దివంగత భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న
పీవీ నరసింహారావు
స్మారకోపన్యాసం, ప్రధానాంశాలు
వనం జ్వాలా నరసింహారావు
(వేదిక: డాక్టర్ అంబేద్కర్ సారవత్రిక
విశ్వవిద్యాలయం హైదరాబాద్, జూన్ 28, 2025)
ఆర్ధిక, రాజకీయ,
దౌత్య, సామాజిక, బహుభాషా, విద్యావేత్త, దార్శనికుడు, కార్యదక్షుడు,
రాజనీతిజ్ఞుడు, తత్త్వశాస్త్రజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి, విజ్ఞాన సర్వస్వం, దివంగత భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న పీవీ నరసింహారావు
ఆలోచనల్లో, అమల్లో,
విజ్ఞాన సర్వస్వం, ఆర్ధిక, రాజకీయ, దౌత్య, సామాజిక,
బహుభాషా విద్యావేత్త; దార్శనికుడు, కార్యదక్షుడు, రాజనీతిజ్ఞుడు, తత్త్వశాస్త్రజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి, అపర చాణక్యుడుగా అందరూ
స్థుతించిన వ్యక్తి, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా స్వపక్షం వారి నుండీ, ప్రతిపక్షాల నుండీ, ఖండ ఖండాంతర ఆర్థిక
నిపుణుల నుండీ మన్ననలనందుకున్న, ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పీవీ నరసింహారావు
స్మారకోపన్యాసం చేయడం బహుశా నా జీవితంలో అత్యంత అరుదైన గౌరవమని భావిస్తున్నాను. ఆ
గౌరవం దక్కడానికి, ఉపన్యాసం ఇవ్వడానికి నాకు అవకాశం కలగచేసిన డాక్టర్
బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణిగారికి
సదా కృతజ్ఞతలు.
నరేంద్ర మోదీ
ప్రభుత్వం స్వర్గీయ పీవీ నరసింహారావుగారికి, గత
సంవత్సరం, దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేసింది. అంతర్జాతీయంగా
భారత ప్రతిష్ఠను ఇనుమడింపచేసిన ఆయన మేధావితత్వం, ఆయనలోని మరెన్నో ప్రత్యేకతలు, పీవీగారికి భారతరత్న లభించడానికి
కొన్ని కారణాలు మాత్రమే. పీవీగారికి మరణానంతరం ఇస్తున్న విషయం, ఫిబ్రవరి 9, 2024 న ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా వినమ్రంగా ప్రకటిస్తూ, ‘ఆయన దార్శనిక నాయకత్వం భారతదేశాన్ని
ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించింది, దేశ శ్రేయస్సు మరియు వృద్ధికి దృఢమైన పునాది
వేసింది’ అన్నారు.
తప్పని
పరిస్థితులలో క్రీయాశీలక రాజకీయాల్లో కొనసాగి,
భారత
జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు
చేపట్టి, అనూహ్య రీతిలో తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా
అధికారంలో వున్నారు పీవీ. ఇది భారత దేశ పార్లమెంటరీ పరజాస్వామ్య చరిత్రలో ఒక
మైలురాయి. పీవీ బాధ్యతలు చేపట్టిన 1991 సంవత్సరం ‘భారతదేశ రాజకీయ ప్రాధాన్యతాసంవత్సరం’
అని పిలవడం బహుశా అతిశయోక్తి కాదేమో! ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించిన తెలుగుబిడ్డ, తెలంగాణ
బిడ్డ పీవీ, స్వాతంత్య్ర సమరయోధుడిగా, స్వామీ
రామానందతీర్థ శిష్యుడిగా నిజాం వ్యతిరేక పోరాటంలో అగ్రభాగాన వున్నారు. పదవుల కొరకు
ఆయన ప్రయత్నం చేయలేదు. పదవులే ఆయన్ను కోరుకున్నాయని చెప్పాలి.
చదువులో ఎప్పుడూ
ముందుడే పీవీకి లెక్కలంటే చాలా ఇష్టం. ఆటల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. పరీక్షల్లో
ప్రశ్నాపత్రాలకు ఆయన రాసిన జవాబులను పీవీ తోటి విద్యార్థులకు చదివి వినిపించేవారు
ఆయన గురువులు. లిటరేచర్, సంగీతం అంటే చెవి కోసుకునేవాడ పీవీ. తెలుగు
ప్రబంధాల నుంచి సినిమా డైలాగుల వరకూ చదివిందీ,
విన్నదీ తుచ తప్పకుండా అప్పచెప్పే ఏక
సంతగ్రాహి పీవీ.
నైజాం-హైదరాబాద్‌లో
‘వందేమాతరం’ గీతాన్ని నిషేధించటంతో, దాన్ని వ్యతిరేకించి కాలేజీ బహిష్కరణకు గురైన
పీవీ నాగపూర్ విశ్వవిద్యాలయంలో ఇంటర్మీడియట్‌లోనూ, తర్వాత బియస్సీలోనూ ప్రథమ శ్రేణిలో
ఉత్తీర్ణుడైనారు. ‘లా’ కళాశాలలో చేరి ‘ఫస్ట్ ఇన్ ఫస్ట్’
ర్యాంకుతో లా డిగ్రీనందుకున్నారు. హైదరాబాద్‌కు వచ్చి స్వర్గీయ బూర్గుల
రామకృష్ణారావు వద్ద జూనియర్‌గా చేరి లా ప్రాక్టీస్ చేసారు.
నాగపూర్‌లో ‘లా’
చదువుతున్న రోజుల్లో ఆయన త్రిపురలో జరిగిన కాంగ్రెసు సభలకు హాజరయ్యారు. అక్కడే ఆయన
జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్‌లతో సహా ఎందరో జాతీయ
నాయకులను కలుసుకున్నారు. అలనాడు హైదరాబాద్ స్టేట్‌లో నెలకొన్న పరిస్థితులను ఆయన
వివరించిన తీరు చూసిన జాతీయ నాయకులు ఆయనలోని ప్రతిభను అప్పుడే గుర్తించారు.
