Wednesday, April 30, 2014

విజ్ఞాన సర్వస్వం - వాసు దాసు “ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం”:వనం జ్వాలా నరసింహారావు

 విజ్ఞాన సర్వస్వం 
వాసు దాసు ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం
వనం జ్వాలా నరసింహారావు

(1909 వ సంవత్సరంలో నాటి చెన్నపురి (నేటి చెన్నై) లోని "శ్రీ వైజయంతీ ముద్రా శాల" లో ముద్రించబడి, ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా "కాలిఫోర్నియా (అమెరికా) విశ్వ విద్యాలయం" కు చెందిన "బర్క్ లీ" గ్రంథాలయం చేరుకుని, "గూగుల్ సంస్థ" డిజిటలైజ్ చేసి నందువల్ల నాకంట పడిన వాసు దాసు (వావిలికొలను సుబ్బారావు) గారి అలనాటి "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం" మొదటి సంపుటి పీఠిక ఆధారంగా, కొన్ని ఆసక్తికరమైన విషయాలు)

గీర్వాణ భాషా గ్రంథాలలో ఆద్యమైంది శ్రీ రామాయణ కావ్యం. కావ్యాలలోకెల్లా ప్రధమంగా ఉత్పన్నమైంది కావడంతో అది ఆదికావ్యమైంది. మన పూర్వీకులకు తెలియని నాగరికతలు లేవు. వారు ఏ కారణం వల్ల ఆర్యులయ్యారు? ఎటువంటి గుణాలు కలిగి, ఎటువంటి మహోన్నత స్థితిలో వుండే వారు? వారి నాగరికత విధానం ఎటువంటిది? వారి కులా చార ప్రవర్తనలెలావుండేవి? రాజుకు-ప్రజలకు మధ్య ఐకమత్యం ఎలా వుండేది? భార్యా-భర్తలు, సోదరులు, తల్లి తండ్రులు, పుత్రులు పరస్పరం ఎలా ప్రవర్తించేవారు? సుఖ-దుఃఖాల విషయంలో స్త్రీ-పురుషులు ఏ విధమైన నడవడి గలవారు? వారికి దేవుడంటే ఎలాంటి ఆలోచన వుండేది? దైవాన్ని వారెలా ఆరాధిస్తుండే వారు? ఇలాంటి లౌకిక విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి శ్రీ రామాయణాన్ని మించి తెలిపే గ్రంథం ఎక్కడా లేదు. కాలక్షేపానికి చదవడానికైనా శ్రీ రామాయణం లాంటి పుస్తకం ఇంకోటి లేదు. శ్రద్ధా భక్తులతో చదివినవారికి కల్పవృక్షంలా కోరిన కోరికలు తీర్చేదీ రామాయణమే. ఇహ-పర లోకాల్లో సుఖపడాలనుకునేవారికి, శ్రీ రామాయణ పఠనం అవశ్య కర్తవ్యం. వాల్మీకి మహర్షి, తను రచించిన ఆది కావ్యానికి శ్రీ రామాయణం అని పేరు పెట్టాడు. ఇందులో సీతాదేవి మహాత్మ్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే, శ్రీ రామాయణాన్ని "సీతాయాశ్చరితం మహత్తు" అని వెల్లడిచేశాడు. ఈ చిత్రం గ్రంథం పేరులోనే కాకుండా, గ్రంథమంతా కనపడుతుంది. శ్రీరామచంద్రుడు మనుష్యుడివలె నటిస్తుంటే, వాల్మీకే మో వాస్థవార్థం చెప్తూ, ఆయన సాక్షాత్తు భగవంతుడే అంటాడు.

వాల్మీకి రామాయణంలోని పాత్రలు-పాత్రధారుల వాక్కులు, ఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగా, సందర్భోచితంగా, వారున్న అప్పటి స్థితికి అర్హమైనవిగా వుంటాయి. శ్రీరాముడు భగవంతుడన్న అభిప్రాయం వాల్మీకి పదే పదే చెప్పుకుంటూ పోయాడు రామాయణంలో. ఒక విషయం గురించి చెప్పాల్సిందంతా ఒకచోట చెప్పడు వాల్మీకి. కొన్ని సందర్భాలలో ఆ విషయానికి సంబంధించిన ప్రస్తావనే వుండదు. అదే విషయం మరెక్కడో సూచన ప్రాయంగా వుండొచ్చు. ఒక్కోసారి విపులంగా విశదీకరించబడి వుండొచ్చు. ఒకే విషయం, ఒకటి కంటె ఎక్కువ సార్లు చెప్పితే, ఒక్కోసారి ఒక్కోరకమైన విశేషంతో చెప్పబడుతుంది. వాల్మీకి రామాయణం "ధ్వని కావ్యం". కావ్యానికి ప్రధానమైంది ధ్వని. కావ్యానికి ప్రాణం ధ్వని. ధ్వని లేని కావ్యం శవంతో సమానం. రామాయణంలో ధ్వని విశేషంగా వుంది. కావ్యమంతా ధ్వన్యర్థం వుండడమే కాకుండా, పలు శ్లోకాలకు విడిగా ధ్వన్యర్థం వుంది. రుతు వర్ణనలలో ధ్వని స్ఫురిస్తుంది. శ్రీమద్రామాయణం గొప్ప ధర్మ శాస్త్రం. ఇందులో సర్వ విధాలైన, అన్ని రకాల ధర్మాల గురించి వివరంగా చెప్పబడింది. రాజ ధర్మం, ప్రజా ధర్మం, పతి ధర్మం, సతీ ధర్మం, భాతృ ధర్మం, పుత్ర ధర్మం, భృత్యు ధర్మం, మిత్ర ధర్మం లాంటి అన్ని ధర్మాలను గురించి చక్కగా తెలుపబడి వుంది. లాభ-లోభ-పక్షపాత బుద్ధి లేకుండా, న్యాయం మీదే దృష్టి నిలిపి వాదించే న్యాయవాది ధర్మం కూడా చెప్పబడింది. శ్రీమద్వాల్మీకి రామాయణం మంత్రనిధానం. ఇందులో అనేకానేక మంత్రాలు ఉద్ధరించబడి వున్నాయి.

