Sunday, January 1, 2012

బొత్స కల 2012 లో ఫలించేనా?: వనం జ్వాలా నరసింహారావు


2011 సంవత్సరంలో ఏం జరిగింది?-4
సూర్య దినపత్రిక (01-01-2012)
వనం జ్వాలా నరసింహారావు

కేంద్రంలో పరిస్థితి అలా వుంటే, ఇక రాష్ట్రంలో మరో విధంగా వుంది. కేంద్రంలో అధికారంలో వున్నది, విభిన్న విధానాలను పాటించే "పలు భాగస్వామ్య రాజకీయ పక్షాల సంకీర్ణ ప్రభుత్వం" కాగా, రాష్ట్రంలో వున్నది విరుద్ధ భావాల-వ్యక్తిగత ఎజెండాల-ఎత్తులకు పైఎత్తులు వేయగల సామర్థ్యం గల "ఏక పార్టీకి (కాంగ్రెస్) చెందిన సంకీర్ణ ప్రభుత్వం". అక్కడ అధికార బాధ్యతలు వహించేది ప్రధాన మంత్రి మన్మోహన్ సింగే ఐనా, అధికారం చెలాయించేది యుపిఎ చైర్ పర్సన్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధి. ఇక్కడ అధికారం పరోక్షంగా నడిపించేది, సోనియా నాయకత్వంలోని అధిష్ఠానం. ఈ నేపధ్యంలో, ఎన్నికల వాగ్దానాలైనా, కనీస ఉమ్మడి ప్రణాళికలో పేర్కొన బడిన అంశమైనా, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనైనా, అమలైనా, పాలనా యంత్రాంగంపై పట్టు సాధించడమైనా, అవినీతిని అరికట్టడమైనా-ప్రోత్సహించడమైనా, పదవుల పందేరమైనా, పార్టీని-పభుత్వాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడమైనా, "భావ సారూప్యం-పరస్పర విరోధ భావం" ప్రాతిపదికగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులపైనే ఆధార పడివుంటుంది. అదే జరిగింది 2011 లో. మొదటి దఫా రాజశేఖర రెడ్డి హయాంలో, "పునరంకిత సభలు" జరిగేవి. రెండో మారు ఆయన గెలిచి, ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలలోపే విమాన ప్రమాదంలో మరణించడంతో, ఆ మరుసటి ఏడాది పునరంకిత సభ జరగనేలేదనాలి. ఇక ఆయన మరణంతో,  పునరంకిత సభ దేవుడెరుగు! రాజశేఖర రెడ్డి రెండో విడత ప్రమాణ స్వీకారం చేసిన తేదీ కూడా ఆయనకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటూన్న వారికి సహితం గుర్తుకు రాలేదు. అంతెందుకు...ఆయన వారసులమని చెప్పుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు కూడా గుర్తులేదు. ప్రభుత్వం పునరంకిత సభలు జరపక పోయినా "రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని" పడగొట్టడం ఇష్ఠంలేని వారన్నా కనీసం మరో విధంగా నన్నా పునరంకితమై తే బాగుండేదేమో!

కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆరు నెలల ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశపెడతామని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్ నెలలో ప్రకటించారు. ఏనాడైతే వై ఎస్ జగన్మోహన్ రెడ్డిని, దివంగత ముఖ్య మంత్రి వారసుడుగా గుర్తించడానికి, అధిష్టానం విముఖత వ్యక్త పరిచిందో, అప్పుడే, ఆయన నాయకత్వంలో చేరదల్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య నిర్ధారణ అయింది. ఒకానొక సందర్భంలో శాసన సభలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీకి చేరే పరిస్థితి కలిగించింది. ఈ నేపధ్యంలో, జగన్ ఓదార్పు యాత్ర, దానికి కాంగ్రెస్-కాంగ్రేసేతర రాజకీయ పక్షాల వ్యతిరేకత, ప్రజల అఖండ అభిమానం, జగన్ పై కాంగ్రెస్ అధిష్టానం మరింత చిన్న చూపు, చివరకు ఆయన పార్టీకి-లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి సోనియా గాంధీపై ధిక్కార స్వరం వినిపించడంతో ప్రభుత్వంపై అవిశ్వాసం దిశగా మరి కొంత అడుగులు పడ్డాయి. ఇంతలో చిరంజీవి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. పోయిందనుకున్న బలం తిరిగొచ్చిందనుకున్నారు కాంగ్రెస్ వారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, కడప ఎన్నికలలో గెలుపు జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వంపై "అవిశ్వాసం" వేగవంతం చేయడానికి బలం చేకూరింది. జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి ఎప్పుడైతో గణనీయమైన సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధమై నారని కాంగ్రెస్ అధిష్టానం భావించిందో, ఆ మరు నిమిషంలోనే, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా, కిరణ్ సర్కారును రక్షించేందుకు చిరంజీవిని అక్కున చేర్చుకుంది. ప్రజారాజ్యం పార్టీ అనే "కుంపటి" ని వీలైనంత తొందరలో నెత్తి మీద నుంచి దించుకోవాలన్న ఆలోచనలో వున్న చిరంజీవికి కాంగ్రెస్ ఆలోచన కలిసొచ్చింది. కొంతలో కొంత జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకో గలిగామన్న భరోసా కలిగింది కిరణ్ సర్కారుకు. ఇంతలో, తొంభై మందికి పైగా శాసన సభ్యుల సంఖ్యా బలం కలిగిన తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాల్సిందేనని డిమాండు చేశారు జగన్. ఇంత జరిగినా అవిశ్వాసం అప్పటికి తుస్సుమనక తప్పలేదు.

బాబా రాందేవ్ అన్నంత పనీ చేశాడు. ఆమరణ నిరాహార దీక్షకు దిగనే దిగాడు. విరమించుకోవడం కూడా ఒక ప్రహసనంలా జరిగిపోయింది. మద్దతిచ్చిన వారున్నారొక వైపు. మండి పడ్డ వారూ తక్కువేం కాదు. సామ-దాన-భేద-దండోపాయాలను ప్రయోగించింది ప్రభుత్వం వ్యూహాత్మకంగా. అవినీతికి, నల్లధనానికీ వ్యతిరేకంగా జూన్ నాలుగు నుంచి నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెడతానన్న రాందేవ్ బాబా, తన లక్ష కిలోమీటర్ల "భారత స్వాభిమాన యాత్ర" ను ఉజ్జయినిలో ముగించుకుని, ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరి అక్కడి విమానాశ్రయం చేరుకోవడానికి ముందే, ఆయన అనుగ్రహం కోసమా అన్న చందాన, ఆయనతో చర్చించే నెపంతో, కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కపిల్‌ సిబాల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్‌ కుమార్ బన్సాల్, పర్యాటక శాఖ మంత్రి సుబోధ్‌ కాంత్ సహాయ్ క్యాబినెట్ సెక్రటరీ కే ఎం చంద్రశేఖర్ వంటి అతిరథ-మహారథులు అక్కడకు వెళ్లడం కంటె విడ్డూరం ఇంకో టి లేదే మో! అంత కంటే మరీ హాస్యాస్పదం, ఆయనతో చర్చలు జరిపిన అనంతరం కపిల్ సిబాల్ ఆయనగారికి ఇచ్చిన "టెస్టిమోనియల్". "రాందేవ్ దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తారు. అవి చాలా ముఖ్యమైన జాతీయ అంశాలు. వాటి పరిధి చాలా విస్తృతం. వాటికి మేం ప్రాథమికంగా స్పందించాం" అన్నది దాని సారాంశం. తనను తాను సాక్షాత్తు దైవాంశ సంభూతుడుగా, ఒక దేవ దూతగా భావిస్తున్న బాబా రాందేవ్ మరో టెస్టిమోనియల్ ను మీడియాకు చూపించారు. నిరాహార దీక్ష విరమించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారని, ఐనా, దేశాన్ని రక్షించడం కోసం నిరశన ప్రారంభించాలనే నిర్ణయానికొచ్చానని, విదేశాల్లో ఉన్న మొత్తం నల్లధనాన్ని స్వదేశానికి తిరిగి తీసుకు రాగలననే పూర్తి ఆత్మ విశ్వాసం తనకున్న దని దాని సారాంశం. అంతా అందరనుకున్నట్లుగానే "మధ్యంతరం" అయింది. బాబా రామ్‌ దేవ్ జూన్ నాలుగో తేదే శనివారం తెల్లవారు జామున చేపట్టిన ఆమరణ దీక్ష ఒక రోజన్నా గడవక ముందే భగ్నమైంది. ఆయనను అరెస్టు చేశారా? కిడ్నాప్ చేశారా? చేయించింది ప్రభుత్వమా? కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి? అన్నవి ప్రశ్నార్థకంగా వుండి పోయాయి. వ్రతం చెడింది...ఫలితం దక్కలేదు. సర్కారు అనుకున్న ది సాధించింది...రాందేవ్ బాబా కూడా అన్న పని చేశాడు. అవినీతి మాత్రం తనను ఎవరూ, ఏమీ చేయలేరని అపహాస్యం చేస్తూ, మందహాసం చేసింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, భారత వైద్య మండలి సంయుక్తంగా ఏర్పాటు చేసిన (జులై నెలలో) రాష్ట్ర స్థాయి సదస్సులో ప్రధానోపన్యాసం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య-వైద్య-కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్, రాష్ట్ర వ్యాప్తంగా శిశు మరణాల సంఖ్య ఏడాదికి 74 వేలకు పైగా వున్నాయని పేర్కొనడం జరిగింది. గిరిజనులలో-షెడ్యూల్డ్ కులాల వారిలో ఇతరుల కంటే శిశు మరణాల సంఖ్య చాలా అధికమని, వీటిని తగ్గించాలంటే వైద్య విద్య కళాశాలలు ముఖ్య భూమిక పోషించాలని రమేష్ సూచించారు. మెడికల్ కాలేజీలలో పనిచేస్తున్న డాక్టర్లు, కమ్యూనిటీ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం కుదుర్చుకుని పనిచేస్తే, శిశు మరణాల సంఖ్య తగ్గే అవకాశం వుందని కూడా ఆయన అన్నారు. ప్రభుత్వ-ప్రయివేట్ రంగంలోని ఆసుపత్రులన్నీ విధిగా గర్భిణీ స్త్రీల వివరాలను నమోదు చేసే కార్యక్రమం దిశగా "మాతా-శిశు ఆరోగ్య కార్డులు" ప్రవేశ పెట్టినట్లు కూడా ఆయన చెప్పారు. ఇదిలా వుంటే, యావత్ రాష్ట్రానికి, ఒకే ఒక్క "చిల్డ్రన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి" గా వున్న, హైదరాబాద్ లోని నిలోఫర్ ఆసుపత్రిలో, సగటున ప్రతి రోజు, పది-పదిహేను శిశు మరణాలు సంభవిస్తున్నట్లు కూడా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, జూనియర్ డాక్టర్ల సమ్మె విరమణ సందర్భంగా ప్రకటించి, సంచలనం కలిగించారు. గ్రామీణ స్థాయి నుంచి, రాజధాని స్థాయి వరకూ, నిరంతరం మాతా శిశు సంరక్షణకు, ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే జరిగే దారుణం ఇలానే వుంటుంది. ఉదాహరణకు, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో, చాలాకాలం నిర్వహించబడిన నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవల వల్ల, గ్రామీణ ప్రాంతాలలో, సుమారు పదమూడు లక్షల మందికి పైగా గర్బ్జిణీ స్త్రీలు ప్రసవానికి ముందు, ప్రసవం అనంతరం సరైన సమయంలో సరైన వైద్య పరీక్షలు చేయించుకుని, సరైన చికిత్స పొందారు. దాని మూలంగా కొంతలో కొంతైనా శిశు మరణాలు సంభవించకుండా నిరోధించే వీలైంది. ఇలాంటివే, ప్రభుత్వం చేపట్టి కొనసాగించితే బాగుంటుందేమో! తెలంగాణ ప్రాంతానికే తలమానికమైన నిలోఫర్ దవాఖానలో సామూహిక హత్యాకాండను పోలిన శిశుమరణాలకు బాధ్యులెవరని పరిశోధన చేసి, సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టి, వాటిని అరికట్ట లేకపోయినా కనీసం తగ్గించే ప్రయత్నం చేసినట్లయితే బాగుండేదేమో!  

