Showing posts with label నాదెండ్ల మనోహర్. Show all posts
Showing posts with label నాదెండ్ల మనోహర్. Show all posts

Monday, March 25, 2013

విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు: వనం జ్వాలా నరసింహారావు


విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు


పక్కా "అంచెలంచల అధికార వ్యూహం" తో జగన్ వర్గంగా ముద్రపడి, ఇటీవల ముగిసిన అవిశ్వాస తీర్మానం ఓటింగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, ఓటు వేసిన తొమ్మిదిమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పై,  పార్టీ ఫిరాయింపుల  నిరోధక చట్టం కింద, అనర్హత  వేటు వేసేందుకు రంగం తయారవుతోంది. ప్రభుత్వ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి వీరిని అనర్హులుగా ప్రకటించమని సభాపతికి విజ్ఞప్తి చేశారు. దానికి అవసరమైన డాక్యుమెంట్లను కూడా ఆయన సభాపతికి సమర్పించారు. కాంగ్రెస్ బాటలోనే పయనించేందుకు తెలుగుదేశం నాయకులు కూడా సిద్ధమవుతున్నవారు. నేడో-రేపో వీరందరినీ అనర్హులుగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఆ తరువాత ఉపఎన్నికలు జరగడం, ఎవరి బలమెంతో తేలిపోవడం మనం చూడబోతున్నాం.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి రాజ్యాంగపరమైన నియమ నిబంధనలున్నాయి. కాకపోతే, అవి ఎంత సక్రమంగా అమలుకు నోచుకుంటున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీ, సత్ సాంప్రదాయాలే మన్నా నెలకొన్నాయంటే, అలా ఏ రాష్ట్రంలోను జరిగిన దాఖలాలు లేవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనుగడ సాగించాలంటే, రాజ్యాంగ నియమ నిబంధనలకు అదనంగా, చిరకాలం గుర్తుంచుకునే సంప్రదాయాలు నెలకొనడం తప్పని సరి. ఏ పార్టీ అధికారంలో వున్నా, వారి వారి రాజకీయ అనుకూలతలు-అననుకూలతల ఆధారంగా, ఆ పార్టీ టికెట్ పై చట్ట సభకు ఎన్నికై సభాపతి పీఠాన్ని అధిష్టించిన వ్యక్తి, తన మాతృ సంస్థ ఆలోచనా ధోరణి ప్రకారమే నడచుకుంటున్న అపవాదు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. ఇప్పటికీ సమయం మించి పోలేదు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభాపతిగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్, ఈ విషయంలో, యావత్ భారత దేశం అభినందించే రీతిలో, రాజ్యాంగ నిబంధనలకు లోబడిన ఒక సత్ సంప్రదాయం ఆవిర్భావానికి చొరవ తీసుకుంటే మంచిది.

చట్ట సభలకు ఎన్నికైన వారు, ఏ ఏ సందర్భాలలో, సభ్యులుగా కొనసాగడానికి అనర్హులవుతారనే విషయం, రాజ్యాంగంలో స్పష్టంగా వివరించ బడింది. సర్వ సాధారణంగా పేర్కొనే విషయాలకు అదనంగా, పదవ షెడ్యూలులో, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందని కూడా వివరించబడింది. రాజీవ్ గాంధి ప్రధానిగా వున్నప్పుడు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా, 1985 లో అమల్లోకొచ్చింది. నాలుగు వందలకు పైగా లోక్ సభ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, ముందు జాగ్రత్తగా రాజ్యాంగ సవరణ చేసిందన్న ప్రచారం కూడా జరిగిందప్పుడు. ఒక రాజకీయ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, స్వచ్చందంగా, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు, సహజంగా శాసన సభ సభ్యత్వం కూడా కోల్పోతారు. ఒక పార్టీ సభ్యుడుగా చట్ట సభకు ఎన్నికైన వ్యక్తి, ఎన్నికల అనంతరం, మరో పార్టీలో చేరి, తన పార్టీకి వ్యతిరేకంగా పని చేసినా సభ్యత్వానికి అనర్హులవుతారు. సభాపతిగా-ఉప సభాపతిగా, లేదా శాసన మండలి అధ్యక్షుడుగా-ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన వారికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ, అనర్హత వేటు పడకుండా చట్టం మినహాయించింది.


అదే విధంగా, టికెట్ ఇచ్చిన పార్టీ అధికారికంగా జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా, శాసన సభలో జరిగే ఓటింగులో పాల్గొనక పోయినా-పాల్గొని వ్యతిరేకంగా ఓటేసినా, సభ్యత్వానికి అనర్హులవుతారు. కాకపోతే, అలా చేయడానికి పార్టీ నుంచి ముందస్తుగా అనుమతి పొందినా, లేక, అలా చేసిన పదిహేను రోజుల లోపు అధికారికంగా పార్టీ నాయకత్వం ఆ వ్యక్తిని మన్నించినా, అర్హతకు గురి కాకుండే అవకాశం వుంది. చట్టం మరో చిన్న వెసులుబాటు కూడా కలిగించింది. ఏదైనా రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన శాసన (లోక్ సభ) సభ సభ్యులలో, మూడింట ఒక వంతు మంది,మూకుమ్మడిగా పార్టీ మారితే-వేరే పార్టీలో విలీనమైతే, ఆ చర్యకు ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి మినహాయింపు వుంది. అయితే, రాజ్యాంగ91 వ సవరణ ఈ నిబంధనను మార్చి, మూడింట రెండు వంతుల సంఖ్య వుంటేనే, విలీనమైనట్లవుతుందని చెప్పింది. అలానే ఒక రాజకీయ పార్టీలో చీలిక వచ్చినప్పుడు, పార్టీ మొత్తం మరో పార్టీలో చేరితే కూడా ఫిరాయింపుల చట్టం నుంచి మినహాయింపు వుంటుంది. ఆ పార్టీ నుంచి ఎన్నికైన కొందరు శాసన సభ సభ్యులు విలీనానికి అంగీకరించకుండా వేరే పార్టీ పెట్టుకున్నా, ఒక ప్రత్యేకమైన గ్రూపుగా ఏర్పడినా, మినహాయింపుంటుంది.

