Tuesday, January 12, 2021

రాజకీయాలలో లోపిస్తున్న గౌరవ మర్యాదలు : వనం జ్వాలా నరసింహారావు

 రాజకీయాలలో లోపిస్తున్న గౌరవ మర్యాదలు

వనం జ్వాలా నరసింహారావు

సాక్షి దినపత్రిక (13-01-2021)

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులు, అందునా ప్రత్యేకించి ఎన్నికైన ప్రజా ప్రతినిథులు పోషించాల్సిన పాత్ర బహుముఖమైనదని, అతి సున్నితమైనదని, అత్యంత క్లిష్టమైనదనే విషయాన్ని ఇటీవలి కాలంలో చాలామంది గౌరవ రాజకీయ నాయకులు మరచిపోవడం చాలా బాధాకరం. ఒక రకంగా అది కత్తిమీద సాము వంటిది. హుందాగా, గంభీరంగా, బాధ్యతగా ఉంటూ రాజకీయ నాయకులు ఇతరులను నొప్పించక, తానొవ్వక నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. క్రమేపీ రాజకీయాలలో మర్యాదలనేవి మంటగలుస్తున్నాయి. దీనికి కారణం ఒకరా, ఇద్దరా, ఒక పార్టీవారా, అన్ని పార్టీలవారా అంటే జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలిపోతుంది. ‘తిలాపాపపం, తలా పిడికెడు. కాకపొతే కొందరైతే అదే పనిగా విమర్శలు గుప్పిస్తుంటారు అదొక జీవనోపాధిలాగా!   

ఇటీవల ఒక ముఖ్యమైన సమావేశంలో మాట్లాడిన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు రాజకీయాలలో సభ్యత, మర్యాద, మన్నన అనేవి మూడు ప్రధానమైన మౌలిక సూత్రాలని, వీటికి కట్టుబడి రాజకీయాలు సాగిస్తేనే అవి అర్థవంతంగా, క్రియాశీలకంగా సాగుతాయని, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే గౌరవ మర్యాదలు, చర్చించడం, తార్కిక విశ్లేషణ, సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే ప్రజా సమస్యలు పరిష్కరించబడతాయని అన్నారు.  

కానీ, ఈ మధ్య చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలను గమనిస్తుంటే, కొందరు రాజకీయ నాయకుల వ్యవహార శైలిని చూస్తుంటే, మర్యాదలనేవి ఎప్పుడో మంట కలిశాయని విస్పష్టంగా తేలుతున్నది. కొందరు రాజకీయనాయకులు బహిరంగంగా మాట్లాడేటప్పుడు, అందునా వారికంటే ఎన్నో రెట్లు ఎక్కువ గౌరవప్రదమైన తమ ప్రత్యర్థుల ప్రస్తావన తెచ్చినప్పుడు, ప్రత్యక్షంగా-పరోక్షంగా వారి పేర్లను ఉటంకించిన సందర్భాలలో మర్యాద అన్న మాటను పూర్తిగా విస్మరించి అసభ్యకరమైన పదజాలాన్ని అలవోకగా ఉపయోగిస్తున్నారు.  కొందరు జాతీయ పార్టీల నాయకులైతే తమ ప్రత్యర్థులను విమర్శించే సందర్భంలో సహనం కోల్పోతున్నారు. మైకుల ముందు ఊగిపోయి ఏం మాట్లాడుతున్నామో తెలియని స్థితిలో, కనీస గౌరవ మర్యాదలు కూడా పాటించడంలేదు. ఏకవచన పిలుపులు, వ్యక్తిగత దుర్భాషలు, ప్రాసలతో కూడిన  పదబంధాలను వాడుతూ, పత్రికల్లో రాయలేని తిట్లను తిడుతూ, అపహాస్యం చేస్తున్నారు. ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్నారు.

ఈ ధోరణి అన్ని రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఈ మధ్య కాలంలో కొంచెం  ఎక్కువ మోతాదులో కనిపిస్తున్నది. మొన్న-మొన్న దుబ్బాకలో, తదనంతరం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో, ముగిసిన తరువాత ఒక జాతీయపార్టీ అధ్యక్షుడైన వ్యక్తి, సాక్షాత్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కనీస గౌరవం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడుతూ, మర్యాద పరిమితులను దాటిన భాషలో అనునిత్యం విషం కక్కుతున్నారు. ముఖ్యమంత్రినే కాకుండా, వారి కుటుంబ సభ్యులపై కూడా తిట్లు, శాపనార్ధాలతో మాటల దాడి చేశారు. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర నాయకుడెవరూ గతంలో ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవు. రాజకీయ నాయకులు ప్రత్యర్థిని మాటల తూటాలతో, వాగ్బాణాలతో మట్టి కరిపించవచ్చు. తమ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టవచ్చు. ఎత్తులకు పైఎత్తులు వేయవచ్చి. కానీ, ప్రత్యర్ధులపై వ్యక్తిగత దూషణ, బురద జల్లడం చాలా దుర్భరమైనది, దురదృష్టకరమైనది.

         ఇలాంటి రాజకీయ నాయకులు గత వర్తమాన చరిత్ర నుండి రాజకీయ గుణపాఠాలు నేర్చుకోవాల్సిన ఆగత్యం ఎంతైనా వున్నది. మన దేశంలో కొందరు యువ-మధ్య వయస్సు నేతలు సహనం కోల్పోయిన సందర్భాల్లో, ప్రత్యర్థులపై అభ్యంతరకరమైన భాషతో మాటల దాడి చేసిన సందర్భాలలో, ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు జోక్యం చేసుకొని వారిని మందలించిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.