బొత్స సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామకం కావడంతో, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. తన జీవితాశయం రాష్ట్ర ముఖ్య మంత్రి కావడం అని కుండ బద్దలు కొట్టి చెప్పుతున్న బొత్స సత్యనారాయణ, గతంలో ఏ పిసిసి అధ్యక్షుడు చేయడానికి సాహసించని విధంగా, సమాంతరంగా "మంత్రి వర్గ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు" నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను, కాంగ్రెస్ పార్టీ పథకాలుగా ప్రచారం చేయడంలోనే పార్టీకి లాభముంటుందన్నారు. పార్టీ అధ్యక్షుడుగా తాను బలపడడం, ముఖ్యమంత్రి కావాలన్న ఆయన జీవితాశయం నెరవేర్చుకోవడం కొరకు చేయాల్సినంతా చేయసాగారు. "రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు-చెవులు కాంగ్రెస్ పార్టీనే సుమా!" అని పీసీసీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరు క్షణంలోనే, బొత్స సత్యనారాయణ, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక హెచ్చరిక లాంటిది చేయడం వెనుక, ఎటువంటి ని గూడార్థం ఇమిడుందని రాజకీయ విశ్లేషకులు శోధించారు. బహిరంగంగా మాత్రం, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చెట్టా-పట్టాలేసుకుని, కలిసి-మెలిసి పని చేసుకుంటూ, పార్టీని "మరింత బలోపేతం చేస్తాను" అని బొత్సా స్పష్టం చేయడం ముఖ్య మంత్రికి కొంత రిలీఫ్ గానే భావించాలి! బొత్స మార్కు వ్యాఖ్య మరొక టి కూడా ఆశ్చర్యకరంగానే వుందనాలి. తాను ఎవరికీ చీఫ్ కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ కార్య కర్తలకు, ఢిల్లీలో అధిష్టానానికి సంధాన కర్తగా మాత్రమే వ్యవహరిస్తానని శలవిచ్చారాయన. పనిలో పనిగా, తననింతవాడిని చేసిన "దైవం" సోనియా గాంధీకి, "పూజారి" గులాం నబీ ఆజాద్‌ కు, ఈ ఇరువురి మధ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించి తనకు ఆ పదవి కట్టబెట్టడంలో తోడ్పడిన జాతీయ-రాష్ట్ర స్థాయి ప్రముఖ నాయకులందరి కీ, ధన్యవాదాలు తెలియ చేసుకున్నారు. ఆయన కల 2012 నన్నా ఫలించేనా?
          
ఇలా మననం చేసుకుంటూ పోతుంటే...ఎన్నో...ఎన్నెన్నో..ఇంకా...ఇంకా చెప్పుకోవచ్చు.        

Saturday, December 31, 2011

రాజకీయ మ్యాచ్‌ ఫిక్సింగ్‌!: వనం జ్వాలా నరసింహారావు


2011 సంవత్సరంలో ఏం జరిగింది?

తడబడినా..... ఆత్మవిశ్వాసం దిశగా! -3
వనం జ్వాలా నరసింహారావు

ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో వున్న వారితో సహా, వివిధ రకాల ఆరోగ్య రుగ్మతల వల్ల, క్రమేపీ ఆరోగ్యం క్షీణించి, పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకున్న వారికి కూడా, అత్యవసర వైద్య సహాయం-అత్యవసరంగా-సకాలంలో లభించేందుకు, "చికిత్సా నిరాకరణ" ను అడ్డుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న వైద్య విధానాన్ని అమల్లోకి తేవాలనుకుందీ సంవత్సరం. ఈ ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చేందుకు, రాష్ట్రవ్యాప్తంగా, సుమారు రెండువందల ప్రభుత్వ-ప్రయివేటు ఆసుపత్రులను తొలిదశలో ఎంపిక చేయదలిచింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, ప్రాణాపాయ స్థితిలో వుండి, అకాల మరణం పాల్పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు మెరుగయ్యాయి. తొలుత రెండువందల ఆసుపత్రులకే పరిమితం చేయదల్చుకున్న ప్రభుత్వ నిర్ణయం దరిమిలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు విస్తరించవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అత్యవసర పరిస్థితుల్లో చికిత్సా నిరాకరణ నేరంగా పరిగణించే ఆలోచన ఈ ఏడాది చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర వైద్య విధానం సంపూర్ణంగా కార్యరూపం దాలిస్తే, ప్రాణాపాయ స్థితిలో వచ్చిన బాధితులు డబ్బులు చెల్లించ లేకపోయినా, వైద్య సేవలు అందించలేమని చెప్పి వెనక్కు పంపడానికి వీలు లేదు.  

2011 ఏప్రిల్ నెలలో తరచుగా వినిపించిన పదం "మాచ్ ఫిక్సింగ్". ఒక అ నైతిక ఒప్పందంగా "మాచ్ ఫిక్సింగ్" అనే మాట ముద్ర పడింది. ఆ తరహా "అప నమ్మకం" అనే ఆయుధాన్ని రాష్ట్ర రాజకీయ నాయకులు విపరీతంగా వాడకంలోకి తెచ్చారు. దానికి మీడియా తన వంతు సహకారాన్ని అందించ సాగింది. మీడియా-రాజకీయ నాయకుల మధ్య "మాచ్ ఫిక్సింగ్" స్థాయికి ఎదిగిందా అపనమ్మకం ఆయుధం. ఉదాహరణలుగా ఎన్నో చెప్పుకోవచ్చు. శాసన సభలో వై ఎస్ జగన్మోహన రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్-తెలుగు దేశం పార్టీల మధ్య "మాచ్ ఫిక్సింగ్". అంటే ఆ రెండు పార్టీల మీద ప్రజల్లో అపనమ్మకం కలిగించడానికి జగన్ వర్గీయులు వాడిన ఆయుధం. అలానే కాంగ్రెస్-జగన్ వర్గాల మధ్య "మాచ్ ఫిక్సింగ్" ఆరోపణను తెలుగు దేశం పార్టీ కొంత కాలం ప్రచారం చేసి, తరువాత జగన్-బిజెపి ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో గళం కలిపింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఆ మూడు ప్రధాన రాజకీయ పార్టీలలో, ప్రతి పార్టీ నాయకులు, ఇతర రెండింటి మధ్య "మాచ్ ఫిక్సింగ్"  అన్న ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. సోనియా-జగన్ ల మధ్య "మాచ్ ఫిక్సింగ్"  గురించి బిజెపి ప్రచారం చేసిన సందర్భం కూడా వుంది. తామేంటో, తమ వ్యూహం ఏంటో, గెలుస్తే తమ పంథా ఎలా వుండబోతుందో తెలియచేయాల్సిన రాజకీయ పార్టీలు, దాన్ని గాలికి వదిలేసి, ప్రత్యర్థుల పై ఓటర్లలో అప నమ్మకం కలిగేలా వ్యవహరించడం విడ్డూరం. చంద్రబాబు నాయుడు బాబ్లీ విషయంలో చేసిన ఉద్యమాన్ని కూడా అప నమ్మకం కోణంలోనే ఆయన వ్యతిరేకులు వాడుకున్నారు తప్ప, ఆయన సరళిలోని తప్పులను ఎంచి చూప లేకపోయారు. అదే కాలంలో రెండు ప్రధాన దిన పత్రికల ఎడిట్ పేజీలలో, ఆ పత్రిక యాజమాన్య అధినేతల విషయంలో, వస్తున్న వ్యాస పరంపరలు, వ్యతిరేకుల మీద "అప నమ్మకం" కలిగించేలా వున్నవే తప్ప, వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న తపన కనిపించడం లేదు. ఈ జాడ్యం రాజకీయాలకే పరిమితమై పోలేదు. అన్ని రంగాలకూ వ్యాపించ సాగింది ఒక అంటు జబ్బులా.

