Showing posts with label నీలం సంజీవరెడ్డి. Show all posts
Showing posts with label నీలం సంజీవరెడ్డి. Show all posts

Thursday, May 30, 2013

బీసీలకు అధికారం ఎండమావేనా?: వనం జ్వాలా నరసింహారావు

బీసీలకు అధికారం ఎండమావేనా?
వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు విడి-విడిగానే పనిచేసేవి. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చొరవతో, జులై 1957 లో, అల్లూరి సత్యనారాయణ రాజు అధ్యక్షతన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించింది. భారత జాతీయ కాంగ్రెస్ కి రాజకీయ పార్టీకుండాల్సిన లక్షణాలు లేవనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితీ అంతే. ప్రజల మద్దతున్న పార్టీ అయినప్పటికీ, అందులో అంతా నాయకులే తప్ప సుశిక్షితులైన అనుచరుల (కాడర్) కొరతుందనే అనాలి. ఆవిర్భావం నుంచి, చాలా కాలం వరకు, పెద్ద చదువులు చదువుకున్న పట్టణ ప్రాంతం వారితో ను, అగ్ర కులాలుగా పిలువబడే వారితో ను-అందునా అధిక సంఖ్యా కులు బ్రాహ్మణ కులానికి చెందినవారితో ను, పార్టీ నాయకత్వం పనిచేసేది. పట్టాభి, అయ్యదేవర, ప్రకాశం, ముట్నూరి, దుగ్గిరాల, కొండా, వీవీ గిరి, మాడపాటి, బూర్గుల, నీలం, కాశీనాథుని, పింగళి, వామన్ నాయక్, మెల్కొటె, జమలాపురం, కెవి రంగారెడ్డి లాంటి వారిని ఆ జాబితాలో ఉదహరించవచ్చు. స్వతంత్రం రాక పూర్వం పరిస్థితి అలా వుంటే, ఇక ఆ తర్వాత, బ్రాహ్మణే తర కులాలకు చెందిన ధనిక భూస్వామి వర్గాలలోని కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ, వెలమ వారి ఆధిపత్యం మొదలైంది. ఇంకా కొనసాగొతుందిప్పటికీ. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టడంతో, ఈ తరగతులకు చెందిన వారిదే పూర్తి పెత్తనంగా మారడం, వారే ముఖ్యమంత్రులు-మంత్రులు-జిల్లా పరిషత్ అధ్యక్షులు-ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కావడం మొదలైంది. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. అప్పటినుంచి కొంత మార్పొచ్చింది.

ఒక గురుమూర్తో, ఒక ముసలయ్యో, ఒక హనుమంతరావో, ఒక సంజీవయ్యో, ఒక అంజయ్యో తప్ప ముఖ్యమంత్రులైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనా, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినా, అగ్ర వర్ణాల వారో, ధనిక వర్గాల వారో కావడమే కాని, వెనుకబడిన వర్గాల వారికి అవకాశాలు ఎక్కువగా రాలేదనే అనాలి. ఇందిరా గాంధి నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో మొదటి సారి చీలి కొచ్చిన తర్వాత, జరిగిన మధ్యంతర ఎన్నికలప్పటినుంచి, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కొంత మార్పు కనబడ సాగింది. వెనుకబడిన వర్గాల వారికి, దళితులకు కొంత ప్రాధాన్యత లభించడం మొదలైంది. సంఖ్యాపరంగా వారు మెజారిటీలో వుండడం, వారి ఓట్లు గెలుపుకు ముఖ్యం కావడం, ఈ మార్పుకు ప్రధాన కారణం. అయితే, జన్మతః అందరు వెనుకబడిన వర్గాలకు చెందిన వారైనప్పటికీ, అవకాశాల విషయానికొచ్చేటప్పటికి, కొందరికే ప్రాధాన్యత లభించింది. సామాజికంగా-ఆర్థికంగా పుంజుకున్న వారు, విద్యాధికులకే పైకి పోయే అవకాశాలు లభించాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో వీరి అవసరం రీత్యా పలువురికి అవకాశాలు రాసాగాయి. అయితే, మొదటి నుంచి కూడా, కాంగ్రెస్ నాయకత్వం ధనికుల-అగ్ర వర్ణాల వారి చేతుల్లో వున్నప్పటికి, పార్టీకి మద్దతిచ్చే వారిలో అధికులు దళితులు, వెనుక బడిన వర్గాల వారు, మైనారిటీలు కావడం విశేషం. ఇప్పటికీ, పూర్తిగా అవకాశం చేతికందకపోయినా, 1972 ఎన్నికల అనంతరం, అధిక సంఖ్యలో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, దళితులు చట్ట సభల్లో ప్రవేశించే వీలు కలిగింది. పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో సగానికి పైగా ఆ వర్గాల వారికే స్థానం లభించడం విశేషం.

కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ విభేదాలెంత మోతాదులో వుంటాయో, అంతకంటే ఎక్కువ మోతాదులో కుల-మత విభేదాలుంటాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎన్నుకొనేటప్పుడు (ఎంపిక చేసేటప్పుడు), శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ల పంపకమప్పుడు, ఎన్నికల అనంతరం శాసనసభ పక్షం నాయకుడి ఎన్ని కప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల విషయంలో, జిల్లా పరిషత్-మునిసిపల్ చైర్మన్ ఎన్ని కప్పుడు కుల రాజకీయాలకు అధిక ప్రాధాన్యతుంటుంది. ఇంతవరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో, అడపాదడపా తప్ప, సర్వసాధారణంగా రెడ్డి, కమ్మ కులస్తులకే ఎక్కువ స్థానాలు ఎక్కువ సార్లు లభించాయి. స్థానిక సంస్థల్లో అంజయ్య పుణ్యమా అని రిజర్వేషన్లు కలిగించడంతో, వెనుకబడిన వర్గాల వారు అధిక సంఖ్యలో ఎన్నిక కాగలుగుతున్నారు. అంతకు ముందు, జిల్లా పరిషత్ చైర్మన్లు గాని, సమితి అధ్యక్షులు గాని ఒక పథకం ప్రకారం అగ్ర వర్ణాల వారే ఎన్నికయ్యేవారు. అందునా, తెలంగాణలో-రాయలసీమలో రెడ్లు, కోస్తాంధ్రలో కమ్మ వారు, ఉత్తరాంధ్రలో క్షత్రియులు ఎన్నికయ్యేవారు.

కాంగ్రెస్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో అవతరించిన మరో రాజకీయ పార్టీ జనత పార్టీ. అంతకు ముందే కమ్యూనిస్ట్, ప్రజా సోషలిస్ట్, స్వతంత్ర లాంటి పార్టీలున్నప్పటికీ, ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ నేపధ్యంలో మొట్టమొదటి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పార్టీగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జనత పార్టీకి ప్రాధాన్యముందనాలి. ఆ పార్టీ కూడా అగ్ర కులాల ఆధిపత్యంలోనే పనిచేసింది. నీలం సంజీవరెడ్డి జనత ఆంధ్ర విభాగం ఏర్పాటును లాంఛనంగా ప్రకటించి, దాని అధ్యక్షుడుగా తెన్నేటి విశ్వనాథంను నియమించారు. ఇప్పటి జాతీయ స్థాయి నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అప్పట్లో విద్యార్థి విభాగం కన్వీనర్. జనత పార్టీ రాష్ట్ర కమిటీలో కేవలం ఇద్దరు మాత్రమే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు, నలుగురు వెనుకబడిన వర్గాలకు చెందిన వారుండగా, మిగిలిన 85% మంది ఇతరులున్నారు. కాకపోతే, వారిలో ఒక ముస్లిం, ఇద్దరు మహిళలు కూడా వున్నారు. 1977 ఎన్నికల ముందు ఏర్పాటుచేసిన అడహాక్ కమిటీ పరిస్థితి కూడా అంతే. అందులో షెడ్యూల్డ్ కులాల వారు, తెగల వారు, వెనుకబడిన వర్గాల వారందరు కలిసి కేవలం 23% మంది మాత్రమే సభ్యులయ్యారు. ఆ తర్వాత కొన్ని మార్పులు-చేర్పులు చేసినా, అవన్నీ రాజకీయ కోణం నుంచే కాని వెనుకబడిన వర్గాల వారి ప్రాధాన్యతను పెంచేందుకు కాదు. 1977 లోక్ సభ ఎన్నికల్లో ఇద్దరు వెనుకబడిన వర్గాల వారు, ఒక్క ముస్లిం అభ్యర్థి తప్ప మిగిలిన అందరూ ఇతరులే. ప్రజల-ఓటర్ల మద్దతు పొందేందుకు 1978 శాసనసభ ఎన్నికల్లో సుమారు 40% స్థానాలను ఆ వర్గాల వారికి కేటాయించింది జనత పార్టీ నాయకత్వం.

