Saturday, June 30, 2018

శరభంగాశ్రమంలో శ్రీరాముడికి కష్ఠాలు చెప్పి శరణు వేడిన మునీంద్రులు....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-15:వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-15
శరభంగాశ్రమంలో శ్రీరాముడికి కష్ఠాలు చెప్పి శరణు వేడిన మునీంద్రులు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (01-07-2018)
భయంతో-శోకంతో ఖిన్నురాలై వున్న సీతాదేవిని ఓదార్చిన శ్రీరాముడు, తమ్ముడు లక్ష్మణిడితో శరభంగాశ్రమానికి పోవడానికి దారి బాగు చేయమని అంటాడు. అక్కడికి పోయి మహాత్ముడైన వాడిని, దేవ-గంధర్వులు, సిద్ధులు, గొప్ప ఋషులు స్తోత్రం చేసేవాడిని, విశేష బ్తహ్మ తేజస్సు గల శరభంగుండితో సంభాషిస్తున్న ఇంద్రుడిని చూశారు సీతారామలక్ష్మణులు. అప్పుడు లక్ష్మణుడితో శ్రీరాముడిలా అన్నాడు: "ప్రకాశిస్తున్న కాంతిగల ఇంద్రుడిని చూశవా? లక్ష్మణా నువ్విక్కడే సీత దగ్గర వుండు. ఆ ఇంద్రుడి వృత్తాంతం, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకొని వస్తా" అని ముని ఆశ్రమానికి చేరబోయాడు. శ్రీరాముడు రావడం చూసిన ఇంద్రుడు, శరభంగుండితో రహస్యంగా, శ్రీరామచంద్రుడు తనను చూడడానికి వస్తున్నాడనీ, ఆయన్ను తానిప్పుడు చూడకూడదనీ అంటాడు. శ్రీరాముడు చేయాల్సిన అసాధ్య కార్యం, రావణాధికం ముందున్నదనీ, అది చేయనివ్వాలనీ, అది ఇతరులు చేయలేనిదనీ, దాంట్లో విజయం సాధించిన తరువాత-కీర్తి పొందిన తరువాత, తానే ఆయన్ను సమీపించి సంభాషిస్తాననీ చెప్పి ఇంద్రుడు రఠం ఎక్కి ఆకాశానికి పోయాడు. అలా ఇంద్రుడు పోగానే, వెనక్కు తిరిగి వచ్చిన శ్రీరామచంద్రమూర్తి, సీతాలక్ష్మణులను కలిసి, వారితో సహా అగ్నిహోత్రంతో ప్రకాశిస్తున్న శరభంగ మహర్షిని భక్తితో సమీపించాడు. చేరి ఆయన పాదాలకు శిరస్సు వంచి మొక్కాడు. మొక్కి ముగ్గురూ నిలుచున్నారు. వారికి ఆసనానికి తగిన పీటలను అమర్చారు ముని. వారు కూర్చొనిన తరువాత, శ్రీరామచంద్రమూర్తి ఇంద్రుడు అక్కడకు రావడానికి కారణం ఏంటని శరభంగుండిని అడిగాడు. జవాబుగా శరభంగుండు ఇలా చెప్పాడు.

"రామచంద్ర దేవా! నేను తపస్సు చేసి క్షుద్రులు పొందలేని బ్రహ్మలోకాన్ని సంపాదించాను. అక్కడకు నన్ను పిలుచుకొని పోవడానికి ఇంద్రుడు ఇక్కడకు వచ్చాడు. ఆ బ్రహ్మలోకానికంటే కూడా ప్రియమై కోరాల్సిన నువ్వు అతిథిగా నా దగ్గరకు వస్తున్నావని తెలిసి, బ్రహ్మలోక ప్రాప్తికంటే కూడా నీ దర్శనం శ్రేష్ఠం కాబట్టి ఇంద్రుడితో పోవడానికి మనసొప్పలేదు. ఫలితంగా నీ దర్శన భాగ్యం కలిగింది. ఇక దేవతలు దర్శించే త్రిదివమునకు పోతాను. నేను తపస్సుతో సంపాదించినవన్నీ ఎప్పటికీ తరిగిపోనివి....పుణ్యలోకాలు కలిగిస్తాయి. నిన్ను దర్శించకుండా నేను బ్రహ్మలోకానికి పోతే ఎలా? స్వర్గలోకంలోని భోగస్థానాలను, బ్రహ్మలోకంలోని భోగస్థానాలను, సంపాదించడానికి నేను చేసిన పుణ్యమంతా నీకిస్తాను. గ్రహించు". అప్పుడు సకల శాస్త్రవేత్త అయిన శ్రీరామచంద్రమూర్తి ఇలా అన్నాడు: "మునీంద్రా! నీ పుణ్యాన్నంతా నేను తీసుకుంటా. మేముండడానికి నివాసయోగ్యమైన స్థలమేదో చెప్పు". జవాబుగా శరభంగుడిలా అన్నాడు: "మీరుండడానికి సరైన స్థలం సుతీక్ష్ణుడనే ముని చెప్తాడు. ఈ అడవిలోనే ఆయన వున్నాడు. రామచంద్రా! మీరు ఇక్కడనుండి తూర్పుగా పారుతున్న ఈ పుణ్యనదికి ఎదురెక్కి, పడమటగా పొండి. మధ్యలో పూల గుంపులు నదిలో కనిపిస్తాయి. అదే సరైన తోవ. రామచంద్రా! పోవద్దు. కాసేపుండు. శరీరాన్ని వదులుతా" అని అంటూనే తన శరీరాన్ని అగ్నిలో ప్రవేశింపచేశాడు. భస్మమైన శరభంగుడు మళ్లీ కుమారుడి రూపాన్ని దాల్చాడు. ఆ రూపంతో బయల్దేరి పోయి, పరబ్రహ్మ లోకంలో భగవన్మూర్తిని చూశాడు. ఆయన కూడా మునిని సుఖంగా వచ్చావా? అని అడిగాడు. సీతారామలక్ష్మణులు ముగ్గురూ ముని శక్తికి ఆశ్చర్యపడ్డారు.


శరభంగుడావిధంగా పరమపదం చేరగా, దివ్యతేజస్సుకల రామచంద్రమూర్తిని, అక్కడున్న ఋషులు కలిసి రక్షించమని వేడుకున్నారు. ఆత్మరక్షణ విషయంలో తాము సమర్థులం కామని, పరాధీనులమనీ, భగవంతుడొక్కడే ఆపద్భాంధవుడనీ భావించిన మునులు శరణాగత రక్షణే పరమ ధర్మమనే జ్ఞానం కల శ్రీరాముడిని రక్షించమని ఇలా వేడుకున్నారు."రఘువంశసత్తమా! పురుష రత్నమా! నీ అభిజాతత్వం శ్లాఘ్యమైంది. నిన్ను లోకులు పొగుడుతున్నారు. అరణ్యానికి రావడం వల్ల తండ్రి మీద భక్తి, భరతుడు అడిగినా ఒప్పుకోనందున సత్యవాక్కు మీద ప్రీతి, ధర్మం అంటే నిష్ఠ, నీలో సంపూర్ణంగా వున్నాయి. సీతావల్లభా! పరమాత్మ స్వరూపడవైన నిన్ను త్రికరణ శుద్ధిగా శరణు కోరుతున్నాం. నిన్ను మేమొక విషయం యాచిస్తాం. రామచంద్రమూర్తీ! మేమొక విన్నపం చేయదల్చాం. కోపగించుకోవద్దు. మేం కార్యార్థులమై వచ్చినందున, నీకు తెలిసినా-తెలియకున్నా చెప్పుకోవాల్సిన విధి మాది. చెప్పుకోలేదన్న లోపం మాలో వుండకూదదు. ప్రజాపాలనే రాజులకు ముఖ్యకార్యం కాబట్టి, మా విన్నపాన్ని ఆలకించు. ఏ రాజైతే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రజలను పాలిస్తాడో, ఆ రాజు, శాశ్వత కీర్తిని సంపాదించి బ్రహ్మలోకానికి పోయి అక్కడ బ్రహ్మతో గౌరవం పొందుతాడు. తపస్సు చేస్తున్న తాము ఆకులలాలు తింటూ కూడా, తమ కష్ఠ ఫలమైన తపస్సులో నాలుగో భాగం రాజుకు ఇవ్వడానికి కారణం అతడు ప్రజలను రక్షించడానికే కదా?”.

