Monday, November 28, 2016

చరిత్ర చెక్కిన ఆయుధం కాస్ట్రో : వనం జ్వాలా నరసింహారావు ....ఆంధ్రజ్యోతి దినపత్రిక (29-11-2016)

చరిత్ర చెక్కిన ఆయుధం కాస్ట్రో
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (29-11-2016)

అగ్రరాజ్యమైన అమెరికా దేశాన్ని అర్ధ శతాబ్దం పాటు గడగడ లాడించి, ఆ దేశాధ్యక్షులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన కాస్ట్రో, తన 90 వ ఏట మరణించారు. ఒక విప్లవకారుడు, ఒక ఉద్యమనేత, ఒక కమ్యూనిస్ట్ యోధుడు, అలనాటి ప్రపంచ నేతల్లో అగ్రగణ్యుడు, ఫిడల్ కాస్ట్రో మరణం, ఆ దేశవాసులకే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆయన లక్షలాది అభిమానులకు, ముఖ్యంగా ఆయనను అందరికన్నా ఎక్కువగా అభిమానించే అనేకమంది భారతీయులకు దుఃఖం కలిగించే వార్త. కాస్ట్రో జీవనయానమే ఒక ఉద్యమం...ఎందరికో స్ఫూర్తి దాయకం.

2006 లో శస్త్ర చికిత్స జరిగిన తరువాత, క్షీణించిన ఆరోగ్యం కారణాన, క్యూబన్ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఫిడల్ కాస్ట్రో స్థానంలో ఆయన సోదరుడు రావుల్ కాస్ట్రో పార్టీ-పాలనా బాధ్యతలను చేపట్టాడు. దరిమిలా, ఫిబ్రవరి 19, 2008 న దేశాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేసిన కాస్ట్రో స్థానంలో 15 మంది సభ్యులతో, రావుల్ కాస్ట్రో నాయకత్వాన పోలిట్ బ్యూరో ఏర్పాటైంది. అధికారాన్ని వదిలినప్పటికీ, క్యూబన్ రాజకీయాలలో, కాస్ట్రో గళం మాత్రం చివరిదాకా వినిపించిందనాలి. కాస్ట్రోను ప్రేమించినా-ద్వేషించినా, ఆయన లేని దేశంలో జీవించడాన్ని ఊహించలేరు చాలామంది క్యూబన్ పౌరులు. అహర్నిశలూ, క్యూబాలో సామ్యవాదం కొనసాగేలా తన శాయశక్తులా కృషి చేసి, ఆ వ్యవస్థను బలహీన పరిచేందుకు ఎవరు ప్రయత్నించినా వారిని నిర్దాక్షిణ్యంగా కాస్ట్రో అణచి వేయడమే దానికి కారణం!

కాస్ట్రో, తన 30 వ ఏట, విజయ గర్వంతో, హవానాలో అడుగిడినప్పుడు, అప్పటి వరకు పాలించిన బటిస్టాను పదవీచ్యుతుడిని చేసిన "హీరో" గా స్వాగతం పలికారు క్యూబన్లు. అధికారంలోకి వచ్చిన అచిర కాలంలోనే, అమెరికన్ల ఆధీనంలో వుంటూ వస్తున్న ఆస్తులను-భూములను ప్రభుత్వం జప్తు చేసి తన అధీనంలోకి తెచ్చుకోవడంతో, అమెరికా దేశంలో ప్రజాభిప్రాయం కాస్ట్రోకి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయింది. ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించిన కాస్ట్రో, తన వ్యతిరేక దారులను ఉక్కుపిడికిలితో అణచివేశాడు. ఎప్పుడైతే తన ప్రభుత్వం మద్దతుకోసం కాస్ట్రో సోవియట్ యూనియన్ వైపు దృష్టి సారించాడో, స్నేహ హస్తం సారించాడో, అప్పుడే, ప్రపంచ పశ్చిమ భూభాగంలో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేపింది. ఆ పరిణామంతో ఖంగుతిన్న అమెరికాను, కాస్ట్రోను పదవీచ్యుతుడిని చేయాలన్న ఆలోచనలో పడవేసింది. 1961 లో, 1962 లో, ఆ తరువాత మధ్య-మధ్య తమ దేశంపై అమెరికా చేసిన దాడులను, యుద్ధ వ్యూహంలో ఆరితేరిన కాస్ట్రో, తనకు అనుకూలంగా మలచుకున్నాడు. తన సహజమైన విప్లవాత్మక ధోరణిలో, అమెరికా దేశాన్ని క్యూబన్ల దృష్టిలో శత్రువుగా చిత్రించి చూపి, క్యూబన్ల రక్షకుడుగా నిలిచాడు కాస్ట్రో. కమ్యూనిజాన్ని కౌగలించుకుని, అమెరికా వ్యతిరేకతను ప్రస్ఫుటంగా వ్యక్తపరుస్తూ, రెండింటినీ తాను అధికారంలో కొనసాగేటట్లు మలచుకున్నాడు.

కాస్ట్రో ఆగస్ట్ 13, 1926 న క్యూబాలో జన్మించాడు. చిన్న తనంనుంచే విప్లవ భావాలను పుణికిపుచ్చుకున్న కాస్ట్రో పదమూడేళ్ల వయస్సులోనే, తండ్రి వ్యవసాయ క్షేత్రంలో, సమ్మెను నిర్వహించాడు. తల్లిదండ్రులిరువురూ నిరక్షరాస్యులైనప్పటికీ, ఫిడల్‍ను బోర్డింగ్ పాఠశాలకు పంపారు. ఫిడల్ కాస్ట్రో తెలివైన-చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు. పాఠశాల ఉత్తమ క్రీడాకారుడుగా బహుమతి పొందాడు కూడా. చదువు పూర్తైన తరువాత హవానాలో న్యాయవాదిగా జీవితం ప్రారంభించాడు. నిరంతరం బీద-పేదల కేసులే వాదించడానికి ఒప్పుకోవడం వలన ఆర్థికంగా ఎదగలేక పోయాడు. ఈ నేపధ్యంలో క్యూబాలో నెలకొన్న ఆర్థిక అసమానతలను అర్థం చేసుకో సాగాడు. దేశాన్ని నియంత్రిస్తున్న అమెరికన్ వ్యాపార వేత్తల ఐశ్వర్యాన్ని, అంతస్తును అసహ్యించుకో సాగాడు. తిరుగుబాటు భావాలు పెరగ సాగాయి.

21 సంవత్సరాల వయస్సులో, 1947 లో, క్యూబన్ పీపుల్స్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నాడు కాస్ట్రో. అవినీతికి, అన్యాయానికి, బీదరికానికి, నిరుద్యోగానికి, చాలీ-చాలని జీతభత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆ పార్టీ భావాలు ఆయనకు నచ్చాయి. ఐదేళ్ల లోనే, 1952 లో, ఆ పార్టీ పక్షాన ఎన్నికలలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికయ్యాడు. సహజంగా మంచి వాగ్ధాటి కలిగిన కాస్ట్రోకు పార్టీలోని యువకుల మద్దతు బాగా లభించింది. క్యూబన్ పీపుల్స్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్న తరుణంలో, జనరల్ ఫల్జెన్సియో బటిస్టా, సైన్యం తోడ్పాటుతో, అధికారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకుని ఎన్నికలు జరగకుండా ఆపాడు. ఇక లాభం లేదనుకున్న కాస్ట్రో విప్లవం ద్వారానే క్యూబన్ ప్రజలకు విముక్తి లభిస్తుందని భావించాడు. 1953 లో 123 మంది స్త్రీ-పురుష విప్లవకారుల సహాయంతో, సైన్యం నివసించే మోంకాడా ప్రాంతంపై దాడి చేశాడు. బటిస్టాను పదవీచ్యుతుడిని చేయాలన్న వ్యూహం అప్పటికి బెడిసికొట్టింది. కాస్ట్రో అరెస్టు అయ్యాడు. అదృష్టవశాత్తు, కాస్ట్రోను వురితీయకుండా దగ్గర లోని పౌర జైలుకు పంపారు. జైలులో కూడా మరణానికి చేరువైన సందర్భాలున్నాయి. ఆపాటికే చోటుచేసుకున్న ప్రపంచ వ్యాప్త ప్రజాభిప్రాయ నేపధ్యంలో కాస్ట్రోను చంపించే ప్రయత్నం మానుకున్నాడు బటిస్టా. ముద్దాయిగా తనను విచారణ చేసిన అవకాశాన్ని ఉపయోగించుకున్న కాస్ట్రో, సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి దేశం ఎదుర్కుంటున్న సమస్యలను ఏకరవు పెట్టాడు. ఆయన ఆనాడిచ్చిన ఉపన్యాసాన్ని తరువాత "హిస్టరీ విల్ అబ్సాల్వ్ మి" అనే పేరుతో పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది. కాస్ట్రోకు పదిహేనేళ్ల కారాగార శిక్ష విధించబడింది. పుస్తకం, విచారణ, జైలు శిక్ష లాంటివి క్యూబన్ల దృష్టిలో, ప్రపంచం దృష్టిలో కాస్ట్రోను హీరో చేశాయి. క్యూబన్ పౌరుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపధ్యంలో, రెండేళ్ల జైలు శిక్షను మాత్రమే అనుభవించిన కాస్ట్రోను ప్రభుత్వం విడుదల చేసింది. క్యూబా నుంచి మెక్సికోకు వెళ్లిన కాస్ట్రో, బటిస్టా ప్రభుత్వాన్ని కూల దోసేందుకు వ్యూహం పన్న సాగాడు.

