Showing posts with label కాలిఫోర్నియా. Show all posts
Showing posts with label కాలిఫోర్నియా. Show all posts

Friday, August 10, 2012

అంగారకుడిపై రోవర్: వనం జ్వాలా నరసింహారావు


అంగారకుడిపై రోవర్
సూర్య దినపత్రిక (11-08-2012)
వనం జ్వాలా నరసింహారావు

మానవజాతి కొనసాగిస్తున్న మహాన్వేషణలో అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం "నాసా" మరో అడుగు ముందుకు వేసింది. ఆ సంస్థ అంతరిక్షంలోకి పంపిన రోవర్ "క్యూరియాసిటీ" అంగారకుడిపై విజయవంతంగా కాలు మోపడంతో, నాసా మరో కీలక మైలురాయిని అధిగమించినట్లయింది. అమెరికా కాలిఫోర్నియా సమీపంలోని నాసా కేంద్రంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలలో మందహాసం తొణికిసలాడింది. కరతాళ ధ్వనులు మారుమోగాయట. క్యూరియాసిటీ లాండింగును న్యూయార్క్ లోని టైం స్క్వేర్‌లో నాసా ఏర్పాటు చేసిన ప్రత్యేక తెరపై లైవ్‍లో వీక్షించిన అమెరికన్ల ఆనందోత్సవాలకు అవధులే లేవంటున్నారు. అంగారకుడిపై కాలుమోపిన క్యూరియాసిటీ అక్కడ జీవ పదార్ధం ఉనికిని కనుగొనే వేటలో మునిగిపోయింది. అంగారకుడి చిత్రాలను భూమికి పంపింది. సుమారు తొమ్మిది వందల కిలోగ్రాముల బరువున్న క్యూరియాసిటీ రోవర్ ముప్పై ఐదు కోట్ల మైళ్ల సుదూర ప్రయాణం చేసి అంగారకుడిని చేరుకుంది. మొత్తం మీద గ్రహాంతర జీవం కోసం మానవుడు జరుపుతున్న శతాబ్దాల అన్వేషణ కీలక దశకు చేరుకుంటుంది. ఈ నేపధ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, హ్యూస్టన్ "నాసా" కేంద్రం గురించి తెలుసుకోవాల్సిన విషయాలు  ఎన్నో వున్నాయి.

1957 లో, అలనాటి సోవియట్ యూనియన్, కృత్రిమ అంతరిక్ష నౌకను మొదటిసారిగా ప్రయోగించడంతో, స్పందించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్హోవర్, ఏడాది తిరక్కుండానే, 1958 లో "నేషనల్ ఎయిరో నాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్"-"నాసా" ను, స్థాపించాడు. వాస్తవానికి మార్చ్ 3, 1915 న ఆ దేశంలో నెలకొల్పిన "నేషనల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఎయిరోనాటిక్స్"-"నాకా" సంస్థ నుంచి "నాసా" ఆవిర్భావం జరిగిందనాలి. అంతరిక్ష యానానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యం, తమ దేశంలో అభివృద్ధి చేయడానికి, "నాసా" స్థాపనకు నలభై సంవత్సరాల ముందు నుంచే "నాకా" పరిశోధనలను విజయవంతంగా నిర్వహిస్తున్నది. తోటి అగ్రరాజ్యం సోవియట్ యూనియన్ సాధించిన ఫలితాలను అధిగమించేందుకు, అంతరిక్ష రంగంలో మరింత పట్టు సాధించేందుకు, ఐసెన్హోవర్ "నాసా" ను స్థాపించాడు. జాన్ కెన్నెడీ అధ్యక్షుడిగా వున్నప్పుడు, "నాసా" పైనా, అంతరిక్షంలోకి పంపాల్సిన వ్యోమగాముల శిక్షణ-అభివృద్ధి పైనా, ముఖ్యంగా "చంద్ర మండలం" మీద పాదం మోపడం కొరకూ, భారీగా నిధులను కేటాయించింది నాటి అమెరికన్ ప్రభుత్వం. అవి సత్ఫలితాలనిచ్చి, జులై 20, 1969 న, అమెరికా అంతరిక్ష నౌక "అపోలో" లో ప్రయాణించిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఆల్విన్ అడ్రిన్ లు కెన్నెడీ విసిరిన సవాలుకు ప్రతిగా, చంద్రుడి మీద పాదం మోపిన తొలి మానవులయ్యారు. ఆయన వాంఛను నెరవేర్చారు.


