Wednesday, January 27, 2010

జ్వాలా మ్యూజింగ్స్-22 (అమెరికాలో సొంత ఇల్లు)


జ్వాలా మ్యూజింగ్స్-21 (సాహిత్యం-మానవతావాదం - మానవ విలువలు)
ఈ బ్లాగ్ లో ఇంతకుముందే పెట్టడం జరిగింది

అమెరికాలో సొంత ఇల్లు
షుగర్ లాండ్ టెల్ ఫెయిర్‌ లో కిన్నెర-కిషన్ నూతన గృహ ప్రవేశం
బంధు-మిత్రుల మధ్య సత్యనారాయణ వ్రతం, హోమం, విందు భోజనం

వనం జ్వాలా నరసింహారావు

మేం అమెరికాకు వచ్చిన రెండు కారణాలలో ఒకటి మా ఆదిత్య-పారుల్ కు పుట్టబోయే కూతురును చూడడం, రెండోది కిన్నెర-కిషన్ ల నూతన గృహ ప్రవేశం. ఎదురు చూస్తున్న రెండూ, రెండు రోజుల తేడాతో జరిగాయి. నవంబర్ 24 ఉదయం 8-36 కు (విరోధి నామ సంవత్సరం-మార్గ శిర మాసం-సప్తమి తిథి-ధనిష్ఠ నక్షత్రం) ఆదిత్య-పారుల్ కూతురు-మా మూడో మనుమరాలు కనక్ పుట్టిందన్న వార్త విని ఆనందంతో ఒక పని అయిందనుకున్నాం. ఇక, కిన్నెర వాళ్లు గృహప్రవేశం కావాలంటే, నవంబర్ 26 లోపు అయిపోవాలి. ఆ తర్వాత మంచిరోజులు రెండు-మూడు నెలల వరకు లేవు. అమెరికాలో వుంటున్నా, ఇక్కడివారు చాలామంది, ప్రతి విషయంలో తిథి-వార-నక్షత్రాలతో సహా ఇల్లు కొనేటప్పుడు వాస్తుకూడా చూస్తుంటారు. కిన్నెర ఇంటికి ప్రవేశ ద్వారం తూరుపు దిక్కుగా వుండాలని అలాంటిది దొరికేంతవరకూ ఆగారు. ఇక గృహప్రవేశం నవంబర్ 26 లోపు జరగాలంటే, ఇల్లు కట్టడం దగ్గర్నుంచి, ఒప్పందంలో పేర్కొన్నవన్నీఇంట్లో అమర్చడం జరిగిపోవాలి. ఇరు పక్షాల "వాక్ థ్రూలు" అయిపోవాలి. ఇవేవీ కాలేదింకా. నిబంధనల ప్రకారం ఇల్లు పూర్తిగా హాండోవర్ చేసేంతవరకు ఇంట్లోకి వెళ్లనివ్వరు. అయితే, మన నమ్మకాలపై గౌరవం వుంచి, నిబంధనలను సడలించి, ఆ ఒక్క రోజుకు తాళంచేతులివ్వడానికి, ఒక్క రాత్రి ఇంట్లో వుండడానికి బిల్డర్ అంగీకరించాడు. ఈ విషయం సరిగ్గా నవంబర్ 24 సాయంత్రం తెలిసింది. ఇక వెంటనే ఏర్పాట్లు చేసుకోవడం మొదలెట్టారు కిన్నెర-కిషన్ లు.

కిషన్ చెల్లెలు-కిన్నెర ఆడపడుచు మానస హ్యూస్టన్లోనే వుంటుంది. అన్నా-వదినలకు మంచి చేదోడుగా వుంటుంది. గురువారం, నవంబర్ 26 రాత్రి ఒంటి గంటకు-తెల్లవారితే 27 న గృహ ప్రవేశానికి ముహూర్తం నిశ్చయం చేసుకున్నారు. కిన్నెర-కిషన్ ల మిత్ర బృందాన్ని ఆహ్వానించారు. గురువారం సాయంత్రం వచ్చి ఒకసారి అన్ని పరిశీలించి వెళ్లాం. ఆ రాత్రికి ఏమేం తేవాలో నిర్ణయించుకున్నాం. చీకటి పడడానికి కొంచెం ముందు కిన్నెర-కిషన్-యష్విన్-మేథ-మానస-శ్రీనివాస్-హర్ష్-భవ్య అక్కడకు చేరుకున్నాం. ఇంటి ముందు నీళ్లు చల్లి, ద్వారానికి మామిడి తోరణం కట్టి, శాస్త్రోక్తంగా మానసతో ముగ్గువేయించి, చాలా సరదాగా కాసేపు గడిపి వెళ్లాం. తిరిగి ముహూర్తానికి కొంచెం ముందర, అందరం కలిసి అక్కడకు చేరుకున్నాం. కిన్నెర-కిషన్ దంపతులు, మానస-శ్రీనివాస్ దంపతులతో కూడి, మేమందరం వెంట వుండగా, బ్రాహ్మణుడి మంత్రోచ్ఛారణ మధ్య, శాస్త్రోక్తంగా గృహప్రవేశం చేశారు. భారతదేశంలో-ఆంధ్ర ప్రదేశ్ లో, ఎవరైనా-ఏ విధంగా శాస్త్రం చెప్పిన పద్ధతిలో గృహప్రవేశం చేస్తుంటారో, అదే విధంగా ఆవగింజ తేడా లేకుండా, ప్రతి విషయంలోనూ శ్రద్ధగా కార్యక్రమాలు చేశారు. బ్రాహ్మణుడు అన్నీ సవ్యంగా జరిపించాడు. ద్వారం ముందు గడప వద్ద మంచి గుమ్మడికాయ పగల గొట్టడం, బూడిద గుమ్మడికాయ ఇంటి ముందరుంచడం, దేవుడిని ఈశాన్యంలో ఏర్పాటుచేయడం, పుణ్యాహవాచన, పాలు పొంగించడం, గణపతి పూజ లాంటి కార్యక్రమాలన్నీ యధా విధిగా జరిపించాడు బ్రాహ్మణుడు అచ్యుత రామ శాస్త్రి గారు. మానస పాడిన మంగళ హారతితో కార్యక్రమం ముగిసింది.

ఆ రాత్రి మేం కాకుండా, పేరి శర్మ-జానకి దంపతులు, బర్కిలీ నుంచి వచ్చిన జానకి చెల్లెలు-భర్త, శివ భార్య పల్లవి, అంబుజ్-రూపాళి దంపతులు, రామకృష్ణ-సునంద దంపతులు, రాచకొండ సాయి-లలిత దంపతులు వారి పిల్లలతో సహా వచ్చారు గృహ ప్రవేశానికి. మరికొన్ని గంటల్లో "బ్లాక్ ఫ్రైడే" అమ్మకాలు మొదలైతాయనీ, వీలైనంత త్వరగా మాల్స్ దగ్గరికెళ్లి క్యూలో నిలబడాలనీ వెళ్లిపోయారు కొందరు. పాలు పొంగించి-అందులో ఉడికించిన పొంగలి ప్రసాదాన్ని తీసుకున్నారందరు. చాలా సరదాగా గడిచిందా రాత్రి. కుటుంబ సభ్యులందరం ఆ రాత్రి నిద్ర చేసి, పొద్దున్నే వెళ్లాం. పూర్తిగా ఫార్మాలిటీస్ అన్ని అయిపోయి ఇల్లు రిజిస్టర్ అయింతర్వాత, స్వాధీనంలోకి వచ్చిన వెంటనే, ఫ్లాట్ ఖాళీ చేసి, అందులోకి డిసెంబర్ 11 న పూర్తి స్థాయిలో ప్రవేశించాం. తిరిగి అంగరంగ వైభోగంగా, ఆ మర్నాడే అశేష బంధువుల మధ్య సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం. హోమం కూడా జరిపించారు బ్రాహ్మణుడు ఉదయ కుమార్ గారు. విందు భోజనం ఎలాగూ ఉంటుంది గదా.

