Showing posts with label రాజీవ్ గాంధి. Show all posts
Showing posts with label రాజీవ్ గాంధి. Show all posts

Sunday, August 5, 2012

సిద్ధాంతాలతో సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ ముఠా రాజకీయం: వనం జ్వాలా నరసింహారావు


సిద్ధాంతాలతో సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ ముఠా రాజకీయం
వనం జ్వాలా నరసింహారావు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ సోనియా గాంధీతో సమావేశమైనట్లు, రాజీ మార్గం గురించి చర్చించినట్లు మీడియాలో కధనాలొచ్చాయి. ఆ వార్తల్లో వాస్తవం లేదని వైఎస్సార్సీపి నేతలు ఖండించడం కూడా జరిగింది. కలవడం, కలవకపోవడం అటుంచి, రాజీ మార్గం ఎంచుకోవడంలో మాత్రం తప్పేంటి? జగన్మోహన్ రెడ్డికి ముందర ఎంతమంది కాంగ్రెస్ పార్టీని వీడి పోలేదు? ఎంతమంది వారిలో స్వగృహ ప్రవేశం చేయలేదు? ఇతర పార్టీలలో వుంటూ ఎంతమంది కాంగ్రెస్‌ను అనరాని మాటలని, ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరి ప్రధాన భూమిక పోషించడం లేదు? అదే విధంగా భవిష్యత్‍లో జగన్మోహన్ రెడ్డి చేసే అవకాశాలు లేవని ఎందుకు భావించాలి? ఎందుకు ఆ పార్టీ వారు భుజం తడుముకోవాలి? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి, అందులోకి రావాలని అనుకునేవారికి మామూలే!

స్వాతంత్రోద్యమం నాటి భారత జాతీయ కాంగ్రెస్ కు ఇప్పటి కాంగ్రెస్ (ఐ) కు పోలికే లేదనాలి. అలనాటి కాంగ్రెస్‌లో అభిప్రాయ భేదాలకు, మైనారిటీ వ్యక్తుల సూచనలకు గౌరవం లభించేది. ఇక ఇప్పుడో, అధిక సంఖ్యాకుల మద్దతున్న వారిని, ప్రజా బలం వున్న వారిని, అధిక సంఖ్యాకుల ప్రజా ప్రతినిధుల ఆదరణ వున్న వారిని, ఏదో ఒక నెపంతో, పార్టీ దూరం చేసుకుంటున్నది. ఒక నాడు పార్టీ అనుసరించిన మద్యే మార్గం, అతివాద-మితవాద శక్తులను కలుపుకుని పార్టీని పటిష్టం చేయడమైతే, ఈ నాటి మద్యే మార్గం, భిన్నాభిప్రాయాలను వెల్లడించమని పరోక్షంగా అధిష్టానం ప్రోత్సహించడమే. అధిష్టానంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, అధినేత్రి దగ్గర పలుకుబడిని సంపాదించుకునేందుకు, ప్రత్యక్షంగానో-పరోక్షంగానో ప్రతి రాష్ట్రంలోని, సమ్మతి-అసమ్మతి వాదులను పురికొల్పడం ఈ నాటి మద్యే మార్గం. కింది స్థాయినుంచి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని వారిని, స్థానికంగా ప్రజల మద్దతు లేని వారిని, పోటీ చేసి గెలవలేని వారిని, అధిష్టానం దగ్గర చెవులు కొరుకుతూ తిరిగే వారిని చేర దీయడం పార్టీకి అలవాటుగా మారింది. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర పోషించి, అన్నీ అనుభవించి, అక్కడ తమ అవసరాలన్నీ తీర్చుకుని, అక్కడ వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తూలనాడిన వారంతా పార్టీలో ప్రముఖులవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అంటూ గొంతు చించుకుంటున్న వారంతా, ఎప్పుడో ఒకప్పుడు పార్టీని దుయ్యబట్టిన వారో, ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారో కావడం విశేషం.

ఉదాహరణకు, ఈ నాడు కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన పదవిలో వున్న జైపాల్ రెడ్డి, రాజీవ్ గాంధిని, ఎన్ని రకాల దూషించడానికి వీలుందో అన్ని రకాలుగా, బోఫోర్స్-ఫెయిర్‌ ఫాక్స్ విషయాల్లో, దూషించారు. జనతా పార్టీనుంచి గెలిచి కేంద్రంలో మంత్రి పదవిని అనుభవించారు. మరిప్పుడాయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి. సాక్షాత్తు ఇందిరా గాంధి మీద ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వీరేంద్ర పాటిల్, కాంగ్రెస్ (ఐ) లో చేరి తన స్థానాన్ని బల పర్చుకోలేదా ? స్వర్గీయ పర్వత నేని ఉపేంద్ర మాటేంటి? ఈ నాడు సోనియాకు అతి సన్నిహితురాలిగా చెప్పుకుంటున్న రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంగతేంటి? తెలంగాణ ప్రజా సమితి పేరుతో కాంగ్రెస్ ను ధిక్కరించి, ఎన్నికల్లో పోటీ చేసి, పది మందికి పైగా అభ్యర్థులను పార్లమెంటుకు గెలిపించుకున్న స్వర్గీయ మర్రి చెన్నా రెడ్డిని అధిష్టానం ఏం చేయ గలిగింది. ఒక్క సారి కాదు ... కనీసం మూడు సార్లు ఆయన అధిష్టానాన్ని ధిక్కరించారు. ఇంతెందుకు.. ఎన్నికలు జరిగిన ప్రతి సారి, టికెట్ దొరకని పలువురు నేతలు, ఇండిపెండెంటుగా పోటీ చేయడం, ఆరేళ్లు బహిష్కరించ బడడం, స్వగృహ ప్రవేశం చేయడం, లోగడ కంటే, మంచి పదవులు పొందడం తెలిసిన విషయమే. జగ్జీవన్ రాం, ఎన్డీ తివారి, అర్జున్ సింగ్‌లను కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయగలిగింది ? ఇవ్వాళ శరద్ పవార్ లేకపోతే భారత జాతీయ కాంగ్రెస్ మనుగడే లేదు. మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌ను కాదనే ధైర్యం సోనియా గాంధీకి వుందా? తమిళ నాడులో పీవీ నరసింహా రావు పొత్తుల నిర్ణయానికి వ్యతిరేకంగా "తమిళ మానిల కాంగ్రెస్" ను స్థాపించి, పార్లమెంటుకు ఎన్నికై, కాంగ్రేసేతర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిత్వ శాఖను నిర్వహించిన చిదంబరం కాంగ్రెస్ క్రమ శిక్షణకు లోబడినట్లా ? కాదా?




కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపోవడం, స్వగృహ ప్రవేశం చేయడం, గతంలో కంటే ప్రాధాన్యత సంపాదించుకోవడం లాంటివి ఆది నుంచీ జరుగుతున్నదే. బాల గంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలే, విభేదించినప్పటికీ దూషించుకోలేదు. గాంధీజీ నాయకత్వంలో యువకులైన నెహ్రూ, బోసులకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినప్పటికీ, బోసు ధిక్కార ధోరణి గాంధీకి నచ్చలేదు. తనకిష్టమైన జవహర్లాల్ నెహ్రూను, స్వతంత్రం రాకమునుపు ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వానికి సారధిని చేసేందుకు, అబుల్ కలాం ఆజాద్‌తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నెహ్రూ వ్యవహరించేందుకు తోడ్పడ్డారు గాంధీజీ. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినంతవరకు, రాగ ద్వేషాలకు, మహాత్ముడంతటి వాడే అతీతం కాదని అనుకోవడానికి నిదర్శనంగా భవిష్యత్‍లో వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యే అవకాశాలను కూడా పరోక్షంగా దెబ్బ తీశారు గాంధీజీ. మధ్యంతర ప్రభుత్వంలో తనకిష్టమైన విదేశాంగ శాఖను నెహ్రూ వుంచుకుని, హోం శాఖను పటేల్‌కు కేటాయించడంతో తనకు తెలియకుండానే, భవిష్యత్‍లో తన ప్రాబల్యం పెరిగేందుకు అవకాశం కలిపించుకున్నారు నెహ్రూ.

1948-1950 మధ్య కాలంలో హోమ్ మినిస్టర్ గా వున్న వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు అన్ని ప్రొవిన్షియల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పటేల్ మనుషులు ఎన్నికయ్యారు. ఈ లోపున రాజ్యాంగ శాసనసభకు సంబంధించి, సంస్థానాల విలీనం గురించి చర్చలు-చర్యలు మొదలయ్యాయి. జాతీయ గీతంగా “జనగణమణ..” వుండాలా, “వందేమాతరం...” వుండాలా? అన్న విషయంలోనూ కాంగ్రెస్ నాయకత్వంలో విభేదాలు చోటుచేసుకున్నాయి. 1948 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గెలిచిన పట్టాభి సీతారామయ్య, ఆ తర్వాత పురుషోత్తం దాస్ టాండన్ చేతిలో ఓటమి పాలయ్యారు. వారిలో మొదటి వారు నెహ్రూ బలపర్చిన వ్యక్తికాగా, టాండన్ పటేల్ పక్షం మనిషి. గాంధీజీ మరణానంతరం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా గవర్నర్ జనరల్ గా పనిచేసిన రాజగోపాలా చారికి నెహ్రూ మద్దతు లభించగా, పటేల్ మద్దతు వున్న రాజేంద్ర ప్రసాద్‌కు ఆ పీఠం దక్కింది. అవన్నీ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరాటాలే. అప్పట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులలో నెహ్రూ అనుచరులని, పటేల్ అనుచరులని వేర్వేరుగా సంబోధించేవారు. నీలం సంజీవరెడ్డి నెహ్రూ అనుకూలుడుగా, టంగుటూరు ప్రకాశం పంతులు ఆయనకు వ్యతిరేకిగా చెప్పుకునేవారు.

మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావులు ఒకటయ్యారు. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ ప్రవేశం చేసి, అదే సంజీవరెడ్డి ప్రోద్బలంతో తిరిగి ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. ఉప ముఖ్య మంత్రి పదవి దక్కించుకున్న నీలం సంజీవ రెడ్డి చక్రం తిప్పారు. కాంగ్రెస్‌ను వీడిన ఆయన ప్రత్యర్థి ఎన్జీ రంగా ఆ తరువాత స్వగృహ ప్రవేశం చేసి గుంటూరు లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. శాసన సభ సమావేశాలలో, మద్య నిషేధం సాకుగా ఓడిన ప్రకాశం రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. అవన్నీ ముఠా రాజకీయాలే. దరిమిలా, నీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1955 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడిగా నీలం-బెజవాడల మధ్య పోటీ వుండడంతో, అధిష్ఠానం బెజవాడ గోపాల రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకుని, పి డబ్ల్యు శాఖతో తృప్తి పడాల్సి వచ్చింది. మళ్ళీ ముఠా రాజకీయాలు మొదలయ్యాయి. గోపాలరెడ్డికి వ్యతిరేకంగా, కళా వెంకట్రావును, కల్లూరు చంద్రమౌళిని కలుపుకుని నీలం సంజీవరెడ్డి పనిచేయ సాగారు. అధిష్ఠానం దూతగా వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి వారి మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరించారు.

బెజవాడ గోపాలరెడ్డికి పోటీగా, కాసు బ్రహ్మానందరెడ్డిని ప్రోత్సహించిన నీలం సంజీవరెడ్డి, తమతో అల్లూరి సత్యనారాయణ రాజును కలుపుకున్నారు. 1956 లో విశాలాంధ్రగా “ఆంధ్ర ప్రదేశ్” రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం మరో మారు పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి-మర్రి చెన్నారెడ్డి మద్దతు బెజవాడకు, బూర్గుల-విబి రాజుల మద్దతు నీలంకు లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తన మంత్రివర్గంలోనే ఉప ముఖ్య మంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి కింద బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక శాఖను నిర్వహించాల్సి వచ్చింది. 1957 లో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. నీలం వర్గానికి అధిక స్థానాలు వచ్చాయి. తన స్థానాన్ని పదిలపర్చుకోసాగాడు. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు ప్రభృతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీని వదిలి, “డెమోక్రాటిక్ పార్టీ” ని స్థాపించారు. విజయవాడలో నిర్వహించిన ఆ పార్టీ మహాసభలో ప్రసంగించిన మర్రి చెన్నారెడ్డి “ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరడం కంటె, కృష్ణా నదిలో పడడం మంచిదని” అన్నారు. పార్టీ వదిలిన మర్రి చెన్నారెడ్డి అప్పుడే కాకుండా అలా మరి రెండు పర్యాయాలు వదలడం-స్వగృహ ప్రవేశం చేయడం, పదవులను అనుభవించడం అందరికీ తెలిసిందే.

