Showing posts with label మన్మోహన్ సింగ్. Show all posts
Showing posts with label మన్మోహన్ సింగ్. Show all posts

Friday, April 12, 2013

ప్రధానిగా 'నాయకుడు': వనం జ్వాలా నరసింహారావు


ప్రధానిగా 'నాయకుడు'
వనం జ్వాలా నరసింహారావు

రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని ఎవరన్న చర్చ రాజకీయాలలో ఆసక్తి వున్న ప్రతి ఇద్దరి మధ్య నడుస్తోంది. ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రాహుల్ గాంధీ చురుకైన పాత్ర వహించిన నాటినుంచి, ఆ మాటకొస్తే అంతకంటే ముందునుంచే, ఆయనను కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా తెరమీదకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన చింతన్ బైటక్ దరిమిలా ఆయనకు పార్టీ ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఆయన జపం మరింత వేగం పుంజుకుంది. అదే విధంగా గుజరాత్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి అఖండ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టినప్పటినుంచి నరేంద్ర మోడీ పేరును బీజేపీ తన పార్టీ అభ్యర్థిగా తెర పైకి తెచ్చింది. తనకు ప్రధాన మంత్రి కావాలని లేదంటున్నప్పటికీ, రాహుల్ జపం మాత్రం పార్టీ కార్యకర్తలు మానలేదు. ఇక మోడీ విషయానికొస్తే ఆయనను బీజేపీ పార్లమెంటరీ పార్టీ సభ్యుడిగా నియమించి ఆ పార్టీ కూడా ఆయనను ప్రధానమంత్రిని చేసే విషయంలో మరో అడుగు ముందుకు వేసింది. వారిద్దరికీ తోడు నితీష్ కుమార్, ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, మాయావతి.....ఇలా మరి కొన్ని పేర్లు ప్రధాని పదవికి పోటీలో వినపడుతున్నాయి. పనిలో పనిగా తానూ రేసులో వున్నానని సంకేతాలిస్తున్నారు ప్రధాని మన్మోహన్ సింగ్. వీరిలో ఎవరు నాయకుడెవరనేది తేల్చేది మొదట ఓటర్లయితే, ఆ తరువాత వారెన్నుకున్న కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలు.

          కొంతకాలం క్రితం, కాంగ్రెస్ అధినేత్రి-యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధి అనారోగ్యానికి గురై, అమెరికాలో చికిత్స పొందడానికి వెళ్లినప్పుడు, ఇక్కడ పార్టీ బాధ్యతలను ఆమె అప్పగించిన నలుగురిలో ఆమె తనయుడు రాహుల్ గాంధి ఒకరు. వెంటనే, సోనియా-రాహుల్ గాంధీల భజన బృందం, భావి భారత ప్రధాని "రాహులే" అంటూ "బృంద గానం" ఆలాపించడం మొదలెట్టింది ఆనాటినుంచి. సోనియా కోలుకోవడానికి మరి కొన్ని రోజుల వ్యవధి వుండడంతో-ఆమె ఆరోగ్యం కుదుట పడుతుండడంతో, అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీలో అన్నా హజారే-ఆయన బృందం ఆరంభించిన నిరాహార దీక్ష దరిమిలా తలెత్తిన సమస్యాత్మక పరిణామాలను పరిష్కరించడానికి తన వంతు "నాయకత్వ" పాత్ర పోషించేందుకు, రాహుల్ గాంధీ దేశానికి తిరిగొచ్చారని భావించారు పలువురు అప్పట్లో. ఇక ఆయన భజన బృందం ఆనందానికి హద్దులే లేకుండా పోయాయి. కాకపోతే, ఢిల్లీ వచ్చిన నాటినుంచి, హజారే దీక్షకు స్పందనగా, పార్లమెంటులో "సెన్స్ ఆఫ్ ద హౌజ్" తీర్మానం ఆమోదించేంతవరకూ, ఏ స్థాయిలోను, రాహుల్ నాయకత్వ లక్షణాల ప్రదర్శన కించిత్తు కూడా జరగకపోవడం విచారకరం. హజారే సృష్టించిన సమస్యల విషయంలో కనీసం కొంత అవగాహనైనా ఆయనకు కలిగుంటే సంతోషించాలి. వాస్తవానికి, అదీ జరగలేదనడానికి నిదర్శనమే, ఆయన సాంప్రదాయాలకు విరుద్ధంగా, లోక్ సభలో లోక్ పాల్ బిల్ల్లును ఉద్దేశించుతూ చేసిన (చదివిన) ప్రసంగం. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్, రాహుల్ చేసిన ప్రసంగాన్ని పరోక్షంగా ప్రస్తావించి, ఘాటుగా విమర్శించారు కూడా.

మరో వైపున, ప్రతిపక్ష ఎన్డీయే భాగస్వామ్య పక్షంలోని బిజెపి లోక్ సభ సభ్యుడు, సంజయ్ గాంధి కుమారుడు, వరుణ్ గాంధి, ఆశువుగా చేసిన హిందీ ప్రసంగం, జూనియర్లతో సహా సీనియర్ పార్లమెంటేరియన్ల ప్రశంసలనందుకుంది. ఆయన హావ భావాలు, సందర్భోచితంగా చేసిన వ్యాఖ్యలు, అధికార పక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకిచ్చిన జవాబులు, నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న అసలుసిసలైన కార్య నిర్వహణ అధికారిని గుర్తుకు తెచ్చాయి. అంత మాత్రాన ఆయన ప్రధాని కాకపోవచ్చు. కానివ్వక పోవచ్చు. ఒక వేళ అయ్యే అవకాశాలొచ్చినా అదృష్టం వరించక పోవచ్చు. కాని, అవేవీ వరుణ్ గాంధీని నాయకుడు కాకుండా చేయలేవు. ఆయనే కనుక, నెహ్రూ-గాంధీ వారసత్వ పరంపరలో రాజకీయాలలో వున్నట్టయితే, ఇదే రాహుల్ భజన బృందం, "దేశ్ కీ నేతా వరుణ్ గాంధీ" అంటూ నినాదాలిచ్చే వారు. విధి బలీయమంటే ఇదేనేమో!

          ఈ నేపధ్యంలో, భావి భారత ప్రధాని కావడానికి గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్ర మోడీకి అన్ని అర్హతలున్నాయని, ఆయనే భారతీయ జనతా పార్టీ పక్షాన రాబోయే ఎన్నికలలో ప్రధాని కాబోయే అభ్యర్థిగా ప్రచారం లోకి దిగుతామన్న భావన కలిగే రీతిలో ఎల్. కె. అద్వానీ మాట్లాడారు ఆ మధ్యన. అదే సమయంలో యాధృఛ్చికంగానో-లేక సాధారణంగానో, అమెరికా చట్ట సభకు అనుబంధంగా పనిచేస్తున్న "కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీసెస్" అనే సంస్థ, మోడీని ఆకాశానికి ఎత్తేస్తూ ఒక సర్వే నివేదికలోని అంశాలను బహిర్గతం చేసింది. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో, బిజెపి ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి మోడీ గట్టి పోటీ ఇస్తారని కూడా ఆ సంస్థ పేర్కొన్నది. ఇంకేముంది కలకలం బయలుదేరింది. ఇప్పటికిప్పుడు రాహుల్ ను ప్రధానిగా చూడాలని ఆశిస్తున్న కొందరు కాంగ్రెస్ నాయకులు, అప్పుడే నరేంద్ర మోడీని ప్రధాన మంత్రిగా ఊహించుకుంటున్న భారతీయ జనతా పార్టీలోని ఆయన అభిమానులు, వాద-ప్రతివాదనలకు దిగారు. రాహులే గొప్ప నాయకుడని కాంగ్రెస్ వారు, మోడీని మించిన నాయకుడే లేరని బిజెపి వారు, సాక్ష్యాధారాలతో సహా చర్చలకు నడుం బిగించారు. వారిద్దరిలో ఎవరు ప్రధాని అవుతారు, ఎవరు కారో, అసలు ఇద్దరిలోనూ ఒకరన్నా అవుతారో, ఎవరూ కారో చెప్పే ముందర వీరిరువిరిలో ఎక్కువ నాయకత్వ లక్షణాలెవరికి వున్నాయో బేరీజు వేయడం అవసరం. నాయకుడు ఐనంత మాత్రాన ప్రధాని కావాలని లేదు కాని, ప్రధాన మంత్రి స్థాయి వారికి నాయకత్వ లక్షణాలు తప్పనిసరిగా వుండి తీరాలి. లేక పోవడం వల్ల ఎలా వుందో కొంతలో కొంత అనుభవంలో చూస్తూనే వున్నాం కదా!

          జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం ఆయన వారసులెవరన్న మీమాంస వచ్చినప్పుడు, తన తర్వాత ప్రధాని కావాల్సింది కూతురు ఇందిర కాదని, లాల్ బహదూర్ ఆ పదవికి తగిన వాడని, స్వయంగా నెహ్రూ అన్నాడంటారు. వాస్తవానికి, తండ్రి చాటున వుంటూనే ఇందిరా గాంధీ, తప్పో-ఒప్పో, అప్పటికే ఒక నాయకురాలిగా (తిరుగులేని) నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలి హోదాలో, కేరళలో ఎన్నికైన ప్రప్రధమ కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని రద్దు చేయించి, రాష్ట్రపతి పాలన విధించాలన్న నిర్ణయాన్ని తీసుకుని నాటి గవర్నర్తో అమలు చేయించగలిగింది! ఆమె తీసుకున్న ఆ చారిత్రాత్మక (అప్రజాస్వామిక) నిర్ణయం నెహ్రూ చని పోవడానికి పదేళ్ల క్రితం నాటిది. ఐనా, ఆమెకు ప్రధానిగా నాయకత్వ బాధ్యతలను తన తదనంతరం వెంటనే అప్పగించడానికి నెహ్రూ సుముఖంగా లేరంటే, ఆమెలో ఏదో కొంత నాయకత్వ లోటు అప్పటికింకా వుందనుకోవాలి. ఆ తర్వాత జరిగింది చరిత్రే కదా! ఆమె తన రెండు విడతల ప్రధాన మంత్రిత్వంలో తిరుగులేని నాయకురాలిగా దేశ-విదేశాలలో గుర్తింపు తెచ్చుకుంది. గెలిచింది-ఓడింది-ఓడి గెలిచింది. తనకు తానే ప్రత్యర్థులను సృష్టించుకుంది. ఆ ప్రత్యర్థులను మట్టి కరిపించింది. అదీ నాయకత్వ లక్షణాలంటే!

