Showing posts with label తెలుగుదేశం. Show all posts
Showing posts with label తెలుగుదేశం. Show all posts

Monday, April 8, 2013

రాహుల్ కోసం అధిష్ఠానం ఆరాటం: వనం జ్వాలా నరసింహారావు


రాహుల్ కోసం అధిష్ఠానం ఆరాటం

వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (22-04-2013)

        కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో మారు రాష్ట్ర వ్యవహారాలపై దృష్టి సారించారనడానికి నిదర్శనం, ఈనెల 18న ఢిల్లీకి రావాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలకు ఆయన దగ్గరనుంచి పిలుపు రావడమే. ఏ క్షణాన్నైనా జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు, తదనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలు, రాష్ట్ర మంత్రులపై సీబీఐ కేసులు, ఇతరత్రా సమస్యల నేపథ్యంలో రాహుల్ రాష్ట్రంపై దృష్టి సారించవచ్చు.  ఈ సమావేశంలో, రాహుల్ కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలానే తెలంగాణ అంశానికి సంబంధించి కూడా ఆయన కొన్ని సూచనలు చేయవచ్చేమో. కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత రాహుల్ పార్టీ కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులతో కొన్నాళ్ల క్రితం భేటీ అయ్యారు. రాహుల్‌గాంధీ ఇప్పటికే 6 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులతో సమావేశమై పార్టీ పరిస్థితులను సమీక్షించారు. ఆ కొనసాగింపుగా, ఈనెల 17, 18, 19 తేదీల్లో పలు రాష్ట్రాల సీఎంలు, పీసీసీ నేతలతో భేటీ కావాలనుకుంటున్నారట. ఇందులో భాగంగానే 18వ తేదీన ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు నేతలతో రాహుల్ సమావేశమవుతున్నారు.
రాష్ట్ర-దేశ రాజకీయాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న పరిశీలకులు అసలేం జరుగుతోంది? జరుగబోతోంది? అన్న మీమాంసతో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్రానికి సంబంధించినంతవరకు, మరి కొద్ది రోజుల్లో తేలనున్న జగన్ వర్గ కాంగ్రెస్-తెలుగుదేశం అసంతృప్తి ఎమ్మెల్యేల అనర్హత భవితవ్యంలో, ఆ తరువాత తేలనున్న ఉప ఎన్నికల ఫలితాలను ఇప్పటి నుంచే వివిధ కోణాలనుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు విశ్లేషకులు. ఈ మొత్తం వ్యవహారంలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చాలా తేలికగా కనిపించవచ్చు కాని వాస్తవానికి అంత చిన్న విషయమేమీ కాదనాలి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనికి, ప్రభుత్వ పదవి లేకపోయినా-ప్రధాని కాకపోయినా, మకుటం లేని మహారాణిగా చెలామణి అవుతున్న సోనియా గాంధీ, ఆమె కుమారుడు-ఢిల్లీ పీఠం బావి వారసుడు రాహుల్ గాంధీల ఆధిపత్యం ఏం కాబోతున్నదా అన్న అనుమానం రాబోయే రాష్ట్ర ఉప ఎన్నిక-దేశ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ద్వారా కలగక మానదంటున్నారు ఆ పరిశీలకులు. ఆంధ్ర ప్రదేశ్ లో పాద రసంలాగా ఎగబాకుతున్న యువ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగు రీతిలో రాజకీయ గుణపాఠం చెప్పి తీరాల్సిందే అన్న పట్టుదలతో యావత్ కాంగ్రెస్ అధిష్ఠానం ముందడుగు వేస్తోంది. జైలుపాలైన జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరిని-తిరుగుబాటు ధోరణిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సహించే స్థితిలో లేదు. ఆయనకు ముక్కుతాడు వేసే ప్రయత్నం చేసింది-ఇంకా చేస్తూనే వుంది. గతంలో జరిగిన ఉప ఎన్నికలను కూడా, తమకు అనుకూలంగా, ఒక ఆయుధంలాగా మలచుకుందామని, జగన్ పార్టీలోకి వలసలను ఆపు చేద్దామని అపోహపడింది అధిష్ఠానం. కాని దురదృష్ట వశాత్తు అది సాధ్యపడలేదు. వీటన్నింటి నేపధ్యం ఒకటే! సామ-దాన-భేద-దండోపాయాలను ఉపయోగించి సోనియా-నెహ్రూ-గాంధీ కుటుంబాల వారసత్వానికి, ఆధిపత్యానికి తిరుగులేని అవకాశం కలిగించి, రాహుల్ గాంధీని ఢిల్లీ గద్దె ఎక్కించడమే! భావి భారత ప్రధానిగా చూడడమే! అది సాధ్యపడుతోందా? లేదా? అంటే అది వేరే సంగతి!