కమ్యూనిస్టు రాజకీయాలపై కూడా కుల ప్రభావం పడిందనాలి. ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ-సామాజిక-ఆర్థిక నేపధ్యంలో అవి తప్పవేమో! స్వతంత్రం రాక పూర్వం రాష్ట్రంలోని జాతీయోద్యమం బ్రాహ్మణుల నాయకత్వంలో చాలావరకు నడి చేది. రాయలసీమలోని రెడ్లు, కోస్తాలోని కమ్మ వారు, ఆధిపత్యం కొరకు బ్రాహ్మణులపై పోరాడారు. కోస్తాలోని కమ్మ వారికి, బ్రాహ్మణులను ఎదిరించేందుకు సరైన ఆయుధం కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో లభించింది. అలానే రాయలసీమ రెడ్డి వారు కూడా. నిజా-నిజాలెంతో కాని, 1952 లో జరిగిన ఎన్నికల్లో, కమ్యూనిస్ట్ వ్యూహం కాంగ్రెస్ పార్టీలోని కమ్మ-రెడ్డి విభేదాలను ఉపయోగించుకునే రీతిలో వుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కమ్యూనిస్టుల్లో కులం ముఖ్యమైనా-కాకపోయినా, చాలా కాలం వరకు అగ్ర కులాల వారి ఆధిపత్యంలోనే నాయకత్వం కొనసాగింది. ఇటీవలి కాలంలో పార్లమెంటరీ పంథాకు అలవాటు పడి, బూర్జువా పార్టీల ధోరణులన్నీ వంటబట్టించుకున్న అతివాద-మితవాద-తీవ్రవాద కమ్యూనిస్టులు, కులం విషయంలో కూడా ఏమీ తీసిపోలేదనిపిస్తున్నారు.

ఆంధ్రుల ఆత్మ గౌరవం ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెట్టారు కాంగ్రెస్ వారంటూ, ఆ పార్టీని ఓడించి, నేల నాలుగు చెరగు లా తెలుగు వాడి సత్తా నిరూపించాలని పిలుపిచ్చారు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి ఆద్యుడు ఎన్ టీ రామారావు. ఆయన పిలుపునందుకొని వారు-వీరన్న తేడా లేకుండా ఆబాల గోపాలం ఆయన వెంట నడిచింది. కులమతాలకు అతీతంగా పార్టీ పక్షాన పోటీ చేసిన ప్రతి వారినీ విజయం వరించింది. అవినీతికి, అన్యాయానికి, వెనుకబడిన తనానికి వ్యతిరేకంగా ఎన్ టీ రామారావు మాట్లాడని రోజు లేదు. అంతవరకు బాగానే వుంది. మొదట్లో అవన్నీ పనికొచ్చాయి. క్రమంగా "ఆత్మగౌరవం" నినాదం స్థానంలో "రాజకీయ గౌరవం" ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్ టీ రామారావు ఆదర్శాలకు ఎదురుదెబ్బ తగిలి ప్రజాస్వామ్యం పరిహసించబడింది. ఆయన ప్రభుత్వాన్ని కూల దోసే నేపధ్యంలో కుల రాజకీయాలకే ప్రాధాన్యతుందనాలి. ఎన్ టీ రామారావును గెలిపించినప్పుడు కొందరు ఆయనను తమ కులానికి ప్రతినిధిగా మాత్రమే చూశారు. ఎప్పుడైతే అది కుదరలేదో, ఆ కులానికి చెందిన మరొకరిని ఆ పీఠంపై కూర్చొబెట్టే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన వ్యక్తులే, అదను చూసుకుని ఆయన అధికారంలో కొనసాగడం మంచిది కాదనుకుని నాయకత్వం చేపట్టారు. తెలుగు దేశం పార్టీ కూడా కుల ప్రాధాన్యత విషయానికొచ్చే సరికి అన్ని రాజకీయ పార్టీల మార్గాన్నే అనుసరించిందనాలి. లెక్కలు పక్కన పెట్టి తే, మూడు పర్యాయాలు ప్రభుత్వంలోకి వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలలో కాని, మంత్రులలో కాని వెనుక బడిన వర్గాల వారి ప్రాధాన్యత మిగిలిన వారితో పోల్చి చూస్తే చాలా తక్కువే. నాయకత్వం సరిపడక పార్టీని వదిలి వెళ్ళి తిరిగొచ్చిన దేవేంద్ర గౌడ్ లాంటి వారు కూడా వెనుకబడిన వర్గాల వారి వాణిగా పేరు తెచ్చుకోలేక పోతున్నారు.

ఇక ఇటీవలి కాలంలో ధనవంతులైన కొందరు బీసీ నాయకులు పార్టీ పెట్టి తమ వారికి న్యాయం చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ గా కూడా గెలిచారు. ఏమైందో-ఏమో, మళ్ళీ అవే రాజకీయాలు. కాంగ్రెస్ గూట్లో చేరారు. ఇలా ఉన్న ఒకటి-రెండు ఆశలను కూడా ఆ వర్గానికి చెందిన వారే అడియాసలు చేస్తుంటే ఎలా?