ప్రభుత్వ ప్రయివేటు భాగ స్వామ్యంలో, 108 అంబులెన్సు అత్యవసర సహాయ సేవలు, సంబంధిత ప్రభుత్వ శాఖలోని కొందరు అధికారుల అలసత్వం వల్ల, మే నెల కల్లా, గతంలో వలె సేవలందించలేని స్థితికి చేరుకున్నాయి. సగటున గతంలో హాజరయ్యే రోజువారీ అత్యవసర సహాయ సేవలు గణనీయంగా పడిపోయాయి. సేవలను కోల్పోతున్న వారిలో, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు, చిన్న పిల్లలు కూడా వున్నారు.  అత్యవసర చికిత్స ఆలశ్యమవుతే సంభవించేది మరణాలే కదా! అదే విధంగా, నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలను అందించే 104 సంచార వాహనాలలో పని చేస్తున్న సిబ్బంది సమ్మె సాకుగా చూపి, సిబ్బంది లేవనెత్తిన అంశాలను పరిష్కరించే బదులు, గత ఏడాది డిసెంబర్ మొదటి వారం నుంచి, ప్రభుత్వమే సంబంధిత జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఆ నిర్ణయం తీసుకునేందుకు పూర్వం, 475 సంచార వాహనాల ద్వారా, ఆ సేవలందించిన యాజమాన్యం, రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలలో- తాము నివసిస్తున్న గ్రామానికి మూడు కిలోమీటర్ల లోపు కనీస వైద్య సౌకర్యాలు ఏ మాత్రం లేని, సుమారు ఇరవై వేల గ్రామాల ప్రజలకు, నెలకొక్క సారి, అది కూడా నిర్ధారిత తేదీన, అన్ని రకాల ప్రాధమిక వైద్య సౌకర్యాలను సమకూర్చింది. లబ్ది పొందిన లక్షలాది మంది గ్రామీణ నిరుపేదలలో, అనేక మంది గర్భిణీ స్త్రీలు, ప్రసూతి స్త్రీలు, పసి పిల్లలు, చంటి పిల్లలు కూడా వున్నారు. మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు ఆ సేవలెంతగానో తోడ్పడ్డాయి. డిసెంబర్ నెలనుంచి, కలెక్టర్ల ఆధ్వర్యంలో నడుస్తున్న అవే వాహనాలు, కనీసం ఒక్క రోజన్నా, ఒక్క గ్రామానికన్నా, నిర్ధారిత తేదీన వెళ్ళిన దాఖలాలు లేవని చెప్పాలి. ప్రజోపయోగంగా వున్న పథకాలను నిష్ప్రయోజనం చేయకూడదు. అలాంటి ప్రజోపయోగమైన పథకాలలో అత్యంత ప్రయోజనమైన వి, బహుళ జనా మోదం పొందినవి, రాజకీయాలకు అతీతంగా-కుల మతాలకు అతీతంగా ఉపయోగ పడేవి, 108 అంబులెన్సులు- నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలను అందించే 104 సంచార వాహనాలు-ఆరోగ్య సమాచార సహాయ కేంద్రం సేవలు. వీటిని నిధుల లేమితో నీరు కార్చే ప్రయత్నం చేసింది ప్రభుత్వం అన్న భావం ప్రజలలో కలిగిందీ ఏడాది.

కడప లోక్ సభ, పులివెందుల శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన నేపధ్యంలో, ఓటమి దరిమిలా ప్రభుత్వ భవిష్యత్ పై ఆసక్తికర పరిణామాలు సంభవించవచ్చని భావించిన నేపధ్యంలో, తన పార్టీ ఓటమిని ఎలా తీసుకుంటారని మీడియా వారడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఒక సారి ఓడిపోయినంత మాత్రాన, అది శాశ్వతంగా ఓటమి పాలైనట్లు కాదని సమాధానం ఇచ్చారు. ఓటమిని క్రికెట్ మాచ్ తో పోల్చి, ఉదాహరణగా, ఒకానొక అంతర్జాతీయ క్రికెట్ మాచ్ లో బలమైన టీమిండియా, బలహీనమైన బంగ్లాదేశ్ టీంతో ఓటమి పాలైన విషయాన్ని, తర్వాత, ప్రపంచ కప్పును గెలవడాన్ని చెప్పారు సీఎం. ఓటమి-గెలుపుల వరకు పోలిక బాగానే వుంది కాని, మిగతా విషయాలలో టీమిండియా సాధించిన విజయ రహస్యానికి-వ్యూహానికి వెనుక నున్న కృషి-పట్టుదల, ఓటమి పాలు కాకుండా వుండేందుకు, "కిరణ్ కుమార్ రెడ్డి కడప ఎన్నికల టీం" కు లేదనేది పలువురి మనసులో మాటగా చెప్పుకోవాలి. వాస్తవానికి, ఆద్యంతం, జగన్మోహన్ రెడ్డిని అత్యంత బలీయమైన శక్తిగానే ఊహించింది కాంగ్రెస్. కాకపోతే, ఎన్నికల వ్యూహరచన ఓటమి దిశగానే  చేసింది. చివరకు ఓటమి పాలైంది. తన తండ్రి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టను అని అన్న జగన్ నోటితోనే, పడగొట్టి తీరుతాను అన్న దాకా ప్రేరేపించింది. ఏదేమైనా, గెలిచింది వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐనప్పటికీ, ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఓడించింది ప్రభుత్వాన్ని. ఓడిపోయింది  అధికారుల అలసత్వానికి ప్రతీకైన ప్రభుత్వం,  ప్రభుత్వంలోని సమిష్టి బాధ్యతా రాహిత్యం, ఆ బాధ్యతా రాహిత్యానికి వూతమిచ్చిన కొందరు అధికారుల సంక్షేమ పథకాల అమలు తీరు. ఈ తప్పులను కనీసం రాబోయే ఏడాదన్నా సరి దిద్దుకుంటే మంచిదేమో!

డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చి మే 22వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. విదేశాంగ విధానమైనా, ఆర్థిక పరమైన నిర్ణయాలైనా, ఇరుగు-పొరుగు దేశాలతో సత్సంబంధాలైనా, ఒక్కొక్క దానికి మన్మోహన్ ప్రభుత్వం ఒక్కో రీతిలో ప్రగతి సాధించింది. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన "జాతీయ సమైక్యతా మండలి" లోని సభ్యుల జాబితా చూస్తే, రాజకీయాలకతీతంగా, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న దేశంలో, అలాంటి కమిటీలను ఏర్పాటు చేయగలమన్న భరోసా ఇవ్వగలిగింది మన్మోహన్ ప్రభుత్వం. గ్రామీణ ఉపాధి హామీ పథకం, పట్టణ పునరుద్ధరణ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, భారత్ నిర్మాణ్ యోజన, ఆం ఆద్మీ ఆలోచన లాంటి పలు పథకాలకు యూపీఏ ప్రభుత్వం రూప కల్పన చేసింది-అమలు పరిచింది. ఆర్థిక సంస్కరణలను, మారుతున్న సామాజిక-రాజకీయ-ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొనసాగించడం యూపీఏ విజయాలలో ఒకటి. అలాగే విజయాలను-అపజయాలను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక విషయం గుర్తుంచుకోక తప్పదు. ఇదొక సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ధర్మానికి అనుగుణంగానే, మంత్రివర్గ ఏర్పాటుతో సహా, అభివృద్ధి-సంక్షేమ కార్య క్రమాల రూపకల్పన అమలు కూడా వుండి తీరుతుంది. ఇక అంతర్జాతీయ రంగానికి వస్తే, క్షణ క్షణానికి, మన దేశంలో జరుగుతున్న మార్పులతో సంబంధం లేకుండా, అంతో-ఇంతో గత ఎన్డీయే హయాంలో కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం కాకుండా, నిర్ణయాలు తీసుకోక తప్పదు. మన్మోహన్ సింగ్ కూడా అలానే చేస్తున్నారనాలి.

అన్నీ విజయాలేనా అంటే, అక్కడక్కడ, అపజయాలు లేకుండా పోలేదు. దానికి ప్రకృతిది కొంత బాధ్యత అనుకుంటే, మానవ తప్పిదాలు మరికొంత దోహద పడ్డాయి. కరువు-కాటకాలు ద్రవ్యోల్బణానికి దారితీస్తే, నిబద్ధత లేని భాగస్వామ్య పక్షాలకు చెందిన కొందరు, అవినీతికి అంకితమై పోయి, యూపీఏ ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారు. ఫలితం అనుభవిస్తున్నారు. అలానే చమురు ధరల పెంపుదల. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం మన దేశంపై పడింది. నిత్యావసర వస్తువైన గాస్ మినహా మిగిలిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంచనాలకు మించి పెరగడం ఒక అపజయంగా అనుకోవచ్చేమో! చమరు ధరల పెరుగుదల నిత్యావసర వస్తువులపై కూడా పడింది. పౌర పంపిణీ వ్యవస్థను ఎంత పటిష్ట పరిచినా ఇంకా చేయాల్సింది చాలా వుంది. టెలికాం స్కాం యూపీఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది కొంతవరకు. అలానే, అత్యంత వైభవంగా-అంగరంగ వైభోగంగా జరిగిన కామన్వెల్త్ క్రీడలలో కూడా కొంత అపశృతి చోటు చేసుకుంది. భారత దేశానికి మున్నెన్నడూ లభించని విధంగా బంగారు-రజత-కాంస్య పతకాలు లభించాయి. అవినీతిని అరికట్టాలన్న ధృఢ సంకల్పంతో పనిచేస్తున్న యూపీఏ ప్రభుత్వం, టెలికాం, కామన్వెల్త్ క్రీడల స్కాంలను సీబీఐకి అప్ప చెప్పి తన చిత్త శుద్ధిని తెలియ చేసుకుంది.