ఉదాహరణకు 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత, కేంద్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో, అప్పటి కేంద్ర పరిశ్రమలశాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ హైదరాబాద్ లో పర్యటించి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద జరిగిన సభల్లో ప్రసంగించారు. ఆ సందర్భంలో జార్జి ఫెర్నాండెజ్  ఇందిరాగాంధీని ‘నిరంతర అబద్ధాలకోరు’ అని విమర్శించారు. ఈ విషయం అప్పడు ప్రధానమంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ కు నిమిషాలలో వేగులవారి ద్వారా తెలిసింది. దీంతో మొరార్జీ జోక్యం చేసుకొని జార్జి ఫెర్నాండెజ్ ను సుతిమెత్తగా మందలించారు. ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల మాజీ ప్రధానిగా ఇందిరాగాంధీ గొప్పతనాన్ని, హుందాతనాన్ని, సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని తక్కువ చేసి మాట్లాడినట్లు అవుతుందని చెప్పారు. ‘నిరంతర అబద్ధాలకోరు’ అనేదానికి బదులుగా ‘ఇందిరాగాంధీ చాలా అరుదుగా నిజాలు మాట్లాడతారు’ అని సభ్యతగా అంటే బాగుంటుందని జార్ని ఫెర్నాండెజ్ కు సలహా ఇచ్చారు. అప్పట్లో ఈ విషయం పత్రికలలో ప్రముఖంగా వచ్చింది కూడా. ఆ రోజుల్లో రాజకీయాలంటే అలా ఉండేవి మరి. మొరార్జీ దేశాయ్ లాంటి అరుదైన రాజకీయ నాయకుల గొప్పతనం కూడా అలానే ఉండేది. ఆరోజులు మారాయి, మారుతున్నాయి!


         ఇంతెందుకు, గతేడాది మనదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనపుడు ప్రజలు సంఘటితమై దాన్ని ఎదుర్కోవాలని, సంఘటిత శక్తిని ప్రదర్శించడానికి కొవ్వొత్తులు వెలిగించాలని, పళ్లాలు గరిటెలు పట్టుకొని చప్పుళ్లు చేస్తూ సంఘీభావం ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దీంతో ఆయన్ను కొందరు ప్రతిపక్ష నాయకులు, వ్యక్తులు ఎగతాళి చేసి మాట్లాడారు. ఆ సందర్భంలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బహిరంగంగా వారి చర్యలను ఖండించారు. దేశ ప్రధానిని అలా విమర్శించడం ఎవరికీ తగదని హితవు పలికారు. ప్రధానిని అపహాస్యం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని కూడా డీజీపిని కోరారు. అలా మొరార్జీ తరహా లాంటి ఉన్నతుల వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి కేసీఆర్ ఎంతో హుందాతనంగా వ్యవహరించారు. రాజకీయాలలో ఆయన అరుదైన వ్యక్తిత్వం ఒక మినహాయింపు అనాలి.  

         ఇపుడు తెలంగాణలో ప్రతిపక్షం అంటే, అధికారంలో ఉన్న పక్షాన్ని అందరికంటే ఎక్కువగా తిట్లుతిట్టడం అనే స్థాయికి దిగజార్చారు జాతీయ పార్టీల్లో ఇపుడున్న కొందరు పెద్ద నాయకులు. అధికార పార్టీపై సహజంగా ఉండే కొద్దిపాటి వ్యతిరేకతను చూసి, అదే తమ బలం అనుకుంటున్నారు. తాము ఇంతకాలం ముఖ్యమంత్రిని ఇలా తిడుతుండబట్టే ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతున్నారని కూడా అనుకుంటున్నారు. ఇది వారి అవివేకం. ఇదే సమయంలో ఇలా మాట్లాడుతున్నా వ్యక్తి  మరొక అడుగు ముందుకేసి మాట్లాడుతూ, ’’ఈ ముఖ్యమంత్రి మా జాతీయపార్టీ నాయకత్వం ముందు నేలపై సాష్టాంగపడి మెప్పించినా, పొర్లుడు దండాలు పెట్టినా, మేం మాత్రం అతన్ని, అతని కుటుంబాన్ని వదిలిపెట్టం. అందరినీ జైలుకు పంపుతాం’’ అంటున్నారు.

అయితే, ఇతను వాడుతున్న భాష అదే జాతీయ పార్టీలోని మిగతా నాయకులను ఇబ్బంది పెడుతున్నది. అతడు ఏమాట జారినా, మీడియాకు పార్టీలోని వారంతా  ఏం సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితి వస్తుందో అనే సంశయం వారిలో నెలకొంది. ఇలా దూషిస్తున్న వ్యక్తి తమ పార్టీలోని రాజకీయాలకు అతీతమైన కొందరి నాయకుల నుండి ఇంకా ఏమీ నేర్చుకోకపోవడం కూడా పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే సమయంలో ఆ జాతీయపార్టీ అధినాయకత్వం కూడా ఇలా అనైతికంగా మాట్లాడున్న వ్యక్తిని నిశ్శబ్దంగా చూస్తుండటం దురదృష్టకరం. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అనారోగ్యకర పరిణామాలను అందరూ ఖండించాల్సిందే.

         గతంలో పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయి, పీవీ ప్రభుత్వాన్ని అనునిత్యం విమర్శించేవారు. కానీ, ఐక్యరాజ్య సమితి వద్ద కాశ్మీర్ సమస్యపై మాట్లాడేందుకు మన భారతదేశ ప్రతినిధిగా ప్రతిపక్ష నాయకుడు వాజ్ పేయినే నియమించి.. ఇదీ పీవీ ఠీవీ అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారాయన. అప్పటి రాజకీయ నాయకుల్లో పరస్పర గౌరవం అలా ఉండేది.  అయితే, అప్పుడు కూడా విమర్శలు మామూలే. నెహ్రూ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుడిగా వాజ్ పేయి పార్లమెంటు లోపలా, బయటా విమర్శిస్తూనే ఉండేవారు. జనతా ప్రభుత్వం హయాంలో నెహ్రూ చిత్రపటాన్ని విదేశాంగ మంత్రిత్వశాఖ కార్యాలయం నుంచి తొలగిస్తున్నపుడు, వాజ్ పేయి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, ఆ చిత్రపటాన్ని మళ్లీ అదే కార్యాలయానికి తీసుకెళ్లి అదేచోట పెట్టించాడు. ఇదీ పాలక, ప్రతిపక్షాల గౌరవం అంటే. ఇదే  ఈరోజు వరకూ వారి వ్యక్తిత్వాల గురించి మనమంతా మాట్లాడుకునేలా చేసింది.