1957లో ‘మంథని’
నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో గెలుపొంది, చట్టసభలోకి
అడుగుపెట్టే అవకాశం పొందిన పీవీ చురుకైన, తెలివైన యువ శాసనసభ సభ్యుడిగా పేరు
తెచ్చుకోవటమే కాకుండా, తెలంగాణా ప్రాంతీయ బోర్డు సభ్యుడిగా కూడా
పనిచేశారు. నీలం సంజీవరెడ్డిగారు ఆంధప్రదేవ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, ఆయన
ఆహ్వానం మేరకు స్టేట్ మంత్రి హోదాలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరారాయన. సమాచార, పౌరసంబంధాల
శాఖ, పౌర సరఫరాలు, లా-జైళ్ల శాఖలను నిర్వహించారు పీవీ
నరసింహారావుగారు. అప్పట్లో జైళ్ల సంస్కరణలు చేపట్టిన పీవీ, బాలనేరగాళ్లకు
విద్యావకాశాలు కల్పించారు.
బ్రహ్మానందరెడ్డిగారి
మంత్రివర్గంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నరసింహారావుగారు
దేవాదాయ నిధులను ఉపయోగించడానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మోస్తరు పద్దతికి
సంబంధించిన చట్టానికి రూపకల్పన చేశారు. అదే మంత్రివర్గంలో వైద్య-ఆరోగ్య శాఖను కూడా
నిర్వహించారాయన కొంతకాలంపాటు. తరువాత, పీవీ
నరసింహారావుగారికి అత్యంత ఇష్టమయిన పోర్టు ఫోలియో, విద్యాశాఖను ఆయనకు అప్పగించారు.
తెలుగును రాష్ట్రస్థాయి అధికార భాషగా సూచిస్తూ పీవీగారు తయారు చేసిన శ్వేతపత్రం
ఎందరో విద్యాధికుల నుండి ప్రశంసలను అందుకుంది. అన్ని విశ్వవిద్యాలయాల్లో కళాశాల
స్థాయి వరకు తెలుగును మాద్యమంగా ప్రవేశపెట్టిన ఘనత ఆయనదే.
రాష్ట్ర విద్యాశాఖ ఆయనకు అప్పగించిన తరువాత సర్వేల్
రెసిడెన్షియల్ పాఠశాల పీవీ నరసింహరావు గారు స్థాపించి, అనేకమంది రత్నాలను తయారు
చేయడానికి దోహదపడ్డారు. చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, దౌత్యవేత్తలు అక్కడ చదివారు. విద్యాశాఖ పేరును హెచార్డీగా మార్చాలని
ప్రతిపాదించిన మంత్రి కూడా పీవీ గారే. అప్పటి ప్రధానమంత్రిని ఒప్పించి ఆ పేరు
పెట్టించింది కూడా పీవీ గారే. ఆశాఖ అధిపతిగా పనిచేసినటువంటి మొదటి మంత్రి కూడా
వారే.
ప్రత్యేక
తెలంగాణా ఉద్యమం నేపధ్యంలో, క్లిష్ట సమయంలో పరిస్థితులు చేజారిపోయిన, పోనీ పోతున్న
తరుణంలో నాటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ నిర్ణయం మేరకు, సెప్టెంబర్
28, 1971 విజయదశమి పర్వదినాన ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన పీవీగారు అహర్నిశలు రాష్ట్రాభివృద్ధికి
కృషి చేసారు. అభివృద్ధికర, ప్రగతిశీల సంస్కరణలు తీసుకొచ్చారు. 1972 సంవత్సరంలో ఆయన నాయకత్వంలో సాధారణ
ఎన్నికలు జరిగాయి. కాంగ్రెసు పార్టీ అభ్యర్థుల ఎంపికలో, యువకులకు, బలహీన
వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చారాయన. అత్యధిక మెజార్టీ సీట్లను గెల్చుకుని మళ్ళీ
రాష్ట్ర సారధ్యం వహించారు పీవీగారు.
చారిత్రాత్మక
భూసంస్కరణల బిల్లుకు ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడే శాసనసభ ఆమోదం తెలిపింది.
ఆర్థిక అసమానతలు తొలగించటానిక, ఉత్పత్తి పెరుగుదలకు ఉద్దేశించిన ఓ సామాజిక
సంస్కరణగా అభివర్ణించారు తాను చేపట్టిన ఆ చర్యను పీవీ గారు. పైకి కనిపించిన, వినిపించిన
కారణాలు ఏవైనా, ఆయన పదవీచ్యుతుడు కావటానికి, పీవీ
చేపట్టిన అభివృద్ధి, ప్రగతిశీల సంస్కరణలు అనే విషయంలో సందేహం లేదు. భూసంస్కరణలు
అనే ఏ ఆయుధంతో ఆయన ప్రజలకు చేరువయ్యాడో, అదే ఆయుధాన్ని త్రిప్పి, ఆయనపై
గురిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజీనామా చేసే స్థితికి తీసుకొచ్చారు నాటి
సంపన్నవర్గాలవారు. పీవీగారి మానసపుత్రిక భూసంస్కరణలు ఆద్యంతం పరిశోధనాంశంగా
పరిగణించాలి.
ఆగస్ట్ 30, 1972
న, అప్పటి ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ
బిడ్డ, స్వర్గీయ పీవీ నరసింహారావు చారిత్రాత్మక
భూసంస్కరణల బిల్లును ప్రవేశ పెట్తూ చెప్పిన మాటలు, తదనంతర అమలు పరిణామాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఈ పదకొండు సంవత్సరాల
కాలంలో ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతలు వారి, వారి ఆలోచనలకనుగుణంగా చేపట్తున్న సమగ్ర భూప్రక్షాలణ,
రైతుల
సంక్షేమానికి చేపట్తున్న కార్యక్రమాల నేపధ్యంలో
వెలుగులోకొచ్సిన భూకమతాల వివరాలు, ఒకదానికొకటి అన్వయించుకుని విశ్లేషణ చేస్తే
ఆసక్తికరమైన విషయాలు అవగాహనకొస్తాయి.
అప్పటి ఇందిరాగాంధీ
నేతృత్వంలోని ప్రగతిశీల కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా, జాతీయ
మార్గదర్శికాల నేపధ్యంలో, జూన్ 1,
1973 నుండి ఉమ్మడి అంధ్రప్రదేశ్
రాష్ట్రంలో భూసంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఆగస్ట్ 30, 1972
న శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టడానికి పూర్వరంగంలో అదే ఏడాది మే నెలలో ప్రభుత్వం
ఆర్డినెన్స్ ద్వారా భూసంస్కరణలకు తెరదించింది. పీవీ స్వయంగా వెయ్యి
నుంచి పన్నెండువందల ఎకరాల ఆసామి. భూసంస్కరణ తనతోనే ప్రారంభంచేస్తూ, సుమారు
800 ఎకరాలకు పైగా తన భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పినటువంటి
మహోన్నత వ్యక్తి.