"నాసా" ఒక వైపు అంతరిక్ష యానం దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే, ఇంకో వైపు, గతంలో "నాకా" చేపట్టిన "అంతరిక్ష పరిశోధన" కు సంబంధించిన ఫలితాలలోను గణనీయమైన పురోగతిని సాధిస్తూ వచ్చింది. "స్పేస్ టెక్నాలజీ" కి సంబంధించిన వాతావరణ-సమాచార రంగాల్లో అభివృద్ధికి అంతరిక్ష నౌకలను అనుసంధానం చేయడంలో కూడా విజయం సాధించింది. వాషింగ్టన్ లోని "నాసా" ప్రధాన కేంద్ర కార్యాలయం, అంతరిక్ష యానానికి సంబంధించిన పరిశోధన-అభివృద్ధి-శిక్షణలకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడం-అమలుకు చర్యలు తీసుకోవడం తీసుకుంటుంది.

"నాసా" కార్య కలాపాల ప్రధాన అధిపతిని "అడ్మినిస్ట్రేటర్" అంటారు. అమెరికా అధ్యక్షుడు ఎంపిక చేసి, నామినేట్ చేసిన వ్యక్తిని, సెనేట్ ఆమోదించాల్సి వుంటుంది. ప్రస్తుతం జులై 17, 2009 నుంచి ఆ పదవిలో వున్న పన్నెండవ అడ్మినిస్ట్రేటర్, మేజర్ జనరల్ ఛార్లెస్ ఫ్రాంక్ బోల్డెన్ జూనియర్ ను, ప్రెసిడెంట్ ఒబామా నామినేట్ చేశాడు. 34 సంవత్సరాల తన సుదీర్ఘ అనుభవంలో 14 సంవత్సరాలు "నాసా" అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సభ్యుడుగా వుంటూ, 1986-1994 మధ్య కాలంలో నాలుగు పర్యాయాలు అంతరిక్ష నౌకలో స్పేస్ వాక్ చేశాడు.  "నాసా" లో వివిధ కీలక పదవులను గతంలో నిర్వహించిన బోల్డెన్ 1946 సంవత్సరంలో ఆగస్ట్ నెల 19 వ తేదీన జన్మించాడు. బోల్డెన్ హ్యూస్టన్ నగర వాసి.

హ్యూస్టన్ నగరంలో, 1961 లో "ప్రయాణీకుల అంతరిక్ష నౌకా కేంద్రం" గా అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ రూపకల్పన చేసి నెలకొల్పిన ఇక్కడి "నాసా" కార్యాలయం పేరును, జాన్సన్ మరణానంతరం, ఆయన స్మృతి చిహ్నంగా, "లిండన్ బి జాన్సన్ స్పేస్ సెంటర్" గా మార్చారు. గత నాలుగైదు దశాబ్దాలుగా మానవ అంతరిక్ష యానానికి సంబంధించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి-విజయవంతంగా అమలుకు రంగం సిద్ధం చేసిన సంస్థల్లో, ప్రపంచంలో అగ్రగామిగా పేరు తెచ్చుకుంది

హ్యూస్టన్లోని ఈ కేంద్రం. అమెరికా అంతరిక్ష పరిశోధన మొదటి కార్యక్రమమైన జెమిని కార్యకలాపాలు పూర్తయి పోయి, అపోలో కార్యక్రమం ఆరంభమవడంతో, యావత్ ప్రపంచం దృష్టి దానిమీద పడింది. కెన్నెడీ విసిరిన సవాలుకు ప్రతిస్పందనగా చేపట్టిన చంద్రుడిపై కాలుమోపే కార్యక్రమం విజయవంతంగా ముగిసి, వ్యోమగాములు సురక్షితంగా భూమి పైకి తిరిగొస్తుంటే, ప్రపంచం కళ్లన్నీ హ్యూస్టన్ మీదనే కేంద్రీకృతమయ్యాయి. జులై 20, 1969 రోజున చంద్రమండలం మీద కాలిడిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, అక్కడ నుంచే, "హ్యూస్టన్, ఈగిల్ లాండయింది" అనడం, కొన్ని గంటల్లోనే, అపోలో నౌక "లూనార్ మాడ్యూల్‌" నుంచి ఆయన సహచర వ్యోమగాములు, నిచ్చెన ద్వారా దిగి అంతరిక్షంలో పాదం పెట్టి, "మానవుడికి ఇదొక చిన్న అడుగే కాని, మానవజాతి మనుగడ దిశగా వేసిన పెద్ద అడుగు" అని ప్రకటించడం, ఇక్కడి వారికి మరుపు రాని సంఘటన.