          తన తదనంతరం ఎవరనేది, ఇందిర మనసులో నిర్ధారించుకుని, మొదలు సంజయ్ గాంధీని, ఆయన దుర్మరణం తర్వాత రాజీవ్ గాంధీని నాయకత్వానికి సిద్ధం చేయసాగింది. ఆమె హత్యానంతరం, అప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చురుగ్గా పనిచేస్తూ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటున్న రాజీవ్ గాంధీ, ఇందిర వారసుడుగా ఏకైక అభ్యర్థిగా మిగిలిపోయాడు. అంత మాత్రాన ఆయన నాయకత్వం ప్రజలంగీకరించినట్లు భావించలేం. కాని, ఆయనకా లక్షణాలున్నాయని, ఇందిర హత్యానంతరం 1984 లో జరిగిన ఎన్నికలలో నిరూపించబడింది. కేవలం ఎన్నికలలో విజయమే కాకుండా, ఇతర విధాలుగా కూడా, నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు రాజీవ్ గాంధీ. 1989 ఎన్నికలలో ఓడినా, పార్టీ నాయకుడుగా రాజీవ్ ను ఆయన హత్యకు గురయ్యేంత వరకు, శ్రేణులు అంగీకరించడమే నాయకత్వ లక్షణం. రాజీవ్ తర్వాత, తానింకా నాయకురాలి స్థాయికి ఎదగలేదనే భావనతో సోనియా పార్టీ పగ్గాలను ఆరేడు సంవత్సరాల వరకు చేపట్టలేదు. అలా గుర్తించడం కూడా నాయకత్వ లక్షణాలే! పదిహేనేళ్ల క్రితం కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సోనియా, ఒక విధంగా చెప్పుకోవాలంటే, రాజీవ్ తల్లి-తాతల కంటే కూడా, వంశపారంపర్యంగా ఆ కుటుంబ సభ్యురాలు కాకపోయినా, నెహ్రూ-గాంధీ కుటుంబ వారసురాలిగా అపారమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు-ఇంకా ప్రదర్శించుతూనే వున్నారనాలి. తాను కాదల్చుకుంటే ప్రధాని కాగలిగినా, తన నాయకత్వం మీదున్న అపార నమ్మకంతో, మరొకరిని ప్రధానిని చేసి, తానే నాయకురాలిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ కు సారధి-నాయకులు ఎవరు అంటే, సోనియా అంటారు కాని మన్మోహన్ అనరు. ప్రధాని కానంత మాత్రాన నాయకులు కాకుండా పోరు. ప్రధాని కాగలిగినా నాయకత్వం కలిగుండాలని లేనే లేదు.

          ఇన్ని తెలిసిన సోనియా రాహుల్ గాంధీని పార్టీ స్థాయిలోనే ఇప్పటికీ శిక్షణ ఇస్తున్నదంటే, ఆమె దృష్టిలో రాహుల్ ఇంకా నాయకుడుగా ఎదగలేదన్నా అనుకోవాలి, ఆయనకా లక్షణాలింకా అబ్బలేదన్నా అనుకోవాలి, అవకాశమిచ్చినా నాయకత్వ పటిమను నిరూపించుకోవడంలో రాహుల్ విఫలమయ్యాడన్నా అనుకోవాలి. ఇందులో ఏవన్నా వుండి వుంటే, ఏ క్షణంలోనైనా రాహుల్ ను ప్రధానిగా చూడవచ్చు. ఆయన ఆ తర్వాత సఫలమో-విఫలమో ప్రజలే నిర్ణయిస్తారు. ఇక మోడీ విషయానికొస్తే, ఆయన పార్టీ అగ్ర నాయకుడే, ఆయనను నాయకుడంటుంటే, కాదనేదెవరు? కాకపోతే, ప్రధానిగా నాయకుడు కావాలంటే 2014 వరకు ఆగాల్సిందే!

          సోనియా మనసులో, రాహుల్ కు మారుగా ప్రియాంకా గాంధీని నాయకురాలిని చేయాలని మనసులో వుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఏదైనా జరగొచ్చు!

Friday, March 1, 2013

చిదంబరం వినిపించిన ఆర్థిక మంత్ర గీతమాలిక: వనం జ్వాలా నరసింహారావు


చిదంబరం వినిపించిన ఆర్థిక మంత్ర గీతమాలిక

వనం జ్వాలా నరసింహారావు

          కేంద్ర ఆర్థికమంత్రి పి చిదంబరం ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం చిదంబరానికి ఇది ఎనిమిదోసారి. దివంగత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ తరువాత ఇన్ని సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఘనత చిదంబరానిదే. భారత దేశ చరిత్రలో తాత్కాలిక బడ్జెట్‌తో కలుపుకుని, ఇప్పటివరకు బడ్జెట్‌ను మొత్తంమీద 82 సార్లు ప్రవేశపెట్టారు. మొట్ట మొదటిసారి నవంబర్‌ 26, 1947 న మొదటి ఆర్థిక మంత్రి ఆర్‌.కె షణ్ముఖం చెట్టి బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. గతంలో పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో, ప్రస్తుతం రాష్ర్ట పతిగా ఉన్న ప్రణబ్‌ ముఖర్జీతో సహా, ప్రధాని మన్మోహన్ సింగ్, టిటి కృష్ణమా చారి, ఆర్‌ వెంకట్రామన్‌, హెచ్ ఎం పటేల్‌, జస్వంత్‌సింగ్‌, విపి సింగ్‌, సి సుబ్రమణియం, జాన్‌ మతాయ్‌ లాంటి ప్రముఖులున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ, చరణ్‌ సింగ్‌, ఎన్‌ డి తివారీ, మధు దండావతే, ఎస్‌ బి చవాన్‌, సచింద్ర చార్దురి కూడా ఒకసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. నెహ్రు, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీలు ప్రధానిగా ఉంటూ మరోవైపు ఆర్థిక శాఖను అదనంగా నిర్వహించిన సమయంలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. అదే విధంగా చరణ్‌ సింగ్‌, మొరార్జీ దేశాయిలు డిప్యూటీ ప్రధానులుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. యశ్వంత్‌ సిన్హా, వై.బి చవాన్‌, సి.డి దేశ్ ముఖ్‌ ఏడుసార్లు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం జరిగింది. ఇప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆరుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

          ఆర్థిక మంత్రి చిదంబరం 2013-14 సంవత్సరానికి రూ. 16, 65,297 కోట్ల వ్యయ అంచనాతో భారీ బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ. 5, 55,322 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ. 11, 09,975 కోట్లు. ఈ మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ సవరించిన అంచనాలకన్నా 29.4 శాతం అధికం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2012-13) బడ్జెట్ వ్యయ అంచనా రూ. 14, 90,925 కోట్లు. సవరించిన అంచనాలో దానిని రూ. 14, 30,825 కోట్లకు కుదించడం జరిగింది. సామాజిక రంగాలకు గత ఏడాదికన్నా కేటాయింపులు పెంచారు. వచ్చే ఏడాది సబ్సిడీ బిల్లును రూ. 2, 57,654 నుంచి రూ. 2, 31,084 కు తగ్గించారు. పెట్టుబడుల ఉపసంహరణల ద్వారా రూ. 55,000 కోట్లు సమీకరించాలన్న భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. రక్షణ రంగానికి కేటాయింపులను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాకన్నా 14 శాతం పెంచి రూ. 2, 03,672 కోట్లు ఇచ్చారు. విద్యా రంగానికి రూ. 65,867 కోట్లు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమానికి రూ. 37,330 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు నిధికి రూ. 11,500 కోట్లు, తాగునీరు, పారిశుధ్యానికి రూ. 15,260 కోట్లు, జవహర్‌లాల్‌ నెహ్రూ పట్టణ పునరుద్ధరణ (జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం)కు రూ. 14,873 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ. 27,049 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ. 7, 00,000 కోట్లకు పెంచారు.

          చిదంబరం తన బడ్జెట్‌లో అదనంగా రూ. 18,000 కోట్ల ఆదాయార్జనకు కొన్ని కొత్త పన్నులు వేశారు. ఇందులో ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ. 13,300 కోట్లు, పరోక్ష పన్నుల ద్వారా రూ. 4,700 కోట్లు అదనపు ఆదాయం వస్తుందని లెక్క చెప్పారు. అందరూ ఆశించినట్లుగా సగటు వేతన జీవికి పన్ను మినహాయింపును పెంచలేదు. అయితే.. రూ. 3లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వార్షికాదాయం గల వ్యక్తులకు ఆదాయ పన్నులో రూ.రెండు వేల రాయితీ ప్రకటించారు. పన్ను కట్టే వారందరి పై మూడు శాతం విద్యా సుంకం కొనసాగుతుందన్నారు. రూ. 50 లక్షలకు మించిన స్థిరాస్థి లావాదేవీలపై ఒక శాతం టీడీఎస్ విధించారు. ఇందులో వ్యవసాయ భూమిని మినహాయించారు. షేర్ల లావాదేవీలపై పన్ను (సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్) ను తగ్గించారు. కొత్తగా, వ్యవసాయేతర సరుకుల షేర్ల లావాదేవీల పన్నును ప్రవేశపెట్టారు.

          తొలిసారిగా గృహాలను కొనుగోలు చేసే వారికి 25 లక్షల రూపాయల లోపు రుణంపై లక్ష రూపాయల వడ్డీ రాయితీని ప్రకటించారు. 25 లక్షలకన్నా పైబడిన రుణాలపై 1.5 లక్షల రూపాయల వడ్డీని తొలగిస్తామని తెలిపారు. సంవత్సరానికి 10 కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని చూపే దేశీయ కార్పొరేట్‌ సంస్థలపై 5 నుంచి 10 శాతం వరకూ సూపర్‌ రిచ్‌ టాక్స్ విధిస్తున్నట్టు తెలిపారు. దేశీయ కంపెనీలతో పోలిస్తే విదేశీ కంపెనీలు ఇప్పటికే అధిక పన్నులను చెల్లిస్తున్నందున వాటిపై సర్ చార్జీని 2 నుంచి 5 శాతానికి పరిమితం చేస్తున్నట్టు వివరించారు. డివిడెండ్‌ పంపిణీ పన్నును 5 నుంచి 10 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. 50 లక్షల రూపాయల దాటిన గృహాల బదిలీపై ఒక శాతం వారసత్వ పన్ను విధిస్తున్నట్టు చిదంబరం తెలిపారు.

          పన్ను చెల్లింపుదారులందరిపైనా 3 శాతం విద్యా సుంకం వసూలు కొనసాగుతుందని, కొత్తగా ప్రకటించిన సర్‌ చార్జీలన్నీ 2013-14లో మాత్రమే అమలవుతాయని తెలిపారు. ప్రత్యక్ష పన్ను ప్రతిపాదనల ద్వారా అదనంగా 13,300 కోట్లు, పరోక్ష పన్నుల నుంచి 4,700 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ‘విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీని ఆదర్శంగా తీసుకుని సర్‌ చార్జ్‌ భారాన్ని ధనవంతులపై మోపాలని భావిస్తున్నాను. ఈ స్వల్ప భారాన్ని ఈ ఒక్క సంవత్సరమూ భరించేందుకు వారు ఆనందంగా అంగీకరిస్తారని భావిస్తున్నా’ అని చిదంబరం వ్యాఖ్యానించారు. పొగ తాగేవారిపై ప్రతియేటాలానే ఈ సంవత్సరం కూడా ఎక్సయిజ్‌ సుంకాల భారాన్ని చిదంబరం మోపారు. సిగరెట్లు, సిగార్స్‌, చిరోట్స్‌, సిగారిల్లోస్‌పై ఎక్సయిజ్‌ సుంకాన్ని 18 శాతానికి పెంచుతున్నట్టు వివరించారు. ఎసి రెస్టారెంటులపై సుంకాలను పెంచారు. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చే వారు 50 వేల రూపాయల వరకూ బంగారు ఆభరణాలను ఎటువంటి సుంకాలు చెల్లించకుండా తీసుకురావచ్చని, అదే మహిళలైతే లక్ష రూపాయల విలువైన ఆభరణాలు తెచ్చుకోవచ్చని తెలిపారు. వ్యవసాయేతర ఉత్పత్తుల దిగుమతిపై ప్రస్తుతమున్న సుంకాలే కొనసాగుతాయని చిదంబరం స్పష్టం చేశారు.

          వెయ్యి కోట్ల రూపాయలతో ‘నిర్భయ నిధి’ని ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మహిళా బ్యాంకుకు ఈ బడ్జెట్‌లో చోటు లభించింది. మహిళల కోసం మహిళలచే నిర్వహించ బడేలా మహిళా బ్యాంకును 1000 కోట్ల రూపాయల ప్రాధమిక మూలధనంతో ప్రారంభించనున్నట్టు చిదంబరం ప్రతిపాదించారు. ఈ బ్యాంకుల నుంచి మహిళా రుణాలు, మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక బృందాలకు చేయూత వంటి కార్యకలాపాలు సాగిస్తామని తెలిపారు. దేశంలోని మహిళల భద్రత, సాధికారతకు ఈ నిధిని వినియోగిస్తామని ఆయన తెలిపారు. దీంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖకు 200 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నామని చిదంబరం పేర్కొన్నారు.

