Thursday, October 18, 2018

బర్త్ ఆఫ్ బుంటి..ఎంఏ ఫలితాలు...లైబ్రేరియన్ గా ఉద్యోగ ప్రస్తానం .... జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు : వనం జ్వాలా నరసింహారావు


బర్త్ ఆఫ్ బుంటి..ఎంఏ ఫలితాలు...లైబ్రేరియన్ గా ఉద్యోగ ప్రస్తానం
జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు
వనం జ్వాలా నరసింహారావు
నవంబర్ 1970 లొ నాగ్ పూర్ వెళ్ళిన తరువాత చదువుమీద దృష్టి మరలించాను. అప్పటికి ఫైనల్ ఇయర్ పరీక్షలకు కేవలం నాలుగు నెలలే సమయమున్నందున ఎక్కువ సమయం స్టడీస్ లోనే గడపాల్సి వచ్చింది. ఎక్కువ కాలం లైబ్రరీలోనే వుండేవాళ్ళం. అయినప్పటికీ, ఇంతకుముందే చెప్పినట్లు, నాకున్న హోంసిక్ వల్ల నవంబర్-మార్చ్ నెలల మధ్య మరో రెండు సార్లు ఖమ్మం వెళ్లి వచ్చాను. నేను నాగ్ పూర్ లో వున్నా, ఖమ్మంలో వున్నా మా ఆవిడ మాత్రం ఖమ్మం మామిళ్ళగూడెంలో వున్న మా ఇంట్లోనే అత్తగారి దగ్గరే ఎక్కువగా వుండేది. మా ఇంటికి అతి సమీపంలోనే మా ఆవిడ పుట్టిల్లు కూడా వుండడంతో ఆమె ఎప్పుడనుకుంటే అప్పుడు అక్కడి పోయి వస్తుండేది. తను అత్తగారి ఇంట్లో వున్నా, పుట్టింట్లోనే వున్న భావన కలిగేదనీ, తనను అంత ఆప్యాయంగా మా అమ్మ-ఆమె అత్తగారు చూసుకునేదనీ ఇప్పటికీ తను చెప్తుంటుంది. మాది అందరిలాగే ఉమ్మడి కుటుంబం. తనకన్నా పెద్ద-చిన్న ఆడపడుచులతో, మరదులతో కలిసి-మెలసి వుండాల్సి వచ్చినా తనకెప్పుడూ ఇబ్బంది కలగలేదని అనేది. యధావిధిగా మా ఇద్దరి మధ్య ఉత్తర-ప్రత్యుత్తరాల కమ్యూనికేషన్ నిరంతరాయం కొనసాగేది.

1971 మార్చ్ నెలలో పరీక్షలైపోయాయి. పాసవుతానన్న ధైర్యంతో నాగ్ పూర్ వదిలి ఖమ్మం చేరుకున్నాను. మళ్లీ ఒక్క సారి రిజల్ట్స్ వచ్చాక వెళ్లి వచ్చాను. నావరకు నేను ఖమ్మంలో స్నేహితులతో ఎక్కువ కాలం గడిపేవాడిని. గర్భిణీగా మా ఆవిడ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మా అమ్మే చూసుకునేది. వంటా-వార్పూ అంతా మా అమ్మే చూసుకునేది. జూన్ నెలలో లాంచనంగా జరిపించాల్సిన సీమంతం తరువాత, మా ఇంటి నుండి తన పుట్టింటికి, ఆ తరువాత ఒకటి-రెండు రోజులకు డెలివరీ నిమిత్తం వరంగల్ కు వాళ్ల అమ్మతో కలిసి వెళ్ళింది మా ఆవిడ. వరంగల్ లోనే, అప్పటికీ ఇంకా హౌజ్ సర్జన్ గా పనిచేస్తున్న మా బావగారు, డాక్టర్ మనోహర్ రావు వుండడం వల్ల, ఆయన ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మను సంప్రదించారు. ఆమె కేవలం డాక్టర్ గానే కాకుండా కుటుంబపరంగా సన్నిహితురాలై, తన ఇంట్లోనే మేడ మీద ఒక పోర్షన్లో మా ఆవిడ వాళ్ళను వుండడానికి ఏర్పాటు చేసింది పెద్ద మనసుతో. ఒక పెద్ద ఆపరేషన్ అయిన ఏడాదికే డెలివరీ కాబోతున్నందువల్ల కొంచెం భయపడ్డా, డాక్టర్ గారింట్లోనే వుండడం చాలా ధైర్యాన్నించ్చింది వీళ్ళకు. ఎప్పటికప్పుడు అవసరమైన వైద్యపరమైన అన్ని శ్రద్ధలూ తీసుకుంటూ డెలివరీ రోజుకోరకు వేచి చూశారు. ఆ రోజున కూడా డాక్టర్ పద్మగారు స్వయానా తన కారు ఇచ్చి ఆసుపత్రికి పంపించి, వెంటనే తానూ వెళ్లి, సిజేరియన్ లాంటివేవీ లేకుండా నార్మల్ డెలివరీ చేయించారు. జులై నెల 8, 1971 న రాత్రి పదిన్నర గంటల సమయంలో ప్రసవించి, మా పెద్దమ్మాయి ప్రేమ మాలిని (బుంటి) కి జన్మనిచ్చింది. నేను అప్పుడు ఖమ్మంలోనే వున్నాను.

         డాక్టర్ పద్మగారి ఇద్దరు కూతుళ్లు రాణి, శోభ మా ఆవిడతో చాలా సరదాగా వుండేవాళ్ళు. దాదాపు వారిది ఇంచుమించు ఒకటే వయసు. రాణి భర్త, ఐపీఎస్ అధికారి గిరీష్ కుమార్, ఉమ్మడి అంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా పనిచేసారు. శోభ భర్త రాజేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసారు. రాణి, శోభలు కూడా ఉన్నత ఉద్యోగాలు చేసారు. 85 ఏళ్ళు దాటిన డాక్టర్ పద్మగారిని ఇటీవలే ఆమె వుంటున్న దోమల్ గూడాలోని ఇంటికి వెళ్లి నమస్కారం చేసి వచ్చాం. ఇటీవల కాలం దాకా ఆమె తన కన్సల్టెన్సీ సేవలను కొనసాగించారు.

         మా ఆవిడ డెలివరీ అయిన రెండు-మూడు రోజులకు మా అమ్మా-నాన్నా వరంగల్ వెళ్లి తల్లీ-బిడ్డను చూసి వచ్చారు. నేను మూడోనాడు వెళ్లాను. ఆ నాటి నా వరంగల్ ప్రయాణం నా జీవితాన్ని ఒక మలుపుతిప్పిన అపురూపమైన ప్రయాణం. అప్పటికే ఎంఏ ఫలితాలోచ్చి పాసయ్యాను. అదొక శుభ వార్తైతే, అమ్మాయి పుట్టడం మరొక శుభ వార్త. ఆ సంతోషంతో వరంగల్ కు బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక వ్యక్తితో గొప్ప పరిచయమైంది. నాకు బస్సులో సీటు దొరికింది...హాయిగా కూర్చున్నా....కాని ఒక నడివయసు మహిళ సీటు దొరక్క నిలబడి వుండడం, నేను లేచి ఆమెకు సీటిచ్చి నిలబడడం జరిగాయి. కొంతసేపటికి మొత్తం మీద ఆమె వెనుక సీట్లోనే నాకూ సీటు దొరికింది. ఒకరినొకరు పరిచయం చేసుకున్నాం. ముందు నేను ఫలానా అనీ, ఇటీవలే ఎంఏ పాసయ్యాననీ, ఇంకా ఉద్యోగం రాలేదనీ, మా ఆవిడ డెలివరీ అయినందున పుట్టిన అమ్మాయిని చూడడానికి వరంగల్ పోతున్నాననీ చెప్పాను. ఆమె వివరాలడిగాను. తన పేరు “షాజహానా బేగం” అనీ, తను ఖమ్మం జిల్లా విద్యాధికారి (డీఈఓ) ననీ, సొంత ఊరైన వరంగల్ పోతున్నాననీచెప్పింది. ఆశ్చర్య పోయాను. అంత పెద్ద అధికారి, వీలున్నా, అధికారిక వాహనం ఉపయోగించుకోకుండా బస్సులో ప్రయాణం చేస్తున్నందుకు ఆమెను అభినందించాను.

