వ్యక్తిత్వ వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-2
వనం
జ్వాలా నరసింహారావు
బాల్యంలో ఖాన్గీ బడి, తరువాత మా గ్రామం, ఖమ్మంలో ప్రాధమిక, ఉన్నత విద్యాభ్యాసం చేయడం
గురించి ఉపోద్ఘాతంలో చెప్పినదాన్ని విస్తృతంగా రాయడానికి కారణం, ఇంతకుముందే చెప్పినట్లు, అరమరికలు, భేషజాలు లేని
ఆరోజులు కళాశాలలో చేరక మునుపు మదిలో మెదిలే మదురమైన జ్ఞాపకాలు. ఆ పరిచయాలు అదోరకమైన సంతృప్తి మిగిల్చాయి. ప్రధానంగా ఖాన్గీ బడిలో పిన్నవయసులోనే
క్రమశిక్షణ నేర్చుకోవడం ఇంకా గుర్తుంది. ఉదయాన్నే బడికి
అందరికంటే ముందు వచ్చిన విద్యార్థికి చేతి మీద ‘శ్రీ’ అని పంతులు గారు రాసేవారు. ‘శ్రీ’ పెట్టించు కోవడం కోసం ముందుగా బడికి
చేరుకునే వాళ్లం. సమయానికి
స్కూల్ కు వెళ్లడానికి అదొక రకమైన క్రమశిక్షణ అనాలి.
‘ఓనమాలు, వంట్లు, ఎక్కాలు, కూడికలు, తీసివేతలు, పెద్దబాలశిక్ష’ లను మూడు సంవత్సరాల
వయసు నిండీ-నిండకుండానే పరిచయం చేస్తూ, అందులో భాగంగా, ‘ఎ ఫర్ యాపిల్, బి
ఫర్ బాయ్, సి ఫర్
కాట్....’ కాకుండా, ‘అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ..., 1,2,3,4,5..., ఒకాట్ల ఒకటి, ఒక రెండు రెండు, ఒక
మూడు మూడు, 1+1=2, 2+2=4, 4+3=7......1-1=0,
2-1=1…, తెలుగు
వారాలు, తెలుగు మాసాలు, తెలుగు సంవత్సరాలు’ లాంటివి నేర్పిన ఆ
మహానుభావుడు, నాకు దూరపు
బంధువు, బీదరికంలో
వున్న పైసా ఆశించకుండా పాఠాలు నేర్పిన ఎర్ర శేషయ్య (పంతులు) గారికి శత-సహస్ర
వందనాలు.
నక్షత్రాలు, రాశులు, రుతువులు కూడా నేర్పించారు. చాలావరకు కంఠస్థం చేయించేవారు. ‘పెద్ద బాల శిక్ష’ లోని వివిధాంశాలను చాలావరకు
నేర్చుకున్నదక్కడే. ‘విశ్వక్సేనుడు’, ‘జంబీర బీజం’,
‘మందార
దామం’ లాంటి కఠిన (గొట్టు) పదాలను ఎలా పలకాలో నేర్చేవారు పంతులు గారు.
గ్రామంలో కొఠాయి (రచ్చబండ) దగ్గర ఒక పూరి పాకలో వున్న ఏకోపాధ్యాయ ప్రభుత్వ
పాఠశాలలో మొదటి తరగతిలో చేర్పించారు నాన్న గారు. కొద్ది
కాలానికి మరో ఉపాధ్యాయుడిని పోస్ట్ చేశారు.
ఒకరిని
‘పాత పంతులు (సత్యనారాయణ) గారు’ అని, మరొకరిని
‘కొత్త పంతులు (దత్తయ్య) గారు’ అని గ్రామంలో చిన్నా-పెద్దా
అందరూ వారిని అత్యంత గౌరవంగా సంబోధించే వారు.
ఉపాధ్యాయుడు
అంటే గ్రామస్తులకు అప్పట్లో వున్న గౌరవ, మర్యాదలు
క్రమేపీ క్షీణించడానికి కొంత పంతుళ్లు కారణమైతే, కొంత
గ్రామస్తులు కారణం.
