Wednesday, April 25, 2018

వైద్య సేవల వినూత్న విధాత : వనం జ్వాలా నరసింహారావు


వైద్య సేవల వినూత్న విధాత
(డాక్టర్ అయితరాజు పాండురంగారావు)
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (26-04-2018)
      నాలుగు సంవత్సరాలపాటు లండన్ తో సహా ఇంగ్లాండ్ దేశంలోని పలు మహానగరాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసి, గైనకాలజీ, ట్రాపికల్ మెడిసిన్, చైల్డ్ హెల్త్, అనస్తీషియా లలో నాలుగు డిగ్రీలు పొంది, భారతదేశానికి తిరిగొచ్చిన ఏ డాక్టరైనా కోరుకునేది హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాలలో ఉద్యోగం. అలా ఇవ్వడానికి అలనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా కూడా వుంది. దానికి విరుద్ధంగా ఒక యువకుడు, హైదరాబాద్ నగరంలోని ఉమ్మడి రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ను కలిసి, తనను గిరిజన ప్రాంతమైన భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మెడికల్ అధికారిగా నియమించామని కోరడంతో డైరెక్టర్ ఆశ్చర్యపోయి, అలా మారుమూల ప్రాంతంలో పనిచేయడానికి ఒకరు ముందుకొచ్చినందుకు సంతోషించి, ఆ యువకుడు కోరినట్లుగానే పోస్టింగ్ ఇచ్చాడు. ఆ యువకుడే ఇటీవల ఏప్రియల్ 15 న మరణించిన డాక్టర్ అయితరాజు పాండురంగారావు. ఆయనే 108, 104 అంబులెన్స్ సహాయ సేవల రూప శిల్పి, వ్యూహకర్త.

  1957 సంవత్సరంలో ఖమ్మం కళాశాల నుండి పీయూసీ లో అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణుడై, వైద్య విద్య అభ్యసించాలని లేకున్నా తండ్రి కోరిక మీద హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో చేరి ఎంబీబీఎస్ డిగ్రీ సంపాదించి కొన్నాళ్ళు ఖమ్మంలో, కొన్నాళ్ళు గిరిజన ప్రాంతమైన బూర్గుంపాడులో డాక్టర్ గా ఉద్యోగం చేసి పై చదువుల కొరకు, సమాంతరంగా ఉద్యోగం చేయడానికి ఇంగ్లాండ్ వెళ్ళారు డాక్టర్ రంగారావు. ఇంగ్లాండ్ లో వున్నప్పుడు, పామ్టీఫ్రాక్ట్, పార్క్ ఆసుపత్రి, నాటింగ్ హాం, చెల్మ్స్ ఫోర్డ్, త్రేద్గేర్, మాంచెస్టర్ లాంటి పలు ఆసుపత్రుల్లో పనిచేసారు.

డాక్టర్ అయితరాజు పాండురంగారావు బహుళ ప్రత్యేకతలు కలిగిన వ్యక్తిగా, బహుముఖ సేవలందించిన వైద్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శిగా, ఏపీ వికలాంగుల కార్పోరేషన్ మేనేజింగ్  డైరెక్టర్ గా, భారత దేశ శాంతభద్రతల పరిరక్షణ (ఐపీకేఎఫ్) ప్రతినిధిగా శ్రీలంకకు వెళ్లిన బృంద సభ్యుడిగా, 108-104 ఆరోగ్య వైద్య అంబులెన్స్ సేవలను తెలుగు రాష్ట్రాలతో పాటు, భారత దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంలో వ్యూహకర్తగా,  పలు వైద్య ఆరోగ్య సంబంధిత అంశాల పట్ల ఔపోసన పట్టి, ఎన్నో సంస్థలకు సలహాదారుగా నిలిచి, వైద్య రంగంలో ఆసియా ఖండంలోనే హైదరాబాద్ ను మెడికల్ హబ్ గా రూపుదిద్దుకునేందుకు తనదైన పాత్ర పోషించిన వ్యక్తిగా ఆబాలగోపాలానికి చిరపరిచితులు. ఏప్రిల్ 15,2018 హైదరాబాద్ లో వారు స్వర్గస్తులయ్యారు.  తెలంగాణలోని ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామ వాస్తవ్యులైన డాక్టర్ రంగారావు సెప్టెంబర్ 20,1942లో  నాటి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ఖంబంపాడు (బ్రిటిష్ పాలనరోజుల్లో మద్రాసు ప్రెసిడెన్సిగా పిలవబడేది) అనే చిన్న గ్రామంలో మాతామహుల ఇంట్లో జన్మించారు. ఒక కుగ్రామంలో జన్మించిన ఆయన అంతర్జాతీయంగా పేరుగాంచిన వైద్య ఆరోగ్య సలహాదారుగా ఎదిగారు.
  
