Sunday, April 17, 2022

పరశురాముడు పోయిన సంగతి దశరథుడికి చెప్పి ప్రయాణం కొనసాగించమన్న శ్రీరాముడు ..... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-104 : వనం జ్వాలా నరసింహారావు

 పరశురాముడు పోయిన సంగతి దశరథుడికి చెప్పి

ప్రయాణం కొనసాగించమన్న శ్రీరాముడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-104

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (18-04-2022)

         పరశురాముడు వెళ్లిపోగానే, ధనుస్సును-బాణాన్ని అదృశ్యుడై వచ్చి వున్న వరుణుడిచేతికిచ్చి, వశిష్ఠాదులకు మొక్కి, భయంతో అవయవాలు స్వాధీనం తప్పిన తండ్రిని సమీపించాడు శ్రీరామచంద్రుడు. పరశురాముడు పోయాడని, సుఖంగా అందరం అయోధ్యకు పోవచ్చని, సేనంతా బయల్దేరడానికి సిద్ధమై, ఆయన ఆజ్ఞకొరకు ఎదురుచూస్తున్నదని అంటాడు తండ్రితో. శ్రీరాముడు చెప్పిన వార్తతో ఉప్పొంగి పోయిన దశరథుడు, కొడుకును దగ్గరకు తీసుకొని, రెండు చేతులతో రొమ్ముకు హత్తుకొని, శిరస్సు వాసన చూసి, సైన్యాన్ని బయలుదేరమని ఆజ్ఞాపించాడు.

అయోధ్య ప్రవేశించిన దశరథుడు

         రాజు కొడుకులతో, కోడళ్లతో వస్తున్నాడని విన్న అయోధ్యా నగర వాసులు, రంగు రంగుల పూల తోరణాలు కట్టి, మంగళ వాద్య ధ్వనులు మారుమోగించుకుంటూ, దారంతా నీళ్లతో తడిపి, ఆ స్థలంలో పుష్పాలు వెదజల్లి, చూడగానే మనస్సుకు సంతోషం కలిగే రీతిలో తోరణాలు కట్టి, రంగు రంగుల రంగవల్లులు తీర్చిదిద్ది, పౌరులందరు బంగారు ఆభరణాలు ధరించి, మంగళ వాయిద్యాలతో తమకు ఎదుర్కోలుపల్కి-వెంట వస్తుంటే, కొడుకులు-కోడళ్ళతో దశరథుడు తన మేడలో సంతోషంతో ప్రవేశించాడు. కౌసల్య-సుమిత్ర-కైక, మొదలైన రాజ భార్యలు, మహానుభావ గు సీతను-యశోవతైన ఊర్మిళను-మాండవీ, శృతకీర్తులను, మంగళ వాద్య ధ్వనులు మోగుతుంటే, అంతఃపురంలో ప్రవేశ పెట్టారు. తెల్లటి వస్త్రాలతో అలంకరించారు. మంచిగందం పూసుకొని, సుందరమైన దేహాలు రమ్యంగా అవుతుంటే, శుభ వాక్యాలు పలుకుతూ, తమ ఇలవేల్పు మందిరాలకు అర్చనలు చేసి, పెద్దలకు మొక్కారు కోడళ్లు. ధనధాన్యాలతో-ఆవులతో బ్రాహ్మణులను తృప్తి పరిచారు. ఆతర్వాత భర్తలతో సౌధాంతరాలలో కొత్త-కొత్త సంతోషాలు కలిగే విధంగా సుఖపడ్డారు.

         వీరులు-భార్యలుగలవారు-సుకుమారులు-సౌందర్యంతో మన్మథుడునే అపహసించగలవారు-హితమైన నడవడిగలవారు-మనోహరులైన దశరథుడి కుమారులు, తండ్రికి ఇష్టమైన రీతిలో తిరుగుతూ అందరినీ ఒప్పించారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత, దశరథుడు , భరతుడితో ఆయన మేనమామ అతడిని తీసుకొని పోయేందికొచ్చి పెళ్లినాటినుండి వేచివున్నాడని అంటాడు. మేనమామ ఇంటికి వెళ్లమని చెప్పగా, తండ్రి ఆజ్ఞ ప్రకారం శత్రుఘ్నుడితో కలిసి, తండ్రికి-తల్లులకు నమస్కారం చేసి అనుమతి తీసుకుని పోయాడు. భరతుడు వెళ్లిన తర్వాత సీతా నాధుడైన శ్రీరామచంద్రమూర్తి, తమ్ముడు లక్ష్మణుడు, మంచి గుణాలలో ఆసక్తి కలిగి, జనకుడే దేవుడని తలుస్తూ, ఆయనకు సంతోషాన్ని భక్తితో కలిగించారు. తండ్రి ఆజ్ఞ ప్రకారం శ్రీరామచంద్రమూర్తి ప్రజలకు మేలైన, సంతోషకరమైన కార్యాలను చేస్తుండేవాడు. తల్లికి, తండ్రికి, గురువులకు ఏ వేళ-ఎలా నడచుకుంటే వారికి సంతోషంగా వుంటుందో అలానే నడుచుకుంటూ, సంతోషం కలిగిస్తుండేవాడు. సమస్త గుణాలలో రమించేవాడై, మంచి నడవడితో అభిరాముడై, మంచి బలంతో అధికుడై, కీర్తి స్థానాన్ని పొందిన రామచంద్రమూర్తిని చూసి, బ్రాహ్మణులు-వైశ్యులు, అన్నిజాతులవారు, చాలా సంతోషించారు.