దుష్ఠుల పెట్టే బాధల వల్ల దుఃఖపడుతూ, బాధపడుతున్న వారిని రక్షించే సామర్థ్యం కల శ్రీరామచంద్రమూర్తీ! యథార్థం చెప్తున్నాం. విను. ఈ వానప్రస్థ సమూహాల్లో బ్రాహ్మణులు చాలామంది వున్నారు. కొద్దిమంది క్షత్రియ, వైశ్యులు కూడా వున్నారు. వీరంతా గొప్ప తపో మహిమవల్ల కీర్తిపొంది నువ్వే దిక్కని నమ్మారు. క్షత్రియులు, వైశ్యులు కూడా స్వశక్తితో తమ్ము కాపడుకునే శక్తి కలవారు కాదు. దుష్టులైన రాక్షసులు పెట్టే బాధలు సహించలేకపోతున్నారు. ఇక నువ్వు ఉపేక్షించ కూడదు. మామీద ప్రేమతో మాకు అభయం ఇవ్వు. మాకు భయం లేకుండా చేయి. శ్రీరామచంద్రా! రాక్షస సమూహాల వల్ల హింసించబడ్డ మునుల దేహాల నుండి వెడలిన ఎముకలు దూరంగా పడి వున్నాయి, మా వెంట రా...చూపిస్తాం. మందాకినీ తీరంలో పంపానది ఒడ్డున, చిత్రకూట పర్వతం దగ్గర నివసిస్తున్న ఋషులను రాక్షసులు బాధించి చంపుతున్నారు. మృత్యువును లక్ష్యపెట్తక తపస్సు చేసే మాకెందుకు మరణభీతి అంటావేమో? మాకుగా మేం దుఃఖించడం లేదు. సంసారాన్ని వదలి అడవులకు వచ్చి తపస్సు చేసుకుంటున్న మునిజనులకు కలుగుతున్న అపకారాన్ని చూసి మేం సహించ లేకపోతున్నాం. కాబట్టి నువ్వు రక్షించాలి. అమోఘబలవంతుడివి కాబట్టి నిన్ను రక్షించమని శరణుజొచ్చాం. మేం రాక్షసుల చేతిలో చావకుండా నీ దయాగుణంతో ఆలోచించి మమ్మల్ని కాపాడు. మమ్మల్ని కాపాడమని నిన్ను నిర్భందించం. నీ కళ్యాణగుణాలకు హాని రాకుండా కాపాడుకో. మేం అనన్యులం...కాబట్టే...నీ రక్షకత్వాన్ని కోరి, నువ్వెప్పుడు అవతరిస్తావా? ఎప్పుడు దర్శనమిస్తావా? ఎప్పుడు మమ్మల్ని కృతార్థులను చేసి రక్షిస్తావా? అను ఎదురుచూస్తున్నాం. నువ్వుతప్ప మాకు వేరే గతిలేదు. మా విషయంలో దయచూపాలా? వద్దా? అనే విషయం సీతాదేవిని అడిగి చూడు.

ఆత్మీయతకు మారు పేరు “ఆదిరాజు” : వనం జ్వాలా నరసింహారావు


ఆత్మీయతకు మారు పేరు “ఆదిరాజు”
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (30-06-2018)
“నాన్న గారు నిన్నరాత్రి 11.30 కు తుదిశ్వాస విడిచారు. మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు” అని ఆదిరాజు సత్యనారాయణరావు తన తండ్రి ఆదిరాజు వెంకటేశ్వర రావు మరణవార్తను మెసేజ్ ద్వారా జూన్ నెల 15 ఉదయం నాకు తెలియచేసినప్పుడు, క్షణకాలం నిర్ఘాంతపోయాను. “జాతస్య మరణం ధృవం” ... "పుట్టిన ప్రతి జీవి చావక మానదు" అనేది అందరికీ తెలిసిన విషయమే అయినా, ఆదిరాజు మరణ వార్తను జీర్ణించుకోవడం కష్టమైంది. సరే... ఆ తరువాత మామూలే. మా శ్రీమతితో కలిసి వాళ్ళింటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులతో కాసేపు గడిపి, ఆదిరాజు భౌతిక కాయానికి అంతిమ నివాళి సమర్పించి వచ్చాను. నేనక్కడ వున్నప్పుడే, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సీనియర్ పాత్రికేయుడు అమర్, వేణుగోపాల్, పౌరహక్కుల నాయకుదు వరవర రావు, అమర్ తమ్ముడు అజయ్, స్నేహితుడు భండారు శ్రీనివాస రావు తదితరులున్నారు.

         ఆదిరాజు ఇంట్లో కూచున్నప్పుడు, ఆ తరువాతా ఆయన స్మృతులే పదే-పదే గుర్తుకు వచ్చాయి. వయసులో నాకంటే పదేళ్లు పెద్దైన ఆదిరాజు వెంకటేశ్వర రావుతో నాకు సుమారు ఐదు దశాబ్దాలకు పైగా సన్నిహితమైన పరిచయం వుంది. మా ఇద్దరిదీ ఒక్కటే (ఖమ్మం) జిల్లా. దూరపు బంధుత్వం కూడా వుంది. పలువురు ఉమ్మడి స్నేహితులున్నారు. వాళ్లలో ఒకరైన డాక్టర్ అయితరాజు పాండు రంగారావు సరిగ్గా ఆదిరాజు మరణించడానికి రెండు నెలల క్రితం మరణించారు. నేను 1971 సంవత్సరంలో ఖమ్మం జిల్లా, ఆదిరాజు స్వగ్రామం పండితాపురంకు సమీపంలో వున్న ఎల్లెందు జూనియర్ కళాశాలలో గ్రాడ్యుఏట్ లైబ్రేరియన్ గా నా మొట్టమొదటి ఉద్యోగంలో చేరిన కొత్తలో, శాశ్వత జూనియర్ లెక్చరర్ ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్ కు వచ్చాను. అప్పుడు స్వర్గీయ భండారు పర్వతాలరావు ఒకానొక సందర్భంలో ఆదిరాజును మొదటిసారిగా పరిచయం చేశారు.

వాళ్లిద్దరూ కలిసి నన్ను అప్పటి విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు దగ్గరకు తీసుకుపోయి విషయం చెప్పగానే, నా అప్లికేషన్ మీద “తక్షణమే జూనియర్ లెక్చరర్ గా నియామకం చెయ్యాలి” అని విద్యాశాఖ డైరెక్టర్ (సుబ్బరాజు) ను ఆదేశిస్తూ సంతకం చేశారు. కాళ్ళకు చెప్పులు అరిగేట్లు విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం చుట్టు తిరిగాను కాని ఆ ఉద్యోగం మాత్రం రాలేదు. సుబ్బరాజు ఎవరి మాట లెక్కచేసేవాడు కాదు. ఈ విషయాన్ని నేను, ఆదిరాజు చాలా సార్లు సరదాగా ముచ్చటించుకొనే వాళ్ళం. ఆ సందర్భంలోనే ఒక సారి ఆదిరాజు అప్పట్లో పనిచేస్తుండే ఆంధ్రజ్యోతి కార్యాలయం (సెక్రెటేరియట్ ఎదురుగా మొదటి అంతస్తులో) లొ కలిశాను. అప్పుడు కూడా నా ఉద్యోగ విషయంలోనే. నా ఎదురుగానే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి పీవీ నరసింహారావుకు ఫోన్ చేసి నా సంగతి చెప్పారు. సహాయం చేయడానికి ఆదిరాజును మించిన వారెవరూ లేరనడానికి, ఆయన ఆత్మీయతకు ఇచి మచ్చు తునకలు మాత్రమే. 

         ఆ తరువాత మూడేళ్ళకు ఉద్యోగరీత్యా హైదరాబాద్ చేరుకున్న నాకు ఆదిరాజుతో సాన్నిహిత్యం పెరుక్కుంటూ పోయింది. అదే రోజుల్లో స్నేహితుడు-బంధువు భండారు శ్రీనివాస రావు ఆకాశవాణి విలేఖరిగా హైదరాబాద్ రావడం, మేం ముగ్గురం తరచూ కలవడం జరుగుతుండేది. ఎప్పుడూ సూటు-బూటు-టై, చేతి వేళ్ళ మధ్య సిగరెట్  విలాసంగా తిప్పుకుంటూ వుండే ఆదిరాజుతో ఒకసారి సచివాలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేశాం మేం ఇద్దరం. గేటువాడు క్షణకాలం ఆపాడు. అప్పటికింకా భండారుకు సచివాలయం పాస్ రాలేదనుకుంటా. నాకెలాగూ లేదు. ఆగ్రహోదగ్రుడైన ఆదిరాజును కన్నెత్తి చూడడానికి కూడా సాహసించని గేటువాడు సలాం కొట్టి మరీ మా ముగ్గురిని లోపలి పంపాడు. ఇక సచివాలయంలోని ప్రెస్ రూమ్ (ఇప్పుడు ఎపీకి కేటాయించిన భవన సముదాయంలోని హెరిటేజ్ బిల్డింగ్) లోకి ఆదిరాజు ప్రవేశించగానే అదోరకమైన భూకంపం వచ్చినట్లుందేది అక్కడ. గల-గలా మాట్లాడుకుంటూ, సిగరెట్ ను అలవోకగా ఆస్వాదిస్తూ, అందరినీ పలకరిస్తూ, ఎవరూ చెప్పలేని వార్తలను పదిమందితో పంచుకుంటూ, ఆయనున్నంత సేపు అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనేది. ఎప్పుడూ పదిమందిని కలుపుకు పోయే మనస్తత్వం ఆదిరాజుది.