అనర్హత విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా సభాపతి దే. పదవ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి, సభాపతి తీసుకున్న ఎటువంటి నిర్ణయమైనా, న్యాయ స్థానాల తీర్పు పరిధిలోకి రావు. పదవ షెడ్యూల్ నిబంధనలను అమలు పరిచే విషయంలో, తదనుగుణమైన విధి-విధానాలను రూపొందించుకునే అధికారం సభాపతికి వుంది. రాజకీయ పార్టీలు తమ-తమ పార్టీలకు చెందిన సభ్యుల వివరాలు, కొత్తగా చేరిన వారి వివరాలు, పార్టీ వ్యతిరేకంగా పని చేస్తున్న వారి వివరాలు, పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేసిన వారి వివరాలు, సంబంధిత అంశాలకు చెందిన ఇతర వివరాలను పార్టీలు నమోదు చేసుకోమని అడిగే అధికారం వుంది సభాపతికి. సభ్యుల అర్హత-అనర్హతలు నిర్ధారించ వలసిన సమయంలో అవి ఉపయోగ పడే అవకాశాలున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యత్వానికి అనర్హులైన వ్యక్తులు, యాంత్రికంగా, తమ సభ్యత్వాన్ని కోల్పోరు. వారిని పార్టీ నుంచి తొలగించ వచ్చు కానీ, చట్ట సభల సభ్యత్వాన్నించి తొలగించడానికి,పార్టీ నాయకత్వం నియమించిన ప్రతినిధి, సంబంధిత సభ్యుల అనర్హత విషయాన్ని సభాపతి దృష్టికి తీసుకుని పోయిన తదుపరి, తగు విచారణ జరిగిన చేసిన తర్వాతే, సభాపతి తగు నిర్ణయం తీసుకుంటారు.

సభాపతి తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయ స్థానాలకు లేకపోయినా, చట్టంలో పొందు పరిచిన నియమ నిబంధనలకు భాష్యం చెప్పే అధికారం, రాజ్యాంగ పరంగా, న్యాయ మూర్తులకు వుంది. తాను ఎన్నికైన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి, స్వచ్చందంగా పార్టీకి రాజీనామా చేస్తే,సభ్యత్వానికి అనర్హుడవుతాడని చట్టం చెప్పిన దాన్ని విస్తరిస్తూ, సరి కొత్త నిర్వచనం చెప్పింది అత్యున్నత న్యాయ స్థానం. లాంఛనంగా రాజీనామా చేయకుండా, తనకు టికెట్ ఇచ్చిన పార్టీ వ్యతిరేక కార్య కలాపాల్లో పాల్గొనే రీతిలో, స్పష్టమైన వైఖరిలో ప్రవర్తించే చట్ట సభ సభ్యుల విషయంలో కూడా, ఫిరాయింపుల నిబంధనలు వర్తించుతాయని, 1994 లో, సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అదే విధంగా, స్వతంత్రుడుగా గెలిచి, ఏదైనా పార్టీలో చేరిన వ్యక్తి కూడా, ఫిరాయింపుల చట్టం పరిధిలోకి వస్తారని చెప్పింది కోర్టు. పార్టీ ఫిరాయింపుల నియమ నిబంధనలను ఉల్లంఘించే సభ్యుల వివరాలు, సభాపతి దృష్టికి తీసుకుని రానంత వరకు, అర్హత-అనర్హతలతో నిమిత్తం లేకుండా, చట్ట సభలలో నిరాటంకంగా సభ్యులుగా కొనసాగడానికి, ఎన్ని రకాల అవకాశాలుండాలో అన్ని రకాల అవకాశాలను చట్టం కలిగించింది. రాజకీయ పార్టీల "అధి నాయకులు" తమకు అనుకూలమని భావించి, సభాపతికి ఫిర్యాదు చేయనంత కాలం, ఫిరాయింపుల చట్టం కాగితాలకే పరిమితం. అలా కాకుండా కొన్ని సత్ సాంప్రదాయాలకు ఎవరో ఒక రాష్ట్రానికి చెందిన శాసన సభ సభాపతి చొరవ తీసుకోవాలి.

తాత్కాలిక-శాశ్వత, ఆర్థిక-లేదా-పదవి లాభం కొరకు, పార్టీ ఫిరాయింపులు, మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకోవడం చాలా కాలం నుండి జరుగుతున్న వ్యవహారం. విలువలకు తిలోదకాలిచ్చి, తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన, మాతృ సంస్థకే ద్రోహం తలపెట్టడం నేరం. ఆ నేరానికి కనీసం శిక్ష అనర్హత వేటు. పాతిక సంవత్సరాల క్రితం ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినా, దాని అమలు అంతంత మాత్రమే. రాజీవ్ గాంధి హయాంలో, చట్టం తేవడానికి ప్రధాన కారణం, అంతకు ముందు, దేశ వ్యాప్తంగా, ఆయారాం-గయారాంల హవాలో అనుక్షణం రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకం కావడమే. అయితే, చట్టం తేవడం జరిగినప్పటికీ,ఫిరాయింపులు మాత్రం ఆగలేదు. చట్టం అమలు బాధ్యత సభాపతిది మాత్రమే కావడంతో రాజకీయాలకు అతీతంగా, సత్ సాంప్రదాయాలు నెలకొనక పోవడమే దీనికి కారణం. పార్టీ ఫిరాయింపులు యధేఛ్చగా కొనసాగుతూనే వున్నాయి. అవసరార్థం ఎమ్మెల్యేలను విపక్షం నుంచి స్వపక్షానికి తెచ్చుకునే ప్రయత్నాలు అన్ని రాజకీయ పార్టీలు చేస్తూనే వున్నాయి. కోట్ల ధనం చేతులు మారుతూనే వుంది. ప్రజాస్వామ్యం విలువను అపహాస్యం పాలు చేయడానికి ఫిరాయింపు దారులు చట్టం లోని లొసుగులను ఇంకా వాడుకుంటూనే వున్నారు. రాష్ట్ర మాజీ గవర్నర్, పాలనానుభవం దిట్ట, ఇందిరా గాంధికి సన్నిహితుడు, పీసీ అలెగ్జాండర్, ఫిరాయింపుల చట్టం లోప భూయిష్టమైందని విమర్శించారు. పదవ షెడ్యూల్ లోని ఫిరాయింపుల చట్టాన్ని తిరగ రాసి, ఏ స్థాయి ప్రజా ప్రతినిధైనా, తాను ఎన్నికైన పార్టీని వీడినట్లైతే, ప్రజల విశ్వాసం కోల్పోయినట్లుగా భావించి, తక్షణం సభ్యత్వానికి అనర్హుడైనట్లుగా ప్రకటించే విధంగా వుండాలని సూచించారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారి విషయంలోను, దానికి కారణమైన వారి మాతృ సంస్థ రాజకీయ పార్టీల విషయంలోను, ఎన్నికల సంఘం అంతో-ఇంతో అప్రమత్తంగా వుంటే మంచిదే మో! ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను నెరవేర్చని పక్షంలో, పార్టీ వీడిపోయే సభ్యులకు ఎన్నికల సంఘం రక్షణ ఇవ్వడం సమంజసం. ఒక పార్టీ, ఒక సారి ప్రణాళికలో చేర్చిన అంశాలకు సంబంధించి, అమలుకు నోచుకోని అంశాల విషయంలో, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేని పరిస్థితులున్నంత కాలం పార్టీలను వీడేవారికి ఇబ్బందులు తప్పవు. అదే విధంగా, పదవ షెడ్యూల్ అమలు విషయంలోను,కనీసం, సభాపతి దృష్టికి తీసుకుపోయే విషయంలోనైనా, ఎన్నికల సంఘం పాత్ర అంతో-ఇంతో వుండడం మంచిది. ఐదేళ్లకో సారి మేల్కొన కుండా,రాజకీయ పార్టీల-పార్టీల ద్వారా ఎన్నికైన సభ్యుల విషయంలో కొంత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన బాధ్యతను ఎన్నికల సంఘం మరిచిపోకూడదు. End