అధిష్ఠానంకు ఈ తరహా ఆలోచన రావడం, అమలుచేయడం,కొత్తేమీకాదు. గతంలో కూడా, అధిష్ఠానానికి ఎదురుతిరిగిన మహామహులను-ఉద్దండ పిండాలను నిరంకుశంగా కాల రాసింది. ఎంతో మంది అతిరథ-మహారథులను అర్థ రధులుగా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, "సమిష్ఠి నాయకత్వం" అన్న మాటే గిట్టదు అధిష్ఠానానికి. అధిష్ఠానం అంటే ఎవరో కాదు. ఒకనాడు నెహ్రూ అయితే, ఆ తర్వాత ఇందిర, రాజీవ్ (మధ్యలో సంజయ్) లు కాగా ఇప్పుడు సోనియా. ఆ ఏక వ్యక్తుల అభిప్రాయమే ఏకాభిప్రాయం-సమిష్ఠి అభిప్రాయం. ఆ సుప్రీం లీడర్‌కు అంతా సలాం కొట్టాల్సిందే! అడుగుజాడలలో నడవాల్సిందే!వారెంత ప్రజాదరణ కల నాయకులైనా, పరిణితి చెందిన నాయకులైనా, ఎన్ని రకాల శక్తి సామర్ధ్యాలున్న వారైనా, తలవంచక-దాసోహం అనక తప్పదు. ఏడాది తరువాత రానున్న సార్వత్రిక ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీకి అంతగా అనుకూలంగా లేని ప్రస్తుత పరిస్థితులలో, మరో ప్రాంతీయ పార్టీని బ్రతికి బట్ట కట్టనిస్తుందా? ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే ఒకటి-రెండు ఉప ఎన్నికల ఫలితాల ద్వారా, పరువు-ప్రతిష్ఠలను పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ అధిష్ఠానం, జగన్ పార్టీని మనుగడ చేయనిస్తుందా? పోనీ ఏం చేయగలుగుతుంది? అన్నింటికన్నా ముఖ్యమైంది, పవర్ పాలిటిక్స్ ను అర్థం చేసుకోగలగడం. పవర్ పాలిటిక్స్ ను అనుసరించాలంటే, ఊహ కందని వ్యూహాలను పన్నాలి. వాటికి నైతికత అక్కర లేదు. పవర్ పాలిటిక్స్ ఆట ఆడడంలో ఢిల్లీ అధినాయకత్వానికి తెలియని కిటుకు లేదు. ఆ ఆట ఆడడానికి అనుసరించని నిరంకుశ ధోరణి లేదు. "నెహ్రూ-ఇందిర-గాంధీ" వారసత్వ సంపదను పదికాలాలపాటు పదిలంగా ఉంచడానికి, కాంగ్రెస్ అధిష్టానం, పవర్ పాలిటిక్స్ ను, అవసరమైతే, జాతీయ అవసరాలను పక్కన పెట్టినా సరే, తమకు అనుకూలంగా మలచుకుంటూ వస్తున్నది. కాకపోతే, అన్నివేళలా అధిష్ఠానం ఆలోచనలు విజయవంతమవుతున్నాయా అంటే, బెడసి కొట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ ఆటలో ఏకైక వ్యూహం ఒక్కటే. ఏదో విధంగా రాహుల్‌ను ప్రధాని పీఠం ఎక్కించడమే! దానిని అడ్డగించినవారికి చుక్కలు చూపించే ప్రయత్నం చేయడమే!
ప్రధాన మంత్రి పదవికి ప్రణబ్ కుమార్ ముఖర్జీ కంటే అర్హుడు మరెవ్వరూ లేరనాలి. ఆయన ఆ పీఠాన్ని అధిరోహించితే అడ్డు చెప్పేవారు కాని, చెప్పగలిగేవారు కాని పార్టీలో ఎవరూ లేరు. అందుకే, రాహుల్‍కు దారి సుగమం చేయడానికి ప్రణబ్‌కు మరో విధంగా పదోన్నతి కలిగించి రాష్ట్రపతి పదవి కట్టబెట్టింది నెహ్రూ-ఇందిర-గాంధీ వారసత్వం. ఇప్పుడిప్పుడే రాజకీయ పాఠాలు నేర్చుకునేవారు సైతం ఈ కుట్రను అర్థం చేసుకోవడం తేలికే! యుపిఎ భాగస్వామ్య పార్టీల ప్రస్తుత-మాజీ నాయకులు శరద్ పవార్, అజిత్ సింగ్, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి లాంటి కాకలు తీరిన యోధుల పాదాలు చల్లబడేట్లు చేసింది సోనియా నిర్ణయం. ఒకవేళ వీరిలో ఎవరన్నా నోరు మెదిపితే, ఎల్లప్పుడూ వాడే సిబిఐ దర్యాప్తు లాంటి బ్లాక్ మెయిల్ ఆయుధం వారిపై కూడా ప్రయోగించే వీలుందని అందరికీ తెలిసిన విషయమే! ఇక రాష్ట్రం విషయానికొస్తే, జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు బావుటాను ఎదుర్కునేందుకు అధిష్ఠానం తనముందున్న తురుఫ్ ముక్కలన్నింటినీ బయటకు తెచ్చింది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన తీవ్ర పదజాలంతో కూడిన వ్యాఖ్యలు కూడా అందులో భాగమే. గతంలో, ఎప్పుడైతే పద్దెనిమిది మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులు పార్టీ ఫిరాయించనున్నారని పసికట్టిందో, అప్పుడే, చిరంజీవిని తనవైపు గుంజుకుంది. ఆ తరువాత ఆయనకు రాజ్యసభ సభ్యత్వం, కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది. కీలకమైన (గత) ఉప ఎన్నికల సమయంలో జగన్‌ను జైలు పాలు చేసింది.  