Tuesday, April 18, 2017

"ఆరోగ్య పరిరక్షణ" సాకారం ఇలా... : వనం జ్వాలా నరసింహారావు ...ఆంధ్రభూమి

"ఆరోగ్య పరిరక్షణ" సాకారం ఇలా...
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (19-04-2017)

          ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్తూ, సమున్నత లక్ష్యాల పేరుతో, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో జాతీయ వైద్య విధానాన్ని ప్రకటించింది. దేశంలో వైద్యసేవలు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి చేయాలనే లక్ష్యంతో ఈ విధానానికి కేంద్రం రూపకల్పన చేసినట్లు సంబంధిత శాఖ మంత్రి చెప్పుకొచ్చారు. "దేశవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించటంతోపాటు అన్ని మందులను అందుబాటులో ఉంచటం ఈ పథకం ఉద్దేశాల్లో ఒకటి" అని కూడా మంత్రి ప్రకటించుకున్నారు. విధాన ప్రకటనలో ఇతర అంశాలతో పాటు, పేషంట్ల సాధికారత, ప్రసూతి మరణాల రేటు తగ్గింపు, నవజాత శిశు మరణాల రేటు తగ్గింపు, ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కలిగించడం లాంటి అంశాలున్నాయి. ఇదంతా బాగానే వుంది...కాని...అసలు ఏ మేరకు ఆరోగ్య సేవలు విచిధ రాష్ట్రాలలో అందుబాటులో వున్నాయనే అంశంపై స్పష్టత లేదనే అనాలి. క్రమేపీ విస్తరిస్తున్న ఆరోగ్య వైద్య అవసరాలకు అనుగుణంగా, అటు కేంద్ర ప్రభుత్వం కాని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కాని, అంచెలంచలుగా అందుతున్న వైద్య సేవల్లో కాలానుగుణంగా మార్పులకు శ్రీకారం ఎంతవరకు చుట్తున్నదనేది చర్చనీయాంశం అనాలి.

          తెలంగాణ రాష్ట్రంలో, దేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా, వైద్య ఆరోగ్య సేవలను మరింత పఠిష్ట పరుచు కోవటం, ప్రభుత్వ వ్యవస్థను పరిపుష్టం చేయటం, తద్వారా కావలసినంత మేరకు వైద్య, ఆరోగ్య సేవలను వినియోగించటంతో పాటు, ప్రభుత్వేతర, ప్రైవేటు, ప్రభుత్వ వైద్యరంగాలను విలీనం చేసి, ఒక సమగ్ర వైద్య విధానం రూపకల్పన చేసి, అమలు చేయడం ఎంతయినా అవసరం. భవిష్యత్ లో సాంకేతికత ఆధారంగా వైద్య సేవలను ప్రజల ఆరోగ్య పరిరక్షణకు  ఉపయోగించు కోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇందుకు తగ్గ ప్రణాళికలను తక్షణం సిద్ధం చేసుకోవలసిన ఆవశ్యకత కూడా ఉంది.

          ఇటు తెలంగాణ రాష్ట్రంలో, అటు దేశ వ్యాప్తంగాను చూసినట్లయితే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పెద్ద ఎత్తున ప్రైవేటు రంగంలోనే అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య సేవలు మాత్రమే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు అందించటం జరుగుతోంది. భారత దేశంలో మరో ముఖ్యమైన సమస్య రోగ నిర్థారణ సేవల కయ్యే అసాధారణ వ్యయం. అటు సామాన్యులకు ఇటు మధ్య తరగతి వారికి కేవలం ప్రైవేటు సంస్థలు మాత్రమే ఈ సేవలు అందించటం జరుగుతుంది. అదీ అత్రి ఎక్కువ ధరలతో.

          ఉదాహరణకి పి.ఎ.టి పరీక్ష (పోసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ) స్కాన్ కు రు.20,000 వరకు ఖర్చవుతుంది. ఎం.ఆర్.ఐ (మాగ్నటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్) పరీక్షకు రు.10,000 దాకా ఖర్చవుతుంది. ఇలా ఎన్నో రకాల పరీక్షలు ఉన్నాయి. వీటిని తక్కువ ఖర్చుతో ప్రభుత్వ వైద్య శాలలే అందించే పరిస్థితి రావాలి. తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా కొంత పురోగమించింది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో పాలీక్లినిక్ లు ఏర్పాటై ప్రైవేట్ క్లినిక్ ల సహాయంతో తక్కువ ఖర్చులో వైద్య పరీక్షలకు వెసులు బాటు కావాలి. ఇందుకు ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో పాటించే విభిన్న పద్ధతులను అధ్యయనం చేసి తదనుగుణంగా మార్పులకు ఉపక్రమించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచించినట్లయితే రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకుని అటు నగరవాసులకు ఇటు గ్రామీణ వాసులకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి వీలు పడే అవకాశం వుంది.

ఆరోగ్య పరిరక్షణ పద్ధతుల సమగ్ర వినియోగం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించు కోవచ్చు. 75-80 లక్షల ప్రజలున్న రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలను ఒక జోన్ గానూ, 40 లేదా అంతకన్నా ఎక్కువ ప్రాంతాలతో 60 లక్షల ప్రజలతో మరోక జోన్ గానూ, మూడవ జోన్ గా 900 గ్రామాలు కలిపి 27 లక్షల ప్రజలతోనూ, వీటిలో ప్రాథమిక, మాధ్యమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నవీ కలుపుకుంటే 47% ప్రజలకు చేరువ అవుతారు. నాలుగో జోన్ గా 8100 గ్రామాలు తీసుకుంటే 186 లక్షల ప్రజలు అవుతారు. ఈ జోన్ లోని 53% ప్రజలు ప్రస్తుతం గుర్తింపు పొందని ఆర్.ఎం.పిలు, ఎ.ఎన్.ఎమ్.ల మీద ఆధారపడి ఉన్నారు.

          ప్రఖ్యాత వైద్య నిపుణుడు డాక్టర్ ఏపీ రంగారావు అంచనాల ప్రకారం ప్రస్థుతం మొదటి జోన్ లో 2400 స్పెషలిస్టులు, 640 సూపర్ స్పెషలిస్టులు ప్రభుత్వ - ప్రైవేటు పరంగా సేవలందిస్తున్నారు. వీరితో పాటుగా ఎం.బి.బి.ఎస్ చేసిన వైద్యులు ఇందులో అదనపు భాగస్వాములుగా ఉన్నారు. రెండవ జోన్ లో ప్రజలకు ప్రథమ స్థాయి ద్వితీయ స్థాయి కేంద్రాలు మాత్రమే చేరువలో ఉన్నాయి. వారికి వారి అవసరాలు బట్టి 780 స్పెషలిస్టులు, 125 సూపర్ స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. జనాభాలో 7.6% ప్రజలు (దాదాపు 27 లక్షల మంది) గ్రామాల్లో ఉన్నారు. వారికి 683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ నిరంతర వైద్యసేవలు మాత్రం మృగ్యంగా ఉన్నాయి అన్నారు. మిగిలిన ప్రజలకు (రమారమి 1.86% కోట్ల మందికి అంటే...ఇంచుమించుగా 53% మంది ప్రజలకు) 8100 గ్రామాల్లో అనుభవంకలిగిన వైద్యులు తత్సంబంధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొన్ని మైళ్ళ దూరంలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీరిలో 57 లక్షల ప్రజలకి 5 నుండి 10కి.మీ. దూరం వెళ్ళవలసిన పరిస్థితి ఉండగా, 92 లక్షలమందికి 10కి.మీ పైనే ప్రయాణించాల్సి ఉంది. నిజానికి ఈ 1.86 కోట్ల మంది ప్రజలు స్థానికంగా గుర్తింపు పొందని, దీర్ఘ కాలంగా వైద్యం అందిస్తున్న వారివద్దనో, అలోపతివైద్య సేవలు అందించే ఇతరుల సేవలనో వినియోగించు కోవడం జరుగుతున్నది.


హైదరాబాద్ నగరంలోని రమారమి 80 లక్షల ప్రజల్లో 25-30 లక్షల మంది గుర్తింపు పొందిన మురికి వాడల్లో నివసిస్తున్నారు. మెహల్లా క్లీనిక్ ల పేరుతో వీరికి వైద్య సేవలు అందించవచ్చు. ఇలా వైద్య సేవలు అందించడానికి, హైదరాబాద్ లో 5000 దాకా క్లీనిక్లు కావలసి ఉంది. ఇక్కడ పనిచేయడానికి 1750 మంది డాక్టర్ల అవసరం ఉంటుంది. ఇందుకోసం హౌస్ సర్జన్ల సేవలు ఉపయోగించుకోవచ్చు. ఏటా 2500 మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో చేరుతుంటారు. వీరిలో 2/3 శాతం మంది ఉత్తర్ణీత పొందిన వారు ఉంటుండగా, మోహల్లా క్లినిక్లలో పని చేయాడానికి 1650 మంది దాకా అందుబాటులో ఉంటారు. వీరి వృత్తి సాధారణ వైద్యం అందించటం, ప్రాథమిక చికిత్స చేయటం, స్క్రీనింగ్ వంటివి ఏర్పాటు కావించటం ఇలా పరిమితంగానే ఉంటుంది. ఇలా వీరి సేవలు ఉపయోగించుకుంటే, సుమారు 30 లక్షల మందికి వైద్యం చేరువ చేసినట్లవుతుందని అన్నారు.