యుద్ధ సామాగ్రిని సరిపోయినంత మోతాదులో సమకూర్చుకున్న అనంతరం, ఎనభై మంది విప్లవకారులతో కలిసి కాస్ట్రో, చి గువేరా, జాన్ ఆల్మీడా 1956 లో క్యూబాలోకి ప్రవేశించారు. మోంకాడా సైనిక స్థావరాల మీద దాడి చేసిన తేదీకి గుర్తుగా, ఈ బృందాన్ని "జులై 26 ఉద్యమం" గా పిలవ సాగారు. సియారా పర్వత శ్రేణిలో తమ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని యుద్ధం కొనసాగించాలని ఆ బృందం ఎత్తుగడ వేసుకుంది. పర్వతాల దగ్గరకు చేరుకునే లోపునే ప్రభుత్వ సేనలు వారిపై దాడి చేశాయి. సియారాకు చేరుకునే సరికి కేవలం పదహారు మంది మాత్రమే మిగిలారు. వారి వద్ద వున్న ఆయుధాలు మొత్తం కలిపి పన్నెండే! తరువాత కొన్ని నెలల పాటు సమీపంలోని-చుట్టుపక్కల సైనిక స్థావరాలపై దాడి చేసి కాస్ట్రో బృందం తమ ఆయుధ సంపత్తిని పెంపొందించుకుంది. వారున్న ప్రాంతాన్ని ఆక్రమించుకుని స్వాధీనంలోకి తెచ్చుకున్న వెంటనే అక్కడి పేద రైతులకు భూమిని పంచారు. ఆ రైతుల మద్దతు వారికి పూర్తిగా లభించింది. కాస్ట్రో జాడ చెప్పమని పలువురిని హింసించ సాగారు. బటిస్టా ప్రభుత్వం చేయిస్తున్న అరాచకాలకు నిరసనగా ప్రజల మద్దతు కాస్ట్రోకు పెరగ సాగింది. 1958 లో నలబై ఐదు సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వానికి రాసిన లేఖలో "జులై 26 ఉద్యమం" కు మద్దతు తెలిపాయి.


ప్రభుత్వ సేనలపైన దెబ్బ మీద దెబ్బ తీసుకుంటూ ముందుకు సాగింది "జులై 26 ఉద్యమం". 1958 వేసవికాలంలో వేయి మందికి పైగా బటిస్టా సైనికులు చనిపోవడమో, గాయపడడమో జరిగింది. బటిస్టా సేనల మాదిరి కాకుండా, తమకు పట్టుబడిన ప్రభుత్వ సైనికులను గౌరవంగా చూడడం చేసేది "జులై 26 ఉద్యమం" బృందం. యుద్దంలో అనుకూలంగా లేని ప్రతిసారి బటిస్టా సేనలు కాస్ట్రో సేనలకు లొంగిపోవడానికి ఇది దోహదపడింది. క్రమేపీ సేనలు మొత్తం గొరిల్లాలతో కలవడం ప్రారంభమైంది. అమెరికా బటిస్టా ప్రభుత్వానికి మద్దతుగా అధునాతన ఆయుధాలను సరఫరా చేసింది. గొరిల్లాల ముందర అవి వాడడం తెలియని ప్రభుత్వ సేనలు అపజయం దిశగానే పోసాగారు. మార్చ్ 1958 లో బటిస్టా సేనల విఫలం చూసిన అమెరికా, ఆ దేశంలో ఎన్నికలు జరిపించమని సూచించింది. ఆ సూచనను పాటించి ఎన్నికలు జరపడం జరిగింది కాని, ఓటర్లు ఎన్నికలను పెద్ద ఎత్తున బహిష్కరించారు. ఎదురు దాడిలో బటిస్టాను ఓడించగలనన్న నమ్మకంతో కాస్ట్రో గొరిల్లాలు ప్రధాన నగరాల వైపుగా కదల సాగారు. అమెరికాను సంప్రదించిన బటిస్టా, దేశం వదిలి పారిపోవడానికి సన్నద్ధమయ్యాడు. మిగిలిన కొందరు సైనిక జనరల్స్ మిలిటరీ పాలన తేవాలని చేసిన ప్రయత్నాలను కాస్ట్రో తిప్పికొట్టాడు. ఆ ప్రతిపాదనకు వ్యతిరేకంగా, దేశ వ్యాప్త కార్మిక-కర్షక-సకల జనుల సమ్మెకు పిలుపిచ్చాడు. పెద్ద సంఖ్యలో ఆ పిలుపుకు లభించిన స్పందనను గమనించిన మిలిటరీ వెనక్కు తగ్గింది. జనవరి 9, 1959 న కాస్ట్రో విజయ పథంవైపు దూసుకుంటూ, హవానా నగరం చేరుకుని క్యూబా నూతన నాయకుడుగా ప్రజల ముందుకొచ్చాడు.

కాస్ట్రో పాలన అమెరికాకు రుచించలేదు. క్యూబాలోని అమెరికన్ ఆస్తులను, టెలిఫోన్ కంపెనీని జాతీయం చేయడమే దీనికి కారణం. అమెరికా పట్ల తన వ్యతిరేకతను బాహాటంగానే ప్రదర్శించేవాడు కాస్ట్రో. తన దేశంలో పండిన చక్కెరను కొనడానికి అమెరికా అంగీకరించక పోవడంతో, సోవియట్ యూనియన్‍తోను, ఇతర తూర్పు యూరోప్ దేశాలతోను చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అమెరికా నిరాకరించిన ఆయుధ సామాగ్రిని, సాంకేతిక నిపుణులను, మెషినరీని ఇవ్వడానికి కూడా సోవియట్ యూనియన్ అంగీకరించింది. నాటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్హోవర్ కోపంతో కాస్ట్రోకి పాఠం చెపుదామనుకున్నాడు కాని, అది బెడసి కొట్టి, కాస్ట్రోను సోవియట్ యూనియన్‌కు మరింత చేరువ చేసింది. క్యూబా సోవియట్ యూనియన్ సైనిక స్థావరం అవుతుందేమోనన్న భయం కలగ సాగింది ఐసెన్హోవర్‍కు. క్యూబా వెలుపల గొరిల్లా సేనలను తయారు చేసి కాస్ట్రోను పదవీచ్యుతుడిని చేసే ప్రణాళిక సిద్ధం చేసింది అమెరికన్ ప్రభుత్వం. ఆయనను కనీసం ఇరవై పర్యాయాలన్నా మట్టుబెట్టే ప్రయత్నం చేసింది సిఐఏ. 1961 లో ఐసెన్హోవర్ స్థానంలో వచ్చిన జాన్.ఎఫ్.కెన్నెడీ మెడకు చుట్టుకుంది క్యూబన్ వ్యవహారం. కాస్ట్రోను తుదముట్టించడానికి కెన్నెడీ ప్రయత్నాలు కూడా ఫలించలేదు.