మనదేశంలో ప్రధానమంత్రి, లేదంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రులు కొన్ని ముఖ్యమైన సమస్యలపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేయడం, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం మనం చూశాం. ఇందులో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజా ప్రయోజనాల కోసమే అయినప్పటికీ, రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష సమావేశాలు విజయవంతంగా జరిగేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒకానొక (వావిలాల గోపాల కృష్ణయ్య లాంటి వారున్నాప్పటి) రోజుల్లో ట్రెజరీ బెంచీలకు చెందిన మంత్రులు, విప్ లు ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్లి వారడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తే ప్రజోపయోగకరంగా వుంటుందో చర్చించిన సందర్భాలు వున్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో అధికార పార్టీ ప్రయత్నించినా, ప్రతిపక్షం సరైన స్ఫూర్తితో స్పందిస్తుందా అనే సందేహం ఉంది.

         ఒక రాజకీయ పార్టీ అస్తిత్వం దాన్ని నడిపే నాయకత్వం, వారు పనిచేసే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. నాయకత్వం సత్ప్రవర్తన, నైతికతతో ఉంటే వారు ప్రజల గౌరవాభిమానాలను పొందుతారు. దుర్భాష వినడానికి అత్యంత వినోదంగా అనిపిస్తుందేమో కానీ, ఆ భాషలో ప్రజా ప్రయోజనం ఉండదు. రాజకీయ ప్రత్యర్థులు అనుసరిస్తున్న విధానాలపైగానీ, ప్రజా సమస్యలపైగానీ విమర్శిచవచ్చు. కానీ, నిరాధారణమైన ఆరోపణలతో ప్రత్యర్థులను వ్యంగంగా పేరు పెట్టి పిలవడం, తిట్టడం, శరీరాకృతిని చూపుతూ అవహేళన చేయడం అనేవి ప్రజా జీవితంలో ఉండే నాయకులు ఏనాడూ అనుసరించకూడదు.

         అయితే, రాజకీయాల్లో సరిగ్గా, నైతికంగా ప్రవర్తించమని ఈ నోటిదురుసు నాయకులకు ఎవరు చెప్పాలి. అదే పార్టీలోని సీనియర్ నాయకులు మాత్రమే ఈ రకమైన నోటిదురుసు నాయకులకు సభ్యత, మర్యాద, మన్నన నేర్పాల్సి ఉంటుంది. తమ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎదురైన సమస్యలు, వాటిని పరిష్కరించిన తీరు ఎలా ఉండేదో చెప్పాలి. అలాంటి క్లిష్ట సమయాల్లో తాము సంయమనంతో వ్యవహరించిన విధానాన్ని కూడా చెప్పాలి. అపుడైనా ఇలాంటి నోటి దురుసు నాయకుల్లో. కొంత మార్పు ఉండొచ్చేమో. అయితే వారి సహజ ప్రవర్తనను వదిలి, సత్ప్రవర్తనతో మెదలాలని కోరితే మాత్రం వారు ఇష్టపడతారా? తొండి మాటలు, తిట్ల పురాణాలు తాత్కాలికంగా విజయంగా కనిపించినా, శాశ్వతంగా మన స్థాయిని దిగజార్చి, మనల్ని భూస్థాపితం చేస్తాయనే విషయాన్ని వారు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.  ఇదే సందర్భంలో, సాక్షాత్తూ సీఎం పదవినే కించపరుస్తూ, ఏకవచనంతో  మాట్లాడటం ఎంతవరకు సమంజసం, ఇంకెంత కాలం ఈ అనైతిక విమర్శలు? ఇంకెన్నాళ్లు ఈ తిట్లు, దండకాలు? అని కూడా తెలంగాణ ప్రజలు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

     రాజకీయాల్లో ఇంతవరకు ఎవరూ వాడని ఈ భాషను తాత్కాలికంగా ప్రజలు ఆసక్తిగా గమనిస్తారే తప్ప, ఆ భాష మాట్లాడిన వ్యక్తిని మాత్రం అభిమానించరు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారిని అసలే నమ్మరు. దీర్ఘకాలంలో వారిని ప్రజా నాయకుడిగా కూడా అంగీకరించరు. ఏదేమైనా ఆద్యతన భవిష్యత్తులో ఏది పార్లమెంటరీ భాషో, ఏది కాదో అనేది పునర్నిర్వచనం చేయాల్నేమో!!!

Sunday, January 10, 2021

శ్రీ రామాయణ కథా ప్రారంభం.. అయోధ్యా పుర వర్ణన ; శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-39 : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీ రామాయణ కథా ప్రారంభం.. అయోధ్యా పుర వర్ణన

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-39

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (11-01-2021)