Monday, July 25, 2011

శాసన నిర్మాణ కర్తల రాజీనామాలు-బ్రిటీష్ పార్లమెంటు అనుభవాలు: వనం జ్వాలా నరసింహారావు

శాసన నిర్మాణ కర్తల రాజీనామాలు

బ్రిటీష్ పార్లమెంటు అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

"తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకన్నా ఒప్పుకోవాలి", లేదా, "తమ రాజీనామాలన్నా ఆమోదించాలి" అన్న ఏకైక నినాదంతో, స్పీకర్ ఫార్మాట్ లో "కారణాలంటూ ఏమీ చూపకుండా" తెలంగాణ ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల శాసనసభ సభ్యులు మూకుమ్మడిగా చేసిన రాజీనామాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. రాజీనామాలు భావోద్వేగాలతో తీసుకున్న నిర్ణయమని, తనకు అందుబాటులో లభించిన సమస్త సమాచారం ఆధారంగా, రాజ్యాంగంలోని 190 (3) అధికరణం ఇచ్చిన అధికారం అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ ప్రకటించారు. తమకు ఆమోద యోగ్యం కాని స్పీకర్ నిర్ణయాన్ని అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమని రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మండిపడ్డారు.

స్పీకర్ నిర్ణయం సమంజసమా? కాదా? అన్న విషయంలో దాన్ని సమర్థించేవారు ఒక విధంగా, వ్యతిరేకించేవారు దానికి విరుద్ధంగా విడమరిచి మరీ చెపుతున్నారు. శాసనసభ స్పీకర్ నిర్ణయానికి అనుగుణంగానే, వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ఆరంభమయ్యే లోపున, లోక్ సభ స్పీకర్ నిర్ణయం వుండబోతుందా? ఒక వేళ ఆమె కూడా రాజీనామాలు తిరస్కరించే అవకాశాలు ఆగస్టు మొదటి తారీఖు లోపల కాని, ఆ తర్వాత కాని వుంటే, దాన్ని ఎదుర్కొనేందుకు, ఒకే-ఒక మార్గం రాజీనామా చేసిన సభ్యులు సమావేశాలకు హాజరు కాకుండా వుండడమే. అందుకే, ఆజాదు వ్యూహం ఆ దిశగా సాగుతోందనుకోవాలా?

వంద మందికి పైగా ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎన్నికైన లోక్ సభ, శాసనసభ సభ్యులు, తమ పదవులకు రాజీనామా సమర్పించడంతో, వాటిని ఆమోదించాలా? తిరస్కరించాలా? అన్న మీమాంసలో పడిపోయారు లోక్ సభ స్పీకర్ మీరా కుమార్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్. అక్కడ లోక సభ స్పీకర్ కాని, ఇక్కడ మనోహర్ కాని ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మంచిదన్న అంశంపై స్పష్టమైన అవగాహన ఎవరికీ లేదనే అనాలి. దానికి కారణం కూడా లేకపోలేదు. చట్ట సభలకు ఎన్నికైన వ్యక్తులు ఇంత భారీ సంఖ్యలో (స్పీకర్ ఫార్మాట్ లో) రాజీనామా చేసిన సందర్భాలు గతంలో, మన దేశంలో కాని-మరేదైనా ఇతర పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాల్లో కాని లేవు. అలాంటప్పుడు, నిర్ణయం ఎలా వుంటే సరైందన్న విషయంలోను స్పష్టమైన నిబంధనలు కాని, సాంప్రదాయాలు కాని, పద్ధతులు కాని, ప్రక్రియలు కాని వుండే అవకాశం కూడా లేదు. వీటి తోడ్పాటు లేకుండా, కేవలం రాజ్యాంగపరమైన మార్గదర్శకాలుంటే సరిపోదు. వాస్తవానికి, ఇంతమంది కాక పోయినా, ఒకరిద్దరు పార్లమెంటు సభ్యులైనా సరే, రాజీనామా చేసిన సందర్భాలలో, మన దేశంలో కాని-ఇతర దేశాలలో కాని, అందరికీ ఆమోద యోగ్యమైన సంప్రదాయాలే మన్నా వున్నాయేమో అధ్యయనం చేస్తే కొంత ఉపయోగకరంగా వుండేదేమో!

