Tuesday, April 30, 2019

ఖమ్మంలో పౌరహక్కుల ఉల్లంఘలనపై నివేదిక ఆవిష్కరణ ..... వైఆర్కే జైలు – కోర్టులు .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


ఖమ్మంలో పౌరహక్కుల ఉల్లంఘలనపై నివేదిక ఆవిష్కరణ  
వైఆర్కే జైలు – కోర్టులు
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (01-05-2019)
1977లో ఎమర్జెన్సీ ఎత్తి వేశాక, కేంద్రంలో అధికారంలోకొచ్చిన జనతా ప్రభుత్వం, ఎమర్జెన్సీలో జరిగిన అకృత్యాల అధ్యయనం కోసం, "షా కమీషన్" ఏర్పాటు చేసింది. ఆ స్ఫూర్తితో తిరిగి పౌర హక్కుల ఉద్యమాన్ని జిల్లాలో ప్రారంభించే ప్రయత్నం చేశారు డాక్టర్ గారు. అప్పటికి సిపిఐ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు తదితరులతో కాంగ్రెస్ నాయకులు గెల్లా కేశవరావుగారు, పూర్వ కమ్యూనిస్ట్ నాయకులు గండ్ర సుబ్బారెడ్డిగారు, జనతా పార్టీ నాయకులు చేకూరి కాశయ్యగారు సహకరించారు. జస్టిస్ తార్కుండే గారి నాయకత్వాన ఒక కమిటీ, పౌర హక్కుల ఉల్లంఘనలపై ఒక పెద్ద నివేదిక విడుదల చేసింది. నివేదికను హైదరాబాద్‍లో ఆవిష్కరించిన తరువాత ఖమ్మంలో ఆవిష్కరించే ఏర్పాట్లు చేశారు. వర్తక సంఘం భవనంలో పెద్ద సదస్సు జరిగింది. హైదరాబాద్ నుండి కన్న భీరన్ గారు, ప్రముఖ హేతువాది అడ్వకేట్ ఎం. వి. రామ్మూర్తి గారు, కాళోజీ నారాయణ రావు గారు హాజరయ్యారు.

ఎమర్జెన్సీ కాలంలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావుగారి ఆధ్వర్యంలో, ఆనాటి నక్సల్స్ పై జరిగిన మారణకాండపై, విషయ సేకరణ కోసం ప్రభుత్వం జస్టిస్ భార్గవ కమీషన్‍ను నియమించింది. ఈ కమీషన్ హైదరాబాద్‍లో విచారణ ప్రారంభించింది. సుందరయ్య, ఓంకార్‍గార్లు విచారణలో పాల్గొన్నారు. కన్నభీరన్‍గారు న్యాయ సంబంధమైన వివరణలు ఇచ్చారు. ఆ కమీషన్ కార్య కలాపాలకు పత్రికలు పెద్ద ఎత్తున ప్రాముఖ్యం ఇవ్వడంతో, ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. కమీషన్ విచారణ బహిరంగంగా చేయరాదని, గుంభనంగా మాత్రమే జరగాలని ఆదేశించింది. అందుకు జస్టిస్ భార్గవ కాని, కన్నభీరన్, సుందరయ్యగార్లు కాని సుముఖంగా లేకపోవడంతో దాన్ని మూసి వేశారు. ఆ రోజుల్లో ఖమ్మం జిల్లాలో కూడా చాలా ఘోరాలు జరిగాయి. సత్తుపల్లికి చెందిన అడ్వకేట్ బత్తుల వెంకటేశ్వరరావును నక్సలైట్ పేరుతో అమానుషంగా పోలీసులు చంపివేశారు. అది పెద్ద సంచలనం సృష్టించింది.

ఆ కేసు తదితర కేసులకు సంబంధించిన వివరాలు డాక్టర్ వై.ఆర్.కె, ఆయన మిత్రులు కర్నాటి రామ్మోహనరావు, బోడేపూడి వెంకటేశ్వరరావు(అడ్వకేట్), ఆయా ప్రదేశాలకు వెళ్లి, సమాచారం సేకరించి, భార్గవ కమీషన్ ముందుకు పంపించారు.

అదే సమయంలో వెంగళరావు అవినీతి అంశంపై విచారణకు "జస్టిస్ విమద్ లాల్ కమీషన్" ఏర్పాటైంది. అది చేకూరి కాశయ్య గారి చొరవతో వేయబడ్డ కమీషన్. దానితో డాక్టర్ వై.ఆర్.కె కు సంబంధం లేదు. కాని, ఆ కమీషన్ కూడా, జస్టిస్ గారి మెతక వైఖరి వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది. ఆ నాడు అవినీతి వ్యతిరేక పోరాటం చేపట్టిన వారందరికీ నిరాశ కలిగించింది.


భార్గవ కమీషన్
దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజుల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, బూటకపు ఎన్‍కౌంటర్లలో అనేక మంది పోలీసుల చేతుల్లో చనిపోయారు. ఆ ఘటనలను విచారించి, నిజానిజాలను కనిపెట్టి బహిరంగంగా బయట పెట్టి బాధ్యులకు శిక్ష విధించాలన్న ఉద్యమం మొదలైంది. ఎమర్జెన్సీ ముగిసిపోయి, జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. ఆ పాటికే ప్రముఖ పౌర హక్కుల ఉద్యమ నాయకుడు విఎం. తార్కుండే అధ్యక్షుడుగా, ఎనిమిది మంది సభ్యులతో ఏప్రిల్ 1977లో ఏర్పాటైన "తార్కుండే కమిటీ" సాక్ష్యాల సేకరణలో నిమగ్నమైంది. అనేక ప్రాంతాలలో కమిటీ సభ్యులు పర్యటించి, సమాచారాన్ని సేకరించి, నివేదికలను రూపొందించి, ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్‍కు, హోం మంత్రి చరణ్ సింగ్‍కు పంపింది కమిటీ. ఆ కమిటీ సభ్యులలో కన్నబిరాన్, కాళోజీ నారాయణరావు, బి.జి. వర్గీస్, అరుణ్ శౌరి లాంటి ప్రముఖులున్నారు. ప్రధానిని, హోం మంత్రిని కన్నభీరన్ పలుసార్లు స్వయంగా కూడా కలుసుకున్నారు. నివేదికలు చదివిన మొరార్జీ దేశాయ్ విచారణ కమీషన్ వేయాల్సిన అవసరం వుందనే అభిప్రాయానికి వచ్చారు. కాకపోతే అలాంటి కమీషన్‍ను వేసే అధికారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే వుందనేది గమనించాల్సిన అంశం. కేంద్రం జోక్యం తప్పని సరి అని కన్నభీరన్ ప్రభృతులు ప్రధానిని కోరడంతో, రాజీ ఫార్ములాగా, కేంద్రం సూచించిన న్యాయమూర్తిని రాష్ట్ర ప్రభుత్వం నియమించి విచారణ జరిపించాలన్న నిర్ణయం జరిగింది.

పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వశిష్ట భార్గవ నాయకత్వంలో, వెంగళరావు ప్రభుత్వం, భార్గవ కమీషన్‍ను ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ భార్గవకు నిజాయితీపరుడని, ముక్కుసూటిగా మాట్లాడే వాడని, జిల్లా జడ్జీగా-హైకోర్టు జడ్జీగా-సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా మంచి పేరు తెచ్చుకున్నాడని గుర్తింపు వుంది. కమీషన్ కార్యదర్శిగా బీనాదేవిగా ప్రసిద్ధిగాంచిన రచయిత బి. నరసింగ రావును నియమించింది ప్రభుత్వం. ఆయన కార్యదర్శిగా జులై 1977 చివరి వారంలో, కమీషన్‍కు సంబంధించిన తొలి విచారణ బహిరంగ ప్రకటన వెలువడింది. హైదరాబాద్ దిల్ కుషా ప్రభుత్వ అతిధి గృహంలో విచారణ జరిగింది. మొట్ట మొదటి వాంగ్మూలం తార్కుండే ఇచ్చారు. తార్కుండే కమిటీ పక్షాన ఎం. వి. రామమూర్తి, కన్నబిరాన్ వాదనలు వినిపించేవారు. పి. శివ శంకర్‍ను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఆయా రంగాలలో నిపుణులైన మరి కొందరిని కూడా కమీషన్ నియమించింది.  

