Monday, August 31, 2020

ప్రపంచోత్పత్తి, సృష్టి వివరణ ఆరంభం .... శ్రీ మహాభాగవత కథ-22 : వనం జ్వాలా నరసింహారావు

 ప్రపంచోత్పత్తి, సృష్టి వివరణ ఆరంభం

శ్రీ మహాభాగవత కథ-22

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

పరీక్షిన్మహారాజుకు శుక మహర్షి చెప్పిన అంశాలలో భాగంగా, పరీక్షిత్తు వేసిన ఒక ప్రశ్న, సమస్త ప్రాణికోటి తోడి-పొందిక ఏవిధంగా ఏర్పడింది? దానికి కారణం ఏమిటి? అలా ఏర్పడడం వ్యక్తి పూర్వం చేసిన కర్మల వల్లనా? అని. ఆవివరాలన్నీ తనకు విడమర్చి చెప్పమని అడిగాడు శుకుడిని పరీక్షిత్తు. అలా మొదలైంది ప్రపంచోత్పత్తి, సృష్టి వివరణ.

‘పరమాత్మ నాభి కేంద్రంగా, పద్నాలుగు భువనాలకు కారణమైన ఒక పద్మం పుట్టింది. అందులో నుండి బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మ పూనుకుని జీవులను సృష్టించాడని చెప్పుకున్నాం కదా! అలాంటి బ్రహ్మ ఏవిధంగా పరాత్పరుడి రూపాన్ని కళ్లారా చూడగలిగాడు? విష్ణువుకు, బ్రహ్మకు, అవయవాల రూపులో కాని, వాటి కూర్పులో కాని, భావంలో కాని, జాడల్లో కాని ఏమైనా తేడా వుందా? ఆ సర్వాత్ముడు మాయా నిర్దేశకుడై ఏవిధంగా, ఎక్కడ పవళించాడు? ఆ మహాపురుషుడి అంగాల నుండి లోకాలు ఎలా కల్పించబడ్డాయి? కాలాల స్వభావం ఎలా ఉంటుంది? దేవతల, పితృదేవతల, మానవ మాత్రుల ఆయుః పరిమితి ఎంత? కాల ప్రవృత్తి ఏమిటి? ప్రాణులు వారి కర్మానుసారం ఏఏ లోకాలకు వెళ్తారు? ఎలాంటి కర్మలు చేస్తే దేవతలుగా అవతరించవచ్చు?

‘ఈ నేల అట్టడుగున ఉండే పాతాళలోకం, దిక్కులు, నింగి, గ్రహాలూ, చుక్కలు, కొండలు, నదులు, సముద్రాలు, దీవులు.....ఇవన్నీ ఏవిధంగా పుట్టాయి? వీటిలోని ప్రాణికోటి జననాలు ఎలా ఉంటాయి? ఆకాశం లోపలి, బ్రహ్మాండం వెలుపలి కొలమానం ఎంత? విష్ణువు అవతార చరిత్రలు, యుగాలు, యుగాల కొలమానాలు, యుగధర్మాలు, ఒక్కో యుగంలో మానవులు పాటించాల్సిన సామాన్య-విశేష ధర్మాలు, ఆయాజాతుల ప్రత్యేక ధర్మాలు, రాజర్షి ధర్మాలు, ఆపద్ధర్మాలు, బతుకు తెరువుకు ఉపకరించే ధర్మాలు ఎలా ఉంటాయి? దేవుడిని పూజించే పధ్ధతి ఏమిటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ఎనిమిది యోగాలు ఎలా ఉంటాయి? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశిత్వ, వశిత్వ, అనే ఎనిమిది సిద్ధుల విధానం ఎలా ఉంటుంది? వాళ్ల “అర్చిరాది” మార్గాలు ఏమిటి?

‘ఋగ్యజుస్సామాధర్వాది నాలుగు వేదాలు, ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వవేదం, అథర్వవేదం అనే నాలుగు ఉపవేదాలు, పద్దెనిమిది స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు పుట్టిన తీరుతెన్నులు ఎలాంటివి? కల్పాల నడుమ సంభవించే ప్రళయం, దాని రూపు, కల్పాంతంలో సంభవించే పెద్ద ముప్పు ఎలా ఉంటుంది? యాగాది సంబంధిత కర్మలు, నూతులు, కొలనులు, చెరువులు, గుళ్లు లాంటి వాటి నిర్మాణం, అన్నదానం, ఉపవనాల ఏర్పాటు, ధర్మశాస్త్రాలు వచించిన పనులు ఎలా చేయాలి? హోమాదుల ఆచరణ పద్ధతులు, ప్రాణుల పుట్టుక, ధర్మార్థకామాలనే మూడు పురుషార్థాలను అమలుపరిచే తీరు, దైవాన్ని, వేదధర్మాలను విశ్వసించనివారి జన్మలు, జీవాత్ముడిని కట్టి వుంచే విధం, ముక్తిని సాధించే తీరు, తన ఇచ్చానుసారం సంచరించే ఈశ్వరుడి విషయం, సర్వాధిపతిగా భగవానుడు జీవులతో వినోదించే విధానం.’

భాగవత పురాణం చెప్తానన్న శుకుడు

ఈ విషయాలన్నీ చెప్పమని అడిగాడు శుకమునిని పరీక్షిత్తు. జవాబుగా శుకుడు, ‘భాగవత పురాణాన్ని చెప్పుతాను విన మని అన్నాడు. వాస్తవానికి ఆ పురాణాన్ని బ్రహ్మ-నారద సంవాదం రూపంలో ఆవిర్భవించింది మొదలు. అది వేదంతో సమానమైనది. దాన్ని మొదలు సర్వేశ్వరుడు బ్రహ్మకల్పంలో బ్రహ్మకు బోధించాడు. ఇదే విదుర మైత్రేయ సంవాదంగా భాగవతంలో చెప్పడం జరిగింది. దాన్నే సూతుడు శౌనకాది మహాయోగులకు చెప్పాడని శుకుడు పరీక్షిత్తుతో అని, ఆ విషయాలను ఆయనకు తెలియచేశాడు సవివరంగా. అవి:

జీవికి శరీరంతో సంబంధం కలిగే అవకాశం ఎలా ఏర్పడుతుందనేది చాలా ముఖ్యంగా అవగాహన చేసుకోవాల్సిన అంశం. పరమేశ్వరుడి మాయ లేకపోతే ఆ బంధం ఏర్పడదు. జీవి విష్ణుమాయా మహిమవల్ల పంచ భూతాలతో కూడిన దేహసంబంధం కలవాడు అవుతాడు. ఆ మాయ వల్లే జీవి బాల్యం, కౌమారం, యవ్వనం అనే వయో వ్యవస్థలను పొందుతాడు. విష్ణుమాయా ప్రభావం వల్లే జీవి మానవుడిగానో, దేవతగానో ఆకారం పొందుతాడు. “నేను”, “ఇది నాది” అనే భావనలతో సంసార మాయకు కట్టుపడి పోతాడు. పరమాత్ముడి మాయే అన్నిటికీ మూలకారణం. ఇలా బందితుడైన ప్రాణికి భగవంతుడి మీద భక్తి కలగడం వల్ల మోక్షం ఏవిధంగా కలుగుతుందనేది ప్రశ్నార్థకం. అదెలా అంటే, ఎప్పుడూ జీవిలో ప్రకృతినీ, పురుషుడినీ అధిగమించే “బ్రహ్మతత్త్వం” ఉంటుంది. బ్రహ్మ ధ్యానంలో జీవి శ్రద్ధ చూపినప్పుడు మోహం వీడిపోతుంది. “నేను”, “నాది” అనే సంసార బంధం వదిలిపోతుంది. దాంతో మోక్షాన్ని పొందుతాడు.

జీవుడికీ, పరమాత్ముడికీ శారీరక సంబంధాలు కన్పిస్తుంటాయి. అలాంటి శరీరాన్ని ధరించిన భగవంతుడి పట్ల భక్తి కలిగి ఉండడం వల్ల జీవుడికి మోక్షం ఎలా కలుగుతుందనే ప్రశ్న రావచ్చు. జీవుడు అవిద్యాప్రభావం కలవాడు. దానివల్ల, కర్మానుసారంగా శరీర బంధం ఏర్పడుతుంది. ఆ సంబంధం మిధ్యా రోపమైనది. పరమేశ్వరుడు తన యోగ మాయా ప్రభావం వల్ల విలాసవంతమైన శరీరాలలో ప్రకాశిస్తుంటాడు. అందువల్ల జీవుడికి భగవద్భక్తి మోక్షాన్ని తప్పక ప్రసాదిస్తుంది.