         సరదాగా మాటలు కొనసాగించిన మేడం “షాజహానా బేగం”, ఉద్యోగం లేకుండా పిల్లల్ని, భార్యను ఎలా పోషిస్తావని ప్రశ్నించింది. నా దగ్గర సమాధానం లేదన్నాను. వరంగల్ నుండి తిరిగొచ్చాక తనను కలవమంది. జూనియర్ లెక్చరర్ల నియామకానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కు రాశామని, నేను కాల్ లెటర్ తెచ్చు కుంటే, ఇంటర్వ్యూకి హాజరవ వచ్చనీ, నాకు ఉద్యోగం రావడానికి తను సహాయ పడతాననీ చెప్పింది. ధన్యవాదాలు తెలియచేశాను అప్పటికి.

         వరంగల్ వెళ్లి మా ఆవిడను, మా అమ్మాయిని చూసి ఒకరోజుండి తిరుగు ప్రయాణమయ్యాను. ఖమ్మంలొ “షాజహానా బేగం” ను కలిశాను. ఆమె చెప్పినట్లే స్థానిక ఎమ్మెల్యే సిఫారసుతో, ఎంప్లాయ్మెంట్ శాఖలో ఉన్నతోద్యోగంలో వున్న పర్సా మోహన్ రావుగారి సహాయంతో,  ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాల్ లెటర్ సంపాదించాను. ఇంటర్వ్యూకి వెళ్లాను. జూనియర్ లెక్చరర్ ఉద్యోగం తాత్కాలికమనీ, పర్మనెంట్ ఉద్యోగమైన గ్రాడ్యుఏట్ లైబ్రేరియన్ పోస్ట్ ఇస్తున్నాననీ చెప్పింది జిల్లా విద్యాధికారి (డీఈఓ). ఎగిరి గంతేసినంత పనిచేసి ఆమెకు కృతజ్ఞతలు తెలియచేసాను. కాకపొతే ప్రస్తుతానికి ఆ ఉద్యోగం ఖమ్మానికి 30 కిలోమీటర్ల దూరాన వున్న ఎల్లెందు జూనియర్ కాలేజీలోననీ, మూడు నెలల్లో ఖమ్మం బదిలీ చేయిస్తాననీ వాగ్దానం చేసింది. ఆ తరువాత ఇదంతా జరగడానికి డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న సంపత్ రావు, క్లార్క్ సీతారాంరావు సహాయం చేసారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులు తీసుకుని ఎల్లెందు జూనియర్ కాలేజీలో రిపోర్ట్ చేసాను. జీతం అక్షరాలా రెండువందల డబ్భై రూపాయలు.      

మా ఆవిడేమో ఖమ్మంలో కాలక్షేపం...నేనేమో నాగ్ పూర్ లో చదువు ఇంతలో ఒక శుభ వార్త.....జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు: వనం జ్వాలా నరసింహారావు


జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు
మా ఆవిడేమో ఖమ్మంలో కాలక్షేపం...నేనేమో నాగ్ పూర్ లో చదువు
ఇంతలో ఒక శుభ వార్త
వనం జ్వాలా నరసింహారావు 
         మా ఆవిడకు కిడ్నీ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిన తరువాత కూడా సుమారు మూడు-నాలుగు నెలలపాటు వరంగల్ లోనే వాళ్ళ కుటుంబం వుండిపోవాల్సి వచ్చింది. కారణం మా మామ గారికి జాండిస్ సమస్య ఇంకా నయం కాకపోవడమే. అందువల్ల ఆయనింకా ఎంజీఎం దవాఖానలోనే చికిత్స తీసుకుంటూ వుండేవారు. ఒకవైపు చికిత్స కొనసాగుతూ వుంటే, మరో వైపు వీళ్ళను చూడడానికి వచ్చి-పోయే బంధువులతో వీళ్లుండే అద్దె ఇల్లు కోలాహలంగా వుండేది. అలోపతికి జాండిస్ నయం అయ్యే సూచనలు కనిపించకపోవడంతో వరంగల్ లొ ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ప్రతివాడ భయంకర శటగోపాచారిని సంప్రదించారు. ఎంజీఎం నుండి డిశ్చార్జ్ అయ్యి శటగోపాచారి ఇంట్లోనే అద్దెకుండే వాళ్లు మా మామగారి కుటుంబం. ఆయుర్వేదం కూడా పని చేయలేదు. ఫలితం కనిపించకపోవడంతో ఒక నిర్ణయం తీసుకుని ఖమ్మం మకాం మార్చారు. వచ్చిన రెండు-మూడు రోజులకు రాయవెల్లూర్ కు మామగారిని తీసుకుపోయాడు మనోహర్. అక్కడ ఒక పదిహేను రోజుల చికిత్స తరువాత కొంచెం కుదుటపడి ఖమ్మం తిరిగొచ్చారు. మొత్తం మీద నయం అయింది.

         మా ఆవిడ తన మొదటి ఆపరేషన్ తర్వాత తొమ్మిదో తరగతి పరీక్షలు రాసి, పాసయ్యి పదవ తరగతిలో చేరింది కాని చదువు కొనసాగలేదు సరిగ్గా. ఇంతలో రెండో ఆపరేషన్ కూడా అవడం వల్ల దాదాపు చదువుకు ఫుల్ స్టాప్ పెట్టినట్లే అనుకోవాలి. ఆమె తన కుటుంబ సభ్యులతో సహా, వరంగల్ నుండి ఖమ్మం వచ్చిన కొన్నాళ్ళకు, నా పీజీ మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడంతో నేను కూడా మూడు నెలలు ఖమ్మంలోనే వున్నాను. నాగ్ పూర్ లో వున్నంత కాలం నాకు, మా ఆవిడకు అంతవరకున్న ఉత్తరాల అనుబంధం, నా ఖమ్మం రాకతో, అక్కడ వుండడంతో ఇద్దరి మధ్యా అన్యోన్య అనుబంధం పెరగసాగింది. చిన్న తనమైనా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి వీలైంది. సినిమాలకు, షికార్లకు పోవడం, మా ఆవిడ అడపా-తడపా మా ఇంటికొచ్చి వుండడం మొదలైంది. పెళ్ళైన ఏడాదిలోపుల అల్లుడైన నన్ను మామగారు తన ఇంటికి లాంచనంగా తీసుకుపోవడం, అలాగే కోడలైన మా ఆవిడను మా నాన్నగారు వాళ్ళు తమ ఇంటికి తీసుకుపోవడం జరిగింది. ఇదొక వేడుక. ఈ వేడుక అందరి ఇళ్ళల్లో జరిగేదే. తీసుకుపోయిన అల్లుడికి వాళ్ళు, కోడలికి వీళ్లూ బట్టలు పెట్టడం సాంప్రదాయం. అదే జరిగింది మా విషయంలో కూడా.  మా ఆవిడను మా గ్రామంలో, మా ఇంట్లో దించేసి (అప్పట్లో మా కుటుంబం ఎక్కువగా మా ఊళ్లోనే కాపురం వుండేది) ఖమ్మం వెళ్ళారు. మా ఇరువురి మధ్య అనుబంధం మరింత పెరగడానికి ఆమె మా ఇంట్లో వున్న రోజుల్లో వీలైంది. ఇంతలో మా కజిన్ కల్మలచెర్వు రమణారావు పెళ్ళికి మిర్యాలగూడెం దగ్గరున్న వాళ్ల వూరికి (కల్మలచెర్వు) పోవాల్సి వచ్చింది. సతీసమేతంగా వెళ్లాను. పెళ్లి తతంగమంతా చాలా సరదాగా జరిగింది. బస్సులో చేసిన ప్రయాణం మినహా మిగతాదంతా ఎడ్ల బండిలోనే.