స్వపురంలో సుఖాలనుభవించిన శ్రీ సీతారాములు

         శ్రీరామచంద్రుడు సీతతో కలిసి, అనేక ఋతువులు, మనోహరమైన విహార క్రీడల్లో ప్రియంగా గడిపారు. సర్వదా మనస్సును ఆ స్త్రీ రత్నం మీదే కొరతలేని ప్రేమతో నిలిపాడు. ఆమె కూడా సర్వదా, కూరిమి అతిశయంతో, మనస్సును హృదయేశ్వరుడైన రామచంద్రుడిపైనే నిలిపింది. దేవతల నమస్కారాలందుకునే శ్రీరామచంద్రమూర్తికి, స్త్రీ రత్నమైన సీతను, తండ్రి మెచ్చి భార్యగా ఇచ్చాడు కాబట్టి, ఆయన మనస్సులో ఆమె మిక్కిలి ప్రియురాలైంది. రాముడిలో ఏ మంచి గుణాలు వున్నాయో, అలాంటి గుణాలే సీతలో కుప్పలుగా వున్నాయి. ఇంకా చెప్పాలంటే, రామచంద్రుడికున్న సద్గుణాలకంటే, సీతలో ఎక్కువగానే వున్నాయి. ఆమెలో సౌందర్య, సౌశీల్య, సౌజన్య, సౌభాగ్యాది గుణాలున్నాయి. అందుకే ప్రీతికి మిక్కిలి పాత్రురాలైంది. రామచంద్రమూర్తికి సీతమీద మనస్సులో ఎంత ప్రేమ వుందో, అంతకు ఇబ్బడి ప్రేమ రామచంద్రుడిమీద సీత హృదయంలో దాగి వుంది. సీత అభిప్రాయం ఎంత కొంచమైనా, దానిని రామచంద్రుడు, ఆమె మనస్సులో కలిగీ-కలగక ముందే పసిగట్టి స్పష్టంగా తెలుసుకునేవాడు.

         ప్రత్యక్ష లక్ష్మి అయి, సౌందర్యంలో దేవతా స్త్రీవలె అందమైన సీతాదేవి, తన భర్త హృదయాన్ని, తన హృదయాన్ని భర్త తెలుసుకున్నదానికంటే ఎక్కువగా తెలుసుకునేది. సీత హృదయంలో అభిప్రాయం పుట్టిన తర్వాత, తెలుసుకునేవాడు శ్రీరాముడు. రామచంద్రుడు ఫలానా కోరిక కోరబోతున్నాడని ముందే పసిగట్టేది సీత.

దశరథ రాజకుమారుడు రామచంద్రమూర్తి, రాజితకాముడై, మహాయోగి-మహాజ్ఞాని-జీవన్ముక్తుడని ప్రసిద్ధికెక్కడంవల్ల, రాజులందరిలో ఉత్తముడైన జనకరాజు కూతురిని-తనకంటే ఎక్కువగా రమింప చేయగలది-తనకంటె అత్యధిక ప్రీతికలదైన సీతతో, ఆలింగనంలో ఏక భావం పొందినవాడై-స్వయం గ్రహ శ్లేషానికి విషయభూతుడై కలిసి, ప్రత్యాలింగన సమర్థుడై, విష్ణువు, చంద్ర సోదరైన లక్ష్మితో కలిసి అనురాగంతో ప్రకాశించే విధంగా రంజిలుతుండేవాడు.

         (అయోధ్యా నగరంలో శ్రీ సీతా రాములు సర్వ సుఖాలు అనుభవించారని చెప్పడంలో వారిద్దరి అన్యోన్యత, అనురాగం, అవతార నేపథ్యం లాంటి అనేక విషయాలు భావగర్భితంగా దర్శనమిస్తాయి. సీతను గూడి శ్రీరామచంద్రుడు ప్రియంగా గడిపాడు అనిచెప్పడంలో, భోగానుభవంలో ప్రాధాన్యం శ్రీరామచంద్రమూర్తికేనని చెప్పబడింది. సీత భోగ్య-రామచంద్రుడు భోగి. భోగ్యకంటే భోగి ప్రధానం. "సీతనుగూడి ప్రియంగా", అనడమంటే, సీత దగ్గరలేని సమయం దుఃఖకరమే కాని ప్రియంకాదని-కాజాలదని భావం. అయితే, సీతారాముల విహారంవలన కలిగే సంతోషం, సీతకే చెందాలని రామచంద్రమూర్తి అభిప్రాయం. ఇరువురి విషయంలోనూ, "కూరిమి" శబ్దాన్ని ప్రయోగించడమంటే, వారిరువురు పరస్పరం సమానమైన ప్రేమ కలవారై వున్నారని భావం. కూరిమి చెప్పబడిందే కాని, కామం గురించి చెప్పలేదు. అంటే, వారి ఐకమత్యానికి-పరస్పరానురాగానికి కారణం కూరిమిగాని, కామంకాదే. వారలా అనేక "ఋతువులు" గడిపారని వుంది గాని, అనేక సంవత్సరాలని లేదు. దానర్థం-వారు ఏ ఏ ఋతువుల్లో ఎలా సుఖపడాల్నో అలానే సుఖపడ్డారని.

         రామచంద్రమూర్తి కోరిక కోరబోతున్నాడని ముందుగానే సీత ఎలా పసిగట్టగలదన్న సందేహం రావచ్చు. ఆమెకు అంత శక్తెలా వచ్చిందంటే, ఆమె మైథిలికన్య-మహా జ్ఞాని, మహాయోగైన జనక రాజు కూతురు కనుక. దేశ స్వభావం-వంశ స్వభావం బట్టీ, దేవతతో సమానమైనందున ప్రాగల్భ్యాన్ని బట్టీ, సాక్షాత్తు లక్ష్మి కాబట్టి సహజ బుద్ధి విశేషాన్ని బట్టీ అమెకు ఆ శక్తి వచ్చిందనాలి. సీతారాముల భోగ విషయంలో ఇక్కడ చెప్పబడిన లక్ష్మి నారాయణ ఉపమానం పద్మ పురాణంలో కూడా వుంది. ఇక్కడ చెప్పింది దివ్యదంపతి భోగమే. ప్రాకృత కామ ప్రేరిత సంభోగం గురించి ఎక్కడా చెప్పలేదు. అప్రాకృత దివ్య మూర్తులలో ప్రాకృత కామం వుండే అవకాశం లేనేలేదు. వివాహం అయ్యేటప్పటికి తనకు ఆరు సంవత్సరాల వయస్సని సీతే స్వయంగా-పరోక్షంగా రావణుడికి వనవాస కాలంలో చెప్పింది. ఆ వయస్సులో ఆంతర సంభోగానికి అవకాశం లేదు).