సమస్త భూమండలాన్ని సంతోషకరంగా పరిపాలించిన చక్రవర్తులలో - రాజులలో, తన అరవై వేలమంది కొడుకులతో సముద్రాన్ని తవ్వించిన సగరుడినే, కడు పుణ్యాత్ముడిగా-చక్రవర్తి శ్రేష్ఠుడిగా పరిగణించాలి. మిగిలిన రాజులందరు అతడిని అనుసరించి నడుచుకున్నవారే. అలా ప్రసిద్ధికెక్కిన వారిలో మనువు కుమారుడు-ఇక్ష్వాకు మహారాజు వంశంలో పుట్టిన సగరాది రాజులలో భూమ్మీద అవతరించిన రఘురాముడి చరిత్రే రామాయణం. భూలోకవాసులందరూ పూజించాల్సిన గ్రంథం రామాయణం. ఈ వంశంలో పుట్టిన భగీరథుడు, బ్రహ్మను ప్రార్థించి - బ్రహ్మ లోకంలో వున్న గంగను భూలోకానికి దిగేటట్లు చేసి - దాన్ని పావనం చేస్తాడు. బ్రహ్మ అనుగ్రహానికి పాత్రుడైన వాల్మీకి మహర్షి, బ్రహ్మ లోకంలో వున్న రామాయణాన్ని, భూలోకవాసులను పవిత్రులను చేసేందుకు అవతరింపచేశాడు. స్వర్గ సుఖాన్ని మాత్రమే కలిగించేది గంగైతే, ఇహలోక సుఖాన్ని - స్వర్గలోక సుఖాన్ని - మోక్షాన్ని కూడా ఇవ్వగలిగేది రామాయణం. కాబట్టే, గంగకంటే కూడా రామాయణం కడు పూజనీయమైంది. కాలిగోటికి-పూర్ణ విగ్రహానికి ఎంత తేడా వుందో, గంగకు-రామాయణానికి అంత తేడా వుంది. తన వద్దకు వచ్చిన వారినే పవిత్రం చేయగలిగేది గంగైతే, నగర-నగరానికి, గ్రామ-గ్రామానికి, పల్లె-పల్లెకు, ఇంటింటికి పోయి, ప్రపంచమంతా వ్యాపించి తనను సేవించిన వారందరినీ పవిత్రులను చేయగలిగేది రామాయణం.

రామాయణం పఠించేవారు సాక్షాత్తు రామ సేవ చేసినట్లే. విధిగా వేదాధ్యయనం చేయాల్సిన బ్రాహ్మణుడు ఈ రోజుల్లో నూటికి-కోటికి ఒకడున్నాడో-లేడో. అలాంటి వారందరు రామాయణ పఠనం చేస్తే, వేద పఠనం చేసినట్లే. వాల్మీకి ఒక సామాన్య ఋషే కదా ! ఆయన రాసింది వేదం ఎలా అవుతుందన్న ప్రశ్న అసమంజసం. చెప్పింది వాల్మీకే అయినా, వెలువడింది బ్రహ్మ ముఖం నుండి. కాబట్టి తప్పక విని తీరవలసిందే. అసూయ వల్ల, అశ్రద్ధ వల్ల, సోమరి తనం వల్ల అలక్ష్యం చేసి వినకపోతే, పాపాత్ములతో సమానమవుతారు. వింటే సకల పాపాలు నశించిపోతాయి. రామాయణ పుణ్య కావ్యాన్ని లోకంలో వ్యాపింపచేసే అధికారం మాత్రమే వాల్మీకికి వుంది కానీ, రచనలో కాని-ఫల ప్రదానంలో కాని అధికారం లేదని వాల్మీకే స్వయంగా-స్పష్టంగా చెప్పుకుంటాడు. రామాయణ పఠనం పాపాలను హరించి వేయడమే కాకుండా, ధర్మ కాంక్ష కలవారికి ధర్మాన్ని- అర్థ కాంక్ష కలవారికి అర్థాన్ని - కామం అందు ఆశ కలవారికి కామాన్ని ఇవ్వగలదు. బ్రహ్మ తనకిచ్చిన అధికారంతో శ్రీరామ జననం మొదలు నిర్యాణం వరకు వివరిస్తానని, సంతోషంతో వినమని-తద్వారా శుభం కలుగుతుందని అంటూ రామ కథను ప్రారంభిస్తాడు వాల్మీకి.

సరయూ నదీతీరంలో వున్న కోసల దేశంలో, ఎక్కడ చూసినా ధనధాన్యాలు రాసులు-రాసులుగా ఇంటింటా పడివుండి, ఒకరి ధనాన్ని-ధాన్యాన్ని మరొకరు ఆశించాల్సిన అవసరం లేనటువంటి స్థితిగతులుండేవి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఆ దేశంలో ప్రజలంతా దేహ పుష్టి కలిగి, సుఖసంతోషాలతో వుండేవారు. ధనధాన్యాది సంపదలతో మిక్కిలి భాగ్యవంతంగాను - మనువు స్వయంగా నిర్మించినందున అందంగా, రమ్యంగాను - పన్నెండామడల పొడవు, మూడామడల వెడల్పు, వంకర టింకర లేని వీధులతోను - ఇరు ప్రక్కల సువాసనలు వెదజల్లే పుష్పాలను రాలుస్తున్న చెట్లతోను - దారినపోయే వారి కళ్లల్లో దుమ్ము పడకుండా తడుపబడిన రాజవీధులతోను అలరారుతుండే అయోధ్యా నగరమనే మహా పట్టణం ఆ కోసల దేశంలో వుండేది. చక్కగా తీర్చి దిద్దిన వీధి వాకిళ్లతోను - తలుపులతోను - వాకిళ్లముందు మంగళకరమైన పచ్చని తోరణాలు కట్టేందుకవసరమైన స్తంబాలతోను - నగరం మధ్యలో విశాలమైన అంగడి వీధులతోను - శత్రువులను ఎదుర్కొనేందుకు కావాల్సిన రకరకాల ఆయుధ సామగ్రినుంచిన భవనాలతోను-శిల్ప కళాకారుల సమూహాలతోను-వందిమాగధులు, సూతుల జాతివారితోను-శ్రీమంతులైన పండితులతోను-ఎత్తైన మండపాల పై కట్టిన ధ్వజాలతోను-భయంకర శతఘ్నుల ఆయుధాలతోను-నాట్యమాడే స్త్రీ సమూహాలతోను-తియ్య మామిడి తోపులతోను, అందాలొలికే అయోధ్యా పురం "లక్ష్మీ పురం" నే మరిపించేదిగా వుంది. "అయోధ్యా పురి" అనే ఆ స్త్రీ నడుముకు పెట్టుకున్న ఒడ్డాణంలా వున్న ప్రాకారం, అగడ్తలు, మితిమీరిన సంఖ్యలో వున్న గుర్రాలు, లొట్టిపిట్టలు, ఆవులు, ఎద్దులు, ఏనుగులు, అనుకూలురైన సామంత రాజులు, కప్పం కట్టే విరోధులైన విదేశీ రాజులు, కాపురాలు చేస్తున్న నానా దేశ వ్యాపారులు, విశేష ధనవంతులైన వైశ్యులు, నవరత్న ఖచితమైన రాజుల ఇళ్లు, చంద్రశాలలున్న అయోధ్యా నగరం స్వర్గ నగరమైన అమరావతిని పోలి వుంది.