ఇంకా జైలులోనే కొనసాగించే వ్యూహం పన్నింది.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు, ఒక వైపు జబ్బు ముదురుతుండగా,  మరోవైపు, రోగ లక్షణాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. రోజు-రోజుకూ ఇన్‌ఫెక్షన్ వేగంగా పాకుతుండడంతో, వ్యాధిని నియంత్రించడం కష్ట తరమై పోతోంది. బహుశా నూట ఇరవై ఎనిమిదేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ పరిస్థితిని, ఇంతకంటే మంచిగా ఎవరూ వర్ణించలేరేమో! స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచీ, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వుంటూ వస్తోందీ దక్షిణ భారత ప్రాంతం. కాకపోతే మొట్ట మొదటిసారి 1983-89 లో, ఆ తరువాత 1994-2004 మధ్యలో, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం చేతిలో ఓటమి పాలైనప్పటికీ, అస్తిత్వాన్ని మాత్రం ఏ నాడూ కోల్పోలేదు. 1983-89 లో అధికారాన్ని కోల్పోయినా, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సమర్ధవంతమైన నాయకత్వంలో 1989 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదే విధంగా 1994-2004 మధ్య కాలంలో అధికారంలో లేకపోయినా డాక్టర్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004 లో మళ్లీ పూర్వ వైభవాన్ని పొంది 2009లో మరో మారు ఎన్నికల్లో గెలిచి ఇంతవరకూ అధికారంలో కొనసాగుతోంది. దురదృష్టవశాత్తు అలాంటి రాజకీయ స్టాల్వార్ట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం, ఆద్యతన భవిష్యత్‍లో అలాంటి వారు దొరుకుతారన్న నమ్మకం కుదరకపోవడం, పార్టీని అపజయ పరంపరలకు గురిచేస్తోంది.
అలనాడు నీలం సంజీవరెడ్డి, ఆయన తరువాత ఆయన వారసుడుగా వచ్చిన బ్రహ్మానందరెడ్డి, 1978-1989 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, 2004-2009 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన డాక్టర్ రాజశేఖర రెడ్డి మినహా, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య మంత్రులుగా పనిచేసిన వారందరూ, "దిగుబడి సరుకే"!. అధిష్ఠానం నమ్మిన వారో, అధిష్ఠానాన్ని నమ్మించిన వారో, అధిష్ఠానాన్ని ఆ కట్టుకోగలిగిన వారో, లాబీయింగ్ చేయగలిగిన వారో మాత్రమే ముఖ్యమంత్రులు కాగలిగారు. ఆ ఆచారం జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి సోనియా హయాం వరకూ అలాగే కొనసాగుతూ వస్తోంది. దామోదరం సంజీవయ్య నుంచి నేటి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ అదే వరస. వీరిలో సమర్ధులు లేరని కాని, "దిగుబడి" కి సమర్ధత కొలమానం కాదని కాని భావన కాదు. ఇదంతా ఒక ఎత్తైతే, కాంగ్రెస్ ఓట్ బాంక్ వ్యవహారం మరో ఎత్తు. ఎన్టీ రామారావు ప్రభంజనంలో ఓడినప్పుడు కాని, ఆ తరువాత చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం హయాంలో ఓడినప్పుడు కాని, త్రి ముఖ పోటీ జరిగినప్పుడు కాని, కాంగ్రెస్ ఓటు బాంక్ 35-40 శాతానికి తగ్గకుండా పదిలంగా వుంటూ వస్తుంది. మొట్టమొదటి సారిగా దానికి భారీ గండి పడింది. గతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పాయి. తెలంగాణ ప్రాంతంలో తెరాస గండి కొడుతుంటే, సీమాంధ్రలో జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆ పని చేసింది. ఓటింగు శాతం ఇరవైకి పడిపోయి ఘోర పరాజయం పాలైంది కాంగ్రెస్ పార్టీ. డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 లో ఎదురు కానున్న పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించసాగింది. 
2009 ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణ భూతుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణానికి గురైన దరిమిలా పార్టీకి ఈ దుస్థితి క్రమేపీ ఏర్పడ సాగింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, భారతీయ జనతా పార్టీల సారధ్యంలో ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తుంటే, మరో పక్క కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ సీమాంధ్ర ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదగ సాగింది. నెత్తి మీద కుంపటి దించుకున్న చందాన, చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఫలితం శూన్యం.