చాలా మందికి ‘ఆదివారం సంఘం’తో అనుబంధం .... "మార్క్సిస్టు ఫోరం" .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు

చాలా మందికి ‘ఆదివారం సంఘం’తో అనుబంధం
"మార్క్సిస్టు ఫోరం"
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (30-04-2019)
భారత చైనా యుద్ధం నేపథ్యంలో చైనా వాదులుగా ముద్రపడి అరెస్ట్ అయినవారిలో, పోలిట్‌బ్యూరో సభ్యుల నుండి జిల్లా స్థాయి ముఖ్య నాయకుల వరకు ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాల ప్రభావం ఖమ్మం జిల్లా మీద కూడా తీవ్రంగా పడింది. తెలంగాణ సాయుధపోరాటం కాలం నుండే ఖమ్మం జిల్లాకు కమ్యూనిస్టుల కంచుకోటగా పేరుండడంతో ఆ జిల్లాలో ముఖ్యమైన కమ్యూనిస్ట్ నాయకులందరినీ నిర్భంధించింది నాటి ప్రభుత్వం పిడి చట్టం కింద.

ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర స్థాయిలో సైద్ధాంతిక చర్చ సాగుతున్న రోజుల్లో, సహజంగా దాని ప్రభావం ఖమ్మం కమ్యూనిస్టుల పైన కూడా పడింది. చాలా కాలం వరకు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోక పోయినా పార్టీ నిర్ణయాలను, విధానాలను తు.. తప్పకుండా ఈనాటి దాకా అమలు జరుపుతుండే పేరుపొందిన స్థానిక డాక్టర్‌. యలమంచిలి రాధాకృష్ణమూర్తి (డాక్టర్‌వై.ఆర్‌.కె.) ఇంటి ఆవరణలో ప్రతి ఆదివారం సాయంత్రం పలువురు పార్టీ సభ్యులు, సానుభూతి పరులు "మార్క్సిస్ట్ ఫోరం" అనే గొడుగు కింద సమావేశమై సిద్ధాంత పరమైన విషయాలపై చర్చించుకునే వారు.

1958 నుండి కృశ్చేవ్ నాయకత్వాన వున్న సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీకి, మావో సేటుంగ్ నాయకత్వాన వున్న చైనా పార్టీకి మధ్య విభేదాలు తలెత్తాయి. విస్తృతమైన బహిరంగ చర్చ జరిగింది. చైనా పార్టీ, నెహ్రూకు సంబంధించి, "నెహ్రూ మరికొంత", "టోగ్లియాటీ గురించి",  "టోగ్లియాటీపై మరికొంత", "కృశ్చేవ్ రివిజనిజం", "లాంగ్ లివ్ లెనినిజం" అంశాలపై అనేక డాక్యుమెంట్లను రాసింది. వాటికి కొంత మేరకు సమాధానంగా సోవియట్ పార్టీ కూడా వ్యాసాలు రాసింది. చైనా పార్టీ చివరకు, "జనరల్ లైన్ ఫర్ ద ఇన్ టర్ నేషనల్ కమ్యూనిస్ట్ మూవ్ మెంట్" అనే పత్రం ఆ చర్చకు క్లైమాక్స్ గా విడుదల చేసింది. 1958లో యూరప్ దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు సమావేశమై ఒక పత్రం విడుదల చేశాయి. తరువాత 1961లో ప్రపంచంలోని 81 దేశాల కమ్యూనిస్ట్ పార్టీలు సమావేశం, మాస్కోలో 30 రోజుల పాటు జరిగింది. చివరకు "81 దేశాల కమ్యూనిస్ట్ పార్టీల ప్రకటన" పేరుతో ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు. అది ఈ రెండు పార్టీల భిన్న ధోరణులకు రాజీ మార్గంగా వచ్చిన ప్రకటన (అనుబంధం లో పొందుపర్చబడింది).

ఈ మొత్తాన్ని ఆ రోజుల్లో "గ్రేట్ డిబేట్" అనే వారు. "మార్క్సిస్టు ఫోరం" వైఖరి చైనా పార్టీ వాదనకు దగ్గరగా వుండేదనేది వాస్తవం. చైనా పార్టీలో 1968-1978 మధ్య "సాంస్కృతిక విప్లవం" పేరుతో జరిగిన అశాస్త్రీయ, అరాచక చర్యలకు చైనా పార్టీతో పాటు భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్టు) పార్టీ కూడా తన అసమ్మతిని తెలియ చేసిందన్నది తరువాత కథ. 1961వ సంవత్సరంలో ప్రారంభమై క్రమం తప్పకుండా జరుగుతుండే ఆ సమావేశాలకు, జిల్లా సీనియర్‌నాయకులైన చిర్రావూరి లక్ష్మినరసయ్య(ఎన్నో మార్లు ఖమ్మం మునిసిపల్‌ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు), మంచికంటి రాంకిషన్‌రావు (1983లో ఖమ్మం ఎమ్మెల్యే) లతో సహా 25-30 మంది ప్రముఖులతో సహా పలువురు విద్యార్థి నాయకులు, యువకులు హాజరయ్యేవారు. వారందరూ చైనా కమ్యూనిస్ట్ పార్టీ పంథాకు అనుకూలురే కాకుండా, పార్టీ చీలిపోయిన తర్వాత సిపిఎంలోనే వుండిపోయారు. స్థానిక కాలేజీ విద్యార్ధి నాయకులు కూడా వస్తుండడంతో ఆ వేదిక కింద మార్క్సిజం-లెనినిజం అధ్యయన తరగతులు నిర్వహించడం కూడా జరిగేది.

డాక్టర్ వై.ఆర్.కె తో పాటు స్థానిక ప్రముఖ అడ్వకేట్లు కె.వి సుబ్బారావు, బోడేపూడి రాధాకృష్ణ గార్లు ఫోరం నిర్వహణలో చురుకైన పాత్ర నిర్వహించేవారు. ఆ నాటి రాజకీయ తరగతులలో పాల్గొన్న విద్యార్థి నాయకుల్లో చాలామంది చురుకైన పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా అభివృద్ధి చెందారు. వారిలో కొందరిని: కర్నాటి రామ్మోహనరావు, మాటూరి రామచంద్రరావు, కర్నాటి మల్లిఖార్జునరావు, గండ్లూరి కిషన్‍రావు, వనం నరసింగరావు, లాయర్ బోడేపూడి వెంకటేశ్వరరావు, సిద్ధి వెంకటేశ్వర్లు, రాయల బోసు, చింతలపూడి రాజారావు, బత్తుల వెంకన్న, ఖాదర్ అలీ (తరువాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు) మొదలైన వారిని డాక్టర్‍గారు గుర్తుకు తెచ్చుకున్నారు.


ఈ నేపధ్యంలో పార్టీ చీలిపోవడం, సిపిఎం నాయకులందరూ నిర్బంధానికి గురికావడం జరిగాయి. ఇంట్లో తను స్థాపించిన మార్క్సిస్ట్ ఫోరం కింద నిర్వహించిన చర్చల్లో పాల్గొన్న వారంతా సిపిఎం పక్షాన చేరడంతో అది తనకో నైతిక విజయంగా భావించారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి. పార్టీ పట్ల సిద్ధాంతాల పట్ల సంపూర్ణ విశ్వాసమున్న డాక్టర్ వై.ఆర్‌.కె. తాను నమ్ముకున్న సిద్ధాంతానికి అనుకూలురైన ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు నాయకులందరూ అరెస్ట్ కావడంతో వారంతా విడుదలయ్యే వరకూ పార్టీని ఏకతాటిపై నడిపిస్తూనే, ఏ విధంగా బలోపేతం చెయ్యాలన్న ఆలోచనలో పడ్డారు. వారి విడుదలకెలా ప్రయత్నం చెయ్యాలన్న ఆలోచనలో భాగంగా స్థానిక అడ్వొకేట్లయిన బోడేపూడి రాధాకృష్ణ, కె.వి. సుబ్బారావుల మద్దతు పొందారు. ఆ ముగ్గురి (మేధావుల) కలయికే భవిష్యత్‌ "భారత పౌర హక్కుల ఉద్యమానికి" నాంది అవుతుందని బహుశ ఆనాడు వారూ ఊహించి ఉండరు. ఆశ్చర్యకరమైన విషయం అప్పటికి, ఈ ముగ్గురు కూడా పార్టీ సానుభూతి పరులే కానీ సభ్యులు కాకపోవడం.

