Saturday, May 29, 2010

VII-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-7): వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-7
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

గతంలో ప్రభుత్వ పరంగా (దివంగత) ముఖ్యమంత్రి తో సహా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారుల వరకు, వారి అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశాలకు, ఫిబ్రవరి 4, 2010 న ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశానికి "ప్రభుత్వానికి ఇ.ఎం.ఆర్.ఐ పనితీరు పట్ల అవగాహనకు సంబంధించి" స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఒక్కమాటలో చెప్పుకోవాలంటే, అప్పటి-ఇప్పటి సమీక్షా సమావేశాల మధ్య "నమ్మకం-అపనమ్మకం", "విశ్వాసం-వంచన" కు మధ్య ఎంత తేడా వుంటుందో అంత తేడా వున్నదని చెప్పొచ్చునేమో ! ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు ఇంతకంటే "పెను సవాలు" మరోటి లేదు. ఈ పరిస్థితిలో-ఆలోచనా ధోరణిలో మార్పురానంత కాలం అత్యవసర సహాయ సేవల అమలు గతంలో మాదిరి జరిగే అవకాశం లేదు. అటు ప్రభుత్వం, ఇటు ఇ.ఎం.ఆర్.ఐ అధికారులు ఆ దిశగా ప్రభుత్వం నియమించిన కమిటీతో తమ ఆంతరంగాన్ని అరమరికలు లేకుండా ఆవిష్కరించే ప్రయత్నం చేసితీరాలి. ఇరువురు భాగస్వాముల మధ్య "విశ్వాసం"-"నమ్మకం" కలగడం ముఖ్యం గాని కమిటీ సిఫార్సులు ముఖ్యంకానేకావు. అలాంటి (లోగడ వున్న మాదిరిగానే) విశ్వాసం-నమ్మకం ఇరువురు భాగస్వాముల మధ్య పునరుద్ధరించడానికి అవసరమైన తక్షణ చర్యలకు ప్రభుత్వం నియమించిన కమిటీ శ్రీకారం చుట్టడం ప్రధానం. అది జరక్కుండా, కాలయాపనకు దారితీసే "ప్రత్యామ్నాయాలను" ప్రతిపాదించడమే జరిగితే భవిష్యత్ లో 108-అత్యవసర సహాయ సేవలు కొనసాగినప్పటికీ, నాణ్యతా లోపం-పౌరులకు గతంలో మాదిరి సేవలు లభ్యం కాకపోవడం తప్పదేమో !

ఇ.ఎం.ఆర్.ఐ సంస్థతో మూడున్నర సంవత్సరాలు అనుబంధం వున్న వ్యక్తిగా, "ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియ" ఆవిర్భావం నుంచి ఆరోహణ వరకు-ఉన్నత శిఖరాలకు చేరుకోవడం దాకా, నా వంతు (ప్రధాన?) భూమిక నిర్వహించిన వ్యక్తిగా, ఇ.ఎం.ఆర్.ఐ సమకూరుస్తున్న 108-అత్యవసర సహాయ సేవల విషయంలో ఆ సంస్థపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఒకప్పుడున్న "నమ్మకానికి-విశ్వాసానికి" సంబంధించిన ఒకటి-రెండు అంశాలను పేర్కొంటానిక్కడ.

రామలింగ రాజు గారి సారధ్యంలో ఆగస్టు నెల 2005 లో 108-అత్యవసర సహాయ సేవలను ఆరంభించిన రోజుల్లోనే (ఆ పాటికే రాష్ట్ర ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ మధ్య మొదటి అవగాహనా ఒప్పందం కూడా కుదిరింది), ఒక వైపు ఇ.ఎం.ఆర్.ఐ ని "రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర సహాయ సేవలందించే" “నోడల్ ఏజన్సీ” గా గుర్తించిన ప్రభుత్వం, మరో వైపునుంచి అదే తరహా సేవలకు, కుటుంబ సంక్షేమ శాఖ నేతృత్వంలో శ్రీకారం చుట్టింది. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కార్యక్రమం కింద, కేంద్ర ప్రభుత్వ నిధులతో, రాష్ట్రంలోని ఎంపిక చేసిన నాలుగు జిల్లాల్లో-ఐ.టీ.డి.ఏ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా "గ్రామీణ అత్యవసర రవాణా పథకం" పేరుతో 122 అంబులెన్సులను ప్రవేశపెట్టింది. ఇ.ఎం.ఆర్.ఐ అధికారులు ఆ పని తమకు అప్ప చెప్పమని అడిగినా నాటి కుటుంబ శాఖ కమీషనర్, ఐఎఎస్ అధికారి శ్రీ చిట్టా బాల సత్య వెంకట రమణ, అంగీకరించలేదు. అచిర కాలంలోనే ఇ.ఎం.ఆర్.ఐ హైదరాబాద్ తో ప్రారంభించి, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాల్లోను-పట్టణాల్లోను (50 కి పైగా) సొంత ఖర్చుతో 70 అంబులెన్సుల ద్వారా అత్యవసర సహాయ సేవలందించడం, ఆ సేవలకు జాతీయ-అంతర్జాతీయ గుర్తింపు రావడం జరిగింది. ఏ కమీషనరై తే (శ్రీ సీ.బి.ఎస్. వెంకట రమణ) "అనుభవం" లేదన్న కారణాన మొదటి దశ 122 అంబులెన్సులను ఇ.ఎం.ఆర్.ఐ కి అప్పగించడం కుదరదన్నా రో, అదే కమీషనర్, మిగిలిన 18 జిల్లాల్లో ప్రవేశ పెట్టదలిచిన 310 అంబులెన్సుల నిర్వహణ బాధ్యత అదే ఇ.ఎం.ఆర్.ఐ కి "అత్యంత నమ్మకంతో-విశ్వాసంతో" అప్పగించారు. అదో చారిత్రాత్మక నిర్ణయం. వాస్తవానికి అలనాటి కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సీ.బి.ఎస్. వెంకట రమణ గారి "నమ్మకం-విశ్వాసం" తో కూడుకున్న సాహసోపేత నిర్ణయమే ఈ నాటి రాష్ట్ర వ్యాప్త అత్యవసర సహాయ సేవలకు పునాది-నాంది. ఏమైందానాటి "నమ్మకం-విశ్వాసం" ? లోపం ఎవరిది ? ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం వుంది.

310 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతను ఇ.ఎం.ఆర్.ఐ కి అప్పగించడంలో సీ.బి.ఎస్ వెంకటరమణ గారి చొరవ-వేగం తో సరిసమానంగా ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం కూడా చొరవ తీసుకున్నట్లయితే, కనీసం నెల రోజుల ముందే రెండో ఎంఓయు పై సంతకాలు చేయడం జరిగేది. ఆ నిర్వహణ బాధ్యతను స్వీకరించడానికి ప్రభుత్వం ఇ.ఎం.ఆర్.ఐ విషయంలో ప్రదర్శించిన "విశ్వాసం-నమ్మకం", అంతే మోతాదులో, మొదట్లో ఇ.ఎం.ఆర్.ఐ ప్రదర్శించలేదు. బహుశా చైర్మన్ రాజు గారు ఆ విషయంలో వెంకట్ గారి కంటే వేగంగా స్పందించారని నా అభిప్రాయం. సీ.బి.ఎస్ గారు అంచెలంచెలుగా ఎంఓయు దశకు తీసుకొచ్చిన విధానం ముందు-ముందు వివరంగా తెలుసుకుందాం.

సెప్టెంబర్ 19, 2006 న ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ అప్పటి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ పి. కె. అగర్వాల్ పేరుతో విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (జీ.ఓ.ఆర్.టీ 1242) లో పేర్కొన్న అంశాలు "నమ్మకానికి-విశ్వాసానికి" మొదటి ఉదాహరణ. "మాతా శిశు సంరక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీ స్త్రీలను, పసి పిల్లలను, అవసరమైనప్పుడు అత్యవసర వైద్య సహాయం కొరకు, సమీప ఆసుపత్రికి చేర్చేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా యూరోపియన్ కమీషన్ సహకారంతో, గ్రామీణ అత్యవసర ఆరోగ్య రవాణా సేవలను ఆరంభించింది. అదే పధకాన్ని మిగిలిన అన్ని జిల్లాలకు పొడిగించాలని కుటుంబ శాఖ కమీషనర్ ప్రతిపాదన పంపారు. అందువల్ల మరో 310 అంబులెన్సుల ద్వారా మిగిలిన 19 జిల్లాల్లో అత్యవసర ఆరోగ్య రవాణా సేవలను అందించేందుకు అలాంటి సేవలందించడంలో ’గుర్తింపు తెచ్చుకున్న’ ఇ.ఎం.ఆర్.ఐ సంస్థను నోడల్ ఏజెన్సీగా నియమించాలని కమీషనర్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించి, కమీషనర్ ను తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అనుమతించింది" అని ఆ ఉత్తర్వులో పేర్కొంది ప్రభుత్వం. ఆ తర్వాత రెండు రోజులకు (22-09-2006 న) అప్పటి ఆర్థిక-ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి రోశయ్య గారి సమక్షంలో అవగాహనా ఒప్పందం (ఎంఓయు) పై కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వెంకట రమణ, ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ సంతకాలు చేశారు. పూర్తిగా తన స్వయం పర్యవేక్షణ కింద (నా సమక్షంలో) తానే తయారుచేసిన అవగాహనా ఒప్పందం "అవతారిక"లో ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ గురించి రాసిన వాక్యాలు ఆ సంస్థమీద ప్రభుత్వానికి అప్పట్లో వున్న"నమ్మకానికి-విశ్వాసానికి" అసలు-సిసలైన మచ్చుతునకలు. "ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, అంబులెన్స్ సేవలతో సహా అన్నిరకాల నాణ్యతా పరమైన అత్యవసర సహాయ సేవలందించడంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయంగా ఆ రంగంలో ప్రఖ్యాతి చెందిన ఏజెన్సీల తోడ్పాటుతో, సత్యం కంప్యూటర్ సంస్థ సాంకేతికపరమైన భాగస్వామ్యంతో ఆ సేవలను అమలుపరుస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ సంస్థను రాష్ట్ర స్థాయి నోడల్ ఏజన్సీగా ప్రభుత్వం నియమిస్తున్నది" అని రాయడం-అదీ సంస్థ సేవలను అందించడం మొదలైన ఏడాది లోపునే అలా సంస్థను ప్రశంసించడం మామూలు విషయం కాదు. ఎంఓయు పూర్వ రంగంలో అలనాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ జంధ్యాల హరినారాయణ, అగర్వాల్ కు ముందున్న ఆరోగ్య వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ఐ.వి.సుబ్బారావు, ఉప కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్, ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కావడానికి-అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేయడానికి చేసిన కృషి-తీసుకున్న చొరవ కూడా "నమ్మకానికి- విశ్వాసానికి" ఉదాహరణలు. అదే అగర్వాల్ గారి "నమ్మకాన్ని-విశ్వాసాన్ని" నాలుగేళ్ల తర్వాత ఇ.ఎం.ఆర్.ఐ కోల్పోవడానికి బలవత్తరమైన కారణాలుండి తీరాలి. అవి విశ్లేషించాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానికి-ఇటు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ అధికారులకు వుంది.

ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంలో నిర్వహిస్తున్న 108-అత్యవసర సహాయ సేవల పటిష్ఠ అమలుకు ప్రభుత్వం ప్రదర్శించిన "విశ్వాసానికి- నమ్మకానికి" మరో మచ్చుతునక, జులై 12, 2007 న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె. హరినారాయణ, నాటి ఆరోగ్య-వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి పరిశీలనార్థం పంపిన వివరణ. ఆ వివరణ పూర్వ రంగంలో ఇ.ఎం.ఆర్.ఐ-ప్రభుత్వం మధ్య కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు, అప్పటికి సరిగ్గా నాలుగు నెలల క్రితం (8-2-2007 న) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన "ఇ.ఎం.ఆర్.ఐ సలహా సంఘం సమావేశం" జరిగింది. ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సహా పలువురు ఉన్నతాధికారులు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆద్యతన భవిష్యత్ లో, ప్రభుత్వ పరంగా, ఇ.ఎం.ఆర్.ఐ కి 108-అత్యవసర సహాయ సేవల నిర్వహణ నిధులను దశలవారీగా పెంచడానికి నాంది జరిగిన చారిత్రాత్మక సలహా సంఘం సమావేశమది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన నియమించిన "ఉప సంఘానికి", అత్యవసర సహాయ సేవల నిర్వహణకు అవుతున్న వ్యయానికి సంబంధించిన వివరాలను, ఉపసంఘం సమీక్షించి తగు విధమైన సిఫార్సులను ప్రభుత్వానికి చేసి, అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేసేందుకు ఒక సమగ్రమైన వివరణాత్మక నివేదికను ఇ.ఎం.ఆర్.ఐ రూపొందించింది. కమిటీకి సమర్పించిన నివేదికను అధ్యయనం చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన వివరణలో పేర్కొన్న అంశాలు:

• ఎంఓయు ప్రకారం అత్యవసర సహాయ సేవల నిర్వహణ కయ్యే వ్యయంలో ప్రభుత్వం భరిస్తానన్న అంశాలు:

• అంబులెన్సులలో పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలు
• అంబులెన్సుల నిర్వహణ-మరమ్మతుల వ్యయం
• టెలిఫోన్, అద్దె, విద్యుత్ ఖర్చులు
• షెడ్యూల్డ్ కులాల, తెగల, దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల, గర్భిణీ స్త్రీల, ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లల రవాణా కొరకయ్యే ఇంధన వ్యయం
• శిక్షణా కార్యక్రమాల వ్యయం
• పైన పేర్కొన్న అంశాలకు సంబంధించిన వ్యయం, అవగాహనా ఒప్పందం ఆధారంగా, ఒక్కో అంబులెన్సుకు రు. 68, 700 అవుతుంది. అంటే, రోజుకు సగటున రు. 2123-లేదా సగటున ట్రిప్పుకు రు. 400 అవుతుంది.
• తొలుత 310 అంబులెన్సుల, ఆ తర్వాత మరో 122 అంబులెన్సుల (మొత్తం 432) నిర్వహణకు, ఒప్పందానికి అనుగుణంగా వ్యయాన్ని భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ మొత్తం సుమారు రు. 33 కోట్లుంటుంది. వీటి ద్వారా మొత్తం రాష్ట్రమంతా సహాయ సేవలను అందించవచ్చు
• ప్రతి అంబులెన్సులో ఆరుగురు (ఇ.ఎం.టి, పైలట్లు కలిసి) ఉద్యోగులతో సహా, ప్రతి పది అంబులెన్సులకు ఒక సూపర్వైజర్ వుంటారు
• అంబులెన్సుల నిర్వహణ-మరమ్మతులంటే, ప్రతి అంబులెన్స్ 40, 000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత టైర్ల మార్పిడి కయ్యే ఖర్చు
• ప్రతి అంబులెన్సుకు రోజుకు 25-30 టెలిఫోన్ కాల్స్
• ప్రతి 7 కిలో మీటర్లకు లీటర్ డీజిల్ చొప్పున సగటున రోజుకు 300 కిలోమీటర్ల వరకు
• వాస్తవ అంచనాల ఆధారంగా, సుమారు 70% లబ్దిదారులు షెడ్యూల్డ్ కులాల, తెగల, దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబాల, గర్భిణీ స్త్రీల, ఐదు సంవత్సరాల లోపు చిన్న పిల్లలకు చెందినవారు. వారి రవాణా కొరకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలి.
• ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ సొంతంగా కొనుగోలు చేసి నిర్వహణ వ్యయం భరిస్తున్న 70 అంబులెన్సులకు కూడా ప్రభుత్వ సహాయం అందించడం పరిశీలించాలి.
• జాతీయ ఆరోగ్య మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పరిగణలోకి తీసుకుని, రాష్ట్రం సమకూర్చాల్సిన నిధుల విషయంలో నిర్ణయం తీసుకోవాలి.