"టీ"-"జే" ల ఒత్తిడి మధ్య కొట్టు మిట్టాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలి మధ్య వున్నట్లుంది. ఇదే పరిస్థితి దాదాపు జాతీయ స్థాయిలో కూడా నెలకొని వుంది. కళ్ల ముందర, ఈ పరిస్థితిని అధిగమించడానికి, మార్గాలేవీ కనిపించడం లేదు. గత ఎన్నికల్లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడేందుకు, దేశంలోనే అధిక సంఖ్యలో-33 మంది ఎంపీలను సమకూర్చిన రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ప్రభావం జాతీయ స్థాయిలో పార్టీ మీద పడక తప్పదు. పార్టీ-యుపిఎ అధికారానికి దూరం కాక తప్పదు. ఈ నేపధ్యంలో, మన్మోహన్ సింగ్ నుంచి అత్యంత అలవోకగా ప్రధాని పదవిని తనయుడు రాహుల్ గాంధీకి బదలాయించాలని తాపత్రయ పడుతున్న సోనియా గాంధీ ముందున్న సవాళ్లు ఏంటి? వాటిని ఆమె ఏ విధంగా అధిగమించగలరు? కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలం ఎదుర్కుంటుందన్నది వాస్తవం. సవాళ్లను సోనియా ఎదుర్కునే ముందర,రాష్ట్రంలో అందరికీ అర్థం అవుతున్న కొన్ని నగ్న సత్యాలను అధిష్ఠానం సహితం అర్థం చేసుకుంటే మంచిదేమో! మంచికో-చెడ్డ కో రోశయ్యను మార్చి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని అంటగట్టిన అధిష్ఠానం, ఏ నాడన్నా ఆయనకు పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చిందా? ఆయన మంత్రి వర్గాన్ని ఆయనే ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిందా? పదవుల పందేరం చేయనిచ్చిందా?ఆయనకిష్ఠమైన వారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపిక చేసుకునే వీలు కలిపించిందా? తన మంత్రివర్గంలో అనునిత్యం తనను ఎదిరిస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం వుందా? ముందు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం అధిష్ఠానానికి ఉంది.
బహుశా, తమిళనాడు తరహాలో, ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో అవగాహన కుదుర్చుకోక తప్పని పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్‌కు తప్పదా? అలాంటప్పుడు, ఆ ప్రాంతీయ పార్టీ ఎలాగూ తెలుగుదేశం కాదు కాబట్టి, తెరాసతోను-వైఎస్సార్ సీపీ తోను అవగాహన వుండే అవకాశాలున్నాయా? రాష్ట్ర విభజన చేయక తప్పదా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఏదో ఒక నిర్ణయం ప్రకటించక తప్పదా?  
2014 లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్‌ను సన్నద్ధం చేసేందుకు-బలోపేతం చేసేందుకు, జాతీయ స్థాయిలో పార్టీ అధి నాయకత్వం-అధిష్జ్ఠానం చేపడుతున్న చర్యల్లో భాగంగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు, భావి భారత ప్రధానిగా భావించబడుతున్న రాహుల్‌గాంధీ, ముఖ్య భూమిక పోషించేందుకు సమాయత్త మౌతున్నారు. యువ నాయకుడు రాహుల్ గాంధీ కాయ కల్ప చికిత్స మొదలు పెట్టారంటున్నారు. అందులో భాగంగానే, ఢిల్లీలో తల్లిని కలవడానికి వచ్చిన పెద్దా-చిన్నా పనిలో పనిగా రాహుల్ గాంధీని కూడా కలిసి పోతున్నారు. అంతే కాదు. రాహుల్ గాంధీనే స్వయంగా ఎంపిక చేసిన కొందరికి ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. రాష్ట్రంలోని సీనియర్‌ నేతలు పలువురితో వ్యక్తిగతంగా మంతనాలు జరిపారు. అధినేత్రి సోనియా ఆదేశాలతోనే రాహుల్‌ రంగ ప్రవేశం చేశారా? లేక స్వయంగా ఆయన తనంతట తానే చొరవ తీసుకుని ఇలా చేస్తున్నారా? అనేది ఇంకా తేలాల్సిన విషయమే.
ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మెరుగయ్యే సూచనలు కనిపించడం లేదు. End