నవరత్నాలతో చెక్కబడి విమానాకారంలో కట్టిన ఇళ్లతోను-ఇంటినిండా ఆరోగ్యవంతులైన కొడుకులు, మనుమలు, మునిమనుమలు, మనుమరాళ్లు, వయో వృద్ధులతోను-ఎత్తుపల్లాలు లేకుండా భూమిపై కట్టిన గృహాల్లో పుష్కలంగా పండిన ఆహార పదార్థాల నిల్వలతోను-ఇంటింటా వున్న ఉత్తమ జాతి స్త్రీలతోను - నాలుగు దిక్కులా వ్యాపించిన రాచ బాటలతోను-వాటి మధ్యనే వున్న రాచగృహాలతోను నిండి వున్న అయోధ్యా నగరం జూదపు బీటలా వుంది.(నగరం మధ్యన రాజగృహం, అందులో కట్టడాలు, గాలి వచ్చేందుకు విడిచిన ఆరుబయలు,నలుదిక్కుల రాచబాటలుండడమంటే చూసేవారికి జూదపు బీటలా వుంటుందని అర్థం).

నగరంలోని నీళ్లు చెరకు పాలల్లా తియ్యగా - తేలిగ్గా - మంచి ముత్యాల్లా కనిపించే లావణ్యం లాంటి కాంతితో వున్నాయి. మద్దెలలు, వీణలు, ఉడకలు, పిల్లన గ్రోవులు, సుందరీమణుల కాలి అందియలు-వీటివల్ల కలిగే ధ్వనులు ఆహ్లాదకరంగా వుండేవి. ఎల్లప్పుడు ఆటపాటలతో, ఉత్సవాలతో, అలంకరించుకున్న స్త్రీలతో, ఆహ్లాద భరితంగా వుండేదా వూరు. ఘోర తపస్సు చేసి సిద్ధిపొందిన వారికి మాత్రమే లభించే స్వర్గంలోని విమానాకార ఇల్లు, అయోధ్యా నగర వాసులకు ఏ కష్టం లేకుండా దొరికాయి.

ఆ నగరంలోని శూరులు అడవులకు వేటకు పోయేటప్పుడు, సింహాలను-అడవి పందులను-ఖడ్గ మృగాలను, ముఖాముఖి కలియబడి తమ భుజ బలంతో-శస్త్ర బలంతో-ఒకే ఒక్క వేటుతో చంపగలిగే గొప్పవారు. అయినప్పటికీ, ఆయుధం లేకుండా-సహాయం చేసేవారు లేకుండా-ఒంటరిగా చిక్కిన బలవంతుడైన శత్రువును కూడా క్షమించి విడిచిపెట్టగల దయా గుణమున్న శూరులు. భయంతో దాగిన వారినికూడా వదిలి పెట్తారు. అయోధ్యా పురంలోని బ్రాహ్మణులందరు అవిచ్ఛిన్నంగా అగ్నిహోత్రం కలిగుండే వారే - శమ దమాది గుణ సంపన్నులే - ఆరంగాలతో, నాలు వేదాలను అధ్యయనం చేసిన వారే - సత్య వాక్య నిరతులే - వేలకొలది దానాలు చేసిన వారే - గొప్ప మనసున్న వారే. వీరందరు సామాన్య ఋషులైనా, గృహస్తులైనా, నగర వాసులైనా, అడవుల్లో వుండే ఋషులకు సమానమైన వారు.

(భగవంతుడు అక్కడ పుట్టినందువల్లే, ఆ పుణ్య నగరం "అయోధ్య" గా కీర్తించబడింది. భగవంతుడైన విష్ణువు ఎక్కడుంటాడో, అదే పరమ పదం-ఆయన సేవే మోక్షం-అదే సర్వ కర్మలను ధ్వంసం చేస్తుంది. అయోధ్యలో మహా విష్ణువు పుట్టినందువల్లే మనుష్యులందరు ముక్తులయ్యారని శివుడు పార్వతికి చెప్పాడు).

శ్రీరాముడు వాలిని చంపడం అధర్మమా? : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరాముడు వాలిని చంపడం అధర్మమా?

వనం జ్వాలా నరసింహారావు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదివారం (10-01-2021) ప్రసారం  

         శ్రీరాముడి బాణం దెబ్బకు వాలి నేలమీద పడిపోయినప్పుటికీ, ఆయన తేజం కాని, పరాక్రమం కానీ, ప్రాణాలు కానీ విడువలేదు. ఇంద్రుడు ఇచ్చిన ఆయన మెడలోని బంగారు సరం వాలి తేజస్సు, ప్రాణాలు, పరాక్రమం, కాంతి పోకుండా కాపాడాయి. బంగారు సరంతో, ప్రాణాలు తీస్తున్న బాణంతో, నిర్మలమైన శరీరంతో వాలి మూడురంగుల ప్రకాశించాడు. శత్రువులను సంహరించే శక్తికల వాలికి, స్వర్గానికి పంపే శక్తికల రామబాణం ముక్తిని కలిగించింది. తాను నేలపడేసినవాడెలాంటివాడో చూడాలనుకుని వాలిని సమీపించాడు శ్రీరాముడు. తనను సమీపించిన రామచంద్రుడిని చూసిన వాలి ధర్మంతో, వినయంతో కూడిన, కఠినమైన మాటలతో ఇలా అన్నాడు.

