Monday, October 24, 2011

ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?: వనం జ్వాలా నరసింహా రావు

ఏకాభిప్రాయం ఎన్నటికి సాధ్యం?

(నమస్తే తెలంగాణ: 25-10-2011)

వనం జ్వాలా నరసింహా రావు

తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతో, నూతనోత్సాహంతో ప్రారంభమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, నాటి నుంచి నేటి వరకు, పూర్తిగా అహింసాయుత మార్గంలో, ఆబాలగోపాలం తెలంగాణ ప్రజల భాగస్వామ్యంతో అంచలంచలుగా ఉదృతమై, ఊపందుకుంటున్నప్పటికీ, కేంద్ర-రాష్ట్ర పాలక పక్షాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం బహుశా ప్రపంచ చరిత్రలో ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ, ఆ మాటకొస్తే ఏ నియంతృత్వ దేశంలోనూ జరిగుండదు. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రాంతంలోని ప్రజల-ఓటర్ల మద్దతు అన్ని రాజకీయ పార్టీలకంటే ఎక్కువ వున్నప్పటికీ, ఆ పార్టీ అధినేత చంద్రశేఖర రావు, తెలంగాణకు మద్దతిచ్చే నాయకులను కలుపుకు పోవాలన్న వ్యూహంతో, 2004 ఎన్నికలలో రాష్ట్ర ఏర్పాటును తప్పక వ్యతిరేకిస్తాడని తెలిసి కూడా రాజశేఖర రెడ్డి నాయకత్వాన (రాష్ట్రంలో) వున్న కాంగ్రెస్ పార్టీతో ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగారు. సోనియా గాంధీని, కాంగ్రెస్ అధిష్టానాన్ని నమ్మారు. కేంద్రంలో మంత్రి పదవిని అంగీకరించారు. నమ్మక ద్రోహం జరిగిందాకా పదవిలో కొనసాగారు. తాను పదవీ త్యాగం చేశారు. తన ఎమ్మెల్యేలతోను, రాష్ట్ర మంత్రులతోను రాజీనామాలు చేయించారు. ఇటు తెలంగాణ ప్రజలకు, అటు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలను ఏలుతున్న కాంగ్రెస్ అధిష్టానానికి తన, తన పార్టీ వాళ్ల నిబద్ధతను ఎరుక పరిచారు. ఏం చేసినా ఆయననుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధించలేక పోయారు. ఆయన ఎంపీ పదవికి ఎన్నిసార్లు రాజీనామా చేసి, మళ్లీ గెలిచినా, ఎవరికీ కనువిప్పు కాలేదు. తెలంగాణ ఏర్పాటు కాలేదు.

మళ్లీ ఎన్నిక లొచ్చే దాకా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ, కాశీ-రామేశ్వరం మజిలీ కథలాగా కాసేపు, ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న చందాన మరి కాసేపు సాగింది. తెలంగాణ వచ్చినా, రాకపోయినా, కనీసం కాంగ్రెస్ లోని తెలంగాణ వాదులకు కనువిప్పు కలగడానికి కెసిఆర్ వ్యూహం ఫలించిందనవచ్చు. 2009 ఎన్నికలలో, తెలుగు దేశంతో (మహా కూటమితో) మరో రకమైన వ్యూహాత్మకంగా చేతులు కలిపారు కెసిఆర్. సీట్లెన్ని వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే, ఈ సారి, తెలంగాణ తెలుగుదేశం వారిలో చలనం కలిగింది. పైకి చంద్రబాబు నాయుడి మాటలకు వంతపాడినా, టిడిపి తెలంగాణ వాదుల్లో కొంతలో కొంతైనా జ్ఞానోదయం కలిగిందనక తప్పదు. ఎన్నికలలో అటు కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోను కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మళ్లీ కనుమరుగైంది. మరో ఉద్యమానికి తెర లేపక తప్పని పరిస్థితులు దరిమిలా కలిగాయి.