“దైవం మానుషరూపేణ” అన్న చందాన ఆయన సమాజానికి చేసిన సేవలు అజరామరం. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలుస్తూ ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలో అందరి ఆలనాపాలనా చూస్తూ, స్వంత కోరికలను, అవసరాలను పక్కన పెట్తూ జీవిక సాగించారు. తనవద్దకు అవసరం నిమిత్తం వచ్చే ప్రతీ ఒక్కరికి ఆయన మానవీయతను, దాతృత్వాన్ని పంచారు. ఆయన మాటల నుండి అందరూ ఒకరకమైన విజ్ఞతను పెంచుకునే వారు. ఆయన చేతలనుండి వినయం, ఆయన అందించే సేవలనుండి  కరుణ గ్రహించారు. ఆయనను అభిమానించే వారికి, అనుసరించే వారికి రంగారావు, మండే ఎండలో చల్లని నీడగా,  వణికించే చలికి వెచ్చని తోడుగా వుండేవారు.   75 సంవత్సరాల జీవణ గమనంలో రంగారావు ఎన్నో కష్ట సుఖాలను, ఒడిదుడుకులను ఎదురీది మేరునగ దీరుడిగా నిలిచి, సాదించాల్సిన దానిపై దృష్టి పెట్టి సమాజంలో తాను పొందాల్సిన దానికి మించి అందించారు. 

     “కదలాడే జ్ఞాపకాలు” (హాపింగ్ మెమోరీస్) పేరిట ఆంగ్లంలో వెలువడనున్న ఆయన ఆత్మకథలో డాక్టర్ రంగారావు తన జీవిత గమనాన్ని, కంభంపాడు నుండి హైదరాబాద్ వరకు సాగిన జీవన ప్రస్తానంలో చెరగని ముద్రలను, జ్ఞాపకాలను ఆవిష్కరించారు.  తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ  రంగారావు మాటల్లో... ‘‘వేయించిన కాఫి గింజల సువాసన, తిరగలి చేసే వింత శబ్ధం, గుప్పున వదిలే బీడి పొగల సుడులు, ఎర్రగా మండుతున్న కట్టెల పొయి... వంటి జీవిత పార్శ్వాలు అన్నీ సునిశిత పరిశీలనలో భాగాలు.... చూరు గుంజకు కట్టిన బట్ట ఉయ్యాలలో జీవితాంతం ఓలలాడలని తపన వెంటాడం, చిన్నప్పుడు నెలకొసారి బలవంతంగా పట్టించే ఆముదం, తద్వారా కడుపు శుద్ధి కావటం అన్న అంతర్లీన ఆరోగ్య సూత్రం, అందుకు వారిస్తున్న నోరు తెరిచి  రెక్కలు విరిచి తాగించే వైనం, అన్నీ మధుర జ్ఞాపకాలే’’ అంటారు.   గతాన్ని సృషించే నేపథ్యంలో... ‘‘ఉదయం లేవగానే ఆరగించే అల్పాహారం తినడానికి 10మంది పిల్లలకు పెద్దలు, రాత్రి మిగిలిన చద్ధన్నంలో పెరుగు  కలిపి ఆవకాయ నంజుకు పెట్టి అందరికీ ముద్దలు తినిపించటం, అమృత ప్రాయంగా ఆరగించటం’’ అనే వైనాన్ని వివరించారు. 


     ప్రభుత్వ ఉద్యోగంలొ తలమునకలుగా పదవీ కాలాన్ని నిర్వర్తించినప్పటికీ, ఉద్యమ కార్యకర్తగా, అనేక జాతీయ-అంతర్జాతీయ ప్రాజెక్టులకు సలహాదారుగా రంగారావు సేవలందించేవారు.   రాజకీయాలలో క్రీయాశీలకంగా వున్నప్పటికీ రాజకీయ పార్టీలతో మాత్రం సంబంధం పెట్టుకోలేదు.  ఒకానొక సందర్భంలో, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రేస్ పార్టీ అధ్యక్ష పదవికి నాటి ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆయన పేరు ప్రతిపాదించారు. ఇది చాలామందికి తెలియని విషయం. సున్నితంగా దాన్ని ఆయన తిరస్కరించారు.

     ప్రభుత్వ సర్వీసులో 1966లో చేరిన ఎపి. రంగారావు ఆ రంగంలో విజయవంతంగా విధులు నిర్వర్తించటంతో పాటుగా వృత్తిని, సంఘ సేవ చేయటమనే ప్రవృత్తిని జోడించి ఆ క్రమంలో విజయం సాధించారు.  ఇందుకు చక్కని ఉదాహరణలు జైపూర్ ఫుట్ సృష్టికర్త డా. సేథీ సాంగత్యం  కావచ్చు, కుష్టు వ్యాధి నివారణలో తన పాత్ర పోషించటం కావచ్చు, వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు చేపట్టటంలో  కావచ్చు,  రెడ్ క్రాస్ సంస్థతో అనుబంధం కావచ్చు,  చేతన అనే ప్రభుత్వేతర సంస్థతో అనుబంధం కావచ్చు, అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీమతి కుముద్ బెన్ జోషీ స్థాపించిన నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్  సోషల్ యాక్షన్ కావచ్చు,  ఈ విధంగా నిరంతర  సేవల ద్వారా ప్రవృత్తి  రీత్యా ప్రజలకు ఆయన చేరువ  కావటం జరిగింది.  