          ప్రస్థుతం హైదరాబాద్ మహా నగరంలో 110 దాకా అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఇవి సరిపోతున్నా ఈ సంఖ్యను అదనంగా మరో 150 అర్బన్ హెల్త్ సెంటర్లుగా పెంచుకున్నట్లయితే అందులో అనుభవజ్ఞుడైన వైద్యుడు అందుబాటులోకి వచ్చినట్లువుతుంది. తద్వారా తొలి దశ వైద్య సేవలు సలహాలు అందంచినట్లుగా అవుతుంది. ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్ కు 30-35 క్లీనిక్ లు అనుసంధానం చేస్తే సమస్య తీరుతుంది. వీటిలో పి.జి మెడికల్ విద్యార్థుల సేవలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుండి రొటేషన్ పద్ధతిలో అనుసంధానిస్తే ద్వితీయ స్థాయి వైద్య సేవలు చేరువ చేసినట్లు కూడా అవుతుంది. తెలంగాణలోని  ప్రభుత్వ, పైవేటు పి.జి కళాశాలల నుండి వీరిని వినియోగించుకుంటే దాదాపు 850 మందికి పైగా పి.జి విద్యార్థుల సేవలు వినియోగించుకున్నట్లు అవుతుంది. వైద్యంతో పాటుగా, సర్జరీ, మానసిక నిపుణులు, గర్భీణీలకు సేవలు, కళ్ళ సమస్యలకు పరిష్కారాలు వంటి వాటికి సలహాలు అందించే ఆస్కారం ఉంటుంది.

          జోన్ మూడు, నాలుగు స్థాయికి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 4863 సబ్ సెంటర్లకు గాను 683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 1147 కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, 31 ఏరియా ఆసుపత్రులు, ఏడు జిల్లా ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తరువాత జిల్లా హెడ్ క్వార్టర్స్ పరిధిలో ఇవి 1/3 శాతం. మనకి జిల్లా స్థాయి ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా 18 టీచింగ్ ఆసుపత్రులలో 10 హైదరాబాదులో ఉండగా 4 వరంగల్ లో ఉన్నాయి. వీటికి అనుబంధంగా అదనంగా 272 ఆయుర్వేద ఆసుపత్రులు, 130 హోమియో ఆసుపత్రులు, 141 యునానీ ఆసుపత్రులు, 24 నాచురోపతి ఆసుపత్రిలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నాయి. వీటన్నంటినీ అనుసంధానించు చేసుకోవచ్చు. ప్రతి జిల్లాకు వైద్య కళాశాలలు విస్తరిస్తున్న నేపథ్యంలో హౌస్ సర్జన్ల సేవలు, పి.జి. విద్యార్థుల సేవలు సమగ్రంగా ఆయా ప్రాథమిక కేంద్రాల్లో, ద్వితియ, తృతీయ స్థాయి కేంద్రాల్లో, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రాంతీయ జిల్లా టీచింగ్ ఆసుపత్రుల్లో ఎక్కడయినా వినియోగించుకునే సౌలభ్యం వుంది. 

          ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగు రీతిలో వైద్యులు సేవలు వినియోగించుకునే ఆస్కారం ఉంది. అనే విధంగా కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో నమూనాల సేకరణ సుగమం అవుతుంది. తృతీయ స్థాయిలో జిల్లాల ఆసుపత్రులలో డయాగ్నిస్టిక్ సేవలు అందుబాటులోకి తెచ్చే ఆస్కారం ఉంది. 8100 గ్రామాల్లోని 1.86 కోట్ల ప్రజలకు (అంటే మొత్తం జనాభాలోని 53% మందికి) నైపుణ్యం కలిగిన ప్రాథమిక వైద్యం సుసాధ్యం చేయంటంతో పాటుగా టెలి మెడిసిన్, ఫిక్స్ డేట్ హెల్త్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. గర్భీణీ స్త్రీలకు పరీక్షలు, పెరిగే పిల్లలకు వైద్యం, దీర్ఘ వ్యాధి గ్రస్థులకు పరీక్షలు, ఆయా సంబంధ సహకారం, సుసాధ్యం అవుతుంది. తద్వారా సమాన వైద్యం రోగి ముంగిట్లో అందిస్తే, తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్య సేవలు అందుబాటు లోకి తీసుకువచ్చినట్లు అవుతుంది. అన్ని వర్గాల వారికి సమన్యాయం సరైన వైద్యం చేరువ చేసినట్లు అవుతుంది.


          సమాచార సాంకేతిక రంగంలో విప్తవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో టెలి కమ్యూని కేషన్ వ్యవస్థను మరింత పరిపుష్ఠం చేసుకుని టెలి మెడిసిన్ ద్వారా దూర వైద్యాన్ని రోగికి చేరువ చేయటం ఆరోగ్య పరిరక్షణకు దోహద పడటం జరుగుతుంది. తద్వారా కాలాయాపన నివారించు కోవడంతో పాటు అనుకున్న సమయంలో, అత్యవసర వైద్యం చేరువ చేసి ఆపత్కాలంలో ఆదుకునే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితులను అధిగమించి ప్రాణాపాయన్ని నివారించి ఆపన్నహస్తం అందించినట్లవుతుంది. ఈ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురాగలిగితే ప్రజలకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని చేరువచేయటంలో కొత్త అధ్యాయన్ని ఆవిష్కరించినట్లవుతుంది.

Monday, April 17, 2017

ఆజన్మాంతం జీవన వెలుగులు : వనం జ్వాలా నరసింహారావు....ఆంధ్రజ్యోతి దినపత్రిక

ఆజన్మాంతం జీవన వెలుగులు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (18-04-2017)

          రైతులకు అవసరమైన ఎరువుల కొనుగోలుకు ప్రతి రైతుకు ఏటా ఎకరానికి రు. 4000 చొప్పున ప్రభుత్వ పరంగా ఇవ్వడానికి సీఎం చంద్రశేఖర రావు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర సంక్షేమ చరిత్రలో మరో మైలురాయి. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 55 లక్షల మంది రైతులకు అవసరమైన సుమారు 25 లక్షల టన్నుల ఎరువులు ప్రభుత్వ ఖర్చుతో కొనుక్కునే వీలు కలుగుతుంది. రైతుల సంక్షేమానికి ఈ పాటికీ అమల్లో వున్న అనేక కార్యక్రమాలకు ఇది అదనం.

సీఎం ఆలోచనాధోరణికి అనుగుణంగా రూపకల్పన జరిగి, వివిధ స్థాయిల్లో అమల్లో వున్న వందలాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, దారిద్రరేఖ దిగువన జీవనం సాగిస్తున్న బడుగు, బలహీన వర్గాల ప్రజల వెన్నంటి వుంటూ వారి జీవితాల్లో ఆజన్మాంతం వెలుగు రేఖలు నింపుతున్నాయి. తల్లి గర్భం దాల్చిన నాటి నుండి, తల్లీ బిడ్డల సంరక్షణతో మొదలుకొని, వారికి సరైన పౌష్టికాహారం అందిస్తూ, వివిద స్థాయిల్లో వారిని ఆదుకుంటూ, ఆదరిస్తూ, ఔదార్యం చూపుతూ, ఆ బిడ్డ పుట్టిన తరువాత విద్యాబుద్దులు నేర్చే సమయంలో, ఉన్నత చదువుల నేపథ్యంలో, పెళ్లి నాటి వేడుకల్లో భాగమై వారి ఆర్ధిక ఎదుగుదలకు తోడ్పడుతూ, వృత్తిలో చేదోడువాదోడుగా నిలుస్తూ, ఆయా పథకాలను, ఆయా సమయాల్లో అందిస్తూ, అనునిత్యం ఆసరాగా వుంటూ, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో, గతంలోనూ, వర్తమానంలోనూ ఇలా జరగలేదని పదేపదే గుర్తుచేస్తూ వుండడం తెలంగాణా రాష్ట్రానికే గర్వకారణం అనాలి. అలా అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను సంక్షిప్తంగా నెమరేసుకుంటే ఆసక్తికరంగానూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగానూ వుంటాయనడంలో అతిశయోక్తి లేదు.