గ్రామంలో క్రమేపీ కొత్త పాఠశాల భవనం (చిన్నది) తయారైంది. అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ భట్ సమక్షంలో, అప్పట్లో జిల్లా-రాష్ట్ర
రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తున్న మాజీ మధిర ఎమ్మెల్యే బొమ్మకంటి సత్యనారాయణ
రావు గారి చేతుల మీదుగా, పాఠశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడైన మా నాన్న
గారు వనం శ్రీనివాస రావు గారి సమక్షంలో ప్రారంభించడం జరిగింది (బహుశా 1954
లో
కావచ్చు). దరిమిలా
తరగతులు పెరగడంతో, కృష్ణమూర్తి
గారు, అయ్యదేవర
రామచంద్రరావు గారు చేరారు. అ పాఠశాలలో ప్రస్తుతం పదవ తరగతి దాకా ఉన్నప్పటికీ
రూపురేఖలు చూడ సొంపుగా మాత్రం లేవు.
మొదట్లో పలకా-బలపం, తరువాత పెన్సిల్-రబ్బర్, మరో రెండేళ్లు గడిచిన తరువాత సిరా బుడ్డి, అందులో ముంచి రాసేందుకు ఒక పొడగాటి కలం ఉపయోగించే
వాళ్లం. ఇప్పుడైతే
మూడో ఏటనుంచే బాల్ పాయింట్ పెన్నులు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, ఇలా ఎన్నో
పిల్లలకు అందుబాటులో వున్నాయి. వాటి ఉపయోగం పెద్దల కంటే వారికే ఎక్కువ తెలుసంటే
ఆశ్చర్యపడక్కరలేదు. ఐదో తరగతి వరకు ఆ పాఠశాలలోనే చదువుకుని, ఖమ్మం మామిళ్లగూడెంలో, మా ఇంటికి సమీపంలో వున్న రికాబ్-బజార్ పాఠశాలలో ఆరవ తరగతిలో చేరి అక్కడి నుంచే
హెచ్.ఎస్.సీ పబ్లిక్ పరీక్షలు హయ్యర్ సెకండరీ క్లాస్ లో
పాసయ్యాను.
చరిత్ర, భూగోళం, తెలుగు,
హిందీ, లెక్కలు, సైన్స్, ఆంగ్లం ఇలా అన్ని సబ్జెక్టల్లకు చెందిన అంశాలను
అరటిపండును వలిచి నోట్లో పెట్టినట్లు బోధించేవారు. ‘పేను
బెత్తం’ దెబ్బలు, ‘కోదండం’ వేయడం, నాటకాల
రిహార్సల్స్, సులభంగా హిందీ బోధన, ‘కాంజుగేషన్ ఆఫ్ ద వెర్బ్,’
ఇవి బోధించిన రాజయ్య, సీతారామయ్య, రసూల్, వెంకట్రాంరెడ్డి, చిన్ని రామారావు, కొండల్ రావు, బొగ్గారపు సీతారామయ్య, డి వెంకటేశ్వర్లు, విఠల్
రంగారావు, వీరభద్రయ్య సార్లు ఆజన్మాంతం గుర్తుంచుకునే దైవసమానులు.
ఇవ్వాళ ఇంగ్లీష్ లో అంతో-ఇంతో రాయగలుగుతున్నామంటే, ఇదంతా వెంకటేశ్వర్లు సార్
నేర్పించిన ‘కాంజుగేషన్ ఆఫ్ ద వెర్బ్’ పుణ్యమే!
ఇటీవల కాలంలో ఎవరైనా విద్యార్థిని దీన్ని గురించి అడుగుతే ఏమీ తెలియదని, అదేంటో వివరిస్తే, ఓహో!!! కంప్యూటర్లో గ్రామర్ చెక్, స్పెల్ చెక్ వుంది కదా, ఇదెందుకని అమాయకంగా జవాబిచ్చారు.