నీలం సంజీవరెడ్డిని జాతీయ రాజకీయాల్లోకి లాగడమే మంచిదని భావించిన జవహర్లాల్ నెహ్రూ, పథకం ప్రకారం 1960 లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. సంజీవరెడ్డి స్థానంలో రాజీ అభ్యర్థిగా దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. తనను వ్యతిరేకించిన ఏసీ సుబ్బారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు సంజీవయ్య. ఏ కొద్దిమందో తప్ప, దాదాపు కాంగ్రెస్ పార్టీలోని హేమా-హేమీలందరు సంజీవయ్యను ధిక్కరించిన వారే ! ఐనా పార్టీలో కొనసాగారు. 1962 లో ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుని రావడం జరిగింది. ఆయన స్థానంలో సంజీవయ్యను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. ఎన్నికలనంతరం 1964 లో కర్నూల్ బస్సుల జాతీయం కేసులో రాజీనామా చేసేంతవరకు బలీయమైన నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి కొనసాగారు.

1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ముఠా రాజకీయాలకు తెర లేచింది. కాసుకు వ్యతిరేకంగా ఏసీ సుబ్బారెడ్డి అసంతృప్తి కాంగ్రెస్ వర్గానికి బాహాటంగానే నాయకత్వం వహించారు. కాసు వర్గాన్ని “మినిస్టీరియలిస్టులు” అని, ఏసీ వర్గాన్ని “డిసిడెంట్లు” అని పిలిచేవారు. మర్రి చెన్నారెడ్డి మద్దతు కాసు వర్గానికుండేది. 1967 లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలిచిన మర్రి చెన్నారెడ్డి ఎన్నికల కేసులో సభ్యత్వాన్ని కోల్పోవడమే కాకుండా, ఆరేళ్లు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడవడంతో, 1969 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టారు. కేంద్ర మంత్రివర్గంలో చేరిన నీలం సంజీవరెడ్డి, రాష్ట్ర రాజకీయాలలో తల దూర్చలేదు. చెన్నారెడ్డి ధిక్కార ధోరణి పుణ్యమా అని, కాసు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పీవీ నరసింహా రావు రావడం జరిగింది. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించి, తెలంగాణ ప్రజా సమితి పేరుమీద ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు చెన్నారెడ్డి బలపర్చిన అభ్యర్థులు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సస్పెన్షన్లకు లెక్కేలేదు. ముల్కీ కేసులో తీర్పుపై పీవీ వ్యాఖ్యలకు నిరసనగా తలెత్తిన ఉద్యమం ఫలితంగా ఆయన పదవి కోల్పోవడం, ఆయన స్థానంలో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా, అత్యంత సమర్థుడైన ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత కాలంలో, ఇందిర మంత్రివర్గంలో “ఎమర్జెన్సీ హోం మినిస్టర్” గా పనిచేసిన బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో, ఇందిరా కాంగ్రెస్ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్-ఐ) ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ్ రావు నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి. వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రి పదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఆయన బాటలోనే బ్రహ్మానందరెడ్డి నడిచారనాలి.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, సమ్మతి-అసమ్మతి రాగాల మధ్య, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభించేది. ఒకరి వెంట మరొకరు అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు అసమ్మతి పుణ్యమా అని. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ను, 1989 లో మరో పర్యాయం, పీసీసీ అధ్యక్షుడుగా గెలిపించిన చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కావడానికి అధిష్ఠానం ఆశీస్సులు తప్పనిసరైందని అనక తప్పదు. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో.. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్య మంత్రయ్యారు. ఆయన్నూ వుండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డాక్టర్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్య మంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లు వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ఆయన వున్నప్పుడు ధిక్కారానికి అవసరం లేనందునో-వీలు కలగనందునో తాత్కాలికంగా ఆగినా, కాంగ్రెస్ లో అంతర్భాగమైన ధిక్కార పర్వాలు, అసంతృప్తి కాండలు మళ్ళీ మొదలయ్యాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో విషయంలో ఈ రోజు ఆయనను బాహాటంగా విమర్శించే వారు, ఆయనున్నప్పుడు నోరు విప్పడానికే జంకేవారు.
          
నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఏదో విధంగా అధిష్ఠానాన్ని ధిక్కరించని నాయకులు అరుదు. పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత వుంటుందో-ఎప్పుడు ఎవరికి వుండకుండా పోతుందో చెప్ప గల వారు లేరిప్పుడు. సుమారు పాతిక పర్యాయాలు పార్టీ పగ్గాలను చేజిక్కించుకుని, నలభై సంవత్సరాల పాటు అధ్యక్ష పీఠం అధిష్ఠించింది నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే. అదే వారసత్వానికి చెందిన సోనియా గాంధీ నాయకత్వంలోని అధిష్ఠానం ప్రస్తుతం అవలంభిస్తున్నది మాత్రం “విభజించి పెత్తనం సాగించడం” అనే బ్రిటీష్ పోకడలు. భవిష్యత్ లో పార్టీకి ఆ పోకడలు లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటే. దీని ప్రభావం అన్ని రాష్ట్రాల మాదిరిగానే, ఆంధ్ర ప్రదేశ్‌పైనా పడక మానదు. యుపిఎ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పరంగా అత్యధిక స్థానాలను సంపాదించి పెట్టిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వారితో సంధి ప్రయత్నాలను చేయక తప్పని పరిస్థితి! 



కాకపోతే, ఆ పని ఇప్పుడు చేస్తే మంచిదా? 2014 ఎన్నికల తరువాత చేస్తే మంచిదా? అని ఆలోచించుకోవాలి. ఏదేమైనా, చేరేది లేదు-చేతులు కలిపేది లేదని తెగేసి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి! ఎవరి వ్యూహం ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.

Monday, July 23, 2012

శరద్ పవార్ కోపం కాంగ్రెస్ ప్రక్షాళణకు దారితీయనుందా?: వనం జ్వాలా నరసింహారావు


శరద్ పవార్ కోపం కాంగ్రెస్ ప్రక్షాళణకు దారితీయనుందా?
వనం జ్వాలా నరసింహారావు


శరద్ పవార్‌కు కోపం వచ్చింది. ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చి సర్దుకుపోయింది. అప్పుడే మో, సోనియా విదేశీయతకు కోపం వస్తే, ఇప్పుడేమో తనకు మంత్రివర్గంలో రెండో స్థానం ఇవ్వలేదని కోపం వచ్చింది. మంత్రిపదవికి రాజీనామా చేస్తానని బెదిరించే వరకూ కోపం వచ్చింది. ఇంతకీ పవార్ యుపిఎని వీడిపోతాడా? పోడా? అనేది ఇప్పుడిప్పుడే చెప్పలేం కాని కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంచెం కష్టాలు తెస్తాడని మాత్రం చెప్పవచ్చు. అసలిదంతా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కావాలనే చేస్తున్నదా? గత పదమూడేళ్లు  రికార్డు స్థాయిలో అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన సోనియా గాంధి తన పార్టీలోను, యుపిఎ భాగస్వాములలోను అసంతృప్తిని పసికట్టిందా? ఇక తప్పదనుకున్న సోనియా అత్తగారి తరహా దిద్దుబాటులోనే పయనించి, యుపిఎలోను-పార్టీలోను చీలికకు శ్రీకారం చుట్టి, సమూల ప్రక్షాలణ చేసి, అసలు-సిసలైన వీర విధేయులను మాత్రమే తన వెంట వుంచుకుని, వారసత్వానికి మార్గం సుగమం చేయనుందా? ఎదురుతిరగగల శక్తి-యుక్తులున్న శరద్ పవార్ లాంటి కాంగ్రేసేతర నాయకులను కాని, ఇంకా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న మరికొందరు అసంతృప్త నాయకులను కాని, వదిలించుకునే ఆలోచనలో సోనియా వుందా? వారికీ విడిపోతేనే మంచి జరుగుతుందని, రాజకీయంగా లబ్ది చేకూరుతుందని భావన కలుగుతోందా? ఎవరి వ్యూహం ఎలా వుందో అర్థం చేసుకోవాలంటే చరిత్ర తిరగదోడాల్సిందే! నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానంలో, ధిక్కరించి పార్టీ వీడిన ప్రముఖులకే ప్రధాని, ఉప ప్రధాని, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులు దక్కాయి. విధేయత, వీర విధేయత ప్రదర్శించిన వారంతా తాము అనుభవిస్తున్న పదవులను కాపాడుకోవడానికే పరిమితమయ్యారే కాని ఉన్నత శిఖరాలకు చేరుకోలేక పోయారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే... ఏదీ అసాధ్యం కాదు!

          సోనియా గాంధి, చిక్కుల్లో పడ్డ పార్టీని, ప్రక్షాలణచేసి-పునర్నిర్మించి-పూర్వ వైభవాన్ని సమకూర్చి, కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకురాలైంది. రాజీవ్ గాంధి మరణానంతరం, సోనియా నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అనూహ్య పరిస్థితుల్లో చేపట్టిన పీవీ నరసింహారావు సోనియా విశ్వాసాన్ని కోల్పోయి పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీనామా చేయక తప్పలేదు. జిత్తులమారిగా పేరున్న మరో వృద్ధ నాయకుడు సీతారాం కేసరికి ఆ రెండు పదవులు దక్కాయి. సీతారాం కేసరికి వ్యతిరేకంగా పలువురు సీనియర్ నాయకులు పార్టీని వీడే పరిస్థితులు తలెత్తడంతో, పార్టీ ఛిన్నాభిన్నం కాకుండా "రక్షించమని" కొందరు నాయకుల అభ్యర్థన మేరకు, నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరలో ఐదో తరం ప్రతినిధిగా, సోనియా గాంధి తొలుత పార్టీ "ప్రాధమిక సభ్యత్వం" స్వీకరించారు. అచిర కాలంలోనే, "రెండు నెలల అపారమైన అనుభవంతో", పార్టీ శ్రేయోభిలాషులు కోరడంతో కాదనలేక, 1998 లో, కొందరు ఆమె "జాతీయత" ను ప్రశ్నించినప్పటికీ, అధ్యక్ష పదవిని చేపట్టి, గత పదమూడు-పద్నాలుగేళ్లగా పార్టీకి తిరుగులేని నాయకురాలిగా-మకుటంలేని మహారాణిగా, నెహ్రూ-గాంధి వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆమె తీసుకున్న నిర్ణయమే "ఏకాభిప్రాయం".