బిడ్డ పుట్టే నేపధ్యంలో....తొంబై రోజుల పాటు బిడ్డ ఆరోగ్య సంరక్షణ కొరకు ప్రత్యేక సెలవు సదుపాయం కలిగించింది ప్రభుత్వం. ఆరు నెలల ప్రసూతి సెలవుకు ఇది అదనం. పిల్లలకు 18 ఏళ్ల వయస్సు వచ్చే వరకు దఫాలవారీగా ఈ సెలవులను విడతలుగా వినియోగించుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం అయ్యే మహిళలకు, ప్రసవించిన అనంతరం తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పన్నెండు వేల రూపాయల ఆర్ధిక సహాయం మూడు విడతలుగా లభిస్తుంది. దవాఖానాలో చేరిన వెంటనే వారి జీవన అవసరాలకు మొదటి విడతగా 4 వేల రూపాయలు, డిశ్చార్జి సమయంలో మరో 4 వేల రూపాయలు, శిశువులకు పోలియో టీకాలు వేసినప్పుడు మరో 4 వేల రూపాయలు అందుతాయి. అమ్మాయి పుడితే తెలంగాణ ఆడబిడ్డకు ప్రోత్సాహంగా మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది.  అప్పుడే పుట్టిన పిల్లకు కావాల్సిన 16 రకాల సామాన్లతో రూ.2వేల వ్యయంతో కేసీఆర్ కిట్ ను ప్రభుత్వం బహుమానంగా ఇస్తుంది. అలాగే ఏజెన్సీల్లో గర్భిణీ స్త్రీలను ఆస్పత్రులకు క్షేమంగా తీసుకురావడం, ప్రసవం తర్వాత తల్లీ బిడ్డలను ఇంటికి సురక్షితంగా తీసుకెళ్లడం కోసం "అమ్మ ఒడి" కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం. గర్భిణీలు ప్రతి మూడు నెలలకోసారి చెకప్‌ల కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సి రావడం కొరకు వాహన సౌకర్యం కలిగించింది ప్రభుత్వం. బిడ్ద పుట్టిన తరువాత ఆరోగ్య లక్ష్మి - పోషకాహారం పథకం అమల్లో వుంది. తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అంగన్‌ వాడి కేంద్రాల ద్వారా గర్బిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు ప్రతి రోజు ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది.

విద్యాబుద్దులు నేర్చుకునే సమయంలో...హాస్టల్ విద్యార్థులకు, పాఠశాల్లో, కళాశాలల్లో చదువుకునే వారికి మధ్యాహ్న భోజన పథకానికి  జనవరి 1, 2015 నుండి సన్నబియ్యం సరఫరా చేస్తున్నది ప్రభుత్వం. విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్ మెంట్ సరేసరి. రాష్ట్రంలో వివిధ వృత్తి విద్యా కోర్సులు చదివే 11,57,589 మంది పేద విద్యార్థుల ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. పేద విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ ప్రభుత్వం అమలు పరుస్తున్న మరో పథకం. రాష్ట్రం లోని పేద విద్యార్ధులకందరికీ ప్రభుత్వం పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్, వృత్తి విద్యా కోర్సుల్లో చదువుతున్న విద్యార్దులందరికీ స్కాలర్ షిప్స్ ఇస్తున్నది. సర్కారీ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాలలను, పాఠశాలలను పెద్ద ఎత్తున ప్రారంబించడం జరుగుతున్నది. ప్రభుత్వ, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, ఆదర్శ పాఠశాలల్లో ఉన్నత ప్రమాణాలతో సర్కార్ విద్యను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం డిజిటల్ తరగతులను ప్రారంభించింది. యూపిఎస్సీ, టిఎస్‌పిఎస్సి నిర్వహించే పోటీ పరీక్షలకు పేద విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి జిల్లా స్థాయిలోనే ఎస్సీ, ఎస్టీ, బిసి స్టడి సర్కిల్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

పెరిగి పెద్దకాగానే....ఉన్నత చదువుల కోసం...మైనారిటి విద్యార్థుల కోసం "ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీం" అమలవుతున్నది. దళిత విధ్యార్థుల కోసం అమల్లో వున్న అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ స్కీం తరహాలోనే మైనారిటీ విధ్యార్థులకు ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల స్కాలర్ షిప్ తో పాటు విమానయాన ఖర్చులు కూడా ప్రభుత్వం అందచేస్తున్నది. అలాగే బిసి విద్యార్థుల కోసం ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావ్ పూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకాన్ని అమలు చేస్తున్నది. ఇలా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు పెళ్లినాటికి కూడా అందుబాటులో వచ్చే విధంగా, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేర్లతో, దళిత, గిరిజన, మైనారిటీ కుటుంబాలతో పాటు బిసిలు, అగ్రవర్ణాలుగా పిలువబడుతున్న వారి ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి ఆర్థిక సహాయం అందచేస్తున్నది ప్రభుత్వం. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలే ఈ పథకానికి అర్హులనే ప్రభుత్వ నిబంధన వల్ల, బాల్య వివాహాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఆర్ధిక ఎదుగుదలకు బడుగు బలహీన వర్గాల వారి జీవితంలో వెలుగులు నింపడానికి, వారి సంక్షేమం కొరకు,  మరెన్నో పథకాలను అమలు చేస్తోందీ ప్రభుత్వం. వాటిలో ఒకటి...నిరుపేద, నిరుద్యోగ యువతకు జీవనోపాది కల్పించాలన్న ఉద్ధేశంతో అమలవుతున్న ఎకానమిక్ సపోర్ట్ పథకం. ఈ కొత్త విధానంలో వారికి ఇచ్చే రుణ సదుపాయంలో సబ్సిడీని భారీగా పెంచింది.

అందరూ, అందరిలాగే, కడుపు నిండా భోజనం చేయాలన్న దృక్ఫదంతో, ఆరు కిలోల బియ్యం ప్రవేశ  పెట్టిందీ ప్రభుత్వం. ఒక్కో వ్యక్తికి  6 కేజీల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి 6 కేజీల చొప్పున  బియ్యాన్ని అందిస్తున్నది. హైదరాబాద్ నగరంలో ఐదు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం దొరుకుతున్నది. నగరంలోని పెద్ద పెద్ద హాస్పటల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్, కూలీలు వుండే వివిద ప్రదేశాలలో  ఈ భోజనం లభించే కేంద్రాలను నిర్వహిస్తున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో వేడి వేడి ఆహారాన్ని అందచేస్తున్నది ప్రభుత్వం.  హైదరాబాద్ నగరంలో "ఓన్ యువర్ ఆటో" అనే వినూత్న పథకం ద్వారా మైనారిటీ యువకులకు 50 శాతం సబ్సిడీపై ఆటోలు దొరుకుతున్నాయి. మైనారిటీ జీవన పరిస్థితులు మెరుగు పర్చడానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నది. స్కాలర్ షిప్పులు,   టిఎస్ ప్రైమ్ పథకం,  హైదరాబాద్ లో ప్రత్యేక ఐటి పార్కు లాంటివి వారి కొరకుద్దేశించిన కొన్ని సంక్షేమ పథకాలు.


బీసీ కులాల్లోని అత్యంత వెనుకబడిన ఎంబీసీలకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా  వీరి సంక్షేమాన్ని పట్టించుకోలేదు. కుల వృత్తులకు తద్వారా మళ్లీ మహర్దశ పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల పెంపకంపై ఆధారపడ్డ యాదవ, గొల్ల కురుమ కులాలవారికి 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. వంద శాతం సబ్సిడీతో చేపపిల్లల పెంపకం కొరకు ఏర్పాట్లు జరిగాయి. అవసరమైన నిధులను కేటాయించి, ఉచితంగా చేపపిల్లల పంపిణీకి, కేజ్ కల్చర్ (పంజరాల్లో చేపల పెంపకం), చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఆధునీకరణ, కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణానికి వినియోగిస్తున్నది. నేత కార్మికుల సంక్షేమం, నేత పరిశ్రమ అభివృద్ధికి నేత కార్మికుల సంక్షేమం కొరకు, చేనేత మగ్గాలు, మర మగ్గాలలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తున్నది ప్రభుత్వం. సెలూన్లకు గృహ కేటగిరీ విద్యుత్ అమలు చేసి, విద్యుత్తు చార్జీల్లో మినహాయింపు ఇస్తున్నది.

ఆజన్మాంతం సంక్షేమం అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల్లో భాగంగా సీఎం తలపెట్టిన మరో కార్యక్రమం సాదాబైనామాలకు సంబంధించినది. రాష్ట్రంలో భూ వివాదాలన్నీ సత్వరం పరిష్కరించి, భూ రికార్డులు సవరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వ్యవహారాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సాదా బైనామాలను (గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాల లోపు) ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నది. దాదాపు 11.19 లక్షల మందికి సాదా బైనామాల ఉచిత రిజిస్ట్రేషన్ ద్వారా లబ్ది కలుగుతుంది. హెచ్‌ఎండీఏ, కుడా పరిధిలోని వ్యవసాయ భూములకు కూడా సాదాబైనామా ద్వారా లబ్ది చేకూరుతుంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 6 లక్షలు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా చనిపోయిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలు, రైతు చేసిన అప్పుల చెల్లింపునకు వన్‌టైం సెటిల్‌మెంట్ కింద లక్ష రూపాయలు చెల్లించడం జరుగుతుంది. బాధిత కుటుంబంలో పెళ్లీడుకు వచ్చిన అమ్మాయిలకు కల్యాణలక్ష్మి పథకం అమలవుతుంది. సమాజంలోని అన్ని వర్గాల వారికి ఏ విధంగా పలు సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయో అలాగే పేద బ్రాహ్మణుల సంక్షేమానికి వరుసగా రెండేళ్లలో రూ.100 కోట్లు చొప్పున రు.200 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.