ఇంత కూలంకషంగా, ఒక పథకం విషయంలో, ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారి. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పై "ఎంతో విశ్వాసం-నమ్మకం" వుండబట్టే అలా వ్యవహరించడం జరిగిందని భావించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయంతో 2007-2008 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి (నిర్ణయం తీసుకుంది జులై నెలలో అయినప్పటికీ అమలు ఏప్రియల్ నుంచే జరిగింది) అప్పటి కయ్యే ఖర్చులో 60% పైగా నిర్వహణ వ్యయం ప్రభుత్వ పరంగా లభించింది. పైగా రాజుగారిచ్చిన 70 అంబులెన్సులకు కూడా నిర్వహణ వ్యయం ప్రభుత్వమే భరించ సాగింది. వాస్తవానికి ఒక్కో అంబులెన్సుకు ప్రభుత్వం సమకూర్చిన రు. 68, 700 పైన ఇ.ఎం.ఆర్.ఐ కి అదనంగా ఎంత ఖర్చయిందో అనే విషయం "ఇదమిద్ధంగా ఇంత" అని ప్రభుత్వానికి సంస్థ విశ్లేషణాత్మకంగా ఎప్పుడో ఒకప్పుడు వివరణ ఇచ్చి వుంటే బాగుండేదేమో. నాకు తెలిసినంతవరకు ఏ నాడూ అలా చేసి వుండలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగానే ఉత్తర్వులు వచ్చిన కొద్ది రోజుల్లోనే, అత్యవసర సహాయ సేవల అంశం క్రమేపీ ముఖ్యమంత్రి దృష్టికి మరింత చేరువగా పోవడంతో, అక్కడినుంచి నిర్ణయాలు ఆయన కనుసన్నల్లో జరగడం మొదలయింది. అలా జరగడం లాభానికి దారి తీసిందా-నష్ఠానికి దారి తీసిందా అంటే చెప్పటం కష్ఠమవుతుంది. జవాబు ఏదైనా, అత్యంత ఆదరణ పొందిన సేవలుగా ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా, ఇతర రాష్ట్రాలకు కూడా పాకడానికి మాత్రం కారకుడు (దివంగత) ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి అనడంలో అతిశయోక్తి లేదు. అయితే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" గాని, ఆ తర్వాత (దివంగత) ముఖ్యమంత్రి "విశ్వాసాన్ని-నమ్మకాన్ని" గాని ఎంతవరకు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ నిలబెట్టుకో గలిగిందనేది జవాబు దొరకని ప్రశ్న.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక్కో అంబులెన్సుకు నెలకు రు. 68, 700 నిర్వహణ వ్యయం కింద ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న పక్షం రోజులకు, రామలింగ రాజు గారి అధ్యక్షతన పనిచేస్తున్న మరో సంస్థ హెచ్.ఎం.ఆర్.ఐ కి సంబంధించిన అంశాలను చర్చించేందుకు ముఖ్యమంత్రి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో సరిగ్గా ఏం జరిగిందో ఏమో గాని, హెచ్.ఎం.ఆర్.ఐ సంస్థతో పాటు, ఇ.ఎం.ఆర్.ఐ కి కూడా నిర్వహణ వ్యయంలో 95% వ్యయాన్ని ప్రభుత్వం భరించడానికి అంగీకరించిందన్న అభిప్రాయానికి సీ.ఇ.ఓ వెంకట్ వచ్చారు. అదే విషయాన్ని ధృవీకరించుకునేందుకు, నేను తోడు రాగా వెంకట్ గారు, ఆగస్ట్ 13, 2007 న ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు వెళ్లాం. నెల రోజుల క్రితం ఎంతో "విశ్వాసంతో-నమ్మకంతో" ప్రభుత్వ పరంగా భరించాల్సిన నిర్వహణ వ్యయం విషయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్న ప్రధాన కార్యదర్శి హరినారాయణ, కొంత అసహనానికి గురయ్యారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం హెచ్.ఎం.ఆర్.ఐ సంస్థ విషయంలోనే గాని ఇ.ఎం.ఆర్.ఐ విషయంలో కాదని స్పష్టం చేశారు. నిర్వహణ వ్యయానికి సంబంధించి అధ్యయనం చేసి, స్వయంగా ఆయన తీసుకున్న నిర్ణయానికి ఇ.ఎం.ఆర్.ఐ కట్టుబడకుండా, అంత తక్కువ వ్యవధిలో, పెంచమని కోరకుండా వుండాల్సింది వెంకట్. అయితే ఆర్థిక పరంగా అప్పటికే ఇ.ఎం.ఆర్.ఐ ఇబ్బందుల్లో వున్నదన్న సంగతి ఆయన ఎవరికి చెప్పుకోగలరు? యాజమాన్య పరంగా రాజు గారు ఇవ్వాల్సిన నిధులను సమకూర్చడం జరగడం లేదన్న విషయం వెంకట్ ఎలా బయట పెట్టగలరు? ఏదేమైనా, ఎంత అసహనానికి గురైనా, ఇ.ఎం.ఆర్.ఐ అందిస్తున్న అత్యవసర సహాయ సేవల విషయంలో అదే "విశ్వాసంతో-నమ్మకంతో", విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి అంగీకరించారాయన.

ఇ.ఎం.ఆర్.ఐ అంతర్గత ఆర్థిక పరమైన విషయాల వ్యవహారం అప్పట్లో నాకంతగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. బాంక్ దగ్గర అప్పు చేసిన సంగతి కూడా తెలియదు. సంస్థ వ్యవహారమంతా క్షుణ్ణంగా తెలిసిన వెంకట్ ఎటువంటి ఇబ్బందులకు అత్యవసర సహాయ సేవలు లోను కాకుండా వుండేందుకు ఆది నుంచీ చేసిన "విశ్వ ప్రయత్నాలలో భాగంగా" నే ఆ నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని 95% నిర్వహణ వ్యయం గురించి పట్టుబట్టి వుండాలి. ఆ నాటి సమావేశంలో వెంకట్ గారు ప్రదర్శించిన ఓర్పు-నేర్పు, చివరకు హరినారాయణ గారిని ఆ విషయం మర్నాడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి పరోక్షంగా ఒప్పించిన విధానం ఆయన సామర్థ్యానికి చక్కటి నిదర్శనం. ఆ నాటి సంఘటన నాకింకా జ్ఞాపకం వుంది.

Thursday, May 27, 2010

"జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" ఏర్పాటును సూచించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి : వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు
(దివంగత సీఎం చెన్నారెడ్డి పౌర సంబంధాల అధికారి)

సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం, 1990 మే నెలలో ఆంధ్ర ప్రదేశ్ లో సంభవించిన భారీ తుఫాన్, దాని తీవ్రతను అంచనావేసి వేలాది ప్రాణాలను కాపాడేందుకు తీసుకున్న ముందస్తు చర్యలు-తుఫాన్ వచ్చిన సమయంలో, ఆ తర్వాత చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలు, వాటిని పర్యవేక్షించిన అలనాటి సహాయ పునరావాస కమీషనర్ అర్జున్ రావు-ఆయనకు పరిపూర్ణ అధికారాలను ఇచ్చి అడుగడుగునా మార్గదర్శకత్వం వహించిన అలనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పాలనా దక్షత పదే-పదే గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిది. చెన్నారెడ్డి గారి దగ్గర పౌర సంబంధాల అధికారిగా ఆ సమయంలో పనిచేసిన నాకు అవన్నీ చాలా దగ్గరగా గమనించే అవకాశం కలగడమే కాకుండా, ఎన్నటికి మరిచిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఆ జ్ఞాపకాలలో కనీసం కొన్నైనా, నేనే కాకుండా, వాటిని దగ్గరగా వీక్షించిన (నేటి ముఖ్యమంత్రి రోశయ్య , సమాచార శాఖ మంత్రి గీతారెడ్డి-మాజీమంత్రి దివాకర రెడ్డి-సమరసింహా రెడ్డి ... ఇంకా మరికొందరు) పలువురి తో సహా, బహుశా పలువురు పాత్రికేయులకు-ఆ మాటకొస్తే వర్తమాన రాజకీయాలను గమనించే చాలామందికి గుర్తుండే వుంటాయని భావిస్తున్నాను.

అదే రోజుల్లో, ఆరోగ్యం బాగాలేనందున శస్త్ర చికిత్సకొరకు అమెరికా ప్రయాణానికి సిద్ధమై-కుటుంబ సభ్యులను విమానాశ్రయానికి పంపిన తర్వాత, మధ్యలో మంత్రివర్గ సమావేశానికి హాజరైయేందుకు వచ్చిన చెన్నారెడ్డి గారు తుఫాను తీవ్రతకు చలించిపోయి, ఆరోగ్యం విషయం పక్కనపెట్టి-ఏకంగా తన పర్యటననే వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అమెరికాకు వెళ్లి, అక్కడకూడా ఆరోగ్యం కంటే ముందు తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాలకు-ఇబ్బందులకు గురైన ప్రజలకు శాశ్వత పునరావాస చర్యలు చేపట్టేందుకు ప్రపంచ బాంక్ సహకారం కోరడానికి సంబంధిత అధికారులను కలుసుకోవడంలోనే వారం-పది రోజులు గడిపారు. తర్వాతే చికిత్సకు సిద్ధమయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన చెన్నారెడ్డి గారు, న్యూ ఢిల్లీలోని సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో, అలనాటి రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ సమక్షంలో చేసిన ప్రసంగంలో, మొట్ట మొదటిసారిగా "జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" (National Calamities Corpus-Need of the Hour) ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను గురించి ప్రస్తావన చేశారు. "జాతీయ విపత్తుల సహాయక నిధి" పేరుతో ఒకటి, "జాతీయ విపత్తుల ఆకస్మిక ఖర్చుల నిధి" పేరుతో మరొక టి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పటికీ, చెన్నారెడ్డి సూచించిన దానికి-వీటికి చాలా తేడా వుంది. తుఫానుకు గురైన రాష్ట్రాలకు ఈ రెండు సంస్థలనుంచి నిధులను విడుదల చేసే విధానాన్ని, ఫైనాన్స్ కమీషన్ మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ఫైనాన్స్ కమీషన్ ఆ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటుంది.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండో పర్యాయం ముఖ్యమంత్రి కావడానికి ముందర, ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం జరగడం, దాని కొరకు అధిష్ఠానం ఆహ్వానం మేరకు పక్షం రోజుల ముందు ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లడం-వెళ్లినప్పుడు విమానాశ్రయంలో వీడ్కోలు ఇచ్చిన అతి కొద్దిమందిలో నేనూ వుండడం, పీసీసీ అధ్యక్షుడుగా-ఆ హోదాలో హైదరాబాద్ తిరిగొచ్చినప్పుడు వేలాది అభిమానులు ఆయనకు స్వాగతం చెప్పడం, ఢిల్లీ నుంచి వచ్చిన చెన్నారెడ్డి గారికి విమానాశ్రయంలో "ముఖ్యమంత్రి స్థాయిలో పోలీసు ఏర్పాట్లు" జరగడం, ఎన్ టీ రామారావు సారధ్యంలోని తెలుగుదేశం పార్టీని జరగబోయే ఎన్నికల్లో ఓడించగల సత్తావున్న నాయకుడు దొరికాడని కాంగ్రెస్ వారు భావించడం, చివరకు అలానే 1989 ఎన్నికల్లో జరగడం, అధిష్ఠానం ఆయన్ను మరో మారు ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం-దాని కొరకు పరిశీలకులు రావడం, నేను అతి దగ్గరగా గమనించాను.

దక్షిణ భారత దేశాన్ని 1977 దివి సీమ ఉప్పెన తర్వాత భీభత్సం చేసిన అతి భయంకరమైన తుఫానుగా 1990 మే నెల మొదటి వారంలో సంభవించిన తుఫానును పేర్కొన వచ్చు. మే 4, 1990 న "ఉష్ణ మండల గందరగోళం" గా ప్రారంభమై, తుఫానుగా మారి, వాయువ్య దిశగా కదిలింది. మర్నాటి కల్లా, తీవ్రమైన వాయుగుండంగా ఏర్పడి మే 8 కల్లా భయంకరమైన తుఫానుగా మారి, ఆంధ్ర ప్రదేశ్‌పై కనీ-వినీ ఎరుగని దుష్ప్రభావం చూపింది. వాస్తవానికి, ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశంలోని పలు ప్రాంతాలపై కూడా దాని ప్రభావం పడింది. కనీసం పది జిల్లాలలోని కోటి మంది ప్రజలు తుఫానుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బందులకు లోనయ్యారు. విద్యుత్ సౌకర్యాలతో సహా అన్ని రకాల ప్రజావసరాల ఏర్పాట్లన్నీ అస్తవ్యస్థమైపోయి, జనజీవనం స్తంభించి పోయింది. లక్షలాది గుడిసె వాసులు నివాసాలు కోల్పోయారు. చెన్నారెడ్డి ప్రభుత్వానికదో పెను సవాలుగా మారింది. "గుడ్డిలో మెల్ల" గా, తప్పిపోతుందనుకున్న తుఫాను రాష్ట్రాన్ని తాకనున్నదన్నసంకేతాలు ముందుగా అందడంతో, సరైన నివారక చర్యలు చేపట్టడంతో లక్షలాది ప్రాణాలు కాపాడబడ్డాయి. పట్టణాభివృద్ధి శాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సి. అర్జున్ రావును, కారణాంతరాల వల్ల ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఆగ్రహానికి గురైనందున, ప్రాధాన్యత లేదని పలువురు భావించే "సహాయ పునరావాస కమీషనర్" గా అంతకు రెండు నెలల క్రితమే నియమించింది ప్రభుత్వం. ఆయన ఆ పదవికే వన్నె తెచ్చే రీతిలో తీసుకున్న ముందస్తు నివారక చర్యల వివరాలు, ఆ శాఖ పదిలం చేసుకుని వుంటే, బహుశా చక్కటి "మార్గదర్శి" గా ఎల్లప్పుడూ పనికొస్తుండవచ్చు. తుఫాను ముగిసిన కొంత కాలానికి అర్జున్ రావు గారు, ఒక చిన్న కార్పొరేషన్ ఎండి గా వున్నప్పుడు, సహాయ పునరావాస కమీషనర్ గా ఆయన తీసుకున్న చర్యలపై "రీడర్స్ డైజెస్ట్" ఒక గొప్ప ఆర్టికల్ ప్రచురించింది.

అలనాటి ప్రకృతి భీభత్సానికి పది జిల్లాలు అతలాకుతలమై పోయాయి. ఆయా జిల్లాల పాలనా యంత్రాంగంతో పాటు, రాష్ట్ర స్థాయి పాలనా యంత్రాంగం చురుగ్గా కదిలి, ఇతర జిల్లాలకు చెందిన అధికారులను ఒక్కో జిల్లాకు వేయి మంది వంతున పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణకు ఏర్పాటుచేసింది ప్రభుత్వం అర్జున్ రావు గారి ఆధ్వర్యంలో-ముఖ్యమంత్రి నాయకత్వంలో. తుఫానుకు గురైన వారిని గుర్తించడానికి ఒక బృందం, సహాయ కార్యక్రమాలను చేపట్టడానికి మరో బృందం, ఆహార పదార్ధాల సక్రమ సరఫరాకు ఇంకో బృందం, వసతి ఏర్పాటుకు మరో బృందం, వ్యాధులు వ్యాపించకుండా చర్యలు చేపట్టేందుకు ఇంకో బృందం.... ఇలా ఎన్నో బృందాలుగా ఏర్పడి శాస్త్రీయంగా సహాయ-పునరావాస కార్యక్రమాలను అమలు పరిచారు. సిరి ఫోర్టు ఆడిటోరియంలో ప్రసంగించిన చెన్నారెడ్డి గారు తన ఉపన్యాసంలో అవన్నీ వివరించినప్పుడు అధికారులను అభినందించిన తీరు ఆయన పాలనా దక్షతకు మచ్చుతునక. తుఫానుకు గురైన ప్రాంతాలను సందర్శించడానికి ముఖ్యమంత్రి, నాకు గుర్తున్నంతవరకు చేసిన ప్రయత్నాలు కనీసం రెండు రోజులు ఫలించలేదు. వాతావరణం ఏ మాత్రం అనుకూలించ నందువల్ల, ఆయనతో సహా మేమందరం ఎక్కిన వైమానికదళ హెలికాప్టర్ మొదటి రెండు రోజులు "మొరాయించింది". ప్రధాన మంత్రి వీపీ సింగ్ వచ్చి ఎక్కిన తర్వాతే అది కదిలింది. అయినప్పటికీ, విజయవాడ విమానాశ్రయం దాటి ముందుకు కదలలేదు. "ప్రధాన మంత్రికన్నా ముందర ముఖ్యమంత్రి ఎలా వెళ్లుతారు? ఆయనకెందుకు మొదలు ఆ కీర్తి దక్కాలి" అని హెలికాప్టర్ మొరాయించే ఏర్పాటు జరిగిందని అప్పట్లో కొందరు వ్యాఖ్యానించారు. అలా వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసమనే ది వారికే వదిలేద్దాం. ముఖ్యమంత్రితో సహా, ప్రతిపక్ష నాయకుడి హోదాలో స్వర్గీయ ఎన్ టీ రామారావు గారు కూడా రాజభవన్ లో ప్రధానిని కలిసి, సహాయం కొరకు అర్ధించారు. అంతగా రాజకీయాలకు తావులేని విధంగా వుందాయన అభ్యర్థన ఆ రోజుల్లో. వారూ-వీరూ అనే తేడా లేకుండా అంతా రాజకీయమే-అన్నీ విమర్శలే ఈ రోజుల్లో. తర్వాత మరో మారు కూడా ప్రధాని వచ్చి తుఫానుకు గురైన ప్రాంతాలను సందర్శించారు. కాంగ్రెస్ నాయకుడి హోదాలో స్వర్గీయ రాజీవ్ గాంధి తుఫాను ప్రాంతాలలో రెండు రోజులు తిరిగారు అప్పట్లో. సహాయ-పునరావాస కార్యక్రమాల సమీక్షకు చెన్నారెడ్డి గారు అమెరికా నుండి తిరిగి రావడానికి ముందు మరో మారు పర్యటించారు. తుఫానులు తరచుగా వస్తున్నాయనో-లేక-మరేమైనా కారణముందో, ఈ రోజుల్లో ప్రధాని గాని, సోనియా గాని పర్యటనలకు ఎక్కువగా రావడం లేదు.

తుఫాను సంభవించిన వెంటనే, కేంద్ర ప్రభుత్వ తక్షణ సహాయం గురించిన వివరాలు టెలిప్రింటర్లో సందేశం వచ్చింది. (ఫాక్సులు ఇంకా పూర్తి స్థాయిలో మొదలవలేదు అప్పటికింకా). అందులో సహాయం మొత్తం ఇంత అని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినప్పుడు ఆ మొత్తం అంకె తప్పని వెంటనే స్పందించారు. మాకు అర్థం కాలేదు. ఇంతలో వచ్చిన మరో మెసేజ్ లో ముఖ్యమంత్రి చెప్పిన రు. 86 కోట్ల మొత్తం గురించి సవరణ వచ్చింది. అదీ ఆయన జ్ఞాపక శక్తి. ఆ సహాయం గురించి ఆయనే మాకు వివరించారు. రకరకాల అంశాలను అధ్యయనం చేసి ఆర్థిక కమీషన్ "ఇంత మొత్తం" ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన రాష్ట్రానికి తక్షణ సహాయం కింద ఇవ్వాలని నిర్ణయిస్తుందని, ఆ మొత్తం అప్పట్లో రు. 86 కోట్లుగా మాకు విశదీకరించారు. అందులో కూడా మూడొంతులు కేంద్రం, ఒక వంతు రాష్ట్రం భరిస్తుందని ఆయనే చెప్పారు. అలనాటి తుఫానును "జాతీయ విపత్తు" గా పరిగణించాలని చెన్నారెడ్డి గారు చేసిన ప్రతిపాదనకు స్పందించిన ప్రధాని వీపి. సింగ్ "ఇది జాతీయ విపత్తు కాకపోతే మరింకేదీ జాతీయ విపత్తుగా అనలేం" అని వ్యాఖ్యానించడమంటే, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించడం అనుకోవాలి. అంతటితో ఆగకుండా, ఇక్కడ వున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని అనుకోకుండా, ఒక ప్రత్యేక అధ్యయన బృందాన్ని కూడా పంపించారు రాష్ట్రానికి వీపి. సింగ్.