{సమాప్తం}

 

 

 

Saturday, April 16, 2022

ఆరవ నాటి యుద్ధంలో పాండవుల మకరవ్యూహం, కౌరవుల క్రౌంచవ్యూహం ..... ఆస్వాదన-67 : వనం జ్వాలా నరసింహారావు

 ఆరవ నాటి యుద్ధంలో పాండవుల మకరవ్యూహం, కౌరవుల క్రౌంచవ్యూహం

ఆస్వాదన-67

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక ఆదివారం సంచిక (17-04-2022)

కురుక్షేత్ర సంగ్రామంలో ఐదవనాటి రాత్రి జరిగిపోయింది. తెల్లవారేసరికల్లా అర్జునుడి ఆలోచనకు అనుగుణంగా పాండవ సేనానాయకుడు ధృష్టద్యుమ్నుడు మకరవ్యూహం తీర్చిదిద్దాడు. ద్రుపదరాజు తలగా; నకులసహదేవులు కన్నులుగా; భీముడు నోరు చివరగా; అభిమన్యుడు, ద్రౌపది కొడుకులు, ఘటోత్కచుడు కపోలాలుగా; సాత్యకితోపాటు ధర్మరాజు కంఠం దగ్గర నిలుచున్నారు. ధృష్టద్యుమ్నుడితో పాటు విరాటరాజు వెన్నుదగ్గర; కేకయరాజులు ఎడమపక్కగా; ధృష్టకేతుడు, కరూశరాజు కుడిపక్కగా; కుంతిభోజుడు, శతానీకుడు మొల దగ్గర; శిఖండి, ఇరావంతుడు తోకదగ్గర నిలుచున్నారు.

ఇక భీష్ముడు పన్నిన క్రౌంచవ్యూహంలో అతడు, ద్రోణుడు ముక్కు దగ్గర; కృపుడు, అశ్వత్థామ కన్నులుగా; శిరస్సు దగ్గర కృతవర్మ, కాంభోజుడు, బాహ్లికుడు; శూరసేన రాజుతో పాటు దుర్యోధనుడు కుత్తుక దగ్గర; వక్షం దగ్గర సౌవీర రాజుతో సహా భగదత్తుడు; వీపున విందుడు, అనువిందుడు; ఎడమ పక్కన సుశర్మ; కుడి పక్క యవనరాజు నిలిచారు. వెనుకగా శ్రుతాయువుతో కలిసి భూరిశ్రవుడు నిలిచాడు.

ఈ విధంగా కౌరవ సేన, పాండవ సేన యుద్ధానికి సమాయుత్తమై వెళ్లారు. యుద్ధం మొదలవగానే భీముడు తన రథాన్ని ద్రోణుడు వున్న దిక్కుగా నడిపించాడు. అతడి ధాటికి ఎదురు నిలువలేక కౌరవ వీరులు వెనక్కు పారిపోసాగారు. భీముడు ద్రోణాచార్యుడి సారథిని చంపాడు. సారథి లేనందున స్వయానా తన రథాన్ని నడుపుతూ యుద్ధం చేస్తున్న ద్రోణుడికి భీష్ముడు సాయంగా వచ్చాడు. భీముడు విజృంభించినందువల్ల కౌరవసేనకు విపరీతంగా నష్టం జరిగింది. ఆ సమయంలో తనకు చిక్కిన దుర్యోధనుడి పన్నెండు మంది తమ్ములను (దుశ్శాసనుడితో సహా) ఏక కాలంలో ఎదుర్కున్నాడు భీముడు. వారంతా చతురంగ బలాలతో భీముడిని చుట్టుముట్టారు. భీముడు ఆనందంతో, తనకేదో మంచి అవకాశం దొరికినట్లుగా భావించి, రథం మీద నుండి కిందకు దూకాడు. భీముడు రణరంగంలో కౌరవ కుమారులమీద వీరవిహారం చేశాడు. భీముడి ధాటికి ఎదురులేకపోయింది.

అటువైపుగా వచ్చిన ధృష్టద్యుమ్నుడు, భీముడు రథం మీద లేకపోవడం చూసి, సారథిని అడిగి అతడెక్కడున్నాడో కనుక్కొని, భీముడికి తోడుగా వచ్చాడు. అప్పుడు కౌరవ రాకుమారులంతా కలిసి ధృష్టద్యుమ్నుడిని చుట్టుముట్టారు. ధృష్టద్యుమ్నుడు తనకు ద్రోణుడు ఉపదేశించిన ‘ప్రమోహనబాణం’ ప్రయోగించి రాజకుమారులను మూర్ఛపోయేట్లు చేశాడు. అదే సమయంలో ద్రోణుడు ద్రుపదుడిమీద విజృంభించాడు. ద్రుపదుడు అక్కడి నుండి తప్పుకున్నాడు. ద్రోణుడప్పుడు ప్రజ్ఞాబాణం ప్రయోగించి మోహనబాణం శక్తిని పోగొట్టాడు. కౌరవ రాజుకుమారులు మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించారు. దొమ్మియుద్ధంలో భీముడు కింద వుండరాదని అంటూ ధృష్టద్యుమ్నుడు అతడిని కేకయరాజు రథం మీద ఎక్కించాడు.