రాష్ట్ర సాధనకోసం ప్రాణాలర్పించిన 470 మంది తెలంగాణ రాష్ట్ర సాధన అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం కింద రు.10 లక్షలు, కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ కుటుంబమైతే భూమిని సమకూర్చడం జరిగింది. రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లు, ట్రక్కులు సహా వివిధ రకాల వాహనాల డ్రైవర్లకు, హోంగార్డులకు, వర్కింగ్ జర్నలిస్టులకు సంవత్సరానికి 46 రూపాయల ప్రీమియంతో 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. గీత కార్మికులకు, మత్య్స కార్మికులకు 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారు మరణించినా, శాశ్వత వైకల్యం పొందినా సమాన పరిహారం అందిస్తుంది. గీత పారిశ్రామిక సంఘాలు, మత్య్స కార్మికసంఘాల్లో ఇప్పటివరకు రిజిస్టర్ అయి సొసైటీల్లో పేర్లు నమోదు చేసుకున్న కార్యకర్తలకే ఇది వర్తిస్తుంది. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రభుత్వం 11 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. ఐడీ కార్డులు, ఇతర నిర్మాణ వ్యవస్థల గుర్తింపు, సెస్ వసూలు, ఆరోగ్య కార్యక్రమాలు కూడా చేపట్టింది. కార్మికులు నిలబడే చోట నీడ, తాగునీటి సౌకర్యంతోపాటు వారికి ఈఎస్‌ఐ వైద్య సౌకర్యం కూడా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంట కోసం కిరోసిన్ వాడని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని భావించిన ప్రభుత్వం అర్హులందరికీ దీపం కనెక్షన్లు అందిస్తున్నది. అంగన్ వాడీల జీతాలు 150 శాతం పెంచింది ప్రభుత్వం. రాష్ట్రంలో ఒంటరిగా జీవితం గడుపుతూ, ఆర్థిక పరిస్థితులతో కష్టాలు పడుతున్న మహిళలకు ప్రభుత్వం నుంచి 2017 ఏప్రిల్ నుంచి ఆసరా ఫించన్ ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 

అత్యంత వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలకు జనాభా పరంగా నిధులు కేటాయించి, ఖర్చు చేయడానికి ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేసింది. కాని సబ్‌ప్లాన్ కింద కేటాయించిన నిధులు ఖర్చు చేయకుంటే రద్దు అయ్యేవి. ఇకపై వాటిని వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదలాయించేలా ప్రతిపాదనలు చేశారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా పక్కాగా సవరణలు రూపొందించింది. కేటాయించిన నిధులు ఖర్చు కాకపోతే వచ్చే ఏడాది బడ్జెట్‌లో కలిపే విధంగా ఫిబ్రవరి 2, 2017న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సవరణలు చేసింది. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పేరును ఇకపై ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ప్రగతి నిధి పేరుతో పిలువనున్నారు. ఈ నిధులను దళితులు, గిరిజనుల కుటుంబాలు, ఆవాసాలకు మాత్రమే ఉపయోగపడేలా వాడాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో సాధారణ పనులు, పథకాల ద్వారా చేసే ఖర్చు ఆ గ్రామానికి ఉపయోగపడితే సంబంధిత శాఖ నిధులే వినియోగించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన బిల్లు శాసనసభ, మండలి ఆమోదం పొందింది. ఇకనుంచి ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌లో ఎంత కేటాయిస్తారో, ఆ డబ్బంతా నేరుగా ఎస్సీ, ఎస్టీ డెవలప్‌మెంట్‌ శాఖకే వెలుతుంది.  దాని ద్వారా ఖర్చు చేస్తారు. దీనవల్ల నిధుల మళ్లింపు జరుగదు. ఎస్సీల కోసం తయారు చేసే పథకాలు, కార్యక్రమాలు కూడా గ్రామీణ ప్రాంతాలు, అర్బన్‌ప్రాంతాలు, సెమి అర్బన్‌ప్రాంతాలకు వేరు వేరుగా వుంటాయి.

రాష్ట్రంలోని వృద్దులు, వికలాంగులు, వితంతువులతో పాటు కల్లు గీత కార్మికులు, నేత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్స్, బీడీ కార్మికులు, పేద వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ఆసరా పెన్సన్లు అందిస్తున్నది. గతంలో కంటే వారి పెన్షన్లను భారీగా పెంచింది.

రాష్ట్రంలోని 4.22 లక్షల స్వయం సహాయక గ్రూపుల్లోని 50 లక్షల మంది సభ్యులకు  ఉపయోగపడేలా గ్రూపుల రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది ప్రభుత్వం. మహిళలు, బాలికల భద్రత, రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకున్నది. కుటుంబానికి మూడెకరాల భూ వసతి కల్పిస్తే, అది వారు ఆ కుటుంబాన్ని పోషించుకోవడానికి అనువైన వనరుగా  ఉపయోగపడుతుందని భావించిన ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన వెంటనే ఆగష్టు 15, 2014న "దళితులకు మూడెకరాల భూ పంపిణీ" కార్యక్రమాన్ని ప్రారంభించారు. వ్యవసాయాధార దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని బోరు, మోటారు, కరెంట్‌ కనెక్షన్‌ లాంటి వసతులతో  చేపట్టింది. ఈ సదుపాయాలన్నిటితో పాటు మొదటి పంటకు అవసరమైన పెట్టుబడిని కూడా సమకూరుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం  కలిగిస్తున్న రాయితీలలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ పార్కుల్లో 22% మేరకు స్థలాలను ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేశారు. హైదరాబాద్ లో ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల కోసం ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు జరుగనుంది. స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ రాపిడ్ ఇంకుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ ప్రీనర్స్ (TS PRIDE) అనే కొత్త కార్యక్రమం అమలు అవుతున్నది.

ప్రతి మనిషికి తప్పక కావాల్సింది తింటానికి అండ...వుండడానికి అండ. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు బలహీన వర్గాల గృహనిర్మాణాల పేరిట ఇండ్లు నిర్మించినా, అవి పేదలకు పెద్దగా మేలు చేయలేదు.  తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు నివాసయోగ్యమైన ఇల్లు, వారి ఆత్మ గౌరవం కాపాడే విధంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తున్నది. రెండు లక్షల అరవై వేల డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది.  ఫ్లాట్లు, ఇండ్లలో రెండు పడక గదులతోపాటు ఒక హాలు, వంటగది, టాయిలెట్లు ఉంటున్నాయి. మొదటి విడతగా ఆధునాతన పద్ధతుల్లో ఒక్కో యూనిట్‌కు 7లక్షల 90 వేలు ఖర్చు చేసి ఐడిహెచ్ కాలనీలో ఇళ్లనిర్మాణం చేపట్టారు. మలి విడతగా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల్లో దాదాపు 600 ఇండ్లకు ఒకేసారి గృహప్రవేశాలు చేశారు. లబ్దిదారులకు రూపాయి భారం కూడా పడకుండా పూర్తిగా ఉచితంగా ఈ డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నది ప్రభుత్వం.

ఇవన్నీ ఒక ఎత్తైతే రాష్ట్ర శాసనసభ ఆమోదం పొందిన కొత్త రిజర్వేషన్ల చట్టం మైనారిటీ, ఎస్టీ సంక్షేమ దిశగా మరో ముందడుగు అనాలి. ఈ చట్టం ఆమల్లోకి రాగానే , బీసీ-ఈ కేటగరీ కింద ముస్లిం మైనారిటీలకు విద్యా-ఉద్యోగాలలో 12% రిజర్వేషన్, ఎస్టీలకు 10% రిజర్వేషన్ సదుపాయం కలుగుతుంది.

          మూడు నాలుగు దశాబ్దాలపాటు ప్రభుత్వానికి, తద్వారా ప్రజలకు సేవలందించి పదవీ విరమణ చేసే ఉద్యోగులకు వారి రిటైర్మెంట్ రోజునే పూర్తి పెన్షన్ అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అదే రోజు ప్రభుత్వ లాంఛనాలతో, ప్రభుత్వ వాహనంలో ఇంటిదాక పంపించి రావాలని నిర్ణయించింది. దీనిని కచ్చితంగా పాటించాలని అధికారులకు స్పష్టం చేసింది. వీరి పట్ల అత్యంత మర్యాదగా, గౌరవంగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఇతర ఉద్యోగులకు ఉందని సీఎం స్పష్టం చేసారు.