          ఒక్క సారి చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను విశ్లేషణ చేస్తే కొన్ని నిజాలు బయటపడ్తాయి. కలసిరాని వ్యవసాయంతో అనునిత్యం అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, వాటిని తీర్చే దారిలేక, సాగు కొనసాగించలేక, సాయం కోసం వేచి చూస్తున్న రైతాంగానికి అంతంత మాత్రం ఊరట కూడా లభించకపోవడం దురదృష్టం. ఆకాశాన్నంటుతోన్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపుచేయటం మాట అటుంచి, వాటి దుష్ఫలితాలను భరించాల్సిన సగటు వేతన జీవిని సంతోషపెట్టేందుకు చిదంబరం చేసిన ప్రయత్నం ఏమీలేదు. పేదరికంలో మగ్గుతూ, ఒళ్లు హూనం చేసుకుని, ఒక్క పూట తిండికి కూడా నోచుకోలేని, పేద ప్రజలకు ఎలాంటి ఆధారమూ చూప లేదు. కంటి తుడుపు గా, ఆహార భద్రత కోసం ఓ పది వేల కోట్లు పక్కన పెడుతున్నామన్న ప్రకటన మాత్రం చేశారు. మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు అవసరమని గీతా బోధన చేసారు. వివిధ శాఖలకు, వివిధ రంగాలకు కేటాయింపులను పెంచడమై తే చేసారు కాని, కచ్చితంగా ఇలా చేయబోతున్నా మన్న హామీ కనిపించలేదు. మహిళా లోకానికి ఆదరణ చేసీచేయనట్లు, నామ్‌కే వాస్తే అన్నట్టు ప్రకటించారు. రూపు-రేఖలు లేని నిర్భయ నిధి, మహిళా బాంక్ ప్రతిపాదనలు కంటి తుడుపువే! ఉద్యోగాలు లేక, ఉపాధి దొరక్క తిప్పలుపడుతూ ఆగ్రహావేశాలతో ఆవేదనతో అవకాశాల కోసం నిరీక్షిస్తున్న యువ జనానికి ఎలాంటి ఆశా లేదు. ‘‘అన్ని వర్గాల సుస్థిరమైన అభివృద్ధికి దోహదం చేసే అధిక వృద్ధి మా లక్ష్యం.. అదే మూల మంత్రం...’’ -అంటూ బడ్జెట్ ప్రసంగం మొదలు పెట్టిన ఆర్థికమంత్రి.. ఆద్యంతం మాటల గారడితో మురిపించారు. కానీ చేతల్లో చేసింది మాత్రం శూన్యం! చివరాఖరికి.. ‘నగదు బదిలీ’నే నమ్ముకున్నారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ‘నగదు బదిలీ’ని యూపీఏ పదవీ కాలం ముగిసే లోగా దేశమంతటా విస్తరించి.. ‘ఆధార్’కు అనుసంధానించే పని పూర్తిచేస్తామని సెలవిచ్చారు!

ఒకవైపు దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి.. మరొక వైపు ఏడాదిలో ఎన్నికలు.. ఒకవైపు ఆర్థిక సంస్కరణాభిలాషి ప్రధాని మన్మోహన్ సింగ్!, మరోవైపు “ఆమ్ ఆద్మీ” మంత్రం పఠించే మేడమ్ సోనియాగాంధీ!, ఎన్నికల వరాలు ప్రకటించి ప్రజలను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం!, ఆర్థిక సంక్షోభం ముదరకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అగత్యం! వీటి మధ్య సమన్వయం సాధించడానికి కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం విశ్వ ప్రయత్నం చేశారు. ఈ తక్కెడలో ఎటు మొగ్గాలో తెలియక తర్జనభర్జన పడ్డారు. ఎన్నికలకు ముందు ప్రజలను ఆకర్షించే భారీ సంక్షేమ పథకాలేవీ లేవు. అలాగని ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే పెద్ద చర్యలూ లేవు! కవితలు, సూక్తులు చెప్తూ.. సున్నితమైన అంశాలపై బరువైన మాటల మాయాజాలంతో అందరినీ ఆకర్షించే ప్రయత్నం చేశారు!! మరో ఏడాదిలో సాధారణ ఎన్నికల నేపథ్యంలో.. మహిళలు, యువత, పేద ప్రజల వర్గాలను ఆకట్టుకునేందుకు కూడా ప్రయత్నం చేశారు. చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో నోబెల్ బహుమతి గ్రహీత-ఆర్థిక శాస్త్ర వేత్త జోసెఫ్ స్టీగ్లిట్జ్, తిరువళ్లువర్, స్వామి వివేకానందల హితోక్తులను ప్రస్తావించటం జరిగింది. ప్రసంగం ఆరంభంలోనే, అన్ని వర్గాల సుస్థిర అభివృద్ధికి తోడ్పడే ఆర్థికవృద్ధి తన బడ్జెట్ మూల మంత్రం అని అన్నారు. సమానత్వం సాధించటమన్న ఒత్తిడి నైతిక బాధ్యతగా తనపై ఉందని, ఐతే, సుస్థిర అభివృద్ధి కావాలంటే అదికూడా అవసరం అనీ అన్నారు. "ఒక దేశపు అత్యంత ముఖ్యమైన వనరు ఆ దేశ ప్రజలే" అన్న స్టీగ్లిట్జ్ వ్యాఖ్యను ఉటంకించారు. ప్రసంగాన్ని ముగించే సమయంలో, తన అభిమాన తమిళ కవి తిరువళ్లువర్ రచనల నుంచి "మనసు నిద్రాణస్థితిలో లేకుండా, దృఢచిత్తంతో ఏది సరైనదని కన్ను విస్పష్టంగా గుర్తిస్తుందో.. మనిషి దానిని నెరవేర్చాలి" అనే పంక్తులను చదివారు. సాధారణంగా చిదంబరం బడ్జెట్ ప్రసంగంలో మూడు నాలుగు సార్లైనా తమిళ కవి తిరువళ్లువర్ పలుకులు వినిపించాల్సిందే! కానీ... ఈసారి ఆయన ఒక్కసారి వినిపించారు. వివేకానంద వాణినీ గుర్తు చేశారు. End

Tuesday, November 15, 2011

సమస్యను జటిలం చెయ్యడమే కాంగ్రెస్ సంస్కృతి! : వనం జ్వాలా నరసింహారావు

ఇదీ కాంగ్రెస్ సంస్కృతి

నమస్తే తెలంగాణ (17-11-2011)

వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణపై సాక్షాత్తు ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా మాట మారుస్తూ చాలా కాలం తరువాత పెదవి విప్పారు. ఏ చిదంబరమో, ఆజాదో, సింఘ్వీనో లేదా ప్రణబ్ కుమార్ ముఖర్జీనో అలాంటి ప్రకటనలు చేస్తే కొట్టి పారేయవచ్చు. "ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వలేం" అని సూటిగా, స్పష్టంగా ప్రధాని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందో-ఏమో కాని, ఆయన సహితం మాట తప్పడంలో మిగతా వారికి తీసిపోను సుమా అని చెప్పకనే చెప్పారు. గతంలో విదేశీ పర్యటనల నుంచి వచ్చినప్పుడు చెప్పినదానికి ఇప్పుడు చెప్పిన దానికీ తేడా వుంది. అలా అని వుండాల్సింది కాదు. ఏకాభిప్రాయమని, విస్తృతాభిప్రాయమనీ, చోటా మోటా నాయకుల లాగా మాట్లాడడం ఏమంత బాగా లేదు. తెలంగాణపై ఇంత కఠినమైన మాట ప్రధాని నోట వెలువడటం ఇదే మొట్ట మొదటిసారి! తెలంగాణ అంశంపై ప్రధాని మన్మోహన్ చేసింది సంచలన ప్రకటనే అనడంలో సందేహం లేదు. ప్రధాని ప్రకటన ప్రభావం రాబోయే పార్లమెంటు సమావేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలోనూ సందేహం లేదు. ఇప్పటికే ఘాటుగా (కనీసం పైకన్నా) విమర్శిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికైనా కనువిప్పు కావాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని "అభ్యర్థించడం" మానుకుని, "ఎందుకివ్వరు" అని ప్రశ్నించాలి-నిలదీయాలి.

కాంగ్రెస్ పార్టీకో సంస్కృతి వుంది. ఇది ఈ నాటిది కాదు. జవహర్లాల్ నెహ్రూ హయాం నుంచి, ఇందిర, రాజీవ్ ల పాలనలో కొనసాగిన ఆ సంస్కృతే, సోనియా గాంధీ సైతం తన కోటరీపైనా అదే సంస్కృతితో వ్యవహరిస్తుందా? ఒకవేళ అదే నిజమైతే, ఏ క్షణంలోనైనా, సోనియా తన పార్టీ నాయకులు ప్రధాని స్థాయి వరకూ చేసిన ప్రకటనలకు విరుద్ధంగా, తెలంగాణకు సానుకూలమైన ప్రకటన చేసే అవకాశం వుందనాలి. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లను మాట్లాడనిచ్చి, తన మనసులో మాట బయట పెడుతుందా? వాహనం కొనిచ్చి, స్టీరింగ్ చేతికిచ్చి, ఇష్టమొచ్చినట్లు తిరగమని చెప్పి, చివరకు తన కాంపౌండులో ఆ వాహనాన్ని పార్కు చేయించే సంస్కృతి కాంగ్రెస్ అధినాయకులకుంటుంది. కాకపోతే, అలా చేయనివారి విషయంలో అప్రమత్తంగా వుండేందుకు, వాహనం బ్రేకులను తన అధీనంలోనే వుంచుకుండే ఏర్పాటుంటుంది. అదే తెలంగాణ విషయంలో జరగొచ్చుననే ఆశ, రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవేమోననే భయం సోనియాలో వుండవచ్చుననే ధైర్యం మనకున్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాక తప్పదు.

తెలంగాణ సమస్య పరిష్కారం విషయంలో అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, యుపిఎ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం, చాలా సీరియస్‌గా ఉందని, ఏ క్షణంలోనైనా దానికి అనుగుణంగా ఒక ప్రకటన వెలువడవచ్చని, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నోట్లో నుంచి వచ్చిన మాట తడి ఆరకముందే, పరిష్కారం మాట దేవుడెరుగు... సమస్యను మరింత జటిలం చేసే ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆ ప్రకటనలు మొదట్లో కర్ర విరగకుండా, పాము చావకుండా, ఆ తరువాత కొంత అస్పష్టంగా వుంటే, ప్రధాని నోట మాత్రం ఒక రకమైన (అదో రకమైన అస్పష్టత!) స్పష్టత వచ్చింది.

రెండో "ఎస్సార్ సీ" ఏర్పాటుచేయడమే "తెలంగాణ సమస్యకు పరిష్కారం" అనీ, భారత దేశం మొత్తానికీ కాంగ్రెస్ పార్టీ విధానమిదేనని, "తెలంగాణకు మినహాయింపు లేదు" అనీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ దేశ రాజధానిలో ఒక ప్రకటన చేశారు. తెలంగాణ సమస్యకు, మాయావతి ఉత్తరప్రదేశ్ ను విభజించాలని చేసిన డిమాండుకు (బోడిగుండును, మోకాలును తలపై లేని జుట్టుతో కలిపి ముడివేసే ప్రయత్నం చేసినట్లు గా) సంబంధం కలిపారాయన ఆ సందర్భంగా. దేశంలోని పలు రాష్ట్రాలలో, ఏక కాలంలో, విభజన ఉద్యమాలు జరుగుతున్నట్లు, ఆ డిమాండ్లను పరిష్కరించడానికి, రెండో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు మినహా మరో దారి లేదన్నట్లు ఆయన ఒక విచిత్రమైన కథనం అల్లారు. కాంగ్రెస్ పార్టీ మినహా మరే ఇతర పార్టీ కూడా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునేవి కాదన్న తరహాలో రషీద్ అల్వీ మాట్లాడడం, "జాతీయ దృక్ఫధం" ఒక్క కాంగ్రెస్ పార్టీకే వున్నట్లు కూడా అయన కలర్ ఇచ్చారు. బహుశా బొత్సా ప్రకటనకు అర్థం ఇదేనేమో!

ఇంతలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి బాంబ్ పేల్చనే పేల్చింది. రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విడదీయాలని, తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతూ, హెచ్చరిక కూడా చేసింది. ఒక తేదీ ఖరారు చేసి, ఆ తేదీలోపున విభజన జరగకపోతే, నాలుగు ప్రాంతాల శాసనసభ సభ్యులు, వేర్వేరుగా సమావేశమై తీర్మానాలు చేసి పంపుతాం జాగ్రత్తా సుమా అని వార్నింగ్ ఇచ్చింది. తానొక ప్రాంతానికే పరిమితం కానని, యు. పి. లోని అన్ని ప్రాంతాలు తనకు సమానమేనని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పరోక్షంగా సూచన చేసింది. తెలంగాణ విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఇది సూచన అనుకోవచ్చు.

తెలంగాణపై నవంబర్ పన్నెండు తరువాత కేంద్రం వైపు నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం వస్తుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో రషీద్ అల్వీ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. రాష్ట్ర విభజన విషయంలో ఎటూ తేల్చుకోలేకుండా ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం నెమ్మది నెమ్మదిగా ఎస్సార్ సీని తెర పైకి తెచ్చి, తెలంగాణ అంశాన్ని మరుగున పడవేసే దిశగా పావులు కదుపుతున్న అనుమానాలూ బలపడుతున్నాయి. మొదటి పర్యాయం ఎస్సార్ సీ వేయడానికొక చారిత్రక నేపధ్యం వుంది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాష్ట్రాల పునర్విభజన అత్యవసరం ఐన నేపధ్యంలో, ఒక యూనిఫార్మిటీ కోసం చేసిన ఏర్పాటది. ఇప్పుడంత అవసరం లేదు. ఒక్కొక్క ఏర్పాటు ఉద్యమానికి ఒక్కో నేపధ్యముందిప్పుడు. మాయావతి డిమాండును, యావత్ తెలంగాణ ప్రజల డిమాండుకు ముడి పెట్టడం, అందుకొరకు ఏకంగా ఎస్సార్ సీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయడం దుర్మార్గం. రషీద్ అల్వీ రాజకీయ నేపధ్యం కూడా, పొంతనలేని ఆయన వ్యాఖ్యల లాగానే వుందనాలి. అందుకేనేమో, తక్షణమే స్పందించారు ఆయన పార్టీ ప్రముఖులు కొందరు. అదీ నిజమేకదా! రషీద్ అల్వీ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. పార్టీలు మార్చడంలో దిట్ట. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు సమాజ్‌ వాదీ పార్టీలోనూ, ఆ తరువాత బిఎస్పీలోనూ, కొంతకాలం జనతాదళ్ లోను వున్నారాయన. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ఉత్తరప్రదేశ్ విభజన అంశాన్ని రెండో ఎస్సార్ సీయే తేల్చాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ మాత్రం తెలంగాణ ఇస్తున్న ధోరణిలో (ఎలానో చెప్పకుండానే) మాట్లాడుతూనే వున్నారింకా.

ఇంకేముంది...తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా గుర్రుమన్నారు. గరం గరంగా (అధిష్టానాన్ని అనే ధైర్యం లేదు కదా!) రషీద్ అల్వీని సున్నితంగా విమర్శించసాగారు. విపరీతార్థాలు వెతక సాగారు. అంగీకరించే ప్రసక్తే లేదన్నారు కొందరు. ఒకవిధంగా అన్ని పార్టీల వారూ ఐక్యంగానే విమర్శించారనవచ్చేమో! అందులో ఎవరు ముందు భాగంలో వున్నారో, చెప్పడం కష్టమేమో కాని, మొత్తం మీద...టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ నేతలు గట్టిగా గొంతు పెంచారు. ఈ నేపధ్యంలో ప్రణబ్‌ ముఖర్జీతో బొత్స మంతనాలు చేశారు. మరికొందరేమో, పార్టీ వైఖరి ఎస్సార్ సీయే ఐనప్పటికీ, తేల్చేది మాత్రం యుపిఎ ప్రభుత్వమే అని భాష్యం చెప్పుకున్నారు. ఏదేమైనా, రషీద్ వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు కారాలు-మిరియాలు నూరారు. "తెలంగాణపై ఎంతో కసరత్తు చేశాక, కొండంత రాగం తీసి... ఏదో పాట పాడినట్ల్లు ఎస్సార్ సీ... బిస్సార్సీ అంటే అంగీకరించం'' అనీ, పిచ్చి వాగుడు మానుకోవాలని హెచ్చరించారు. ఏదేమైనా, ఎవరెన్ని చెప్పినా, ఎంతవరకైతే, ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన తెలంగాణను (హైదరాబాద్ ను రాజధానిగా చేయడంతో సహా) ఇవ్వకపోతే మరో తుపాను సృష్టిస్తామని కుండ బద్దలు కొట్టి మరీ హెచ్చరించారు కెసిఆర్. "సకల జనుల సమ్మె సమయంలో మెడపై కత్తి పెట్టి నిర్ణయం తీసుకోమంటే ఎలాగని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి గులాంనబీ ఆజాద్ అన్నారనీ, ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి కనుక, రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయొచ్చు కదా?'' అని మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటన చేసినా ప్రభుత్వాలు కూలక తప్పదని కూడా హెచ్చరించారు. పనిలో పనిగా "సమైక్యవాద టీడీపీ భూస్థాపితం" చేయాలనీ, జేఏసీ తరఫున "కాంగ్రెస్‌కో ఖతం కరో.. తెలంగాణకో హాసిల్ కరో" అనే నినాదం తీసుకొచ్చి, తెలంగాణ రాష్ట్ర సమితిని ఒక "బలమైన రాజకీయ శక్తి" గా మలచనున్నట్లు కూడ ఆయన అన్నారు.

తెలంగాణ అంశంపై తమ పార్టీ వారే అయినా దిగ్విజయ్‌ సింగ్, రషీద్ అల్వీ వంటి వారి వ్యాఖ్యలను పట్టించుకోబోమని, సోనియాగాంధీ, గులాంనబీ ఆజాద్ మాట్లాడితేనే పరిగణనలోకి తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ (ఇంకో రూట్ నుంచి) శల విచ్చారు. తెలంగాణ అంశాన్ని రెండో ఎస్సార్ సీకి నివేదించే ఉద్దేశం కేంద్రానికి అసలు లేనే లేదని, కేవలం ఉత్తరప్రదేశ్ విషయంలో మాత్రమే అది వర్తిస్తుందని మరో రకమైన కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదో రూట్. ఇంతకూ, శ్రీకృష్ణ కమిటీ నివేదికలో సూచించిన సిఫారసుల ఆధారంగా, తెలంగాణపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోబోతున్నాదా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశాలేమైనా వున్నాయా? లేక రెండు ప్రాంతాలకూ వేర్వేరు రాజధానులను ప్రకటించవచ్చా? పోనీ, హైదరాబాద్‌ను ప్రస్తుతానికి ఉమ్మడి రాజధానిగా నిర్ణయించి, ఆ తరువాత సీమ+ఆంధ్ర=సీమాంధ్రకు వేరే రాజధాని (నులను)ని ప్రకటించడమా? ఏదీ కాకుండా, ఇంకా నాన్చుడు ధోరణేనా? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు. సమాధానం దొరికీ దొరకని ప్రశ్నలు. సార్క్ సమావేశాలకు వెళ్లిన మన్మోహన్ సింగ్ స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఏమన్నా తేలనుందా? ఏం తేల్చినా, అది పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందేనా? అంతా అయోమయం. స్పష్టత లేదు.

ఇదిలా వుంటే చర్చల జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ "కీలక చర్చలు" జరిపారు. ఒకసారి కాదు...పలుమార్లు! ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో వారు చర్చలు చేశారు. టెలివిజన్ ఛానళ్ల లాగానే (ప్రత్యేకంగా బైట్) సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేశవరావు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ అల్వీని కల్సి చర్చించారు. కేశవరావు ప్రణబ్ ముఖర్జీతో కూడా చర్చించారు. ప్రణబ్‌ను కలిసే ముందు బొత్స, కేశవరావు చర్చలు జరిపారు! తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్ర శేఖరరావుతో కూడా కోర్ కమిటీ సభ్యుడొకరు చర్చలు జరిపారట. ఇక తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ రోజువారీ చర్చలుండనే వున్నాయి. చర్చోఫ చర్చలైతే జరుగుతున్నాయి కాని ఫలితం శూన్యం. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ-ప్రధానమంత్రి కార్యాలయం తెలంగాణ అంశంపై తీసుకోవాల్సిన నిర్ణయం గురించి సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్లు మరో వార్త. నిజంగా వీళ్ళు త్రికరణ శుద్ధిగా చర్చలు చేస్తుంటే, ఈ పాటికి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో ఏర్పాటయ్యేదికదా!

అసలు సమస్య చర్చలు కాదు. సమస్య పరిష్కారం దొరక్క కూడా కాదు. మనసుంటే మార్గముంటుందంటారు. హృదయమంటూ వుంటేనే స్పందన వుంటుంది. ప్రజాస్వామ్యంలో నమ్మకమున్న వారికే దాని విలువ అర్థమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారికి మాత్రమే మాటకు కట్టుబడి వుండే అలవాటుంటుంది. పార్టీపరంగా కాని, వ్యక్తుల పరంగా కాని, కాంగ్రెస్ కు, ఆ పార్టీ నాయకులకు ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం అవగాహన లేదనాలి. ఎన్నికల ప్రణాళికలో, కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేర్చిన విషయం కాంగ్రెస్ అధిష్టానానికి కాని, ఆ పార్టీ నాయకులకు కాని తెలియదా? ఎన్నికల ప్రణాళిక రచనలో తెలంగాణ అంశాన్ని చేర్చిన సంగతి ప్రణబ్ ముఖర్జీకి గుర్తులేదా? అలా చేర్చడంలో ఆయన పాత్ర లేదా? ఆయనకు తెలియకుండానే కనీస ఉమ్మడి కార్యక్రమంలో దాన్ని పెట్టారా? పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంలో ఆ విషయాన్ని చేర్చిన సంగతి ఈ నాయకులెవరికీ తెలియదా? ప్రధాన మంత్రి చేసిన వాగ్దానం ఆయనకూ గుర్తులేదా? ఒకసారి దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో తన వెంట వచ్చిన పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ అంశంపై స్పష్టంగా, పార్టీ పరంగా-ప్రభుత్వ పరంగా తమ ప్రాధాన్యతా అంశం అని ప్రధాని చెప్ప లేదా? ఎన్ని సార్లు ...ఇంకెన్ని సార్లు మాట మారుస్తారు వీళ్లు?