         రాజ్ భవన్లో కుముద్ బెన్ జోషి గవర్నర్ గా, చంద్రమౌళి గవర్నర్ కార్యదర్శిగా వున్నప్పుడు, నేను అక్కడ పనిచేస్తున్న రోజుల్లో (1986-90 మధ్య కాలంలో) రాజీవ్ గాంధీ మీద (గాంధీ టు గాంధీ) ఆదిరాజు పుస్తకం రాస్తుండేవాడు. అప్పుడు పుస్తకాంశానికి సంబంధించిన పలు విషయాలను మాతో చర్చించే వాడు. ఎలెక్ట్రానిక్ టైప్ రైటర్లు అందుబాటులోకి అప్పుడేవచ్చాయి. రాజ్ భవన్లో కూడా ఒకటి వుండేది. గవర్నర్ పీఏ గా పనిచేస్తుండే శేషాచార్యులు, కార్యదర్శి పీఎ అప్పారావు, ఆ టైప్ రైటర్ మీద గాంధీ టు గాంధీ పుస్తకానికి సంబంధించిన కొన్ని పేజీలు  టైప్ చేసేవారు. గవర్నర్ కుముద్ బెన్ జోషీకి,  కార్యదర్శి చంద్రమౌళికి ఆదిరాజు అంటే  వాత్సల్యం. పుస్తకం పూర్తైన తరువాత, దానికి ఇండెక్స్ తయారుచేయడానికి గవర్నర్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్న స్వర్గీయ సంజీవ్ కుమారుడు చక్రవర్తి సహాయ పడ్డాడు. గాంధీ టు గాంధీ పుస్తకం ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో అప్పటి రాష్ట్రపతి జైలు సింగ్ ఆవిష్కరించినప్పుడు, ఆ కార్యక్రమానికి ఆదిరాజు నన్ను, భండారు శ్రీనివాస రావును ప్రత్యేకంగా ఆహ్వానించి హైదరాబాద్ నుండి ఢిల్లీ విమానంలో తీసుకెళ్ళాడు. పుస్తకావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అప్పట్లో అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి టీ అంజయ్య  కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. పుస్తకావిష్కరణ తరువాత ఆదిరాజు ప్రధాని రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు ఆయన కార్యాలయంలో ఆయన్ను కలుసుకున్నారు. నాకు తెల్సినంతవరకు, ప్రధాని చేస్తానన్న ఆర్ధిక సహాయాన్ని సున్నితంగా తిరస్కరించారు ఆదిరాజు.

నేను, భండారు శ్రీనివాస రావు మొట్టమొదటి సారి విమాన ప్రయాణం చేయడం ఆదిరాజు చలవ వల్లే. టంగుటూరి అంజయ్య ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, మేం ఇద్దరం ఒక రాచకార్యం మీద “ఏపీ ఎక్స్ ప్రెస్” లో ఢిల్లీ వెళ్లాం. ఏపీ భవన్లో బస. చేతిలో 24 గంటలూ వాహన సౌకర్యం. పోయిన పని మొదటి రోజే పూర్తికావడం జరిగింది. అప్పుడు ఆదిరాజు ఢిల్లీలో విలేఖరిగా పనిచేస్తున్నాడు. అధికార-అనధికార-ప్రయివేట్-ప్రభుత్వ ఉన్నత వ్యక్తులతో అపారమైన పరిచయం వుండేది ఆయనకు. మొదటి సారి మేం ఢిల్లీ వెళ్ళడం వల్లా, ఆయనకక్కడ తెలియంది లేనందువల్ల, ముగ్గురం కలిసి (వరప్రసాద్ అనే ఇందిరాగాంధీ వ్యక్తిగత లాయర్ కూడా వుండేవాడు మా వెంట) సరదాగా గడిపాం. మా ఇద్దరినీ ఆ ఇద్దరు ఎంతోమందికి (ప్రధాని ఇందిరాగాంధీతో సహా) పరిచయం చేశారు. పదిహేను రోజుల తరువాత తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. “ఫ్లై నౌ, పే లేటర్” (ఇప్పుడు విమాన ప్రయాణం చేయి....ఆ తరువాత చార్జీ చెల్లించు) అనే పథకం ఏమన్నా వుందా అని సరదాగా ఆదిరాజును అడిగాం. ఎప్పటిలాగే సూటూ-బూటూ-సిగరెట్ చేతిలో తిప్పుకుంటున్న ఆదిరాజు తన వెంట బయల్దేరమన్నాడు. ఇద్దర్నీ “చౌబే” అనే వ్యాపార వేత్త దగ్గరకు తీసుకెళ్లాడు. మా ఇద్దరినీ ఆకాశం అంత ఎత్తున వున్న వ్యక్తుల్లాగా ఆయనకు పరిచయం చేశాడు ఆదిరాజు. మేం అత్యవసరంగా హైదరాబాద్ పోవాలన్నాడు. మరుక్షణమే మా చేతుల్లో హైదరాబాద్ కు రెండు విమానం టికెట్లు వచ్చాయి. అప్పట్లో చార్జ్ కేవలం రు. 650 మాత్రమే. మా ఆనందానికి హద్దుల్లేవు. అలా మొదటిసారి విమానంలో, మాతోపాటు ఆయన తన స్వంత ఖర్చుతో, ప్రయాణం చేసి హైదరాబాద్ కు చేరుకున్నాం.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండో పర్యాయం ఉమ్మడి అంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి ముందు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కావడానికి తన వంతు ప్రయత్నం ఆయన చేస్తున్న రోజుల్లో, గవర్నర్ కుముద్ బెన్ జోషి దగ్గర పనిచేస్తున్న పాత్రికేయ మిత్రుడు పర్సా వెంకట్ నాకు ఆయన్ను పరిచయం చేశాడు. నా పరిచయాన్ని కొనసాగించుకుంటూనే, ఆయన పీసీసీ అధ్యక్షుడిగా కావడానికి ఎవరెవరి సహాయం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన నేను కూడా నా వంతుగా చేసినప్పుడు మదిలో ఆదిరాజు మెదిలాడు. అప్పుడు ఢిల్లీలో పాత్రికేయుడిగా మంచి పలుకుబడి సంపాదించుకున్న ఆదిరాజుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాయకులతో సన్నిహిత సంబంధాలుండేవి. ఆయన్ను చెన్నారెడ్డి దగ్గరకు ఒక సాయింత్రం తీసుకెళ్ళాను. అయితే అంతకు ముందు దాదాపు పది-పన్నెండేళ్లగా వారిద్దరి మధ్య సత్సంబంధాలు లేవు. 1978-80 మధ్యకాలంలో మొదటి సారి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో ఆయన మీద కాంగ్రెస్ అసంతృప్తి నాయకులు తిరుగుబాటు బావుటా ఎగురవేసినప్పుడు, ఆ వివరాలను ముందుగానే మీడియా ద్వారా బహిర్గతం చేసి, అగ్నికి ఆజ్యం పోసి, చెన్నారెడ్డికి కోపం కలిగించాడు ఆదిరాజు. ఇద్దరి మధ్యా తీవ్ర వివాదానికి దారితీయడం, ఒకరితో మరొకరు మాట్లాడుకొని పరిస్థితులకు దారితీయడం జరిగింది. ఆ నేపధ్యంలో ఒకరిని మరొకరు ఆహ్వానించారని (వాస్తవానికి ఎవరు-ఎవరినీ ఆహ్వానించలేదు) ఇద్దరికీ చెప్పి ఇద్దరినీ కలిపాను నేను.