ముగ్గురూ వారి వారి వృత్తుల్లో నిరంతరం బిజీగా ఉండే వారు కావడంతో పార్టీపరమైన పనికి ఎక్కువగా రాత్రి వేళలు కేటాయించేవారు. ఆపాటికే ఆదరణ పొందిన "మార్క్సిస్ట్ ఫోరం" వేదిక కార్యకలాపాలు ముమ్మరం చేసారు. అప్పట్లో వారికదో పెను సవాల్‌. ఒకవైపు సిపిఐ నాయకత్వమంతా (ఆ పక్షాన ఖమ్మం జిల్లాలో చేరింది అతి కొద్ది మందే అయినప్పటికీ కూడా) ఏకతాటిపై పని చేస్తూ, సిపిఎం కార్యకర్తలను తమ వైపుకు ఆకర్షించుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. సిపిఐ పక్షాన జిల్లా అగ్రనాయకుల్లో ఒకరైన ఎన్‌. గిరిప్రసాద్‌ ఉండడంతో అది మరో సవాలుగా మారింది. నిజానికి చీలికొచ్చేంత వరకూ గిరిప్రసాద్‌ సిపిఎం పంథాకు అను కూలంగా ఉండేవారని అనుకునేవారు. మొత్తం మీద రెండో స్థాయి నాయకత్వం, మేధావిత్రయం మార్గదర్శకంలో చేసిన కృషి ఫలితంగా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని పటిష్ట పరచగలిగారు.

1964లో ఉమ్మడి పార్టీ చీలినప్పుడు అత్యధిక భాగం మార్క్సిస్టు పార్టీవైపు రాగా, కొద్ది మంది మాత్రం గిరిప్రసాద్ గారి నాయకత్వాన సిపిఐ పక్షాన వుండిపోయారు. వారిలో బోడేపూడి రామకోటేశ్వరరావు(పండితాపురం), సింగరేణి కార్మిక నాయకులు కొమరయ్య, రాజేశ్వరరావు, రావెళ్ల జానకిరామయ్య(చిరు నోముల), చుండూరు నరసింహారావు, తమ్మారపు గోవిందు, తాళ్లపల్లి రాములు, భద్రాచలం నుండి భూపతిరావు, తహశీల్, వాసిరెడ్డి వెంకటపతి(మధిర) గార్లు ముఖ్యులని అంటారు. (మరిన్ని వివరాలు-సి. హెచ్. నోట్ 1964-అనుబంధంలో వున్నాయి). కొద్ది మాసాల తరువాత రేగళ్ల చెన్నారెడ్డి, నల్లమల పిచ్చయ్య గార్లు కూడా సిపిఐ లోకి వెళ్లారు. వారిద్దరూ 1964 లో కలకత్తాలో జరిగిన సిపిఐ (ఎం) సభకు కూడా హాజరై వచ్చాక ఆ నిర్ణయం తీసుకున్నారు.

ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో కాని ఖమ్మంలో మార్క్సిస్ట్ ఫోరం ప్రతి ఆదివారం నిర్వహిస్తుండే సమావేశాలకు హాజరయ్యే వారిని ఆదివారం సంఘంగా-"సండే సిండికేట్" గా ఎద్దేవా చేస్తూ, పిలవడం జరిగేది ఓ రకమైన హేళనతో అప్పట్లో. ఇప్పటికీ ఆదివారం సంఘంతో అనుబంధమున్న వారు ఆ జిల్లాలో పలువురున్నారు.

1985 తర్వాత పార్టీ సేవకే అంకితం .... వైఆర్కే జైలు – కోర్టులు .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


1985 తర్వాత పార్టీ సేవకే అంకితం
వైఆర్కే జైలు – కోర్టులు
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (29-04-2019)
కమ్యూనిస్ట్ పార్టీ చీలిన నేపధ్యంలో, దేశవ్యాప్తంగా సీపీఎం నాయకులను అరెస్ట్ చేసిన నేపధ్యంలో, పౌర హక్కుల ఉద్యమం ఆరంభించిన నేపధ్యంలో, ఆ ఉద్యమానికి ఆద్యుడైన డాక్టర్ రాధాకృష్ణమూర్తిని, ఆయనకు తోడ్పడిన ఇతరులను ప్రభుత్వం నిర్బంధించింది. వీరికంటే ముందు అరెస్ట్ కాబడి, జైలులో వుంటూ పెరోలుపై విడుదలై వచ్చి, మరల వెళ్ళిపోతున్న వట్టి కొండ నాగేశ్వరరావును పంపడానికి, డాక్టర్ వై.ఆర్.కె, అడ్వకేట్ కర్నాటి రామమోహన్‌రావు ప్రభృతులు, డోర్నకల్ వరకు వెళ్ళి తిరుగు ప్రయాణానికి సిద్ధపడుతుండగా, వారి కొరకు కాపలా వున్న పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనంలో ఖమ్మం తరలించి, స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూర్చో బెట్టారు. వీరిని అరెస్ట్ చేసిన సమయంలోనే, ఖమ్మంలో వున్న అడ్వకేట్లు బోడేపూడి రాధాకృష్ణ, కె.వి సుబ్బారావులను కూడా అరెస్ట్ చేసింది ప్రభుత్వం. డాక్టర్ వై.ఆర్.కె పేషంటైన పోలీసు అధికారి మాధవరావు వారిని స్టేషన్‌లో మర్యాదగా చూశాడు. అక్కడి నుంచి రైలులో హైదరాబాద్ చంచల గూడా జైలుకు తరలించారందరినీ. అక్కడ మోటూరు హనుమంత రావు, ఎల్.బి.జి (లావు బాల గంగాధర రావు), మంచికంటి, గుంటూరు బాపనయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఎస్.ఆర్. దాట్ల, నల్లమల గిరిప్రసాద్ ల నుండి జిల్లా నాయకుల వరకున్నారు. రెండు వారాల తర్వాత, ముషీరాబాద్ జైలుకు మార్చారు. కారణం తెలియదు. రెండో పర్యాయం జైలు జీవితం అలా ప్రారంభమయింది. జైలులో రాజకీయ తరగతులు జరిగేవి.

రాధాకృష్ణమూర్తిగారు డాక్టర్ అని తెలుసుకున్న జైలు అధికారులు ఆయనకు అనధికారికంగా, అధికారులు చేయాల్సిన బాధ్యతను అప్పచెప్పారు. ఆయనకు అంటగట్టారనడం సమంజసమేమో! ప్రతి దినం జైలు డాక్టర్ వచ్చి, డిటెన్యూలను పరీక్షించి, అవసరమను కుంటే కొందరిని ఆసుపత్రులకు చికిత్స కొరకు పంపాల్సి వుంటుంది. ఆయన రావడం మానేయడంతో ఆ స్థానాన్ని డాక్టర్ వై ఆర్ కె భర్తీ చేశారు. పరీక్ష చేసి మందులు రాయడం, ఎవరెవరిని బయటకు పంపాలనే నిర్ణయం ఆయన తీసుకోవడం, అధికారిక సంతకం మాత్రం జైలు డాక్టర్ చేయడం నిత్య కృత్యమైంది. సాధారణంగా డిటెన్యూలకు ఏదోఒక మిష మీద జైలు గోడలు దాటి బయటకు పోవాలనిపిస్తుంది. వైద్యుడి సలహాపై వెళ్ళడం అన్నింటికన్నా తేలిక. సీపీఎం నాయకత్వం మటుకు, డిటెన్యూల ఆ ఆలోచనకు వ్యతిరేకం. అదే జైల్లో వున్న పుచ్చలపల్లి సుందరయ్య గారు, డిటెన్యూలను ఆ కారణంగా బయటకు పంపే విధానానికి స్వస్తి చెప్పాలని ఖచ్చితమైన ఆదేశాలిచ్చారు. ఆయన ఆదేశమంటే అది శిరోధార్యమే! దానికి తిరుగులేదు.