అమెరికాలో ఇల్లు కొనడమనేది కొంచెం కష్టం అనిపించినా, వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ పోతే, ఇంటి తాళం చేతులు చేతికందుకోవడానికి నాలుగైదు నెలల కంటే ఎక్కువ పట్టదు. మా అమ్మాయి కిన్నెర వాళ్లు ఐదారు ఏళ్ల క్రితం సిన్సినాటిలో వున్నప్పుడు, అమెరికాలో మొదటి సారి ఇల్లు కొనుక్కున్నారు. న్యూయార్క్-ఆల్బనీకి వెళ్లేటప్పుడు దాన్ని అమ్మి అక్కడ ఇంకో టి కొనుక్కున్నారు. హ్యూస్టన్ కు వచ్చిన తర్వాత కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆల్బనీ ఇల్లు అమ్మి ఇక్కడ షుగర్ లాండ్ టెల్ ఫెయిర్‌ కమ్యూనిటీ కాలనీలో కొనుక్కున్నారు. ఇల్లు కొనడం-అమ్మడంలో కిషన్ కు అనుభవం వున్నందువల్లా, అదనంగా తగు జాగ్రత్తలు తీసుకోవడం వల్లా, వాళ్లు వెతకడం మొదలెట్టి, ఇంట్లోకి పూర్తిగా ప్రవేశించడానికి సుమారు నాలుగైదు నెలల కంటే ఎక్కువ పట్టలేదు.

అమెరికా "పట్టణాభి వృద్ధి-గృహ నిర్మాణ శాఖ", దేశంలో ఇళ్లు కొనుక్కోవాలనుకునే వారందరికీ తొమ్మిదంచెల సురక్షిత విధానాన్ని, ఆ శాఖ కార్యదర్శి పేరు మీద విడుదల చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అదనంగా కొనే వాళ్ల అవసరాల కను గుణంగా వుండే విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇవన్నీ ఆలోచించే కొంటారెవరైనా ఇక్కడ ఇళ్లను.
ఇల్లు కొనాలనుకునేవారి ఆదాయ వనరులు-అసలు ఆదాయం, దాని ఆధారంగా ఎంత ఋణ సౌకర్యం పొందే వీలుంది, నెలసరి ఖర్చెంత, దాచుకున్న డబ్బునుంచి కట్టగలిగేదెంత, తీసుకోదల్చిన ఋణం మీద చెల్లించే స్తోమతున్న వడ్డీ రేటు లాంటి విషయాల ప్రాతిపదికగా, అందులో అనుభవమున్న స్నేహితుల-నిపుణుల సలహా సంప్రదింపులతో ఆరంభించడం మంచిది. ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దె-భవిష్యత్ లో చెల్లించ బోయే బాంక్ వాయిదా తేడాను అంచనా వేసుకొని, చెల్లించే స్తోమతుందని నిర్ధారణ చేసుకోవాలి. "పిండికి తగ్గ రొట్టె" నే తయారు చేసుకోవాలి. సొంత ఇల్లు కొన్నుక్కోవాలనుకున్న ప్రతి వారూ, తమ హక్కులను గురించి తెలుసుకోవాలి. ఆస్తి కొనుగోలు-అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను, ఋణ సౌకర్యం నిబంధనలను అర్థం చేసుకోవాలి. అప్పు దొరుకుతుంది కదా అని ఎవరిస్తే వారి దగ్గర లోన్ తీసుకోకుండా, సరైన హోమ్ వర్క్ చేస్తే, వాయిదాలన్నీ చెల్లించే లోపు, ఎక్కడ తీసుకుంటే ఎక్కువ ఆదా చేయవచ్చో అధ్యయనం చేయాలి. వివిధ బాంకుల వారితో సంప్రదింపులు జరిపి, బేరమాడి, తక్కువ వడ్డీ ఇచ్చే చోటునే అప్పుచేయడం మంచిది. ఎంత ఋణం పొందుతామో, అంత మొత్తానికి మొదలే బాంకునుండి ఉత్తర్వులు తీసిపెట్టుకుంటే మరీ మంచిది. మొదటి సారి ఇల్లు కొనుక్కునే వాళ్లు తక్కువ డౌన్ పేమెంట్ అవకాశాలను అన్వేషించాలి. ఏ ప్రాంతంలో ఇల్లు కొంటే సౌకర్యంగా వుంటుందో, ఇరుగు-పొరుగు వాళ్లెవరో, మనదేశం వాళ్లు-మన ప్రాంతం నుంచి అమెరికాకు వచ్చిన వాళ్లు ఎంతమంది వున్నా రక్కడ చూసుకోవాలి.

ఇంతవరకు చెప్పుకున్నవన్నీ ఇల్లు కొనే ప్రతివారు తు. చ తప్పకుండా పాటిస్తూ, నిబంధనలకు సంబంధించిన ఏ విషయమైనా, అక్షరం ముక్క పొల్లు పోకుండా చదివి-అర్థం చేసుకుని, ఆ తర్వాత అడుగు వేస్తారు.

ఈ లోపుగా, భార్యా-భర్తలు ఉద్యోగం చేసే ఆఫీస్ నగరంలో ఎక్కడున్నా, ఆ విషయం పక్కన పెట్టి, పిల్లల చదువుకు అనువైన మంచి (ప్రభుత్వ) పాఠశాల-కళాశాల ఏ ప్రాంతంలో వుందో అన్వేషిస్తారు. ఒక కమ్యూనిటీ కాలనీ-ప్రాంతంలో నివసిస్తున్న వారి పిల్లలు, మరో ప్రాంతానికి చెందిన పాఠశాలలకు పంపేందుకు నిబంధనలు ఒప్పుకోవు. ప్రయివేట్ స్కూళ్లకు పంపొచ్చు గాని, అవి చాలా ఎక్కువ ఫీజులు వసూలుచేస్తారు. అదే విధంగా చంటి పిల్లలున్న వారు, డే కేర్ సెంటర్ల సౌకర్యం కూడా చూసుకుంటారు. భార్యా-భర్తల ఆఫీసు వేళలు-పాఠశాల, డే కేర్ సెంటర్ల వేళలు సమన్వయం చేసుకునేందుకు అనువైన ప్రాంతంలోనే ఇల్లు కొనుక్కుంటారు. ఒక్కో ప్రాంతానికి అక్కడ లభించే సౌకర్యాల ప్రాతిపదికగా ఒక్కోరకమైన ఆస్తి పన్నులు విధిస్తుంటారు. ఈ పన్నుల్లోనే, పిల్లల చదువుల ఖర్చు, వాళ్ల స్కూల బస్ రవాణా చార్జీల ఖర్చు లాంటివి చేర్చబడతాయి. సొంత ఇల్లు కొనుక్కునేవారు, వారుండబోయే ప్రాంతం తీర ప్రాంతమా, లోయా, థండర్ స్టార్మ్స్ లాంటి ప్రకృతి భీభత్సాలకు లోనయ్యే ప్రాంతమా అని కూడా విచారిస్తారు. అలాంటప్పుడు, అవసరమైనప్పుడు వాటి నుంచి వచ్చే ముప్పును అధిగమించేందుకు, సాంకేతికంగా సదుపాయాలను సమకూర్చే సమర్థవంతమైన-పేరొందిన గృహ నిర్మాణ సంస్థలను ఎంపిక చేసుకుంటారు. వీటన్నిటినీ దృష్టిలో వుంచుకొని, సంబంధిత రియల్ ఎస్టేట్ ఏజంటును ఎంపిక చేసుకుంటారు.

