Friday, May 31, 2013

గుర్తుకొస్తున్న అలనాటి తీపి జ్ఞాపకాలు: వనం జ్వాలా నరసింహారావు

గుర్తుకొస్తున్న అలనాటి తీపి జ్ఞాపకాలు
వనం జ్వాలా నరసింహారావు

మా గ్రామం (ఖమ్మం జిల్లాలో) పక్కనున్న కమలాపురం సరిహద్దుల్లో, మా అబ్బాయి ఆదిత్య ఇటీవల కొన్న తోటలో కాసిన కొన్ని మామిడి పండ్లను, ఖమ్మం-హైదరాబాద్‌లోని బంధువులకు, స్నేహితులకు శ్రీమతి ప్రోద్బలంతో పంచుతున్న నేపధ్యంలో, నా బాల్యం, యవ్వనం తొలినాళ్లు, అలనాటి తీపి జ్ఞాపకాలు ఒకటి వెంట మరొకటి గుర్తుకొచ్చాయి. మా గ్రామం, ఆ వూళ్లోని కొఠాయి (రచ్చ బండ), మా రెండంతస్తుల భవనం, ఆ భవనం ముందున్న స్థలంలో తెలతెలవారుతుండగానే ఇద్దరు పని మనుషులు శుభ్రం చేసి కలాపు నీళ్లు చల్లడం, కిలోమీటర్ దూరంలోని ముత్తారం-అమ్మపేట గ్రామాలు, అక్కడి రామాలయం-వేంకటేశ్వర స్వామి గుడులు, పక్కనే వున్న మా పెదనాన్నగారి గ్రామం వల్లాపురం, మా కచ్చడం బండి, పెంట బండి, మేనా, వరి పొలాలు, మల్లె తోట, మామిడి తోట, మిరప-మొక్క జొన్న తోటలు, తోటలలోని మోటబావులు, జొన్న చేలు, చేలలోని దోసకాయలు, మంచె, మా పది అరకలు, పది జతల ఎద్దులు, పది-పన్నెండు మంది పాలేర్లు (జీతగాళ్లు అనే వాళ్లం), పాడి పశువులు, మేకలు, వరి గడ్డి వాములు, మా ఇంట్లో బావి, బావి పక్కనున్న నిమ్మ-అరటి చెట్లు, మా ఇంటి వెనుక వంట ఇంటి పక్కన ఉదయాన్నే మజ్జిగ చిలికే ప్రక్రియ, అందులో వచ్చిన వెన్న పూస తినడం, ఉదయాన్నే తిన్న చద్ది అన్నం-మామిడి వూరగాయ కారం, మా ఎనిమిదిమంది అన్న దమ్ములం-అక్క చెల్లెళ్లు కలిసి వెండి కంచాలలో భోజనాలు చేయడం, సరదాగా కీచులాడు కోవడం, సాయంత్రం ఇంటి ముందు నీళ్లు చల్లి నవారు-నులక మంచాలు వేయడం, వాటిపై పక్కలు వేయడం, మా పదిమంది కుటుంబ సభ్యులు-అడపాదడపా వచ్చే బంధువులు కబుర్లు చెప్పుకుంటా పడుకోవడం, పడుకోని ఆకాశంవైపు చూసి ఆనందించడం..... ....... ఇలా ఎన్నో విషయాలు గుర్తుకు రాసాగాయి. దీనికి ప్రధాన కారణం, చిన్నతనంలో, మా మామిడి తోటలో కాసిన పండ్లను వైశాఖ మాసంలో పది మందికి పంచిపెట్టిన విషయం జ్ఞప్తికి రావడమే! ఆ రోజుల్లో మా తోటలో వందల-వేల సంఖ్యలో మామిడి పండ్లు కాసేవి. తిన్నన్ని తిని పది మందికి పంచడం ఆనవాయితీగా ప్రతి ఏడు చేసే వాళ్లం. సరే...ఇప్పుడా తోట లేదు.....పండ్లు లేవు. మళ్లీ మా అబ్బాయి ఆదిత్య మామిడితోట కొనడం, గతంలోని మోతాదులో కాకపోయినా కొన్ని పండ్లనైనా పంచే అవకాశం దొరకడం మా అదృష్టమే.

మా వూరి పేరు వనం వారి కృష్ణా పురం. ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలంలో వుంది. ఒకప్పుడు ఖమ్మం తాలూకాలో వుండేది. గతంలో పాలేరు శాసనసభ నియోజక వర్గంలోను, ప్రస్తుతం మధిర నియోజక వర్గంలోను వుంది. కిలోమీటర్ దూరంలోని ముత్తారం రెవెన్యూ గ్రామానికి ఇది శివారు గ్రామం. ముత్తారంకు మరో శివారు గ్రామం కూడా వుంది. దాని పేరు కోదండరామపురం. ఈ మూడు గ్రామాలకు కలిపి మా వూరి పేరుమీద పంచాయతీ బోర్డు వుంది. మా పూర్వీకులు వనం కృష్ణరాయలు గారు కట్టించిన గ్రామమైనందున వూరికాపేరు వచ్చిందంటారు. ఇప్పుడైతే ఎక్కువమంది లేరు కాని, ఒకానొకప్పుడు, మా ఇంటి పేరు (వనం వారు) కుటుంబాలు సుమారు పాతిక వరకుండేవి మా వూళ్లో. కరిణీకం కూడా మా ఇంటి పేరువారిదే. ముత్తారం గ్రామంలో ఇటీవలే పునర్నిర్మించిన పురాతన రామాలయం కూడా వుంది. మా నాన్న వనం శ్రీనివాస రావు గారు మా వూరి పక్కనే వున్న మరో గ్రామం అమ్మ పేటకు పట్వారీగా వుండేవారు. మా అమ్మ గారి పేరు సుశీల. నాన్నగారు చనిపోయి పదిహేను సంవత్సరాలు కావస్తోంది. అమ్మకిప్పుడు సుమారు తొంబై సంవత్సరాలు. మేం ఐదుగురు అన్నదమ్ములం, ముగ్గురు అక్క చెల్లెళ్లున్నారు. అందరిలోకి పెద్ద మా అక్క రాధ. తరువాత నేను.

నేను మా వూరికి పది కిలోమీటర్ల దూరాన వున్న గండ్రాయి గ్రామంలో ఆగస్ట్ 8, 1948 న పుట్టాను. అప్పట్లో తెలంగాణ సాయుధ పోరాటం జరుగుతుండడం, కొన్ని కారణాలవల్ల సొంత వూళ్లో వుండడం ఇబ్బందికరంగా మారడంతో మా కుటుంబం కాందిశీకులలాగా గండ్రాయి గ్రామంలో తలదాచుకున్నప్పుడు ఒక పెరికవారింట్లో పుట్టాను నేను. తరువాత పోలీసు యాక్షన్ జరగడం. మళ్లీ మా కుటుంబం గ్రామానికి తిరిగి రావడం జరిగింది. మాకు మొదట్లో సుమారు నాలుగు వందల ఎకరాల భూమి వుండేది. బూర్గుల రామకృష్ణారావు రోజుల్లో ఖమ్మం జిల్లాలో అమలైన కౌలుదారీ చట్టం-భూ సంస్కరణల చట్టం నేపధ్యంలో సుమారు రెండు వందల ఎకరాల భూమిని అమ్ముకోవాల్సి వచ్చింది. అలా వచ్చిన పైకంతో ఖమ్మంలో ఒక ఇల్లు, మా గ్రామంలో ఒక ఇల్లు కట్టించారు నాన్నగారు. అమ్మగా మిగిలిన రెండు వందల ఎకరాల భూమిలో సొంతంగా సేద్యం చేసేవారు నాన్న. పది మంది పాలేర్లు, పది అరకలు, నాలుగైదు ఎద్దుల బండ్లు, చిన్న కచ్చడం బండి, పది జతల ఎద్దులు, వాటికి పెద్ద కొష్టం, పాడి గేదెలు-ఆవులు, వందల సంఖ్యలో మేకలు.....ఇలా అంగరంగ వైభోగంగా వుండేది చిన్నతనంలో. కాలికి మట్టి అంటకుండా పెంచారు మమ్ములను.

మా నాన్నగారు చేస్తున్న వ్యవసాయానికి ప్రతిఫలంగా సుమారు 40 పుట్ల వడ్లు (పుట్టికి 75 కిలోల బరువుండే ఎనిమిది బస్తాలు), 20 పుట్ల జొన్నలు, 40-50 పుట్ల వేరు శనగ, 10 పుట్ల కందులు, 10 పుట్ల పెసలు, వీటికి తోడు మిరప కాయలు, పొగాకు, మామిడి పంట, మల్లెలు.....ఇలా... ప్రతి ఏటా పండేవి. మా భూమిలో సుమారు నలబై ఎకరాలను పాడి పశువుల మేత కొరకు బీడు భూమిగా వదిలే వాళ్లం. మా వూరి సరిహద్దు నుంచి పక్కనున్న మల్లన్నపాలెం సరిహద్దు వరకు వున్న భూమంతా మాదే! అందులో నల్ల రేగడి భూమి సుమారు నలబై ఎకరాలుండేది. వూరిపక్కనే పది ఎకరాల అంటు మామిడి తోట వుండేది. ఎకరం విస్తీర్ణంలో ముత్తారం దగ్గర ఐదారు పెద్ద నాటు మామిడి చెట్లు కూడా వుండేవి. ఆ చెట్లలో "పుట్ట మాకు" కాయలు కాసే చెట్టు ఒకటి వుండేది. ఆ కాయలనే వూరగాయలకు, పండిన తరువాత తింటానికి వాడే వాళ్లం. పచ్చిగా వున్నప్పుడు ఎంత పుల్లగా వుండేవో పండిన తరువాత అంతకంటే ఎక్కువ తియ్యగా వుండేవి. నల్ల రేగడిలో జొన్న పంట వేసే వాళ్లం. ముత్తారం గ్రామ సరిహద్దులలోని వూర చెరువు కింద వరి పొలం సుమారు పాతిక ఎకరాలుండేది. అందులో వడ్లు పండేవి. వూర చెరువు లోపలి భాగం కూడా మా పట్టా భూమే. చెరువులోకి నీరు రాకపోతే, జనప పంట వేసే వాళ్లం. ఇప్పటికీ నా పేరు మీద, పోగా మిగిలిన ఏడెకరాల వరి పొలం (గుండ్ల పంపు) వుంది. అందులో ఏటా సుమారు రు. 50 వేల విలువైన పంట పండుతోంది. వల్లాపురం గ్రామ సరిహద్దుల్లోని "ఎర్రమట్టి చేను", ముత్తారం సరిహద్దుల్లోని "గుడిపాటి చేను", "జిట్టమర్రి చేను", మల్లన్న పాలెం సరిహద్దుల్లోని "రేగడి చేను", వూరి పక్కన వున్న బీడు అంచలంచలుగా అమ్మి వేశాం. "బోదుల సాహిబ్ చేను" తమ్ముడి అధీనంలో వుందింకా. అంటు మామిడి తోటను మా నాన్న గారు చనిపోయింతర్వాత మా చెల్లెలు అమ్ముకుంది. వరి పొలాలలో "బత్తులోరి పంపు", "నంది మిట్ట", "గుండ్ల పంపు" ఇంకా మిగిలున్నాయి.