జైలులో పుచ్చలపల్లి సుందరయ్య గారితో డాక్టర్ వై.ఆర్.కె పంచుకున్న అభిప్రాయాలు ఎంతోమంది ఆదర్శప్రాయంగా తీసుకోదగ్గంత విలువైనవి. ప్రతి దినం మార్నింగ్ వాక్‍కు కలిసి పోతుండే వారిద్దరూ. అలా పోతుంటే ఒక నాడు వై ఆర్ కే ఊహించని ప్రశ్న వేశారు సుందరయ్య గారు. పార్టీకి, పార్టీ అనుబంధ సంస్థలకు ఎనలేని సేవలందిస్తున్న డాక్టర్ వై.ఆర్.కె, అంతవరకు సభ్యత్వం మాత్రం తీసుకోలేదు. పూర్తి కాలం కార్యకర్తగా పార్టీలో చేరి సభ్యత్వం ఎందుకు తీసుకోవడం లేదని అడిగారు సుందరయ్య గారు. జవాబుగా, తన మనసులోని మాటను నిర్మొహమాటంగా చెప్పారు డాక్టర్ వై.ఆర్.కె. తాను ఒంటరివాడిని కానని, కుటుంబ బాధ్యతలు ఎన్నో తన నెత్తిమీద వున్నాయని, ఆర్థికంగా నిలదొక్కుకో లేదని, ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నాయని, చిన్నతనం నుంచి కష్టాలకు అలవాటు పడలేదని చెప్పి అసలు కారణం బయట పెట్టారు. సుందరయ్యగారిలా త్యాగాలు చేయలేనని, పార్టీపరంగా తనకిచ్చే ఆదేశాలను చిత్త శుద్ధితో అమలు చేయగలనే కాని, పూర్తి కాలం కార్యకర్తగా త్యాగం చేసే స్థాయికి ఇంకా ఎదగలేదని స్పష్టం చేశారు. డాక్టర్‍గా తనకు వృత్తి పరమైన కొన్ని విద్యుక్త ధర్మాలు నిర్వహించాల్సిన బాధ్యత వుందని, సుఖమయమైన జీవన శైలికి అలవాటు పడ్డ తన పద్దతులు గమనించి ఇతర కార్యకర్తలు చెడిపోయే అవకాశం వుండవచ్చని, ముమ్మూర్తులా-త్రికరణ శుద్ధిగా, మరింత త్యాగానికి సిద్ధంగా వుండగలిగిన నాడు, ఆయన కోరినట్లు పార్టీలో చేరుతానని చెప్పారు. అప్పటివరకు, తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ, పార్టీ అప్ప చెప్పిన కార్యక్రమాన్ని నెరవేరుస్తానని చెప్పిన డాక్టర్ వై.ఆర్.కె అన్న మాట ప్రకారం నడచుకున్నారు. 1985లో పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత సుందరయ్యగారికి ఇచ్చిన మాట ప్రకారం మనసా-వాచా-కర్మణా పార్టీ సేవకే అంకితమయ్యారు. అలా ఆయన రెండో పర్యాయం జైలు జీవితం గడిచింది.

సరిగ్గా అదే రోజుల్లో, ఆ పాటికే జైలు జీవితం గడుపుతూ అనారోగ్యానికి గురైన ప్రముఖ సీ.పి.ఎం నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యగారిని పెరోల్ పై విడుదల చేసి, చికిత్స కొరకు సోవియట్ రష్యా పంపించి, కుదుటపడ్డ తర్వాత ముషీరాబాద్ జైలుకు తీసుకొచ్చారు. ఖమ్మంలో అరెస్టయిన నలుగురినీ (వై.ఆర్.కె, బోడేపూడి రాధాకృష్ణ, కె. వి. సుబ్బారావు, కర్నాటి రామ్మోహన రావు) కూడా ముషీరాబాద్ జైలుకే పంపారు. ఆ విధంగా వీరికి ఆపాటికే జైలులో వున్న సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య, చండ్ర పుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డిగార్ల లాంటి ప్రముఖులందరినీ కలుసుకునే అవకాశం కలిగింది. మాస్కో నుండి తిరిగి వస్తూ ఢిల్లీలో ఇందిరా గాంధిని, హైదరాబాద్‍లో ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గార్లను కలుసుకుని అరెస్టులపై తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు సుందరయ్య. డాక్టర్ వై.ఆర్.కె త్రయాన్ని అరెస్ట్ విషయాన్ని ప్రశ్నించిన సుందరయ్యతో "మీకంటే వారే ప్రమాదకరమైన వ్యక్తులు" అని జవాబిచ్చాడట బ్రహ్మానందరెడ్డి. ఆ విషయాన్ని స్వయంగా తెలియచేసిన సుందరయ్య, పౌరహక్కుల ఉద్యమ ప్రభావం అంత తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని కుదిపేసినందుకు ఆయన్ను, మేధావిత్రయాన్ని అభినందించారు.

ఖమ్మం ఆదివారం సంఘం ఆధ్వర్యంలో పౌర హక్కుల ఉద్యమానికి శ్రీకారం....అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


ఖమ్మం ఆదివారం సంఘం ఆధ్వర్యంలో
పౌర హక్కుల ఉద్యమానికి శ్రీకారం
పౌర హక్కుల సంఘం
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (28-04-2019)
నిర్బంధంలో ఉన్న ఖమ్మం జిల్లా నాయకులను విడుదల చేయించుకోవాలంటే అది కేవలం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితమైన వ్యవహారం కాదని, అఖిల భారత స్థాయిలో ఆలోచన చేయాల్సిన సమస్యనీ గ్రహించింది మేధావిత్రయం. అలా చేయాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయి సంస్థను నెలకొల్పాల్సిన అవసరముందని కూడా భావించారు. రాజకీయ పరమైన హక్కులకు కత్తెర పడ్డదన్న సంగతిని జనానికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా తమపై వేసుకోదల్చారు. సిపిఎం నాయకులపై చైనా మద్దతు దారులన్న ముద్ర వేయడంతో పాటు, సిపిఐ నాయకుల పట్ల మెతక ధోరణిని అవలంబించింది ప్రభుత్వం అప్పట్లో. రాజకీయ-పౌరహక్కులకు భంగం కలిగింది కాబట్టి, ఆ దిశగా ఉద్యమించాలని, ఉద్యమానికి సిపిఐ నాయకుల మద్దతు కూడా పొందాలని మొట్టమొదటగా మేధావి త్రయం భావించింది.

ఆరోజున సిపిఎం పట్ల ప్రభుత్వం అవలంబించిన పౌరహక్కుల ఉల్లంఘన, భవిష్యత్‌లో సిపిఐ పై కానీ, ఇతర రాజకీయ పార్టీలపైన కానీ అవలంబించరన్న నమ్మకం లేదని దాసరి నాగభూషణం లాంటి రాష్ట్ర సిపిఐ నాయకులు నచ్చచెప్పారు మేధావిత్రయం. కలిసి ఉద్యమించడానికి ఉభయ కమ్యూనిస్టులు అంగీకరించారు. విజయవాడలో కలిసిన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తమ ఉమ్మడి కార్యాచరణలో భాగంగా విజయవాడలో ఒక సదస్సు నిర్వహించి పౌర హక్కుల సంస్థను స్థాపించి, అదే రోజు బహిరంగసభ జరిపి ప్రకటన చేయాలని నిర్ణయించారు. ఆ బహిరంగ సభకు పిలువాలనుకున్న నాయకులలో సిపిఐకి చెందిన శ్రీపాద అమృత డాంగే, సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌. నంబూద్రిపాద్‌ ముఖ్యులు. అతివాదుల్లో మితవాదులని అప్పట్లో ప్రభుత్వం భావించినందున సిపిఎంకు చెందిన ఇ.ఎం.ఎస్‌ను, జ్యోతిబసును అరెస్టు చేయలేదు అప్పట్లో. తొమ్మండుగురు సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుల్లో వారిద్దరినీ తప్ప మిగతా ఏడుగురిని నిర్బంధించింది ప్రభుత్వం.

ప్రభుత్వ ఆదేశాలను-ఉత్తర్వులను విధేయతతో దేశ ప్రజలు పాటిస్తున్నంత వరకు పౌర హక్కుల సమస్యే తలెత్తదు. అలా ప్రజలు వాటిని పాటిస్తున్నారంటే అవి న్యాయ సమ్మతమైనవని, ధర్మసమ్మతమైనవని భావించాలి. దీనికి విరుద్ధంగా ప్రజలకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య సంఘర్షణ తలఎత్తితే పౌర హక్కుల సమస్య తెర పైకొస్తుంది. అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే హక్కు ప్రజల కుందని, అదే పౌరులకు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కైన భావ స్వాతంత్య్రమని అందరూ గుర్తించాలి. అయితే అదే రాజ్యాంగంలో అవసర మైనప్పుడు ప్రభుత్వానికి అండగా ఉండే రీతిలో ముందు జాగ్రత్త చర్యగా పొందు పరిచిన కొన్ని నిబంధనలు, ఎమర్జెన్సీ లాంటి సమయాల్లో పౌర హక్కులకు భంగం కలిగించే చర్యలు చేపట్టే అవకాశం కలిగిస్తోంది. బహుశ ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మామూలేనేమో. అలానే వ్యతిరేకంగా ఉద్యమించడమూ సహజమేనేమో!