బ్రహ్మ తన పుట్టుకకు చోటైన పద్మం గురించి తెల్సుకోవాలనుకున్నాడు. చుట్టూ ఉన్న నీళ్లలో వెతికాడు కాని, పద్మం మూలం కనుక్కోలేక విసిగి పోయాడు. వెనక్కు వచ్చి, మళ్లీ ఆ కమలంలోనే కూర్చున్న అతడికి లోకాలను సృష్టించాలనే కోరిక కలిగింది. ఎలా చేయాలో అర్థం కాలేదు. ఇంతలో నీళ్ల మధ్య నుండి ఒక ధ్వని వినపడింది. “తప” అనే పదం విన్నాడు ఆ ధ్వనిలో నుండి. ఆ పలికింది ఎవరో అతడు తెలుసుకోలేక పోయాడు. ఆ శబ్దం తనను తపస్సు చేయమని ఆదేశించినట్లు భావించాడు. వేయి దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మ. ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. పరమపదాన్ని తన ఎదుట చూశాడు. అక్కడ అంతా “విష్ణుమయం” గా కనిపించింది. వేదమంత్రాలు వినపడ్డాయి. వైకుంఠ భవనం మహిమతో వెలిగిపోతూ ఉన్నది. అక్కడ లక్ష్మీదేవి సరసన అన్ని ఐశ్వర్యాలతో, అతిశయించినవాడు, సర్వేశ్వరుడు, పరమపురుషుడు, పద్మాక్షుడు అయిన శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు దర్శనమిచ్చాడు.

బ్రహ్మ తపస్సుకు మెచ్చాననే, ఏమి కావాలనో కోరుకోమనీ అన్నాడు విష్ణుమూర్తి. ఆ మహాత్ముడి మహాత్మ్యాన్ని గ్రహించుకునే తెలివిని ప్రసాదించమని కోరాడు బ్రహ్మ. లోక సృష్టి నిర్మాణంలోని మాయావిధానం గురించి కూడా అడిగాడు. దాన్ని తెలియపరుస్తానని అన్నాడు విష్ణువు ఈ విధంగా:  ‘లేని పదార్ధం నా ప్రభావంతో ఉన్నట్లుగా, తిరిగి చూస్తే లేనట్లుగా తోచడమే నాదైన మాయా ప్రత్యేకం. పంచమహా భూతాలు, భౌతిక వస్తువులలో ఏవిధంగా ప్రవేశించి ఉంటానో ఆ విధంగానే నేను ఈ భూత-భౌతికాలైన సమస్త కార్యాలలో సత్త్వాది రూపాలలో చొచ్చి ఉంటాను. భూత-భౌతికాలు కారణదశను పొంది, నాలో వ్యక్తరూపాన్ని పొంది, స్ఫుటంగా ఉండవు. అన్ని ప్రదేశాలలో, అన్ని వేళలా, ఏది ఆకళింపుకు వస్తుందో అదే పరబ్రహ్మ స్వరూపం. నా తత్త్వస్వరూపకమైన అర్థమే పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకోవాలి. దీన్ని నీ మనసులో నిలుపుకుని సృష్టి సాగిస్తే ఎలాంటి మొహమూ నీ దగ్గరకు రాదు అని భగవానుడు భోదించాడు.

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

    

 

Sunday, August 30, 2020

జగత్ సృష్టి అంతా భగవత్ సృష్టే అని నారదుడికి చెప్పిన బ్రహ్మ .... శ్రీ మహాభాగవత కథ-21 : వనం జ్వాలా నరసింహారావు

 జగత్ సృష్టి అంతా భగవత్ సృష్టే అని నారదుడికి చెప్పిన బ్రహ్మ

శ్రీ మహాభాగవత కథ-21

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమహాభాగవతం ద్వితీయ-తృతీయ, పంచమ స్కందాలలో ప్రపంచోత్పత్తి గురించి, అంతుచిక్కని సృష్టి రహస్యం గురించి చాలా విపులంగా రాయడం జరిగింది.

శ్రీమన్నారాయణుడు ఒకప్పుడు చతుర్ముఖ  బ్రహ్మకు లోక సృష్టి మీద బుద్ధి కలిగించాలని సంకల్పించాడు. దానికొరకు భగవానుడు సరస్వతిని నియోగించాడు. ఆ వాగ్దేవి తనకు తానుగా బ్రహ్మను హృదయనాధుడిగా వరించింది. వేదరూపిణిగా ఆయన ముఖమండలం నుండి బయటకు వచ్చి, ఆ బ్రహ్మను తిరుగులేని సృజనాక్రియా పారంగతుడిని చేసింది. భగవంతుడు తాను స్వయంగా అంతటా వ్యాపించి ఉన్నవాడే అయినప్పటికీ, పంచభూతాల పరస్పర సంయోగంతో శరీరాలు అనే పురాలను పుట్టించాడు. పంచభూతాలలో పదకొండు ఇంద్రియాల తేజాన్ని ప్రసరింపచేసి వాటి మహాత్మ్యంతో పదహారు కళారూపాలతో వెలుగొందుతాడు.

నారదుడు తన తండ్రి బ్రహ్మను జగత్ సృష్టి గురించి అడిగాడు ఒకసారి. ‘ఈ జగాన్ని ఇలా సృష్టించాలనే తెలివి మొదట నీకు ఎవరు కలిగించారు? ఏ ఆధారంతో లోక సృష్టిని మొదలు పెట్టావు? అలా ఆరంభించడానికి కారణం ఏమిటి? దాని అవసరం ఏమిటి? దాని అసలు స్వరూపం ఎలా ఉంటుంది? ఎడతెరిపి లేని సాలెగూటి లాంటి సృష్టి క్రమాన్ని ఎలా అల్లుకుంటూ వస్తున్నావు? ఈ సృష్టి అంతటికీ నువ్వే అధిపతివి అని అనుకుంటున్నాను. అది నిజమేనా? నువ్వే సర్వాదికారివా? నీకంటే ఘనుడు, నిన్ను మించిన మహానుభావుడు మరెవరైనా ఉన్నారా? నువ్వు ఏ దేవదేవుడిని గురించి తపస్సు చేశావు? నీకు పరమ విభుడు ఎవరైనా ఉన్నారా? ఉంటే, అతడే ఈ బ్రహ్మాండం పుట్టడానికి కారణమా? ఆయన విలాసం వల్లే ఈ విశ్వం వర్ధిల్లుతూ, లయిస్తూ ఉంటుందా? ఈ సృష్టి విధానం ఆసాంతం నాకు వివరించు అని ప్రశ్నించాడు నారదుడు బ్రహ్మను.

జవాబుగా బ్రహ్మ దేవుడు ఇలా అన్నాడు: ‘ఈ చరాచర జగత్తు మొత్తాన్నీ నాకు నేనుగా సృష్టించే తెలివి నాకు ఏమాత్రం లేదు. అందుకే మొదట చాలా తడబడ్డాను. ఈ సమస్తాన్ని సమన్వయ పరచుకుని, సృష్టికి నేను యథేచ్చగా శ్రీకారం చుట్టగల అవగాహనను నాకు ఆ పరమాత్మ ప్రసాదించాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, గ్రహాలూ, చిన్న చుక్కల్లాగా ఈ లోకం అంతా పరమాత్మ కాంతిని అనుసరించి వెలుగుతుంది. ఈ సృష్టి అంతా భగవత్ సృష్టే. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల పుట్టుకకు కారణం ఆ వాసుదేవుడే! పద్నాలుగు లోకాలు ఆ శ్రీహరి నియమించినవే! సురలంతా ఆ దివ్య స్వరూపుడి శరీరం నుండి పుట్టినవారే! వేదాలు, యుగాలు, తపస్సులు, యోగాలు, విజ్ఞానం ఇవన్నీ నారాయణుడికి చెందినవే! సర్వాంతర్యామి, సర్వాత్ముడు, అన్నిటికీ సాక్షీభూతుడు ఆ పరమేశ్వరుడే! అతడి అనుగ్రహంతో మాత్రమే నేను సృష్టిస్తూ ఉంటాను’.