వాల్మీకి సంస్కృత రామాయణాన్ని, యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా తెనిగించిన ఏకైక మహానుభావుడు ఆంధ్ర వాల్మీకి-కవి సార్వభౌమ కీర్తి శేషులు వావిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు. ఆయన సొంత-స్వతంత్ర రచన అనిపించుకున్న శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం తెలుగునేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని వందేళ్ల క్రితమే సంతరించుకుంది. ఇరవై నాలుగు గాయత్రీ మంత్రాక్షరాలలో నిబంధించబడిన మంత్ర మంజూష వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణం. వావిలికొలను సుబ్బారావు గారు, వాల్మీకి రామాయణాన్ని యధాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందః యతులను ఆయా స్థానాలలో నిలిపి, వాల్మీకాన్ని తెనిగించారు. వాల్మీకి రామాయణానికి తుల్యమైన స్థాయినీ-పారమ్యాన్నీ, తొలుత నిర్వచనంగా ఆంధ్ర వాల్మీకి రామాయణానికి అందించి, తదనంతరం, "మందరం" అని దానికి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు.

వాల్మీకి రామాయణ క్షీరసాగర మధనాన్ని చేసి "మందర" మకరందాలనూ, రమా రామ పారమ్య పీయూషాలనూ, నాలుగు చెరగులా పంచి, ఆ మథనంలో ఆవిర్భవించిన శ్రీ సీతారాముల తత్వాన్ని, వేద వేదాంగేతిహాస స్మృతి శ్రుతి శుభంగా అన్వయించి, ఆంధ్రుల హృదయ కేదారాలను ప్రపుల్లంచేసిన పరమ భాగవతోత్తములు "ఆంధ్ర వాల్మీకి" వాసు దాస స్వామి. "రామ భక్తి సామ్రాజ్యం యే మానవుల కబ్బెనో మనసా! ఆ మానవుల సందర్శనం అత్యంత బ్రహ్మానందమే" అన్న త్యాగరాజ స్వామి వారి కీర్తనకు సాకార దివ్య స్వరూపులు వాసు దాస స్వామి. ఆంధ్ర వాల్మీకి వాసు దాస స్వామి అవతరించి వున్న కాలంలో, వారి దర్శన-అనుగ్రహ భాషణా సౌభాగ్యమబ్బిన వారు, "శ్రీ మద్రామాయణం-మందరం" పారాయణ పరులై, తమ పరంపరకు శ్రీ వాసు దాస స్వామి గారి దివ్య స్మృతులను అందించి తరించారు. వాల్మీకి సంస్కృత రామాయణాన్ని అందరికంటే మొట్ట మొదలు ఆంధ్రీకరించి, పదే-పదే రామాయణ పఠన పాఠన శ్రవణాదుల పట్ల ఆంధ్రులకు అత్యుత్సాహాన్ని కలిగించి, "రామ భక్తి సామ్రాజ్యం" అంటే, ఆంధ్ర దేశమే సుమా, అనిపించిన నిరుపమ రామ భక్తులు వాసు దాస స్వామివారు. వాసు దాసుగారి కీర్తికి ఆలవాలమైంది ఆంధ్ర వాల్మీకి రామాయణం. ఆంధ్ర భాషలో అంతకుముందు రామాయణానికి యధా మూలాలు లేవని, అర్థ పూర్తి కలిగి, కావ్య-ఇతిహాస గౌరవ పాత్రమై, సర్వజన పఠనీయమై, ప్రామాణికమై, మూలానుసరమైన రామాయణం తెలుగులో వుండడం లోకోపకారంగా భావించి, రచించించారీ గ్రంథాన్ని వాసు దాసుగారు. ఎనిమిదేళ్లలో రామాయణాన్ని తొలుత నిర్వచనంగా ఆంధ్రీకరించి, ఆ తరువాత ఆయనే ప్రతి పద్యానికీ ప్రతి పదార్థ తాత్పర్యం తో సహా తన వ్యాఖ్యానాన్ని కూడా జోడించి, మందరం పేరుతో ప్రచురించారు.

"శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం-మందరం" ఒక గొప్ప ఉద్గ్రంథం. సరికొత్త విజ్ఞాన సర్వస్వం. "మందరం" అంటే, క్షీర సాగరాన్ని మథించడంలో కవ్వంగా ఉపయోగించిన మందర పర్వతమే గుర్తుకొస్తుంది. కాని, వాసు దాసుగారి శ్రీపాద సంబంధులకు మాత్రం, "మందరం" అంటే, మొదట గుర్తుకొచ్చేది, ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరమే. వాల్మీకి విరచితమైన రామాయణాన్ని శ్రీవారు, "క్షీరవారాసి" గా సంభావించి, దానిని మధించిన తమ "మేథ" అందించిన మకరందాలను-మధురిమలను, ముచ్చటగా "మందరం" అని పేర్కొన్నారు. సహృదయ నైవేద్యంగా-అనుభవైక వేద్యంగా వచ్చిన రచనలకు అసాధ్యంగా-నిగమ గోచరంగా భావించబడిన రామాయణానికి "మందరం" అని నామకరణం చేయడంలో తను కొంత వరకే న్యాయం చేయగలిగానని అంటారాయన. అందులోంచి చిలికిన కొద్దీ ఎన్నో దివ్య రసాయనాలు ఉద్భవిస్తాయని, భావితరాల వారు ఇందుకు పూనుకోవాలని కూడా సూచించారు వాసు దాసుగారు. తను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి శ్లోకానికొక పద్యం వంతున రాసారు వాసు దాసుగారు. మందరంలో తను రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్థ తాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న వివిదార్థాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. ఆయన మందరాలలోని శ్రీ రామాయణ వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి" కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది.వాసు దాసుగారి ఆంధ్ర వాల్మీకంలోని ప్రతి కాండకొక ప్రత్యేకతుంది. ప్రతి కాండ ఒక్కోరకమైన విజ్ఞానసర్వస్వం. ప్రతి కాండలోని, ప్రతి పద్యానికి, ప్రతి పదార్థం ఇస్తూ, చివరకు తాత్పర్యం రాస్తూ, అవసరమైన చోట నిగూఢార్థాలను-అంతరార్థాలను-ఉపమానాలను ఉటంకిస్తూ, సాధ్యమైనంత వరకు ఇతర గ్రంథాల్లోని తత్సంబంధమైన అంశాలను పేర్కొంటారు కవి. ప్రత్యుత్తరం కోరి చదవాల్సిన విషయాలన్నింటికీ సోదాహరణంగా జవాబిస్తారు. శ్రద్ధగా చదువుకుంటూ పోతే-అర్థం చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ చదువగలిగితే, ప్రతి కాండలో ఆ కాండ కథా వృత్తాంతమే కాకుండా, సకల శాస్త్రాల సంగమం దర్శనమిస్తుంది. ఒక సారి ధర్మశాస్త్రం లాగా, ఇంకో సారి రాజనీతి శాస్త్రం లాగా, మరో చోట భూగోళ శాస్త్రం-ఖగోళ శాస్త్రం-సాంఘిక, సామాజిక, ఆర్థిక, సామాన్య, నీతి, సంఖ్యా, సాముద్రిక, కామ, రతి, స్వప్న, పురా తత్వ శాస్త్రం లాగా దర్శనమిస్తుంది. బహుశా, క్షుణ్ణంగా చదివితే, ఇంకెన్నో రకమైన శాస్త్ర విషయాలు గోచరిస్తాయి. అసలు-సిసలైన పరిశోధకులంటూ వుంటే, మందరం ఏ ఒక్క కాండ  మీద పరిశోధన చేసినా, ఒకటి కాదు-వంద పీహెచ్‌డీలకు సరిపోయే విషయ సంపద లభ్యమవుతుంది. డాక్టరేట్ తో పాటు, అద్భుతమైన రహస్యాలు అవగతమౌతాయి. పరిశోధనా దృక్ఫధంతో చదివితే, పాదరసం నుండి బంగారం చేసే రహస్యమైన విషయాలలాంటి కూడా అనేకమైనవి తెలుసుకోవచ్చు. ప్రతి కాండ చివర వాసు దాసుగారు రాసిన ఆఖరు పద్యంలో, ఆ కాండలో వున్న మొత్తం పద్యాలెన్నో తెలియచేసే పంక్తులుంటాయి.

వాసు దాసు రాసిన నిర్వచన రామాయణంలో సాధారణంగా అందరూ రాసే చంపక మాలలు, ఉత్పల మాలలు, సీస-ఆటవెలది-తేటగీతి-కంద-శార్దూలాలు, మత్తేభాలు మాత్రమే కాకుండా, తెలుగు ఛందస్సులో వుండే వృత్తాలన్నిటినీ, సందర్భోచితంగా ప్రయోగించారు. వాటిలో, "మత్తకోకిలము", "పంచ చామరం", "కవిరాజ విరాజితము", "తరలము", "ప్రహరణకలిత", "సుగంధి", "ఉత్సాహం", "మనోహరిణి", "వనమయూరము", "తోటకము", "మానిని", "ఇంద్రవంశము", "లయగ్రాహి", "తోదకము", "మాలిని", "కలితాంతము", "మధురగతిరగడ", "వనమంజరి", "కమల విలసితము", "వసంతమంజరి", "మంజుభాషిణి", "స్రగ్ధర", "వసంతతిలక", "మాలి", "కరిబృంహితము", “చారుమతి", "వృషభగతిరగడ", "స్రగ్విని", "మనోరంజని", “హ్లాదిని”, "వంశస్థము", "తామరసం", "పద్మనాభ వృత్తం", "అంబురుహ వృత్తం", "మణిమంజరి", "మంగళ మహాశ్రీ వృత్తం", "మందాక్రాంత" లాంటివెన్నో వున్నాయి. ద్విపదలూ వున్నాయి. దండకం కూడా వుందో సందర్భంలో. ఎక్కడ ఎందుకు ఏ విధంగా ఛందః యతులను ఉపయోగించారో కూడా వివరించారు. వీటికి తోడు అనేక వ్యాకరణ విషయాలను అవసరమైన ప్రతి చోటా పాఠకులకు అర్థమయ్యే రీతిలో విపులంగా తెలియచేశారు.

వాసు దాసుగారి రచనా శైలి విభిన్నమైంది. అందరు రచయితలకు అలా రాయడం చేతకాదు. ఆయన శైలే వేరు. ఉదాహరణకు: వాల్మీకి, రామాయణం రాయడానికి ముందర ఒక నాడు తమసా నదిలో స్నానం చేస్తున్న సందర్భంలో, ఆయన కంటికి సమీపంలో, మనోహరంగా కూస్తూ, వియోగం సహించలేని క్రౌంచ పక్షుల జంట కనిపించింది. ఆ సమయంలో, తాను చూస్తున్నానన్న లక్ష్యం కూడా లేకుండా, సహజంగా జంతువులను హింసించే స్వభావమున్న బోయవాడొకడు, రెండు పక్షులలో మగదాన్ని బాణంతో చంపి నేల కూల్చాడు. క్రూరుడైన బోయవాడిపై దయ వీడి శపించాడు వాల్మీకి. సంస్కృత రామాయణంలో ఆ శ్లోకం ఇలా వచ్చింది వాల్మీకి నోట:
"మానిషాద ప్రతిష్ఠాం త్వ! మగ మ శ్శాశ్వతీ స్సమాః
యత్క్రౌంచ మిథునాదేక! మవధీః కామమోహితం"

ఆంధ్ర వాల్మీకి రామాయణంలో వాసు దాసుగారిలా తెనిగించారు ఆ శ్లోకాన్ని:

"తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున"

రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకమిది. ఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసు దాసుగారు మొట్టమొదట రాసిన పద్యమూ ఇదే. "మానిశాద" శ్లోకం అంతవరకు తెనిగించినవారు లేరంటారు కవి. వ్యాఖ్యాతలు రాసిన అన్ని అర్థాలు వచ్చేట్లు రాయడం కష్టమనీ, దీన్ని తెనిగించగలిగితే మిగిలిందంతా తెనిగించడం తేలికవుతుందనీ భావించి, తనను తాను పరీక్షించుకోదల్చి, తొలుత ఆ పద్యాన్ని రాసానంటారు వాసు దాసుగారు.