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు నాయకులను జైళ్ళలో నిర్బంధించిన నేపథ్యంలో వారిని విడుదల చేయించేందుకు, 1948లో ఆచార్య కె.పి.చటోపాధ్యాయ అధ్యక్షతన, పశ్చిమ బెంగాల్‌లో మొట్ట మొదటి ప్రయత్నంగా పౌర హక్కుల సంఘం స్థాపించడం జరిగింది. 1962 నాటి భారత-చైనా యుద్ధం ప్రభావంగా నాటి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన "ముందస్తు నిర్బంధ చట్టం" (పి.డియాక్ట్) అమలులో భాగంగా వేయి మందికి పైగా కమ్యూనిస్టుల నిర్బంధంతో ఆరంభమైన ఉద్యమకారుల నిర్బంధ చట్టాలు, ఎమర్జెన్సీ రోజుల నాటికి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నాయకుల నిర్బంధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయనవచ్చు. ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజుల నాటి చేదు అనుభవాల నేపథ్యంలో, ప్రజా స్వామ్య విలువల పరిరక్షణకు, పౌర హక్కుల సంఘాల ఆవిర్భావం జోరందుకుంది. వాటిలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల కమిటి, పి.యు.డి.ఆర్‌, పంజాబ్‌ ప్రజాస్వామ్య హక్కుల సంఘం, పి.యు.సి.ఎల్‌. లాంటి కొన్నింటిని ప్రధానంగా పేర్కొనవచ్చు. రాజకీయ ఖైదీల విడుదలకే మొదట్లో ఉద్యమించిన పౌర హక్కుల సంఘాలు, క్రమేపీ తమ పరిధిని విస్తృత పరచుకుంటూ పౌరహక్కుల అణచివేత వ్యతిరేక ఉద్యమాలు చేపడుతున్నాయి.


ఈ పరిణామాలకు చాలాముందే, అంటే, 1965లోనే, విజయవాడలో ఆవిర్భవించనున్న పౌర హక్కుల సంస్థ ప్రకటన బహిరంగ సభకు అందరికీ ఆమోదయోగ్యమైన డాంగే, .ఎం.ఎస్‌లతో పాటు ఇంకెవరిని పిలవాలని ఆలోచన చేసారు మేధావి త్రయం. చర్చల్లో మహాకవి శ్రీ శ్రీ పేరు ప్రస్తావనకొచ్చింది సభా ముఖంగా. అదే విధంగా ఉభయ కమ్యూనిస్టులకు సమాన దూరంలో ఉంటూ వస్తున్న మాజీ పార్లమెంట్‌సభ్యుడు కడియాల గోపాలరావు పేరూ ప్రస్తావన కొచ్చింది. అజ్ఞాతంలో ఉన్న సిపిఎం నాయకులైన నండూరి ప్రసాదరావు, చెన్నుపాటి లక్ష్మయ్యల సూచన మేరకు జాతీయ స్థాయిలో పేరొందిన పౌరహక్కుల వాది జస్టిస్‌ఎన్‌.సి. చటర్జీని పిలవాలన్న ఆలోచన జరిగింది. ఈయన ప్రముఖ సిపిఎం నాయకుడు, 2004-2009 మధ్య లోక్‍సభ సభాపతిగా వున్న సోమ్‍నాథ్‍చటర్జీ గారి తండ్రి. ఖమ్మంకు చెందిన న్యాయవాదులు, వైద్యులు విజయవాడలో జరుగనున్న సదస్సుకు కావలసిన సదుపాయాలను సమకూర్చేందుకు సహాయపడ్డారు. జైల్లోవున్న ఆ నాటి సిపిఎం నాయకుడు తమ్మిన పోతరాజు అనుయాయులు విజయవాడ సభ ఏర్పాట్లకు తోడ్పడ్డారు. పౌర హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యల వివరాలను, కార్యాచరణ పథకాన్ని సదస్సులో చర్చించాలని మేధావి త్రయం చేసిన సూచనను అందరూ అంగీకరించారు.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడుగా విజయవాడకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.వి.ఎస్. ప్రసాదరావును ఎన్నుకున్నారు. స్థానిక న్యాయవాదుల-వైద్యుల సహకారంతో, తమ్మిన పోతరాజు అనుయాయుల తోడ్పాటుతో, మేధావిత్రయం మార్గదర్శకత్వంలో, "ఆదివారం సంఘం" ఆశించిన స్థాయిలో, పౌరహక్కుల ఉద్యమం శ్రీకారం చుట్టడానికి విజయవాడ వేదికగా రంగం సిద్ధం కానున్న తరుణంలో, ఊహించని కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు తలెత్తాయి. కార్యాచరణలో భాగంగా, తొలుత ఉదయం పూట, నాలుగైదు వందలమంది వరకూ హాజరు కానున్న డెలిగేట్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలను సాయంత్రం నిర్వహించదలచిన బహిరంగసభకు హాజరయ్యే ప్రజలకు వెల్లడి చేయాల్సి వుంది. అంతవరకూ అంతా సవ్యంగానే జరుగుతోంది. అనుకున్నరీతిలోనే సదస్సు నిర్వహించడం, సీ.పి.ఐ, సీ.పి.ఎం.లతో సహా పలువురు సానుభూతిపరులు ఆ సదస్సుకు హాజరవడం జరిగింది. సదస్సు ఆరంభంలో సీ.పి.ఎంకు చెందిన బోడేపూడి వెంకటేశ్వరరావు భాగవతార్ రాజకీయ పరమైన హరికథను చెప్తూ, అందులో భాగంగా కేవలం సీ.పి.ఎం.కు చెందిన నాయకుల పేర్లనే ప్రముఖంగా ప్రస్తావించడంతో, సీ.పి.ఐ కి చెందిన వారినుండి తీవ్ర నిరసన వ్యక్తమై, వ్యవహారం చిలికి-చిలికి గాలివానగా మారింది. సదస్సు నిర్వహణంతా ఏకపక్షంగా జరుగుతున్నదంటూ, నిరసన తెలుపుతూ, సీ.పి.ఎం వారిని దూషించుకుంటూ, సదస్సునుండి వెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా, అప్పటికే విజయవాడ చేరుకున్న కమ్యూనిస్ట్ నాయకుడు శ్రీపాద అమృత డాంగేను కలిసి, సాయంత్రం జరిగే బహిరంగ సభకు హాజరు కావద్దని విజ్ఞప్తిచేశారు. కార్యకర్తల-సానుభూతిపరుల కోరిక మేరకు, డాంగేతో సహా సీ.పి.ఐకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరుకూడా బహిరంగ సభకు హాజరవకూడదని నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మీద సీ.పి.ఐ.వారెవరూ రాకుండానే విజయవంతంగా బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చింది. "ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంస్థ (Andhra Pradesh Civil Liberties Association-APCLA)" పేరుతో రాష్ట్రస్థాయి పౌరహక్కుల పరిరక్షణ ఉద్యమ సంస్థను నెలకొల్పాలనీ, ఉద్యమాన్ని జిల్లా-గ్రామ స్థాయికి తీసుకుపోవాలనీ, ప్రతి స్థాయిలోనూ నాయకత్వాన్ని ఏర్పాటుచేయాలనీ సదస్సు తీసుకున్న నిర్ణయాలను బహిరంగ పరిచారు మేధావి త్రయం.