పీవీ గారి భూసంస్కరణల
పుణ్యమా అనీ, భూస్వాముల భూమి పోవడంతో పాటు, చట్టం
అమలు మొదలైన తరువాత పెద్ద మొత్తంలో వ్యవసాయ భూముల కొనుగోలు, పెద్ద
కమతాలుండే విధానం, క్రమేపీ తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్రం
ఏర్పాటైన తరువాత అధికారంలోకి వచ్చిన రెండు ప్రభుత్వాల, సమగ్ర సర్వే, భూ రికార్డుల
ప్రక్షాళణ నేపధ్యంలో, లభ్యమవుతున్న గణాంకాల వివరాల ప్రకారం, చిన్న-సన్న-మధ్యకారు
కమతాలున్న రైతులే మెజారిటీలో, సుమారు 97 శాతం దాకా వున్నారని ప్రాధమిక అంచనా.
ఏదేమైనా, పీవీ నరసింహారావు గారి భూసంస్కరణల పుణ్యమే
చిన్న కమతాలు ఏర్పడడం!
దురదృష్టవశాత్తు, భూసంస్కరణల
లాంటి అభివృద్ధి చర్య గిట్టని ఆయన సొంత పార్టీకి చెందిన ప్రగతిశీల వ్యతిరేక ముఠా
ఆయన కుర్చీని లాగివేయటం జరిగింది. బహుశా అప్పుడు వారికి తెలియదు కాబోలు, తాము
రాష్ట్రంలో వద్దనుకున్న అదే పీవీగారు, దేశాన్ని నడిపించడానికి అంచెలంచలుగా నాయకత్వ
నిచ్చెన ఎక్కుతాడని, ప్రధాన మంత్రి అవుతాడని, భారతదేశ కీర్తిపతాకం
ప్రపంచవ్యాప్తంగా ఎగురవేస్తాడనీ!!
భూసంస్కరణల
బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడానికి పదిహేను రోజుల పూర్వం, భారతదేశ స్వాతంత్ర్య రజతోత్సవాల సందర్భంగా
1972 ఆగస్టు 15, అర్థరాత్రి 12 గంటలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పీవీ శాసనసభా భవనంలో తమ సందేశంగా ‘ఆ నిద్రాణ నిశీధిని
మానిసి మేల్కాంచినాడు’ అనే అద్భుత గీతాన్ని ఆలపించారు. పీవీగారి భాషావేత్త
కోణానికి ఇదొక నిదర్శనం మాత్రమే! ఆ గీతం ఇలా సాగుతుంది. “ఆ నిద్రాణ నిశీధిని మానిసి
మేల్కాంచినాడు; ఒళ్లు విరిచి,
కళ్లు తెరిచి వోహో అని లేచినాడు; కటిక
చీకటుల చిమ్మెడు కారడివిని పయనించు నిజ జఠరాగ్ని జ్వాలల నింగినంత లేపినాడు........”
బహుశా దీని
అంతరార్థం తెలుసుకోవాలంటే భాషా ప్రవీణులు పరిశోధన చేయాల్సిందే. ఒక డాక్టరేట్ కు
సరిపోయే సమాచారం, ఇందులో దాగుంది. పీవీగారి తెలుగు, హిందీ భాషల ప్రావీణ్యానికి మరో నిదర్శనం, జ్ఞానపీఠ ఆవార్డు గ్రహీత, కవిసామ్రాట్
స్వర్గీయ విశ్వనాధ సత్యనారాయణ గారు రచించిన ‘వేయిపడగలు’ తెలుగు పుస్తకాన్ని హిందీలోకి ‘సహస్రఫన్’
గా అనువదించడం. ఎడతెగని, క్షణమైనా తీరికలేని రాజకీయ కార్యకలాపాలు
ఉన్నప్పటికీ, అన్ని
భాషలలోని ప్రముఖ రచయితలతో పీవీ క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించారు.
పివి 17 భాషలలో
నిష్ణాతులు కావడంతో పాటు ఆర్థికశాస్త్రం, చట్టం, చరిత్ర,
రాజకీయాలు, కళలలో
కూడా ప్రావీణ్యం ఉంది. తెలంగాణ
సాయుధపోరాటం ఇతివృత్తం ఆధారంగా పీవీ రాసిన గొల్ల రామవ్వ కథలో ఒక గొప్ప సాయుధపోరాట
వీరుడిని గొల్ల రామవ్వ ఏ విధంగా కాపాడిందో అద్భుతంగా వర్ణించారు. పీవీ. సాహిత్యం
ఎంత చదువుకున్నా ఆయనెపుడూ ప్రగాల్బాలకు పోలేదు. చాలా అద్భుతమైనటువంటి కవి. రచయిత.
జ్ఞాన తృష్ణ ఉన్నటువంటి వ్యక్తి. సాహిత్య పిపాసి.
ముఖ్యమంత్రిగా
రాజీనామా చేసిన పీవీ నరసింహారావు గారికి భారత జాతీయ కాంగ్రెసు కార్యదర్శిగా
బాధ్యతలు అప్పచెప్పింది కాంగ్రెసు అధిష్ఠానవర్గం. ఆ హోదాలో ఆయన స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీకి
చేరువయ్యారు. 1977 ఎన్నికల్లో హన్మకొండ పార్లమెంటు నియోజకవర్గం నుండి గెలిచి లోక్‌సభలో
అడుగుపెట్టారు. 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తిరిగి హన్మకొండ లోక్‌సభ
స్థానానికి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొంది, శ్రీమతి ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో
విదేశీ వ్యవహారాల మంత్రిగా పదవినలంకరించారు.
జవహర్‌లాల్
నెహ్రూగారి విదేశాంగ విధానాన్ని, దౌత్యనీతిని, దశ దిశలా ప్రచారం చేశారు పీవీ. ఐక్యరాజ్యసమితి
సర్వసభ్య సమావేశంలో ఆయన ఉపన్యాసం కృష్ణమీనన్ ఉపన్యాసాన్ని మరిపించిందని అనేవారు. 1983
అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్
కాస్ట్రోను అబ్బురపరచాడు. ఇజ్రాయిల్‌తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి
పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా
దేశాలతో చైనా, ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ
సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని. పీవీ గారు విదేశాంగ
మంత్రిగా పనిచేస్తూ ‘లుక్ టు ఈస్ట్’ అన్నారు.