సోవియట్ యూనియన్ మరోవైపు తన క్యూబా మద్దతును ద్విగుణీకృతం చేసింది. అణుయుద్ధం జరిగే ప్రమాదం దిశగా అమెరికా-సోవియట్ యూనియన్ కదల సాగాయి. దీనికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలు మొదలయ్యాయి. రష్యా ప్రధాని నికితా కృశ్చేవ్ తన కోపాన్ని కెన్నెడీకి వరుస వుత్తరాల ద్వారా వ్యక్త పరిచాడు. క్యూబాపైన దాడికి దిగబోమని అమెరికా హామీ ఇస్తే, తాము తమ మిస్సైల్స్ ను ఉపసంహరించుకుంటామని కృశ్చేవ్ అన్నాడు. కెన్నెడీ ఆ ప్రతిపాదనకు అంగీకరించడంతో అప్పటికి అణు యుద్ధ ప్రమాదం తప్పింది. అమెరికా-సోవియట్ యూనియన్ల మధ్య అణుయుద్ధ ప్రమాదం సంభవించాల్సిన ఏకైక సన్నివేశం "క్యూబన్ మిస్సైల్ సంక్షోభం" ఆ విధంగా అప్పటికి సమసి పోయింది. ఇక అక్కడినుంచి ప్రచ్చన్న యుద్ధం మొదలైంది.


జులై 31, 2006 న తన రాజకీయ బాధ్యతలను తమ్ముడు రావుల్‍కు బదలాయించాడు కాస్ట్రో. ఫిబ్రవరి 19, 2008 న తానిక భవిష్యత్‍లో దేశాధ్యక్షుడుగా కాని, సైనికాధికారిగా కాని వుండబోనని ప్రకటించాడు. ఆ విధంగా, 1959 చారిత్రాత్మక విప్లవం అనంతరం, మొట్టమొదటి సారి, క్యూబాలో నాయకత్వ మార్పిడి జరిగింది. "క్యూబాలో సామ్యవాద సిద్ధాంతాన్ని ఆచరణలో కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, పదిలపరచుకుంటూ, బధ్రపరుచుకుంటూ, త్రికరణ శుద్ధిగా కొనసాగించడానికి, క్యూబా దేశం సామ్రాజ్యవాదం వైపు మొగ్గు చూపకుండా వుండేందుకు నా పదవిని ఉపయోగించుకుంటాను" అని, ఆ సందర్భంగా ప్రతిజ్ఞ చేశాడు రావుల్. ప్రపంచ విప్లవ చరిత్రలో మరో అంకం ముగిసింది.

Sunday, November 27, 2016

లంఖినిని చావు దెబ్బ తీసిన హనుమ ...ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు 20 వ భాగం - సుందర కాండ : వనం జ్వాలా నరసింహా రావు

లంఖినిని చావు దెబ్బ తీసిన హనుమ
ఆంధ్ర వాల్మీకి రామాయణంలో ఛందః ప్రయోగాలు
20 వ భాగం - సుందర కాండ
వనం జ్వాలా నరసింహా రావు
సూర్య దినపత్రిక (28-11-2016)

లంకలో ప్రాకారం చేరి తిరిగి ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు. వానర సైన్యం లంకలోకెలా రాగలదని యోచించాడు. రామ లక్ష్మణుల బల పరాక్రమాలను బేరీజు వేసుకుని, ధైర్యం తెచ్చుకుంటాడు. లంకా నగరంలో ప్రవేశిస్తున్న హనుమంతుడిని అడ్డుకున్న లంకాధి దేవత లంకిణిని, తన ఎడమ చేతి పిడికిలితో పొడిచాడు హనుమంతుడు. తనను రక్షించమని వేడుకున్న లంకిణి, లంకా నాశనానికి సమయం వచ్చిందని అంటుంది. లంకలో తిరగమంటుంది. లంకలో ప్రవేశించి, సంచరిస్తున్న హనుమంతుడు, వర్ణనాతీతమైన రావణుడి అంతఃపురాన్ని చూసినప్పుడు దాన్ని వర్ణిస్తూ "వంశస్థము" వృత్తంలో రాశారీ పద్యాన్ని కవి:

వంశస్థము:              సహేమరత్నోజ్జ్వల చక్రవాళమున్
                        మహార్హముక్తామణి మండి తాంతము౯(న్)
                        మహా సితాభ్రాగురు మంజుగంధమై
                        రహించురక్షోధిపు రాణివాసమున్ -85

తాత్పర్యం:     బంగారం, ఇతర రత్నాలతో ప్రకాశిస్తున్న ప్రాకారంతో, విలువైన ముత్యాలు-రత్నాలతో అలంకరించబడిన లోగిలితో, అగరు చెక్కల కమ్మని వాసనలతో కూడి వున్న రావణుడి అంతఃపురాన్ని చూశాడు హనుమంతుడు.

ఛందస్సు:      వంశస్థము వృత్తానికి "జ" "త" "జ" "ర" "గ" గణాలు, ఎనిమిదింట యతి వుంటాయి.
రావణుడి అంతఃపురాన్ని బయట నుంచే చూసిన హనుమంతుడు, ఆ తర్వాత, లోనికి ప్రవేశించాడు. ఆకాశం మధ్యలో, సుమారు తొమ్మిదిన్నర గంటల సమయంలో, హనుమంతుడు చూసిన చంద్రుడిని వర్ణించడానికి, వాసు దాస కవి లయగ్రాహి, చారుమతి వృత్తాల్లో రెండు పద్యాలను ఈ విధంగా రాశారు:

లయగ్రాహి:    అంత హనుమంతుడు న భోంతరమునఁ గనియె
                వింత లగు వెన్నెలల కాంతులు వెలుంగన్
                గాంత మగుమంద వృష కాంతునిగతిన్ మలయు
                చంతట జగంబున ని తాంతరుచి మీరన్
                స్వాంతములు హాయి గొన సంతసమున్ జలధి
                కాంతుఁ డు తరంగముల గంతు లిడు నట్లా
                శాంతముల నంటునటు లెంతయును జేయునుడు
                కాంతు జనసంచయదు రంతదురితాంతు౯(న్) -86

చారుమతి:     ఏకాంతి పొల్చునొ మ హీస్థలి మందరస్థ మై
                యేకాంతి సంజ రహి యించి నదీశ్వరస్థ మై
                యేకాంతియొప్పు సర సీద్ధసరోరుహస్థ మై
                యాకాంతి యప్డు పొలు పారె నిశాకరస్థమై - 87

తాత్పర్యం:    
హనుమంతుడు చూసిన ఆనాటి చంద్రుడు, వినోదకరమైన వెన్నెల కాంతులను విరజిమ్ముతూ, అందమైన ఎడ్ల గుంపులో ఆబోతులా తిరుగుతూ, ప్రపంచమంతా తన చల్లటి కాంతిని వ్యాపింప చేస్తూ,           జనాల మనస్సుల్లో సుఖపడ్తున్నామన్న ఆలోచన కలుగ చేస్తూ, ఉప్పొంగిన సముద్రుడి నృత్యాన్ని తలపిస్తూ, ఆబాలగోపాలానికి దుఃఖ నాశనం చేస్తున్నట్లున్నాడు. భూమ్మీదున్న మందర పర్వతపు కాంతి, సాయం సమయంలో సముద్రంలో వున్న కాంతి, సరస్సులందలి తామర పూల కాంతిని పోలిన కాంతే చంద్రుడిలో వుందప్పుడు.