ఇంకా ఇలా చెప్పాడు బ్రహ్మ: ‘ఆ పరమ దైవం మాయకు పాలకుడు. తన మాయ వల్ల, దైవ స్థానం వల్ల లభించిన కాలం, జీవుడు-అదృష్టం (కర్మ)-స్వభావం అనే మూడు అంశాలతో, వివిధ రకాలుగా సృష్టి చేయాలని సంకల్పించి ఆ పనికి పూనుకున్నాడు. ఆయన ఆశ్రయించిన తత్త్వం “మహత్తు”. దానితో కాలాన్ని, గుణాలనూ మేళవించాడు. స్వభావానికి రూపం ఇచ్చి, దానిని సృష్టిగా మలచాడు. జీవుడి పుణ్య-పాప రూపమైన కర్మ (అదృష్టం) నుండి “జన్మ” ను కలిగించాడు. ఆ మహత్తత్త్వం రజోగుణం, సత్వగుణాలతో విస్తరించి, ఒక రూపం పొందింది. దానివల్ల తమోగుణం ప్రధానంగా కల “అహంకారం” ఏర్పడింది. ఇది పంచ మహాభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో కూడుకున్నది. అహంకారం, ద్రవ్యశక్తి కల “తామసం”, క్రియాశక్తి కల “రాజసం”, జ్ఞానశక్తి కల “సాత్త్వికం” అనే మూడు రూపాలుగా మార్పుచెందింది. ఈ మూడిట్లో పంచభూతాల సృష్టికి మూలం “తామస అహం”. దీని వికృతి “ఆకాశం” గా ఏర్పడింది. దీని గుణం “శబ్దం”. ఈ శబ్దం చాలా సూక్ష్మరూపం కలిగి ఉంది’.

బ్రహ్మ కొనసాగిస్తూ ఇలా అన్నాడు: ‘ఆకాశం నుండి “వాయువు” ఏర్పడుతుంది. ఆకాశంతో పొందిక వల్ల “శబ్దం”, “స్పర్శ” అనే రెండు గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ప్రాణ రూపంలో ఉంటుంది. ఈ వాయువులో ఇంద్రియాల ఆరోగ్యం, మానసిక శక్తి, దేహపుష్టి ఉంటాయి. ఇవి ఓజస్సు, జీవశక్తి, బలం అనేవాటికి హేతువులై ప్రవర్తిల్లుతాయి. వాయువు నుండి “తేజస్సు” ఏర్పడుతుంది. రూపం, స్పర్శం, శబ్దం అనేవి దాని గుణాలు. తేజస్సు నుండి జలం ఏర్పడుతుంది. రసం, రూపం, స్పర్శం, శబ్దం అనేవి దీని గుణాలు. జాలం నుండి భూమ ఏర్పడుతుంది. గంధం, రసం, రూపం, స్పర్శం, శబ్దం అనే అయుదు దీని గుణాలు. వీటన్నిటికీ తామసాహంకారం మూలం. సాత్త్వికాహంకారం వికారానికి లోనైనప్పుడు “మనస్సు” పుట్టింది. దీని దైవం చంద్రుడు. అహం నుండే దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే పదిమంది దేవతలు పుట్టారు’.

   బ్రహ్మ ఇంకా కొనసాగించాడు. కొనసాగిస్తూ ఇలా అన్నాడు: ‘రాజసాహంకారం తేజస్సుకు సంబంధించినది. దీన్నుండే పది ఇంద్రియాలు ఏర్పడ్డాయి. వీటికి మూలం పదిమంది సాత్త్వికాహంకార దేవతలు. త్వక్కుకు దిక్కు, నాలుకకు సూర్యుడు, ముక్కుకు అశ్వినీ దేవతలు, చేయికి అగ్ని, పాదానికి ఉపేంద్రుడు, గుడానికి మిత్రుడు, మర్మాంగానికి ప్రజాపతి దేవతలు. ప్రజ్ఞను పుట్టించే ఇంద్రియాలలో ఒకటి బుద్ధి. క్రియను పుట్టించే ఇంద్రియం ప్రాణం. ఇలాంటి పది జ్ఞానేంద్రియాలతో కూడిన పంచభూతాల, పంచేంద్రియాల, మనస్సుల గుణాలు అనే వస్తు సంచయం ఉన్న ఇవి విడి-విడిగా వేటికవే ఉండడం వల్ల బ్రహ్మాండపు శరీరాన్ని రూపొందించగల సామర్థ్యం లేకుండా పోయాయి. పంచభూతాల, పంచేంద్రియాల, మనస్సుల గుణాలతో, ప్రాకృతిక శక్తి ప్రేరేపణలతో, అన్నీ ఏకీకృతమైనాయి. ఇవి అన్నీ కలిసి చేతన-అచేతన రూప బ్రహ్మాండాన్ని సృజించేవి అయ్యాయి. అలా ఏర్పడ్డ బ్రహ్మాండం కోట్లాది సంవత్సరాలు నీళ్లలోనే ఉండిపోయింది. ఆ పరమాత్మ జీవం లేనిదాన్ని జీవవంతం చేశాడు. ఆ దివ్యాత్ముడు జీవరూపంలో చక్కగా చుట్టూ చుట్టుకుని ఉన్న నీళ్లలో పడివున్న బ్రహ్మాండంలో జొరబడి వాటిని బాగా విస్తరింప చేశాడు. ఆ తరువాత అందాన్ని బద్దలు చేసి బయటపడ్డాడు.

నారదుడి ప్రశ్నకు జవాబు కొనసాగిస్తూ బ్రహ్మ ఇంకా ఇలా అన్నాడు. ‘ఆ పరమేశ్వరుడు, ఈశుడు జగదాకారుడు. అనంతమైన బ్రహ్మాండాన్ని విపులమైన పద్నాలుగు లోకాలు (భువనాలు) గా చేశాడు. బహురూపాలు దాల్చిన ఆ పరమయోగి ఎన్నో పాదాలు, తొడలు, భుజాలు, ముఖాలు, నేత్రాలు, శిరస్సులు, నోసళ్ళు, చెవులతో కూడి ఉంటాడు. ఆయన సృష్టించిన భువనాలలో మీద ఉన్న ఏడు లోకాలు నడుము నుండి పైన ఉన్న శరీర భాగం. దిగువనుండి ఏడు భువనాలు విష్ణువుకు దిగువనున్న శరీర భాగం. ప్రపంచమే పరమాత్ముడి దేహం. ఆ పురుషుడి నోటి నుండి బ్రహ్మణకులం, చేతులనుండి క్షత్రియ కులం, తొడల నుండి వైశ్యకులం, పాదాల నుండి శూద్రకులం పుట్టాయని చెప్తుంటారు. ఆయన మొలచుట్టూ ప్రదేశం “భూలోకం”. హృదయం “సువర్లోకం”. ఎదురు రొమ్ము భాగం “మహర్లోకం”. మెడ మూలం “జనలోకం”, రెండు స్తనాలు “తపోలోకం”, శిరో భాగం బ్రహ్మ నివసించే “సత్యలోకం”, కటి భాగం “అతలం”, తొడలు “వితలం”, మోకాళ్లు “సుతలం”, పిక్కలు “తలాతలం”, చీల మండలం “మహాతలం”, కాలి ముని వేళ్లు “రసాతలం”, అరికాళ్లు “పాతాళం”. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఉర్ధ్వలోకాలలో వ్యాపించి ఉన్నాడు. అమరులు, అసురులు, మునులతో సహా నీళ్లలో, ఆకాశంలో, తిరిగే ప్రాణులు అంతా విష్ణుమయమే. బ్రహ్మాండం అంతా అతడి శరీరంలో 12 అంగుళాల ప్రమాణంలో పొందుపడి ఉంటుంది. అంతా ఆయనే.