Monday, March 25, 2013

విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు: వనం జ్వాలా నరసింహారావు


విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు


పక్కా "అంచెలంచల అధికార వ్యూహం" తో జగన్ వర్గంగా ముద్రపడి, ఇటీవల ముగిసిన అవిశ్వాస తీర్మానం ఓటింగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, ఓటు వేసిన తొమ్మిదిమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల పై,  పార్టీ ఫిరాయింపుల  నిరోధక చట్టం కింద, అనర్హత  వేటు వేసేందుకు రంగం తయారవుతోంది. ప్రభుత్వ విప్ గండ్ర వెంకట రమణారెడ్డి వీరిని అనర్హులుగా ప్రకటించమని సభాపతికి విజ్ఞప్తి చేశారు. దానికి అవసరమైన డాక్యుమెంట్లను కూడా ఆయన సభాపతికి సమర్పించారు. కాంగ్రెస్ బాటలోనే పయనించేందుకు తెలుగుదేశం నాయకులు కూడా సిద్ధమవుతున్నవారు. నేడో-రేపో వీరందరినీ అనర్హులుగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఆ తరువాత ఉపఎన్నికలు జరగడం, ఎవరి బలమెంతో తేలిపోవడం మనం చూడబోతున్నాం.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి రాజ్యాంగపరమైన నియమ నిబంధనలున్నాయి. కాకపోతే, అవి ఎంత సక్రమంగా అమలుకు నోచుకుంటున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీ, సత్ సాంప్రదాయాలే మన్నా నెలకొన్నాయంటే, అలా ఏ రాష్ట్రంలోను జరిగిన దాఖలాలు లేవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పది కాలాల పాటు మనుగడ సాగించాలంటే, రాజ్యాంగ నియమ నిబంధనలకు అదనంగా, చిరకాలం గుర్తుంచుకునే సంప్రదాయాలు నెలకొనడం తప్పని సరి. ఏ పార్టీ అధికారంలో వున్నా, వారి వారి రాజకీయ అనుకూలతలు-అననుకూలతల ఆధారంగా, ఆ పార్టీ టికెట్ పై చట్ట సభకు ఎన్నికై సభాపతి పీఠాన్ని అధిష్టించిన వ్యక్తి, తన మాతృ సంస్థ ఆలోచనా ధోరణి ప్రకారమే నడచుకుంటున్న అపవాదు అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. ఇప్పటికీ సమయం మించి పోలేదు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ సభాపతిగా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్, ఈ విషయంలో, యావత్ భారత దేశం అభినందించే రీతిలో, రాజ్యాంగ నిబంధనలకు లోబడిన ఒక సత్ సంప్రదాయం ఆవిర్భావానికి చొరవ తీసుకుంటే మంచిది.