(మరిన్ని మిగిలాయింకా)

Friday, December 30, 2011

విపక్షాల వైఖరి మారాలి: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో, ఏ రకమైన చట్టాన్ని, ఎప్పుడు-ఎలా-ఎందుకు రూప కల్పన చేయాలో, చేసిన దానిని రాజ్యాంగ ప్రకరణాలకు-పార్లమెంటరీ విధానాలకు అనుగుణంగా ఆమోదింప చేసుకోవాలో, చేయడం వల్ల తలెత్తే పర్యవసానం ఎలా అధిగమించాలో అన్న విషయాలను నిర్ణయించే అధికారం కేవలం చట్ట సభలకు మాత్రమే వుంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలైన కార్య నిర్వాహక వ్యవస్థ, శాసన ప్రక్రియ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు, వాటి-వాటి పరిధుల్లో తిరుగులేని అధికారాలను కలిగి వుండడం వల్ల, ఒక వ్యవస్థను మరోటి పూర్తిగా కబళించలేని విధంగా, అధిగమించలేని పద్ధతిలో, "అదుపులు-అన్వయాలు" ఆయా వ్యవస్థల అధికారాలను పరిమితం చేస్తుంటాయి. ఏ వ్యవస్థకు అపరిమితమైన అధికారాలను రాజ్యాంగం కట్టబెట్టలేదు. పార్లమెంటు తన హక్కుగా, బాధ్యతగా, పారదర్శకతతో చేయాల్సిన విధిని, అదేదో తమ పనిగా, ఎవరో కొందరు-పౌర సమాజం నెపంతో నో, లేదా మరే కారణంతో నో, తమపైన వేసుకోవడం అప్రజస్వామికం-అనైతికం.

చారిత్రాత్మక లోక్ పాల్ నమూనా బిల్లు రూపొందించే ప్రక్రియలో, క్రియాశీలక పాత్ర వహించిన గాంధేయ వాది అన్నా హజారేను ప్రతి భారతీయ పౌరుడు మనఃపూర్వకంగా అభినందించాల్సిందే! అంత మాత్రాన, భారత పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని, తద్వారా కొనసాగాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియను కించపరిచే దిశగా అడుగులు వేయబూనుకోవడం సరైందికాదు. రాజ్యాంగ పరంగా సంక్రమించిన శాసన నిర్మాణ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన పార్లమెంటు అధికారం తిరుగులేనిదే! హజారే సూచించిన అంశాలు చాలావరకు పొందుపరిచి లోక్ పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ప్రధాని మన్మోహన్ సింగ్ ను, ఆయన మంత్రి మండలిని అభినందించాల్సిన హజారే-ఆయన పౌర సమాజ బృందం, దానికి బదులుగా, పార్లమెంటు ఆమోదించనున్న ఆ చట్టాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించనున్నదని ముందే జోస్యం చెప్పడం దురదృష్టకరం. ఒకవైపు లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్తుంటే, మరో వైపు ముంబై నగరంలో నిరాహార దీక్షకు పూనుకోవడం ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మనిషిని, అందరిలో ఒకడిగా మిగిల్చింది. చివరకేమైంది? పట్టుమని పదివేల మంది మద్దతును కూడా కూడగట్టుకోలేని దుస్థితికి దిగజార్చింది. హజారే అనుకున్న జన లోక్ పాల్ చట్టం రాకపోగా, ప్రభుత్వం ప్రయత్నించిన లోక్ పాల్-లోక్ ఆయుక్త కూడా ప్రస్తుతానికి చట్టం కాలేకపోవడం దురదృష్టం. 

పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతాల ప్రకారం, అదుపులు అన్వయాలకు లోబడి, కార్య నిర్వహణ అధికారి (ప్రధాన మంత్రి) మంత్రి మండలి సమష్ఠి బాధ్యతకు అనుగుణంగా, చట్టాలను (రూప కల్పనను)  ముందస్తుగా మంత్రి మండలిలో క్షుణ్ణంగా చర్చించి, బిల్లు రూపంలో పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశ పెట్టి-చర్చించిన తర్వాత, (సవరణలతో) ఆమోదించడమో, తిరస్కరించడమో జరగడం ఆనవాయితీ. ఇప్పుడదే జరిగింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన ఒకటి-రెండు సవరణలను ప్రభుత్వం లోక్ సభలో పరిగణలోకి తీసుకుంది . రాజ్యసభలో ప్రతిపాదనకు వచ్చిన సుమారు రెండువందల సవరణలను పరిగణలోకి తీసుకోవాలా-వద్దా అని నిర్ణయం జరగక ముందే, సభలో నెలకొన్న గందరగోళ పరిస్థితులలో సభాధ్యక్షుడు సభను నిరవధికంగా వాయిదావేశారు. అధికార-ప్రతిపక్షాలకు చెందిన సభ్యులందరూ, పార్లమెంటు సార్వభౌమాధికారం విషయంలో మాత్రం ఒక్కటయ్యారు. "లాబీ వర్గాల" కు (పౌర సమాజం వారితో సహా), పార్లమెంటు సభ్యులుకాని వారికి, లాంఛనంగా-చట్ట పరంగా, ఆ ప్రక్రియలో ముందుగా పాల్గొనే వీలు రాజ్యాంగం కలిగించలేదు. కాకపోతే, వారి పలుకుబడి-ప్రభావం చూపించి, ప్రభుత్వం మీద-పార్లమెంటు సభ్యుల మీద కొంత ఒత్తిడి తెచ్చే అవకాశం లేక పోలేదు. అది హక్కు ఎంత మాత్రం కానేకాదు. ప్రధాన ప్రతిపక్షాలన్నీ ధర్నా చౌక్‌లో అన్నా హజారే బృందానికి మద్దతిస్తూనే, పార్లమెంటు ఉభయ సభలలో మాత్రం తాము అనుకున్నదే చేశారు.

అన్నా హజారే-ఆయన పౌర సమాజం చెప్పిందల్లా చేస్తే, పార్లమెంటుకు, ప్రధానికి ఏదన్నా పాత్ర వుందనుకోవాలా? లేదా? పౌర సమాజానికి చెందిన కొందరు స్వయం ప్రకటిత నేతల ఒత్తిళ్లకు లొంగి, చట్టాల రూపకల్పనకు సంబంధించి పూర్తి అధికారాలను కలిగున్న పార్లమెంటు పరిధి నుంచి ఆ అధికారాలను పార్లమెంటే తర శక్తులకు బదిలీ చేస్తే ప్రజాస్వామ్యం ఏం కావాలి? ప్రధాని మన్మోహన్ సింగ్, సుమారు నాలుగున్నర దశాబ్దాల తర్వాత, చొరవ తీసుకుని (పోనీ హజారే చొరవ వల్ల అనుకుందాం), లోక్ పాల్ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చారు. స్వయంగా ప్రధానిని కూడా లోక్ పాల్ పరిధిలో చేర్చమని ఆయనే కోరారు. చివరకు కమిటీ సభ్యుల సూచనను అంగీకరించారు. బహుశా అత్యున్నత స్థాయి కార్య నిర్వహణ అధికారిని (ప్రధాని), అత్యున్నత న్యాయ వ్యవస్థను, పార్లమెంటులో సభ్యుల పనితీరును, లోక్ పాల్ పరిధిలో తీసుకురాక పోవడం సమంజసమే మో! అదుపులు-అన్వయాలకు బాధ్యత వహించాల్సిన ఈ మూడు వ్యవస్థలను ఆ స్థాయిలో గౌరవించాల్సిన అవసరం వుందనాలి. లోక్ పాల్ సభ్యులుగా నియామకం కాబోయే తొమ్మిది మంది సభ్యులలో భవిష్యత్ లో ఏ నాడూ-ఎవరూ-ఎలాంటి పరిస్థితుల్లోను, ఇతర ఉన్నత స్థాయి-మధ్య స్థాయి-కింది స్థాయి వ్యక్తుల లాగా, ఏ బలహీనతలకు లోను కారన్న నమ్మకం వుందా? అలాంటి వారే ప్రధాని కూడా అని, న్యాయ మూర్తులని భావించడం మంచిదే మో!

పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని, దాని శాసన నిర్మాణ కర్తవ్యాన్ని, ఆ కర్తవ్యంలో పాలు పంచుకుంటున్న గౌరవ సభ్యులను, కార్య నిర్వహణ అధికారి ప్రధానిని కాదని, ఆ మరణ నిరాహార దీక్షకు దిగడం ఎంతవరకు సబబు?

అత్యున్నత విలువల నుంచి హజారే స్ఫూర్తి పొంది ఉండవచ్చు గాక! ఆయన వెంట అశేష జన వాహిని నేడు నడుస్తుండవచ్చు కాక! ఆయన వేసిన ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ, పౌర సమాజానికి చెందిన అతిరథ-మహారథులు హజారే చెప్పే ప్రతి వాక్యాన్ని వేద వాక్కుగా పరిగణిస్తుండ వచ్చు గాక! అంత మాత్రాన ఆయన ఎంచుకున్నది మాత్రం అసలు సిసలైన నిఖార్సైన మార్గం అనే వీలు లేదు. ఇందిరా గాంధీ హయాంలో అత్యవసర పరిస్థితి విధించిన దరిమిలా, అసలే అంతంత మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న పార్లమెంటరీ వ్యవస్థ- అందులోని ఉభయ సభల రాజ్యాంగ బద్ధమైన అధికారాలను హరించే ప్రయత్నం చేస్తే వారెంత గొప్ప వారైనా వారి చర్యలను ఎదుర్కోవాల్సిందే. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రమాదకరమైన ప్రభావం పడే ఎటువంటి చర్యైనా అటు ప్రభుత్వం కాని, ఇటు ప్రతి పక్షాలు కాని, వీటన్నింటి కీ అతీతం అని అంటున్న పౌర సమాజం కాని చేపట్టి తే, దాన్ని అడ్డుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం.

