Showing posts with label బొత్స సత్యనారాయణ. Show all posts
Showing posts with label బొత్స సత్యనారాయణ. Show all posts

Monday, March 18, 2013

సంఖ్యాపరంగా శాసనసభ విశ్వాసం కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వం: వనం జ్వాలా నరసింహారావు


సంఖ్యాపరంగా శాసనసభ 

విశ్వాసం కోల్పోయిన రాష్ట్ర ప్రభుత్వం


కిరణ్ సర్కారుపై అవిశ్వాసం వీగిపోయినప్పటికీ, ప్రభుత్వాన్ని మైనారిటీలోకి పడిపోయేలా మాత్రం చేసింది. కాంగ్రెస్ నుంచి 9 మంది, టీడీపీ నుంచి 7 మంది, మొత్తం పదహారు మంది వారి పార్టీల విప్‍లను ధిక్కరించి, అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసి, నేడో రేపో స్పీకర్ అనర్హత అస్త్రానికి గురికాబోతున్నారు. కొన్నాళ్ల క్రితం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్యాపదేశంగా తమ పార్టీ శాసన సభ్యులపై అన్న వ్యాఖ్యలు నిజమని నిరూపించబడింది. ఆనాడు పాత్రికేయులు బొత్స చెప్పిన తొమ్మిదిమంది కాంగ్రెస్ వారు ఎవరని మరీ మరీ అడిగినా రాని సమాధానం అవిశ్వాస తీర్మానం ద్వారా బయటకొచ్చింది. అలానే అవిశ్వాస తీర్మానం ఓటింగుకు వస్తే తన పార్టీకి నష్టమనుకున్న చంద్రబాబు నాయుడు భయం కూడా నిజమని తేలింది. తనవారు కారేమోననుకున్న ఏడుగురి విషయంలో ఆయన అనుమానం ధృఢ పడింది. ఆరుగురు అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసి విప్‌ను ధిక్కరిస్తే, మరొక సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొననప్పటికీ.. నోటీసుకు మద్దతు తెలిపారు. అదికూడా విప్ ఉల్లంఘనే!

'అర్ధరాత్రి' సమయంలో జరిగిన అవిశ్వాస పరీక్షలో.... ఎవరి 'విశ్వాసం' ఎంతో తేలిపోయింది! కాంగ్రెస్ టికెట్ల పై గెలిచి... జగన్ పంచన చేరిన తొమ్మిది మంది శాసనసభ సాక్షిగా తిరుగుబాటు బావుటాను ఎగురవేశారు. ఆది నుంచి అనుకుంటున్న ఎనిమిది మందితోపాటు... చివర్లో జోగి రమేశ్ కూడా కాంగ్రెస్‌కు 'చెయ్యి'చ్చారు. జగన్‌కు జై కొట్టారు. తెలుగుదేశంకు చెందిన ఏడుగురు సభ్యులు 'సైకిల్' దిగిపోయారు. 'మాది తటస్థ వైఖరి' అని తేల్చి చెప్పిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి... అనుకోకుండా మజ్లిస్ పార్టీ కూడా తోడైంది. అవిశ్వాస ప్రక్రియకు దూరంగా నిలిచింది. దీంతో... ముందుగా అనుకున్నట్లు గానే అవిశ్వాసం వీగిపోయింది. వైసీపీ రెండు అవిశ్వాస నోటీసులు ఇచ్చినప్పటికీ, టీఆర్ఎస్ నోటీసునే స్పీకర్ పరిగణనలోకి తీసుకున్నారు. దీనికి 45 మంది సభ్యులు మద్దతు ఇవ్వడంతో చర్చ మొదలైంది. వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు... విమర్శలు, ప్రతి విమర్శలు... ఆరోపణలు, సమాధానాలు... ఇలా వాడిగా, వేడిగా సభా సమరం కొనసాగింది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ... వీటిలో ప్రతి పార్టీ మరో పార్టీపై దుమ్మెత్తిపోస్తూ తమ తమ వాదనలు వినిపించాయి. ఉదయం 11 గంటల సమయంలో మొదలైన చర్చ.... అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివర్లో... విపక్షాల విమర్శలకు ముఖ్యమంత్రి కిరణ్ సుదీర్ఘ సమాధానం ఇస్తూ తన ప్రభుత్వ పని తీరును ఆకాశానికి ఎత్తివేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పక్ష నేత ఈటెల రాజేందర్ ఆనవాయితీ ప్రకారం మాట్లాడారు. అర్ధరాత్రి దాటాక అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఓటింగ్ జరిపారు. దీనికి టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎంతోపాటు కాంగ్రెస్, టీడీపీ రెబెల్స్... మొత్తం 58 మంది బలపరిచారు. 142 మంది అవిశ్వాసాన్ని వ్యతిరేకించారు. టీడీపీ, ఎంఐఎం సభ్యులతో సహా 91 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. టీడీపీ, ఎంఐఎం మద్దతు ఇచ్చినా సరే, అవిశ్వాసం వీగి పోవడానికే అవకాశాలు ఎక్కువగా వుండేవి. అయితే, చివరి నిమిషం దాకా అధికార పక్షానికి ముచ్చెమటలు  పోసేవి. ప్రస్తుతం ప్రభుత్వం అవిశ్వాసం నుంచి గట్టెక్కినా, సభలో మేజిక్ ఫిగర్ ను సాధించకపోవడంతో మైనారిటీలో పడిపోయినట్లే! ఏదైతేనేం... మరో ఆరునెలలపాటు 'అవిశ్వాసం' ఊసు ఉండదు.


రెండేళ్లు.. రెండు అవిశ్వాస తీర్మానాలు.. రెండుసార్లూ విజయాలు! ఇదీ.. సీఎంగా కిరణ్ ఘనత. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కూడా దాటలేదు. కానీ.. రెండు అవిశ్వాస తీర్మానాలను దాటేశారు. గత ఏడాది టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం గండం నుంచి గట్టెక్కారు. తాజాగా, టీఆర్ఎస్, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు చర్చకు వచ్చాయి. వీటికి తాము మద్దతు ఇవ్వడం లేదని టీడీపీ ముందుగానే ప్రకటించడంతో అధికారపక్షం పైయెత్తు వేసింది. అవిశ్వాసంపై చర్చ, ఓటింగ్ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని భావించి ప్రతిపక్షాలకు ఝలక్ ఇస్తూ ఒక్క రోజులోనే చర్చ, ఓటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించింది. అయితే, టీడీపీ నిర్ణయంతోనే 'సేఫ్'లోకి వెళ్లిన పాలక పక్షానికి ఎంఐఎం నిర్ణయం 'డబుల్ సేఫ్'లోకి నెట్టింది. అవిశ్వాసంపై పంతం నెగ్గించుకున్నామన్న ఆనందం... అధికార పక్షం దాడిని అంతే ధాటిగా తిప్పికొట్ట లేకపోయామన్న స్వల్ప నిరాశ! ఇదీ టీఆర్ఎస్ పరిస్థితి. ప్రధాన ప్రతిపక్షం కాకపోయినప్పటికీ... ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టి, చర్చ జరిగేలా చూడటంలో టీఆర్ఎస్ విజయం సాధించింది. తనకు 17 మంది సభ్యుల బలమే ఉన్నప్పటికీ, ఇతర పక్షాలనూ కూడగట్టి, చివరికి వైసీపీ కూడా తమ వెంటే నడిచేలా చేసింది.

ఈ నేపధ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అవిశ్వాస తీర్మానం పూర్వాపరాలను తెలుసుకోవడం మంచిది. అధికారంలో వున్న పార్టీ పనితీరును నిశితంగా విమర్శించేందుకు, ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ పథకాలలోని లోపాలను-లోటుపాటులను ఎత్తి చూపేందుకు, ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు, తద్వారా ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించేందుకు, అవిశ్వాస తీర్మానాన్ని ఒక పదునైన ఆయుధంగా, ప్రజాస్వామ్య దేశాలలో-ముఖ్యంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశాలలో ప్రతిపక్షాలు వాడుకుంటాయి. సాధారణంగా ఈ పనిని ప్రధాన ప్రతిపక్షం తన భుజాన వేసుకుంటుంది. ఎన్నికైన ప్రభుత్వానికి ఒక నిర్దిష్ట కాలపరిమితి వరకు అధికారంలో వుండే అవకాశం వున్నప్పటికీ, అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడం ద్వారా, ఆ కాలపరిమితి లోపునే, ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో సఫలం కావచ్చు, విఫలం కావచ్చు. ఒక విధంగా ఆలోచిస్తే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, అధికారంలో వున్న ప్రభుత్వానికి చట్ట సభలో మెజారిటీ లేదని నిరూపించి, మైనారిటీలో పడవేసి, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాని, ముందస్తుగా ఎన్నికలకు పోవడం కాని అవిశ్వాస తీర్మానం ద్వారా సాధించవచ్చు. కాకపోతే, అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన ప్రతిపక్ష పార్టీ, తీర్మానం నెగ్గించుకోగలిగితే, ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని అందించడానికి సిద్ధంగా వుండగలగాలి.  ఆషామాషీగా తీర్మానం పెట్టడం సాంప్రదాయం కాదు.

అవిశ్వాస తీర్మానం అనే ప్రక్రియ లేని కొన్ని ప్రజాస్వామ్య దేశాలలో, ప్రభుత్వాధినేతలను లేదా ఇతర ప్రజాప్రతినిధులను, పదవీచ్యుతులను చేసేందుకు "ఇంపీచ్‌మెంట్" కాని "రీకాల్" పద్ధతి కాని ఉపయోగించుకుంటాయి ప్రతిపక్షాలు. వీటికి అవిశ్వాస తీర్మానానికి మధ్య కొంత తేడా వున్నప్పటికీ, ఫలితం మాత్రం ఒకటే. అవిశ్వాస తీర్మానంలో ఇరుపక్షాలకు లభించిన మద్దతు ఓట్లు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటాయి. తాము ప్రతిపాదించిన అవిశ్వాసానికి ఇంతమంది మద్దతు వుందని బహిరంగపర్చడం ద్వారా, ప్రభుత్వాన్ని నిరంతరం ఇరుకున పెట్టవచ్చు. ఉదాహరణకు మొన్న ముగిసిన అవిశ్వాసాన్నే చెప్పుకోవచ్చు. దాని మూలాన, ప్రభుత్వానికి మద్దతిచ్చే సభ్యుల సంఖ్య స్పష్టంగా బయటపడింది. భవిష్యత్‍లో ఆ సంఖ్య పిసరంత తగ్గినా, ప్రభుత్వం మైనారిటీలో పడినట్లే! ఇలా మెడమీద కత్తి వేలాడుతూనే వుంటుంది. అవిశ్వాస తీర్మానానికి సెన్సార్ తీర్మానం అన్న పేరు కూడా కొన్ని చోట్ల వాడుకలో వుంది. కాకపోతే రెంటి మధ్యా తేడా కూడా వుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గితే, ప్రభుత్వం రాజీనామా తప్పనిసరి. సెన్సార్ తీర్మానం నెగ్గడం అంటే, ప్రభుత్వ విధి విధానాలకు సభ ఆమోదం తెలపడం లేదని అర్థం. సెన్సార్ తీర్మానం నెగ్గినప్పటికీ మంత్రివర్గం రాజీనామా చేయనవసరం లేదు. సెన్సార్ తీర్మానం ఏ ఒక్క మంత్రికి వ్యతిరేకంగానో, లేక, ఒకరికంటే ఎక్కువ మంత్రుల బృందానికి వ్యతిరేకంగానో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అవిశ్వాస తీర్మానం మాత్రం యావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వుంటుంది. ఒక్కో సారి, ప్రభుత్వమే, అది ప్రతిపాదించిన కొన్ని బిల్లుల విషయంలో, ఒక అడుగు ముందుకు వేసి, ఆ బిల్లు సభ ఆమోదం పొందడం అంటే, తమ ప్రభుత్వంపై విశ్వాసం ప్రకటించినట్లే అని స్పష్టం చేస్తుంది. అసంతృప్తితో వున్న అధికార పక్ష సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు చేయకుండా నిరోధించే చర్యలు కూడా చేపడ్తుంది ప్రభుత్వం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృక అని చెప్పుకునే బ్రిటీష్ సాంప్రదాయం ప్రకారం, ద్రవ్య వినియోగ బిల్లు కనుక చట్ట సభ ఆమోదం పొంద లేకపోతే, అవిశ్వాస తీర్మానం గెలిచినప్పుడు జరిగే విధంగానే, ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వుంటుంది. పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలకు పోవాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది.

అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో దేశ దేశాలలో కొన్ని తేడాలున్నాయి. జర్మనీ, స్పెయిన్, ఇజ్రాయెల్ లాంటి దేశాలలో, అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన ప్రతిపక్ష పార్టీ, అదే ప్రతిపాదనలో, ప్రభుత్వం ఓడిపోతే-అధినేత రాజీనామా చేస్తే, ఆయన స్థానంలో ఎవర్ని నియమించాలో కూడా తెలియచేయాలి. అంటే ఒకే ఓటు ద్వారా అధికారంలో వున్న ప్రభుత్వంపై అవిశ్వాసం, రాబోయే ప్రభుత్వంపై విశ్వాసం ప్రకటించడం అన్న మాట. బ్రిటీష్ సాంప్రదాయం ప్రకారం, ప్రతిపక్షాలకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే అవకాశం ఇవ్వకుండా, ప్రభుత్వమే విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు. చాలా సందర్భాలలో అవిశ్వాస తీర్మానాలు కేవలం ప్రభుత్వ పని తీరును విమర్శించేందుకు పరిమితం కావడంతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అవి నెగ్గే అవకాశాలు లేకపోయినా ప్రతిపాదించడం చేయడం ప్రతిపక్షాల ఆనవాయితీ అయిపోయింది. అదే విధంగా, ఒకసారి అవిశ్వాస తీర్మానం వీగి పోతే ఒక నిర్దుష్ట కాలపరిమితి వరకు మళ్లీ ప్రతిపాదించడానికి ఆస్కారం లేదు. మన దేశంలో రాష్ట్రపతి ప్రసంగానికి, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లాంటిదే, బ్రిటీష్ సాంప్రదాయంలో రాణి ప్రసంగానికి వుంటుంది. ఆ తీర్మానం వీగి పోయినా, ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందే. అది కూడా ప్రభుత్వానికి సభ విశ్వాసం కోల్పోయినట్లే భావించాలి. 

                ప్రప్రధమ పార్లమెంటరీ సాంప్రదాయ అవిశ్వాస తీర్మానం మార్చ్ 1782 లో బ్రిటన్‌లో ప్రవేశ పెట్టడం జరిగింది. అమెరికన్ రివల్యూషనరీ యుద్ధంలో, యార్క్ టౌన్ వద్ద బ్రిటీష్ ప్రభుత్వం ఓటమి చెందడంతో, అప్పటి ప్రధాన మంత్రిపైన, మంత్రి మండలిపైనా విశ్వాసం లేదని ప్రతిపక్షాలు పార్లమెంటులో తీర్మానం ప్రతిపాదించాయి. అయితే, వెంటనే, తన రాజీనామాను నాటి ప్రధాని లార్డ్ నార్త్ బ్రిటీష్ రాణికి సమర్పించడంతో కథ సుఖాంతమైంది. అదే విధంగా 19 వ శతాబ్దం తొలినాళ్లలో, కొందరు బ్రిటీష్ ప్రధాన మంత్రులు తమకు సభలో మెజారిటీ లేకపోయినా పాలన చేసేందుకు ప్రయత్నాలు చేయడంతో, ప్రతిపక్షాల నుంచి మొదలైన వ్యతిరేకత, శతాబ్దపు మధ్యకాలానికల్లా, అవిశ్వాస తీర్మానం ఒక పటిష్టమైన ఆయుధంగా మారడానికి దారి తీసింది. ఇప్పటి వరకు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్‌లో, 11 మంది ప్రధాన మంత్రులు అవిశ్వాస తీర్మానం పుణ్యమా అని పదవులను కోల్పోయారు. 1925 తరువాత ఒకే ఒక్క సారి-జేమ్స్ కాలహాన్ కు వ్యతిరేకంగా మాత్రమే అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఆధునిక కాలంలో, సర్వసాధారణంగా, అవిశ్వాస తీర్మానాలను నెగ్గించుకోవడం దాదాపు జరగడం లేదనే అనాలి. పార్టీ క్రమశిక్షణ పేరుతో విప్ జారీ చేయడంతో విధిగా ఏ పార్టీ వారు ఆ పార్టీకే ఓటు వేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులు  ఆ విధంగా అవిశ్వాస సమయంలో తగ్గి పోయాయి. ఒకటి రెండు ఓట్ల మెజారిటీతో అధికారంలో కొచ్చిన సందర్భాలలో అవిశ్వాస తీర్మానాలు నెగ్గుతున్నాయే మో కాని సాధారణంగా ఓటమి పాలే అవుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాలలో అవిశ్వాస తీర్మానాలను ఎక్కువ సార్లు ప్రతిపాదించడం జరుగుతోంది.

Saturday, April 7, 2012

"చేతులు" కలిసినట్టేనా?: వనం జ్వాలా నరసింహారావు




సూర్య దినపత్రిక (07-04-2012)


వనం జ్వాలా నరసింహారావు

మొత్తం మీద అంతా అనుకున్నట్లు గానే-అనుకున్న విధంగానే జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య తలెత్తిన వివాదాన్ని గులాం నబీ ఆజాద్ తనదైన “అధిష్టానం దూత” శైలిలో ప్రస్తుతానికి సమసిపోయేట్లు చేశారు. ఇకపై వారిద్దరిలో ఎవరు కూడా ఒకరికంటే మరొకరి అధికులు కారని, ఇద్దరూ ఆజాద్‍ కనుసన్నలలో పనిచేయాలని నిర్ణయం జరిగినట్లు మీడియా కధనాలొచ్చాయి. తగాదా లేకుండా కలిసిమెలిసి పనిచేయాల్సిన వారిద్దరూ, అనవసరంగా ఒకరితో మరొకరు తగవులా డి, తానెక్కువంటే తానే ఎక్కువని కయ్యానికి కాలుదువ్వి, చివరకు, ఇద్దరూ తక్కువనే రీతిలో ఆజాద్ కింద పనిచేయాల్సిన స్థితికి చేరుకున్నారు. రాజీ కుదిరించే మార్గంలో, ఆజాద్ పదే-పదే మేడం ప్రస్తావన తీసుకొచ్చారు. ఆమె గారు కిరణ్-బొత్సలపై కోపంగా వున్నారని కూడా చెప్పాడు. త్వరలో జరగబోయే ఉపఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి ధీటుగా పోటీ ఇవ్వకపోతే. వారిద్దరితో పాటు తానూ ఇంటిదారి పట్టాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. పనిలో పనిగా కిరణ్ కుమార్‌కు మరికొన్ని పాఠాలు కూడా చెప్పారట. అదే విధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పేర్ల జాబితా తయారుచేసి తన ఆమోదం కొరకు పంపాలని బొత్సకు సూచించారు. నామినేటెడ్ పదవుల పందేరాలు మొదలెట్టాలని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం విషయంలో ఉపముఖ్యమంత్రితో, బొత్సతో చర్చించాలని సీఎంను ఆదేశించారు. ఉపఎన్నికలలో విజయం సాధించడానికి, నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. అంటే, ఇక అంతా ఆజాద్ పాలనే కొనసాగనున్నదన్న మాట! ఏదేమైనా, తామంతా ఒకటే జట్టు అని, అంతా కలిసి కట్టుగా వుంటామని బొత్స-కిరణ్ ప్రకటించడం గమనించాల్సిన విషయం!

ఈ తతంగం నమ్మాలంటే, బొత్స-కిరణ్ "కలిసి పోయారని" భావించాలంటే, కనీసం ఒక్క సారన్నా, వారిద్దరూ ఢిల్లీకి "కలిసి పోవాలి". అదెలాగూ జరుగదు కనుక వీరిద్దరి మధ్య రాజీ తాత్కాలికమే! దానికి ఉదాహరణగా, ఏసిబి లో చోటుచేసుకుంటున్న పరిణామాలనే తీసుకోవాలి. బాధ్యతాయుతమైన పదవిలో వున్న ఒక ఏసిబి అధికారిని పదోన్నతిపై బదిలీ చేయడం, ఆయనను రిలీవ్ చేసేది లేనేలేదని ఆయన పై అధికారి అనడం, అవసరమైతే తానే శెలవుపై వెళ్తాననడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యంతో సర్దుమణిగినట్లే కనిపించి మరింత వివాదానికి దారి తీయడం, ఇదంతా జరుగుతుండగానే బొత్స మనుషులు అనుకున్న తెల్ల రేషన్ కార్డుల వారిపై మరి కొన్ని దాడులు జరగడం, కిరణ్‌కు-బొత్సకు మధ్య రాజీ పెట్టిందే కాని అతుక్కున్నది కాదని అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగిస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు సంక్షోభం వచ్చినా, అది కేవలం వచ్చినంత వేగంగా సర్దుమణగడానికేనేమో అనిపిస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వుంది. అదే మళ్లీ మరో మారు జరుగుతోందిప్పుడు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, దామోదర రాజనర్సింహ మధ్య చిచ్చు పుట్టినట్లే పుట్టి, వెంటనే ఆరినట్లే ఆరిపోయింది. కనీసం పైకన్నా అలా జరిగింది. ఇక ముసళ్ల పండుగ ముందుందా? ప్రస్తుతానికి కథ కంచికేనా? అంటే దానికి సమాధానం అంత తేలిగ్గా దొరికేది కాదు. మొత్తం మీద అధిష్టానం ముగ్గురినీ ఢిల్లీకి పిలిచి, పెట్టాల్సిన చివాట్లు పెట్టి, పనిలో పనిగా గుంజాల్సినంత గుంజి, తలంటు పోసి, రాజకీయ రాజీ కుదిర్చి, ఇక ఇప్పటికిది చాలులే అని హైదరాబాద్‌కు సాగనంపారు. అధిష్టానానికి కావాల్సింది రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్య, దాని కనుసన్నలలో కొనసాగే వైరం కాని, సయోధ్య కానే కాదన్న సంగతి, కిరణ్‍కూ, బొత్సకూ, దామోదరకూ తెలుసు. అందుకే వారు ఈ తతంగాన్ని పెద్ద శిక్షగా కానీ, అభిశంసనగా కానీ భావించడం లేదు. వెళ్లిన పని ఇప్పటికి ఐందికదా అని ఊపిరి పీల్చుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.

ఇంతకూ రాష్ట్ర కాంగ్రెస్-సంబంధిత రాజకీయాలలో ఏం జరుగుతోంది? ఏం జరుగబోతోంది? కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేతగా ఏడాదిన్నర కింద కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసి, ముఖ్యమంత్రిగా ఇన్నింగ్స్ ప్రారంభించమని అనడం వెనుక కొంత నేపధ్యం వుండి తీరాలి. ఆ నేపధ్యం ఆయనంటే గిట్టనివారికి ప్రతికూలంగా వుండి వుండాలి. ఆ ప్రతికూలతే, ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పుడో-ఎప్పుడో ఒకప్పుడు ఆశించిన వారికి, మధ్య మధ్య గుర్తుకొస్తుండవచ్చు. దాని పర్యవసానమే, కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తికి కారణమై వుండి వుండవచ్చు. ఇంతకీ ఆ నేపధ్యం ఏమై వుండవచ్చు?