బ్రహ్మ ఇంకా ఇలా చెప్పాడు: ‘అచ్యుతుడు, బ్రహ్మాండం లోపల ఉంటూనే లోపలా, బయటా వెలుగులు నింపుతాడు. అలాంటి లోకాత్ముడి బొద్దు నుండి ఒక తామర పూవు పుట్టింది. దాని నుండి నేను (బ్రహ్మ) పుట్టాను. ఆ పరమాత్మ ఈ లోకాన్ని నిర్మించడం కొరకు ఒక మాయను సృష్టించాడు. ఆ మాయ వల్లే అతడు భగవంతుడయ్యాడు. ఆ విష్ణువు జగత్తే ఆత్మ కలవాడు. ప్రపంచానికి ఈశుడు. అతడు నియమించడాన్ని బట్టి నేను స్థావర జంగమాత్మకమైన ప్రాణులతో ఈ సృష్టి క్రమాన్ని విస్తరిస్తాను. విష్ణువు సుస్థితిని కలిగించి రక్షిస్తుంటాడు. శివుడు గిట్టింప చేస్తాడు. విష్ణువు సృష్టి, స్థితి, లయలనే మూడు శక్తులు కలిగి ఈ సమస్తానికీ తానె మూల భూతమై ఉన్నాడు. శ్రీమహావిష్ణువు అంతరంగాన్ని అనుసరించి ఈ ప్రపంచాన్ని, జీవులను సృష్టించడమే నా విధి. ఈ సమస్త ప్రపంచానికి ఆధారభూతమైనది కేవలం పరమమైన బ్రహ్మమే!’.

బ్రహ్మ ముగింపుగా మరికొన్ని విషయాలను చెప్పాడు నారదుడికి ఇలా: ‘ఆదిపురుషుడి తోలి అవతారం నుండి కాలం, కర్మం, స్వభావం అనే మూడు శక్తులు పుట్టాయి. వీటిల్లో నుండి ప్రక్రుతి ఏర్పాటైంది. దాన్నుండి మహత్తు అనే తత్త్వం కలిగింది. దాన్నుండి పుట్టిన రాజసాహంకారం నుండి ఇంద్రియాలు, సాత్త్వికాహంకారం నుండి అధిష్టాన దేవతలు, తామసాహంకారం నుండి పంచభూతాలకు కారణమైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం జనించాయి. వీటి నుండి ఆకాశం, గాలి, నిప్పు, నీరు, నేల అనే పంచభూతాలు ఉత్పన్నమయ్యాయి. వీటి నుండి జ్ఞానేంద్రియాలైన చర్మం, నేత్రం, చెవి, నాలుక, ముక్కు; కర్మేంద్రియాలైన మాట, చెయ్యి, కాలు, మలావయవం, మూత్రావయం, మనస్సు ఉదయించాయి. వీటన్నిటి నుండి ఆ విరాట్పురుషుడు జన్మించాడు తనకు తానే. అతడి నుండి ఈ లోకం పుట్టింది. దాంట్లో నుండి సత్త్వరజస్తమోగుణాత్మక రూపాలలో విష్ణువు, నేను, శివుడు పుట్టాం. అందులో నుండి సమస్త లోకం, అందులో జీవించే వారు పుట్టారు. ఇలాంటి విశ్వం మొదటి పుట్టుకను “మహాత్తత్త్వ సృష్టి” అంటారు. రెండోది అండంతో కలిగిన సృష్టి. మూడోది సమస్త ప్రాణులకు చెందిన సృష్టి. అలా, ఆ పద్మాక్షుడి లీలావతారాలు అనంతం.       

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

    

 

వాల్మీకికి రామాయణాన్ని ఉపదేశించిన నారదుడు .... శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-23 : వనం జ్వాలా నరసింహారావు

 వాల్మీకికి రామాయణాన్ని ఉపదేశించిన నారదుడు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం బాలకాండ మందర మకరందం-23

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (31-08-2020)

వేదాధ్యయనంలో సుసంపన్నుడు, వేదాంతవేత్త, బ్రహ్మజ్ఞాననిష్టుడు, జపపరుడు, వ్యాకరణాది వేదాంగాలను తెలిసినవాడు, సరస్వతీ పుత్రులలో శ్రేష్టుడు, పరమాత్మ స్వరూపాన్ని బోధించేవాడు, యోగవేత్తలలో ముఖ్యుడైన నారదుడొస్తాడు వాల్మీకి దగ్గరకు. భగవద్విషయాన్ని బోధించే యోగ్యతున్న గురువు దొరకలేదనే నిర్వేదంతో శుష్కించిన మనన శీలుడు, తపశ్శాలి వాల్మీకి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఈ విధంగా ప్రశ్నించాడు.

" తపమున స్వాధ్యాయంబున, నిపుణుని వాగ్విద్వరేణ్యు నిఖిల మునిజనా

  ధిపు  నారదుసంప్రశ్నము,  తపస్వి  వాల్మీకి  యిట్టు,  తమి గావించెన్ "

వాసుదాసుగారు  కంద పద్యంలో రాసిన ఈ ప్రశ్నకు ప్రతి పదార్థ తాత్పర్యంతో పాటు 500 పంక్తుల వ్యాఖ్యానం జోడిస్తారు."తపమున స్వాధ్యాయంబున" అని అనడమంటే, ఆచార్యుడికుండాల్సిన గుణ సంపత్తిని తెలపడమే. అంటే నారదుడు తపశ్శీలుడని, వేదాధ్యయన సంపన్నుడని అర్థం. అదేవిధంగా నారదుడి సంయమన శక్తీ చెప్పబడింది. ఆయన అష్టాంగ యోగసిద్ధి కలవాడనే అర్థమూ వస్తుంది. పర బ్రహ్మం ధ్యానించడంలో సమర్థుడనే మరో అర్థం కూడా వుంది. నారదుడు గుణాతీతుడైన మహాయోగి-భక్తుడు.దీన్నిబట్టి ఈ గ్రంథంలోని ముఖ్యవిషయం భగవత్ స్వరూపాను సంధానం అని బోధపడుతున్నది.

"వాగ్విద్వరేణ్యుడు" అంటే, కేవలం వేదమే కాకుండా అర్థ జ్ఞానం కూడా నారదుడికి ఉన్నదని అర్థమొస్తుంది. "నిఖిల ముని జనాధిపు" అనే విశేషణం సమాహితత్వమనే ఆచార్య గుణాన్ని తెలియచేస్తుంది. మునులు మనన స్వభావులు. నిఖిల శబ్దం శేషంలేమిని తెలుపుతుంది. జన శబ్దం అనేక తత్వాన్ని తెలుపుతుంది. వాగ్విద్వరేణ్యుడు అనేది మననాన్ని తెలుపుతుంది. ఇలా ఇవన్నీ కలిపితే నారదుడికి "శ్రవణ మనన నిధి ధ్యాసనాత్మకమైన యోగ పూర్తి" ఉందని అర్థం చేసుకోవాలి. "తపమున నిపుణుడు" అంటే  జ్ఞానాధికుడని-"ముని జనాధిపుడు" అంటే ఉపాసుకులందు శ్రేష్ఠుడని, నారదుడిలో ఈ రెండూ పూర్ణ శక్తులుగా వున్నాయనీ అర్థం.

         నారదుడు భగవత్తత్వాన్ని సాక్షాత్కరించుకున్నాడని ఆతర్వాత చెప్పిన పదాల్లో వుంది. నరుడికి సంబంధించిన అజ్ఞానాన్ని ఖండించేవాడే నారదుడు. జ్ఞానాన్నిచ్చేవాడూ ఆయనే. ఇట్లా నారదుడిలోని ఆచార్య లక్షణాలను సంపూర్ణంగా వర్ణించడం జరిగింది. ఇక వాల్మీకిలోని శిష్య లక్షణాలను చెప్పడం కూడా జరిగింది. నిర్వేదం లేనివాడు ముముక్షువు కాలేడు. ఉపదేశార్హుడూకాడు. వాల్మీకి నిర్వేదం కలవాడు-ఉపదేశ యోగ్యుడు. వల్మీకంలోనుండి పుట్టడం వల్ల ఇతనికి వాల్మీకుడు అనే పేరొచ్చిందని బ్రహ్మంటాడు. భృగువంశంలోని ప్రచేతసుండనే ఋషి పదో కొడుకు వాల్మీకనే సమాధానం కూడా వుంది. ఆయన వంశంలో పుట్టినందువల్ల వాల్మీకి జాతి బ్రాహ్మణుడే అనాలి. బ్రహ్మ కూడా వాల్మీకిని ఓ సందర్భంలో "బ్రాహ్మణుడా" అని సంబోధిస్తాడు.

