Sunday, October 28, 2018

కపులకు సీతాదేవి పరిస్థితిని తెలిపిన హనుమంతుడు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


కపులకు సీతాదేవి పరిస్థితిని తెలిపిన హనుమంతుడు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (29-10-2018)
లంకకు పోయివచ్చిన విధమంతా క్షుణ్ణంగా కపులకు వివరించిన హనుమంతుడు, తన వానర మిత్రులతో ఇలా అంటాడు:

"శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహంచేత, మీ అందరి ప్రోత్సాహం వల్ల, నావన్తుగా మీరు నాకు అప్పగించినపని, లంకకు వెళ్లి సీతను చూసి రావడం పూర్తయింది. ఇక తక్కినకార్యం మీవంతు. సుగ్రీవుడు సీతాన్వేషణకోసం చూపిన ఉత్సాహం, రామచంద్రుడి ప్రయత్నం, ఈ రెండూ, సీతాదేవి మహాపాతివ్రత్య మహిమవల్ల ఫలించాయి. వారివురు అనుకున్నవి నెరవేరాయి. వికసించిన తామరపూవును విడిచి తుమ్మెద రాలేనట్లే, నా మనసు లంకలో వున్న సీతాదేవిని విడిచి ఇక్కడకు రాలేక పోతున్నది. ఇలా నా జన్మ సఫలమయింది. ఉన్న విషయాన్ని యదార్ధంగా చెప్పాను".

"నేను చెప్తున్నదాన్నిబట్టి రావణుడు అల్పుడనీ, సులభ సాధ్యుడనీ, భావించవద్దు. వాడి తపోబలంతో, లోకాలను నిల బెట్టగలడు. సంహరించనూ గల సమర్ధుడు. జానకిని తగిలినా వాడింకా దగ్ధమై పోలేదంటే, అది వాడి తపోబలమే! వాడి తపోమహిమ సీతాదేవి పాతివ్రత్యం కంటే గొప్పదనడంలో అర్థం, వాడిని రాముడు, సుగ్రీవుడు ఏమీ చేయలేరని కాదు. రావణుడు దగ్ధమైపోకుండా వున్నాడంటే అది వాడి తపోబలంవల్ల కాదు. వాడు ఆమెను తాకినప్పుడు ఆమె కోప్పడలేదు. ఆమె నిజంగా కోపమే తెచ్చుకుంటే, ఆ కోపాగ్ని, నిజమైన అగ్నిహోత్రుడి అగ్నికంటే తీవ్రమయిందవుతుంది. అగ్నిహోత్రుడు రావణాసురుడి కొంపకాల్చగలిగాడు కాని, సీతాదేవి వున్న చెట్టుకాల్చగలిగాడా? సీత తనంతట తానుగా రావణుడిని నాశనం చేయ సంకల్పించలేదు కనుకనే వాడింకా జీవించి వున్నాడు".

"లంకలో జరిగిందంతా చెప్పాను. ఇక జరగాల్సింది మీరు ఆలోచించండి. సీతాదేవిని తీసుకొచ్చి, రామచంద్రమూర్తి దగ్గరకు పోతే మంచిదని నా అభిప్రాయం. జాంబవంతుడితో సహా మీరంగీకరిస్తే అలానే చేద్దాం. ఆమె అక్కడ ఏడుస్తూ వుండడం, ఆ వార్త చెప్పగానే రామచంద్రమూర్తి దుఃఖపడడం, ఈ సన్నివేశం మనం కళ్లప్పగించి చూడడం నాకు నచ్చలేదు. రావణుడిని, వాడి బలగాన్నీ, నేనొక్కడినే చంపగలను. మీరుగూడా నావెంట వుంటే చెప్పాల్సిన పనేలేదు. కార్యం సులభమైపోతుంది. మనం రావణుడిని చంపి సీతను తెస్తే, రాముడికేమీ అపకీర్తి రాదు. మనం ఆయన సేవకులం. సేవకులు చేయాల్సినపనికూడా ప్రభువే చేయాలా? సేవకులకు  సాధ్యపడకపోతేనే ప్రభువు చేయాలి. అన్నీ ప్రభువే చేసుకుంటే సేవకులతో పనేమిటి?"

"ఈ కార్యం మనవలన అవుతుందా, కాదా? అన్న సందేహం లేదు. మీరంతా శూరులు, అస్త్రజ్ఞానమున్నవారు, వీరాధివీరులు, బుధ్ధిమంతులు, జయం మీద కోరికున్నవారు, ఎదిరించలేని బలవంతులు, సముద్రాన్ని దాటే శక్తిగలవారు. ఇలాంటి మీరు తోడైవస్తే, లంకానాశనం జరగదా? రావణుడిని కొడుకులతో, తమ్ములతో, సైన్యంతో సహా నేనొక్కడినే చంపగలను. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం, ఇంద్రాస్త్రం, రుద్రాసత్రం, వారుణాసత్రం, అన్నింటినీ నేనొక్కడినే నాశనం చేస్తాను. దీనికి మీ సమ్మతి కావాలనీ, మీ అంగీకారం లేదనీ, ఆగాను. నేను రాళ్లవాన కురిపిస్తే దేవతలైనా చస్తారు, రాక్షసులొక లెక్కా? సముద్రం చెలియలికట్ట దాటితే దాటవచ్చు, మందర పర్వతం వణకొచ్చు, కాని జాంబవంతుడిని యుద్ధంలో కదిలించగల శత్రు సమూహం లేనేలేదు".

"ఆ రాక్షసుల్లో ప్రసిధ్ధమైన వారందరినీ ఒక్క అంగదుడే చంపగలడు. పనసుడి, నీలుడి వేగానికి మందరం కూడా పాడైపోతుంది. మైంద, ద్వివిదులతో పోరి, గెలవగలవారు యక్షులలో, గంధర్వులలో, పన్నగులలో కూడా లేరు. వీరు బ్రహ్మవరప్రసాదితులు, అమృతాన్ని త్రాగినవారు, అశ్వినీ దేవతల గౌరవార్థం వీరికి చావులేకుండా బ్రహ్మ వరం ఇచ్చాడు. మిగిలిన బలవంతుల సంగతి అటుంచి, వరగర్వంతో, దేవతా సమూహాలను గెల్చి అమృతం తాగిన వీరు రాక్షసులను లక్ష్య పెట్తారా?"

"నిర్భయంగా లంకా నగరమంతా తిరిగి బూడిదయ్యేంతవరకూ కాల్చాను. రామచంద్రుడి పేరు, సుగ్రీవుడి పేరు, లక్ష్మణుడి పేరు, మహా పరాక్రమవంతులైన మీ అందరి పేర్లూ, అన్నిచోట్లా అదేపనిగా చెప్పాను. నేను రామచంద్రమూర్తి దాసుడననీ, పేరు హనుమంతుడనీ, వాయుపుత్రుడననీ, అందరూ వినేటట్లు చెప్పాను. రహస్యంగా ఏపనీ చేయలేదక్కడ".

"శీలవతి, గుణవతి, రూపవతి, పతివ్రతాశిరోమణి, ఒక దుష్టుడికి చెందిన అశోకవనంలో, ఓ ఇరుగుడు (శింశుపావృక్షం) చెట్టు నీడ కింద దుఃఖించే దృశ్యాన్ని జప్తికి తెచ్చుకుంటే, మనస్సు మండిపోతున్నది. సీతను ఆస్థితిలో మీరందరూ చూస్తే ఏమైపోయేవారో! ఎంతో రాతిగుండె వున్నవాడినైనందున నేను నిబ్బరించుకున్నాను. రాక్షసస్త్రీల మధ్య బందీగా వున్న సీత, మబ్బుల్లో మరుగునపడ్డ చంద్రకాంతిలా, కాంతిహీనమై శోకిస్తున్నప్పటికీ, రావణుడినేమాత్రం లక్ష్యపెట్టడం లేదు. ఇంద్రుడిమీద శచీదేవి మనసుంచినట్లే, భర్తమీద ఏకాగ్రమైన మనసుంచి, అనురాగంతో, ఎల్లవేళలా శ్రీరామచంద్రమూర్తినే ధ్యానిస్తున్నది సీతాదేవి".

"మాసిపోయిన ఒకే ఒక్క చీరెతో, వంటిమీద ఉత్తరీయంకూడా లేకుండా, దుమ్ములో మునిగి దుఃఖిస్తున్న సీత, భర్తను చూస్తానన్న ఆశతో రాక్షసస్త్రీల మాటలు, బెదిరింపులు లెక్కచేయడంలేదు. ఆమె శోకించే దృశ్యాన్ని తలచుకున్నప్పుడల్లా కడుపు మండుతున్నది. చూడటానికే వికారంగా వుండే రాక్షసస్త్రీలు, ఆమెను ఎల్లప్పుడూ భయపెడ్తున్నారు. అయినా ఆమె ఎల్లవేళలా నాధా అంటూ, అతని క్షేమం కోరి దుఃఖిస్తూ, వెల వెల్లాడిన ముఖంతో, నేలపైన కూర్చుని వుండడం చూస్తుంటే, ఆమె, శీతాకాలంలోని తామరతూడులాగా కనిపించింది. రామచంద్రమూర్తి తనదగ్గరకు వచ్చేమార్గం కనపడలేదనుకుని, రావణుడిని నమ్మలేని సీత, వాడిచేతుల్లో చచ్చేకంటే, తనంతట తానే మరణిద్దామని నిశ్చయించుకున్నప్పుడు, ఆపతివ్రతా శిరోమణికి నచ్చచెప్పి, ఏదోవిధంగా ఆ పని మానిపించాను".