రాజశేఖర రెడ్డి అకాల మరణంతో సుమారు మూడేళ్ల కింద రాష్ట్ర రాజకీయాలలో, అందునా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో, అర్థంకాని శూన్యత హఠాత్తుగా చోటుచేసుకుంది. ఆయన స్థానంలో, అంతటి పటిష్టమైన నాయకుడు అప్పట్లో (ఆ మాటకొస్తే ఇప్పటికీ!) ఎవరూ అధిష్టానానికి కనపడలేదు. ఆయన వారసుడుగా వద్దామనుకున్న పటిష్టమైన (వై ఎస్ జగన్మోహన్ రెడ్డి?) నాయకుడు అధిష్టానానికి పనికి రాలేదు. మధ్యేమార్గంగా, సీనియారిటీని తెర పైకి తెచ్చి, అనధికారికంగా రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో "నంబర్ టు" గా వున్న రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది అధిష్టానం. అది గిట్టని వారు గింజుకున్నారు-గొణిగారు కాని అసంతృప్తి స్థాయికి ఎదగలేదు. మధ్యలో జగన్ గొడవ కొంత సాగింది. ఆయనకు మద్దతు ప్రకటించిన అనేక మంది మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారానికి రామని కూడా మారాం చేశారు. రోశయ్యగారు, ఆయనకు మద్దతుగా అధిష్టానం దూతలు, నయానో-భయానో నచ్చ చెప్పి, అప్పట్లో-ఆ తరువాత ఒక ఏడాది కాలం పాటు అసంతృప్తిని ఎవరి గుండెలలో వారే పదిలంగా వుంచుకునేట్లు చేయగలిగారు. అడుగడుగునా అధిష్టానం పేరు చెప్పుకుంటూ రోశయ్య, అత్యంత భారంగా, ఒక ఏడాది పాటు పదవిలో వుండగలిగారు. తన సీనియారిటీకి రాష్ట్ర రాజకీయాలు తగవని నిర్ధారించుకున్న మరుక్షణం, రోశయ్య అత్యంత గౌరవ ప్రదంగా, స్వచ్చందంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని, అనతి కాలంలోనే గవర్నర్‍గా స్థిరపడిపోయారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలని ఆలోచన చేసిన అధిష్టానం దృష్టికి వచ్చిన పేర్లలో, ఆసక్తికరంగా, కిరణ్ కుమార్ రెడ్డి ముందు వరుసలో నిలబడ్డాడు. ఆయన ముఖ్యమంత్రి కావడం, పరిశీలనలోకి వచ్చిన ఇతర పేర్లలో ఒకరు ఉప ముఖ్యమంత్రి కావడం, మరొకరు దరిమిలా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావడం అందరికీ తెలిసిందే. ఐతే, అందరిలోకి కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఎక్కువ మార్కులొచ్చాయి?

ఈ ప్రశ్నకు సమాధానం అంత సులువు కాదు. ఐనా దొరకబుచ్చుకున్నారు విశ్లేషకులు. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో సభ్యులు కానివారికి మొదటి ప్రాధాన్యత ఇద్దామనుకుంది అధిష్టానం. దానికి సరైన కారణం లేకపోలేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన చేసిన భూపందేరాలలాంటి అనేకానేక అవినీతి వ్యవహారాలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పవన్న భావనలో వుంది అధిష్టానం. ఆ వ్యవహారం బయటపడిన తరువాత, కేవలం అది రాజశేఖర రెడ్డితోనే ఆగదని, అది ఆయన మంత్రివర్గంలో పనిచేసిన అందరి మెడలకీ చుట్టుకుంటుందని అధిష్టానం నమ్మింది. ఆ క్రమంలోనే రోశయ్యను తప్పించినప్పుడు, వైఎస్‌కు సన్నిహితుడిగా వున్నప్పటికీ, ఆయన మంత్రివర్గంలో సభ్యుడు కాని కిరణ్ కుమార్ రెడ్డిమీద కు దృష్టి మరల్చింది. వాస్తవానికి అదే బొత్సకు మైనస్ పాయింట్ అయింది. ఇక దామోదర రాజ నరసింహకు రాకపోవడానికి కారణం ఆయన తెలంగాణ నేపధ్యమే! ఆ నేపధ్యమే ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. ఇంతవరకూ బాగానే వుంది కాని, ఆ తరువాత జరుగుతున్న కథే అర్థం కావడం లేదు అధిష్టానానికి. తమవాడనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి తామనుకుంటున్న తరహాలో-మోతాదులో, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవడం లేదన్న అనుమానం రాసాగింది. బొత్సను రంగంలోకి దింపింది. ఆయన కూడా వైఎస్ జగన్‌ను డీ కొట్టడానికి బదులు కిరణ్‌తో తల పడ్డాడు. ఇక దామోదర రాజనర్సింహ ఎందుకు పెంచుకున్నాడో-ఏమో కాని ఆయన కూడా కిరణ్ కుమార్ రెడ్డి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఈ ముగ్గురి మధ్య ఇతరులు తలదూర్చడం మొదలైంది. ఇక శంకర రావు లాంటి వారు, డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి వారు ఎలాగూ ఎప్పుడూ వుంటూనే వుంటారు. ఈ నేపధ్యంలో మొదలైంది అవినీతి నిరోధక శాఖ వారి మద్యం ముడుపుల దాడులు. దాంతో వాతావరణం మరింత వేడెక్కింది.

గత ఆరు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్‌ల పైన, ఎక్సైజ్ అధికారుల పైన, శాంతిభద్రతల విభాగం పోలీసులపైన, అవినీతి నిరోధక శాఖ చేస్తున్న దాడుల విషయంలో, మిగతా వారి సంగతి ఎలా వున్నా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పరిస్థితి మాత్రం, అంటకాగుతున్న పెనంలో పెట్టిన వస్తువులాగా తయారైంది. ఆ దాడులకు ప్రధాన బాధ్యుడైన పోలీసు అధికారిని ఆ పోస్టులోంచి తొలగించే దాకా బొత్సకు నిద్దురపట్టలేదనాలి. తనవారనుకున్న వారిపై దాడులకు ప్రేరణ ముఖ్యమంత్రి నుంచేనని ఆయన అనుమానం. ఆ సందర్భంగానే, ఒకానొక సందర్భంలో ఢిల్లీనుంచి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, నిష్టూరాలు ఆడాడని మీడియాలో కధనాలొచ్చాయి. సరే, ఆ తరువాత, బొత్స వాటిని ఆనవాయితీ ప్రకారం ఖండించడం కూడా జరిగింది. ఆ నేపధ్యంలోనే, తనపై వచ్చిన అపవాదునుంచి తప్పించుకోవడానికి, కిరణ్ కుమార్ రెడ్డి, ఏసిబి అదనపు డైరెక్టర్‌ను ఆ స్థానం నుంచి తప్పించారంటున్నారు. ఏదేమైనా మద్యం సిండికేట్‌ల పైనా ఈ పాటికే చాలా లోతుగా దర్యాప్తు జరిగింది. మద్యం సిండికేట్‌ల వెనుక భారీ ఆర్థిక కుంభకోణం వుందని కూడా అనుమానాలు వచ్చాయి. ఎప్పుడైతే సిండికేట్‌ల భాగోతం విజయనగరం జిల్లాకు చేరుకుందో అప్పుడే రాజకీయ దుమారం మొదలైంది. ఆ దుమారంలో కీలక అంశం బొత్స మనుషులుగా చెప్పుకుంటున్న ముప్పై మందికి పైగా తెల్ల రేషన్ కార్డుల వారి పేరుతో షాపులుండడం. సహజంగానే బొత్సకు ఈ వ్యవహారం నచ్చలేదు. అలా మొదలైన బొత్స-కిరణ్ ప్రచ్చన్న-పరోక్ష యుద్ధం ప్రస్తుతానికి వాయిదా పడ్డా, ఇద్దరిలో ఏ ఒక్కరన్నా-లేదా ఇద్దరన్నా పదవి కోల్పోయిందాకా ఆగదనేది అక్షర సత్యం. అందుకే అటు బొత్స ఇటు కిరణ్ ఇద్దరూ కూడా ఆ తరువాత తమ పరిస్థితి ఏంటి అన్న దానిపైనే దృష్టి సారించారని, రాష్ట్రంలో కోల్పోనున్న పదవుల స్థానంలో రాబోయే ఎన్నికలలో వారిద్దరూ లోక్ సభ నుంచి రంగంలోకి దిగాలని ఆలోచిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే, అవసరమైతే ప్రస్తుతం ప్రత్యర్థులని భావిస్తున్నవారి మద్దతును కూడా కూడగట్టే ప్రయత్నంలో వున్నారని ఒక వార్త ప్రచారంలో వుంది. వారిద్దరూ ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం లేదని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల వారితో విచారణ జరిపిస్తున్నది అధిష్టానం అని కూడా వార్త ప్రచారంలో వుంది. పాపం-పుణ్యం భగవంతుడికే తెలియాలి!

Friday, March 23, 2012

ఉప సమరం నేర్పిన గుణపాఠాలు: వనం జ్వాలా నరసింహారావు



సూర్య దినపత్రిక (25-03-2012)
వనం జ్వాలా నరసింహారావు

కోస్తాంధ్రలో ఒక్క సీటుకు, ఉత్తర-దక్షిణ తెలంగాణాలో ఆరు సీట్లకు ముగిసిన ఉప ఎన్నికలలో ఓటర్లు ఇచ్చిన తీర్పు అమోఘం. అందరికీ అంతో-ఇంతో గుణపాఠం చెప్పకనే చెప్పారు. ఒక పక్క తెరాస అధ్యక్షుడు చంద్రశేఖరరావును, మరోపక్క వైఎస్సార్ సీపీ నేత జగన్మోహన్‌ రెడ్డిని హీరోలుగా అంగీకరించుతూనే, తస్మాత్ జాగ్రత్త అంటూ ఇతోధికంగా చురకలు కూడా వేశారు ఓటర్లు. ఇక ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి స్పష్టమైన హెచ్చరికలు చేశారు. అదే క్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, తాజా కాంగ్రెస్ నాయకుడు చిరంజీవికి, వారి-వారి జిల్లాలలో ప్రచార బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్-తెలుగుదేశం నేతలకు తగు సంకేతాలిచ్చారు. పార్టీల పరంగా తెరాసకు, తెలుగుదేశానికి, కాంగ్రెస్‌కు, భారతీయ జనతా పార్టీకి కొన్ని సంకేతాలిచ్చారు. ఐదు చోట్ల పోటీ చేసిన టీఆర్ఎస్‌ పార్టీ నాలుగు చోట్ల గెలిచి, తెలంగాణా సెంటిమెంటును ఎంత బలంగా నిరూపించిందో, అంతే మోతాదులో బీజేపీ పోటీ చేసిన ఒకే ఒక్క మహబూబ్‌నగర్ స్థానాన్ని కైవసం చేసుకుని నిరూపించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసిన ఒక్క సీటునీ కైవసం చేసుకుని, సమీప భవిష్యత్‍లో జరుగనున్న పద్దెనిమిది శాసనసభ స్థానాల ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, తెలుగు దేశానికీ ధీటుగా నిలవబోతోంది. పాలక, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, తెలుగుదేశం ఏడు చోట్లా పోటీ చేసి, ప్రతి చోటా ఓటమి చవిచూశాయి. కాంగ్రెస్‌ పార్టీ నాలుగు చోట్ల రెండో స్ధానంతోను, మూడు చోట్ల మూడో స్ధానంతోను సర్దుకోవాల్సి వచ్చింది. తెలుగు దేశం పార్టీ ఒక చోట నాలుగో స్ధానంలో, రెండు చోట్ల రెండో స్ధానంలో, నాలుగు చోట్ల మూడో స్ధానంలో ఉంది. రెండు చోట్ల డిపాజిట్ కూడా కోల్పోయింది.  ప్రతిష్టాత్మకమైన మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ టీఆర్ఎస్‌ ద్వితీయ స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నెల్లూరు జిల్లాలోని కోవూరు గతంలో తెలుగుదేశం అధీనం లో ఉండేది. ఇప్పుడది జగన్‌ పార్టీ పరమైంది.