ఈ లోపున ద్రోణుడు విజృంభించాడు. ధృష్టద్యుమ్నుడి ధనుస్సు ఖండించాడు. సారథిని చంపాడు. మరో సారథి తెచ్చిన రథాన్ని ఎక్కాడు ధృష్టద్యుమ్నుడు. ద్రోణ, ధృష్టద్యుమ్నుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. మరో పక్క భీముడికి, దుర్యోధనుడికి మధ్య యుద్ధం జరిగింది. దుర్యోధనుడికి తోడుగా ఆయన తమ్ములు వచ్చారు. అప్పుడు అభిమన్యుడు, ద్రౌపది కుమారులు, ధృష్టకేతుడు, కేకయులు, భీముడికి అండగా వచ్చారు. అంతా కలిసి కౌరవ రాజకుమారులమీద విజృంభించారు. వారి ధాటికి కౌరవ రాజకుమారులు తట్టుకోలేకపోయారు. పారిపోయారు. దుర్యోధనుడికి కోపం వచ్చి భీముడితో భయంకరమైన యుద్ధానికి దిగాడు. భీముడికి సాయంగా వచ్చిన ద్రౌపది కొడుకులు దుర్యోధనుడి మీద బాణాలు ప్రయోగించి, నొప్పించి, తరిమివేశారు.

ఇంతలో భీష్ముడు శత్రుసేనలో ప్రవేశించి పాండవ సేనను చెదరగొట్టగా అర్జునుడు అతడి ఎదుర్కున్నాడు. ఇదిలా వుండగా భీముడు, ఎలాగైనా అదేరోజున దుర్యోధనుడిని చంపాలన్న కోరికతో, దుర్యోధనుడిని ఎదుర్కుని, అతడి రథాశ్వాలను, సారథిని చంపి, దుర్యోధనుడి విల్లు విరిచాడు. మరిన్ని బాణాలను వేయడంతో దుర్యోధనుడు మార్చపోయి, స్పృహతప్పి పడిపోయాడు. మూర్ఛిల్లిన దుర్యోధనుడిని కృపాచార్యుడు తన రథం మీద ఎక్కించుకుని వెళ్లాడు. ఆ సమయంలో భీముడి మీదికి వచ్చిన జయద్రథుడిని అభిమాన్యాదులు ఎదుర్కున్నారు భీకరంగా. కౌరవ కుమారులు తిరిగొచ్చి ద్రౌపదీ తనయులతో పోరాడారు.

ఆ సమయంలో నకులుడి కొడుకైన శతానీకుడు పరాక్రమం ప్రదర్శించి విజృంభించాడు. కేకయ దేశాదిపతులు, ద్రుపదుడు అతడికి తోడుగా నిలబడ్డారు. సూర్యాస్తమయం కాబోతున్న తరుణంలో భీష్ముడు ప్రళయకాల యముడిలాగా విజృంభించి పాండవుల వ్యూహాన్ని చీల్చి, తన సేనలను ఉపసంహరించి విడిదులకు పొమ్మని ఆదేశించాడు. అతడు తన శిబిరానికి పోయాడు. ఆ రోజుకు యుద్ధ విరమణ జరిగింది. పాండవులు అలసి పోయి చెమటకారే దేహాలతో తమ విడిదులకు వెళ్లిపోయారు.

ఆనాటి రాత్రి భీష్ముడితో దుర్యోధనుడు, కౌరవులు ఎంత పూనికగా వ్యూహం పన్నుతూ ముందుకు సాగుతున్నా పాండవ సేన దానిని నాశనం చేస్తున్నదని, భీష్ముడు చూస్తుండగానే భీముడి చేతుల్లో తాను భంగపడ్డానని, భీష్ముడి అండతో పాండవులను గెలుస్తానన్న ఆశ తనకు వుండేదని, దాన్ని ఆయన తప్పగొట్టుతున్నాడని, భీష్ముడు దేవతలను కూడా జయించగల పరాక్రమవంతుడని, అయినా యుద్ధరంగంలో పాండవులు అంత పరాక్రమవంతులు కావడానికి కారణం ఏమిటని అన్నాడు. దుర్యోధనుడి మాటలు విన్న భీష్ముడు నవ్వి, తనను అలా అనడం భావ్యం కాదని, తాను యుద్ధంలో తన శరీరం దాచుకోలేదని, పాండవులు ఎప్పటికీ జయింపరానివారే అని పలుమార్లు చెప్పానని, అయినప్పటికీ తాను దుర్యోధనుడే జయించాలన్న ఉద్దేశంతో ఒళ్లు దాచుకోకుండా యుద్ధం చేస్తానని, దుఃఖపడవద్దని చెప్పాడు.              

కవిత్రయ విరచిత

శ్రీమదాంధ్ర మహాభారతం, భీష్మపర్వం, ద్వితీయాశ్వాసం

(తిరుమల, తిరుపతి దేవస్థానాల ప్రచురణ)

                          

Monday, April 11, 2022

ఆ ‘సఖ్యత రాష్ట్రాలలో ఎందుకు లేదు? : వనం జ్వాలా నరసింహారావు

 ఆ ‘సఖ్యత రాష్ట్రాలలో ఎందుకు లేదు?