రామాయణం రాద్దామని సంకల్పించిన వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకంలో, ఆంధ్ర వాల్మీకి రామాయణ రచనలో వాసు దాసుగారు మొట్టమొదట రాసిన మొదటి పద్యంలో నాలుగు పాదాలున్నాయి. పాదానికి 13 అక్షరాలు. సాంఖ్య శాస్త్రం ప్రకారం 13 ప్రణవాన్ని బోధిస్తుంది. ఎందుకంటే, వర్ణసమామ్నాయంలో 13వ అక్షరం "" విష్ణు అనే అర్థమున్న "మానిషాద" శబ్దం "" కారాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠస్త్రీ లింగం. ఇక్కడ స్త్రీ వాచకం ప్రకృష్టమైంది. ప్రతిష్ఠ అనేది లక్ష్మీ వాచకమైన "" కారాన్ని బోధిస్తుంది. "నీక" అనేది "" కార మొక్క అవథారణార్థకాన్ని తెలుపుతుంది. "క్రౌంచ మిథునంబునందు నొక్కండు", ప్రకృతి పురుషుల్లో కుటిల గతి కలది ప్రకృతి అనీ, దాని సంబంధంవల్ల అల్పమైన జ్ఞానమున్నవాడు (బద్ధ జీవుడు) పురుషుడని అర్థం చేసుకోవాలి. ఇది "" కారాన్ని బోధిస్తుంది.

వాసు దాసుగారు రాసిన మొదటి పద్యం రామాయణార్థాన్ని సంపూర్ణంగా సూచిస్తుంది. "మానిషాదుండ... ... అంటే లక్ష్మికి నివాస స్థానమయిన శ్రీనివాసుడా, శ్రీరాముడాఅనే పదం బాలకాండ అర్థాన్ని సూచిస్తుంది. "ప్రతిష్ఠ నీక శాశ్వతంబగు" అనే పదం పితృవాక్య పరిపాలన, రాముడి ప్రతిష్ఠను తెలియచెప్పే అయోధ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. "శాశ్వతహాయనముల" అనే పదంలో రాముడు దండకారణ్యంలో ఋషులకు చేసిన ప్రతిజ్ఞలు నెరవేర్చి నందువల్ల ఆయనకు కలిగిన ప్రతిష్ఠను తెలియచేసే అరణ్య కాండ అర్థాన్ని సూచిస్తుంది. దాని ఉత్తరార్థంలో కిష్కింధ కాండార్థాన్ని సూచిస్తుంది. క్రౌంచ దుఃఖం సీతా విరహతాపాన్ని తెలియచేసే సుందర కాండ అర్థాన్ని సూచిస్తుంది. ఇలా రకరకాలుగా రామాయణార్థం సూచించబడిందీ పద్యంలో.

సంస్కృత మూలంలో మాదిరిగానే, ఆంధ్ర వాల్మీకంలో, ప్రణవం-ప్రణవార్థం సముద్ధరించబడి వున్నాయి. ఉదాహరణకు, ఆంధ్ర వాల్మీకంలోని, "అగ్రవర్తియై శ్రీరాము... నువిద తను మధ్య..... మహిత కోదండ..... డోలి....ప్రేమ" అన్న పద్యంలోని మొదటి మూడు పాదాల ప్రథమాక్షరాలు (అవుమ) కలిపితే, నాల్గవ పాదం ప్రథమ-అంత్య అక్షర (ఓమ) స్వరూపం వస్తుంది. ఇలా మంత్రార్థమంతా మూలంలో వలె వుంటుంది. ఇలా, షడక్షరి, అష్టాక్షరి, ద్వయము లాంటి మంత్రాలు కూర్చబడ్డాయి. పరిశోధకులకు ఇవి కనుగొనడం తేలిక.

ఆంధ్ర వాల్మీకంలోని ఈ పద్యం చదువుతే సాంఖ్య శాస్త్ర రహస్యం గురించి కూడా తెలుసుకోవచ్చు.

          "శ్రీమహిజాధవుండు జడ చేతనజీవనధాత సద్గరీ
        యో మరభూరుహంబు సమ దారివిదారణశీలి భక్తవా
        రామృతదాత సంభృతశ రాసకరాంబుజు డొంటిమిట్టశ్రీ
        రాము డమాయవర్తనుడు రక్తి గ్రహించుత మన్నమస్కృతుల్

చివరి పాదంలోని మొదటి అక్షరం "రా" అంటే సంఖ్యా శాస్త్రం ప్రకారం 2కు సమానం. ఈ అక్షరం తర్వాత రెండు అక్షరాలను వదిలి చదివితే "మాయ" వుంటుంది. సాంఖ్య శాస్త్రం ప్రకారం మాయ 15కు సమానం. మొదటి అక్షరం తర్వాత 15 అక్షరాలు వదిలి చదివితే "నమః" వుంటుంది. ఇలా అన్నీ కలిపి చదివితే "రామాయనమః" ఏర్పడుతుంది. ఇలాగే కాండాది పద్యాలలో ద్వయము, షడక్షర నియమం కనిపిస్తాయి. కాండాంత పద్యాలలో "రామషడక్షరి" చొప్పించబడి వుంది. వాస్తవానికి సంస్కృత మూలంలో కొన్ని శ్లోకాలు అభేద్యంగా, వాటి స్వరూపాలు ఊహకందకుండా వుండడంతో తెనిగించడం అంత తేలికైన విషయంగా కనిపించలేదు.