            తెలంగాణ అంతటా మెరుగైన స్వర్గధామాల ఏర్పాటుకు కృతనిశ్చయంతో వుందీ ప్రభుత్వం. ఎంతటివారికైనా తప్పని అంతిమయాత్రకు పరమపద వాహనాలు కూడా ఏర్పాటు చేసిందీ ప్రభుత్వం. మనిషి చనిపోతే సమీప బంధి మిత్రులకు ఓ వైపు పుట్టెడు దుఖం, కడసారి చూపుకోసం ఇంటి వద్ద ఎదురుచూసే కుటుంబ సభ్యులు, ఆర్ధిక స్తోమత అంతంత మాత్రంగా వుండడం.. ఆ పరిస్థితులనే ఈ దళారులు తమకు అనుకూలంగా మార్చుకుని సొమ్ము చేసుకునేవారు. వీరి బాదలను అర్ధం చేసుకున్న ప్రభుత్వం దవాఖానల్లోని మార్చురీల్లో పోస్టుమార్టం నిర్వహించిన మృతదేహాలను సంబంధిత బంధువుల ఇళ్ల వద్దకు ఉచితంగా చేర్చడానికి పార్థివ దేహాల అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వాహనాలు మృత దేహాలను వారి గమ్యస్థానాలకు చేర్చనున్నాయి.


            తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా...ఇలా.. ఆజన్మాంతం సంక్షేమ పథకాలను అమలు చేస్తూ దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా పలువురి మన్ననలను పొందుతున్నది. END

Sunday, April 16, 2017

ప్రశస్త వాక్కు గల ఆంజనేయుడే హనుమంతుడు .....ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

ప్రశస్త వాక్కు గల ఆంజనేయుడే హనుమంతుడు
ఆంధ్ర వాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
 వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (17-04-2017)

హనుమంతుడు నిజంగా రామదూతే అయితే, తనకు ప్రియమైన శ్రీరాముడి గుణ-గణాలు వర్ణించమని సీతాదేవి హనుమంతుడిని అడుగుతుంది. భగవత్ గుణానుభవంలో అభిలాష వుండి, భగవత్గుణాను సంధానం చేస్తూ, శిష్యుడికి, భగవత్ గుణాలను వర్ణించి చెప్పేవాడే నిజమైన "గురువు-ఆచార్యుడు". అట్లా చేయకపోతే వారిని నమ్మకూడదు. దగ్గరకు రానీయ కూడదని దీనర్ధం. హనుమంతుడు ప్రత్యక్ష, పరోక్ష నిదర్శనాలతో, సీతాదేవిని పరీక్షించి (ఆచార్యుడు-శిష్యుడిని) చూసుకున్నట్లే, సీతాదేవి కూడ హనుమంతుడుని (శిష్యుడు-ఆచార్యుడిని) ప్రత్యక్షంగా పరీక్షిస్తుంది మొదట. అంటే శిష్యుడిని గురువు పరీక్షించినట్లే, గురువును కూడా శిష్యుడు పరీక్షించాలి. వీధిన పోయే ప్రతివాడినీ నమ్మి "ఆచార్యుడి"గా రానీయకూడదు.

          శ్రీరామ, లక్ష్మణుల చిహ్నాలేంటని సీతాదేవి హనుమంతుడుకి వేసిన ప్రశ్న ఒక విషమ ప్రశ్న. అందులో రెండు భాగాలున్నాయి. చేతుల విషయం ఎవరైనా చెప్పొచ్చు...అందరికీ కనిపిస్తాయి కాబట్టి. "తొడలెలా వుంటాయి?" అని కూడా అడుగుతుంది సీత. అంటే మర్మాంగాలను గురించి ఆరా తీస్తున్నదన్న మాట. దీంట్లో గురువును పరీక్షించే తీరు కనిపిస్తుంది. జవాబు చెప్పేటప్పుడు ఔచిత్యం కనబరుస్తాడా? లేదా? అని పరీక్షించ దల్చింది. దీనర్ధం..."ఆచార్యుడు", భగవత్ తత్వాన్ని ఆమూలాగ్రంగా, రహస్యాలతో సహా తెలిసిన వాడై వుండాలని!

          సీతమ్మ రాముడి తొడలు ఎలా వుంటాయనీ, లక్ష్మణుడి తొడలు ఎలా వుంటాయనీ, అడగడమేంటి? తప్పుకదా! అనిపించడం సహజం. విశేషించి పర పురుషుడుని, అందునా అసలే పరిచయం లేని వాడిని అలా అడగడమేంటి? ఇదొక విషమ పరీక్ష హనుమంతుడికి. ఆమెకు రామలక్ష్మణుల స్వరూపం తెలుసు. కాబట్టి అడిగింది. హనుమంతుడు చెప్పేదానిలో ఆ వివరాలు సరిపోతే ఆమె నమ్మగలగుతుంది. అదలా వుంచుదాం. కంటికి కనిపించే అవయవాలను వర్ణించి చెప్పవచ్చు. కంటికి కనిపించని మర్మావయాలను ఎలా వర్ణించడం? తెలిసే అవకాశం లేదే? ఒకవేళ చూడడం సంభవించినా, స్త్రీ ముందు వివరించి చెప్పడం ఔచిత్యం కాదుకదా? హనుమంతుడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు...సాముద్రిక శాస్త్రవేత్త. ఆ శాస్త్రం వ్యక్తుల రూపురేఖా విలాసాలను చెప్పి, వాటి ఫలితాలను ఇస్తుంది. ఏ ఏ జాతులవారు ఎలా వుంటారనేది సర్వావయ పరిణామాలను బట్టి విశ్లేషిస్తుంది. సాముద్రిక శాస్త్రజ్ఞాని హనుమంతుడైనందున, కంటికి కనిపించే అవయవాల పరిణామాలను బట్టి, పొందికను బట్టి, కంటికి కనిపించని (మర్మ) అవయవాలను వర్ణించగలుగుతాడు. సీతమ్మ ఉద్దేశ్యం కూదా అదేనేమో! రామలక్ష్మణుల ముఖాలనూ, బాహువులనూ, వక్షస్థలాలనూ, గమనించిన వాడు, మిగిలినవాటిని చెప్పగలడా? లేదా? అని. అంటే, ఈ దూత చూసిందే వల్లిస్తాడా? లేక చూసిన దానిని బట్టి, ఇంగిత జ్ఞానంతో, తదుపరి ఆలోచన చేయగలడా? లేదా? అని గ్రహించడానికే, హనుమంతుడుని ప్రశ్నించింది సీత. జయశీలుడైన హనుమంతుడు పరీక్ష నెగ్గాడు. సీతకు విశ్వాసపాత్రుడైనాడు.

          జవాబుగా హనుమంతుడు మొదలు శ్రీరాముడి ఆత్మ గుణాలను వర్ణించి, తర్వాత దేహ గుణాలను వర్ణిస్తాడు. "తేజస్సు, యశస్సు, శ్రీ" ల వల్ల వ్యాపించినవాడు శ్రీరాముడు అంటాడు. బ్రహ్మచర్య నిష్ట గలవాడంటాడు. రాముడిని వర్ణించిన హనుమంతుడు, ఆయన్ని గురించి చాలా నిగూఢంగా చెప్తాడు. స్పష్టంగా చెప్పి వుండేవాడే కాని, అలా చెప్తే చెప్పడం తెలియని వాడనీ, అడవి మనిషనీ, సీత భావించి వుండేది. "లింగం, వృశణం" గురించి కూడా చెప్పాడు. ఔచిత్యం పాటించక పోతే, "ఇటువంటి వాడు రామ దూతగా వుండజాలడు" అని సీతాదేవి తీర్మానించేదే! అసలామె ప్రశ్న వేసింది కూడా హనుమంతుడెలా చెప్తాడని తెలుసుకునేందుకే!


          రామచంద్రమూర్తి దూతగా వచ్చానని చెప్పిన తర్వాత, ఆమె నమ్మిందని నిర్ణయానికి వచ్చిన తర్వాత, తన జన్మ వృత్తాంతాన్ని, తనను గురించిన విషయాలనీ కూడా వివరించి చెప్తాడు హనుమంతుడు సీతాదేవికి. ఇలా చెప్పటంలో కూడ ఎంతో అర్ధం వుంది. స్నేహం చేయటానికి, కలసి మెలసి వుండడానికి, కులహీనుడితో, ఆచార హీనుడితో, సదాశ్రయం లేనివాడితో కుదరదు కాబట్టి, తన విషయం చెప్పుకొన్నాడు. కులం, గుణం, ఊరు, నిజమైన పేరు, దాచేవాడు ఆచార్యుడిగా పనికి రాడు. శిష్యుడు కూడా గురువు వంశాదులను, పుట్టు పూర్వోత్తరాలను, విచారించాలని కూడా దీని భావన."ఆచార్య కృత్యం" కూడా హనుమంతుడి మాటల్లో వ్యక్తమౌతుంది. శిష్యుడికి భగవంతుడి విశయమంతా వివరంగా చెప్పి, భయపడొద్దనీ, భగవంతుడే స్వయంగా వచ్చి తీసుకో పోతాడనీ, ఆ సమయానికై వేచి వుండాలనీ అంటాడు. శిష్యుడు మాత్రం సదాచారం, భక్తి విశ్వాసాలు కలిగి వుండాలని కూడ ఆయన మాటల్లో స్ఫురిస్తుంది. గురు పరంపర కూడా చెప్తాడు. శిష్యులు కాదల్చుకున్న వారు ఆచార్యులమని వచ్చేవారిని, పరీక్షించు కోవాలనే అర్ధం కూడా వుంది.