ఇంతకూ, గెలుపెవరిది? ఓటమి ఎవరికి? కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు సంబంధించినంతవరకు, కేవలం ఓటమి మాత్రమే కాకుండా, ఆ పార్టీల ప్రతిష్ట కూడా పూర్తిగా దిగజారి పోయిందనాలి. 2009 లో కాంగ్రెస్ గెల్చుకున్న రెండు స్థానాలను, ఇండిపెండెంటుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మరో సభ్యుడి స్థానాన్నీ, మొత్తం మూడు స్థానాలనూ కోల్పోయింది. పడ్డ ఓట్లు కూడా అంతంత మాత్రమే! తెలుగుదేశం దీ అదే పరిస్థితి. 2009 లో ఆ పార్టీ గెలిచిన నాలుగు స్థానాలలో దారుణంగా ఓటమి పాలైంది. ఆ పార్టీ ప్రతిష్టా మంట కలిసింది. భవిష్యత్‍లో తెలంగాణ ప్రాంతంలో జరగబోయే ఏ ఎన్నికైనా తెలంగాణ వాదంతోనే బలంగా ముడిపడి వుంటుందన్నతరహా తీర్పిచ్చారు ఓటర్లు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీలకు చెందిన ఇతర నాయకులు, వాస్తవానికి, తమ వంతుగా తెలంగాణ వాదాన్ని మొన్నటి ఉపఎన్నికలలో వినిపించే ప్రయత్నం చేశారు కూడా. తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బాబు, తెలంగాణ సెంటిమెంటు గణనీయంగా వుందని, ఐనా ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రప్రభుత్వమే అని కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వాదానికి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయబట్టే, ఆ మాత్రం ఓట్లన్నా రాలాయి. ఆ రెండు పార్టీల భవిష్యత్ తెలంగాణకు సంబంధించినంతవరకు ఇక ప్రశ్నార్థకమే! సమైక్య్తవాదానికి కట్టుబడి పోటీ చేసిన ఏకైక పార్టీ సీపీఎం సోదిలోకి లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వినిపించడానికి నడుం బిగించిన భారతీయ జనతా పార్టీని, మహబూబ్‌నగర్‌లో, తెరాస కంటే ఎక్కువగా నమ్మారు ఓటర్లు. భవిష్యత్‍లో తెలంగాణ సాధన ప్రక్రియలో, కేవలం రాజకీయ ఐకాసలో కల్సి వుండడమే కాకుండా, ఎన్నికలలో కూడా, తెరాస-బీజేపీ అవగాహన కుదుర్చుకోవాలన్న సంకేతాన్ని కూడా ఓటర్లు మహబూబ్‌నగర్ స్థానం ఫలితం ద్వారా ఇచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు పుట్టగతులు లేకుండా పోతుంటే, సీమలో-ఆంధ్రలో కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొన్నదనాలి. కోవూరు ఫలితమే దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఏనాడైతే దివంగత ముఖ్యమంత్రి వారసుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారత జాతీయ కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదో, ఆ నాడే, కాంగ్రెస్ తన అస్థిత్వాన్ని కోల్పోవడానికి తానే స్వయంగా బాటలు వేసుకుందనాలి. రాజశేఖర రెడ్డి వారసుడిగా బాధ్యతలు స్వీకరించిన రోశయ్య కానీ, ఆయన వారసుడిగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కానీ, జగన్ దూకుడుకు కళ్లెం వేయ లేకపోయారు. 154 మంది కాంగ్రెస్ శాసనసభ సభ్యుల మద్దతుతో-సంతకాలతో ప్రారంభమైన ఆయన అసమ్మతి ప్రస్థానం, "గోపీ" ల పుణ్యమా అంటూ,  17 కు పడిపోయినా, జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ మాత్రం వీసమెత్తైనా పడిపోలేదు. ఓదార్పు పేరుతో ఆయన చేపట్టిన వేలాది కిలోమీటర్ల రాష్ట్రవ్యాప్త ప్రజా యాత్ర, ఆబాలగోపాలాన్ని జగన్ చెంతకు చేర్చింది. ఏం జరిగినా-ఎంత ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డికి వున్నా, కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోక పోవడంతో, విసిగివేసారిన జగన్ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తన తల్లి విజయమ్మతో కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారు. తరువాత జరిగిన ఉపఎన్నికలలో కడప-పులివెందులల నుంచి అఖండ విజయం సాధించి, కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు ఆనాడే సవాలు విసిరారు జగన్. ఆ ఎన్నికలలో పోటీ చేసి ఘోర ఓటమి పాలై-డిపాజిట్ కూడా కోల్పోయిన మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డికి అప్పట్లో రాజీనామా చేయాలని తోచలేదు పాపం! దరిమిలా జగన్ అక్రమాస్తుల వ్యవహారం, సీబీఐ దర్యాప్తు ప్రక్రియ, శాసనసభలో అవిశ్వాస తీర్మానం అంశం లాంటివి జగన్ వెంట నడిచే నిఖార్సైన ఎమ్మెల్యేల-ఎంపీల సంఖ్యను తేల్చింది. ఎంపీ రాజమోహన రెడ్డి రాజీనామాతో సహా, పదిహేడు మంది జగన్ వర్గ ఎమ్మెల్యేలు సభ్యత్వం కోల్పోవడంతో జగన్ వర్గం మరింత బలపడ సాగింది. ఆ నేపధ్యంలో వచ్చిందే కోవూరు శాసనసభ ఉప ఎన్నిక. కడప-పులివెందుల ఫలితం ప్రభావం కోవూరు మీద స్పష్టంగా పడింది. భారీ మెజారిటీతో కాకపోయినా మంచి మెజారిటీతో ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి, కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు పెను సవాలు విసిరారు. తెలంగాణలో సెంటిమెంటుకు, (సీమ) ఆంధ్రలో సెంటిమెంటుకు కొంత తేడా వున్నప్పటికీ, అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఓటమి పాలు కావడానికి ఆ రెండు సెంటిమెంట్లే కారణమయ్యాయి. రాజశేఖర రెడ్డి వారసుడిగా, ఆయన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోదగ్గ వ్యక్తిగా, భావి ఆంధ్ర ప్రదేశ్ యువతరం నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటర్లు తీర్పిచ్చారు. ఇక ఆయనదే హవా!

అధికార పక్షానికి చెందినంతవరకు, ఉప ఎన్నికలలో ఓటమికి బాధ్యత ఎవరిది అన్న అంశంపై, సమ్మతి-అసమ్మతి రాగాలు ఆరున్నొక్క శ్రుతిని దాటాయి. అసమ్మతి రాగాల మాట అటుంచితే, సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డితో అన్నట్లుగా చెప్పుకుంటున్న మాటలు కొంచెం ముఖ్యమంత్రిని ఇబ్బందిలో పడేసి విగా వున్నాయనాలి. "ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ముఖ్యమంత్రిది కాకపోతే ఎవరిది బాధ్యత అవుతుంది?" అని ఆజాద్ వ్యాఖ్యానించారట. అసమ్మతి గళం విప్పినవారిలో అగ్రగణ్యుడు మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. కడప లోక్ సభ స్థానానికి ఓడినప్పుడు కూడా అంతగా బాధపడని డీఎల్, ఈ ఉపఎన్నికలలో ఓటమికి చాలా కలత చెందారు పాపం! మంత్రి మండలి మొత్తం రాజీనామా చేయాలన్న డిమాండుతో సరిపుచ్చుకోకుండా. ఆయన తన రాజీ-నామా పత్రాన్ని అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. కిరణ్ కుమార్ రెడ్డి మీద, బొత్స మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి, తనదైన "క్రికెట్ స్టయిల్ లో" ఈ ఆటలో ఓడామని వ్యాఖ్యానించి సరిపుచ్చుకున్నారు. బొత్స కూడా రాజీనామా చేసే వరకు వ్యవహారం పోయిందంటారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా కిరణ్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఇక కే కేశవరావు, ఎంపీ వివేక్‌లు సరే సరి. ఇంత జరిగినా తప్పెవరిది అంటే అంతా గప్ చిప్!

ఒకరి మీద మరొకరి విమర్శనాస్త్రాలు తీవ్రతరమౌతున్నాయి. విభేదాలు పెరిగిపోతున్నాయి. హస్తంలో కీచులాటలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రకంపన లింకా ఆగలేదు. సరికదా ఊపందుకుంటున్నాయి. పార్టీలో సంపూర్ణ ప్రక్షాళన-దాదాపు కామరాజ్ నాడార్ ప్రణాళిక లాంటిది అవసరమనేంతవరకూ వెళ్లింది వ్యవహారం. ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ కార్యవర్గం మొత్తం రాజీనామా చేయాలంటూ సీనియర్ నేత, మాజీ మంత్రి శంకర్రావు డిమాండుతో మీడియా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి బలహీనుడని, ఆయన పదవిలో కొనసాగాలా-వద్దా అనే విషయం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నానని ఎంపీ వివేక్ వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు సహితం ముఖ్యమంత్రిదే బాధ్యత అన్నారు. సీఎం పక్షాన మాట్లాడేవారే కరవయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఇలా ఒక్కొక్కరు-ఒక్కొక్కవిధంగా మాట్లాడడం సరికొత్త అసమ్మతికి తెరలేపినట్లయింది. ఐనా, పూర్తిగా ముఖ్యమంత్రిదే ఓటమికి బాధ్యత అనడం ఎంతవరకు సబబు? ఆయనను ఆయన మానాన ఎన్నడన్నా వదిలేశారా ఇలా మాట్లాడుతున్న నాయకులు? ఉపఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుంచి, ప్రచార బాధ్యతలను నెత్తిమీద వేసుకోవడం దాకా, ఏ కాంగ్రెస్ నాయకుడు ఎంతవరకు తమ వంతు పాత్రను సక్రమంగా పోషించారో వారికి వారే బేరీజు వేసుకోవడం మంచిది. మరోవైపు ముఖ్యమంత్రికి సన్నిహితంగా మెలుగుతున్నవారు, అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్న సీనియర్ నేతలపై యుద్ధాన్ని ప్రకటించేందుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో, చివరకు పరిస్థితి ఎటు నుంచి ఎటు వైపునకు దారి తీస్తుందోనన్న ఆందోళన అధిష్ఠానానికి పట్టుకుంది. రాష్ట్రంలో అసమ్మతి నిప్పులపై నీళ్లు చల్లేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగవలసిన అవసరం ఏర్పడింది.

ఏదేమైనా, ఆద్యతన భవిష్యత్‍లో సీమాంధ్రలో జరుగనున్న పదిహేడు శాసనసభ స్థానాల ఉపఎన్నికలు, తెలంగాణలోని ఒక స్థానానికి జరగనున్న ఎన్నిక రాష్ట్ర రాజకీయ రంగంలో ఒక కీలకమైన మలుపుకు దారితీయనున్నది. కోవూరు ఓటమితో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి పక్షానికి వలస పోయే అవకాశాలు రోజు-రోజుకూ పెరుగుతున్నాయి. ఇక తెలంగాణ ప్రాంతంలో, తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలోకి వలసలు మొదలవుతాయి. ఒకవేళ అందరూ ఊహించినట్లుగానే, ఉపఎన్నికలు జరుగనున్న పద్దెనిమిది స్థానాలలో మెజారిటీ (లేదా అన్నింటిలో) స్థానాలలో కాంగ్రెస్-టీడీపిలు ఓటమి పాలైతే, ఇక ఆ పార్టీల పరిస్థితి, 2014 ఎన్నికలొచ్చే సరికి అగమ్యగోచరం అనక తప్పదు!