అయినా చెన్నారెడ్డి గారు తృప్తిపడలేదు. అందిన సహాయం ఏ మూలకు సరిపోదని ఆయన భావన. ఆ ఆలోచనతో "ప్రపంచ బాంక్" ను కదిపారు. " ఈ ఆధునిక ప్రపంచంలో కొంత బియ్యాన్ని పంచడంతో నో, మరో రకమైన ధాన్యాన్ని-పప్పు దినుసులను సమకూర్చడంతో నో, గుడిసెల మరమ్మతుకు అంతో-కొంతో ధనం సహాయం చేయడంతో నో సరి పుచ్చుకోవడం మన సంస్కృతిని-సాంప్రదాయాన్ని-ప్రపంచం దృష్టిలో మన గౌరవ ప్రతిష్ఠలను ప్రతిబింబించవు. శాశ్వతమైన ఏర్పాట్లు చేసినప్పుడే ఫలితం వుంటుంది" అన్నారాయన. ఏం జరిగిందో-ఎలా జరిగిందో అని అర్థం చేసుకునే లోపల, ప్రపంచ బాంక్ బృందం, తుఫాను సంభవించిన అతి కొద్ది రోజుల్లో రాష్ట్రాన్ని సందర్శించింది. ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రంలో అధికారులు వెంట రాగా రెండు రోజులు పర్యటించింది బృందం. మళ్ళీ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఆయన వారికిచ్చిన "తుఫాను ప్రాంత సంగ్రహ సమాచారం (Detailed Brief on what is to be done ?)" వివరించిన తీరు ఆయన మేథస్సుకు నిదర్శనం. బహుశా ఆయన తప్ప మరొకరు ఆ విధంగా చేయలేరని నా ఉద్దేశం. ఆయన ఆ రోజు ప్రపంచ బాంక్ బృందానికి చేసిన సూచన (తుఫాను ప్రాంత) భావి తరాల వారికి శాశ్వత పరిష్కారం. తర్వాత ప్రభుత్వాలు నిజంగా అందులో ఎన్ని అమలు చేసాయోగాని అమలు చేసే వుంటే తుఫాను తాకిడికి జరిగే నష్టం చాలా వరకు నివారించగలిగే వీలుండేది. ఆయన ఇచ్చిన వివరణలో ప్రధానమైంది "కృష్ణా-గోదావరి డెల్టా ప్రాంతంలో పురాతన కాలంలో నిర్మించి అస్తవ్యస్థమైపోయిన డ్రైనేజి ఏర్పాటు" గురించి.

"యావత్ భారత దేశంలో ఆంధ్ర ప్రాంతపు వ్యవసాయ దారులు, వ్యవసాయోత్పత్తిలో అగ్రగణ్యులని, 1924 లో, అప్పటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రాయల్ అగ్రికల్చరల్ కమీషన్ పేర్కొంది. దానికి ప్రధాన కారణం అక్కడి డెల్టా ప్రాంతం-డ్రైనేజి వ్యవస్థ. అందుకే భారతదేశానికి అన్నపూర్ణగా ఆంధ్ర ప్రదేశ్ కు పేరొచ్చింది. దురదృష్టవశాత్తు తుఫాను మూలంగా డ్రైనేజి వ్యవస్థ పూర్తిగా నాశనమై పోయింది. అలా పాడై పోవడానికి, రాజకీయ నాయకుల-రకరకాల భూ ఆక్రమణదారుల ప్రోత్సాహంతో, డ్రైనేజి ప్రాంతంలో కాలువలకు చెందిన కొంత భాగాన్ని కబ్జా చేసుకోవడమే కారణం. కొందరు దురాశ పరుల మూలాన మొత్తం డ్రైనేజి వ్యవస్థ పగుళ్లకు దారితీసింది-పనికి రాకుండా పోయింది. ఆంధ్ర ప్రాంతంలోని సుమారు వేయి కిలోమీటర్లకు పైగా పొడవనున్న తీర ప్రాంతంలోని చాలా భాగం తుఫాను తాకిళ్లకు గురయ్యే ప్రమాదముంది. ఈ ప్రమాదం నుంచి శాశ్వతంగా అక్కడి ప్రజలను కాపాడాలి". అని ప్రపంచ బాంక్ బృందానికి వివరించి, "తుఫాను ఆవాసాలను" ఆ ప్రాంతాలలో పటిష్ఠంగా నిర్మించేందుకు ఆర్థిక సహాయం చేయమని అడిగారు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి. ఆ విషయం గురించి ప్రపంచ బాంక్ ఉపాధ్యక్షుడు మొయిన్ కురేషీతో చర్చించాలని చెన్నారెడ్డికి సూచించారు బృందంలోని సభ్యులు.

అప్పట్లో ప్రపంచ బాంక్ సహాయం పొందాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పని సరి. ఇప్పుడూ అవసరమే కాని వారి దృష్టికి తీసుకెళ్తే చాలు. చెన్నారెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధానిని, ఆర్థిక మంత్రిని కలిసి డ్రైనేజి వ్యవస్థ పునర్నిర్మాణానికి ప్రపంచ బాంక్ సహాయం విషయం చెప్పి, వారిచ్చిన ప్రోత్సాహంతో భవిష్యత్ కార్యాచరణ పథకాన్ని రూపొందించుకున్నారు. మొదట్లో వాయిదా వేసుకున్న అమెరికా ప్రయాణాన్ని వారం-పది రోజుల అనంతరం కొనసాగించారు. అత్యవసరంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సినప్పటికీ, జూన్ 6, 1990 అర్థ రాత్రి ఆసుపత్రిలో చేరేంతవరకు, నిత్యం ప్రపంచ బాంక్ ఉపాధ్యక్షుడితో సంప్రదింపులు జరుపుతూనే వున్నారు. డ్రైనేజి వ్యవస్థ పునరుద్ధరణ తన ప్రధమ కర్తవ్యంగా భావించానని అమెరికా నుంచి వచ్చిన చెన్నారెడ్డి సిరి ఫోర్టు ఆడిటోరియంలో చెప్పారు. చెన్నారెడ్డి గతంలో రాష్ట్ర ఆర్థిక-పారిశ్రామిక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన సందర్భంలో మొయిన్ కురేషీని కలిసిన సందర్భాలు ఇరువురూ గుర్తుచేసుకున్నారు. పునరుద్ధరణకు సంబంధించిన అంచనాలను తయారు చేయాలని, చేయించిన తదుపరి, తప్పక ఆర్థిక సహాయం చేస్తామని ఆయన దగ్గర హామీ తీసుకున్నారు చెన్నారెడ్డి. ఇరువురి కలయిక తర్వాత కేవలం పద్నాలుగు రోజుల్లో నిష్ణాతులైన పలువురు ప్రపంచ బాంక్ నిపుణుల బృందం రాష్ట్రానికి రావడం, వివరంగా అంచనాలను రూపొందించడం జరిగింది. భవిష్యత్ లో ప్రపంచ బాంక్ హామీ నెరవేరడం వల్లనే పాడై పోయిన డ్రైనేజి వ్యవస్థ బాగుపడింది ఆ తర్వాత.

ఆరోగ్యం కుదుట పడింతర్వాత రాష్ట్రానికి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి, రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ సమక్షంలో న్యూ ఢిల్లీలోని సిరి ఫోర్టు ఆడిటోరియంలో మాట్లాడుతూ, తుఫాను భీభత్సాలను-ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కోడానికి, అప్పట్లో అమల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరిపోదని బహిరంగంగా తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఫైనాన్స్ కమీషన్ సమీక్షల ఆధారంగా అయిదు సంవత్సరాల కాలపరిమితికి సరిపడా ప్రకృతి వైపరీత్యాల సహాయ విధానం అమలు సరిపోదన్నారు. ఒకటి-రెండు రాష్ట్రాల నుంచో, కేంద్ర నుంచో నిధులను సేకరించి "జాతీయ విపత్తుల సహాయక నిధి" ని ఏర్పాటు చేయడంతో సరిపోదని, అన్ని రాష్ట్రాలలోని పౌరులందరి విరాళాలతో-భాగస్వామ్యంతో, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక " న్యూక్లియస్ నిధి" ని ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ-అంతర్జాతీయ విపత్తులలో-విషాదాల్లో, తమ వంతు పాత్ర నిర్వహించాలన్న భావన ప్రతి పౌరుడిలో కలిగించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు చెన్నారెడ్డి. ప్రణాళికా సంఘం సరైన ఆలోచన చేసి, భారత దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని-ప్రతి పౌరుడిని "విధిగా" తోచినంత విరాళం ఇచ్చే విధంగా "శాశ్వత నిధిని" ఏర్పాటు చేసే, ఆ నిధులతో నడిచే "జాతీయ విపత్తుల సమష్ఠి సంస్థ" ను నెలకొల్పాలని సూచించారు చెన్నారెడ్డి. అలా చేస్తే, ప్రకృతి వైపరీత్యాల్లో, తమ విరాళాలతో, తమ తోటి వారికి సహాయం అందిందన్న సంతృప్తి ప్రతి పౌరుడిలో కలుగుతుందని ఆయన భావించారు. అలా జరిగుంటే బాగుండేదేమో !

Saturday, May 22, 2010

VI-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-6): వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-6
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

ఆశయం గొప్పది కావచ్చు. అమలు పరిచేవారు నిష్ణాతులే కావచ్చు- నిబద్ధత, అంకిత భావాలకు సాక్షాత్తు చిరునామా కావచ్చు. కాకపోతే, ప్రజాస్వామ్యంలో "అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు, సంబంధిత సమాచారాన్ని పొందే హక్కు" ప్రతి పౌరుడికి వుంది. దానికి తోడు, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో 95% ప్రభుత్వ నిధులతో నిర్వహించబడుతున్న 108-అత్యవసర సహాయ సేవలు లభ్యం కావటంలో ఏ మాత్రం అలసత్వం వున్నా కారణాలు తెలుసుకుని, ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రామ లింగ రాజు (సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో) హఠాత్తుగా బాధ్యతల నుంచి తొలగడం, ఆయన స్థానంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, "లోకోపకార దాతృత్వ” భావంతో పలు సంక్షేమ కార్యక్రమాలకు తన వంతు నిధులను సమకూరుస్తున్న జీ.వీ.కె సంస్థల అధిపతి శ్రీ జీ.వి.కృష్ణారెడ్డి, (దివంగత) ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చొరవతో, చైర్మన్ గా రావడంతో, అత్యవసర సహాయ సేవలు అందచేయడంలో ఏ సమస్యలు రావని లబ్దిదారులు భావించారు. బహుశా ప్రభుత్వం కూడా అలానే భావించి వుంటుంది. అయితే, ప్రభుత్వం నాలుగు దశల్లో ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు సమకూర్చిన 732 అంబులెన్సులు-అంతకు ముందే ప్రయివేట్ భాగస్వామిగా ‘రామ లింగరాజు గారి ఇ.ఎం.ఆర్.ఐ’ జతకూర్చిన మరో 70 అంబులెన్సులు కలిపి మొత్తం 802 అంబులెన్సులు పౌరులకు సేవలందించాల్సి వుండగా, వాటిలో కనీసం 100 అంబులెన్సులు, వివిధ కారణాల వల్ల సేవలందించలేని స్థితిలో వుండడంతో అలా ఎందుకు "ఒడిదుడుకులకు లోను కావాల్సి వచ్చిందో" అర్థం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది ప్రభుత్వం. ఆ క్రమంలోనే బహుశా ప్రభుత్వ దృష్టికి మరికొన్ని అంశాలు వచ్చి వుండాలి.

108 అంబులెన్సుల ద్వారా అత్యవసర సహాయ సేవలందిస్తున్న ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఇ.ఎం.ఆర్.ఐ) పని తీరుపై ఏప్రియల్ 2010 చివరి వారంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని (హెల్త్, మెడికల్, కుటుంబ సంక్షేమ శాఖ-జీ.ఓ.ఆర్.టీ నంబర్ 594, తేదీ 28-04-2010) నియమించింది. కమిటీని నియమిస్తూ విడుదల చేసిన ప్రభుత్వ ఉత్తర్వులో, 4-2-2010 న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం లో తీసుకున్న నిర్ణయాలను, 30-03-2010 న ప్రభుత్వ సలహాదారుడి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం లో తీసుకున్న నిర్ణయాలను, 3-4-2010 న కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ప్రభుత్వానికి సమర్పించిన అభిప్రాయాన్ని ఉటంకించడం జరిగింది. అంటే సుమారు మూడు నెలలుగా ప్రభుత్వంలోని వివిధ స్థాయిలలో 108 అంబులెన్సు అత్యవసర సహాయ సేవల విషయంలో సుదీర్ఘమైన సమీక్షలు జరుగుతున్నాయనుకోవాలి. ఆ సమీక్షల్లో వారికి కావాల్సిన వివరణలు సరైన రీతిలో లభించి వుండలేదని కూడా భావించాలి. వాస్తవానికి, ప్రభుత్వానికి-ఇ.ఎం.ఆర్.ఐ కి మధ్య కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందంలోనే కనీసం మూడు-నాలుగు రకాల సమీక్షలకు అవకాశాలున్నాయి. మూడు-ఆరు నెలలకోమారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన, ప్రతినెలా ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన సమీక్షలు జరుగుతాయి. క్రమం తప్పకుండా కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సమీక్షలు నిర్వహిస్తుంటారు. ఇ.ఎం.ఆర్.ఐ నెల-నెలా నివేదికలు పంపిస్తుంటుంది. ఇన్ని రకాల సమీక్షలుండగా మళ్లీ మరో కమిటీ అవసరం వచ్చిందంటే పరిస్థితి తీవ్రంగా వుండడమో, లేక, జరగాల్సిన ప్రభుత్వ స్థాయి సమీక్షలు జరగకపోవడమో కారణమయ్యుండాలి.

ప్రభుత్వం నియమించిన కమిటీ తన పని ప్రారంభించింది. వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ చైర్మన్ గా, రవాణా శాఖ సంయుక్త కమీషనర్, ఏ.పి.ఎస్.ఆర్.టీ.సి కి చెందిన సాంకేతిక నిపుణుడు, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి, ఆరోగ్య-వైద్య-కుటుంబ శాఖ ఉప కార్యదర్శి, ఆరోగ్య శాఖ రవాణాధికారి, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థకు చెందిన మేనేజ్‌మెంట్ నిపుణులొకరు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కళాశాలకు చెందిన మేనేజ్‌మెంట్ నిపుణులొకరు, ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ సీనియర్ అధికారి సభ్యులుగా వుంటారీ కమిటీలో. ఎన్.ఆర్.హెచ్.ఎం ప్రోగ్రాం అధికారి కమిటీ కన్వీనర్. కమిటీ పరిశీలనకు-సిఫార్సులకు సంబంధించిన (కింద పేర్కొన్న) అంశాలను కూడా ఉత్తర్వులో పేర్కొన్నారు వైద్య-ఆరోగ్య శాఖ కార్యదర్శి పీ.వీ.రమేశ్.

ప్రభుత్వానికి. ఇ.ఎం.ఆర్.ఐ కి మధ్య 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం గడువు ఏడాది తర్వాత ముగిసి, 30.09.09 వరకు పొడిగించినప్పటికీ, తిరిగి ఎం.ఓ.యు కుదుర్చుకోవాల్సిన అవసరం వుంది కనుక, దాన్ని రూపొందించుకునే ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు:

• సంబంధిత అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ అంబులెన్స్ నెల-నెలా నిర్వహణ వ్యయాన్ని నిర్ణయించడం
• సగటున ఒక్కో అంబులెన్స్ ట్రిప్పుకు కేవలం 450-475 రూపాయల మధ్య సరిపోతాయని ఇ.ఎం.ఆర్.ఐ అధ్యయన నివేదికలో పేర్కొన్నప్పటికీ, ముసాయిదా ఎం.ఓ.యు లో ఆ వ్యయాన్ని పెంచి 594 రూపాయలుగా చూపించిన అంశాన్ని పరిశీలించడం
• నిర్వహణ వ్యయంలో 5% వాటాను జీ.వీ.కె ఇ.ఎం.ఆర్.ఐ భరించాల్సిన అంశాన్ని పరిశీలించడం
• 01-04-2009 నుండి 31-12-2009 వరకు తన వంతు 95% వాటాగా కుటుంబ సంక్షేమ శాఖ జీ.వి.కె ఇ.ఎం.ఆర్.ఐ కి విడుదల చేసిన రు. 74, 33, 44, 742/- (సుమారు 74.34 కోట్ల రూపాయలు)లో, రు. 12, 21, 30, 052/-(సుమారు 12.22 కోట్ల రూపాయలు) ప్రభుత్వ అనుమతి లేకుండా సంస్థ వాడుకుందన్న(సూపర్వైజర్ల జీతాలకు, బాంక్ వడ్డీకి, కొనుగోలు-విక్రయదారుల అప్పు కింద వ్యయం చేయడానికి) అంశంపై సమీక్ష
• ఎం.ఓ.యు లో పేర్కొనని అంశాలకు సంబంధించిన వాటిపై ప్రభుత్వ నిధులను జీ.వీ.కె ఇ.ఎం.ఆర్.ఐ వ్యయం చేస్తుందన్న అంశంపై పరిశీలన
• ఎప్పటికప్పుడు ఏదైనా సంబంధిత అంశం పై పరిశీలన జరుపదల్చుకుంటే అలా చేసే అవకాశం

• ఆంధ్ర ప్రదేశ్ లో అమలవుతున్న అత్యవసర రవాణా సేవలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమలుకు సంబంధించి వాటి అమలు తీరుతో ఇక్కడి వాటిని పోల్చి చూడడం. ప్రస్తుతం లభిస్తున్న "అత్యవసర రవాణా సేవలకు" ప్రత్యామ్నాయాలే మన్నా వున్నాయేమో పరిశీలించడంతో సహా అన్ని అంశాలను సమీక్షించి, సరైన సూచనలను-సలహాలను రెండు వారాల్లోపు కమిటీ ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులో పేర్కొంది ప్రభుత్వం.