ఇంతెందుకు. రెండేళ్ల క్రితం నాటి డిసెంబర్ తొమ్మిది ప్రకటన, పార్లమెంటులో చేసిన వాగ్దానాలు మర్చిపోయారంటే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనట్లే! ఇలా మరో రెండేళ్లు గడుపుతారేమో కాని, శాశ్వతంగా అపవాదు మూటకట్టుకుంటున్నామన్న సంగతి మర్చిపోతున్నారు కాంగ్రెస్-యుపిఎ నాయకులు. నిర్ణయం తీసుకోవాల్సిన సోనియాగాంధీని ఇంత వ్యూహాత్మకంగా తప్పుదోవ పట్టిస్తున్న వారెవరో కాని వారికి జోహార్లు పలకాల్సిందే! చీటికీ-మాటికీ ప్రకటనలు గుప్పిస్తున్న ఈ ఛోటా-మోటా నాయకులకు, అసలామె అనుమతు వుందో-లేదో? సోనియాకు సమస్య తీవ్రతను వివరించిన దాఖలాలు లేవనిపిస్తోంది. బహుశా రేపో-మాపో యౌవరాజ్య పట్టాభిషేకం జరుగుతుందన్న వార్తలొస్తున్నాయి. యువరాణిగారు కూడా రంగప్రవేశం చేయబోతున్నట్లు కథనాలు వినవస్తున్నాయి. సోనియాకు చెప్పని వారు, వీరికి చెపుతారన్న నమ్మకం ఏంటి? వీరికి అర్థమయ్యేలోపున ఎన్నికలొస్తాయి. ఇక ఆ తరువాత ఏం జరుగుతుందో భగవంతుడికే తెలియాలి. సమస్యకు దొరికేది పరిష్కారం కాదు. దాన్ని మరింత జటిలం చెయ్యడమే! End

Thursday, July 7, 2011

రాష్ట్ర ప్రభుత్వ పాలన మెరుగు పడాలంటే "గవర్నింగ్ కమీషన్" ఏర్పాటు తప్పనిసరి! : వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్రానికి ఓ గవర్నింగ్‌ కమిషన్‌ !

వైఎస్‌ పథకాలకు అదే రక్ష

సూర్య దినపత్రిక (08-07-2011)

వనం జ్వాలా నరసింహారావు

నేడు-జులై ఎనిమిది - దివంగత ముఖ్య మంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం - అరవై రెండవ జయంతి. రాజశేఖర రెడ్డికి జన్మ దినం ఘనంగా జరుపుకునే అలవాటు లేదనాలి. ముఖ్య మంత్రి హోదాలో వున్నప్పటికీ, ఆడంబరాలకు దూరంగా, తన స్వస్థలమైన ఇడుపులపాయకు వెళ్లి, బంధువుల మధ్య-అత్యంత సన్నిహిత స్నేహితుల మధ్య మాత్రమే తన పుట్టిన రోజు గడపడం ఆయన చేస్తుండే వారు. 2011 లో, రెండవ పర్యాయం కాంగ్రెస్ పార్టీని అధికారంలో కి తెచ్చిన రెండు నెలలకే, రాజశేఖర రెడ్డి జరుపుకున్న షష్టిపూర్తి జన్మ దినాన్ని కూడా, ఆడంబరాలకు దూరంగా, కేవలం తన సమీప బంధు - మితృలతో గోవాలో గడిపారు. ఆడంబరాలకు దూరంగా వున్నప్పటికీ, తనకు అత్యంత ప్రేమ పాత్రమైన సంక్షేమ పథకాల విషయం వచ్చేటప్పటికి, వాటికి సంబంధించిన అంశం తన దృష్టికి వస్తే, వాటిపై శ్రద్ధ చూపించడం మాత్రం తప్పని సరిగా చేసేవారు. చనిపోవడానికి రెండు నెలల ముందర గోవాలో, పుట్టిన రోజున వున్నప్పుడు, ఆ రాష్ట్రంలో అమలవుతున్న 108 అత్యవసర సహాయ సేవల గురించి స్వయంగా ఆరా తీసి, అక్కడున్న 108 యాజమాన్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 108 అత్యవసర సహాయ సేవలను భారత దేశంలో మొట్ట మొదటి సారిగా ఆరంభించడానికి కారకుడు రాజశేఖర రెడ్డి అనే విషయం అందరికీ తెలిసిందే.

ఒక్క ఆ సేవల విషయంలోనే కాకుండా, ఆయన ఆరంభించిన అనేక సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో రాజశేఖర రెడ్డి చూపించిన శ్రద్ధ, ఆయన తదనంతరం కూడా, ఆయన వారసులమని చెప్పుకుంటున్న ప్రభుత్వాధి నేతలు చూపక పోవడం అత్యంత దురదృష్టకరం. ఆయన తర్వాత వచ్చిన ముఖ్య మంత్రులు, ఏం చేసినా - చేయక పోయినా, ఒక్క పని మాత్రం అత్యంత నైపుణ్యంతో చేయగలిగారు. అదే, అంచలంచలుగా, ఆయన సంక్షేమ పథకాల అమలును శక్తి వంచన లేకుండా అడ్డుకోవడం. దీనికి ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన - ఆయన మంత్రి వర్గ సహచరులు కొందరు, ఆయన సన్నిహితులు మరి కొందరు, ఆయన కుటుంబ సభ్యులతో సహా ఇంకొందరు అవినీతికి పాల్పడినట్లు, ఆయనను బ్రతికుండగా పొగడిన వారితో సహా - ఆగర్భ శత్రువులు కూడా ఆయన మరణానంతరం చేస్తున్న విమర్శలలో నిజా - నిజాలెంతవరకో కాని, ఆయన మదిలో మెదలిన భావాలకనుగుణంగా రూపు దిద్దుకుని - అమలైన సంక్షేమ పథకాల విషయంలో మాత్రం, ఆయనను శంకించే ముందర ఒకటికి రెండు మార్లు ఆలోచించాలి.

రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయనకు నివాళులర్పించిన కాంగ్రెస్-కాంగ్రేసేతర ప్రముఖులందరూ, ఆయనను ఆకాశం అంత ఎత్తులో చూపుతూ పొగడిన వారే. "మహిళల సాధికారితకు, పిల్లల సంక్షేమానికి, పేదలు- రైతుల అభ్యున్నతికి జీవితమంతా ధారపోసిన దార్శనికుడు, ప్రభావశీలి, అభ్యుదయ నాయకుడు" రాజశేఖర రెడ్డి అంటూ, ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం అవిశ్రాంతంగా శ్రమించారని పొగిడారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి. "వై ఎస్ మరణం కాంగ్రెస్‌కు తీరని నష్టం" అని వాపోయారు. మరి కొంచెం ముందుకు పోయి, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కొరకు అహర్నిశలు-అలుపు లేకుండా శ్రమించిన రాజశేఖర రెడ్డి స్ఫూర్తిని ఎప్పటికీ స్మరించుకుంటూ పాలన చేద్దామని సలహా కూడా ఇచ్చారు సోనియా గాంధి. ఇక ఆమె సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వాధినేత-ప్రధాని మన్మోహన్ సింగ్ "డాక్టర్ వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయింది" అన్నారు. వైఎస్ తీసుకున్న చారిత్రక నిర్ణయాలు అయన కీర్తిని నిలబెడతాయని, అయన ప్రజల గుండెల్లో సజీవంగా ఎప్పుడూ ఉంటారని అప్పటి ప్రజారాజ్యం అధ్యక్షుడు - ఇప్పటి కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి అన్నారు. తామూ రాజశేఖర రెడ్డిని పొగడడంలో ఏ మాత్రం తీసి పోమన్న తరహాలో, ఆయనను ప్రగతిశీల నాయకుడుగా - అంకిత భావం కల రాజకీయ వేత్తగా అభివర్ణించారు మాజీ ప్రధాని - భారత జనతా పార్టీ నేత అటల్ బిహారీ వాజ్ పాయి. పాతికేళ్ల రాజకీయ జీవితం మొత్తాన్నీ ప్రజల కోసమే అంకితం చేసిన వైఎస్ లేని లోటు ఎవరూ పూడ్చలేనిదన్నారు లోక్ సభలో ప్రతిపక్ష నేత - భావి భారత ప్రధాని ఎల్.కే.అద్వాని. మరణించిన వ్యక్తి గురించి మంచి మాటలు చెప్పడంలో ఏ మాత్రం తప్పు లేదు కాని, ఆయన మరణించిన అనతి కాలంలోనే, సోనియా గాంధీతో సహా - ఆయనను ఆకాశానికి ఎత్తిన పలువురు ప్రతి పక్ష నాయకులు కూడా, రాజశేఖర రెడ్డిని - ఆయన పాలనా కాలానికి సంబంధించిన అనేకానేక అంశాలపై, విమర్శలు గుప్పించడం వెనుక రాజకీయ కారణాలు తప్ప మరింకేమన్నా వున్నాయా?

స్వపక్ష - విపక్ష రాజకీయ నాయకులు అంత గొప్పగా పొగడిన, అరుదైన పాలనా దక్షత కలిగిన వ్యక్తి, హఠాత్తుగా - హెలికాప్టర్ ప్రమాదంలో, మరణించిన వెంటనే రాజకీయ శూన్యత ఎందుకు కలగాలి? మరణించి ఇంకా రెండేళ్లన్నా కాలేదు...ఎందుకంత గా ఆయనను అందరూ విమర్శించాలి? అంతవరకూ బాగానే వుంది. ఏ కారణంతో ఆయన తలపెట్టిన అతి ముఖ్యమైన సంక్షేమ పథకాల అమలు కుంటు పడాలి? కనీసం ఆ పథకాలలో, బీద - సాద, వెనుక బడిన వర్గాల, షెడ్యూల్డ్ కులాల - తెగల, మధ్య తరగతి ప్రజలకు చెందిన లబ్దిదారుల కుటుంబాలకు మేలు చేకూర్చిన కొన్నింటి అమలునన్నా కొనసాగించలేని స్థితిలో ప్రభుత్వం (రాజశేఖర రెడ్డి తర్వాత ముఖ్య మంత్రైన రోశయ్య నాయకత్వంలోనిదైనా - ఆ తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డిదైనా) వుండడానికి అంత బయటకు చెప్పలేని కారణాలేమై వుంటాయి? అవి "రాజశేఖర రెడ్డి పథకాలు" గా ముద్ర పడినందు వల్లా? లేక, ఆర్థిక ఇబ్బందుల వల్లా? లేక ప్రభుత్వ యంత్రాంగంలో చోటు చేసుకున్న నిర్లిప్తత వల్లా? రాజశేఖర రెడ్డి వారసులుగా వచ్చిన ముఖ్య మంత్రుల ఆదేశాలను అధికారులు బే ఖాతరు చేయడం వల్లా? వీటిలో ఒకటి కంటే ఎక్కువ కారణాల వల్లా? దీనికి సరైన సమాధానం, రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న ఒక సీనియర్ సివిల్ సర్వెంటు ఆయన సమీప సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలలో లభించింది కొంతమేరకు. రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రిగా వున్న కాలంలో, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన సంక్షేమ కార్యక్రమాలలో ఒక దాని అమలు విషయంలో ఆ సివిల్ సర్వెంటు అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఆయనను ఆ పాత్ర నుంచి తప్పించారు - పోనీ ఆయనే స్వచ్చందంగా వైదొలిగారనుకుందాం!