"మా ఇద్దరిమధ్య జరిగిన సంభాషణలోని అన్నివిషయాలనూ, ఆమె అడిగినవన్నీ తెలియచేసాను. వానరరాజు సుగ్రీవుడికి, శ్రీరామచంద్రమూర్తికి స్నేహం కుదిరిందన్న సంగతివిని ఎంతో ఆనందించింది. సీతాదేవి మహాత్మ్యం చేత, ఆమె అసమానమైన పాతివ్రత్యంచేత, తమోగుణంకల రావణుడు ఇంతవరకూ దుర్మరణం పాలుకాలేదంటే వాడుగొప్పవాడనే అనాలి. అయితే భర్త చేతులతోటే రావణుడిని చంపించి, ఆ కీర్తి ఆయనకు దక్కేలాచేసి వీరపత్నిననిపించుకోవాలన్న ఆమె వ్రతమే ఆ రావణుడినింతవరకూ కాపాడింది. వాడందుకే ఇంకా శాపగ్రస్తుడు కాలేదు. సహజంగా సన్నగా వుండే సీత, భర్తను విడిచి వుండడంవల్ల ఇంకా క్షీణించిపోయింది. వీటన్నిటికీ ప్రతిక్రియగా ఏది న్యాయమని తోస్తే అదేచేద్దాం. ఆలోచించండి" అని హనుమంతుడనగా, అంగదుడు తన అభిప్రాయం చెప్పసాగాడు.

శౌర్యమందు సమర్ధుడు, దేవదానవ పన్నగులకు అసమానుడు, హనుమంతుడు, సీతను చూసివచ్చాడే కాని, పిలుచుకుని రాలేదనడం బాగుంటుందేమో ఆలోచించమని అంటాడు అంగదుడు. ఇట్టివాడు ఉత్త చేతులతో రాముడి వద్దకు పోతే మంచిదికాదేమో నని తన అభిప్రాయమంటాడు అంగదుడు. "వీరుడు హనుమంతుడు లంకలోని వీరులందరినీ చంపి వచ్చాడు. ఇక మనం అక్కడకు పోయి సీతను తేవడమే మిగిలుంది, సీతను తెద్దాం" అంటాడు అంగదుడు. అయితే అంగదుడి ఆలోచన బాగున్నప్పటికీ, రామచంద్రమూర్తి అభిప్రాయం తెలుసుకుని, ఆయన చెప్పినట్లు చేస్తే బాగుంటుందని జాంబవంతుడు సలహా ఇస్తాడు.

Saturday, October 27, 2018

శూర్పణఖ ప్రేరేపణతో శ్రీరాముడితో యుద్ధానికి పోయిన ఖరుడు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-32 : వనం జ్వాలా నరసింహారావు


శూర్పణఖ ప్రేరేపణతో శ్రీరాముడితో యుద్ధానికి పోయిన ఖరుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-32
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (28-10-2018)

         భయంకరంగా గట్టిగా ఏడ్చుకుంటూ, జనస్థానంలో వున్న ఖరాసురుడి దగ్గరకు వచ్చిన శూర్పణఖను (రాక్షస నాశనానికి కారకురాలు కాబోతున్న) చూసి ఖరుడు ఇలా అన్నాడు. “ఎందుకే మళ్ళా ఏడుస్తూ వచ్చావు? నువ్వు కోరినట్లే, నీ ఇష్టప్రకారమే, మిక్కిలి శూరులైన రాక్షస శ్రేష్టులను నీ వెంట పంపానుకదా? ఇంకా ఎందుకు ఏడుస్తావు? ఆ పద్నాలుగు మంది నేనంటే భక్తికలవారు. చెప్పిన కార్యం చేయక మానరు. మిక్కిలి ధీరులు. అనురాగం కలవారు. యుద్ధంలో ఓటమి ఎరుగానివారు-పరులకు జయించరానివారు. అయ్యో! నాథా అని ఆడుపాములాగా పొరలి-పొరలి ఏడుస్తున్నావెందుకే? ఏ కారణాన ఏడుస్తున్నావు? ఉన్న విషయం చెప్పు. దీనురాలివై, అయ్యో! నాకు దిక్కెవరూ లేరని ఏడుస్తూ వున్నావెందుకు? నేనున్నాను కదే నీకు దిక్కు. అక్కడ ఏం జరిగిందో చెప్పవే. భయం వదలవే”.

ఇలా ఖరుడు అనగానే, కన్నీళ్లు చేత్తో తుడుచుకొని, లేచి కూర్చొని, తోడబుట్టినవాడిని చూసి, “నా పగ తీర్చడానికి నువ్వు బలవంతులైన పద్నాలుగు మంది రాక్షసులను పంపిన మాట వాస్తవమే. అయినప్పటికీ నువ్వు పంపిన వారందరూ రాముడి పదునైన, భయంకరమైన బాణాలకు చీల్చబడ్డ శరీరాలతో క్షణకాలంలో నిలబడి చచ్చిపోయారు. అది చూసిన నేను, అక్కడ వుంటే నన్నేం చేస్తారో అన్న భయంతో, గాలి వేగంతో పరుగెత్తుకుంటూ వచ్చానిక్కడికి. అప్పుడు పుట్టిన వణుకు ఇప్పటికీ తగ్గలేదు. ఖరుడా చూడు, నా మాట అసత్యమేమో? గొప్ప విషాదమనే మొసళ్ళను, మహా భయమనే అలలను కల పెద్ద దుఃఖం అనే సముద్రంలో మునిగిన నన్ను లేవదీయి. నీ పనికోసం పోయిన రాక్షసుల మీద, తోబుట్టువైన నామీద, నీకు కొంచెమైనా దయ నిజంగా వుంటే, నువ్వు రాముడిని ఎదిరించి, యుద్ధం చేసే ధైర్యం వుందా? వుంటే, ఏదీ చూద్దాం...తక్షణమే ఆ రాక్షసులపాలిటి ముల్లైన రాముడిమీదకు యుద్ధానికి బయల్దేరు”.

“చనిపోయిన రాక్షసుల మీద, బతికున్న నా మీద, దయ లేకున్నా, రాముడిని ఎదిరించి యుద్ధం చేసే ధైర్యం లేకున్నా, నాతో పాటు నువ్వు కూడా ఇంట్లోనే వుండు. నేను ఏడుస్తుంటా...నువ్వు సంతోషంగా నవ్వుతుండు. ఆయన నిశాట కంటకుడు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నా వదిలిపెట్టడు. ఎప్పటికైనా పక్కనున్న ముల్లు గుచ్చుకోకుండా వుంటుందా? నాకు శత్రువైన శ్రీరామచంద్రమూర్తిని నువ్వు చంపడానికి ప్రయత్నం చేయకపోతే, నువ్వు చూస్తుండగానే, నీ ఎదుటనే ప్రాణాలు వదులుతా. ముక్కు-చెవులు కోయించుకొని కూడా పగ తీర్చుకోలేని ఈ అవమానపు బతుకు బతకడంకంటే చావడం మేలు కదా? నా ఆరాటం కొద్దీ నేను చెప్తున్నా కానీ వాస్తవం ఆలోచిస్తే, నువ్వు నీ సైన్యంతో పోయినా యుద్ధ భూమిలో ఆయన ఎదుట నిల్వలేవని అనిపిస్తున్నది. ఆయన బలం, ఆయన ధైర్యం ఎక్కడ? పిరికిపందవు, దుర్బలుడివి, నువ్వెక్కడ?

         “నాకేంటి? బలశౌర్యాలు లేకపోవడం ఏంటి? దేవతలను జయించానంటావా? అట్లయితే ఏదీ...నీ బాల శౌర్యాలు చూద్దాం. వెంటనే శ్రీరామచంద్రుడిని యుద్ధంలో ఎదుర్కోవడానికి సైన్యంతో బయల్దేరు. అలా చేయలేకపోతే, బలం, ధైర్యం లేని పిరికిపందకు ఈ దండకాటవి ఎందుకు? ఓరీ కులదూషకా! రాక్షస కులానికి అపకీర్తి తేవడానికి పుట్టావా? ఇక ఇక్కడ ఆలశ్యం చేస్తే, రాముడు రానే వస్తాడు. అదిగో రాముడు వస్తున్నాడు....నిన్నిక్కడే పూడుస్తాడు. మరెక్కడికైనా పరుగెత్తు. నా ముక్కు-చెవులు కోసి నన్నిలా అవమానించిన వీరుడిని, రఘువంశనాయకుడిని, శ్రీరామచంద్రమూర్తిని, ఆయన తమ్ముడు లక్ష్మణుడిని నువ్వేమని భావిస్తున్నావురా? సామాన్య మనుష్యులు అనుకుంటున్నావా? పది మంది, నూరు మంది ఆయన్ను గెలవగలరని అనుకుంటున్నావా?” అని శూర్పణఖ పెద్ద నగారా వాయించినట్లు కడుపు మీద బాదుకుంటూ, ఏడుస్తుంటే రాక్షస నాయకుడు ఖరుడు సమాధాన పరచాడు.