నేను మూడు సంవత్సరాల పాటు, మా గ్రామంలో వుండి వ్యవసాయం చేయించాను. రాజకీయాలలో కూడా చురుగ్గా పాల్గొన్నాను. వ్యవసాయపు పనులు వేసవి కాలంలోనే మొదలయ్యేవి. పొలాలకు పెంట తోలే ప్రక్రియతో వ్యవసాయపు పనులు మొదలయ్యేవి. ఉగాది పండుగ కల్లా రాబోయే సంవత్సరానికి పాలేర్లను (జీతగాళ్లను) కుదుర్చుకునే వాళ్లం. ఆ రోజుల్లో పెద్ద పాలేరుకు సంవత్సరానికి పది నుంచి పన్నెండు బస్తాల జొన్నలిచ్చేవాళ్లం. జొన్నల ధర పెరిగినా, తగ్గినా అదే జీతం. మిగిలిన వాళ్లకు ఎనిమిది బస్తాలవరకిచ్చేవాళ్లం. వీరిలో కొందరిని వ్యవసాయ పనులకు, కొందరిని పాడి పశువులను కాసేందుకు, ఒకరిద్దరిని ఇంటి పనులకు ఉపయోగించుకునే వాళ్లం. మొదలు మా పాడి పశువుల వల్ల పోగైన పెంటను తోలే వాళ్లం. ఆ పెంటను నిలవ చేయడానికి మా పాత ఇంటిలోని స్థలాన్ని ఉపయోగించుకునే వాళ్లం. సుమారు నాలుగైదు వందల బండ్ల పెంట మా పశువుల ద్వారా పోగైంది వుండేది. మాకున్న ఐదు ఎద్దుల బండ్లను ఆ పని అయ్యేంతవరకు పెంట బండ్లలా వాడే వాళ్లం. దీనికి అదనంగా మా గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో పొలాలు లేని వారి దగ్గర నుంచి పెంట ఖరీదు చేసి కొని పొలాలకు తోలే వాళ్లం. చెల్లింపులన్నీ ధాన్యం రూపేణగానే జరిగేది. పక్కనే వున్న మల్లన్నపాలెం గ్రామంలో అంతా యాదవులే (గొల్లలు) వుండేవారు. వారి దగ్గర "జీవాలు" (గొర్రెలు) వుండేది. వందల సంఖ్యలో వుండే జీవాలను పొలాలలో రాత్రింపగళ్లూ వుంచేవాళ్ళం. అదీ ఖరీదుకే. అలా వుంచడం వల్ల పొలాలలో జీవాల పెంట పోగయ్యేది. అది పొలాలకు ఎరువులాగా ఉపయోగపడుతుంది. అప్పట్లో రసాయనిక ఎరువుల వాడకం అలవాటు ఇంకా సరిగ్గా కాలేదు. ఇళ్లలో పోగైన పెంటను, జీవాల పెంటను మాత్రమే ఎరువులాగా వాడే వాళ్లం. అదనంగా, చెరువు పూడిక తీసి మట్టిని పొలాలకు తోలే వాళ్లం. తెల్లవారు జామునుంచే పెంట బండ్లను కట్టే ప్రక్రియ మొదలయ్యేది. మధ్యాహ్నం పన్నెండు (రెండు జాములు అనే వాళ్ళు) గంటల సమయం వరకు తోలి ఇళ్లకు తిరిగి వచ్చే వాళ్ళు జీతగాళ్లు. పొద్దున్నే చద్ది అన్నం తినే వాళ్ళు. నేను కూడా అప్పుడప్పుడు పెంట బండి తోలేవాడిని. మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు వాళ్ల ఇళ్లకు వెళ్లి భోజనం చేసి వచ్చి, ఎడ్లకు దానా వేయడం, నీళ్లు పెట్టడం లాంటివి చూసుకునేవారు. ఆ సంవత్సరానికి కావాల్సిన వ్యవసాయ పనులకు సంబంధించిన వాటిని ఒక గంట-రెండు గంటల పాటు చూసుకునేవారు. ఉదాహరణకు తాళ్లు పేనడం. మళ్లీ నాలుగు గంటల ప్రాంతంలో పెంట బండ్ల కార్యక్రమం మొదలయ్యేది. వెన్నెల రోజుల్లో రాత్రుళ్లు కూడా బండ్లు తోలేవారు. ఇలా తొలకరి జల్లులు కురిసే వరకు కొనసాగేది.


మా జీతగాళ్ల పేర్లు కొందరివి ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. అచ్చయ్య అనే వ్యక్తి జీవనాధారం కొరకు ఎక్కడి నుంచో మా వూరికి నా చిన్నతనంలో వలస వచ్చాడు. మా నాన్న గారికి అతను నచ్చాడు. ఆయన దాదాపు పాతిక సంవత్సరాలకు పైగా మా పెద్ద పాలేరులాగా వుండేవాడు. అతను వెలమ కులస్తుడైనందున మిగిలిన జీతగాళ్లందరు ఆయనను "అచ్చయ్యగారు" అని సంబోధించేవారు. మా నాన్నకు కుడి భుజంలాగా వుండేవాడు. మేం ఎన్నడూ ఆయనను పాలేరులాగా చూడలేదు. మా ఇంటి సొంతమనిషిలాగా చూసుకునే వాళ్లం. గౌరవించేవాళ్ళం. ఆయనకు భార్యా పిల్లలు లేరు. మా ఇంట్లోనే వుండేవాడు. ఆయన తరువాత ఆ పనికి దాసరి తిరుపతయ్యను పెట్టుకున్నాం. తరువాత కొన్నాళ్లు చాగంటి నారాయణ, ముండ్ర చంద్రయ్య ఆ పని చేశారు. దరిమిలా చాగంటి నారాయణ మా గ్రామ సర్పంచ్‌గా కూడా ఎన్నికయ్యాడు. ముండ్ర చంద్రయ్య కుమారుడు అప్పారావు కూడా గ్రామ సర్పంచ్ అయ్యాడు. వెంకులు ఇంటి పని చూసేవాడు. చెన్నయ్య అనే మరొక జీతగాడు వుండేవాడు. రోజంతా పని చేయడమే కాకుండా జీతగాళ్లు రాత్రుళ్లు మా ఇంటి ముందర నిద్రపోవడానికి వచ్చే వాళ్ళు. వాళ్లను పొద్దున్నే లేపి పొలం పనులకు పురమాయించేవాళ్ళం. ఇంటి పని చూసుకునే వెంకులు గేదెల, ఆవుల పాలు పితకడం, కవ్వంతో పెరుగు చిలికి మజ్జిగ చేయడం, అంట్లు తోమడం లాంటి పనులు చేసేవాడు. ప్రతి రోజు ఉదయం మా ఇంట్లో తయారైన మజ్జిగను తీసుకెళ్లేందుకు కొందరొచ్చేవారు. వాళ్లు ఇంట్లో తాము తినేందుకు జొన్నలు దంచుకుని, మా గేదెలు-ఆవులు తాగేందుకు మా ఇంటికి వచ్చి దాని తొక్కు వంచి పోయేవారు. బదులుగా మజ్జిగ (చల్ల అనే వాళ్లం) తీసుకు పోయే వాళ్లు. వేసవి కాలంలో, మా ఇంటి వెనుక కుండలో వుంచిన మజ్జిగను కడుపు నిండా ఎన్నో సార్లు తాగే వాళ్లం. ఇంట్లో పని చేయడానికి కుదుర్చుకున్న జీతగాడిని బట్టలు ఉతకడానికి వాడుకోక పోయే వాళ్లం. ఉదయాన్నే చాకలి వచ్చి విడిచిన బట్టలు తీసుకెళ్లి వూరి బయట వున్న వాగులోనో, చెరువులోనో వుతికి సాయంత్రం తెచ్చే వాళ్లు. మా ఇంట్లో వంట వండడానికి కూడా ఒకరుండేవారు. 

తొలకరి వానలు మొదలవ్వగానే పొలం పనులలో కొంత మార్పు వచ్చేది. వరి పొలాలకు కావాల్సిన నారు చల్లడం, పునాస పంటలకు పొలాలను నాగళ్లతో దున్నడం, దంతెలతో దున్నడం జరిగేది. వర్షాలు కురిసే తీరుతెన్నుల ఆధారంగా పొలం పనులలో మార్పులు చేర్పులు జరుగుతుండేవి. వర్షాలు ఆగుతే మిగిలిన పెంటను తోలడం కొనసాగించేవారు. వేరు శనగ, అందులో కంది పంటలు వేసే వాళ్లం. చెరువులకు నీళ్లు రావడం జరుగుతే వరి నాట్లు వేసే వాళ్లం. ఆ తరువాత జొన్న పంట వేసే వాళ్లం. వరి నాట్లు వేయడం నాకింకా బాగా గుర్తుంది. నాట్లు వేయడానికి ముందర పొలాన్ని మొదలు నాగళ్లతో, తరువాత బురద నాగళ్లతో దున్నడం జరిగేది. సాధారణంగా మా గ్రామంలో వరి నాట్లు మహిళలే వేసేవారు. పాటలు పాడుకుంటూ, హుషారుగా నాట్లు వేసేవారు. నాట్ల రోజుల్లో నేను భోజనం పొలం దగ్గరకే తెప్పించుకుని చేసేవాడిని. అక్కడ చెరువు నీళ్లే తాగేవాడిని. ఆ నీరు తాగడానికి భయమేసేది కాదు. ఇప్పుడైతే మరి మినరల్ వాటర్! నాట్లు పడ్డ తరువాత దశలవారీగా పొలాలకు నీరు పెట్టడం జరిగేది. ఒక్కో సారి రాత్రుళ్లు పోయి వంతుల వారీగా నీళ్లు పెట్టే వాళ్లం. నీళ్లు సరిపోకపోతే పొలాలలో ఒక పక్కన కొంత లోతు వరకు తవ్వి, నీటిని తీసి చేది పోయడం జరిగేది. వరి కొంత పెరిగిన తరువాత కలుపు తీయడం జరిగేది. మూడు-నాలుగు నెలల తరువాత కోతల సీజన్ ఆరంభమయ్యేది. కోయడం, గూళ్లు వేయడం, సమయం చూసుకుని, వాతావరణం అనుకూలించినప్పుడు నూర్పిడి చేయడం, తూర్పార పట్టడం, చివరకు వరి ధాన్యాన్ని ఇంటికి తోలడం జరిగేది. ఈ ప్రక్రియ జరిగినన్నాళ్లు వరి పొలంలోనే రాత్రుళ్లు నిద్రించే వాళ్ళం. ఆ ఆనందం ఇప్పుడు తలుచుకుంటుంటే ఒక మధురానుభూతిలాగా అనిపిస్తోంది. నాటు కూలి, కోత కూలి, ఇతర కూలి అంతా ధాన్యం రూపేణగానే. ఎకరానికి ఐదారు కుండల ధాన్యం కూలీగా వుండేది. రేట్లు పెంచమని అడపాదడపా కూలీలు ఆందోళన చేసే వాళ్లు కూడా. కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా నేను వాళ్లకు మద్దతిచ్చేవాడిని. నాట్ల సీజన్లో, కోతల సీజన్లో ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలు వచ్చేవారు.