ఇవిలా వుండగా, కాంగ్రెస్ పార్టీని వీడిన వారు, అలిగి పోయిన వారు, రాజకీయ కారణాలతో కొంతకాలం బయటున్న వారంతా అగ్ర కులాల వారే. ఎన్జీ రంగా కేఎల్పీ పార్టీ, బ్రాహ్మణుల నాయకత్వంలో వెలిసిన కే.ఎం.పీ.పీ, మర్రి చెన్నా రెడ్డి డెమోక్రాటిక్ పార్టీ, స్వతంత్ర పార్టీ అలాంటివే. ఆధిపత్య పోరు కొరకే అవన్నీ. అందునా కుల ప్రాతిపదికన జరిగిన ఆధిపత్య పోరే అది. ఎదేమైనా-ఎవరెన్ని చెప్పినా, వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ పెత్తనం అప్పగించడం ఇప్పటికీ ఇంకా మాటల్లోనే కాని ఆచరణలో కానే కాదు. ఒక వేళ వీరిలో ఎవరన్నా ఉన్నత స్థాయికి చేరుకోగల వారుంటే, వారికి కూడా ధన బలం తప్పని సరి. అది లేకపోతే, వారి వారే వెనక్కు పడవేయడం ఖాయం.


Friday, November 18, 2011

మనం మరచిపోలేని మహా నేత: వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు
{తండ్రి జవహర్‌లాల్ కంటే మిన్నగా ప్రధానమంత్రి పదవికి వన్నె తెచ్చిన మహా నాయకురాలు ఇందిర. అధికారంలో ఉన్నా లేకపోయినా అత్యంత బలీయమైన శక్తిగా ఆమె గుర్తింపు పొందారు. తనకు తానే సాటి అనిపించుకున్న ఇందిరాగాంధీతో పోల్చ దగ్గ వారు చరిత్రలో చాలా అరుదుగా ఉంటారనడం అతిశయోక్తి కాదేమో! - ఎడిటర్, ఆంధ్ర జ్యోతి}
ఇందిరా గాంధీ మరణించి పాతికేళ్ళు గడిచిపోయాయి. జాతీయ అంతర్జాతీయ రంగాలలో ఆమె మిగిల్చిన గుర్తులు అజరామరంగా అశేష ప్రజానీకం గుండెల్లో గూడుకట్టుకున్నాయి. పదహారేళ్ళపాటు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ ఆత్మ స్తైర్యం, నిరంకుశ ధోరణి, రాజీపడని మనస్తత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వంతో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశానికి సమర్థ పరిపాలనను అందించి చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. రాధాకృష్ణన్, జకీర్ హుస్సేన్, వివిగిరి, ఫకృద్దీన్ అలీ అహమ్మద్, నీలం సంజీవరెడ్డి. జైల్ సింగ్ రాష్ట్రపతులుగా ఉన్నప్పుడు ఆమె ప్రధానిగా పనిచేశారు. తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న 'సిండికేట్' నాయకత్వాన్ని ధిక్కరించి, పార్టీని చీల్చి, భార త జాతీయ కాంగ్రెస్ పార్టీని తన గుప్పిట్లో పెట్టుకున్న అసాధారణ నేత ఇందిర. ఎమర్జెన్సీ అనంతరం ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్‌ను మరో మారు చీల్చి ఇందిరాకాంగ్రెస్‌గా నామకరణం చేసి రెండేళ్ళకే మళ్ళీ అధికారంలోకి వచ్చి పాలనా పగ్గాలను పార్టీ పగ్గాలను తన చేతుల్లో ఉంచుకున్నారు. తనకు ఎదురులేకుండా, ఎదిరించిన వారికి పుట్టగతులు లేకుండా, ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించి నియంతృత్వ ప్రజాస్వామ్యమంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన ధీర ఇందిర.
ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా మలిచే ప్రయత్నంలో అప్రయత్నంగానే నిరంకుశత్వం అలవరచుకున్నారు ఇందిరాగాంధీ. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బలమైన కేంద్రం దిశగా ఆమె విధానాలు రూపుదిద్దు కోసాగాయి. పార్టీలో కూడా ఆమె నియంతృత్వ ధోరణులే అవలంభించారు. తమ పార్టీకి చెందిన ముఖ్య మంత్రులను ఇష్ట్టమొచ్చిన రీతిలో మార్చడం, ఇతర పార్టీలకు చెందిన ముఖ్య మంత్రులను ఇబ్బందులకు గురిచేయడం, అధికారాలను కేంద్రీకరించడం ఆనవాయితీగా మారిపోయింది. కమ్యూనిస్టు వ్యతిరేకతతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఇందిర, కాంగ్రెస్‌లోని సిండికేట్‌పై విజయం సాధించడానికి వామపక్షాలను కలుపుకున్నారు. 'కమ్యూనిజం' కంటే 'కమ్యూనలిజం' వల్లే ప్రమాదం అంటూ అలనాటి జనసంఘ్ లాంటి పార్టీలను ఎదగకుండా చేశారు.
ఎప్పుడైతే ఎమర్జెన్సీ విధింపునకు వ్యతిరేకంగా కాంగ్రేసేతర పార్టీలన్నీ ఏకమయ్యాయో, వారూ వీరూ అనే తేడా లేకుండా తన విధానాలను వ్యతిరేకించిన అందరినీ జైళ్ళకు పంపడానికి వెనుకాడలేదు. ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళికైనా, గరీబీ హటావో పథకమైనా బ్యాంకుల జాతీయకరణైనా, గ్రామీణ బ్యాంకుల స్థాపనైనా, రాజ్యాంగ సవరణలైనా, సవరణలలో భాగంగా అవతారికలో 'సామ్యవాదం, లౌకిక వాదం' అన్న పదాలను చేర్చడమైనా, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల కంటే ముఖ్యమైనవని చెప్పడమైనా మరేదైనా ఏమి చెప్పినా చేసినా ఇందిర మనసులో మాట ఒకటే. భారతదేశానికి నాయకత్వం వహించగలిగేది తానే అని, తాను దానికోసమే జన్మించానని ఆమె నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆమె అనుకున్న కార్యం సాధించడానికి దేనికైనా వెనుకాడక పోయేరు. ఆ నమ్మకమే ఆమె గెలుపునకు సోపానాలయ్యాయి. ఓటమికి కారణాలయ్యాయి.