         శూర్పణఖ నిందా వాక్యాలకు, తన పౌరుషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన మాటలకు జవాబుగా ఖరుడు “నా తోబుట్టువైన నిన్ను అవమాన పర్చారన్న అవమానం వల్ల కలిగిన కోపం, పొంగిపోయే సముద్రాన్ని అణచడం సాధ్యం కానట్లే, తగ్గించడం సాధ్యం కాదు. నీచ మనుష్యులను, చచ్చిన వాళ్లతో సమానమైన వారిని, నేను లక్ష్య పెట్తానా? వాడిని నేను చంపాల్సిన పని లేదు. వాడి దుష్ట చేష్టల వల్ల వాడే లోకంలో చంపబడుతాడు. ఇలాంటివాడు ఇలా చేసి చచ్చాడని పేరు మాత్రం నిలుస్తుంది. ఎందుకు ఏడుస్తావు? ఏడవ వద్దు. ఇదిగో ఇప్పుడే పోయి తమ్ముడితో సహా రామచంద్రుడిని నా పదునైన బాణాలతో, కఠినమైన కత్తితో చంపుతా. ఆ దుష్టుడి వేడి-వేడి నెత్తురు నీ పగతీరేదాకా జుర్రుకో” చెప్పగానే శూర్పణఖ సంతోషించింది. తమ్ముడిని మరీ-మరీ పొగిడింది. వాడు కూడా మరింత విర్రవీగుతూ, దూషణుడు అనే పౌరుషం, కోపం కల సేనానాయకుడిని పిలిచి యుద్ధానికి సన్నద్ధం కమ్మన్నాడు.

         బలంతో భయంకరమైన వేగం కలవారిని, యుద్ధంలో వీపు చూపించని వారిని, సాహసవంతులను, నల్లటి మేఘం వన్నె దేహం కలవారిని, దయలేనివారిని, హింస చేయడానికి ఇష్ట పడేవారిని, సింహంలాగా పరాక్రం కలవారిని, తన ఇష్టప్రకారం నడిచేవారిని, రణప్రయత్నం కలవారిని, భయంకరమైన బలం కలవారిని, పద్నాలుగువేల రాక్షసులను శీఘ్రంగా సమకూర్చమని దూషణుడిని పురమాయించాడు ఖరుడు. విల్లులు, బాణాలు, కత్తులు, ఇతర అనేక ఆయుధాలు కల తన రథాన్ని తీసుకురమ్మన్నాడు. పౌలస్త్య వంశంలో పుట్టిన రాక్షసుల ముందు తానూ పోతానన్నాడు. తన వెనుక సైన్యాన్ని రమ్మన్నాడు. శ్రీరామచంద్రుడికి చావుకూడేట్లు చేసి జయం పొంది లోకంలో ప్రసిద్ధికెక్కుతానన్నాడు.

         ఖరుడు ఇలా చెప్పగా దూషణుడు ప్రళయకాలం నాటి సూర్యుడితో సమానమై, నానా వర్ణాల గుర్రాలు కట్టిన రథాన్ని అతడి ముందు నిలిపాడు. దాని మీదకు కోపంతో ఎక్కాడు ఖరుడు. ఖరుడు రథం ఎక్కగానే, దూషణుడు పెద్ద సేనతో ఖరుడి పక్కన నిలిచాడు. సైన్యాన్ని కదలమని ఖరుడు ఆజ్ఞాపించాడు. ఆ వెంటనే వేగంగా సేన బయల్దేరింది. ఆ ధ్వనికి అడవిలో మృగాలు తత్తరపాటుతో ఎటూ పోవడానికి దారితోచక తికమకలాడాయి. కొన్ని భయంతో మూర్చపోయాయి. సలాకులు, ముద్గారాలు, కత్తులు, గండ్రగొడ్డళ్ళు, బాకులు, వజ్రాయుదాల లాంటి కత్తులు, బల్లాలు, ఇనుపకట్ల గుదియలు, విల్లులు, బాణాలు చేతుల్లో ధరించి, చూసేవారికి భయంకరమైన వేషాలతో, భూమి గడగడ వణకుతుంటే పద్నాలుగు వేలమంది రాక్షసులు బయల్దేరారు. ఖరుడి మనసెరిగిన అతడి సారథి సైన్యం వెంట తీవ్రంగా రథాన్ని తోలాడు. ఆ రథం గమనవేగం వల్ల పుట్టిన ధ్వని భూమి నాలుగు దిక్కులా వ్యాపించింది. ఖరుడు కోపంతో, కఠినమైన గొంతుతో సారథిని త్వరితగతిన రథాన్ని తోలమని పురమాయించాడు.

Sunday, October 21, 2018

లంకకుకుపోయి వచ్చిన విధం కపులకు చెప్పిన హనుమ ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


లంకకుకుపోయి వచ్చిన విధం కపులకు చెప్పిన హనుమ
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (22-10-2018)