          నెహ్రూ-గాంధి కుటుంబీకుల అనుకూల-ప్రతికూల శక్తుల, వ్యక్తుల, ముఠా రాజకీయాల మధ్య జరుగుతున్న ఆధిపత్య సమరమే, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర. విధేయులు "అణిగిమణిగి" వుండి, దొరికిన దానితో సంతృప్తి పడుతుంటే, వ్యతిరేకులు అడపాదడపా ఎదురుతిరగకుండా వుండలేక పోయారు. మొరార్జీ దేశాయ్, విశ్వనాథ ప్రతాప సింగ్, చంద్రశేఖర్, గుజ్రాల్ ఎదురు తిరిగి పార్టీని వీడక పోయినట్లయితే, ఏ నాటికీ "ప్రధాన మంత్రి" అయ్యేవారు కానే కాదు. జగ్జీవన్ రాం కు ఉప ప్రధాన మంత్రి దక్కే అవకాశమే వుండకపోయేది. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి కాగలిగింది కాంగ్రెస్ పార్టీని వీడినందునే. వారే కనుక వీర విధేయతతో పార్టీలో కొన సాగినట్లయితే మంత్రివర్గంలో స్థానంతో సరిపుచ్చుకోవాల్సిందే. భారత జాతీయ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం, అసంతృప్తులు, ధిక్కారాలు, ఎదురీతలు, చీలికలు అంతర్భాగాలే. నెహ్రూ-గాంధి కుటుంబీకుల వారసత్వ పరంపరలో ప్రతి ఒక్కరు, తమ మాట చెల్లని ప్రతిసారీ పార్టీని ప్రత్యక్షంగానో పరోక్షంగా నో వీడడమో, చీల్చడమో, "మనస్సాక్షి చెప్పినట్లు" నడచుకోమని కార్యకర్తలను ప్రోత్సహించడమో-పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయమని సూచించడమో, వ్యతిరేకులు పార్టీని వదలి వెళ్లే పరిస్థితులు కలిపించడమో చరిత్ర చెప్పిన వాస్తవం. అలా జరిగిన ప్రతిసారీ ఆ కుటుంబీకులు పార్టీలో తమ ఆధిపత్యాన్ని పదిల పరచుకున్న విషయమూ జగమెరిగిన సత్యం. ఆ క్రమంలోనే ఆ వారసుల నాయకత్వం మినహా గత్యంతరం లేని అవసరం కూడా ఏర్పడింది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.

          నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వ ప్రధమ తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ, కుమారుడు జవహర్లాల్ నెహ్రూకు, తన తర్వాత వెనువెంటనే "అధ్యక్ష బాధ్యత" అప్ప చెప్పారు. ఆ కుటుంబానికి రాజకీయ పరంగా మద్దతిచ్చిన మహాత్మా గాంధి, ఆయన జీవించినంతవరకు, నెహ్రూను వ్యతిరేకించిన-వ్యతిరేకించగల సామర్థ్యం వుందని భావించిన వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, టాండన్, పట్టాభి సీతారామయ్య లాంటి నాయకులందరినీ పార్టీలో మైనారిటీకి తగ్గించేందుకు సహకరించారనే ది వాస్తవం. స్వాతంత్ర్యం లభించిన తర్వాత అలనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఆచార్య కృపలానీ చర్యలను తరచుగ ప్రశ్నించు తూ, తన ఆధిపత్యాన్ని నెహ్రూ ప్రదర్శించడం కూడా తిరుగుబాటు లాంటిదే. ముగ్గురు ప్రధాన మంత్రులను దేశానికిచ్చి, నాలుగో తరం త్వరలో ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా వున్న అరుదైన కుటుంబం అది. నాలుగు దశాబ్దాలు వివిధ దశల్లో, పాతిక పర్యాయాలు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన ఘనత కూడా ఆ కుటుంబానిదే.

          నెహ్రూ వారసురాలిగా ఇందిరా గాంధి తొలుత పార్టీ పగ్గాలను 1959-60 లో చేపట్టింది. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత, 1966 లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజుల్లో పార్టీలో రెండు బలమైన వర్గాలుండేవి. ఇందిర అనుయాయులైన "సామ్యవాదులు", మొరార్జీ-తదితరుల నాయకత్వంలోని "సంప్రదాయ వాదులు" ఆధిపత్యం కొరకు బహిరంగంగానే విమర్శించుకునే వారు. నెహ్రూ-గాంధి కుటుంబ ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన మొరార్జీ దేశాయ్‌ని తప్పని పరిస్థితుల్లో మంత్రివర్గంలో తీసుకుని కీలకమైన ఆర్థిక శాఖనిచ్చింది ఇందిర. బాంకుల జాతీయం, రాజా భరణాల రద్దు లాంటి విధాన పరమైన నిర్ణయాల నేపధ్యంలో, మొరార్జీ దేశాయ్‍తో సహా, హేమామేమీలైన "సంప్రదాయ వాదుల" ను బయటకు పంపేందుకు, 1969 లో పార్టీని చీల్చింది ఇందిర. ఆమెతో విభేదించి, తమదే అసలైన పార్టీగా ప్రకటించి, దానికి సారధ్యం వహించి, ఆ తర్వాత జనతా పార్టీలో విలీనం చేసిన మొరార్జీ దేశాయ్ ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వ ప్రధాన మంత్రి కాగలిగారు. నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వాన్ని వ్యతిరేకించగలిగిన వారే, ప్రధాన మంత్రి స్థాయికి ఎదగ గలుగుతారని నిరూపించారాయన.

          మైనారిటీలో పడిన ఇందిర వర్గం కాంగ్రేసేతర సోషలిస్టుల-వామ పక్షాల మద్దతు పొంది విప్లవాత్మక సంస్కరణలతో బలమైన నాయకురాలిగా ఎదగసాగింది. 1971 ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించి, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నాయకురాలయ్యారు. పార్టీని అంటిపెట్టుకున్న విధేయుల్లో కొందరు క్రమేపీ ఆమెను అంతర్లీనంగా వ్యతిరేకించసాగారు. పార్టీని వీడిన "యంగ్ టర్క్స్" ఎస్ చంద్రశేఖర్ ప్రధాన మంత్రి స్థాయికి, కృష్ణకాంత్ ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇందిర మరో విమర్శకుడు, ఐ కె గుజ్రాల్ కూడా రాజీనామా చేసి ప్రధాన మంత్రి కాగలిగారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల పూర్వ రంగంలో, ఆమెకు అత్యంత విధేయుడుగా వున్న జగ్జీవన్ రాం ఆమెను ఎదిరించి పార్టీని వదిలి, "కాంగ్రెస్ ఫర్ డెమాక్రసీ" ని స్థాపించి, జనతా కూటమితో కలిసి పోటీ చేయడం వల్లనే ఉప ప్రధాన మంత్రి కాగలిగారు. 1977 ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తర్వాత పార్టీలో తన వీర విధేయులకు తప్ప ఇతరులకు స్థానం లేకుండా చేసి, పార్టీని చీల్చి, ఇందిరా కాంగ్రెస్ పేరుతో పునర్నిర్మించి, ఎవరినీ నమ్మలేని పరిస్థితుల్లో 1978 లో తానే అధ్యక్ష పదవిని చేపట్టింది. అనతి కాలంలోనే అఖండ విజయం సాధించి ప్రధాని కాగలిగింది. ఆమె వారసుడిగా ఎదుగుతున్న చిన్న కొడుకు సంజయ్ గాంధి దుర్మరణం పాలవడంతో, పెద్దకొడుకు రాజీవ్ గాంధిని నెహ్రూ-గాంధి కుటుంబ పాలనను కొనసాగించడానికి రాజకీయ తెరమీదికి తీసుకొచ్చింది. "వీర విధేయులు" దానికి మద్దతీయగా, "నిశ్సబ్ద వ్యతిరేకులు" మౌనం పాటించారు. సమయం కొరకు వేచి చూడ సాగారు. హత్యకు గురయ్యేంతవరకూ పార్టీ పగ్గాలు ఇందిరా గాంధి తన చేతుల్లోనే వుంచుకుని, తదనంతరం రాజీవ్ గాంధికి వారసత్వం ఇచ్చింది. ఇక నాటినుంచి భారత జాతీయ కాంగ్రెస్‌ను ఇందిరా కాంగ్రెస్ అని వాడుకలో పిలవడం, ఏఐసీసీ (ఐ) అని ఉపయోగించడం మొదలైంది.

          1984 సార్వత్రిక ఎన్నికల్లో, గతంలో ఎన్నడు సాధించలేనంత భారీ మెజారిటీతో రాజీవ్ పార్టీని గెలిపించారు. భారత జాతీయ కాంగ్రెస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సంవత్సరంలో 1985 లో, "ఇందిర కాంగ్రెస్ పార్టీ" అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ "ధిక్కార ధోరణి" ని సహించలేని రాజీవ్, తల్లి ఇందిర ఏ విధంగా మొరార్జీ ని తొలగించిందో, అలానే, సింగ్ శాఖలో మార్పులు చేసి రక్షణ శాఖకు మార్చాడు. ఎప్పుడైతే "బోఫోర్స్" కుంభకోణానికి సంబంధించిన సమాచారం వెలుగులో తేవడానికి సింగ్ సిద్ధపడుతున్నాడని అనుమానం వచ్చిందో, రాజీవ్ ఆయనను ఆ శాఖనుంచి కూడా తప్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి, పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసిన వీపీ సింగ్, 1989 లో జరిగిన ఎన్నికల్లో జనతా దళ్ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికై, "నేషనల్ ఫ్రంట్" ప్రభుత్వానికి సారధ్యం వహించి ప్రధాన మంత్రి అయ్యారు. ఆయనే కనుక రాజీవ్ గాంధీకి "వీర విధేయుడి" గా వుండిపోయినట్లైతే, తన ఆర్థిక శాఖను కాపాడుకో గలిగే వాడే కాని, ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగేవాడు కానే కాదు. 1991 మధ్యంతర ఎన్నికల్లో ప్రచారంలో వున్న రాజీవ్ గాంధి హత్యకు గురికావడంతో ఆయన స్థానంలో పీవీ నరసింహారావు "ఏకాభిప్రాయ అభ్యర్థి" గా పార్టీ పదవిని చేపట్టి, ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి అయ్యారు.

          నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరకు చెందని వారికి, పార్టీ సారధ్యం-ప్రధాన మంత్రి పదవి రావడం పలువురిని ఆశ్చర్య పరిచింది. సోనియా తన చెప్పు చేతల్లో వుంటాడనుకున్న వ్యక్తి, సొంత నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తెచ్చి, భవిష్యత్ ప్రధాని కావడానికి పునాదులు వేశారాయన. సోనియా ఆగ్రహానికి మాత్రం గురికాక తప్పలేదు. పార్టీ నాయకత్వ బాధ్యతలనుంచి దయనీయంగా తొలగించారాయనను. ఆయన స్థానంలో వచ్చిన కేసరికి అదే పరిస్థితి ఎదురైంది తర్వాత. సోనియా శకం మొదలైంది. ఐదో తరం వ్యక్తిగా పార్టీ అధ్యక్షురాలైంది.

          సోనియా అధ్యక్ష పదవిని అనుకున్నంత సులభంగా అధిష్టించలేదు. నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వ నాయకత్వంపై వున్న వ్యతిరేకత ప్రభావం ఆమెపై కూడా సహజంగానే పడింది. పీవీ రావడంతో ఇక వారసత్వ రాజకీయాలు స్వస్తి అని భావించిన పలువురు కాంగ్రెస్ "ఆశావహులు" నిరాశకు గురయ్యారు. ఇంతలో 2004 ఎన్నికల సంరంభం మొదలైంది. రద్దయిన లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన శరద్ పవార్, ఎన్నికల్లో కాంగ్రెస్ పక్ష ప్రధాని అభ్యర్థిగా, భారత దేశంలో పుట్టిన వారి పేరునే ప్రకటించాలన్న నినాదం లేవదీశాడు. ధిక్కార స్వరం వినిపించాడు. జన్మతః ఇటలీ దేశస్తురాలైన సోనియాకు నెహ్రూ-గాంధి వారసురాలిగా ప్రధాని కాకూడదన్న భావం ఆయనకే కాకుండా మరి కొందరిలో కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. మాట నెగ్గించుకోలేని పవార్, మాజీ లోక్ సభ సభాపతి సంగ్మాతో కలిసి "నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ" ని నెలకొల్పారు. స్థైర్యం కోల్పోని సోనియా, చాకచక్యంగా మన్మోహన్ సింగ్ ను తెర పైకి తెచ్చింది.