కల్మలచెర్వు నుండి తిరిగి మా వూరికొచ్చాం. ఇది సుమారు 1970 మే-జూన్ నెలల ప్రాంతంలో. వచ్చిన ఒకటి-రెండు రోజుల్లో మా వూరికి సమీపంలోనే వున్న నాచేపల్లి గ్రామంలో నివసిస్తున్న మా తాతగారికి (అమ్మ తండ్రిగారు) వంట్లో సుస్తీ చేసినందువల్ల అమ్మా-నాన్న అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. మమ్మల్ని ఇద్దరినీ మా వూళ్ళో (వనంవారి కృష్ణాపురం) వదిలేసి వాళ్ళు వెళ్లారు. మేం మూడు-నాలుగు రోజులు వుండి, నాచేపల్లి మీదుగా (ఎడ్ల బండ్లో ప్రయాణం) నేలకొండపల్లి వెళ్లి అక్కడ బస్సెక్కి ఖమ్మం వెళ్లాం. ఒంటరిగా మా వూళ్ళో వున్న ఆ మూడు-నాలుగు రొజులు భార్యా-భార్తలమైన మేం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి దోహదపడ్డాయి.

ఇక్కడ మా తాతగారి గురించి కొంత చెప్పాలి. ఆయన పేరు ముదిగొండ వెంకటరామ నర్సయ్య గారు. అమ్మమ్మ పేరు సుభద్రమ్మ గారు. వీరికి సంతానం కలగనందున మా అమ్మ సుశీలను దత్తత తెచ్చుకున్నారు. పసిపిల్లగా ఉన్నప్పుడే అమ్మ వీళ్ళింటికి వచ్చింది. అందుకే అమ్మ పుట్టింది బలపాలైనా మావరకు మాకు అమ్మమ్మగారిల్లంటే నాచేపల్లే. మా అమ్మతో పాటు మరికొన్నాళ్లకు మరొక మగపిల్లవాడిని కూడా దత్తత తెచ్చుకున్నారు. ఆయనకు చలపతిరావు అని పేరు. ఆయనకే మా అక్కయ్యనిచ్చి పెళ్లి చేసాం. మా తాతగారు అపర శ్రీరామ భక్తులు. ఇంట్లో గంటలతరబడి పూజాపునస్కారాలు చేయడమే కాకుండా అను నిత్యం వాళ్ల గ్రామంలో వున్న పురాతన రామాలయానికి పోయి వచ్చేవారు. వాళ్ల గ్రామ కరిణీకం ఆయనే చేసేవారు. తాతగారికి రామాయణ, భారత, భాగవత గ్రంథాలకు సంబంధించిన అనేక విషయాలే కాకుండా వర్తమాన సామాజిక-ఆర్ధిక-రాజకీయ పరిజ్ఞానం అపరిమితంగా వుండేది. ఆ తరువాత కొద్ది రోజులకు ఆయన దివంగతులయ్యారు. మా చిన్నతనమంతా, ముఖ్యంగా శలవుల్లో, అమ్మమ్మగారింట్లోనే గడిచింది.

ఖమ్మంలో కొద్ది రోజులుండి జులై నెలలో పీజీ రెండవ సంవత్సరం కొనసాగించడానికి నాగ్ పూర్ వెళ్లాను. ఎప్పటిలాగే రొటీన్. నా రూమ్మేట్ ఎబెనజార్ కేరళకు చెందినవాడు. వాడితో మాట్లాడుతుంటే అడవిబాపిరాజు నవల నారాయణరావు చదువుతున్నట్లుండేది. వాడు చూడడానికి అంత బాగా వుండకపోయేవాడు. కాని నాతో ఎప్పుడూ “నా అంత అందగాడు ఎవరూలేరు జ్వాలా” అనేవాడు. కొంచెం మతిమరుపు కూడా వుండేది. ఉదయం టూత్ పేస్ట్ కు బదులు షేవింగ్ క్రీం వాడిన రోజులు చాలా వున్నాయి. నేను తరచూ ఖమ్మం వెళ్లి వస్తుండడం వల్ల రూమ్ అద్దె నాది కూడా వాడే కట్టేవాడు. వచ్చినతరువాత అప్పు తీర్చేవాడిని. చాలా సరదా మనిషి అయిన ఎబెనజార్ ఎక్కడున్నాడో ఏమో! 

అడపా-దడపా ఖమ్మం వచ్చిపోతున్న నాకు అలా ఒక సారి వచ్చినప్పుడు, నవంబర్ 1970 లో, మా ఆవిడ ఒక శుభ వార్త చెప్పింది. ఆవిడ తల్లి, నేను తండ్రి కాబోతున్నానన్నది. ఆ విషయాన్ని విన్న మా అమ్మా-నాన్న, అత్తగారు-మామగారు, అటువైపు-ఇటువైపు కుటుంబ సభ్యులు అందరూ సంతోషించారు. వెంటనే హైదరాబాద్ వచ్చి అప్పట్లో ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సీతను సంప్రదించాం. ఆమె అంతా సవ్యంగా జరుగుతుందని భరోసా ఇచ్చింది. మా ఆవిడ ఖమ్మం, నేను నాగ్ పూర్ ప్రయాణమై పోయాం.  

పెళ్ళికి ముందు-తరువాత అనూహ్య పరిణామాలు....జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు: వనం జ్వాలా నరసింహారావు


జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు
పెళ్ళికి ముందు-తరువాత అనూహ్య పరిణామాలు
వనం జ్వాలా నరసింహారావు
         మా పెళ్లి అయ్యేనాటికి నా వయసు ఇరవై సంవత్సరాల ఎనిమిదినెలలైతే, కాబోయే శ్రీమతి వయసు పదిహేను సంవత్సరాల ఐదు నెలలు మాత్రమే. అది బాల్య వివాహమా-కాదా అనే సంగతి అటుంచితే, అసలు-సిసలు పెద్దలు కుదిరించిన వివాహమని తప్పకుండా అనాలి. పెళ్ళైన కొన్నాళ్లకే నాగ్ పూర్ లో ఎంఏ చదువుకు పోయాను. 1969 జులై నెలలో అక్కడికి వెళ్ళిన తరువాత ఒకటి-రెండు సార్లు ఖమ్మం వచ్చినా తెలియని ఒక విషయం, మా ఆవిడ కూడా చెప్పలేకపోయిన ఒక విషయం మా బావమరది, అప్పటికింకా వరంగల్ లో ఎమ్బీబీఎస్ చదువుతున్న (డాక్టర్) మనోహర్ రావు నాకు రాసిన ఉత్తరం ద్వారా తెలిసింది. అది మా శ్రీమతి ఆరోగ్యం విషయం కావడాన ఉత్తరం అతి జాగ్రత్తగా, నేను మరోలా భావించకుండా వుండే తరహాలో రాశాడా ఉత్తరం. వివరాల్లోకి పోతే.....

         1968 డిసెంబర్ నెలలో, అప్పటికింకా కేవలం పదిహేనేళ్ల వయసే వున్నప్పుడు, ఇంకా పెళ్లి సన్నాహాలు మొదలు కానప్పుడు, కాబోయే మా శ్రీమతికి (విజయలక్ష్మి) సుస్తీ చేసింది. పొట్ట ఎడమ భాగాన విపరీతమైన నొప్పి రావడంతో, స్థానిక ప్రభుత్వ వైద్యుడు, సర్జన్ డాక్టర్ రోశయ్యను సంప్రదించారు. ఎక్స్-రె తదితర వైద్య పరీక్షలు నిర్వహించి, ఎడమ కిడ్నీలో రాయి (కిడ్నీ స్టోన్) వుందనీ, తక్షణమే వైద్యం మొదలెట్టాలనీ సలహా ఇచ్చారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమం ఉదృతంగా వున్న కారణాన, వరంగల్ మెడికల్ కాలేజీకి శలవులు ఉన్నందున, మనోహర్ రావు ఖమ్మంలోనే వుండేవాడు. వెంటనే హైదరాబాద్ తీసుకొచ్చారు తనను. కిడ్నీ స్టోన్ వున్నదని ధృవ పరచడానికి ఫెర్నాండేజ్ ఆసుపత్రిలో ఐవీపీ (అప్పట్లో కిడ్నీ సంబంధిత వ్యాధి నిర్ధారణకు అదే సరైన వైద్య పరీక్ష) వైద్య పరీక్ష చేయించారు. కేవలం స్టోన్ మాత్రమే కాకుండా, ఎడమ కిడ్నీ సరిగ్గా పని చేయడం కూడా లేదని పరీక్షలో బయటపడ్డది. ఆపరేషన్ అవసరం వుందని కూడా అన్నారు.