బయటకు చెప్పే కారణాలు - అందరూ వూహించే కారణాలకు భిన్నంగా ఆ సివిల్ సర్వెంటు ఆసక్తికరమైన తన అభిప్రాయం వెల్లడి చేశారు. వాస్తవానికి అతి చేరువలో వున్న ఆయన అభిప్రాయం నిశితంగా పరిశీలిస్తే ఆయన మాటల్లో యదార్థం గోచరించింది. దివంగత ముఖ్య మంత్రి అభివృద్ధి పధకాలైన జలయజ్ఞం లాంటి విషయంలో ఆచి-తూచి స్పందించిన ఆ సివిల్ సర్వెంటు, పరోక్షంగా వాటి అమలు - వాటి బాటలోనే, సంక్షేమ పథకాల అమలు గురించి కొన్ని విషయాలు చెప్పారు. రాజశేఖర రెడ్డి తన మొదటి విడత పాలనలో, తొలి నాలుగేళ్ల వరకు, అత్యంత జాగరూకతతో - పాలనా దక్షతతో, పటిష్ఠమైన యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని ఏర్పాటు చేయగలిగినా, ఆ తర్వాత, ముఖ్యంగా - 2009 ఎన్నికలకు ఒక ఏడాది ముందు, అంటే 2008 సంవత్సరం మధ్య నుంచి, తన ఆలోచనా ధోరణిని మార్చుకున్నారన్నారు. ఎలాగైనా, మలి విడత జరిగే 2009 ఎన్నికలలో గెలవాలన్న లక్ష్యం ఒక వైపు, తనను నమ్ముకున్న ఎమ్మెల్యేలకు సాధ్యమైనంత సహాయపడాలన్న కోరిక మరో వైపు ఆయనలో కలిగిందని, దాని ప్రభావం పథకాలపై పడడం ఆరంభమైందని అన్నారాయన. ఆ పాటికే, ఆయన ముందు అధికారంలో వున్న తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చోటుచేసుకున్న కొంతలో-కొంత రాజకీయ అవినీతి ప్రభావం, పెద్ద మోతాదులో మారుతున్న రాజశేఖర రెడ్డి ఆలోచనా ధోరణి మీద పడిందంటారాయన. ఎన్నికైన ప్రజా ప్రతినిధులలో పలువురు, అధికారులను శాసించే దిశగా పాలన సాగడంతో దాని దుష్ప్రభావం పథకాలపై పడి, ఆయన తర్వాత ఇంతై-ఇంతితై-వటుడింతై అన్న చందాన వాటి మూతవేసి స్థితికి చేరుకున్నాయని ఆయన అభిప్రాయం. దానికి ఒక ఉదాహరణగా, ఆయనకు ఇటీవల తాజ్ కృష్ణా హోటల్ సమీపంలో పార్కుచేసి వున్న 108 అంబులెన్సు మీద పూర్తిగా కళా విహీనంగా - మాసి పోయి - కనిపించకుండా వున్న రాజీవ్ గాంధీ బొమ్మ విషయం చెప్పారు. కనీసం ఆ బొమ్మను పునరుద్ధరించడానికి కూడా నిధులివ్వలేని పరిస్థితికి కారణం మూలాలు కూడా రాజశేఖర రెడ్డిలో 2008 సంవత్సరం మధ్య నుంచి వచ్చిన మార్పే అన్నారు.

ఇంతకూ, ఆ మార్పేంటని ప్రశ్నిస్తే, విచక్షణా రహితంగా, రూపాయి ఆదాయం మాత్రమే వుందని తెలిసి కూడా, భవిష్యత్ లో ఏం జరుగుతుందని ఆలోచన చేయకుండా, పది రూపాయల ఖర్చయ్యే పథకాల రూపకల్పన చేయడమేనని ఆయనిచ్చిన మొదటి జవాబు. సంక్షేమ పథకాల అవసరమున్న 30-40 శాతం ప్రజలకు అవి కలిగించే ఆలోచన చేయకుండా, అవసరమున్న వారికి - లేని వారికి, వాటిని అందించుదామన్న ఆలోచన - అదీ రాబోయే ఎన్నికలను దృష్టిలో వుంచుకుని చేసిన ఆలోచనను ఆ సివిల్ సర్వెంటు తప్పుబట్టారు. ఆయన ఆలోచన రాజకీయ ఆలోచన మాత్రమే అంటారాయన. ప్రణాళిక పథకాలను, ప్రణాళికేతర పథకాలుగా మార్చలేక పోవడం, మార్చడానికి ప్రభుత్వ యంత్రాంగానికి అవకాశం ఇవ్వక పోవడంతో, దీర్ఘకాలం కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే వీలు కాని ఆ పథకాలు కుంటుపడి పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ఇవ్వాళ వాటిని తీసేయలేక, కొన సాగించలేక, సహజంగా నీరుకారుస్తే బాగుంటుందన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేయడానికి కారణమైందన్నారు. ఈ పరిస్థితుల్లో సాక్షాత్తు "దేవుడే దిగి వచ్చి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టినా" ఏమీ చేయలేని పరిస్థితులొచ్చాయని అన్నారు. వీటికి తోడు, తెలంగాణా ఉద్యమం కూడా అనిశ్చిత స్థితిని కలిగించిందంటారాయన.

వీటి నుంచి గట్టెక్కడానికి, ఒకే ఒక మార్గం "గవర్నింగ్ కమీషన్" ను ఏర్పాటు చేసి, దానికి రాజ్యాంగ బధ్రతను కలిగించి, పాలనలో సమూలంగా మార్పులు తేవడమే! రాజశేఖర రెడ్డి జన్మదినం నాడు, ఆయన ఏ ఆలోచనతో చేసినప్పటికీ, ఆయన రూప కల్పన చేసి - అమలు చేసిన సంక్షేమ పథకాల కొన సాగింపుకు, కొంతలో - కొంతైనా ఈ మార్గం ఉపయోగపడుతుందేమో నన్న ఆలోచన చేయడం మంచిదే మో!


Thursday, May 26, 2011

అయోమయం-అస్తవ్యస్తం-గందరగోళం:వనం జ్వాలా నరసింహారావు

అక్కడ పునరంకితం... ఇక్కడ దినదిన గండం

(సూర్య దిన పత్రిక:27-05-2011)

వనం జ్వాలా నరసింహారావు

కేంద్రంలో తొలి మలి విడతలు కలిపి ఏడేళ్లు; రాష్ట్రంలో సీఎంలు మారినా కాంగ్రెస్‌ దే పెత్తనం; అక్కడా, ఇక్కడా అధినేత్రే కీలకం; సమస్యల పరిష్కారంలో వైఫల్యమా, సాఫల్యమా?; అవినీతి విషయంలో ప్రజల ఆందోళన; ఇక్కడ పోగ్రెస్‌ రిపోర్టులూ లేవు, పునరంకితాలూ లేవు!; అంతా అయోమయం, అస్తవ్యస్తం, గందరగోళం!

అక్కడ, కేంద్రంలో మన్మోహన్ సింగ్ సారధ్యంలోని "యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ ఎలైన్స్" (యుపిఎ) తొలి-మలి విడతలు కలిపి అధికారంలో కొచ్చి ఏడేళ్లు, ఒక్క మలివిడత అధికారంలో కొచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి. ఇక ఇక్కడ, ఆంధ్ర ప్రదేశ్ లో, పదేళ్ల విరామం అనంతరం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004 ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ, తొలి విడత పూర్తి కాలం-మలివిడత నాలుగు నెలలు ఆయనే ముఖ్య మంత్రిగా, ఆయన మరణానంతరం రోశయ్య కొన్నాళ్లు-ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత ముఖ్య మంత్రిగా, అధికారంలో కొచ్చి కూడా ఏడేళ్లు పూర్తయ్యాయి. కేంద్రంలో వున్నది, విభిన్న విధానాలను పాటించే "పలు భాగస్వామ్య రాజకీయ పక్షాల సంకీర్ణ ప్రభుత్వం" కాగా, రాష్ట్రంలో వున్నది విరుద్ధ భావాల-వ్యక్తిగత ఎజెండాల-ఎత్తులకు పైఎత్తులు వేయగల సామర్థ్యం గల "ఏక పార్టీకి (కాంగ్రెస్) చెందిన సంకీర్ణ ప్రభుత్వం". అక్కడ అధికార బాధ్యతలు వహించేది ప్రధాన మంత్రి మన్మోహన్ సింగే ఐనా, అధికారం చెలాయించేది యుపిఎ చైర్ పర్సన్-అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధి. ఇక్కడ, రాజశేఖర రెడ్డి వున్న రోజుల్లో కొద్ది మోతాదులో, రోశయ్య గారి హయాంలో తగు మోతాదులో, ప్రస్తుతం పూర్తి మోతాదులో, ఎవరు ముఖ్యమంత్రైనా అధికారం పరోక్షంగా నడిపించేది, సోనియా నాయకత్వంలోని అధిష్ఠానం. ఈ నేపధ్యంలో, ఎన్నికల వాగ్దానాలైనా, కనీస ఉమ్మడి ప్రణాళికలో పేర్కొన బడిన అంశమైనా, అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనైనా, అమలైనా, పాలనా యంత్రాంగంపై పట్టు సాధించడమైనా, అవినీతిని అరికట్టడమైనా-ప్రోత్సహించడమైనా, పదవుల పందేరమైనా, పార్టీని-పభుత్వాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడమైనా, "భావ సారూప్యం-పరస్పర విరోధ భావం" ప్రాతిపదికగా రాజకీయాలు నడుపుతున్న వ్యక్తులపైనే ఆధార పడివుంటుంది. అదే జరుగుతున్నదిప్పుడు.

కేంద్ర ప్రభుత్వ సాఫల్యాలపై ప్రధాని మన్మోహన్ ఏటేటా విడుదల చేసే "ప్రోగ్రెస్ రిపోర్టు" ఈ ఏడాది కూడా విడుదలైంది. తాము రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది పాలనలోని విజయాలను గత ఏడాది విడుదల చేసిన రిపోర్టులో ఆయన ప్రస్తావించారు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోవడంలో తమ సర్కారు విజయం సాధించిందని అప్పట్లో ప్రధాని తెలిపారు. గడిచిన సంవత్సరం 8.5 శాతం వార్షిక వృద్ధిరేటు సాధిస్తామన్న ధీమాను ఆయన అప్పట్లో వ్యక్తం చేశారు. ఇరుగు, పొరుగు దేశాలతో సత్సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో ముందంజలో ఉన్నామన్నారు. నక్సల్స్ సమస్య తమ ముందున్న ప్రధాన అడ్డంకిగా ఆయన తెలిపారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అయన గత ఏడాది చెప్పిన వాటిలో చేసినవి కొన్ని, చేయలేనివి మరి కొన్ని వున్నాయి. ప్రజల విశ్వాసాన్ని మరింతగా పొందే దిశగా, రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలోను, కేంద్ర మంత్రి వర్గంలోని కొందరు మంత్రుల సఫలతలను-విఫలతలను విశ్లేషించి చూపుతూ, యుపిఎ-2, మరో మారు ప్రోగ్రెస్ రిపోర్టు కార్డు విడుదల చేసింది. అవినీతి, ద్రవ్యోల్బణం, సంకీర్ణ కష్టాలు, ఆహార ధాన్యాల ధరల పెరుగుదల ప్రభుత్వాన్ని బాధిస్తున్న అంశాల్లో ముఖ్యమైనవిగా నివేదికలో పొందుపరచడం గమనిస్తే, వాటిని ఎదుర్కోవడంలో నాయకత్వం కొంత మేరకు విఫలమైన ట్లుగా భావించాల్సి వస్తుంది. ప్రధాని మన్మోహనే అయినప్పటికీ, ఆయన విడుదల చేసే రిపోర్టును మొదట యుపిఎ రధ సారధి, కాంగ్రెస్ అధినాయకి సోనియా గాంధీకి చూపి మరీ బహిర్గతం చేశారు ప్రధాని. ప్రభుత్వ విజయాలను గురించి విపులంగా పేర్కొన్నారు కూడా.