          ఎన్నికల అనంతరం యూపీయే ప్రభుత్వానికి సారధ్యం వహించడానికి ఆమె తిరస్కరించి, ఆయనను ప్రధానిని చేసింది. ప్రణబ్ కుమార్ ముఖర్జీ గతంలో కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించినప్పుడు, రిజర్వ్ బాంక్ గవర్నర్ గా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఆర్థిక మంత్రి హోదా రిజర్వ్ బాంక్ గవర్నర్ హోదాకంటే పెద్దే కాకుండా, రిపోర్టింగ్ అధికారిక స్థాయి కూడా. అదే ప్రణబ్ కుమార్ ముఖర్జీ మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియారిటీ, సోనియా నిర్ణయం ముందు పనికి రాలేదు. ఆయనకు ప్రధాని కావాలన్న ఆశా చావలేదు. అవకాశం వస్తే, ధిక్కరించగలిగితే, వదులుకునేవాడు కాదేమో? గతంలో రాజీవ్ గాంధి హయాంలో, ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల తర్వాత, నిర్లక్ష్యానికి గురై పార్టీని వీడి సొంత కుంపటి కూడా పెట్టుకున్నారు. తిరిగి పీవీ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా స్వగృహ ప్రవేశం చేసి, పార్టీకి-సోనియాకు విధేయుడిగా కొనసాగి, 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు లేవని ధృవీకరించుకుని, ప్రధాని పీఠం అధిష్టించే యోగం లేదని భావించి, రాష్ట్రపతి పదవిపై కన్నేసి, అనుకున్నది సాధించుకున్నాడు. ఆయనకే రాష్ట్రపతి ఇవ్వకపోతే, ఆయనలోని అలనాటి రాజీవ్ (నెహ్రూ-గాంధి) వ్యతిరేకత దేనికైనా దారితీసేదేమో! శరద్ పవార్ మనసు మార్చుకుని, సోనియా సారధ్యంలోకి పరోక్షంగా చేరినప్పటికీ ప్రధాని కావాలన్న కోరిక దేనికైనా దారితీయవచ్చు.

          తనకు మద్దతు ఇస్తూనే-ఇస్తున్నట్లు నటిస్తూనే, పరోక్షంగా, అవకాశం కొరకు ఎదురుచూస్తున్న పార్టీ లోని-యుపిఎ భాగస్వామ్య పక్షాలలోని సొంత మనుషుల వ్యవహారం సోనియాకు తెలియకుండా వుంటుందా? ప్రధాని పీఠంపై తనయుడు రాహుల్ గాంధీని కూచోబెట్టాలంటే, నామ మాత్రం వ్యతిరేకత కూడా లేకుండా జాగ్రత్త పడాలి. బయటపడి ఏదో ఒక కారణం చూపించి, సోనియా సూచనను పాటించని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు ఆమెకు అసలైన శత్రువులు కారని ఆమెకూ తెలుసు. జగన్ లాంటి వారు జాతీయ స్థాయిలో సోనియాని అస్థిరపరిచలేరని కూడా అమెకు తెలుసు. వచ్చిన చిక్కల్లా "కంట్లో నలుసుల" తోనే. సోనియాకు కాంగ్రెస్ పార్టీని మరో మారు ఏదో ఒక రకంగా, అత్తగారి తరహాలో చీలిస్తేనో, లేక, ఏదో కారణాన జాతీయ స్థాయిలో ఆమెను వ్యతిరేకించేవారు చీలిపోతేనే మంచిది. నెహ్రు-గాంధీ వారసత్వం చెక్కు చెదరకుండా వుండాలంటే కాంగ్రెస్ పార్టీలో మరో ప్రక్షాళన జరగాల్సిందే. భారత జాతీయ కాంగ్రెస్(ఆర్-రాహుల్) కాని, భారత జాతీయ కాంగ్రెస్ (ఎస్-సోనియా) కాని ఆవిర్భవించవచ్చు. అనూహ్యంగా తెర పైకి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ (పి-ప్రియాంక) స్థాపన జరిగినా ఆశ్చర్యం లేదు.

Sunday, February 6, 2011

మల్లు అనంతరాములు-స్వయం కృషితో జాతీయ స్థాయికెదిగిన దళిత నాయకుడు:వనం జ్వాలా నరసింహారావు

ఫిబ్రవరి 7, 2011 న మల్లు అనంతరాములు 21 వ వర్ధంతి సందర్భంగా....
మల్లు అనంతరాములు-స్వయం కృషితో జాతీయ స్థాయికెదిగిన దళిత నాయకుడు
వనం జ్వాలా నరసింహారావు

ఫిబ్రవరి 7, 1990 ఉదయం రాజ్ భవన్ ప్రాంగణంలో నివసిస్తున్న మా ఇంటికి "బ్రేక్ ఫాస్ట్ అతిథి" గా వచ్చిన డాక్టర్ మల్లు అనంతరాములు ఎంతో ఉల్లాసంగా-ఉత్సాహంగా కనిపించారు. రాజీనామా చేసిన కుముద్ బెన్ జోషి స్థానంలో నియమితులైన కృష్ణకాంత్, ఆంధ్ర ప్రదేశ్ నూతన గవర్నర్ గా, అదే రోజున, మరి కొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాజ భవన్ కు మల్లు వస్తున్నందున, నేను ఆయనను మా ఇంటికి ఆహ్వానించాను. డాక్టర్ చెన్నారెడ్డిని రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఎన్నుకోవడంతో, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా రాజీనామా చేసిన ఆయన స్థానంలో, అధిష్ఠానం మల్లును పీసీసీ అధ్యక్షుడుగా నియమించింది. ఆ హోదాలో ఆయన గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. పీసీసీ అధ్యక్షుడుగా నియామకం కావడానికి రెండు నెలల పూర్వం, 1989 చివర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో, రెండో పర్యాయం, మహబూబ్ నగర్ జిల్లా-నాగర్ కర్నూల్ రిజర్వు డు నియోజక వర్గం నుంచి లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు మల్లు. ఉదయం బ్రేక్ ఫాస్టులోను, ఆ తర్వాత గవర్నర్ ప్రమాణ స్వీకారోత్సవంలోను, ఎప్పటిలాగా చురుగ్గా-సరదాగా అందరితో కబుర్లు చెప్పుకుంటూ గడిపిన మల్లు అనంతరాములు, ఆ మధ్యాహ్నమే హఠాత్తుగా మరణించారన్న వార్తను ఆయనకు సన్నిహితంగా మెలిగిన వారితో సహా ఎవరూ నమ్మలేక పోయారు. మల్లు మరణ వార్త తెలిసిన వెంటనే ముఖ్య మంత్రి చెన్నారెడ్డి స్వయంగా ఆయన మాటల్లో చెప్పిన సంతాప సందేశాన్ని సీఎం పీఆర్వోగా పత్రికల వారికి, ఆయన కుటుంబ సభ్యులకు పంపాను. రాష్ట్ర శాసన సభకు, దేశ వ్యాప్తంగా లోక్ సభకు, జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయాల్లో మల్లు వహించిన పాత్రను అప్పటి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ గాంధి, ఘనంగా పొగుడుతూ మల్లుకు నివాళులు అర్పించారు.

పెద్దవాళ్ల మధ్య పెద్దవాడి గాను, చిన్న వాళ్ల మధ్య పెద్ద తరహా గాను మలగుతూ, అందరినీ తన వారిగా భావించే మనస్తత్వమున్న అనంతరాములు మల్లు, స్వయం కృషితో అంచలంచెలుగా ఎదిగిన అరుదైన దళిత నాయకుడు. పదవిలో వున్నా-లేకపోయినా, సన్నిహితులకు-అంతగా పరిచయం లేని ఇతరులకు, తన చేతనైన సహాయం చేయడానికి ఎప్పుడూ వెనుకాడేవాడు కాదు మల్లు. ఒకే జిల్లాకు చెందిన మా ఇద్దరికి, రెండు దశాబ్దాల పరిచయం. మొట్టమొదటి సారి, మా జిల్లా నుంచి కాకుండా, మహబూబ్ నగర్ జిల్లానుంచి 1980 లో లోక్ సభ కు ఎన్నికైన తర్వాత, రాజకీయంగా కూడా మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఢిల్లీ నుంచి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా, నాకు-మితృడు భండారు శ్రీనివాస రావుకు ముందస్తుగా సమాచారం ఇవ్వడం, వచ్చిన తర్వాత, ఇక్కడున్నన్ని రోజులు కలిసి మెలిసి వుండడం తప్పని సరిగా జరిగేది. ఒక సాధారణ "వీ ఎల్ డబ్ల్యూ" గా పని చేసి, కాంగ్రెస్ సంస్థలో ఉన్నత పదవులను అలంకరించిన అతి కొద్దిమంది దళితుల్లో మల్లు ఒకరు. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో పడడం ఆయన కార్య దక్షతకు, పట్టుదలకు నిదర్శనం. వీ ఎల్ డబ్ల్యూ యూనియన్ క్రియాశీలక వ్యక్తిగా మల్లులో నిబిడీకృతమైన నాయకత్వ లక్షణాలు, ఖమ్మం జిల్లా నాయకులతో సహా రాష్ట్ర స్థాయి నాయకులకు ఆయనను చేరువ చేసింది. ఆయన ఉపన్యాసాలు శ్రోతలను ఉర్రూతలూగించేవి. ఎమర్జెన్సీ నేపధ్యంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర స్థాయిలో అధికారం, రాష్ట్ర స్థాయిలో పట్టు కోల్పోయిన ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి మల్లు లాంటి వారి అవసరం కలిగింది.

1978 లో జరిగిన రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో, ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఎన్నో ఎన్నికల సభల్లో ఆయన ఉపన్యాసాలు, కాంగ్రెస్ కార్యకర్తలను ప్రోత్సహించడంతో పాటు, రాష్ట్ర నాయకత్వాన్ని మెప్పించాయి. అప్పటి ముఖ్య మంత్రి చెన్నారెడ్డి మల్లు నాయకత్వ లక్షణాలను గుర్తించి, ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో, నాగర్ కర్నూల్ నియోజక వర్గం లోక్ సభ టికెట్ ఇప్పించారు. ఆయన ఘన విజయం సాధించడంతో, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగడం ఆరంభమయింది. పార్లమెంటు సభ్యుడుగా ఢిల్లీలో అడుగు పెడుతూనే, కేంద్ర నాయకులతో సాన్నిహిత్యం పెంచుకుంటూ, దాన్ని తన స్వప్రయోజనాలకు వాడుకోకుండా, నియోజక వర్గం అభివృద్ధికి ఉపయోగించుకుంటూ, ప్రజలకు చేరువయ్యారు. నాటి ఆర్థిక సహాయ మంత్రి జనార్థన్ పూజారి తోడ్పాటుతో, నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో పలు ప్రదేశాల్లో రుణ మేళాలు ఏర్పాటు చేసి, షెడ్యూల్డు కులాల వారికి-తెగల వారికి-వెనుక బడిన వర్గాల వారికి ఎన్నో రకాల ఆర్థిక సహాయం అందేలా చూశారు మల్లు. నాగర్ కర్నూలు తో సహా, స్వస్థలమైన ఖమ్మం జిల్లా వాసులకు కూడా సహాయ పడే వారాయన. కార్య శీలతకు, కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలూ అంకితమై పనిచేస్తున్న వారికి పార్టీలో గుర్తింపు దొరకడం కష్టం కాదని మల్లు నిరూపించారు. ఖమ్మం జిల్లా స్వంత గ్రామం లక్ష్మీపురంలో, ఆత్మీయుల మధ్య పార్టీ వ్యవహారాలు చర్చిస్తున్న సందర్భంలో, నాటి ప్రధాని-అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజీవ్ గాంధి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పాతికేళ్ల క్రితం, దేశ రాజధాని నుంచి కుగ్రామానికి ప్రధాన మంత్రి దగ్గర నుంచి నేరుగా పిలుపు రావడం సాధారణ విషయం కాదు. మల్లు ప్రతిభే దానికి కారణం. పదమూడు రాష్ట్రాల పార్టీ బాధ్యతలను అప్పగించు తూ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మల్లును నియమిస్తున్నట్లు రాజీవ్ గాంధి నుంచి సమాచారం అలా చేరింది ఆయనకు.