         “రామా! నువ్వు రాజకుమారుడివి. శాస్త్రజ్ఞానం చక్కగా తెలిసనవాడివి. గొప్పవంశంలో పుట్టావు. కీర్తికి నువ్వు నెలవైనవాడివి. ఇలాంటివాడివై వుండి కూడా యుద్ధభూమిలో నేను ఇతరులతో యుద్ధం చేస్తున్న సమయంలో, చాటున వుండి నా రొమ్ముమీద కొట్టడంలో ఏం గొప్ప వుందో చెప్పు. రామచంద్రా! రాముడు కరుణాజ్ఞానం కలవాడనీ, ప్రజల మేలు కోరేవాడనీ, దయాలక్ష్మికి స్థానమైనవాడనీ, ఉచితానుచితజ్ఞానం కలవాడనీ లోకులు నిన్ను పొగడుతుంటారు. తార నన్ను యుద్ధానికి పోవద్దని, సుగ్రీవుడికి సహాయంగా రాముడు వచ్చాడనీ, ఆయన నన్ను చంపుతాడనీ చెప్పినా వినకుండా వచ్చాను. రాజులకుండే ఉచితమైన సద్గుణాలు రాముడిలో లేకపోతాయా, నన్నేల నిరపరాధిని చంపుతాడని వచ్చాను. నీ చేతుల్లో చచ్చాను. నేను అంటున్న రాజగుణాల్లో ఒక్కటికూడా నీలో లేదు. నువ్వేం రాజువి? సుగ్రీవుడు చెప్పాడని తొందరపడి, కోపగించి, గుణదోషాల విచారణ చేయకుండా, ఇతరులతో యుద్ధం చేసేవాడిని ఎలా చంపాలి? అన్న ఆలోచన చేయక, ధర్మచింతన చేయక, ఎదురుపడి యుద్ధం చేసే ధైర్యం లేక, సత్యాసత్యాలు తెలుసుకోకుండా, పిరికివాడిలాగా దూరంగా మాటువేసి, నీకే అపకారం చేయని నన్ను దండించావు కదా? నువ్వు మోసగాడివి అని తార తెలుసుకుంది కాని నేను తెలుసుకోలేక పోయాను”.

         “రాముడు గొప్పవంశంలో పుట్టాడు కాబట్టి గొప్ప గుణాలు కలవాడై వుంటాడనీ, కళ్యాణ గుణాల మనోహరుడు కాబట్టి హేయ కార్యాలు ఎందుకు చేస్తాడనీ, నేను ఇతరులతో యుద్ధం చేస్తున్నప్పుడు నామీదకు ఎలా వస్తాడనీ, నన్నెందుకు చంపుతాడనీ, ఇలాంటి అకార్యం ఎందుకు చేస్తాడనీ భావించి, నీ ముఖం ఎన్నడూ చూడని కారణాన మోసపోయి ఈ విధంగా యుద్ధానికి వచ్చి నీచేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాను. రాజవేషం ధరించిన పాపపు నడవడికలవాడివి నువ్వు. మాయలమారివి. ఈ వాస్తవం తెలుసుకోలేక బుద్ధిహీనతవల్ల ఇలా అయిపోయాను. నీకు నామీద కలహకారణం లేదు. అడవుల్లో వుండి మా ఇష్టప్రకారం ఏదో ఆ వేళకు దొరికిన కాయకూరలు తింటూ బతికే కోతులం. కాబట్టి నీకూటికి అడ్డం రాలేదు. ఇలాంటి నన్ను యుద్ధం చేస్తున్న సమయంలో చంపడానికి కారణం ఏంటి? రాజుల వంశంలో పుట్టి వేదాలను అధ్యయనం చేశావే? ఎందుకీ విధంగా ధర్మాత్ములు ధరించాల్సిన వేషాలు వేసుకుని లోకులకు కీడైన క్రూర కార్యం చేయతలపెట్టావు?”.

         “మేం అడవుల్లో తిరిగేవాళ్ళం. మీరు నగరాల్లో తిరిగేవారు. మేం పండ్లు, కందమూలాలు తిని జీవించే మృగాలం. మీరు ఇష్ట మృష్టాన్నాలు తింటారు.  నేనేమో మృగాన్ని. నువ్వో మనుష్యుడివి. నేను నీ సేవకుడిని. నువ్వు రాజైనా బుద్ధిలేనివాడివయ్యావు. రాజులైనవారు ధర్మవశులై నడచుకోవాలికాని మేమే ప్రభువులం, మేమెలా చేసినా కాదనేవారెవరు? అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదు. నువ్వేమో ఇంద్రియాల వల్ల కలతచెంది, కామమే సర్వకాల-సర్వావస్తలలో ముఖ్యమని భావిస్తూ, అది నెరవేరకపోతే కోప్పడుతూ, చెడు-మంచిరాజుల మిశ్రమ నడవడికలవాడివై ప్రవర్తిస్తున్నావు. దానివల్ల నువ్వు మంచివాడివో, చెడ్డవాడివో మాలాంటి వాళ్లకు అర్థం కావడం లేదు. నిన్ను శిష్టుడవని నమ్మలేం, దుష్టుడవని అనలేం. విల్లే ప్రధాన సాధనంగా తలచి, కలహానికి కాలుదువ్వుతూ, బలవంతుడినన్న గర్వంతో, ధర్మం విడిచి మర్యాద వదిలావు”.