తాను రచించిన మందరం గురించి రాస్తూ వాసు దాసుగారు ఇలా అంటారు: సంస్కృతం నుంచి తెలుగుకు భాషాంతరీకరణం చేస్తున్నప్పుడు, మూలంలోని ప్రతి అక్షరానికి అలాంటి మారక్షరం వేయాలన్న ఉద్దేశం నాకు లేదు. అలా రాయడమంటే, గ్రంథం తెలుగులో వున్నా, రాసేవాడికి-చదివేవాడికి సులభంగా వుండదు. మూలాన్ని వదిలిపెట్టి, "శాఖాచంక్రమణం" కూడా చేయలేదు. "పరికర-పరికరాంకురాది" అలంకారాలను, నాకు చేతనైనంతవరకు తత్ సమానమైన అక్షరాలతో పోషిస్తూ, తెనిగించాను. అక్కడక్కడ, అర్థం చేసుకోలేక పోతేనో, మతి హీనత వల్లో, సారస్యం తెలుసుకోలేనప్పుడు కొన్ని సరైన పదాలలో లోపముండవచ్చు. శ్లోక భావాన్ని మించి పద్యం మిగిలిపోయిన సందర్భంలో, పాదాన్ని పూర్తిచేయడానికి కొన్ని పదాలను ఎక్కువగా ఉపయోగించి వుండవచ్చు కూడా. శ్లేషాలంకారాలున్న శ్లోకాలను తెనిగించేటప్పుడు, వాటికున్న అర్థాలన్నీ, ఒకే పద్యంలో వచ్చేట్లు వీలైనంతవరకు ప్రయత్నం చేశాను. "తే వనేన వనం గత్వా" లాంటి వాటిలోని శ్లేషాన్ని పోషించడం కష్టమని భావించి ఆ ప్రయత్నం మానుకున్నాను. ఒక్కోసారి, శ్లోకానికి పద్యం కాకుండా, రెండు-మూడు శ్లోకాల భావాన్ని ఒక్క పద్యంలోనే చొప్పించే ప్రయత్నం కూడా చేశాను. రాసేది లోకోపకారమైన గ్రంథం కాబట్టి సార్వజనీనంగా వుండాలన్నదే నా అభిప్రాయం. ఈ కారణం వల్ల, మూలంలో గూఢంగా వున్న సందర్భాలలో, దాని అర్థాన్ని విడమర్చి కొంచెం పెంచి రాసాను. ఏ కారణం వల్ల వాల్మీకి తన కావ్యాన్ని "నిర్వచనం" గా రాసారో, అదే కారణం వల్ల నేనుకూడా తొలుత దీన్ని నిర్వచనంగానే రచించాను. నేను సర్వజ్ఞుడను కానందున, అల్పజ్ఞుడైనందున, శక్తిహీనుడను కూడా అయినందున, మీరు ఆలోచించి, నా సాహసానికి క్షమించి, మీ పిల్లల మాటలలాగా నా రచనను అనుగ్రహించి నన్ను ధన్యుడిని చేయమని ప్రార్థిస్తున్నాను. నా దోషాలను మన్నింతురుగాక” !

ఆంధ్ర వాల్మీకి రామాయణం తర్వాత రచించబడిన పలు గద్య-పద్య రామాయణాలకు విశేష ప్రాచుర్యం లభించినా, వాసు దాసుగారి రామాయణానికి తగినంత గుర్తింపు ఎందుకు లభించలేదనేది జవాబు దొరకని ప్రశ్న. "ఆదికవి-ఆంధ్ర వాల్మీకి", యథాతథంగా మంత్రమయం చేస్తూ, ఛందః యతులను ఆయా స్థానాలలో నిలిపి తెనిగించిన వాల్మీకానికి రావాల్సినంత మోతాదులో, ఎందుకు గుర్తింపు రాలేదు? వ్యాస మహాభారతాన్ని మొదట తెనిగించిన నన్నయను "ఆదికవి" గా పిలిచినప్పుడు, వాల్మీకి రామాయణాన్ని యథా వాల్మీకంగా పూర్వ కాండలతో కలిపి ఉత్తర కాండను కూడా మొట్టమొదట తెనిగించిన వాసు దాసుగారు కూడా "ఆదికవే" కదా? నన్నయంతటి గొప్పవాడే కదా. వాస్తవానికి సరైన పోషకుడో-ప్రాయోజకుడో వుండి వుంటే, వాసు దాసుగారి ఆంధ్రవాల్మీకిరామాయణం, ఎప్పుడో-ఏనాడో నొబెల్ సాహిత్య బహుమతికో, జ్ఞానపీఠ పురస్కారానికో నోచుకుని వుండేది. ఆ మహానుభావుడికి భారతరత్న బిరుదిచ్చినా తక్కువేమో! వాసు దాసుగారు ఆంధ్ర వాల్మీకిగా లబ్ద ప్రతిష్టులయ్యారు. మహనీయమైన "మందర" రామాయణాన్ని అనేకానేక విశేషాలతో, పద్య-గద్య-ప్రతి పదార్థ-తాత్పర్య-ఛందః అలంకార విశేష సముచ్ఛయంతో, నిర్మించి, వేలాది పుటలలో మనకందించారు. రామాయణ క్షీర సాగరాన్ని "మందరం" మథించి, మనందరికీ ఆప్యాయంగా అందించింది. అయితే, దానిని ఆస్వాదించే తీరికా-ఓపికా లేని జీవులమైపోయాం మనం. భాష, శైలి, అర్థం, తాత్పర్యం కాలక్రమంలో పరిణామం చెందుతున్నాయి. నేటి తరం పఠితులూ, పండితులూ "సూక్ష్మంలో మోక్షం" కావాలంటున్నారు. కాలం గడిచిపోతున్నవి. వాసు దారుగారు మారిపోతున్న తరాలకు గుర్తు రావడం కూడా కష్ఠమైపోతున్నది. వారి "ఆర్యకథానిథుల" తోనూ, "హితచర్యల" పరంపరలతోనూ, పరవశించిపోయిన ఆ నాటి తెలుగు పాఠక మహనీయులు క్రమంగా తెరమరుగవుతున్నారు. మళ్లీ-మళ్లీ జ్ఞాపకం చేసుకోవాల్సిన, మరవలేని మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు వాసు దాస స్వామి. End