టిడిపి లోని తెలంగాణ మద్దతు దారులతో సహా, బిజెపి, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీలు కూడా ఉద్యమంలో దూకాయి. మరికొన్ని భావ సారూప్యతగల పార్టీలూ పుట్టుకొచ్చాయి. ఉద్యమించాయి. ఐనా తెలంగాణ రాలేదు. కెసిఆర్ ప్రయత్నాలు, ఆయనదైన శైలితో ఉద్యమం కొనసాగుతూనే వుంది. ఇంతలో రాజశేఖర రెడ్డి దుర్మరణం పాలయ్యారు. ఆయన స్థానంలో పైకి తటస్థంగా, లోపల సమైక్యానికి అనుకూలంగా, దేని కీ ఇదమిద్ధంగా మద్దతు తెలియ చేయలేని రోశయ్య ముఖ్య మంత్రి అయ్యారు. మళ్లీ తెలంగాణ కథ మొదటికొచ్చింది. అస్థిర ప్రభుత్వం పాలనలో, కెసిఆర్ తన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. నవంబర్ 2009 లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కేంద్రం దిగి రాక తప్పని పరిస్థితులొచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టుతున్నట్లు చిదంబరంతో (కపట) ప్రకటన చేయించింది కేంద్ర ప్రభుత్వం. దీక్ష విరమించారు కెసిఆర్. సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల బెదిరింపు రాజీనామాలు మొదలయ్యాయి. (అన్ని పార్టీలకు చెందిన) తెలంగాణ ప్రజా ప్రతినిధులు కూడా రాజీనామాలు చేశారు. మళ్లీ చిదంబరం మరో ప్రకటన. కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి (ఇద్దరు మినహా) ఎమ్మెల్యేల రాజీనామాలు మాత్రమే అంగీకరించబడ్డాయి. మరో ఆలశ్య ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుతో, వస్తుందనుకున్న తెలంగాణ, ఎప్పుడో ఒకప్పుడు రాకపోతోందా అన్న మజిలీకి చేరుకుంది. ఓపికతో కమిటీ ప్రక్రియను స్వాగతించారు తెలంగాణ కోరుకునేవారు కూడా. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు.

తెలంగాణాకు అనుకూలంగా తీర్పు ఇస్తుందనుకున్న శ్రీకృష్ణ కమిటీ, గోడమీద పిల్లి వాటంగా, ఏమీ చెప్పకుండా దాటవేసింది. అది సేకరించిన సాక్ష్యాధారాలు నిబద్ధతతో పరిశీలించినట్లయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయాల్సిందేనని చెప్పి వుండేది. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో కూడా తెలంగాణ రాలేదు. వస్తుందన్న నమ్మకం కలిగే విధంగా కేంద్రంలో ఈ వ్యవహారాన్ని ఒక "పార్ట్ టైమ్ జాబ్" లాగా చూస్తున్న చిదంబరం, అఖిల పక్షం సమావేశం అంటూ కుంటి సాకులు చెప్తూ కాలయాపన చేయసాగాడు. ఎన్నడో వేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ అసలా సంగతే మర్చిపోయింది. మధ్యలో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు పర్యవసానంగా, రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య మంత్రి పీఠాన్ని అలంకరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కను చూపు మేరలో లేకుండా పోయింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ కూడా మారారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన కొత్తలో తెలంగాణ ప్రాంత ప్రభుత్వోద్యోగులు సమ్మె చేశారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం. ఏవో కొన్ని హామీలు ఇచ్చి అప్పట్లో సమ్మెను విరమింప చేసింది ప్రభుత్వం. మిల్లీనియం మార్చ్ కూడా రాష్ట్ర సాధన దిశగా ఫలితం కలగలేదు. ఉస్మానియా విద్యార్థుల ఆందోళన, ఆత్మ హత్యలు, ఉద్రిక్తతలు ఎన్ని చోటుచేసుకున్నా తెలంగాణ రాలేదు.