సీతాన్వేషణకు లంకకు వెళ్లి వచ్చిన హనుమంతుడు, ఆ వృత్తాంతమంతా, తోటి వానరులకు వివరించిన దానిని, ఒక సుదీర్ఘ "దండకం" రూపంలో రాశారు వాసు దాస కవి. ఆ దండకం ఇలా సాగుతుంది.
దండకం: ఆద్యంత వృత్తాంత మాలింపఁ గా నింపు పెంపార నా జాంబవంతుండు వాతాత్మజుం జూచి యో యంజనానందనా! ముందుగాఁ బొందుగాఁ దెల్పుమే రీతి నా నాతిని న్నీవు గన్గొంటి? వాల్గంటి దా నొంటి నెట్లున్న? దా యన్నుమిన్నన్ దశాస్యుండు క్రూరుండు దా నే విధిం జూచెడిన్? మీది కార్యంబు ఱేనంచునన్ సంచుగా జెప్ప నౌ చెప్పఁ గా రాని యవ్వాని భాశింపు మన్నన్, హనూమంతుఁ  డత్యంత సంతుష్టుడై హృష్టుడై జానకిన్ లోన ధ్యానించి మూర్ధంబుచే మ్రొక్కి యిక్కై వడింబల్కె; వారాశియా ప్రక్కతీరంబుఁ  జేరంగ లో నెంచి నే నీ నగాగ్రంబునందుండి కుప్పించి దాఁ టంగ మీరెల్లఁ గన్నారఁ గన్నార కాదే? యటేనేగ నంబోధిమధ్యంబునన్ హేమశృంగాంచితంబైన శైలంబు నాత్రోవకడ్డంబు రా వచ్చె రా విఘ్న మం చెంచి రోషించి భేదించి పోవంగ లోనెంచి దానిన్ ఢికీలంచు నే దాఁ కితిన్, దోఁ కతో దాచితిన్, దాచినన్ దాని శృంగంబు వేభంగులన్ భంగ మై రాలెఁ , దఛ్చైలమో మామకీ నాశయం బెంచి హర్షంబుగా నాయనా! నీకు జిన్నప్ప నే, గాడ్పుమిత్రుండ, మైనాకుఁ డన్, వార్ధిలో చుండుదున్, మున్ను పక్షంబు లుండన్ ధరాధ్రంబు లెల్లన్ యధేచ్ఛంబుగాఁ  గ్రుమ్మరన్ లోకభీదానదక్షంబు లౌ వాని వీక్షించి పక్షంబులం ద్రుంచె వజ్రహతిన్ శక్రు, డగ్గోడు తప్పింప నీ తండ్రి నన్దెచ్చి యీ యంబుధిం ద్రోచెఁ జూ, ధర్మభృద్వర్యుఁ డున్ శక్రవీర్యుండు నౌ రాము కార్యంబున న్నాదు సాహాయ్యముం గొమ్ము నా, సమ్మతిన్ నాదు కర్జంబు చందంబు బోధించి కార్యైకసక్తాత్మతన్ శైలరాజాజ్ఞ నేఁ బోయితిన్, గ్రావమున్ మానుషాకారమున్ మాని శైలాకృతింబూని వారాశిమధ్యంబునన్ నిల్చె, నే నెచ్చు వేగంబునన్ బోవ బోవంగ నాగాంబ వేగంబ నాకడ్డమైనిల్చి యోక్రోతిఱేఁ డా! మదాహారముం గమ్ము, వేగమ్మ రారమ్ము, దేవాళి యేర్పాటురా సుమ్ము నా; నమ్మహాదేవికిన్ మ్రొక్కి దిక్కేమియుం దోఁ ప కిట్లంటి నో దేవి! భూదేవి జామాత శ్రీరాముఁ డారణ్య దేశంబునన్ జానకీ లక్షణాన్వీతుడై! క్రుమ్మరం బంక్తికంఠుండు శుంఠుండు తద్దేవినిన్ మ్రుచ్చిలించెన్, దదన్వేశణార్ధంబు రామాజ్ఞచే బోవుచున్నాఁ డ, దద్దేవిదేశంబునం దుంట శ్రీరాము కార్యంబునందోడు కారాదె? కాదేని వైదేహినిన్ రామునిం జూచి వే వచ్చి నే నిచ్చి నీ మెచ్చుగా జొచ్చువాఁ డన్ భవద్వక్త్రమం దన్న న య్యన్ను హా! యేటిమాటల్ బళా దాఁ టి పోనీయ, నాకీ వరం బిచ్చి రా దేవతావల్లభుల్, పొల్లుగాదన్న, మే న్వెంచితిన్ యోజనంబుల్ పది న్నిడ్పు లం దర్ధవిస్తారముం గల్గనాదేవి నాయంత వాక్రంత దావిచ్చె నే నంత హ్రస్వుండనై యొక్క యంగుష్ట మాత్రంబు గాత్రంబుగా జివ్వునన్ దాని వక్త్రంబునం జొచ్చి వెల్వడ్డ నన్ జూచి నైజాకృతిం దాల్చి యా యంబ, యోవానరంబా! సుఖంబార బోపొమ్ము, నీకార్యముల్ చక్కనౌఁ , గూర్పుమీ సీత శ్రీరాముతో, మెచ్చితిన్ నీయెడన్, భద్రమౌ నన్న నన్నంతటన్ భూతముల్ ప్రీతముల్ మేలు మేలంచు శ్లాఘించె, దర్వాత నిర్భీతి బక్షీశురీతిన్ మొగుల్ త్రోవ నేఁ బోవ, నాచాయనేదో గ్రహింపంగ నేచాయ గన్గొన్న నాకేమియుం దోఁ ప దాత్మీయ వేగంబు సంకుంఠితం బైన నే నాత్మలో నే మహా! నా మహావేగమాచిక్కె, నే ప్రక్క నేయొక్కరిం గాన, గార్యంబు వార్యంబుగా నోపునో? యంచు దుఃఖాకులాత్ముండ నై క్రిందు చూడంగ, మున్నీట ఘోరాకృతిం బండి రాకాసి యొక్కర్తు నన్ చూచి గర్జించి తర్జించి పెన్నవ్వుతోఁ  గ్రొవ్వుతోఁ  గీడుగా నాడె, నో పెద్ద దేహంబువాడా! బలే యెందురా యేగవే వేగ? నే నెన్నియో నాళ్ళుగాఁ  గూడు లేకుంట నాఁ కంట నే జిక్కి స్రుక్కంగ నిందుండ నా దండిభాగ్యాన నాకంటికిం దోఁ చి తిప్పట్ల, నాకడ్పులోఁ గుడ్పుగా జొచ్చి యానంద మొందింపరా  యన్నఁ గా నిమ్మటం చేను నామేను వేదాని వాకంటె బల్ పెద్దగాఁ బెంప,  నా టక్కు నూహింపఁ గా లేక నన్మింగ నోర్విచ్చె, నేనో నిమేశంబునన్ గుజ్జువేశంబునన్ దాని పెన్బొట్టలో దిట్టనై యట్టెవేచొచ్చి ప్రేవుల్ వెసం గొంచుఁ జివ్వాలునం బైకి లంఘించితిన్, హస్తముల్ వ్రేల రాకాసి వారాశిలోఁ గూలె, మింటన్ నభశ్చారు లౌ చారణుల్ సింహికా రాక్షసిం ద్రుంచె సామీరి యం చాడగా వింటి, నే నత్యయం బెంచుచున్ వింటిమార్గంబునం బోయి శాఖిప్రతానావృతంబౌచు లంకాపురం బుండు నాయొడ్డు గన్గొంటి, నా పిమ్మటన్ సూర్యుఁ డస్తాద్రిఁ  జేరంగ ఘోరాసురస్తోమముల్ గాన కుండంగ లంకాపురిం జొచ్చితిం, జొచ్చుచుండంగ నొక్కర్తు కల్పాంత ధా రా ధ రా కా రఘోరాట్టహాసాననోపేతజాజ్వల్యమానాగ్ని కేశాలితో నన్నుఁ జంపన్ సమీపింప డా కేల నేఁ బెద్ద పెట్టొక్కటిం బెట్టితిన్, దానితో ఱోలుచుం గూలి,  నన్ చూచి యో వీర! లంకాపురిన్ నేను, నన్గెల్చి తీవింక గెల్వంగ నేర్తీసురారాతి సంఘంబుఁ బొమ్మంచు నచ్చేడె నన్నాడె, నేనా ప్రదోశంబునన్ లంకలో జొచ్చి రేయెల్ల సీతాసతిన్ రోసితిన్, దైత్యునంతః పురాంతస్థ్సలిం గానరాదయ్యె, నేనయ్యెడన్ శోకసంతాప మేపారఁ  బ్రాకారముం దాఁ టి, యుద్యానముం గాంచి, యందే యశోకావనీజాతమొం డెక్కి బంగారసంటుల్ విరాజిల్లు తోఁ టొక్కటిన్ శింశుపాభూరుహోపాంతదేశంబునన్ శ్యామనీ రేజిపత్రాంబకన్ నిట్రుపాసంబులం జిక్కి యేకాంశుకాన్వీతయై, ధూళిసంలగ్న కేశాంతయై, శోకసంతాపదీనాంగియై, నాధు ధ్యానించుచున్ బెబ్బులుల్ చుట్టఁ గా లేడిచందాన దుఃఖించుచున్ భూమిపై వ్రాలి పెన్మంచునం దమ్మివోలెన్ వివర్ణాకృతిం దాల్చి దైత్యేశభీతిన్ మృతిం జెందఁ గా గోరు సీతాసతిం గాంచు చా చెట్టుపై నుంటి, నే నింతలోఁ బంక్తి కంఠాలయంబందు ఝాళం ఝుళీరావముల్ వింటి, నద్దాన నే నివ్వెఱన్ గొంటి, సంక్షిప్త గాత్రుండనై పక్షివోలెం గుజంబందు నే నుంటి, దైత్యేశు డిల్లాండ్రతో వచ్చె నచ్చోటికిన్, జానకీదేవి యారాక్షసాధీశునింజూచి మోఁ కాళులన్ ఱొమ్మునంజేర్చి హస్తంబులం జుట్టి విత్రస్తయై దిక్కు లేకందు నల్దిక్కు లీక్షించుచున్ వేపమానాంగియై యుండ వాఁ డంగనం జేరి ధాత్రీస్థలిన్ వ్రాలి నన్నేలవే గోల! యో బేల! రెన్నెల్లలో నన్నుఁ  గైకోక గర్వించి తేనిన్ భవచ్ఛోణితం బేను ద్రావంగ నుంకితుఁ జుమ్మన్న నన్నీచు వాక్యంబు లాలించి రోశంబునన్ సీత భాషించె నో నీచుడా! దుర్మతీ! నన్నెవ్వతెంగాఁ  గనుంగొంటిరా! నీవు; శ్రీరాము నిల్లాల, నిక్ష్వాకువంశేశ్వరుండైన యయ్యాజికిం గోడలన్, నన్నురా నీవు నీచోక్తులాడంగ! నీనాల్క తుత్తున్కలై కూలదా? క్రూరుఁ డా! శూరుడా నీవు? చోరుండవై నాదు నాధుండు లేనప్డు నన్దెచ్చి ముచ్చట్లు వాక్రువ్వగా వచ్చితా? రామచంద్రుండు సంగ్రామశూరుండు సత్తోక్త్యుదారుండు యజ్ఞప్రచారుండు నీ వా మహాభావు దాసుండగా నైన నర్హుండవా? కావు కావన్న నన్నాతివాక్యంబు లాలించి కోపించి యంతం, జితాస్థాగ్ని చందంబున న్మండి పెన్గ్రుడ్డులం ద్రిప్పి నద్దేవినిం గ్రుద్ది చంపంగఁ  గేలెత్తనయ్యో యయో యయ్యయో యంచు దైత్యాంగనల్ గూయ స్త్రీ మధ్యమందున్న మండోదరీ నామ్ని దానడ్డమై శూరుఁ డా! యేమి ఈ సేఁ త? యీసీత నీకేల నేనుండగా? లేరె యీయక్ష దేవాంగనల్? చాలరే వీరు? లీలావిలాసంబులం దేలఁ గా రాదె, రమ్మంచువారెల్లఁ గోపంబు చల్లార్చి యా రాక్షసుం దోడు కొంచేగి ర ట్లేగ సీతాసతిం గాచు ఘోరాస్యలౌ రాక్షసస్త్రీలు తద్దేవినిం జూచి గర్జించి భర్జించి, తర్జించి కర్జంబుగా నెన్నియో దారుణాలాపముల్ పల్కఁ గా వాని నా చానయున్ గడ్డిపోఁ చంబలెం జూచె, నా యింతి స్థైర్యంబు నారక్కెసల్ గ్రక్కునం బోయి దేవారికిం జెప్పి యా యంగనన్ లొంగఁ గాఁ జేయ దుస్సాధమం చెంచి యందంద