న్యూ ఢిల్లీలోని మల్లు కార్యాలయం ఎప్పుడూ అత్యంత కోలాహలంగా వుండేది. గత పది-పదిహేనేళ్లలో జాతీయ స్థాయికెదిగిన పలువురు కాంగ్రెస్ నాయకులను మల్లు అనంతరాములు దగ్గర కలిసే అవకాశం కలిగింది. తన దగ్గర కొచ్చిన ప్రతి వారినీ, బయట వరకు వచ్చి పంపడం ఆయన అలవాటు. ఎప్పుడన్నా పని ఒత్తిడుల వల్ల అలా వీలు కాకపోతే తప్ప, సాధారణంగా ఆయన ఆ మర్యాద పాటించేవారు. ఇతరులకు పరిచయం చేసేటప్పుడు, తన స్నేహితుల గురించి చాలా గొప్పగా చెప్పడం మల్లు లోని సద్గుణం. అడిగిన పని తనకు సాధ్యం కాదని అనే అలవాటు ఆయనలో లేదు. ప్రయత్న లోపం వుండదని దానర్థం. మల్లు పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా, రాజీవ్ గాంధి ఆయనను నేషనల్ ఫార్మ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడుగా నియమించారు. ఆ పదవిలోనూ మల్లు రాణించారు. రాజీవ్ గాంధీకి మరింత చేరువ కావడానికి ఆ పదవి తోడ్పడింది. పార్టీ ప్రయోజనాలకై చాలా మందికి తెలియని ఎన్నో గురుతర బాధ్యతలను రాజీవ్ గాంధి ఆయనకు అప్ప చెప్పారు. ఎంఏ వరకు చదువుకున్న మల్లు పార్లమెంటు సభ్యుడైన తర్వాత రీసెర్చ్ చేసి, పీ హెచ్ డి తెచ్చుకుని, డాక్టర్ అనంతరాములు మల్లు ఐపోయారు.

ఎన్ టీ రామారావు సారధ్యంలో రాష్ట్రంలో అధికారంలో కొచ్చిన తెలుగు దేశం పార్టీని ఓడించడానికి చెన్నారెడ్డి నాయకత్వంలో 1989 లో ఎన్నికల బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ, మరో పర్యాయం, మల్లు అనంతరాములుకు నాగర్ కర్నూలు లోక్ సభ టికెట్ ఇచ్చింది. వాస్తవానికి ఆయనకు శాసన సభకు పోటీ చేయాలని మనసులో కోరికగా వుండేది. వీలుంటే ఖమ్మం జిల్లాలో ఏదైనా నియోజక వర్గం నుంచి టికెట్ వస్తే బాగుండేదనుకునేవారాయన. కాకపోతే, ఖమ్మంలోని రిజర్వుడు నియోజక వర్గాల నుంచి గతంలో పోటీ చేసిన వారు కాని, సిట్టింగ్ అభ్యర్థులు కాని పోటీ చేస్తుండడంతో మల్లుకు అవకాశం దొరకడం కష్టమైంది. రాజీవ్ గాంధీ ఆదేశం కూడా లోక్ సభకు పోటీ చేయమనే. తనకు పార్టీ విజయం ముఖ్యమని, రాష్ట్రంలోను-దేశంలోను, ప్రత్యేకించి తనకప్పగించిన పదమూడు రాష్ట్రాలలోను, అభ్యర్థుల విజయానికి తన పూర్తికాలం వినియోగిస్తానని చెప్పినప్పటికీ, రాజీవ్ గాంధీ మల్లును నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు. తన నియోజక వర్గంతో పాటు, ఇతర నియోజక వర్గాలలోను మల్లు ప్రచారం చేశారు. లోక్ సభకు మరో మారు గెలిచారు. కాకపోతే, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. రాష్ట్రంలో అధికారంలోకొచ్చింది. 1989 ఎన్నికల్లో, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం కొరకు రాజీవ్ గాంధీ కూడా వచ్చారు.

మర్రి చెన్నారెడ్డి స్థానంలో పీసీసీ అధ్యక్షుడుగా నియామకం జరిగిన నాటి రాత్రి పది గంటల సమయంలో మర్నాడు హైదరాబాద్ వస్తున్న సంగతి ఫోన్ చేసి మరీ చెప్పారు మల్లు అనంత రాములు స్వయంగా. పీసీసీ అధ్యక్షుడుగా ఆయన నియామకం చేయడానికి బలవత్తరమైన కారణం వుండొచ్చు. బ్రతికున్నట్లయితే, మర్రి చెన్నారెడ్డి తర్వాత, బహుశా మల్లుకు ముఖ్య మంత్రి అయ్యే అవకాశం వచ్చి వుండేదేమో! నేను ముఖ్య మంత్రి చెన్నారెడ్డి పీఆర్ వో గా పని చేస్తున్నప్పటికీ, మల్లు పీసీసీ అధ్యక్షుడుగా హైదరాబాద్ మొదటిసారి వచ్చినప్పుడు బేగంపేట విమానాశ్రయానికి పోవడమే కాకుండా, ఆయన వెంట వూరేగింపులో కొంత సేపు ప్రయాణం కూడా చేశాను. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా మల్లు పలువురి మన్ననలను, ప్రశంసలను అందుకోవడమే కాకుండా, ఎన్నో నూతన ఒరవడులకు నాంది పలికారు. ముఖ్య మంత్రికి, ఇతర మంత్రులకు, గాంధీ భవన్ కు మధ్య వారధిగా పని చేశారు. ముఖ్య మంత్రిని కలవడానికి వచ్చినప్పుడు ఇతర సందర్శకులలాగానే వ్యవహరించేవారు తప్ప, తన కంటూ ఒక ప్రత్యేకత కావాలని కోరేవారు కాదు.

అది యాధృఛ్చికమో, దైవ సంకల్పమో కాని, మల్లు అనంతరాములు హఠాత్తుగా మరణించడానికి కొన్ని గంటల ముందు, ఆయన తమ్ముడి మామగారు, అప్పట్లో రాష్ట్ర కాబినెట్ మంత్రి కోనేరు రంగారావు పదవికి రాజీనామా చేశారు. అనంతరాములు సోదరుడు మల్లు రవి ఆయన స్థానంలో నాగర్ కర్నూలు లోక్ సభ సభ్యుడుగా రెండు సార్లు ఎన్నికకాగా, మరో సోదరుడు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా, మధిర శాసన సభ సభ్యుడుగా ఎన్నికై ప్రస్తుతం ప్రభుత్వ ఛీఫ్ విప్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

గవర్నర్ ప్రమాణ స్వీకారం, కాబినెట్ మంత్రి రాజీనామా, పీసీసీ అధ్యక్షుడి హఠాన్మరణం అన్నీ ఒక్క నాడే, ఫిబ్రవరి 7, 2011 న సంభవించాయి. మల్లు మరణించి సరిగ్గా 21 సంవత్సరాలైంది. సాధారణ ఉద్యోగిగా జీవితం ప్రారంభించి, పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికై, నేషనల్ ఫార్మ్స్ డెవలప్ మెంట్ చైర్మన్ పదవిని పొంది, అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా-పదమూడు రాష్ట్రాల ఇన్-చార్జ్ గా బాధ్యతలు నిర్వహించిన మల్లును, ఒక దళిత నాయకుడిని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మరిచిపోయినట్లే కనిపిస్తోంది. భావి తరాల వారు-ఆ మాటకొస్తే నేటి తరం వారుకూడా, ఆయన్ను గుర్తుంచుకునే ట్లు, ఆయన జ్ఞాపకార్థం ఏదైనా కార్యక్రమం చేపట్టి తే బాగుంటుందేమో!

Monday, August 30, 2010

పార్టీ వీడిన - పార్టీ చీల్చిన వారికి మాత్రమే రాజకీయ ఎదుగుదల : వనం జ్వాలా నరసింహారావు

సెప్టెంబర్ 3, 2010 న నాలుగో సారి
సోనియా కాంగ్రెస్ అధ్యక్షురాలు కానున్న సందర్భంగా


లాంఛనప్రాయంగా ముగియనున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ఫలితం అందరూ ఊహించిందే. గత పన్నెండేళ్ల గా రికార్డు స్థాయిలో అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన సోనియా గాంధి వరుసగా నాలుగో పర్యాయం ఎన్నిక కానుంది. అసంతృప్తిని పసికట్టిన సోనియా అత్తగారి తరహా దిద్దుబాటలోనే పయనించి, చీలికకు శ్రీకారం చుట్టి, సమూల ప్రక్షాలణ చేసి, అసలు-సిసలైన వీర విధేయులను మాత్రమే తన వెంట వుంచుకుని, వారసత్వానికి మార్గం సుగమం చేయనుందా? నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ ప్రస్థానంలో, ధిక్కరించి పార్టీ వీడిన ప్రముఖులకే ప్రధాని, ఉప ప్రధాని, రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవులు దక్కాయి. విధేయత, వీర విధేయత ప్రదర్శించిన వారంతా తాము అనుభవిస్తున్న పదవులను కాపాడుకోవడానికే పరిమితమయ్యారే కాని ఉన్నత శిఖరాలకు చేరుకోలేక పోయారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే... ఏదీ అసాధ్యం కాదు!

ఆంగ్లేయుల పాలనలోని భారతీయ సివిల్ సర్వెంట్-రాజకీయ సంస్కర్త ఎలన్ ఆక్టేవియన్ హ్యూమ్, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ స్థాపనకు కారకుడైతే...... ఇటలీ దేశానికి చెందిన భారతీయురాలు సోనియా గాంధి, చిక్కుల్లో పడ్డ పార్టీని, ప్రక్షాలణచేసి-పునర్నిర్మించి-పూర్వ వైభవాన్ని సమకూర్చి, కేంద్రంలో అధికారంలోకి రావడానికి కారకురాలైంది. రాజీవ్ గాంధి మరణానంతరం, సోనియా నిరాకరించిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలను అనూహ్య పరిస్థితుల్లో చేపట్టి, మైనారిటీ ప్రభుత్వానికి ప్రధానిగా సారధ్యం వహించి, ఐదేళ్లలో మెజారిటీ స్థాయికి తీసుకొచ్చినప్పటికీ, పార్టీ పరంగా అదృష్టాలు తారుమారయ్యేందుకు కారకుడయ్యాడన్న అప్రతిష్టను తెచ్చుకున్నాడు పీవీ నరసింహారావు. సోనియా విశ్వాసాన్ని కోల్పోయి పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీనామా చేయక తప్పలేదు. జిత్తులమారిగా పేరున్న మరో వృద్ధ నాయకుడు సీతారాం కేసరికి ఆ రెండు పదవులు దక్కాయి. సీతారాం కేసరికి వ్యతిరేకంగా పలువురు సీనియర్ నాయకులు పార్టీని వీడే పరిస్థితులు తలెత్తడంతో, పార్టీ ఛిన్నాభిన్నం కాకుండా "రక్షించమని" కొందరు నాయకుల అభ్యర్థన మేరకు, నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరలో ఐదో తరం ప్రతినిధిగా, సోనియా గాంధి తొలుత పార్టీ "ప్రాధమిక సభ్యత్వం" స్వీకరించారు. అచిర కాలంలోనే, "రెండు నెలల అపారమైన అనుభవంతో", పార్టీ శ్రేయోభిలాషులు కోరడంతో కాదనలేక, 1998 లో, కొందరు ఆమె "జాతీయత" ను ప్రశ్నించినప్పటికీ, అధ్యక్ష పదవిని చేపట్టి, గత పన్నెండేళ్ల గా పార్టీకి తిరుగులేని నాయకురాలిగా-మకుటంలేని మహారాణిగా, నెహ్రూ-గాంధి వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆమె తీసుకున్న నిర్ణయమే "ఏకాభిప్రాయం".

నెహ్రూ-గాంధి కుటుంబీకుల అనుకూల-ప్రతికూల శక్తుల, వ్యక్తుల, ముఠా రాజకీయాల మధ్య జరుగుతున్న ఆధిపత్య సమరమే, భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర. విధేయులు "అణిగిమణిగి" వుండి, దొరికిన దానితో సంతృప్తి పడుతుంటే, వ్యతిరేకులు అడపాదడపా ఎదురుతిరగకుండా వుండలేక పోయారు. మొరార్జీ దేశాయ్, విశ్వనాథ ప్రతాప సింగ్, చంద్రశేఖర్, గుజ్రాల్ ఎదురు తిరిగి పార్టీని వీడక పోయినట్లతే, ఏ నాటికీ "ప్రధాన మంత్రి" అయ్యేవారు కానే కాదు. జగ్జీవన్ రాం కు ఉప ప్రధాన మంత్రి దక్కే అవకాశమే వుండకపోయేది. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి కాగలిగింది కాంగ్రెస్ పార్టీని వీడినందునే. వారే కనుక వీర విధేయతతో పార్టీలో కొనసాగినట్లైతే, ఒక ప్రణబ్ ముఖర్జీ వలెనో, గులాం నబీ ఆజాద్ లాగానో, అలాంటి మరి కొందరి వలెనో, మంత్రివర్గంలో స్థానంతో సరిపుచ్చుకోవాల్సిందే.