"ఇల్లు కట్టి చేసి చూడు-పెళ్లి చేసి చూడు" అన్న విషయం ఒక యూనివర్సల్ ట్రూత్. ఏ వ్యక్తికైనా, ఇల్లు కొనడమంటే, జీవితంలో తీసుకునే అతి కీలకమైన నిర్ణయమే కాకుండా, అతి ఖరీదైన కొనుగోలు కూడా అదేననాలి. ఇల్లు కొనుక్కుందామన్న నిర్ణయం తీసుకున్న మరుక్షణమే, మనకు తెలియకుండానే, దానికి సంబంధించిన రియల్టర్లు తారస పడుతారిక్కడ. కొనుగోలుదారు అవసరాలకు అనుగుణంగా, వారి పక్షాన బేరసారాలు చేస్తుంటారు వీరు. ఈ రియల్టర్ ఏజంటుకు లభించే కమీషన్ కొనుగోలుదారులనుంచి కాకుండా, అమ్మకం దారుల నుంచే లభిస్తుంది.

ఎంపిక చేసుకున్న రియల్ ఎస్టేట్ ఏజంటుతో ఇల్లు కొనుగోలు చేయదల్చుకున్న వారు, తమ అవసరాలను వివరించి, అనువైన స్థలం, కావాల్సిన ఇతర సదుపాయాలు, ఇరుగు-పొరుగు వ్యవహారాలు, ఇంటి ధర, ఇంటి డిజైన్ లాంటి విషయాలను విచారిస్తారు. ఇంటి నిర్మాణంలో తీసుకోబోయే జాగ్రత్తలు, గారంటీ కాలం, మధ్యలో ఏ రకమైన సేవలు లభించనున్నాయి కూడా అడుగుతారు. ఏజంటుతో, ఆదినుంచి-అంతం వరకు, ఇల్లు కొనుగోలుకు ఏమేమి చేయాలో, ప్రతి చిన్న వివరాన్నీ అడిగి తెలుసుకుంటారు. ఇరువురు, అన్ని విషయాలలో అంగీకారానికి వచ్చేంతవరకు, చర్చలు కొనసాగుతుంటాయి. టర్మ్స్-కండీషన్స్ కుదుర్చుకుంటారలా. కొనదల్చుకున్న ఇంటికి సంబంధించి, అంగీకారానికి వచ్చిన ప్రతి విషయానికి సంబంధించిన ప్రతి అంశం విషయంలో, ఒప్పందాలను పొందుపరుస్తూ, తయారై వున్న ఒప్పంద పత్రంపైన సంతకాలు చేయడం జరుగుతుంది. ఇల్లు కొనుక్కునే ముందర ఋణ సౌకర్యం పొందేందుకు, బాంకులకు రెండు నుంచి అయిదేళ్ల కాలం, తనకు సంబంధించిన ఆర్థికపరమైన లావాదేవీల వివరాలన్నింటినీ అందచేస్తారు. ఉద్యోగం చేస్తున్న సంస్థ యాజమాన్యం నుంచి అవసరమైన ధృవీకరణ పత్రాలను కూడా ఇస్తారు.

రియల్టర్ ఏజంట్ సూచన-సలహా ప్రాతిపదికగా ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెడుతున్న సమయంలోనే కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సివుంటుంది. సాధారణంగా అది అతి తక్కువ మొత్తంలోనే-మొత్తం విలువలో ఒక శాతం మాత్రమే వుంటుంది. ఇది చెక్కు రూపేణా ఇస్తారు. ఈ చెక్కును "ఎస్ క్రో" ఏజంట్ వద్దనే వుంటుంది. డిజైన్ ఖరారు చేసుకున్న తర్వాత ఇంకో నాలుగు శాతం చెల్లిస్తారు. ఆ తర్వాత ఇల్లు పూర్తయి, ఇంటి తాళం చేతులు ఇచ్చినప్పుడే, మిగిలిన మొత్తాన్ని సరాసరి బాంకులే అమ్మకం దారుడికి చెల్లించే ఏర్పాటుంటుంది. ఇల్లు నిర్మాణం మొదలైనప్పటినుంచి అప్పగించేంతవరకు, మధ్యలో అవసరమైన అన్నిరకాల క్వాలిటీ పరీక్షలు ఇరు పక్షాల నిపుణులు జరుపుతారు. ఒప్పందంలో రాసుకున్న సౌకర్యాలన్నీ అమర్చిన తర్వాతే ఫైనల్ సెటిల్ మెంట్ జరుగుతుంది. ఇరవై ఏళ్ల వారెంట్, భీమా సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, గాస్-నీటి సరఫరా ఏర్పాట్ల లాంటివి అన్నీ అయిన తర్వాతే సొంతదారులు ఇంట్లో ప్రవేశిస్తారు.