భూత-భవిష్యత్-వర్తమానాలకు చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధనలు, సాధించిన విషయాలు, మానవజాతి మనుగడకు సాధించనున్న సత్ఫలితాలు కళ్లకు కట్టినట్లు చూడొచ్చిక్కడ. సాక్షాత్తు అంతరిక్ష యానం చేస్తున్న అనుభూతినీ పొందవచ్చు. ఈ భూమండలంలో-యావత్ ప్రపంచంలో, మరెక్కడా లేని విధంగా, మరో ప్రపంచంలోకి సాహసోపేతమైన ప్రయాణం చేయించగల సౌకర్యమున్న ప్రదేశం కూడా బహుశా హ్యూస్టన్లోని అంతరిక్ష కేంద్రం ఒక్కటేనోమో. ఇక్కడ ప్రదర్శనలో వుంచిన వివిధ అంశాలు, ఆకర్షణలు, ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు, ఇంతవరకు జరిపిన అంతరిక్ష ప్రయాణాలకు సంబంధించిన అలనాటి "ప్రత్యక్ష ప్రసారాలు", వ్యోమగాముల శిక్షణా వివరాలు, మిషన్ కంట్రోల్ కేంద్రం, చంద్ర మండలం నుంచి తెచ్చిన శిలలు, "నాసా" వాహనంలో పర్యటన, అంతరిక్షంలో నౌకను పంపే సమయంలో అడుగడుగునా చోటు చేసుకునే సంఘటనలు, చిన్న పిల్లల వినోద కార్య క్రమాలు.. ... ఇలా ఎన్నో ఆసక్తికరమైన వినోద-విజ్ఞాన ప్రదేశం హ్యూస్టన్లోని "నాసా" కేంద్రం.

Sunday, January 10, 2010

జ్వాలా మ్యూజింగ్స్-3 (శాంతా క్లారా టు లాస్ ఏంజల్స్)

శాంతా క్లారా నుండి లాస్ ఏంజల్స్ కు కారులో ప్రయాణం

వనం జ్వాలా నరసింహారావు

అమెరికా-ఉత్తర కాలిఫోర్నియాలోని "శాన్ ఫ్రాన్ సిస్కో" సాగర తీరానికి దక్షిణ భాగాన వున్న అందమైన లోయ ప్రదేశమే "శాంతా క్లారా వాలీ". శాంతా క్లారా కౌంటీ లోని ఎక్కువ భాగంతో సహా శానోజ్ నగరం కూడా ఈ లోయలోనే వున్నాయి. "హృదయాలను పులకరించే మధురమైన లోయ" గా ఒకప్పుడు కవులచే అభివర్ణించబడిన ఈ లోయ ప్రాంతమంతా, ఇప్పటికీ మైళ్ల పర్యంతం, అందమైన వృక్షాలు-పూల పొదలు-పళ్ల చెట్లు-కూరగాయల తోటలు, వ్యాపించి వుంటాయి. 1960 సంవత్సరం వరకు, ప్రపంచంలోనే అతి పెద్ద పళ్ల ఉత్పత్తి ప్రాంతంగా ప్రసిద్ధికెక్కిందీ లోయ. చుట్టుపక్కలంతా సారవంతమైన భూమి వుండడంతో, వ్యవసాయ ప్రాధాన్యమైన ప్రాంతంగా ఒకప్పుడుండే శాంతా క్లారాలోని చాలా భాగం, క్రమేణ నగరంగా మారిపోయినప్పటికీ, ఇంకా గ్రామీణ ఛాయలు పరిసరాల్లో-ముఖ్యంగా లాస్ ఏంజల్స్ దిక్కుగా పోతుంటే ప్రస్ఫుటంగా దర్శనమిస్తాయి. వాస్తవానికి, "శాంతా క్లారా వాలీ", ఈనాడు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన "సిలికాన్ వాలీ", ఒకదానిలో ఇంకోటి అంతర్భాగమే. శాంతా క్లారా వాలీ ఉత్తర కొనే, శాన్ ఫ్రాన్ సిస్కో సాగర తీరానికి దక్షిణాన చివరి ముక్క. వాలీకి నైరుతీ భాగాన అందమైన "శాంతా క్రజ్ పర్వత సముదాయం", ఈశాన్య భాగాన "డైబ్లో కనుమలు" వ్యాపించి వుంటాయి. శాంతా క్లారా నగర ప్రాంతంలోని లిక్ మిల్ రోడ్ లోని ఒక భవన సముదాయంలో మా అబ్బాయి ఆదిత్య వుండే ఫ్లాట్ వుంది.