         ”ధర్మం రక్షించడంలో నీకు విశ్వాసం లేదు. ధర్మరక్షణ వ్యర్థమని నీ అభిప్రాయం. కోరికల మీద మనసు పోనిచ్చి, ఇంద్రియాలకు వశపడి , అవి ఎలా ఈడుస్తే అలా పోతున్నావు. నీ విషయంలో నేను ఏ రకమైన దోషం చేయలేదు. ఇలాంటి నిరపరాధిని నన్ను నీ బాణంతో చంపావు. ఈ నింద పోవడానికి సజ్జనుల సభలో నువ్వేమని సమాధానం చెప్తావు? నువ్వు రాజవంశంలో పుట్టతగిన వాడివికాదు. రామచంద్రా! ఏం మగవాడివయ్యా? నీ మగతనం నీ భార్యను అపహరించిన వాడిమీద చూపలేకపోయావు కాని, నీజోలికి రాకుండా తటస్థుడిగా వున్న నామీద చూపావుకదా! రామా! నా కంటి ఎదురుగా నిలబడి నువ్వు నాతో యుద్ధం చేస్తే నిన్ను నేను నిమిషంలో రుద్రభూమికి పంపేవాడిని కదా? నేనెంత శౌర్యం కలవాడినైనా చాటుగా వుండి విడిచిన నీ బాణం వల్ల చావాల్సి వచ్చింది కదా?

         “రామా! నీ కథ నాకు కొంచెమైనా చెప్పలేదు. చెప్పినట్లయితే, నువ్వే కారణాన సుగ్రీవుడు కోరిక తీర్చడానికి నన్ను చంపావో, ఆ కపటచిత్తుడైన రావణుడిని యుద్ధంలో కొట్టి, మెడలు వంచి పట్టుకుని, ఇక్కడికి ఈడ్చుకుంటూ తీసుకొచ్చేవాడినికదా? సీతను ఒక్కపూటలో తీసుకునిరానా? గోటితో పోయేదానికి గొడ్డలిని వెతికావుకదా? నా మరణానంతరం తండ్రి రాజ్యభాగంలో అర్హుడైన సుగ్రీవుడు నన్ను ఆ రాజ్యం కొరకు చంపడం న్యాయమే. కాని, ఏ సంబంధంలేని నువ్వు వక్రమార్గంలో నన్ను చంపావు. ఇది తమస్సుతో చేసింది. అధర్మమైనది”.

         అని, నోరు ఎండుతుంటే, బాణం బాధతో శరీరమంతా మండుతుంటే, బాధ సహించలేక శ్రీరాముడిని వూరికే చూసుకుంటూ తేజోహీనుడై వాలి పడిపోయాడు.  వాలి తనను దూషించిన వాక్యాలకు శ్రీరామచంద్రుడు సమాధానం చెప్పాడు. దీనికొరకే వాలి వెంటనే మరణించే విధంగా బాణం వేయకుండా కొన ఉపిరి వుండేట్లు వేశాడు రాముడు. వాలి చనిపోయేట్లు బాణం వదులుతే రామచంద్రమూర్తి వాలిని వధించడానికి కారణం తెలియక లోకులు ఆయన్ను పలురకాలుగా నిందించి వుండేవారు. రాముడు తగిన సమాధానం చెప్పినప్పటికీ కొందరు దుష్టులు ఇప్పటికీ ఆయన్ను నిందిస్తూనే వున్నారు కదా!

         ధర్మార్థయుతంగా, హితంగా, కఠినంగా, అవివేకంగా వాలి పలికిన మాటలకు, ధర్మార్థ గుణ సహితంగా రామచంద్రమూర్తి ఇలా అన్నాడు. “ఓయీ! ధర్మమని, అర్థమని పలికావు. సంతోషమేకాని ధర్మం ఏవిధంగా ఆచరిస్తే పురుషార్థమవుతుంది? ఎప్పుడు అది పురుషార్థం కాదు? అర్థం, కామం ధర్మంతో కూడి వుండేట్లు చేయాల్నా? ఈ విషయం నువ్వు ఆలోచించావా? పోనీ కుల సంప్రదాయం అంటావా? శాస్త్ర విషయంలో సందేహం వస్తే శిష్టాచారం కదా ప్రమాణం? అది ఎలా వుందో ఆలోచించావా? ఏ ఆలోచన చేయకుండా పిల్లతనంగా నన్ను దూషిస్తే నీకు కలిగే లాభం ఏమిటి? పోనీ నువ్వు అడవిలో వుండేవాడివు కాబట్టి నీకు ధర్మశాస్త్రం ఎలా తెలుస్తుందంటావా? తెలుసుకోక పోవడం నీ తప్పు. (ignorance of law no excuse). నువ్వు కులగురువులనో, కులంలో పెద్దలనో, శాస్త్రం తెలసిన పండితులనో, ఆచార శుద్ధులనో అడిగావా? ఎందుకు అడగలేదు? ఇదంతా ఆలోచించకుండా నన్ను దూషిస్తే లాభం ఏంటి?”.

         “ఓయీ! కొండలతో, అడవులతో, తోటలతో, తోపులతో కూడిన ఈ భూమంతా ఇక్ష్వాకుల కాలం మొదలు ఇప్పటిదాకా మా వంశంలో పుట్టిన రాజులదని నీకు తెలుసా? ఈ కారణాన నువ్వు ఇక్ష్వాకు వంశంవారికి సామంతరాజువేకాని స్వతంత్ర ప్రభువువు కాదు. ఇలా వాళ్లు సార్వభౌములైనందువల్ల వారి రాజ్యంలోని సమస్త జనులను, మృగాలను, పక్షులను కూడా రక్షించడానికి, శిక్షించడానికి వారికి అధికారం వుందని తెల్సుకో. ధర్మరక్షణ కొరకు తిరిగే మేం స్వధర్మాన్ని తప్పకుండా భూమ్మీదకల అధర్మాత్ములను భరతుడి ఆజ్ఞమేరకు దండిస్తాం. నువ్వు ధర్మాన్ని వదిలి కఠినమైన, నింద్యమైన కార్యం చేస్తూ అధర్మయుక్తమైన కామాన్నే ప్రధానంగా స్వీకరించి రాజధర్మాన్ని తప్పావు. ఇది నీకు తగునా? నిన్ను చంపిన కారణం చెప్తా విను. సజ్జనులు శ్లాఘించే సనాతన ధర్మాన్ని వదిలి నీ తమ్ముడు బతికుండగా అతడి భార్యను, నీ కోడలి లాంటి రుమను నువ్వు పాపమార్గంలో దుష్కామంతో పొందావు. నీతమ్ముడి భార్యను నువ్వు చెరిచిన కారణాన నిన్నీవిధంగా చంపాల్సి వచ్చింది”.