1955లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యురాలిగా, నాలుగేళ్ళ అనంతరం, నాలుగు పదుల వయస్సులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఇందిర ఎన్నికయ్యారు. అధ్యక్షురాలిగా ఏడాది కాలంలోనే ఆమె తన రాజకీయ దక్షతను చూపారు. దానితో పాటే కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ప్రపంచ చరిత్రలో ప్రప్రథమంగా బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వచ్చిన కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దుచేయించడంలో ఇందిర కీలక పాత్ర వహించారు. ఆ తరువాత జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం సమకూర్చారు. అయినా మరో సారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఆమె సుముఖత చూపలేదు. తండ్రి మరణాంతరం లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో ఇందిర సమాచార శాఖను నిర్వహించారు. శాస్త్రి హఠాన్మరణం దరిమిలా కాంగ్రెస్ అధిష్ఠానం, ఇష్టం ఉన్నా లేకపోయినా ఇందిరను ప్రధాన మంత్రిని చేశారు.
తమ ధోరణికి అనుకూలించడనుకున్న మొరార్జీ ప్రధాన మంత్రి కాకూడదనే ఆలోచనతో, తమ అదుపు ఆజ్ఞల్లో కనుసన్నల్లో నడుచుకుంటుందన్న ధీమాతో కామరాజ్ నాడార్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి లాంటి వారు ఇందిర వైపు మొగ్గు చూపారు. అయితే భవిష్యత్తులో ఆమె నుంచి తమ రాజకీయ అస్తిత్వానికి పొంచి వున్న ప్రమాదాన్ని పసికట్ట లేకపోయారు.
అకస్మాత్తుగా మరణించిన రాష్ట్రపతి జకీర్ హుస్సేన్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో పార్టీలోని విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇందిరను విమర్శించే సంజీవరెడ్డిని కాంగ్రె స్ అధిష్ఠాన వర్గం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించింది. తొలుత ఆయననే ప్రతిపాదించిన ఇందిర ఓటింగులో స్వతంత్ర అభ్యర్థి వివిగిరికి మద్దతును బహిరంగంగానే ప్రకటించారు. తన వారందరినీ ఆయనకే ఓటేయ్యమని సూచించారు. ఆమె మాటే నెగ్గింది. నీలం ఓటమిపాలయ్యారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు తన వ్యతిరేక వర్గానికి చెందిన మొరార్జీ ని మంత్రి వర్గంలోంచి వెళ్లి పోయే పరిస్థితులను ఇందిర కల్పించారు. క్రమశిక్షణను ఉల్లంఘించారన్న ఆరోపణపై వృద్ధ నాయకత్వం ఆమెను పార్టీనుంచి తొలగించింది. దీంతో 'సిండికేట్'గాచెలామణీ అవుతున్న నాయకులందరూ అభివృద్ధి నిరోధక శక్తులుగాను, సామ్యవాద పథకాలను అడ్డుకునే వారుగాను చిత్రించారు ఇందిర. పార్లమెంటరీ పార్టీ ఇందిర నాయకత్వంలో విశ్వాసం ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది. ఇందిర ఏడాదిముందే 1971లో ఎన్నికలు నిర్వహించారు. అఖండ విజయం సాధించారు.
ఆ తర్వాత కొద్ది నెలలకు జరిగిన రాష్ట్ర శాసనసభల ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆమె ప్రభ వెలగ సాగింది. ఆమె ఆరోహణ పర్వం కొనసాగుతుండగానే, అవినీతి ఆరోపణలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులొచ్చాయి. అలహాబాద్ హైకోర్టు, లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పుచెప్పింది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించింది. తక్షణమే ఆమె రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించి, ఇందిర అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అంతర్గత భద్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించారు. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపారు ఇందిరాగాంధీ. రాజ్యాంగాన్ని తిరగ రాయించారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పు నుంచి ఊరట పొందారు.
సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేశారు. మీడియాపై ఆంక్షలు విధించారు. అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించడానికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఇందిరకు మరింత బలం చేకూరింది. రాజ్యాంగ సవరణల ద్వారా, అవధులు లేని అధికారాలను ఇందిరా గాంధీ తన సొంతం చేసుకున్నారు. అసాధారణ రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదం లభించింది. జనవరి 1977లో ఎన్నికల నిర్ణయం ప్రకటించి, మార్చి నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని చెప్పి, జైళ్ళలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించారు. భారతదేశం బలీయమైన శక్తిగా ఎదగడానికి బలమైన కేంద్ర ప్రభుత్వం, సుస్థిరమైన కేంద్ర ప్రభుత్వం అవసరమని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ కాలం నుండి ప్రోత్సహిస్తూ వస్తున్న చిన్న కొడుకు సంజయ్ గాంధీని రాజ్యాంగేతర శక్తిగా ఎదగడానికి ఇందిర ఎంతైనా తోడ్పడ్డారు.
ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగ సహచరుడు జగ్జీవన్ రాం వారితో చేయి కలిపారు. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్‌లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపునిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా, జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చి 20, 1977న జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇందిరాగాంధీని ఆమె నియోజకవర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. కలగాపులగం లాంటి కాంగ్రెసేతర పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసిన మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.
ఎమర్జెన్సీ అక్రమాలపై విచారణ చేయడానికి జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ముందు హాజరవడానికి ఇందిర నిరాకరించారు. అది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, రాజ్యాంగ బద్ధంగా, మంత్రివర్గం సిఫార్సుపై, పార్లమెంటు ఆమోదం లభించిన చర్య అని ఆమె స్పష్టం చేశారు. కమిషన్ ఏర్పాటుకు చట్టబద్ధత లేదన్నది. అవినీతి ఆరోపణలపై జనతా ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది. బెయిలు తీసుకోమని ప్రభుత్వం ఇచ్చిన సలహాను ఆమె నిరాకరించారు. ఆమె అరెస్టుకు తగిన కారణాలు ప్రభుత్వం చూపలేకపోయిందని, ఆమెను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఇందిర ప్రయత్నాలు తిరిగి ప్రారంభించారు. తన పార్టీలో తనకు వ్యతిరేకంగా వున్న వారితో బంధాలు తెంచుకుని, మరో మారు పార్టీని చీల్చి, కాంగ్రెస్ (ఐ)ని స్థాపించారు.
అదే అసలు సిసలైన భారత జాతీయ కాంగ్రెస్‌గా ప్రకటించారు. కర్నాటకలోని చిక్ మగలూర్ నుంచి ఇందిరా గాంధీ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అఖండ విజయం సాధించడంతో ప్రజలు ఆమెకు తిరిగి బ్రహ్మరధం పట్టసాగారు. లోక్‌సభలో సుదీర్ఘచర్చ అనంతరం, ఇందిరా గాంధీ సభ్యత్వం రద్దుచేయాలని, సమావేశాలు ముగిసేవరకు అరెస్ట్ చేయాలని, ప్రధాని మొరార్జీ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. పార్లమెంట్ హాలును వదిలి వెళ్లనని, తననక్కడే అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తూ భీష్మించుకుని కూచున్నారు ఇందిరా గాంధీ. అరెస్ట్ చేయడానికి వచ్చిన అధికారులకు నమస్తే చెపుతూ వారి వెంట వెళ్లింది. ఆమె అరెస్టుకు నిరసనగా లక్షలాది మంది అభిమానులు ఆందోళన చేశారు. అరెస్టయ్యారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ఆమెను విడుదల చేసింది ఫ్రభుత్వం. ఆమెను వదిలి వెళ్లిన కాంగ్రెస్ నేతలు, ప్రజల నుండి లభిస్తున్న అభిమానాన్ని గమనించి తిరిగి ఆమె పంచన చేరారు. ఇంతలో అంతర్గత వైరుధ్యాల మధ్య జనతా ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది.
1979 జూలైలో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దానికి కారణభూతుడైన చరణ్‌సింగ్‌కు మద్దతు పలికి, వ్యూహాత్మకంగా ఆయన ప్రధాన మంత్రి కావడానికి తోడ్పడ్డారు ఇందిరాగాంధీ. తనపై మొరార్జీ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలను ఉపసంహరించుకోవడానికి నిరాకరించిన చరణ్‌సింగ్ ప్రభుత్వాన్ని విశ్మాస తీర్మానంలో ఓటమి పాలు చేసింది. ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా ఉన్న చరణ్ సింగ్ ఆచరణలో ఇందిర ప్రతినిధిగా పాలన చేశాడనాలి. జనవరి 1980లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ (ఐ), మూడింట రెండు వంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించింది. సుస్థిరతా అస్థిరతా అన్న నినాదంతో ఇందిరా గాంధీ ఎన్నికల బరిలో దిగి గెలిచారు. సుస్థిరతే ముఖ్యమని భారత దేశ ఓటర్లు స్పష్టం చేశారు. అస్థిర పాలన కంటే, నియంతృత్వ ప్రజాస్వామ్యమే మెరుగైందని ఓటర్లు తీర్పిచ్చారు. దాని రూపకర్త ఇందిరను మరో మారు ప్రధానిని చేశారు. ప్రధానిగా ఉండగానే ఇందిర హత్యకు గురయ్యారు.
రాజకీయాలకు నిలయమైన కుటుంబంలో జన్మించిన ఇందిర, తండ్రి జవహర్లాల్ కంటే మిన్నగా ప్రధానమంత్రి పదవికి వన్నెతెచ్చిన మహానాయకురాలు. అధికారంలో ఉన్నా లేకపోయినా అత్యంత బలీయమైన శక్తిగా గుర్తింపు పొందారు. వైరివర్గాలను నామరూపాలు లేకుండా చేయగలిగే స్థాయికెదిగి, తనకు తానే సాటి అనిపించుకున్న ఇందిరాగాంధీతో పోల్చ దగ్గ వారు చరిత్రలో చాలా అరుదుగా ఉంటారనడం అతిశయోక్తి కాదేమో! వారసత్వ అధికారాన్ని వంశపారంర్యంగా తమ కుటుంబీకులకే దక్కే విధంగా వ్యూహం పన్నిన ఇందిర నవ భారత వర్తమాన చరిత్రలో వేరెవరూ సాధించలని దాన్ని అవలీలగా సాధించగలిగిన వ్యక్తిగా ఇందిర చిరస్థాయిగా మిగిలిపోతారు.