ఇక ఇక్కడ అమెరికాలోని ఇళ్లన్నీ దాదాపు ఒకే రకమైన డిజైన్లలో వుంటాయనిపిస్తోంది. కాకపోతే పెద్దవి-చిన్నవి వుంటాయి. తుపాను లాంటి ప్రకృతి భీభత్సాలకు గురి కావచ్చనుకున్న ప్రాంతాలలో కొన్ని రకాల రక్షణలు, మంచు బాగా కురిసే ప్రాంతాలలో ఇంకో రకమైన రక్షణలు, అధిక వర్షపాతమున్న ప్రదేశాల్లో దానికి తగ్గ రక్షణలు.. ... ఇలా అవసరాలను బట్టి రక్షణలు ఏర్పాటు చేస్తారు బిల్డర్లు. సిన్సినాటిలో మా కిన్నెర వాళ్లుండె ఇంటికి సెల్లార్ సౌకర్యం కలిగించారు. అక్కడ "థండర్ స్టార్మ్స్-టార్నొడోస్" బాగా వస్తుండేవి. అవి రావచ్చని పసిగట్టి, వాతావరణ సూచన ఇవ్వగానే, అక్కడున్న వారు దాని తీవ్రతను బట్టి "అండర్ గ్రౌండ్’ లోకి కొంచెం సేపు వెళ్లి తలదాల్చుకుంటారు. డిజైన్ ఏదైనా నిర్మాణం మొత్తం అధికభాగం చెక్కలతోనే చేస్తారు. బహుశా ఏ పదో వంతో ఇటుకలతో వుంటుందేమో. డూప్లెక్స్ తరహా ఇళ్లల్లో, సర్వ సాధారణంగా లివింగ్ రూమ్, కిచెన్, డైనింగ్ సదుపాయం, అతిథుదులొచ్చినప్పుడు అందరూ కలిసి భోజనం చేసేందుకు అదనంగా మరో ఓపెన్ రూమ్, అతిథులకు వాష్ రూమ్ లతో సహా, "మాస్టర్ బెడ్ రూమ్" కింద వుంటాయి. గెస్ట్ బెడ్ రూమ్, పిల్లల పడక గదులు, పిల్లలు ఆడుకునే గదులు, స్టడీ రూమ్స్, వాళ్ల దైనందిన కృత్యాలకు కావాల్సిన ఇతర సౌకర్యాలు పై అంతస్తులో ఏర్పాటు చేస్తారు. డూప్లెక్స్ కాకపోతే అన్నీ కిందనే వుంటాయి. చిన్న సైజ్ ఇళ్లల్లో తక్కువ బెడ్ రూమ్స్ వుంటే, పెద్ద వాటిల్లో ఎక్కువుంటాయి. ప్రతి ఇండిపెండెంట్ ఇంటికి ముందు-వెనుకా విశాలమైన లాన్, దానికి తగ్గ బహిరంగ స్థలం వుంటుంది. ఇంటిని హాండ్ ఓవర్ చేసేటప్పుడే, లాన్ పూర్తిగా తయారుచేసి, అప్పటికే కొంచెం ఎత్తెదిగిన కొన్ని స్టాండర్డ్ రకాల చెట్లను నాటి, అవి నీటికొరకు ఇబ్బంది పడకుండా అవసరమైన స్ప్రింక్లర్ సౌకర్యాలను అమర్చి మరీ ఇస్తారు. ఇల్లు నిర్మాణ దశలో చూస్తే అగ్గిపెట్టెలాగా, పేకమేడలుగా అనిపిస్తుంది. కొన్ని ఇళ్లకు ఎకరం పైనా ఆవరణ ఇంటి చుట్టూతా వుంటుంది.

ఇక ధరల విషయానికొస్తే, ప్రాంతాన్ని బట్టి, సౌకర్యాలను బట్టి, పన్నుల విధానాన్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి కనీసం రెండు లక్షల డాలర్ల నుంచి, రెండు మిలియన్ డాలర్ల వరకు సగటున వుంటాయి. అయితే మరీ ధనవంతుల ఇళ్ల విషయం వేరేగా వుండొచ్చు. నేను చూసిన-అంతో ఇంతో ఇతరులద్వారా తెలిసిన వాళ్ల ఇళ్ల సంగతి ఇది. హ్యూస్టన్ లో, ఒక ప్రాంతంలో మూడు-నాలుగు లక్షల డాలర్ల ఖరీదు చేసే ఇంటి తరహా ఇంటికి, మరో చోట దానికి రెట్టింపు ధర చెల్లించాల్సి వుంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లను "మిలియన్ డాలర్ల ఇళ్ల" ప్రాంతాలని పిలుస్తుంటారు. మా కిన్నెర వాళ్లుండే షుగర్ లాండ్ టెల్ ఫెయిర్‌, న్యూ టెరిటరీ ప్రాంతాల్లోనే అత్యధికంగా తెలుగు వారు-భారతీయులు కొనుక్కున్నారు. ఆ ఇళ్ల ధరలన్నీ సైజును బట్టి, మూడున్నర లక్షల డాలర్ల నుంచి, ఐదున్నర లక్షల డాలర్ల వరకున్నాయి. కాలనీలో ఒక మూలన నిర్మించే ఇళ్ల సైజు పెద్దగా, ధర ఖరీదైనవిగా వుంటాయి.

కిన్నెర వాళ్లుంటున్న హ్యూస్టన్ లోను, టెక్సాస్ రాష్ట్రంలోను ఇంటి ధరలు తక్కువంటారు. మా ఆదిత్య వుంటున్న కాలిఫోర్నియా రాష్ట్రంలోను, అందునా, శాన్ ఫ్రాన్ సిస్కో-శానోజ్-శాంతా క్లారా లోను ధరలు చాలా ఎక్కువ. అద్దె ఇళ్లకు కూడా ఎక్కువే ఖర్చవుతుంది. కాలిఫోర్నియాలో మిలియన్ డాలర్లు కనీస ధర వుంటుంది. చాలా మంది భారతీయులు ఉద్యోగం చేసినంత కాలం కాలిఫోర్నియాలో వుండి, సొంత ఇంటిని అమ్ముకొని, అందులో నాలుగోవంతు వెచ్చించి టెక్సాస్ లో ఇల్లు కొనుక్కొని, అక్కడ సెటిల్ అవుతుంటారట. మిగిలిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపొచ్చు. అద్దె ఇళ్లకు ఇచ్చే రెంట్ కు అదనంగా మరో అయిదొందల డాలర్లు నెలసరి వాయిదాలకు చెల్లిస్తే, అద్దె ఇంటికన్నా పెద్ద సొంత ఇల్లు, దొరుకుతుందని, చాలా మంది ఇల్లు కొనుక్కుంటారు. ఏదేమైనా "కర్మ భూమి"నుంచి వచ్చి, "భోగ భూమి" లో సౌఖ్యాలనుభవిస్తున్న భారతీయులను అభినందించాలి. మా శ్రీమతి కజిన్, వల్లభి (స్వర్గీయ) అయితరాజు శేషగిరి రావుగారి కుమారుడు, వెంకట్ సురేష్ కాలిఫోర్నియా-శాన్ ఫ్రాన్ సిస్కోలో కొనుక్కున్న ఇల్లు, హ్యూస్టన్ లోని కిన్నెర ఇంటికన్నా చిన్నదైనా ఖరీదు మటుకు రెట్టింపు. సౌకర్యాలన్నీ ఒకే విధంగా వుంటాయి.

జ్వాలా మ్యూజింగ్స్-20 (చందమామ బ్లాగ్ రాజశేఖర రాజు గారి అభిమానం)

జ్వాలా మ్యూజింగ్స్-19 (హిందూత్వం-మార్క్సిజం-రామాయణం:సాహిత్యం-మానవ విలువలు)
ఇంతకు ముందే బ్లాగ్ లో పెట్టడం జరిగింది.

"అగ్రవర్ణ-నిమ్నవర్ణ పునాదిని పదిలపర్చిన రామరాజ్యం"-
"ఎవరికీ ప్రయోజనం కలిగించని మానవ విలువలు"-రాజు