.పి.సీ.ఎల్.ఏ అధ్యక్షుడుగా మహాకవి శ్రీ శ్రీ ని, కార్యదర్శిగా కడియాల గోపాల రావును, ఉపాధ్యక్షులుగా కే.వి.సుబ్బారావు-కే.వి.ఎస్.ఎన్.ప్రసాదరావులను, సభ్యులుగా కర్నాటి రామ్మోహనరావు-డాక్టర్ వై. రాధాకృష్ణమూర్తిగార్లతో సహా మరికొంత మందిని నియమిస్తూ సదస్సు తీసుకున్న నిర్ణయాలను, దరిమిలా చేపట్ట దలచిన కార్యాచరణ పథకాన్నిసభాముఖంగా బహిరంగపరచారు. నలభై వేల మందికి పైగా హాజరయిన భారీ బహిరంగ సభగా నాటి విజయవాడ పౌరహక్కుల ఉద్యమ ఆరంభ సభను గురించి చెప్పుకునేవారప్పట్లో. బహిరంగ సభకు హాజరై వేదికమీదున్న ప్రముఖుల్లో ఎన్. సి. ఛటర్జీ, .ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, శ్రీ శ్రీ, కడియాల గోపాలరావులున్నారు. రహస్యంగా నండూరి ప్రసాదరావుగారిని కలుసుకొని, ఎన్. సి. ఛటర్జీని సంప్రదించడానికి, సభకు రప్పించడానికి డాక్టర్ వై. ఆర్. కె కు ప్రముఖ పాత్రికేయుడు వి. హనుమంతరావు సహాయం చేసారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లాస్థాయి సదస్సులు, బహిరంగ సభలు నిర్వహించాలని ఏ.పి.సీ.ఎల్.ఏ నిర్ణయించింది. అనుకున్న విధంగానే కర్నూల్, అనంతపూర్, (సూర్యాపేట) నల్గొండ జిల్లాలలో సభలు జయప్రదంగా నిర్వహించారు.

           మూడు జిల్లాల్లో జరిగిన సభలకు మహాకవి శ్రీ శ్రీ హాజరు కావడం విశేషం. పౌరహక్కుల ఉద్యమంతో అదే ఆయనకు మొదటి సారిగా ఏర్పడ్డ అనుబంధం. ఆయనే ప్రతి సభకు ప్రధాన ఆకర్షణ. నవంబర్ 1965 మూడో వారంలో సూర్యాపేటలో జరిగిన సదస్సు మిగతా రెండింటి కన్నా బాగా జరిగింది. సదస్సులో ప్రసంగించిన వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నిప్పులు కురిపించారు. సూర్యాపేట సదస్సు జరిగిన ఎనిమిదో రోజున "మేధావిత్రయం"తో పాటు కర్నాటి రామ్మోహనరావు (అడ్వొకేట్)ను, రాష్ట్ర వ్యాప్తంగా వున్న నాయకత్వాన్ని, ముందస్తు నిర్బంధ చట్టం కింద అరెస్టు చేసింది ప్రభుత్వం.

         వీరి అరెస్టుకు పూర్వమే ఖమ్మంలో సదస్సు, బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో, వారు లేకపోయినా, అరెస్టయిన పది రోజులకు స్థానిక న్యాయవాది-కమ్యూనిస్ట్ సానుభూతిపరుడు ఏడునూతుల పురుషోత్తమ రావు సారధ్యంలో ఖమ్మంలో బ్రహ్మాండమైన సదస్సు, సభ జరిగింది. .ఎమ్.ఎస్. నంబూద్రిపాద్, కడియాల గోపాలరావులు ఆ సదస్సుకు హాజరయ్యారు. శ్రీ శ్రీ వచ్చిన దాఖలాలు లేవు. దురదృష్ట వశాత్తు ఆ దశ పౌరహక్కుల ఉద్యమంలో అదే చివరి సభ అయింది.

         సూర్యాపేట సభ జరిగిన వారంలోపల మేధావిత్రయాన్ని, కర్నాటి రామ్మోహనరావును అర్థరాత్రి అరెస్ట్ చేసి, చంచల్ గూడా జైలుకు పంపింది ప్రభుత్వం.

రామానుజదాసు సుందరకాండ ప్రవచనాలు : వనం జ్వాలా నరసింహారావు


రామానుజదాసు సుందరకాండ ప్రవచనాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (29,30 ఏప్రిల్, 1 మే 2019)
దర్శనమ్ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆద్వర్యంలో, కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు, వాసుదాస స్వామి నెలకొల్పిన అంగలకుదురు శ్రీ కోదండరామ సేవక ధర్మ సమాజం నిర్వాహకులు, ప్రస్తుత పీఠాదిపతి, శ్రీమాన్ రామానుజదాస స్వామి వారి వాసుదాస విరచిత సుందరకాండ ప్రవచనాలు, ఏప్రిల్ నెల 22 సోమవారం నుండి ఏప్రిల్ నెల 24 బుధవారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 5-30  గంటల నుండి రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరిగాయి. కిక్కిరిసిన ఆహ్వానితుల సమక్షంలో అత్యంత మధురాతి మధురంగా జరిగిన ఈ ప్రవచన మహోత్సవాన్ని ప్రత్యక్షంగా పలువురు వీక్షించడమే కాకుండా దేశ-విదేశాల్లోని అనేకమంది తెలుగువారు ఫేస్ బుక్, యు-ట్యూబ్ ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించి పులకించారు. కార్యక్రమం జరిగిన మూడురోజులూ రామనుజదాసు ప్రవచనాలు ఆధ్యాత్మిక పరిమళాలను గుబాళింప చేశాయి.

మొదటి రోజు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి వచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఆదర్శవంతమైన పరిపాలనను అందించి, ప్రజలకు రాముడు ఆదర్శపురుషుడిగా నిలిచారని ఆయన అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలు రాముడిని ఆదర్శంగా తీసుకోదగిన మహాపురుషుడని ఆయన తన ప్రారంభ ఉపన్యాసంలో చెప్పారు. మొదటిరోజు కార్యక్రమంలో ద్విసహస్రావధాని, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ రామాయణ వైశిష్ట్యాన్ని విశదీకరించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తనదైన శైలిలో సుందరకాండ గొప్పదనాన్ని తెలియచేశారు. కార్యక్రమ నిర్వాహకులు వనం జ్వాలా నరసింహారావు (ఆంధ్ర) వాల్మీకి రామాయణం క్షీరదార అనీ, సుందరకాండ పాలల్లో కలుపుకున్న పంచదార లాంటిదనీ, కాండలో సుందరం కానిదేదీ లేదని అన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవాది సీతారామయ్యగారు వావిలికొలను సుబ్బారావుగారి రామాయణ రచనాశైలిని సోదాహరణంగా వివరించారు. దర్శనం వెంకటరమణ శర్మ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

రెండో రోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ వై ఆర్ కృష్ణారావు వచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రామాయణంలో కీలక ఘట్టాలను సుందరకాండలో వివరించారని అన్నారు. సత్యం, ధర్మం, తండ్రిమాట జవదాటని సుగుణాలతో మూర్తీభవించిన ప్రతిరూపమే శ్రీరామచంద్రుదని ఆయన అన్నారు. ఆ మహనీయుడి జీవిత చరిత్రే వాల్మీకి మహర్షి అందించిన రామాయణమని, అందులోని సుందరకాండలో హనుమంతుడు సీతాన్వేషణలో తారసపడిన ప్రకృతి వర్ణన అద్భుతంగా వుంటుందని కృష్ణారావు చెప్పారు. మొదటిరోజు జరిగిన ప్రవచనాల సారాంశాన్ని వనం జ్వాలా నరసింహారావు వివరించారు. రెండో రోజు కార్యక్రమానికి కూడా దర్శనం శర్మ అధ్యక్షత వహించారు.


  ముగింపు రోజు మూడోరోజు కార్యక్రమాన్ని దూరదర్శన్ మాజీ సంచాలకులు డాక్టర్ పాలకుర్తి మధుసూదన రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, జెన్కో-ట్రాన్స్కో చైర్మన్-మానేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్ రావు, దైవజ్ఞ శర్మ, ఎస్బీఐ మాజీ సేజీఎమ్  భండారు రామచంద్రరావు, డెల్హీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలా చారి, ఆధ్యాత్మిక వేత్త సీతారామయ్య తదితరులు ముగింపు కార్యక్రమానికి ముఖ్య-గౌరవ అతిథులుగా వచ్చారు. (ఆంధ్ర) వాల్మీకి రామాయణ వైశిష్ట్యాన్ని, ముఖ్యంగా సుందర కాండ ప్రాముఖ్యతను వారు ఆహ్వానితులకు తెలియచేశారు. శ్రీరామాయణం అద్భుత కావ్యమనీ, సుందరకాండ రసరంయమైన ఘట్టమనీ, సమకాలీన సమాజానికి ఈ ప్రవచనాలు ఒక మార్గదర్శకంగా నిలుస్తాయని సభాధ్యక్షుడు రమణాచారి అన్నారు. రవీంద్రభారతి వేదిక ఈ ప్రవచన కార్యక్రమంతో పునీతమైందని ఆయన చెప్పారు. కార్యక్రమం జరిగిన మూడు రోజులు కూడా అతిథులకు సత్కారంతో పాటు, ప్రవచన కర్త రామానుజదాస స్వామి వారికి ప్రవచనం చేసే ముందర ముఖ్య అతిథి పూల దండ వేసి సత్కరించారు.