ఇక వేరు శనగ పంట వ్యవహారం మరో విధంగా వుండేది. విత్తనాలు తయారు చేయించే ప్రక్రియతో మొదలయ్యేది. ఇంటికి కూలి వాళ్లను పిలిచి, క్రితం సంవత్సరం పండిన వేరు శనగ కాయలను కొలిచి, వాటినుంచి విత్తులను తీయమని వాళ్లకు చెప్పే వాళ్లం. వాళ్లలో కొందరు తమ ఇంటికి తీసుకెళ్లి చేసేవారు, కొందరు మా ఇంట్లోనే చేసేవారు. సాయంత్రం కల్లా వాళ్ల-వాళ్ల సామర్ధ్యాన్ని పట్టి కుండెడో-రెండు కుండలో కాయ కొట్టి విత్తులను తీసే వాళ్లు. వాళ్ళకు కూలీ ధాన్యం రూపేణగానే ముట్టేది. విత్తులు తీసేటప్పుడు కొంత భాగం పప్పు అయ్యేది. ఆ పప్పుతో శనగ నూనె చేయించి ఇంట్లో ఉపయోగించే వాళ్లం. వర్షాలు పడగానే, భూమిని దున్ని అదను కుదిరినప్పుడు "ఎద" పెట్టే వాళ్లం. ఒకడు ఎద గొర్రు తోలుతుంటే, పక్కన నడుచుకుంటూ మరొకరు, శనగ విత్తులను, భూమిలోకి గొర్రు పైభాగంలోంచి భూమిలో పడేలా పోసేవారు. అతి క్లిష్టమైన ఈ ప్రక్రియ అందరికీ చేత కాదు. పైగా శనగ విత్తులతో పాటు కంది విత్తనాలు కూడా ఒక పద్దతి ప్రకారం ఎద పెట్టాలి. శనగ పంట ముందు చేతికొస్తుంది. ఆ తరువాత రెండు నెలలకు కంది పంట వస్తుంది. శనగ విత్తనాలు మొలకెత్తిన నెల రోజుల తరువాత పై పాటు చేయాలి. ఇది కూడా కష్టమైన పనే. పై పాటు చేసే అరకలను అందరూ తోలలేరు. ఎద్దుల కాళ్ల కింద మొక్కలు నలిగి పోకుండా, అరక కింద చెట్లు పడ కుండా తోలాలి. అదెంతో ముచ్చటేసేది. మూడు నెలల తరువాత కూలి వాళ్లతో శనగ మొక్కలను భూమి నుంచి పీకించి కాయలను వేరు చేయించే వాళ్లం. మరో రెండు నెలలకు కంది కళ్ళం వేసి ఆ పంటను కూడా తెచ్చుకునే వాళ్లం. ఇక మరో పంట జొన్న. వీటినే పచ్చ జొన్నలనే వాళ్లం. ఇటీవల కాలంలో నీటి పారుదల ప్రాజెక్టులు వచ్చిన తరువాత జొన్న పంట దాదాపు ఎవరూ వేయడం లేదు. దీనికి కూడా ఎద పెట్టడం వుంటుంది. జొన్న పంట తయారైన తరువాత కోసి, కట్టలు కట్టించే వాళ్లం. కూలీ కింద కట్టలనే ఇచ్చే వాళ్లం. ప్రతి ఐదు కట్టలకు ఒక కట్ట కూలీ కింద పోయేది. ఇక ఆ తరువాత జొన్న గూడు వేయించడం, కంకి కోయించి తొక్కించడం, తూర్పార బట్టడం, ధాన్యాన్ని ఇంటికి-మార్కెట్‌కు చేర్చడం జరిగేది.

ఈ పంటలకు తోడు మేం మిరప తోట వేసే వాళ్లం. మధ్యలో బంతి పూల చెట్లు వేసే వాళ్లం. మా ఇంటి పక్కనే తోట వుండేది. అందులో ఒక పక్క మల్లె తోట కూడా వుండేది. తోటలో మోట బావి వుండేది. మోట తోలడం కూడా కష్టమైన పనే. మోట తోలడానికి కట్టిన ఎద్దులను వెనుకకు నడిపించుకుంటూ, భావి ముందరకు తీసుకెళ్లాలి. భావిలో మోట బక్కెట్ (చాలా పెద్దగా వుంటుంది) పూర్తిగా మునిగి నీరు నిండే లాగా ఎద్దులను వెనక్కి తేవాలి. అప్పుడు మునిగి-నిండిన బకెట్ పైకి రావడానికి ఎద్దులను ముందుకు తోలాలి. బకెట్ కట్టిన తొండం లోంచి నీరు భావిదగ్గరున్న కాలువలో పడి ప్రవహించుకుంటూ మిరప చెట్లను తడుపుకుంటూ పోతుంది. మోట తోలడం సరదాగా కూడా వుంటుంది. అలానే పొగాకు పంట కూడా వేసే వాళ్లం. వూరి బయట వున్న మరో తోటలో మొక్క జొన్న వేసే వాళ్లం. కొన్నాళ్లు దినుసు గడ్డలు, వుల్లి గడ్డలు కూడా సాగు చేశాం. క్యాబేజీ, కాలీ ఫ్లవర్ లాంటి కూరగాయలతో సహా ఎన్నో రకాల కూరగాయలను కూడా పండించాం. ఇక మామిడి తోట సరేసరి. జొన్న చేలల్లో పప్పు దోసకాయలుండేవి. అవి అక్కడనే కొడవలితో కోసుకుని, మంచెపైకెక్కి కూచుని తినే వాళ్లం. జొన్న వూస బియ్యం కూడా కొట్టించుకుని, పలుకు రాళ్ల నిప్పులో వేడి చేసుకుని తినే వాళ్లం. చేనులో దొరికే పెసలు తినే వాళ్లం.

ప్రతి పంటకు "పరిగ" అని వుండేది. మాకు జీతగాళ్లే కాకుండా, ఒకరిద్దరు మేమిచ్చే వార్షిక కూలీ మీద ఆధారపడి జీవించే వాళ్లున్నారు. వాళ్లు మాకు అవసరమైన చిల్లర పనులను చేసేవారు. ఉదాహరణకు మా జీత గాళ్లకు కావాల్సిన పాదరక్షలను తయారు చేసే వారుండేవారు. మా పొలాలకు నీరు పెట్టే నీరుకాడుండేవాడు. మా ఇంటి ముందు అలకడానికి కావాల్సిన ఎర్ర మట్టిని తెచ్చి పెట్టేవాడుండేవాడు. మా బట్టలుతికే వాళ్లు. మేమిచ్చే సమాచారాన్ని మా వూరి నుంచి ఇతర గ్రామాలకు తీసుకెళ్ళే మనిషి. ఇలా... కొందరుండేవారు. మా పొలాలలో పంటను మేం తీసుకెళ్ళిన తరువాత, పొలంలో మిగిలిన దాన్ని "పరిగ" అంటారు. అదంతా వాళ్లకే చెందుతుంది. పరిగ కూడా చాలా మోతాదులోనే వుంటుంది ఒక్కో సారి.


          మిగిలిన విషయాలు...ఇంకా ....ఎన్నో గుర్తొస్తున్నాయి....అవన్నీ తరువాత.

Thursday, May 30, 2013

బీసీలకు అధికారం ఎండమావేనా?: వనం జ్వాలా నరసింహారావు

బీసీలకు అధికారం ఎండమావేనా?
వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా, ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్ర ప్రొవిన్షియల్ కాంగ్రెస్, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు విడి-విడిగానే పనిచేసేవి. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చొరవతో, జులై 1957 లో, అల్లూరి సత్యనారాయణ రాజు అధ్యక్షతన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆవిర్భవించింది. భారత జాతీయ కాంగ్రెస్ కి రాజకీయ పార్టీకుండాల్సిన లక్షణాలు లేవనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితీ అంతే. ప్రజల మద్దతున్న పార్టీ అయినప్పటికీ, అందులో అంతా నాయకులే తప్ప సుశిక్షితులైన అనుచరుల (కాడర్) కొరతుందనే అనాలి. ఆవిర్భావం నుంచి, చాలా కాలం వరకు, పెద్ద చదువులు చదువుకున్న పట్టణ ప్రాంతం వారితో ను, అగ్ర కులాలుగా పిలువబడే వారితో ను-అందునా అధిక సంఖ్యా కులు బ్రాహ్మణ కులానికి చెందినవారితో ను, పార్టీ నాయకత్వం పనిచేసేది. పట్టాభి, అయ్యదేవర, ప్రకాశం, ముట్నూరి, దుగ్గిరాల, కొండా, వీవీ గిరి, మాడపాటి, బూర్గుల, నీలం, కాశీనాథుని, పింగళి, వామన్ నాయక్, మెల్కొటె, జమలాపురం, కెవి రంగారెడ్డి లాంటి వారిని ఆ జాబితాలో ఉదహరించవచ్చు. స్వతంత్రం రాక పూర్వం పరిస్థితి అలా వుంటే, ఇక ఆ తర్వాత, బ్రాహ్మణే తర కులాలకు చెందిన ధనిక భూస్వామి వర్గాలలోని కమ్మ, రెడ్డి, కాపు, క్షత్రియ, వెలమ వారి ఆధిపత్యం మొదలైంది. ఇంకా కొనసాగొతుందిప్పటికీ. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టడంతో, ఈ తరగతులకు చెందిన వారిదే పూర్తి పెత్తనంగా మారడం, వారే ముఖ్యమంత్రులు-మంత్రులు-జిల్లా పరిషత్ అధ్యక్షులు-ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కావడం మొదలైంది. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. అప్పటినుంచి కొంత మార్పొచ్చింది.

ఒక గురుమూర్తో, ఒక ముసలయ్యో, ఒక హనుమంతరావో, ఒక సంజీవయ్యో, ఒక అంజయ్యో తప్ప ముఖ్యమంత్రులైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనా, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినా, అగ్ర వర్ణాల వారో, ధనిక వర్గాల వారో కావడమే కాని, వెనుకబడిన వర్గాల వారికి అవకాశాలు ఎక్కువగా రాలేదనే అనాలి. ఇందిరా గాంధి నాయకత్వంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీలో మొదటి సారి చీలి కొచ్చిన తర్వాత, జరిగిన మధ్యంతర ఎన్నికలప్పటినుంచి, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కొంత మార్పు కనబడ సాగింది. వెనుకబడిన వర్గాల వారికి, దళితులకు కొంత ప్రాధాన్యత లభించడం మొదలైంది. సంఖ్యాపరంగా వారు మెజారిటీలో వుండడం, వారి ఓట్లు గెలుపుకు ముఖ్యం కావడం, ఈ మార్పుకు ప్రధాన కారణం. అయితే, జన్మతః అందరు వెనుకబడిన వర్గాలకు చెందిన వారైనప్పటికీ, అవకాశాల విషయానికొచ్చేటప్పటికి, కొందరికే ప్రాధాన్యత లభించింది. సామాజికంగా-ఆర్థికంగా పుంజుకున్న వారు, విద్యాధికులకే పైకి పోయే అవకాశాలు లభించాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో వీరి అవసరం రీత్యా పలువురికి అవకాశాలు రాసాగాయి. అయితే, మొదటి నుంచి కూడా, కాంగ్రెస్ నాయకత్వం ధనికుల-అగ్ర వర్ణాల వారి చేతుల్లో వున్నప్పటికి, పార్టీకి మద్దతిచ్చే వారిలో అధికులు దళితులు, వెనుక బడిన వర్గాల వారు, మైనారిటీలు కావడం విశేషం. ఇప్పటికీ, పూర్తిగా అవకాశం చేతికందకపోయినా, 1972 ఎన్నికల అనంతరం, అధిక సంఖ్యలో వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, దళితులు చట్ట సభల్లో ప్రవేశించే వీలు కలిగింది. పీవీ నరసింహా రావు మంత్రివర్గంలో సగానికి పైగా ఆ వర్గాల వారికే స్థానం లభించడం విశేషం.

కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ విభేదాలెంత మోతాదులో వుంటాయో, అంతకంటే ఎక్కువ మోతాదులో కుల-మత విభేదాలుంటాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎన్నుకొనేటప్పుడు (ఎంపిక చేసేటప్పుడు), శాసనసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ల పంపకమప్పుడు, ఎన్నికల అనంతరం శాసనసభ పక్షం నాయకుడి ఎన్ని కప్పుడు, స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల విషయంలో, జిల్లా పరిషత్-మునిసిపల్ చైర్మన్ ఎన్ని కప్పుడు కుల రాజకీయాలకు అధిక ప్రాధాన్యతుంటుంది. ఇంతవరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో, అడపాదడపా తప్ప, సర్వసాధారణంగా రెడ్డి, కమ్మ కులస్తులకే ఎక్కువ స్థానాలు ఎక్కువ సార్లు లభించాయి. స్థానిక సంస్థల్లో అంజయ్య పుణ్యమా అని రిజర్వేషన్లు కలిగించడంతో, వెనుకబడిన వర్గాల వారు అధిక సంఖ్యలో ఎన్నిక కాగలుగుతున్నారు. అంతకు ముందు, జిల్లా పరిషత్ చైర్మన్లు గాని, సమితి అధ్యక్షులు గాని ఒక పథకం ప్రకారం అగ్ర వర్ణాల వారే ఎన్నికయ్యేవారు. అందునా, తెలంగాణలో-రాయలసీమలో రెడ్లు, కోస్తాంధ్రలో కమ్మ వారు, ఉత్తరాంధ్రలో క్షత్రియులు ఎన్నికయ్యేవారు.

కాంగ్రెస్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో అవతరించిన మరో రాజకీయ పార్టీ జనత పార్టీ. అంతకు ముందే కమ్యూనిస్ట్, ప్రజా సోషలిస్ట్, స్వతంత్ర లాంటి పార్టీలున్నప్పటికీ, ఇందిరా గాంధి విధించిన ఎమర్జెన్సీ నేపధ్యంలో మొట్టమొదటి కాంగ్రేసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి పార్టీగా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జనత పార్టీకి ప్రాధాన్యముందనాలి. ఆ పార్టీ కూడా అగ్ర కులాల ఆధిపత్యంలోనే పనిచేసింది. నీలం సంజీవరెడ్డి జనత ఆంధ్ర విభాగం ఏర్పాటును లాంఛనంగా ప్రకటించి, దాని అధ్యక్షుడుగా తెన్నేటి విశ్వనాథంను నియమించారు. ఇప్పటి జాతీయ స్థాయి నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు అప్పట్లో విద్యార్థి విభాగం కన్వీనర్. జనత పార్టీ రాష్ట్ర కమిటీలో కేవలం ఇద్దరు మాత్రమే షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు, నలుగురు వెనుకబడిన వర్గాలకు చెందిన వారుండగా, మిగిలిన 85% మంది ఇతరులున్నారు. కాకపోతే, వారిలో ఒక ముస్లిం, ఇద్దరు మహిళలు కూడా వున్నారు. 1977 ఎన్నికల ముందు ఏర్పాటుచేసిన అడహాక్ కమిటీ పరిస్థితి కూడా అంతే. అందులో షెడ్యూల్డ్ కులాల వారు, తెగల వారు, వెనుకబడిన వర్గాల వారందరు కలిసి కేవలం 23% మంది మాత్రమే సభ్యులయ్యారు. ఆ తర్వాత కొన్ని మార్పులు-చేర్పులు చేసినా, అవన్నీ రాజకీయ కోణం నుంచే కాని వెనుకబడిన వర్గాల వారి ప్రాధాన్యతను పెంచేందుకు కాదు. 1977 లోక్ సభ ఎన్నికల్లో ఇద్దరు వెనుకబడిన వర్గాల వారు, ఒక్క ముస్లిం అభ్యర్థి తప్ప మిగిలిన అందరూ ఇతరులే. ప్రజల-ఓటర్ల మద్దతు పొందేందుకు 1978 శాసనసభ ఎన్నికల్లో సుమారు 40% స్థానాలను ఆ వర్గాల వారికి కేటాయించింది జనత పార్టీ నాయకత్వం.

కమ్యూనిస్టు రాజకీయాలపై కూడా కుల ప్రభావం పడిందనాలి. ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ-సామాజిక-ఆర్థిక నేపధ్యంలో అవి తప్పవేమో! స్వతంత్రం రాక పూర్వం రాష్ట్రంలోని జాతీయోద్యమం బ్రాహ్మణుల నాయకత్వంలో చాలావరకు నడి చేది. రాయలసీమలోని రెడ్లు, కోస్తాలోని కమ్మ వారు, ఆధిపత్యం కొరకు బ్రాహ్మణులపై పోరాడారు. కోస్తాలోని కమ్మ వారికి, బ్రాహ్మణులను ఎదిరించేందుకు సరైన ఆయుధం కమ్యూనిస్ట్ పార్టీ పేరుతో లభించింది. అలానే రాయలసీమ రెడ్డి వారు కూడా. నిజా-నిజాలెంతో కాని, 1952 లో జరిగిన ఎన్నికల్లో, కమ్యూనిస్ట్ వ్యూహం కాంగ్రెస్ పార్టీలోని కమ్మ-రెడ్డి విభేదాలను ఉపయోగించుకునే రీతిలో వుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. కమ్యూనిస్టుల్లో కులం ముఖ్యమైనా-కాకపోయినా, చాలా కాలం వరకు అగ్ర కులాల వారి ఆధిపత్యంలోనే నాయకత్వం కొనసాగింది. ఇటీవలి కాలంలో పార్లమెంటరీ పంథాకు అలవాటు పడి, బూర్జువా పార్టీల ధోరణులన్నీ వంటబట్టించుకున్న అతివాద-మితవాద-తీవ్రవాద కమ్యూనిస్టులు, కులం విషయంలో కూడా ఏమీ తీసిపోలేదనిపిస్తున్నారు.

ఆంధ్రుల ఆత్మ గౌరవం ఢిల్లీ నడి వీధుల్లో తాకట్టు పెట్టారు కాంగ్రెస్ వారంటూ, ఆ పార్టీని ఓడించి, నేల నాలుగు చెరగు లా తెలుగు వాడి సత్తా నిరూపించాలని పిలుపిచ్చారు తెలుగు దేశం పార్టీ ఆవిర్భావానికి ఆద్యుడు ఎన్ టీ రామారావు. ఆయన పిలుపునందుకొని వారు-వీరన్న తేడా లేకుండా ఆబాల గోపాలం ఆయన వెంట నడిచింది. కులమతాలకు అతీతంగా పార్టీ పక్షాన పోటీ చేసిన ప్రతి వారినీ విజయం వరించింది. అవినీతికి, అన్యాయానికి, వెనుకబడిన తనానికి వ్యతిరేకంగా ఎన్ టీ రామారావు మాట్లాడని రోజు లేదు. అంతవరకు బాగానే వుంది. మొదట్లో అవన్నీ పనికొచ్చాయి. క్రమంగా "ఆత్మగౌరవం" నినాదం స్థానంలో "రాజకీయ గౌరవం" ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్ టీ రామారావు ఆదర్శాలకు ఎదురుదెబ్బ తగిలి ప్రజాస్వామ్యం పరిహసించబడింది. ఆయన ప్రభుత్వాన్ని కూల దోసే నేపధ్యంలో కుల రాజకీయాలకే ప్రాధాన్యతుందనాలి. ఎన్ టీ రామారావును గెలిపించినప్పుడు కొందరు ఆయనను తమ కులానికి ప్రతినిధిగా మాత్రమే చూశారు. ఎప్పుడైతే అది కుదరలేదో, ఆ కులానికి చెందిన మరొకరిని ఆ పీఠంపై కూర్చొబెట్టే ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన వ్యక్తులే, అదను చూసుకుని ఆయన అధికారంలో కొనసాగడం మంచిది కాదనుకుని నాయకత్వం చేపట్టారు. తెలుగు దేశం పార్టీ కూడా కుల ప్రాధాన్యత విషయానికొచ్చే సరికి అన్ని రాజకీయ పార్టీల మార్గాన్నే అనుసరించిందనాలి. లెక్కలు పక్కన పెట్టి తే, మూడు పర్యాయాలు ప్రభుత్వంలోకి వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలలో కాని, మంత్రులలో కాని వెనుక బడిన వర్గాల వారి ప్రాధాన్యత మిగిలిన వారితో పోల్చి చూస్తే చాలా తక్కువే. నాయకత్వం సరిపడక పార్టీని వదిలి వెళ్ళి తిరిగొచ్చిన దేవేంద్ర గౌడ్ లాంటి వారు కూడా వెనుకబడిన వర్గాల వారి వాణిగా పేరు తెచ్చుకోలేక పోతున్నారు.

ఇక ఇటీవలి కాలంలో ధనవంతులైన కొందరు బీసీ నాయకులు పార్టీ పెట్టి తమ వారికి న్యాయం చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ గా కూడా గెలిచారు. ఏమైందో-ఏమో, మళ్ళీ అవే రాజకీయాలు. కాంగ్రెస్ గూట్లో చేరారు. ఇలా ఉన్న ఒకటి-రెండు ఆశలను కూడా ఆ వర్గానికి చెందిన వారే అడియాసలు చేస్తుంటే ఎలా?

ఇవిలా వుండగా, కాంగ్రెస్ పార్టీని వీడిన వారు, అలిగి పోయిన వారు, రాజకీయ కారణాలతో కొంతకాలం బయటున్న వారంతా అగ్ర కులాల వారే. ఎన్జీ రంగా కేఎల్పీ పార్టీ, బ్రాహ్మణుల నాయకత్వంలో వెలిసిన కే.ఎం.పీ.పీ, మర్రి చెన్నా రెడ్డి డెమోక్రాటిక్ పార్టీ, స్వతంత్ర పార్టీ అలాంటివే. ఆధిపత్య పోరు కొరకే అవన్నీ. అందునా కుల ప్రాతిపదికన జరిగిన ఆధిపత్య పోరే అది. ఎదేమైనా-ఎవరెన్ని చెప్పినా, వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ పెత్తనం అప్పగించడం ఇప్పటికీ ఇంకా మాటల్లోనే కాని ఆచరణలో కానే కాదు. ఒక వేళ వీరిలో ఎవరన్నా ఉన్నత స్థాయికి చేరుకోగల వారుంటే, వారికి కూడా ధన బలం తప్పని సరి. అది లేకపోతే, వారి వారే వెనక్కు పడవేయడం ఖాయం.


Tuesday, May 28, 2013

మంత్రివర్గ సమిష్టి బాధ్యత: వనం జ్వాలా నరసింహారావు

మంత్రివర్గ సమిష్టి బాధ్యత

ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవులకు రాజీనామా చేశారు. వివాదాస్పద జీవోల జారీ విషయంలో తమ తప్పేమీ లేదని, తాము కోర్టులో నిర్దోషులుగా బయటపడ్తామని అన్నారు. తాము అలనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో సభ్యులుగా, కేవలం, మంత్రివర్గం సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలను అమలుపర్చామే తప్ప, తాము లబ్ది పొందే విధంగా ఏ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు, ప్రస్తుతానికి వారికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన జరిగింది. ఇక భవిష్యత్‍లో ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.

      ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్ విషయంలో సీబీఐ అభ్యర్థనను కొన్నాళ్ల క్రితం తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం, దానికి కారణం చూపుతూ, ఆ కేసుకు సంబంధించిన నిర్ణయం అలనాడు రాజశేఖర రెడ్డి కాబినెట్ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం అని చెప్పింది. ప్రాసిక్యూషన్ తిరస్కరించిన నిర్ణయాన్ని కూడా మంత్రి మండలి సమిష్టి నిర్ణయంగా చెప్పింది. మంత్రి మండలి నిర్ణయానికి మంత్రులందరూ కట్టుబడి వుండాల్సిందే. ధర్మాన ప్రసాద్ రావు విషయంలో జరిగిన ఈ వివాదాస్పద అంశం చర్చనీయాంశమే!

రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ముగిసిన వెంటనే, శాసనసభలో మెజారిటీ స్థానాలను పొందిన రాజకీయ పార్టీ-లేదా-సంకీర్ణ కూటమికి చెందిన నాయకుడిని (నాయకురాలిని) ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించడం ఆనవాయితీ. ఆ నాయకుడినే ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు. అలా ముఖ్యమంత్రిగా నియమించబడిన వ్యక్తి సూచనమేరకు, గవర్నర్ ఇతర మంత్రులను, మంత్రి మండలి సభ్యులుగా నియమించడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే, ముఖ్యమంత్రి తనతో "సమాన హోదా కలిగిన ఇతర మంత్రులలో ప్రథముడు" మాత్రమే (First among the equals). ఇక అప్పటినుంచి, విధాన పరమైన ప్రభుత్వ పాలన యావత్తు "మంత్రి మండలి సమిష్టి బాధ్యత" అన్న రాజ్యాంగ ప్రాధమిక సూత్రం ఆధారంగానే జరుగుతుంది-జరిగి తీరాలి.

ఈ నిబంధనకు ఎవరూ అతీతులు కాదు. అలా కావడం అంటే రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా నడచుకున్నట్లే! ఇక మంత్రిగా కాబినెట్‌లో చేరిన వ్యక్తికి రెండు రకాల బాధ్యతలుంటాయి. అందులో మొదటిది ఆయనకు అప్పజెప్పిన శాఖాపరమైన దైనందిన బాధ్యత. దానికి పూర్తి బాధ్యుడు స్వయంగా ఆ మంత్రి మాత్రమే. రెండోది విధానపరమైన నిర్ణయాలలో యావత్ మంత్రి మండలి సభ్యులతో పాటుగా సమిష్టి బాధ్యత. అంటే, ఒకటి వ్యక్తిగతమైంది మరొకటి సమిష్టిది. రొటీన్‌గా వెలువడే ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో బాధ్యత మొత్తం తనది, సంబంధిత అధికారి(రులది)ది అవుతుంది. కాబినెట్ నిర్ణయం తీసుకునే ఉత్తర్వుల విషయంలో తనకు, తనతో పాటుగా ఇతర మంత్రులకు బాధ్యత వుంటుంది. ఆ నిర్ణయం కాబినెట్ నిర్ణయం అవుతే, ఆయనతో పాటు ఇతర మంత్రులకు కూడా బాధ్యత వుండి తీరుతుంది.

          వివరాలలోకి పోతే, వివాదాస్పద ప్రభుత్వ జీవోలు ఒక విధంగా సంబంధిత శాఖా మంత్రిని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తే, మరో రకంగా అదే మంత్రిని ఇతర సహచర మంత్రులతో పాటు సమిష్టి గా బాధ్యుడిని చేస్తాయి. "ముఖ్యమంత్రి సంతకం పెట్టమంటే పెట్టాను కాని తనదేం తప్పు లేద" ని వాదించడం సబబు కాదు. ముఖ్యమంత్రితో పాటు, తనది-తనతో పాటు ఇతర మంత్రులది సమిష్టి బాధ్యత కింద తప్పే!

          పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకగా చెప్పుకునే బ్రిటన్‌లో మంత్రివర్గ సమిష్టి బాధ్యత అనేది ఒక సత్ సాంప్రదాయం. అనాదిగా వస్తున్న సదాచారం. దీనికి చట్టబద్ధత ఎంత మేరకున్నదని ప్రశ్నించడం మూర్ఖత్వమే అవుతుంది. ఇంతకూ, మంత్రివర్గ సమిష్టి బాధ్యత ఎవరికి? మంత్రివర్గం ప్రభుత్వ విది-విధానాల మీద తీసుకున్న నిర్ణయానికి సమిష్టిగా చట్ట సభలకు బాధ్యత వహిస్తారని దానర్థం. సాధారణ పరిభాషలో మాట్లాడుకోవాలంటే, సమిష్టి బాధ్యత అనే సూత్రం కింద, మంత్రివర్గంలోని సభ్యులందరూ, ప్రభుత్వ విధి-విధానాల మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఎవరు-ఎక్కడ-ఏ సందర్భంలో మాట్లాడినా, ఒకే విధంగా మాట్లాడాలన్న భావన వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడి ప్రజలను తికమక పెట్ట కూడదు. ప్రజల ముందుకు ప్రభుత్వ విధానాన్ని తీసుకెళ్లేటప్పుడు అందరి అభిప్రాయం ఒక్కటి గానే వుండాలి. ప్రభుత్వం ఇమేజ్ దెబ్బ తినకూడదు. మంత్రివర్గ సభ్యులంతా, అధికార పక్షంలో ఒక ఐక్య సంఘటనలాగా వుండాలి. ఒక వేళ ఎవరికైనా భేదాభిప్రాయం వుంటే, దానిని బయట పెట్టే ముందర మంత్రివర్గ సభ్యుడిగా రాజీనామా చేయడం కనీస ధర్మం. అలా జరిగినప్పుడు, రాజీనామా చేసిన మంత్రి అభిప్రాయం సరైందన్న వాదన బలపడితే, మిగిలిన మంత్రివర్గం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించుకోవచ్చు. మరో విధంగా చెప్పుకోవాలంటే, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించ లేకపోతే, బహిరంగంగా విమర్శించడం తప్పనిసరిగా మానుకోవాలి.

         రాజ్యాంగ పరంగా అనాదిగా వస్తున్న ఈ సాంప్రదాయం ద్వారా, మంత్రి మండలిలోని ప్రతి ఒక్క సభ్యుడు, కాబినెట్‌లో తీసుకున్న ప్రతి నిర్ణయానికీ, వ్యక్తిగతంగా ఆ నిర్ణయానికి వ్యతిరేకమైనప్పటికీ, బహిరంగంగా, దానిని సమర్థించాల్సి వుంటుంది. అందులో భాగంగానే, ఆ నిర్ణయం విషయంలో ఒకవేళ చట్ట సభలలో ఓటింగు జరుగుతే దానికి అనుకూలంగా ఓటేయాల్సి వుంటుంది. వాస్తవానికి ఇలాంటి సాంప్రదాయమే కమ్యూనిస్టు దేశాలలో కూడా మరో విధంగా అమలులో వుంది. పార్టీ కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదనే ఆ సాంప్రదాయానికి "ప్రజాస్వామ్య కేంద్రీకరణ" అని పేరు పెట్టుకున్నారు వాళ్లు. కాబినెట్ సమిష్టి నిర్ణయం అన్నా, బాధ్యత అన్నా ఒకటే. ఒక వేళ మంత్రివర్గంలోని ఏ ఒక్క సభ్యుడి పైనైనా చట్ట సబలలో అవిశ్వాస తీర్మానం పెడితే, అది యావత్తు మంత్రివర్గం మీద పెట్టినట్లే. అది సభ ఆమోదం పొందితే మంత్రులందరి మీద అవిశ్వాసమే కాని, కేవలం ఆ ఒక్క మంత్రిమీద మాత్రమే కాదు. అలాంటప్పుడు మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాల్సిందే! ఆ తరువాత కొత్త మంత్రివర్గం అన్నా ఏర్పడవచ్చు, లేదా, చట్ట సభలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలను జరపాల్సిన అవసరమైనా కలుగుతుంది. సమిష్టి బాధ్యతకు, వ్యక్తిగత బాధ్యతకు కొంచెం తేడా వుంది. వ్యక్తిగత బాధ్యత అంటే, మంత్రులు తమ శాఖకు సంబంధించిన దైనందిన కార్యకలాపాలలో  రోజువారీగా తీసుకునే నిర్ణయాలు అని అర్థం. వారికి కేటాయించిన శాఖల నిర్వహణ బాధ్యత వ్యక్తిగతమైనటువంటిది. అలా శాఖాపరంగా తీసుకునే నిర్ణయాలకు వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్న వారు మాత్రమే బాధ్యులవుతారు.

          బ్రిటన్‌లో, సమిష్టి బాధ్యత అనే సూత్రం, కేవలం మంత్రులకు మాత్రమే కాకుండా, మంత్రివర్గంలో పరోక్ష సభ్యులైన పార్లమెంటరీ ప్రయివేట్ సెక్రటరీలకు కూడా వర్తిస్తుంది. సమిష్టి నిర్ణయాల అమలు ఎలా వుండాలనే విధానాన్ని "మినిస్టీరియల్ కోడ్" లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాకపోతే, ఒకటి-రెండు పర్యాయాలు ఈ సూత్రాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు. 1930 లో బ్రిటన్‌లో జాతీయ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు, మంత్రి మండలిలో భాగస్వాములుగా వున్న లిబరల్ పార్టీ సభ్యులకు "రక్షిత పన్నుల విధానం" విషయంలో కొంత వెసులుబాటు కలిగించడం జరిగింది. అదే విధంగా, 1975 లో, హెరాల్డ్ విల్సన్ ప్రధానిగా వున్నప్పుడు, యునైటెడ్ కింగ్ డం యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీలో కొనసాగాలా? వద్దా? అనే విషయంలో చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ ఓటింగులో, తమకిష్టమైన విధంగా మంత్రివర్గ సభ్యులు ప్రచారం చేసుకోవచ్చని వెసులుబాటు కలిగించడం జరిగింది. కాబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా, ఇరాక్ యుద్ధానికి వ్యతిరేకత వ్యక్త పరిచిన క్లేర్ షార్ట్ ను మంత్రి మండలిలో కొనసాగడానికి, 2003 లో నాటి ప్రధాని టొనీ బ్లెయిర్ అంగీకరించడం మరో వెసులుబాటు. కాకపోతే, బహిరంగంగా కాబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన షార్ట్ రాజీనామా చేయక తప్పలేదు. డేవిడ్ కామెరూన్ ప్రధానిగా వున్నప్పుడు, కన్సర్వేటివ్-లిబరల్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో వుండేది. కన్సర్వేటివ్ పార్టీ మంత్రుల నిర్ణయాన్ని బహిరంగంగానే లిబరల్ పార్టీకి చెందిన మంత్రులు విమర్శించే ఆనవాయితీ తలెత్తినప్పుడు. చేసేదేమీలేక, ప్రధాని మంత్రివర్గ సమిష్టి నిర్ణయం అనే సూత్రాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. "వెస్ట్ లాండ్" విషయంలో 1986 లో, మార్గరెట్ థాచర్ మంత్రి మండలి సభ్యుడిగా వున్న, హాజెల్టైన్ రాజీనామా చేశాడు. వెస్ట్ లాండ్ వ్యవహారం థాచర్ ప్రభుత్వ హయాంలో తలెత్తిన ఒక పెద్ద రాజకీయ అపవాదు-కళంకం. అలనాటి యునైటెడ్ కింగ్ డం భవిష్యత్ హెలికాప్టర్ పరిశ్రమే ప్రశ్నార్థకంగా మిగిలిపోయిన వ్యవహారం అది. రక్షణ వ్యవహారాల శాఖను నిర్వహిస్తున్న మైఖేల్ హాజెల్టైన్ సూచనను మంత్రి మండలి తిరస్కరించింది. అమెరికన్ కంపెనీ చేతులలో వెస్ట్ లాండ్ ను విలీనం చేయాలన్న థాచర్ నిర్ణయంతో విభేదించిన హాజెల్టైన్  కాబినెట్ నుంచి వైదొలగాడు. ఆ తరువాత 1990 లో జరిగిన పార్లమెంట్ నాయకత్వ పోటీలో థాచర్ కు వ్యతిరేకంగా నిలుచుని ఓడిపోయాడు. అదే విధంగా 1990 లో యూరోప్ విధానం మీద కాబినెట్ తో ఏకీభవించని జాఫ్రీ రాజీనామా చేశాడు. విభేదించిన మంత్రులు వైదొలగారు కాని మంత్రి మండలిలో కొనసాగలేదు. ఇవన్నీ అతి కొద్ది ఉదాహరణలు మాత్రమే. ఏదేమైనా, బ్రిటన్ రాజ్యాంగంలో కాబినెట్ సమిష్టి బాధ్యత అనేది ఒక విడదీయలేని అనుబంధంలాంటి సాంప్రదాయం.