కాంగ్రెస్ అధినేత్రి మౌనంగా జరుగుతున్న పరిణామాలను నిస్సహాయంగా-బింకంగా-మొండి ధైర్యంతో గమనిస్తోందే కాని, నిర్ణయం తీసుకోవడంలో మాత్రం పురోగతి కనిపించలేదు. రాష్ట్ర శాసన సభలోని మూడింట రెండు వంతుల మంది శాసన సభ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. రాజ్యసభ సభ్యుడు కేశవ రావు, తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికైన లోక్ సభ సభ్యులలో ముగ్గురు మినహా అందరూ రాజీనామా చేశారు. పదిహేను మందికి పైగా ఎమ్మెల్సీలు సహితం వీరి బాటలోనే నడిచారు. పార్టీలకు అతీతంగా-లాయల్టీలకు అతీతంగా, రాజీనామా చేసిన వారున్నారు. కాంగ్రెస్ వారిలో, అందరి కంటే ముందే రాజీనామా చేసింది జగన్ వర్గానికి చెందిన కొండా సురేఖ. ప్రత్యక్షంగానో, పరోక్షంగా నో, రాజకీయ-రాజ్యాంగ సంక్షోభం చోటు చేసుకునే దిశగా, వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలున్నందు వల్ల, వాటి ఆమోదం అంత కష్టం కాకూడదనుకున్న ఎమ్మెల్యేలకు ఆశాభంగమే మిగిలింది. రాజీనామాలతో రాజకీయ సంక్షోభం రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు.

సమష్ఠి బాధ్యతా రాహిత్యం, సమన్వయ లోపం, అసమర్థ నాయకత్వంతో, పీకల లోతుకు మునిగి పోయిన యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్ ప్రభుత్వం దాని సారధి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఏ విషయంలోను ఒక విధానం అంటూ లేకుండా, ఒక నిర్ణయం అంటూ తీసుకోలేకుండా ఇలా ఎంత కాలం కొనసాగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ-రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ నాయకత్వానికి, విధాన పరంగా నిర్ణయాలు తీసుకోలేని స్థితికి, కీలకమైన విషయాలలో తమ విధానం ఇదంటూ పాలక పార్టీ ప్రకటించ లేక పోవడానికి, ప్రతి పక్ష పార్టీల సూచనలు-సలహాలు పాటించక పోవడానికి, వందల ఉదాహరణలు పేర్కొనవచ్చు. మధ్యలో ఏకాభిప్రాయమంటూ మరో వాదన లేవదీసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ సమస్యను, తన రాజకీయ అవసరాల కొరకు, చంద్రబాబు నాయుడి ఆధిపత్యాన్ని, పలుకుబడిని ఎదుర్కొని, ఎన్నికలలో విజయం సాధించడానికి, 2004 ఎన్నికల్లో, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంది. ఆ విషయాన్ని గులాం నబీ ఆజాదులు, చిదంబరాలు, ప్రణబ్ ముఖర్జీలు, వారి అధినేత్రి సోనియా గాంధీ ఎందుకు మరిచిపోయారో? ఎన్నికల ప్రణాళికలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ సుముఖంగా వున్న అభిప్రాయం కలిగించారు ఇటువంటి చిదంబరాలు, ఆజాదులు. ఆనాడు ఏకాభిప్రాయంతోనే ఆ పని చేశారా? ఆ నాడు సీమాంధ్ర నాయకులను సంప్రదించే ఆ పని చేశాడా చిదంబరం, ఆజాద్? అప్పుడు గుర్తుకురాని ఏకాభిప్రాయం ఇప్పుడెందుకు గుర్తుకు రావాలి? తెలంగాణ ఇవ్వడం-ఇవ్వక పోవడం కాదిక్కడ ముఖ్యం. మాట మార్చే అలవాటే చిదంబరం నైజం అనడం ఇక్కడ ప్రధానం.