వనం జ్వాలా నరసింహారావు

చందమామ బ్లాగ్ ను ఆరంభించి, ఆబాల తెలుగు గోపాలానికి, బాల్యాన్ని మళ్లీ-మళ్లీ గుర్తుకు తెచ్చే విధంగా ఆ బ్లాగ్ ను తీర్చిదిద్దుతున్న రాజశేఖర రాజు గారు నేను హ్యూస్టన్ తెలుగు సాహితీ లోకం వారి నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో చేసిన ప్రసంగ పాఠాన్ని చదివి అపూర్వంగా స్పందించారు. "శుద్ధ ఛాందస కుటుంబంలో పుట్టి, కమ్యూనిస్ట్ మిత్రుల మధ్య పెరిగాను. ఛాందసత్వానికీ, కమ్యూనిజానికీ దగ్గరగా-సమాన దూరంలో పెరిగి పెద్దవాడినైనందున, ఇప్పటికీ ఆ రెండంటే నమ్మకమే-అభిమానమే. రెంటిలోనూ వున్న మంచిని ఎలా కలిపి, లేదా విడదీసి అర్థంచేసుకోవాలన్న తపన ఎల్లప్పుడూ నన్ను వేధిస్తుంటుంది." అన్న నా భావాలపై వ్యాఖ్యానిస్తూ: "మొదట సాంప్రదాయిక వాతావరణంలో పెరిగినా తర్వాత దానికి వ్యతిరేకమైన జీవితంలోకి పోయిన వారు మీలాగే చాలామంది ఉన్నారు మనలో. కానీ ఛాందసత్వానికీ, కమ్యూనిజానికీ దగ్గరగా-సమాన దూరంలో పెరిగి పెద్దయిన మీరు ఇప్పటికీ ఆ రెండింటిపైనా నమ్మకం ఉంచుకోవడం చాలా ఆశ్చర్యకంరంగానూ, తీవ్ర వైరుధ్యపూరితం గానూ ఉంది. ఇలా ఉండటం ఎవరికయినా ఎలా సాధ్యం?" అని ప్రశ్నించారు.

"హిందూత్వం అనేది మతం అయినా-కాకపోయినా, మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానం అనే సంగతి, చిన్నతనంలోనే నన్నెంతో ప్రభావితుడిని చేసింది. అలానే పెరిగి పెద్ద వాడినయ్యాను. ఈ నమ్మకాలేవీ, నన్ను మార్క్సిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితుడను కాకుండా చేయలేకపోయాయి." అని నేనంటే, ఆయన "మీరు సాహిత్య పరంగా మార్కిజం పట్ల ఆకర్షితుడయ్యారే కానీ దాని ఆచరణాత్మక జీవితానుభవం మీకు లేదనే అనిపిస్తోంది" అని నిష్కర్షగా తేల్చి చెప్పారు.

"నాన్నగారు చెప్పిన పాఠాల్లో హిందూత్వ కర్మ సిద్ధాంతం ఇమిడివుంటే, పక్క వూళ్లో వుండే బాబాయి చెప్పిన పాఠాల్లో మార్క్సిజం-కమ్యూనిజానికి సంబంధించిన కర్మ సిద్ధాంతం ఇమిడి వుందని తెలుసుకున్నాను." అన్న నా మాటలను ఆయన నమ్మలేక పోయారు. "హిందూత్వ కర్మ సిద్ధాంతం, మార్క్సిజం-కమ్యూనిజం కర్మసిద్ధాంతం... ఎక్కడో తేడా కనబడుతూ ఉంది. స్పష్టంగానే.." అని వ్యాఖ్యానించారు. అయితే నేనన్న "ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం "మార్క్సిజం-కమ్యూనిజం" అన్న దానికి ఆయన మిశ్రమంగా స్పందించారు. "దాని (కమ్యూనిజం) ఆచరణలో 90 ఏళ్లుగా జరుగుతూ వచ్చిన అరాచకాలను పక్కనబెట్టి చూస్తే.... మీరన్న పై వాక్యం అక్షర సత్యం. మనిషికి 8 గంటల పని అవసరం గురించి ఎలుగెత్తి చాటిన సిద్ధాంతం మార్క్సిజమే మరి. ఇంతకు మించిన మానవ విలువ ఎక్కడైనా ఉందా? 8 పని గంటలకు సంబంధించిన ఈ మహత్తర విలువే ఈనాడు పూర్తిగా తలకిందులవుతూ వస్తోంది. ఎంతగా రాత్రింబవళ్లూ ప్రాజెక్టుల మీద పనిచేసినా సరే ఇంకా చేయలేదే అనేంత గొప్ప స్థాయికి ఇప్పటి సమాజం ఎదిగిపోతోంది.." అని అంటూనే, "రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనా, శ్రామికరాజ్యమైనా.. .. ... ... మానవతా దృక్పథం కలిగిందైతేనే, మానవ విలువలకు అర్థముంటుంది" అన్న విషయాన్ని ఒప్పుకోలేదు.

"అగ్రవర్ణ, నిమ్నవర్ణ పునాదిని పదిలపర్చిన రామరాజ్యంలో మానవవిలువలు ఎవరికి ప్రయోజనం కలిగించి ఉంటాయి. రామరాజ్యం వర్ణ వివక్షకు పట్టం గట్టిన రాజ్యం. అక్కడ మానవ విలువలు అంటే సవర్ణ మానవ విలువలు అనే అర్థమే వస్తుంది" అని ఘంటా పధంగా-నిర్మొహమాటంగా చెప్పారు.

చివరగా, "ఆద్యంతం విరుద్ధ-విభిన్న మార్గాలలో పయనించడం అని మీరు ఓ చోట అన్నారు. ఇది మీకు కూడా ఎక్కువగానే వర్తిస్తుందనుకుంటున్నా. మిమ్మల్ని నొప్పించాలని కాదు. మొత్తంమీద చూస్తే రెండు విభిన్న దృక్పధాలను కలిగి ఉంటున్నట్లుగా చెప్పిన మీ నిజాయితీకి అభినందనలు. కానీ ఈ ద్వంద్వజీవన దృక్ఫథమే నాకు బోధపడటం లేదు. జీవిత విధానానికి సంబంధించి మీ ఎంపికను నేను తప్పు పట్టదల్చుకోలేదు. మిమ్మల్ని నొప్పించే ఉద్దేశం కూడా లేదు." అని ముగించారు.

రాజు గారు చెప్పిందాన్ని ఒక్క సారి నిశితంగా పరిశీలించాను. నేను చెప్పిందాట్లో తప్పుందానని మల్లీ-మళ్లీ ఆలోచించాను. ప్రస్తుతానికి తప్పనిపించడం లేదన్న నిర్ధారనకొచ్చాను. అయినా.. ఏమో.. ముందు-ముందు నేను మారనన్న నమ్మకం లేదేమో అనుకున్నా. మారేంతవరకు, ఈ నేనును నేనేగా అనుకున్నాను. జవాబిచ్చానిలా: "నా భావాలను మీరు విశ్లేషించిన పద్ధతి నాకు బాగా నచ్చింది. నా అంతరాత్మ ప్రబోధం ప్రకారం, ఇప్పటికీ ... రెండు సిద్ధాంతాలను గౌరవిస్తాను-పాటిస్తాను. నా వయసిప్పుడు 61+. మరి కొన్ని దినాలో, నెలలో, సంవత్సరాలో వేచి చూస్తాను. మారడమో-ఇలానే కొనసాగడమో జరుగుతుందనుకుంటాను".