కొంతమంది
నా క్లాస్ మేట్స్ పేర్లు గుర్తున్నాయి. జూపూడి హనుమత్
ప్రసాద్, జూపూడి హనుమంతరావు, ఎల్విఎస్ఆర్
శర్మ, ఎంవికెహెచ్ ప్రసాద్, కెవిడిపి
శేషగిరి రావు, వనం వరదారావు (గోవిందరావు), అబ్దుల్ రహమాన్, సైదుర్ రహమాన్, షుకూర్, చీనా, ధర్మా, జాన్ మీరా, గుర్రం, బూర్లె, దోసపాటి
పుల్లయ్య, ఏడునూతుల ప్రభాకర్, విజయబాబు,
రామ బ్రహ్మాచారి, బండారు బాబు, బాగవతుల కృష్ణ.....వీరిలో కొందరు. భండారు శ్రీనివాస రావు తొమ్మిదవ
తరగతిలో క్లాస్మేట్ గా చేరినట్లు గుర్తు. వీరిలో ఏ ఒకరిద్దరో
తప్ప (చనిపోయేంతవరకు వారితోసహా), అసలుసిసలైన స్నేహితులుగా, ఈర్ష్యాసూయలకు అతీతంగా, ఒకరి వృద్ధిని మరొకరు తమ వృద్ధిలాగే భావిస్తూ వుండడం నిజంగా అదృష్టమే
అనాలి. చాలామందికి ఇలాంటి మంచి బాల్యస్నేహితులు వుండడం కష్టమే.
నా
బాల్యస్నేహితులలో పబ్లిక్ పరీక్షలలో ఫెయిలై, దరిమిలా చదువులు
కొనసాగించదానికి ఆర్ధిక వెసులుబాటులేక, మెరుగైన స్థాయికి చేరుకోలేకపోయిన కరామత్
అలీ, చీనా, ధర్మ, నవాబ్, జాన్ మీరా లాంటి వారు ఫారెస్ట్ గార్డులుగా,
మెకానిక్ లుగా, శనక్కాయలమ్మే వారిగా, చిన్న-చిన్న జీవనాధారం పనులు చేసే వారిగా
స్థిరపడిపోయారు. అయినప్పటికీ చాకాలం వరకు నేను ఖమ్మం
వెళ్లినప్పుడల్లా పట్టణంలో అందుబాటులో ఉన్నవారిని కలిసి కొంతసమయం గడపడానికి కారణం
అలాంటివారి ఆప్యాయతలే. ‘ఏవి తల్లీ, నిరుడు కురిసిన హిమ
సమూహములు’ అనే మహాకవి శ్రీశ్రీ రాసిన ఒక ప్రసిద్ధ కవితలోని పంక్తి జ్ఞప్తికి
తెచ్చుకోవడం మినహా, బాల్యమిత్రుల ఆప్యాయతలు తిరిగి పొందలేము కదా?
హెచ్
ఎస్ సీ (11 వ తరగతి) తరువాత పియుసి (12 వ తరగతి), ఆ తరువాత
డిగ్రీకాని, ప్రొఫెషనల్ కోర్సు కాని చదవాలి. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యను అభ్యసించడానికి ఇప్పటిలాగా ఎంసెట్, నీట్ లాంటి ప్రవేశ
పరీక్షలు వుండేవి కావు. ఈ నేపధ్యంలో, హెచ్ ఎస్ సీ పాసై, లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన
శాస్త్రం (ఎంపీసీ) ఆప్షనల్ సబ్జెక్టులుగా, ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ కంపల్సరీ సబ్జెక్టులుగా తీసుకుని,
1962 లో ఖమ్మం ఎస్ఆర్అండ్ బిజిఎన్ఆర్ కళాశాల లో ప్రీ-యూనివర్సిటీ (పియుసి)
కోర్సులో చేరాను. జనరల్ నాలడ్జ్ అవసరమైన పోటీ పరీక్షలు రాసేవారికి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్
బాగా ఉపయోగం. ఇప్పుడు ఆ సౌకర్యం ఉందోలేదో తెలియదు. తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్
కు మారడం ఇబ్బందిగా వున్నప్పటికీ, అలవాటై పోయింది.
కాలేజీ విద్యార్థిగా పెద్దరికం వచ్చిన అనుభూతి
కలిగింది. ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్, భౌతిక, రసాయన శాస్త్రాల క్లాసులు
సంబంధిత గ్రూపులన్నిటికీ కలిపి బోధించేవారు. లెక్కల క్లాస్
ప్రత్యేకంగా ఎంపీసీ గ్రూపుకు మాత్రమే వుండేది. తెలుగు
క్లాసులలో చెప్పిన మనుచరిత్రలోని పద్యాలు ఇంకా గుర్తున్నాయి. జనరల్ స్టడీస్
క్లాసులను భోధించే లెక్చరర్లు వర్తమాన సంఘటనలను పాఠ్యాంశాలకు అనుసంధానం చేసి
ఆసక్తికరంగా చెప్పేవారు. ప్రాక్టికల్స్ క్లాసులను
తీసుకునేవారిని ఆ రోజుల్లో ‘డిమాన్ స్ట్రేటర్’ (లెక్చరర్
కంటే ఒక గ్రేడ్ తక్కువ) అనే వారు. భౌతిక
శాస్త్రానికి చక్రపాణి గారు, రసాయన శాస్త్రానికి సి ఆంజనేయులు
గారు డిమాన్ స్ట్రేటర్లుగా పని చేశారు.