Saturday, September 25, 2010

రాజకీయ ఆజానుబాహుడు-విజయభాస్కర రెడ్డి: వనం జ్వాలానరసింహా రావు

సెప్టెంబర్ 27, 2010 న కోట్ల విజయభాస్కర రెడ్డి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా

కోట్ల విజయ భాస్కర రెడ్డి మరణించి అప్పుడే తొమ్మిదేళ్లయింది. ఐనా ఆయన మన మధ్య ఇంకా కదలాడుతున్నట్లే వుంది. కేవలం తన కంటిచూపుతోనే ఆత్మీయ తను పంచిపెట్ట గలిగే వ్యక్తిత్వం ఆయనది. ప్రలోభాలకు-ఒత్తిళ్లకు లోనుకాకుండా తనకు తానే సాటి అనిపించుకున్న కోట్ల, రెండు పర్యాయాలు, రాష్ట్ర ముఖ్య మంత్రిగా, అనేక సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసి అందరి మన్ననలు పొందారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో, విద్యార్థి నాయకుడుగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని, లాఠీ దెబ్బలు తిన్న కోట్ల జీవితాంతం అవే స్వతంత్ర భావాలు కనబరచారు. అడ్వొకేట్‌గా పనిచేస్తూనే, రాజకీయ రంగంలో ప్రవేశించారు.ఆరు సార్లు కర్నూలు నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎమ్మిగనూరు, డోన్, పాణ్యం, పత్తికొండల నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు కర్నూల్ జిల్లాపరిషత్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

పాత తరం నాయకులలో విజయభాస్కర రెడ్డికి ప్రత్యేకత వుందనాలి. ఎన్ టీ రామారావుకు ఖ్యాతినిచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని, అంతకు పది పైసలకన్నా తక్కువ ధరకే ప్రవేశ పెట్టిన వ్యక్తి విజయభాస్కర రెడ్డి. అలాగే సారాను నిషేధించాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఆ తర్వాత కాలంలో మద్య నిషేధానికి దారి తీసింది. ఈ నిర్ణయాలు ఆయన తీసుకోకపోతే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు వాటిని పట్టించుకోక పోయేవారేమో!