          అలాంటప్పుడు మంత్రి మండలిలో సభ్యుడైనంత మాత్రాన, వ్యక్తిగతంగా ఒక శాఖను నిర్వహిస్తున్న మంత్రికి వ్యక్తిగత బాధ్యత లేదని అనుకోరాదు. తమ వ్యక్తిగత నడవడితో సహా, చట్ట సభలలో, గౌరవ సభ్యుల సందేహాలకు తమదైన శైలిలో నివృత్తి చేసే బాధ్యత మంత్రులందరి మీదా వుంటుంది. తమ శాఖలకు సంబంధించిన బిల్లులను చట్టసభలలో ప్రవేశ పెట్టే బాధ్యత కూడా వ్యక్తిగతంగా మంత్రులదే. వారు ప్రవేశ పెట్టిన బిల్లులతో సహా, వారి శాఖలు చెందిన పలు అంశాలపై చట్ట సభలకు వారే జవాబుదారీ అవుతారు. సభ్యుల ప్రశ్నలకు లిఖిత పూర్వకంగా-మౌఖికంగా సమాధానాలివ్వడం, వారు పలు నిబంధనల కింద లేవనెత్తిన అంశాలకు వివరణ ఇవ్వడం, చట్ట సభల కమిటీల ముందు హాజరై వివరణలు ఇవ్వడం, చట్ట సభల ఉప సంఘాలలో సభ్యుడిగా తమ బాధ్యతలు నిర్వర్తించడం లాంటివి వ్యక్తిగత బాధ్యతలే. ఇవన్నీ వారి వ్యక్తిగత హోదాలో, కార్య నిర్వహణ బాధ్యతలలో భాగంగా చట్ట సభలకు జవాబుదారీగా వుండే ప్రక్రియ మాత్రమే. మరో విధంగా చెప్పుకోవాలంటే, చట్ట సభల ద్వారా, ఓటర్లకు-ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించడమే! వ్యక్తిగత బాధ్యత అనే సాంప్రదాయం-చట్టం కింద, తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యవహారాల విషయంలో విధాన పరమైన-పాలనా పరమైన సీరియస్ తప్పులు దొర్లినా, వ్యక్తిగతంగా తప్పుడు విధానాలు అవలంబించినా, తప్పుడు పనులకు ప్రేరేపించినా, తన శాఖకు సంబంధించి రాబోయే పరిణామాలను ఊహించలేకపోయినా బాధ్యతల నుంచి తప్పుకోవడానికి రాజీనామానే పరిష్కారం. అలాంటి ఉదాహరణలూ కోకొల్లలు. 1982 లో, ఫాల్క్ లాండ్స్ పై అర్జెంటీనా దాడి చేయబోతోందన్న విషయాన్ని ముందుగానే పసిగట్ట లేక పోయిన నాటి బ్రిటన్ విదేశాంగ మంత్రి లార్డ్ కారింగ్ టన్ తన సహాయకులైన ఇద్దరు జూనియర్ మంత్రులతో సహా రాజీనామా చేయాల్సి వచ్చింది. అలానే వైవాహేతర సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చిన కన్సర్వేటివ్ మంత్రి సిసీల్ పార్కిన్ సన్ 1980 నాటి రాజీనామా. ఇటీవలి కాలంలో బ్రిటీష్ మంత్రిగా రాజీనామా చేసిన పీటర్ మాండిల్ సన్ వ్యవహారం కూడా వ్యక్తిగతంగా తప్పుడు నడవడి కలిగి వుండడమే! చట్ట సభలను తప్పు దోవ పట్టించిన మంత్రులు రాజీనామా చేసిన సందర్భాలూ లేకపోలేదు.

          ప్రభుత్వం సక్రమంగా నడవాలంటే మంత్రి మండలి సక్రమంగా వ్యవహరించాలి. మంత్రి మండలిలోని ప్రతి సభ్యుడూ బాధ్యతాయుతంగా నడచుకోవాలి. ఎవరి దారి వారిదే అనుకోరాదు. తమ సహచరులు తీసుకున్న నిర్ణయంతో ఏకీభవించి, ఆ నిర్ణయాన్ని అన్ని వేళలా సమర్థించడం సమంజసం. అలా చేయలేక పోతే రాజీనామా చేసి మంత్రి మండలి నుంచి వైదొలగడం మంచిది.

ఈ నేపధ్యంలో మంత్రి మండలికి ధర్మాన ప్రసాద రావు చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి ఆనాడే ఆమోదించినట్లయితే బాగుండేది. అలా కాకపోయినా కనీసం ఆయన తీసుకున్న నిర్ణయాలను వ్యక్తిగత ఖాతాలోకి పంపి వుండాల్సింది. ఈ రెండింటికి విరుద్ధంగా వాటిని కాబినెట్ సమిష్టి నిర్ణయంగా చూపడానికి ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా, ధర్మాన ప్రసాద రావు ప్రాసిక్యూషన్ కు అనుమతి నిరాకరిస్తూ దానిని మంత్రివర్గ నిర్ణయంగా చూపాడు. ఇక ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి కూడా రాజీనామా చేశారు. వీరిద్దరి రాజీనామాలను ఆమోదించడం మినహా ముఖ్యమంత్రికి మరో మార్గం లేదు.

          జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో కింది నుంచి పైదాకా చాలామందిది, ఆ మాటకొస్తే, మంత్రులందరిది తప్పే. జగన్ తో పాటు వీరందరిని విచారించాల్సిందే. మోపిదేవి, ధర్మాన, సబితాలతో పాటు మిగతా ముగ్గురు మంత్రులను కూడా, అదే బాట పట్టించాలి. వారందరినీ, సిబిఐ దర్యాప్తుకు పిలిచే లోపుగానే మంత్రి మండలి నుంచి తొలగించాలి. సిబిఐ పిలవడం, విచారణ మొదలవడం, అరెస్ట్ పర్వం ఆరంభమవడం, అప్పుడు రాజీనామా కోరడం కన్నా ఇదే సరైన మార్గం. అంతే కాదు... సమిష్టి బాధ్యత కింద, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన ఇతర మంత్రులందరిని కూడా తొలగించి, మంత్రి మండలిని పునర్వ్యవస్థీకరించాలి. అప్పుడే దీనికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. లేకపోతే, ఒకరిద్దరు మంత్రులను మాత్రమే బలి పశువులను చేసినట్లవుతుంది.


          ఇదిలా వుంటే, వైఎస్సార్సీపి లోకి వలసల భయం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాజీనామా చేసిన మంత్రులు కాని చేయబోయే మంత్రులు కాని కాంగ్రెస్ పార్టీని వీడిపోతే ప్రభుత్వం మనుగడ ఎలా అన్న మీమాంసలో పడిపోయింది పార్టీ అధిష్టానం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు తమకు నష్టమేనని ఇరు పార్టీల నాయకత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విశ్లేషించు కొంటున్నాయి. ఏం జరిగినా ఆశ్చర్య పోనక్కరలేదు. End

Monday, May 27, 2013

బయ్యారం గనుల వ్యవహారంలో తెలియని కోణాలు: వనం జ్వాలా నరసింహారావు


బయ్యారం గనుల వ్యవహారంలో తెలియని కోణాలు
వనం జ్వాలా నరసింహారావు

          వైఎస్ హయాంలో రక్షణ స్టీల్స్ కు కేటాయించిన బయ్యారం గనులను, రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసి, విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించడంతో వివాదం చెలరేగింది. "బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు" అన్న నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ప్రాంత తెలుగుదేశం నాయకులు, వారితో సహా పలువురు ఇతర పార్టీలకు చెందిన తెలంగాణ నేతలు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టడమే కాకుండా, ఎట్టి పరిస్థితుల్లోను అక్కడి నుంచి ముడిసరుకు తరలి పోకుండా అడ్డుకుంటామని సవాలు విసిరారు. ఈ నేపధ్యంలో ఖమ్మం జిల్లా వాసిగా, బయ్యారం గనుల గురించి చిన్నతనం నుంచే వింటున్న వ్యక్తిగా, ఎప్పుడో 60 ఏళ్ల కిందే అక్కడ గనుల నుంచి ముడిసరుకు వెలికి తీసి విదేశాలకు రవాణా చేశారని ఆ నోటా ఆనోటా తెలుసుకున్న వాడిగా కొన్ని విషయాలు పాఠకులతో పంచుకునే ప్రయత్నమే ఇది.

          ఖమ్మం జిల్లాలో స్వర్గీయ మూల్పూరి అక్కయ్య చౌదరి గురించి వినని వారు లేరు. ఆయనో వ్యాపార వేత్త. ఖమ్మం సమీపంలోని నేలకొండపల్లితో సహా జిల్లాలోని పలు ప్రదేశాలలో రకరకాల వ్యాపారాలు చేసేవారు. కవి, రచయిత కూడా. ఆయనగారికి మైనింగ్ మీద అమితమైన మక్కువ. ఖమ్మం జిల్లాలో అనేక ప్రదేశాలలో రకరకాల గనులున్నాయని, అపారమైన ఆ ఖనిజ సంపదను వెలికి తీసి వ్యాపారం చేయాలని అనుకునే వ్యక్తుల్లో ఆయన ప్రథముడు. 1909 జులై నెలలో జన్మించిన ఆయన తన 80 వ ఏట 1989 నవంబర్‌లో మరణించారు.  నిజానికి "బయ్యారం అంటే అక్కయ్య చౌదరి అని, అక్కయ్య చౌదరి అంటే బయ్యారం అని" ఆ ప్రాంతంలో అనుకునే వారు ఆ రోజుల్లో. ఆయన నేపధ్యం, అభిలాష తెలుసుకున్న బయ్యారం చుట్టుపక్కల గ్రామస్థులు కొందరు, వాళ్ల వూళ్లో కాకి రాయి, ఎర్ర రాయి వుందన్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు 1953 ప్రాంతంలో. అక్కయ్య చౌదరి వెంటనే తనకు తెలిసిన కొందరు శాస్త్రవేత్తలతో ఆ పరిసరాలను అధ్యయనం చేయించి, అక్కడ లభించే ముడిసరుకుని విశ్లేషణ చేయించారు. అక్కడ రాయిలో 62%-64% వరకు ఫెర్రిక్ కన్టెన్ట్ వుందని తేలడంతో, నాటి హైదరాబాద్ ప్రభుత్వానికి చెందిన గనుల శాఖాధికారులను కలిశారు. బయ్యారం గ్రామంలోని 1500 ఎకరాలను, పక్కనే వున్న ఇర్సలాపురం గ్రామంలో 986 ఎకరాలను ఖనిజం తవ్వేందుకు లీజుకు తీసుకున్నాడాయన. అంటే ఎప్పుడో 60 ఏళ్ల కిందే అక్కడ గనులను ప్రభుత్వం లీజుకిచ్చింది అన్న మాట. అక్కయ్య చౌదరి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేంతవరకు బయ్యారంలో ఉక్కు ఖనిజం వుందన్న సంగతే ఎవరికీ తెలియదు. ఆ తరువాత సుమారు పదేళ్లకు రాష్ట్ర ప్రభుత్వ గనుల శాఖకు చెందిన భూవిజ్ఞాన శాస్త్రజ్ఞులు ఎస్సార్ శర్మ, అప్పావధానులు అక్కడ అధ్యయనం చేసి సుమారు నూట పది లక్షల టన్నుల ఇనుప ఖనిజం అక్కడ లభ్య్యమవుతుందని అంచనా వేశారు. ఈ నాటికీ అదే శాస్త్రీయ అధ్యయనం. కాకపోతే  అందులో సగం మాత్రమే 62%-64% ఫెర్రిక్ కన్టెన్ట్ వుంటుందని అంచనా వేశారు వాళ్లు.