నిద్రించిరా మైథిలీ దేవియున్ రామ! రామా! యటం చేడ్చుచుండం ద్రిజాటాఖ్య దా నిద్దురన్ లేచి రక్షస్సతీసంఘముం గాంచి మీరేటికే జానకిం జూచి బక్షింతుమా తిందుమా యంచుఁ దర్జింపగా? మ్రింగుడీ నన్ను మీరే, ధరాపుత్రి నాశంబు గా దెన్నఁ , డా యాజికిం గోడ లై రాము నిల్లాలు నౌ సాధ్వి మీచేతికా చిక్కెడిన్? దారుణమ్బైన స్వప్నంబునం దీ దశగ్రీవునాశంబు శ్రీరాము గెల్పుం గనుంగొంటి, మీ తర్జనల్ చాలు, మిమ్మెల్ల నీదేవి శ్రీరాముతోఁ  చెప్పి రక్షింపఁ  జాలున్, నమస్కారమాత్ర ప్రసన్నన్ గృపావాల, వే వేఁ డుకోరే, మదీయాశయం బిద్ది, నిక్కంబు దుఃఖంబులం బాపు నీదేవి, యో తల్లిరో! నీవ మాదిక్కు మా మ్రొక్కుఁ  గైకొంచు రక్షింపుమన్నన్ దయాలోల సీతామహాదేవి తా నెవ్వరిం గాచు, నన్నంత నా యింతియుం గాంతు జేతృత్వ మాలించి లోసిగ్గునం బల్కె, మీ మాట సత్యంబ యే నట్ల రక్షింతు నం చీ గతిం బల్క, నా కల్కి యాపద్దశం జూడ లేనైతి నాధైర్యమోవమ్ముగాఁ బోయె. నేనంత నాకాంతతో భాశణోపాయముం జక్క భావించి యిక్ష్వాకు వంశస్తవం బారఁ గా జేయ నామాట లాలించి యాదేవి కన్నీటితో వానరశ్రేశ్ఠ యెవ్వండవయ్యా! నినుం బంపె నెవ్వం డ దేలా య దేలాగునన్ వచ్చితీ విందు? నే విందుగా విందు, శ్రీరాముతోఁ జెల్మి నీ కెట్లు చేకూరె? భాషింపవే యన్న నా యన్నుతో విన్నపం బిట్లు నేఁ జేసితిన్, దేవి! నీ నాధు మిత్రుండు మిత్రాత్మజుండుండు సుగ్రీవనాముండు, నే నా మహాశూరుబంటన్ హనూమంతుఁ  డన్పేరివాడన్, నినుం గాన నా ఱేఁ డు శ్రీరాముఁ డంపెజుమీ, నీ కభిజ్ఞానమాత్మాంగుళీయంబు దా నిచ్చెఁ గైకొమ్ము, నా కిమ్ము నీవానతిన్, రామ సౌమిత్రులన్  డాయ ని న్గొంచు నేఁ బోయెదన్ వచ్చెదే? యన్న  నాగోలలన్ మిన్న యోయన్న శ్రీరాముడే రావణుం జంపి నన్గొంచుబో వత్తు నన్నన్ సతీ! నాకు జిత్తప్రమోదావహంబైన గుర్తేమియే నిచ్చెదే? యన్నఁ  గానిమ్మటం చింద మీ దివ్యచూడామణిం గొమ్ము, నా ప్రాణనాధుండు నిద్దాని వీక్షించినంతన్ నిజం బెచ్చుగా నిన్ను మన్నించు నం చిచ్చి తా వెండియుం గొన్ని సందేశవాక్యంబులం జెప్పె, నే నా సతీరత్నమున్ మ్రొక్కి నే నిందురాఁ  జూచుచుండంగఁ , దా వెండియున్ నన్ను వీక్షించి యో యంజనానందనా! యెట్లు వ్రాకుచ్చినన్ రామసౌమిత్రి సుగ్రీవు లిచ్చోటికిన్ వేగ రాఁ  జూతురో యట్లు భాశింపు, మిం కేను మాస ద్వయంబే చుమీమేనఁ  బ్రాణంబులం దాల్తు నీలోన శ్రీరామచంద్రుండు న న్జూడ రాఁ డాయెనా నాయనా! నే నా యనాథాకృతిం జత్తు, మీయిష్ట మం చన్న నాకన్నె దీనోక్తు లాలింపఁ గాఁ గింక యంకూర మెత్తెం జుఁ డీ, యంత గొండంత దేహంబుతో యుద్ధకాంక్షన్ వనంబెల్లఁ  జీకాకుగాఁ బీకి నిర్మూలముం జేయ యారద్దునన్ నిద్దురన్ లేచి యద్దైత్యకాంతల్ మదిన్ భీతి గొల్పంగ నల్దిక్కులం బాఱి యిం దారినిం జేరి యోవైరివిద్రావణా రావణా! క్రోతి యొక్కండు యుష్మన్నహాశూరతాజ్ఞాని దుష్టాత్ముఁ డై తోఁ టయెల్లన్ సపాటంబుగా నేలతో పాటు గావించె, నా క్రించు రప్పించి ఖండింపుమీ, యన్న నా రాక్షసుం డుగ్రులంగింక రాఖ్యాతశూలాయుధాశీతిసాహస్ర సఖ్యాకులం బంచె, నే లౌడిచేఁ  ద్రుంచితిన్ వారలం జావగా, దక్కియున్నట్టి దైత్యుల్ వెసంబారిదేవారితోఁ జెప్పి, రే నింతలో నూర కేలుండగా నంచుఁ దోఁ పంగ నాచైత్య ప్రాసాదమున్ ధ్వస్తముం జేసి యచ్చోటిరక్షస్తతిన్ స్తంభఘాతంబులం గూల్చితిన్ నూర్వురన్, వచ్చెఁ  దా నంతలోనం బ్రహస్తాత్మసంభూతుఁ డౌ జంబుమాల్యాఖ్య విఖ్యాత శూరుండు ఘోరాసురవ్యూహసం యుక్తుఁ డై, వాని సేనాసమేతంబుగా లౌణిచేఁ  జంపితిం, బిమ్మటం బంచె నాపై మహామాత్ర పుత్రాష్టకం బేను నద్దాననే వారిఁ గాలాలయావాసులం జేసితిం, బంచసంఖ్యాకసేనాను లుద్దండత న్వెండి పై రా విదారించితిన్ సేనతో, వెన్క  నప్పంక్తి కంఠాత్మజుం డక్షుఁ డన్వాఁ డు సైన్యంబుతో వచ్చె, నే నా కుమారున్ మహావీరు మందోదరీసూనునిన్ మింటికిన్వాఁ డు లంఘించుచోఁ గాళ్ళు లీలన్ బిగంబట్టి గి ర్గిఱ్ఱునన్ నూఱు మాఱుల్ వడిం ద్రిప్పి పెన్ముద్దగా జేసి ధాత్రీస్థలి న్మోఁ దితిన్, వానిపా టా దశాస్యుండు నాలించి వేరొడు పుత్రున్ మహాగాత్రునిన్, శక్రజిం బంపె; నవ్వాని నవ్వాహినిం గూడఁ  దేజం బఱంజేసి మోదించితిన్, వాడు నన్గెల్చున న్నమ్మకం బూనిరక్షోవిభుం డంపె, నన్నెట్టులుం గెల్వరాదంచు నూహించి వాఁ డంత బ్రహ్మాస్త్రపాశంబులన్ నన్ను బంధించె, రక్షోవరుల్ త్రాళ్లతో నన్ను బంధించి కొంపోయి దైత్యేశు మ్రోలన్ నిలంబెట్ట వాఁ డుగ్రుఁ డై యేలరా వచ్చితీలంక! కీ వేలరా చంపితా సోఁ కులం? జెప్పరా యన్న సీతార్ధ మై సర్వముం జేసితిన్, నిన్నుఁ జూడంగ నీయింటికిన్ వచ్చితిన్ రాక్షసేంద్రా! హనూమంతు డన్వాఁ డ, నేఁ బావమానిన్ రఘూత్తంసుఁ డౌ రామదూతుండ, సుగ్రీవు మంత్రిన్, ననుంబంప రాముండు నీయొద్దకు న్వచ్చితిన్ దూతనై, సూర్యపుత్రుండు నీ సేమముం ప్రశ్న గావించె, ధర్మార్ధకామానుషక్తంబు పథ్యంబు వాక్యంబు నీకున్ వచించెంజుమీ, ఋశ్యమూకంబునన్ రాముతో మైత్రిఁ  గావించి యున్నాఁ డు, తద్వీరు వాక్యంబు లాలింపుమా, రామదేవుండు దేవారి నా నారినిన్ మ్రుచ్చిలించెన్ వనీభూమి, నీవిందు సాహాయ్యముం జేయుమా, యంచు నన్వేఁ డ నే నట్టులే చేయుదుంగాని యవ్వాలినిం జంపఁ గా బాసఁ  గావింపు మీ యంటి, సూర్యాన్వయుండట్లు గావించి యవ్వాలినిన్ బాణమొక్కంటనే చంపి కీశాధిపత్యంబు నా కిచ్చె, నే హవ్యభుక్సాక్షికంబైన స్నేహంబు గావించితిన్, రామసాహాయ్య మే నెట్టులుం జేయుదున్, జానకీదేవి శ్రీరామభూనేత కి మ్మీయకున్నంత వీరుల్ వనాటుల్ భవచ్ఛౌర్య నిర్మూలనం బెట్లుఁ  గావింతు, రెవ్వారు! మావారి శౌర్యంబు లోకంబునం గానరో? పోవరో మున్ను దేవాళికిం దోడుగా? నంచు నీతో వచింపన్ ననుం బంచె నన్నన్ రుషాశోణితం బైన నేత్రంబులం జూఁ డున ట్లుగ్రతం జూచి నా విక్రమం బా దురాత్ముం డవిజ్ఞాతుడై యంత నన్ జంప నాజ్ఞప్తి గావింపగా వానితమ్ముండు ధీశాలి రక్షోవరు న్నానిమిత్తంబుగా వేఁ డె నో సోఁ కు ఱేఁ డా! కనన్ రాజశాస్త్రవ్యపేతంబు నీ యాజ్ఞ శాస్త్రంబునం దూత వధ్యుండుగాఁ , డిచ్చమైఁ  దథ్యముం బథ్యముం బల్కు వాఁ డెట్టి నేరంబు  గావించినన్ రూపుమార్పన్ వికారంబుగాఁ  జెల్లుగా, కెప్పుడుం జంపగా రా దనం, దోఁ కఁ గాల్పంగఁ  బంచెన్ దశాస్యుండు, రక్షోవరుల్ వాల్క వారంబులన్ జీర్ణ కార్పాసవస్త్రంబులం దోఁ కకుం జుట్టి నన్ గట్టెలం గొట్టుచున్, గింకచే దిట్టుచున్, బైపయిన్ ఱొప్పుచుం, వీథులం ద్రిప్పుచున్, బోవ సంక్షిప్తగాత్రుండనైతట్టులండుల్చి నే వెండియున్ ఘోరరూపంబుఁ  గైకొంచుఁ  బెన్ లౌడిచే వారలం జంప ద్వారంబునన్ జేరి లంకాపురిం గొంప లన్నింటికిం జిచ్చు సంధించి యామంటలో సీతయుం ద్రుంగెనో? పోయెఁ గా పట్టనం బంతయుం బాడుగాఁ, దన్విమాత్రంబు దా నెట్లు జీవించెడిన్? రామకార్యంబు నిర్మూలముం జేసితిన్ బుధ్ధిహీనుండనై యంచు శోకించుచున్ సీత భద్రంబ యం చంభ్రమార్గంబునం జారణుల్ పల్కనాలించి భావించి సర్వంబునుం గాల్చు నా యాశ్రయాశుండు నాతోఁ క గాల్పండ, నా చిత్తమా సంప్రహృష్టంబు, సౌరభ్య సంభారుఁ డై గంధవాహుండు నున్ వీచె, సీతామహాదేవి నావీతిహోత్రుండు దాఁ  గాల్పఁ గానోపు? నంచాత్మ మోదించి యా యించుబోణిన్ మఱిం గాంచి నే నామెకుం జెప్పి తత్రస్థమౌ నా యరిష్టంబుపై నెక్కి మిమ్మెల్ల దర్శించు పెన్మక్కువన్ గ్రక్కునన్ వారిధిం దాఁ టి చంద్రార్కసంసేవితంబైన మార్గంబునన్ వచ్చితిన్, మిమ్ముఁ గన్గొంటి, శ్రీరామచంద్ర ప్రభావంబునన్ యుష్మదీయోరుతేజంబునన్ నేను సుగ్రీవు కార్యంబు నీమట్టు గావించితిన్ లంకలో, నింకఁ  గాఁ గల్గు కార్యం బవార్యంబుగాఁ  జేయ మీరెల్లరున్నారుగా.