ఆదిరాజును తన గదిలో చూడగానే చెన్నారెడ్డి “ ఏం ఆదిరాజూ....ఏం పని మీద వచ్చావు?” అని తన సహజ ధోరణిలో ప్రశ్నించాడు. “నాకు మీతో ఏం పని లేదు...మీరు రమ్మని అడిగితే వచ్చాను” అని కోపంగా జవాబిచ్చి, “డాక్టర్ సాబ్... ఐ యాం గోయింగ్...ఇఫ్ యు ఇన్వైట్ మీ అగైన్ అండ్ వాంట్ మీ టు కం, ఐ విల్ సీ” అంటూ కుర్చీ లోంచి దూకుడుగా లేచాడు. ఇద్దరికీ సర్ది చెప్పడం మా వంతైంది. చివరకు ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకోవడం జరిగింది. పదేళ్ళ క్రితంనాటి కోపాలు ఇద్దరూ మర్చిపోయి మాట్లాడుకున్నారు. చెన్నారెడ్డికి తన వంతు సహాయం చేస్తానని మాటిచ్చాడు. అన్నట్లుగానే ఢిల్లీలో అప్పట్లో అధిష్టాన వర్గానికి అత్యంత కీలక వ్యక్తిగా వ్యవహరిస్తున్న హెచ్ కె ఎల్ భగత్ ను, నాటి కేంద్ర పరిశ్రమల మంత్రి జలగం వెంగళ్ రావును, పార్లమెంటు సభ్యుడు ద్రోణంరాజు సత్యనారాయణను సంప్రదించాడు ఆదిరాజు. ఎవరి ప్రయత్నం ఫలించిందో చెప్పలేం కాని, 1989 ఉత్తరార్థంలో నేదురుమల్లి జనార్ధన రెడ్డి స్థానంలో డాక్టర్ మర్రి చెన్నారెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఆ తరువాత ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

ఆదిరాజు ఏ పత్రికలో పనిచేసినా, సమాచార భారతి లాంటి ఏజన్సీకి పనిచేసినా, స్వయంగా “రాజధాని” పేరుతో పత్రిక నడిపినా, వివిధ పత్రికలకు ఫ్రీ లాన్సర్ గా వ్యాసాలూ రాసినా, తనకంటూ ఒక విభిన్న-వైవిధ్యభరితమైన శైలి వుండేది. అలాగే ఆయన తెలుగు-ఆంగ్ల భాషల్లో రాసిన అనేకమైన పుస్తకాలు. ఎవరికీ తలవంచని, ఎవరికీ భయపడని మహనీయ పాత్రికేయుడు ఆదిరాజు. ఆయన బాటలో ఈ తరం పాత్రికేయులు నడిచి ఆయన అవలంభించిన ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే ఆదిరాజుకు నిజమైన నివాళి.

Sunday, June 24, 2018

తన విషయం శ్రీరాముడికి చెప్పమని హనుమను కోరిన సీత ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


తన విషయం శ్రీరాముడికి చెప్పమని హనుమను కోరిన సీత
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (25-06-2018)
చూడామణిని హనుమంతుడికిచ్చిన సీతాదేవి, ఈమణి రామచంద్రమూర్తికి బాగా తెలుసనీ, దీన్ని చూడగానే తనను, తన తల్లినీ, దశరథ మహారాజునూ, ఆయన స్మరించుకుంటాడనీ చెప్తుంది. వివాహ సమయంలో, దీనిని జనకమహారాజు తనతల్లి చేతికిచ్చాడనీ, ఆమె, దశరథుడు, రాముడు చూస్తుండగా, తనతలలో అలంకరించిందనీ అంటుంది. హనుమంతుడికి ఉత్సాహం కలిగేవిధంగా, చెప్పగలిగినంత చెప్పాననీ, ఇక ముందున్న కార్యం ఎట్లా చేస్తే బాగుంటుందో, అది ఆయన్నే ఆలోచించుకోమనికూడా చెప్తుంది. (ఇప్పుడు ఆడవారు ధరించే పచ్చబిళ్ల లాంటిదే, ఈ జడబిళ్ల కూడా. సీతాదేవి జడబిళ్ల అంతా రత్నమే! అంత పెద్ద కెంపు అయినందునే దాన్ని "అతులితము", "మహార్హము" అని వర్ణించారు)

ఆంజనేయుడి మనసంతా, ఎక్కడో వున్నదని గ్రహించిన సీత, తను చెప్పేది వినమనీ, శ్రీరామచంద్రమూర్తినీ, ఆయన తమ్ముడినీ, ఆయనకూ, తనకూ ముఖ్యులైన వారితో కూడిన సుగ్రీవుడినీ, వానరులందు పెద్దవారినీ, ధర్మ పద్ధతిలో యధాచితంగా క్షేమాన్ని విచారించానని చెప్పమంటుంది. మహాబలవంతుడైన శ్రీరాముడు, ఏవిధంగా, మోయలేని ఈ దుఃఖ సముద్రాన్నుంచి తన్ను దరిచేరుస్తాడో, ఆ విధానాన్ని తెలుసుకుని, ఆ పద్ధతిలోనే ఆయన్ను ఒప్పించి, కీర్తిమంతుడివి కమ్మని చెప్తుంది. తాను దేహాన్ని చాలించకముందే, తనమగడు తన్నెట్లా రక్షించగలడో ఆలోచించి, బుధ్ధి, చమత్కారాలున్న హనుమంతుడు, ఆయనకు నచ్చచెప్పి పుణ్యం కట్టుకొమ్మని అడుగుతుంది.

"సాహసవంతుల్లో అగ్రగణ్యుడవైన నీవు, సందేహానికి తావులేని మాటలతో, ఉత్సాహంతో చెప్తే, ఆ ప్రోత్సాహంతో, నా భర్త నన్ను ఆపద అనే సముద్రం నుండి కాపాడుతాడు. అట్లా కాకుండా, నువ్వు నీళ్లు నములుకుంటూ, లంక చాలా దూరముంది, చుట్టూ సముద్రముంది, దాటడం కష్టం, దాటినా రావణుడు బలవంతుడు, ఎలానో, ఏంటోనని సంశయాత్మకంగా చెప్పొద్దు. రామచంద్రా! లే! సీతాదేవిని ఆ దుష్టుడైన రావణుడు బాధిస్తున్నాడు, మనం వెళ్లేవరకు బ్రతుకుతుందో లేదో, రావణుడేమీ లెక్క కాదు, నిమిషంలో పోయి లంకను నాశనం చేసి, రావణుడిని చంపి సీతను తీసుకొద్దామని చెప్పు. ఒక ఆడది దిక్కులేక, అల్లాడుతుంటే, ఇందరం మగవాళ్లం, పరాక్రమవంతులం, వూరికే వుండరాదని చెప్పు. నీవు నేను చెప్పినట్లు అనుకూల వాక్యాలతో చెప్తే, రాముడు తనపౌరుషాన్ని రాక్షసులపై చూపుతాడు" అంటుంది సీతాదేవి.

ఇలా అన్న సీతాదేవితో హనుమంతుడు:" దేవీ! శ్రీరాముడు వానరులతో, భల్లూకాలతో, శీఘ్రంగా ఇక్కడకు వచ్చి, శత్రువులను చంపి, నీ దుఃఖాన్ని పోగొట్టుతాడు. నీకొరకు రామచంద్రమూర్తి యుధ్ధప్రయత్నం చేస్తే, దేవతలు, మానవులు, పన్నగులు, ఇంద్ర, సూర్య, యములు, ఎవరడ్డమొచ్చినా చచ్చిపోవాల్సిందే. ఇలా జయించి, ఈ భూమండలమంతా, పరిపాలించగలడు. రామచంద్రమూర్తి పరాక్రమాన్ని వర్ణిస్తున్నానేకాని, నిజానికి ఆయన విజయానికి మూలకారణం నీవే కదా! సత్యవంతుడికి సావిత్రిలాగా, రాముడికి నీవని చెప్పావుకదా! ఎందుకు మర్చిపోయావు? నీ పాతివ్రత్యం వ్యర్ధమై పోదు. ఆయన్ను గెలిపించడానికి అదొక్కటే చాలు" అని బదులు చెప్తాడు ఆచార్యావతారమైన హనుమంతుడు. (ఆచార్యుడు అంటే జీవాత్మ-పరమాత్మలను అనుసంధానించే వాడని అర్థం. సీతమ్మ జీవాత్మ కాగా, రామచంద్రుడు పరమాత్మ కద! ఆచార్యుడిని భగవంతుడి అవతారంగా పెద్దలు భావిస్తారు.)