          అక్కయ్య చౌదరి 1954 లో గనులను లీజుకు తీసుకుని, మైనింగ్ చేసి, ముడిసరుకును సరాసరి జపాన్ కు ఎగుమతి చేసేవారు. అప్పట్లో చౌదరి మైనింగ్ కంపెనీ పేరుతో సగటున ఏడాదికి 20,000 టన్నుల ముడిసరుకును ఎగుమతి చేసేవారట. బయ్యారం నుంచి విజయవాడ వరకు లారీలలో, అక్కడినుంచి బందర్ (మచిలీపట్నం), కాకినాడలకు పడవలలో తీసుకెళ్లి, బందర్-కాకినాడలనుంచి జపాన్ కు పంపేవారు. అక్కయ్య చౌదరికి చెందిన చౌదరి మైనింగ్ కంపెనీకి 50%  వాటా, మిగిలిన 50% వాటా గూడూరు మైకా మైనింగ్ కంపెనీకి చెందిన గోగినేని వెంకటేశ్వర రావుకు వుండేది. ఇంతలో 1958 లో "మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్" (ఎం.ఎం.టి.సి) స్థాపించింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ మైనింగ్ విధానం మారింది. మైనింగ్ కంపెనీలు సరాసరి ముడిసరుకును విదేశాలకు ఎగుమతి చేయరాదన్న నిబంధన విధించింది ప్రభుత్వం. ఎం.ఎం.టి.సి ద్వారానే ఎగుమతి జరగాలని స్పష్టం చేయడం జరిగింది. దానికి తోడు అనేక ఇతర నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి. ఇంతకు ముందున్న ధర కంటే తగ్గించి, టన్నుకు రు. 21 లుగా విధించారు. ఆ ధర కూడా బయ్యారం సమీపంలోని గుండ్రాతిమర్గు రైల్వే స్టేషన్‌కు చేర్చిన తరువాతే నని చెప్పారు. అంతే కాకుండా ఏడాదికి 10, 000 టన్నుల కంటే ఎక్కువగా ఎగుమతి చేయరాదని మరో నిబంధన విధించారు. ఆ విధంగా టన్ను ధర తగ్గించడం, లేబర్ ధరలు పెరిగి పోవడం, డీజిల్ ధర పెరగడం, అప్పుడప్పుడే పుట్టుకొచ్చిన నక్సలైట్ సమస్య తలెత్తడం లాంటి అడ్డంకులు కలగడంతో 1969 లో, దాదాపు 15 సంవత్సరాల పాటు చేసిన మైనింగ్‌ను వదులుకున్నారు అక్కయ్య చౌదరి. వాస్తవానికి నక్సలైట్ సమస్యను అధిగమించడానికి పోలీస్ రక్షణ కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రాలేదు. ప్రభుత్వానికి లేఖ రాసి మైనింగ్ నుంచి విరమించుకున్నారు. ఇక నాటి నుంచి రక్షణ స్టీల్స్ కు లీజుకు ఇచ్చేవరకు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూనే వుంది. ఇది జగమెరిగిన సత్యం.

          ఈ విషయాలను, బయ్యారం గనులకు సంబంధించిన మరిన్ని విషయాలను, అక్కయ్య చౌదరి కుమారుడు 75 సంవత్సరాల ఆచార్య ఎం. వెంకటేశ్వర రావు వివరిస్తూ ఇనుప ఖనిజం గురించి ఆసక్తికరమైన సంగతులు చెప్పారు. అక్కయ్య చౌదరికి గనులన్నా, మైనింగ్ అన్నా ఎంత ఇష్టమంటే, తన కుమారుడిని, ఇంజనీర్-డాక్టర్ చేయకుండా జియాలజిస్ట్ చేయాలనుకున్నాడు. డిగ్రీ జియాలజీతో, ఫీజి జియాలజీతో చేశారు వెంకటేశ్వర రావు.  పీజీ తరువాత, బయ్యారం గనులపైనే పిహెచ్. డి చేశారాయన. ఆ తరువాత కొంతకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, కొంతకాలం కొత్తగూడెం పీజీ కేంద్రంలో గనుల విభాగంలో అధ్యాపకుడిగా పనిచేశారాయన. ఆయన చెప్పినదాన్ని బట్టి, భారత దేశంలో నాణ్యమైన ఇనుప ఖనిజం జార్ఖండ్‌లోను, ఛత్తీస్‌ఘడ్ లోను, ఒరిస్సా రాష్ట్రంలోను లభ్యమవుతుందన్నారు. జగ్దల్‍పూర్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సరఫరా అవుతున్న ఖనిజం కూడా మంచిదే అన్నారు. బయ్యారంలో లభ్యమయ్యే ఖనిజం అటు వైజాగ్ ఉక్కు కర్మాగారానికి కాని, ఆ ప్రాంతంలోనే నెలకొల్పే కర్మాగారానికి కాని అంతగా పని కొచ్చే నాణ్యమైన సరుకు కాదని ఆయన అభిప్రాయం. పరిమాణం కోణంలో ఆలోచించినా తనకు తెలిసినంతవరకు దీర్ఘకాలం సరిపోయేది కాదంటారాయన. తక్కువ నాణ్యత నుంచి ఎక్కువ నాణ్యతకు పెంచడానికి పని కొచ్చే పెల్లిటైజేషన్ ప్లాంట్ బయ్యారంలో నెలకొల్పితే మంచిదని వెంకటేశ్వర రావు అంటారు. వాస్తవానికి 1969 లోనే పాల్వంచలో పెల్లిటైజేషన్ ప్లాంట్ పెట్టడానికి అక్కయ్య చౌదరి ప్రయత్నం చేశారు. ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా చేశారు. అప్పట్లో, ఐక్య రాజ్య సమితి అభివృద్ధి సంస్థ కార్యక్రమం కింద దానిని చేపట్టే ఉద్దేశంతో, ఆ సంస్థ అధ్యయన బృందం బయ్యారం పర్యటించింది కూడా. నాటి ఖమ్మం కలెక్టర్ ఆర్. పార్థసారథి, నాటి రాష్ట్ర మైనింగ్ డైరెక్టర్ రంగ సాయి బయ్యారం వచ్చిన బృందంలో వున్నారు కూడా. దురదృష్టవశాత్తు ఆ బృందం కేవలం బయ్యారం గ్రామం వరకే పోగలిగింది కాని, ఖనిజం లభ్యమయ్యే స్పాట్‌కు వెళ్లలేక పోయింది. దానికి కారణం ఆ ప్రాంతంలో ఆనాడు చోటుచేసుకున్న నక్సలైట్ సమస్యే. అప్పట్లో జిల్లా ఎస్. పీ గా ఆర్. కె. రాగాల వుండేవారు. ఏదేమైనా పెల్లిటైజేషన్ ప్లాంట్ మాత్రం స్థాపించడం జరగలేదు. కాకపోతే స్టీల్ ప్లాంట్ లాంటిది ఒకటి పాల్వంచలో 1970 ప్రాంతంలో నెలకొల్పబడినప్పటికీ తొందరలోనే పనిచేయకుండా పోయింది.

          బయ్యారం గనులపై శాస్త్రీయ అధ్యయనం చేసిన వారిలో ఏ. ఎం. హేరాన్ ఒకరు. ఆయన ఐదు దశాబ్దాల క్రితం హైదరాబాద్ జియలాజికల్ సర్వే శాఖలో సూపరింటెండెంట్ గా పని చేసేవారు. ఆయన బయ్యారం గనులపై ఓ పుస్తకం రాశారు కూడా. అలానే ఎస్సార్ శర్మ, అప్పావధానులు కూడా అధ్యయనం చేశారు. వాస్తవానికి ఖమ్మం పరిసరాలలో అన్ని రకాల ఖనిజ నిల్వలున్నాయి. కాకపోతే అందులో చాలా భాగం రెండో రకానికి చెందినవే. తవ్వగా-తవ్వగా ఏదో ఒక చోట ఒక చిన్న ముక్క నాణ్యమైంది దొరుకుతుంది అంటారు వెంకటేశ్వర రావు. ఆయన పి. హెచ్. డి అధ్యయనం కూడా ఆసక్తికరంగానే వుంటుంది.

          వేంకటేశ్వర రావు గారి మాటలను అర్థం చేసుకుంటే, ఒక విషయం స్పష్టమవుతుంది. నాణ్యత దృష్ట్యా, లభ్యమయ్యే మోతాదు దృష్ట్యా, స్థానిక అవసరాల దృష్ట్యా, రవాణా-ఇతర వ్యయాలను పరిగణలోకి తీసుకుంటే, బయ్యారం సమీపంలోనే ఉక్కు కర్మాగారాన్ని కాని, శుద్ధి కర్మాగారాన్ని కాని ఏర్పాటు చేయడం మంచిది. వైజాగ్ స్టీల్ ప్లాంటుకు ఇక్కడ నుంచి రవాణా చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయ్యారం పరిసరాలలోనే కర్మాగారం నెలకొల్పి "బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు" అన్న నినాదాన్ని కార్యరూపంలో తేవడం ప్రభుత్వ కనీస బాధ్యత.
        

Saturday, May 25, 2013

Friday, May 24, 2013

అంతర్‌రాష్ట్ర జల వివాదాలు, రాజకీయాలు: వనం జ్వాలా నరసింహారావు


అంతర్‌రాష్ట్ర జల వివాదాలు, రాజకీయాలు
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (25-05-2013)

బాబ్లీ ప్రాజెక్టు వివాదంపై కోర్టు తీర్పుమీద వివరణ, సమీక్ష కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుకు ముందు మూడంచెల వ్యూహం అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలొచ్చాయి. ఇందులో భాగంగా ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీ పరిధి, అధికారాలపై స్పష్టత కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి లేఖ రాసే ఆలోచనలో వున్నట్లు కూడా వార్తలొచ్చాయి. అదే లేఖలో , గోదావరి జలాల్లో మహారాష్ట్ర వినియోగించే 60 టీఎంసీలపై లెక్కల ఖరారు సంగతి కూడా తెలపాలని కోరవచ్చు. ఆ తరువాత నీటిపారుదల శాఖ మంత్రి నేతృత్వాన అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తోంది. ఈ విధంగా చేయడం వలన, బాబ్లీపై సుప్రీంకోర్టు తీర్పుమీద రాష్ట్ర ప్రభుత్వానికి వున్న సందేహాలను కేంద్రం ముందు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా కేంద్రంనుంచి అనుకున్న స్పష్టత రాకపోతే, సుప్రీం కోర్టుకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలా? లేక క్లారిఫికేషన్ పిటిషన్ వేయాలా? అనే దానిపై న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంది ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో చేపట్టాల్సిన తదుపరి చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి మార్చి 28న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు సుప్రీంకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ప్రతిపక్షాలు ఈ సందర్భంగా ప్రభుత్వానికి సూచించాయి.

