వ్యక్తిత్వ
వికాసం, జీవన పాఠాలు, స్వీయానుభవాల పరిపక్వత-3
రాజకీయ చైతన్యం, ఉద్యమాల గుమ్మం,
‘తెలంగాణ సాహిత్య ప్రపంచానికి ముఖద్వారం’ నా ఖమ్మం
వనం
జ్వాలా నరసింహారావు
ఖమ్మం
ఎస్ఆర్అండ్ బిజిఎన్ఆర్ కళాశాలలో పియుసి చదువుతున్నప్పుడే రాజకీయ (చైతన్య)
వాసన తగలడం ఆరంభమైందని చెప్పడానికి, మహోన్నతమైన అలనాటి ఆ మా ఖమ్మం కాలేజీలో, చదువుతోపాటు
సరిసమానంగా రాజకీయాలకు, అంతకు మించి రాజకీయ చైతన్యానికి అమితమైన ప్రాధాన్యత వుండడమే
ప్రత్యేక కారణం. విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవడేవి. అక్కడ చదువుకున్న
అనేకమంది విద్యార్థులు మితవాద, అతివాద (తీవ్రవాద కూడా), మధ్యేవాద ప్రత్యక్ష, పరోక్ష రాజకీయాలలో పాల్గొని,
తమదైన శైలిలో వారి-వారి పార్టీలలో, నిర్ణయాత్మక స్థానాలలో సమున్నత స్థాయికి ఎదిగారు. బహుశా ఖమ్మం పట్టణం పక్కనే
ప్రవహించే మునేరు నీరు తాగిన ప్రభావమేమో అది. ఖమ్మం గురించి,
అక్కడి కొందరి వ్యక్తుల గురించి కొంత వివరం అవసరం.
ఉద్యమాల గుమ్మం,
‘తెలంగాణ సాహిత్య ప్రపంచానికి ముఖద్వారం’ ఖమ్మం పట్టణం మధ్యలో ఉన్న
స్తంబాద్రి లక్ష్మీ(నృ)నరసింహస్వామి పేరు మీద స్థంబాద్రిగా వెలసింది ప్రాచీనకాలంలోనే
ఖమ్మం. స్తంభాన్ని ఉర్దూలో ‘ఖంబా’ అంటారు. ముగ్గురు సోదరులు రంగారెడ్డి,
లఖ్నారెడ్డి, వేమారెడ్డి ఓరుగల్లు నుండి అపారమైన
గుప్తనిధిని తీసుకుని వచ్చి ఖమ్మం ఖిల్లాను, లఖ్నవరం
చెరువును నిర్మించారని చెప్పుకుంటారు. పౌరాణిక గాధల ఆధారంగా, కృతయుగంలో సాలగ్రామాద్రి అని, త్రేతాయుగంలో
నరహరిగిరి అని, ద్వాపరయుగంలో స్థంబశిఖరి అని, కలియుగంలో స్తంబాద్రి అని పిలిచేవారట. పౌరహక్కుల కోణంలో పురాణాలని చూసిన కాళోజీ
దృష్టిలో మొదటి ఫాసిస్ట్ హిరణ్యకశిపుడిని చంపి, అన్యాయాన్ని అడ్డుకున్న నృసింహస్వామే
ఖమ్మం ప్రజలకు స్ఫూర్తి.
మొదటి సాలార్జంగ్ ప్రధాని కాగానే 1865 లో
పరిపాలనా వ్యవస్థను పకడ్భందీగా ఏర్పాటు చేయడంలో భాగంగా, ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉండేది. వరంగల్ ఆనాడు ఖమ్మం జిల్లాలో తాలూకాగా
మాత్రమే. 20వ శతాబ్ధం ఆరంభంకల్లా ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లాలో అంతర్భాగంగమై, అక్టోబర్ 1, 1953 న తిరిగి ఖమ్మం జిల్లా కేంద్రంగా, కొత్త జిల్లాగా ఏర్పాటైంది. ప్రముఖ కవి, కవిత్వం
ద్వారా నిప్పులు కురిపించిన దాశరధి, ‘ఖమ్మం తెలంగాణ
సాహిత్య ప్రపంచానికి ముఖద్వారం’ అన్నాడు. తెలంగాణ సాంస్కృతిక
పునరుజ్జీవనానికి, రాజకీయ చైతన్యానికి, ప్రగతికి, విద్యా వ్యాప్తికి, వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ
రంగాలకు, వైజ్ఞానిక స్ఫూర్తికి ఖమ్మం పర్యాయపదం అంటే
అతిశయోక్తి కాదేమో! తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైన తరువాత, ఖమ్మం
జిల్లాను విభజించి, రెండు (ఖమ్మం,
భద్రాద్రి కొత్తగూడెం) జిల్లాలను చేసింది ప్రభుత్వం.