4-2-2010 న ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు జరుపుతున్న 108 అత్యవసర (వైద్య) సహాయ సేవలను పర్యవేక్షించడానికి కుటుంబ సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేక పర్యవేక్షక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వైద్య, అత్యవసర ఆరోగ్య సేవలకు "ఏ మాత్రం ఆటంకం కలగని విధంగా వ్యయం మదింపు జరగవలసి ఉందని" ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యంతో అమలు జరుపుతున్న ఇ.ఎం.ఆర్‌.ఐ-108 అత్యవసర (వైద్య) సహాయ కార్యక్రమాల అమలులో నిరంతర పర్యవేక్షణ అవసరమని ప్రభుత్వం భావించింది. సామాన్య ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత, అత్యవసర వైద్య సేవలలో పొరపాట్లకు, అక్రమాలకు తావులేకుండా వుండేటందుకే నిరంతర పర్యవేక్షణ అవసరమని ముఖ్యమంత్రి కె. రోశయ్య అభిప్రాయపడ్డారు. అదే సమీక్షా సమావేశంలో 108 వాహనాల వినియోగంలో జరుగుతున్న అదనపు వ్యయాన్ని నియంత్రించవలసి ఉందని కూడా ప్రభుత్వం భావించింది. గతంలో ఒకొక్క వాహనం సగటున రోజుకు 10 ట్రిప్పులు తిరిగేదని, ఇప్పుడు ఆ సంఖ్య 6 కు తగ్గినందున ఆ మేరకు వ్యయం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రయివేట్ భాగస్వామిగా జి.వి.కే సంస్థను "ఖరారు చేయడానికి" మరికొంత సమయం పడుతుందని కూడా సంబంధిత శాఖ మంత్రి పితాని సత్యనారాయణ సమీక్షా సమావేశంలో పేర్కొనడం విశేషం.

నిపుణులు, సీనియర్‌ అధికారులతో పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు సమీక్ష అనంతరం మంత్రి మీడియాకు తెలిపారు. ఇ.ఎం.ఆర్‌.ఐ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడంతో సహా ఇతర సంబంధిత అంశాలను కూడా పర్యవేక్షక కమిటీ పరిశీలించగలదని మంత్రి పాత్రికేయులకు చెప్పారు. మెరుగైన, సుస్తిర అత్యవసర వైద్య సేవల కోసం ప్రయివేటు భాగస్వామ్యాన్ని ఎంపిక చేయడంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించిందని కూడా ఆయన అన్నారు. సంబంధిత శాఖ మంత్రి పితాని సత్యనారాయణ, సలహాదారుడు పి. కె. అగర్వాల్‌, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌. వి. సుబ్రహ్మణ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్‌ అనిల్‌ పునీత, ఇ.ఎం.ఆర్‌.ఐ సీ.ఇ.ఓ వెంకట్‌ చెంగవల్లి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

30-3-2010 న ప్రభుత్వ సలహాదారుడి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశం లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే 3-4-2010 న కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ ప్రభుత్వానికి తన అభిప్రాయాన్ని తెలియచేసి వుండొచ్చు. పర్యవసానంగా, ముఖ్యమంత్రి రోశయ్య సంబంధిత శాఖ మంత్రి పితాని కలిసి 4-2-2010 న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు, కమీషనర్ నివేదికకు అనుగుణంగా కమిటీ నియామకం జరిగిందని భావించాలి.

కమిటీ నియమించడానికి పూర్వ రంగంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, సంబంధిత శాఖ మంత్రి మీడియాకు వివరించిన వ్యవహార శైలిని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇ.ఎం.ఆర్.ఐ పని తీరుపై మంత్రిగారో-ప్రభుత్వమో-ముఖ్యమంత్రో కొంత అసంతృప్తిగా వున్నారని విశదమవుతుంది. దానికి కారణాలు అనేకం వుండవచ్చు. సమీక్షా సమావేశానికి హాజరయిన ఇ.ఎం.ఆర్.ఐ అధికారులు ఆ రోజునే ఆ విషయంలో ఒక అవగాహనకు వచ్చి, సంబంధిత అధికారులతో-అనధికారులతో చర్చించి, కమిటీ నియమించే దాకా పరిస్థితిని రాకుండా జాగ్రత్త పడితే బాగుండేదేమో ! మంత్రి మీడియాకు చెప్పిన అంశాలను, కమిటీ భవిష్యత్ లో ప్రభుత్వానికి చేయాల్సిన సూచనలకు సంబంధించి ఉత్తర్వు చివర పేర్కొన్న అంశాన్ని నిశితంగా పరిశీలిస్తే, 108-అత్యవసర వైద్య సహాయ సేవలను పౌరులకు అందించే విషయంలో ప్రభుత్వ ఆలోచనా సరళిలో కొంత మార్పు వస్తున్నట్లు భావించాల్సి వస్తుంది. ఉదాహరణకు మంత్రి పితాని సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ... "108 అత్యవసర సహాయ సేవల నిర్వహణకు ప్రయివేట్ భాగస్వామిగా జి.వి.కే సంస్థను ఖరారు చేయడానికి మరికొంత సమయం పడుతుంది" అని, "మెరుగైన, సుస్తిర అత్యవసర వైద్య సేవల కోసం ప్రయివేటు భాగస్వామ్యాన్ని ఎంపిక చేయడంలో తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది" అని చెప్పడం గమనించాల్సిన విషయం. అదేవిధంగా, కమిటీని నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో... "ప్రస్తుతం లభిస్తున్న అత్యవసర రవాణా సేవలకు ప్రత్యామ్నాయాలే మన్నా వున్నాయేమో పరిశీలించడంతో సహా అన్ని అంశాలను సమీక్షించి, సరైన సూచనలను-సలహాలను ఇవ్వాల్సింది" గా పేర్కొనడం కూడా భవిష్యత్ పరిణామాలకు సంకేతంగా భావించాల్సి వస్తుంది.

ఆర్థిక శాఖ లేవనెత్తిన పలు అంశాలను దృష్టిలో వుంచుకోవాలని కూడా ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. ఇంతకూ ఆర్థిక శాఖ లేవనెత్తిన ఆ పలు అంశాలను నిశితంగా పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు బయటపడ్తాయి. లోగడ ఇలా జరగలేదు. ఇప్పుడు జరగడానికి కారణాలు వుండితీరాలి. నూతన అధ్యక్షుడుగా జీ. వి. కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పేరు ముందర జీ.వి.కె అని చేర్చి, 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం స్థానంలో (గడువు ముగిసినందున) "ప్రభుత్వానికి-జీ.వి.కె ఇ.ఎం.ఆర్.ఐ కి మధ్య నూతన ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య అవగాహనా ఒప్పందం” (పి.పి.పి ఒప్పందం అని దానికి పేరు పెట్టారు) ముసాయిదాను తయారు చేసి, పరిశీలన కొరకు ప్రభుత్వానికి సమర్పించింది సంస్థ. గతంలో ప్రభుత్వం-ఇ.ఎం.ఆర్.ఐ మధ్య కుదుర్చుకున్న మొదటి (ఏప్రియల్ 2, 2005) ఎంఓయు విషయంలో గాని, రెండో (సెప్టెంబర్ 22, 2006) ఎంఓయు విషయంలో గాని, మూడో (అక్టోబర్ 5, 2007) ఎంఓయు విషయంలో గాని, నాలుగో (మే 5, 2008) ఎంఓయు విషయంలో గాని ఏ విధమైన "కొర్రీలను" ప్రభుత్వం వేయలేదు. వేసే అవకాశం-అవసరం, అప్పట్లో ఆ విషయాన్ని చూస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ (ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య సంబంధిత) అధికారులు ప్రభుత్వానికి ఇవ్వలేదు. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పక్షాలకు చెందిన అధికార ప్రతినిధులు కూర్చొని-చర్చించి ముసాయిదాను ఖాయపరిచే సాంప్రదాయం వుండేది. "విశ్వాసం-నమ్మకం" అనే ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రధాన ప్రాతిపదిక ఆధారంగా ఎంఓయు లన్నీ ఖరారయ్యాయి. మొట్టమొదటి సారిగా "కొర్రీల సాంప్రదాయానికి" అవకాశం ఇచ్చింది (జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. ఇలా జరగకుండా వుండాల్సింది. ఇంతకూ (జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించిన ముసాయిదా ఎంఓయు లో వున్న అంశాలేంటి ? వాటి విషయంలో ఆర్థిక శాఖ లేవనెత్తిన అభ్యంతరాలేంటి ? పరిశీలించుదాం.

(జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం రూపొందించిన ముసాయిదా ఒప్పందం ప్రతిపాదనలో ప్రధానమైంది నెల-నెలా సగటున ఒక్కో అంబులెన్సుకు ప్రభుత్వ పరంగా ఇస్తున్న ప్రత్యక్ష నిర్వహణ వ్యయానికి సంబంధించిన విషయం. 2008-2009 ఆర్థిక సంవత్సరానికి, అప్పట్లో ఇ.ఎం.ఆర్.ఐ, ఒక్కో అంబులెన్సుకు సగటున ప్రతినెలా రు. 1, 18, 420 వ్యయమవుతుందని ప్రతిపాదించగా, దాన్ని పరిశీలించి-అంగీకరించిన ప్రభుత్వం, తన వంతు 95% వాటాగా రు. 1, 12, 499 చొప్పున ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. 502 అంబులెన్సులున్నప్పుడు అంగీకరించిన ఆ మొత్తం (రు. 1, 12, 499), తర్వాత సంఖ్య 652 కు చేరినప్పటికీ, ఆ తర్వాత ఆ సంఖ్య 802కు పెరిగినప్పటికీ, "విశ్వాసంతో-నమ్మకంతో" పునఃపరిశీలించకుండా చెల్లిస్తూ వస్తున్నారు. అది కూడా మొదట్లో మూడు నెలల అడ్వాన్సు ఒకే సారి ఇచ్చే సాంప్రదాయం వుండేది. జీ.వీ.కె యాజమాన్యం బాధ్యతలు స్వీకరించడానికి కొద్ది నెలల ముందు నుంచి నెల-నెలా అడ్వాన్సుల సాంప్రదాయానికి అంగీకరించింది యాజమాన్యం. 108 అత్యవసర సహాయ సేవల ఒడిదుడుకులకు ఇదో ప్రధాన కారణం. ముసాయిదాలో 95% నిర్వహణ వ్యయాన్ని నూటికి 100% పెంచి, ప్రతి నెలా ఒక్కో అంబులెన్సుకు రు. 1, 18, 420 వంతున ప్రభుత్వం భరించాలని ప్రతిపాదించింది (జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. అదనంగా మరో రు. 10 కోట్లు "మూల ధన వ్యయం" కొరకు కావాలని కోరింది. సంవత్సరానికి రు. 12 లక్షల కంటే ఎక్కువ (నెలకు లక్ష రూపాయలు !) వేతనం ఇవ్వాల్సిన ఉద్యోగుల జీత భత్యాలను మాత్రమే (జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం భరిస్తుందని, మిగతా వారికి ప్రభుత్వమే ఇవ్వాలని మరో ప్రతిపాదన ఇచ్చింది. ఆర్థికంగా ప్రభుత్వంపై మరింత భారాన్ని పరోక్షంగా సూచించింది (జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం. అడపాదడపా ఏదన్నా ఊహించని వ్యయం జరిగితే దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరింది. శిక్షణా కార్యక్రమాలన్నింటికీ అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని మరో ప్రతిపాదన. వీటన్నిటినీ అధిగమించిన ఆర్థిక భార ప్రతిపాదన రాజు గారు చైర్మన్ గా తొలగిన సమయానికి ఇ.ఎం.ఆర్.ఐ ఇరుక్కుపోయిన సుమారు రు. 120 కోట్ల "అప్పుల ఊబి". ఆర్థిక శాఖకు ఇది రుచించలేదు.

(జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్యం ప్రతిపాదించిన అంశాలపై ఆర్థిక శాఖ తన అభిప్రాయాలను షరాలను (Remarks) నిక్కచ్చిగా పేర్కొంటూ, "కొర్రీలు" వేసింది. 2008 సంవత్సరంలో ప్రభుత్వం అంగీకరించిన సగటు అంబులెన్సు నిర్వహణ వ్యయాని కంటే అదనంగా రు. 8,833 లు (అంటే రు. 1, 27, 253) ఖర్చయ్యాయని లెక్కలు చూపించింది సంస్థ. మరోవైపు లెక్కల పుస్తకాలలో ఆ వ్యయం సుమారు రు. 90, 000 మాత్రమే వున్నట్లు ఆర్థిక శాఖ దృష్టికొచ్చింది. ఎంఓయు లో అంగీకరించిన దానికంటే ఎందుకంత అదనంగా ఖర్చయ్యిందన్న అంశాన్ని పరిశీలించాలని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. సగటున ప్రతి నెలా అంబులెన్సుకు అయ్యే సరాసరి నిర్వహణ వ్యయం ఎంతుంటుందన్న విషయాన్ని "నిపుణులతో క్షుణ్ణంగా అధ్యయనం చేయించడం గాని" లేదా "టెండర్ విధానం ద్వారా వేలం పోటీ పద్ధతిన సరసమైన ధరను నిర్ణయించడం గాని" జరగాలని ఆర్థిక శాఖ అభిప్రాయం. 05.05.08 న కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందంలోని పలు అంశాలను మార్చవలసిన ఆగత్యాన్ని కూడా ఆర్థిక శాఖ ప్రశ్నించింది. వంద కోట్ల రూపాయలకు పైగా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నందున కుటుంబ సంక్షేమ శాఖలో "అంకిత భావం కలిగిన మానిటరింగ్ యూనిట్" ను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా అభిప్రాయ పడింది. నిధుల సేకరణకు "అడ్వర్టయిజింగ్" విధానం అవలంభించడం మంచిదని మరో సూచన చేసింది. ఇలా అడుగడుగునా ప్రభుత్వానికి (జీ.వి.కె) ఇ.ఎం.ఆర్.ఐ యాజమాన్య నిర్వహణ విషయంలో అనుమానాలొస్తుంటే భవిష్యత్ లో ఏం జరగబోతోందో ఊహించడం కొంచెం కష్టమే మరి !

Sunday, May 16, 2010

V-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-5): వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-5
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

లాభాపేక్ష లేని రిజిస్టర్ డ్ సొసైటీగా, లాంఛనంగా రూపు దిద్దుకోనున్న "ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-ఇ.ఎం.ఆర్.ఐ" ముఖ్య కార్య నిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన వారణాసి సుధాకర్ తన ప్రయత్నాల్లో భాగంగా డాక్టర్ రంగారావు గారిని సంస్థ మెడికల్ సలహాదారుగా చేసుకుని, అత్యవసర సహాయ సేవలు లభ్యమవడానికి అవసరమైన "మెడికల్ ప్రక్రియల” ను, "ప్రోటోకాల్స్" ను రూపొందించసాగారు. ఈ నాటికీ ఆయన అప్పట్లో రూపొందించిన వాటి ఆధారంగానే ఆ సేవలు ఇంకా కొనసాగుతున్నాయి. కాకపోతే, పెరుగుతున్న-మారుతున్న అవసరాలకు అనుగుణంగా వాటిని మలచుకుంటున్నారా-లేదా అన్న విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. సుధాకర్ కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినంతవరకు ఏ రకమైన ఇబ్బందీ లేదు. ఒక వైపు రంగారావు గారి సలహా తీసుకుంటూనే, మెడికల్ ప్రోటోకాల్స్ విషయంలో కొంత అధ్యయనం చేసేందుకు అమెరికా లాంటి దేశాలకు వెళ్లొచ్చారు. మొత్తమ్మీద, ఏమనుకున్నారో-ఏమోకాని, జనవరి 29, 2005న రాజు గారు నిధుల విషయంలో హఠాత్తుగా ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఎనిమిది నుంచి పది కోట్ల రూపాయల వరకు తాను సమకూరుస్తానన్నారు. "అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల" కు అనుగుణంగా-ఏ మాత్రం నాణ్యత తగ్గకుండా వుండే తరహా "ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లను" ఒక్కో రాష్ట్రానికి ఒకటి రూపు దిద్దుకోవాల్సిన అవసరం వుందని సూచించారు. మొదలు ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి, హైదరాబాద్ లో ఏర్పాటు చేయమన్నారు. అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వున్న మోహన్ కందా గారికి ఈ విషయాలన్నీ వివరిస్తూ ఒక ప్రెజెంటేషన్ చేశారు సుధాకర్. "టోల్ ఫ్రీ టెలిఫోన్ నంబర్" కొరకు నాటి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి దయానిధి మారన్ ను కూడా కలుసుకున్నారాయన. ఆయనకెందుకో కేంద్ర ప్రభుత్వం తమ సంస్థకు 112 నంబర్ కేటాయిస్తే బాగుంటుందన్న అభిప్రాయం బలంగా నాటుకుంది అప్పట్లో. కాకపోతే, ఆయన తర్వాత సీ.ఇ.ఓ బాధ్యతలు చేపట్టిన వెంకట్-ఆయన సహచరుడు కిశోర్ తమకు 108 నంబర్ కేటాయించమని కోరడం, అలానే కేటాయించడం, ఆ నంబర్ అచిర కాలంలోనే ఆబాలగోపాలానికి అత్యంత ఆదరణీయమైంది కావడం జరిగింది. పలు విషయాలను స్వయంగా అధ్యయనం చేయడానికి అత్యవసర సహాయ సేవలందిస్తున్న వివిధ దేశాలకు వెళ్లొచ్చారు సుధాకర్.