కొంతకాలం హోమ్
శాఖను నిర్వహించారాయన. పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ
ప్రభుత్వానిదే.
కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు
లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే. 1998లో
వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ
ప్రభుత్వమే.
1984లో
మహారాష్ట్రలోని రామ్‌టెక్ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయిన పీవీ, రాజీవ్‌గాంధీ
మంత్రివర్గంలో రక్షణశాఖను, మానవవనరుల అభివృద్ధిశాఖను నిర్వహించారు. నూతన
విద్యా విధానాన్ని(ఛాలెంజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్) ఆయనే రూపొందిచారు.
ఆయన హయాంలోనే జాతీయ శిక్షణ విధానాన్ని (నేషనల్ ట్రైనింగ్ పాలిసీ) కూడా
రూపొందించారు. 1989లోనూ రామ్‌టెక్ నుండే గెల్చారు.
రాజకీయాలకు
దాదాపు స్వస్థి పలికి విశ్రాంతి తీసుకుంటుండగా,
మధ్యంతర ఎన్నికలొచ్చాయి. టికెట్ కూడా
అడగకుండా మూటా ముళ్లా సర్దుకుని స్వరాష్ట్రం వెళ్లే ప్రయత్నంలో వున్న సమయంలో, రాజీవ్
గాంధీ హత్యకు గురయ్యారు. కష్టకాలంలో, భారత జాతీయ కాంగ్రెసు పార్టీ అధ్యక్షపదవిని
చేపట్టి హత్యానంతరం జరిగిన ఎన్నికలకు సారధ్యం వహించి, ఆ
పార్టీని ఏకైక పెద్ద పార్టీగా గెలిపించుకున్నారు. పార్టీ ఆయన్ను పార్లమెంటరీ
పార్టీ నాయకుడిగా ఎన్నుకోవడంతో 1991లో మైనార్టీ ప్రభుత్వ ప్రధానమంత్రిగా, తొలి
దక్షిణాది వ్యక్తి ఆ పదవిని అధిష్టించిన వాడిగా ఓ గుర్తింపు పొందారు.
తత్త్వశాస్త్ర
వేత్తలే సమాజానికి, దేశాలకు ఉత్తమమైన పాలకులు అని ప్రాచీన గ్రీకు
తాత్త్వికుడు ప్లేటో ఉద్ఘాటించారు. తత్త్వవేత్తలే పాలనలో న్యాయాన్ని ధర్మాన్ని
సమానంగా, సమతుల్యంగా స్వీకరిస్తారని ఆయన అంటారు. ఇతరులకు
అది అంతగా చేతకాదు. అలాగే చాణక్యుడిగా ప్రసిద్దికెక్కిన అర్థశాస్త్ర రచయిత
కౌటిల్యుడి అభిప్రాయం ప్రకారం, సానుకూల,
ప్రతికూల భావోద్వేగాలను అర్థం చేసుకుని తదనుగుణంగా పాలన చేసినప్పుడే
ఎవరైనా మంచి నాయకుడు కాగలడు. ఒక వ్యక్తి మంచి,
చెడు రెండింటినీ ఒకే సమయంలో, ఒకే
కోణంలో చూసినప్పుడు, తనంతట తానుగా ఏకకాలంలో నిర్ణయానికి
రాగలిగినప్పుడే మంచి నాయకుడు కాగలడు అని కూడా కౌటిల్యుడి విశ్వాసం. పీవీ నరసింహారావుగారు
ఈ లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న ఏకైక వ్యక్తి అనడంలో అతిశయోక్తి లేదేమో!
భారత దేశం, ఆమాటకొస్తే, యావత్
ప్రపంచం ఎదుర్కొంటున్న వర్తమాన వివిధ రకాల పరీక్షా కాలంలో, సామాన్య
మానవుడి మనుగడే ప్రశ్నార్ధకమవుతున్న సంక్షోభ సమయంలో, అనునిత్య
యుద్ధవాతావరణంలో, వ్యక్తిదీ, వ్యవస్థదీ
ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్న నేపధ్యంలో, ప్రతి
ఒక్కరికీ స్ఫురణకు వచ్చేది అలనాటి పీవీ నరసింహారావుగారి రాజనీతిజ్ఞత, ఆర్ధిక
సంస్కరణాభిలాష.
దేశం తీవ్ర
ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, ఆర్థిక ప్రపంచంలో విశ్వసనీయత కోల్పోతున్నప్పుడు, అసమానమైన, మునుపెన్నడూ
కనీ-వినీ ఎరుగని రీతిలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి, మార్కెట్
సరళీకరణ విధానాన్ని రూపొందించాడు. పీవీ ఆశయాలకు చేరువగా ఆయన రూపకల్పన చేసిన ప్రైవేటీకరణ, ఆర్థిక సరళీకరణ తదనంతర ప్రభుత్వాలు
కూడా అమలుపరచినప్పటికీ, దురదృష్టవశాత్తూ ఆశించినంత మేరకు కొనసాగించలేదనాలి.
ప్రభుత్వ రంగంలో
కొంత భాగం ప్రైవేటీకరించబడింది, వ్యవస్థాపిత పోటీకి దారితీసే లైసెన్స్ రాజ్
రద్దు చేయబడింది, రాష్ట్ర నియంత్రణ, అధికార
నిత్యకృత్య పద్దతి తగ్గించబడ్డాయి. ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించడానికి విదేశీ
పెట్టుబడులపై విధానాలు సవరించబడ్డాయి. బహుభాషా కోవిదుడుగా పివి స్వయంగా ఒక
చేయితిరిగిన రచయితగా తన జ్ఞాపకాలను ‘ది ఇన్సైడర్’ అనే పుస్తకంలో పొందుపరచారు. పీవీ, భారతదేశాన్ని
ఒక ప్రధాన సమాచార సాంకేతిక భాండాగారంగా పరివర్తన చెందడానికి కారకుడయ్యాడు.
సమాచార, సాంకేతిక
విప్లవం పీవీ పుణ్యమే.