చట్ట సభలకు ఎన్నికైన వారు, ఏ ఏ సందర్భాలలో, సభ్యులుగా కొనసాగడానికి అనర్హులవుతారనే విషయం, రాజ్యాంగంలో స్పష్టంగా వివరించ బడింది. సర్వ సాధారణంగా పేర్కొనే విషయాలకు అదనంగా, పదవ షెడ్యూలులో, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఎలా వర్తిస్తుందని కూడా వివరించబడింది. రాజీవ్ గాంధి ప్రధానిగా వున్నప్పుడు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా, 1985 లో అమల్లోకొచ్చింది. నాలుగు వందలకు పైగా లోక్ సభ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, ముందు జాగ్రత్తగా రాజ్యాంగ సవరణ చేసిందన్న ప్రచారం కూడా జరిగిందప్పుడు. ఒక రాజకీయ పార్టీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, స్వచ్చందంగా, ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు, సహజంగా శాసన సభ సభ్యత్వం కూడా కోల్పోతారు. ఒక పార్టీ సభ్యుడుగా చట్ట సభకు ఎన్నికైన వ్యక్తి, ఎన్నికల అనంతరం, మరో పార్టీలో చేరి, తన పార్టీకి వ్యతిరేకంగా పని చేసినా సభ్యత్వానికి అనర్హులవుతారు. సభాపతిగా-ఉప సభాపతిగా, లేదా శాసన మండలి అధ్యక్షుడుగా-ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన వారికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ, అనర్హత వేటు పడకుండా చట్టం మినహాయించింది.


అదే విధంగా, టికెట్ ఇచ్చిన పార్టీ అధికారికంగా జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా, శాసన సభలో జరిగే ఓటింగులో పాల్గొనక పోయినా-పాల్గొని వ్యతిరేకంగా ఓటేసినా, సభ్యత్వానికి అనర్హులవుతారు. కాకపోతే, అలా చేయడానికి పార్టీ నుంచి ముందస్తుగా అనుమతి పొందినా, లేక, అలా చేసిన పదిహేను రోజుల లోపు అధికారికంగా పార్టీ నాయకత్వం ఆ వ్యక్తిని మన్నించినా, అర్హతకు గురి కాకుండే అవకాశం వుంది. చట్టం మరో చిన్న వెసులుబాటు కూడా కలిగించింది. ఏదైనా రాజకీయ పార్టీ నుంచి ఎన్నికైన శాసన (లోక్ సభ) సభ సభ్యులలో, మూడింట ఒక వంతు మంది,మూకుమ్మడిగా పార్టీ మారితే-వేరే పార్టీలో విలీనమైతే, ఆ చర్యకు ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి మినహాయింపు వుంది. అయితే, రాజ్యాంగ91 వ సవరణ ఈ నిబంధనను మార్చి, మూడింట రెండు వంతుల సంఖ్య వుంటేనే, విలీనమైనట్లవుతుందని చెప్పింది. అలానే ఒక రాజకీయ పార్టీలో చీలిక వచ్చినప్పుడు, పార్టీ మొత్తం మరో పార్టీలో చేరితే కూడా ఫిరాయింపుల చట్టం నుంచి మినహాయింపు వుంటుంది. ఆ పార్టీ నుంచి ఎన్నికైన కొందరు శాసన సభ సభ్యులు విలీనానికి అంగీకరించకుండా వేరే పార్టీ పెట్టుకున్నా, ఒక ప్రత్యేకమైన గ్రూపుగా ఏర్పడినా, మినహాయింపుంటుంది.