భారత జాతీయ కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం, అసంతృప్తులు, ధిక్కారాలు, ఎదురీతలు, చీలికలు అంతర్భాగాలే. చాలావరకు నెహ్రూ-గాంధి కుటుంబీకుల ఆధిపత్యం చుట్టూతా నే అవన్నీ చోటు చేసుకున్నాయనాలి. విశ్లేషించి చూస్తే, ఎదురు తిరగడమైనా - చీలిక తేవడమైనా, మోతీలాల్ నెహ్రూతో మొదలెట్టి, ఆ వారసత్వ పరంపరలో ప్రతి ఒక్కరు, తమ మాట చెల్లని ప్రతిసారీ పార్టీని ప్రత్యక్షంగానో పరోక్షంగా నో వీడడమో, చీల్చడమో, "మనస్సాక్షి చెప్పినట్లు" నడచుకోమని కార్యకర్తలను ప్రోత్సహించడమో-పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేయమని సూచించడమో, వ్యతిరేకులు పార్టీని వదలి వెళ్లే పరిస్థితులు కలిపించడమో చరిత్ర చెప్పిన వాస్తవం. అలా జరిగిన ప్రతిసారీ ఆ కుటుంబీకులు పార్టీలో తమ ఆధిపత్యాన్ని పదిల పరచుకున్న విషయమూ జగమెరిగిన సత్యం. దాని వల్ల దేశానికి మేలు జరిగి వుండొచ్చు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటై వుండొచ్చు. ఆ క్రమంలోనే ఆ వారసుల నాయకత్వం మినహా గత్యంతరం లేని అవసరం కూడా ఏర్పడింది. అదే ఇప్పటికీ కొనసాగుతోంది.

నెహ్రూ-గాంధి కుటుంబ ఆధిపత్యానికి ఆద్యుడైన ప్రధమ తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ, రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి, లండన్ లో విద్యనభ్యసించి రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో చేరిన కుమారుడు జవహర్లాల్ నెహ్రూకు, తన తర్వాత వెనువెంటనే "అధ్యక్ష బాధ్యత" అప్ప చెప్పారు. వారసత్వానికి, రెండో తరం నాయకత్వానికి, బలమైన పునాదులు, లాహోర్ లో జరిగిన 44 వ ప్లీనరీలో, 1929 లోనే వేశారు. ఆ కుటుంబానికి రాజకీయ పరంగా మద్దతిచ్చిన మహాత్మా గాంధి, ఆయన జీవించినంతవరకు, నెహ్రూను వ్యతిరేకించిన-వ్యతిరేకించగల సామర్థ్యం వుందని భావించిన వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్ర బోస్, టాండన్, పట్టాభి సీతారామయ్య లాంటి నాయకులందరినీ పార్టీలో మైనారిటీకి తగ్గించేందుకు సహకరించారనే ది వాస్తవం. స్వాతంత్ర్యం లభించిన తర్వాత అలనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు ఆచార్య కృపలానీ చర్యలను తరచుగ ప్రశ్నించు తూ, తన ఆధిపత్యాన్ని నెహ్రూ ప్రదర్శించడం కూడా తిరుగుబాటు లాంటిదే. భారత దేశానికి "డొమినియన్ హోదా" విషయంలో, మోతీలాల్ పార్టీని వదిలి స్వరాజ్ పార్టీ స్థాపనకు తోడ్పడగా, కొడుకు గాంధి పక్షం వహించాడు. ముగ్గురు ప్రధాన మంత్రులను దేశానికిచ్చి, నాలుగో తరం త్వరలో ఆ పదవిని చేపట్టడానికి సిద్ధంగా వున్న అరుదైన కుటుంబం అది. నాలుగు దశాబ్దాలు వివిధ దశల్లో, పాతిక పర్యాయాలు కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టిన ఘనత కూడా ఆ కుటుంబానిదే.

నెహ్రూ వారసురాలిగా ఇందిరా గాంధి తొలుత పార్టీ పగ్గాలను 1959-60 లో చేపట్టింది. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత, 1966 లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజుల్లో పార్టీలో రెండు బలమైన వర్గాలుండేవి. ఇందిర అనుయాయులైన "సామ్యవాదులు", మొరార్జీ-తదితరుల నాయకత్వంలోని "సంప్రదాయ వాదులు" ఆధిపత్యం కొరకు బహిరంగంగానే విమర్శించుకునే వారు. 1967 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించినప్పటికీ, మెజారిటీ భారీగా తగ్గింది. పార్లమెంటరీ పార్టీ నాయకత్వానికి జరిగిన పోటీలో, ఆదినుంచీ నెహ్రూ-గాంధి కుటుంబ ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన మొరార్జీ దేశాయ్ ని ఇందిర ఓడించింది. మొరార్జీ తరహా సంప్రదాయ నాయకులు మరికొందరు ఇందిరకు విధేయత చూపారు అప్పట్లో. తప్పని పరిస్థితుల్లో తనను వ్యతిరేకించిన మొరార్జీ ని మంత్రివర్గంలో తీసుకుని కీలకమైన ఆర్థిక శాఖనిచ్చింది ఇందిర. బాంకుల జాతీయం, రాజా భరణాల రద్దు లాంటి విధాన పరమైన నిర్ణయాల నేపధ్యంలో, మొరార్జీ దేశాయ్ తో సహా, హేమామేమీలైన "సంప్రదాయ వాదుల" ను బయటకు పంపేందుకు, 1969 లో పార్టీని చీల్చింది ఇందిర. ఆమెతో విభేదించి, తమదే అసలైన పార్టీగా ప్రకటించి, దానికి సారధ్యం వహించి, ఆ తర్వాత జనతా పార్టీలో విలీనం చేసిన మొరార్జీ దేశాయ్ ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వ ప్రధాన మంత్రి కాగలిగారు. నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వాన్ని వ్యతిరేకించగలిగిన వారే, ప్రధాన మంత్రి స్థాయికి ఎదగ గలుగుతారని నిరూపించారాయన.

మైనారిటీలో పడిన ఇందిర వర్గం కాంగ్రేసేతర సోషలిస్టుల-వామ పక్షాల మద్దతు పొంది విప్లవాత్మక సంస్కరణలతో బలమైన నాయకురాలిగా ఎదగసాగింది. బంగ్లాదేశ్ మీద సాధించిన విజయం నేపధ్యంలో జరిగిన 1971 ఎన్నికల్లో మంచి మెజారిటీ సాధించి, కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నాయకురాలయ్యారు. పార్టీని అంటిపెట్టుకున్న విధేయుల్లో కొందరు క్రమేపీ ఆమెను అంతర్లీనంగా వ్యతిరేకించసాగారు. పార్టీని వీడిన "యంగ్ టర్క్స్" ఎస్ చంద్రశేఖర్ ప్రధాన మంత్రి స్థాయికి, కృష్ణకాంత్ ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. ఇందిర మరో విమర్శకుడు, ఐ కె గుజ్రాల్ కూడా రాజీనామా చేసి ప్రధాన మంత్రి కాగలిగారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల పూర్వ రంగంలో, ఆమెకు అత్యంత విధేయుడుగా వున్న జగ్జీవన్ రాం ఆమెను ఎదిరించి పార్టీని వదిలి, "కాంగ్రెస్ ఫర్ డెమాక్రసీ" ని స్థాపించి, జనతా కూటమితో కలిసి పోటీ చేయడం వల్లనే ఉప ప్రధాన మంత్రి కాగలిగారు. 1977 ఎన్నికలలో ఘోర పరాజయం పొందిన తర్వాత పార్టీలో తన వీర విధేయులకు తప్ప ఇతరులకు స్థానం లేకుండా చేసి, పార్టీని చీల్చి, ఇందిరా కాంగ్రెస్ పేరుతో పునర్నిర్మించి, ఎవరినీ నమ్మలేని పరిస్థితుల్లో 1978 లో తానే అధ్యక్ష పదవిని చేపట్టింది. అనతి కాలంలోనే అఖండ విజయం సాధించి ప్రధాని కాగలిగింది. దురదృష్టవశాత్తు, ఆమె వారసుడిగా ఎదుగుతున్న చిన్న కొడుకు సంజయ్ గాంధి దుర్మరణం పాలవడంతో, పెద్దకొడుకు రాజీవ్ గాంధిని నెహ్రూ-గాంధి కుటుంబ పాలనను కొనసాగించడానికి రాజకీయ తెరమీదికి తీసుకొచ్చింది. "వీర విధేయులు" దానికి మద్దతీయగా, "నిశ్సబ్ద వ్యతిరేకులు" మౌనం పాటించారు. సమయం కొరకు వేచి చూడ సాగారు. హత్యకు గురయ్యేంతవరకూ పార్టీ పగ్గాలు ఇందిరా గాంధి తన చేతుల్లోనే వుంచుకుని, తదనంతరం రాజీవ్ గాంధి కి వారసత్వం ఇచ్చింది. ఇక నాటినుంచి భారత జాతీయ కాంగ్రెస్‌ను ఇందిరా కాంగ్రెస్ అని వాడుకలో పిలవడం, ఏఐసీసీ (ఐ) అని ఉపయోగించడం మొదలైంది.

ఇందిర హత్యకు గురికావడంతో, నెహ్రూ-గాంధి వారసత్వంలో నాలుగో తరం పార్టీ నాయకత్వం మొదలైంది. అప్పటి వరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా వున్న రాజీవ్ గాంధి నాయకు డయ్యారు. 1984 సార్వత్రిక ఎన్నికల్లో, గతంలో ఎన్నడు సాధించలేనంత భారీ మెజారిటీతో రాజీవ్ పార్టీని గెలిపించారు. భారత జాతీయ కాంగ్రెస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సంవత్సరంలో 1985 లో, "ఇందిర కాంగ్రెస్ పార్టీ" అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ను, మంత్రివర్గంలో తీసుకుని ఆర్థిక శాఖను కేటాయించాడు. దరిమిలా వీపీ సింగ్ "ధిక్కార ధోరణి" ని సహించలేని రాజీవ్, తల్లి ఇందిర ఏ విధంగా మొరార్జీ ని తొలగించిందో, అలానే, సింగ్ శాఖలో మార్పులు చేసి రక్షణ శాఖకు మార్చాడు. ఎప్పుడైతే "బోఫోర్స్" కుంభకోణానికి సంబంధించిన సమాచారం వెలుగులో తేవడానికి సింగ్ సిద్ధపడుతున్నాడని అనుమానం వచ్చిందో, రాజీవ్ ఆయనను ఆ శాఖనుంచి కూడా తప్పించడం జరిగింది. కాంగ్రెస్ ప్రాధమిక సభ్యత్వానికి, పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసిన వీపీ సింగ్, 1989 లో జరిగిన ఎన్నికల్లో జనతా దళ్ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికై, "నేషనల్ ఫ్రంట్" ప్రభుత్వానికి సారధ్యం వహించి ప్రధాన మంత్రి అయ్యారు. ఆయనే కనుక రాజీవ్ గాంధీకి "వీర విధేయుడి" గా వుండిపోయినట్లైతే, తన ఆర్థిక శాఖను కాపాడుకో గలిగే వాడే కాని, ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగేవాడు కానే కాదు. 1991 మధ్యంతర ఎన్నికల్లో ప్రచారంలో వున్న రాజీవ్ గాంధి హత్యకు గురికావడంతో ఆయన స్థానంలో పీవీ నరసింహారావు "ఏకాభిప్రాయ అభ్యర్థి" గా పార్టీ పదవిని చేపట్టి, ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి అయ్యారు.