రాజు గారు అసలు-సిసలైన సాహిత్యాభిమాని. విమర్శకులు-విశ్లేషకులు. ఏదో మొక్కుబడిగా, బ్లాగ్ లో పేరు చూసుకునేందుకు కామెంట్ లో రాసే రకమైన వ్యక్తి కాదు. అందుకే, నా ప్రతి స్పందనను మళ్లీ విశ్లేషించారు. స్పందిస్తూ: "మార్క్సిజం - రామాయణంపై వచ్చిన మీ వ్యాసంపై నా వ్యాఖ్యకు స్పందించినందుకు చాలా సంతోషంగా ఉంది. దానిపై మరి కొంత వివరణను పంపిస్తున్నాను చూడండి. "అయితే, ఈ నమ్మకాలేవీ, నన్ను మార్క్సిజం-కమ్యూనిజం వైపు ఆకర్షితుడను కాకుండా చేయలేకపోయాయి. మరో అనిర్వచనీయమైన శక్తి ఆ దిశగా లాగిందేమో నన్ను. బాల్యంలో నేను పెరిగిన మరో కోణంలోని పరిసరాలే దీనికి కారణం అయుండవచ్చు. నాన్నగారు చెప్పిన పాఠాల్లో హిందూత్వ కర్మ సిద్ధాంతం ఇమిడివుంటే, పక్క వూళ్లో వుండే బాబాయి చెప్పిన పాఠాల్లో మార్క్సిజం-కమ్యూనిజానికి సంబంధించిన కర్మ సిద్ధాంతం ఇమిడి వుందని తెలుసుకున్నాను." అన్న నా మాటలను ఉదహరించారీ్సారి.

"నేను విమర్శా పూర్వకంగా మీ వ్యాసంపై వ్యాఖ్య పంపినప్పటికీ ఎంతో సహృదయతతో మీరు దాన్ని స్వీకరించి మీ అభిప్రాయం చెప్పడం నిజంగా కదిలించివేస్తోంది. రెండు విభిన్న దృక్పధాలను ఒకే సారి, ఒకే వ్యక్తి పాటించడం హేతు విరుద్ధమనే దృష్టితోటే ఆవ్యాఖ్య అలా పంపాను. కానీ నిజం చెప్పాలంటే తెలంగాణాలో మీరు మీ నాన్నగారి ద్వారా సాంప్రదాయక జీవన విలువలను, మీ మిత్రుల ద్వారా వామపక్ష సిద్ధాంత దృక్పధాన్ని ఎలాగైతే ఒడిసి పట్టుకున్నారో, సరిగ్గా అలాంటి అనుభవమే నాకూ ఉంది. బాల్యంలో నేను పెరిగిన సంప్రదాయ జీవనకోణంలోని పరిసరాలు ఒక రకం వ్యక్తిత్వాన్ని నాలో పెంపొందిస్తే, తర్వాత విద్యార్థి జీవితపు మలిదశలో పరిచయమైన మార్క్సిస్ట్ సిద్ధాంతం మరో రకమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించింది. ఇప్పటికీ ఈ రెండింటి కలయికతోటే నా జీవితమూ కొనసాగుతోంది. కానీ, ప్రస్తుతం ఉద్యమ జీవితంతో సంబంధం లేకున్నప్పటికీ వ్యక్తిగా కూడా మార్క్సిస్టు దృక్పధాన్ని నా జీవితమార్గంగా ఎంచుకున్నాను. రాజకీయ మార్క్సిజం దాని పెడధోరణుల కంటే సమాజాన్ని అవగాహన చేసుకోవడంలో మార్క్సిజం అన్ని సిద్ధాంతాల కంటే పై మెట్టులో ఉందని నా అభిప్రాయం" అన్నారు.

"అందుకే ఆధునిక ప్రపంచంలో మానవ విలువలకు నూటికి నూరుపాళ్లు అద్దంపట్టిన అతి గొప్ప సిద్ధాంతం "మార్క్సిజం-కమ్యూనిజం" అని మీరు జనవరి నెల సుజనరంజని వ్యాసం -మార్క్సిజం - రామాయణం (సాహిత్యం మానవ విలువలు)- లో మీరు ప్రకటించిన భావానికి వినమ్రంగా అంజలి ఘటిస్తున్నాను. అలాగని నా బాల్యజీవితాన్ని వెలిగించిన సంప్రదాయ సాహిత్యాన్ని, సంగీతాన్ని ఈనాటికీ నేను మర్చిపోవడం లేదు. నా చందమామ బ్లాగు లో నిన్ననే పోస్ట్ చేసిన "మా తెలుగు మాష్టారూ - మా తెలుగు పద్యమూ" అనే బాల్య జ్ఞాపకాన్ని దయచేసి చూడగలరు. ఈ రోజుకీ మా యింట్లో ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం రెండూ కలిసే కాపురం చేస్తుంటాయి. తెలుగు పద్యం, శ్లోకాలలోని సంగీత ఝరి నన్ను ఎంతగా ఆకట్టుకుంటుందో దాస్ కేపిటల్ పుస్తకం కూడా అంతే ఉద్వేగానుభూతిని కలిగిస్తుంది. ఇది దాదాపు ఉద్యమాల్లో పనిచేసిన, బయట ఉండి మద్దతు పలికిన ప్రతివారి అనుభవంలోనూ కొనసాగుతూ వస్తోంది" అని తన మనసులోని భావాలను ఆవిష్కరించారు రాజు గారు. ఇక మంచి ఉదాహరణను కూడా చెప్పారు. ఆయన చెప్పిన ఆ (ఈ కింద వున్న) విషయం నాకు లోగడ తెలియదు.

"విరసం ఒకప్పటి కార్యదర్శి, సుప్రసిద్ధ మార్క్సిస్ట్ విమర్శకుడు కేవీఆర్ ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తో దాదాపు అందరికీ తెలుసు. కానీ ఆయన ఇష్టపూర్వకంగా వినే గీతాల్లో త్యాగరాజ కృతులు ఒకటి అంటే నమ్మండి. మార్క్సిజాన్ని విశ్వసిస్తూ ఇదేమిటీ చాదస్తం అని ఎవరైనా అంటే అప్పట్లో ఆయన ఒకే ఒక మాట అనేవారు. అవును నేను 'పెట్టుబడి'నీ చదువుతాను. త్యాగరాజ కృతినీ వింటాను. మీకేమన్నా అభ్యంతరమా..! అనేవారాయన". ఎంత గొప్పగా చెప్పారు రాజు గారు.!