Monday, April 28, 2014

టీ వీ 5 న్యూస్ స్కాన్ చర్చలో పాల్గొంటూ: వనం జ్వాలా నరసింహారావు


Participating in Tv 5 News Scan Discussion on 27th April 2014:https://www.youtube.com/watch?v=y_p2WNbm2Fw
► Subscribe to Tv5 News Channel: http://goo.gl/NHJD9 ► Like us on Facebook: http://www.facebook.com/tv5newschannel ► Follow us on Twitter: https://twitter.co...
YOUTUBE.COMParticipating in Tv 5 News Scan Discussion on 27th April 2014 Part II:https://www.youtube.com/watch?v=grrsP8pE4yU
► Subscribe to Tv5 News Channel: http://goo.gl/NHJD9 ► Like us on Facebook: http://www.facebook.com/tv5newschannel ► Follow us on Twitter: https://twitter.co...
YOUTUBE.COM

Sunday, April 27, 2014

ఈ టీవీ నిర్వహించిన "ప్రతిధ్వని" చర్చా కార్యక్రమం

ఈ టీవీ నిర్వహించిన "ప్రతిధ్వని" చర్చా కార్యక్రమంలో (25-04-2014) న పాల్గొంటూ...:http://www.youtube.com/watch?v=vIm-W5LFfw4
etv2pratidhwani program that takes up a set of all political praties interviews.Pratidhwani all various problems questions and answers.
YOUTUBE.COM

Friday, April 25, 2014

WAR ROOM Discussion on 6Tv on 23rd April 2014
Participating in the 6Tv WAR ROOM Discussion on 23rd April 2014:http://www.youtube.com/watch?v=3wi25VyjqKc
interviews, sport, weather, entertainment, business updates and current affairs. To watch latest news videos, subscribe to 6TV News' official YouTube channel...
YOUTUBE.COM

Saturday, April 12, 2014

WAR ROOM DISCUSSION On 6Tv on 9th April 2014Participating in the WAR ROOM Discussion on 6 Tv three days ago:http://www.youtube.com/watch?feature=player_detailpage&v=yiCOzGCdsTE
6tv warroom by Venkata krishna Watch 6TV, the 24/7 Telugu news channel. dedicated for breaking news, live reports, exclusive interviews, sport, weather, ente...
YOUTUBE.COM

Tuesday, April 8, 2014

సీతా కళ్యాణంలో వాల్మీకి భావ సూక్ష్మాలు : వనం జ్వాలా నరసింహారావు

సీతా కళ్యాణంలో వాల్మీకి భావ సూక్ష్మాలు
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర జ్యోతి దినపత్రిక (08-04-2014)

(రాముడెప్పుడైతే శివుడి విల్లు విరిచాడో, అప్పుడే అతడు శివుడి కంటే గొప్పవాడైన విష్ణువని జనకుడు గ్రహించాడు. అలాంటి ఆమెకు సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా 'ఈ సీత' అన్నాడు... సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా, 'నాదుకూతురు' - తన కూతురని చెప్పాడు. సీతే లక్ష్మీదేవి అయినందువల్ల, విష్ణువు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపం. సృష్టిలో, రక్షణలో, సంహారంలో ఆమె ఆయనకు సర్వకాల సర్వావస్థలందు తోడుగా వుంటుంది. వివాహ లీల కేవలం లోక విడంబనార్థమేనని, ఆయన సొత్తును ఆయనే తీసుకొమ్మని కూడా అర్థం.)

ఈసీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా
కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్

విశ్వామిత్రుడు తన యాగ రక్షణకై దశరథ కుమారులైన రామలక్ష్మణులను వెంట తీసుకుపోయి, తన కార్యం నెరవేర్చుకున్న అనంతరం, వారికి కళ్యాణం జరిపించాలన్న ఆలోచనతో, తన వెంట మిథిలా నగరానికి తీసుకుని వెళ్తాడు. వారిని జనక మహారాజుకు పరిచయం చేసి, తన దగ్గర వున్న శివ ధనుస్సును చూపించమంటాడు. దాన్ని చూపించే ముందు సీత జన్మ వృత్తాంతం చెప్పాడు జనకుడు. తనకు నాగేటి చాలులో దొరికిన సీత వీర్యశుల్కనీ, శక్తి ప్రదర్శన చేయడమే అమెకివ్వదగిన శుల్కమనీ, ఎటువంటి వస్త్రవాహనాది అలంకారాలు ఇవ్వాల్సిన పనిలేదనీ, తన దగ్గరున్న ధనుస్సును ఎక్కుపెట్టగలవాడికే కూతురు సీతను ఇస్తానని అంటాడు. ఇంతవరకు తన దగ్గరకు వచ్చిన వారిలో ఎవరు కూడా వింటిని ఎక్కుపెట్టడం మాట అటుంచి, అల్లెతాడును ఎక్కించడం గాని, కనీసం వింటిని ఎత్తడం గాని చేయలేకపోయారని అంటాడు. అలా ధనుస్సు వృత్తాంతం చెప్పి దానిని శ్రీరామ లక్ష్మణులకు చూపించాడు. శ్రీరామచంద్రమూర్తి విల్లెక్కుపెట్టగలిగితే తాను అదృష్టవంతుడినని, అయోనిజైన సీతను ఆయన కిస్తానని, అంటాడు.