లోక్ సభ, శాసనసభ సభ్యుల రాజీనామాలు "స్పీకర్ ఫార్మాట్" లో, ఎటువంటి కారణాలు చూపకుండా, పద్ధతి ప్రకారం అవి ఆమోదించేందుకు అనుగుణంగా వున్నప్పటికీ, రాజీనామా చేసిన వారందరూ కూడా, బహిరంగంగా తామెందుకు అలా చేయాల్సి వచ్చింది ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటన్నా జరగాలి, లేదా, రాజీనామాలన్నా ఆమోదించాలని ఆ ప్రకటనల సారాంశం. ఫార్మాట్ లో పేర్కొనక పోయినా, ఏ కారణం వల్ల తాము రాజీనామా చేశారో స్పష్టం చేశారు. అలాంటప్పుడు, స్పీకర్ వాటిని ఆమోదించితే తెలంగాణా ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా లేదన్న పరోక్ష సంకేతం ఇచ్చినట్లే కదా! అలా కాకుండా ఆమోదించకపోతే, అదే తమ నిర్ణయమని బహిర్గతం చేస్తే, తెలంగాణ ఇస్తున్నట్లు ప్రభుత్వం ఒప్పుకుందని అన్న ట్లే కదా! అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా వుందన్న ప్రభుత్వ అభిప్రాయాన్ని స్పీకర్ ద్వారా ఈ విధంగా తెలియ చేయడం జరిగిందా?

భారత రాజ్యాంగ నిర్మాణ స్వరూపం చాలా వరకు, వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ పద్దతితోనే రూపు దిద్దుకుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుసరించే భారత, ఇంగ్లాండ్ దేశాలకు, దాదాపు ఒకే రకమైన సంప్రదాయాలు, ప్రక్రియలున్నాయి. యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ నియమ-నిబంధనలు, సంప్రదాయాలు భారత దేశం అనుకరించడం జరుగుతున్నప్పటికీ, అ దేశంలో ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు పూర్తికాలం పదవిలో కొనసాగకుండా మధ్యలో రాజీనామా చేయాలనుకున్నప్పుడు, రాజ్యాంగ స్ఫూర్తితో స్పీకర్ తీసుకునే నిర్ణయానికి సంబంధించిన ప్రకరణ మన రాజ్యాంగంలో పొందుపరచక పోవడం బహుశా పొరపాటే మో! అసలా మాటకొస్తే వెస్ట్ మినిస్టర్ నమూనా పార్లమెంటరీ విధానంలో ఎప్పటికప్పుడు ఏదో ఒకటి నేర్చుకునే విధానం అంతర్లీనంగా వుంటుందనాలి. అలాంటివి ప్రజాస్వామ్యం బలపడ్డానికి దోహదపడతాయి. ఉదాహరణకు, ఆ దేశంలో లాగా, ఇక్కడి లోక్ సభ-రాష్ట్ర శాసన సభల స్పీకర్లు, చట్ట సభల కాలపరిమితి తర్వాత జరిగే ఎన్నికలలో, ఏ పార్టీకి చెందని అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం కలిగించాలి.

ఇంగ్లీష్ పార్లమెంటుకు ఒక సారి ఎన్నికైన వ్యక్తికి, పదవీ కాలం పూర్తవకుండా-లేదా మళ్లీ ఎన్నిక లొచ్చే వరకైనా, రాజీనామా చేసే అవకాశం లేనే లేదు. పదిహేడవ శతాబ్దంలో, రాచరిక వ్యవస్థ నేపధ్యంలో, బ్రిటీష్ పార్లమెంటుకు ఎన్నిక కావడం, సభ్యులుగా వుండడం అరుదైన గౌరవంగా, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశంగా భావించినందున ఎవరు రాజీనామా చేసేందుకు ఇష్టపడేవారు కాదు. ఆ అవసరం దృష్ట్యా, మార్చ్ 2, 1623 న ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు తమ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు వీలుపడకుండా, సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ తీర్మానమే అమలులో వుందిప్పటికీ. అదే మన దేశం విషయానికొస్తే, ఒక వ్యక్తి ఒకటికి మించిన స్థానాలలో పోటీ చేయవచ్చు- చేసి గెలిచిన స్థానాలలో ఒకటి వుంచుకుని మిగతా వాటికి రాజీనామా చేయవచ్చు. గెలిచిన అభ్యర్థి తన ఇష్టం వచ్చినప్పుడు రాజీనామా చేసి, ఉప ఎన్నికలొచ్చిందాకా వేచి వుండి తిరిగి పోటీకి దిగవచ్చు. బహుశా ఈ విధానానికి స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందనాలి.

ఇండియా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో, చట్ట సభలకు ఎన్నికై నవారు, రాజీనామా చేయదల్చు కుంటే, ఆ విషయాన్ని ఫార్మాట్ లో, స్పీకర్ కు తెలియ చేస్తే సరిపోతుంది. స్పీకర్ తక్షణం (వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో జరిగినట్లు) రాజీనామాను ఆమోదించవచ్చు, లేదా, (గతంలో రాష్ట్ర శాసన సభ సభ్యుల విషయంలో జరిగిన విధంగా) నిర్ణయం వాయిదా వేయడమో, రాజీనామాలను తిరస్కరించడమో చేయవచ్చు. ఇలా చేశాం అని చెప్పాల్సిన అవసరం లేదు. స్పీకర్ అందుబాటులో లేకపోతే, రాజీనామా చేయదల్చుకున్న వ్యక్తి డిప్యూటీ స్పీకర్ కు కాని, కార్యాలయంలో సిబ్బందికి కాని ఇచ్చి పోవచ్చు. రాజీనామా చేయడం అంత తేలికైన విషయమన్న మాట. ఫాక్స్ ద్వారా పంపిన వారు కూడా వున్నారు. ఎంత వేగంగా వారు రాజీనామాలను సమర్పించుకుంటా రో, అంతే మోతాదులో, అత్యంత నెమ్మదిగా, నిర్ణయాన్ని వాయిదా వేయవచ్చు. ఇంగ్లాండులో సభ్యులకు రాజీనామా చేసే అవకాశం లేకపోయినా, సభ్యత్వం నుంచి తొలగడానికి రాజ్యాంగం ఒక వెసులుబాటు కలిగించింది. "రాజీనామా" కు బదులుగా "పదవీ విరమణ" చేసే అవకాశం పార్లమెంట్ కలిగించింది . పార్లమెంటు సభ్యులుగా వున్న వారు "ఆదాయం లభించే" పదవులను అంగీకరించ రాదన్న నిబంధన వున్నందున, సభ్యులు ఆ నిబంధన ప్రకారం సభ్యత్వాన్ని కోల్పోయేందుకు, ప్రభుత్వ పరంగా, ప్రత్యేకంగా దీని కొరకే ఉద్దేశించబడిన ఒక పదవి కావాలంటూ అభ్యర్థన చేసుకోవాలి. దాన్ని మన్నించి, బ్రిటీష్ రాణి (లేదా రాజు), ఆర్థిక మంత్రి (ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్ చెకర్) ద్వారా ఆ పదవిలో వారిని నియమించడం, తక్షణమే, సభ్యత్వం రద్దు కావడం జరుగుతుంది. అలాంటి వారు, తాము ఖాళీ చేసిన సీటుకు ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి సాధారణంగా సాహసించరు. పార్టీ టికెట్ కూడా లభించదు. ఆశ్చర్యకరమైన విషయం... దీని కొరకు కేటాయించిన పదవులు కాగితం పై మాత్రమే వుంటాయి. ఎప్పుడో, మాంధాతల కాలంలో, రాచరిక వ్యవస్థ పూర్తిగా వేళ్లూనుకున్న రోజుల్లో, ఏర్పాటైన ఆ పదవులు, ప్రస్తుతం "చట్టపరమైన కల్పితాలు" గా మిగిలి పోయాయి.