"భక్తి సాహిత్యానికే తలమానికంగా నిలిచిన అన్నమయ్య సంకీర్తనలు వింటే, అన్నమయ్య సినిమాలో 'అంతర్యామీ అలసితీ' వంటి పాటలు వింటూంటే నా కళ్లవెంబడి నీళ్లు ధారాపాతంగా కారిపోతుంటాయి. రాజులు మత్తులై, మదోన్మత్తులై రాజ్యాలు ఏలుతున్న కాలంలో తన దేహము, తన గేహము తన సర్వస్వాన్ని దేవుడు అనే భావానికి అంకితం చేసి మానవానుభవాన్ని అక్షరీకరించిన మహితాత్ముడు అన్నమయ్య. రేపు నవ సమాజం ఏర్పడినా అన్నమయ్య సంకీర్తనలు ప్రజలలో ప్రాచుర్యం పొందుతూనే ఉంటాయి. జీవితం పట్ల, సమాజం పట్ల, నమ్మకం కోల్పోయిన చోట, తమను ఆదుకునే వారు ఈలోకంలో ఎవరూ లేరు అనే సామూహిక చింతన గట్టిపడిన చోట మధ్యయుగాల్లో భక్తిసాహిత్యం మానవజాతికి ఊరట కలిగించిందనటం సత్యదూరం కాదు. భక్తిసాహిత్యంలో ప్రగతిశీల ధోరణిని ఈ కోణంలోనే అర్థం చేసుకోవాలనుకుంటాను. రేపటికి సంబంధించిన భయాలు, వృత్తికి సంబంధించిన భయాలు, జీవితానికి సంబంధించిన నిత్య భయాలు సమాజంలో లేకుండా పోయిన రోజు ఈ భక్తిసాహిత్యం కూడా పండుటాకులాగే మారిపోతుందనడంలో సందేహపడవలిసింది ఏదీ లేదు. మీ అంత గట్టిగా నేను సంప్రదాయ విశ్వాసాన్ని ఇప్పుడు పాటించకపోయినప్పటికీ విశ్వాసం, భక్తి పట్ల నాకు గుడ్డి వ్యతిరేకత లేదు. భక్తిపేరుతో జరిగే అరాచకాలపట్ల వ్యతిరేకతే తప్ప, మనిషి నమ్ముతున్న విశ్వాసాన్ని మనస్పూర్తిగా గౌరవిస్తాను. హృదయంలేని ప్రపంచంలో ఊరట నిచ్చేది, ఆత్మలేని ప్రపంచంలో ఆత్మే మతం అని ఏ నాడో మార్క్స్ చెప్పాడు గదా. సమాజానికి భక్తి, విశ్వాసం అవసరమైనంతకాలం అవి కొనసాగుతాయి. వాటి అవసరం తీరిపోయినప్పుడు అవి పండుటాకులా రాలిపోతాయి. ఇదే అవగాహనతో నేను ప్రాచీన సాహిత్య, సంస్కృతులనూ నాదిగా చేసుకుంటున్నాను. అదే సమయంలో యవ్వన జీవితంలో పరిచయమైన సామ్యవాదాన్నీ విశ్వసిస్తూ వస్తున్నాను. మానవ జాతి సాధించిన సమస్త విజ్ఞానాన్ని యువజనులు తమదిగా చేసుకోవాలని లెనిన్ ఏనాడో అన్నాడు కదా. ప్రాచీన సాహిత్య సంపద కూడా మానవ విజ్ఞానంలో భాగమే అయినప్పుడు దానికి దూరంగా ఎలా ఉండగలం" అన్నారు రాజు గారు.

"మీ వ్యాసాన్ని నా విశ్వాసం ప్రాతిపదికనే వ్యాఖ్యానించాను, విమర్శించాను తప్పితే మరేవిధంగాను మిమ్మల్ని నొప్పించలేదనే భావిస్తున్నాను. అలా జరిగి ఉంటే మనఃపూర్వక క్షమాపణలు. మనిషిలో ఉంటున్న సాంప్రదాయ, ఆధునిక విశ్వాసాల, అలవాట్ల వైచిత్రిని మీ జీవితం సాక్షిగా ఆవిష్కరించారు. ఆవిధంగా నావంటి ఎంతోమంది జీవితాల్లోని విశ్వాసాల వెనుక గల గతాన్ని మరోసారి గుర్తుతెచ్చుకునేలా చేశారు. అందుకు మీకు ఆత్మీయ అభినందనలు. 61 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మీ పరస్పర విరుద్ద విశ్వాసాలను, భావజాలాన్ని మార్చుకోగలగడం లేదా మరి కొంత కాలం అట్టిపెట్టుకోవడం గురించి ఆలోచిస్తున్నారు. మీ సాంప్రదాయిక విశ్వాసానికి, మార్క్సిజం పట్ల మీ ఆరాధనకు నిండు నీరాజనాలు". అని ఆయన ముగింపు మాటలకు నా కళ్లు చెమర్చాయి. ఆనంద భాష్పాలు రాలాయి. ఎవరితో ఈ విషయం చెప్పుకోవాలే తెలియదు. ఎవరితో నన్నా పంచుకోవాలి వెంటనే. ముందుగా పక్కనున్న శ్రీమతికి చూపించాను. కూతురు కిన్నెరకు చదివి వినిపించాను. అయినా తృప్తి కలుగలేదు. ఏదో స్వార్థం. ఇంకెందరికో తెలియచేయాలన్న తపన నన్ను వెంటాడింది.

రాజశేఖర రాజు గారికి జవాబిచ్చాను. వ్యాసం పూర్వాపరాలు, ఏ సందర్భంలో నా భావాలకు అక్షర రూపం ఇచ్చానో వివరించాను. నా మనసులో మాట మరోమారు బయట పెట్టాను.

"నా వ్యాసంకంటె మీరు విడతలుగా చేసిన వ్యాఖ్యానం అద్భుతంగా వుంది. ఇంతకాలం నాలాంటి వాళ్లలో నేనొకడినే అనుకుంటుండే వాడిని. నేనెప్పుడు నావాదనను వినిపించే ప్రయత్నం చేసినా స్పందన కరవయ్యేది. అయినా పదిమంది స్నేహితులం కలిసినప్పుడు చెప్పదల్చుకుంది చెప్పితీరేవాడిని. నాకిప్పుడు "మీలో" నా భావాలను అర్థంచేసుకోగల సన్నిహితుడొకరు దొరికారన్న ఆనందం కలుగుతుంది. సీ. నారాయణరెడ్డి, మహాకవి శ్రీ శ్రీ లాంటి ప్రముఖులను ముఖ్య అతిథులుగా పిల్చిన "ఇళ్లక్కియ చింతనై" అనే ప్రముఖ తమిళ సాహీతీసంస్థ నన్నొకసారి, వారినెందుకు పిలిచారో-నన్నూ అందుకే పిలిచే సరికి, ఏమని జవాబివ్వాలో తోచలేదు. ఏటేటా చెన్నైలో జరుపుకునే వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా తమిళ భాషేతర సాహిత్యరంగ ప్రముఖులను పిలవడం ఆ సంస్థకు ఆనవాయితి. అప్పట్లో చిదంబరం సోదరుడు లక్ష్మణన్ ఆ సంస్థకు అధ్యక్షుడు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిగారికి ఆయన సన్నిహితుడు. చంద్రమౌళిగారి ద్వారా-నా ద్వారా లక్ష్మణన్ ఆహ్వానించిన సాహితీ ప్రముఖులు ఆఖరు క్షణంలో హఠాత్తుగా రాలేమని చెప్పడంతో, నన్ను రమ్మనీ-"సాహిత్యం-మానవ విలువలు" అన్న అంశంపై మాట్లాడమనీ ఆ సంస్థ అధ్యక్షుడు లక్ష్మణన్ కోరాడు. పది సంవత్సరాల క్రితం మాట ఇది. ఒప్పుకోక తప్పలేదు. ఒప్పుకున్నాను కనుక మాట్లాడక తప్పలేదు. ఆనాటి ఆ సభలో చేసిన ఆంగ్ల ఉపన్యాస సారాంశం ఒకవిధంగా నాలో నిరంతరం రేపే ఆలోచనలే. సాహిత్యం-మానవ విలువలు ఒకరకంగా - ఏదో ఒక రూపంలో, నా చిన్నతనంనుండి, నేను ఆలోచించి-ఆచరణలో పెడుతుండే భావాలకనుగుణమైనవే. అవి బాల్యంలో ఒక విధంగా, పెరుగుతున్నా కొద్దీ మరో రకంగా మలుపులు తిరుగుతూ వచ్చాయి. ఊహ తెలిసినప్పటినుండి, ఏదో ఘర్షణ-అర్థంకాని ఏదో ఆలోచన, ఏదో తపన, ఏమిటో చెయ్యాలన్న పట్టుదలకు లోనవుతుండే వాడిని. దాని సారంశమే తెలుగులోని ఈ వ్యాసం. నా బ్లాగ్ లో నేను ఆంగ్లంలో చేసిన ఉపన్యాసం కూడా వుంది. వీలున్నప్పుడు చూడగలరు" అని జవాబిచ్చాను.