పోనీ, యుపిఎ ప్రభుత్వం రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం ప్రస్తావించినప్పుడు ఏకాభిప్రాయం గుర్తుకు రాలేదా చిదంబరానికి? డిసెంబర్ తొమ్మిదిన ప్రకటన చేయడానికి ముందర కాని, దరిమిలా చేసిన ప్రకటనప్పుడు కాని ఏకాభిప్రాయం మంచిదన్న భావనే కలగలేదా? వాస్తవానికి, డిసెంబర్ తొమ్మిది ప్రకటనకు ముందు జరిగింది అన్ని పార్టీల ఏకాభిప్రాయం కాదా? ఒకనాడు శాసన సభలో చేసిన తీర్మానం ఏకాభిప్రాయం కాదా? ఒక రాష్ట్రంలోని ఒకటికి మించిన ప్రాంతాల ప్రజలు-ప్రజా ప్రతినిధులు నిలువుగా-అడ్డంగా-ఏటవాలు గా చీలిపోయినప్పుడు, ఎవరి సిద్ధాంతంతో వారు పట్టుదలగా వున్నప్పుడు, ఏకాభిప్రాయం నెపంతో, వారి మధ్య వైషమ్యాలు పెంపొందించడం కేవలం మాట మార్చేవారికి మాత్రమే సాధ్యపడుతుందని అనక తప్పదు. దొంగ... ఎదుటివారిని "దొంగ..దొంగా" అని అరిచి, తన దొంగతనం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్లే, తన పార్టీ మధ్యనే ఏకాభిప్రాయం సాధించలేని చిదంబరం, తెలుగుదేశం పార్టీని, దాని నాయకుడు చంద్రబాబు నాయుడునీ తప్పుబట్టడం మరీ హాస్యాస్పదం. ముందు తన తప్పు ఒప్పుకుని, ఇతరులు తప్పు చేశారంటే అర్థముంటుంది కాని, ఇతరులది తప్పు-తనది ఒప్పు అనడం ఎంతవరకు భావ్యం? ఇరు ప్రాంతాల వారికి వీలై నన్ని తక్కువ అభ్యంతరాలతో సమస్యను పరిష్కరించాలి తప్ప, ఏకాభిప్రాయం పేరుతో, దీర్ఘకాలికంగా వాయిదా వేసుకుంటూ పోతే, దొరికే ది పరిష్కారం కాదు కదా...మరిన్ని సమస్యల తోరణాలు మాత్రమే!

ఈ నేపధ్యంలో సకల జనుల సమ్మెతో నన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాదా అన్న ధీమాతో, ప్రపంచ చరిత్రలో ఎవరూ కనీ-వినీ ఊహించని రీతిలో, ఉద్యమించారు తెలంగాణ ప్రజలు. ఆర్టీసీ, సింగరేణి కార్మికుల సమ్మెతో ప్రభుత్వానికి దిమ్మ తిరిగిందే కాని అసలు సమస్యను పరిష్కరించాలన్న ఇంగిత జ్ఞానం మాత్రం కలగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదు. ఏ సకల (తెలంగాణ) జనులకొరకు తాము ఇబ్బందులకు గురైనా సమ్మెకు దిగారో, ఆ సకల జనులే ఇబ్బందుల పాలవుతుంటే, ఆర్టీసీ, సింగరేణి కార్మికులు, పాఠశాలల-కాలేజీల సిబ్బంది సమ్మెను విరమించుకున్నారు (వాయిదా వేసుకున్నారు). రైలు రోకోలు, సార్వత్రిక బందులు ఏవీ కూడా ప్రభుత్వంలో చలనం తెప్పించలేక పోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అన్నీ అడ్డంకులే! అందరూ అడ్డు తగిలే వారే! ఈ నేపధ్యంలో, 2009 డిసెంబర్ 9 ప్రకటనను అమలు చేయించుకోవడానికి తెరాస అధినేత కేసీఆర్, మరో పర్యాయం ఆమరణ నిరాహారదీక్షకు దిగవచ్చనే వార్తలు కూడా వచ్చాయి.