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న లోక్ పాల్ బిల్లుకు ఒక  సుదీర్ఘ చరిత్ర వుంది. హజారే ఆందోళన - పౌర సమాజం జోక్యం - ప్రభుత్వ ఏమరుపాటు - రాందేవ్ బాబా రంగ ప్రవేశం - ప్రభుత్వం తొందర పాటు చర్యలు - రాజీ మార్గాల అన్వేషణ - పౌర సమాజం సభ్యులతో కలిసిన సంయుక్త కమిటీ ఏర్పాటు - జన లోక్ పాల్, ప్రభుత్వ లోక్ పాల్ ముసాయిదా బిల్లుల తయారీ - ఏకాభిప్రాయ సాధన - నాలుగై దు మినహా జన లోక్ పాల్ లో ప్రతిపాదించిన అంశాలన్నింటినీ చేర్చుతూ ప్రభుత్వం లోక్ పాల్ బిల్లు ముసాయిదా రూపొందించడం - మంత్రి మండలి ఆమోదం - లోక్ సభలో ప్రవేశ పెట్టడం - మధ్యలో అసంతృప్తి చెందిన అన్నా హజారే నెల రోజుల క్రితమే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటన చేయడం - అన్న మాట ప్రకారం ఆగస్టు పదహారున దీక్షకు దిగేందుకు సన్నద్ధం కావడం - హజారే ముందస్తు అరెస్టు, అదే రోజు రాత్రి పొద్దు పోయాక ఆయనను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం - ఈ లోపల చిదంబరం తో సహా ముగ్గురు కేబినెట్ మంత్రులు ఢిల్లీ పోలీసుల చర్యను సమర్థించడం - హజారేతో సహా పలువురి నిర్బంధం, విడుదల - పార్లమెంటు లోపల, బయట ప్రభుత్వం, ప్రతి పక్షాల మధ్య మాటల యుద్ధం - చివరకు జైలులోనే వుంటానని భీష్మించుకుని కూర్చున్న హజారే మూడోరోజుకల్లా దిగి రావడం...ఒకటి వెంట ఒకటి జరిగిన పరిణామాలు.  ఇక ఆ తర్వాత "సెన్స్ ఆఫ్ ద హౌజ్" పేరుతో అన్నా హజారే ప్రతిపాదనలకు ప్రభుత్వ పరంగా పరోక్ష ఆమోదం, అన్న మాట ప్రకారం ప్రభుత్వం లోక్ పాల్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడం, సభ ఆమోదం పొందడం, రాజ్యసభలో ఆమోదం పొందకుండానే సభ నిరవధికంగా వాయిదాపడడం తదనంతర పరిణామాలు. వీటిలో, అంతా సత్య సంధులే అనడం నిజం కాదు...ప్రభుత్వం ది ఒక రకమైన మొండి వైఖరై తే, ప్రతి పక్షాల ది మరో రకమైన మొండి తనం...ఇక పౌర సమాజానిది గజ మొండి తనం! వెరసి, మీడియాకు బిజీ-బిజీ-బిజీ! ఏదేమైనా ప్రస్తుతానికి లోక్ పాల్ చట్టం లేనట్లే!

నాలుగున్నర దశాబ్దాల తర్వాత లోక్ పాల్ బిల్లు ఆవశ్యకతను గుర్తుచేస్తూ, అన్నా హజారే నాయకత్వంలోని పౌర సమాజ బృందం మొదట్లో ఆందోళనకు దిగడం సమంజసమే. అప్పట్లో వారి డిమాండు ప్రభుత్వం లోక్ పాల్ బిల్లును తెచ్చి చట్టం చేయాలని మాత్రమే! ఆయన వెంట వున్న పౌర సమాజం సభ్యులు నిజాయితీ పరులే-అందులో సందేహం లేదు. గండం గట్టెక్కడానికి ప్రాధాన్యతనిచ్చే సర్కారు, పౌర సమాజాన్ని-ప్రతిపక్షాలను చీల్చాయి అప్పట్లో. ప్రతి పక్షాలను దూరం పెట్టి పౌర సమాజాన్ని దగ్గరకు తెచ్చుకునే వ్యూహంతో ముందుకు సాగింది. ఆందోళనను తాత్కాలికంగా పలచన చేయగలిగింది.

అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్న లోక్ పాల్ బిల్లు ముసాయిదాను ఖరారు పర్చే ముందర, సంప్రదాయ బద్ధంగా-ఆనవాయితీగా వస్తున్న ప్రతిపక్షాలను సంప్రదించే ఆచారాన్ని పక్కన పెట్టింది. కమిటీలో  పౌర సమాజం సభ్యులకు మాత్రమే ప్రభుత్వ సభ్యుల సరసన పెద్ద పీట వేసింది. ఆ చర్యతో, పౌర సమాజం సభ్యులు, తమ వాదనను వినిపించడంలో బలపడ సాగారు. పౌర సమాజం ఎదురు తిరిగింది. జన లోక్ పాల్ బిల్లు తప్ప ప్రభుత్వ బిల్లు తమకు ఆమోద యోగ్యం కాదు పొమ్మంది! ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. తానేమీ తక్కువ తిన్నానా అన్న చందాన, ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకునే బదులు, ఎదురుదాడికి దిగింది. అప్రజాస్వామిక చర్యలకు పూనుకుంది. అవసరం లేకపోయినా హజారే ను-ఆయన బృందాన్ని నిర్బంధంలోకి తీసుకుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంది. పార్లమెంటు సార్వభౌమాధికారం అన్న మాటను ఆలశ్యంగా తెరపైకి తెచ్చింది. అది కాదనే పరిస్థితి ప్రతిపక్షాలకు కలిగించింది. ప్రతిపక్షాలను హజారే వైపు మళ్లకుండా జాగ్రత్త పడాల్సింది.

అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి అన్న సాకుతో, పార్లమెంటుకు, కార్య నిర్వహణ వ్యవస్థకు, న్యాయ స్థానాలకు, రాజ్యాంగానికి, రూల్ ఆఫ్ లాకు అతీతమైన ఒక సూపర్-డూపర్ నామినేటెడ్ బాడీని ఏర్పాటు చేయాలని పౌర సమాజం ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించడం ఎంతవరకు సబబు? దానికి ఈ మహానుభావులంతా వంత పాడడం ఎంతవరకు న్యాయం? అరవై నాలుగు సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో-అరవై రెండు సంవత్సరాల భారత రాజ్యాంగ చరిత్రలో, అంచలంచలుగా బలపడాల్సిన రాజ్యాంగ వ్యవస్థలను, పటిష్టం చేయాల్సిన బాధ్యతను విస్మరించిన రాజకీయ నాయకులనేకమంది, అదే బాధ్యతను ఇన్నాళ్లు విస్మరించిన పౌర సమాజం నాయకులకు వత్తాసు పలకడంలోని ఔచిత్యం ఏమిటి? నలభై రెండేళ్ల క్రితం నాటిన లోక్ పాల్ మొక్కకు నీరు పోసిన వారు-పోయనివారు ఏకమై పోయారిప్పుడు. వాస్తవానికి మనకు రాజ్యాంగం ప్రసాదించిన అవినీతి వ్యతిరేక అస్త్ర-శస్త్రాలను, అదే రాజ్యాంగంలోని అనేకానేక ప్రకరణాలను, ఒకదానికి మరొక టి అనుసంధానం చేసి అవినీతి పరులపై ప్రయోగించడానికి, ఇదే రాజకీయ నాయకులు-పౌర సమాజం ప్రతినిధులు ఆదినుంచి పూనుకున్నట్లయితే, సమస్య ఇంత జటిలమయ్యేదా? అంతా జరిగినాక, ఇప్పుడు రాత్రికి రాత్రే, "సర్వోపతి" లాంటి ఒక దివ్యౌషధం కావాలని ప్రభుత్వంపై పౌర సమాజం ఒత్తిడి తేవడం సమంజసం కాదు.

సరే అయిందేదో అయిందను కుందాం. తన మాట నెగ్గ లేదనుకుని, మరింత పటిష్టమైన లోక్ పాల్ బిల్లు తేవాలని ప్రభుత్వాన్ని కోరటంలో తప్పు లేదనుకుందాం. దాని కొరకు దీక్షకు దిగడంలోను న్యాయం వుందను కుందాం. ఆయన వెంట నడుస్తున్న ఇతర పౌర సమాజం సభ్యులు, హజారే కంటే అధిక స్థాయిలో పట్టుదల ప్రదర్శించడాన్నీ ఒప్పుకుందాం. కాని, తమకు-తమ పౌర సమాజానికి-తమకు మద్దతిస్తున్న వారికి తప్ప ఇతరులెవరికీ లోక్ పాల్ బిల్లు విషయంలో, ఏమీ తెలవదని వాదించడం మాత్రం అన్యాయం. హజారే ఆరోగ్యం పట్ల ఆందోళన చెందిన ప్రభుత్వం-ప్రతి పక్షాలు, పరస్పరం సంప్రదింపులు చేసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తున్న సమయంలో తమవంతు సహకారం అందించడంలో హజారే బృందం సరైన పద్ధతిలో వ్యవహరించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా-ప్రతిపక్షాలు ఎంత సహకారం అందించినా, పరిష్కారం కను చూపు మేరలో కనిపించడం లేదు. ప్రభుత్వం ఎన్నో మెట్లు దిగి వచ్చింది. జన లోక్ పాల్ బిల్లులోని  చాలా అంశాలను, పార్లమెంటు ప్రక్రియ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లులో చేర్చే ప్రయత్నం చేసింది. పార్లమెంటు స్థాయీ సంఘం ఆమోదం పొందడానికి రాజ్యాంగపరంగా వున్న వెసులుబాటులను పరిశీలించింది. పౌర సమాజం సభ్యులతో, అఖిల పక్షం సభ్యులతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించింది. సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి, బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్, ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ ఒక్క విషయంలో ప్రభుత్వానికి అండగా నిలిచారని చెప్పొచ్చు. పార్లమెంటు సార్వభౌమాధికారం, శాసన ప్రక్రియ, న్యాయ స్థానాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా లోక్ పాల్ బిల్లును తేవాలన్నది వారి మాటల్లో స్ఫురించింది.

రాజ్య సభలో ఇంకా ఏమీ తేలకపోయినా, మన్మోహన్ సింగ్ సర్కారు లోక్ సభలో ప్రవేశపెట్టి, సభ ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లు, అన్నా హజారే బృందం సూచించినంత బలీయమైంది కాకపోవచ్చు. రాజ్యసభలో సూచించిన మోతాదులో 187 సవరణలు తేవాల్సినంత బలహీనమైన బిల్లు కూడా కాదు. అటు పౌర సమాజం, ఇటు ప్రతిపక్షాల సలహాల-సూచనలకు అనుగుణంగా రూపొందించిన "సంతులిత బిల్లు" అనవచ్చేమో! పౌర సమాజాన్ని రెచ్చగొట్టిన ప్రతిపక్షాలు, ఇలాంటి "సంతులిత బిల్లు" కు ఆక్షేపణలు తెలియచేయకుండా వుంటే సమంజసంగా వుండేదేమో! ఇప్పటికైనా ప్రతిపక్షాలతో సహా కొన్ని యుపిఎ భాగస్వామ్య పక్షాలు ఆ దిశగా ఆలోచన చేయాలి. ఇది బలహీనమైందన్న సాకుతో, లోక్ పాల్ చట్టం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలి. 