ఆపరేషన్ కు భయపడి, ఒక నెలరోజులు మనోహర్, ఆయన అన్నయ్య డాక్టర్ రంగారావు క్లాస్మేట్ కాంతారావు (ఆయన కూడా సర్జనే) దగ్గర వైద్యం చేయించారు. తగ్గనందున, పెద్దగా ఫలితం లేనందున, ఇంకా నొప్పి వస్తుండడం వల్ల, విజయవాడలో ప్రముఖ హోమియోపతి వైద్యుడు సీతాపతి దగ్గరకు తీసుకుపోయారు. తాను బాబాయిగారింట్లో (తుర్లపాటి హనుమంతరావు) వుంది. చికిత్స చేయించుకుంది. చికిత్స మాటేమో కాని, అక్కడున్నప్పుడే ఆమె మేనమామ భండారు శ్రీనివాసరావు (నా క్లాస్మేట్), కజిన్ సాయిబాబు (తుర్లపాటి సాంబశివరావు), శ్రీనివాసరావుకు కాబోయే భార్య నిర్మల తదితరులతో సరదాగా కాలక్షేపం చేశానని మా శ్రీమతి ఇప్పటికీ అంటుంది. హోమియోపతి కూడా సరిగ్గా పనిచేయలేదు. నొప్పి అంతగా తగ్గలేదు.

ఇదిలావుండగా పెళ్లి వ్యవహారం మొదలైంది. ఇరుపక్షాల పెళ్లి పెద్దలు మా ఇద్దరికీ పెళ్లి కుదిరించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెళ్లి చూపులకని మా కాబోయే మామగారు అయితరాజు రాంరావు గారు కూతురును ఖమ్మం తీసుకుపోవడానికి విజయవాడ వచ్చారు. ఖమ్మం వచ్చిన మర్నాటి ఉదయమే (ఫిబ్రవరి 28, 1969 న) పెళ్లి చూపుల తతంగం, ఆ సాయింత్రానికల్లా ఇరు పక్షాలు పెళ్ళికి అంగీకారం తెలపడం చక-చకా జరిగిపోయాయి. ఆ తరువాత మాటా-మంతీ కూడా అయిపోయాయి. ఇవన్నీ ఒక పక్క జరుగుతుండగానే తనకు మళ్లీ తీవ్రంగా నొప్పి రావడం, అనుకోకుండా ఖమ్మంలో మనోహర్ వుండడం, ఆమెను వెంటనే వరంగల్ తీసుకెళ్లాలని నిర్ణయించడం, అందరూ వెళ్ళడం జరిగింది. మనోహర్ టీచర్, ప్రముఖ సర్జన్ డాక్టర్ కేఆర్ ప్రసాద్ రావు తనను పరీక్షించి వెంటనే ఎంజీఎం ఆసుపత్రిలో అడ్మిట్ చేసారు. అవసరమైన వైద్య పరీక్షల అనంతరం మార్చ్ 15, 1968 న ఆపరేషన్ చేశారు డాక్టర్ ప్రసాద్ రావు గారు. అప్పట్లో అది మేజర్ ఆపరేషన్. కిడ్నీ పనిచేసే అవకాశం ఇంకా ఉన్నందున, కిడ్నీ స్టోన్స్ తీసేసి, పది-పన్నెండు రోజులు ఆసుపత్రిలో వుంచి డిశ్చార్జ్ చేసారు. 28 మార్చ్ కల్లా అంతా ఖమ్మం వచ్చేశారు. ఈ విషయాలేవీ నాకు కాని, మా వాళ్ల దృష్టికి కాని రాలేదు.   

ఇంతలో మా నాన్నగారి దగ్గరనుండి మా కాబోయే మామగారికి కబురొచ్చింది. వాళ్ళిద్దరూ అరేయ్-తురీ అనుకునేంత చనువుంది. ఇద్దరూ స్కూల్ క్లాస్మేట్స్. మార్చ్ 30 న లగ్న నిశ్చయం చేసుకోవాలని మా నాన్నగారి కబురు సారాంశం. ఆపరేషన్ సంగతి చెప్పాల్నా-వద్దా అనేది నిర్ణయించుకోవడం కష్టమైంది. ఎంతైనా ఆడ పిల్ల వాళ్ళు కదా! మొత్తం మీద విషయం అప్పటికి బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం లేదని భావించారు. ఇద్దరి ఇళ్లు ఒకే వీధిలో వున్నాయి కాబట్టి, ఎలాగూ తెలుస్తుంది కాబట్టి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారు. ఏప్రియల్ 30, 1969 న మా వివాహం అయింది. కిడ్నీ సంబంధమైన ఆపరేషన్ జరిగి అప్పటికి నెలరోజులన్నా కాకపోయినా, పెళ్లిలో కాని, తదనంతర వివాహ సంబరాలలో కాని ఏ మాత్రం అలసట లేకుండా పరిపూర్ణ ఆరోగ్యవంతురాలిగా తిరిగింది మా శ్రీమతి. ఎవరికీ ఏ అనుమానం రాలేదు. సందేహానికి తావే లేదు. అయితే కథ ఇంతటితో అయిపోతే బాగుండేది. అలా జరగలేదు. ఆమెకు మరొక ఆపరేషన్ జరగాలని భగవంతుడు రాసిపెట్టి వుంటాడు. అదే జరిగింది.

ఇంతకు ముందే రాసినట్లు, మనోహర్ దగ్గరనుండి ఉత్తరం రావడానికి కారణం వుంది. మా పెళ్లయిన ఎనిమిది నెలలకు, ఆపరేషన్ తదనంతర వైద్య పరీక్షలకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్ళారు మా శ్రీమతిని. దురదృష్టం...వైద్య పరీక్షల్లో తేలింది...ఆమె కిడ్నీ పనిచేయడం లేదని.... పనిచేయని కిడ్నీ అలాగే వుంచితే మరో కిడ్నీకి ప్రమాదమనీ. తర్జన-భర్జనలు జరిగాయి. ఆపరేషన్ తప్పనిసరి అనే నిర్ణయానికి వచ్చారు. ముందుగా ఈ విషయాన్ని (అప్పటికి నాకింకా ఆమెకు కిడ్నీ స్టోన్ తీసేసిన విషయం కూడా తెలియదు) నాకెలా తెలియచేయాలో అని చర్చించుకున్నారు. అదే రోజుల్లో మా మామగారికి జాండిస్ వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. నాకు ఒక “టచింగ్” ఉత్తరం రాసాడు మనోహర్. విషయమంతా తెలియచేసి నిర్ణయం నాకొదిలేశారు. కిడ్నీ తీసేయించడమనే నిర్ణయం అంత తేలిగ్గా తీసుకునేది కాదని అందరూ అనుకున్నారు. నేను ఉత్తరం అందిన వెంటనే హైదరాబాద్ కు వచ్చాను హుటా-హుటిన. ఈ లోపున ఇంగ్లాండులో వున్న మా ఆవిడ పెద్దన్నయ్య డాక్టర్ రంగారావు దగ్గరనుండి మరో ఉత్తరం. చెల్లెలి కిడ్నీ తీయకుండా ఏదైనా మార్గం వుంటే, అది ఆచరణలో పెట్టడానికి, ఎంత ఖర్చైనా సరే, ప్రపంచంలో ఎక్కడికైనా సరే, తాను తీసుకెళ్ళి చికిత్స చేయిస్తానని ఉత్తరంలో పేర్కొన్నాడు. మొత్తం మీద మరోసారి ఫెర్నాండేజ్ ఆసుపత్రిలో డాక్టర్ జీపీ రామయ్య సారధ్యంలో మళ్లీ ఐవీపీ పరీక్ష చేసి, కిడ్నీ తీయక తప్పదని నిర్ధారించుకోవడం జరిగింది. నేను మా నాన్న గారికి విషయమంతా వివరించాను. మేమందరం ఆపరేషన్ కే మొగ్గు చూపాం. ఇక్కడో విషయం చెప్పాలి. డాక్టర్ జీపీ రామయ్య మాకు ధైర్యం చెప్తూ తనకు ఒక కిడ్నీలో సగం మాత్రమే పని చేస్తుందనీ, ఒక కిడ్నీ వున్న వాళ్లకు ఏ ఇబ్బందీ వుండదనీ, రెండు కిడ్నీల పని ఒకటే చేస్తుందనీ అన్నారు.