అందుకే పీవీని
స్మరించు కోవటం సదా మన కర్తవ్యం, మన నైతిక బాధ్యత, మన కనీస ధర్మం. అత్యున్నత వ్యక్తిత్వం
కలిగి ఉండటం పివి సొంతం. భారత రాజకీయ, ఆర్థిక,
సామాజిక వ్యవస్థ సుస్థిరతకు ఆయన
అందించిన విలువైన నాయకత్వం సదా స్మరనీయం. జూన్ 28, 1921 లో జన్మించిన పీవీగారి శత
జయంతి ఉత్సవాలను నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి, ఏడాది పొడవునా అనేక కార్యక్రమాలను నిర్వహించి, ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా
తెలంగాణకు, ప్రధానమంత్రిగా భారతదేశానికి చేసిన అసమానమైన
సేవలను గుర్తుచేసుకోవడం యావత్ తెలంగాణ ప్రజలు ఆయనకు అర్పించిన గొప్ప నివాళి.
తెలంగాణ
ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన దరిమిలా, పీవీ జయంతి, వర్ధంతి
ఉత్సవాలను ఘనంగా, అధికారికంగా ఏటేటా నిర్వహించారు. ఆ ఒరవడి ఆ
తరువాత వచ్చిన ప్రభుత్వం కూడా కొనసాగించడం జరిగింది. ఆయన శతజయంతి ఉత్సవాలను
ఏడాదిపాటు ఘనంగా నిర్వహించడానికి అప్పటి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేశవరావు
అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు నాటి సీఎం కేసీఆర్.
భారత
ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన, అధికారాల రీత్యా రాష్ట్రపతి స్థానం కంటే
బలీయమైన ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే
ఒక్క తెలుగువాడు, అందునా తెలంగాణ వాడు, పాములపర్తి
వెంకట నరసింహారావు మరణానికి ముందు, ప్రధానిగా పదవీ విరమణ చేసిన తర్వాత, సుమారు
ఎనిమిది సంవత్సరాలు, ఆయనను ఎన్ని విధాల కష్టపెట్టడానికి వీలుందో, అన్ని
రకాలైన ఇబ్బందులకు గురిచేశాయి అలనాటి ప్రభుత్వాలు. అవి ఎన్డీయే ప్రభుత్వమా? యూపీఏ ప్రభుత్వమా? అనేది వేరే విషయం.
పదవి నుండి
దిగిపోయాక వరుసగా జరిగిన విచారణలు ఆయన్ని అనుక్షణం వెన్నాడాయి. అయితే ఈ ఆరోపణలన్నీ
కోర్టుల్లో వీగి పోయాయి. చివరి కేసు ఆయన మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు
వీగిపోయింది. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్టమొదటి మాజీ ప్రధానమంత్రిగా పీవీ చరిత్ర పుటల్లోకెక్కారు. అయితే ఢిల్లీ
హైకోర్టు ముడుపుల కేసును కొట్టివేసింది. సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు, లఖుభాయి
పాఠక్ కేసుల్లోను పీవీ నిర్దోషిగా ఉన్నత న్యాయస్థానాలు తీర్పిచ్చాయి. ఈ మూడూ కాక
స్టాక్ మార్కెట్ కుంభకోణం ఆరోపణలు కూడా నిరాధారాలని తేలింది. అయితే ఆయనకు
జరగాల్సిన అన్యాయం జరిగింది. మచ్చ మిగిలిందా,
చెరిగి పోయిందా అనే విషయాన్ని భావితరాల
వారికే వదులుదాం.
ఇదిలా వుండగా, మరికొన్ని సంవత్సరాల తరువాత, సుమారు పదేళ్ల క్రితం మరోమారు పీవీ మీద
బురదచల్లే కార్యక్రమానికి కొందరు ప్రబుద్ధులు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్
పార్టీలో, ఆయన ఎప్పుడూ అలా భావించకపోయినా,
పీవీ రాజకీయ ప్రత్యర్థి అర్జున్ సింగ్ ఆత్మకథ, ‘ఏ గ్రెయిన్ ఆఫ్ శాండ్ ఇన్ ద
అవర్ గ్లాస్ ఆఫ్ టైమ్’ పేరిట, సీనియర్ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ పుస్తకం ‘బియాండ్
ద లైన్స్’ పేరిట, ఆ
మహనీయుడిపై బురద చల్లే కార్యక్రమానికి పనిగట్టుకుని మరీ శ్రీకారం చుట్టారు.
పీవీ
నరసింహారావు అంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కోపమని, సోనియా
అంటే పీవీకి సదభిప్రాయం లేదని, రాజీవ్ హత్యా-మరణానంతరం సోనియా గాంధీని అఖిల
భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని చేద్దామన్న సూచనకు పీవీ వ్యతిరేకమని, ఇంజనుకు
తగులుకుని రైలు పెట్టెలన్నీ దాని వెనకాలే వెళ్లినట్టు నెహ్రూ-గాంధీ కుటుంబం వెనుకే
కాంగ్రెస్ పార్టీ వెళ్లడం దేనికని పీవీ ఆ సందర్భంగా ప్రశ్నించాడని, బాబ్రీ
మసీదు కూల్చివేత సందర్భంలో ఆయన ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కూర్చోవడమంటే
రోమ్ తగలబడుతున్నప్పుడు నీరో ఫిడేలు వాయిస్తున్న దృశ్యం తనకు గుర్తుకొచ్చిందని
అర్జున సింగ్ ఆరోపించారు తన ఆత్మకథలో.
సోనియా
వ్యతిరేకత విషయం ప్రస్తావించిన అర్జున్ సింగ్ పీవీ ‘ఎమోషనల్ ఔట్ బరస్ట్’
గురించి రాశాడు. పీవీ తత్వం అర్థం చేసుకున్న చాలామందికి ఆయనకసలు అలాంటి గుణమే
లేదనే వాస్తవం తెలుసు. ఇవన్నీ సోనియాకు, పీవీకి సంబంధాలు చెడగొట్టే ప్రయత్నం
చేయడమే! అర్జున్ అస్తమానం పీవీ మీద సోనియాకు పితుర్లు మోయడమే పనిగా పెట్టుకునేవాడు.
పీవీకి లాయల్టీ అంటే, విధానాలకా?