కోట్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తొలుత, 1955 శాసన సభ ఎన్నికలలో పోటీ చేసి, టంగుటూరు ప్రకాశం పంతులు ప్రభుత్వం అవిశ్వాసం తీర్మానంలో ఓటమి చెందడానికి కారణమైన న్యాయ కంటి శంకర రెడ్డిని ఓడించి ఎమ్మెల్యే అయ్యారు. 1959 లో కర్నూల్ జిల్లా పరిషత్ మొదటి అధ్యక్షునిగా, మళ్లీ రెండో పర్యాయం 1964 లో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. శాసన మండలి సభ్యుడుగా కూడా 1967 లో ఎన్నికయ్యారు. బ్రహ్మానంద రెడ్డి మంత్రివర్గంలో అనేక కీలక శాఖలను నిర్వహించారు. 1977-1999 మధ్య కాలంలో ఆరు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఇందిరా గాంధి, రాజీవ్ గాంధి, పీవీ నరసింహా రావు మంత్రివర్గాలలో పనిచేశారు. 1983 లో నాలుగు నెలలు, 1992-1994 మధ్య కాలంలో రెండేళ్లకు పైగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షునిగా, వర్కింగ్ కమిటీ సభ్యునిగా, జాతీయాభివృద్ధి మండలి, జాతీయ సమగ్రతా మండలి సభ్యునిగా, వివిధ రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ పరిశీలకునిగా సేవలందించారు. దక్షిణాది నుంచి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి రెండుసార్లు ఎన్నికైన ఏకైక వ్యక్తి విజయభాస్కర రెడ్డి. తిరుపతి ప్లీనరీలో 1992 లో మొదటి పర్యాయం, కలకత్తాలో 1996 లో రెండో పర్యాయం వర్కింగ్ కమిటీకి ఎన్నికయ్యారాయన.

కోట్ల విజయభాస్కర రెడ్డి గురించిన ఘటన ఒకటి అప్పట్లో ప్రచారంలో వుండేది. ఇందిరా గాంధి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో, సిండికేట్‌ నాయకులతో ఘర్షణ నెలకొంది. ఈ సందర్భంలో నీలం సంజీవరెడ్డి అనుచరుడుగా పేరున్న కోట్లపై ఆమె దృష్టి పడింది. అప్పటికి ఆయన రాష్ట్రంలో ఆర్థిక మంత్రి మాత్రమే. ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి ఇందిరాగాంధి పక్షం. సంజీవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థిగా రాష్ట్రపతి పదవికి పోటీలో వున్నారు. ఆయనను సాక్షాత్తు ఇందిరా గాంధి ప్రతిపాదించారు. కానీ ఆ తరువాత మనసు మార్చుకుని స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన వీవీ గిరికి "అంతరాత్మ ప్రబోధం" అనే నినాదంతో మద్దతు ప్రకటించారు. ఇందిరా గాంధి పిలుపు మేరకు విజయభాస్కర రెడ్డి ఆమెను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ఆమె నివాసంలో ఇందిరను కలిసి మాట్లాడుతున్న సమయంలోనే, సంజీవరెడ్డి అమెను కలిసేందుకు వచ్చారట. తనతో మాట్లాడడం పూర్తైన తర్వాత విజయభాస్కర రెడ్డిని ప్రధాన ద్వారం నుంచి కాకుండా, వేరే ద్వారం నుంచి వెళ్తే బాగుంటుందని ఆమె సలహా ఇచ్చారట. కోట్లకు, సంజీవరెడ్డికి ఉన్న అనుబంధం తెలిసిన ఆమె ఇరువురి స్నేహం చెడకుండా ఈ సలహా ఇచ్చిందంటారు. అయితే, కోట్ల మాత్రం తాను బహిరంగంగా ఇందిరకు మద్దతు తెలపడానికి వచ్చానని అంటూ వేరే ద్వారం నుంచి వెళ్లడానికి మర్యాదగా తిరస్కరించారట.

కోట్ల మరణించినప్పుడు సంతాపసభలో లోక్‌సభ దివంగత స్పీకర్ బాలయోగి చెప్పిన మాటలు మరువలేనివి. "ఆరడుగుల ఆజానుబాహుడు విజయభాస్కర రెడ్డి పార్లమెంటు సెంట్రల్ హాలుకు నడుచుకుంటూ వస్తుంటే, తెలుగు తేజం ఉట్టిపడుతుంది" అన్నారాయన.