హైదరాబాద్ నుండి మళ్లీ వరంగల్ పోయాం. జనవరి 10, 1970 న ఎంజీఎం ఆసుపత్రిలో డాక్టర్ ప్రసాద్ రావు గారు తనకు ఆపరేషన్ చేసి పనిచేయని కిడ్నీ తొలగించారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఆసుపత్రిలో వున్న తనను చూడడానికి మా అమ్మా-నాన్న వచ్చిపోయారు. ఆ తరువాత ఆమెను డిశ్చార్జ్ చేసి ఖమ్మం పంపారు. నేను ఒక వారం-పది రోజులుండి నాగ్ పూర్ వెళ్లాను. కథ సుఖాంతం.

ఆపరేషన్ అయ్యి ఇప్పటికి సుమారు ఏబై ఏళ్ళు కావస్తున్నది. భగవంతుడి దయవల్ల ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్క కిడ్నీ వున్నవాళ్ళు రెండు కిడ్నీలు ఉన్నవాళ్ళ లాగే ఏ సమస్య లేకుండా జీవించవచ్చనడానికి మా శ్రీమతి ఒక ఉదాహరణ. ఆ తరువాత ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అన్నీ నార్మల్ డెలివరీలే. ఆనాటి నుండి ఈనాటి వరకూ, అందరిలాగే నార్మల్ జీవితం గడుపుతోంది. తనకసలు ఒక కిడ్నీ లేదన్న ఆలోచనే రాదు. గృహ సంబంధమైన ఎంత కష్టమైన పనైనా రెండు కిడ్నీలున్న వాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా చేస్తుంది.

మనల్ని కాపాడడానికి ఎల్లప్పుడూ భగవంతుడున్నాడు, ఉంటాడు అనడానికి ఇంతకంటే ఏ ఉదాహరణ కావాలి?                      


పెళ్ళైన తరువాత మళ్ళీ చదువు...నాగ్ పూర్ లో రెండేళ్ళు....జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు: రెండేళ్ళు


జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు
పెళ్ళైన తరువాత మళ్ళీ చదువు...నాగ్ పూర్ లో రెండేళ్ళు
వనం జ్వాలా నరసింహారావు
         ఏప్రియల్ 1969 లో పెళ్ళైన తరువాత అప్పటికే డిగ్రీ చేతికొచ్చిన నాకు పీజీ చేయాలన్న కోరిక కలిగింది. హైదరాబాద్ లో డిగ్రీ చదువు పూర్తిచేసిన తరువాత సుమారు మూడు సంవత్సరాలు గ్రామీణ వాతావరణంలో, చుట్టుపక్క గ్రామాల్లోని కమ్యూనిస్ట్ స్నేహితుల సాహచర్యంలో, వ్యవసాయమే ప్రవృత్తిగా కాల గడిపిన నాకు మళ్ళీ చదువుకోవాలన్న కోరిక కలగడానికి ప్రధాన కారణం, మా ఆవిడవైపు వారంతా ఉన్నత చదువులు చదువుతూ వుండడమే. బహుశా అలా అందరితో సమానంగా వుంటే మంచిదేమో అని నాకు అనిపించడం  కూడా కావచ్చు. వెంటనే పై చదువులకోసం ఏం చేయాలనే ప్రయత్నాలు ప్రారంభించాను.

         1969 సంవత్సరంలో మొట్టమొదటి తెలంగాణా ఏర్పాటు ఉద్యమం స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సారధ్యంలో ఉధృతంగా సాగుతున్నందున తెలంగాణ ప్రాంతంలోని కళాశాలల్లో, ఉస్మానియా విశ్వవిద్యాలయాలంలో బోధనా జరగడం లేదు. దాదాపు మూసివేతకు గురయ్యాయి. ఎలాగైనా చదువు కొనసాగించాలన్న కోరికతో నాగ్ పూర్ ప్రయాణమై పోయాను. మొదటి విడత నేను నాగ్ పూర్ వెళ్ళినప్పుడు నా వెంట మా ఆవిడ పక్షాన బంధువైన ఆమె సోదరుడు మనోహర్ రావు (అప్పట్లో వరంగల్ లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు) కూడా వచ్చాడు. అక్కడికి వెళ్లి వివిధ కోర్సుల గురించి విచారణ చేసి వచ్చాం. రెండో విడత వెళ్ళినప్పుడు మా పిన్ని కొడుకు రమణారావు నా వెంట వున్నాడు. నాగ్ పూర్ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ (లెక్కలు) కోర్సుకు దరఖాస్తు పెట్టుకుని, రెండు రోజులుండి సీటు సంపాదించుకుని వచ్చాను.

         తరగతులు ప్రారంభం కాగానే నాగ్ పూర్ కు వెళ్లాను. తాత్కాలికంగా అక్కడ చదువుతున్న సీనియర్ల దగ్గర మకాం పెట్టాను. మొదటిరోజు ఎమ్మెస్సీ క్లాసుకు హాజరై పాఠ్యాంశాలు వింటుంటే పూర్తిగా మతిపోయింది. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నేను ఇక్కడ హైదరాబాద్ ఉస్మానియా బీఎస్సేలో చదువుకున్న లెక్కలకు, అక్కడ నాగ్ పూర్ ఎమ్మెస్సీ లెక్కలకు ఎక్కడా పొంతన లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ లెక్కల సబ్జెక్టుతో పీజీ చేయలేననే నిర్ధారణకు వచ్చాను. కాని ఎలాగైనా పీజీ చేయాలన్న కోరికున్న నాకు ఏం చేయాలో పాలుపోలేదు. సరిగ్గా నాలాగే ఆలోచిస్తున్న సహాధ్యాయి వడ్డీ జీవ రత్నం అనే తెలుగు స్నేహితుడు (కొత్తగా అయ్యాడు ఆరోజునే) ఒక సలహా ఇచ్చాడు. దాని ప్రకారం తక్షణమే బయల్దేరి ఆనతి దూరంలో వున్న విశ్వవిద్యాలయం గ్రంథాలయ భవనానికి వెళ్లాం. అక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా పనిచేస్తున్న తెలుగు ప్రొఫెసర్ మూర్తి గారిని కలిసాం. మా అభ్యర్ధన మేరకు మా ఇద్దరికీ ఎంఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) లో సీట్ ఇప్పించాడు. ఆ విధంగా సైన్స్ లో డిగ్రీ చేసిన నేను, హ్యుమానిటీస్ కు మారాను. అదో కొత్త అనుభవం.