ఇంకేం చేస్తే తెలంగాణ వస్తుంది? తెలంగాణ ప్రజలంతా ప్రతిరోజూ, ఏదో ఒక నిర్ణీత సమయాన, ఎవరింటి ముందర వారు వీధుల్లోకి వచ్చి ముక్త కంఠంతో ఢిల్లీ దాకా వినిపించేటట్లు తెలంగాణ ఏర్పాటు కావాలని నినాదాలు చేయాల్నా? ప్రతి తెలంగాణ వాది తన వంతు విరాళంగా నెలకు కనీసం ఒక్క రూపాయన్నా ఇచ్చి నెలకింత అని (నాలుగైదు కోట్ల రూపాయలు?) తెలంగాణ ఇచ్చిందాకా అధిష్టానానికి అధికారికంగా "ముడుపు" చెల్లించాల్నా? ప్రతివారం కనీసం కొన్ని లక్షల సంఖ్యలో ఒక్కో తెలంగాణ వాది దగ్గర నుంచి ఓ కార్డు ముక్క సోనియా గాంధీకి పోస్టు చేద్దామా? పోనీ ఇలాంటివే ఇంకేమన్నా మార్గాలు వెదుకుదామా?

కాదూ కూడదంటే సీమాంధ్ర ప్రభుత్వాన్ని బహిష్కరించి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం. మనల్ని మనం ఏలు కుందాం.

Sunday, October 9, 2011

కళ్లున్న కబోదులకు ఏదీ కనిపించదు! : వనం జ్వాలా నరసింహారావు

కళ్లున్న కబోదులకు ఏదీ కనిపించదు!

వనం జ్వాలా నరసింహారావు

మూసుకున్న ఢిల్లీ కాంగ్రెస్-యుపిఎ సారధ్య నాయకుల (నాయకీమణుల) కళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అవును మరి! ఇంకా కొద్ది రోజులు మూసుకునే వుంటే, వారింక ఎప్పటికీ తెరవలేమోనన్న భయం పట్టుకుంది. అప్పుడో మాట, ఇప్పుడో మాట - అక్కడో మాట, ఇక్కడో మాట - అమ్మ ముందో మాట, వెనుకో మాట - సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో ఒక మాట, తెలంగాణ వారితో మరొక మాట - తమ పార్టీ రాష్ట్ర నాయకులతో చెప్పేదొకటి, ఇతర పార్టీల వారితో చెప్పేదొకటి - ఇలా ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకుంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన ఢిల్లీ (కాంగ్రెస్ అధిష్టానం బృందగానం ఆలాపించే) నాయకులకు సకల జనుల సమ్మె వేడి నపాళానికెక్కింది. మింగలేక, కక్క లేక, అధినేత్రి సోనియాకు మొర పెట్టుకుని వుండవచ్చు. జ్ఞానోదయం కలగడం ఆమె దగ్గర నుంచి ఆరంభమైందా? లేక ఆమె సూచనతో బృందగాన భజన పరులకు స్వయానా కలిగిందా? అర్థం చేసుకోవడం కష్టమే! కాని, రాదనుకున్న కదలిక కనపడడం (కనీసం వినపడడం) మాత్రం మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవడం తధ్యమనే విషయం, దాంతో పాటే, మూడు వారాలకు పైగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సకల జనుల సమ్మె ప్రభావం నుండి బయటపడే అవకాశాలు మటుకు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అలా జరగకపోతే, ముఖ్యమంత్రి మొదట్లో చెప్పినట్లు, సమ్మె ప్రభావం ఒక్క తెలంగాణ ప్రాంతం పైనే కాకుండా, యావత్ ఆంధ్ర ప్రదేశ్ తో సహా, భారత దేశంలోని పలు రాష్ట్రాలపై పడే అవకాశాలున్నాయనే సంగతి కేంద్రం ఈ పాటికే గ్రహించి వుండాలి.