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు నలభై సంవత్సరాల వరకు, అటు కేంద్రంలోను, ఇటు పలు రాష్ట్రాలలోను కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో వున్నాయి. సరిహద్దు నున్న పొరుగు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తి, పార్టీ పరంగా చాలావరకు సమసి పోయినా, అన్ని విషయాల్లో-అన్ని సందర్భాల్లో అంగీకారానికి వచ్చాయని అనలేం. కాకపోతే ఆరంభంలో, రాష్ట్రానికి ఒకటో-రెండో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటివి మాత్రమే వుండడంతో, పెద్దగా పేచీలుండకపోయేయి. క్రమేపీ, ఒక్క నీటి పారుదల ప్రాజెక్టులే కాకుండా, రక-రకాల పంపకాలలో విభేదాలు తలెత్తడం మొదలైంది. అవీ, కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్యనే, కాంగ్రెస్ ఇంకా కేంద్రంలో అధికారం కోల్పోక ముందే తలెత్తాయి. కాంగ్రేసేతర ప్రభుత్వాలు అధికారంలోకి రావడంతో, విభేదాలు చిలికి-చిలికి గాలివానలయ్యాయి. పొరుగు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను రాజకీయ కోణం నుంచి, రాజకీయ లబ్దిని దృష్టిలో వుంచుకుని చూడడం సహజమైంది. ఇంతలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ-తమ ప్రాంత ప్రజలకు లాభం చేకూరాలన్న కోణంలో ఆలోచన చేయడం, ఆ ఆలోచనలో రాజకీయం వుండడం, అంతటితో ఆగకుండా కొందరు నాయకులు పొరుగు రాష్ట్రాల వారికి నష్టం జరిగినా తమకు లబ్ది జరగాలని ముందుకు సాగడం నిరంతర సమస్యలకు నాంది పలింది. తమ రాష్ట్రం నుండి పారుతున్న నీటిపై తమకే హక్కు అని కొందరు వాదిస్తే, మిగులు జలాలపై హక్కు తమదనే అని మరికొందరు వాదించ సాగారు. సహజంగా ప్రవహించే నీటిపై హక్కు ఎవరికి-ఎంత మోతాదులో వుండాల్నోనని తేల్చాల్సిన కేంద్ర జల వనరుల సంఘం, ప్రాజెక్టులు ఆరంభించినప్పటినుంచి, పూర్తయ్యేవరకు నిమ్మకు నీరెత్తినట్లు వుండి, ఆ తర్వాత తమకే హక్కుందని వాదించే పొరుగునున్న రాష్ట్ర ప్రభుత్వాలకు తమదైన శైలిలో వంతుల వారీగా మద్దతిచ్చి సమస్యను మరింత జటిలం చేయడం ఆనవాయితీ అయిపోయింది. అలాంటి తాజా వివాదమే బాబ్లీ ప్రాజెక్టు.


బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది, తప్పా-ఒప్పా అని నిర్ణయించే అధికారమున్న "కేంద్ర జల వనరుల సంఘం" తీర్పు చెప్పే లోపునే నిర్మాణం పూర్తైంది. తెలుగు దేశం హయాంలోనే పనులు మొదలయ్యాయని కాంగ్రెస్ వారు, కాదని తెలుగుదేశం నాయకులు వాదించు కోవడంతో మొదలైన జగడం, అప్పట్లో సమస్యను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలనే వరకు పోయింది. అఖిల పక్ష కమిటీ ప్రధానిని కలిసే లోపునే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధుల బృందం, బాబ్లీ ప్రాజెక్టును సందర్శించి, స్వయంగా అధ్యయనం చేసి, ప్రధానికి అన్ని విషయాలు తెలియచేయాలన్న ఆలోచనతో ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకుంది. వారిని మహారాష్ట్రలోకి రానీకుండా అడ్డుకున్న మరాఠా పోలీసులు, అంతటితో ఆగకుండా, ప్రాజెక్టుకు తీసుకుపోతామని మభ్యపెట్టి పోలీసు వాహనం ఎక్కించి, అతి జుగుప్సాకరమైన పద్ధతిలో వారందరినీ "అరెస్టు" చేసినట్లు ప్రకటించి, మర్నాడు న్యాయమూర్తి ముందర హాజరు పరిచారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా, మిగతా వారందరు చట్ట సభలకు ఎన్నికైన వారని కూడా చూడకుండా, అందులోనూ మహిళలున్నారని కూడా ఆలోచించకుండా, మరాఠీ పోలీసులు ప్రవర్తించారు అప్పట్లో.

ఒకానొక రోజుల్లో రాష్ట్ర సమస్యలు వచ్చినప్పుడు, పొరుగు రాష్ట్రాలతో పోరాడవలసి వచ్చినప్పుడు, పార్టీలకతీతంగా కలిసి-మెలిసి పని చేసేవారు. ఇప్పుడా స్ఫూర్తి పోయింది. అప్పట్లో చంద్రబాబు నాయుడు చేసిన పని విమర్శించవచ్చునేమో కాని, ఆయన అరెస్టును, ఆ తర్వాత ఆయన పట్ల-ఆయన సహచరుల పట్ల మరాఠా పోలీసులు వ్యవహరించిన తీరును, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కాని-ప్రభుత్వం కాని ఖండించక పోవడం శోచనీయం. అసలింతకీ బాబ్లీ ప్రాజెక్టు ఇరు రాష్ట్రాల రైతుల సమస్య. మహారాష్ట్ర రైతే బాగుపడాలని కాని, ఆంధ్రా రైతే బాగు పడాలని కాని కోరడం సమంజసం కాదు. భారత దేశంలోని రైతు ఎక్కడున్నా రైతే. జల వివాదాలు పరిష్కరించుకొని, అంతర్ రాష్ట్రాల గుండా పారుతున్న జలాలను, ప్రాజెక్టులు ఎక్కడ కట్టినా, పొరుగు నున్న రాష్ట్రాల రైతులకు కూడా లాభం కలిగేటట్లు ఉపయోగించుకోవాలి. రెండు-లేక-మూడు ఇరుగు-పొరుగు రాష్ట్రాల మధ్య జల వివాదం వుంటే, రాజకీయాలను ఆస్కారం లేకుండా, ఇతర రాష్ట్రాల ఇంజనీరింగు నిపుణుల సంఘం పరిష్కరించే విధానం రూపొందించాలి. వారి నిర్ణయాన్ని ధిక్కరించకుండా సంబంధిత రాష్ట్రాలు అమలు పరిచే చట్టం రూపొందించాలి. అంతవరకు రాజకీయాలకు అతీతంగా భారత దేశ రైతు లాభ పడే ఆస్కారం భవిష్యత్ లో లేదు.

చారిత్రాత్మకంగా-భౌగోళికంగా రూపు దిద్దుకొని, సుస్థిర జన సమూహంతో-సామాజిక వర్గంతో కూడి, ఉమ్మడి భాష-పరిసరాలు-ఆర్థిక జీవన శైలి-మానసిక స్థితిగతులు కలిగిన సార్వజనీన సమాజ లక్షణాలుంటే దానినొక "జాతి" గా-"దేశం" గా పరిగణించాలని, అదే జాతికి సరైన నిర్వచనమని, మార్క్సిస్ట్ సిద్ధాంతం చెపుతుంది. ఈ నిర్వచనం అన్ని కోణాల్లోంచి పరికించి చూస్తే సరిపోతోందా అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. ఎల్లలతో కూడిన సరిహద్దులున్నప్పుడే దాన్ని ఒక ప్రత్యేక జాతిగా, లేదా, దేశంగా పిలవాలని మరి కొందరి అభిప్రాయం. గత కొన్నాళ్లపాటు వార్తల్లోకెక్కిన బాబ్లీ ప్రాజెక్ట్ వివాదం గమనిస్తుంటే, ఒక దేశం విషయంలో ఇది నిజం కావచ్చునేమో కాని, ఒకే దేశంలో-ఒకే జాతిలో (భారత జాతి-ఉదాహరణకు) భాగమైన వివిధ రాష్ట్రాల విషయంలో హద్దులు-సరిహద్దులు-ఎల్లలు-హక్కులు-ప్రత్యేకతలు-వేర్పాటు ధోరణులు అనే భావన కలగడం సరైందేనా? అని ప్రశ్నించుకునే సమయం ఆసన్నమైందనాలి.

భారతదేశం వివిధ రాష్ట్రాల సమాఖ్య (ఫెడరల్ తరహా వ్యవస్థ). కాకపోతే, పాక్షికంగా ఏక కేంద్రక ప్రభుత్వ విధానాన్ని పాటించే రాజ్యాంగ వ్యవస్థ అని కూడా అంటాం. ఒక వైపు సకలాధికారాలున్న కేంద్ర ప్రభుత్వం, మరో వైపు తమ రాష్ట్రానికి సంబంధించినంతవరకు అదే మోతాదులో సర్వాధికారాలున్న రాష్ట్ర ప్రభుత్వాలు, సాధ్యమైనంత వరకు తమ-తమ హద్దుల్లో, రాజ్యాంగం నిర్దేశించిన పరిధుల్లో, అధికారాన్ని చలాయిస్తుంటాయి. రాష్ట్రాధికారాలని, కేంద్రం అధికారాలని, ఉమ్మడి అధికారాలని, వేర్వేరు రకాల అధికారాలను, అటు ఫెడరల్ విధానానికి-ఇటు యూనిటరీ విధానానికి భంగం కలగని రీతిలో రాజ్యాంగం నిర్దేశించింది. అంత వరకూ బాగానే వుంది కాని, ఒకే దేశంలో-ఒకే జాతిలో, భిన్న భాషలు మాట్లాడే, విభిన్న సంస్కృతులు అనుసరించే, రక-రకాల మనస్తత్వాలున్న సామాజిక వర్గంతో నిండిన వివిధ రాష్ట్రాల మధ్య అధికారాల-హక్కుల విషయంలో తేడాలొస్తే, పరిష్కరించుకునే విధానం అస్పష్టంగా వుండడంతో, బాబ్లీ లాంటి సమస్యలు ఉత్పన్నమవడం మొదలైంది.

అసలింతకీ మనముంటున్నది ఒకే దేశంలోని, ఒకే జాతి వారమా? లేక ఒకే దేశంలో నివసిస్తున్న విదేశీయుల మా? పొరుగునున్న ప్రాజెక్టును చూస్తామనడంలో తప్పేం టో అర్థం కావడం లేదు. ఇలాంటి సంఘటనలిలానే కొన సాగిస్తే, భిన్నత్వంలో ఏకత్వానికి-ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీకని మనం చెప్పుకుంటున్న భారతావని ప్రకటనలకే పరిమితం అనాల్సి వస్తుందేమో!