ఛందస్సు:      లయగ్రాహికి భ---------గణాలుంటాయి. ప్రాస యతే కాని-యతి లేదు. ఇది సమ వృత్తాల్లో చేరింది కాదు-మాలికా వృత్తాల్లో చేరింది.
చంద్ర వర్ణనను కొనసాగిస్తూ, వాసు దాసు గారు, మరో పద్యాన్ని వంశస్థము వృత్తంలో రాశారీవిధంగా:

వంశస్థము:    వినష్టశీతోదక బిందుపంకుఁ డు౯(న్)
                ఘనగ్రహగ్రాహవి నష్టపంకుఁ డు౯(న్)
                వినోదలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకుఁ డు౯(న్)
                వినిద్రరుగ్యుక్తిఁ జనె౯(న్) శశాంకుడు౯(న్) -88
తాత్పర్యం:     నశించిన మంచు బిందువుల మాలిన్యం కల వాడును, తన కాంతితో బృహస్పతి లాంటి పెద్ద గ్రహాల           కాంతిని కప్పిన వాడును, ఆశ్చర్యకరమైన కాంతికి ఆశ్రయమై-నిర్మలమైన అంకము కలవాడై, విశేష           కాంతితో చంద్రుడున్నాడు.
ఛందస్సు:      వంశస్థము వృత్తానికి "జ" "త" "జ" "ర" "గ" గణాలు, ఎనిమిదింట యతి వుంటాయి.

త్రయోదశి నాటి ప్ర దోష కాలంలో ప్రకాశిస్తున్న చంద్రుడి కాంతికి పటాపంచలైన చీకటిలో, కమ్మని వీణా నాదాల మధ్య, లంకలోని రాక్షస స్త్రీలను చూశాడు హనుమంతుడు. ఆయన అలా చూసిన స్త్రీల మధ్య సీతాదేవి వుందేమోనని వెతుకుతాడు. వారి ముఖ నేత్రాలను పరికించి చూసి వారంతా దేవతా స్త్రీలా? రాక్షస స్త్రీలా అని పరీక్ష చేశాడు. తాను చూస్తున్న స్త్రీలలో సీతా దేవేనని భావించడానికి అర్హతలున్న వ్యక్తిని చూడలేక పోయినందుకు బాధ పడిన సందర్భాన్ని దోదకము వృత్తంలో రాశారు కవి ఇలా:

దోదకము:     సీతను రాముని శ్రీతరలాక్షిన్
                వాతతనూజుడు పట్టనమందున్
                భీతిల కారసి వేదిజ లేమిన్
                జాత మహావ్యథ సంకటమందెన్ -89

తాత్పర్యం:     శ్రీరామచంద్రమూర్తి భార్యైన సీతా దేవి కొరకు, భయపడకుండా, అన్ని రహస్య ప్రదేశాలలో, వెతికినప్పటికీ, కనపడక పోవడంతో, హనుమంతుడు ఎంతగానో దిగులు చెందాడు.

ఛందస్సు:      దోదకము నకు మూడు "భ" గణాలు, రెండు గురువులు, ఏడింట యతి స్థానముంటుంది. 

Saturday, November 26, 2016

హిందూ వివాహ వేడుక...ఒక మరపురాని ఘట్టం : వనం జ్వాలా నరసింహారావు

హిందూ వివాహ వేడుక...ఒక మరపురాని ఘట్టం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర ప్రభ దినపత్రిక
(16, 23, 30 అక్టోబర్; 6, 13, 20, 27 నవంబర్ 2016)

(ఏడు భాగాలుగా నేను రాసిన "హిందూ వివాహ వేడుక ఒక మరపురాని ఘట్టం" ఆంధ్ర ప్రభలో వారంవారం ప్రతి ఆదివారం ప్రచురించారు)

ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి, భవిష్యత్ దంపతులుగా, కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ, జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం.

పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో, ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన "పెళ్లి పెద్దలు" సంధాన కర్తలుగా వ్యవహరించి, కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఒప్పించి, కార్యక్రమానికి నాంది పలుకుతారు. సాంప్రదాయం ప్రకారం అబ్బాయికి చెందిన వారు బంధు-మిత్ర-సపరివార సమేతంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి, అమ్మాయిని చూస్తారు. వధూవరులు పరస్పరం నచ్చాక, ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవుతారు. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకుంటారు. వరకట్న నిషేధం లాంటివి అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రులు కట్న కానుకలు, ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకుంటారు.

"పెళ్ళి చూపుల" సాంప్రదాయం ప్రకారం అబ్బాయి బంధు-మిత్ర-సపరివార సమేతంగా కాబోయే మా మామ గారింటికి వెళ్ళి, అమ్మాయిని చూడాలి. తర్వాత జరగాల్సింది ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవడం. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకోవడం. వరకట్న నిషేధం అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకోవాలి.

వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్ధానం. అంటే: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం) తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు "నిశ్చయ తాంబూలం". వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి వేడుక వధువు ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది. దీన్నే ఇప్పుడు "ఎంగేజ్ మెంట్" అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో తంతును పెళ్లికంటే ఘనంగా జరుపుకుంటున్నారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు.

సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి. తాహతును బట్టి కొంచెం మార్పులు-చేర్పులు వుండొచ్చు. ఇరుపక్షాల వాళ్ళు మరిచిపోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా, ఒక కాగితం మీద ఇచ్చి-పుచ్చుకోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే.

సాధారణంగా ఆడ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతక ద్రవ్యాలు, వరుడి ధోవతులు, మధు-పర్కాలు (వరుడుకి ఇవ్వాల్సిన బట్టలు), ఉత్తర జంధ్యాలు, భటువు, కాళ్లుగడిగే పళ్లెం-బిందెలు, కల్యాణ వేదికపై వరుడిని కూచోబెట్టే చిన్న బల్ల, వివాహంలో వివిధ సందర్భాలలో (స్థాళీపాకం, నాగవల్లి, సదశ్యం, అప్పగింపులు, మేజువాణి లాంటివి) వరుడికి పెట్టాల్సిన బట్టలు (ధోవతులు, పట్టు బట్టలు, సూట్, పాంట్-షర్ట్ లు లాంటివి), వరుడివైపు బంధువులకు పెట్టాల్సిన బట్టలు, అప్పగింతల బట్టలు, పెళ్ళైన తర్వాత మగ పెళ్ళివారింట్లో గృహప్రవేశం సందర్భంగా-సత్యనారాయణ వ్రతమప్పుడు వధూ-వరులకు పెట్టవలసిన బట్టలు, ఆడ బిడ్డలకు-అత్తగారికి ఇవ్వదల్చుకున్న లాంఛనాలు, పెళ్ళి కూతురుకు ఇచ్చే సారె (సారె పెట్టెలో పెట్టాల్సిన వస్తువులు-ఏభై ఒక్క కొబ్బరి చిప్పలు, ఐదు రవికె గుడ్డలు, రెండుంపావు కిలోల శనగ-సున్నిపిండి, కిలోంబావు పసుపు-అందులో సగం కుంకుమ, చీరె-ధోవతులు, ఐదు రకాల తీపి పదార్థాలు) ముఖ్యమైనవి.

సాధారణంగా మగ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతకంలో బావమరిదికి పెట్టాల్సిన బట్టలు, పెళ్ళి కూతురుకు పెట్టాల్సిన పట్టు చీరెలు-ఇతర చీరెలు, నగలు-ఆభరణాలు, నల్లపూసలు, పుస్తె (ఒకటి పుట్టింటి వారు, ఇంకొకటి అత్తగారింటి వారు ఇవ్వాలి), మెట్టెలు, ముత్తవుతల్లి (వధువు అమ్మమ్మ) కిచ్చే కట్నం, వధువు తల్లి కడుపు చీరె-తండ్రికి బట్టలు, ప్రధానపు వుంగరం లాంటివి.

వధూవరుల తారా బలం-చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. "పెళ్లినాటి ప్రమాణాలు" భవిష్యత్ లో దంపతులు తు. తప్పకుండా అమలు చేయాలంటే "ముహూర్త బలం" ముఖ్యమని హిందువుల నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ వుంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో-పరోక్షంలో వధూవరుల తల్లి-తండ్రుల మధ్య కుదిరిన ఇచ్చి-పుచ్చుకునే ప్రతి చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదాయంలో భాగమే. ఇదంతా "ఆచారం-పద్ధతి". పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోంటే పెళ్లి సరంజామా కొనడం అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. పట్టుచీరలు, బంగారు ఆభరణాలు, నూతన వస్తువులు.. .. ఎన్నో కొంటారు.

నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారం "శుభ లేఖలు"గా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగు వైపులా పసుపు పూస్తారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అరుదుగా కలిసే చుట్టపక్కాలతో సహా బంధువులందరూ కలుసుకోగలిగే "సామాజిక ఏర్పాటు" పెళ్ళిళ్లు. కలయికలకు వేదికగా పెళ్ళి వారి ఇల్లు (కల్యాణ మంటపం) మారిపోతుంది. ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ "శుభ లేఖలు" పంపించే ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని మరిచిపోవడం సహజంగా జరుగుతుంది. వాళ్లకు కోప-తాపాలు కూడా వస్తాయి. కాకపోతే వచ్చినంత త్వరగా తగ్గిపోతాయి కూడ. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి పెళ్లిలోనూ-ప్రతివారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. చిరు కోపాలు రాకుంటే పెళ్ళి శోభ రానట్లే.

పెళ్లిరోజుకు ఒకరోజు ముందర "స్నాతకం" అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే "సంస్కారం", ప్రధానంగా, వరుడిని "బ్రహ్మచర్యం" నుండి "గృహస్థాశ్రమం" స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో "గృహస్థాశ్రమం" స్వీకరించే ఏర్పాటిది. సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని "సత్యాన్న..." అన్న ఒక శ్లోక రూపంలో వుంటుంది.

"సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను, పొరపాటు పడవద్దు" అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ-ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమనీ బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ, "వరుడికి శుభం కలుగుగాక" అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచనా విధానాన్ని తెలియచేశాడు పురోహితుడిక్కడ.

స్నాతకానికి "సమా వర్తనం" అన్న పేరు కూడా వుంది. సమా వర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమా వర్తనం అంటారు. కాశీ యాత్ర, హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం సాంప్రదాయంలో మరో ముఖ్యమైన ఆచారం. కాశీ ప్రయాణం - బాజా భజంత్రీల మద్య వరుడు గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావు కోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు, కాశీకి పోతున్నానని చెప్పి బయలు దేరుతాడు. వధువు సోదరుడు వచ్చి "అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి" అని చెప్పి బొట్టు పెట్టి,బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వెనుకకు తీసుకొని వస్తాడు.

కాశీ యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నానని, దానికి బంధు-మిత్రుల అనుజ్ఞ కావాలని వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదని, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మ భద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందిగా పురోహితుడు (గురువు) హితవు పలుకుతాడు. ఇక పెళ్ళి కూతురు వైపునుంచి వచ్చిన వారు (బావ మరిది-మేన మామ-తాత గారు లాంటి వారు) "బంగారు ఆభరణాలతో అలంకరించబడిన వారి "అమ్మాయి" నిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నామని, అగ్ని సాక్షిగా అమెను వివాహమాడమని, ముందుగా తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వరుడికి నచ్చచెప్పి, కాశీ యాత్ర ఆలోచనను విరమింపచేసే ఘట్టం ఇది. చాలా కోలాహలంగా పెళ్ళికి "తరలి పోయే ముందర" జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు-మిత్రులందరు వధువు గృహానికి (వసతి గృహానికి) బయలుదేరుతారు. బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించు కోవడం, పల్లకి లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. బయలుదేరే ముందర, శుభకార్యానికి బయలుదేరుతున్నామని, వెనక్కు పిలవడంనిందించడం - దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా వుండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు.

పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం-అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూ-వరుల ఇళ్లలో, ఉదయం తెల-తెలవారుతుండగానే, మంగళ వాయిద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువుకు, కన్యా దాత దంపతులకు, తోటి పెళ్ళి కూతురుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి, తల్లి-తండ్రులకు, తోటి పెళ్ళికొడుకుకు (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది. స్నాతకం చేసుకున్న నాడే, లాంఛనంగా అక్కడ కన్యా దాత ఇంట్లో, వధువుని "పెళ్ళికూతురు" చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. ముందు-వెనుకల కూడా జరగొచ్చు. అంకురార్పణగా పిలిచే వేడుకకు కన్యా దాత దగ్గరి బంధువులందరూ వస్తారు. నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని "అంకురార్పణ" లో చేస్తారు.

స్నాతకం చేసుకున్న రోజునే మగ పెళ్లివారు ఆడ పెళ్ళివారి వూరికి తరలి పోతారు. ఒక్కోసారి అక్కడకు పోయి స్నాతకం చేసుకుంటారు.

మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికొరకు ఎదురు చూస్తున్న ఆడ పెళ్లి వారు, "ఎదురు కోలు" పలికే ఆచారం సరదాగా-సందడిగా జరుపుకునే మరో వేడుక. విడిదిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసి (సబ్బులు, పేస్టులు, బకెట్లు, తుండు గుడ్డలు, వేడి నీళ్లు లాంటివి) ముందు (హాలులో) భాగంలో పెద్ద తివాచీ లాంటిది పరిచి ఎదురు చూస్తుంటారు ఆడ పెళ్ళి వారు. మేళ-తాళాలతో ఆహ్వానించి కాబోయే అత్తగారు, మామ గారు, వారి సమీప బంధువులు ఎదురుకోలలో భాగంగా, విడిదిలోకి ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిస్తారు. పెళ్ళికొడుకు పనిని బావమరిదితో చేయిస్తారు. కాళ్లు కడగడమనేది రెండు-మూడు పర్యాయాలు జరిపే వ్యవహారం. తర్వాత అందరికీ కాఫీ-పలహారాలిచ్చి మర్యాదలు చేసి, స్నానాలు ముగించుకొని సిద్ధంగా వుంటే, భోజనాలకు తీసుకెళ్తామంటారు. లేదా అక్కడే ఏర్పాటు చేస్తారు.

వివాహం ముహూర్తం నాడు పెళ్లికి ముందు-పెళ్ళిలో-పెళ్లైన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలెన్నో వున్నాయి. తెలుగు వారి పెళ్ళిళ్లలో ఉండే సందడి, సంతోషం ఎంత మోతాదులో వుంటుందో ఎవరూ చెప్పలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరవలేని సంఘటన. కొందరు కల్యాణ మండపాలను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెటూర్లలో కొబ్బరి ఆకుల పందిరి వేయడం వలన మండపం ఆవశ్యకత తగ్గింది. పట్టణాలలో టిప్ టాప్ పందిరి మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది.

ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి,పార్వతి,సరస్వతి" ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు.

వధువుకు నలుగు స్నానం చేయించి, పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, నూతన వస్త్రాలను కట్టించి (పట్టు చీరె) "గౌరీ పూజ" కు తీసుకెళ్తారు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే, వర పూజ కొరకు విడిదికి వెళ్తారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. వరపూజలో భాగంగా, ఆడ పెళ్ళి వారు-వారి వైపు బంధువులు వచ్చి, వివాహం చేసుకోవడానికి రమ్మని మగ పెళ్ళివారిని ఆహ్వాని్స్తారు. వరపూజలోనే ఇరువైపువారు, ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించు కోవడానికి "శుభలేఖలు" మార్చుకుంటారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే, కన్యా దాత ఇంట్లో, వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది.

మగ పెళ్లివారందరు కన్యా దాత ఇంటికి చేరుకునే సమయానికి, వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది ఆచారం-సాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందేందుకు కన్యా వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్లమని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, "నారాయణ స్వరూపుడైన వరుడికి" పాద ప్రక్షాళన లాంటివి జరిపించి, కన్యా దాత ఆతిధ్యం ఇస్తారు. దీనినే "మధు పర్కం" అని పిలుస్తారు. మధుపర్కం: మధువు అంటే తేనె. కుమార్తెకు భర్తగా వరుడి ఎంపిక తరువాత అతను వధువు తల్లి-తండ్రికి సంప్రదాయాన్ననుసరించి పుత్ర సమానుడౌతాడు. వివాహానంతరం "మధుపర్కం" అంటే తీయటి పానీయం అని అర్ధం. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన వేడుకకై వేచి వుంటాడు. వరుడు పనిలో వున్నప్పుడు, తర్వాత కార్యక్రమం జరిపించడానికి, కన్యా దాత వరుడు నాన్న గారిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న చోటుకెళ్తారు.