అరవై ఏళ్లుగా - పోనీ నలభై ఏళ్ళుగా - కనీసం గత పదకొండేళ్లు గా నన్నా - అధమ పక్షం రెండేళ్లకు పైగా - ఇవేవీ కాకపోయినా ఇటీవల మూడు వారాలకు పైగా జరుగుతున్న సకల జనుల సమ్మె ప్రభావం నేపధ్యంలోనైనా, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కళ్ళున్న కబోదుల మాదిరిగా, చూసీ చూడనట్లు -అంటీ ముంటనట్లుగా వ్యవహరించిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (నాటి నుంచి నేటి వరకున్న) అధిష్ఠానం, ఆ పార్టీ ఈ నాటి అధినేత్రి, ఆమె భజన బృందం, కనీసం ఇప్పటికైనా తెలంగాణ సమస్యపై సముచిత స్థాయిలో దృష్టి పెట్టడం ఆహ్వానించ దగ్గ పరిణామం. దాని పర్యవసానమే, బహుశా, తమలో తాము విస్తృతంగా చర్చించుకోవడం, రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ ను ఢిల్లీకి రమ్మనడం - ప్రదాన మంత్రితో భేటీకి పిలవడం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహను, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ ను కూడా రమ్మనడం కావచ్చు. కోర్ కమిటీలు, మినీ కోర్ కమిటీలు ఎడతెరిపి లేకుండా సమావేశమవుతున్నాయి. ఏం జరుగబోతుందోనన్న అంశం ఇంకా అస్పష్టంగా వున్నప్పటికీ, ఏదో జరుగడం ఖాయం అన్న విషయంలో మాత్రం స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఎవరి (కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ) నోటి నుండి తెలంగాణ విషయంలో ఒక అసంబద్ధమైన మాటలు రెండు రోజుల క్రితమే వెలువడ్డాయో, ఆ వ్యక్తికే కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను అధినేత్రి సోనియా గాంధి అప్ప చెప్పడం విశేషం. దసరా పండుగ (తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఈ ఏడాది జరుపుకోని పండుగ!) పూర్తయిన వెంటనే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై దృష్టి సారించడమంటే, కనీసం దీపావళి కానుకగా నన్నా, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను భౌగోళికంగా విడదీసి - రాబోయే తర తరాల తెలుగు వారు కలిసి మెలిసి సహజీవనం సాగించే విధంగా, చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించవచ్చన్న ఆశలు ఇరు ప్రాంతాలలో చిగురిస్తున్నాయనవచ్చు.

తెలంగాణ సమస్యకు పరిష్కారం అంత సులభమైంది కాదని, ఐనా అందుకు తామందరం యత్నిస్తున్నామని, ఎప్పటి లోపు సమస్య తేలుతుందోనని, అసలు ఏ దిశగా అది పరిష్కరించబడుతోందని, చూద్దాం - చేద్దాం అని, క్లిష్టమైన సమస్యను మరింత సంక్లిష్టంగా - భూతద్దంలో చూపించే ప్రయత్నం "రాజనీతిజ్ఞుడు" అని అందరూ భావించే ప్రణబ్ ముఖర్జీ కూడా చేశాడంటే, ఏదో జరుగబోతుందోనన్న సంకేతం ఇచ్చినట్లే! భారతదేశంలో, రాష్ట్రాల ఏర్పాటులో, ఒక పద్ధతిని అనుసరించలేదని, అలా అలవోకగా చరిత్ర -భూగోళం కలిపి కలగాపులగంగా ఓ ప్రైవేట్ చానల్ ఇంటర్వ్యూలో, ప్రణబ్ ఏదేదో మాట్లాడడం వెనుక అనేకానేక గూడార్థాలుండే వుండాలి. యాదృచ్చికంగానే జరిగిందో? లేదో? కాని, సరిగ్గా అదే సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఇచ్చిన జవాబులో (ఆయన రాసిన లేఖకు ప్రతిగా) తెలంగాణ అనే సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం చేయ దగ్గ కృషి అంతా చేస్తున్నది అని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ప్రధాని ఈ విషయాన్ని తెలంగాణ విషయంలో ఏ అభిప్రాయం చెప్పని ఒక పార్టీ నాయకుడికే ఎందుకు రాశారో అర్థం కాని అంశం.