Saturday, January 7, 2012

సమన్వయమా, సమాంతరమా: వనం జ్వాలా నరసింహారావు




సూర్య దినపత్రిక (8-01-2012)
వనం జ్వాలా నరసింహారావు

సమన్వయ కమిటీ సమన్వయ సాధన కోసమేనా?; ప్రథమ సమావేశంలో అనూహ్య పరిణామాలు; అసంతృప్తివాదుల సమర శంఖం; పరస్పర ఆరోపణలు, విమర్శలు; విభేదాలపై కథనాలు; సమర్ధ పాలనకు సహకరిస్తారా? (ఎడిటర్)


పదవీ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో తడబడుతూ అడుగులు వేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అచిర కాలంలోనే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను క్రమ పద్ధతిలో ఆకళింపు చేసుకుని, అందరినీ కూడదీసుకుని, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్న నేపధ్యంలో, కారణాలేవైనప్పటికీ, పార్టీకి-ప్రభుత్వానికీ మధ్య అవగాహనుండాలన్న నెపంతో, ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది అధిష్టానం. ఆ కమిటీలో సమతుల్యం వుండాలన్న భావనతో ముఖ్యమంత్రిని-ఉపముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షుడిని-మాజీ పీసీసీ అధ్యక్షుడిని, కావూరిని-చిరంజీవిని-షబ్బీర్ అలీని ఒక ఆలోచన ప్రకారం సభ్యులుగా ప్రకటించింది అధిష్టానం. కిరణ్ తోక కత్తిరించడానికే ఈ కమిటీ ఏర్పాటైందని కొందరు భావిస్తే, కానేకాదు... బొత్స దూకుడు కట్టడి చేయడానికే అని మరికొందరన్నారు. అదేం కాదు, చిరంజీవిని బుజ్జగించడానికే అని అన్నవారు కూడా వున్నారు. మాజీ పీసీసీ ఛీఫ్‌ను, మహమ్మద్ అలీ షబ్బీర్‌ను, కావూరి సాంబశివరావును ఎందుకు నియమించారంటే ఇదమిద్ధంగా సమాధానం లేదెవరిదగ్గరనుంచి కూడా. ఏదేమైనా, ఏదో ఒక పదవిని అప్ప చెప్పడం, అదెంత పెద్దదైనా-చిన్నదైనా, ఆ పదవి లభించినవారెంత పెద్దవారైనా-చిన్నవారైనా, మురిసిముక్కలవడం కాంగ్రెస్ పార్టీలో అనాదిగా వస్తున్న సాంప్రదాయం. ఇప్పుడూ అదే జరిగింది. సమన్వయ కమిటీలో పేర్లున్న వారిలో కొందరిని ఈ వ్యాస రచయిత అభినందించినప్పుడు, వారి ఆనందానికి హద్దులు లేని విధంగా వారి దగ్గర్నుంచి స్పందన లభించిందంటే, ఆ పదవి ఎంతముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా, సమన్వయ కమిటీ ప్రధమ సమావేశానికి కమిటీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ పూనుకుని, హైదరాబాద్ నగరానికి విచ్చేయడం, సమావేశం పూర్వ రంగంలో- సమావేశంలో, ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోవడం విశేషం.




కిరణ్ కుమార్ రెడ్డి నియంతలాగా వ్యవహరిస్తున్నారని సమన్వయ కమిటీ ఛైర్మన్ గులాంనబీ ఆజాద్‌కు పలువురు ఫిర్యాదులు చేశారని, అసంతృప్తి వాదులెందరో ముఖ్యమంత్రిపై సమరశంఖం పూరించారని, అంత భారీ ఎత్తున ఆయనకు వ్యతిరేకత వ్యక్తం కావడం ఆజాద్‌ను విస్తుపోయే ట్లు చేసిందని మీడియాలో కధనాలొచ్చాయి. తనపైనా, తన సహచర మంత్రులపైనా కొందరు ఎమ్మెల్యేలు-మంత్రులు ఫిర్యాదులు చేయడం వెనుక, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రోత్సాహం వుందన్న అనుమానం కిరణ్ కుమార్ రెడ్డి తన సన్నిహితుల ముందర వ్యక్త పరిచినట్లు కూడా మీడియా కధనాలొచ్చాయి. నిఘా వర్గాలు కూడా ఆ అనుమానాలను ధృవపర్చాయట. నిజానిజాలేవైనప్పటికీ, బొత్స సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడైనప్పటినుంచి, ఆయనకూ కిరణ్ కుమార్ రెడ్డికీ మధ్య విభేదాలున్న ట్లు కథనాలొస్తూనే వున్నాయి. వాస్తవానికి ఆ కథనాల నేపధ్యంలోనే, సమన్వయకమిటీ ఏర్పాటైందని కూడా అనుకుంటున్నారు విశ్లేషకులు. ఐతే, సమన్వయ కమిటీ ఏర్పాటుకు కిరణ్ హస్తముందా? బొత్స హస్తముందా? లేదా వారిద్దరినీ ఒకరిపై మరొకరు దాడి చేసుకోకుండా నివారించేందుకు అధిష్టానమే అందుకు పూనుకుందా? అనే దానికి ఎవరి సమాధానం వారే చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి సీటుపై కన్నేసిన బొత్స పీసీసీ అధ్యక్షుడైన తర్వాత ప్రత్యేక అజెండాతో వెళుతున్నారని, అందులో భాగంగానే కిరణ్‌ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేస్తున్నారని బాహాటంగా బొత్స వర్గీయులే చెప్పడమే కాకుండా, ఆజాద్‌ ఎదుట ఆ తర్వాత జరిగినట్లు భావిస్తున్న పంచాయితీలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ, చిరంజీవితోపాటు, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులంతా కిరణ్‌‍ను టార్గెట్ చేశారట.

తొలి సమన్వయంలోనే వెల్లువెత్తిన సమర ధ్వనులలో, కిరణ్ కుమార్ రెడ్డిపై చేసిన ఆరోపణలలో ప్రధానమైనవి, ఆయన ఎవరినీ సంప్రదించకుండానే నూతన పథకాలను ప్రకటించడం, సీఎం వి అన్నీ ఒంటెత్తు పోకడలనడం, గాంధీభవన్‌కు అంతవరకూ ఎన్నడూ రానివారికి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారనడం, ప్రభుత్వ పాలనంతా పూర్తిగా ఏకపక్షం అనడం లాంటివున్నాయి. అలా ఫిర్యాదులు మొదటిరోజు చేసిన వారిలో సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి కూడా వున్నారు. ఆయన లేవనెత్తిన అంశంలో సహచర మంత్రి శంకర్రావుపై సబితా ఇంద్రారెడ్డి మనుషులు చేసినట్లు చెప్పుకుంటున్న దాడి కూడా వుండడం విశేషం. ఇక ఎప్పటినుంచో 104, 108 వాహనాల విషయంలోను, రాజీవ్ ఆరోగ్య శ్రీ విషయంలోను, ఆ మాటకొస్తే మొత్తం ఆరోగ్య-వైద్య శాఖ విషయంలోను ముఖ్యమంత్రి జోక్యాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఆ శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, ప్రభుత్వ పథకాల విషయంలో సీఎం సంబంధిత శాఖ మంత్రులను అసలే సంప్రదించడం లేదని, అలానే తామూ ఆయనను సంప్రదించే అవకాశమే లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారట. అలాగే 108 వాహనాలపై రాజీవ్ గాంధి బొమ్మ వివాదం కూడా ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. కొందరు పార్టీ నాయకులు, ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డిని కొనసాగిస్తే 2014 ఎన్నికల్లో పరాజయం పాలైతుందని అనే దాకా వెళ్లడం గమనించాల్సిన విషయం.

గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో జరిగిన విషయాలు బయటకెలా పొక్కాయోకాని, ముఖ్యమంత్రిని "మిస్టర్ చీఫ్ మినిస్టర్" అని ఉపముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ సంబోధించినట్లు కూడా కొన్ని పత్రికలలో వార్తలొచ్చాయి. మరీ విడ్డూరం: కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వ లక్షణాలను కూడా ఆయన ప్రశ్నించారట. కిరణ్ కుమార్ రెడ్డికి అన్నీ అస్పష్టతలే అన్న చందాన సాగిన దామోదర రాజ నరసింహ ధిక్కార ధోరణిలో భాగంగా జగన్ విషయం కూడా ప్రస్తావనకొచ్చిందట. జగన్మోహన్ రెడ్డి అనునిత్యం పార్టీ అధినేత్రి సోనియా గాంధీని, యువనేత రాహుల్ గాంధీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నా కిరణ్ కుమార్ రెడ్డి ఏమీ చేయలేకపోవడం, పై పెచ్చు ఆ తిట్ల పురాణమంతా రాస్తున్న ఆయన పత్రికకే కోట్ల రూపాయల ప్రభుత్వ అడ్వర్టైజ్‌మెంట్లు విడుదల చేయడం రాజనర్సింహ తప్పుబట్టారు. ఒకానొక సందర్భంలో ఆయన దాడికి అడ్డుతగిలిన ప్రతివారిపై కూడా ఎదురుదాడికి దిగారట ఆయన. టెలివిజన్ ఛానళ్లలో ప్రతిరోజూ వస్తున్న విశ్లేషణల-చర్చల ప్రస్తావన కూడా తీసుకొచ్చిన దామోదర రాజ నరసింహ, కనీసం వాటిల్లోనైనా కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా వాదనలు విన్పించేవారు లేకపోవడం కూడా ముఖ్యమంత్రి తప్పుగానే వర్ణించారట. ముఖ్యమంత్రికి మీడియా విషయంలోను స్పష్టమైన అవగాహన లేదనే దాకా వెళ్లింది ఆయన ఆరోపణల పర్వం.

ఏదేమైనా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విభేదాలు స్పష్టంగా పొడచూపాయి. విభేదాలుండడంలో తప్పు లేదు. వాటిని సమన్వయ సమావేశంలో చర్చించుకోవడంలోను తప్పులేదు. ఎటొచ్చీ, ఆ సమావేశ విషయాలు బయటకెందుకు పొక్కాలనే విషయంలోనే పార్టీ వారందరినీ తప్పు పట్టాల్సి వస్తుంది. సమన్వయ సమావేశానికి ముందు ఆజాద్‌కు అందిన ఫిర్యాదులు బయటకు రావడం సహజం. కాకపోతే, సమన్వయ సమావేశంలో జరిగినవి కూడా ఒక్కో పత్రికలో ఒక్కో విధంగా అంతా పూస గుచ్చినట్లు రావడం వెనుక ఎవరి హస్తం వుందనేదే అర్థం కావాల్సిన అంశం.

ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి చేతనైనంత మేరకు చేస్తున్నారనడంలో సందేహం లేదు. ఆయన ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్తున్న సమయంలోనూ, చేపట్టిన మరుక్షణం నుంచీ ఆయన చుట్టూ సమస్యల తోరణాలు స్వాగతం పలికాయి. ఆయన ధరించింది ఒక ముళ్ల కిరీటం. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. అప్పట్లో ఆయన పాలనా దక్షతకు, సమర్థతకు అవన్నీ అగ్నిపరీక్షల లాంటివే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమస్య,  ఆందోళనలు-ఉద్యమాలు, ఫ్రీ జోన్ అంశం, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ధిక్కార ధోరణి, నత్తనడకన సాగుతున్న జలయజ్ఞం ప్రాజెక్టులను పూర్తిచేయాల్సిన గురుతర బాధ్యత లాంటి సమస్యలెన్నో ఆయనకు ఎదురయ్యాయి.  ఒక్కొక్క సమస్యను అధిగమించే క్రమంలో, ఆయన ఒక్కొక్క అడుగే ముందుకు వేశారు. మంత్రివర్గం ఏర్పాటులో తనదైన శైలిని అనుసరించి మంచి పేరే తెచ్చుకున్నారు. శాసన సభాపతి ఎంపిక, డిప్యూటీ స్పీకర్ ఎంపిక లాంటి వాటిలో తన మాట చెల్లించుకోవడంతో పాటు, అధిష్టానం ఆలోచనా ధోరణికి అనుగుణంగా నడుచుకోవడం కూడా చెప్పుకోవాల్సిన సంగతే. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అధిష్టానం బొత్స సత్యనారాయణను ఎంపిక చేసినప్పుడు, ఎదురు చెప్పకపోవడం కూడా కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చతురతకు నిదర్శనం అనాలి. ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయనను విమర్శించినా, సంయమనం కోల్పోకుండా, తగు రీతిలో, ఎవరినీ నొప్పించకుండా-అందరినీ మెప్పించుకుంటూనే, స్పందించారే కాని, తన స్థాయి మరిచిపోయి ఎదురుదాడికి దిగలేదు. వై. ఎస్. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, చివరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కేవలం పదహారు మంది ఎమ్మెల్యేలే మిగలడం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ చాకచక్యమే అనాలి. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు, తన జిల్లాకే చెందిన తన చిరకాల ప్రత్యర్థి, నారా చంద్రబాబునాయుడుని సహితం తన దారిలోకి తెచ్చుకోగలిగి, శాసనసభలో ఆయన పరోక్ష మద్దతు కూడా తనకే సుమా అని ప్రచారం చేయించుకోగలిగిన థీశాలి కిరణ్ కుమార్ రెడ్డి. అవిశ్వాస తీర్మానంలో, నెగ్గుకోరావడం కూడా అభినందించాల్సిన అంశమే.