వ్యక్తులకా? లాయల్టీకి
సైకోఫెన్సీకి తేడా తెలియనివారు అలా రాయడంలో ఆశ్చర్యం లేదు. అర్జున్ సింగ్ తన
అవసరాలకొరకు, స్వలాభం కొరకు, పీవీకి సోనియాకి మధ్య అగాధం సృష్టించాడని
విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
అర్జున్ సింగ్, కులదీప్
నయ్యర్ చేసిన ఆరోపణలను పీవీ ప్రధానిగా వున్న రోజుల్లో న్యాయశాఖ కార్యదర్శిగా పని
చేసి ఆయనకు రాజ్యంగ పరమైన అనేక విషయాల్లో నిర్మోహమాటమైన సూచనలిచ్చిన స్వర్గీయ పీసీ
రావు, అదే విధంగా పీవీకి మీడియా సలహాదారుడిగా
పనిచేసిన సీనియర్ ఐఏస్ అధికారి, స్వర్గీయ పీవీఆర్కే ప్రసాద్ ఈ ఆరోపణలను అప్పట్లోనే
పత్రికా ముఖంగా ఖండించారు. బాబ్రీ మస్జీద్ కూల్చివేత సమయంలో అలనాడు జరిగిన
వాస్తవాలకు వీరు ప్రత్యక్ష సాక్షులు. జరుగుతున్నదంతా పీవీ పైన ఆశ్చర్యకరమైన, బాధాకరమైన
ఆరోపణలనక తప్పదు. వాస్తవమేంటో, బాబ్రీ మసీదు కూల్చివేత నేపధ్యంలో అక్కడ పీవీ
ఇంట్లో జరిగిందేంటో చెప్పాల్సిన బాధ్యత తన మీద వుందంటూ, జరిగిన
విషయాలన్నీ పూస గుచ్చినట్లు బహిరంగ పరిచారు పీవీఆర్‍కె ప్రసాద్ మీడియా సమావేశంలో.
అర్జున్ సింగ్, కులదీప్
నయ్యర్ చెప్పిన దాంట్లో రాజకీయ కోణాలున్నాయి. అసలా మాటకొస్తే ఇవేవీ కొత్తగా
చేస్తున్న వ్యాఖ్యానాలు కానే కావు. కాకపోతే చేసే పద్ధతే మారింది. ఇందులో
రెండు-మూడు విషయాలు ప్రధానంగా చెప్పుకోవాలి. అసలు చేస్తున్న వ్యాఖ్యానాలు
వాస్తవాధారంగా వున్నాయా? లేనప్పటికీ చేశారంటే, ఏదో
ఒక కారణం, ప్రణాళిక వుండి తీరాలి. ఇదేదో మామూలుగా జరుగుతున్న విషయంలాగా కనిపించడం
లేదు. అర్జున్ సింగ్ కానీ, కులదీప్ నయ్యర్ కానీ సంఘటనా స్థలంలో (పీవీ
ఇంట్లో) లేరప్పుడు. అక్కడ జరిగింది ప్రత్యక్షంగా ఇద్దరూ చూడలేదు. ఇద్దరు కూడా ఎవరో
చెప్పారని మాత్రమే అంటున్నారు.
ఆ వ్యవహారం
ఎంతవరకు వెళ్లిందంటే: చివరకు లిబర్హాన్ కమీషన్ పీవీని నిర్దోషి అని తేల్చిన తరువాత
కూడా, కాంగ్రెస్ నాయకుడైన అర్జున్ సింగ్ తన ఆత్మకథలో ఇలా రాయడం, దానికి
కులదీప్ నయ్యర్ లాంటి వారు వంత పలకడం విడ్డూరం. బాబ్రీ మసీదు కూల్చివేతకు తన
పార్టీ, తమ ప్రధాని బాధ్యుడనే స్థితికి దిగజారాడు అర్జున్ సింగ్. ఆయన మైండ్ సెట్, అజెండా, ఒక
రకంగా పీవీ మీద ద్వేషం, మరొక రకంగా ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కకుండా పోవడం. ఆయన
ఆర్థిక సంస్కరణలైనా, భూసంస్కరణలైనా, నెహ్రూ-గాంధీ విధానాలను కొనసాగించడమే
కాని దానికి విరుద్ధమెలా అవుతుంది? పీవీ తీసుకున్న ప్రతి నిర్ణయం దేశం కోసం
మాత్రమే. ఆయనే కనుక తనకోసం నిర్ణయం తీసుకుంటే,
మరో మారు ప్రధాని కావడం ఏ మాత్రం
కష్టమయ్యేది కానే కాదు. బహుశా పీవీ జీవించి వున్నట్లయితే
అర్జున్ సింగ్-కులదీప్ నయ్యర్ రాతలకు ఒక చిరునవ్వు నవ్వేవాడేమో!
చివరగా, అత్యంతమౌలికమైన పీవీగారి ఒక అద్భుతమైన
ఉపన్యాసంలోని ప్రధాన అంశాలను, ఆయన మాటల్లోనే ప్రస్తావించి, ఈ స్మారకోపన్యాసాన్ని ముగిస్తాను. ‘రెండు
యుద్ధాల మధ్య సాగిన తమ జీవన యానం’ అంటూ, స్వర్గీయ కాళోజీ నారాయణరావు 88 వ పుట్టిన రోజు సందర్భంగా, కొంత
ఆలశ్యంగా నవంబర్ 18, 2001 న నిర్వహించిన సభలో పీవీ నరసింహారావు
చేసిన ప్రసంగమిది. కాళోజీ సమగ్ర కవితా సంకలనం పుస్తాకావిష్కరణ సందర్భంగా హైదరాబాద్
నగరంలోని ఇందిరా ప్రియదర్శిని సమావేశ మందిరంలో జరిగిన ఆనాటి సభ నాకింకా బాగా
గుర్తుంది.
అలనాటి పీవీగారి
ఉపన్యాసం ఒక రకంగా చెప్పుకోవాలంటే, అతి క్లుప్తంగా ఆయనగారు తన జీవితాన్ని
తనమాటల్లోనే చెప్పుపున్న మాటలనాలి. పీవీగారు తన ఉపన్యాసంలో చెప్పిన కొన్ని మాటలు
చాలా అర్తవంతమైనవి. ఉదాహరణకు: “జగతికి శాపములు ఇచ్చుచు శత సంవత్సరములు బ్రతుకుము ;
రెండు యుద్ధాల మధ్య సాగిన తమ జీవన యానం; సాహిత్య జగత్తు; కాళోజీ భూతం; కాళోజీ
ఫినామినన్; కామన్-అన్ కామన్ క్షణాలు” లాంటివి పేర్కొనవచ్చు.