(హనుమంతుడు సముద్రం దాటి లంకకు పోయి సీతను చూసి, సంభాషించి, మరలి వచ్చే ముందర లంకాదహనం చేసి, తిరిగి వచ్చి తన వానర మిత్రులను కలిసేంత వరకూ జరిగిన సుందరకాండ వృత్తాంతం ఇది. ఇంతవరకూ జరిగిన సుందరకాండంతా ఇందులో వుంది. ఇందులోని విషయమంతా హనుమంతుడు వక్తగా, సంగ్రహంగా వానర మిత్రులకు చెప్పాడు. ఇది చదివి ఇక ముందుకు సాగితే సుందరకాండ అంతా చదివినట్లే కద! మహాద్భుతమైన, రసరమ్య రంజితమైన శ్రీవాసుదాసస్వామి శ్రీ లేఖిని నుండి జాలువారిన ఈ దండకం సర్వదోషహారం. సర్వ క్లేశ నివారణం. శ్రీరామానుగ్రహ ప్రసాద కారణం)


Saturday, October 20, 2018

సీతారామలక్ష్మణుల వృత్తాంతం ఖరుడికి చెప్పిన శూర్పణఖ .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-31 : వనం జ్వాలా నరసింహారావు


సీతారామలక్ష్మణుల వృత్తాంతం ఖరుడికి చెప్పిన శూర్పణఖ
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-31
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (21-10-2018)

           దేహమంతా నెత్తురుతో తడిసి నేలమీద పడి, వికార రూపంతో ఏడుస్తున్న శూర్పనఖను చూసి ఖరుడు ఇలా అన్నాడు. “ఎవరినీ తరుమకుండా, బెదిరించకుండా, బుసకొట్టకుండా, తనంతట తాను బుట్టలో కదలకుండా వుండే మహా భయంకర, విషంకల నల్ల త్రాచుపామును ఎవడు వేలితో పొడిచాడు? ఎవడీ విషం తాగింది? ఎవడు తనంతట తానే మృత్యుపాశాన్ని తన కంఠానికి తగిలించి బిగించుకున్నాడు? చెప్పు. నేనిప్పుడే వేగంగా పోయి వాడిని చంపి నెత్తురు తాగుతా. నువ్వు బలం, పరాక్రమం విశేషంగా వున్నదానివి. కాబట్టి సామాన్య బలవంతులు నిన్ను పరాభవం చేయలేరు. నువ్వు కోరిన చోట, కోరిన రూపంతో తిరగగలిగే దానివి. నిన్ను అడ్డగించగలవారు లేరు. అలాంటి నిన్ను ఎవడే దీర్ఘకాలం బతకడానికి ఇష్టపడక ఇలాంటి కష్టాల పాలు చేశాడు? దేవతలలో కాని, గంధర్వులలో కాని, పరమర్షులలో కాని, దౌర్జన్యంగా ఇలాంటి పెద్ద అపకారం చేయడానికి తెగించిన వాడు ఎవడో చెప్పు. వాడిని చంపుతా”.

“దేవతలలో బాకాసురుడిని చంపిన వేయికళ్ల ఇంద్రుడైనా, నాకు అప్రియమైన పని చేయడానికి భయపడతాడు. మరి ఎవరు నాకు ఈ విధమైన అప్రియమైన పనిచేశాడు? నీళ్లలో వున్నా పాలను హంస తాగినట్లు శీఘ్రంగా ఇదిగో, ఇప్పుడే నా బాణాలతో అతడి భూమిని కూల్చి, వాడి ప్రాణ వాయువులు తాగుతా. అయ్యో! నా ముద్దుల అక్కా! యుద్ధ భూమిలో ఎవడిని చంపి వాడి నెత్తురును నురుగుతో సహా, నా బాణాలు తాగాలని కోరుకుంటున్నావు? నా పదునైన బాణాలతో చీల్చబడిన ఎవడు గద్దల్లాంటి పక్షిజాతికి ఆహారంగా కావాలని కోరుకుంటున్నావు? ముద్దు-ముద్దుగా ముక్కర పెట్టుకోకుండా ఎవడు నిన్నిలా బాధ పెట్టాడు? అలాంటి వారిని రక్షించడానికి దేవతలు సమర్ధులు కారు. రాక్షసులూ కారు. నా బాణాల దెబ్బలకు వాడికి చావు తధ్యం. కాబట్టి బడలిక తీర్చుకొని నిన్నీ ప్రకారం చేసిన వాడి గుర్తులు చెప్పు”. అని ఖరుడు అడగ్గా, తోడ బుట్టిన వాడి మాటలు విని విస్తారంగా కన్నీళ్లు కాల్వలుగా కారుతుంటే, ఈ విధంగా చెప్పింది శూర్పణఖ.

         “నన్నీ ప్రకారం చేసింది ఎవరని అంటావా? చెప్తా విను రాక్షసుడా! వారు యౌవనవంతులు. చక్కటివారు. మునుల వేషంలో వున్నారు. కోమల దేహం కలవారు. మహాబల సంపన్నులు. వికసించిన తామర పూల లాంటి కళ్లున్న వారు. నార చీరెలు, కృష్ణాజినం వస్త్రాలుగా వున్న వారు. అడవిలో లభించే పళ్ళు తింటారు. ఇంద్రియ నిగ్రహం కలవారు. ధర్మ మార్గంలో వుండేవారు. అన్నదమ్ములు వాళ్ళు. దశరథరాజ కుమారులు....శ్రీరామలక్ష్మణులు అనే పేర్లు కలవారు”.