గౌరీ పూజ జరిగే చోట ఒక్క సారి, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం-ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి అత్యంత ఆసక్తికరంగా-విన సొంపుగా వుంటుంది. "గోత్రం" అంటే వంశం, "ప్రవర" అంటే వంశం మూల పురుషుల సమాచారం. మీ అమ్మాయిని, మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించమని వరుడి తండ్రి, కన్యా దాతను కోరడమే వేడుక ముఖ్య ఉద్దేశం. "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-వశిష్ట, శక్తి, పరాశర త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే, తైత్తిరీయ శాఖాధ్యాయినే, ఆపస్తంబ సూత్రిణే, ….. …. శర్మణో నప్త్రే, …. … శర్మణ పౌత్రాయ, … …. శర్మణ పుత్రాయ, .. … శర్మణే వరాయ, భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే" ("మూడు ఋషులున్న పరాశరుడితో సమానమైన గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, వేదం ప్రకారం తన ఇంటి కార్యక్రమాలను నడిపించేవాడూ, తైత్తరీయ శాఖను-ఆపస్తంబ సూత్రాన్ని అభ్యసించి అనుసరించేవాడూ, … మునిమనుమడూ, …. మనుమడూ, …. పుత్రుడూ అయినఅనే వరుడికి మీ కూతురునిచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాం") అని అడుగుతాడు. ఇలా వంశం వివరాలు చెప్పడం వల్ల కన్యా దాత చివరివరకూ ఆలోచించుకునే అవకాశం వుందింకా. ఇవేవీ తెలియకపోతే (అందరి సమక్షంలో), ఫలానావారి పిల్లవాడిని చేసుకున్నాం-ఇప్పుడు అనుభవిస్తున్నాం అని భవిష్యత్‌లో అనవచ్చు.

కన్యా దాత, వరుడి వివరాలు ముత్తాత తరం దగ్గర నుండి విన్న తర్వాత, సంబంధం తనకి ఇష్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా చెప్పి అబ్బాయి తన కూతురుని చేసుకోమని అడుగుతాడు.

గౌరీ పూజ దగ్గర గోత్రం-ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చాలా సరదాగా వుంటుంది. ఇందులోనూ ఒకరకమైన సామాజిక స్పృహ కనిపిస్తుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం కూడా పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని-సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ వేడుకలో వుందంటారు పెద్దలు.

కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం, వివాహంలో, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మరో ముఖ్యమైన ఘట్టం. కన్యాదాతేమో వయసులో పెద్ద-వరుడేమో చిన్నవాడు. అయినా కాళ్లు కడిగే ప్రక్రియ వుందంటే దానికి సాంప్రదాయ బద్ధమైన అర్థం వుండి తీరాలి. కన్యా దాత వరుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తరిగి పోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని చెప్పుతాడు. "నా లోని తేజస్సు, శక్తి, కీర్తి, బలం సుస్థిరంగా వుండుగాక" అన్న అర్థం వచ్చే మంత్రం అది. అది కన్యా దాత ఉచ్చరిస్తూ, ఇచ్చిన "అర్ఘ్యాన్ని" (మంచి నీరు) స్వీకరిస్తాడు వరుడు. కన్యా దాత వరుడి కాళ్ళు కడిగి నందువల్ల, చిన్నవాడైన వరుడు, తనలోని కాంతి తరిగిపోకుండా వుండేందుకు, ఆచమనం చేసి, దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు. ఆచమనం చేస్తూ, వరుడితో, " ఉదకములారా, మీరు నాకు గొప్ప కీర్తిని-పాడి పంటలను ఇచ్చి, అందరు ఇష్టపడేవాడిని చేసి, రక్షించండి" అని చెప్పిస్తారు. వధువుని గంపలోనే వుంచి మహా సంకల్పంతో ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్తారు పురోహితులు.

వధూవరులు సాక్షాత్తు "లక్ష్మీ-నారాయణ స్వరూపులు" గా భావించుతారు కాబట్టి, విధంగానే "లక్ష్మీ నారాయణుల కల్యాణం" లా జరిపించుతారు. "మహా సంకల్పం" చెప్పడం, సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి శక్తి-సామర్థ్యాలు అనంతమని-అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని కొనసాగింది. మానవుడి మేథస్సు ఊహించనలవికాని పరిమాణంలో వున్న జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్న-చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత ఖండంలో, మారు మూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసే దే మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది.

మహా సంకల్పం విశ్వ స్వరూపాన్ని, ఖగోళ స్థితిని చక్కగా వివరిస్తుంది. భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్త ద్వీపాలు, నవ వర్షాలు, నవ ఖండాలు, దశారణ్యాలు, యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో భరత వర్షం-భరత ఖండం, దానిలో కన్యాదానం ఎక్కడ చేస్తున్నది కన్యా దాత పేర్కొంటాడు. అలాగే బ్రహ్మ కాలమాన ప్రకారం యాభై సంవత్సరాలు పూర్వార్థం గడవగా, యాభై ఒకటవ సంవత్సరంలో, మొదటి మాసంలో, మొదటి పక్షంలో, మొదటి పగటిలో బ్రహ్మకు ప్రాణాయామ కాలం ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్పి తొమ్మిది కల్పాలలోని శ్వేత వరాహ కల్పంలో, పద్నాలుగు మన్వంతరాలలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో-శాలివాహన శకంలో-ఇరవై ఎనిమిదవ మహా యుగంలో-కలియుగంలో-ఫలానా సంవత్సరంలో-ఫలానా మాసంలో-ఫలానా తిది రోజున, సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్ర్రీతి కోసం సర్వాలంకార భూషితైన కన్యను దానం చేస్తున్నాను అని కన్యా దాత చెప్పే సంకల్పం ఇది. కన్యాదానం వల్ల తనకు బ్రహ్మ లోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలని, అగ్ని,స్తోమ, వాజపేయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలని, తనకు వెనుక- ముందు పది తరాల వాళ్ళు బ్రహ్మ లోకంలో నివసించాలని కన్యా దాత సంకల్పం చేస్తాడు.

ఇక తర్వాత, "కన్యా దానం" తంతు, అంటే, ముహూర్తం సమయం దగ్గరపడుతున్నదని అర్థం. "కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషియా" !! అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి. దీని అర్ధం-"ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేనూ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను" అని కన్యా దాత అంటారు. ఇంకా ఇలా చెప్పారు కన్యా దాత: " సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు-పంచభూతాల-సర్వ దేవతల సాక్షిగా, పితృదేవతలను తరింపచేసేందుకు, కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం కలిగి, బుద్ధిమంతుడి వైన నీకు, ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు, సాలంకృత సాధ్వియైన కన్యను సమర్పించుకుంటున్నాను". ఇలా అంటూ, మామ గారు (కన్యా దాత) (వరుడి) చేతిలో నీళ్లు పోసి మరో మాటంటారు. "నీకు దానం చేసినప్పటికీ, కన్య నా కుమార్తే సుమా!" అని. ఇలా అంటూనే, "ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి చరితవ్యా" అని ప్రతిజ్ఞ చేయిస్తారు కన్యా దాత వరుడితో. దీనికి సమాధానంగా, "నాతి రామి" అని వరుడితో చెప్పించారు. సుముహూర్తం వచ్చేస్తున్నదనె దీనర్థం.