   మూడురోజులు సాగిన ప్రవచన కార్యక్రమంలో మొదటిరోజు సీతా దర్సనం వరకు, రెండో రోజు సీతమ్మ ఆంజనేయుడికి చూడామణి ఇవ్వడం వరకు 38 సర్గలు, చివరి రోజున మిగిలిన 30 సర్గల లోని విషయాలు చెప్పారు రామానుజ దాసు. తొలుత వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా, యధావాల్మీకంగా తెలుగులోకి అనువదించిన ఆంధ్ర వాల్మీకి, వాలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారిని గురించి, ఆయన జీవిత విశేషాలను గురించి వివరించారు స్వామి. ఆ వివరాలు ఆయన మాటల్లో.....


ఇరవైనాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. మహా మహానుభావులూ, మహా విద్వాంసులూ కీర్తి శేషులు శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు, వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందో యతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ-పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, "మందరం" అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు. ఆంధ్ర పాఠక లోకం మందరాన్ని అపారంగా అభిమానించింది-ఆదరించింది.

వాసుదాసుగారు రచించిన ఆంధ్ర వాల్మీకి రామాయణానికి తెలుగులో సరైన వ్యాఖ్యానముంటే, సంస్కృతం రానివారికి చక్కగా అర్థమవుతుందని కొందరంటారు ఆయనతో. జవాబుగా, శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం, మందరం" పేరుతో గొప్ప వ్యాఖ్యానం రాసారు వాసుదాసుగారు. వాస్తవానికి అదొక గొప్ప ఉద్గ్రంథం. సరికొత్త విజ్ఞాన సర్వస్వం. వాసుదాసుగారు, తాను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి శ్లోకానికొక పద్యం వంతున రాసారు. మందరంలో తను రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్థ తాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న వివిదార్థాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. ఆయన మందరాలలోని శ్రీరామాయణ వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి" కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది.


వావిలికొలను సుబ్బరావుగారు, కడప జిల్లా-జమ్మలమడుగులో 1863 లో జన్మించి 1939 లో పరమపదించారు. ఎఫ్.ఎ చదువు పూర్తిచేసి, పొద్దుటూరు తాలూకా కార్యాలయంలో చిరుద్యోగిగా చేరి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హోదాకెదిగారు. 1893-1904 మధ్య కాలంలో పదకొండేళ్లు రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేసారు. తరువాత, మద్రాస్ (నేటి చెన్నై) ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్య కాలంలో పనిచేసారు. "శ్రీ కుమారాభ్యుదయం" అనే ప్రబంధ గ్రంథాన్ని రచించి, నాటి కవి పండితులను ఆశ్చర్య పరిచారు. ఆయన ప్రతిభకది తొలి హారం. భార్యా వియోగం కలగడంతో, వాసుదాసుగారు భక్తి-యోగ మార్గం పట్టారు. జీర్ణ దశలో వున్న ఒంటిమిట్ట రామాలయాన్ని సముద్ధరించాలన్న సంకల్పంతో, టెంకాయ పట్టుకుని బిక్షాటనచేసి లభించిన ధనంతో ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ఆంధ్ర వాల్మీకి రచనాకాలం 1900-1908 మధ్య కాలంలో. గాయత్రీ మంత్రం, రామ షడక్షర మంత్రం మూలంలో వున్నట్లే, అనువాదంలో కూడా నిక్షిప్తం చేసారాయన. వాల్మీకంలో వున్న బీజాక్షరాలన్నీ, ఇందులోనూ యథాస్థానంలో చేర్చబడ్డాయి. శ్రీరామనుతి కూడా రాసారు. ఆంధ్ర వాల్మీకం అనువాదమైనా, స్వంత రచన-స్వతంత్ర రచన అనిపించుకుంది.

వాసుదాసుగారు ఆంధ్ర వాల్మీకిగా లబ్ద ప్రతిష్టులయ్యారు. మహనీయమైన "మందర" రామాయణాన్ని అనేకానేక విశేషాలతో, పద్య-గద్య-ప్రతి పదార్థ-తాత్పర్య-ఛందోలంకార విశేష సముచ్ఛయంతో, నిర్మించి, వేలాది పుటలలో మనకందించారు. రామాయణ క్షీర సాగరాన్ని "మందరం" మథించి, మనకందరికీ ఆప్యాయంగా అందించింది. అయితే, దానిని ఆస్వాదించే తీరికా-ఓపికా లేని జీవులమైపోయాం మనం. భాష, శైలి, అర్థం, తాత్పర్యం కాలక్రమంలో పరిణామం చెందుతున్నాయి. "సూక్ష్మంలో మోక్షం" కావాలంటున్నారు నేటి తరం పఠితులూ, పండితులూ. కాలం గడిచిపోతున్నది. వాసుదారుగారు మారిపోతున్న తరాలకు గుర్తురావడం కూడా కష్ఠమైపోతున్నది. వారి "ఆర్యకథానిథుల" తోనూ, "హితచర్యల" పరంపరలతోనూ, పరవశించిపోయిన ఆ నాటి తెలుగు పాఠక మహనీయులు క్రమంగా తెరమరుగవుతున్నారు. మళ్లీ-మళ్లీ జ్ఞాపకం చేసుకోవాల్సిన, మరువలేని మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు వాసుదాసస్వామి.

వాసుదాసు గారిని గురించి చెప్పిన అనంతరం ప్రవచనాలను ప్రారంభించారు స్వామి. ఆయన చెప్పిన ప్రవచనాల వివరాల్లోకి పోతే....

తేట తేట తేనెలోని తీయందనాన్ని, చల్లని వెన్నెలలోని సుఖ శీతల మధురిమల్ని కలబోసి వాల్మీకి కోకిల ఆలపించిన ఆనంద మయ కావ్యగానమే సుందరకాండ. శబ్ద-అర్ధ-భావ-రస సౌందర్యాలను పరస్పరాశ్రయంగా సురుచిర భద్రంగా నింపుకొన్న రసమయ పేటి ఇది. ఇది ఒక అమృత భాండం. జీవ-జీవన సౌందర్య కాండం. బాధల మధ్య బోధలనూ, వ్యక్తుల మధ్య సాధనా సిధ్ధులనూ సిధ్ధపరచి, అందించిన మంత్రమయ అక్షయ అక్షర భాండం సుందరకాండం. సుందరకాండలో సుందరం కానిదేమిటట? అంటే..ఏమీ లేనే లేదు..అని పెద్దలి తేల్చేశారు.

ఇందులో హనుమ మహాయోగి. మహాజ్ఞాని. "విశిష్ట వశిష్ఠుడు". మహాచార్యుడు. అంతటి వాడు లంకకు వెళ్లేటప్పుడు శ్రీరామచంద్రుడి భద్ర ముద్రికను (ఉంగరాన్ని), తిరిగి వచ్చేటప్పుడు సీతమ్మ చూడామణిని చక్కగా ధరించి సముద్రాన్ని సునాయాసంగా దాటి వచ్చాడు. శ్రీసుందరకాండలో సౌందర్యమనేది రాశీభూతమైంది. మంత్ర పూతమైన రస సౌందర్యం-భగవత్ సౌందర్యమైన శ్రీరామ సౌందర్యం-ఆచార్య సౌందర్యమైన శ్రీహనుమ సౌందర్యం-అశోక, మధు వనాల ఉద్యాన వన సౌందర్యం-మహా విశిష్టమైన లంకా నగర సౌందర్యం-లంకలో కామినీ భోగినీ జన సౌందర్యం-రావణుడి వీర సౌందర్యం-హనుమ సాధనా సౌందర్యం-ఆదికవి వాల్మీకి మహనీయ రమణీయ మాధుర్యమైన కవితా శిల్పసౌందర్యం......వీటన్నింటినీ కలబోసిన మహాసౌందర్యం, శ్రీ "సుందర" సౌందర్యం.