         (తనను విరూపను చేసినవారెవరు? అని ఖరుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా శూర్పణఖ దశరథ రాజకుమారులు శ్రీరామలక్ష్మణులు అని చెప్పే బదులు, వారి సౌందర్యాన్ని ఎందుకు వర్ణించాలి? ఆమెలో కామం విఘ్నమై కోపంగా మారిందేకాని, కామం చావలేదు. వైరాగ్యం ఇంకా పుట్టలేదు. గాఢంగా శ్రీరామలక్ష్మణ రూపాలలో మనస్సు నాటుకొని వుండడం వల్ల, వారి మూర్తులే దానికి కళ్ళ ఎదుట కనపడుతున్నాయి. అలా కామమోహిత అయినందువల్ల దాన్ని నిగ్రహించుకోలేక తమ్ముడి ఎదుట ఆ భావాన్నే బయట పెట్టింది. “కామాతురాణాం నభయం నలజ్జా” అనే నానుడి వుంది. అంటే, కామాతురులకు భయం, సిగ్గు వుండదు. ఈ కారణం వల్లే రామలక్ష్మణుల సౌందర్య వర్ణన చేసింది శూర్పణఖ. ఇలా చేయడం స్త్రీ అయిన శూర్పణఖ గొప్ప కాదు. శ్రీరామచంద్రమూర్తిని చూసిన వారందరూ, అనుకూలమైనా, ప్రతికూలమైనా ఇలానే మాట్లాడుతారు).


         శూర్పణఖ తన జవాబును కొనసాగిస్తూ...”తాము దశరథ రాజకుమారులమని చెప్పారేకాని, వారి తేజస్సు చూస్తే, వాళ్ల మాట నమ్మడం కష్టంగా వుంది. అయినా, వారు అసత్యమాడేవారిలాగా లేరు. కాబట్టి వారి మాట ప్రకారం వాళ్లు మనుష్యులో, నా ఆభిప్రాయం ప్రకారం దేవతలో చెప్పలేను. చూడడానికి రాజచిహ్నాలున్నా గంధర్వరాజుతో సమానంగా వున్నారు. ఆ ఇద్దరిమధ్య ప్రాయంలో వున్నా ఒక పడుచును, సమస్తాభరణాలు ధరించిన దానిని, సన్నటి నడుముకల దానిని, తామర రేకుల్లాంటి కళ్లున్న దానిని చూశాను. అలాంటి సుందరిని నేనింతవరకు చూడలేదు. ఆ పడుచుకోసం నన్ను వారిద్దరూ ఒక్కటై, రంకుటాలిలాగా దిక్కులేని దాన్ని చేసి దురవస్థల పాలు చేశారు” అని అంటుంది.

         శూర్పణఖ చెప్పిన మాటలు విన్న ఖరుడు కోపంతో క్రూరులు, యముడితో సమానమైన వారు, అయిన పద్నాలుగురు రాక్షసులను చూసి, “దండకారణ్యంలో ఒక చెడునడవడి కల ఆడదానితో ఇద్దరు మనుష్యులు, కోదండ ధరులు, కృష్ణాజినం కట్టినవారున్నారు. వారిని చంపితె, ఆ నెత్తురు తాగాలని మా అక్క కోరుతున్నది. కాబట్టి మీరు మా అక్క కోరిక నెరవేర్చండి” అని అనగానే, శూర్పణఖ దారి చూపిస్తుంటే, దండకారణ్యానికి పోయారు వాళ్ళు. మేఘాల్లాగా వచ్చిన వారంతా సీతతో కూడి ఆశ్రమంలో కూర్చున్న తేజోవంతులైన అన్నదమ్ములను శూర్పణఖ చూపించగా చూశారు. శ్రీరామచంద్రమూర్తి రాక్షసులతో వచ్చిన శూర్పణఖను చూసి కోపంతో లక్ష్మణుడితో ఇలా అన్నాడు. “లక్ష్మణా! కాసేపు నువ్వు సీతను రక్షిస్తూ వుండు ఇక్కడే. వీళ్ళను చంపి నేను వస్తా” అని అనగా లక్ష్మణుడు అంగీకరించాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి విల్లెక్కుపెట్టి, బాణాలు తీసుకొని, రాక్షసులను చూసి ఇలా అన్నాడు.

         “ఓ రాక్షసులారా! మీము అన్నదమ్ములం. రామలక్ష్మణులు అంటారు. ప్రసిద్ధుడైన దశరథ మహారాజు కొడుకులం. దండకారణ్యంలో ఈ సీతతో సంచారం చేయడానికి వచ్చాం. కందమూలాలు తింటాం. తపస్సు చేసుకుంటాం. ధర్మం అంటే ఆసక్తి కలవాళ్ళం. ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళం. కాబట్టి మావల్ల ఎవరికీ ఏ కీడు జరగదు. మా ఇష్టప్రకారం మేం సర్వజన సాధారణమైన దండకలో నివసిస్తాం. మీ ఇళ్లకు ఎప్పుడూ రాలేదు. మిమ్మల్ని బాధపెట్టలేదు. ఇలాంటి మామీద నిష్కారణంగా మీరెందుకు కోపంతో ఇక్కడికి వచ్చారు? ఇంత దండకారణ్యం వుందికదా? ఎక్కడికైనా పోకూడదా అని అంటారేమో? మునుల ఆజ్ఞతో దుష్టవర్తనులైన రాక్షసులను యుద్ధంలో చంపడానికి వచ్చాం. మీకు ధైర్యం వుంటే నిలిచి యుద్ధం చేయండి. బతకాలనుకుంటే పారిపోండి....మిమ్మల్ని బాధించను”.

         శ్రీరాముడి మాటలకు ఆ పద్నాలుగు మంది రాక్షసులు కోపంతో చేతిలో పదునైన బాణాలు పట్టుకొని, “రామా! మేం వచ్చిన పని చెప్తాం విను. పూర్ణ పరాక్రమవంతుడైన మా ఖర మహారాజుకు మీరు కోపం కలిగించారు. అలాంటప్పుడు శరీరంతో ఎలా వుంటారు? ఎక్కడికి పోతారు? మరణించాల్సిన వారే. ఇక్కడికి వచ్చిన మా పద్నాలుగు మంది రాక్షసుల ఎదుట ఒంటరిగా నిలువగలవా? నీకది సాధ్యమా? అది అసాధ్యమైనప్పుడు మమ్మల్ని ఎదిరించి యుద్ధం చేయడం కూడా అసాధ్యమే” అని అన్నారు.

         తాము ప్రయోగించే బాణాలు గుదియలు, శూలాలు అనీ, అవి రాముడిని తాకగానే ఆయన తన వీర్యం, విల్లు, బాణాలు అన్నీ వదులుతాడనీ, అని అంటూ ఆ పద్నాలుగు మంది రాక్షసులు ఒక్కసారిగా సూలాలను రాముడిమీదకు విసిరారు. శ్రీరామచంద్రుడు తన బంగారు చెక్కడపు బాణాలతో వాటన్నిటినీ చిన్నచిన్న తునకలుగా చేసి, నేలరాలకొట్టాడు. అంతటితో ఆగితే ప్రమాదమని భావించి వారిమీద పదునైన పిడుగులుకల పద్నాలుగు బాణాలను ప్రయోగించాడు శ్రీరాముడు. అవి వాళ్ల రొమ్ముల్లో దూరి వీపులోంచి బయటకు వచ్చి నేలమీద పడ్డాయి. ఆ రాక్షసాధములు వేళ్ళు తెగిన చెట్లలాగా నెత్తురుతో తడిసి, దేహాలతో ప్రాణాలు పోయినవారై, భూమ్మీద పడ్డారు. అది చూసి శూర్పణఖ పరుగెత్తింది.

Thursday, October 18, 2018

ఇల్లెందు నుండి ఖమ్మం బదిలీ..ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు..బీఎల్లెస్సీ లో సీటు....జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు: వనం జ్వాలా నరసింహారావు


జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు
ఇల్లెందు నుండి ఖమ్మం బదిలీ..ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు..బీఎల్లెస్సీలో సీటు
వనం జ్వాలా నరసింహారావు
          ఇల్లెందు జూనియర్ కళాశాలలో గ్రాడ్యుయేట్ లైబ్రేరియన్ గా చేరాను ఆగస్ట్ 1971 సంవత్సరంలో. ఖమ్మంలో కాపురం. ప్రతిరోజూ ఉదయమే బయల్దేరి, ఆర్టీసీ బస్సులో 30 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇల్లెందు పోవడం, కాలేజీ అయిపోయినతరువాత మళ్లీ తిరుగు ప్రయాణం చేయడం నిత్యకృత్యమయిపోయింది. బస్సు చార్జీ ఆ రోజుల్లో రానూ-పోనూ నాలుగైదు రూపాయలే వుండేది. అంటే, నెలకు నా జీతంలో మూడో వంతు బస్సు ప్రయానానికే అయ్యేది. ఉదయం 7.30 కు బయల్దేరుతే, సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఒక్కోసారి ఏడు దాటేది. మొదట్లో అలసట అనిపించేది. కళాశాల ప్రిన్సిపాల్ గా కృష్ణమూర్తి గారు, వైస్ ప్రిన్సిపాల్ గా పీ కృష్ణయ్య వుండేవారు. పీ కృష్ణయ్య ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వర్ రావు గారి సోదరుడు. ప్రిన్సిపాల్ కు ఒక మోటార్ సైకిల్ వుండేది. ఆయన దానిమీదే రోజూ ఖమ్మం నుండి వచ్చి పోయేవాడు. సాధారణంగా ఆయన మధ్యాహ్నం నుంచే వెళ్ళిపోయేవారు. ప్రిన్సిపాల్ కాబట్టి ఆయన మాటకు ఎవరూ ఎదురు చెప్పలేక పోయేవారు. నేను కూడా మధ్యాహ్నం క్లాసులు లేకపోతే ముందుగా వెళ్లే ప్రయత్నం చేసేవాడిని కాని, వైస్ ప్రిన్సిపాల్ అంత సులభంగా అనుమతి ఇచ్చేవాడు కాదు. ఒక్కోసారి అంగీకరించేవాడు.