ఇలా చెప్పిన హనుమంతుడి మాటలకు, చెప్పిన విధానానికి, వాటిలోని యదార్ధానికి, సీత సంతోషించి, ఆయన్ను ఎంతగానో మెచ్చుకుంటుంది. లంకలోనే, ఎక్కడైనా, ఆ పూటవరకు చాటుగావుండి, మర్నాడు సముద్రాన్ని దాటి పోవచ్చుకదా అంటుంది. (హనుమంతుడు లంకకు వస్తున్నప్పుడు సముద్ర మధ్యంలో మైనాకుడు ఎదురు వచ్చి కించిత్తు విశ్రమించి వెళ్లమంటే, ఇది రామకార్యం, రామబాణంలాగా వెళ్లి వస్తానని వానరులకు మాట ఇచ్చి బయలుదేరాను, మధ్యలో ఆగజాలను, అన్న మహానుభావుడు ఇప్పుడు ఒక రోజు ఆగమంటే ఆగగలడా? కార్య ఔచిత్యాన్ని, ఆవశ్యకాన్నీ హనుమంతుడు ఎలా భావించాడో తెలిసిందే. ఇది తెలుసుకుందామని సీతమ్మ కూడా తలచిందేమో! హనుమంతుడు పరీక్షలో నెగ్గాడు. అరణ్యానికి రాముడు బయలుదేరి వెళ్లే సమయంలో కూడా దశరథుడు రామచంద్రుడిని ఒక్క రోజు ఆగి వెళ్లమంటాడు. రాముడు ఆగనేలేదు. రోమరోమంలో రామభావాన్ని నింపుకున్న రామదూత రాముడి వలనే ప్రవర్తించడం గమనార్హం) ఇది తన మనస్సులోని మాటనీ, ఆయన మనసుకు నచ్చితే అలా చేయొచ్చనీ సూచిస్తుంది. అప్పుడే వచ్చి, మళ్లా అప్పుడే పోవటమంటే అలసటగా వుండవచ్చని చెప్పినా, ఆమె మనసులోని అసలు భావన: కొంతసేపైనా హనుమంతుడు సమీపంలో వున్టే, తనకు ధైర్యంగా ఉంటుందనే ఆశ. అంతసేపన్నా శోకతాపాలను విడిచి బ్రతకగలుగుతానన్న ఉద్దేశంతో అలా చెప్తున్నానని కూడా అంటుంది.

"ఆంజనేయా! ఒకరోజు నువ్విక్కడుంటే, నాకొచ్చే లాభం ఏంటి? ఆ తర్వాతైనా ఎప్పడిలాగా ఏడ్వాల్సిందేకదా! నువ్వు మాత్రం ఎన్నాళ్లుంటావిక్కడ? నీకిక్కడ ఆలస్యమైతే, నీకోసం ఎదురుచూస్తున్న రామచంద్రమూర్తి, నాకంటే ఎక్కువగా పరితపిస్తాడుకదా! నువ్వు ఇక్కడుంటే జరగాల్సిన పనులెలా జరుగుతాయి? అందుకే శ్రీరాముడి దగ్గరకు వెళ్లి మళ్లీ రామచంద్రుడితో రా! మళ్లీ ఎన్నాళ్లకొస్తావో, ఏంటో! అంతవరకు నా ప్రాణం ఉంటుందో, లేదో? చెప్పలేను. ఎందుకంటున్నానంటే, నిన్ను చూడగానే పోయే ప్రాణాలు నిలబడ్డాయి. మరి నువ్వుకూడా పోతే ఆ ప్రాణాలుంటాయో, పోతాయో చెప్పలేను" అంటుంది.

"నువ్వెట్లాగూ సముద్రాన్ని దాటిపోతావు. రాముడికి నాసంగతులన్నీ చెప్తావు. ఆ అన్నదమ్ములిద్దరూ, వానర సేనతో సముద్ర తీరానికి వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేదే ప్రశ్న. ఎలుగుబంట్లు, వానరులు, రాజకుమారులు, అలవికాని ఆ సముద్రాన్ని ఎట్లా దాటుతారయ్యా? ఈ భూప్రపంచంలో, నువ్వూ, గరుత్మంతుడు, వాయుదేవుడు, తప్ప ఇంకెవరూ ఈ సముద్రాన్ని దాటలేరని నా అభిప్రాయం. నేనాలోచిస్తున్న కొద్దీ, వారిక్కడకు రావడం, అసాధ్యమైనపనిలాగానే తోస్తున్నది. అయినా కార్యదక్షుడవైన నీకు చేయలేని పనేదీలేదు. దీనికి ఏమంటావు? ఎలా నెగ్గుకొస్తావో నాకు తెలియదుకాని, సాధించగలవాడివి మాత్రం నీవొక్కడివే! నీవలె ఎవరూ చేయలేరు, కీర్తినీ పొందలేరు." అని తన సందేహాన్ని వెలిబుచ్చుతుంది సీతాదేవి. ఇంకా ఇలా అంటుంది ఆమె:

"రామచంద్రమూర్తి సైన్యంతో వచ్చి, యుద్ధంలో బల-పరాక్రమాలను ప్రదర్శించి, రావణుడిని చంపి, నన్ను అయోధ్యకు తీసుకొని పోతేనే అది నాకు కీర్తికరం. అప్పుడే నేను వీరపత్నినన్న బిరుదుకు కూడా అర్హురాలిని అవుతాను. ఇది రాముడికి సాధ్యపడుతుందా, పడదా అనేసంగతి వేరేవిషయం. కాని ఇంకే విధంగా జరిగినా నాకు కీర్తికరం కాదు. నేను చెప్పినట్లు చేసి, తన బలంతో, బాణాలతో లంకను భస్మం చేసి, నన్ను వెన్ట తీసుకునిపోతే, నాకేకాదు, శ్రీరాముడికీ కీర్తి. ఆయన వంశానికీ కీర్తి దక్కుతుంది. నాకోసం కాకపోయినా, తనకోసమైనా నేను చెప్పినట్లు చేయాల్సిందేనని నా కోరిక. ఆడదానినైన నా ఆలోచనావిధానమిది. యుద్ధంలో శూరుడైన రామచంద్రమూర్తికి తగినటువంటి చర్య ఏదో ఆలోచించి చెప్పు".

సీతాదేవి చెప్పిన మాటలన్నీ, హితమైనవిగా, యుక్తియుక్తంగా, నిర్దోషమైనవిగా, ప్రయోజనంతో కూడినవిగా వున్న మంచిమాటలని భావించిన మారుతి చెప్పదలుచుకున్న మిగిలిన మాటలను ఆమెకు చెప్తాడు.

(సీత కోరరాని కోరికేమీ కోరలేదు. "పరమ భక్తులు, ప్రపన్నులు" భగవంతుడే స్వయంగా వచ్చి, తమను పిల్చుకోపోవాలని కోరుకుంటారు కాని, దూతలతో పిలిపించు కోవటానికి ఇష్టపడరు. అలా కాకపోతే మహారాజును ఆశ్రయించినా, వాడి సేవకుడిని ఆశ్రయించినా తేడా లేనట్లేగదా! సీత చెప్పిన "ఉపాయం" వలన, భక్తి-ప్రపత్తుల శ్రేష్టత్వం నిరూపించబడింది. సీత చెప్పిన "ఉపాయం" గొప్పదైనా, "ఉపేయం" కూడా గొప్పదే! ఉపేయం గొప్పదైతే, దాన్ని సాధించే ఉపాయం కూడ గొప్పగానే వుండాలి. "ఉపేయం" రామచంద్రమూర్తి, దాని సాధనోపాయం రామచంద్రమూర్తి రావడమే! )

Saturday, June 23, 2018

విరాధుడిని చంపిన రామలక్ష్మణులు.....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-14: వనం జ్వాలా నరసింహారావు


శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-14
విరాధుడిని చంపిన రామలక్ష్మణులు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (24-06-2018) 
ఇలా శ్రీరామచంద్రమూర్తితో చెప్పిన లక్ష్మణుడు, రాక్షసుడివైపు తిరిగి, "ఓరీ నువ్వెవడివిరా...ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావురా?" అని చిరునవ్వుతో అడిగాడు. తన వనానికి వచ్చి తనెవ్వరని ఎందుకడుగుతున్నారనీ, ముందు వారెవరో చెప్పాలనీ, వారెక్కడికి పోతున్నారనీ, విరాధుడు జవాబుగా ప్రశ్నించాడు. దానికి శ్రీరామచంద్రుడు "ఓరీ వినరా! మేం ఇక్ష్వాకు వంశంలో పుట్తిన క్షత్రియులం. అడవిలో తిరుగుతున్నాం. నువ్వనుకున్నట్లు మేం పాపాత్ములం కాదు. నిర్దోషమైన నడవడి కలవారం. నువ్వెందుకు ఈ అడవిలో తిరుగుతున్నావు?" అని అడిగాడు. జవాబుగా విరాధుడు: "నా తండ్రి జయుడు, నా తల్లి శతహ్రద నన్ను దనుజులందరూ విరాధుడు అని పిలుస్తారు. నేను తపస్సు చేసి శస్త్రంతో చావకుండా బ్రహ్మ నుండి వరం పొందా. నరకబడడం వల్ల, చీల్పబడడం వల్ల, చంపబడకుండా వరం పొందా. మీరు బతకాలనుకుంటే ఈ స్త్రీని నాకు వదిలి వెళ్లండి. ఈమెను నాకు వదిలితే మిమ్మ్లని చంపను" అని అన్నాడు.