శాంతా క్లారా చేరుకోవడానికి, హైదరాబాద్ శంషాబాద్ నుంచి బయలుదేరిన మే మెక్కిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ విమానం, శాన్ ఫ్రాన్ సిస్కో విమానాశ్రయంలో లాండ్ అవుతుంటే అదో అద్భుత దృశ్యంలాగా వుంటుంది. సరాసరి సముద్రం మీదనుంచి, అందులో పడబోతోందా అన్న భయం కలిగే విధంగా, పక్కనే నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగుతుంది. ఈ ఒక్కటే కాదు: చుట్టుపక్కలున్న, ఓక్ లాండ్, శాంతా క్లారా, శానోజ్ విమానాశ్రయాలు కూడా అలానే వుంటాయిక్కడ. చుట్టూ సముద్రం-మధ్యలో ఒక ద్వీప కల్పం లాగా విమానాశ్రయం.


శాంతా క్లారా నుండి లాస్ ఏంజల్స్ కు సుమారు 350 మైళ్ల దూరం. విమానాలు, బస్సులున్నప్పటికీ, అక్కడినుంచి డిస్నీ లాండ్ కు-హాలీవుడ్ స్టూడియోలున్న ప్రదేశానికి వెళ్లి రావడానికి నిర్ణయించుకున్నందున మేం (అబ్బాయి ఆదిత్య, శ్రీమతి విజయలక్ష్మి, మనుమడు అన్ష్, నేను) కారులో వెళ్లాం. అక్కడెలాగు మా శ్రీమతి అక్క కొడుకు ప్రశాంత్ ఉద్యోగ రీత్యా వుంటున్నందువల్ల వాడింట్లోనే వుండి చుట్టుపక్కల ప్రదేశాలను చూద్దామనుకున్నాం.


సుమారు ఐదున్నర గంటల ప్రయాణం ఆహ్లాద భరితంగా గడవడానికి కారణం ఆరు సంవత్సరాల వయసున్న మా మనుమడు అన్ష్. వాడికెందుకో నామీద ఆ ప్రయాణంలో కోపమొచ్చింది. హైదరాబాద్ నుంచి శాన్ ఫ్రాన్ సిస్కోకు చేసిన విమాన ప్రయాణంలో వాడికిష్టమైన వాడిని నేనైతే, ఈ ప్రయాణంలో, ఆ ఇష్టం వాడి అమ్మమ్మ మీదికి పోయింది. పైగా నాపై ప్రదర్శించిన కోపానికి వాడిదైన పరిభాషలో, నా పై సినిమా తీసే ప్రతిపాదన దాకా పోయింది. ఆ సినిమాకు వాడే పేరు పెట్టాడు. వాడు తీద్దామనుకున్న ఆ సినిమా పేరు: "అల్ట్రా నైట్రోజెన్ ఉల్టా తాతయ్య-ప్యార్ కర్నేసే వజే ట్రబుల్ కర్తా హై". దారి పొడుగూ, వాడెలా ఆ సినిమాకి కథ, మాటలు, పాటలు రాయ దల్చుకుంది, స్క్రీన్ ప్లే ఎలా వుండబోతుంది, సంగీతం ఎలా సమ కూర్చదల్చాడు అన్నీ వివరించాడు. సినిమాలో నన్ను విలన్ పాత్రకు, వాడి అమ్మమ్మను ప్రధాన పాత్రకు ఎంపిక చేశాడు. నన్నెలా వాడు తన ఆధీనంలో వుంచుకోదలిచాడో అసలు-సిసలైన అనుభవజ్ఞుడైన సినీ దర్శకుడిలా వర్ణిస్తుంటే ఆనందం-ఆశ్చర్యం కలిగింది. గర్వంగా కూడా ఫీలయ్యాం.