          శ్రీరాముడు, ధనుస్సుండే పెట్టె దగ్గరికిపోయి, దాని మూత తెరిచి, తాను వింటిని చూసానని, తాకానని చెప్పి, ఆయన ఆజ్ఞాపిస్తే బయటకు తీస్తానని అంటాడు. వింటిని బయటకు తీసి ఎక్కుపెడతానని కూడా అంటాడు. అలానే చేయమని జనకుడు, విశ్వామిత్రుడు చెప్పారు రాముడితో. అవలీలగా వింటిని అరచేత్తో పట్టుకొని, బయటకు తీసి, రాజులందరు చూస్తుండగా రాముడు అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోయింది. రామచంద్రమూర్తి భుజబలం చూసానని, సీత రామచంద్రమూర్తిని మగడిగా గ్రహించడమంటే అది తన అదృష్టమని, తాను ధన్యుడనయ్యానని, అంటాడు జనకుడు. తన ముద్దుల కూతురు సీత దశరథ కుమారుడు శ్రీరామచంద్రుడిని భర్తగా పొందడంవల్ల తమ జనక కులానికి కీర్తి సంపాదించిపెట్టినట్లయిందని కూడా అంటాడు జనకుడు విశ్వామిత్రుడితో.


          ఆ తరువాత జరగాల్సిన కార్యక్రమం జరిపించడానికి దశరథ మహారాజుకు కబురు చేయడం, ఆయన మందీ మార్బలంతో మిథిలా నగరానికి రావడం జరిగింది. సీతా రాముల కళ్యాణానికి ముందు ఇరు వంశాల వారు వంశ క్రమాలను గురించి అడిగి తెలుసుకుంటారు. కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలి. కులం తెలుసుకోకుండా కన్యను ఇవ్వకూడదు-తీసుకొననూ కూడదు. వివాహంలో వధూవరుల కుల జ్ఞానం అవశ్యంగా తెలియాలి. తొలుత తల్లి కులం, తండ్రి కులం పరీక్షించాలి. ధన ధాన్యాలు ఎంత సమృద్ధిగా వున్నప్పటికీ, వివాహ విషయంలో పది రకాల వంశం వారిని వదలాలని శాస్త్రం చెపుతున్నది. జాతకర్మాది క్రియలు లేని, పురుష సంతానంలేని, విద్యా శూన్యమై, మిగిలి దీర్ఘ రోగాలు కలదై, మూల రోగాలు కలదై, క్షయ-అజీర్ణం-అపస్మారం-బొల్లి-కుష్ఠు రోగాలు కలదైన వంశాలతో వివాహ సంబంధం చేయరాదు. తోడబుట్టినవాడు లేని పిల్లను, తండ్రెవరో తెలియని దానిని వివాహం చేసుకోకూడదు. ఇక ఆ తరువాత సీతా కళ్యాణ ఘట్టం మొదలవుతుంది.

"సీతను సర్వాభరణోపేతను  దా నిలిపి నగ్ని  కెదురుగ గౌస
ల్యా తనయున  కభిముఖముగక్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్ "

          అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా-శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువబెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:

ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా
కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్ "

కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత-మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు" అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు. దేవతలు, ఋషులు మేలు-మేలనీ, భళీ అనీ శ్లాఘించారు. సంతోషాతిశయంతో దేవతలు పూల వాన కురిపించారు. దేవదుందుబులను చాలా సేపు మోగించారు. వాసవుడు మొదలైన పలువురు,తమ శోకత్వాన్ని-దీనత్వాన్ని తమ మనస్సులనుండి తొలగించుకున్నారు.

ఈవిధంగా మంత్రించిన జలాలను ధారపోసి భూపుత్రి సీతను శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేసానని జనక మహారాజు సంతోషిస్తూ లక్ష్మణుడివైపు చూసి, "లక్ష్మణా ఇటు రా. దానంగా ఊర్మిళను స్వీకరించు. ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను. ఈమె చేతిని ప్రేమతో గ్రహించు" మని కోరాడు. ఊర్మిళను లక్ష్మణుడికిచ్చిన తర్వాత, భరతుడిని మాండవి చేతిని, శత్రుఘ్నుడిని శ్రుతకీర్తి చేతిని గ్రహించమని ప్రేమతో పలికాడు జనకుడు. ఇలా నలుగురు కన్యలను దశరథుడి నలుగురు కొడుకులకు ధారపోసి, జనకుడు రాజకుమారులతో, దోష రహితమైన మనసున్న వారందరు సుందరులైన భార్యలతో కలిసి, సౌమ్య గుణంగలవారిగానూ-సదాచార సంపన్నులుగానూ కమ్మని అంటాడు. జనక మహారాజు మాటలను విన్న దశరథుడి కుమారులు-రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, తండ్రి అనుమతితో భార్యల చేతులను తమ చేతుల్లో వుంచుకొని, సంతోషాతిశయంతో, మలినం లేని భక్తితో, అగ్నికి-వేదికి-మౌనీశ్వరులందరికి-రాజులకు భార్యలతో కలిసి ప్రదక్షిణ చేసారు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. పూల వాన కురిసింది. ఆకాశంలో దేవ దుందుభులు ధ్వనించాయి. దేవతా స్త్రీలు నాట్యం చేసారు. గంధర్వ కాంతలు పాడారు. రావణాసురుడి భయం వీడి, సందుల్లో-గొందుల్లో దాక్కున్న వారందరు నిర్భయంగా-గుంపులు, గుంపులుగా ఆకాశంలో నిలిచారు. మంగళ వాద్యాలు మోగుతుంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేయడంతో పెళ్లి తంతు ముగిసింది. తమ భార్యలతో దశరథ కుమారులు విడిది ఇళ్లకు పోవడంతో, వారివెంట దశరథుడు, వశిష్ట విశ్వామిత్రాది మునీశ్వరులతో, బందువులతో విడిదికి పోయారు.