దీర్ఘ కాలంపాటు అత్యవసర సహాయ సేవలను అందించాలంటే, లాభాపేక్ష లేకుండా నిర్వహించడంతో సరిపుచ్చుకోకుండా, ఏదో రకమైన "రెవెన్యూ మోడల్" అయితే బాగుంటుందన్న ఆలోచన కూడా చర్చకొచ్చింది. డాక్టర్ రంగారావు తో సహా సహాయ సేవల రూపకల్పనలో నిమగ్నమైన వారందరూ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించడంతో, ప్రతి పౌరుడికి "ఉచితంగా సేవలు లభ్యమయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఆ నిర్ణయమే ఇప్పటికీ అమల్లో వుంది. దరిమిలా, రాజు గారి బృందం, అయిదారు పర్యాయాలు ముఖ్యమంత్రి (దివంగత) రాజశేఖర రెడ్డి గారిని కలిసి పలు అంశాలపై ప్రభుత్వ తోడ్పాటు కోరారు. అప్పట్లో ఆర్థిక సహాయం కోరకపోయినా అంతర్లీనంగా భవిష్యత్ లో కోరబోతున్నా మన్న సంకేతం తెలియచేశారు. ఆ సంకేతాన్ని ఏప్రియల్ 2, 2005 న కుదుర్చుకున్న మొదటి అవగాహనా ఒప్పందంలో అతి చాకచక్యంగా పొందుపరిచారు రాజు గారు. అంతే చాకచక్యంగా రెండో ఎంఓయు లో కూడా చేర్చడంతో, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జంధ్యాల హరినారాయణ గారు, కుటుంబ శాఖ కమీషనర్ సీ.బి.ఎస్ వెంకట రమణ గారు 2006 సంవత్సరాంతంలో ప్రారంభించి, 2007-2008 సంవత్సరంలో సుమారు 50-60 శాతం వరకు, ప్రభుత్వ పరంగా నిర్వహణ నిధులను ఇ.ఎం.ఆర్.ఐ కి లభించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆ వివరాలు ముందు-ముందు తెలుసుకుందాం.

ఇక సహాయ సేవలను అందించే సంస్థ రూపురేఖలెలా వుండాలో కూడా సుదీర్ఘంగా చర్చించారు. వాటన్నిటికీ వారణాసి సుధాకర్, డాక్టర్ బాలాజి, డాక్టర్ రంగారావు లాంటి వారితో సహా సత్యం సంస్థలో పనిచేస్తున్న పలువురు నిపుణులను సంప్రదించేవారు రాజు గారు. చివరకు లాభాపేక్ష లేని "సొసైటీ" తరహాలో, తన కుటుంబ సభ్యులే "ప్రమోటర్ సభ్యులు" గా "ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్" (Emergency Management and Research Institute-E.M.R.I) అన్న పేరుతో రిజిస్టర్ చేశారు. ప్రఖ్యాత ఛార్టర్డ్ అక్కౌంటెంట్ ఎస్.వి.రావు గారిని తొలుత ఈ విషయంలో సంప్రదించారు. అత్యవసర సహాయ సేవలకు సంబంధించిన వివిధ అంశాల "ప్రక్రియ-ప్రాసెస్" లను తయారు చేశారు. అందులో ప్రధానమైంది "సెన్స్-రీచ్-కేర్" ప్రక్రియ. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ఇ.ఆర్.సి) స్థాపన విషయంలో చర్యలు ప్రారంభించారు. అంబులెన్స్ డిజైన్ కు చెందిన అంశాలను అధ్యయనం చేశారు. ఇ.ఆర్.సి కి చెందినంతవరకు "కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ" అన్న పేరుతో సత్యం సంస్థ ఇ.ఎం.ఆర్.ఐ కొరకు వ్యయం చేయడాన్ని అప్పట్లో అంతర్గతంగా చర్చనీయాంశమైంది. 2005 సంవత్సరపు "సత్యం బాలన్స్ షీట్లో" ఇ.ఎం.ఆర్.ఐ కి పెట్టిన వ్యయానికి సంబంధించిన లెక్కలు చేర్చారని కూడా అంటారు.

ఇలా మౌలిక సదుపాయాలకు-సహాయ సేవల రూపకల్పనకు సంబంధించిన పనులను చేసుకుంటూనే, ప్రభుత్వంతో ఏప్రియల్ 2, 2005 న మొట్టమొదటి "అవగాహనా ఒప్పందం" (Memorandum of Understanding-MoU) పై ప్రభుత్వ ప్రతినిధి, ఇ.ఎం.ఆర్.ఐ ప్రతినిధి సంతకాలు చేశారు. అప్పట్లో ఇ.ఎం.ఆర్.ఐ ప్రతినిధిగా సీ.ఇ.ఓ వారణాసి సుధాకర్ సంతకం చేయగా ప్రభుత్వం పక్షాన "డిజాస్టర్ మేనేజ్‌మెంట్" శాఖ కార్యదర్శి సంతకం చేసారు. ఎం.ఓ.యు. అంశాల వివరాలు మరో సందర్భంలో తెలుసుకుందాం. రాజుగారు కోరినట్లు గానే జులై 14, 2005 కల్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన మౌలిక సదుపాయాలు తయారయ్యాయి.

ఎం.ఓ.యు పై సంతకం చేసింది సుధాకర్ అయినప్పటికీ, సరిగ్గా ఆ రోజునుంచే ఆయన స్థానంలో ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ గా వెంకట్ చెంగవల్లి నియమించబడ్డ సంగతి ఆ క్షణం వరకు గోప్యంగానే వుంచబడింది. ఇక నాటినుంచి వెంకట్ గారి శకం ఆరంభమయింది. వెంకట్ సారధ్యంలో సుధాకర్ సేవలూ కొనసాగాయి. బాలాజి, రంగారావుల సలహాలు కూడా కొంతకాలం కొనసాగాయి. అయితే, క్రమేపీ "ఒక సూర్యుడు సమస్త జీవులకు..." అన్న చందాన వెంకట్ గారు ఇ.ఎం.ఆర్.ఐ లో అన్నీ తానే అయ్యారు. సంస్థను, సంస్థ లక్ష్యాలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చారు. కాకపోతే "దృష్టి దోషం" తగిలిందేమో... ఎంత త్వరగా పైకెదిగిందో...అంత త్వరగానే రాజుగారి నిష్క్రమణంతో "ఒడిదుడుకుల్లో" ఇరుక్కుపోయింది. ఎందుకిలా జరిగిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అయినప్పటికీ సమాధానాలు కూడా దొరుకుతాయి.

వెంకట్ గారి శకం ఆరంభం, బాహ్య ప్రపంచానికి, ఇ.ఎం.ఆర్.ఐ లో పనిచేస్తున్న సీనియర్ అధికారులు సుధాకర్ వారణాసి-కిషోర్-అనిల్ లాంటి వారికి హఠాత్పరిణామమే అయినా అంతకుముందు సుమారు రెండు నెలలకు పైగా, అత్యవసర సహాయ సేవల యాజమాన్య నిర్వహణా సంస్థ-ఇ.ఎం.ఆర్.ఐ కి ముఖ్య కార్య నిర్వహణాధికారిగా తీసుకొచ్చేందుకు చైర్మన్ రామ లింగరాజు గారు ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 18, 2004 వెంకట్, రాజు గారి మధ్య పరిచయానికి బీజాలు పడ్డాయి. మద్రాస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నిర్వహించదలచిన ఒక కార్యక్రమానికి ఆయన్ను ఆహ్వానించే బాధ్యతను వెంకట్ కు అప్పగించారు నిర్వాహకులు. అందులో భాగంగా జనవరి 20, 2005న ఇద్దరి మధ్య ఒక "బ్రేక్ ఫాస్ట్ సమావేశం" చెన్నైలో జరిగింది. బహుశా అప్పటికప్పుడే వెంకట్ గారి ప్రతిభను ఆకళింపు చేసుకుని వుండాలి రాజు గారు. ఆ మర్నాడు ఇద్దరు ఒకే వేదికపై సుమారు రెండు గంటలకు పైగా కలిసి పాల్గొన్నారు. ఆ వేదికపై ప్రధాన భూమిక వహించిన వెంకట్ గారి "బహు విధ కార్య కలాపాల నిర్వహణా ప్రజ్ఞ" ను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న రాజు గారు, తాను అమలు పర్చదల్చుకున్న "అత్యవసర సహాయ సేవల" కు సమర్థవంతంగా నాయకత్వం వహించగల సత్తా వున్న వ్యక్తిగా ఆయన్ను ఎంపిక చేసుకున్నారు. ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకున్నారు.

జనవరి 22, 2005 న హైదరాబాద్ నుంచి సత్యం అనుబంధ సంస్థలో పనిచేస్తున్న త్యాగరాజు అనే సీనియర్ ఉద్యోగి దగ్గర్నుంచి రాజుగారి "సందేశం" అందింది వెంకట్ కు. "లాభాపేక్ష" ధ్యేయంగా-లక్ష్యంగా పని చేసే పలు "బహుళజాతి సంస్థల" లో పాతిక సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న అనుభవం కలిగిన వెంకట్ కు, భవిష్యత్ లో, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో నిర్వహించాల్సిన ఒక "లాభాపేక్ష లేని" సంస్థకు నాయకత్వం వహించడమంటే ఎలా వుండబోతుందోనన్న ఆందోళన వెన్ను తట్టింది. జీవన యానంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి, "ఉపాధ్యాయ వృత్తి" లో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న తండ్రి గారి సలహా కోరారు వెంకట్. " కేవలం ఏభై సంవత్సరాల వయస్సులోనే సమాజానికి లాభం చేకూర్చనున్న లాభాపేక్ష లేని ఒక సంస్థకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసే అవకాశం కలగడం అదృష్టంగా భావించాలి" అని తండ్రి గారు ప్రోత్సహించారు వెంకట్ ను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా భార్యా సమేతంగా హైదరాబాద్ రాజు గారి ఆహ్వానం మేరకు వచ్చి, ఆయనతో సమావేశం అయ్యారు. తిరిగి మరో మారు ఫిబ్రవరి 3, 2005 న ఇరువురి మధ్య సమావేశం జరిగింది. ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ ఫిబ్రవరి 8, 2005 న సొసైటీ గా-లాభాపేక్ష లేని స్వచ్చంద సంస్థగా ఆవిర్భావం చెందడానికి సరిగ్గా అయిదు రోజుల ముందర, ఆ సంస్థకు భవిష్యత్ లో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసేందుకు వెంకట్ నిర్ణయం తీసుకున్నారు. అలా ఆయన శకానికి అంకురార్పణ జరిగింది ఆనాడు. నేటి వరకూ "మడమ తిప్పకుండా" ఆ బాధ్యతను కష్టమైనా-ఇష్టమైనా నిర్వహిస్తూనే వున్నారాయన.

సెప్టెంబర్ 25, 1953 న జన్మించిన ప్రకాశం జిల్లా చీరాల వాస్తవ్యుడు వెంకట్ చెంగవల్లి, విజయవాడ లయోలా కళాశాలలో విద్యాభ్యాసం ముగించి, వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నారు. అహ్మదాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో ఎం.బి.ఏ చేశారు. నిరంతరం జ్ఞానార్జనపైనే ఆసక్తి కలిగిన వెంకట్ వ్హార్టన్ స్కూల్, లండన్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ బిజినెస్ స్కూల్, కొలంబియా బిజినెస్ స్కూల్ కు చెందిన "యాజమాన్య నాయకుల" అనుభవాలను అధ్యయనం చేశారు-ఆకళింపు చేసుకున్నారు. నేర్చుకున్న ప్రతి అంశాన్ని తాను నిర్వహించిన కార్యకలాపాల్లో సందర్భానుసారంగా అన్వయించుకున్నారు. అనేక విజయాలను సాధించారు-విజయాల దిశగా కొనసాగుతున్నారు ఇప్పటికీ.

ఆర్థిక, ప్రణాళిక, మార్కెటింగ్ పరమైన వివిధ అంశాల్లో అపారమైన నైపుణ్యం-అనుభవం ఆయన సొంతం చేసుకున్నారు. తాను ఎదుగుతూ, తనతో పనిచేసినవారి ఎదుగుదలకు తోడ్పడుతూ, ఉమ్మడిగా ఆయన పనిచేసిన ప్రతి సంస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. ఆయన నిరంతరం అధ్యయనం చేయడమే కాకుండా, తాను నేర్చుకున్న విషయాలను పనిచేస్తున్న సంస్థ అవసరాలకు అన్వయించుకుంటూ, సంస్థలోని సహచర ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ఆయన ప్రత్యేకత. "టీచింగ్-ట్రైనింగ్" కు ఆయన ఇచ్చే ప్రాముఖ్యత వెంకట్ గారి "ప్రెజెంటేషన్ల" లో స్పష్టంగా కనిపిస్తుంది.

1977 నుంచి అనేక బహుళ జాతి సంస్థల్లో ప్రధాన భూమికలను నిర్వహించారు వెంకట్. ప్రధానంగా ఆయన ఫార్మా, కెమికల్, టెక్ స్టైల్ రంగాలలో అనుభవం గడించారు. వెంకట్ ఆలోచనలన్నీ వ్యూహాత్మకమైన వే. "సముచిత స్థానం నుంచి సమున్నత స్థానానికి" తాను పనిచేస్తున్న సంస్థను ఎలా తీసుకెళ్లాలన్న తపన ఆయనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అనేక జాతీయ-అంతర్జాతీయ వేదికల మీద ఆయన చేసిన "పవర్ పాయింట్ ఆధారిత ఉపన్యాసాలు" శ్రోతల-ప్రేక్షకుల మదిలో చిర స్థాయిగా నిలిచిపోతాయి. అంశం హెల్త్ కేర్ కావచ్చు, వ్యూహాత్మక ఆలోచన కావచ్చు, నాయకత్వ నేర్పులు కావచ్చు, వ్యూహాత్మక మార్కెటింగే కావచ్చు, సంప్రదింపుల నైపుణ్యం కావచ్చు... మరేదైనా కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనకు ఆయనే సాటి. వెంకట్ గారి "బహు విధ కార్య కలాపాల నిర్వహణా ప్రజ్ఞ" ను ఆయనను కలిసిన మరుక్షణంలోనే గుర్తించారు రామలింగ రాజు గారు.

వెంకట్ గారు సీ.ఇ.ఓ గా బాధ్యతలు చేపట్టడానికి సుమారు రెండు నెలల ముందు ఫిబ్రవరి 8, 2005 న సత్యం కంప్యూటర్స్ చైర్మన్ వ్యవస్థాపక అధ్యక్షుడుగా, "ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్" (అత్యవసర యాజమాన్య నిర్వహణా పరిశోధనా సంస్థ-ఇ.ఎం.ఆర్.ఐ) ఆవిర్భావం జరిగింది. తన కుటుంబ సభ్యులే "ప్రమోటర్స్" గా అతి చాకచక్యంగా సొసైటీ నియమ-నిబంధనలను రూపొందించారు రాజు గారు. దానికి కారణాలు అనేకం వుండొచ్చు. నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకునే ముందర-విశ్లేషించే ముందర, క్లుప్తంగా ఇ.ఎం.ఆర్.ఐ లక్ష్యాలను-ధ్యేయాలను తెలుసుకుందాం. "భద్రత మీ హక్కు" అన్న నినాదంతో, ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థగా, ఒకే గొడుకుకింద-ఒకే వ్యవస్థ నిర్వహణలో, ఆరోగ్య-వైద్య-అగ్నిమాపకదళ సంబంధిత అత్యవసర సహాయ సేవలను అందించేందుకు నెలకొల్ప బడిందే అత్యవసర యాజమాన్య నిర్వహణా పరిశోధనా సంస్థ (ఇ.ఎం.ఆర్.ఐ). తొలుత ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఆర్థిక సహాయం ఆశించకుండా, ఆంధ్ర ప్రదేశ్ లో ఆరంభమైన అత్యవసర సహాయ సేవలు, అచిర కాలంలోనే, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంలో, పది రాష్ట్రాలకు వ్యాపించి, లక్షలాది ప్రాణాలను కాపాడగలిగి, జాతీయ-అంతర్జాతీయ స్థాయి మన్ననలను అందుకునే స్థాయికి ఎదిగాయి. అత్యవసర సహాయ సేవలను, సగటు పౌరుడిపై, ఏ విధమైన ఆర్థిక భారం పడకుండా, వీరు-వారు అనే తేడా లేకుండా, అందరికీ లభ్యమయ్యేలా నిర్వహించేందుకు ఉద్దేశించబడిన ఇ.ఎం.ఆర్.ఐ అందుకనుగుణంగానే తన లక్ష్యాలను-ధ్యేయాలను రూపొందించుకుంది. క్లుప్తంగా అవి:

• అత్యవసర పరిస్థితికి (ఊహించని విధంగా హఠాత్తుగా, ధన-మాన-ప్రాణహాని ప్రమాదం)గురైన వ్యక్తులను, వారికి ప్రమాదం సంభవించిందని సమాచారం అందుకున్న వెంటనే, తక్షణ సహాయాన్ని సరైన సమయంలో అందించడం

• అత్యవసర సమయాల్లో ప్రాణ రక్షణకు, యాజమాన్య నిర్వహణ సమాచార సహాయ కేంద్రంగా సేవలందిస్తూ, తద్వారా పౌరుల ప్రాణాలను కాపాడి, వారి కుటుంబాలపై ఆర్థిక భారం పడకుండా చూడడం

• అంకితభావంతో-నిబద్ధతతో, అత్యవసర యాజమాన్య నిర్వహణ-పరిశోధనను ప్రోత్సహించే ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందేందుకు, జాతీయ స్థాయి నాయకత్వాన్ని-నైపుణ్యాన్ని సమకూర్చుకోవడం, పెంపొందించడం

• దేశవ్యాప్తంగా, అత్యవసర సహాయ సేవలకు సంబంధించిన అవసరాలను తీర్చే దిశగా, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని-మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటూ, క్రమేపీ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వాటిని మలుచుకోవడం

• వ్యూహాత్మక భాగస్వామ్యం, ఆలోచనాత్మక కార్యక్రమం, సహకార విధానాల ద్వారా అత్యవసర యాజమాన్య నిర్వహణలో-పరిశోధనలో నిరంతరాభివృద్ధిని సాధించడం

• పౌరుల అవసరాలకు అనుగుణంగా సహాయ సేవల రూపకల్పన చేయడం

• వీలున్నంతవరకు, అత్యవసర సహాయ సేవల అవసరం పౌరులకు కలగకుండా నివారణ చర్యలు చేపట్టే దిశగా పరిశోధనలు చేపట్టడం

• క్షేత్ర స్థాయిలో అత్యవసర సహాయ సేవలను పటిష్ఠ పరిచేందుకు-అమలు చేసేందుకు, అత్యున్నత స్థాయి జాతీయ-అంతర్జాతీయ సంస్థల, ప్రభుత్వ-ప్రభుత్వేతర సంస్థల తోడ్పాటుతో పరిశోధనలు జరపడం

• కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల చొరవతో-తోడ్పాటుతో విజయవంతంగా అత్యవసర సహాయ సేవలను అమలు పరిచేందుకు వ్యూహాత్మక సూచనలను ఇవ్వడం

• సభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్ షాపులు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో ఈ సేవల పట్ల అవగాహన పెంపొందించడం.