ఆ రోజు ఆ సభలో
వున్న నేను పీవీగారు మాట్లాడినదాన్ని యధాతథంగా రాసుకున్నాను. ఇప్పటికీ ఆ రాసుకున్న
ప్రతిని భద్రంగా దాచుకున్నాను. ప్రఖ్యాత తెలుగు దినపత్రిక ‘ప్రజాతంత్ర’ అప్పట్లో దీన్ని ప్రచురించింది కూడా. ‘జగతికి
శాపములు ఇచ్చుచు శత సంవత్సరములు బ్రతుకుము’ అని అప్పటికి 28 సంవత్సరాల
క్రితం కాళోజీ షష్టి పూర్తి సందర్భంగా తాను అన్న మాటలనే తిరిగి చెప్తున్నానంటూ తన
ఉపన్యాసాన్ని మొదలు పెట్టారు పీవీ నరసింహారావు గారు ఆ సందర్భంగా.
కాళోజీ
మాట్లాడితే వినాలని, తిడితే పడాలని, అనుకోని వారు బహుశా ఎవరూ వుండరని అంటూ, తనకంటే
ఐదేళ్లు పెద్దవాడైన కాళోజీతో తన పరిచయాన్ని,
తరువాత క్రమేపీ తమ మధ్య పెన
వేసుకుపోయిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పీవీ. కాళోజీ ప్రభావం తనపై ఎంతో
గాఢంగా పడిందనీ, ఆ కారణాన,
తాను ఏదైనా నిర్ణయం తీసుకున్న
ప్రతిసారి కాళోజీ లాంటి విమర్శకుడు ఆ నిర్ణయం విషయంలో ఎలా స్పందిస్తారోనని ఆలోచనలో
పడిపోతాననీ, ఆ విధంగా కాళోజీ తన ఆత్మగా మారి కూర్చున్నాడనీ
చెప్పారు.
వయసులో
చిన్నవాడినైన తనకు, తనకంటే పెద్దవాడైన కాళోజీని ఆశీర్వదించాలని
వుందనీ, ఆయనింకా పది కాలాల పాటు నడవాలి అని అనాలని
వుందని, ఆయన అవసరం ఎంతో వుందని అడుగుతున్నానని, ‘నువ్వు
మాట్లాడితే వినాలని...తిడితే పడాలని’ ఆశగా వుందని అంటారు పీవీ. ఆ నాడు పీవీ సుమారు
అరగంట పాటు ఏకధాటిగా ప్రసంగించి, ‘రెండు యుద్ధాల మధ్య సాగిన తమ జీవన యానం’ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.
2001 సెప్టెంబర్‌లో
తన 88 వ పుట్టిన రోజు జరుపుకున్న కాళోజీ గారు ఆ మరుసటి సంవత్సరమే, నవంబర్
13, 2002 న మరణించారు. ఆయన మరణ వార్త విన్న పీవీ
నరసింహారావు, ఆ రోజుతో తమ ఇద్దరి మధ్య కొనసాగిన 60 సంవత్సరాల
అన్యోన్య స్నేహం, 70 సంవత్సరాల కాళోజీ సాహిత్య సేవ, ప్రజల
వెంట వుండి చేస్తున్న కావ్య సేవ, ఇవన్నీ అంతరించి ఒక శకం పూర్తైనందుకు విషాదంగా
వుందన్నారు.
పీవీ
ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక,
సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప
మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో అవినీతి
ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి
చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు
బీజం వేసాడు. తన ఆర్థికమంత్రి, భావి
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు
ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన
అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
పీవీ నరసింహారావు
ఒక గొప్ప తత్త్వ శాస్త్ర వేత్త. తత్త్వశాస్త్ర వేత్తలే సమాజానికి, దేశాలకు
ఉత్తమమైన పాలకులు అని ప్రాచీన గ్రీకు తాత్త్వికుడు ప్లేటో చెప్పాడు. తాత్త్వికుల
లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న ఏకైక వ్యక్తి పీవీ అనడంలో అతిశయోక్తి లేదేమో! ఒక
తత్త్వ వేత్త అయిన ప్రధానిగా, ఒక ఆర్ధిక వేత్త అయిన ప్రధానిగా, ఒక
సామాజిక వేత్త అయిన ప్రధానిగా, ఒక ఒక రాజకీయవేత్త అయిన ప్రధానిగా, ఒక
భాషావేత్త అయిన ప్రధానిగా, ఒక అభ్యుదయ వేత్త అయిన ప్రధానిగా, ఒక
విద్యావేత్త అయిన ప్రధానిగా, అన్నింటినీ కలగలపిన ఒక బహుముఖ
ప్రజ్ఞాశీలిగా పీవీ చరిత్ర పుటల్లో నిలిచి
పోయారు.
పివి
నరసింహారావు రాజనీతిజ్ఞత, ఆర్ధిక సంస్కరణాభిలాష అత్యద్భుతం. ఆయన
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి ఆర్ధిక సంక్షోభాన్ని, అత్యంత
చాకచక్యంగా, దేశానికి బంగారు బాట వేసి, దిశా
నిర్దేశం చేశారు. వాటి ఫలితాలు, ఫలాలు ఇటీవలి కాలం వరకు మనమంతా అనుభవిస్తూనే
ఉన్నాము. వాటి నుండి పాఠాలు నేర్చుకోవడంలో మాత్రం ఒక అడుగు వెనక్కే వున్నామనాలి.
పప్రథమంగా భారత
జాతీయ కాంగ్రెసు ఆధిపత్యాన్ని ఆ కుటుంబం నుండి తప్పించి, అయిదేళ్లు
సుస్థిర పాలనను అందించి, ప్రపంచంలో అత్యంత పెద్దదైన పార్లమెంటరీ
ప్రజాస్వామ్య భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆర్థిక-సామాజిక-రాజకీయ
సంస్కరణలకు శ్రీకారం చుట్టి చివరకు ఆ పునాదుల శిధిలాల్లోనే వాటికి రాళ్లు మోసిన
వారి చేతుల్తోనే నెట్టబడ్డారు పీవీ నరసింహారావు.
స్థితప్రజ్ఞతకి, మూర్తీభవించిన
వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం పీవీ. రాజకీయ జీవితంలో పీవీ ఎల్లప్పుడూ
స్థిరత్వాన్ని కొనసాగించారు. జెఎంఎం లంచాల కుంభకోణంలో మేజిస్ట్రేట్ కోర్టు అతనికి
మూడు సంవత్సరాల శిక్ష విధించినప్పుడు, తీర్పు ఇస్తూ, మేజిస్ట్రేట్ అజిత్ భరిహోక్ పివిపై పలు
వ్యాఖ్యలు చేసినప్పుడు, ఆయన్నొక నేరస్థుడిలాగా ముద్ర వేసినప్పుడు, అదే
విషయానికి మీడియాలో బహుళ ప్రచారం జరిగినప్పుడు,
పీవీ స్పందన పరిపూర్ణ నిశ్శబ్దం. ఈ
కేసులన్నిటిలోనూ ఆయన నిర్దోషి అని తేలినప్పుడు అదే మీడియా తగు రీతిలో
స్పందించలేదు.