నెహ్రూ-గాంధి వారసత్వ పరంపరకు చెందని వారికి, పార్టీ సారధ్యం-ప్రధాన మంత్రి పదవి రావడం పలువురిని ఆశ్చర్య పరిచింది. సోనియా తన చెప్పు చేతల్లో వుంటాడనుకున్న వ్యక్తి, సొంత నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో, భారత దేశ ఆర్థిక సంస్కరణల ఆద్యుడిగా మన్ననలందుకోవడం జరిగింది. రాజకీయాలతో సంబంధం లేని మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా తెచ్చి, భవిష్యత్ ప్రధాని కావడానికి పునాదులు వేశారాయన. సోనియా ఆగ్రహానికి మాత్రం గురికాక తప్పలేదు. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీ నాయకత్వ బాధ్యతలనుంచి దయనీయంగా తొలగించారాయనను. ఆయన స్థానంలో వచ్చిన కేసరికి అదే పరిస్థితి ఎదురైంది తర్వాత. సోనియా శకం మొదలైంది. ఐదో తరం వ్యక్తిగా పార్టీ అధ్యక్షురాలైంది.

సోనియా అధ్యక్ష పదవిని అనుకున్నంత సులభంగా అధిష్టించలేదు. నెహ్రూ-గాంధి కుటుంబ వారసత్వ నాయకత్వంపై నున్న వ్యతిరేకత ప్రభావం ఆమెపై కూడా సహజంగానే పడింది. పీవీ రావడంతో ఇక వారసత్వ రాజకీయాలు స్వస్తి అని భావించిన పలువురు కాంగ్రెస్ "ఆశావహులు" నిరాశకు గురయ్యారు. ఇంతలో 2004 ఎన్నికల సంరంభం మొదలైంది. రద్దయిన లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన శరద్ పవార్, ఎన్నికల్లో కాంగ్రెస్ పక్ష ప్రధాని అభ్యర్థిగా, భారత దేశంలో పుట్టిన వారి పేరునే ప్రకటించాలన్న నినాదం లేవదీశాడు. ధిక్కార స్వరం వినిపించాడు. జన్మ తః ఇటలీ దేశస్తురాలైన సోనియాకు నెహ్రూ-గాంధి వారసురాలిగా ప్రధాని కాకూడదన్న భావం ఆయనకే కాకుండా మరి కొందరిలో కూడా ప్రస్ఫుటంగా కనిపించింది. మాట నెగ్గించుకోలేని పవార్, మాజీ లోక్ సభ సభాపతి సంగ్మాతో కలిసి "నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ" ని నెలకొల్పారు. స్థైర్యం కోల్పోని సోనియా, చాకచక్యంగా మన్మోహన్ సింగ్ ను తెర పైకి తెచ్చింది.

ఎన్నికల అనంతరం యూపీయే ప్రభుత్వానికి సారధ్యం వహించడానికి ఆమె తిరస్కరించి, ఆయనను ప్రధానిని చేసింది. ప్రణబ్ కుమార్ ముఖర్జీ గతంలో కేంద్ర ఆర్థిక శాఖ నిర్వహించినప్పుడు, రిజర్వ్ బాంక్ గవర్నర్ గా మన్మోహన్ సింగ్ పనిచేశారు. ఆర్థిక మంత్రి హోదా రిజర్వ్ బాంక్ గవర్నర్ హోదాకంటే పెద్దే కాకుండా, రిపోర్టింగ్ అధికారిక స్థాయి కూడా. అదే ప్రణబ్ కుమార్ ముఖర్జీ ఇప్పుడు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో పనిచేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ సీనియారిటీ, సోనియా నిర్ణయం ముందు పనికి రాలేదు. ఆయనకు ప్రధాని కావాలన్న ఆశా చావలేదు. అవకాశం వస్తే, ధిక్కరించగలిగితే, వదులుకుంటాడా? గతంలో రాజీవ్ గాంధి హయాంలో, ఇందిర హత్యానంతరం జరిగిన ఎన్నికల తర్వాత, నిర్లక్ష్యానికి గురై పార్టీని వీడి సొంత కుంపటి కూడా పెట్టుకున్నారు. తిరిగి పీవీ హయాంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా స్వగృహ ప్రవేశం చేసి, పార్టీకి-సోనియాకు విధేయుడిగా ఇప్పుడు కొనసాగుతున్నారు. ఆయనలోని అలనాటి రాజీవ్ (నెహ్రూ-గాంధి) వ్యతిరేకత దేనికైనా దారితీయవచ్చునేమో! శరద్ పవార్ మనసు మార్చుకుని, సోనియా సారధ్యంలోకి పరోక్షంగా చేరినప్పటికీ ప్రధాని కావాలన్న కోరిక దేనికైనా దారితీయవచ్చు.

తనకు మద్దతు ఇస్తూనే-ఇస్తున్నట్లు నటిస్తూనే, పరోక్షంగా, అవకాశం కొరకు ఎదురుచూస్తున్న పార్టీ లోని సొంత మనుషుల వ్యవహారం సోనియాకు తెలియకుండా వుంటుందా? ప్రతిభా పాటిల్ పదవీ కాలం ముగియగానే, ఆమె స్థానంలో కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా మన్మోహన్ ను ప్రతిపాదించి, ప్రధాని పీఠంపై తనయుడు రాహుల్ గాంధీని కూచోబెట్టాలంటే, నామ మాత్రం వ్యతిరేకత కూడా లేకుండా జాగ్రత్త పడాలి. బయటపడి ఏదో ఒక కారణం చూపించి, సోనియా సూచనను పాటించని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లు ఆమెకు అసలైన శత్రువులు కారని ఆమెకూ తెలుసు. జగన్ లాంటి వారు జాతీయ స్థాయిలో సోనియాని అస్థిరపరిచలేరని కూడా అమెకు తెలుసు. వచ్చిన చిక్కల్లా "కంట్లో నలుసుల" తోనే. సోనియాకు కాంగ్రెస్ పార్టీని మరో మారు ఏదో ఒక రకంగా, అత్తగారి తరహాలో చీలిస్తేనో, లేక, ఏదో కారణాన జాతీయ స్థాయిలో ఆమెను వ్యతిరేకించేవారు చీలిపోతేనే మంచిది. నెహ్రు-గాంధీ వారసత్వం చెక్కు చెదరకుండా వుండాలంటే కాంగ్రెస్ పార్టీలో మరో ప్రక్షాళన జరగాల్సిందే.

కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గురించి అందరూ మాట్లాడే వారే. క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా వున్న ఏకె ఆంటోనీ ఒకప్పుడు పార్టీని వీడిన వాడే. ప్రణబ్ ముఖర్జీ పార్టీని వీడిన వాడే. ఇందిరకు వ్యతిరేకంగా కాంగ్రెస్ (ఐ) నుంచి బయటకొచ్చి, భారత జాతీయ కాంగ్రెస్ (అర్స్) స్థాపించినప్పుడు అందులో చేరిన ప్రముఖుల్లో ఆంటోనీ ఒకరు. సోనియాకు సన్నిహితుడైన ప్రియరంజన్ దాస్ మున్షీ కూడా ఒకరు. ఆంటోనీ అంతటితో ఆగకుండా, కాంగ్రెస్ (ఎ) ను స్థాపించి, 1982 లో స్వగృహ ప్రవేశం చేసి, పార్టీలో క్రమశిక్షణను కాపాడే పనిలో వున్నాడు! సోనియా ఆదేశాలిచ్చిందన్న సాకుతో, మొయిలీలు-అహ్మద్ పటేల్లు-ప్రణబ్ ముఖర్జీలు, వారు చెప్పారని ఆంధ్రా నాయకులు, జగన్ కు మంచిచెపుతున్నట్లు నటిస్తూనే, ఆమెకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. అలాంటి వారిని గుర్తించే ప్రయత్నం జరుగుతుండొచ్చు. అందుకే పార్టీలో చీలిక తప్పకపోవచ్చు.

భారత జాతీయ కాంగ్రెస్(ఆర్) కాని, భారత జాతీయ కాంగ్రెస్ (ఎస్) కాని ఆవిర్భవించవచ్చు. అనూహ్యంగా తెర పైకి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి కాంగ్రెస్ (పి) స్థాపన జరిగినా ఆశ్చర్యం లేదు. అలా జరగాలంటే, జగన్ లాంటి యువ నాయకులను వెంట వుంచుకోవాల్నా? వదిలించుకోవాల్నా? అన్న ఆలోచన చేయకుండా సోనియా వుండే అవకాశాలు లేనే లేవు!

Thursday, July 8, 2010

అధిష్టానం మాటలకు అర్థాలే వేరయా: వనం జ్వాలా నరసింహారావు


భారత పునరుజ్జీవన రాజకీయ పర్యవసానమే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం. ఆవిర్భావ కాలం నాటి కాంగ్రెస్, తొలినాళ్లలో కొన్ని దశాబ్దాల పాటు, సమాజంలోని ఉన్నత-మధ్య తరగతి వర్గాల వారినే ఆకర్షించినప్పటికీ, 1905 నాటి స్వదేశీ ఉద్యమం ఫలితంగా, మధ్యతరగతి దిగువనున్న వర్గాల వారినీ కలుపుకుని పోయినప్పటికీ, ఈ నాటికీ, కుల-మతాల విషయం పక్కన పెడితే, ధనవంతుల-బలవంతుల పార్టీగానే మనుగడ సాగిస్తున్నదనవచ్చు. వారసత్వ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగం అనడం అతిశయోక్తి కాదు. కాకపోతే, అధిష్టానం దృష్టిలో, వారసత్వ రాజకీయాలకు ఎవరు అర్హులో-ఎవరు కాదో అనే విషయంలో, సమయానుకూలంగా మారుతూ వుంటుంది. రాజేష్ పైలట్, మాధవరావు సింధియాల పిల్లలకు ఒక నీతి, రాజశేఖర రెడ్డి తనయుడికొక నీతిని ఎంచుకుంది అధిష్టానం. అధిష్టానం బహిరంగంగా చెప్పినా-చెప్పక పోయినా, అడ్డంగా-నిలువుగా తల వూపి, నిమిషానికొక మాట మార్చడం కాంగ్రెస్ నాయకులకు పరిపాటై పోయింది.

జాతీయోద్యమానికి ఎప్పుడైతే మహాత్మాగాంధి నాయకత్వం లభించిందో, అప్పటినుంచి, అశేష జన వాహిని, తారతమ్యాలు మరిచి, కాంగ్రెస్ వెంట నడిచారు. ఏ గాంధి "సత్యాగ్రహం"-"నిరాహార దీక్ష" సిద్ధాంతాలకు అల నాడు కాంగ్రెస్ పట్ల ఆకర్షితులయ్యారో, ఆ సిద్ధాంతమే, నేడు వ్యక్తిగత అవసరాలను నెరవేర్చుకునేందుకు, అదే కాంగ్రెస్ వారసులకు ఆయుధంగా ఉపయోగపడుతున్నదనాలి. మహాత్మా గాంధి రాజకీయ వారసుడు జవహర్లాల్ నెహ్రూ, బ్రిటీష్ వలస విధానాన్ని-సామ్రాజ్య వాదాన్ని తుదముట్టించేందుకు, భారత ప్రజాశక్తిని, కాంగ్రెస్ అనే కవచం కింద కు చేర్చారు. బ్రిటీష్ పాలన అంతరించి, నవ భారత శకం ఆరంభమయిన పిదప, కాంగ్రెస్ రూపురేఖలే మారిపో సాగాయి. నెహ్రూ నాయకత్వంలోనే, భిన్న స్వరాల కాంగ్రెస్ పెద్దలు, మహాను భావుల త్యాగాల ఫలితంగా సిద్ధించిన స్వతంత్ర ఫలితాలను, తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. కాకపోతే, పార్టీలో సంభవిస్తున్న పరిణామాలను గమనించిన నెహ్రూ సహితం, అన్ని దృక్ఫదాల వారిని కలుపుకుని పోవాలన్న ఆరాటంతో, మౌనంగా, అన్నింటినీ సహించాల్సి వచ్చింది. స్వార్థపర శక్తులు తమ అవసరాలకు ఆ రోజుల్లోనే పార్టీని ఉపయోగించుకునే ప్రయత్నం చేసినప్పటికీ, విలువలకు కట్టుబడ్డ ఎందరో మహాను భావులు మాత్రం సిద్ధాంత పరంగా ఒకరినొకరు విభేదించారే తప్ప, ఇప్పటి లాగా నిమిషానికొక మాట మార్చలేదు.