ఈ నేపధ్యంలో, ఆ దేశంలోని, వామ పక్ష ఐరిష్ రిపబ్లికన్ రాజకీయ పార్టీ నాయకుడు-పార్లమెంటు సభ్యుడు గెర్రీ ఆడమ్స్, ఇటీవల, బ్రిటీష్ పార్లమెంటు సభ్యత్వానికి చేసిన రాజీనామా, కొన్ని సమస్యలకు దారితీసిందక్కడ. ఆయన రాజీనామా చేయడానికి కారణం, ఉత్తర ఐర్లాండ్ శాసన సభ స్థానానికి పోటీ చేసి-గెలిచి, అక్కడ అధికారం పంచుకుంటున్న తన పార్టీ పక్షాన మంత్రి వర్గంలో చేరడమే. వాస్తవానికి, గెర్రీ ఆడమ్స్ “ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు ఇష్టపడని” (Abstentionist) వెస్ట్ మినిస్టర్ హౌస్ ఆఫ్ కామన్స్ (బ్రిటీష్ పార్లమెంట్ ఎగువ సభ) సభ్యుడుగా 1983 నుంచి 1992 వరకు, తిరిగి 1997 లో ఎన్నికై 2011 వరకు కొనసాగుతున్నాడు. అలానే ఆయన సహచర పార్టీ అభ్యర్థులు మరి కొందరున్నారు. ఆ పార్టీ సిద్ధాంతం ప్రకారం, తమ బలాన్ని నిరూపించుకోవడానికి పోటీ చేసి గెలుస్తారు కాని, సభా కార్యక్రమాలలో పాల్గొనరు. అలా 19 వ శతాబ్దం నుంచి కొనసాగుతుందక్కడ. ఉత్తర ఐర్లాండును యునైటెడ్ కింగ్ డం నుంచి వేరు పరచడం వారి నినాదం. ఒకనాటి మిలిటెంట్ ఉద్యమాన్ని ప్రస్తుతం ప్రజాస్వామ్య పద్దతుల ద్వారా కొనసాగిస్తోందా పార్టీ. పార్లమెంటులో ఆ పార్టీ సభ్యులు అనుసరిస్తున్న విధానాన్ని ఉత్తర ఐర్లాండ్ శాసన సభ విషయంలో పాటించడం లేదు. ఐరిష్ శాసన సభకు పోటీ చేసేందుకు, జనవరి 2011 ఆడమ్స్ తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సాంప్రదాయం ప్రకారం, రాజీనామాకు ప్రత్యామ్నాయంగా, అందుకై కేటాయించిన ప్రభుత్వ కొలువులో, ఆయనను నియమిస్తూ, ఛాన్సలర్ ఆఫ్ ఎక్స్ చెకర్ ఉత్తర్వులు జారీ చేసారు. కాకపోతే, బ్రిటీష్ రాణికి "విశ్వసనీయత" ప్రకటించేందుకు అవసరమైన ప్రమాణాన్ని పార్లమెంటు సభ్యుడుగా చేయడానికి అంగీకరించని ఆడమ్స్, ఆ పదవిని ఒప్పుకోలేదు. తాను ఎన్నికలలో ఐర్లాండ్ శాసన సభకు పోటీ చేసి తీరాల్సిందేనని పట్టు బట్టాడు.

పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా అంగీకరించక పోతే, ఐరిష్ పార్లమెంటుకు పోటీ చేయడానికి వీలుంటుందా? "అవును" అనే సమాధానం యునైటెడ్ కింగ్ డం రాజ్యాంగ సవరణ లాంటి "2000 చట్ట సభల సభ్యత్వ రద్దు చట్టం" లో దొరుకుతుంది. ఈ చట్టం ప్రకారం, ఐరిష్ శాసన సభకు ఎన్నికైన వారికి, ఆ సభలో సభ్యులుగా వుంటూనే, బ్రిటీష్ పార్లమెంటు సభ్యులుగా కొనసాగే అరుదైన "హక్కు" కలిగింది. అంటే, ఐరిష్ పార్లమెంటు సభ్యుడుగా పోటీ చేసి-గెలిచి, అక్కడ సభ్యుడుగా వుంటూ, 2015 లో జరిగే అవకాశమున్న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల వరకు, ఆడమ్స్ హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడుగా వుండవచ్చు. ఇంత చక్కటి అవకాశం వున్నప్పటికీ, తనకు, పార్లమెంటు సభ్యుడుగా వుండేందుకు ఇష్టం లేదని బల్ల గుద్ది చెపుతున్నాడు ఆడమ్స్. ఇక మిగిలిందొకటే దారి. ఇంతవరకు సభ్యుడుగా ప్రమాణ స్వీకారం చేయని ఆడమ్స్ సభ్యత్వాన్ని రద్దు చేయడమే పరిష్కారం.