పీవీ గారి జీవితాన్ని, అతని
భవిష్యత్ దర్శినిని, రాజకీయ జీవితాన్ని గురించి విపులంగా, ఆయనను
అనుసరించిన వారందరికీ తెలుసు. పీవీ నరసింహారావు సమాజం గురించి ఎప్పుడూ ఆలోచించే
దార్శనికుడని, స్వార్థపూరిత ఆలోచనలను ఎప్పుడూ చేయలేదని
అందరికీ తెలుసు. ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్రం లో విద్యాశాఖ మంత్రిగా సేవలు
అందించినప్పుడు, పేదలకు రెసిడెన్షియల్ విద్యావ్యవస్థను
తొలిసారిగా పరిచయం చేసిన ఘనత ఆయనదే. కేంద్రంలో మానవ వనరుల మంత్రిగా ఉన్నప్పుడు ఇదే
ఆలోచనను నవోదయ విద్యాలయాల రూపంలో జాతీయ స్థాయిలో ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఆయనదే.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రులుగా ఉన్న రోజుల్లో
జాతీయ విద్యా విధానం రూపొందించిన వ్యక్తి
విద్యావేత్త పీవీ నరసింహారావు.
అయిదారు
దశాబ్దాల తన రాజకీయ జీవితంలో, శతాబ్దాల అనుభవాన్ని సంపాదించి పలువురికి పంచి
పెట్టిన మేధావి, కాకలు తీరిన కాంగ్రెస్ యోధుడు, ఎన్ని
ఒడుదుడుకులు ఎదురైనా చిరునవ్వు వీడని ధీశాలి. ఆలోచనల్లో, అమల్లో
విజ్ఞాన సర్వస్వంగా పేర్కొనాల్సిన వ్యక్తి,
అపర చాణక్యుడుగా అందరూ స్థుతించిన
వ్యక్తి, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ప్రతిపక్షాల నుండీ
ఖండ ఖండాంతర ఆర్థిక నిపుణుల నుండీ మన్ననలనందుకున్న వ్యక్తి పీవీ నరసింహారావు.
సమైక్య ఆంధ్ర
ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యాభై సంవత్సరాల క్రితం, ఆగస్టు
30, 1972 న,
శాసనసభలో ప్రసిద్ధ భూసంస్కరణల బిల్లు
ప్రవేశపెట్టిన ఘనత పీవీ సొంతం. ఇది తొలిసారిగా వినూత్నమైన భూ సంస్కరణల బిల్లు.
దేశంలో ఎక్కడైనా ఇదే మొదటిది. పివి అప్పుడు తీసుకువచ్చిన భూసంస్కరణలు భూస్వామ్య
జమీందార్ వ్యవస్థను సమూలంగా నిర్మూలించదానికి బాటలు వేశాయి, భూమిలేని
పేదలను చిన్న-చిన్న కమతాల యజమానులుగా మారడానికి సహాయపడ్డాయి. పేద వారికి సమాజంలో
గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది.
పీవీ
నరసింహారావుది 360 డిగ్రీస్ పర్సనాలిటీ అని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి
కేసీఆర్, పీవీ శత జయంతి ఉత్సవాల ప్రారంబోత్సవాల సందర్భంగా చెప్పిన విషయం వందశాతం
నిజం. పీవీ నిరంతర సంస్కరణశీలి. ఎక్కడ ఏ రంగంలో ఆయనను పెట్టినా, ఆ
రంగంలో సంస్కరణలు తేవడమే ఆయన చేసిన పని. అందుకే పీవీని స్మరించు కోవటం సదా మన
కర్తవ్యం, మన నైతిక బాధ్యత, మన కనీస ధర్మం. భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక
వ్యవస్థ సుస్థిరతకు ఆయన అందించిన విలువైన నాయకత్వం సదా స్మరనీయం.
ఆర్ధిక సంస్కరణల
రూపకర్త, తత్త్వవేత్త, భాషా ప్రవీణుడు, ధీశాలి
పీవీ నరసింహారావు భారత రాజకీయ చరిత్రలో అజరామర నేత. సామాన్యుడి జీవితానికి అర్థం, భారత దేశానికి బంగారు బాట చూపిన మహా నాయకుడు. ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర
ముఖ్యమంత్రిగా తెలంగాణకు, ప్రధానమంత్రిగా దేశానికి మేలు చేసిన విశిష్ట వ్యక్తిత్వం
పీవీగారిది.
బహుభాషా
పాండిత్యంతో, ఆలోచనల విశ్వవిద్యాలయంగా, విజ్ఞానసర్వస్వంగా, దౌత్యంలో
జవహర్లాలాల్ నెహ్రూ, రాజగోపాలచారి స్థాయిని మించిన మేధావిగా, సంక్షోభాల
శాంతిదూతగా నిలిచిన మహామనీషి. నవభారత నిర్మాతల్లో మొట్టమొదటి కంట్రీ ప్లానింగ్
మొదలుపెట్టిన వ్యక్తి జవహర్ లాల్ నెహ్రూ అయితే, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన
పీవీగారు గ్లోబల్ ఇండియా సృష్టించిన వ్యక్తి.
మితభాష, మేధోబలం, భూసంస్కరణల
పునాది, మౌలిక సంస్కరణల మిత్రుడు. రాజ్యాధికారపు
అగ్రస్థానాన్ని అధిరోహించిన తొలి తెలుగువాడు. పీవీగారి స్మృతి, భారత
ప్రగతికి శాశ్వత స్పూర్తి. తరతమ బేధం లేని తెలంగాణ బిడ్డ, బహుముఖ ప్రజ్ఞాశీలి,
స్వర్గీయ పాములపర్తి వెంకట నరసింహారావు పేరు భారతదేశ చరిత్రలో, అంతర్జాతీయ రాజకీయ,
ఆర్థికవేత్తల, దౌత్య సంబంధాల నాయకుల చరిత్రలో, సువర్ణాక్షరాలతో
లిఖించబడింది. ఆ మహనీయుడికి నా నివాళి.