నేను చిన్నగా ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి గారితో స్నేహం చేసుకుని, ఆయనతో, ఆయన వెళ్లినప్పుడల్లా వెళ్లడం ప్రారంభించాను. కొన్నాళ్ళకు ఆయనతో రావడం, పోవడం కూడా జరిగింది. ఆ విధంగా ఇంటికి త్వరగా చేరుకోగలిగే వాడిని, ఆలస్యంగా ఇంట్లో బయల్దేరే వాడిని. అప్పుడు లీటర్ పెట్రోల్ ధర రెండు-మూడు రూపాయలలోపే. కృష్ణమూర్తి గారికి నేను భారం కాకూడదని భావించి ఒక ట్రిప్పుకు నేను పెట్రోల్ పోయించేవాడిని. మొత్తం మీద అలా నాలుగైదు నెలలు గడిచాయి. అనుకున్న ప్రకారం, నాకు డీయీఓ షాజాహానాబేగం ఇచ్చిన మాట ప్రకారం, సూపరింటెండెంట్ సంపత రావు, క్లార్క్ బారు సీతారామరావుల సహాయంతో, మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కింద ఖమ్మం శాంతినగర్ మల్టీ పర్పస్ హైస్కూల్ కం జూనియర్ కాలేజీకి బదిలీ అయి వచ్చాను. అక్కడ పనిచేస్తున్న ఆదిరాజు సుబ్బారావును మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కు ఒప్పించారు సూపరింటెండెంట్ సంపత రావు, క్లార్క్ సీతారామరావులు.

నేను పనిచేసిన రోజుల్లో శాంతినగర్ హైస్కూల్-కం-జూనియర్ కాలేజీ హెడ్ మాస్టర్లుగా కొన్నాళ్ళు హెచ్ వీ శర్మ, కొన్నాళ్ళు టీవీ రాజయ్య, కొన్నాళ్ళు ఓవీ చలపతిరావు వుండేవారు. ఉపాధ్యాయులుగా దుర్గామహేశ్వర్ రావు, వెంకట్రావు, జక్కా సత్యం మొదలైన వాళ్ళుండేవారు. అంతా సరదాగే గడిచేది. అక్కడి లైబ్రరీ అత్యంత పురాతనమైన లైబ్రరీ. ఎప్పుడో మాంధాతల కాలం నాటి పుస్తకాలుండేవి. బహుశా అత్యంత విలువైన పాతకాలం నాటి పుస్తకాలు ఆ లైబ్రరీలో లభ్యమయ్యేవి. నేను అప్పటికింకా లైబ్రరీ సైన్స్ చదవలేదు కాబట్టి, శాస్త్రీయ పద్ధతిలో కాకుండా, నా ఊహ ప్రకారమే వాటన్నింటినీ ఒక క్రమంలో మొట్టమొదటి సారిగా అమర్చాను. ఇవి కాక లైబ్రరీలో పాఠ్య పుస్తకాలు కూడా వుండేవి. వాతి పంపిణీ బాధ్యత కూడా నాదే. మొత్తం మీద ఏదోలా నెట్టుకొచ్చాను. ఇంటి నుండి సైకిల్ మీద స్కూల్ కు వెళ్లివచ్చేవాడిని. మధ్యాహ్నం భోజనం సాధారణంగా తీసుకుపోయేవాడిని, లేదా, ఇంటికి వచ్చి తిని పోయేవాడిని. రానూ-పోనూ పెద్దగా టైం పట్టకపోయేది.

అవి జై ఆంధ్ర ఉద్యమం ఉదృతంగా వున్నా రోజులు. ముల్కీ నియామకాలు రాజ్యంగ విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో 1969 లో స్వర్గీయ డాక్టర్ మర్రిచెన్నారెడ్డి సారధ్యంలో మొదటి సారి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బ్రహ్మాండంగా కొనసాగింది. అయితే 1972లో మరోకేసులో గతంలో ఇచ్చిన తీర్పును చెల్లుబాటు కాకుండా ముల్కీ నిబంధనలను అమలు చేయాలని అత్యున్నత న్యాస్థానం ఇచ్చిన తీర్పు పర్యవసానమే జై ఆంధ్ర పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం. విద్యార్థులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. శాసనసభ స్పీకరు బి.వి.సుబ్బారెడ్డి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్యధిక మంత్రులు రాజీనామా చేసారు. జై ఆంధ్ర ఉద్యమంలో కాకాని వెంకటరత్నం కీలకంగా వ్యవహరించి మంత్రిపదవికి కూడా రాజీనామా చేశారు. 1972డిసెంబరు 25 గుండెపోటుతో మరణించినప్పుడు జై ఆంధ్ర కోసమే మరణించాడని అనేవారు.

ఉద్యమం హింసాత్మకంగా జరిగింది. సమైక్యవాదులపై దాడులు కూడా జరిగాయి. జనవరి 10, 1973 న కాంగ్రెసు పార్టీ తమ ముఖ్యమంత్రిపి.వి.నరసింహారావు చేత రాజీనామా చేయించి రాష్ట్రపతి పాలన విధించింది. ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం దృఢంగా వ్యవహరించింది. ఉద్యమం ఆపివేయడానికి ఆరు సూత్రాల పథకాన్ని ప్రతిపాదించింది. 1973 డిసెంబర్లో పార్లమెంటు ఈ ప్రణాళికను రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చింది. కేంద్రం రాష్ట్రపతి పాలన తొలగించి జలగం వెంగళరావు నాయకత్వంలో తిరిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసింది. జై ఆంధ్ర ఉద్యమానికి నిరసనగా ఇటు తెలంగాణాలోనూ ఉద్యమం జరుగుతుండేది.

అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణాలో వేర్వేరు కారణాల వల్ల ఉద్యమాలు సాగుతుంటే ప్రతిరోజూ శాంతినగర్ హైస్కూల్ దాదాపు పనిచేసేది కాదు. విద్యార్థులు స్కూల్ కువచ్చేవారు కాదు. ఉపాధ్యాయులం వెళ్ళాక తప్పేది కాదు. ఉదయం నుండి సాయంత్రం వరకు కబుర్లు, కాలక్షేపం చేసి ఇంటికి చేరుకునే వాళ్ళం.

సరిగ్గా అప్పుడే, ఆ రోజుల్లోనే డీఇఓ షాజహానా బేగం ప్రోత్సాహంతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఎల్ఎస్సీ (లైబ్రరీ సైన్స్) కోర్సులో ఇన్ సర్వీస్ అభ్యర్థిగా చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించాను. నన్ను ఆమె అప్పట్లో విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ గా వున్న స్వర్గీయ ఐవీ చలపతిరావు దగ్గరకు తీసుకుపోయి నన్ను పరిచయం చేసి నాకు ఇన్ సర్వీస్ అభ్యర్థిగా బీఎల్ఎస్సీ లో చేరడానికి అనుమతి ఇవ్వమని నా పక్షాన అభ్యర్థించింది. ఆమె అభ్యర్ధనను ఆయన తోప్సిపుచ్చారు. ఆ విధంగా నాకు 1972-1973 బాచ్ లో సీటు దొరకలేదు. అయినా నా ప్రయత్నం మానలేదు. మరుసటి సంవత్సరం ఖమ్మం జిల్లా విద్యాశాఖాధికారిగా షాజహానా బేగం స్థానంలో శ్రీమతి శ్రీకంఠం వచ్చారు. ఆమె మా ఆవిడ సోదరుడు (మా బావ గారు) డాక్టర్ ఏపీ రంగారావుకు స్నేహితురాలు. తిరిగి ఆమె ద్వారా “థ్రు ప్రాపర్ చానెల్” బీఎలెస్సీ సీటు కొరకు మళ్లీ విద్యాశాఖ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నాను. వాళ్లు ఈ సారి దాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఫార్వార్డ్ చేశారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ మొత్తం మీద సీటు దొరికింది. అలా దొరకడానికి నాకు సహాయ పడ్డవారిలో ముందువరుసలో స్వర్గీయ బొమ్మకంటి సత్యనారాయణ రావు గారు, అప్పట్లో తాత్కాలిక వైస్ చాన్స్లర్ గా వ్యవహరించిన స్వర్గీయ దేవులపల్లి రామానుజరావు, అప్పటి రాష్ట్ర మంత్రి స్వర్గీయ అక్కిరాజు వాసుదేవరావు, విశ్వవిద్యాలయ విద్యార్ధి నాయకులు శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి, ప్రభాకర్ తదితరులు వున్నారు.
ఆ విధంగా మళ్లీ 1973-74 బాచ్ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి అయ్యాను.