సీతా కల్యాణ ఘట్టం చదివినవారికి శ్రీ సీతా వివాహ విషయ చర్చకు సంబంధించి ఆసక్తి కలగడం సహజం. కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని "కౌసల్యా సుత" అని సంబోధించాడు. ఎందుకు జనకుడు కౌసల్యా కుమారా అని పిలవాలి? స్త్రీ పేరుతో పిలవకుండా, వాడుక పేరైన "రామా" అని పిలవచ్చు కదా. దశరథ కుమారా అనకూడదా? ఆ రెండూ ఇప్పుడు సరిపోవని అర్థం చేసుకోవాలి. కేవలం రామా అని పిలిస్తే ఆ పేరుకలవారు మరొకరుండవచ్చు కదా. దశరథ కుమారా అని పిలవడానికి ఆయనకు నలుగురు కొడుకుల్లో వేరొకరు కావచ్చు కదా. కౌసల్యా కుమార అంటే ఏవిధమైన సందేహానికి తావుండదు. "ఈ సీత" అంటాడు రాముడితో. సీత, సిగ్గుతో తన చేయి పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. రామచంద్రమూర్తి తనకు తానే సీత చేయి పట్టుకుంటే, పెళ్లికాక ముందే ఎందుకలా స్వతంత్రించి కాముకుడిలా ప్రవర్తించాడని సీత అనుకోవచ్చు-లోకులూ భావించవచ్చు. అందుకే జనకుడు తానే సీతచేతిని రామచంద్రమూర్తికి చూపి "ఈ సీత" అని చెప్పాడు. అలంకరించబడిన కల్యాణమంటపంలో, నలు వైపులా నిలువుటద్దాలు వేసి వుండడంతో, అన్నిటిలోనూ సీత రూపమే కనిపించసాగింది. అద్దంలో సీతేదో-నిజమైన సీతేదో తెలుసుకోలేక నలుదిక్కులు చూస్తున్న రాముడి భ్రమపోయేట్లు, చేయి చూపి "ఈ సీత" అని చెప్పాడు జనకుడు.

"ఈ సీత" అంటే,అతి రూపవతైన సీతని, సౌందర్య-సౌకుమార్య-లావణ్యాదులలో స్త్రీలందరినీ అతిశయించిందని అర్థంకూడా వస్తుంది. "ఈ సీత" అంటే, "ఈ యగు సీత" అనే అర్థం కూడా వుంది. రాముడెప్పుడైతే శివుడి విల్లు విరిచాడో, అప్పుడే అతడు శివుడికంటే గొప్పవాడైన విష్ణువని జనకుడు గ్రహించాడు. అలాంటి ఆమెకు సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా "ఈ సీత" అన్నాడు. రాముడెంత మహా సౌందర్య పురుషుడని పేరుందో, అంతకంటే తక్కువ కాని సౌందర్యం ఆమె కుందని చెప్పదల్చుకున్నాడు జనకుడు. సీత అంటే కేవలం నాగటి చాలనే కాదని, నాగటి చాలు భూమిని ఛేదించుకొని రూపంకలదిగా ఎలా అవుతుందో, అలానే భూమిని ఛేదించుకొని రావడంవల్ల సీత అనే పేరు ఆమెకు ప్రఖ్యాతమయింది. దీనివల్ల ఆమె ఆభిజాత్యం తెలుస్తున్నది. సీత-నాగటి చాలు-అంటే కాపువాడి కృషి ఫలింపచేసి, వాడికి ఫలం కలిగించేది. అలానే రాముడు చేయబోయే కార్యాలన్నీ, సీత వలనే ఫలవంతమవుతాయనీ, ఆమె సహాయం లేకుండా రాముడి కృషి వ్యర్థమని, ప్రతిఫలాపేక్ష లేకుండా అతడికి సహాయపడుతుందని జనకుడి మనస్సులోని ఆలోచన.

          ఆకాశ గంగానది శాఖైన సీత ఏవిధంగా ఒకసారి తనను సేవించినవారి పాపాలను ధ్వంసం చేస్తుందో, అలానే "ఈ సీత" తనకొక్కసారి నమస్కారం చేసిన వారి పాపాలను ధ్వంసంచేస్తుంది. కౌసల్యా సుతుడైన రాముడు యోనిజుడని, సీత అయోనిజని, కాబట్టి ఆభిజాత్యంలో రాముడికంటే తక్కువైందేమీ కాదని జనకుడి భావన. సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా, "నాదుకూతురు"-తన కూతురని చెప్పాడు. అలాంటి తనకూతురును, ఎలా ప్రేమించాలో అలానే ప్రేమించమని సూచించాడు. సీతంటే జన్మపరిశుద్ధి అనీ, "నాదుకూతురు" అంటే నానా సపరిశుద్ధి అనీ తెలుపబడింది. "నీ సహధర్మచరి" అనడమంటే, రాముడి విషయంలో ఎలా వుంటుందోనని ఆలోచించాల్సిన పనిలేదనే అర్థం స్ఫురిస్తుంది. రాముడేది ధర్మమని భావిస్తాడో, ఆ ధర్మమందే ఆమె ఆయనకు తోడుగా వుండి ఆ కార్యాన్ని నిర్వహిస్తుంది. రాముడు తండ్రి వాక్యాన్ని ఎలా పాలించాడో, అలానే ఆయన వాక్యాన్ని సీత పాలిస్తుందని అర్థం. సీతే లక్ష్మీదేవి అయినందువల్ల, విష్ణువు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపం. సృష్టిలో, రక్షణలో, సంహారంలో ఆమె ఆయనకు సర్వకాల సర్వావస్థలందు తోడుగా వుంటుంది. వివాహ లీల కేవలం లోక విడంబనార్థమేనని, ఆయన సొత్తును ఆయనే తీసుకొమ్మని కూడా అర్థం.


Saturday, April 5, 2014

TRS Manifesto: A discussion on TV 5

Participating in TV5 Discussion on TRS manifesto:http://www.youtube.com/watch?feature=player_detailpage&v=j8Mi5opgWUA
► Subscribe to Tv5 News Channel:http://goo.gl/NHJD9 ► Like us on Facebook:http://www.facebook.com/tv5newschannel ► Follow us on Twitter: https://twitter.co./..
YOUTUBE.COM|BY TV5NEWSCHANNELParticipating in TV 5 Discussion on TRS manifesto:http://www.youtube.com/watch?feature=player_detailpage&v=utCOadCxXjg
► Subscribe to Tv5 News Channel:http://goo.gl/NHJD9 ► Like us on Facebook:http://www.facebook.com/tv5newschannel ► Follow us on Twitter: https://twitter.co./..
YOUTUBE.COM|BY TV5NEWSCHANNEL

Thursday, April 3, 2014