Thursday, December 29, 2011

భయపెట్టిన కేంద్ర పాలన: వనం జ్వాలా నరసింహారావు


2011 సంవత్సరంలో ఏం జరిగింది?
తడబడినా..... ఆత్మవిశ్వాసం దిశగా! - 2
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్రంలోని స్థితిగతులపై దృష్టి సారిస్తే ఆసక్తికరమైన సంఘటనలు 2011లో చోటుచేసుకున్న విషయం అవగతం చేసుకోవచ్చు. రాజకీయ రంగంలో, ఒకానొక తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ లో నెల కొన్న పరిస్థితి మరే రాష్ట్రంలోను, నెలకొని లేదనే అనాలి. రాజశేఖర రెడ్డి అకాల మరణంతో, కాంగ్రెస్ రాజకీయాలలో, "శూన్యం" ఏర్పడి, రోశయ్య హయాంలో బలపడి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఆయన ప్రమేయం లేకుండానే మర్రి ఊడల్లాగా పెకిలించనలవికాని లోతుకు కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీకి "అధిష్టానం" అనేది వున్నదనే సంగతిని రాజశేఖర రెడ్డి తీసేయగా, రోశయ్య తన పాలనలో చేసిన పని మరిచిపోయిన అధిష్టానాన్ని గుర్తుచేయడమే! ఇక, ఆ తర్వాత, అధిష్టానమే ఇక్కడ పాలన చేసే స్థితికి రాష్ట్రం చేరుకుంది. ప్రత్యేక తెలంగాణ వాదన, జగన్మోహనరెడ్డి సవాలు, ప్రభుత్వోద్యోగుల నిరసనలు, తెలుగు దేశం అవినీతి ఆరోపణలు, ప్రాంతాలవారీగా కాంగ్రెస్ నాయకులు విడిపోయి ఇటు ముఖ్యమంత్రికి-అటు అధిష్టానానికి తల బొప్పి కట్టించడం, అధికారుల్లో అలసత్వం, పధకాల అమలులో నిర్లిప్తత....ఇలా...రకరకాల సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోయిన రాష్ట్రంలో, రాష్ట్రపతి పాలన మినహా గత్యంతరం లేని పరిస్థితులు రాబోతున్నాయా అన్న అనుమానం కూడా కలిగింది ఒక దశలో. రాష్ట్రంలో అప్పట్లో ఎవరి ఆలోచనలు వారివే...ఎవరి ఆరోపణలు వారివే. కాంగ్రెస్-తెలుగుదేశం మధ్య మాచ్ ఫిక్సింగ్ అని తెరాస అంటే, టిడిపి-తెరాస మధ్యనే మాచ్ ఫిక్సింగ్ అని కాంగ్రెస్ వాదించింది. జగన్మోహన రెడ్డికి కేసీఆర్ కు మధ్య మాచ్ ఫిక్సింగ్ కుదిరిందని తెలుగుదేశం ఆరోపించింది. వీటితో సంబంధం లేకుండా, బహిరంగంగానే ఫిక్సయిపోయాడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీతో. చివరకు నెత్తిమీద కుంపటి దించుకుని తన పార్టీని, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ హస్తాలలో పెట్టాడు.

నాలుగు లక్షల మంది తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆట విడుపు స్థలాలయ్యాయి. ఉద్యోగులు రావడం, సంతకాలు చేయడం, పెన్ డౌన్ సమ్మె చేయడంతో ప్రభుత్వం దాదాపు స్తంభించి పోయిందనాలి. ఆ తర్వాత రెండు రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె, మరో రోజున "పల్లె పల్లె పట్టాల" పైకి ఆందోళన కార్యక్రమంతో ప్రభుత్వానికి ఏం చేయాల్నో పాలుపోలేదు. జగన్మోహన రెడ్డి వారం రోజుల నిరాహార దీక్ష సహితం వార్తలలో ప్రముఖంగా చోటు చేసుకుంది. రాజశేఖర రెడ్డి హయాంలో వాగ్దానం చేసిన ఫీజు రీఇంబర్స్ మెంటు విషయంలో, చేసిన దీక్ష అది. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోను, నిజాం కళాశాల ప్రాంగణంలోను చెలరేగిన హింసా కాండ కూడా దారుణమైన సంఘటనలే అనాలి. అదే రోజుల్లో లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేయడంతో, వారికి కాంగ్రెస్ సభ్యుల, ఎన్డీయే సభ్యుల మద్దతు లభించడంతో, సభ పలు మార్లు వాయిదా పడింది. ఎమెల్యేలు శాసన సభలో లేకుండా, మంత్రులు రాజీనామా బాట పడుతుంటే, (కాంగ్రెస్ పార్టీకి చెందిన)ఎంపీలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటుంటే, ఏమీ చేయలేని స్థితిలో వున్న (రాష్ట్ర) ప్రభుత్వాన్ని రద్దు చేసి, అసెంబ్లీని సుషుప్తావస్థలో వుంచి రాష్ట్రపతి పాలన పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం వుందేమో అన్న అని అనుమానాలు కలిగాయప్పట్లో. చివరకు అంతా సర్దుమణిగింది.
పార్లమెంటును తెరాస సభ్యులు స్థంబింప చేసే ప్రక్రియలో, తెలుగు దేశం తెలంగాణ లోక్ సభ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు, "జై తెలంగాణ" నినాదాలతో అండగా నిలిచారు. భారతీయ జనతా పార్టీ తన సంపూర్ణ మద్దతును తెలంగాణకు అనుకూలంగా ప్రకటించింది. పరిస్థితి చే జారి పోతున్న తరుణంలో, ప్రణబ్ ముఖర్జీ, తన మంత్ర దండాన్ని ఉపయోగించారు. ఆ చర్యతో కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఒకింత అవాక్కయ్యారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకున్నారు. ఇక అంతే సంగతులు...తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ, ఆ మాటకొస్తే దానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చే ప్రక్రియ, ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యేవరకు వాయిదా వేశారు. 2011 మే నెల చివరి వరకూ, కాంగ్రెస్ సభ్యులను కట్టడి చేస్తూనే, పరోక్షంగా తెరాసకు సంకేతం పంపారు. అంతవరకూ వేచి చూడాల్సిందేనని, ఆగాల్సిందే-ఆగి తీరాల్సిందే అని స్పష్టం చేసారు ప్రణబ్ ముఖర్జీ. అలనాటి ఢిల్లీ సంకేతాలు, సహాయ నిరాకరణ చేస్తున్న నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగుల పైన ప్రభావం చూపాయి. ఇంటర్ పరీక్షల సమస్య కూడా వారికి తల నొప్పైంది. మూడు నెలలు సహాయ నిరాకరణ కొనసాగించడం కష్టమైన పని అని భావించి, వ్యూహాత్మకంగా విరమించారు. అదలా వుండగా మిలియన్ మార్చ్ వ్యవహారాన్ని తెర పైకి తెచ్చింది రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ. 