     రంగారావు తన ఆత్మకథలో వివరించిన విధంగా  రెడ్ క్రాస్ తో తన అనుబంధం, శ్రీలంక జాఫ్నా రక్తసిక్త యుద్ధ వాతావరణం, ఐపికెఎఫ్, ఎల్టీటిఇల మధ్య యుద్ధం సాగిన తీరు, గగుర్పాటుకు గురిచేస్తాయి.  ప్రతీ అంశాన్ని దృశ్య రచన కావింపబడిన తీరు యుద్ధంతో కూడుకున్న సినిమాను  మరిపిస్తుంది.   భయానక పరిస్థితుల్లోనూ నిశ్చల  మనస్సుతో ఆయన వ్యవహరించిన తీరుతెన్నులు అతని వివరణకు దర్పణంగా నిలుస్తాయి. రంగారావు ఎటువంటి భయానక పరిస్థితుల్లోను తన చెరగని చిరునవ్వును విస్మరించి ఉండకపోవచ్చు అనే సత్యం అందరూ గ్రహిస్తారు.  ఇన్నివిజయాలను సాధించిన రంగారావు నేతృత్వంలో ప్రజలకు ఉపయోగపడిన అనేక కార్యక్రమాల్లో 108 అంబులెన్స్ సేవలు అతి ఉన్నతంగా పేర్కొనాలి.  దేశానికే తలమానికంగా ఇది రూపకల్పన చేయబడింది.  లక్షలాది మందికి  ఆశాజ్యోతిగా 108 సేవలు ఆపద సమయాన నిలిచాయి. దేశ వైద్య రంగంలో ఎందరో ఆపన్నుల తలరాతలు మార్చగలిగిన ఏకైక సేవగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అందించబడ్డాయి.  ఆలాగే డాక్టర్ రంగారావు కృషికి 104 సర్వీసులు, నిర్దిష్ట రోజుల ఆరోగ్య సేవలు, దూర వైద్య సేవలు కూడా తలమానికంగా నిలుస్తాయి. 

     అంతేకాకుండా డాక్టర్ రంగారావు కృషికి, అత్యవసర వైద్య సేవలు (ఇ.ఎమ్.ఎస్), జాతీయ సమాచార సేవలు (ఎన్.ఐ.ఎస్) ప్రభల నిదర్శనంగా నిలుస్తాయి. ఇ.ఎమ్.ఎస్ ద్వారా అత్యవసర వైద్యాన్ని ఉద్యోగ స్వామ్యంలోని సామాన్యుడికి, మధ్యతరగతి వారికి అందుబాటులోకి తేవడంతో పాటుగా స్వయాన రంగారావు పర్యవేక్షణలో రోజూవారి కార్యక్రమాల నిర్వహణ చేపట్టటం జరిగింది. అత్యంత ఖరీదైన వైద్యాన్ని మధ్య తరగతి వారికి చేరువ చేయటం అన్నది అతన చొరవకు, దార్శనికతకు అద్ధం పడతాయి. ఎన్.ఐ.ఎస్ వార్తా సంస్థ ద్వారా ఎన్నెన్నో వార్తా కథనాలు, విశ్లేషణలు అనేక వార్తా పత్రికల్లో ప్రచూరించటం జరిగింది. ఆంగ్ల తెలుగు భాషలలో అనేక పుస్తకాలు ఎన్.ఐ.ఎస్. ప్రచురించింది.

     రంగారావు “కదలాడే జ్ఞాపకాలు” నుంచి సమాజంలోని ఎన్నో కోణాలను, ఆనందాలను, బాధలను, దుఖాలను, విజయాలను, చిన్న చిన్న క్షమాపణలను, అద్బుత మానవ సంబంధాలను, కుటుంబంలో సఖ్యతను, సమాజంలో మెసిలే తీరును ఇలా ఎన్నో ఎన్నెన్నో పార్శ్వాలను పేర్కొనడం జరిగింది.  కేవలం ఆత్మకథగానే కాకుండా గొప్ప అనుభవాలను, సంఘటనలను, ముచ్చట్లను, కరుణ, ప్రేమ, మానవత్వం, సేవ వంటి మార్గాలను చూపుతూ....చక్కటి అర్ధవంతమైన పరిపూర్ణ జీవణానికి దిశానిర్దేశం చేస్తుంది.  విద్యావేత్తలకు, చరిత్ర కారులకు, పత్రికా విలేఖరులకు, సాంఘిక వేత్తలకు ఇలా మానవ విలువలను విశ్వసించే ప్రతీ  ఒక్కరికీ ఈ పుస్తకం ఉపయుక్తంగా వుంటుంది. 

(సంతాప సభ, పుస్తకావిష్కరణ, 27-04-2018 న సోమాజిగూడ లోని హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో సాయంత్రం 6-00 గంటలకు).

No comments:

Post a Comment