వధూ-వరులను కళ్యాణ వేదికపై, తూర్పు-పడమర ముఖంగా కూచోబెట్టి, మధ్య ఉత్తర-దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి, ఇరువురి చేతికి "జీల కర్ర- బెల్లం" కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు. పెళ్ళిచూపుల కార్యక్రమం పూర్తి అయిన పిదప, అమ్మాయి-అబ్బాయిల జాతకాల ననుసరించి జ్యోతిష్యంలో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు-వధువు ఒకరి తలపై ఇంకొకరు "జీలకర్ర-బెల్లం" పెట్టడం జరుగుతుంది. నిజానికిదే సుముహూర్తం (జీల కర్ర-బెల్లం శిరస్సుపై వుంచడం). మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, గౌరీ దేవిని ధ్యానించుకుంటూ వధువు, వరుడు ఏక కాలంలో నిర్ణయించిన ముహూర్తానికి ఒకరి శిరస్సు మీద మరొకరం (బ్రహ్మ రంధ్రం మీద) జీల కర్ర-బెల్లం కలిపిన ముద్దను వుంచుకుంటారు. సుముహూర్త కాలంలో పెద్దల ఆశీర్వాదాన్ని పొందుతారు. పురోహితుడి తర్వాత, తల్లి-తండ్రులతో మొదలయ్యి, పెద్దలందరూ అక్షితలు చల్లుతారు దంపతులు మీద.

జీల కర్ర-బెల్లం ముద్దను వధూవరులు పెట్టుతున్న సమయంలో, పురోహితుడు చదివిన మంత్రానికి, "వరుణుడు, బృహస్పతి, మీకు శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చెదరు గాక ! అగ్ని దేవతలు మిమ్ములను దీవించెదరు గాక ! పంచభూతాలు స్థిరంగా వుండు గాక ! సుముహూర్తం మీకు శుభ ముహూర్తం అగుగాక !" అని అర్థం వస్తుంది. జీల కర్ర-బెల్లం మిశ్రమంలో పరస్పరాకర్షణ వుంటుందని మన పెద్దలు చెప్పడమే కాకుండా, శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. ఇక వధూవరులమైన మేమిద్దరం, తర్వాత, సకల దేవతలకు నమస్కరించి, "నూతన దంపతులమైన మా ఇరువురి ప్రేమానుబంధం చాలా గొప్పది. మా బంధాన్ని పితృదేవతలు కూడా ఆశీర్వదించారు. వారి ఆశీస్సులతోనే మేం భార్యా-భర్తలం అయ్యాం. శుభ సమయంలో బంధువులైన మీరందరూ ఆనందంగా వుండండి. వధువు బంధువులు కొద్దిగా మానసిక ఆందోళనకు గురికావడం సహజమే" అని మంత్రాల ద్వారా పురోహితుడు అనిపిస్తాడు. ఇక ఇక్కడినుంచి మాంగల్య ధారణ తంతు మొదలవుతుంది.

వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. మంగళ సూత్రం అనే శబ్దం సంసృతం నుండి పుట్టింది. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ గారు పెట్టిన "మధు పర్కం చీరె" ను, వధువుతో ధరింపచేస్తారు. వధూవరులు ఇద్దరూ మధుపర్క ధారణతో మంగళ సూత్ర ధారణ కార్య క్రమానికి సిద్ధమవడం ఆచారం.

సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే "శత మానములు" అని కూడా అంటారు. బంగారంతో చేయబడ్తాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడు ""మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!"" అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతారు, పురోహితుడు మూడు ముళ్లు వేయమంటారు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేతం. చదివిన మంత్రానికీ అర్థముంది-" సుందరీ ! మంగళ సూత్రాన్ని, నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించుతారు."శతమానం భవతి, శతాయుః పురుష !" అనే మంత్రాన్నీ చదువుతారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది.

పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. పుట్టింట్లో పెరిగి, అత్తగారింటికి చేరి, బరువు-బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు-అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారని హిందువుల నమ్మకం. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి వారి మంచి-చెడులు తనవేనని, ధర్మ మోక్షాలు-అర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం.

మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది-'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో తంతు జరిపిస్తారు.

కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, వరుడి చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయిస్తారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని వరుడితో అనిపించుతారు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, వరుడి లాగనే తలంబ్రాలు తీసుకొని, వరుడి శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో అనిపించుతారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరుగుతుంది. వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేస్తారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురు కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరుతాడు వరుడు.

తలంబ్రాల కార్య క్రమం, బ్రహ్మ ముడి వేయడంతో ఇక వధూవరులను వివాహ వేదిక పైనుంచి కిందికి దింపుతారు. సాధారణంగా గౌరీ పూజ జరిపించిన చోటనో, లేకుంటే మరో అనువైన స్థలంలోనో, హోమం ఏర్పాటు చేసి స్థాళీపాకం వేడుక జరిపిస్తాడు పురోహితుడు. ఇందులో భాగంగా హోమం దగ్గర అన్నం వండించే పని, తర్వాత సప్తపది వుంటుంది.

వివాహంలో సప్తపది అతి ముఖ్యమైన ఘట్టం. పరమ పావన మూర్తి అగ్నిహోత్రుడి సాక్షిగా, అగ్నిహోత్రుడి చుట్టూ, పాణి గ్రహణం తర్వాత వధూవరులిద్దరు, వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి, ఏడు అడుగులు వేయిస్తారు. దీనిని సప్తపది అని అంటారు. వధువుతో కలిసి ఏడడుగులు వేస్తూ వరుడు, ఏడు కోరికలను వివరిస్తాడు. అనంతరం వధువు తన అంగీకారాన్ని తెలియ పరుస్తుంది. ఇది గృహస్థా శ్రమ స్వీకారానికి పరమావధి. సప్తపది పూర్తైన తర్వాతనే, వధువు గోత్రం-ప్రవర-ఇంటి పేరు, వరుడి గోత్రం-ప్రవర-ఇంటి పేరు గా మారుతుంది. వధూవరులు కలిసి అడుగులు వేస్తున్నప్పుడు, భారతీయ-హిందూ సాంప్రదాయ వివాహ విధానాన్ని, అందులోని గొప్పదనాన్ని విశదపరిచే మంత్రాన్ని చదువుతారు. అందులో, " చిన్నదానా ! నీవు నన్ను అనుసరించి నడువు. నీవు నడిచేటప్పుడు శ్రీ మహా విష్ణువు, మొదటి అడుగులో అన్నాన్ని-ఐశ్వర్యాన్ని, రెండవ అడుగులో శారీరక-మానసిక బలాన్ని, మూడవ అడుగులో మంచి పనులు చేయాలన్న సంకల్పాన్ని-ఉత్తమ కర్మనూ-శ్రద్ధనూ, నాలుగవ అడుగులో కర్మ ఫలాన్నీ-సుఖాన్నీ-ఆనందాన్నీ, ఐదవ అడుగులో పశు సమృద్ధినీ-ధన ధాన్యాలనూ, ఆరవ అడుగులో మంచి సంతానాన్నీ, ఏడవ అడుగులో ఇద్దరి ఆధ్యాత్మిక చింతనకు తగు రక్షణను మనకు కలిగించుగాక" అన్న అర్థం స్ఫురిస్తుంది.

వధువును అగ్నికి తూర్పునకుగానీ, ఉత్తరం నకుగానీ, ఏడు మంత్రాలతో, ఏడు అడుగులు నడిపించుతున్న వరుడితో జపం-హోమం చేయించుతారు. ఇక్కడే చెప్పిన మరో మంత్రంద్వారా వధూవరులిద్దరు, ఇకనుంచి స్నేహితులం అన్న అర్థం కూడా వుంటుంది. "మన ఇద్దరం స్నేహితులం. నీవు నాతో ఏడడుగులు నడవడంతో మన ఉభయులకు మైత్రి కలిగింది. నీ చేతిని నేనెప్పుడూ విడవను-నన్ను నీవు కూడా విడవవద్దు. మంచి మనస్సుతో అన్నోదకాలను స్వీకరించి ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని అనుభవించుదాం. పరస్పరం చర్చించుకొని కుటుంబ పనులను నెరవేరుద్దాం. అనుకూల దంపతులమై సంసార యాత్ర కొనసాగించుదాం. నువ్వు భూమివి-నేను ఆకాశాన్ని. నువ్వు వాక్కువు-నేను మనస్సును. నేను చేసే ధర్మ కార్యాలకు నీ సహకారం కావాలి. యోగ్యమైన సంతానాన్ని-సంపదను మనం ఇద్దరం కలిసి అనుభవించుదాం" అని దానర్థం. " రాత్రి గాని, పగలు గాని, ఎల్ల వేళలా సుఖ సంతోషాలతో నువ్వుండాలి నీకు ఎటువంటి ఇబ్బందీ కలగరాదు. సుమంగళివై-సత్ సంతానంతో గృహలక్ష్మివై, అభివృద్ధి చెందాలి" అని రక రకాలుగా అనునయించే మాటలివి.