అదే రోజుల్లో మార్చ్ 11, 2011 న జపాన్ తీరప్రాంతంలో సంభవించిన సునామీ-భూకంపం దరిమిలా చెలరేగిన అణు సంక్షోభం క్షణ-క్షణ భీకరమైపోయింది. పరిస్థితి విషమించింది. ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రంలో రేడియేషన్ స్థాయి తీవ్రమై, హెలికాప్టర్ సహాయంతో రి యాక్టర్ పై నీళ్లు చల్లేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఇంధన కడ్డీలను చల్లార్చేందుకు హెలికాప్టర్ల ద్వారా బోరిక్ యాసిడ్ చల్లే అవకాశాలను కూడా అధికారులు పరిశీలించారు. ఫుకుషిమా విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే కలుషిత గాలి, రష్యా మీదుగా వెళుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అమెరికా కాలిఫోర్నియాకు చేరవచ్చనీ అన్నారప్పట్లో. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో, అంతవరకూ ఎన్నడూ, కనీ-వినీ ఎరుగని రీతిలో, దేశంలో వున్న మిలిటరీ సిబ్బందిలో సగానికి పైగా, సుమారు లక్ష మందిని సహాయ-పునరావాస కార్యక్రమాలకు పురమాయించింది జపాన్ ప్రభుత్వం. అమెరికా దేశానికి చెందిన న్యూ క్లియర్ ఆధారిత విమానాలు మోసుకెళ్లే నౌక "రొనాల్డ్ రీగన్" తన వంతు సహాయం చేయడానికి అక్కడకు చేరుకుంది కూడా. రోజులు గడుస్తున్నా కొద్దీ పరిస్థితులు తీవ్రమయ్యాయేకాని తగ్గే సూచనలు అంతగా కానరాలేదు.
గెలుపు-ఓటములు దైవాధీనం కాదని, మానవాధీనం అని ఘంటా పధంగా చెప్పడానికి 2011 మార్చ్ నెలలో జరిగిన మూడు రకాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఉపాధ్యాయ-పట్టభద్రుల నియోజక వర్గాల నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కాని, ఎమ్మెల్యేల కోటా ఎన్నికలు కాని, స్థానిక సంస్థల కోటావి కాని...ఆ మాట కొస్తే భవిష్యత్ లో జరగబోయే మరి కొన్ని ఈ మోస్తారు ఎన్నికలు తీరుతెన్నులు కాని, కేంద్ర-రాష్ట్ర ఎన్నికల సంఘాలు కించిత్తైనా గమనించిన దాఖలాలు లేవు. ఆ పార్టీ-ఈ పార్టీ అన్న తేడా లేకుండా, ఉపాధ్యాయ-పట్టభద్రుల-ఎమ్మెల్యే-స్థానిక సంస్థల కోటాలో అభ్యర్థుల గెలుపు-ఓటములు. ఎన్నికల నిబంధనలతో సంబంధం లేకుండా, సాంప్రదాయాలను ఏ మాత్రం గౌరవించకుండా, తమ గెలుపు-ప్రత్యర్థుల ఓటమే లక్ష్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం దురదృష్టకరం.
 ఉపాధ్యాయ-పట్ట భద్రుల కోటాలో బరిలోకి దిగినవారిలో, ఎవరో ఒకరిద్దరి విషయం మినహాయించి, పోటీకి దిగిన ప్రతివారూ, ఏదో ఒక రాజకీయ పార్టీ మద్దతు లేకుండా, రంగంలోకి దిగడం జరగలేదు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాజకీయ నేపధ్యంలోనే జరిగింది. వీరి విషయంలో కూడా ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా నైనా క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే స్థితికి చేరుకుంది వ్యవహారం. కాంగ్రెస్ సమ్మతి-అసమ్మతి వర్గ అభ్యర్థులు, జగన్ వర్గం అభ్యర్థులు, టిడిపి అభ్యర్థులు, వీరి మద్దతు అంతో-ఇంతో కూడగట్టుకున్న మిత్ర పక్షాల అభ్యర్థులు రంగంలోకి దిగి, ప్రత్యర్థుల ఓటమికి కృషి చేశారు. తమ గెలుపు లక్ష్యం కన్నా, ఇతరుల ఓటమే లక్ష్యంగా జరిగిన ఎన్నికలివి. సరే అంచనాలు కొందరి విషయంలో అనుకూలంగాను, మరి కొందరి విషయంలో తారు-మారుగాను జరగడంతో, ఓడిన వారి పక్షాన నిలిచిన రాజకీయ పార్టీ నాయకుల కన్ను ఎమ్మెల్యే కోటా ఎన్నికలపై పడింది.
ఎమ్మెల్యేల కోటాలో పది మంది ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు మాత్రమే వీలుండగా, అన్ని పార్టీలకు చెందిన రాజకీయ చాణక్యులు, వారి-వారి అనుకూల కూటముల అవగాహన (రాహిత్యం) ప్రకారం, కలిమిడిగా-విడి విడిగా, పన్నెండు మంది అభ్యర్థులను రంగంలో దింపారు. సాధారణంగా బలాబలాలు స్పష్టంగా వున్నప్పుడు ఏకగ్రీవంగా జరిగే నిర్ణయం, ఈ సారి, ఎన్నికల ద్వారా తీసుకోవాల్సిన అవసరం పడింది. "సీక్రెట్ బాలెట్" కాస్తా "ఓపెన్ సీక్రెట్ బాలెట్" గా మారి పోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక నియమావళికి విరుద్ధంగా జరిగింది. ఆసాంతం పర్యవేక్షించాల్సిన ఎన్నికల సంఘం నోట మాట లేదు. ఎవరినీ తప్పు పట్టలేని స్థితికి చేరుకుంది. గెలిచిన వారు, ఓడిన వారు ఒకే తప్పు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతి పక్ష పార్టీల వారు, తమ చేతిలో వున్న "క్రాస్ ఓటింగు" ఆయుధాన్ని యధేఛ్చగా వాడుకున్నారు. తాము ఓడి పార్టీని ఓటమి పాలు చేసిన వారు కొందరైతే, పార్టీని ఓడించి తామూ ఓటమి పాలైన వారు మరి కొందరయ్యారు.
ఏప్రిల్ 2011 చివరలో దేశ-విదేశాలలోని లక్షలాది మంది తమ ఆరాధ్యదైవంగా భావించే భగవాన్ సత్య సాయిబాబా ఆరోగ్యం విషమించి పరమపదించారు. ఆస్తికులు-నాస్తికులు, అన్ని మతాల వారు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు, అధికారులు-అనధికారులు, ఆంధ్రులు-ఆంధ్రేతరులు, దేశ-విదేశాల్లోని సామాన్యులు-అసామాన్యులు, బాబా అపర భక్తులు-ఏ మాత్రం గిట్టని వారు, వారు-వీరు అనే తేడా లేకుండా ఆబాల గోపాలం సత్య సాయిబాబా ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. దీన్ని అర్థం చేసుకోవడంలోనే, ఆయనో మహానుభావుడని, దైవాంశ సంభూతుడని, మానవ రూపంలో మనందరి మధ్యనే-మన కోసం కద లాడుతున్న "పురుషోత్తముడు" అనే విషయం బోధ పడుతుంది. పొలిమేరలే తప్ప ఎల్లలు లేని ఒక కుగ్రామంలో జన్మించి, ఎల్లలెరుగని అపురూప ప్రదేశంగా దాన్ని మలిచి, ప్రపంచ వ్యాప్తంగా దేశ-దేశాల పౌరులకు ఆధ్యాత్మిక తృప్తిని, మానసిక స్థయిర్యాన్ని కలుగజేసే "ప్రశాంత నిలయం" గా ఆ పల్లె రూపు-రేఖలనే మార్చి, తన చిన్న కుటుంబాన్ని వసుధైక కుటుంబంగా చేసుకున్న భగవాన్ సత్య సాయిబాబా తన భక్తులను వీడి శివైక్యం పొందారు.  సత్య సాయిబాబా మానవ రూపంలో మన మధ్య నున్న దైవం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ దైవాన్ని మన మధ్యనే ఆ భగవంతుడు వుంచి నంత కాలం అందరికీ అంతా మంచే జరిగింది. ఆ తర్వాత ఆ భగవంతుడు ఎలా జరగాలనుకున్నాడో అలానే జరిగింది. ఇదే భగవత్ అవతార రహస్యం!
(మరిన్ని మిగిలాయింకా)