ఖమ్మం పట్టణంలో ఎప్పుడూ జట్కా బండ్లు కాని, టాంగాలు కాని, మనిషి లాగే రిక్షాలు కాని, వుండేవి కాదని పాత కాలానికి చెందిన వారంటారు. ఒంటెద్దు బండ్లుండేవట.
ఖమ్మానికి అద్వితీయమైన ప్రాచీన చరిత్ర కూడా వుంది. కొన్నాళ్లు కాకతీయుల వశంలో,
ఆ తరువాత గోల్కొండ సుల్తానుల పాలనలో, ఆ
క్రమంలో ఆసఫ్ జాహీల, నిజాంల అధీనంలో వుండేది. 1900 హైదరాబాద్
స్థానిక సంస్థల చట్టానికి లోబడి 1910 లో ఖమ్మం మునిసిపాలిటీ ఏర్పాటైంది. అప్పట్లో
జనాభా కేవలం ఐదు వేలు మాత్రమే! మునిసిపాలిటీ బాధ్యతలు తహసీల్దార్ నిర్వహించే వాడు.
1942 లో మునిసిపాలిటీ కమిటీగా వ్యవస్థీకరించడం జరిగింది. 1952 లో మొదటి సారి
మునిసిపాలిటీ పాలకవర్గ ఎన్నికలు జరిగాయి.
1956 దాకా ఖమ్మం పట్టణంలో విద్యుత్ సౌకర్యం
వుండేది కాదు. పెట్రోమాక్స్ లైట్లు వాడేవారు. ఇళ్లల్లో ఆముదం దీపాలుండేవి. మధ్య
తరగతి, సంపన్నుల ఇండ్లలో లాంతర్లుండేవి. రెండే సినిమా
టాకీసులుండేవి మొదట్లో. ఒక దాని పేరు ‘సుందర్ టాకీస్,’ మరో
దాని పేరు ‘నవాబ్ టాకీస్.’ ఇవి కూడా డైనమో కరెంటుతో నడిచేవి. ప్రాచీన స్థలాలో
ఖిల్లా తరువాత చెప్పుకో దగ్గవి గుంటు మల్లన్న సత్రం, రామాలయం.
ఖమ్మం పోలీసు స్టేషన్ సమీపంలో ఇప్పుడున్న దుకాణాల
సముదాయంలో ఒకప్పుడు ‘ప్రభాత పుస్తక శాల’ వుండేది. జాతీయోద్యమంలో అంతర్భాగంగా, గ్రంధాలయోద్యమానికి వూతంగా, ప్రచారానికి ఉపయోగపడేదీ
పుస్తక శాల. అలానే కారంసెట్టి చిన నరసయ్య అనే వ్యాపారికి ఒక పుస్తకాల షాప్
వుండేది. అక్కడ కూర్చుని అనేకమంది ప్రముఖులు (ప్రముఖులంకాని నాలాంటి వారు కొందరు) ఆయనిచ్చిన
కాఫీని సేవిస్తూ కొనకుండా మాగజైన్లు, పుస్తకాలు చదివేవారు.
ఇప్పటికీ వాడుకలో వున్న ‘కమాన్ బజార్, కస్బా బజార్’ పాత కాలం పేర్లే. అలాగే ఖమ్మం ఖిల్లా రాజు గారి సైన్యాల
విడిదిగా, ఔట్ పోస్టులాగా వుండేది. రాజుగారి గుర్రాల జీనులకు
ఇరు పక్కలా కాళ్లు పెట్టుకోవడానికి వుండే ‘రికాబులు’ తయారు చేసే వీధిని ‘రికాబు
బజార్’ అని అప్పట్లో, ఇప్పట్లో పిలుస్తున్నారు. అక్కడుండాల్సిన పాఠశాల ఏ కారణం
చేతనో మామిళ్లగూడెంలో వుండేది. పేరు ‘రికాబ్ బజార్ హైస్కూల్’ కాని వుండేది వేరే
చోట. నా హై స్కూల్ విద్యాభ్యాసం అక్కడే కరిగింది.