సంప్రశ్నము” అన్న పదంద్వారా మిక్కిలి శ్రేష్ఠమైనప్రశ్న అడిగి, మంచివిషయాన్ని రాబట్టదలిచాడన్న అర్థం స్ఫురిస్తుంది. ఆంధ్ర వాల్మీకిరామాయణం వేదార్థాన్ని విశదీకరిస్తుంది.   తపశ్శక్తిగల వాల్మీకి పరబ్రహ్మనిష్టుడైన నారదుడిని ప్రశ్నించిన విషయమూ పర బ్రహ్మమే. కాబట్టి ముముక్షువులకు రామాయణం అవశ్య పఠనీయం. వాల్మీకి రచించిన శ్రీమద్రామాయణానికి ఇరవైనాలుగువేల గ్రంథాల పరిమితుంది. ముప్పై రెండక్షరాలను గ్రంథమంటారు. వెయ్యికి ఒకటి చొప్పున 24,000 గ్రంథాలలో 24 గాయత్రీ వర్ణాలు చేర్చబడ్డాయి. అందులో మొదటి వేయి మొదటి గాయత్రి అక్షరంలో మొదటిదైన "త" కారముంది. గ్రంథం రచించేవారికి, పఠించేవారికి "త" కారం శుభ ప్రయోగం. రామాయణంలో గాయత్రి ఇమడ్చబడిందంటే, గాయత్రితో విస్తరించబడిందనే అర్థం. భగవంతుడు బ్రహ్మకు "దప తప" అని ఉపదేశించాడు. ఈ రెండక్షరాలనే వాల్మీకి గ్రంథం ఆరంభంనుండే పాఠకులకు ఉపదేశిస్తాడు.



గురువు శిష్యుడిని ఏదాదిపాటు పరీక్షించిన తర్వాతే ఉపదేశించాలని శాస్త్రం చెపుతున్నది. అలాంటప్పుడు వాల్మీకి అడగంగానే నారదుడెట్లా ఉపదేశించాడన్న సందేహం కలగొచ్చు. అయితే శిష్యుడు గురువు దగ్గరకొచ్చినప్పుడు, వచ్చినవాడు ఉపదేశించ బడడానికి అర్హుడా-కాదా అనేది గురువు నిర్ణయించుకున్నవెంటనే ఉపదేశించవచ్చు. అర్హుడుకాదని భావిస్తే, వాడియోగ్యతను బట్టి, మూడుమాసాలనుండి పన్నెండేళ్లవరకు తన దగ్గరుంచుకుని, వ్రతానుష్ఠానాలతో-ఆహార వ్యవహారాలతో వాడికి తగిన యోగ్యత వచ్చిందని భావించిన తర్వాతే గురువు ఉపదేశిస్తాడు. హనుమదాచార్యుడు సీత దగ్గరకు పోయిన విధంగానే, కొందరు గురువులు అర్హులైన శిష్యులను వెదుక్కుంటూ పోతారని శాస్త్రాలు చెపుతున్నాయి. బ్రహ్మ ఆదేశానుసారం నారదుడు వచ్చి వాల్మీకికి ఉపదేశించాడు కనుక శిష్యుడినిక్కడ పరీక్షించాల్సిన అవసరం లేదు.

వాల్మీకి చరిత్ర గురించి కూడా ఇందులో ఇమిడి వుంది. సీతా రామ లక్ష్మణులు చిత్రకూటంలో వాల్మీకిని కలిసినప్పుడు ఆయనే తనగురించి ఇలా చెప్పుకున్నాడు: "రామా, నేను పూర్వం పరమ కిరాతకులతో పెంచబడ్డాను. పుట్టుకతో బ్రాహ్మణుడనైనా, ఆచారరీత్యా శూద్రుడనయ్యాను. శూద్ర స్త్రీని పెళ్లి చేసుకుని కొడుకులను పొందాను. దొంగల్లో చేరి దొంగనయ్యాను. జంతువుల పాలిటి యముడనయ్యాను. నేనున్న భయంకర అడవిలో ఓ రోజు సప్తఋషులు కనిపిస్తే, వాళ్లను దోచుకుందామని, వారివెంట పరిగెత్తాను. ’నీచ బ్రాహ్మణుడా, ఎందుకొచ్చావు?’ అని వారడిగారు. నాపుత్రులు ఆకలితో వున్నారు-వాళ్ల సంరక్షణ కై ఈ కొండల్లో అడవుల్లో తిరుగుతున్నాను-వాళ్ల ఆకలి తీర్చేందుకు మీదగ్గరున్నవి దోచుకుందామని వచ్చానని జవాబిచ్చాను. నన్నింటికి పోయి, నా పాపంలో వాళ్లు భాగం పంచుకుంటారేమో కనుక్కుని రమ్మన్నారు మునులు. నేనొచ్చేవరకుంటామనికూడా చెప్పారు. వాళ్ల మాటలు నమ్మి ఇంటికి పోయి వారు చెప్పినట్లే నా భార్యా-పిల్లలను ప్రశ్నించాను. నేను తెచ్చింది తింటామన్నారే కాని నా పాపంతో సంబంధం లేదన్నారు. వెంటనే మునుల వద్దకు పరుగెత్తుకుని పోయి, వాళ్ల పాదాలపై పడి నన్ను రక్షించమని కోరాను. ఈ బ్రాహ్మణాధముడికి మోక్ష మార్గం ఉపదేశిద్దామని తలచిన వారు ’రామ’ నామాన్ని తలకిందులు చేసి, వాళ్లు మరల వచ్చేవరకు, ’మరా మరా’ అని ఎల్లవేళలా జపించమని ఆదేశించి పోయారు. ఆ విధంగానే సర్వసంగ విహీనుడనై, నిశ్చలుడనై దీర్ఘకాలం జపించాను. నాపైన పుట్ట పెరిగింది. నా తపోబలంతో, నేనక్కడ నాటిన దండమే వృక్షమయింది. ఇలా వేయి యుగాలు గడిచిపోయాయి. ఋషులు మళ్లా వచ్చి లెమ్మని పిల్చారు. పుట్టనుండి బయట కొచ్చిన నన్ను చూసిన మునులు నన్ను ’మునీశ్వర వాల్మీకీ ’ అని పిలిచారు. నాకది రెండవ జన్మన్నారు".

 

Saturday, August 29, 2020

యోగీశ్వరుడైన భరతుడి తత్త్వజ్ఞానోపదేశం ..... శ్రీ మహాభాగవత కథ-20 : వనం జ్వాలా నరసింహారావు

 యోగీశ్వరుడైన భరతుడి తత్త్వజ్ఞానోపదేశం

శ్రీ మహాభాగవత కథ-20

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

         ఋషభుడి అనంతరం ఆయన పెద్ద కుమారుడైన భరతుడు ఈ భూమండలానికి రాజయ్యాడు. విశ్వరూపుడి కుమార్తె పంచజని అనే కన్యను వివాహమాడాడు. వారికి సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆచరణుడు, ధూమ్రకేతువు అనే ఐదుగురు, అహంకారం నుండి పంచతన్మాత్రలు జన్మించిన విధంగా పుట్టారు. గతంలో అజనాభం అని పిలవబడే ఈ భూభాగం భరతుడు పాలించడం మొదలైన తరువాత ’భరత వర్షం’ అన్న పేరు సార్థకమైంది. భరతుడి పాలనను దేవతలు సహితం మెచ్చుకున్నారు. ఆయన ఎన్నో యజ్ఞాలను, పూజలను ఆచరించాడు. యజ్ఞకర్మలను ఆచరిస్తూనే రాజ్యపాలనలో గొప్ప ఖ్యాతి గడించాడు భరతుడు. పవిత్రమైన అంతఃకరణతో, పవిత్ర చిత్తంతో, ఆ రాకుమారుడు ధర్మనిష్టతో ఈ భూమిని పరిపాలించాడు. ఇలా ఏభైలక్షల వేల సంవత్సరాలపాటు భరతుడు రాజ్యాన్ని పాలించాడు. తండ్రి-తాతల ఆస్తైన రాజ్యాన్ని అర్హతకు తగ్గ విధంగా కొడుకులకు పంచాడు. తరువాత పులహాశ్రమ సమీపంలో గందకీ నది దగ్గర, ఇంద్రియ నిగ్రహంతో, భరతుడు విష్ణువును సేవించేవాడు. పూర్తిగా భక్తిలో మునిగి పరమేశ్వరుడిని హిరణ్మయమూర్తిగా తలుస్తూ స్తుతించేవాడు అనేక విధాలుగా.  