శాంతా క్లారా-లాస్ ఏంజల్స్ మధ్య కారు ప్రయాణం చేస్తుంటే విస్తారమైన పంట భూములు, ట్రాక్టర్ల సహాయంతో వ్యవసాయం చేస్తున్న అమెరికన్లు, లారీలలో నింపుకొని తీసుకెళ్తున్న టొమాటోలు-బంగాళ దుంపలు, దారి పొడుగూ కనిపించే రోడ్ పక్కనున్న పంటపొలాల్లో ఏర్పాటు చేసిన కూరగాయల-పళ్ల అమ్మకం దుకాణాలు, సాగునీరు-తాగు నీరు సరఫరాకు సంబంధించిన చెరువులు-నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టలు-రిజర్వాయర్లు, అనేకం దర్శనమిస్తాయి. మన దేశంలో ప్రయాణం చేస్తున్నట్లే అనిపిస్తుంది మధ్య-మధ్యలో. ఆ సుందర దృశ్యాలను ఆస్వాదించుకుంటూ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో బయలుదేరిన వాళ్లం, సాయంత్రం అయిదింటికల్లా ప్రశాంత్ వుండే ఫ్లాట్ కు చేరుకున్నాం. అమెరికాలో ఎవరినీ అడ్రెస్ అడగక్కరలేదు. జీ.పి.ఎస్ సహాయంతో సరాసరి ఇంటి ముందు వాలొచ్చు. వెళ్తూనే కాళ్లు-చేతులు కడుక్కొని, చీకటి పడగానే, ప్రశాంత్-వాడి భార్య-కూతురుతో సహా అందరం సమీపంలోని "మాలిబు బీచ్" చూడ్డానికి వెళ్లాం.


కాలిఫోర్నియా-పశ్చిమ లాస్ ఏంజల్స్ కౌంటీ లో, సుమారు 20 మైళ్ల నిడివున్నపసిఫిక్ సముద్ర తీరప్రాంతమే "మాలిబు" అని పిలువబడే చిన్న పట్టణం. పూనా-ముంబై మధ్యలో, ఖండాలా లోయలో, హిందీ సినిమా యాక్టర్లు కట్టుకున్నట్లే, హాలీవుడ్ కు చెందిన ఎందరో సినీ తారలు మాలిబు పరిసరాల్లో ఆకాశ హర్మ్యాలను నిర్మించుకున్నారు. మాలిబు బీచ్, లాస్ ఏంజల్స్ ప్రాంతంలో చలి వున్నప్పుడు కూడా, వేడిగా వుంటుందని ప్రతీతి. దక్షిణ ప్రాంత కాలిఫోర్నియాకు చెందిన ధనవంతులైన పారిశ్రామిక వేత్తల ఇళ్లు కూడా మాలిబు బీచ్ ప్రాంతంలోనే వుంటాయి. పసిఫిక్ మహాసముద్రం తీరానికి కేవలం వందల మీటర్ల దూరంలోనే, దాదాపు సముద్రాన్ని ఆనుకొనే వీళ్ల ఇళ్లుంటాయక్కడ. అలా అంత చేరువలో వుంటూ సముద్రాన్ని-బీచ్ నూ అనునిత్యం దర్శించుకొని ఆనందిస్తుంటారు.


మాలిబు బీచ్ కు మేం చేరుకొనేసరికి సుమారు రాత్రి ఎనిమిదయింది. అయినా వందల సంఖ్యలో పర్యాటకులున్నారింకా. సముద్రంలో దిగి కాసేపు, బీచ్ లో కూచొని ఇంకొంచెం సేపు, సరదాగా గడిపాం. మాకంటే కూడా చిన్న పిల్లలిద్దరు బాగా ఎంజాయ్ చేశారు. మర్నాడు ఉదయమే డిస్నీ లాండ్ ప్రోగ్రాం వుంది కనుక ఆలశ్యం చేయకుండా, త్వరగా ఇల్లు చేరుకున్నాం.