విరాధుడు చెప్పిన మాటలకు కోపగించిన శ్రీరామచంద్రుడు, "ఓరీ! నీచ రాక్షసుడా! దుష్టుడా! నీ అంతట నువ్వే చావును వెతుక్కుంటూ వచ్చావు. నా ఎదురుగా నిలబడి మరల బతికిపోతావా?" అంటూ బాణం ఎక్కుపెట్టాడు. పదునైన బాణాలను రాక్షసుడిమీద వేశాడు. రాముడు ఏడు బాణాలను విరాధుడి రొమ్ము దూర్పోయే విధంగా వేయగా, అవి కొండ లాంటి వాడి దేహాన్ని చీల్చి, ఎర్ర్గా మారిపోయి, భూమిలోకి పోయాయి. బాణాల తాకిడి బాధను సహించలేని విరాధుడు జానకి నేలమీద వదిలి, శూలం తీసుకుని రామలక్ష్మణులను సమీపించాడు. రామలక్ష్మణులిరువురూ ఆ రాక్షసుడి మీద పదునైన బాణాలను వర్షంలాగా కురిపించారు. వారు వేసిన బాణాలను చూసిన విరాఢుడు, ఈ బాణాలు తననేమీ చేయలేవని నవ్వి, తన భయంకరమైన శరీరాన్ని పెంచాడు. దేహంలో నాటుకుని పోయిన బాణాలన్నీ నేలరాలాయి. శ్రీరామచంద్రమూర్తి మరి కొన్ని బాణాలను వేశాడు. శ్రీరామలక్ష్మణులు వేస్తున్న పదునైన అబణాలను చూసి రాక్షసుడు నవ్వాడు. వాళ్లూ వదలకుండా వీడిపై బాణాలు వేయసాగారు. వాటివల్ల బాగా బాధకలిగిన విరాధుడు, ప్రాణాలను బిగపట్టుకుని, రామలక్ష్మణులపై వజ్రసమానమైన శూలాన్ని విసిరాడు. మండుతూ వస్తున్న ఆశూలాన్ని చూసి శ్రీరాముడు దాన్ని రెండు బాణాలతో నరికాడు. భూమి కంపించే విధంగా అది నేలరాలింది. వాడి శూలం విరగగానే, రామలక్ష్మణులిద్దరూ వాడి మీద దూకారు. దూకి తమ కత్తులతో వాడిని కొట్టారు. అప్పుడా రాక్షసుడు వాళ్లిద్దరినీ ఎత్తుకుని ఆకాశంలో పరుగెత్తాడు. అడవి మధ్యలోకి వాళ్లను తీసుకుని వెళ్లి తమను చంపాలన్న వాడి కోరికను గ్రహించాడు శ్రీరాముడు. వాడు ఎక్కడికి తీసుకునిపోతే అక్కడికే పోదామనీ, అదే మన మార్గమనీ శ్రీరాముడు లక్ష్మణుడితో అన్నాడు.


          చంటి పిల్లను ఎత్తుకున్న విధంగా రామలక్ష్మణులను భుజాలమీద ఎత్తుకుని అడవిలో పోతున్న ఆ విధానం చూసిన సీతకు భయం కలిగింది. గట్తిగా , ఇలా జరిగిందికదా అని ఏడ్చింది. అప్పుడు సీతాదేవి ఇలా అంటుంది: "దానవోత్తముడా! నన్ను ఒంటరిగా విడిచి వారిద్దరినీ తీసుకొనిపోతే నన్ను ఇక్కడ పెద్ద పులులు, తోడేళ్లు, చిరుతపులులు మింగుతాయి. కాబట్టి వాళ్లను వదిలి నన్ను తీసుకొని పోయి చంపు. అలా అయితే వాళ్లు సుఖంగా జీవిస్తారు. వాళ్లు లేకుండా నేనున్నా చచ్చినదానితో సమానమే. కాబట్టి నీకు నమస్కారం చేస్తా....వాళ్లను విడిచి పెట్టు". సీత ఈ ఏడుపు మాటలు విన్న శ్రీరామలక్ష్మణులు రాక్షసుడిని చంపడానికి తొందరపడసాగారు. విరాధుడి కుడి భుజమందున్న లక్ష్మణుడు వాడి ఎడమ చేతిని, ఎడమ భుజాన వున్న శ్రీరాముడు వాడి కుడిచేతిని నరికారు. విరాధుడు ఆయుఅధాలతో చచ్చ్హేవాడు కాదు. చేతులు లేనివాడయ్యాడు. కాబట్టి వాడిని మోచేతులతో, మోకాళ్లతో గుద్ది, పైకెత్తి కింద పడేశారు. కత్తులతో నరికినా, బాణాలతో గుచ్చినా, నేలమీద వేసి గుద్దినా, చావని ఆ కఠిన రాక్షసుడిని చూసిన శ్రీరాముడు లక్ష్మణుడితో , వీడిని ఒక గుంట తీసి పూడుద్దామన్నాడు. ఇది విన్న విరాధుడు, రాముడితో, తాను ఆయన చేతిలో చచ్చిపోయాననీ, అజ్ఞానం వల్ల ఆయన ఎవరైందీ తెలుసుకోలేక పోయాననీ, అని తన శాప విషయాన్ని గురించి చెప్పాడు.

          విరాధుడిలా అన్నాడు: "కౌసల్యానందనా! కరుణాస్వరూప! శ్రీరామ్చంద్రా! తండ్రీ! మీరెవరో ఇప్పుడు తెలుసుకున్నా. శ్రీరాముడివి నీవు....అవతార మూర్తైన భవంతుడవని, సీతాదేవి లక్ష్మి అని తెలుసుకొంటిని. నేను పూర్వం తుంబురుడనే గంధర్వుడిని. రంభతో కూడి కామావేశాన మర్యాద తప్పి సంచరిస్తుంటే కుబేరుడు నన్ను రాక్షసుడివి కమ్మని శపించాడు. శాపం తొలగే ఉపాయం కూడా ఆయనే చెప్పాడు. దశరథ కుమారుడు శ్రీరాముడు ఎప్పుడు నన్ను చంపుతాడో అప్పుడు నాకు రాక్షసత్వం పోతుందని, గంధర్వ రూపం వస్తుందని అన్నాడు. శ్రీరఘురామచంద్రమూర్తీ! నీ కరుణవల్ల భయంకరమైన శాప బాధ తొలగింది. మీ దర్శనం వల్ల కృతకృత్యుడనయ్యాను. స్వర్గానికి పోతాను. దయ చేసి ఆజ్ఞ ఇవ్వు. మీకు మేలు కలుగుగాక! ఈ దారిలో ఒకటిన్నర ఆమడ దూరం పోయాక అక్కడ సూర్యతేజుడైన శరభంగ మహర్షి వున్నాడు. ఆయన్ను మీరు దర్శించండి. మేలు కలుగుతుంది. నన్ను పూడ్చి వేయండి. ఆ తరువాత అక్కడికి పోండి శ్రీరామచంద్రమూర్తీ! లక్ష్మనా! ఏనుగును పూడ్చడానికి ఎంత గుంట తవ్వుతారో అంతది తవ్వండి" అన్నాడు. వెంటనే చనిపోయాడు.

శ్రీరామచంద్రమూర్తి చెప్పిన విధంగా లక్ష్మణుడు విరాధుడిన దేహం పక్కనే వెంటనే ఒక గుంత తవ్వాడు. శ్రీరామలక్ష్మణులు కల్సి వాడి శరీరాన్ని ఆ గుంటలో వేశారు. ఇంకా ప్రాణంతో వున్న విరాధుడు, శ్రీరామలక్ష్మణులు బలవంతంగా గుంతలో పడేయగానే, భయంకరమైన ధ్వని చేస్తూ, దాంట్లో పొర్లాడు. వాడిని పిడికి పోటులతో చంపారు రామలక్ష్మణులు. ఊపిరితో పూడ్చరాదు కాబట్టి చంపి మరీ పూడ్చారు. శ్రీరామలక్ష్మణులు విరాధుడిని ఈ విధంగా చంపి, సంతోషించి, ఆ గోతిని పెఅద్ద రాయితో పూడ్చారు. ఇలా చేసి, దూరంగా వుంచిన వారి బాణాలను మరల తీసుకుని, సీతాదేవి దగ్గరకు పోయి, అడవిలో చంద్రడు సూర్యుడులాగా ప్రకాశించారు.