ఒకనాడు భరతుడు ఆ మహానదీతీర్థంలో స్నానం చేస్తున్నప్పుడు, గర్భిణైన ఒక లేడి నీరుతాగుతుండగా ఒక సింహం దాన్ని చూసి గర్జించింది. భయంతో లేడి గర్భం విచ్చిన్నమై, కడుపులో వున్న పిల్ల జారి నీళ్లలో పడిపోయింది. తల్లి చనిపోయింది. నీళ్లలో జారి, ప్రవాహంలో తేలుతున్న లేడిపిల్లను భరతుడు చూశాడు. దాన్ని తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. దాన్ని పెంచుతూ, దానిమీద మమకారాన్ని కూడా పెంచుకున్నాడు. చివరకు పరమేశ్వరుడిని కూడా మర్చిపోయాడు. ఆత్మలో యోగనిష్టకు బదులు లేడిపిల్లమీద ప్రేమ స్థిరపడిపోయింది. దానితో ఆటపాటలతోనే జీవితం గడిచిపోయేది. ఒకనాడు ఆ లేడిపిల్ల ఎటో పారిపోయింది. రాజర్షయిన భరతుడు మనస్సులో దానికోసం ఆరాటపడ్డాడు. దాని కారణంగా బహువిధాల కోరికలతో సతమతమయ్యాడు. భగవత్ ధ్యాస మానేశాడు. అతడికి దానిమీద మోహం మరింత తీవ్రమైంది.

ఇలా వుండగా, భరతుడికి అవసానదశ వచ్చింది. లేడిపిల్లనే ఆత్మలో నిలుపుకుని దేహాన్ని విడిచి పెట్టాడు. ఆ కారణాన, గతస్మృతితో, ఒక లేడి గర్భంలో పడి లేడిపిల్లగా జన్మించాడు. తానెందుకు లేడిపిల్లగా పుట్టాల్సి వచ్చిందో అర్థం చేసుకున్నాడు. శ్రీహరినే అనునిత్యం ధ్యానం చేస్తూ, పులహాశ్రమానికి వచ్చి, చక్రనదీ తీర్థంలో స్నానం చేస్తూ, అవసాన సమయం కోసం ఎదురు చూస్తూ, చివరకు లేడి శరీరాన్ని విడిచి పెట్టాడు. ఆ తరువాత అంగిరసుడి వంశంలోని  ఒక బ్రాహ్మణుడికి పుత్రుడిగా జన్మించాడు. ఎల్లప్పుడూ శ్రీహరి పాదాలనే ధ్యానం చేసుకునేవాడు.

అంగిరసుడికి ఇద్దరు భార్యలు. ఆయనది పరిశుద్ధ స్వభావమే. స్వాధ్యాయ అధ్యయనపరుడు. మొదటి భార్యకు తొమ్మిదిమంది కొడుకులున్నారు. చిన్నభార్యకు ఇతడు కాక ఇంకొక ఆడపిల్ల పుట్టారు. భరతుడికి పూర్వజన్మ జ్ఞాపకం వుండేది. భరతుడు తండ్రి చెప్పడం వల్ల గాయత్రీ మంత్రోపదేశం పొందాడు. వేదాలను అధ్యయనం చేశాడు. అంగిరసుడు చనిపోయిన తరువాత తల్లి ఆయనతో సహగమనం చెసింది. సవతి తల్లి కొడుకులు ఇతడిని వేదాద్యయనం చెయ్యనీయకుండా ఇంటి పనులకు నియమించారు. వారు చెప్పిన పనులు చేస్తూ, వాళ్ల బరువులు మోస్తూ, కూలిపని చేస్తూ, బిచ్చమెత్తుకునేవాడు. మాసిన గుడ్దలు కట్టుకునేవాడు. అతడి యజ్ఞోపవీతాన్ని చూసి ఇతడెవరో పిచ్చివాడనుకునే వారు. అలా కాలం గడిపేవాడు.    

ఒకనాడు ఒక శూద్రజాతి నాయకుడు తనకు సంతానం కలగడానికి కాళికాదేవికి బలి ఇవ్వడానికి ఒకడిని పట్టుకుని తీసుకుపోతున్నారు. వాడు వీళ్లనుండి తప్పించుకుని పారిపోగా, అతడిని వెతుకుతుంటే, భరతుడు దొరికాడు. పారిపోయినవాడి స్థానంలో ఇతడిని బలి ఇవ్వడానికి నిశ్చయించుకుని దానికి అవసరమైన సంస్కారాలు చేసారు భరతుడికి. కాళికాదేవి ఎదుటికి తెచ్చి కూచోబెట్టారు. ఆ సమయంలో ఈ బ్రాహ్మణ బాలుడి తేజస్సు సాక్షాత్తు కాళికాదేవినే ఆశ్చరపరిచింది, భయం కొలిపింది. హుంకారం చేసి బలివ్వాలనుకున్న శూద్రనాయకుడిని బలి తీసుకుంది. భరతుడు ఇదేమీ పట్టనట్లు వాసుదేవుడిని హృదయంలో స్మరిస్తూ నిర్వికారంగా వున్నాడు. తరువాత భరతుడు ఆలయం నుండి బయటకొచ్చి ఎప్పటిలాగే చేనుకు కాపలా కాయసాగాడు.  

ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇదిలా వుండగా, సింధు దేశాన్ని పాలిస్తున్న రహుగణుడనే రాజు కపిల మహర్షి దగ్గర నుండి తత్త్వ జ్ఞానాన్ని తెలుసుకోవాలన్న కోరికతో ఒకనాడు రాచఠీవితో పల్లకి ఎక్కి బయల్దేరాడు. పల్లకి బోయీలలో ఒకడు సరిగ్గా నడవలేకపోవడంతో వాడి స్థానంలో దారిలో కనిపించిన భరతుడికి ఆపని ఆప్పగించారు. ఏమాత్రం చింతపడకుండా పల్లకిని మోయసాగాడు భరతుడు. అలవాటు లేనందున అతడు మోస్తుంటే పల్లకి కుదుపులకు లోనైంది. రహుగణుడికి భరతుడి మీద కోపం వచ్చింది. నిష్టూరంగా అతడిని మందలిస్తూ వేళాకోళంగా మాట్లాడాడు. భరతుడు మాత్రం జవాబివ్వకుందా పల్లకి మోయసాగాడు. అతడికి అహంకార మమకారాలు లేవు తన శరీరం మీద. సాక్షాత్తు పరబ్రహ్మం మీదే చూపు కలిగి అప్పగించిన పని చేస్తున్నాడు. రాజుకు మరింత కోపం వచ్చింది. తన ఆజ్ఞ పాటించకుండా తప్పుగా నడుస్తున్న వాడిని సరిగ్గా నడిపిస్తానని రాజు గర్వంతో, హద్దూ-అదుపూ లేకుండా మాట్లాడ సాగాడు.

బ్రాహ్మణుడీ (భరతుడు) మాటలను విన్నాడు. జవాబుగా: "రాజా! బరువు ఈ శరీరానికి కాని నాకు కలగదు. ఆకలిదప్పులు, మనోవ్యాధులు, మమకారం, అహంకారం, రోగాలు, రోషం....ఇత్యాదులు శరీరంతో పుట్టేవేకాని నాకు ఏర్పడేవి కావు. అందరూ జీవన్మృతులే. బంధాలన్నీ శరీరానికి వుంటాయి కానీ జీవుడికి వుండవు. జడునిలా వుంటూ బ్రహ్మాత్మస్వభావంతో వున్న నామీద నువ్వు విధించే శిక్షవల్ల ఏం లాభం చేకూరుతుంది? నేను శరీరభావం లేని స్తబ్దుడిని, మత్తుడిని. అలాంటి నాకు నువ్వు విధించే శిక్ష వ్యర్థం", అని, ఇలా ఏవేవో ప్రాపంచిక విషయాలు చెప్పసాగాడు. రహుగణుడు ఈ మాటలను విన్నాడు. కపిలముని దగ్గరికి తత్త్వ జ్ఞానం కోసం పోతున్న అతడికి భరతుడి మాటలు హృదయగ్రంథిని విడదీశాయి. వెంటనే రాజు పల్లకి లోనుండి దిగాడు. భరతుడికి సాష్టాంగదండ ప్రమాణం చేశాడు. గర్వాన్ని విడిచి, చేతులు జోడించి ఆయనెవరని అడిగాడు. ఆయనే కపిల మునీంద్రుడా అని ప్రశ్నించాడు. జవాబుగా భరతుడనే ఆ బ్రాహ్మణుడు, ఈ సంసారం ఒక ఘటం లాంటిదనీ, దానికి శిక్షణను, రక్షణను కలిగించేవాడు రాజనీ, అతడు చెడు కర్మలను మాని వాసుదేవుడిని సేవిస్తే మళ్లీ జన్మ ఎత్తకుండా, సంసారంలో చిక్కకుండా వుంటాడనీ అన్నాడు.