ఇంత గొప్ప ఆశయంతో-ఆశయాలతో ఆవిర్భవించిన ఇ.ఎం.ఆర్.ఐ సంస్థకు ప్రపంచ ప్రఖ్యాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ అధిపతి చైర్మన్ గా, అపారమైన అనుభవం-అంకిత భావం కలిగిన వ్యక్తి సీ.ఇ.ఓ గా వున్నప్పటికీ సంస్థ ఒడిదుడుకులకు ఎందుకు లోను కావాల్సి వచ్చిందో అంత సులభంగా అర్థం చేసుకోలేం. మున్ముందు ఆ కారణాలనూ తెలుసుకుందాం.

Saturday, May 8, 2010

IV-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-4) : వనం జ్వాలా నరసింహారావు

అంతర్మధనం-4
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలా నరసింహారావు

తాను నడుపుతున్న సత్యం కంప్యూటర్స్ సంస్థ భారతదేశంలోనూ-అంతర్జాతీయం గానూ పేరు-ప్రతిష్ఠలతో పాటు కోట్లాది రూపాయల లాభాలను ఆర్జించడంతో, సంస్థ చైర్మన్ రామలింగ రాజులో అంతర్లీనంగా వున్న దాతృత్వ ధోరణి బహిర్గతం కాసాగింది. తనను ఉన్నతస్థితికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా ముందుగా తన ప్రాంత ప్రజలకు, దరిమిలా రాష్ట్ర ప్రజలకు, క్రమేపీ దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి ఏదైనా లాభం కలిగే పని చేపట్టాలన్న భావన కలిగింది రాజుగారిలో. అంతవరకు ప్రత్యక్షంగానో-పరోక్షంగానో ప్రజల ధనంతోనే తన సంస్థ లాభాలను ఆర్జిస్తున్నదనీ, తాను ఆర్జించిన లాభాలలో కొంత ఆ ప్రజలకే ముట్టచెప్పాలనీ అనుకున్న రాజుగారు తన ఆలోచనలను కార్యరూపంలోకి తేగలిగే వ్యక్తులకోసం వెతకసాగారు. తన సంస్థకు చెందిన-తానే నియమించిన "సత్యం ఫౌండేషన్" స్వచ్చందసంస్థ డైరెక్టర్ డాక్టర్ ఊట్ల బాలాజిని సంప్రదించారు రాజు గారు. యాదృఛ్చికమో-భగవదేఛ్చో కాని సరిగ్గా అదే సమయంలో బాలాజికి ఒక చేదు అనుభవం ఎదురయ్యింది. ఆయన స్నేహితుడొకరికి ప్రాణాపాయ ప్రమాదం సంభవించడం, ఆ సందర్భంలో ఆ స్నేహితుడికి అత్యవసర వైద్య సహాయం కొరకు ఆసుపత్రికి తరలించడానికి కనీస సౌకర్యాలున్న అంబులెన్స్ కోసం బాలాజి ప్రయత్నాలు చేయడం, అతి కష్టం మీద ఒక నామ మాత్రపు "మేటా డోర్ వాహనం" అంబులెన్స్ లభించడం, చివరకు బాలాజి సరైన సమయంలో-సరైన రీతిలో స్నేహితుడిని ఆసుపత్రికి చేర్చలేక పోవడం, అతడు మరణించడం జరిగింది. ఆ సంఘటన డాక్టర్ బాలాజిని కదిలించడమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో, తగిన వైద్య సహాయం అందించుకుంటూ, సమీప ఆసుపత్రికి చేర్చగలిగే అంబులెన్సులను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే మార్గం ఏదన్నా వుంటే బాగుంటుందన్న భావన కూడా కలిగింది. తనకు ఈ విషయంలో తోడ్పడగల వైద్య నిపుణుల కొరకు అన్వేషణ సాగించారు. ఒకవిధంగా, రాజుగారి ఆలోచనకనుగుణంగా బాలాజి మనస్సులో మెదిలిన భావన ఆద్యతన భవిష్యత్ లో ఒక గొప్ప సేవా కార్యక్రమంగా రూపు దిద్దుకుని, లక్షలాది ప్రాణాలను కాపాడేందుకు నాంది పలికిందని చెప్పొచ్చు. ప్రస్తుతం రామలింగ రాజు గారు స్థాపించిన మరో స్వచ్చంద సంస్థ హెచ్.ఎం.ఆర్.ఐ లో డాక్టర్ బాలాజి ముఖ్య కార్య నిర్వహణాధికారిగా పనిచేస్తున్నారు.

రాజు గారి ఆలోచనలు కార్యరూపంలోకి తేవడానికి డాక్టర్ బాలాజికి తోడ్పడిన వారిలో ముందు వరుసలో డాక్టర్ ఎ.పి. రంగారావు, వారణాసి సుధాకర్, శ్రీకాంత్, కృష్ణ కోనేరు, శ్రీనివాస రాంబాబు, పొలిమల్లు శివ వున్నారు. వీరి లాంటి ఎందరో కలిసి రూపొందించిన ప్రణాళికా బద్ధమైన కార్యాచరణ పథకమే 108-అత్యవసర సహాయ సేవలు. "చీమల పుట్ట పాములపాలైనట్లు", ప్రస్తుతం వారెవరినీ అనుకున్నవారు లేకపోగా, కనీసం, ఒడిదుడుకులకు లోనైన ఆ సేవలను ఆదుకునేదెలా అన్న విషయంలోనైనా ఆవిర్భావ కాలం నాటి వ్యక్తులను సంప్రదించాలన్న ఆలోచన లేకపోవడం దురదృష్టకరం. రాజుగారెప్పుడూ అంబులెన్స్ పైన తన పేరు గాని, తన సత్యం సంస్థ పేరు కానీ వుండాలని మాటమాత్రంగానైనా అనలేదు. ఇప్పుడేమో అవే అంబులెన్సులు ఒకరి సొంత ఆస్తిలాగా రోడ్లపై తిరుగుతున్నాయి. నాకు గుర్తున్నంతవరకు, 108-అత్యవసర సహాయ సేవల ఆవిర్భావ నేపధ్యంలో, అమోఘమైన కృషిచేసి, వైద్య పరంగా ప్రతి చిన్న అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి, ఆ మోడల్ ను రూపొందించి-ఏడాదికి పైగా అన్నిరకాల సలహా సంప్రదింపులను అందచేసిన డాక్టర్ ఎ.పి. రంగారావు, రాజుగారి నిష్క్రమణ తర్వాత, అనుకోకుండా ఒకనాడు ఇ.ఎం.ఆర్.ఐ క్యాంపస్‌కు వచ్చారు ఏదో పనిమీద. సరిగ్గా అదే సమయంలో సంస్థ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన జీ.వీ. కృష్ణారెడ్డి మొట్టమొదటి సారిగా క్యాంపస్‌ చూడడానికి వచ్చారు. ఏక కాలంలో క్యాంపస్‌లో వున్న వారిద్దరినీ ఒకరినొకరికి పరిచయం చేయాలన్న ఆలోచనకూడా డాక్టర్ విజిట్ ను ఏర్పాటు చేసిన వారికి గాని-ఆయన్ను, ఆయన సామర్థ్యాన్ని బాగా ఎరిగిన ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్ గారికి గాని రాలేదు. సంబంధ-బాంధవ్యాల విషయంలో ఎంతో జాగ్రత్తపడే వెంకట్ గారికి జీ.వీ.కె దగ్గరకు డాక్టర్ ను ఒక్కసారైనా తీసుకెళ్లాలన్న ఆలోచన రాకపోవడానికి బలవత్తరమైన కారణమేదైనా వుండొచ్చు. బహుశా వారిద్దరికీ పరిచయం చేసుంటే, ఈ నాటి ఒడిదుడుకులకు, కొన్ని పరిష్కార మార్గాలు ఏనాడో లభించేవేమో ! ఇప్పటికీ మించిపోయింది లేదు.

ఇదిలావుండగా హైదరాబాద్ పరిసరాల్లో-నగరంలో అప్పట్లో ఏదో రకమైన సేవలందిస్తున్న అంబులెన్సులను గురించి కొంత సమాచారం సేకరించారు బాలాజి. వాటి సంఖ్య, డిజైన్, సౌకర్యాలు, నాణ్యత లాంటివి అధ్యయనం చేశారు. తాను అర్థం చేసుకున్న విషయాలను రామలింగ రాజు గారికి విశ్లేషణాత్మకంగా వివరించారు. అలా వివరించిన విధానాన్ని ఇష్టపడ్డ రాజు గారు, హైదరాబాద్ నగరంలో ఒకటి-రెండు అంబులెన్సులను నడిపి ఫలితాలెలా వుంటాయో చూద్దామనుకున్నారు. తన ఆలోచనను అమలుచేయాల్సిన బాధ్యత బాలాజికి అప్పచెప్పారు. వాస్తవానికి ఆపాటికే రాజుగారి స్వస్థలమైన భీమవరంలో భైర్రాజు సంస్థ ఆధ్వర్యంలో ఒక అంబులెన్సును తిప్పుతున్నారు. శాస్త్రీయంగా ముందుకుపోవాలన్న సంకల్పంతో, ఈ విషయంలో అవగాహన-ఆలోచన-అనుభవం-నిబద్ధత వున్న వైద్య రంగ నిపుణుడి కొరకు ప్రయత్నాలను తీవ్రతరం చేశారు బాలాజి. ఆయనకు పరిచయమున్న, ఒక స్వచ్చంద సంస్థను నడుపుతున్న శశి అనే వ్యక్తి ద్వారా డాక్టర్ రంగారావును కలుసుకున్నారు. "సత్యం సంస్థ లాంటి విశ్వసనీయ సంస్థ" అధిపతి ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్తానంటే తన సహాయం తప్పక వుంటుందని రంగారావు హామీ ఇచ్చారు. కేవలం ఒక్కో పౌరుడి మీద సంవత్సరానికి పది రూపాయలు మాత్రమే ఖర్చు చేయగలిగితే దేశమంతా సంపూర్ణ వైద్య సౌకర్యాలున్న అంబులెన్సులను నడపొచ్చొని అప్పటికప్పుడే సూచించారు రంగారావు గారు. వారిద్దరూ కలిసిన మొదటి రోజే సరదాగా ధూమపానం చేసుకుంటూ బృహత్తరమైన ప్రణాళికను రూపకల్పన చేశారు. ఇదంతా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మొదటి సారి 2004లో అధికారంలోకి రావడానికి రెండేళ్ల ముందు నుంచి ఆరంభమై సరిగ్గా ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి కార్యరూపం దాల్చడం మొదలైంది.

అయితే అప్పటికీ-ఎప్పటికీ "మిలియన్ డాలర్ల ప్రశ్న" గా మిగిలిపోయిన ఒకే-ఒక అంశం రామలింగ రాజు గారు తన బృహత్తర ప్రణాళికకు ఎంత ఖర్చు చేయదల్చుకున్నారనే విషయం. ఆయన ఖచ్చితంగా ఎంత ఇవ్వ దల్చుకున్నాడో, ఎన్నడూ, సూచన మాత్రంగానైనా చెప్పకపోవడం విశేషం.

ఈ నేపధ్యంలో, ఒక రోజు ఉదయాన్నే రాజుగారి దగ్గర్నుంచి డాక్టర్ బాలాజికి ఫోనొచ్చింది. ఒకటి-రెండు రోజుల్లో ముఖ్యమంత్రి (దివంగత) రాజశేఖర రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఏలూరుకు వస్తున్నారని, ఆ సందర్భంగా ఆయనకు అందచేసేందుకు, తమ ఆలోచనలకనుగుణంగా, అత్యవసర సహాయ సేవలకు-అంబులెన్సులకు సంబంధించి ఒక సమగ్రమైన పథకాన్ని తయారు చేసి తెమ్మని రాజుగారు కోరారు. అంబులెన్సు సేవల ఆవశ్యకతను వివరించే విధంగా నివేదిక వుండాలని కూడా ఆయన సూచించారు. అంతవరకు తాను-తన మిత్ర బృందం కలిసి సేకరించిన తత్సంబంధమైన వివరాలను క్రోడీకరించి, ఒక "ప్రతిపాదన” ను తయారుచేసి రాజుగారి దగ్గరకు పట్టుకెళ్లారు బాలాజి. కొంతకాలం (మహీంద్రా) సత్యం కంప్యూటర్స్ సంస్థకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన ఏ.ఎస్. మూర్తి గారింట్లో సరదాగా డిన్నర్ పార్టీలో వున్న సమయంలో బాలాజీ తీసుకెళ్లి చూపించిన ప్రతిపాదనను రాజుగారు మెచ్చుకున్నారు. ఆ విధంగా భవిష్యత్ లో కార్యరూపం దాల్చు కోనున్న ఒక బృహత్తర ప్రణాళికకు, ఆవిర్భావ ప్రతిపాదనకు అంకురార్పణ జరిగింది. ఆ మర్నాడే ఆ ప్రతిపాదన ముఖ్యమంత్రికి సమర్పించేందుకు బాలాజిని ఏలూరుకు రమ్మని సూచించారు రాజుగారు. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు పదవీ ప్రమాణ స్వీకారం చేసి అప్పటికింకా పట్టుమని నెల రోజులు కూడా కాలేదు. జూన్ నెల 2004 లో జరిగిందిది. తక్షణమే ప్రయాణమై అక్కడకు చేరుకొని రాజశేఖర రెడ్డి గారికి నివేదిక సమర్పించారిద్దరు. బాగుందని మెచ్చుకున్న ముఖ్యమంత్రి ఆయన కార్యదర్శికిచ్చి పరిశీలించమన్నారు దాన్ని.

ఇది జరిగిన వారం రోజుల్లోనే ముఖ్యమంత్రికి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని, దాన్ని తయారుచేయమని బాలాజిని పురమాయించారు రాజు గారు. సత్యం ఫౌండేషన్ డైరెక్టర్ గా దైనందిన కార్యకలాపాల్లో బాలాజికి పని ఒత్తిడి ఎక్కువగా వుంటుందని భావించిన రాజు గారు సత్యం సంస్థలోనే పనిచేస్తున్న మరో సీనియర్ అధికారి వారణాసి సుధాకర్ సహాయం తీసుకోమని కూడా చెప్పారు బాలాజికి. ఎలాగూ అపాటికే డాక్టర్ రంగారావు గారి వైద్య పరమైన సలహా-సంప్రదింపులు తీసుకుంటూనే వున్నారు. సత్యం మేనేజ్ మెంట్ విభాగంలో పనిచేస్తున్న మరో అధికారి కృష్ణ కోనేరు కూడా వీరికి తోడయ్యారు. ఆయన సూచించిన "సెన్స్-రీచ్-కేర్" (ప్రాణాపాయ పరిస్థితుల్లో అత్యవసర సహాయం అవసరమైన వ్యక్తికి సంబంధించిన సమాచార సేకరణ-ఆ వ్యక్తి వున్న స్థలానికి వీలైనంత త్వరలో చేరుకోవడం-చేరుకున్న వెంటనే అత్యవసర వైద్య సహాయం తక్షణమే అందించే ప్రక్రియ ఆరంభించి సమీప ఆసుపత్రికి అంబులెన్సులో తరలించడం) నమూనా రాజుగారికి బాగా నచ్చిందంటారు బాలాజి. డాక్టర్ రంగారావు ఎంపికచేసిన (అప్పటికి) సుమారు 132 రకాల "ఎమర్జెన్సీలను" ప్రజెంటేషన్ లో చొప్పించారు. ఇవన్నీ రాజుగారు చాలా మెచ్చుకొని ముఖ్యమంత్రితో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం మీద డాక్టర్ బాలాజి అనుకున్న రోజున ముఖ్యమంత్రికి నచ్చేలా చక్కటి ప్రజెంటేషన్ చేశారు. ఇక అప్పటినుంచి రాజు గారి సూచన మేరకు వారణాసి సుధాకర్ ఎక్కువ చొరవ తీసుకోవడం ప్రారంభించారు.

వారణాసి సుధాకర్ కు ముఖ్య భూమిక అప్పగించమని బాలాజికి చెప్పడంతో సరిపుచ్చుకోకుండా స్వయంగా రాజుగారు దానికి పూనుకున్నారు. బహుశా వీలైనంత త్వరగా తన ఆలోచనలను కార్యరూపంలోకి తేవాలన్న ఆతృత ఆయనలో వుండొచ్చు. బెంగుళూర్లో వినాయక చవితి పూజ చేసుకుంటున్న వారణాసి గారికి సెప్టెంబర్ 17, 2004 ఉదయాన రాజు గారి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. పూజ పూర్తి చేసుకున్న తర్వాత వారిరువురు మాట్లాడుకున్నారు. మరి కాసేపట్లో మళ్ళీ ఫోన్ చేసిన రాజు గారు, ఉమ్మడిగా సమాలోచన చేసేందుకు, కాన్ఫరెన్స్ కాల్ ద్వారా, తమ్ముడు (నాటి సత్యం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్) రామరాజును, ఏ.ఎస్. మూర్తి గారిని, వారణాసి గారిని కలిపి మాట్లాడారు. అప్పట్లో సుధాకర్, సత్యం సంస్థలో, సాంకేతిక సంబంధమైన బిజినెస్ ను, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హోదాలో సుమారు ఎనిమిది సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నారు. వృత్తి పరంగా ఆయనకు సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం గల వ్యక్తిగా పేరుంది. అత్యవసర సహాయ సేవలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకనుగుణంగా అందచేయాలంటే, సాంకేతిక పరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం ప్రాధాన్యతా పరమైన అంశమని గ్రహించిన రాజు గారు, అవి సమకూర్చగల సామర్థ్యం వున్న వ్యక్తి వారణాసి సుధాకర్ అని భావించారు. "ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీసెస్-అత్యవసర సహాయ సేవల" ను అందుబాటులోకి తెచ్చే బాధ్యత స్వీకరించాల్సిందిగా వారణాసిని కోరారు రాజు గారు.