అనర్హత విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా సభాపతి దే. పదవ షెడ్యూల్ కింద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి, సభాపతి తీసుకున్న ఎటువంటి నిర్ణయమైనా, న్యాయ స్థానాల తీర్పు పరిధిలోకి రావు. పదవ షెడ్యూల్ నిబంధనలను అమలు పరిచే విషయంలో, తదనుగుణమైన విధి-విధానాలను రూపొందించుకునే అధికారం సభాపతికి వుంది. రాజకీయ పార్టీలు తమ-తమ పార్టీలకు చెందిన సభ్యుల వివరాలు, కొత్తగా చేరిన వారి వివరాలు, పార్టీ వ్యతిరేకంగా పని చేస్తున్న వారి వివరాలు, పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేసిన వారి వివరాలు, సంబంధిత అంశాలకు చెందిన ఇతర వివరాలను పార్టీలు నమోదు చేసుకోమని అడిగే అధికారం వుంది సభాపతికి. సభ్యుల అర్హత-అనర్హతలు నిర్ధారించ వలసిన సమయంలో అవి ఉపయోగ పడే అవకాశాలున్నాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సభ్యత్వానికి అనర్హులైన వ్యక్తులు, యాంత్రికంగా, తమ సభ్యత్వాన్ని కోల్పోరు. వారిని పార్టీ నుంచి తొలగించ వచ్చు కానీ, చట్ట సభల సభ్యత్వాన్నించి తొలగించడానికి,పార్టీ నాయకత్వం నియమించిన ప్రతినిధి, సంబంధిత సభ్యుల అనర్హత విషయాన్ని సభాపతి దృష్టికి తీసుకుని పోయిన తదుపరి, తగు విచారణ జరిగిన చేసిన తర్వాతే, సభాపతి తగు నిర్ణయం తీసుకుంటారు.

సభాపతి తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం న్యాయ స్థానాలకు లేకపోయినా, చట్టంలో పొందు పరిచిన నియమ నిబంధనలకు భాష్యం చెప్పే అధికారం, రాజ్యాంగ పరంగా, న్యాయ మూర్తులకు వుంది. తాను ఎన్నికైన రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి, స్వచ్చందంగా పార్టీకి రాజీనామా చేస్తే,సభ్యత్వానికి అనర్హుడవుతాడని చట్టం చెప్పిన దాన్ని విస్తరిస్తూ, సరి కొత్త నిర్వచనం చెప్పింది అత్యున్నత న్యాయ స్థానం. లాంఛనంగా రాజీనామా చేయకుండా, తనకు టికెట్ ఇచ్చిన పార్టీ వ్యతిరేక కార్య కలాపాల్లో పాల్గొనే రీతిలో, స్పష్టమైన వైఖరిలో ప్రవర్తించే చట్ట సభ సభ్యుల విషయంలో కూడా, ఫిరాయింపుల నిబంధనలు వర్తించుతాయని, 1994 లో, సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అదే విధంగా, స్వతంత్రుడుగా గెలిచి, ఏదైనా పార్టీలో చేరిన వ్యక్తి కూడా, ఫిరాయింపుల చట్టం పరిధిలోకి వస్తారని చెప్పింది కోర్టు. పార్టీ ఫిరాయింపుల నియమ నిబంధనలను ఉల్లంఘించే సభ్యుల వివరాలు, సభాపతి దృష్టికి తీసుకుని రానంత వరకు, అర్హత-అనర్హతలతో నిమిత్తం లేకుండా, చట్ట సభలలో నిరాటంకంగా సభ్యులుగా కొనసాగడానికి, ఎన్ని రకాల అవకాశాలుండాలో అన్ని రకాల అవకాశాలను చట్టం కలిగించింది. రాజకీయ పార్టీల "అధి నాయకులు" తమకు అనుకూలమని భావించి, సభాపతికి ఫిర్యాదు చేయనంత కాలం, ఫిరాయింపుల చట్టం కాగితాలకే పరిమితం. అలా కాకుండా కొన్ని సత్ సాంప్రదాయాలకు ఎవరో ఒక రాష్ట్రానికి చెందిన శాసన సభ సభాపతి చొరవ తీసుకోవాలి.