తెలంగాణ అంశం సున్నితమైనదని, సంక్లిష్టమైనదని, దాన్ని నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించలేమంటూ ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపాయి. కాంగ్రెస్‌లోని తెలంగాణ నేతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఐనా, ఆ వ్యాఖ్యలలో తప్పేమీ లేదని సర్దుకుపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రణబ్ వ్యాఖ్యలలో తెలంగాణ అనుకూలమైన అర్థాలను వెతికే ప్రయత్నమే చేశారు. దీంతో.. అసలు ఆ వ్యాఖ్యలు కావాలని చేసినవా? లేక నోరు జారి చేసినవా? అన్న సంశయం కూడా కలిగింది. ప్రణబ్ వ్యాఖ్యలను ఆషామాషీగా తీసుకోలేమని ఇదంతా వ్యూహాత్మకమేనని మెజారిటీ నేతలు అంటున్నారు. తెలంగాణ అంశంపై త్వరలో నిర్ణయం వెలువడుతుందంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే ప్రణబ్ ఇలా మాట్లాడి ఉంటారని కొందరు విశ్లేషకులు భావిస్తుంటే, మరి కొందరు తెలంగాణ ఏర్పాటు కొరకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారని ఘంటాపథంగా చెప్తున్నారు. ఏదేమైనా, ఆ వ్యాఖ్యలు చేసిన అతి కొద్ది సమయంలోనే ఢిల్లీలో చర్చల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం శుభపరిణామాలకు దారితీయవచ్చని అందరి ఆశగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఇవ్వడం - ఇవ్వకపోవడం కాదు సమస్య. సకల జనుల సమ్మె ప్రభావంగా దినదినం దుర్భరమవుతున్న సామాన్య-అసామాన్య పౌరుల జీవనం ఒకింత కుదుట బడే వీలుంటుందన్న నమ్మకం కలుగుతోంది.

ఈ నేపధ్యంలో గత వారం రోజులుగా ఢిల్లీలో నాటకీయంగా జరిగిన పరిణామాలు రాజకీయ విశ్లేషకులకు, రాజకీయాలలో వున్న నాయకులకు, రాజకీయం చేసే వారికి, ఆసక్తి కలిగించినప్పటికీ, చిత్తశుద్ధితో తెలంగాణ సమస్యకు పరిష్కారం త్వరలో లభించాలని కోరుకుంటున్న ప్రజానీకానికి మాత్రం అసహ్యంగా, అతి జుగుప్సాకరంగా వున్నాయనక తప్పదు. సమస్య పరిష్కారానికి ఇంకా కొంత సమయం ఎందుకు కావాలి? ఎవరి కొరకు కావాలి? ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నందున సకల జనుల సమ్మెను విరమించమని అడిగే వారికి వారెందుకు సమ్మె చేస్తున్నారో అర్థం కావడం లేదా? సమస్యకు పరిష్కారం కావాలంటే ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో వ్యవహరించాలంటున్న వారి ఉద్దేశం ఒక ప్రాంతం వారికే ఈ సూత్రం వర్తిస్తుందా? ఎప్పటికీ ఒకరే ఇచ్చుకోవాల్నా? పుచ్చుకోవాల్నా? ఎవరూ నష్టపోని రీతిలో విన్-విన్ సిచ్యువేషన్ పరిస్థితి వుండాలనడం ఎంతవరకు సమంజసం? "విన్" అంటే ఒకరి "విన్నా"? ఇద్దరి "విన్నా"? భాగస్వాములందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. తెలంగాణ విషయంలో "భాగస్వాములు" (స్టేక్ హోల్డర్స్) అంటే ఆ ప్రాంతంలో వుండే ప్రజలు -ప్రజా ప్రతినిధులు - రాజకీయ పార్టీల నాయకులు - పౌర సమాజం నాయకులు - ప్రభుత్వ, ప్రభుత్వేతర సిబ్బంది, సిబ్బంది నాయకులే కాని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ససేమిరా ఇష్టపడని పొరుగు వారు, పొరుగు రాష్ట్రాల వారు, ఈ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు ఎలా అర్హులవుతారు? ఇంకా నయం...సరిహద్దు దేశాల వారిని, ఐక్య రాజ్య సమితి సభ్యులను కూడా "స్టేక్ హోల్డర్స్" చేద్దామని అనడం లేదు!