సీతమ్మ హనుమంతుడిని తన జన్మ వృత్తాంతం చెప్పమని అడగలేదు. రాముడి రూప విశేషాలను మాత్రమే చెప్పమని అడిగింది. దాంతో పాటు తన జన్మ వృత్తాంతాన్నీ చెప్పాడు హనుమంతుడు. అడగందే చెప్పడం దేనికి? అనిపించవచ్చు. కానీ హనుమంతుడు "ఆంజనేయుడు" కదా! అంటే ప్రశస్త వాక్కు కలవాడని అర్థం. వ్యర్థంగా ఏదీ మాట్లాడడు. అసలు కారణమేంటంటే, తాను రామ దూతనననీ, సామాన్యమైన సగటు వాడిని కాదనీ, సమర్థుడననీ సీతమ్మను నమ్మించ చేయడం ప్రధానం ఇక్కడ. నమ్మదగిన వాడినీ, విశ్వాసపాత్రుడునీ, అని సీతమ్మకు రూఢి చేయాలని భావించడం! తనను ఈ మహా కష్టం నుండి తప్పించగలవాడని, శ్రీరాముడిని రప్పించి తనను ఆయనతో కూర్చగల సమర్థుడని విశ్వాసాన్ని పాదుకొల్పడానికే తన వైనం చెప్పాడు హనుమంతుడు. రామాయణం "ధ్వని కావ్యం". అంతరాంతరాలలో దాగివున్న పరమార్థాలను ఆంధ్ర వాల్మీకి ఎంతో సులభంగా, సుందరంగా మనకు అందించాడాయన మన అదృష్టం వల్ల!

          ఇవన్నీ అయిన తర్వాత, సీతాదేవికి తన మాటల్లో ఇంకా పిసరంత సందేహముంటే, దాన్ని కూడా పోగొట్ట దల్చి, "శ్రీరామముద్రిక" ను ఇస్తాడు సీతమ్మకు. అంటే, సీతాదేవి సందేహం తీరిందని, శ్రధ్ధ కలిగిందని,  నమ్మకం కలిగిన తర్వాతనే ఉంగరం ఇచ్చాడు హనుమంతుడు. దీన్ని బట్టి సంశయంతో వున్నవారికి, శ్రధ్ధలేని వారికి, "రామ మంత్రం" ఉపదేశించ కూడదని అర్ధం చేసుకోవాలి. అదే విధంగా శిష్యుడు ఇది చెప్పమని అడగ కూడదు. గురువనుగ్రహిన్చిందే స్వీకరించాలి. ఈ విధంగా "సీత-ఆంజనేయుల"  చర్య వలన "శిష్య లక్షణం, గురు లక్షణం, ముముక్షు హిత చర్య, భగవత్ మంత్ర ప్రాప్తం" చెప్పడం జరిగింది.


          "రామముద్రిక"ను చూసిన సీతాదేవికి, సాక్షాత్తు, శ్రీరామచంద్రుడే ఎదురుగా వచ్చినట్లు, భావనాతిశయం వల్ల ఆయన ఆకారం స్పష్టంగా కనిపించింది. భగవన్మూర్తి ధ్యాన, సోపాన మార్గాన్ని తెలుపుతున్న దీచర్య. ఇది శిష్యుడి ఉత్తర కార్యం. భగవన్మూర్తి ఇలా ఎదురుగా వచ్చి నిల్చున్నట్లు అనిపించిందాకా భగవంతుడిని ఉపాసించాల్సిందే!

Friday, April 14, 2017

TS welfare schemes now cover from Cradle to Grave : Vanam Jwala Narasimha Rao

TS welfare schemes now cover from Cradle to Grave
Vanam Jwala Narasimha Rao
The Hans India (15-04-2017)

Chief Minister K Chandrashekhar Rao’s latest announcement of crediting Rs 4000 per acre in to each farmer’s account towards the cost of purchasing fertilizers is yet another milestone in the history of welfare in Telangana state.

This unprecedented decision will help about 55 lakhs of farmers across the state to procure about 25 lakhs of tons of fertilizers needed for farming. This is in addition to series of welfare measures being implemented to farmers since the formation of state.

As promised in its election manifesto, the TRS government already waived the crop loans of 36.33 Lakh farmers, which are below Rs One lakh amounting to Rs 17,000 Crore and all the four installments are released.

The state government has also been giving Rs 6 lakh ex-gratia to the farmers who have committed suicides. Subsidized micro irrigation and uninterrupted power supply is also aimed at welfare of farmer.     

Welfare state, a concept of government, is based on the principles of equality of opportunity, equitable distribution, and public responsibility for those unable to avail themselves of the minimal provisions for a good life. Sir William Beveridge, considered as the author of a welfare state, in his report to the British parliament in November 1942, proposed a system of social security which would be operated by the state.

This is exactly or perhaps even more than Beveridge envisaged has been happening in the state of Telangana. Welfare encompasses those government programs that provide benefits and economic assistance to no or low income people living in Telangana. Welfare of Government of Telangana aims to improve the quality of life and living standards of the poor and underprivileged. It may sound a bit philosophical, but the schemes conceived and being implemented by KCR government will take care of every stage of a human being’s life, the proverbial from “Cradle to Grave”.    
       
Several of these innovative schemes are not only first of their kind in the country but also become role models and torch bearers for other States to emulate. From a pregnant mother to child, later the education of the child when it becomes an adult to the marriage of a girl at every phase, the government has a scheme or two.

            Take for instance welfare for women…For all the government women employees a 90-day special leave is given to them which is besides the 3 months maternity leave. For those women getting their deliveries done in the government hospitals, there is a scheme to take care of her nutritional requirements during the anti-natal stage. An amount of Rs 12, 000 is given at different stages of ante-natal and post-natal care. If the woman is blessed with a girl child an additional Rs. 1000 is given to the mother.

KCR Kit with 16 essential items required for a newborn worth about Rs. 2000 is given to the mother and child. Through “Amma Vodi” scheme pregnant women living in the remote agencies are brought to the hospitals and transport her back after the delivery. After the child is born to give her nutritional diet there is “Arogya Laxmi” programme for providing nutritional diet one time daily through Anganwadi centre.


During the child’s education period, midday meal scheme is implemented with fine rice. Fee reimbursement for the students, benefit of scholarship scheme to pre-metric, post-metric, Graduate, Postgraduate and professional education students who are poor are also available. The state government has introduced English medium in the schools and launched in a big way residential schools for the SC/ST/Minority/BCs as part of KG to PG system of education. Study Circles are formed in the districts for the SC/ST/BC students preparing for the competitive examinations.

For those aspiring Minority students who want to pursue their higher studies abroad, the government is giving Overseas Scholarships on the lines of Dr Ambedkar Overseas Scholarship given to the SCs. At the time of marriage of girl child, Kalyana Laxmi/Shadi Mubarak schemes through which Rs. 75, 116 is given to the mother of bride. There is an economic support scheme to provide employment to the unemployed youth.

For every individual to have a proper meal, the government is giving 6 Kgs subsidized rice for each and every member of the family. In Hyderabad, a meal is given to the poor at a nominal price of Rs. 5 per plate.  Autos are available to the minority youth with 50 per cent subsidy to run the auto services in Hyderabad under "Own your Auto" Scheme.

For the welfare of the Most Backward Classes, a separate Finance Corporation is set up. Towards strengthening the rural economy hereditary professions are going to have better days ahead. For the benefit and welfare of the Yadav and Kuruma communities who are traditionally dependent on sheep breeding, government has embarked on a slew of measures. For those who are dependent on fisheries, the state government has initiated several schemes. 100 per cent subsidy is given for fish culture. Several schemes are also in place for the development and welfare of handloom weavers and workers. Hair dressing saloons are brought under the category of domestic sector for power tariff and measures are initiated to upgrade saloons in the rural sector.

As part of welfare from cradle to grave, the State government has decided to put an end to the land disputes and rectify the land records. As part of this, it has brought in several reforms in Registration and Mutations. Sada Bainama (Agreements written on plain paper) below 5 acres of land in rural areas are registered free of cost. Welfare schemes for the upper caste Brahmin community are also being implemented in the State. In the last two years Rs 200 Crore (Rs 100 Crore per year) is allotted for the Brahmin welfare.