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (12-04-2022)

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ (తన) ప్రభుత్వం తనపట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నదని ప్రధాన మంత్రిని, కేంద్ర హోం మంత్రిని కలిసి పిర్యాదు చేసినట్లు వార్తలొచ్చాయి. తెలంగాణాలో తనకు సంబంధించిన ప్రోటోకాల్ వివాదం విషయంలో కూడా ప్రధానికి, హోం మంత్రికి పిర్యాదు చేశారు. ప్రధానిని, హోం మంత్రిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మహిళా గవర్నర్ ను అయిన తనను అవమానిస్తున్నారని, తనపై (తన) ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, గవర్నర్ కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్సీగా సిఫారసు  చేయడాన్ని, తాను పెండింగులో పెట్టడాన్ని ప్రస్తావిస్తూ, ఆయనను నామినేట్ చేయడం విషయంలో తాను సంతృప్తి చెందలేదని తన ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. అంతటితో ఆగకుండా తాను తలచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పడిపోయేదని ఆమె అన్నట్లు కూడా వార్తలొచ్చాయి. అన్ని విషయాలు ప్రజలే నిర్ణయిస్తారని కూడా అన్నారు.   

ఇలా కొందరు గవర్నర్లు మాట్లాడడం మనదేశంలో కొత్తేమీ కాదు. భారత సహకార సమాఖ్య వ్యవస్థలో ఒక ముఖ్య భూమికగా భావించబడుతున్న గవర్నర్ స్థానం అది ఏర్పాటైన నాటినుండీ ఏదో ఒకరకమైన వివాదాస్పద వ్యవస్థగా మిగిలిపోయింది. ప్రపంచంలోనే ఎన్నికైన మొట్టమొదటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని శాసనసభలో బలం వున్నప్పటికీ కూలగొట్టిన ఘన చరిత్ర మన గవర్నర్లది. అప్పట్లో (1959 సంవత్సరంలో) అది చోటు చేసుకున్నది కేరళ రాష్ట్రం కాగా పదవి కోల్పోయిన ముఖ్యమంత్రి ఇఎంఎస్ నంబూద్రిపాద్ అయితే అలనాటి గవర్నర్ బూర్గుల రామకృష్ణారావు.   

మన దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడ్డ రాష్ట్రాధినేత. సమస్త కార్యనిర్వాహక అధికారాలు ఆయన ఆధీనంలోనే వుంటాయి. రాష్ట్ర శాసనసభ మెజారిటీ సభ్యుల నాయకుడు ఆయన. ఇక గవర్నర్ విషయానికొస్తే, రాజ్యాంగం ప్రకారం, ఆయన లేదా ఆమె, రాష్ట్రానికి నామ మాత్రపు అధిపతి మాత్రమే. నియమించేది ప్రధాని సిఫారసు మేరకు రాష్ట్రపతి. కేంద్రంలో రాష్ట్రపతికి ఎలాంటి అధికారాలు, విధులు వుంటాయో రాష్ట్ర స్థాయిలో గవర్నర్ కు కూడా అలాంటి అధికారాలు, విదులే వుంటాయి. గవర్నర్ రాజ్యాంగ పరంగా తనకు సంక్రమించిన అధికారాలను, విధులను సహకార సమాఖ్య స్ఫూర్తితో, భారతదేశాన్ని ఐక్యంగా వుంచడానికి మాత్రమే ఉపయోగిస్తారని రాజ్యంగా నిర్మాతలు భావించారు కాని, అందరూ కాకపోయినా కొందరు గవర్నర్లు, అధికారంలో వున్న కేంద్ర ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేయడం వాస్తవం. రాష్ట్రంలో వున్నది గవర్నర్ నియమించిన తన ప్రభుత్వం. తనకు ఏమి కావాల్సి వచ్చినా ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రిని నేరుగా అడగవచ్చు.

ఈ నేపధ్యంలో ఒక్కసారి రాష్ట్రంలో గవర్నర్ అధికారాలకు, కేంద్రంలో రాష్ట్రపతి అధికారాలకు పోల్చి చూస్తే ఆసక్తికరమైన విషయాలు అవగతమౌతాయి. భారత రాజ్యాంగ నిబంధనల, ప్రకరణల ప్రకారం అపరిమితమైన అధికారాలు వున్నది రాష్ట్రపతికా? లేక ప్రధాన మంత్రికా? అన్న ఒక అధ్యాయనపరమైన చర్చ జరిగితే, వచ్చే సమాధానం, నిర్ద్వందంగా రాష్ట్రపతికే విశేషాధికారాలు వున్నాయనేది. గవర్నర్లకు అలా అధికారాలు లేవు. భారత రాష్ట్రపతిని ఎన్నికైన లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, రాష్ట్రాల శాసనసభ సభ్యులు, అంతా కలిసి ఎన్నుకుంటారు కాని ప్రధానమంత్రి కేవలం లోక్ సభ సభ్యుల్లో మెజారిటీ పార్టీకి మాత్రమే నాయకుడు. పోనీ ఎక్కువలో ఎక్కువ, పార్లమెంటరీ పార్టీ నాయకుడు. దీనర్థం, ప్రాతినిధ్యపరంగా రాష్ట్రపతే ప్రధానికంటే ఎక్కువ. గవర్నర్ విషయంలో అలాకాదు. గవర్నర్ కేవలం నామినేటెడ్ అయిన వ్యక్తే. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వ్యక్తి.  

భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలో కూడా, స్పష్టంగా కానీ, పరిపూర్ణంగా కానీ, అస్పష్టంగా కానీ, ఎక్కడా రాష్ట్రపతి కంటే ప్రధానమంత్రికి ఎక్కువ అధికారాలున్నాయని చెప్పడం జరగలేదు. కాకపోతే చాలామంది రాజ్యాంగ నిపుణులు బ్రిటీష్ నమూనాను, అక్కడి అనుభవాలను, సంప్రదాయాలను మన రాజ్యాంగానికి అన్వయించి ఉదాహరణలు ఇస్తుంటారు. వాస్తవానికి మనది చాలావరకు బ్రిటీష్ మోడల్ అయినప్పటికీ దాన్ని మొత్తానికి మొత్తం అనుసరించడం లేదు. కొంతమేరకు మనది పార్లమెంటరీ వ్యవస్థ అయితే, కొంత మేరకు ప్రెసిడెన్షియల్ వ్యవస్థ అనాలి. అయినప్పటికీ ఇంతవరకూ ఏ రాష్ట్రపతి తన అధికారాలను ఉపయోగించుకున్న దాఖలాలు కాని,  దుర్వినియోగపరచిన సందర్భాలు కానీ, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు కాని, తనను అవమానించారని చెప్పడం కాని, తాను తలచుకుంటే కేంద్ర ప్రభుత్వం పడిపోయేది అని అనడం కాని జరగలేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రపతిగా ఎన్నికైన వారు ప్రధానికి, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి  ఆమోదయోగ్యమైన వ్యక్తి కావడమే. గవర్నర్ల విషయంలో అలా కాదు. ముఖ్యమంత్రికి ఆమోదయోగ్యమైన వ్యక్తి అయినా, కాకపోయినా ప్రధాని సూచన మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. అలా నియమించబడిన వ్యక్తి చాలా సందర్భాలలో కేంద్రంలో అధికారంలో వున్న పార్టీకి చెందిన వ్యక్తి అయ్యుంటారు.      

భారత రాజ్యాంగం ప్రకారం నిజమైన కార్యాచరణ వ్యవస్థ రాష్ట్రపతిదే కాని ప్రధానిది కాదు. రాష్ట్రపతికి సహాయపడేందుకు, సలహా ఇచ్చేందుకు మంత్రిమండలి ఏర్పాటుకు సంబంధించి ఆర్టికల్ 74 వివరిస్తుంది. రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సలహాలను, సూచనలను స్వీకరిస్తారని ఆ ఆర్టికల్ లో పేర్కొనడం జరిగింది. రాష్ట్రాలలో కూడా గవర్నర్ పాత్ర ఇలాంటిదే. ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి సూచనలను, సలహాలను పాటించి తీరాల్సిందే.  

రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు సర్వాధినేత రాష్ట్రపతి. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకు రాష్ట్రపతే అధిపతి. త్రివిధ దళాలకు ఆయనే కమాండర్ ఇన్ చీఫ్. రాష్ట్రపతి నేరుగా కానీ, లేదా, తన అధీనంలో పనిచేస్తున్న మరే అధికారి ద్వారా కానీ, తన అధికారాలను అమలు చేయవచ్చునని రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 చెప్తున్నది. వివాదాస్పద, చర్చనీయాంశమైన ఆర్డినెన్సులను జారీ చేసే శాసనాధికారం కూడా రాష్ట్రపతిదే. ఆ విధంగా రాష్ట్రపతికి అపారమైన అధికారాలున్నాయనాలి. కాకపొతే ఇంతవరకు ఎన్నికైన రాష్ట్రపతులందరు ప్రతివిషయంలో ప్రధాన మంత్రులకు ఆమోదయోగ్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి విషయంలో లాగా విభేదించిన సందర్భాలు కేంద్రంలో దాదాపు లేవనే చెప్పాలి.

   ఎన్నో ముఖ్యాతి ముఖ్యమైన నియామకాలను రాష్ట్రపతే చేస్తాడు. వారిలో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ న్యాయమూర్తులు, ఎన్నికల అధికారులు తదితరులుంటారు. షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనకు సంబంధించి కమీషన్లను కూడా ఆయనే నియమిస్తారు. అన్నిటికన్నా ప్రాధాన్యమైంది, ఆర్టికల్ 352 నుండి 360 వరకు పేర్కొన్న రాష్ట్రపతికున్న ఎమర్జెన్సీ విశేషాధికారాలు. ఆ సమయంలో రాష్ట్రపతి, పౌరుల ప్రాధమిక హక్కులను సైతం రద్దు చేయవచ్చు. వీటిని కూడా ఏ రాష్ట్రపతి కూడా ఎన్నడూ దుర్వినియోగం చేయలేదు. మంత్రివర్గం సలహా మేరకు మాత్రమే నడుచుకుంటారు.  

రాజ్యాంగం ఆర్టికల్ 75 ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రధానిని రాష్ట్రపతి నియమించడానికి ఫలానా విధమైన పధ్ధతి అని రాజ్యాంగంలో ఎక్కడా ప్రత్యేకంగా నిబంధనలు పొందుపరచలేదు. సాంప్రదాయాలుండవచ్చు. అది పూర్తిగా రాష్ట్రపతి విచక్షణాధికారం. దీనికి అనుగుణంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్ లో అనేక ఉదాహరణలు వున్నాయి. విక్టోరియా మహారాణి 1894 లో తన విచక్షణాధికారాలు ఉపయోగించి, పదవీ విరమణ చేసిన గ్లాడ్ స్టోన్ సలహాను పక్కకు పెట్టి, దానికి విరుద్ధంగా, లార్డ్ రోస్బెరీని ప్రధానిగా నియమించింది. తిరిగి 1957 లో ఎలిజబెత్ మహారాణి తన విచక్షణాధికారాలను సంపూర్ణంగా వాడుకుని, తన ఇష్ట ప్రకారం, ప్రధాని కావాల్సిన బట్లర్ కు బదులుగా హెరాల్డ్ మాక్మిలన్ ను ఆ పదవిలో నియమించింది. మెజారిటీ స్థానాలను గెల్చుకున్న కన్సర్వేటివ్ పార్టీ నాయకుడిని ఎన్నుకునే లోపలే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.