“నిన్ను దండించడానికి నేనెవర్ని అంటావేమో? చెప్తా విను. నేను క్షత్రియుడుగా పుట్టాను. సనాతన ధర్మాన్ని ‘క్షతమ్’ (చెడి పోకుండా) కాకుండా రక్షించే వాడే క్షత్రియుడు. కాబట్టి ధర్మరక్షణ అనేది నాకు పుట్టుకతో వచ్చిన అధికారం. నేను సింహాసనం అధిష్టించినా, అధిష్టించకున్నా ఈ కార్యం నాకు తప్పదు. అది తప్పితే నేను నా స్వధర్మాన్ని తప్పినట్లే. ధర్మరక్షణ విషయంలో నాకెక్కువ అధికారం వుంది. రాజకుమారుడినైన నేను ధర్మాన్ని లక్ష్యం చేయకుండా కామమే ప్రధానంగా చేసుకుని అతిపాపం చేస్తున్న నిన్ను ఎలా క్షమిస్తాను? ఎలా సహిస్తాను? ఇది సాధ్యమా? నా భార్యను రావణుడు ఎత్తుకుని పోవడం అధర్మమని కదా నువ్వు వాడిని కొట్టి తెస్తానన్నావు. అలాగే పరుడి భార్యను, అదీ తమ్ముడి భార్యను, కోడలులాంటి దానిని పూర్తిగా చెరిచిన నిన్ను ఏం చేయాలో నువ్వే చెప్పు?”.

         “వాలీ! నా మనసులో లక్ష్మణుడు ఎలాగో స్నేహం విషయంలో సుగ్రీవుడు అలాంటివాడే. నావల్ల సుగ్రీవుడికి కలిగే లాభం ఏంటి అంటావా? లక్ష్మి, భూమి, భార్య. అతడి వల్ల నాకు కలిగే లాభం సీతను వెతకడం. ఆ పని అతడు చేయగలడు. మా స్నేహంవల్ల నాక్కావలసింది నాకవుతుంది, అతడికి కావాల్సింది అతడికి దక్కుతుంది. ఇలాంటి స్నేహాన్ని ఏ కారణాన ఉపేక్ష చేసి నీతో స్నేహం చేయమంటావు? ఇంతకంటే ఎక్కువ మేలు నువ్వేం చేస్తావు నాకు? నీ భార్యను హరించిన వాలిని చంపుతానని, వానర రాజ్యాన్ని, ఆయన భార్యను ఆయనకు అప్పగిస్తానని సుగ్రీవుడికి మాట ఇచ్చాను. ఈ మేరకు వానరుల సమక్షంలో ప్రతిజ్ఞ చేసాను. అలా నిండు మనస్సుతో ప్రమాణం చేసి మాట తప్పవచ్చా? కాబట్టి నా స్నేహితుడి కార్యసాధన కొరకు కూడా నిన్ను చంపాను. నువ్వు నిర్దోషివైనా, నా స్నేహితుడుకి విరోధివైనందున నాకు కూడా నువ్వు విరోధివే. నిన్ను చంపడానికి అనేక కారణాలున్నాయి. నువ్వు తనకు విరోధివని సుగ్రీవుడు చెప్పినంత మాత్రానే నేను నమ్మి నిన్ను చంపలేదు. నా కళ్లముందర నా స్నేహితుడు, నా ఆశ్రితుడు, నాకు శరణాగతుడు వేరేవాళ్ల చేతిలో చంపబడడం నేను అలా చూస్తూ సాక్షిగా వుండడం ధర్మమా?”.

ఇలా వాలికి అనేక రకాలుగా ధర్మ శాస్త్ర వాక్యాలను చెప్పాడు శ్రీరాముడు. శ్రీరాముడి మాటలకు సమాధానపడి తనను క్షమించమని కోరాడు వాలి. చెప్పినదంతా సత్యమనీ, దాంట్లో కొంచెమైనా సందేహం లేనేలేదనీ, జ్ఞానం లేకపోవడంతో తానేదేదో అన్నాననీ,  తన్ను క్షమించమనీ,  తానూ ఆయన చేతిలో యుద్ధంలో చనిపోయి ఉత్తమలోకాలకు పోతున్నాననీ,  తన మరణానికి నేను చింతించననీ,  సుగ్రీవుడి మీద ఏ ప్రేమ వుంచాడో ఆ ప్రేమ అంగదుడిమీద కూడా వుంచమనీ అన్నాడు.

         ఇలా చెప్పిన వాలిని సమాదానపర్చాడు రాముడు. “నువ్వు  పాపకార్యం చేశావు కాబట్టి నేను నిన్ను దండించాను. దానివల్ల నువ్వు పాపరహితుడివై ఈ దేహాన్ని విడిచి నిర్మలమైన దేవతాస్వరూపాన్ని ధర్మ మార్గంలో పొందేవాడివయ్యావు. నిన్ను దండించకపోతే నువ్వు నరకానికి పోయేవాడివి. నేను నిన్ను చంపడం ఏమాత్రం అధర్మం కాదు” అన్నాడు. “రామచంద్రా! మహానుభావా! నువ్వు ప్రయోగించిన వాడి బాణం నిప్పులాగా నన్ను కాలుస్తుంటే, ఆ బాధతో తెలివిహీనుడనై నిన్ను తిట్టాను. రామచంద్రా! నన్ను క్షమించు” అన్నాడు వాలి. అలా అంటూనే కొన ఊపిరితో నేలకొరిగాడు. (వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)