         నార్త్ అంబజారీ రోడ్డులోని యూనివర్సిటీ లైబ్రరీ భవనంలోని రెండో అంతస్తులో మా క్లాసులు జరిగేవి. ఉదయమంతా ఖాళీ. మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు-ఆరు గంటల వరకు సాగేవి తరగతులు. గోకుల్ పేట్ లో ఒక గది అద్దెకు తీసుకుని మరొకరితో కలిసి వుండేవాడిని. మొదటి సంవత్సరం ఎంకాం చదువుతున్న నందిరాజు వరప్రసాద్, రెండవ సంవత్సరం మా క్లాస్ మేట్ కేరళకు చెందిన ఎబెనజర్ నా రూమ్మేట్స్. సమీపంలో వుండే రెడ్డి మెస్ లో కాని, అయ్యర్ మెస్ లో కాని భోజనం. నాన్న నెలకు రెండొందళ రూపాయలు పంపేవారు. మంచిగా సరిపోయేవి. రెండు కారణాల వల్ల నాగ్ పూర్ లో చదువుతున్న రోజుల్లో ఎక్కువ సమయం అక్కడుండ లేకపోయేవాడిని. ఒకటి ఇంకా మా గ్రామ రాజకీయాల వాసన వదలకపోవడం అయితే, రెండోది కొత్తగా పెళ్ళైన వాళ్లందరిలాగే నాకూ ఎప్పుడూ ఖమ్మం పోవాలనిపించడం. మొత్తం మీద నాగ్ పూర్ రెండేళ్ళ చదువులో నేనక్కడుంది ఐదారుమాసాలే. నాగ్ పూర్ లో వుంటున్నప్పుడు కూడా హోమ్ సిక్ వుండేది. అందుకే కాలేజీకి పొయ్యే సమయం తప్ప మిగతా సమయమంతా లైబ్రరీలో గడిపేవాడిని. ఆపాటికే కమ్యూనిజం వాసన తగిలినందువల్ల లైబ్రరీలో ఎక్కువగా కార్ల్ మార్క్స్ పుస్తకాలే చదివేవాడిని. ఆంగ్లంలో విజ్ఞాన సర్వస్వం ఒకటుంటుందని మొదటిసారి తెలుసుకున్నది ఆ లైబ్రరీలోనే.

         మొదటి సంవత్సరం మా క్లాస్ లో సుమారు 40 మందిదాకా విద్యార్థులుండేవారు. ఫైనల్ యియర్లో ఆ సంఖ్య పన్నెండుకు తగ్గింది. మిగతావాళ్ళు పరీక్ష తప్పారు. తెలుగు వారైన వైకే మోహన్ రావు, ఉమాశంకర్, జీవరత్నం, పీవీఎస్సార్ దాస్ లతో పాటు నాకు గుర్తున్న మరో స్నేహితుడి పేరు అరుణ్ ఉపాధ్యాయ్. అతడు నాగ్ పూర్ నివాసి. ప్రముఖ రాజకీయ నాయకుడు, ముగ్గురు ప్రధాన మంత్రుల దగ్గర కేంద్ర మంత్రిగా పనిచేసిన ఎన్కేపీ సాల్వే కూతురుని పెళ్లి చేసుకున్నాడు. ఆయన భార్య అరుణ కూడా మా క్లాస్మేటే. మేమంతా ఎప్పుడూ కలిసి-మెలిసి వుండేవాళ్ళం. అరుణ్ ఇప్పటికీ కాంటాక్టులో వున్నాడు. ఇతర స్నేహితుల పేర్లు కొన్ని గుర్తున్నాయి. ఉమాశంకర్, పీవీఎస్సార్ దాస్ చనిపోయారు. జీవరత్నం ఎక్కడున్నాడో తెలియదు. వైకే మోహన్ రావు వ్యాపారంలో ఆరితేరి ప్రస్తుతం హైదరాబాద్ లో వుంటున్నాడు. రూమ్మేట్ గా వుండే వరప్రసాద్ ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసాడు. ఎబెనజర్ ఏమయ్యాడో తెలియదు. మా క్లాస్ అమ్మాయిలు పాధ్యా, లోండే, జాలీ, భారతీ భర్వాడా కూడా మాతో సరదాగా వుండేవారు.

         మాకు ప్రోఫెసర్లుగా వీవీ మూర్తి, ఎన్జీఎస్ కిని, దేశ్పాండే, దవే, కులకర్ణి తదితరులుండేవారు. కిని పొలిటికల్ సోషాలజీ చెప్పేవారు. మూర్తి గారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బోధించేవారు. దేశ్పాండే స్థానిక స్వపరిపాలన చెప్పేవారు. ఈ ముగ్గురూ ఇప్పటికీ గుర్తుండడానికి కారణం వారు మాకు పాఠాలు బోధించిన తీరు. ముఖ్యంగా మూర్తి గారు, కిని గారు. ఒకరిని మించి ఒకరు అన్నట్లు వుండేవారిద్దరూ. నేను అస్తమానం కమ్యూనిస్ట్ కోణంలో క్లాసులో లెక్చరర్లతో వాదన వేసుకునేవాడిని. చివరకోకనాడు కిని నన్ను తన రూమ్ కు పిలిచి వార్నింగ్ ఇచ్చాడు. కాకపొతే ఆయన సబ్జెక్టులోనే నాకు ఎక్కువ మార్కులు వచ్చేవి.

         మూర్తి గారు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్లాస్ లో ఏనాడూ పాఠ్యాంశం బోధించలేదు. క్లాసుకు వస్తూనే ఆ రోజు కరెంట్ అఫైర్స్ ప్రస్తావించేవారు. ఆ అంశాన్ని బోర్డు మీద రాసి చర్చ మొదలెట్టేవాడు. వర్తమాన రాజకీయాలు, సామాజిక పరిణామాలు, ఇలా అనేకమైన ఆసక్తికర అంశాలను చర్చించేవాడు. ఇందిరాగాంధీ అంటే వల్లమాలిన అభిమానం. ఎన్జీఎస్ కినికి ఆమె అంటే విపరీతమైన కోపం. వీరిద్దరూ పోటా-పోటీగా వర్తమాన రాజీయాలను అత్యంత ఆసక్తికరంగా చెప్పేవారు-చర్చించేవారు. కిని వస్త్రధారణ చాలా సాదా-సీదాగా వుండేది. వీలున్నప్పుడల్లా బీడీలు తాగేవాడు. మేం ఎంఏ చదువుతున్న తొలినాళ్ళలో ఇందిరాగాంధీ సిండికేట్ నాయకులను ఎదిరించి, తాను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వరాహగిరి వెంకటగిరిని బలపర్చి, అంతరాత్మ ప్రబోధం అనే నినాదాన్ని లేవనెత్తింది. అలనాటి ఆవర్తమాన రాజకీయాలు అత్యంత ఆసక్తిగా తరగతిలో చర్చించేవాళ్ళం.

         “హోంసిక్” తొ సతమతమయ్యే నాకు ఉరట కలిగించేవి....స్నేహితులతో కాలక్షేపం, లైబ్రరీలో కాలం గడపడం, అడపా-దడపా బీరు తాగడం, చీట్లపేక ఆడడం, వరుసకు బంధువైన తుర్లపాటి సాంబశివరావు (ఆయన నాగ్ పూర్ లో అదే రోజుల్లో ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ చదువుతుండే వాడు) తో ముచ్చటించడం, అదే పనిగా క్రమం తప్పకుండా మా శ్రీమతికి ఉత్తరాలు రాయడం, జవాబు కోసం ఎదురుచూడడం.

         ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు యూనివర్సిటీ ఎన్నికలు జరిగాయి. అక్కడ పధ్ధతి ప్రకారం మొదలు యూనివర్సిటీ ప్రతినిధులను ఎన్నుకుంటారు. వీరంతా కలిసి, వీళ్ళలో ఒకరిని యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులను ఎన్నుకుంటారు. మేమంతా కలిసి మా క్లాస్మేట్ ఉమాశంకర్ ను ఒక అభ్యర్థిగా నిలబెట్టాం. కాకపోతే ఆయన ప్రత్యర్థిలలో ఒకరు యూనివర్సిటీ అధ్యక్ష స్థానాన్ని ఆశిస్తున్న వ్యక్తి. అతడు అలనాటి మహారాష్ట్ర ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు, శివసేన బాల థాకరేను ఎప్పుడూ విమర్శించే చోబే సోదరుడు. పోటీ రసవత్తరంగా సాగి, ఈ ఇద్దరూ ఓడిపోయి మూడో వ్యక్తీ గెలిచాడు. తక్షణమే మా మీదికి దాడికి దిగారు చోబే సోదరుడి అనుయాయులు. మొత్తం మీద ఎదో విధంగా ఆ కష్టం నుండి బయట పడ్డాం. ఆ తరువాత మేమమతా స్నేహితులమయ్యాం.  