Sunday, June 17, 2018

Growth of India lies in the growth of its states : Vanam Jwala Narasimha Rao


Growth of India lies in the growth of its states
Vanam Jwala Narasimha Rao
Speaking at the fourth governing council meeting of NITI Aayog held in New Delhi on Sunday the 17th June 2018, Telangana Chief Minister K. Chandrashekhar Rao asked the Centre to encourage fast-growing States such as Telangana by giving tax incentives, if additional devolution of funds linked to performance is not possible as the prosperity of the country lies in the growth of States. Chief Minister also reiterated the suggestion made in the past to link the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme (MGNREGS) to agriculture as part of the need to focus on agriculture and allied activities as an integrated sector.

CM said the burden of investment in farming (for farm work) could be reduced at least by half by providing 50% funding from the employment guarantee scheme and meeting the remainder from farmers. Stating that such initiative would also help in doubling farmers' income by 2020 as being planned by the Centre, the Chief Minister requested the Centre to exempt allied areas of agriculture such as dairy, poultry, goat- and sheep-rearing and fisheries from the income tax net.

To put in his own words the CM said that: “I would like to mention that the growth of India lies in the growth of its states. Therefore the fast-growing states must be encouraged by tax incentives, if not by additional transfers from central funds. Further, we need to focus on agriculture and allied activities as an integrated sector and dairy, poultry, goat and sheep rearing, and fisheries should also be exempted from income tax. As a part of the initiatives for doubling the income of farmers, MGNREGA funds should be tagged to agriculture with 50% contribution from farmers to reduce the cost of their investment”.

CM started his statement with a thanksgiving note and said that: On behalf of the Government and people of Telangana, I take this opportunity to convey my deep sense of gratitude to Honorable Prime Minister for inviting us to the fourth meeting of the Governing Council of NITI Aayog in the true spirit of Cooperative Federalism.  Since the previous meeting of the Governing Council, several initiatives had been taken up by Government of India at the national level and by my colleague Chief Ministers in their respective States.  We have to learn from each other to accelerate the overall pace of development in the country. In this connection, I would like to share some of the initiatives taken up by the State of Telangana with all of you.

 Stressing on the need of cooperative federalism, often talked about by Prime Minister Narendra Modi, the Chief Minister wanted more freedom to States in the implementation of schemes in the areas such as health, education, urban development, agriculture and rural development. Instead, the Centre should focus on macro-economic, defence and external affairs issues where the country was facing challenges, he suggested.

The CM in this context in his concluding remarks has said that: I would like to say that the country is facing lots of challenges in the areas of external affairs, defence and macro-economic and global issues. Therefore in the changing global scenario, it should continue to give due attention to those issues and at the same time leave more space to the states in doing work in such sectors as health, education, urban development, agriculture and rural development and also remove the rigidness of certain centrally sponsored schemes that curtail the initiatives of the state government”.

CM also utilised the opportunity to share some of the initiatives taken up by Telangana Government, including the recently launched Rythu Bandhu scheme, to provide support to farmers with ₹4,000 per acre per farming season as input assistance, irrespective of their landholding. He explained that all farmers were covered under the scheme since more than 98% of them in Telangana were small and marginal.


The CM said that: “We have launched a scheme called "Rythu Bandhu" (friends of farmers) providing Rs.4,000/- per acre per crop as agriculture input assistance.  As there are more than 98% small and marginal farmers in Telangana, it makes sense to cover all the farmers to avoid unnecessary screening.  The scheme also envisages "give it up" provision where farmers can surrender their cheques.  I would also like to allay unfounded fears of some that Rythu Bandhu Scheme will distort the financial market.  This "agricultural investment assistance scheme" does not distort the credit system, agriculture product prices and cropping pattern etc.”

Stating that the Rythu Bandhu was introduced after purifying land records and issuing new pattaadar passbooks-cum-title deeds with 17 embedded security features to landholder, the Chief Minister stated that it would also facilitate hassle-free land transactions in rural areas by integrating the registration and mutation process. He said that: “Most important area of agriculture reform is providing clear title over farm land.  We have taken up a massive exercise of purifying the title of over 50 lakhs farm holdings in the State and have given them a Pattaadar Pass Book with embedded 17 security features.   We are also planning to integrate registration and mutation process in a seamless manner.  I am sure, with the help of express mutation, we would be able to develop a robust mechanism for hassle free land transactions in rural areas.  Over a period of time, we would like to usher in similar reforms for urban properties as well”.

Chief Minister also listed out Rythu Bhima Yojana with Rs. 5 lakh insurance that would provide cover to all farmers in the age group of 18 to 60 years. This would be launched on August 15, with a payment of about Rs. 1,000 crore premium by the State. CM said that: “Another scheme started by us is "Rythu Bhima Yojana" for all the farmers in the State aged 18 to 60 years with the public-sector giant 'LIC" insuring each farmer for Rs.5.00 lakhs in case of his / her unfortunate death due to any reason whatsoever.  The State Government bears the insurance premium costing about Rs.1,000/- Crores per annum.  Formal launch of this scheme is scheduled on 15th August 2018 covering about 50 lakh farmers.
CM has also talked about investment in the irrigation sector by taking up the Kaleshwaram and Palamoor-Rangareddy projects to create irrigation potential of over 28 lakh acres and construction of 356 godowns with a storage capacity of 18.3 lakh tonnes. CM with reference to these said that: “In order to extending a helping hand to farmers we are also making massive investments in irrigation.  Kaleshwaram and Palamoor Ranga Reddy Irrigation Projects, on rivers Godavari and Krishna, on completion are going to become the life line of Telangana.  These Projects shall provide new irrigation facilities to farmers in over 26 lakh acres and in stabilization of 18 lakh acres in 24 Districts of Telangana.  We are setting up new standards in completing various Mega Projects without any time and cost overruns”.

“Another major infrastructure development we have taken up for the overall growth of agriculture sector is construction of 356 agricultural godowns in the past 3 years with a storage capacity of 18.30 lakh MTs at a cost of Rs.1050 Crores.   This is in addition to 170 godowns with a capacity of 4.17 lakh MTs storage capacity, and these godowns are distributed throughout the State depending upon potential for usage.  This is helping farmers in many ways, like storage of agriculture produce in order to beat market fluctuations, storage of agriculture inputs like fertilizers, seeds etc.”

The Chief Minister concluding his statement wished the meeting of Governing Council a grand success.

హనుమకు చూడామణి ఇచ్చి రామలక్ష్మణులకు సందేశం పంపిన సీత ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు


హనుమకు చూడామణి ఇచ్చి రామలక్ష్మణులకు సందేశం పంపిన సీత
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (18-06-2018)
"అమ్మా, నేను పోయి సీతాదేవిని చూశాననగానే, శ్రీరాముడు, లక్ష్మణుడు  సుగ్రీవుడు, వానరులైన నా స్నేహితులు, మాకేం చెప్పిందంటే, మాకేం చెప్పిందని అడుగుతారు. నీమాటలుగా, వారందరికీ ఏం చెప్పాలో చెప్ప" మని ఆంజనేయుడు అడుగుతాడు సీతను. దుఃఖంతో కన్నీరుకారుస్తూ, సీతాదేవి సమాధానమిస్తుంది హనుమంతుడికిట్లా:

"కుశలమడిగానని చెప్పు. నాకు బదులుగా ఇదిసీత నమస్కారమని రాముడికి మ్రొక్కు. మీ క్షేమ సమాచరం అడిగానని చెప్పు.  నేను రక్షించమని అడిగానని మాత్రం చెప్పవద్దు. నీవు మిత్ర శ్రేష్టుడవు. ఇదే నీవు నాకు చేయవలసిన ఉపకారం. (ఇదివరకు తన్ను రక్షించమనికోరి మహాపరాధం చేసాననుకుంటుంది. ప్రపన్నురాలు అలాంటి కోరికలు కోరరాదు. భగవత్ కృత్యం ఆయనకు నేర్పి "దురహంకారి" నైనా ననుకుంటుంది సీత. అంటే ఆయనపై "విస్మృతి" దోషం ఆరోపించినట్లే! ఆయన రక్షణ చేస్తాడన్న విషయంలో విశ్వాసం లేక పోవటమే! అయన సొత్తు కాపాడుకున్నా, పోగొట్టుకున్నా, బలవంత పెట్టేందుకు తనెవరనుకుని, దోష నివృత్తి కొరకు, ప్రాయశ్చిత్తంగా "నమస్కరిస్తున్నా" ననిమాత్రమే చెప్పమంటుంది.)