ఐనా, అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డికీ, బొత్స సత్యనారాయణకూ మధ్య ఏదో అగాధం వుందని భావించింది. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం వుండాలనీ భావించింది. పర్యవసానంగా సమన్వయ కమిటీ రూపు దిద్దుకుంది. ఆ కమిటీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మరింత పటిష్టంగా పనిచేయడానికి తోడ్పడాలి కాని, అడ్డుకోవడానికి కాకూడదు. గులాంనబీ ఆజాద్ అలా అడ్డుకునేవారికి తన మద్దతు ఇవ్వకూడదు. రాబోయే రోజుల్లో ఆ కమిటీ సమన్వయం కొరకు సంయమనంతో పనిచేస్తుందని, అందులోని సభ్యులంతా సమాంతరంగా పనిచేయరని భావించుదాం.


Thursday, June 30, 2011

మంత్రివర్గ మార్పుల వేళ సీఎం వ్యూహం…ప్రత్యర్థులతో కలిసి కాపురం ?: వనం జ్వాలా నరసింహారావు

మంత్రివర్గ మార్పుల వేళ సీఎం వ్యూహం…ప్రత్యర్థులతో కలిసి కాపురం ?

సూర్య దిన పత్రిక (01-07-2011)

వనం జ్వాలా నరసింహారావు

బొత్స, రాజ నరసింహ తీరుతో ధోరణిలో మార్పు, పట్టు కోసం మంత్రివర్గ విస్తరణ ఆయుధం, చిరంజీవి విందు రాజకీయం ఆంతర్యం?, వ్యతిరేకులకు మంత్రివర్గంలో స్థానం?, కిరణ్‌ సవాళ్ళు ఎదుర్కొంటారా?

పిసిసి అధ్యక్షుడుగా బొత్స సత్యనారాయణ నియామకం-పార్టీపై ప్రత్యక్షంగా-పాలనపై పరోక్షంగా ఆయన పట్టు సాధించే ప్రయత్నాలు, ఉప ముఖ్య మంత్రిగా దామోదర రాజ నరసింహ రంగ ప్రవేశం-తెలంగాణ కాంగ్రెస్ నేతగా గుర్తింపు దిశగా ఆయన పయనం-ఢిల్లీ స్థాయిలో పలుకుబడి పెంచుకునే ప్రయత్నాలు, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆలోచనా ధోరణిలో కొంత మార్పుకు దారి తీశాయనక తప్పదు. అపారమైన రాజకీయానుభవంతో, బలీయమైన సామాజిక వర్గం అండ దండల నేపధ్యంతో, సహజ సిద్ధమైన చొరవతో-పలుకుబడితో, బొత్స తన నియామక ప్రకటన వెలువడిన మరు నిమిషం నుంచే, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో తనదైన శైలిలో-తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని వేగంగానే సంపాదించు కుంటున్నాడనాలి. తెలంగాణ ఏర్పాటుపట్ల సానుభూతి అపారంగా వున్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడి వ్యవహార శైలి ఇలా వుంటే, దానికి ఒకింత భిన్నంగా, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉప ముఖ్య మంత్రి రాజ నరసింహ ఢిల్లీలో చక్రం తిప్పిన ధోరణి వుందనాలి. బొత్స సరాసరి, తానే భవిష్యత్ ముఖ్య మంత్రినన్న రీతిలో, పూర్తి స్థాయి కాకపోయినా, కొందరు మంత్రులతో కూడిన పరోక్ష కాబినెట్ సమావేశాలను జరుపుతున్న తీరు కూడా కిరణ్ కుమార్ రెడ్డికి నచ్చడం లేదంటున్నారు. రాజ నరసింహ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో పాటు పలువురు ఇతర సీనియర్ నాయకులను కలుసుకుని రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు, ప్రభుత్వం పనితీరు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై సమాలోచనలు జరపిన తీరు-ఆ తర్వాత వెలువడిన పత్రికా ప్రకటనల తీరు గమనిస్తే, అధిష్టానం ఆలోచనా ధోరణికి అనుగుణంగా రాష్ట్ర రాజకీయాలలో బొత్స, కిరణ్ కుమార్ రెడ్డిలతో పోటా-పోటీగా ఎదిగే పనిలో నిమగ్నమైన ట్లు అనుకోవాలి. ఈ పరిణామాల మధ్య, ఆర్నెల్ల క్రితం అధిష్టానం ఆశీస్సులతో, ముఖ్య మంత్రి పీఠాన్ని అధిష్టించిన కిరణ్ కుమార్ రెడ్డి, ఆదిలో ఎదురైన ఆటుపోట్లను అధిగమించి, పార్టీ పైన-పాలన పైన అంతో-ఇంతో గట్టి పట్టు సాధించి, ఆ పట్టు కోల్పోకుండా మరింత బలం కూడగట్టుకోడానికి, ఆయనకు రాజ్యాంగ పరంగా సంక్రమించిన "మంత్రి వర్గ విస్తరణ" ఆయుధాన్ని ఉపయోగించుకునే ప్రయత్నంలో వున్నారు.

బొత్స సత్యనారాయణ బలమైన ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ప్రజారాజ్యం అధినేత చిరంజీవికి ఆయన వీరాభిమాని. వాస్తవానికి బొత్సను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా అధిష్టానం ఎంపిక చేయడంలో చిరంజీవి పరోక్ష పాత్ర-సహకారం కూడా వుందంటారు. అందుకేనేమో, బొత్స తన నియామకం అయిన వెంటనే కలిసిన ప్రముఖులలో ముందు వరుసలో వున్న వారిలో చిరంజీవి ఒకరు. అదలా వుంటే, చాలా కాలం తన నియోజక వర్గానికి దూరంగా వుంటున్న, చిరంజీవి, హఠాత్తుగా, బొత్స నియామకం తర్వాత, తిరుపతి పర్యటనకు వెళ్లారు. అంతవరకు ఆశ్చర్యం లేదు. ఆ పర్యటనలో భాగంగా, ముఖ్య మంత్రి బద్ధ విరోధిగా అందరూ భావించే, చిత్తూరు జిల్లాకు చెందిన శాసనసభ సభ్యుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి విందు భోజనానికి వెళ్లారు. విందు రాజకీయాలలో, చిరంజీవి పాత్ర కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా పెద్దిరెడ్డిని మార్చడానికా? లేక, ప్రతికూలంగా-మరింత ఘాటుగా ఆయన వుండేందుకు, ఆయనను బొత్స సరసన చేర్చడానికా? అన్నది బయట పడాల్సి వుంది. మధ్యలో, చిరంజీవి మరో సంచలన ప్రకటన చేసి వార్తల్లోకి ఎక్కారు. తానిక సినిమాలలో నటించనని, అది కూడా ముఖ్య మంత్రి పాత్రలో అసలే నటించనని, నిజ జీవితంలోనే ముఖ్య మంత్రిగా తనను చూడాలనుకుంటున్న ప్రజల కోరిక తీరుస్తానని దాని సారాంశం! ఇదిలా వుంటే, దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి మలి విడత మంత్రివర్గంలో పెద్దిరెడ్డిని చేర్చడానికి కారణ భూతుడైన అపర రాజకీయ చాణక్యుడు కెవిపి రామచంద్ర రావు ఇంటికెళ్లి మంతనాలు జరిపారు ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. అప్పట్లో, పెద్దిరెడ్డిని మంత్రి వర్గంలో తీసుకున్నందుకు కిరణ్ కుమార్ అలిగారని, స్పీకర్ పదవి చేపట్టడానికి విముఖత కూడా చూపారని వార్తలొచ్చాయి. నిజా-నిజా లేమైనా, ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో, తన బద్ధ శత్రువు పెద్దిరెడ్డిని, త్వరలో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో, కిరణ్ కుమార్ రెడ్డి స్థానం కలిగించనున్నట్లు వార్తలొచ్చాయి. మంత్రి వర్గ విస్తరణకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడానికి గవర్నర్ నరసింహన్ ను కలిసిన ముఖ్య మంత్రి అధిష్టానం అనుమతి కోసం ఢిల్లీ వెళ్లారని అనుకుంటున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో, తన మంత్రి వర్గంలో, పూర్తిగా తనకు అనుకూలురైన వారిని మాత్రమే చేర్చుకోవాలని కాని-వ్యతిరేకులను పూర్తిగా దూరం పెట్టాలని కాని గతంలో ఏ ముఖ్య మంత్రి భావించలేదు. కొందరు సీజన్డ్ ముఖ్య మంత్రులు, తమకు అనుకూలంగా లేనివారిని, తమవైపు తిప్పుకోవడానికో-తమ గుప్పిట్లో పెట్టుకోవడానికో, తప్పకుండా తమ మంత్రివర్గంలో చేర్చుకున్న దాఖలాలున్నాయి. తండ్రి, దివంగత అమర్ నాథ్ రెడ్డి కాలంలో, రాజకీయాలను అంతో-ఇంతో దగ్గరగా గమనించే అవకాశమున్న ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పూర్వ కాలపు కాంగ్రెస్ ముఖ్య మంత్రుల తరహాలో వ్యవహరించడానికి, తనను వ్యతిరేకించేవారికి కూడా మంత్రి వర్గంలో స్థానం కలిగించి, పాత సాంప్రదాయాలను పునరుద్ధరించడం మంచిది.

1956 లో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పార్టీ నాయకుడిగా పోటీ పడిన నీలం సంజీవ రెడ్డి, బెజవాడ గోపాల రెడ్డి, ఆ తర్వాత విభేదాలున్నా కలిసి మెలిసి పనిచేశారు. నీలం సంజీవరెడ్డి ముఖ్య మంత్రిగా, తనను ఎదిరించిన గోపాల రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు-ఉప ముఖ్య మంత్రిని కూడా చేశారు. అంతకు ముందున్న మంత్రివర్గంలో, బెజవాడ ముఖ్య మంత్రైతే, నీలం కాబినెట్ మంత్రిగా-ఉప ముఖ్య మంత్రిగా పని చేశారు. ఇద్దరికీ పడక పోయినా, సహచర మంత్రులుగా, ఒకరి కింద మరొకరు పని చేసిన మొదటి ఉదాహరణ ఇదే. సంజీవ రెడ్డి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు, ఆయన స్థానంలో ముఖ్య మంత్రి పదవి పొందిన దామోదరం సంజీవయ్య, తన మంత్రి వర్గంలో, ఆయన బద్ధ విరోధి ఏసి సుబ్బారెడ్డికి స్థానం కలిగించారు. అదే విధంగా మలి విడత ముఖ్య మంత్రిగా నీలం సంజీవ రెడ్డి రాజీనామాచేసిన తర్వాత, ఆయన వారసుడుగా వచ్చిన కాసు బ్రహ్మానందరెడ్డి సహితం తన వైరి వర్గానికి చెందిన ఏసి సుబ్బారెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో ముఖ్య మంత్రైన పివి నరసింహా రావు, బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో వుండగా, తనను ఆసాంతం వ్యతిరేకించిన జలగం వెంగళ రావుకు, మొదట్లో చోటివ్వక పోయినా, రెండవ పర్యాయం ముఖ్య మంత్రి అయిన తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. సీమాంధ్ర ప్రాంతం నుంచి, తనను వ్యతిరేకించే పలువురు కాంగ్రెస్ నాయకులకు కూడా మంత్రి వర్గంలో చోటిచ్చారు. అలానే, జలగం వెంగళ రావు తన వ్యతిరేకులైన రాజమల్లు, రాజారాంలకు తన మంత్రి వర్గంలో స్థానం కలిగించారు. మర్రి చెన్నారెడ్డి మొదటి విడత ముఖ్య మంత్రిగా వున్నప్పుడు, ఆయన పదవి నుంచి వైదొలగడానికి కారణమైన రాజారాం, రాజమల్లు, గోకా రామస్వామిలను తన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత ముఖ్య మంత్రులైన వారందరూ, అధిష్ఠానం సూచించిన వారికే సింహభాగం మంత్రి పదవులిచ్చినప్పటికీ, తన వారనుకున్న వారిని మంత్రులుగా చేసేందుకు వెనుకాడ లేదు-తనను వ్యతిరేకించిన వారికి పదవులు దక్కకుండా చూసేందుకు శాయశక్తులా కృషి చేశారు. తెలివిగల నాయకుడు తన ప్రత్యర్థులనుకునే వారికి కూడా పదవులిచ్చి, వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తారు. కిరణ్ కుమార్ రెడ్డి కూడా అలానే చేస్తే బాగుంటుందేమో!