స్వాతంత్రోద్యమం నాటి భారత జాతీయ కాంగ్రెస్ కు ఇప్పటి భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) కు పోలికే లేదనాలి. అలనాటి కాంగ్రెస్ లో అభిప్రాయ భేదాలకు, మైనారిటీ వ్యక్తుల సూచనలకు గౌరవం లభించేది. ఇక ఇప్పుడో, అధిక సంఖ్యాకుల మద్దతున్న వారికి, ప్రజా బలం వున్న వారికి, అధిక సంఖ్యాకుల ప్రజా ప్రతినిధుల ఆదరణ వున్న వారికి, ఏదో ఒక నెపంతో, పార్టీ దూరం చేసుకుంటున్నది. ఒక నాడు పార్టీ అనుసరించిన మద్యే మార్గం, అతివాద-మితవాద శక్తులను కలుపుకుని పార్టీని పటిష్టం చేయడమైతే, ఈ నాటి మద్యే మార్గం, భిన్నాభిప్రాయాలను వెల్లడించమని పరోక్షంగా అధిష్టానం ప్రోత్సహించడమే. అధిష్టానంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, అధినేత్రి దగ్గర పలుకుబడిని సంపాదించుకునేందుకు, ప్రత్యక్షంగానో-పరోక్షంగా నో ప్రతి రాష్ట్రంలోని, సమ్మతి-అసమ్మతి వాదులను పురికొల్పడం ఈ నాటి మద్యే మార్గం. కింది స్థాయినుంచి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని వారిని, స్థానికంగా ప్రజల మద్దతు లేని వారిని, పోటీ చేసి గెలవలేని వారిని, అధిష్టానం దగ్గర చెవులు కొరుకుతూ తిరిగే వారిని చేర దీయడం పార్టీకి అలవాటుగా మారింది. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర పోషించి, అన్నీ అనుభవించి, అక్కడ తమ అవసరాలన్నీ తీర్చుకుని, అక్కడ వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తూలనాడిన వారంతా పార్టీలో ప్రముఖులవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అంటూ గొంతు చించుకుంటున్న వారంతా, ఎప్పుడో ఒకప్పుడు పార్టీని దుయ్యబట్టిన వారో, ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారో కావడం విశేషం.

స్వర్గీయ పర్వత నేని ఉపేంద్ర తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ కీలకమైన వ్యక్తిగా వుండి, పార్టీ పక్షాన, కేంద్ర మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆయన పార్లమెంటులో తనకు వ్యతిరేకంగా మాట్లాడాడన్న నెపంతో, "నీ అంతు చూస్తాను"అని ఒకసారి హైదరాబాద్ పర్యటన కొచ్చిన సోనియా ఉపేంద్రను ఉద్దేశించి అన్నట్లు అప్పట్లో (డిసెంబర్ 22, 1987) పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. స్వయంగా తనను అలా అన్నదని ఉపేంద్ర గారే విలేకరులకు తెలియ చేశారప్పుడు. కానీ, తర్వాత ఏమైంది? అదే ఉపేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధాన భూమిక వహించి, చివరకు కాంగ్రెస్ రాజకీయాల్లోకి తన వారసుడిగా స్వయాన అల్లుడిని తీసుకొచ్చారు. తెలుగుదేశంలో వున్నన్నాళ్లు కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారాయన. అసలాయన కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం సోనియాగాంధి కాదా ?ఆయన లాగా కాంగ్రెస్ పార్టీని జగన్ విమర్శించలేదే !

ఈ నాడు కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన పదవిలో వున్న జైపాల్ రెడ్డి సోనియా గాంధి భర్త రాజీవ్ గాంధిని అనని మాట లేదు. ఎన్ని రకాల దూషించడానికి వీలుందో అన్ని రకాలుగా, బోఫోర్స్-ఫెయిర్‌ ఫాక్స్ విషయాల్లో, రాజీవ్ గాంధిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దూషించారు జైపాల్ రెడ్డి గారు. జనతా పార్టీనుంచి గెలిచి కేంద్రంలో మంత్రి పదవిని అనుభవించారు. మరిప్పుడాయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి. అదృష్టం కలిసి వస్తే ఎప్పుడో ఒకప్పుడు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ కూడా వుండొచ్చు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో, కాంగ్రెస్ పార్టీలో మొదటి సారి చీలిక వచ్చినప్పుడు, వ్యవస్థాగత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, నంద్యాల లోక సభ స్థానానికి నామినేషన్ కూడా వేసి, రాత్రికి రాత్రే పార్టీ ఫిరాయించి, ఇందిరా గాంధి నాయకత్వంలోని కాంగ్రెస్ (ఆర్) పక్షాన గెలిచిన స్వర్గీయ పెండేకంటి వెంకట సుబ్బయ్య సంగతేంటి ? అంతెందుకు సాక్షాత్తు ఇందిరా గాంధి మీద ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వీరేంద్ర పాటిల్ కాంగ్రెస్ (ఐ) లో చేరి తన స్థానాన్ని బల పర్చుకోలేదా ? తెలంగాణ ప్రజా సమితి పేరుతో కాంగ్రెస్ ను ధిక్కరించి, ఎన్నికల్లో పోటీ చేసి, పది మందికి పైగా అభ్యర్థులను పార్లమెంటుకు గెలిపించుకున్న స్వర్గీయ మర్రి చెన్నా రెడ్డిని అధిష్టానం ఏం చేయ గలిగింది. ఒక్క సారి కాదు ... కనీసం మూడు సార్లు ఆయన అధిష్టానాన్ని ధిక్కరించారు. ఇంతెందుకు.. ఎన్నికలు జరిగిన ప్రతి సారి, టికెట్ దొరకని పలువురు నేతలు, ఇండిపెండెంటుగా పోటీ చేయడం, ఆరేళ్లు బహిష్కరించ బడడం, స్వగృహ ప్రవేశం చేయడం, లోగడ కంటే, మంచి పదవులు పొందడం తెలిసిన విషయమే.

జగ్జీవన్ రాం, ఎన్డీ తివారి, అర్జున్ సింగ్ లను కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయగలిగింది ? శరద్ పవార్ గురించి ఏమనాలి ? సోనియా గాంధి విదేశీయ తను తెర పైకి తెచ్చిన మొదటి వ్యక్తి ఆయన కాదా ? ఇవ్వాళ ఆయన లేకపోతే భారత జాతీయ కాంగ్రెస్ మనుగడే లేదు. మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ను కాదనే ధైర్యం సోనియా గాంధీకి వుందా? తమిళ నాడులో పీవీ నరసింహా రావు పొత్తుల నిర్ణయానికి వ్యతిరేకంగా "తమిళ మానిల కాంగ్రెస్" ను స్థాపించి, పార్లమెంటుకు ఎన్నికై, కాంగ్రేసేతర ప్రభుత్వంలో ప్రధాన కేంద్ర మంత్రిత్వ శాఖను నిర్వహించిన చిదంబరం కాంగ్రెస్ క్రమ శిక్షణకు లోబడినట్లా ? కాదా? వీరందరి ధిక్కారం కంటే జగన్ ధిక్కారం గొప్పదా?

జగన్ పట్ల కాంగ్రెస్ అధిష్టానం వైఖరి ఎందుకిలా వుందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ వై ఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం దరిమిలా రాష్ట్రంలోనూ-రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోనూ ఊహించని పరిణామాల నేపధ్యంలో, రోశయ్యకు ముఖ్య మంత్రి పీఠం దక్కింది. జగన్ కు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరూ (దాదాపు) మద్దతు లభించినా అధిష్టానం మద్దతు కరువయింది. ఒక సమయంలో రోశయ్య మంత్రివర్గంలోని పలువురు బహిరంగంగానే జగన్ పక్షాన నిలిచారు. ఎవరు అవునన్నా-కాదన్నా, అభిమానుల అండ దండలు, గతంలో ఏ కాంగ్రెస్ నాయకుడికి లభించనంత మోతాదులో జగన్ కు లభించాయి. ముఖ్య మంత్రి రోశయ్య గారు తన పీఠాన్ని పదిల పర్చుకునే దిశగా అడుగులు వేస్తున్న సంకేతాలు జగన్ పసిగట్టడంతో, ప్రజలకు చేరువయ్యే దిశగా అతను పావులు కదిలించ సాగాడు. పరోక్షంగా పార్టీ (రాష్ట్రంలో) శ్రేణుల మద్దతు, ప్రత్యక్షంగా ప్రజల-పార్టీ కార్యకర్తల అండదండలు విరివిగా లభించడంతో అధిష్ఠానానికి ఫిర్యాదులు మోయడం మొదలయింది. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయ లేని వారు, ఏళ్ల తరబడి పార్టీలో వున్నా పైకెదగ లేక పోయిన వారు, ఈర్ష్యాసూయలకు అలవాటు పడ్డ వారు, రాజ శేఖర రెడ్డిగారి హయాంలో నోరు మెదపడానికి కూడా భయ పడేవారు, అధిష్టానం కనుసన్నల్లో మెలిగే వారు, రోశయ్య గారి దృష్టిలో పడాలనుకునే వారు, ఇలా... ఒక్కో విధంగా.. ఎదురుపడి నిలిచి జగన్ ను ఎదిరించే శక్తిలేని వారందరు, తమ బాణాలను ఆయన పైకి ఎక్కుపెట్టారు. మహ బూబాబాద్ పర్యటనకు పోతున్న జగన్ ను అధిష్టానం ప్రతినిధులు సందిగ్ధంలో పడవేశారే గాని, ఇదమిద్ధంగా పోవద్దని-పొమ్మని చెప్పలేదు. తెలంగాణ వాదం బలంగా వున్న నేపధ్యంలో, ఆయన మహబూబాబాద్ పర్యటన అధిష్టానానికి సాకుగా దొరికింది. అంతవరకు బాగుంది... ఎందుకాయన కోస్తాంధ్ర పర్యటనను అడ్డుకోవాల్సి వచ్చిందో అర్థం కాని విషయం.

చివరకు అధిష్టానం తలవంచక తప్పలేదు. రోశయ్యతోనే అధిష్టానం ఆంతరంగాన్ని బహిష్కరించారు. హైదరాబాద్ లో ఆయన ఉదయం చేసిన ప్రకటనకు విరుద్ధంగా, ఢిల్లీలో ఆయన నోట వేరే మాట పలికించింది అధిష్టానం. బహుశా ముఖ్య మంత్రి రోశయ్య కూడా అధిష్టానాన్ని అర్థం చేసుకోలేక పోతున్నాడేమో ! బహుశా జగన్ కుటుంబ సభ్యులు సోనియాను కలిసినప్పుడే, ఇరువురి మధ్య ఒక అవగాహన కుదిరుండ వచ్చేమో ! జగన్ మీడియాకు రాసిన లేఖ ఆంతర్యం బహుశా, తనకు అయిష్టంగానన్నా సోనియా మద్దతుందని చెప్పడమేనేమో ? జగన్ ధిక్కార ధోరణిని అవలంభించాడని భావించినా, అధిష్టానం చేయగలిగిందేమీ లేదు. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర వహించి ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్న వారిని ఏమీ చేయలేని సోనియా, పార్టీని ధిక్కరించి బయటకు పోయి వేరు కుంపటి పెట్టుకున్న వారిపై ఆధార పడ్ద సోనియా, ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ లాంటి చురుకైన యువ నాయకుడిని వదులుకునే సాహసం చేస్తుందా? ఒక వేళ దుస్సాహసం చేస్తే, ఇటు రాష్ట్రంలోను-అటు కేంద్రంలోను పార్టీ సంక్షోభంలో పడదా? అవకాశం కొరకు ఎదురు చూస్తున్న పవార్లు, మమతలు తమ మద్దతును జగన్ కు ఇవ్వకుండా వుంటారా? ఏదేమైనా, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు ఒకరిపై మరొకరు నిప్పులు కురిపించుకుంటూ మాట్లాడడం పార్టీకి శ్రేయస్కరం కానే కాదు.