సర్వేపల్లి రాధాకృష్ణన్ భారత రాష్ట్రపతిగా వున్నరోజుల్లో ఆ పదవికున్న అసలు-సిసలైన అధికారం మొట్టమొదటిసారిగా లభించింది. జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం, అధికార కాంగ్రెస్ పార్టీ దాని అభిప్రాయాన్ని వెల్లడించక ముందే, రాష్ట్రపతి జీఎల్ నందాను ప్రధాన మంత్రిగా నియమించారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం కూడా అదే విధానాన్ని పాటించారు సర్వేపల్లి రాధాకృష్ణన్. మరో మారు కూడా గుల్జారీలాల్ నందాను ప్రధానిగా నియమించారాయన. ఆయన్ను నియమించేటప్పటికి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఎన్నుకోలేదు. కాకపోతే రెండు సార్లు కూడా గుల్జారీలాల్ నందా కేవలం ఆపద్ధర్మ-తాత్కాలిక ప్రదానిగానే పదవిలో కొనసాగారు.

ఇందిరాగాంధీ హత్యానంతరం అప్పటి రాష్ట్రపతి జైల్ సింగ్, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజీవ్ గాంధీని ఎన్నుకోక ముందే ఆయన్ను ప్రధానిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. 1989 సాధారణ ఎన్నికల అనంతరం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విముఖత వ్యక్తపరచడంతో వీపీ సింగ్ ను ప్రధానిగా నియమించడానికి, ఆ తరువాత ఆయన రాజీనామా దరిమిలా, మొదలు రాజీవ్ గాంధీని, తరువాత చంద్రశేఖర్ ను ఆహ్వానించడానికి, అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్ తన విచాక్షనాధికారాలను పూర్తిగా వినియోగించుకున్నారు.

ఇంతవరకూ చెప్పిన ఉదాహరణలు రాష్ట్రపతి విచక్షణాధికారాలకు సంబంధించినవి కాగా, 1979 లో నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా వ్యవహరించిన తీరు  ఆ పదవికున్న ప్రాధాన్యతను తెలియచేస్తుంది. మొరార్జీ దేశాయి ప్రభుత్వం విశ్వాస నిరూపణలో ఓటమి తరువాత మొదలు వైబీ చవాన్ ను ఆహ్వానించడంలో, తరువాత, మొరార్జీకి మరో చాన్స్ ఇవ్వకుండా వుండడంలో, చరణ్ సింగ్ ను చివరకు ప్రధానిగా నియమించడంలో రాష్ట్రపతి పాత్ర ప్రాముఖ్యత సంతరించుకున్నదే కాకుండా ఆ వ్యవస్థకున్న విశేష అధికారాలను కూడా ప్రస్ఫుట పరుస్తున్నది. ఆ తరువాత చరణ్ సింగ్ ను విశ్వాస పరీక్షకు ఆదేశించారు రాష్ట్రపతి. అలా ఆదేశించడం అదే అప్పటికి మొదటిసారి. 25 రోజుల్లోపలే చరణ్ సింగ్ ప్రధానిగా రాజీనామా చేసి పార్లమెంట్ కు పోని మొదటి-చివరి ప్రధానిగా చరిత్ర పుటల్లో మిగిలిపోయారు. లోక్ సభను రద్దు చేయమన్న ఆయన సిఫార్సుకు నీలం సంజీవరెడ్డి అంగీకరించారు. చరణ్ సింగ్ ను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగమన్నారు రాష్ట్రపతి. దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రపతిని విమర్శించాయే కాని ఆయన అధికారాలను కుదించలేకపోయాయి. ఎందుకంటే రాష్ట్రపతి అధికారం అంత గొప్పది కాబట్టి.

ఈ ఉదాహరణలన్నీ ఒకటే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాయి. ప్రధాన మంత్రి, ఆయన మంత్రిమండలి వందకు వంద శాతం రాష్ట్రపతి అభిమతానికి అనుగుణంగానే పదవిలో కొనసాగుతారు. కొనసాగి తీరాలి. ఇంతవరకూ జరగక పోయినా, ఇక ముందు జరిగే అవకాశాలు ఏ మాత్రం లేకపోయినా, రాజ్యాంగంలోని అంతర్లీన అర్థం ప్రకారం, సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ, తాను నియమించిన ప్రధానిని, ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి వుంటుంది. కాని అలా జరగడం కాని, రద్దు చేస్తాననడం కానీ జరగలేదు. రాష్ట్రాలలో కొందరు గవర్నర్ల లాగా కేంద్రంలో రాష్ట్రపతి కూడా ప్రవర్తిస్తే స్వతంత్ర భారత దేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితి ఏమయ్యుండేదో?

ఇన్ని అధికారాలున్న ఏ భారత రాష్ట్రపతి ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ వివాదాస్పదం కానప్పుడు, ఒక పార్టీ అధికారంలో వున్నప్పుడు ఎన్నుకోబడిన రాష్ట్రపతి, ఒక నీలం సంజీవరెడ్డి లాగానో, ఒక ప్రణబ్ ముఖర్జీ లాగానో తాము ఎన్నుకోబడిన తరువాత వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా వివాదరహితంగా ప్రధానితో కలిమిడిగా, సఖ్యతగా పనిచేసినప్పుడు, కేంద్రంలో రాష్ట్రపతి మోతాదులో రాష్ట్రాలలో అధికారాలు లేని కొందరు గవర్నర్ల విషయంలో అలా ఎందుకు జరగడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

దీనికి సరైన సమాధానం చెప్పాల్సింది రాజ్యాంగ కోవిదులు, రాజ్యంగ నిపుణులు మాత్రమే. బ్రిటీష్ సామ్రాజ్యవాద, వలసవాద పాలన నుండి గత శతాబ్దంలో స్వాతంత్ర్యం పొందిన అనేక దేశాలలో ప్రజాస్వామ్య ప్రక్రియ కొనసాగుతున్న ఏకైక దేశం భారతదేశం. ఈ వరవడి పదికాల పాటు కొనసాగాలని కోరుకుందాం.     