Wednesday, December 28, 2011

తడబడినా..... ఆత్మవిశ్వాసం దిశగా!: వనం జ్వాలా నరసింహారావు


2011 సంవత్సరంలో ఏం జరిగింది?
వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (29-12-2011)

     కిరణ్‌ వైపే మొగ్గిన అసంతృప్తి వాదులు; ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్న కిరణ్‌; ఎటూ తేల్చని శ్రీకృష్ణ కమిటీ; మరో వివాదాన్ని తెచ్చిన బ్రజేష్‌ తీర్పు; న్యూస్‌ బ్రాడ్‌ కాస్టర్స్‌ అసోసియేషన్‌ ఆవిర్భావం; కేంద్రమంత్రివర్గ విస్తరణలో ఆంధ్రులకు అన్యాయం; అరబ్‌ ప్రపంచాన్ని కుదిపివేసిన తిరుగుబాట్లు - ఎడిటర్

          ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు, అన్ని రంగాలలో కాకపోయినా, కనీసం రాజకీయ రంగంలోనైనా, గత ఏడాది కోడి కొంచెం ముందే కూసింది. తన రాజకీయ సుదీర్ఘ ప్రస్థానంలో, నిత్య "అసంతృప్తి వాది" గా ముద్రపడినప్పటికీ, ఏనాడూ, భారత జాతీయ కాంగ్రెస్‌ను వీడే సాహసం చేయని వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యం పూరించలేక పోయిన నేటి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య స్థానంలో, గత ఏడాది (2010) చివరలో-నవంబర్ నెలాఖరులో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది అధిష్టానం. నెల తిరిగే కల్లా 2011 సంవత్సరానికి స్వాగతం పలికాం. అప్పటివరకూ కనీసం మంత్రిగా ఒక్కసారైనా పనిచేయని కిరణ్ కుమార్ రెడ్డి ఎంపికను జీర్ణించుకోలేక పోయారు పలువురు కాంగ్రెస్ నాయకులు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్థానంలో నూట ఏబైమందికి పైగా ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోదలిచిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరిక తీరలేదు. ఆయన కోరిక తీరనందుకు ఆయనకంటే ఎక్కువగా ఆయన వీర విధేయులు కలతచెందారు. అలా కలతచెందిన వారిలో, అలనాటి మంత్రివర్గంలోని అనేక మంది మంత్రులున్నారు కూడా. వారిలో కొందరు, రాజ్యాంగపరంగా చేయాల్సిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరవడానికి ఒకింత విముఖత చూపించారు కూడా. ఐతే, కాలం-కర్మం కలిసి రాకపోవడంతో, అలా విముఖత చూపిన వారే, తమ మంత్రి పదవికి ఎక్కడ ఎసరొస్తుందనే భయంతో, ఒక్కరొక్కరే, కిరణ్ కుమార్ రెడ్డి పంచన చేరడం మొదలెట్టారు. ఏ వీర విధేయతను వారంతా జగన్ పట్ల చూపించారో, అదే వీర విధేయతను, అంచలంచలుగా ముఖ్యమంత్రి పట్ల చూపించసాగారు. "తప్పటడుగులు" వేసి తమ గుప్పిట్లో చిక్కకపోతాడా ముఖ్యమంత్రి అని భావించిన పలువురికి ఆశాభంగం కలిగింది. కొంత "తడబడుతూ అడుగులు" వేసినప్పటికీ, రోజులు-నెలలు గడుస్తున్నా కొద్దీ, అత్యంత "ఆత్మవిశ్వాసం" తో అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తన ఆధిపత్యాన్ని అన్ని విధాలా నిలుపుకోవడం 2011 రాజకీయ సంవత్సరం ప్రత్యేకతగా చెప్పుకోవాలి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పరిశీలించడానికి, కేంద్రప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను పాత్రికేయుల సమక్షంలో, హోం మంత్రి చిదంబరానికి అందచేసి, తదుపరి ప్రక్రియ జనవరి 6, 2011 న రాష్ట్రానికి చెందిన ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదించిన తర్వాతే ప్రారంభిస్తామని చిదంబరం ప్రకటన చేయడం వల్ల 2010 సంవత్సరానికి సంబంధించినంతవరకు, ఆందోళనలకు తావులేకుండా వీడ్కోలు పలికే అవకాశం కలిగిందనాలి. నివేదిక ఇస్తూ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు తమకు “అప్పజెప్పిన పని సులభమైంది కాదని” అన్నారు. పదకొండు నెలలుగా చేసిన విస్తృత సంప్రదింపులు, బృహత్తర పరిశోధనలు చివరకు ఏమైనా తేల్చిందా? అనేది ప్రశ్నార్థకం. ఒక విధంగా చెప్పాలంటే, శాశ్వత ప్రతిష్ఠంభన దిశగా సూచనలివ్వడం జరిగింది. కమిటీ చేసిన "బెస్ట్" లేదా "సెకండ్ బెస్ట్" సూచనలలో ఏ ఒక్క దాన్ని ప్రభుత్వం అంగీకరించినా, ఆ నిర్ణయం, నిజంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్లు "ఎవరికీ పరాజయం లేకుండా అందరికీ సమానంగా విజయం చేకూరినట్లు" అవుతుందా? జవహర్లాల్ నెహ్రూ  చెప్పిన బుద్ధుడి ప్రవచనాలను శ్రీకృష్ణ కమిటీ నిజంగా గౌరవించిందా? న్యాయమూర్తి అనేవారెవరైనా "ధర్మ సమ్మతమైన న్యాయం" చెప్పి సమస్యను పరిష్కరించే సూచనలివ్వాలి కాని, సమస్యను మరింత జటిలం చేయొచ్చా? పైగా అందరికీ విజయం చే కూరుస్తున్నామని చెప్పడం తగునా? నివేదికలో ఏం చెప్పినా ఇష్టంగానో-అయిష్టంగా నో, మనసులో మాట మాత్రం దాచుకోలేక పోయారు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు. ఆధునిక మహాభారత యుద్ధానికి తెరలేపింది శ్రీకృష్ణ కమిటీ "కృష్ణ రాయభారం తరహా నివేదిక". నాటి శ్రీకృష్ణుడు పాండవ పక్షం-ధర్మం పక్షం వహిస్తే, నేటి శ్రీకృష్ణుడి నివేదిక సమైక్యానికి మొగ్గు చూపినట్లు భావన కలిగించినా, ఆసాంతం, మనసులో వున్న మాటగా, విభజన పలుకులే పలకడం విశేషం.
          "కృష్ణా జలాలపై" బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పు మరో వివాదానికి తెర లేపి, శాశ్వతంగా పొరుగు రాష్ట్రాలకు, మనకు మధ్య విరోధానికి నాంది పలికిందని అనక తప్పదు. రాష్ట్రానికి, ఒక వైపు నికర జలాల వాటా పెంచుతూనే, గతంలో బచావత్ తీర్పు నిష్పత్తిలో కాకుండా తగ్గింపు కోటా ఇవ్వడం, మరో వైపు అదనపు జలాల కోటా పూర్తిగా తగ్గించడం వల్ల, రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేసేందుకు అవకాశాలను కలిగించింది ట్రిబ్యునల్. ఇలా ఆరంభమయింది 2011 సంవత్సరం.
ఈ నేపధ్యంలో గత ఏడాది సంఘటనలను ఒక్క సారి మననం చేసుకుంటే ఎలా వుంటుంది? 
కంచే చేనును మేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించాల్సిన అత్యున్నత న్యాయస్థానమే వాటి ఉల్లంఘనకు మార్గం సుగమం చేసిందని, దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత, అదే అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. అస్సాంకు చెందిన చౌహాన్ అనే వ్యక్తికి సుప్రీం కోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ, పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అరుదుగా జరిగే వీలున్నప్పటికీ, భవిష్యత్ లో అసలే జరుగదనే నమ్మకం లేదన్న అభిప్రాయం వెలిబుచ్చింది అత్యున్నత న్యాయస్థానం 2011 జనవరి మొదటి వారంలో ఒక రివ్యూ పిటీషన్లో ఇచ్చిన తీర్పులో. ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో 1976 లో అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన ఒక "హెబియస్ కార్పస్ కేసు" లో తీర్పిచ్చిన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, "ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరుడి జీవించే హక్కు కూడా రద్దుచేయవచ్చు" అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన విషయం జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు ఈ సందర్భంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.
మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలన్న డిమాండుతో, “తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్” ఆవిర్భవించడం, ఆ సంస్థకు రాష్ట్రంలోని ప్రధాన వార్తా ఛానళ్ల ప్రముఖుల మద్దతుండడం గమనించ దగ్గ విషయం. ఈ సంస్థ మార్గదర్శకాలకు, ఇంతవరకూ జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ’ఎన్‌బీయే’ సంస్థ ఆదేశాలకు వ్యత్యాసం ఏమేరకుంటుందో చూడాలి. భారత రాజ్యాంగం భావ స్వేచ్ఛ ప్రసాదించినప్పటికీ, ఆ స్వేచ్ఛ "నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా" వినియోగించుకోవడానికి, ప్రభుత్వ పరమైన నియంత్రణలకంటే స్వయం సంయమనం పాటించడమే మేలు. మన రాష్ట్రంలో ఆవిర్భవించిన “తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్” స్వయం సంయమనం పాటించే దిశగా చర్యలు తీసుకుంటే అభినందించాల్సిందే. వ్యక్తి భావ ప్రకటనా స్వేఛ్చకుండాల్సిన పరిమితులు-హద్దులు రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ బాధ్యతను, రాష్ట్రంలోని ప్రధాన వార్తా ఛానళ్ల ప్రముఖుల చొరవతో ఆవిర్భవించిన “తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్” చేపడ్తుందని ఆశించుదాం.
జనవరి 19, 2011 న చేసిన కేంద్ర మంత్రి మండలి విస్తరణలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ అన్యాయం జరిగింది. ఢిల్లీ స్థాయిలో కీలక పదవుల పంపకంలో ఆది నుంచీ తెలుగు వారికి అన్యాయం జరుగుతూనే వుంది. ఢిల్లీ స్థాయిలో పెత్తనం సాగించే కీలకమైన రాజకీయ నాయకులకు "చేదోడు-వాదోడుగా" వుండడంలో అగ్రభాగాన వుండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కేంద్రంలో పలుకుబడి ఉపయోగించడానికి దోహదపడే కీలక స్థాయికి ఎదగడంలో మాత్రం వెనుకబడే వుంటూ వస్తుంది. కేంద్ర స్థాయిలో పాలనలో సరైన భాగస్వామ్యం లభించకపోవడంతో, అక్కడినుంచి నిధులను పొందడంలో కూడా విఫలమవుతూనే వుంది. అదే మరో మారు జరిగింది 2011లో కూడా. ఒకసారి కాదు, రెండు సార్లు.
నియంతృత్వానికి వ్యతిరేకంగా, ఈజిప్ట్ ప్రజల, అందునా యువకుల, పద్దెనిమిది రోజుల సుదీర్ఘ ప్రజాస్వామ్య పోరాటం, ఆ దేశాధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేసింది. ముప్పై సంవత్సరాల హోస్నీ ముబారక్ పాలనకు చరమ గీతం పాడిన దేశ పౌరులకు, వారి చిరకాల వాంఛైన ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడే విషయమా, లేక, మరికొంత కాలం సైనిక పాలనే కొనసాగనున్నదా అనేది ఇప్పటికీ చెప్పడం కష్టమే. తిరుగుబాటు అనంతరం పాలనను చేపట్టిన ఈజిప్ట్ మిలిటరీ నాయకులు, త్వరలోనే రాజ్యాంగాన్ని సవరించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించుతామని, ప్రజల న్యాయమైన హక్కులకు భంగం వాటిల్లకుండా చూస్తామని, ముబారక్ కాలం నుండి అమల్లో వున్న "అత్యవసర చట్టాన్ని" తొలగించుతామని బహిరంగంగా ప్రకటించి కూడా ఏడాది కావస్తోంది. పౌర పాలన స్థాపనకు శ్రీకారం చుట్టి, ప్రజలెన్నుకున్న నాయకుల కింద పనిచేసేందుకు సైన్యం అంగీకరించుతుందా, లేక, మరో మిలిటరీ నియంత పాలనకు కనీసం ప్రయోగాత్మకంగానన్నా దోహదపడుతుందా అనే విషయం ఇంకా తేలాల్సి వుంది.
లిబియాలో అధికారంలో ఉన్న గడాఫికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 17, 2011 న మొదలైన ఉద్యమం రోజురోజుకు ఊపందుకుంది. ఇరవై మూడేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన తునీషియా అధ్యక్షుడు జినే బెన్ అలీ ప్రజల ఆగ్రహాన్ని చవిచూసి పదవీచ్యుతుడు కాక తప్పలేదు. బహరైన్ లోనూ పరిస్థితి తీవ్రతరమయింది. యెమెన్ లో కూడా ప్రభుత్వ మార్పిడి కోరుతూ ప్రజలు పెద్ద యెత్తున ఆందోళనలు చేపట్టారు. ఆ మార్గాన్నే 41 సంవత్సరాల కల్నల్ గడాఫి నియంతృత్వ పాలనకు చరమగీతం పాడారు. పెట్రోలియం నిల్వలతో-ఉత్పత్తులతో సంపన్న దేశాల జాబితాలో చేరిన లిబియా దేశాన్ని తన ఉక్కు పిడికిలిలో బంధించిన గడాఫి, చివరకు అమెరికా కుట్రలో భాగంగా అసువులు కోల్పోయాడు. ఇటీవలి కాలంలో అరబ్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న తిరుగుబాటులకు, గతంలో సైనిక తిరుగుబాటులకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, తిరుగుబాటుల వల్ల నియంతృత్వం పోయి ప్రజాస్వామ్యం వచ్చే అవకాశాలు అప్పూడూ-ఇప్పుడూ లేవు. ఆ దేశాల్లో సైనికులు ప్రభుత్వాలను పడగొట్టడానికి నూతన మార్గాలను ఎంచుకున్నట్లు కనబడుతున్నది. ఉన్న నియంతకు వ్యతిరేకంగా ప్రజలను పురికొల్పి, వారిని గద్దె దింపి, ఆ స్థానంలో అధికారం పొందడమనే వ్యూహం వుందా అన్న ధోరణిలో అక్కడి తిరుగుబాటులు గోచరిస్తున్నాయి. ప్రజాస్వామ్యం నెలకొననంత వరకు తిరుగుబాటు చేసిన ప్రజలకు వారు కోరుకున్నది లభించనట్లే. ఇదిలా వుండగా, అరబ్ ప్రపంచాన్ని అస్థిర పరచడానికి, అమెరికా పన్నిన కుట్రలో భాగంగానే, ఆయా దేశాల్లో తిరుగుబాటులు చోటుచేసుకుంటున్నాయని, ప్రజాస్వామ్యమైనా-నియంతృత్వమైనా, రాబోయే ప్రభుత్వాలు తన కనుసన్నలలో మెలగాలని అమెరికా పన్నాగమని విశ్లేషకులనుకుంటున్నారు.
(మరిన్ని మిగిలాయింకా)