తనతో ఫోన్లో మాట్లాడిన రాజు గారు, తనకు బాధ్యతను అప్పచెప్తూ, పేపర్ పై రాసుకుని, ఫోనులోనే చదివిన దాన్ని (సుమారు ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా) వారణాసి సుధాకర్ ఇప్పటికీ మర్చిపోలేదు. "సుధాకర్ ! అమెరికాలోని 911 తరహా అత్యవసర సహాయ సేవలను అందించేందుకు, అవసరమైన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ను, అంతర్జాతీయ ప్రమాణాలతో, ఒక సంవత్సర కాలంలో మీరు ఏర్పాటుచేసి తగు విధమైన సేవలు లభించేలా చర్యలు చేపట్టాలి. తొలుత ఆంధ్ర ప్రదేశ్ లోను, క్రమేపీ దేశ వ్యాప్తంగానూ దాని ద్వారా పౌరులందరికీ ఆ సేవలు లభ్యమయ్యేలా చూడాలి" అని దాని సారాంశం. రాజు గారికి (అప్పట్లో) తాను చెప్పదల్చుకున్న విషయంలో పూర్తి అవగాహన వున్నప్పటికీ "స్పష్టంగా" వ్యక్తం చేయడంలో కొంత ఇబ్బంది పడేవారని సుధాకర్ అభిప్రాయం. తనకు అప్ప చెప్పిన బాధ్యతకు సంబంధించిన సందేహాలను తక్షణమే ఫోన్లో వ్యక్త పరిచారు సుధాకర్. "అత్యవసర యాజమాన్య-నిర్వహణ సేవలు" అంటే తనకు అవగాహన లేదని, "అంతర్జాతీయ ప్రమాణాల సేవలు" అంటే ఏమిటని, "ప్రభుత్వంతో కలిసిమెలిసి ఎలా పనిచేయాలో తెలియదని" మూడు సందేహాలను వెలిబుచ్చారు. అవన్నీ త్వరలోనే ఆయనకు అర్థమవుతాయని ముక్త సరిగా ముగించారు రాజుగారు.

రాజుగారి ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చే బాధ్యతను స్వీకరించిన సుధాకర్ ముందు ఎన్నో సవాళ్లు కనిపించసాగాయి. "మెడికో-లీగల్" కు సంబంధించిన సమస్యలను ఎలా అధిగమించాలన్నది అందులో ముఖ్యమైందంటారాయన (వాస్తవానికి నేను ఇ.ఎం.ఆర్.ఐ లో పనిచేసిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఒక్కనాడుకూడా అది సమస్య కాలేదు). ఆయన ముందున్న మరో సవాలు ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం (నేను అక్కడ పనిచేసినంతకాలం చేసిన పనే అది. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే కాకుండా మొత్తం అత్యవసర సహాయ సేవలు లభ్యమవుతున్న పది రాష్ట్రాలలో నాకు ఆ సమస్య ఎదురవ్వలేదు). మరో ప్రధానమైన సవాలు, రాజు గారు ఈ సేవలకు ఎంత మోతాదులో నిధులను సమకూరుస్తాడో నని. నిజానికి అప్పటికీ-ఎప్పటికీ ఇది సవాలుగానే, ఒక "యక్ష ప్రశ్న" గానే మిగిలింది. ఇక దానికి సమాధానం లేనట్లే ! ఇలా సవాలు వెంట సవాలు సుధాకర్ మదిని తొలుస్తున్నా కార్యాచరణ పథకం రూపొందించడానికి అవేవీ అవరోధాలు కాలేదు. సెప్టెంబర్ 2004-ఏప్రియల్ 2005 మధ్య కాలంలో సవాళ్లకు సమాధానాలు దొరకడమే కాకుండా, ఎమర్జెన్సీకి "సరైన నిర్వచనం" లభించింది. సందేహాలకు సమాధానాలతో పాటు, ఎన్నో కొత్త అంశాలకు సంబంధించి అవగాహనకు రాసాగారు. టోల్ ఫ్రీ టెలిఫోన్ గురించి, దాని నంబర్ గురించి, అంబులెన్స్ డిజైన్ గురించి, లోగో గురించి, వైద్య పరమైన ప్రోటోకాల్స్ గురించి, సాంకేతిక సదుపాయాల గురించి, ప్రభుత్వ భాగస్వామ్యం గురించి స్పష్టత రాసాగింది. రాందల్లా బడ్జెట్ విషయంలోనే. సుధాకర్ వైద్య పరమైన విషయాలనేకం డాక్టర్ రంగారావుతో చర్చించేవారు. తనకు సాంకేతిక పరంగా తోడ్పడేందుకు వై.ఎన్.ఎస్ కిషోర్ అనే నిపుణుడిని ఇ.ఎం.ఆర్.ఐ లో నియమించారు. అంతకు ముందే బాలాజి సత్యం సంస్థలో నియమించిన మరో నిపుణుడు అనీల్ జంపాలను కూడా ఇ.ఎం.ఆర్.ఐ కి తీసుకొచ్చారు. ఆయనకు అమెరికాలో ఆ రంగంలో పనిచేసిన అపారమైన అనుభవం వుంది.

వీరిద్దరు ఇ.ఎం.ఆర్.ఐ సంస్థ పెరుగుదలకు చాలా కృషి చేశారు. కిషోర్ ఇప్పటికీ ఇంకా అక్కడే పనిచేస్తున్నారు. ఆయన కక్కడ ప్రమేయం లేని రంగం లేదనాలి. బహుశా పాత తరం వాళ్లలో ఆయనొక్కడే (ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత సీ.ఓ.ఓ హెచ్.ఎస్.డి.శ్రీనివాస్, వెంకట్ గారు తప్ప) మిగిలారేమో ఇంకా అక్కడ. రెండో తరం వాళ్లలో కూడా బహుశా వైద్య శిక్షణకు సంబంధించిన జీ.వి.రమణారావు గారొక్కడే మిగిలారనుకుంటాను. అంతర్జాతీయంగా 108-అత్యవసర సహాయ సేవలకు వివిధ దేశాల్లో గుర్తింపు రావడానికి, వివిధ దేశాల్లోని సంబంధిత సంస్థలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అనిల్ జంపాల అపారమైన కృషి చేశారు. "టెంకాన్" అన్న పేరుతో అంతర్జాతీయ స్థాయి సెమినార్ ను హైదరాబాద్ లో నిర్వహించి, అనాదిగా భారతదేశంలో అత్యవసర సహాయ సేవలు ఎలా అంద చేశారన్న అంశాల నుంచి,ఆధునిక ప్రపంచంలో అవి ఎలా లభ్యమవుతున్నాయన్న అంశాల వరకు పలు విషయాలను కూలంకషంగా చర్చించుకోవడానికి వేదికను ఏర్పాటుచేసిన ఘనత అనిల్ కే దక్కుతుక్కుతుంది. అనిల్-కిషోర్ , ఇద్దరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన వారే కావడంతో, ఆ రంగానికి సంబంధించిన అనేక విషయాలు, సమీక్షా సమావేశాల్లో చర్చకొచ్చేవి. ఒక్కోసారి అవి ఘాటుగా వుండేవి కూడా. వాళ్లిద్దరూ సంస్థ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడినప్పటికీ, ఒకే ఒక్క విషయంలో నేను ఊహించని రీతిలో ఎందుకు జరిగిందో ఇప్పటికీ నేను అర్థం చేసుకోలేకపోయాను. వారిద్దరినీ కాదని, వీరికంటే పై స్థాయిలో నూకల సుధాకర్ ను ఆంధ్ర ప్రదేశ్ "ప్రధాన ఆపరేటింగ్ అధికారి" గా రాజుగారు ఎందుకు నియమించాల్సి వచ్చింది? ఎందుకు వెంకట్ ఆ విషయంలో అడ్డు చెప్పలేదు? వారిద్దరికంటే నూకల సుధాకర్ సమర్థుడనే కదా ! అంత గొప్ప సమర్థుడిని అతి తక్కువ కాలంలో (అదీ రాజుగారు చైర్మన్ గా తొలగిన కొద్ది రోజులకే) తప్పుకోమని అడగాల్సిన కారణాలేమై వుంటాయి? ఈ నాటి సంస్థ ఒడిదుడుకులకు ప్రత్యక్షంగా కాని-పరోక్షంగా కాని ఆ కారణాలు ఎంత సహేతుకం అనొచ్చు?

మొదటి అవగాహనా ఒప్పందం ప్రభుత్వంతో కుదుర్చుకోవడానికి పూర్వ రంగంలోనే అనిల్, కిషోర్ ఇద్దరు చేసిన కృషి గాని, ఆ తర్వాత సంస్థ ద్వారా పది రాష్ట్రాల్లో అత్యవసర సహాయ సేవలు లభ్యమయ్యేలా చూడడంలో గాని వారిద్దరి కృషి అమోఘం. నూకల సుధాకర్ లాగానే ఎందరినో "ఆయా రంగాలలో నిపుణులు" అన్న పేరుతో ఇ.ఎం.ఆర్.ఐ లో నియమించడం జరిగింది. అలా నియమించబడిన వారిలో సంస్థ ఎదుగుదలకు కృషి చేసినవారికంటే, చేయనివారే ఎక్కువని అనాలి. బహుశా ఆర్థికంగా ఈ నాటి ఒడిదుడుకులకు కారణం సంస్థా పరంగా వారందరికీ చెల్లించిన పెద్దమొత్తంలోని జీతాలు కూడా. వారికి చెల్లించిన పెద్ద మొత్తంలోని జీతాలను చైర్మన్ రామలింగ రాజు గారు సమకూర్చకపోయినా, ఏ నిధుల్లోంచి-ఎందుకు మళ్లించాల్సి వచ్చిందోనన్న ప్రశ్నకు జవాబు దొరకదేమో ! ఆ వివరాలు మరోసారి తెలుసుకుందాం.

Monday, May 3, 2010

III-108 అత్యవసర సహాయ సేవల ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల వెనుక దాగి వున్న వాస్తవాలు (అంతర్మధనం-3) : వనం జ్వాలానరసింహారావు

అంతర్మధనం-3
108 అత్యవసర సహాయ సేవల
ఆవిర్భావం-పరిణామక్రమం-ఒడిదుడుకుల
వెనుక దాగి వున్న వాస్తవాలు
వనం జ్వాలానరసింహారావు

జీ.వీ.కె రెడ్డి గారి అధ్యక్షతన జీ.వీ.కె.ఇ.ఎం.ఆర్.ఐ గా 108-అత్యవసర సహాయ సేవలు రూపాంతరం చెందాక ఊహించీ-ఊహించని-ఊహ కందని అనేకానేక మార్పులు యాజమాన్య పరంగా కొన్ని-నిర్వహణ పరంగా మరికొన్ని కనిపించసాగాయి. మార్పు సహజం అని సర్దుకునే ప్రయత్నం మాలో కొందరు చేస్తే, అనారోగ్యకరమైన మార్పులకు అంకురార్పణ జరిగిన ప్రతి సందర్భంలోనూ బాధను-అసంతృప్తిని మరికొందరం బాహాటంగానో, జనాంతికంగా నో వ్యక్త పరిచాం. మార్పుకు సంబంధించిన సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపించాయనడానికి నిదర్శనంగా జులై నెల 8, 9, 10-2009న జరిగిన "ఇంటెగ్రేటర్స్ సమీక్షా సమావేశం" లో చోటుచేసుకున్న సంఘటనలు కొన్ని ఉదహరించవచ్చు. నూతన చైర్మన్ మొదటిసారిగా తన ఆంతరంగాన్ని ఇ.ఎం.ఆర్.ఐ సీనియర్ అధికారుల సమక్షంలో ఆవిష్కరించారు. రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఇ.ఎం.ఆర్.ఐ-108 అత్యవసర సహాయ సేవల నెట్‌వర్క్ నుంచి తొలగిపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బహిరంగంగానే శల విచ్చారు. మరి, ఒక్కొక్క రాష్ట్రాన్ని, మాజీ చైర్మన్ రామ లింగరాజు గారి "భవిష్యత్ సందర్శన దృశ్యం-విజన్" ఆలోచనా ధోరణికి ( అత్యవసర సహాయం కావాలని కోరుతూ కనీసం పదిలక్షలకు పైగా టెలెఫోన్ కాల్స్ ప్రతిరోజూ 108 కు వచ్చేలా చూడడం-ప్రతిఏటా దేశవ్యాప్తంగా కనీసం పది లక్షలకు పైగా ప్రాణాలను రక్షించడం) అనుగుణంగా, ఎంతో కృషి చేసి-ఆయా రాష్ట్రాల అధికారులకు-అనధికారులకు నచ్చచెప్పి ఇ.ఎం.ఆర్.ఐ-108 అత్యవసర సహాయ సేవల నెట్‌వర్క్ లోకి తీసుకొచ్చిన మాలాంటి వారికి (వెంకట్ గారితో సహా), అలా వచ్చిన రాష్ట్రాల్లో ఏ ఒక్కటి తొలగిపోయినా కలిగే బాధ మాటల్లో వ్యక్తపరిచేదికాదు. అర్థం చేసుకోగలిగేవారికి మాత్రమే అర్థమవుతుంది.

ఆ వివరాల్లోకి పోయే ముందర ఇ.ఎం.ఆర్.ఐ లో క్రమం తప్పకుండా జరిగే సమీక్షా సమావేశాల గురించి తెలుసుకుందాం.

ఇ.ఎం.ఆర్.ఐ ఆవిర్భావంనుంచి సంస్థ సీ.ఇ.ఓ, ప్రతినెలా క్రమం తప్పకుండా, అత్యవసర సహాయ సేవలకు సంబంధించిన అన్ని విషయాలపై కూలంకషంగా సమీక్షలు చేసేవారు. ఆ సమీక్షా సమావేశాలను "బిజినెస్ సమీక్షా సమావేశం-బీ.ఆర్.ఎం" అని, "ఇంటెగ్రేటర్స్ సమీక్షా సమావేశం-ఐ.ఆర్.ఎం" అని సమావేశంలో పాల్గొనే సంబంధిత అధికారుల స్థాయిని బట్టి పిలిచేవారు. ఈ రెండు కాకుండా, ప్రతినెలా, కనీసం ఒక్కసారన్నా చైర్మన్ రాజుగారు ఉన్నతస్థాయి యాజమాన్య (ఇంటెగ్రేటర్స్) అధికారులను పిలిచి మరో సమీక్ష జరిపేవారు. దాన్ని "చైర్మన్ సమీక్షా సమావేశం-సీ.ఆర్.ఎం" అని అనే వాళ్లం. మొదటి రెండు సీ.ఇ.ఓ-ముఖ్య కార్య నిర్వహణాధికారి వెంకట్ చెంగవల్లి నిర్వహిస్తే, మూడోది చైర్మన్ రాజు గారే స్వయంగా నిర్వహించే వారు. కాకపోతే, మొదట్లో కేవలం ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రమే లభ్యమయిన 108-అత్యవసర సహాయ సేవలు, క్రమేపీ మరో పది రాష్ట్ర్రాలకు వ్యాపించడంతో, బీ.ఆర్.ఎం సమీక్షా సమావేశాలను సంబంధిత రాష్ట్ర్రాల ప్రధాన ఆపరేషన్స్ హెడ్ నిర్వహించడం మొదలయింది.

సీ.ఇ.ఓ వెంకట్ గారి సమీక్షలకు, తదనంతరం జరిగిన సమీక్షలకు నాణ్యతా పరమైన తేడా కొంత కొట్టొచ్చినట్లు కనిపించసాగింది. కొన్ని విషయాల్లో మెరుగుదల కూడా కనిపించిందనాలి. సమీక్షల్లో పాల్గొన్నవారు "వెంకట్ లర్నింగ్ సెషన్లు" మిస్ కావాల్సి వచ్చింది. సీ.ఇ.ఓ వెంకట్ కు బదులుగా సంబంధిత రాష్ట్రాల ప్రధాన ఆపరేటింగ్ అధికారులు (సీ.ఓ.ఓ) వారి-వారి పరిధిలో సమీక్షలు జరిపేవారు. పర్యవసానంగా కొంత నైపుణ్యం-కొంత యూనిఫార్మిటీ లోపించిందని మాలో కొందరం భావించేవాళ్లం. మరి కొందరు కొన్ని విషయాల్లో మెరుగుదల చూపించినప్పటికీ, సరైన కమ్యూనికేషన్ ను కిందిస్థాయి ఉద్యోగులకు అందచేయడంలో విఫలమైనందున ఎన్నో సమస్యలు తలెత్తాయి. సమీక్షా సమావేశాల్లో సీ.ఓ.ఓ సందేశాన్ని సరిగ్గా అవగాహన చేసుకోని కొందరు జిల్లా స్థాయి ఇ.ఎం.ఆర్.ఐ ఉద్యోగులు తమ పదవులను కోల్పోవాల్సి కూడా వచ్చింది. అలా కోల్పోయిన వారిలో ఇ.ఎం.ఆర్.ఐ ఆవిర్భావం నుంచి, సంస్థకు ఎంతో సేవ చేసి-సంస్థ ఎదుగుదలకు అహర్నిశలూ తోడ్పడిన వారు కూడా వున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ సీ.ఓ.ఓ గా నూకల సుధాకర్ బిజినెస్ రివ్యూ మీటింగులలో (బీ.ఆర్.ఎం) నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ప్రతినెలా సమీక్షా సమావేశాలు నిర్వహించి కూలంకషంగా చర్చించడమే కాకుండా "త్రైమాసిక సమీక్షలు" కూడా జరిపి జిల్లా మేనేజర్ల పనితనాన్ని సమీక్షించేవారు. అయితే వాటివల్ల మేలుతోపాటు కీడుకూడా జరిగి నేటికీ కోలుకోలేని స్థితిలో ఇ.ఎం.ఆర్.ఐ కూరుకుని పోయిందనాలి. అప్పట్లో చైర్మన్ రాజు గారి దృష్టంతా అత్యవసర సహాయ సేవలను ఎలా విస్తరించాలనే వుండేది. ఏదో విధంగా ఆంధ్ర ప్రదేశ్ లోని అంబులెన్సుల సంఖ్యను 70 నుంచి 380కి, తర్వాత 502కు, దరిమిలా 652 నుంచి 802 వరకూ పెంచాలని పట్టుదలగా వుండే వారు. ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యానికి సంబంధించిన విషయాలను చూస్తుండే నేను, నాకు సంబంధించినంతవరకు, ఆయన ఆలోచనను కార్యరూపం దాల్చడానికి ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు చేయడం జరిగేది. అయితే అంబులెన్సుల సంఖ్య పెంచాలంటే తగు సహేతుకమైన కారణాలను కూడా చూపాల్సిన అవసరం వుంది. అందులో ముఖ్యమైంది "ఎమర్జెన్సీల సంఖ్య" రోజు-రోజుకూ పెరిగి అప్పట్లో వున్న అంబులెన్సులకు వాటికి సరిపడే విధంగా సగటున ట్రిప్పులను వేయలేక పోవడం ఒకటి. సగటున ఒక్కో అంబులెన్స్ ఎక్కువలో ఎక్కువ ఎనిమిది-పది కంటే ట్రిప్పులు వేయలేదు. దానికి కారణాలు అనేకం వున్నాయి. అవి మరో సందర్భంలో తెలుసుకుందాం.