Follow in footsteps of Presidents : Vanam Jwala Narasimha Rao

 Follow in footsteps of Presidents

Vanam Jwala Narasimha Rao

Telangana Today (12-04-2022) 

Governor of Telangana met the Prime Minister and Union Home Minister and later addressed media that (her) Government is not bestowing the due respect to her. Governor also mentioned about protocol violations to her. Governor further said that since she was not satisfied with the recommendation of Government to nominate Koushik Reddy as MLC she kept the issue in pending. Media also reported quoting Governor that had she wanted, the government would have collapsed and everything will be decided by the people.

The Governor’s post and position which is an important institution in the Indian cooperative federalism has been subjected to some sort of criticism ever since it was created. Our country has the great reputation of dismissing the first ever elected communist Government in the world in 1959 in Kerala headed by EMS Namboodiripad while he was enjoying full majority by Burgula Ramakrishna Rao as Governor. Subsequently it happened many times both in Congress party and non-Congress party rule.

Executive Powers:

Chief Minister of a state is the democratically elected Chief Executive. The entire executive powers are under his control. Governor according to the Constitution is appointed to that post by the President of India on the recommendation of Prime Minister. A cursory look may appear that the powers and responsibilities of Governor in the state or more or less similar to that of President of India at the center. But in fact, not exactly so. The framers of the Constitution visualized that the Governor uses the powers and responsibilities entrusted to him or her through Constitution, to keep the country united with the spirit of cooperative federalism. However, though not all, at least few of them, over a period, in connivance with the Union Government abused these powers on various occasions and for various reasons. In any state the Government that is in power is the Government of the Governor and whatever the Governor requires in the state she or he may directly contact the Chief Minister and get it done. This is what happens at the center.

Comparing Powers:

Against this background it may be of interest to compare the powers of Governor at the state level and President at the central level. An academic discussion advocates that it is the President who is supreme and more powerful than the Prime Minister. Governors have no such enormous powers. If one fundamentally ponders over, before actually going into the niceties, the President is elected by all the elected peoples’ representatives of Lok Sabha and State Legislatures as well as the Rajya Sabha, where as the Prime Minister is just the leader of the majority party in the Lok Sabha! Thus, certainly, the President is more representative in character. Prime Minister however is the elected Chief Executive. In the case of Governor, it is a mere nominated institution where as the Chief Minister is democratically elected individual representing the people at large.

Most of the constitutional pundits often quote the experience of Britain the model of which India adopted. But the fact is that India did not in toto adopted British model and the quintessence is, it is partly parliamentary form and partly Presidential form. Despite this, the beauty of the Constitution is that so far during the last 75 years no President has ever misused or overstepped the powers, or spoke against the elected government at the center which in fact is his or his own Government, or expressed displeasure that he or she was ever insulted, or threatened that if he or she wants the Union Government would be dismissed! The main reason for this is that, the person who is elected as President is an acceptable individual to the Prime Minister and the ruling party. This is not the case with Governors. Irrespective of the fact that whether the Governor is acceptable to the Chief Minister or not President appoints him or her on the advice of Prime Minister. The individual so appointed as Governor would be one who belongs to the ruling party at center with exceptions.     

The real “functionary” according to the Constitution is President and not the Prime Minister. Article 74 of Constitution of India speaks about "Council of Ministers to aid and advise President". In the states the role of the Governor is similar. The Governor has no option except to accept the advice of Cabinet led by Chief Minister. The President of India is the head of state of the Republic of India. The President possesses enormous power. Despite this every president till date took decisions only based on the advice of Prime Minister. They seldom differed with the Prime Minister the way it happened in the case of Koushik Reddy or in the case of Protem Chairman of Council in Telangana state.

Constitution says:     

Constitution of India says that the Prime Minister shall be appointed by the President and the other Ministers shall be appointed by the President on the advice of the Prime Minister. In India an occasion for real exercise of this power arose for the first time when Sarvepalli Radhakrishnan was President who exercised his discretion and appointed GL Nanda as PM even before the Congress Party could indicate its choice following Jawaharlal Nehru’s death. Radhakrishnan again followed the same procedure and appointed GL Nanda when Lal Bahadur Shastri died. However, on both the occasions Nanda was mere caretaker PM. After Indira Gandhi assassination President Zail Singh, even before Rajiv Gandhi was elected as Congress Party Parliamentary leader, appointed him as PM. Consequent to 1989 general elections President Venkatraman, while inviting VP Singh after Congress refused to form government and then after VP Singh’s resignation in inviting first Rajiv Gandhi and then Chandrashekhar, exercised his discretionary powers. However, Neelam Sanjiva Reddy’s decision in 1979 in the case of appointing Charan Singh, though faced some criticism was cooled down soon as there was no option then.  

This is an ample proof that the Prime Minister and his council of ministers hold office at the pleasure of President. The President may also exercise his discretionary power, which is inherent in the Constitution, in dismissing a PM even if he or she enjoys majority in Lok Sabha, though there is no precedent and in future also highly unlikely. Had the Presidents of India also resorted to dismissals of Governments at the center by invoking discretionary powers, the way few Governors did in states, what would have happened to the democracy in India is anybody’s guess.  

When none of the Presidents in India during the past 75 years of democratic history including those elected during one party in power and continued later after a different party came to power like Neelam Sanjiva Reddy or like Pranab Mukherji, were controversial in discharging their duties and responsibilities and also worked closely, cordially and friendly with Prime Ministers, why not the appointed Governors who are not as powerful as President do the same? It’s a million Dollar question.

Probably it is only Constitutional experts who will be able to ponder over this. India is the one and only country among several countries that got independence from the British colonial rule where elections are regularly held and governments are changed in regular intervals and has come to stay as the largest democratic nation in the world. Let us hope that this continues forever without any hurdles.

It is better if Governors follow the footsteps of Presidents in maintaining cordial relations with the elected executive heads to uphold the democratic spirit of country.