For those 470 Martyrs who laid down their lives for the cause of separate Telangana State, the government sanctioned Rs 10 Lakh per family besides one job to the eligible person in the family and for those living on farming one acre of land. In order to help the handicapped, widows, old age persons, toddy tappers, weavers, HIV patients, Beedi rollers, old age artistes, the Government of Telangana is giving pension under the Aasara scheme. Old age people and Widows were getting Rs. 200 per month as pension earlier which has been enhanced to Rs.1, 000 now. Similarly for handicapped and old age artists the same has been enhanced from Rs.500 to Rs.1500.  Income limit for eligibility has also been enhanced to include more people. Aasara pension is also extended to Single women.

The SC/ST Sub Plan is renamed as SC/ST Special development Fund and it is used only for the SC/ST families and their places of residence. The Bill making these amendments was passed by the Legislative Assembly and Council. The funds granted in the Budget will directly go to the SC/ST development Ministry.

To give a proper shelter to the poor, the government has embarked upon the 2-bed Room Houses scheme.  The government has instructed the officials to pay pension of those retiring on the same day of their retirement. Welfare even after the death of a person is what that has been envisaged by the government. The state government is keen on making proper arrangements for those dead to provide relief to the near and dear at a time when they are all in deep sorrow.


And this is how the Telangana government is taking care of welfare of the people from cradle to grave. END 

Tuesday, April 11, 2017

"ఆంగ్లంలో భగవద్గీత సందేశ సారం" రడ్ యార్డ్ కిప్లింగ్ "ఇఫ్" : వనం జ్వాలా నరసింహారావు


"ఆంగ్లంలో భగవద్గీత సందేశ సారం" రడ్ యార్డ్ కిప్లింగ్ "ఇఫ్"
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రప్రభ దినపత్రిక (11-04-2017)

          విమర్శలు సహజం. కానీ అదే పనిగా వ్యక్తిగత విమర్శలు చేయడం, వున్నదీ-లేనిదీ కల్పించి..ఊహించి...అందుబాటులో వున్న మాధ్యమాల్లో రాయడం, ద్వేషాన్ని రెచ్చగొట్టడం, అవమానాలకు గురిచేయడం కొందరికి అదో అలవాటు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటీవల రాష్ట్ర-రాష్ట్రేతర దేవాలయాలో ప్రభుత్వ పక్షాన చెల్లించుకున్న మొక్కుల పట్ల పలు రకాల, అనవసర విమర్శలు, అందునా దేవాలయాలన్నా, దేవుళ్లన్నా, మతం అన్నా విశ్వాసం, గౌరవం లేనివాళ్లు చేయడం దురదృష్టకరం. అలాగే సీఎంను సమర్ధించిన వారిపై కొందరు వ్యక్తిగత విమర్శలకు దిగడం మరీ శోచనీయం. బహుశా ఒకే ఒక్క ఉదాహరణ వీటన్నింటికీ జవాబేమో! భద్రాచల రామాలయానికి అలనాటి తానీషా రోజులనుంచి, నేటి ప్రజాస్వామ్య పాలకుల వరకు, ప్రతి శ్రీరామనవమికి, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వ పక్షాన పోతున్నాయా? లేక రాష్ట్రాధినేత సొంత ఖర్చులతో పోతున్నాయా? అదే విధంగా ఇతర రాష్ట్రాలలోని దేవాలయాల విషయంలో కూడా జరగడం వాస్తవమా? కాదా? మరెందుకీ విమర్శలు? ప్రజాస్వామ్యంలో, ఎన్నికైన ప్రజా ప్రతినిధి, ఆయన కాని ఆమె కాని ఇచ్చే ప్రతి బహుమతీ స్వంత ఖర్చుతో ఇచ్చుకుంటూ పోవాలా? ఇరుగు-పొరుగు రాష్ట్రాల, దేశాల అధినేతలు వచ్చినప్పుడు, కలిసినప్పుడు ఇచ్చీ మొమెంటోలు కాని, బహుమతులు కాని సొంత ఖర్చుతోనే కొనాలా? అలాగే దేవుళ్లకు ఇచ్చీవి కూడా సొంత ఖర్చుతోనే కొనాలా? ఇవి చర్చనీయాంశాలే...కాదనను...కాని అదే పనిగా విమర్శించడం...అందునా దైవం మీద బొత్తిగా నమ్మకం లేని వాళ్లు విమర్శించడం ఎంతవరకు సబబు?  

ఈ నేపధ్యంలోనే...ఆరోపణలకు గురైన వారు ఏం చేయాలో...ఏం చేస్తే బాగుంటుందో, రడ్ యార్డ్ కిప్లింగ్ "ఇఫ్" అనే తన ఆంగ్ల పోయెంలో చక్కగా వివరించాడు. భారతదేశంలో జన్మించి నోబెల్ బహుమతి అందుకున్న వారిలో రెండవ వ్యక్తి రడ్ యార్డ్ కిప్లింగ్. కిప్లింగ్ రాసిన వాటిలో అత్యంత ఆదరణ లభించింది "ఇఫ్" ఆనే గేయ కవితకు. రచయిత కుష్వంత్ సింగ్ మాటల్లో చెప్పుకోవాలంటే, ఆ గేయ కవిత, "ఆంగ్లంలో భగవద్గీత సందేశ సారం". "ఇఫ్ యు కెన్ కీప్ యువర్ హెడ్ వెన్ ఆల్ ఎబౌట్ యు ఆర్ లూజింగ్ దెయిర్స్ అండ్ బ్లేమింగ్ ఇట్ ఆన్ యు......యువర్స్ ఈజ్ ద అర్త్ అండ్ ఎవ్రీ థింగ్ దట్ ఈజ్ ఇన్ ఇట్, అండ్-విచ్ ఈజ్ మోర్-యు విల్ బి మాన్, మై సన్" అని ఆంగ్లంలో వున్న ఆ కవితకు ప్రేమ మాలిని తెలుగు అనువాదమే "సంపూర్ణ మానవుడు". అదిలా సాగుతుంది…..

"తమదంతా కోల్పోతూ - దానికి నిను నిందిస్తూ,
ఆరోపణలు వేస్తున్నా - తలెత్తుకుని తిరుగు!
ఎవరికెన్ని అనుమానాలు వచ్చినా, ఆ అనుమానాలకు తావిస్తూ
కుంగి పోకుండా అలసట లేని నిరీక్షణకు అలవాటు పడుతూ
అసత్య వ్యవహారాలకు అపరిచితుడిగా వుంటూ
ద్వేషించబడుతున్నా ద్వేషానికి దూరంగా మెదులుతూ
మరీ సౌజన్యంగా, మరీ సచ్చీలంగా, మరీ వివేకంగా మెలగక
ఆత్మ విశ్వాసమే నీ ఊపిరిగా ముందుకు సాగిపో!
కలలెన్ని కంటున్నా, ఆ కలల్లోనే విహరించకు
ఆలోచించగలిగినా, ఆ ఆలోచనలనే నీ అంతిమ లక్ష్యం కానీకు
జయాపజయాలను సమతుల్యంగా పరిగణించి
నీవు పలికిన సత్యాన్ని వంచకులు అసత్యం చేసినా విని భరించు
నీ కొరకు నీవు సమకూర్చుకున్నవి తునాతునకలైనా ఓర్పు వహించు
కళా విహీనమైన జీవితాన్ని తిరిగి అందంగా మలచడానికి ప్రయత్నించు
ఓటమి ఎదుర్కొన్నా తిరిగి ఆదినుండి ఆరంభిస్తూ విజయానికి బాటలు త్రొక్కు
నీ మనసుకి ఎనలేని ధైర్యాన్నిస్తూ ఒక్కసారైనా ఓటమి ఊసెత్తకు
సామ్రాట్టులతో తిరిగినా సామాన్యులను మరవకు
ఎందరిని కలిసినా ఎందరితో మాట్లాడినా నీ గౌరవాన్ని కాపాడుకో
మనుషులందరినీ విశ్వసించినా అధికంగా ఎవరినీ నమ్మకు
జారవిడిచిన అమూల్యమైన నిమిషాన్ని తిరిగి సంపూర్ణంగా సిద్ధించుకో
అప్పుడే అవుతుంది ఈ విశ్వం సర్వం నీ సర్వస్వం
అందులోని ప్రతి అంశం నీ సొంతం
అన్నిటికన్నా అపూర్వం
సంపూర్ణ మానవునిగా నీ పునర్జన్మం!"