తాత్కాలిక-శాశ్వత, ఆర్థిక-లేదా-పదవి లాభం కొరకు, పార్టీ ఫిరాయింపులు, మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకోవడం చాలా కాలం నుండి జరుగుతున్న వ్యవహారం. విలువలకు తిలోదకాలిచ్చి, తనకు పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన, మాతృ సంస్థకే ద్రోహం తలపెట్టడం నేరం. ఆ నేరానికి కనీసం శిక్ష అనర్హత వేటు. పాతిక సంవత్సరాల క్రితం ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చినా, దాని అమలు అంతంత మాత్రమే. రాజీవ్ గాంధి హయాంలో, చట్టం తేవడానికి ప్రధాన కారణం, అంతకు ముందు, దేశ వ్యాప్తంగా, ఆయారాం-గయారాంల హవాలో అనుక్షణం రాష్ట్ర ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకం కావడమే. అయితే, చట్టం తేవడం జరిగినప్పటికీ,ఫిరాయింపులు మాత్రం ఆగలేదు. చట్టం అమలు బాధ్యత సభాపతిది మాత్రమే కావడంతో రాజకీయాలకు అతీతంగా, సత్ సాంప్రదాయాలు నెలకొనక పోవడమే దీనికి కారణం. పార్టీ ఫిరాయింపులు యధేఛ్చగా కొనసాగుతూనే వున్నాయి. అవసరార్థం ఎమ్మెల్యేలను విపక్షం నుంచి స్వపక్షానికి తెచ్చుకునే ప్రయత్నాలు అన్ని రాజకీయ పార్టీలు చేస్తూనే వున్నాయి. కోట్ల ధనం చేతులు మారుతూనే వుంది. ప్రజాస్వామ్యం విలువను అపహాస్యం పాలు చేయడానికి ఫిరాయింపు దారులు చట్టం లోని లొసుగులను ఇంకా వాడుకుంటూనే వున్నారు. రాష్ట్ర మాజీ గవర్నర్, పాలనానుభవం దిట్ట, ఇందిరా గాంధికి సన్నిహితుడు, పీసీ అలెగ్జాండర్, ఫిరాయింపుల చట్టం లోప భూయిష్టమైందని విమర్శించారు. పదవ షెడ్యూల్ లోని ఫిరాయింపుల చట్టాన్ని తిరగ రాసి, ఏ స్థాయి ప్రజా ప్రతినిధైనా, తాను ఎన్నికైన పార్టీని వీడినట్లైతే, ప్రజల విశ్వాసం కోల్పోయినట్లుగా భావించి, తక్షణం సభ్యత్వానికి అనర్హుడైనట్లుగా ప్రకటించే విధంగా వుండాలని సూచించారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారి విషయంలోను, దానికి కారణమైన వారి మాతృ సంస్థ రాజకీయ పార్టీల విషయంలోను, ఎన్నికల సంఘం అంతో-ఇంతో అప్రమత్తంగా వుంటే మంచిదే మో! ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలను నెరవేర్చని పక్షంలో, పార్టీ వీడిపోయే సభ్యులకు ఎన్నికల సంఘం రక్షణ ఇవ్వడం సమంజసం. ఒక పార్టీ, ఒక సారి ప్రణాళికలో చేర్చిన అంశాలకు సంబంధించి, అమలుకు నోచుకోని అంశాల విషయంలో, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేని పరిస్థితులున్నంత కాలం పార్టీలను వీడేవారికి ఇబ్బందులు తప్పవు. అదే విధంగా, పదవ షెడ్యూల్ అమలు విషయంలోను,కనీసం, సభాపతి దృష్టికి తీసుకుపోయే విషయంలోనైనా, ఎన్నికల సంఘం పాత్ర అంతో-ఇంతో వుండడం మంచిది. ఐదేళ్లకో సారి మేల్కొన కుండా,రాజకీయ పార్టీల-పార్టీల ద్వారా ఎన్నికైన సభ్యుల విషయంలో కొంత క్రియాశీలక పాత్ర పోషించాల్సిన బాధ్యతను ఎన్నికల సంఘం మరిచిపోకూడదు. End