న్యాయ శాస్త్ర పరమైన నియమ-నిబంధనల నేపధ్యంలో రాజ్యాంగ ప్రకరణాలు, న్యాయ స్థానాల తీర్పులు వుండి తీరాలి. సంప్రదాయాలకు ఇదమిద్ధమైన నిబంధనంటూ ఏదీ వుండాల్సిన అవసరం లేదు. చట్ట ప్రకారం నడుచుకోక పోతే దాని పరిణామాలు ఒక విధంగా వుంటాయి. సంప్రదాయాలకు అలాంటి ఇబ్బంది లేదు. చట్టాలను సవరించవచ్చు. సంప్రదాయాలను మెరుగుపర్చవచ్చు. ఎంత మంచి సంప్రదాయమైనా చట్టానికి లోబడితేనే దానికి విలువ వుంటుంది. ఇవన్నీ అధ్యయనం చేస్తే, చట్ట సభల కన్నా, ఆ సభలను నడిపించాల్సిన స్పీకర్ అధికులు కారు. చట్టం స్పష్టంగా వుంటే, స్పీకర్ కు సరైన మార్గదర్శకాలుంటే, ఆయన తీసుకునే నిర్ణయం తిరుగులేనిదే అవుతుంది. ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. చట్టంలో స్పష్టత లేనప్పుడు, సంప్రదాయాల ఆసరా దొరకనప్పుడు, స్పీకర్ అత్యంత జాగ్రత్తతో ముందుకు సాగాలి. తొందరపడి నిర్ణయం తీసుకోవడం భావ్యం కాదు. బహుశా, ప్రస్తుతం నెల కొన్న సంక్లిష్ట వాతావరణంలో, ఇంత భారీ సంఖ్యలో రాజీనామాలు చేసిన నేపధ్యంలో, నిర్ణయాధికారాన్ని, చట్ట సభలకే, వదిలేస్తే మంచిదే మో!

వంద మందికి పైగా చట్ట సభల సభ్యుల రాజీనామాల విషయంలో ఎలా వ్యవహరిస్తే మంచిదో, రాజీనామా చేసిన-చేయని సభ్యుల ద్వారా సభా ముఖంగా తెలుసుకునే ప్రయత్నం, లోక్ సభ, రాష్ట్ర శాసన సభ స్పీకర్లు చేస్తే బాగుండేదేమో! పార్లమెంటును-రాష్ట్ర శాసన సభను సమావేశ పరిచి, సభ నిర్ణయం ఆధారంగా ముందుకు సాగితే, భవిష్యత్ లో అవసరమైనప్పుడల్లా, అదే ఒక కొత్త సాంప్రదాయం అయ్యే అవకాశం వుంది. రాజీనామా కారణాలను సభా ముఖంగా వివరించే అవకాశం కూడా సభ్యులకు ఇచ్చినట్లవుతుంది. ఏదేమైనా, స్పీకర్ నిర్ణయంలోని అనుకూలతలను తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయోగించే దిశగా తెలంగాణ ఎమ్మెల్యేలు అడుగులు వేస్తే మంచిది. రాజీనామాలు ఆమోదించనంత మాత్రాన పదవులను అంటి పెట్టుకుని వుండాల్సిన అవసరం లేదు. శాసనసభ ఎప్పుడు సమావేశమైనా సభాకార్యకాలాపాల్లో పాల్గొనక పోతే, ఆర్నెల్లు సభకు హాజరు కాకపోతే, సభ్యత్వం కోల్పోయినట్లే కదా!

Friday, April 22, 2011

ఎమ్మెల్యేల పై అనర్హత వేటుకు సమయం-సందర్భం?:వనం జ్వాలా నరసింహారావు

ఎమ్మెల్యేల పై అనర్హత వేటుకు సమయం-సందర్భం?

(సూర్య దిన పత్రిక:23-04-2011)

వనం జ్వాలా నరసింహారావు

పక్కా "అంచెలంచల అధికార వ్యూహం" తో జగన్ వర్గంగా ముద్రపడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల పై, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద, అనర్హత వేటు వేసేందుకు రంగం తయారవుతోంది. దీనికంటే ముందే, నాయకుల ఫిర్యాదు మేరకు రాజీనామా చేసిన పోచారం శ్రీనివాస రెడ్డితో సహా, ముగ్గురు తెలుగు దేశం శాసన సభ సభ్యులపై కూడా వేటు వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది. మరో పక్క కాంగ్రెస్ బాటలోనే, ఆ పార్టీలో విలీనం కానున్న ప్రజారాజ్యం పార్టీ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తోంది. ఆ పార్టీకి చెందిన శోభా నాగిరెడ్డి, కాటసాని రాం రెడ్డిలపై అనర్హత పిటిషన్ సభాపతికి ఇచ్చేందుకు పీ ఆర్పీ నాయకులు సిద్ధమవుతున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి రాజ్యాంగపరమైన నియమ నిబంధనలున్నాయి. కాకపోతే, అవి ఎంత సక్రమంగా అమలుకు నోచుకుంటున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీ, సత్ సాంప్రదాయాలే మన్నా నెలకొన్నాయంటే, అలా ఏ రాష్ట్రంలోను జరిగిన దాఖలాలు లేవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనుగడ సాగించాలంటే, రాజ్యాంగ నియమ నిబంధనలకు అదనంగా, చిరకాలం గుర్తుంచుకునే సంప్రదాయాలు నెలకొనడం తప్పని సరి. ఏ పార్టీ అధికారంలో వున్నా, వారి వారి రాజకీయ అనుకూలతలు-అననుకూలతల ఆధారంగా, ఆ పార్టీ టికెట్ పై చట్ట సభకు ఎన్నికై సభాపతి పీఠాన్ని అధిష్టించిన వ్యక్తి, తన మాతృ సంస్థ ఆలోచనా ధోరణి ప్రకారమే నడచుకుంటున్న అపవాదు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. ఇప్పటికీ సమయం మించి పోలేదు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ (ఉప) సభాపతిగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్, ఈ విషయంలో, యావత్ భారత దేశం అభినందించే రీతిలో, రాజ్యాంగ నిబంధనలకు లోబడిన ఒక సత్ సంప్రదాయం ఆవిర్భావానికి చొరవ తీసుకుంటే మంచిది.

చట్ట సభలకు ఎన్నికైన వారు, ఏ ఏ సందర్భాలలో, సభ్యులుగా కొనసాగడానికి అనర్హులవుతారనే విషయం, రాజ్యాంగంలో స్పష్టంగా వివరించ బడింది. సర్వ సాధారణంగా పేర్కొనే విషయాలకు అదనంగా, పదవ షెడ్యూలులో, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందని కూడా వివరించబడింది. రాజీవ్ గాంధి ప్రధానిగా వున్నప్పుడు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా, 1985 లో అమల్లోకొచ్చింది. నాలుగు వందలకు పైగా లోక్ సభ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, ముందు జాగ్రత్తగా రాజ్యాంగ సవరణ చేసిందన్న ప్రచారం కూడా జరిగిందప్పుడు. ఒక రాజకీయ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, స్వచ్చందంగా, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు, సహజంగా శాసన సభ సభ్యత్వం కూడా కోల్పోతారు. ఒక పార్టీ సభ్యుడుగా చట్ట సభకు ఎన్నికైన వ్యక్తి, ఎన్నికల అనంతరం, మరో పార్టీలో చేరి, తన పార్టీకి వ్యతిరేకంగా పని చేసినా సభ్యత్వానికి అనర్హులవుతారు. సభాపతిగా-ఉప సభాపతిగా, లేదా శాసన మండలి అధ్యక్షుడుగా-ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన వారికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ, అనర్హత వేటు పడకుండా చట్టం మినహాయించింది.