చిర్రావూరి లక్ష్మీనరసయ్య, సర్వదేవభట్ల రామనాధం, మంచికంటి రామకిషన్‌రావు,
రావెళ్ళ సత్యనారాయణ, కెఎల్ నరసింహారావు,
బోడేపూడి వెంకటేశ్వర రావు, నల్లమల గిరిప్రసాద్,
టీబీ విఠల్ రావు, పువ్వాడ నాగేశ్వర్ రావు,
మహమ్మద్ రజబ్ అలీ, పర్సా సత్యనారాయణ వంటి
కమ్యూనిస్ట్ పార్టీ యోధాన యోధులను అందించిన జిల్లా ఇది. మధిర ఎమ్మెల్యేగా రాష్ట్ర
రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన బొమ్మకంటి సత్యనారాయణరావు ఖమ్మం జిల్లావాడే.
బహుభాషావేత్త, సాంఘిక సంస్కర్త,
సామాజిక, సాంస్కృతిక, రాజకీయ
వికాసానికై నిరంతరం కృషి చేసిన ప్రముఖుడు మాడపాటి హనుమంతరావు మధిర తాలూకా
ఎర్రుపాలెంలో జన్మించారు. మాడపాటి రామచంద్రరావు ఈ జిల్లావాడే. తెలంగాణ సర్దార్ గా
పేరొందిన సర్దార్ జమలాపురం కేశవరావు ఈ జిల్లావాడే. ఆరడుగుల ఎత్తుతో మోకాళ్ల దాకా
ఖద్దరు పంచెకట్టి బుజాన గొంగిడి వేసుకుని ప్రజల స్వాతంత్రకాంక్షకు నిజాం పరిపాలన
విధానానికి వ్యతిరేకంగా జనాన్ని సమీకరించినాడు.
మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ్రావు, మాజీ మంత్రి శీలం సిద్దారెడ్డి ఖమ్మం జిల్లావారే. తెలంగాణ రాష్ట్రం
ఏర్పాటైన తరువాత మొదటి దఫా మంత్రివర్గంలో పనిచేసి, ప్రస్తుతం మంత్రివర్గంలో వున్న తుమ్మల
నాగేశ్వరరావు, రెండవ దఫా మంత్రివర్గంలో పనిచేసిన పువ్వాడ
అజయ్ కుమార్ ఖమ్మం జిల్లా వారే. తెలంగాణ
ప్రస్తుత ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మరో మంత్రి
పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ జిల్లావారే. ఉభయ కన్యూనిస్ట్ పార్టీల రాష్ట్ర
నాయకులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు ఉమ్మడి
ఖమ్మం జిల్లాకు చెందినవారే. దేశచరిత్రలోనే పౌరహక్కుల ఉద్యమాలకు నాంది పలికిన మాజీ
రాజ్యసభ సభ్యుడు డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, అడ్వకేట్లు
రాధాకృష్ణ, సుబ్బారావులు ఖమ్మం పట్టణంలో స్థిరపడిన వారే.
ఖమ్మంలో జన్మించిన హీరాలాల్ మోరియా
పూర్వికులెప్పుడో ఉత్తరాది నుండి వచ్చి ఖమ్మంలో స్థిరపడినారు. హీరాలాల్ క్విట్
ఇండియా ఉద్యమంలో, నిజాం వ్యతిరేక ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు.
ఉర్ధూలో ప్రావీణ్యం సంపాధించి రామాయణాన్ని ఉర్ధూలోకి అనువాదం చేసి ఉత్తర ప్రదేశ్
ప్రభుత్వ ప్రశంసలందుకున్నాడు. మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు భాషపై మమకారంతో
రచనలు చేశారు. సహచర కవులైన దాశరథి, కవి రాజమూర్తి, కొలిపాక మధుసూదనరావు లాంటివారితో కలిసి స్వాతంత్ర్య ఉద్యమంలో పనిచేశారు.