రిపోర్టులో ఏముందనేదాని కంటే, తాము చేసిందే దో చెప్పే ప్రయత్నమై తే చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రం విషయానికొస్తే, రాజశేఖర రెడ్డి హయాంలో, ఏటేటా, ఆయన ముఖ్య మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజున, "పునరంకిత సభలు" జరిగేవి. ఆ సందర్భంలో, తమ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో చేసినా వాగ్దానాల అమలులో, ఎలా వడి-వడిగా అడుగులు వేసుకుంటూ పోయింది సవివరంగా-సభా ముఖంగా, అఖిల భారత స్థాయి-రాష్ట్ర స్థాయి అతిరధ-మహారధ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి ప్రజలకు తెలియ చేసేవారు. ఆయన చేపట్టిన జలయజ్ఞం, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం లాంటివి ఎలా అమలవుతున్నాయో సగర్వంగా, బహిరంగసభ జరిపి చెప్పేవారు. ఆ పథకాల అమలులో జరుగుతున్నాయని భావించిన లోటుపాటులను కూడా ప్రజలు మరిచిపోయేలా, ఆయన వివరించేవారు. రెండో మారు ఆయన గెలిచి, ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలలలోపే విమాన ప్రమాదంలో మరణించడంతో, ఆ మరుసటి ఏడాది పునరంకిత సభ జరగనట్లే. రెండేళ్ల క్రితం రాజశేఖర రెడ్డి నాయకత్వంలో, మే నెల 20, 2009 న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైందన్న సంగతే ఎవరికీ గుర్తున్న దాఖలాలు లేవు. పునరంకిత సభ దేవుడెరుగు! రాజశేఖర రెడ్డి రెండో విడత ప్రమాణ స్వీకారం చేసిన తేదీ కూడా ఆయనకు అత్యంత సన్నిహితులుగా చెప్పుకుంటూన్న వారికి సహితం గుర్తుకు రాలేదు. అంతెందుకు...ఆయన వారసులమని చెప్పుకుంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులకు కూడా గుర్తున్నట్లు లేదు. ప్రభుత్వం పునరంకిత సభలు జరపక పోయినా "రాజశేఖర రెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని" పడగొట్టడం ఇష్ఠంలేని వారన్నా కనీసం మరో విధంగా నన్నా పునరంకితమై తే బాగుండేదేమో!

అసలు అక్కడా-ఇక్కడా (అటు కేంద్రం లోను, ఇటు రాష్ట్రం లోను) ఏం జరుగుతోందని నిశితంగా పరిశీలిస్తే, ఏదన్నా కనీసం జరుగుతోందా? అన్న అనుమానం వేస్తోంది. మన్మోహన్ సింగ్ నీతికి-నిజాయితీకి మారు పెరే కావచ్చు. ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడో-బాధ్యుడో కావచ్చు. సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడే కావచ్చు. మంత్రి మండలి సభ్యులందరి మన్ననలను పొందుతుండవచ్చు. దేశ-విదేశాల్లో తనకూ-భారత దేశానికీ పేరు-ప్రతిష్టలు తెచ్చి పెడుతున్నాడన్న గుర్తింపు పొందివుండవచ్చు. ఇవేవీ, సామాన్యులకు పట్టదు. అందునా మధ్య తరగతి ప్రజానీకానికి అసలే అవసరం లేదు. వాళ్ల దృష్టంతా, అతి తక్కువ సమస్యలతో, ఎలా జీవన యానం సాగించాలన్న అంశంపైనే. ఆ అంశానికి సరాసరి సంబంధమున్న, ప్రభుత్వంలోని అన్ని స్థాయిలలోని అధికార-అనధికార వ్యక్తుల్లో పేరుకుని-కూరుకుపోయిన అవినీతి అనే బ్రహ్మ పదార్థం గురించి మన్మోహన్ ఏం చేశాడన్నది వారి ముందున్న ప్రశ్న. రాజా టెలికాం స్కాం, సురేష్ కల్మాడి కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో పాల్పడిన అంతులేని అవినీతి లాంటి అంశాలు సామాన్యుడి మదిని అహర్నిశలు తొలి చేస్తుంటాయి. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతుంటే, నిత్యావసర వస్తువుల దరలు ధనవంతుడికి కూడా అందుబాటులోకి లేనంత ఘోరంగా పెరిగి పోతుంటే, తమ దగ్గర పన్నుల రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తున్న పైకం బాహాటంగా అవినీతి చక్రవర్తులు స్వాహా చేస్తుంటే, నిశ్శబ్దంగా-నిబ్బరంగా గమనించడం తప్ప చేయగలిగిందేమీ లేదన్న భావన ప్రజల్లో కలగడాన్ని, మన్మోహన్ రిపోర్టులో ఏ విధంగా వివరించబడిందో అర్థం కావడం లేదు. అహర్నిశలు భాగస్వామ్య పక్షాలను ఎలా మంచి చేసుకోవాలన్న తపన, మంచి చేసుకోక పోతే ప్రభుత్వం మనుగడ వుండదేమోనన్న ఆందోళనతో కాలం గడుపుతున్నదేమో కేంద్ర ప్రభుత్వం అన్న భావన పలువురి లో కలగడంలో తప్పులేదే మో!

ఇక మన రాష్ట్రం విషయానికొస్తే అంతా అయోమయం, అస్తవ్యస్తం, గందరగోళం! రాజశేఖర రెడ్డి అకాల మరణం రాష్ట్ర రాజకీయాలలో-అందునా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో అంతుచిక్కని శూన్యాన్ని తెచ్చి పెట్టింది. ఆయన బ్రతికున్నంత కాలం ఆయనతో ఎట్లా వేగాలో-ఆయన్నెట్లా అదుపుచేయాలా అని ఆలోచించిన కాంగ్రెస్ అఖిల భారత స్థాయి అధినాయకత్వం, ఆయన మరణానంతరం, ఆయనకు ధీటైన వారసులెవరో తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయింది. ఆయన ప్రారంభించిన పథకాలకు నిధులెలా సమకూర్చాలో అని మధన పడిన అలనాటి ఆర్థిక మంత్రి రోశయ్య, ముఖ్య మంత్రయ్యాక, ఆ పథకాలను ఎలా ఊడగొట్టాలో అన్న ఆలోచనలో పడిపోయారు. ఆయన తర్వాత ముఖ్య మంత్రిగా అధిష్టానం ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుల మద్దతు కూడగట్టడంలోనే సమయమంతా గడిచిపోతుంది. మరో వైపు అధికార యత్రాంగం ఎవరికివారే యమునాతీరే అన్న చందాన వ్యవహరిస్తున్నారు. ఏ పథకం అమలు చేస్తే ప్రజలకు మేలు కలుగుతుందో, ఏ పథకం అమలు చేస్తే ప్రజాభిమానాన్ని చూరగొనొచ్చో, అన్న విషయం మంత్రులకు తెలియదు. తెలియ చేయాల్సిన అధికారులకు ఆ సంగతే పట్టదు. పట్టించుకున్న ఒకరిద్దరు అధికారులకు సముచితమైన గుర్తింపు వుండదు. అందుకే ఇక్కడ ప్రోగ్రెస్ రిపోర్టులు లేవు. పునరంకితం ప్రస్తావనే లేదు.

ఇవన్నీ ఇలా వుంటే, తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యం ప్రత్యేక రాష్ట్ర సాధన తప్ప మరేదీ కానందున, అన్ని పార్టీల వారికి చెందిన వారిలో వీలున్నంత మందిని, తమ వైపు ఆకర్షించుకునే కార్యక్రమంలో వారు నిమగ్నమై వున్నారు. సోనియా గాంధీని ఎదుర్కుని కడపలో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా విజయ భేరీకి కాచుక్కూచున్నారు. తమ పార్టీలో వున్న వారు తెలంగాణ పేరు మీదో-మరే కారణానో పార్టీ వదిలి పోకుండా జాగ్రత్త పడుతూ, రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలలో ఆధిక్యాన్ని పెంచుకునే పనిలో టీడీపి వుంది. అధికారం ఎట్టి పరిస్థితుల్లోను కోల్ఫొకుండా, తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరకుండా వేయాల్సి నన్ని ఎత్తులు వేసే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బిజీగా వుంది. ఇక బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతరులు ఇవేవీ తమకు పట్టనట్లు, వారి సహజ ధోరణిలో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టే ప్రయత్నంలో వారున్నారు.

ప్రజలకు మాత్రం అంతా అయోమయం-అంతా అస్తవ్యస్తం-అంతా గందరగోళం గా కనపడుతున్నవి!

Saturday, May 21, 2011

యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలు:వనం జ్వాలా నరసింహారావు

సాఫల్యాలతో సార్థక పాలన

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర జ్యోతి దిన పత్రిక (24-05-2011)


డాక్టర్ మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యుపిఎ ప్రభుత్వం రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చి మే 22వ తేదీ నాటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి ఏడేళ్లయింది. భారత దేశ చరిత్రలో, స్వాతంత్ర్యం వచ్చిన సుమారు ముప్పై సంవత్సరాల అనంతరం, అలనాటి జనతా పార్టీ సారధ్యంలో, ప్రప్రధమంగా కాంగ్రేసేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటైంది. ఆ తర్వాత, ఓటమి పాలైన రెండున్నర ఏళ్లకే, అదే పూర్వ శోభతో కాంగ్రెస్ పార్టీని, మళ్లీ అధికారంలోకి తెచ్చిన ఘనత ఇందిరా గాంధీకి దక్కింది. ఆమె హత్యానంతరం, రికార్డు స్థాయిలో, అత్యంత భారీ మెజారిటీతో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చింది రాజీవ్ గాంధి. తదనంతరం సంభవించిన-సంభవిస్తూ వస్తున్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో, అధికారం చేపట్తున్నది సంకీర్ణ ప్రభుత్వాలే కాని, ఏ ఒక్క రాజకీయ పార్టీ పూర్తి మెజారిటీ సాధించి మాత్రం కాదు. రాజీవ్ హత్యానంతరం ప్రధానైన పీవీ నరసింహారావు సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీకి తొలుత లోక్ సభలో మెజారిటీ లేదు. అలానే ఆయన తర్వాత ప్రధానైన వాజ్ పాయే సారధ్యంలోని బీజేపీకి సొంత మెజారిటీ లేదు. కేంద్రంలో అధికారం దరిదాపుల్లోకి కూడా కాంగ్రెస్ పార్టీ చేరుకోలేని పరిస్థితుల్లో, పీవీ-కేసరిల తర్వాత, పార్టీ పగ్గాలను చేపట్టిన సోనియా గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయ పరంపర 2004 లో ప్రారంభమైంది. రాజీవ్ హత్యానంతరం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత బాధ్యతలు చేపట్టడానికి ఇష్టపడని సోనియా గాంధీ 1996 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సంభవించిన పరాజయం తర్వాత, పీవీ వారసుడు కేసరి పార్టీకి న్యాయం చేకూర్చలేడని భావించి పదవి స్వీకరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో లోక్ సభలో పార్టీ బలాన్ని పెంచగలిగినా, ఎన్డీయే అధికారంలోకి రాకుండా చేయలేకపోయింది కాంగ్రెస్.

ఆ నేపధ్యంలో 2004 లో జరిగిన ఎన్నికలలో 145 స్థానాలు గెలిచి, తన ప్రత్యర్థి ఎన్డీయేకు ప్రభుత్వం ఏర్పాటుచేసే సంఖ్యాబలం లేదని తేలిన తర్వాత, "యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ ఎలైన్స్" ఏర్పాటు చేసింది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి 2004 ఎన్నికలలో ఎన్డీయే పక్షాన లోక్ సభకు గెలిచింది 169 మంది సభ్యులు మాత్రమే. కాంగ్రెస్ పార్టీ, తన సభ్యులతో సహా-తన ఆలోచనా ధోరణికి దగ్గర లో వున్న, వివిధ పార్టీల నుంచి లోక్ సభకు గెలుపొందిన, 222 మందితో 59 మంది సభ్యుల వామ పక్ష కూటమిని కలుపుకుని తొలి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. "కామన్ మినిమమ్ ప్రోగ్రాం" పేరుతో, సంకీర్ణ భాగస్వామ్య పార్టీలందరికీ ఆమోద యోగ్యమైన ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది యూపీఏ.