మొత్తం మీద ఎంఏ రెండేళ్ళ చదువు పూర్తి చేసుకున్నాను. చదువు పూర్తయిన తరువాత నాకొక టెస్ట్ మోనియల్ కావాలని మూర్తిగారిని అడిగాను. ఆయన ఇచ్చిన సర్టిఫికేట్ ఇప్పటికీ అది నాదగ్గర భద్ర పర్చుకున్నాను. “నియమ నిబంధనలను పాటించడం కన్నా తనకు అప్పచెప్పిన, తాను స్వీకరించిన పనిని పూర్తి చేయడం జ్వాలా నరసింహారావు ప్రత్యేకత” అని ఆ సర్టిఫికేట్ సారాంశం.
ఎప్పటిలాగే ఎంఏ థర్డ్ క్లాస్ లో పాసయ్యాను. ఖమ్మంలో ఉద్యోగాన్వేషణ మొదలెట్టాను.

Wednesday, October 17, 2018

రావణ దహనం....చెడుపై విజయం : వనం జ్వాలా నరసింహారావు


రావణ దహనం....చెడుపై విజయం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (18-10-2018)
నవరాత్రి పర్వదినాలు ముగియనున్నాయి. దసరా భారతావనిలో ఒక ముఖ్యమన పండుగ. దసరా లేదా విజయదశమి చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగ. రాముడి చేతిలో రావణుడి ఓటమి దసరా నాడే జరిగిందంటారు. విష్ణుమూర్తి దశావతారాలలో ఏడవ అవతారమైన రామావతారంలో రాక్షసరాజు రావణుడిని యుద్ధంలో ఓడించి చెరలోనున్న తన భార్య సీతను విడిపించుకుంటాడు రాముడు. రామలీలాలో భాగంగా రావణ దహనం అంటే, రావణ, కుంభకర్ణ, మేఘనాథ దిష్టి బొమ్మలను దహనం చేస్తారు. ఇంతకీ ఈ రావణుడు ఎవరు? వాడిని ఎందుకు మంచివాడని అనరు? తెలుసుకోవడం ఆసక్తికరమైన విషయమే.

రావణాసురుడు దేవుడని, దసరానాడు రావణ దహనం తప్పనీ, ఇటీవల కొందరు పని కట్టుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. ఆ మాటకొస్తే, ఒక్క రావణుడే కాదు, మహిషాసురుడు, నరకాసురుడు, హిరణ్య కశిపుడు, శిశుపాలుడు.....ఇలా మన పురాణాలలో, ఇతిహాసాలలో రాక్షసులుగా ముద్రపడిన ప్రతి వారినీ వారు దేవతలంటున్నారు. రావణుడిని అగ్రవర్ణాల వారు అణగదొక్కారని కూడా వాదిస్తున్నారు. రావణుడు పుట్టింది బ్రాహ్మణ -క్షత్రియ జంటకు. అలాంటప్పుడు వెనుకబడిన వర్గానికి చెందిన వాడెలా అవుతాడు? సుమాలి అనే రాక్షస రాజు తన కూతురు కైకసిని విశ్రవసువును వివాహం చేసుకో మంటాడు. విశ్రవసుడికి కైకసి వివాహిత భార్య కాలేకపోయింది. కొంతకాలానికి ఆమెకు నిడుపాటి కోరలు, పది తలలు, ఎర్రని వెంట్రుకలు, ఇరవై చేతులతో భయంకరమైన ఆకారం కలవాడిని కంటుంది. వాడికి దశకంఠుడు అని పేరు పెట్టాడు తండ్రి విశ్రవసుడు. ఆ తరువాత వాడికి రావణుడనే పేరు మిగిలింది. రావణుడి తండ్రి బ్రాహ్మణుడైనప్పటికీ, తల్లి రాక్షస రాజకన్యక ఐనందున, బ్రాహ్మణుడికి క్షత్రియ స్త్రీయందు కలిగిన వాడు క్షత్రియుడే. బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, మనం అనుకునే వెనుకబడిన కులాలకు చెందిన వాడుకాదు!

రావణాసురుడు బుద్ధి తెల్సినప్పటి నుంచే ఘోరాలు-నేరాలు చేసిన వాడే!. సవతి సోదరుడు కుబేరుడిని వర బలంతో లంక నుంచి వెళ్ల గొట్టాడు. ముల్లోకాలను బాధ పెట్టడం వాడికొక దిన చర్య. అడ్డూ-అదుపూ లేకుండా క్రూరుడై, దేవతలను, ఋషులను, యక్షులను చంపసాగాడు. తప్పని చెప్పిన అన్న కుబేరుడి మీద యుద్ధానికి పోయి పుష్పక విమానాన్ని లాక్కుంటాడు. శౌర్యవంతులైన రాజులను ఇబ్బందులకు గురి చేస్తూ, యుద్ధంలో ఎదిరించిన వారిని చంపుకుంటూ, ఓడిన వారిని బెదిరిస్తూ రోజులు గడిపేవాడు. నందీశ్వరుడిని అవమానించి శాపానికి గురయ్యాడు. కామంతో వేదవతిని అవమానించాడు. అయోధ్య రాజు అనరణ్యుడిని అవమానించి ఆయన శాపానికీ గురవుతాడు. యముడి మీదకు, ఇంద్రుడి మీదకు దండెత్తుతాడు. బల గర్వంతో, రాజ స్త్రీలను, ముని కన్యలను, దానవ కుటుంబినులను, దేవతా స్త్రీలను, కంటకనబడిన స్త్రీలందరినీ బలాత్కారం చేస్తాడు. రంభను చెరిచి నలకూబరుడి శాపానికి గురవుతాడు. చివరకు సీతాదేవిని అపహరిస్తాడు.

హిమవత్పర్వత ప్రాంతంలో రావణుడికి వేదవతి కనిపించింది. కామంతో కళ్లు మూసుకున్న రావణుడు ఆమెను చేరబోయాడు. తల వెంట్రుకలు పట్టుకుని వేదవతిని లాగుతాడు. రావణుడు అవమానించిన ఆ దేహాన్ని ఇక తాను వుంచుకోనంటుంది. అగ్ని ప్రవేశం చేస్తానని, రావణుడి గర్వమణచడానికి మళ్లీ జన్మించుతానని అంటూ, చెప్పినట్లే చేస్తుంది. ఆ విధంగా రావణ వినాశానికి బీజాలు పడ్డాయి. ఆ వేదవతే, జనక మహారాజు కూతురై, భూమిలో పుట్టి, సీత పేరుతో శ్రీరాముడిని వివాహమాడింది. అయోధ్యకు వెళ్లాడు రావణుడు. ఆ సమయంలో అనరణ్యుడు అయోధ్యను పాలించేవాడు. ఆతడిని యుద్ధానికి పురిగొల్పాడు రావణుడు. యుద్ధంలో ఓడిపోయాడు అనరణ్యుడు. తన వంశంలోనే దశరథ మహారాజు కుమారుడైన రాముడు, యుద్ధంలో రావణుడిని చంపుతాడని శపించాడు. 

యముడిని చంపడానికి పోతాడు. యమ-రావణ యుద్ధం జరుగుతుంది. ఇరువురు సరిసమానంగా పోరు సల్పారు. యముడిని గెలిచినట్లు ప్రకటించుకున్న రావణుడు యమ పురిని విడిచి లంకా నగరానికి పోతూ, రాజ స్త్రీలను, ముని కన్యలను, దానవ కుటుంబినులను, దేవతా స్త్రీలను, కంటకనబడిన స్త్రీలందరినీ బలాత్కారం చేస్తాడు. చెరబడిన స్త్రీలందరూ విలపించినా రావణుడు పట్టించుకోడు. పర స్త్రీలను తన భార్యలుగా చేసుకోవాలను కోవడం కంటే పాప కార్యం లేదని, తమను కామంతో వశ పర్చుకో చూస్తున్నాడని, తామే పతివ్రతలమైతే, రావణుడు పర స్త్రీ కారణంగానే చంపబడతాడని శపించారు వారందరు. అలా మరో శాపం తగిలింది.