"ఆంజనేయా! శ్రీరాముడు, నేనూ అడవులకు రావటానికీ, లక్ష్మణుడు రావటానికీ, చాలా తేడా వుంది. రామచంద్రమూర్తి తండ్రి ఆజ్ఞ మీరలేక, నిర్బంధంగా వచ్చాడేకాని, సంతోషంగా, బుధ్ధిపూర్వకంగా రాలేదు. ఆయన వచ్చాడు కాబట్టి భార్యనైన నాకు తప్పిందికాదు. రాముడి రాకను సమ్మతించిన వారెవ్వరూ లేరు. లక్ష్మణుడి విషయం అలాంటిదికాదు. అరణ్యాలకు రావాల్సిన కారణంలేదు. ఆయన చేసిన పనికి, ఆయన భక్తికి అందరూ సంతోషించారు, సమ్మతించారు. సంచారయోగ్యమైన, మనోహరమైన ఇళ్లను, భోగభాగ్యాలను, సేవకులను, బుధ్ధిపూర్వకంగా వదిలేసి, తల్లి, తండ్రులను గౌరవించి, సమాధానపర్చ్చి, వారి అనుగ్రహానికి పాత్రుడై అరణ్యాలకు బయల్దేరాడాయన. తనలా పోవడంవల్ల ప్రయోజనం లేకపోయినా, అన్న ఒక్కడే పోతున్నాడన్న ఆలోచనతోనూ, ఆయన పిలుస్తే మారు పలికే మనిషిలేడనీ, ఆయన ఏకాంతానికి ఏ ఇబ్బందీ లేకుండా చూద్దామనీ అడవుల్లోకి వచ్చాడు. ఆయనెంత సుగుణవంతుడో కదా!"

"అడవుల్లో ఎట్లా వున్నాడో తెలుసా? అసమానపరాక్రమవంతుడైనా, గర్వమనేదిలేక వినయంగా మసిలేవాడు. అది ఆయన గురువులవద్ద నేర్చుకున్న విద్యాఫలం. సత్పురుషులకు ప్రియంగా వుండేవాడు. సుఖాలన్నీ త్యాగం చేసి, అన్నకొరకే, కష్టకాలంలో, ఆయనకనుకూలంగా, ఆయన సేవే చేస్తుండేవాడు. ఆయనకు మేలుచేయటమే తెలుసుకాని, ద్రోహబుధ్ధి అంటే ఏమిటో తెలియదు. ఆయన్ను చూస్తుంటే సౌమ్యుడనే విషయం వెంటనే తెలిసిపోతుంది. సింహబలుడిలాంటివాడు. అన్నివిషయాల్లోనూ, మా మామగారికి సమానమైన వాడు. రావణాసురుడు నన్నెత్తుకొచ్చిన సంగతి ఆయనకు తెలిసుండదు. తెలిస్తే వాడినక్కడనే చంపేసేవాడు".

"లక్ష్మణుడు పెద్దలదగ్గరుండి వారిసేవ చేసినవాడు. కాంతిమంతుడు, మితంగా మాట్లాడుతాడు. మామగారికి ముద్దులకొడుకు, నాకు ముద్దులమరది. ఎంతకష్టమైన పనిచెప్పినా, చేతకాదనకుండా చేసేవాడు. ఎంతబరువైనా మోసేవాడు. ఆయన పక్కనుండడంతో, తండ్రి లేడే అన్న భావనేలేకపోయింది. దయాగుణం కలవాడు, దాక్షిణ్య స్వభావమున్నవాడు. నిర్మలమైన, మృదువైన, మనస్సున్నవాడు. ఎట్టిదోషం లేనివాడు. శ్రీరాముడి ప్రియ సోదరుడు. అలాంటి లక్ష్మణుడి క్షేమం అడిగానని చెప్పు హనుమంతా! ఎలా నచ్చ చెపితే, శ్రీరామచంద్రమూర్తి తక్షణమే ఇక్కడకు వస్తాడో, ఆవిధంగానే విషయాలన్నీ క్షుణ్ణంగా చెప్పు".


"వానరేంద్రా! నా దుఃఖం సమసిపోవాలి. ఇదే నాకు కావాల్సింది. దానికొరకు నామగడు, ఎలాంటి ప్రయత్నం చేస్తే నన్ను రక్షించగలడో, అదంతా ఆయనతో చేయించాల్సిన వాడివి నీవే! ఆ భారం నీమీదే వుంది. ఒక్కమాటమాత్రం ఆయనకు మళ్లీ-మళ్లీ చెప్పు. ఎంత కష్టమైనా సహించి ఇంకొక్కనెల ప్రాణాలు బిగపట్టుకుంటాను. ఆపైన నేను నిల్పుకోవాలన్నా ప్రాణం నిల్వదు రామచంద్రా! అన్నానని చెప్పు. పూర్వం ఇంద్రుడికి రాజ్యలక్ష్మిని చేర్చినట్లు నన్నుధ్ధరించమను. తన సొమ్మును తనే కాపాడుకోవాలని చెప్పు".

(రావణుడిచ్చిన గడువు ఇంకా రెండు నెలలుండగానే, నెలరోజులకే ప్రాణం విడుస్తానని ఎందుకంటున్నది సీత? ఇది పద్నాలుగవ సంవత్సరం, ఫాల్గుణమాసం. సీతారామలక్ష్మణులు అయోధ్య విడిచి వెళ్లింది చైత్ర శుధ్ధ చతుర్ధి. పద్నాలుగు సంవత్సరాలు నిండడానికి ఇంకా పంతొమ్మిది రోజులే మిగిలి వున్నాయి. పదిహేనవ సంవత్సరం మొదటి రోజున, రాముడు రాకపోతే అగ్నిప్రవేశం చేస్తానని భరతుడు శపథం చేసాడు. రామచంద్రమూర్తి దాన్ని ఒప్పుకున్నాడు. అంటే ఆరోజుకింకా ఇరవయ్యోరోజు, అయోధ్యలో రాముడుండక తప్పదు. భరతుడు మరణిస్తే, కౌసల్య, సుమిత్ర, కైకేయి, శత్రుఘ్నుడు కూడా మరణిస్తారు. వంశనాశనం జరుగుతుంది. దాన్ని నాకొరకు రామచంద్రుడు ఎట్లా సహించగలడు? కావున అయోధ్యకు పోక తప్పదు. రాముడొస్తాడు, తన్ను రక్షిస్తాడన్న ఆశతో వున్న సీతకు, ఆయన అయోధ్యకు పోయాడని తెలిసి, ఆశాభంగమై ప్రాణాలు పోతాయి. అందుకే నెలరోజులు గడువిచ్చింది)

తనమాటలుగా రామచంద్రమూర్తికి చెప్పమని ఎన్నో విషయాలు చెప్పిన సీతాదేవి, ఆ తర్వాత తన కొంగులో ముడివేసి దాచుకున్న "చూడామణి" ని తీసి, రామచంద్రమూర్తికిమ్మని హనుమంతుడికిస్తుంది. నిత్యమూ శ్రీరాముడికి పాదాభివందనం చేయడం సీతమ్మకు అలవాటు. అలా చేస్తున్నప్పుడు  చూడామణిని (నాగరం లేదా కొప్పుబిళ్ల) రాముడు చూస్తుండడంవల్ల దానిని ఆయన తేలిగ్గా గుర్తుబడతాడు. అందువల్లనే చూడామణిని ఇచ్చింది సీతమ్మ. ఆమె ఇచ్చిన ఆ జడబిళ్లను హనుమంతుడు తనవేలికి పెట్టుకున్నాడు. అప్పుడాయన చేయి పెద్దగాలేదు. సీతకు చూపించిన ఆకారాన్ని తగ్గించి, పూర్వంలాగా చిన్నగయ్యాడు. ఆ జడబిళ్ల ఆయన వేలికి ఉంగరంలాగా సరిపోయింది. తర్వాత ఆమెకు ప్రదక్షిణ చేసి, నమస్కరించి నిలబడ్డాడు. వచ్చిన పని అయిపోయిందన్న సంతోషంతో, హనుమంతుడు, శరీరాన్ని సీత దగ్గరుంచినా, మనస్సును రాముడిపై మళ్లించి, ఆయన్ను ఎప్పుడు చూస్తానా అని త్వరపడసాగాడు. అసమానమై, ఉత్తములు మాత్రమే ధరించదగి, సీతాదేవి తన మహాత్మ్యం వల్ల ధరించిన, చూడామణిని, హనుమంతుడు, తన బుధ్ధిబలంతో పొంది, సంతోషించి, శ్రీరాముడి దగ్గరకు త్వరగా పోవాలన్న ఆలోచనలో పడ్డాడు.