వామ పక్షాలు ఒకానొక సందర్భంలో మద్దతు ఉపసంహరించుకున్న సమయంలో, సమాజ్ వాది పార్టీ, బహు జన సమాజ్ పార్టీలు సమయానుకూలంగా మద్దతిచ్చి యూపీఏ ప్రభుత్వం పడిపోకుండా కాపాడాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి, యూపీఏ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టి, తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగును యూపీఏ పక్షాన ప్రధాన మంత్రిగా ప్రతిపాదించారు. పదమూడవ భారత ప్రధానిగా 2004 లో బాధ్యతలు స్వీకరించిన మన్మోహన్ సింగ్ సారధ్యంలోని తొలి యూపీఏ ప్రభుత్వం సాధించిన సాఫల్యాలు, ఐదేళ్ల అనంతరం 2009 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, తిరిగి యూపీఏ ను అధికారంలోకి వచ్చేందుకు దోహద పడ్డాయి. 2004 ఎన్నికల అనంతరం ఏర్పాటైన "యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ ఎలైన్స్" భాగస్వామ్య పక్షాలు, ఈ సారి 2009 లో జరిగిన ఎన్నికలలో, ఉమ్మడిగా పోటీ చేసి, సంఖ్యా పరంగా తమ బలాన్ని పెంచుకుని, గతంలో కంటే, 61 స్థానాలను అధికంగా గెలుచుకుని, మొత్తం 262 సభ్యుల బలీయమైన కూటమిగా విజయ పథాన నిలిచింది. భారత దేశంలో, జవహర్లాల్ నెహ్రూ తర్వాత, ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మరో మారు ప్రధాని కాగలిగిన రెండో వ్యక్తిగా మన్మోహన్ సింగ్ రికార్డు సాధించారు. మే నెల 22, 2009 న, సరిగ్గా రెండేళ్ల క్రితం, రెండవ పర్యాయం ప్రధాన మంత్రిగా, యూపీయే ప్రభుత్వ సారధిగా, బాధ్యతలు చేపట్టారు. సుస్థిర ప్రభుత్వానికి బాటలు మరో మారు వేశారాయన.

మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వం తొలి విడత అధికారంలో వున్న మొదటి ఐదేళ్ళలో, పాలనా పరమైన సంస్కరణలు, సమాచార హక్కు చట్టం, పనికి ఆహార పథకం లాంటివి ప్రవేశ పెట్టి తన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చి పెట్టారు. ఐనా, ఏ నాడు, తన ప్రభుత్వం సాధించిన దాన్ని, అతిగా చెప్పే ప్రయత్నం చేయలేదు. అలానే, రెండో విడత అధికారం చేపట్టి ఏడాది నిండిన సందర్భంగా, ప్రభుత్వం సాధించిన విజయాలను, తక్కువ చేసి చూపుతూ, చేయాల్సింది ఇంక ఎంతో ఉందన్నారు. "సముచితమైన సాఫల్యాలను" సాధించిందని మాత్రమే అన్నారు ప్రధాని. తాను సాధించ దల్చుకున్నది ఎంతో మిగిలి పోయిందని, తన సాఫల్యాలను చారిత్రక కారులు ఎప్పుడో ఒకప్పుడు సరైన రీతిలో అంచనా వేస్తారని కూడా అన్నారాయన.

మన్మోహన్ సింగ్ ఎంత సవినయంగా తన ప్రభుత్వం గురించి అన్నప్పటికీ, యూపీఏ ప్రభుత్వం సాధించిన విజయాలను తక్కువ అంచనా వేయలేం. విదేశాంగ విధాన కానీయండి, ఆర్థిక పరమైన నిర్ణయాలు కానీయండి, ఇరుగు-పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పే విషయమే కానీయండి, ఒక్కొక్క దానికి మన్మోహన్ ప్రభుత్వం ఒక్కో రీతిలో ప్రగతి సాధించింది. యూపీఏ ప్రభుత్వం అన్ని వర్గాల వారి విషయంలో, సమతుల్యం పాటిస్తుందనడానికి నిదర్శనం తొలి విడత-మలి విడతలలో ఏర్పాటు చేసిన "జాతీయ సమైక్యతా మండలి". అందులోని సభ్యుల జాబితా చూస్తే, రాజకీయాలకతీతంగా, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న దేశంలో, అలాంటి కమిటీలను ఏర్పాటు చేయగలమన్న భరోసా ఇవ్వగలిగింది మన్మోహన్ ప్రభుత్వం.

గ్రామీణ ఉపాధి హామీ పథకం, పట్టణ పునరుద్ధరణ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, భారత్ నిర్మాణ్ యోజన, ఆం ఆద్మీ ఆలోచన లాంటి పలు పథకాలకు యూపీఏ ప్రభుత్వం రూప కల్పన చేసింది-అమలు పరిచింది. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో పని చేసిన నాటి ఆర్థిక సంస్కరణలను, మారుతున్న సామాజిక-రాజకీయ-ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొనసాగించడం యూపీఏ విజయాలలో ఒకటి. ఆ మాటకొస్తే, పీవీ మంత్రివర్గంలో మన్మోహన్ నాటిన ఆర్థిక సంస్కరణల విత్తనాలు, మొక్కలై-వృక్షాలై, యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కొట్టు మిట్టాడుతున్న సమయంలో భారతావనికి ఆ ప్రభావం పడకుండా చూడడానికి, యూపీఏకు ముందున్న ఎన్డీఏ సారధి వాజ్ పాయే కూడా కారణమనాలి. ప్రపంచం దృష్టిలో ఆర్థిక పరంగా రెండు దశాబ్దాల క్రితం భారత దేశంపై నున్న చులకన భావన స్థానంలో, అత్యంత గౌరవ స్థానం లభించడానికి కూడా మన్మోహన్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వమే కారణం. అలానే ప్రపంచ వర్తక-వాణిజ్య రంగంలో కూడా చక్కటి పురోగతి సాధించింది గత ఏడాది-రెండేళ్లలో. స్టాక్ మార్కెట్ పతనం దరిమిలా, దాని దుష్ప్రభావం ఏ మాత్రం మన ఆర్థిక వ్యవస్థపై పడకుండా కాపాడిందీ ప్రభుత్వం.

మన్మోహన్ సింగ్ సారధ్యంలోని ప్రభుత్వం సాధించిన విజయాలను-సాధించలేక పోయిన వాటిని గురించి ప్రతి పక్షాలు వెలిబుచ్చిన అభిప్రాయాలను, సరైన రీతిలో అర్థం చేసుకోవాలంటే, బహుశా, రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల సభ్యులనుద్దేశించి, ఈ ఏడాది బడ్జెట్ సమావేశాలలో చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశ పెట్తూ, ప్రధాని చేసిన ప్రసంగంలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడమే. అలాగే విజయాలను-అపజయాలను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక విషయం గుర్తుంచుకోక తప్పదు. ఇదొక సంకీర్ణ ప్రభుత్వం. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని ఇచ్చి ఓటర్లు గెలిపించ తల్చుకోనప్పుడు, సంకీర్ణాలు తప్పవు. సంకీర్ణ ధర్మానికి అనుగుణంగానే, మంత్రివర్గ ఏర్పాటుతో సహా, అభివృద్ధి-సంక్షేమ కార్య క్రమాల రూపకల్పన అమలు కూడా వుండి తీరుతుంది. ఇక అంతర్జాతీయ రంగానికి వస్తే, క్షణ క్షణానికి, మన దేశంలో జరుగుతున్న మార్పులతో సంబంధం లేకుండా, అంతో-ఇంతో గత ఎన్డీయే హయాంలో కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం కాకుండా, నిర్ణయాలు తీసుకోక తప్పదు. మన్మోహన్ సింగ్ కూడా అలానే చేస్తున్నారనాలి.

రాష్ట్రపతి ప్రసంగంలో లేవనెత్తిన అంశాలను-ప్రతిపక్ష నాయకుల విమర్శలకు అనుసంధానం చేస్తూ, తన ప్రభుత్వం సాధించిన ప్రగతిని, పరోక్షంగా, భవిష్యత్ లో యూపీఏ చేయబోతున్న వాటితో కలిపి చెప్పారు మన్మోహన్ సింగ్. సామాన్యులు-సగటు మనిషి, అధిక ధరల తాకిడి తట్టుకోడానికి ద్రవ్యోల్బణం అదుపులోకి తేవడం, ప్రజా జీవితంలో సత్య నిష్టను-న్యాయ బుద్ధిని ప్రోత్సహించడం, బీద-సాద-పేద-బలహీన-వెనుకబడిన వర్గాల వారికి అభివృద్ధిలో తమ వంతు వాటా పొందేలా ఆర్థికాభి వృద్ధి సాధించడం, దేశ సమగ్రత-సమైక్యత విషయంలో అప్రమత్తంగా వుండడం, అంతర్జాతీయ స్థాయిలో భారత జాతి గొంతు గట్టిగా వినిపించేలా విదేశాంగ విధానం రూపొందించడం యూపీయే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా తమ ప్రభుత్వం, తొలి విడత-మలి విడతలలో సాఫల్యం సాధించిందని మన్మోహన్ సింగ్ అన్నారు. ఆయన మాటల్లోనే, యూపీఏ సాధించిన ప్రగతిని అవగాహన చేసుకోవచ్చు.

అన్నీ విజయాలేనా అంటే, అక్కడక్కడ, అపజయాలు లేకుండా పోలేదు. దానికి ప్రకృతిది కొంత బాధ్యత అనుకుంటే, మానవ తప్పిదాలు మరికొంత దోహద పడ్డాయి. కరువు-కాటకాలు ద్రవ్యోల్బణానికి దారితీస్తే, నిబద్ధత లేని భాగస్వామ్య పక్షాలకు చెందిన కొందరు, అవినీతికి అంకితమై పోయి, వారికి-యూపీఏ ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారు. ఫలితం అనుభవిస్తున్నారు కూడా. అలానే చమురు ధరల పెంపుదల. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం మన దేశంపై పడింది. నిత్యావసర వస్తువైన గాస్ మినహా మిగిలిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంచనాలకు మించి పెరగడం ఒక అపజయంగా అనుకోవచ్చేమో! చమరు ధరల పెరుగుదల నిత్యావసర వస్తువులపై కూడా పడింది.

పౌర పంపిణీ వ్యవస్థను ఎంత పటిష్ట పరిచినా ఇంకా చేయాల్సింది చాలా వుంది. జాతీయ ఆరోగ్య బధ్రతా బిల్లు దీని కొరకే తెచ్చే ఆలోచనలో వుంది యూపీఏ ప్రభుత్వం. టెలికాం స్కాం యూపీఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది కొంతవరకు. అలానే, అత్యంత వైభవంగా-అంగరంగ వైభోగంగా జరిగిన కామన్వెల్త్ క్రీడలలో కూడా కొంత అపశృతి చోటు చేసుకుంది. భారత దేశానికి మున్నెన్నడూ లభించని విధంగా బంగారు-రజత-కాంస్య పతకాలు లభించాయి. అవినీతిని అరికట్టాలన్న ధృఢ సంకల్పంతో పనిచేస్తున్న యూపీఏ ప్రభుత్వం, టెలికాం, కామన్వెల్త్ క్రీడల స్కాంలను సీబీఐకి అప్ప చెప్పి తన చిత్త శుద్ధిని తెలియ చేసుకుంది.

సంకీర్ణ ధర్మం అడపదడప యూపీఏ ప్రభుత్వాన్ని ఊగిసలాటలో పడ వేసినప్పటికీ, మొదటి విడత లాగానే, గత రెండేళ్లలో గణనీయమైన సాఫల్యాలను సాధించిందనడంలో అతిశయోక్తి లేదనొచ్చు. యూపీఏ విజయాల వెనుక ప్రధాని మన్మోహన్ సింగ్, చైర్ పర్సన్ సోనియా గాంధి, సంకీర్ణ భాగస్వామ్య పక్షాల నాయకులు, బాధ్యతాయుతమైన ప్రతి పక్షాలున్నాయని చెప్పాలి.