దేవతల మీదకు దండయాత్రకు పోతాడు. మార్గమధ్యంలో, దేవతా సౌందర్యవతి రంభను చూసి ఆమె చేయి పట్టుకుంటాడు. రావణుడు తనకు తండ్రి లాంటి వాడని, ఇలా చేయడం తగదని, వేడుకుంటుంది రంభ. రావణుడా మాటలు పట్టించుకోకుండా రంభను చెరిచి విడిచి పెట్తాడు. రావణుడు చేసిన చెడ్ద పనిని భర్త నలకూబరుడి (కుబేరుడి కొడుకు) తో చెప్తుంది రంభ. పర స్త్రీని చెరిచినట్లయితే రావణుడు మరణించుతాడని నలకూబరుడు శపించుతాడు. రావణుడు బలవంతంగా ఎత్తుకుని వచ్చిన పతివ్రతా స్త్రీలు ఆ శాపం తెలిసి కొని సంతోషించారు. రావణుడి వలన భయం వదిలారు. ఆ దినం మొదలుకుని, పర స్త్రీ సంగమం విషయంలో మనస్సు పోనిచ్చినవాడు కాదు రావణుడు.

రావణుడు కనిపించిన ప్రతి వారినీ, రాజులందరినీ బాధించుతూ, భుజ బల గర్వంతో, కళ్లు మూసుకొనిపోయి, ఒకనాడు మాహిష్మతీ నగరాన్ని పాలిస్తున్న కార్తవీర్యార్జునుడి మీదకు యుద్ధానికి పోతాడు. కార్తవీర్యార్జునుడు వాడిని బంధించి చెరసాలలో పడేశాడు. ఇది తెలుసుకున్న రావణుడి తాత పులస్త్యుడు అక్కడకు చేరుకుని, రావణుడిని చెరసాలనుంచి విడవమని కోరాడు. ఆయన కోరికను మన్నించాడు కార్తవీర్యార్జునుడు. రావణుడు కార్తవీర్యార్జునుడితో స్నేహం చేస్తూ, తరువాత, మళ్లా రాజులను ఓడించాలన్న కోరికతో, పొగరు పడుతూ, భూమి మీద తిరుగుతుండేవాడు.

రావణుడు లోకాలలో సంచరిస్తూ, ఒకనాడు కిష్కింధకు వచ్చి, వాలిని యుద్ధానికి పిలిచాడు.

ఆ సమయంలో వాలి సంధ్య వార్చడానికి నాలుగు సముద్రాలకు పోయాడు. అప్పుడు దక్షిణ సముద్రంలో సంధ్య వారుస్తున్నాడని తెలుసుకుని పుష్పక విమానం ఎక్కి అక్కడకు చేరుకుంటాడు రావణుడు. వాలిని వెనుక నుంచి వెళ్ళి బంధించాలనుకుంటాడు. వాడి ఉద్దేశం కనిపెట్టిన వాలి, రావణుడిని తన చంకలో ఇరికించి, ఆకాశ మార్గంలో పోయి, పడమటి సముద్రంలో, ఉత్తర సముద్రంలో, తూర్పు సముద్రంలో సంధ్య వారుస్తాడు. కిష్కింధకు తిరిగొచ్చి రావణుడిని విడిచి, ఏమీ తెలియని వాడివలె అతడి క్షేమ సమాచారం అడుగుతాడు. తాను వాలితో యుద్ధం చేయడానికి వచ్చానని, గర్వభంగం ఐందనీ, అగ్ని సాక్షిగా అతడితో స్నేహం చేయాలని వుందని అంటాడు. ఆ తరువాత వారిరువురు స్నేహితులౌతారు.

సన్న్యాసి వేషంలో సీతను రావణుడు బలాత్కారంగా ఎత్తుకుని పోతాడు. సీతతో లంక చేరుకుంటాడు. సీత మీద రాక్షస స్త్రీలను కాపలాగా వుంచుతాడు. సీత తనను కామించడానికి పన్నెండు నెలల గడువిస్తాడు. రావణుడి రూపం, తేజం, బలం, ధైర్యం అనుపమానవైనవే. సౌందర్యం, సంపద, ఆకర్షణ రాముడిలో ఎంత వున్నాయో, రావణుడి దగ్గర కూడా అంతే మోతాదులో వున్నాయనవచ్చు. ఐతే, ఇతరుల పట్ల కరుణ, రక్షించాలనే బుద్ధి రాముడిలో వున్నాయి కాని రావణుడిలో లేవు. వాడిది కఠినమైన మనస్సు. భూతదయ వాడికి లేనందునే జనులు దూషించారు. దేవదానవులు వణికారు.

రావణుడు, విధానాన్నసురించి ధర్మ శాస్త్రాలను చక్కగా అధ్యయనం చేశాడు. ప్రపంచం మెచ్చే రీతిలో తపస్సు చేశాడు. ఎంతో కష్టపడి తపస్సు చేసినా, అది మర్చిపోయి, తపో ధర్మం వల్ల కలిగే సత్ఫలితాలను పాడుచేసే పనులెన్నో చేశాడు. అతడి తపస్సు వ్యర్థమైపోయింది. తన తపస్సుతో దేవదానవులెవరూ జయించకుండా వరం పొంది, ఇంక తనకేం భయమని గర్వపడ్డాడు. వాస్తవానికి, ఆ వరాలేవే అతన్ని ఎల్లప్పుడూ రక్షించ లేవనే సంగతి అతడి ఆలోచనకే రాలేదు. 

తపఃఫలం వల్ల రావణుడు తనకు పాప ఫలం రాదనుకున్నాడు! అష్టైర్యాలను అనుభవించే వాడికి రోగాలు రావా? రావణుడి తపస్సు అతడికి దీర్ఘాయువు ఇవ్వాలి. కాని, వాడు చేసిన పర స్త్రీ అపహరణనే పాపపు పని వల్ల త్వరగా చావాలి. ఈ రెండూ ఏకకాలంలో జరగవు కాబట్టి, అతడి చావు రాముడొచ్చేవరకూ ఆగింది.
చివరకు నరవానరుల చేతిలో చచ్చాడు.

రావణుడు బలవంతంగా ఎత్తు కొచ్చిన సీతాదేవిని, ఇతర స్త్రీలను ఎవరి వారికి వారిని అప్పగించినట్లైతే అతడి దోషం పోయేది. తపఃఫలం సదా రక్షిస్తుందనేమాట భ్రాంతే! తపఃఫలం పుణ్యమనుభవించిన కొద్దీ క్షీణిస్తుంది. శాశ్వతంగా మిగిలిపోదు. రామ రావణ యుద్ధం మొదలవుతుంది. శ్రీరాముడు మూల బలాల్ని సంహరిస్తాడు. పౌరుషోక్తులు పలుకుతూ రావణుడు యుద్ధానికి వెళ్తాడు. ఇరువురూ దివ్యాస్త్రాలతో పోరాడుతారు. రావణుడు పరాజితుడై లంకకు పరుగెత్తుతాడు. రామరావణుల కడపటి యుద్ధం ప్రారంభమవుతుంది. బ్రహ్మాస్త్రంతో రావణుడిని వధించాడు రాముడు. రావణుడి మరణానికి లోకాలన్నీ సంతోషించాయి.

శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. వీటితో పాటు కథా సందర్భానుసారంగా, అంతరాంతరాలలో ఎన్నో నీతులు చెప్పబడ్డాయి. రావణుడి పాత్ర కూడా అందులో భాగమే! ఆ పాత్రను చెడుపాత్రగా చిత్రించడానికి కారణం వాడు చెడ్డవాడు కావడమే. ఏదేమైనా, రావణ వధతో ఒక యుగంలోని చెడు అంతరించి పోయింది. దానికి గుర్తుగా ఏటేటా దసరానాడు రామదహనం జరుపుకోవడం ఆచారంగా మిగిలిపోయింది.