ఇదిలా వుంటే, డి శ్రీనివాస్ స్థానంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావాలని ఆశించి-కాలేక పోయిన కన్నా లక్ష్మీనారాయణ, ఆ పదవి దక్కించుకున్న బొత్స సత్య నారాయణ, చిరంజీవి నిజ జీవితంలో ముఖ్య మంత్రి కావాలనుందని చెప్పిన మాటల లోని గూఢార్థాన్ని విశ్లేషణ చేసే ప్రయత్నంలో సమావేశమైనట్లు వార్తలొచ్చాయి. వీరిలో ఎవరినుంచి-ఎటువైపు నుంచి తనకు ముప్పు, ఏ విధంగా రాబోతున్నదోనని అంచనా వేసే ప్రయత్నంలో-ఆ తర్వాత తన అంచనాలకు అనుగుణంగా వారికి చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగా, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారా, లేక, మంత్రి వర్గ విస్తరణకే వెళ్లారా తెలుసుకోడానికి కొంత సమయం పట్టవచ్చు. బొత్స-కన్నా-చిరంజీవిల కలివిడి, విడి విడి ప్రకటనల పరిణామాలు; రాజ నరసింహ తన కంటూ ఒక ప్రత్యేక నాయకత్వ స్థానాన్ని దక్కించుకునేందుకు మొదలెట్టిన ప్రయత్నాలు; ముఖ్య మంత్రి పదవి ఆశించి ఉప-ముఖ్య మంత్రి పదవిని కూడా పొందలేక పోయిన తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో మంత్రి గీతారెడ్డి పరోక్ష హెచ్చరికలు; తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఉధృతం విషయంలో టీ ఆర్ ఎస్ అధినేత చంద్ర శేఖర రావు-జానారెడ్డిల సమావేశం-తదనంతర పరిణామాలు-రాజకీయ ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి ఉమ్మడి పోరాటం చేయాలన్న నిర్ణయం; మరో వారం రోజుల్లో జరుగనున్న వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు-అందులో ఆ పార్టీ అధినేత తీసుకో బోయే కీలక (తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా?) నిర్ణయాలు; మధ్య-మధ్య బిజెపి, కమ్యూనిస్టు పార్టీల ప్రతిఘటనలు; వీటన్నిటినీ మించి ప్రతి పక్ష నేత-తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనుక్షణం విసురుతున్న సవాళ్లు; ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆద్య తన భవిష్యత్ లో ఎదుర్కోనున్న క్లిష్టమైన సమస్యలు. వీటిని ఆయన వ్యూహాత్మకంగా అధిగమించి, ఢిల్లీ అధిష్టానం అండ దండలతో, తన స్థానాన్ని పదిలపరచుకుంటారో, లేక, మంత్రి వర్గంలో మార్పులు-కూర్పులు చేసి, తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా తన నాయకత్వాన్ని సవాలు చేస్తున్న వారికే ప్రతి సవాలు విసురుతారో చూడాలి.

Wednesday, June 15, 2011

బొత్స రాజశేఖరీయం:వనం జ్వాలా నరసింహారావు

బొత్స రాజశేఖరీయం

సూర్య దిన పత్రిక (16-06-2011)

(సమన్వయ) కర్తవ్యం దిశగా వడి వడి అడుగులు

వనం జ్వాలా నరసింహారావు

అధిష్ఠానానికి మింగుడు పడని సమస్యలు! ... పట్టు బిగించడం కోసమే పదవుల పంపకం... బొత్స స్వామి కార్యం, స్వ కార్యం నిర్వహించగలరా? ... సీఎంకు హెచ్చరికలు, చురకలు!... ఇకనైనా బడుగులకు పాలనా పగ్గాలు లభించేనా!

బొత్స సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామకం కావడంతో, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత, ఆ పార్టీలో తలెత్తిన విభేదాలు-వైషమ్యాలు-ధిక్కార స్వరాలు-నాయకత్వ లోపాలు-బహిరంగ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, అధిష్టానానికి తల బొప్పి కట్టించాయి. గత్యంతరం లేని పరిణామాల మధ్య జగన్మోహన్ రెడ్డి అధిష్టానానికి ఎదురు తిరిగారు. రోశయ్యను దింపి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్య మంత్రి పీఠంలో కూచోబెట్టడంతో, దింపుడు కళ్లెం ఆశ సహితం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి, పార్టీకి-పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసి, తల్లి విజయమ్మతో శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేయించి, వైఎస్సార్ కాంగ్రెస్ ను స్థాపించి, తండ్రి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ టికెట్ సంపాదించి ఎమ్మెల్యేలైన కొందరిని తన శిబిరానికి తెచ్చుకోవడం మొదలెట్టారు. కడప-పులివెందుల ఎన్నికలలో అఖండ విజయం, ఎమ్మెల్యేలు ఒకరి వెంట మరొకరు జగన్ శిబిరంలో కొంత రహస్యంగా-కొంత బహిరంగంగా చేరడం, కాంగ్రెస్ అధినాయకత్వానికి మింగుడు పడని సమస్యై పోయింది. ఈ లోపు దిగ్విజయ్ స్థానంలో పాత కాపు గులాం నబీ ఆజాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి, తనదైన శైలిలో కాయ కల్ప చికిత్స మొదలెట్టాడు. ఆ క్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డిని పాలనాపరంగా-పార్టీ పరంగా బలోపేతం చేయడానికి రంగం సిద్ధం చేసింది అధిష్టానం. నాలుగు నెలల పైగా పెండింగులో పెట్టిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఉప ముఖ్య మంత్రి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవులను భర్తీ చేయడం జరిగింది.

తన జీవితాశయం రాష్ట్ర ముఖ్య మంత్రి కావడం అని కుండ బద్దలు కొట్టి చెప్పుతున్న బొత్స సత్యనారాయణ, గతంలో ఏ పిసిసి అధ్యక్షుడు చేయడానికి సాహసించని విధంగా, సమాంతరంగా "మంత్రి వర్గ సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు" నిర్వహించడం ఆరంభించారు. ప్రభుత్వ పథకాలను, కాంగ్రెస్ పార్టీ పథకాలుగా ప్రచారం చేయడంలోనే పార్టీకి లాభముంటుందని ఆయన గ్రహించడం వెనుక ఒక వైపు రాబోయే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడం, మరో వైపు పార్టీ అధ్యక్షుడుగా తాను బలపడడం, ఆయన జీవితాశయం నెరవేర్చుకోవడం కారణమై వుండాలి. సహచర మంత్రుల వద్దకు కూడా వెళ్ళి, సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీస్తున్నారు. గ్రేట్ బొత్స గారు అనిపించుకుంటున్నారు. రాజశేఖర రెడ్డి పథకాలకు పునరుజ్జీవనం పోసే దిశగా బొత్స అడుగు వేయడం కూడా గమనించాల్సిన విషయం. ఉదాహరణకు, ఆరోగ్య-వైద్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డిని కలిసి, రాజీవ్ ఆరోగ్య శ్రీ-104-108 పథకాలకు నిధులు పెంచాలని, పటిష్టంగా అమలు చేయాలని కోరడం, కాంగ్రెస్ పట్ల ప్రజలకు సడలుతున్న నమ్మకాన్ని పునరుద్ధరించడమే కావచ్చు.

భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు, సూర్యుడి చుట్టూ తిరగడానికి మున్నూట అరవై ఐదు రోజులు పడుతుంది. "భూ భ్రమణం", "భూ పరిభ్రమణం" అని భౌగోళిక శాస్త్రవేత్తలు పిలిచే ఈ ప్రక్రియ ఏక కాలంలో జరుగుతుంది. ఇలాంటిదే మన సత్తిబాబు, పిసిసి అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు నిర్వహించి నన్ని రోజులు (పోనీ నిర్వహించడానికి అధిష్టానం అవకాశం ఇచ్చి నన్ని రోజులు) చేయాల్సిన పని. రాష్ట్రంలోని బడా-చిన్న నేతలను కలవడానికి, కలిసి వారి మద్దతు కూడగట్టుకోడానికి, కట్టుకుని అధిష్టానం తనకు అప్పగించిన స్వామికార్యం-స్వకార్యం నెరవేర్చడానికి, జిల్లాల-మండలాల స్థాయిలో తిరగడానికి రోజుకున్న ఇరవై నాలుగు గంటలు సరిపోతాయో? లేదో? అలానే, తనను పిసిసి పీఠం మీద కూచోబెట్టిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి-వారి కోరికలు (ఏమన్నా వుండక పోతాయా!) తీర్చడానికి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. భూ భ్రమణం-పరిభ్రమణం లాగా ఇటు రాష్ట్రంలోను, అటు ఢిల్లీ చుట్టూ చేయాలి. ఈ క్రమంలో ఆయన నుంచి అధిష్టానం ఆశించింది జరగకపోతే, అది మరో ప్రహసనంగా మారి పోవచ్చు కూడా.

"రాష్ట్ర ప్రభుత్వానికి కళ్లు-చెవులు కాంగ్రెస్ పార్టీనే సుమా!" అని పీసీసీ అధ్యక్షుడుగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరు క్షణంలోనే, బొత్స సత్యనారాయణ, ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఒక హెచ్చరిక లాంటిది చేయడం వెనుక, ఎటువంటి ని గూడార్థం ఇమిడుందని రాజకీయ విశ్లేషకులు శోధిస్తున్నారు. అసలింతకీ, ఆ విషయం ముఖ్య మంత్రికి తట్టిందో-లేదో మరి. పార్టీ పరంగా ప్రభుత్వానికి కళ్లు-చెవులు ఇప్పుడే పుట్టుకొచ్చాయా? లేక భూత-భవిష్యత్-వర్తమాన కాలాలలో ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారంలో వున్నా, పార్టీనే ప్రభుత్వపు కళ్ళు-చెవులుగా, ఆయా సందర్భాలలో ముఖ్య మంత్రులుగా పనిచేసిన వారు భావించారా? లేదా? ఇవన్నీ సమాధానం దొరికీ-దొరకని భేతాళ ప్రశ్నలు. ఆయన మనసులోని భావాలే వైనా, ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో చెట్టా-పట్టాలేసుకుని, కలిసి-మెలిసి పని చేసుకుంటూ, పార్టీని "మరింత బలోపేతం చేస్తాను" అని బొత్సా స్పష్టం చేయడం మాత్రం, (కిరణ్ కుమార్ రెడ్డి అనుకున్నా-అనుకోక పోయినా, పత్రికల వారందరు అనుకుంటున్నట్లు) ముఖ్య మంత్రికి కొంత రిలీఫ్ గానే భావించాలి! బొత్స మార్కు వ్యాఖ్య మరొక టి కూడా ఆశ్చర్యకరంగానే వుందనాలి. తాను ఎవరికీ చీఫ్ కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ కార్య కర్తలకు, ఢిల్లీలో అధిష్టానానికి సంధాన కర్తగా మాత్రమే వ్యవహరిస్తానని శలవిచ్చారాయన. పనిలో పనిగా, తననింతవాడిని చేసిన "దైవం" సోనియా గాంధీకి, "పూజారి" గులాం నబీ ఆజాద్‌ కు, ఈ ఇరువురి మధ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించి తనకు ఆ పదవి కట్టబెట్టడంలో తోడ్పడిన జాతీయ-రాష్ట్ర స్థాయి ప్రముఖ నాయకులందరి కీ, పేరు-పేరునా కాకపోయినా, ప్రత్యేకమైన తరహాలో సభా ముఖంగా ధన్యవాదాలు తెలియ చేసుకున్నారు.