భరతుడి మాటలు విన్నాక రహుగణుడిలో మార్పు వచ్చింది. అతడిని వినయంతో ప్రస్తుతించాడు. తను రాజుననే దురభిమానంతో గుడ్డిగా ప్రవర్తించాననీ క్షమించమనీ అన్నాడు. తనకు తెలిస్న తత్త్వాన్ని మరికొంత బోధించాడు భరతుడు. అతడు కారణజన్ముడని, నిత్యమూ పరమాత్మానుభవంలోనే వున్నవాడని,  అనుభవ విహారి అని, సాటిలేని పరమ శాంతిని పొంది వున్నాడని, మహాజ్ఞానియైన ఆయనకు మళ్లీ-మళ్లీ నమస్కరిస్తున్నానని అన్నాడు రాజు రహుగణుడు. తన సంశయాలన్నింటినీ భరతుడిని అడిగి నివృత్తి చేసుకోవలనుకుంటున్నానని, ఆధ్యాత్మయోగాన్ని తనకు యోగ్యమైన పద్ధతిలో చెప్పమని అడిగాడు. జవాబుగా పరమార్థమై జ్ఞానరూపమైనట్టి పరబ్రహ్మమొక్కటే సత్యమైనదని, జగత్తు అసత్యమైనదని, పరమ భాగవతుల పాదసేవ చేయడం వల్ల బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుందని, మహాభాగవతులను సేవిస్తే మోక్షసాధనకు పద్మాక్షుడైన శ్రీహరి మీదే మనస్సు నిలిచి వుంటుందని చెప్పాడు భరతుడు. తన పూర్వజన్మల గురించి, అలా ఎత్తడానికి కారణం గురించీ చెప్పాడు. రాజుకు సంసారమనే అడవి తీరు ఎలా వుంటుందో వివరించాడు. రాజు అనే భావాన్ని విడిచి, సకల చరాచర ప్రపంచంతో స్నేహితుడిగా వుండమనీ, ఇంద్రియాలను జయించమనీ, జ్ఞానం అనే ఖడ్గంతో మాయా పాశాన్ని తెగనరికి జీవిత గమ్యస్థానాన్ని చేరుకోమనీ బోధించాడు. అలా యోగీశ్వరుడైన భరతుడు రాజుమీద కరుణతో తత్త్వజ్ఞానాన్ని ఉపదేశించాడు. ఆయన బోధనలు విన్న రాజు ఆయనకు తనివితీరా నమస్కరించాడు. రాజు నమస్కారాన్ని అందుకుని భరతుడు దయ కలిగిన మనస్సుతో భూమ్మీద సంచరించాడు.         

         (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

Friday, August 28, 2020

సాక్షాత్ భగవత్ స్వరూపుడైన ఋషభుడు .... శ్రీ మహాభాగవత కథ-19 : వనం జ్వాలా నరసింహారావు

 సాక్షాత్ భగవత్ స్వరూపుడైన ఋషభుడు

శ్రీ మహాభాగవత కథ-19

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

         రాకుమారుడైన ప్రియవ్రతుడు నారద మహర్షికి ప్రియశిష్యుడు. ఒకసారి అపూర్వమైన సత్రయాగం చెయ్యాలనే ఉద్దేశంతో దీక్షవహించాడు. తండ్రి స్వాయంభువ మనువు రాజ్యపాలన చెయ్యమని కొడుకును ఆజ్ఞాపించాడు. కాని దానివల్ల రాగద్వేషాలు పెరిగి భగవత్ జ్ఞానం పోతుందనే భయంతో ప్రియవ్రతుడు ఒప్పుకోలేదు. ఈ సంగతి బ్రహ్మదేవుడికి తెలిసింది. ఆయనకు రాజ్యపాలన మీద మనస్సు పుట్టించాలని నిర్ణయించుకుని, బయల్దేరి, గంధమాదన పర్వత లోయల్లో వున్న ప్రియవ్రతుడు, నారదుడు, స్వాయంభవ మనువుల దగ్గరికి వచ్చాడు. వచ్చి, ప్రియవ్రతుడితో, విష్ణుమూర్తి మాటలుగా, ఆయన శాసనంగా కొన్ని విషయాలు చెప్పాడు. "మనమంతా సర్వేశ్వరుడు నడిపించినట్లు నడుస్తున్నాం. శరీరాన్ని ధరించడం, ప్రారబ్దాన్ని అనుభవించడం, ఎవరూ తప్పించుకోలేరు. ఇంద్రియ నిగ్రహం లేకుండా అడవికి పోయినా సంసార బంధం వున్నట్లే. ఇంద్రియ నిగ్రహం కలిగి, ఆత్మస్వరూపం తెలిసి, బ్రహ్మనిష్ట కలిగినవారికి గృహస్తు అయినా మోక్షం లభిస్తుంది. నువ్వు కూడా భగవంతుడు నీకు కలిగించిన భోగాలను అనుభవించు. వీటి పట్ల సంగం లేకుండా ప్రవర్తిస్తూ ముక్తిని పొందు" అన్నాడు బ్రహ్మదేవుడు. ప్రియవ్రతుడు బ్రహ్మ సలహాను గౌరవంతో అంగీకరించాడు. ఇలా చెప్పి బ్రహ్మ వెల్లిపోయాడు.

స్వాయంభవ మనువు తన కొడుకు ప్రియవ్రతుడికి పట్టాభిషేకం చేసి అరణ్యానికి వెళ్లాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం ప్రియవ్రతుడు రాజ్యపాలన చేస్తున్నాడు. విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె బర్హిష్మతిని వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల పదిమంది కొడుకులను, ఒక కూతురును పొందాడు. కొడుకుల పేర్లు: అగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ణుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి. కూతురు పేరు ఊర్జస్వతి. కొడుకుల్లో కవి, మహావీర, సవనులు బాల్యం నుండే పరమహంసలయ్యారు. మనస్సులో భగవత్ సాక్షాత్కారం పొందారు. ప్రియవ్రతుడికి ఇంకో భార్యవల్ల ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే ముగ్గురు కొడుకులను కన్నాడు. వారు చాలా గొప్పవారై, మన్వంతరాలకు అధిపతులయ్యారు. ఈ ముగ్గురూ పరమహంసలైన కవి, మహావీర, సవనుల స్థానాన్ని పొందారు. ఇలా ప్రియవ్రతుడు పదకొండు కోట్ల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు.   

         ఇలా రాజ్యాన్ని చక్కగా పాలిస్తున్నప్పుడు, ఒకనాడు ఒక అతిమానుషమైన పని చేశాడు. సూర్యుడు మేరుపర్వతానికి ఒకవైపున చీకటి కలిపించే సందర్భంలో, ఆ చీకటిని పోగొట్టడానికి, సూర్యుడి రథంతో సమానమైన వేగం, తేజస్సు కలిగిన రథాన్ని ఎక్కి, రాత్రులను పగలుగా చేస్తానని ఏడురోజులపాటు రెండో సూర్యుడిలాగా రథాన్ని పోనిచ్చాడు. రథ చక్రం తాకిడికి భూమ్మీద గోతులు ఏర్పడ్డాయి. అవే సప్త సముద్రాలయ్యాయి. ఆ సముద్రాల మధ్య భాగం ఏడు దీపాలయ్యాయి. మేరుపర్వతం చుట్టూ ప్రియవ్రతుడు తన రథంతో ఏడుసార్లు ప్రదక్షిణం చేశాడు కాబట్టి సముద్రాలు, ద్వీపాలు సప్త సంఖ్యలో వచ్చాయి.

ఆ సప్త ద్వీపాలు: జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలి ద్వీపం, కుశ ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం. వీటిలో జంబూ ద్వీపం లక్ష యోజనాల పరిమితి కలది. అక్కడి నుండి ఒక్కొక్క ద్వీపం ముందుదాని కంటే తరువాతది రెండు రెట్లు పెద్దగా ఉంటుంది. ఇక సప్త సముద్రాలు ఇవి: లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, ఘృత (నేతి) సముద్రం, పాల సముద్రం, దధి (పెరుగు) సముద్రం, జల సముద్రం. సముద్రాలు ద్వీపాలకు అగడ్తల లాగా ఉన్నాయి. సముద్రాలు, ద్వీపాలు ఒకదానితో ఇంకొకటి కలిసి పోకుండా, సరిహద్దులు పెట్టినట్లు వరుస తప్పకుండా ఏర్పడడం చూసి, సకల జీవులూ విస్తుపోయాయి.