సప్తపది తర్వాత మరో ముఖ్యమైన వివాహ వేడుకలు, నాగవల్లి-సదశ్యం. తర్వాత అప్పగింతల కార్యక్రమం. సదశ్యంలో బ్రాహ్మణులకు కానుకలు, వధూవరులకు బట్టలు పెట్టే కార్యక్రమం వుంటుంది. నాగవల్లిలో పెళ్లి కూతురుకు భర్తతో కాలి మెట్టెలు తొడిగించే కార్యక్రమం, గుచ్చిన నల్లపూసల తాడును వధువు మెడలో కట్టించే కార్యక్రమం జరిపించుతారు. నల్ల పూసలతాడును కూడా మూడు ముళ్లు వేయించుతారు. ఇక వధూవరులతో కలిసి సమీప బంధుమితృల కోలాహలం మధ్య "భుజం బంతి భోజనాల" హడావిడి వుంటుంది. వధూవరులిద్దరిని పక్క-పక్కన కూచోబెట్టి, వెండి కంచాలలో ఇరువురికీ భోజనాలు వడ్డించి, వరుసకు బావా-మరదళ్లలాంటి వారి వేళా-కోళాల మధ్య భోజన చేయడం ఆరంభించుతారు అందరూ. మధ్యలో పాటలు, వధూవరులు ఒకరి కంచంలోది మరొకరి కంచంలో వుంచడం, పక్క వారందరూ తినమని బలవంతం చేయడం అక్కడ జరిగే వేడుక.

ఉంగరాలు తీయడమనే "ప్రధానాంగుళీయకం" వేడుకలో మూత కురుచగా ఉండే చిన్న బిందెలో పాలూ, నీళ్ళూ పోసి, దానిలో మెట్టెలు, ఒక బంగారు ఉంగరాన్ని వేసి పురోహితుడు చెప్పగానే గభాలున దానిని తీయడానికి వధూవరులు ప్రయత్నించే తంతుంటుంది. వుంగరం దొరికిన వారు వేరొకరికి తొడుగుతారు. చూడటానికి సరదాగా కన్పించే ఇది కేవలం అప్పటిదాకా పరిచయం లేని వదూవరులకు స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం. ఇక్కడా బంధుమితృల కోలాహలం చోటుచేసుకుంటుంది. కాసేపు అది ఇరు పక్షాల వారి మధ్య ఒక నిజమైన పోటీలా జరుగుతుంది.

కన్యా దాత ఇంట్లో జరిగే వేడుకల్లో "అప్పగింతలు" కార్యక్రమం అన్నింటిలోకి చివరిది-ఉద్వేగ భరితమైంది. సాధారణంగా పెళ్లి జరిగిన రోజున అర్థరాత్రి దాటింతర్వాత అప్పగింతల మంత్రంతో మొదలవుతుంది కార్యక్రమం. అయితే ఇటీవలి కాలంలో, వసతి గృహాల్లో పెళ్ళిళ్లు జరుపుకోవాల్సిన పరిస్థితుల్లో, వాళ్లిచ్చిన వేళకు మించి అక్కడ వుండడం కుదరనందున, అన్నీ టైంలోపల జరిపిస్తున్నారు. వధూవరులకు చూపాల్సిన "అరుంధతి" నక్షత్రాన్ని కూడా పట్ట పగలు చూపించి "కనబడిందా?" అని అడుగుతున్నాడు పురోహితుడు. కనబడిందని జవాబిస్తున్నారు వధూవరులు.

భజంత్రీలు అప్పగింతల పాట పాడుతుంటే, పెళ్ళి పీటపై వధువును మధ్యలో కూర్చుండ బెట్టి, పాలలో చేతిని ముంచిన తర్వాత అప్పగింతల తంతు జరుగుతుంది.

అప్పగించిన పెద్దలందరికీ బట్టలు పెట్టే తంతుంటుంది. వధువు రెండు చేతులను పాలలో ముంచి వరుని చేతిలో పెట్టి అప్పగించాలి. అప్పగించుతూ: "అష్టవర్షాభవేత్ కన్యా, పుత్రవత్ పాలితా మయా, ఇదానీం తవ దాస్యామి, దత్తా స్నేహేన పాలయా" అంటాడు కన్యా దాత. అంటే, "పుత్రుడితో సమానంగా పెంచిన ఎనిమిది సంవత్సరాల వయసున్న కన్యను నీకిస్తున్నాను. నీవు ఈమెను ప్రేమాభిమానాలతో కాపాడు." అని దాని అర్థం. అదే మంత్రం చదువుతుంటే, అదే అర్థం వచ్చేలా, అత్తమామలు వరుడి ప్రక్కన కూర్చుని వుంటే, వారికి కూడా వధువు రెండు చేతులు పాలలో ముంచి వారి చేతులో అద్ది, "మీ పుత్రిక వలె కాపాడాలి" అని అప్పగిస్తారు. బహుశా అప్పగింతల ద్వారా, పెళ్లికూతురును అత్తవారింటి వైపు బంధువులందరికీ పరిచయం చేయడం కొరకు, వేడుకను జరిపిస్తుండవచ్చు.

అప్పగింతల ముందర "వడి కట్టు" వధువుకు కట్టు తారు. వడి కట్టులో శేరుంబావు బియ్యం, వెండి గిన్నె, కొబ్బరి చిప్ప వుంచుతారు. అప్పగింతల కార్యక్రమంలో వధువును అప్పగించే ముందర, "బొమ్మ"ను అప్పగించడమనే, చిన్న వేడుక జరిపారు. ఒక మంచం మీద జంఫఖానా పరిచి, జాకెట్ గుడ్డతో ఊయలలాగా చేసి, అందులో చెక్క బొమ్మను నిదురిస్తున్న భంగిమలో వుంచుతారు. వధూవరుల కొంగులను కలిపి, అందులో ఎర్ర నీరు ఊయలలోంచి పడే విధంగా పోస్తారు. వధువుతో వరుడికి బొమ్మనిప్పించి, తాను పనిమీద వున్నాననీ, బొమ్మ రూపంలో వున్న వాళ్ల పాప-బాబును జాగ్రత్తగా చూస్తుండమనీ అనిపిస్తారు. అలా మూడు సార్లనిపించిన తర్వాత, ఆడబిడ్డకు పనిని అప్పగించుతారు. ఆడ బిడ్డకు బొట్టు పెట్టి, చీరె ఇచ్చి, బొమ్మను చేతిలో వుంచుతారు. ఇదయిన పిదప, అయిదుగురు దంపతులకు వధూవరులతో, (దంపత) తాంబూలాలు ఇప్పించుతారు. పెద్దలందరికీ వీరిరువురితో దండాలు పెట్టిస్తారు.

అప్పగింతలు చేసేవారికి, చూసే వారిలో చాలామందికి కంట తడిపెట్టిస్తుందనడంలో అతిశయోక్తి కాదు. ఇన్నాళ్లుగా పెంచి పోషించిన కూతురు తమను విడిచి అత్త వారింటికి వెళుతుందని ఆమెను వదలి వుండాలే అనే బాధ కన్నవారికి కలగడం సహజం. అప్పగింతల కార్యక్రమం అనంతరం, పెళ్ళికూతురును లోపటికి తీసుకునిపోయి, పెరుగు అన్నం పెట్టి, దేవుడికి దండం పెట్టించి, బయట ఇంటి సింహద్వారం దగ్గర తల్లి కడుపుపై మజ్జిగతో అద్దించి, గడపకు చేతులతో కొట్టించుతారు. ఇవన్నీఅయ్యాక విడిది గృహ ప్రవేశానికి పంపుతారు. ఇక అంతటితో కన్యా దాత ఇంటినుంచి ముందు జరగాల్సిన వేడుక, విడిదికి-అక్కడినుంచి పెళ్లికొడుకు ఇంటికి మారుతుంది.

హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.