సుందరకాండ వృత్తాంతమంతా కేవలం ఒకటిన్నర రోజుల్లోనే జరిగింది. కధ విషయాని కొస్తే, హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం, లంకకు చేరడం, సీతాదేవి కోసం వెతకడం, ఆమెను చూడడం, రామ లక్ష్మణుల సమాచారం చెప్పడం, శ్రీరామ ముద్రికనిచ్చి-చూడామణిని తీసుకో పోవడం, లంకా దహనం, మరలిపోయి శ్రీ రాముడికి సీతమ్మ సందేశాన్నివ్వడం-ఇంతే!. జాంబవంతుడి ప్రేరణతో మహేంద్ర పర్వతాన్ని ఎక్కి, అక్కడనుండి లంక కెళ్ళాలన్న సంకల్పంతో సిద్ధపడ్డ హనుమంతుడి ప్రయాణ సంబ్రమంతో మొదలవుతుందీ కాండ.

హనుమంతుడికి సహాయం చేయాలనుకొని సముద్రుడు "మైనాకుడిని" పంపుతాడు. సమయాభావం వల్ల ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించ లేనని సున్నితంగా తిరస్కరించి, ఆయనకు నచ్చ చెప్పి ముందుకు సాగిపోతాడు. దేవతల ప్రేరణతో అడ్డుపడ్డ నాగమాత "సురస"ను జయిస్తాడు. తనకున్న అణిమాది అష్టసిధ్ధులతో చిన్న ఆకారంగా మారి, ఆమె కోరినట్లు ఆమె నోట్లో దూరి, సురక్షితంగా బయటకొస్తాడు. ఆ తర్వాత హింసికైన "సింహిక"ను వధించి, ప్రయాణాన్ని సాగించి లంకకు చేరుకుంటాడు. ఇదంతా కేవలం ఎనిమిది గంటల్లో జరిగింది.

            లంకా నగరం చేరిన హనుమంతుడు లంక ప్రవేశిస్తూ అడ్డగించిన లంకాధి దేవత-లంఖిణిని, జయించి, లంకా వినాశానికి నాంది పల్కుతాడు. లంకలో చిన్న పిల్లిలా దిగి, తర్వాత చిన్నకోతి ఆకారంలో యధేఛ్చగా సంచరించి సీతాదేవికై వీధీ-వీధీ గాలిస్తాడు. మండోదరిని చూసి సీతాదేవేనని భ్రమపడుతాడు. రావణ అంతఃపురం చూసి అంతఃపుర స్త్రీల మధ్య సీతున్నదేమోనని అక్కడా వెతుకుతాడు. సీతాదేవి ఎక్కడా కనిపించక పోవటంతో, విచారంతో, మళ్ళీ-మళ్ళీ వెతుకుతూ, అశోకవనానికి చేరుకుంటాడు హనుమంతుడు.

            హనుమంతుడి ప్రయత్నం ఫలించి, వెతుకుతున్న సీతాదేవి అశోకవనంలో కనిపిస్తుంది. ఆమే సీతని నిశ్చయించు కోవడానికి, కొన్ని ఆధారాలు చూసుకుంటాడు. ఆమె స్థితికి దుఃఖిస్తాడు. రాక్షస స్త్రీల బెదిరింపులు-రావణుడి బెదిరింపు మాటలు-సీత రావణుడిని నిందించడం, పరుషపు మాటలనటం-ఆయన ఆగ్రహించడం-మళ్లీ రాక్షస స్త్రీల బెదిరింపులు- ఇవన్నీ వింటాడు చెట్టు చాటునుండి హనుమంతుడు. సీతాదేవి భయపడి శ్రీ్రాముడిని తల్చుకుంటూ దుఃఖించడం-త్రిజట స్వప్న వృత్తాంత కూడా వింటాడు.

సీతాదేవి వినేటట్లు శ్రీరాముడి కథను ప్రస్తావించి ఆయన్ను  ప్రశంసిస్తూండగా ఆయన ఉనికి తెలుస్తుందామెకు. ఆ తర్వాత ఆమెతో సంభాషించడం, ఒకరి విషయాలు ఇంకొకరికి చెప్పుకొఓడం, కుశల వార్తలడగడం జరుగుతుంది. సందేహాలు తీర్చుకున్న సీత, రామ లక్ష్మణుల చిహ్నాలేంటని అడగడం, హనుమంతుడు ఆమెకు నచ్చే రీతిలో చక్కగా శ్రీరాముడి దివ్యమంగళ విగ్రహాన్ని వర్ణించి చెప్పడం, ఆ తర్వాత కథ. శ్రీ రామ ముద్రికను ఇచ్చి, తన మీద నమ్మకం కుదిరిందనుకున్న హనుమంతుడు సీతను తన వీపు మీద కూర్చోబెట్టుకుని శ్రీ రాముడి దగ్గరకు తీసుకెళ్తానంటాడు. ఆమె నిరాకరిస్తే, ఆమెను కల్సినట్లు గుర్తుగా ఏమన్నా ఇవ్వమంటాడు. కాకాసుర వృత్తాంతాన్ని చెప్పి, చూడామణి నిచ్చి, హనుమంతుడిని ఆశీర్వదించి సెలవిస్తుంది వెళ్ళి రమ్మని సీతాదేవి.

            శత్రువుల బలా-బలాలు తెల్సుకోదల్చిన హనుమంతుడు, వెంటనే తిరిగి పోకుండా, అశోక వనాన్ని పాడు చేసి కయ్యానికి కాలు దువ్వుతాడు. రావణుడికి కోపం వచ్చి పంపిన కింకరులను మట్టుపెట్తాడు. హనుమంతుడు జయఘోశ చేస్తూ ప్రతీకారంగా పంపబడిన చైత్య పాలకులను చంపుతాడు. జంబుమాలి వధ, మంత్రి పుత్రుల చావు, సేనానాయకుల మృతి, అక్ష కుమారుడి వధ వెంట-వెంట జరుగు తాయి. ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డ హనుమంతుడిని తాళ్ళతో కట్టేయటంతో, బ్రహ్మాస్త్ర బంధనం వీడిపోతుంది. రావణుడికి తన వృత్తాన్తాంతా చెప్పి, లంకకు వచ్చిన కారణం చెప్తాడు హనుమంతుడు. రావణుడికి బుధ్ధి చెప్తుంటే కోపించిన ఆయన హనుమంతుడుని దండించమన్నప్పుడు  విభీషణుడి బోధతో తోక కాల్చి పంపమంటాడు రావణాసురుడు.

            ఆ తర్వాత, లంకా దహనం చేస్తాడు హనుమంతుడు. సీతాదేవిని పునర్దర్శించి మళ్ళీ సెలవు తీసుకుని, గంట సేపట్లోనే సముద్రాన్ని లంఘించి, మహేందాద్రి పై దిగుతాడు. వానర మిత్రులకు లంకకు పోయివచ్చిన విధమంతా "దండకం" లాగా చెప్తాడు. కిష్కిందకు చేరుకుని, శ్రీరాముడికి సీతాదేవి స్థితిని వివరిస్తాడు. చూడామణినిస్తాడు. శ్రీరాముడికి హనుమంతుడు సీతా సందేశం వినిపిస్తాడు. సుందరకాండలో ఆయా సందర్భాల్లో చేసిన వర్ణనలనేకం. మహేంద్ర పర్వతం వర్ణన, హనుమంతుడి గమనవేగ వర్ణన, మైనాకుడి వృత్తాంతం, లంక వెలుపలి ఉద్యానవన వర్ణన, లంకా నగర వర్ణన, చంద్ర వర్ణన, రావణుడి అంతఃపుర వర్ణన, రాక్షస స్త్రీల వర్ణన, పుష్పకవిమాన వర్ణన, రావణుడి వర్ణన, అశోకవన వర్ణన, సీతాదేవి దుఃఖ వర్ణన, సీతా రామచంద్రుల వర్ణన, శ్రీ్రాముడి విరహ తాప వర్ణన, కాకాసుర వృత్తాంతం, చూడామణి వర్ణన, రావణుడి సభలో రావణుడి వర్ణన, రాక్షస విలాప వర్ణన, అరిష్టాద్రి వర్ణన, మధువన వర్ణనలతో నిడివైంది సుందరకాండ.

         ఈ వివరాలతో ప్రవచన కార్యక్రమం ముగిసింది. ప్రతిరోజూ కార్యక్రమం చివర్లో శ్రీరామనుతి పఠించడం విశేషం.