కమ్యూనిస్ట్ రైతాంగ ఉద్యమానికి సమాంతరంగా
సరిహద్దు పోరాట కాంపులను సమర్ధవంతంగా నడిపి, మొట్టమొదటి సారిగా
జాతీయ జెండాను జయంతి గ్రామంలో పోలీసు చర్యకు ఆరంభంగా దారి చూపిన మహానుభావుడు,
సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఆర్య సమాజ దీక్ష తీసుకున్న పండిత
రుద్రదేవ్ ఖమ్మం జిల్లా బీరవోలు గ్రామస్థుడు. రజాకార్ల దౌష్ట్యానికి బలైపోయిన
ప్రముఖ పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్ ఈ జిల్లాకు చెందిన సుబ్లేడులో
జన్మించాడు.
ఖమ్మం గుంటు మల్లన్న సత్రం ఆవరణతో దాశరథి సోదరులకు
సంబంధం వుండేది. దాశరథి కృష్ణమాచారి రాసిన అగ్నిధార, రుద్రవీణ కవిత సంపుటాలు సామాన్య ప్రజానీకానికి నినాదాలు అయ్యాయి. ‘నా
తెలంగాణ కోటి రతణాల వీణ’ అన్న దాశరధి జైలు శిక్ష అనుభవిస్తూ, ‘ముసలి నక్కకు దక్కునే రాజ్యము’ అని బొగ్గుతో నిజామాబాద్ జైలు గోడల మీద
కవిత్వం రాశాడు. తెలంగాణ తొలితరం కవి, సాయుధ పోరాట యోధుడు,
తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచి,
తెలంగాణ గీతం రాసి ప్రఖ్యాతివహించిన రావెళ్ళ వెంకట రామారావు
ముదిగొండ మండలం గోకినేపల్లి వాసి. తెలుగు సినీ ప్రంపంచానికి, నాటకరంగానికి పాటలు రాసిన మొట్టమొదటి కవి చందాల కేశవదాసు ఖమ్మం జిల్లా జక్కేపల్లి
గ్రామంలో జన్మించాడు.
1968 లో తెలంగాణ
ప్రజా పోరాటానికి ‘రక్షణల ఉద్యమం’ పేరుతో పాల్వంచ థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రంలో
అంకురార్పణ జరిగింది. అలనాటి ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన విద్యార్థి ఉద్యమం,
ఇంతై-ఇంతింతై-వటుడింతై’ అన్న చందాన వట వృక్షమైంది. ఆ పోరాటమే చిలికి చిలికి
గాలివానగా మారి, జిల్లా అంతటా పాకి, ఖమ్మం
పట్టణం చేరుకుంది. ఖమ్మం స్థానిక కళాశాలలో చదువుకుంటున్న నా స్నేహితుడు ‘రవీంద్రనాథ్’
అనే విద్యార్థి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ ‘గాంధి చౌక్’ లో ఆమరణ నిరాహార
దీక్షకు దిగాడు.
భక్త రామదాసుగా (కంచర్ల
గోపన్న) పుట్టిన నేలకొండపల్లి ఖమ్మం పట్టణానికి 23
కిలోమీటర్ల దూరంలో కోదాడ రహదారిలో ఉన్నది. రు. 3 కోట్లతో నిర్మించిన రామదాసు ధ్యానమందిరం,
అపురూపమైన ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపు దిద్దుకోనున్నది.
ముదిగొండ మండలం, ముత్తారం గ్రామంలో ప్రాముఖ్యత సంతరించుకున్న
వామాంక స్థిత జానకీ సహిత శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయమున్నది. అప్పట్లో ఖమ్మంలో
ఒకే ఒక సర్కారీ హైస్కూల్ వుండేది ఒకరిద్దరు క్వాలిఫైడ్ డాక్టర్లు మాత్రమే వుండేవారు.
ఇలాంటి మహత్తర చారిత్రిక నేపధ్యమున్న ఖమ్మం పట్టణంలో కళాశాల ఆవిర్భావ, ఆరోహణల ఆసక్తికర అంశాలు వివరంగా మున్ముందు.
No comments:
Post a Comment