ఇక పోతే సమీక్షా సమావేశాల్లో సీ.ఓ.ఓ దీనికి సంబంధించి ఇచ్చిన ఆదేశాలు-వాటిని జిల్లా మేనేజర్లు అర్థం చేసుకున్న తీరులో తీవ్రమైన అవగాహనా లోపం వచ్చింది. ఎమర్జెన్సీల సంఖ్య పెరగడం అంటే, ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ కేసు వుందో, వాటిని సరైన ప్రచారం చేసుకుంటూ, 108 అంబులెన్స్ ను అలా ఎమర్జెన్సీకి గురైన వారు వాడుకోవాలన్న వుద్దేశాన్ని మేనేజర్లు కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏదో విధంగా ఎమర్జెన్సీల సంఖ్యను పెంచాలని, వారిలో కొందరు తమ కింది స్థాయి ఉద్యోగులకు "టార్గెట్లు" ఇవ్వ సాగారు. ఫలితంగా ఎమర్జెన్సీల పేరుతో సాధారణ రుగ్మతలొచ్చిన వారిని, అసలు వైద్య సహాయం అవసరమేలేనివారిని, 108 అంబులెన్సులలో ఆసుపత్రికి చేరవేయ సాగారు. ఎమర్జెన్సీల సంఖ్య పెరిగిందని (సమీక్షా సమావేశాల ఆధారంగా)గణాంకాలు చూపడంతో, సీ.ఓ.ఓ సుధాకర్ నూకల సూచన మేరకు క్రమేపీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంబులెన్సుల సంఖ్యను రికార్డు స్థాయిలో 802కు పెంచింది. ఇంతలో చేసిన తప్పు బయట పడింది. కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. చివరకు కారణాలే వైనా సీ.ఓ.ఓ పైకూడా వేటు పడింది. తప్పెవరిదో-ఒప్పెవరిదో తెలుసుకునే లోపల, యాజమాన్య మార్పిడీ జరిగింది. ఇప్పుడేమో అదంతా "గతజల సేతుబంధం". ప్రస్తుతం (గత బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ఉపన్యాసం ఆధారంగా) అన్ని అంబులెన్సులూ కలిపి సగటున రోజుకు 4000 లోపు ట్రిప్పులే తిరుగుతున్నాయి. అంటే ఒక్కో అంబులెన్స్ 5-6 కంటే ఎక్కువ ట్రిప్పులు తిరగడం లేదన్నమాట. 108 అత్యవసర సహాయ సేవల శాఖను చూస్తున్న మంత్రి పితాని సత్యనారాయణ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, అవగాహనా ఒప్పందం ప్రకారం ఏటా 24లక్షల ట్రిప్పుల తిరగాల్సి వుండగా, ప్రస్తుతం అన్ని అంబులెన్సులు కలిసి 14-15లక్షలు మాత్రమే తిరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. తిరగాల్సినన్ని ట్రిప్పులు తిరగకపోవడానికి కారణాలు వెతకాలి.

బీ.ఆర్.ఎం లకు హాజరయ్యేవారిని "ఎఫ్.ఎల్.సీ.ఎల్-ఫుల్ లైఫ్ సైకిల్ లీడర్" అని పిలిచేవారు. వీరిలో రీజనల్ మేనేజర్లు, హెడ్ ఆఫీసులో వివిధ శాఖలను (ఆర్థిక, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్య, సాంకేతిక, ఫ్లీట్, మానవ వనరులు, మార్కెటింగ్ వగైరా) నిర్వహిస్తుండే వారు వుండేవారు. క్రితం నెల ఆయా రంగాలలో సాధించిన విజయాలను, రాబోయే నెలలో తలపెట్టిన కార్యక్రమాలను-అవి పూర్తిచేయడానికి రూపొందించిన ప్రణాళికను సంబంధిత బిజినెస్ హెడ్-ఎఫ్.ఎల్.సీ.ఎల్ ఆ సమీక్షా సమావేశాల్లో క్షుణ్ణంగా వివరించాల్సి వుంటుంది.

ఆయా బిజినెస్ హెడ్స్ (ఫుల్ లైఫ్ సైకిల్ లీడర్) ఇచ్చిన వివరాల ఆధారంగా, వారి పై స్థాయి అధికారులు (ఇంటెగ్రేటర్స్ అనేవారు) మరింత శాస్త్రీయంగా-లోతుగా, సీ.ఇ.ఓ నిర్వహించే సమీక్షా సమావేశంలో వివరిస్తారు. సీ.ఇ.ఓ రివ్యూ మీటింగులు ఏదో తూ-తూ మంత్రంలాగా కాకుండా సుమారు పన్నెండు గంటలకు పైగా జరిగేవి. ఉదయం సరిగ్గా తొమ్మిదిన్నరకు మొదలయిన వెంటనే, అత్యవసర సహాయ సేవలను అన్వయిస్తూ, మేనేజ్ మెంట్ కు-నాయకత్వ లక్షణాలకు-నిబద్ధత, పారదర్శకతలకు సంబంధించిన విషయంపై, కూలంకషంగా కనీసం మూడుగంటల పాటు వెంకట్ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సహాయంతో ఒక శిక్షణా కార్యక్రమం నిర్వహించేవారు. అందులో ఆయన ప్రతిభ స్పష్టంగా గోచరించేది. ఆద్యంతం సరదాగా సాగేది.

ఉదాహరణకు సమీక్షా సమావేశాల్లో నాకు సంబంధించిన సబ్జెక్ట్ తీసుకుందాం. నేను, "ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం” అనే "ఫుల్ లైఫ్ సైకిల్ బిజినెస్" కు "ఫుల్ లైఫ్ సైకిల్ లీడర్" గా బిజినెస్ రివ్యూ మీటింగులలోను, ఇంటెగ్రేటర్ గా ఇంటెగ్రేటర్స్ రివ్యూ మీటింగులలోను పాల్గొనేవాడిని. సీ.ఇ.ఓ వెంకట్ గారి దృష్టిలో కొన్ని సార్లు నేను "ఇంటెగ్రేటర్ స్థాయి వాడిని కాదనుకున్న" నెలల్లో నాకు ఇంటెగ్రేటర్స్ రివ్యూ మీటింగులకు అనుమతి వుండకపోయేది. అది ఆయన ఎప్పుడు-ఎందుకు చేశేవారో నాకిప్పటికీ అర్థం కాలేదు. నాకే కాదు, బహుశా నా సహచరులకు కూడా అర్థమయ్యేది కాదు. ఏదేమైనా ఇంటెగ్రేటర్స్ రివ్యూ మీటింగులకు కాని-చైర్మన్ రివ్యూ మీటింగులకు కాని పిలుపు అందకపోతే, ఒక విధంగా సీ.ఇ.ఓ దృష్టిలో పిలుపు అందనివారి సామర్థ్యం తగ్గిందని అక్కడ పనిచేస్తున్న ఇతరులు భావించేవారు. చైర్మన్ రాజు గారైతే వెంకట్ గారు ఎవర్ని తన వెంట తీసుకొచ్చారో-తీసుకు రాలేదో అన్న విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్లు నేనెప్పుడూ భావించలేదు. వచ్చిన వారందరికీ, వారికి సంబంధించిన బిజినెస్ గురించి కూలంకషంగా మాట్లాడుతామన్న నమ్మకం కూడా లేదు. అదో అనుభవం.

ఆ విషయాలు పక్కనపెడితే బీ.ఆర్.ఎం-ఐ.ఆర్.ఎం లలో పాల్గొన్న ప్రతివారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చేసి వారికి సంబంధించిన బిజినెస్ ఎలా వుందో వివరించాలి. అలా వివరిస్తున్నంతసేపూ, సీ.ఇ.ఓ ప్రతి విషయంలోనూ తరచి-తరచి ప్రశ్నలు సంధించేవాడు. మధ్యలో ఆయనదైన శైలిలో హాస్యం చిందించేవారు. ఆయనే కాకుండా సహచరులనుంచి వచ్చే సందేహాలకు కూడా వివరణలు ఇచ్చుకోవాలి. సుమారు నలభై బీ.ఆర్.ఎం లు, కొంచెం ఇంచుమించుగా అన్నే ఐ.ఆర్.ఎం లు, ఓ ముప్పై వరకు చైర్మన్ రివ్యూ మీటింగులకు హాజరైన నాకు, ఆ అనుభవం జీవితంలో మరవలేని అనుభూతితో పాటు, అపారమైన (నూతన విషయాలకు సంబంధించిన) విజ్ఞానాన్ని సముపార్జించుకునే అవకాశం కలిగించింది. ముఖ్యంగా వెంకట్ గారి "లర్నింగ్ సెషన్స్" నిజంగా ఎన్నో రకాల యాజమాన్య పరమైన విషయాలను తెలుసుకునే అవకాశం కలిగించింది.

నేను అక్టోబర్ నెల, 2007లో జరిగిన ఐ.ఆర్.ఎం లో చేసిన ప్రెజెంటేషన్ ను ఉదహరిస్తానిక్కడ. ఉపోద్ఘాతంగా నా బిజినెస్ "ఇ.ఎం.ఆర్.ఐ కి-ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు మధ్య సంబంధాలను అభివృద్ధి పరిచేదని" చెప్పాను. వివరాల్లోకి వెళ్తూ, నా బిజినెస్ లో భాగంగా, ప్రభుత్వం నుంచి అవసరమైన బడ్జెటరీ మద్దతును పొందడానికి-అత్యవసర సహాయ సేవలు పౌరులందరికీ ఉచితంగా లభ్యమయ్యేందుకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అంగీకరించిన నిధులను సరైన సమయంలో విడుదలయ్యేలా చర్యలు చేపట్టడానికి కృషి చేస్తానని-గత నెలలో కృషి చేశానని ప్రారంభంలో చెప్పాను. అలానే ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆరు నెలలకో సారి జరగాల్సిన "సలహా మండలి సమావేశాలు" నిర్వహించేందుకు తగు చర్యలు తీసుకున్నానని; సమాజంలో పలుకుబడి-ప్రబావం చూపగల ప్రభుత్వ-ప్రభుత్వేతర వ్యక్తులకు, సంస్థల అధిపతులకు ఇ.ఎం.ఆర్.ఐ అందిస్తున్న సేవలు వివరించి, తద్వారా భాగస్వామ్య ప్రక్రియను పఠిష్ఠపరిచేందుకు సంబంధిత అధికారులను సంస్థకు తీసుకొచ్చానని; పొరుగు రాష్ర్ట్రాలలో అత్యవసర సహాయ సేవలు ఆరంభించడానికి భాగస్వామ్య ప్రక్రియ చేపట్టానని; అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య ప్రక్రియకు అవసరమైన చర్యలు చేపట్టాలని బిజినెస్ ను గురించి కొంచెం లోతుగా వివరించాను.

నా దైనందిన బిజినెస్ కు సంబంధించి నేనెవరికి రిపోర్ట్ చేస్తానో-చేస్తున్నానో, ఎవరెవరి (సహచరుల) సహాయ-సహకారాలు ఏ ఏ విషయంలో తీసుకుంటున్నానో కూడా వివరించాను. నేను నా బిజినెస్ నిర్వహణలో భాగంగా గత నెలరోజుల్లో సాధించిన ఫలితాలను వివరిస్తూ ఉదాహరణగా అక్టోబర్ 5, 2007న ఇ.ఎం.ఆర్.ఐ సీ.ఇ.ఓ వెంకట్, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ అనిల్ పునిఠ మధ్య ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యానికి సంబంధించిన రెండో అవగాహనా ఒప్పందంపైన సంతకాలు పెట్టినప్పటి ఫొటోగ్రాఫ్ ను చూపించాను. ఒక విధంగా సమీక్షా సమావేశంలో పాల్గొన్న సహచరులందరికి ఆ విషయాన్ని తెలియచేసే వేదిక అది కాబట్టి, విషయం తెలిసిన వారికి-తెలియని వారికి వివరించే ప్రక్రియ అది. అదే విధంగా క్రితం నెలలో ఇ.ఎం.ఆర్.ఐ కి వచ్చిన ప్రముఖ వ్యక్తుల్లో, ఢిల్లీ కాట్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాలచంద్రన్-రాజస్థాన్ ఆరోగ్య శాఖ అధికారిణి రోలీ సింగ్-తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి, అధికారులు-మధ్య ప్రదేశ్ కు చెందిన ఆరోగ్య శాఖ అధికారులు-అస్సాం ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హేమంత, కార్యదర్శి భాస్కర్, తదితర అధికారులు-కేరళ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీమతి టీచర్, ఇతర అధికారులు-వగైరాలున్నారని వివరించాను. వాస్తవానికి వీరి రాక వలన భవిష్యత్ లో ఇ.ఎం.ఆర్.ఐ సేవలు రాజస్థాన్-అస్సాం లలో ఆరంభించడానికి వీలు కలిగింది. ఇలా నేను రాబోయే నెలరోజుల్లో తక్షణ చేయాల్సిన పనులు-రాబోయే మూడు నెలల్లో చేయాల్సిన వాటికి తీసుకోబోయే చర్యలు కూడా వివరించాను.

వీటన్నిటి ఆధారంగా సీ.ఇ.ఓ తనకు రిపోర్ట్ చేస్తున్న "లీడర్స్"ను వెంట తీసుకుని చైర్మన్ జరిపే సమీక్షా సమావేశంలో మరో సమీకృత నివేదిక రూపొందించి చర్చిస్తారు. సీ.ఇ.ఓ తెలియచేసిన వివరాలకు సంబంధించి ఏమన్నా సందేహాలుంటే చైర్మన్ ఆయన వెంట వచ్చిన లీడర్స్ ను అడిగి తెలుసుకుంటారు. ఇలా ఇన్ని అంచెల సమీక్షా సమావేశాలు జరిపి ఎక్కడా ఏ లోపం రాకుండా అత్యవసర సహాయ సేవలు అందేలా జాగ్రత్త పడేవారు. సమీక్షల మాట అలా వుంచి, రాజుగారి ఇంట్లో జరిగిన సమావేశాల సమయంలో అందులో పాల్గొన్న మాకు, పాల్గొన్న ప్రతిసారీ ఆయన ఇచ్చిన ఆతిథ్యం జీవితంలో మరువలేం. అల్పాహార మైనా, లంచ్ అయినా, డిన్నరైనా రాజు గారే స్వయంగా ప్రతి వ్యక్తికి ప్లేట్ అందించి, వడ్డించి మరీ తినిపించే వారు. ఇక సమీక్ష జరిగినంతసేపూ, ఆయన ఎప్పుడు ఏం ప్రశ్న వేస్తారోనని మాలో ప్రతి వారికీ జంకుగా వుండేది. రాజుగారి సమీక్షా సమావేశాల్లో అన్ని విషయాలు చర్చకు వచ్చినప్పటికీ, ఆర్థికపరమైన విషయాల ప్రస్తావన తెచ్చినప్పుడల్లా "ఈ విషయాలను తీరిగ్గా-క్వాలిటీ టైమ్ తీసుకుని చర్చిద్దామండీ వెంకట్ గారు" అనేవారెందుకో. అప్పుడర్థం కాలేదు కాని, ఆ తర్వాత అర్థం చేసుకున్నాం. ఆ ఫలితాలను ఆస్వాదించాం-అనుభవించాం. వివరాలు మరో చోట తెలుసుకుందాం.

రాజుగారు అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాక సీ.ఇ.ఓ సమీక్షలే తప్ప, చైర్మన్ రివ్యూ మీటింగులు దాదాపు నాలుగు నెలల పాటు జరగలేదు. ఆ తర్వాత జీ.వీ.కె గారు జరుపుతున్నట్లు కూడా లేదంటున్నారు. జులై నెల 10-2009న జరిగిన సమీక్షా సమావేశానికి మటుకు ఆయన వచ్చారు. అప్పుడు నేనింకా అక్కడ పనిచేస్తూనే వున్నాను. అంతర్గతంగా ఇ.ఎం.ఆర్.ఐ జరిపే సమీక్షా సమావేశాలే కాకుండా, ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్య పరమైన అవగాహనా ఒప్పందానికి అనుగుణంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి, కుటుంబ సంక్షేమ కమీషనర్ స్థాయి వరకు ఎన్నో రకాల సమీక్షలు నిరంతరం జరిగేవి. ఆ వివరాలు కూడా ముందు-ముందు తెలుసుకుందాం.

ఇన్ని రకాల సమీక్షా సమావేశాలు-ఇంత పకడ్బందీగా జరిగినప్పటికీ, రాజుగారు రాజీనామా చేసే దాకా ఇ.ఎం.ఆర్.ఐ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు బాహ్య ప్రపంచానికి కాని-అక్కడ పనిచేస్తున్న చాలామందికి కానీ ఎందుకు తెలియలేదు? తెలిసినవాళ్లు మనకెందుకు అని మౌనం వహించారా? రాజుగారు రాజీనామా చేసిన వారం రోజుల్లోనే, ఒక వైపు (దివంగత) ముఖ్యమంత్రి హామీ పత్రికా ముఖంగా ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ, సంస్థ బాంక్ అకౌంట్ ను హఠాత్తుగా స్థంబింప చేయడానికి కారణమేంటి?