సత్యనాధం లెక్చరర్, సుబ్బారావు ట్యూటర్ (లెక్చరర్ కంటే ఒక గ్రేడ్ తక్కువ) ఇంగ్లీష్ చాలా
చక్కగా బోధించేవారు. తెలుగును ఎం హనుమంతరావు సార్ చెప్పేవారు. జనరల్ స్టడీస్ క్లాసులను జగన్మోహన రావు గారు, వైవి రెడ్డి
గారు ఎంతో ఆహ్లాదకరంగా తీసుకునేవారు. వర్తమాన సంఘటనలను
పాఠ్యాంశాలకు అనుసంధానం చేసి ఆసక్తికరంగా చెప్పేవారు. ఎన్వి సాంబశివరావు
సార్ లెక్కల సబ్జెక్ట్, భౌతిక శాస్త్రం సబ్జెక్ట్ ఎ విస్సన్న పంతులు గారు, రసాయన శాస్త్రం ఆదిశేషా రెడ్డి గారు బోధించేవారు.
పియుసి
క్లాస్ మేట్స్ పేర్లు ఎక్కువగా గుర్తుకు రావడం లేదు. ఎల్విఎస్ఆర్
శర్మ, సి బాలమౌళి (దరిమిలా ప్రఖ్యాత చార్టర్డ్ అకౌంటెంటు), సత్యనారాయణ
(దరిమిలా ఇంజనీర్), హేమ నళిని (తరువాత బంధువు), నయన తార, దేవి, ఫకీర్ బీ పేర్లు
గుర్తున్నాయి. నేను పియుసి చదువుతున్నప్పుడే బాబాయి వనం నర్సింగరావు బి ఎస్సీ డిగ్రీ మూడో సంవత్సరంలో చదువుతుండగా, ఆయన తమ్ముడు స్వర్గీయ వనం రంగారావు డిగ్రీ బి ఏ రెండో సంవత్సరంలో
చదివేవాడు. పియుసి చదువుతున్నప్పుడు సబ్జెక్టులు బోధించిన
అధ్యాపకులతో పాటు ఇతర వ్యాపకాల (ఎక్సట్రా కరిక్యులర్, కొ
కరిక్యులర్) దృష్ట్యా పరిచయమైన వైద్య, జడ్డీ లాంటివారు, అలాగే సహాధ్యాయులతో చాలాకాలం సంబంధ బాంధవ్యాలు కొనసాగించాను. అంతా
గొప్పవారే.
సరిగ్గా
పియుసి చదువుతున్నప్పుడే క్రికెట్ ఆట నేర్చుకోవడంతోపాటు, రాజకీయ వాసన తగలడం ఆరంభమైంది. కాలేజీలో రాజకీయాలకు ప్రాధాన్యత వుండేది.
విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవడేవి. ఆ రోజుల్లో ఖమ్మం కాలేజీ ఎన్నికల
రాజకీయాలు, శాసన సభ, లోక్ సభ ఎన్నికల రాజకీయాలను మరిపించే
విధంగా వుండేవి. కాలేజీలోని రెండు ప్రధాన గ్రూపులకు, జిల్లాకు
చెందిన రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, ఉమ్మడి కమ్యూనిస్ట్ ల అండ దండలు
పూర్తి స్థాయిలో వుండేవి. కళాశాల రాజకీయాలు స్థానిక కమ్మ హాస్టల్, మామిళ్ల గూడెం లోని మా ఇల్లు కేంద్రంగా
సాగుతుండేవి. ఎన్నికలు ముగిసిన తరువాత అంతా సర్దుకు పోయేది. చదువుమీద ధ్యాస పెరిగి, దానికే పరిమితమై, విద్యార్ధి దశనుండి రాజకీయాలకు
ఎదగడం తగ్గసాగింది. ఈ నేపధ్యంలో, నేను పియుసి అత్తెసరు
మార్కులతో థర్డ్ క్లాస్ లో పాసయ్యాను.
No comments:
Post a Comment