అదే విధంగా, టికెట్ ఇచ్చిన పార్టీ అధికారికంగా జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా, శాసన సభలో జరిగే ఓటింగులో పాల్గొనక పోయినా-పాల్గొని వ్యతిరేకంగా ఓటేసినా, సభ్యత్వానికి అనర్హుడవుతారు. కాకపోతే, అలా చేయడానికి పార్టీ నుంచి ముందస్తుగా అనుమతి పొందినా, లేక, అలా చేసిన పదిహేను రోజుల లోపు అధికారికంగా పార్టీ నాయకత్వం ఆ వ్యక్తిని మన్నించినా, అర్హతకు గురి కాకుండే అవకాశం వుంది. చట్టం మరో చిన్న వెసులుబాటు కూడా కలిగించింది. ఏదైనా రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన శాసన (లోక్ సభ) సభ సభ్యులలో, మూడింట ఒక వంతు మంది, మూకుమ్మడిగా పార్టీ మారితే-వేరే పార్టీలో విలీనమైతే, ఆ చర్యకు ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి మినహాయింపు వుంది. అయితే, రాజ్యాంగ 91 వ సవరణ ఈ నిబంధనను మార్చి, మూడింట రెండు వంతుల సంఖ్య వుంటేనే, విలీనమైనట్లవుతుందని చెప్పింది. అలానే ఒక రాజకీయ పార్టీలో చీలిక వచ్చినప్పుడు, పార్టీ మొత్తం మరో పార్టీలో చేరితే కూడా ఫిరాయింపుల చట్టం నుంచి మినహాయింపు వుంటుంది. ఆ పార్టీ నుంచి ఎన్నికైన కొందరు శాసన సభ సభ్యులు విలీనానికి అంగీకరించకుండా వేరే పార్టీ పెట్టుకున్నా, ఒక ప్రత్యేకమైన గ్రూపుగా ఏర్పడినా, మినహాయింపుంటుంది.

అనర్హత విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా (ఉప) సభాపతి దే. పదవ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి, సభాపతి తీసుకున్న ఎటువంటి నిర్ణయమైనా, న్యాయ స్థానాల తీర్పు పరిధిలోకి రావు. పదవ షెడ్యూల్ నిబంధనలను అమలు పరిచే విషయంలో, తదనుగుణమైన విధి-విధానాలను రూపొందించుకునే అధికారం సభాపతికి వుంది. రాజకీయ పార్టీలు తమ-తమ పార్టీలకు చెందిన సభ్యుల వివరాలు, కొత్తగా చేరిన వారి వివరాలు, పార్టీ వ్యతిరేకంగా పని చేస్తున్న వారి వివరాలు, పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేసిన వారి వివరాలు, సంబంధిత అంశాలకు చెందిన ఇతర వివరాలను పార్టీలు నమోదు చేసుకోమని అడిగే అధికారం వుంది సభాపతికి. సభ్యుల అర్హత-అనర్హతలు నిర్ధారించ వలసిన సమయంలో అవి ఉపయోగ పడే అవకాశాలున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యత్వానికి అనర్హులైన వ్యక్తులు, యాంత్రికంగా, తమ సభ్యత్వాన్ని కోల్పోరు. వారిని పార్టీ నుంచి తొలగించ వచ్చు కానీ, చట్ట సభల సభ్యత్వాన్నించి తొలగించడానికి, పార్టీ నాయకత్వం నియమించిన ప్రతినిధి, సంబంధిత సభ్యుల అనర్హత విషయాన్ని సభాపతి దృష్టికి తీసుకుని పోయిన తదుపరి, తగు విచారణ జరిగిన చేసిన తర్వాతే, సభాపతి తగు నిర్ణయం తీసుకుంటారు.

సభాపతి తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయ స్థానాలకు లేకపోయినా, చట్టంలో పొందు పరిచిన నియమ నిబంధనలకు భాష్యం చెప్పే అధికారం, రాజ్యాంగ పరంగా, న్యాయ మూర్తులకు వుంది. తాను ఎన్నికైన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి, స్వచ్చందంగా పార్టీకి రాజీనామా చేస్తే, సభ్యత్వానికి అనర్హుడవుతాడని చట్టం చెప్పిన దాన్ని విస్తరిస్తూ, సరి కొత్త నిర్వచనం చెప్పింది అత్యున్నత న్యాయ స్థానం. లాంఛనంగా రాజీనామా చేయకుండా, తనకు టికెట్ ఇచ్చిన పార్టీ వ్యతిరేక కార్య కలాపాల్లో పాల్గొనే రీతిలో, స్పష్టమైన వైఖరిలో ప్రవర్తించే చట్ట సభ సభ్యుల విషయంలో కూడా, ఫిరాయింపుల నిబంధనలు వర్తించుతాయని, 1994 లో, సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అదే విధంగా, స్వతంత్రుడుగా గెలిచి, ఏదైనా పార్టీలో చేరిన వ్యక్తి కూడా, ఫిరాయింపుల చట్టం పరిధిలోకి వస్తారని చెప్పింది కోర్టు. పార్టీ ఫిరాయింపుల నియమ నిబంధనలను ఉల్లంఘించే సభ్యుల వివరాలు, సభాపతి దృష్టికి తీసుకుని రానంత వరకు, అర్హత-అనర్హతలతో నిమిత్తం లేకుండా, చట్ట సభలలో నిరాటంకంగా సభ్యులుగా కొనసాగడానికి, ఎన్ని రకాల అవకాశాలుండాలో అన్ని రకాల అవకాశాలను చట్టం కలిగించింది. రాజకీయ పార్టీల "అధి నాయకులు" తమకు అనుకూలమని భావించి, సభాపతికి ఫిర్యాదు చేయనంత కాలం, ఫిరాయింపుల చట్టం కాగితాలకే పరిమితం. అలా కాకుండా కొన్ని సత్ సాంప్రదాయాలకు ఎవరో ఒక రాష్ట్రానికి చెందిన శాసన సభ సభాపతి చొరవ తీసుకోవాలి.