అన్నింటికన్నా వింతైన వార్తలను గత వారం కొన్ని పత్రికలు ప్రచురించాయి. వాటిలో నిజా-నిజాలెంతవరకో కాని, అందులో ఏ మాత్రం వాస్తవం వున్నా, పరిస్థితి గందరగోళం అనక తప్పదు. తెలంగాణ సమస్యను వేగంగా పరిష్కరించమని, లేకపోతే, తాము తమ-తమ నియోజక వర్గాల్లో తిరగడం కష్టమని, తమ మనుగడ - కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని, మొర పెట్టుకోవడానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గరకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు-ప్రజా ప్రతినిధులకు, మన్మోహనే తన మొర వినిపించాడట. అదో వింత అనుభవం అంటున్నారు కాంగ్రెస్ నాయకులు కొందరు. తానూ-తన సంకీర్ణ కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగడం ఇబ్బందికరంగా వుందని, ప్రధాని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాకపోతే, తన మొర ఎలా వున్నా, తెలంగాణ నాయకుల మొరను అధినేత్రి సోనియా దృష్టికి, కోర్ కమిటీ దృష్టికి తీసుకెళ్తానని మంచి మనసుతో అన్నారు పాపం ప్రధాని! తాను, తన పార్టీ కేంద్ర స్థాయి నాయకులు, తన సారధ్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, తెలంగాణ ఏర్పాటు విషయంలో తీసుకుంటున్న చొరవకు సంబంధించిన అన్ని సంగతులు వివరించారట ప్రధాని.

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా వచ్చారో, అలానే తిరుగు ప్రయాణం కట్టారు కేసీఆర్ అని కొందరనడం హాస్యాస్పదం. ఆయన వెళ్లి వచ్చిన తర్వాతే ఈ తతంగం అంతా జరుగుతుందంటే, ఆయన ప్రమేయం ఏదీ లేకుండా ఎలా వుంటుంది? తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయం రాని పక్షంలో, రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు, కాంగ్రెస్ తెలంగాణ నాయకులు, తెలుగుదేశం తో సహా ఇతర పార్టీ నాయకులు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో, కారణాలేవైనా, తెలంగాణ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనక తప్పదని కాంగ్రెస్ అధిష్ఠానం ఓ స్పష్టమైన అంచనాకు వచ్చిందనేది స్పష్టం. ఇక ఎంతమాత్రం నాన్చడం మంచిది కాదని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో పరిస్థితి రోజురోజుకు తీవ్రంగా మారుతోందని అర్థమవుతోంది కాంగ్రెస్ అధిష్టానానికి. కళ్లున్న కబోదులకు, మూసిన కళ్లను తెరవక తప్పలేదు. ఒకరి వెంట మరొకరిని ఢిల్లీకి రమ్మని కబురు పెట్టారు. గవర్నర్ నరసింహన్ ప్రధానిని, రక్షణ మంత్రి ఆంటోనీని కల్సినట్లు సమాచారం. మరోపక్క, ముఖ్యమంత్రి కిరణ్, ఉపముఖ్యమంత్రి రాజనర్సింహ, ఇతర నాయకులు ఆజాద్ ను, ఇతర ప్రముఖులను కలుస్తున్నారు. ఉక్కు పిడికిలితో ప్రజాభిప్రాయాన్ని అణచి వేయడం అసాధ్యం అనే సంగతి స్పష్టమైంది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందనాల్సిందే. ఆటకు ముగింపు రానున్నది.