ప్రియవ్రతుడు తన ఏడుగురు కుమారులైన అగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ణుడు, మేధాతిథి, వీతిహోత్రుడులను ద్వీపాలకు పరిపాలకులుగా నియమించాడు. కుమార్తె ఊర్జస్వతిని శుక్రాచార్యుడికిచ్చి పెళ్లి చేశాడు. వారి కూతురే దేవయాని. క్రమేపీ ప్రియవ్రతుడికి సంసారం మీద విరక్తి కలిగింది. విరాగయ్యాడు. కొడుకులకు రాజ్యాన్ని ఇచ్చాడు. భార్యను విడనాడాడు. సూర్యుడికి రెండవ సూర్యుడిలాగా వెలుగొందిన ప్రియవ్రతుడు చివరకు, శ్రీహరిని ధ్యానించడానికి గంధమాదన పర్వతానికి వెళ్లాడు.

ఆ తరువాత అగ్నీధ్రుడు జంబూద్వీపాన్ని పరిపాలించి ప్రఖ్యాతికెక్కాడు. సంతానం కోసం బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. బ్రహ్మ సంతోషించి పూర్వచిత్తి అనే అప్సరసను అగ్నీధ్రుడి దగ్గరికి పంపాడు. ఆమెను చూసి అగ్నీధ్రుడు కామ పరవశుడయ్యాడు. తనతో కలిసి తపస్సు చెయ్యమనీ, సంసారం చెయ్యమనీ కోరాడామెను. పూర్వచిత్తి అంగీకరించింది. లక్ష సంవత్స్రరాలు అతడితో కలిసుండి స్వర్గభోగాలను అనుభవించింది. వారికి నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురుడు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే తొమ్మిదిమంది కొమారులు పుట్టారు. ఆ తరువాత పూర్వచిత్తి పిల్లల్ని, అగ్నీధ్రుడిని వదిలి బ్రహ్మలోకానికి వెళ్లిపోయింది. ఆమెనే తలపోస్తూ అగ్నీధ్రుడు కూడా పిల్లలకు రాజ్యాన్ని అప్పచెప్పి బ్రహ్మలోకానికి వెళ్లాడు. ఆయన తొమ్మిది మంది కొడుకులు మేరువు కుమార్తెలను వివాహం చేసుకున్నారు.

అగ్నీధ్రుడి కొడుకైన నాభి, తన భార్య మేరుదేవితో కలిసి వాసుదేవుడిని కొలిచాడు. ఆయన నాబీమేరుదేవులకు ప్రత్యక్షమయ్యాడు. వారాయనను పరిపరి విధాలుగా స్తుతించారు. ఆయన లాంటి కొడుకు కావాలని నాభి, అతడి పక్షాన ఋత్విక్కులు భగవంతుడికి కోరారు. నాభి భార్య మేరుదేవికి తాను జన్మిస్తానని చెప్పి అంతర్థానమయ్యాడు. అన్నట్లే, మేరుదేవి గర్భంలో ప్రవేశించాడు నాభిమీద దయతో. ఋషభుడు అనే పేరుతో ఆమె ద్వారా అవతరించాడు శ్రీమన్నారాయణుడు. చాలా గొప్పవాడయ్యాడు. ఇంద్రుడు ఋషభుడి మహిమలను విని అసూయతో ఆయన రాజ్యంలో తీవ్రమైన అనావృష్టిని కల్పించాడు. ఇది తెలుసుకున్న ఋషభుడు తన మాయతో రాజ్యం అంతటా సమృద్ధిగా వర్షం కురిపించాడు. నాభి కొన్నాళ్లకు కొడుకుకు రాజ్యాన్ని పూర్తిగా అప్పగించి బదరికాశ్రమానికి వెళ్లి, శ్రీహరిలో లీనమయ్యాడు. ముక్తిపొందాడు నాభి.

ఋషభుడు జయంతి అనే కన్యను వివాహమాడాడు. ఆమెవల్ల భరతుడు మొదలైన వందమంది కొడుకులను పొందాడు. ఎన్నో పురాలు, ఆశ్రమాలు, కొండలు, చెట్లు మొదలైన వాటితో నిండిన ఈ వర్షానికి అతడి (భరతుడి) పేరుమీదే ’భారత వర్షం’ అనే పేరొచ్చింది. ఆ మహాభారత వర్షంలో ఋషభుడు తన కొడుకులలో తొమ్మిదిమందిని భూభాగాలకు వారి-వారి పేర్లతో ప్రధానులుగా చేశాడు. మరో తొమ్మిది మంది భాగవత ధర్మాన్ని లోకంలో ప్రచారం చేయడానికి భాగవత ధర్మనిష్టులయ్యారు. మిగిలిన 81 మంది తండ్రి ఆజ్ఞానుసారం యజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణోత్తములయ్యారు. 

కొడుకులకు సమస్త రాజ్యాన్ని ఇచ్చివేసి ఋషభుడు బ్రహ్మావర్త దేశానికి వచ్చాడు. ఒకనాడు కొడుకులను దగ్గరికి తీసుకుని, వారితో, కోరికలమీద బుద్ధి పెట్టవద్దనీ, వృద్ధులను, దీనులను ఆదుకోవాలనీ, పాపాలకు మూలమైన కామాన్ని కోరవద్దనీ, మోక్షసాధనకు కావాల్సిన ఉపాయాలను అన్వేషించమనీ, సమస్త జీవులపట్ల సానుభూతి చూపాలనీ, భగవంతుడి కథలను వినాలనీ, ఆధ్యాత్మయోగం కలిగి ఉండాలనీ, భగవద్ విషయాలనే మాట్లాడాలనీ, సాత్త్విక స్థితిలో వుండాలనీ, వీటన్నిటి ద్వారా లింగ శరీరాన్ని జయించి నిత్య శాశ్వత సుఖాన్ని పొందాలనీ బోధించాడు. అందరిలోకి పెద్దవాడైన భరతుడిని తండ్రిలాగా చూడమని చెప్పాడు.

ఇంకాఇలా అన్నాడు: విష్ణువు బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులను ఆదరిస్తాడనీ, అందువల్ల మానవుడికి బ్రాహ్మణుడు దైవమనీ, బ్రాహ్మణుడితో సమానమైన దైవం లేడనీ, అగ్నిలో హోమం చేయడం కంటే బ్రాహ్మణులకు సమర్పించిన దానినే భగవంతుడు సంతోషంగా తీసుకుంటాడనీ అన్నాడు. బ్రాహ్మణులలో తాత్త్విక చింతన, మనోనిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, సత్యసంధత, తపస్సు, ఓరిమి వుంటాయనీ, ఇవన్నీ వున్న బ్రాహ్మణుడు తనకు సద్గురువనీ, అలాంటి బ్రాహ్మణుల శరీరంలో అందుబాటులో వుంటాననీ, బ్రాహ్మణులను భక్తితో పూజించడమే భగవంతుడిని ఆరాధించదం అనీ అన్నాడు సాక్షాత్ భగవత్ స్వరూపుడైన ఋషభుడు. బ్రాహ్మణ జాతిని పూజించేవాడు ఈ భూమ్మీద మోక్షమార్గాన్ని తెలుసుకుంటాడని, ఇది సత్యమని స్పష్టం చేశాడు.  

ఆ తరువాత ఋషభుడు లింగ శరీరం నుండి విముక్తుడై, మనస్సులో దేహాభిమానాన్ని విసర్జించాడు. ఇలా వుండగా ఆయనున్న అడవిలో దావాగ్ని రగిలి, అడవి తగులబడి, అందులో ఋషభుడి శరీరం కూదా దగ్దమైంది. ఋషభుడు సకల వేదాలకు, లోకాలకు, దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమగురుడు. సాక్షాత్తు భగవానుడు. అలాంటి ఋషభదేవుడి చరిత్రే హరిభక్తికి తాత్పర్యం. సాక్షాత్తు విష్ణువైన ఋషభుడు తన శరీరాన్ని వదిలి లయమయ్యాడు. అలా ముగిసింది ఋషభదేవుడి అవతారం.

         (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)