రడ్‌యార్డ్ కిప్లింగ్, బ్రిటిష్ పాలన కాలం నాటి బొంబాయి ప్రెసిడెన్సీ లో వున్న, నేటి ముంబాయి నగరంలో, 1865వ సంవత్సరం లో జన్మించారు. తండ్రి జాన్‌లాక్ ఉడ్ కిప్లింగ్, తల్లి ఆలీస్. వీరిది భారతదేశంలో స్థిరపడిన ఆంగ్లేయ కుటుంబం. రడ్ యార్డ్ కిప్లింగ్‌ ని ఆరవ యేట ఇంగ్లండ్‌కు పంపించారు ఆయన తల్లిదండ్రులు. ఇంగ్లండులో ఎన్నో కష్టాలనుభవిస్తూ కిప్లింగ్ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన కిప్లింగ్, అప్పటి అవిభక్త భారతదేశంలోని లాహోర్ పట్టణంలో ఒక ప్రచురణ కర్త వద్ద సహాయకుడిగా ఉద్యోగం చేశారు కొంతకాలం. క్రమేపీ రడ్ యార్డ్ కిప్లింగ్‌ రచయితగా రూపుదిద్దుకోవడం మొదలయింది. కొంతకాలం తరువాత రడ్ యార్డ్ తిరిగి లండన్‌కు వెళ్లిపోయారు. లండన్‌లో ఆయన తొలి నవల “ద లైట్ దట్ ఫెయిల్డ్” ప్రచురితమైంది. రడ్ యార్డ్ కిప్లింగ్‌కు అమెరికన్ ప్రచురణ కర్త వోల్‌కాట్‌తో పరిచయం కావడం, ఆ పరిచయం స్నేహం గాను, బాంధవ్యం గాను మారడం, వోల్‍కాట్ సోదరి కారొలీన్‌ను రడ్ యార్డ్ కిప్లింగ్ వివాహం చేసుకోవడం, దరిమిలా అమెరికాలో జీవించడం మొదలయింది.


ముంబాయి లోని జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్ కాంపస్‌లో ఇప్పటికీ, కిప్లింగ్ జన్మించిన ఇల్లుంది. చాలా కాలం పాటు ఆ ఇంటిని కళాశాల డీన్ వసతి గృహంగా ఉపయోగించేవారు. కిప్లింగ్ తల్లిదండ్రులు తాము ఆంగ్లో-ఇండియన్ల మని చెప్పుకునేవారు. చిన్నతనంలో తనకంటే చిన్నైన సోదరితో కలిసి ఇంగ్లాండ్ వెళ్లడం, అక్కడ వారిని వుంచుకుని చదువుసంధ్యలు నేర్పించిన సారా హోలోవే అనే మహిళ వారిద్దరినీ పెట్టిన ఇబ్బందులు కిప్లింగ్ రచనలపై ప్రభావం చూపాయి. ఆ విషయాలను ఆయన తన జీవిత చరిత్రలో కూడా పేర్కొన్నారు.

అనారోగ్యానికి గురైన కిప్లింగ్‌ తిరిగి ఇంగ్లండుకు చేరుకున్నారు. ఇంగ్లండ్‌లో రడ్ యార్డ్ కిప్లింగ్ బాలల కోసం, సైనికుల కోసం ఎన్నో రచనలు చేశారు. ఎన్నో పద్యాలు రాశారు. వాటిలో "ది సెవెన్ సీస్" అనే పద్య సంపుటి, "కెప్టెన్స్ కరేజియస్" అనే నవల ముఖ్యమైనవి. అంతకు ముందు "నౌలాహ్‌క" మోగ్లీ కథలు రాశారు. 1902లో రడ్ యార్డ్ రాసిన “జస్ట్ సో” కథాసంపుటి ప్రచురితమైంది. రడ్‌యార్డ్ రచనలను ఆమూలాగ్రం పరిశీలించిన తర్వాత 1907వ సంవత్సరం సాహిత్యంలో ఆయనకు నోబెల్ పురస్కారాన్ని అందజేశారు. నోబెల్ బహుమతి గ్రహించిన తర్వాత “లార్డ్” బిరుదును పొంది ఎన్నో ఉన్నత పదవులు అధిష్టించారు కిప్లింగ్. ప్రతీ తరంలోనూ పిల్లలు చదువుకుని ఆనందించే కథల పుస్తకాల్లో రడ్ యార్డ్ కిప్లింగ్ "హ్యూమరస్‌ టేల్స్" ఒకటి. కిప్లింగ్‌ భారత దేశంలో ఉన్న సమయంలో అనేక పుస్తకాలు రాశారు. ముఖ్యంగా పిల్లలకు మంచి హాస్య రస కథలు రాశారు. వాటిలో ఆణిముత్యాల లాంటివి ఏరి కూర్చిన సంకలనం ఈ పుస్తకం. కడుపుబ్బనవ్వించే ఈ కథల పుస్తకంలో "ది టాకింగ్‌ లంగ్‌టంగ్‌పెన్‌", "మై సండే ఎట్‌ హోమ్‌", "పిగ్‌", "అల్నాషర్‌ అండ్‌ ది ఓక్సన్‌", "ది బుల్‌ దట్‌ థాట్‌", "ది మాస్టర్‌ కుక్‌", "గాలియోస్‌ సాంగ్‌", "మోతీ గుజ్‌ మ్యూటినర్‌", "మై లార్డ్ ది ఎలిఫెంట్‌" లాంటి అనేక కథలున్నాయి.

రడ్ యార్డ్ కిప్లింగ్‍ను, ప్రధానంగా, బ్రిటీష్ ఇండియాలోని సైనికుల గురించి రాసిన గేయ రచయితగా యావత్ ప్రపంచం గుర్తించింది. చిన్న-చిన్న కథలను కళాత్మకంగా రచించడంలో కిప్లింగ్ ఒక నూతన ఒరవడిని సృష్టించాడని ప్రసిద్ధి. అలానే ఆయన రచించిన అనేక కథలు బాల బాలికలను విభిన్న ధోరణిలో ఆకట్టుకునే విగా వుంటాయి. నోబెల్ బహుమతి గ్రహీతలలో ఆయనే మొట్టమొదటి ఆంగ్ల భాషా రచయిత. అత్యంత పిన్న వయసులో ఆ బహుమతిని పొందిన మొదటి వ్యక్తి కూడా కిప్లింగే. బ్రిటన్ ఆస్థాన కవిగా వుండమని ప్రభుత్వం ఆయనను కోరినప్పటికీ దానిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. బ్రిటీష్ వలస వాద ప్రవక్తగా సైన్స్ ఫిక్షన్ రచయిత జార్జ్ ఆర్వెల్ కిప్లింగ్‍ను  సంబోధించేవాడు.

బ్రిటీష్ ఇండియాకు తిరిగొచ్చిన కిప్లింగ్ లాహోర్ నగరంలో "సివిల్ అండ్ మిలిటరీ గెజెట్" అనే వార్తా పత్రికలో ఉద్యోగంలో చేరాడు. ఏడాది పొడుగూతా ప్రచురించబడే ఆ పత్రిక వారానికి ఆరు రోజులు మాత్రమే వెలువడేది. నాటి ఆ పత్రిక సంపాదకుడు స్టీవెన్ వీలర్ కిప్లింగ్‌కు చాలా కష్టతరమైన పనులను అప్పగించినప్పటికీ, రచనా వ్యాసంగంపై తనకున్న మక్కువను మాత్రం కొనసాగించ లేకుండా వుండలేక పోయాడు. ఆయన పనిచేస్తున్న పత్రిక సంపాదకుడు మారి, మరొకరు వచ్చిన తరువాత, కిప్లింగ్ కు కొంత స్వేచ్ఛ లభించింది. సంపాదకుడి ప్రోత్సాహంతో అదే పత్రికకు కథలు రాయడం మొదలుపెట్టాడు. అప్పట్లో వేసవి విడిది కోసం కిప్లింగ్ ప్రతి సంవత్సరం సిమ్లాకు వెళుతుండేవాడు. అక్కడ ఆయనకు కనిపించిన, వినిపించిన పలు ఆసక్తికరమైన విషయాలనే తన కథా వస్తువులుగా మలచుకుని, గెజెట్ పత్రికలో రాసేవాడు. గెజెట్ పత్రికలో ప్రచురితమైన కిప్లింగ్ కథలు "ప్లెయిన్ టేల్స్ ఫ్రం ద హిల్స్" పేరుతో పుస్తక రూపంగా వచ్చాయి. ఆ తరువాత అలహాబాద్ నుంచి ప్రచురితమయ్యే "ద పయనీర్" అనే పత్రికలో కొన్నాళ్లు పనిచేశాడు కిప్లింగ్. పయనీర్ లో ఉద్యోగం వదిలిన తరువాత కూడా చాలా కాలం ఆ పత్రికలో ఆయన వ్యాసాలు వస్తుండేవి. కిప్లింగ్ రాసిన "కిం" నవలంటే జవహర్లాల్ నెహ్రూకు చాలా ఇష్టం.

                      1936 లో రడ్ యార్డ్ కిప్లింగ్ మరణించారు. ఆయన రచించిన "ఇఫ్" పోయం అప్పటికీ - ఇప్పటికీ, పదిమంది బధ్రంగా పదిలపరచుకునే ఒక చక్కటి సందేశాత్మక గేయ కవిత. చెప్పాల్సింది చెప్పలేక ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని కువిమర్శలు చేసేవారికి ఇదొక సందేశం. ఇతరులను విమర్శించే ముందర ఒక్క సారి అలా చేస్తే మంచిదా? కాదా? అనే ఆలోచన చేస్తే బాగుంటుందేమో!End