తాత్కాలిక-శాశ్వత, ఆర్థిక-లేదా-పదవి లాభం కొరకు, పార్టీ ఫిరాయింపులు, మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకోవడం చాలా కాలం నుండి జరుగుతున్న వ్యవహారం. విలువలకు తిలోదకాలిచ్చి, తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన, మాతృ సంస్థకే ద్రోహం తలపెట్టడం నేరం. ఆ నేరానికి కనీసం శిక్ష అనర్హత వేటు. పాతిక సంవత్సరాల క్రితం ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినా, దాని అమలు అంతంత మాత్రమే. రాజీవ్ గాంధి హయాంలో, చట్టం తేవడానికి ప్రధాన కారణం, అంతకు ముందు, దేశ వ్యాప్తంగా, ఆయారాం-గయారాంల హవాలో అనుక్షణం రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకం కావడమే. అయితే, చట్టం తేవడం జరిగినప్పటికీ, ఫిరాయింపులు మాత్రం ఆగలేదు. చట్టం అమలు బాధ్యత సభాపతి మాత్రమే కావడంతో రాజకీయాలకు అతీతంగా, సత్ సాంప్రదాయాలు నెలకొనక పోవడమే దీనికి కారణం. పార్టీ ఫిరాయింపులు యదేఛ్చగా కొనసాగుతూనే వున్నాయి. అవసరార్థం ఎమ్మెల్యేలను విపక్షం నుంచి స్వపక్షానికి తెచ్చుకునే ప్రయత్నాలు అన్ని రాజకీయ పార్టీలు చేస్తూనే వున్నాయి. కోట్ల ధనం చేతులు మారుతూనే వుంది. ప్రజాస్వామ్యం విలువను అపహాస్యం పాలు చేయడానికి ఫిరాయింపు దారులు చట్టం లోని లొసుగులను ఇంకా వాడుకుంటూనే వున్నారు. రాష్ట్ర మాజీ గవర్నర్, పాలనానుభవం దిట్ట, ఇందిరా గాంధికి సన్నిహితుడు, పీసీ అలెగ్జాండర్, ఫిరాయింపుల చట్టం లోప భూయిష్టమైందని విమర్శించారు. పదవ షెడ్యూల్ లోని ఫిరాయింపుల చట్టాన్ని తిరగ రాసి, ఏ స్థాయి ప్రజా ప్రతినిధైనా, తాను ఎన్నికైన పార్టీని వీడినట్లైతే, ప్రజల విశ్వాసం కోల్పోయినట్లుగా భావించి, తక్షణం సభ్యత్వానికి అనర్హుడైనట్లుగా ప్రకటించే విధంగా వుండాలని సూచించారు.

ఇక ఈ నాటి మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల విషయానికొస్తే, తెలుగు దేశం పార్టీకి చెందిన ముగ్గురు సభ్యుల విషయంలో అనర్హత కేసు నడుస్తోంది. అందులో ఒకరైన పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయనపై అనర్హత ఫిర్యాదు సభాపతికి చేరక ముందే తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించమని కోరుతూ, ఆందోళన కూడా చేశారు. తాను పోటీ చేసిన నాడు, తన పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న దానికి-ప్రజలకు వాగ్దానం చేసిన దానికి విరుద్ధంగా, పార్టీ నాయకత్వం, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో వ్యవహరిస్తున్నందున, పార్టీలో వుండడానికి ఇష్టపడని తాను రాజీనామా ఇస్తున్నానని బహిరంగంగా ప్రకటించారు. రాజీనామా అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితికి అనుకూలంగా మారారు. ఏదో వ్యక్తిగత లాభం కొరకు కాకుండా, నాలుగున్నర కోట్ల ప్రజల ఉద్యమానికి మద్దతుగా రాజీనామా ఇచ్చిన వ్యక్తి ఫిరాయింపుదారుడుగా భావించడానికి వీలు లేదు. ఇక మిగిలిన ఇద్దరు, బహిరంగంగా, పార్టీకి వ్యతిరేకంగా (సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొన్న ఫిరాయింపుల శ్రేణిలో) పని చేశారని నాయకత్వం ఫిర్యాదు చేసింది. వారి విషయం సభాపతి నిర్ణయం మేరకే జరగొచ్చు. కాంగ్రెస్ పార్టీ సభ్యుల విషయానికొస్తే, ఏడాదిన్నర కాలం మౌనంగా వుండి, ఇప్పుడేదో కొంప మునిగినట్లు, సభాపతికి ఫిర్యాదు చేయడంలోని ఆంతర్యం కేవలం రాజకీయ సౌకర్యం తప్ప మరేమీ కాదు. ఒక వేళ జగన్ వెంట వెళ్లారని వేటు వేయదల్చుకుంటే, వీరితో పాటు మరి కొందరి విషయంలో ఫిర్యాదు చేయకపోవడానికి కారణాలేంటి అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వాలి.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారి విషయంలోను, దానికి కారణమైన వారి మాతృ సంస్థ రాజకీయ పార్టీల విషయంలోను, ఎన్నికల సంఘం అంతో-ఇంతో అప్రమత్తంగా వుంటే మంచిదే మో! ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను నెరవేర్చని పక్షంలో, పార్టీ వీడిపోయే సభ్యులకు ఎన్నికల సంఘం రక్షణ ఇవ్వడం సమంజసం. ఒక పార్టీ, ఒక సారి ప్రణాళికలో చేర్చిన అంశాలకు సంబంధించి, అమలుకు నోచుకోని అంశాల విషయంలో, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేని పరిస్థితులున్నంత కాలం పోచారం లాంటి వారికి ఇబ్బందులు తప్పవు. అదే విధంగా, పదవ షెడ్యూల్ అమలు విషయంలోను, కనీసం, సభాపతి దృష్టికి తీసుకుపోయే విషయంలోనైనా, ఎన్నికల సంఘం పాత్ర అంతో-ఇంతో వుండడం మంచిది. ఐదేళ్లకో సారి మేల్కొన కుండా, రాజకీయ పార్టీల-పార్టీల ద్వారా ఎన్నికైన సభ్యుల విషయంలో కొంత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన బాధ్యతను ఎన్నికల సంఘం మరిచిపోకూడదు.