పార్టీ అభివృద్ది కోసం కాంగ్రెస్‌ పెద్దలు చెప్పినవి వింటానని-సూచనలు పాటిస్తానని, సీనియర్లతో అహర్నిశలు చర్చించి-పార్టీకి "పూర్వ వైభవం" తీసుకొస్తానని, ముఖ్యమంత్రితో కలసి "పార్టీని బలోపేతం చేస్తానని" కూడా బొత్స అంటున్నారు. తనకు "ఎలాంటి సొంత ఆలోచనలు లేవు" అని, "పార్టీ అధినేత్రి నిర్ణయమే తనకు శిరోధార్యం" అని, అనడంతో అధినేత్రి దృష్టిలో మరికొన్ని మార్కులు అదనంగా తెచ్చుకున్నారు. టీవీలు, పేపర్లలో ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వం చేస్తోన్న పథకాలు జనం లోకి పోవని, పరోక్షంగా ముఖ్య మంత్రికి ఒక "అఫెన్సివ్" చురక అంటించారు. అలా అంటూనే, మళ్లీ "డిఫెన్సివ్" గా, ముఖ్య మంత్రితో తనకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, ఇద్దరం కలిసి పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని స్పష్టం చేశారు. బొత్స "అఫెన్సివ్" చురకలకు, "డిఫెన్సివ్" స్నేహ హస్తానికి అదే మోతాదులో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు తనకు మధ్య ఎటువంటి భేదాభి ప్రాయ లేవని, భవిష్యత్తులోనూ ఉండవని (?) ఆయన స్పష్టం చేశారు. వారిరువురు తాము చెప్పిన దానిని ఆచరణలో చూపబోతున్నామని చెప్పడానికి సంకేతంగా, ఇద్దరూ కలసి గద-కత్తిని ఎత్తారు. మరో అడుగు ముందుకు వేసి, క్రికెట్ ఆటగాడైపోయారాయన కొంచెం సేపు. తాను, బొత్స, రాజ నరసింహ, స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, డిప్యూటీ స్పీకర్‌ మల్లు భట్టి విక్రమార్క (ఎవరు కెప్టెన్, వైస్ కెప్టెన్, ఓపెన్ బౌలర్, ఓపెన్ భాట్స్ మెన్? అనేది చెప్పలేదు) 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం కోసం, "సెలెక్టర్" సోనియా గాంధీ ఎంపిక చేసిన ట్వెన్టీ-ట్వెన్టీ క్రికెట్ టీం సభ్యుల లాంటి వారమని అన్నారు. ముఖ్య మంత్రి తన టీంను క్రికెట్ టీంతో పోల్చడాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేశవ రావు తప్పుబట్టారు. 2014 ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాకుండా, "రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసేందుకు" కూడా కృషి చేస్తామని సీఎం కిరణ్‌ చెప్పారు. మన్మోహన్ సింగ్ ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా దేశ ప్రధానిగా వున్నారు కదా! ఆయనతో సంప్రదించి ముఖ్య మంత్రి ఆ ప్రకటన చేశారా? లేక, స్వయంగా ఆయన నిర్ణయమా అది? గతంలో రోశయ్యను, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని, వారింకా ముఖ్య మంత్రులుగా వుండగానే, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్య మంత్రిని చేయాలని కొందరు కాంగ్రెస్ సభ్యులు (జగన్ ఇంకా కాంగ్రెస్ సభ్యుడుగా వున్నప్పుడు) డిమాండు చేయడంలో తప్పులేదే మో!

బొత్స సత్యనారాయణ, తెలంగాణ సమస్య విషయంలో ఆచి-తూచి మాట్లాడారు. తెలంగాణపై తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ఆయన చెప్పిన దాంట్లో నిజాయితీ ఒకింత కనిపించినా, అదే వేదికపై, అఖిల తెలంగాణ ప్రజలు అసలు-సిసలు తెలంగాణ వాదిగా భావిస్తున్న కేంద్ర మంత్రి, మేధావి జైపాల్ రెడ్డి మాత్రం, తన మనసులో మాట బయట పెట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నవాళ్లు ప్రాంతీయ వాదులు-ఉప ప్రాంతీయ వాదులు కాదని, ప్రపంచంలోనే కాంగ్రెస్‌ అతిపెద్ద జాతీయ పార్టీ అని (?), భారతీయ జనతాపార్టీ (తెలంగాణ ఏర్పాటుకు మద్దతిస్తున్న) కి సైద్దాంతిక-భౌగోళిక శక్తి లేదని, కమ్యూనిస్టు పార్టీలకు భౌగోళిక శక్తి ఉంది కాని సైద్దాంతిక శక్తి లేదని, తన మేధ మధనాన్ని కాంగ్రెస్ కార్యకర్తలకు వెల్లడి చేశారు. సరిగ్గా ఆరు నెలల క్రితం, కాంగ్రెస్ అధిష్టానం, రోశయ్య స్థానంలో ముఖ్య మంత్రిగా జైపాల్ రెడ్డి పేరును పరిశీలించిందన్న వార్తల నేపధ్యంలో, ఆయన అన్నట్లుగా ఢిల్లీ పత్రికల్లో వచ్చిన వ్యాఖ్యలకు (అధిష్టానం తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శించి తేనే తాను ముఖ్య మంత్రి పదవిని ఒప్పుకుంటానని జైపాల్ రెడ్డి అన్నట్లుగా!) నేటి వ్యాఖ్యలకు పొంతనే లేదు. సహజంగానే, జైపాల్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో దుమారం లేపడం, ప్రత్యేకంగా ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం, వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం, మరో మారు పరోక్షంగా ప్రత్యేక తెలంగాణ అంశం ఇప్పట్లో తేలేదికాదని చెప్పడం, అసలింతవరకు కేంద్ర మంత్రివర్గంలో దీని గురించి చర్చకూడా జరగలేదనడం, చిదంబరం డిసెంబర్ తొమ్మిది ప్రకటన వెనుక తన బాధ్యత ఏమీ లేదనడం, కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్న మరో నాటకంలో ప్రధానాంశాలుగా పరిగణించాలి. తెలంగాణ ఏర్పాటు కావాలని కోరుకునేవారి వాదన సమంజసమా? కాదా? అనే విషయం కాసేపు పక్కన పెడితే, జైపాల్ రెడ్డి ది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను జాతీయ వాదం కానే కాదని, నిఖార్సైన అవకాశ వాదమని, ఆయన ఎంత వేగంగా పార్టీలు మార గలరో అంతే వేగంగా మాటలను కూడా మార్చగలరని అనక తప్పదు. బోఫోర్సు కుంభకోణంలో అయన వేసిన రంకెలను కాంగ్రెస్ పార్టీలో చేరాక ఆశీర్వచనాలుగా మార్చ గలిగిన సత్తా ఆయన కుంది. ప్రత్యేక రాష్ట్రం కోరడం జాతీయ వాదానికి ఎలా వ్యతిరేకమవుతుందో జైపాల్ రెడ్డే చెప్పాలి. భారత దేశం ఒక వైపు "ఏక కేంద్రక ప్రభుత్వమైతే", మరోవైపు "సమాఖ్య తరహా ప్రభుత్వం" కూడా. ఆ విషయం ఆయనకు తెలియదా?

ఈ నాటకీయ పరిణామాల మధ్య, రాబోయే రోజుల్లో ఏం జరుగబోతుంది? కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఏంటి? బొత్సను అధ్యక్షుడుగా చేయడం వెనుక రహస్యం ఏంటి? అధిష్టానం ఆయనకు అప్పగించిన పనిని నెరవేర్చగల సామర్థ్యం వుందా? ఒకవేళ వున్నా ఆయనను సజావు గా పనిచేయనిస్తారా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదం ఒక వైపు, జగన్ సవాళ్లు మరో వైపు బొత్సకు తలనొప్పిగా మారుతాయా? 2004 ఎన్నికలలో ఓడిపోయి, అంచలంచలుగా, రాజకీయ వ్యూహంలో తన చతురతను ప్రదర్శించుకుంటూ, 2009 ఎన్నికలలో గతంలో కంటే రెట్టింపు స్థానాలను సాధించి, 2014 ఎన్నికలొచ్చేసరికి అధికారం చేజిక్కించుకునే ధీమాతో ముందుకు సాగుతున్న తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడిని ఎదుర్కునేందుకు బొత్స సరిపోతా రా? ఇవన్నీ రాజకీయ విశ్లేషకుల ముందున్న ప్రశ్నలు.

పూర్వ వైభవం తెస్తానని బొత్స అంటున్నారు. పూర్వ వైభవం అంటే, 2004 కు ముందున్న వైభవమా? 2009 ముందు వైభవమా? అంత కంటే మరోటా? 1999 ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడుగా చేసిన వ్యూహాత్మకమైన తప్పులను, శాసన సభలో ప్రతి పక్ష నాయకుడుగా 2004 ఎన్నికలలో సరిదిద్దుకుని-తనకిష్టం లేకపోయినా తెలంగాణ రాష్ట్ర సమితితో ఒప్పందం కుదుర్చుకుని, ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాల ఆధారంగా ఘన విజయం సాధించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు రాజశేఖర రెడ్డి. అప్పట్లో పిసిసి అధ్యక్షుడుగా వున్న డి. శ్రీనివాస్ ను కాదని, ఆనవాయితికి విరుద్ధంగా రాజశేఖర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసింది అధిష్టానం. ఆయన చేసిన వాగ్దానాలను నమ్మి గెలిపించిన ఓటర్లు, అవి ఆయన అమలు పరిచి ధీమాగా 2009 ఎన్నికలలో కొత్త వాగ్దానాలేవీ చేయకుండా పోటీ చేసినప్పుడు, అదే ఓటర్లు అత్తెసరు మార్కులతో గెలిపించారు తప్ప అఖండ విజయం చేకూర్చలేదు. దాదాపు కాంగ్రెస్ పార్టీని ఓడించినట్లే ఒక విధంగా! అప్పట్లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ నాయకుడు. ఇక ఇప్పుడు-భవిష్యత్ లో ఆయన నాయకత్వానికి వారసుడు జగన్మోహన్ రెడ్డి అయిపోయారు. కడప ఎన్నికలలో అది నిరూపణ ఐంది కూడా. రెడ్డి నాయకులంతా ఆయన వెంట వెళ్దామంటున్నారు. అందుకే, కాంగ్రెస్ వల పన్నింది. ఆ వలలో చిరంజీవి పడ్డారు మొదలు. ఇప్పుడున్న వారిలో బొత్సకున్న నాయకత్వ లక్షణాలను గ్రహించిన అధిష్టానం ఆయనను అందలం ఎక్కించింది. వెనుకబడిన వర్గాల వారితో సహా, అన్ని వర్గాల వారిని, తన వెంట తిప్పుకోగల సమర్థుడాయన అని నమ్మింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు అగ్ర కులాలకు చెందిన నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, పివి నరసింహారావు, జలగం వెంగళ రావు, కొణిజేటి రోశయ్య, భవనం వెంకటరాం, ఎన్ టీ రామా రావు, నాదెండ్ల భాస్కర రావు, చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రి కాగలిగారు. తన తర్వాత ముఖ్య మంత్రి కాగలిగిన అవకాశాలున్న అల్లూరి సత్యనారాయణ రాజును కాకుండా చేసే వ్యూహంలో భాగంగా దళిత కులానికి చెందిన వ్యక్తి దామోదరం సంజీవయ్యను, ముఖ్య మంత్రి అయ్యేందుకు సంజీవరెడ్డి మద్దతిచ్చారు. అలానే రాజారాం అవకాశాలను దెబ్బ తీశారు. కాకపోతే ఇందిరా గాంధి అండ దండలతో ఒక సారి టంగుటూరి అంజయ్య ముఖ్య మంత్రి కాగలిగారు. కాపులకు ఇంకా అవకాశం రానే రాలేదు. ఇకనైనా కాపు నాయకుడు బొత్సకు ఆ దిశగా భవిష్యత్ వుందేమో వేచి చూడాలి.

బొత్స సమర్థత, కార్య దక్షత నిరూపించుకోవాలంటే, రాష్ట్రంలో అందరినీ కలుపుకు పోయి, ఢిల్లీలో అందరి మన్ననలను పొందాలి. అందుకే రాష్ట్రంలో "భ్రమణం", ఢిల్లీ చుట్టూ "పరి భ్రమణం" తప్పదు. 2014 ఎన్నికలు-లేదా అంతకన్నా ముందే జరిగే అవకాశం వున్న ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీని గెలిపించు తాయా? గెలిపించినా బొత్సకు ముఖ్య మంత్రి పీఠం దక్కుతుందా? దక్కనిస్తారా? ఏమో! ఆల్ ద బెస్ట్!