నా కెందుకో రాజుగారి భావాలను ఆప్త మిత్రుడు భండారు శ్రీనివాసరావుకు తెలియచేయాలనిపించింది. పంపించాను. ఆయన దగ్గరనుంచి వచ్చిన స్పందన మరో అద్భుతమైన వ్యాఖ్యానం. "ఒక రచనకు కానీ ఒక రచయితకు కానీ సార్ధకత లభించడం ఆ రచనని ఎవరయినా చదివినప్పుడు కాదు. చదివిన దానిపై ఏ చదువరి కూడా అనవసరంగా స్పందించడన్నది నా అభిప్రాయం. అయితే ఆ మహానుభావుడు, తెలుగు తెలిసిన ప్రతి వ్యక్తీ చేతులెత్తి నమస్కరించ తగిన ఆ రాజు గారికీ నీకూ నడుమ సాగిన స్పందన, ప్రతిస్పందన గమనించిన తర్వాత నీ రచన సంపూర్తిగా సార్ధకం అయినట్టుగా నేను భావిస్తున్నాను". అని అభినందిస్తూ ఆప్యాయంగా రాసాడు భండారు శ్రీనివాసరావు. దీన్నీ రాజుగారికి పంపాను.

దీనిపైనా రాజుగారి స్పందన చదివిన తర్వాత ఆ వ్యక్తిలోని గొప్పతనం కొట్టొచ్చినట్లు కనిపించింది. దాన్నీ యధాతథంగా కింద వుంచుతున్నాను.

"అనుకోకుండా మీతో ఏర్పడిన ఓ పరిచయం నాజీవితానికో వెలుగులా మారుతోంది. ఓ గొప్ప వ్యక్తిని అనడం అతిశయోక్తి అవుతుంది కాబోలు. ఎంత మంచి వ్యక్తిని పరిచయం చేశారు మీరు! మూడు రోజుల క్రితమే మీరు భండారు శ్రీనివాసరావు గారి గురించి చెబుతూ మెయిల్ పెట్టారు. చదివిన దానిపై ఏ చదువరి కూడా అనవసరంగా స్పందించడన్నది నా అభిప్రాయం-అని రాసారు ఆయన. అయితే ఆ మహానుభావుడు-తెలుగు తెలిసిన ప్రతి వ్యక్తీ చేతులెత్తి నమస్కరించ తగిన ఆ రాజు గారికీ నీకూ నడుమ సాగిన స్పందన, ప్రతిస్పందన గమనించిన తర్వాత నీ రచన సంపూర్తిగా సార్ధకం అయినట్టుగా నేను భావిస్తున్నాను-అంటూ మీకు ఆయన ఇచ్చిన మెయల్‌ను నాకు పంపారు. చదివిన ఆ క్షణం నా తలను కృతజ్ఞతతో కిందికి వాల్చేశాను. "రామాయణం, మార్క్సిజం సాహిత్యంలో మానవ విలువలు" పేరిట మీరు రాసిన వ్యాసం సుజనరంజనిలో చదివిన క్షణాల్లో నా హృదయంలో అప్పటికప్పుడు చెలరేగిన భావాలను వ్యాఖ్యగా మలిచి పంపాను. దానికి మీరు ఎంతగా కదిలిపోయి స్పందించారో అంతకు మించి మీ స్నేహితుడు శ్రీనివాసరావు గారు చలించిన హృదయంతో నాపై ప్రశంసల జల్లు కురిపించినట్లుంది. ఓ మంచి వ్యక్తి హృదయాన్ని కదిలించిన ఫలితమే ఆయన నాపై కురిపించిన ఈ ప్రశంసల జల్లుగా భావిస్తున్నాను. ఈ క్షణంలో నేనేమీ కోరుకోవడం లేదు. నా చిన్ని జీవితానికి ఇది చాలు. ఈ ప్రశంసకు నేను అర్హుడిని కానని నా కనిపిస్తున్నప్పటికి మీ మిత్రుడి హృదయావిష్కరణను వినమ్రంగా స్వీకరిస్తున్నాను".

"మీరు ఈ మెయిల్ పంపిన తర్వాత గత మూడు రోజులుగా స్పందించలేకపోయాను, నిన్న కూడా సెలవే అయినప్పటికీ సిస్టమ్ ముందు కూర్చోలేదు. ఇవ్వాళే మీ మిత్రుడి బ్లాగు చూసాను. నా కళ్లముందు ఓ కొత్త ప్రపంచం ఆవిష్కరించబడినట్లయింది. నిజం చెప్పాలంటే "మార్పు చూసిన కళ్ళు" పేరిట ఆనాటి మాస్కో అనుభవాలు గురించి ఆయన రాస్తున్న బాగాలను చదువుతుంటే ఒకనాటి మహత్తర దేశంతో ఆయన పొందిన మమేకత్వాన్ని ఆత్మావిష్కరణ చేసుకుంటున్నట్లుగా నాకనిపించింది. ఈ క్షణంలోనే ఆయన బ్లాగును నా కిష్టమైన బ్లాగుగా ఎపీ మీడియా కబుర్లు అనే కేటగిరీలో జోడిస్తున్నాను. మీది కూడా ఇక్కడే ఉంటుంది. "ఆ రష్యన్ మహిళ - జగదేకవీరుడు సినిమాలో సరోజాదేవి మాదిరిగా తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటే"... ఇది చదువుతుంటేనే నేను ఫ్లాట్‌గా పడిపోయానంటే నమ్మండి. ఆయన రాసిన మూడు భాగాలను అపరూపంగా నా సిస్టమ్‌లో దాచుకున్నాను. రష్యాలో ఆయన పొందిన అనుభవాలను ఇలాగే ధారావాహికగా రాస్తూపోవాలని కోరుతూ ఇప్పుడే ఆయన బ్లాగులో కామెంట్ పెడుతున్నాను. ఆయన తన మొబైల్, లోకల్ ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు కాని ఈ ఆదివారం తనను ఎక్కడ ఇబ్బంది పెడతానో అని సంకోచంతో కాల్ చేయలేకపోతున్నాను. ఆయన రోజులో ఏ సమయంలో తీరికగా ఉంటారో చెప్పండి. ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాలనుంది. అలాగే మీతో కూడా. ఎంత చక్కటి శైలితో ఆయన ఒక మహా దేశపు చరిత్రతో తన అనుబంధాన్ని రాస్తున్నారు? నిజంగా పిచ్చెత్తిపోతోంది నాకు. అలాగే ఆయన రాజకీయ విశ్లేషణాత్మక వ్యాసాలు కూడా. మీవి కూడా చదివాను. ఇకపై ఎంత బిజీగా ఉన్నప్పటికీ మీ ఇద్దరి బ్లాగులను రెగ్యులర్‌గా ఫాలో అవుతాను. నాలుగైదు దశాబ్దాల నాటి మన దేశ రాజకీయ చరిత్ర విశేషాలను చదవాలంటే మీ ఇద్దరి బ్లాగులూ చదివితే చాలనిపిస్తోంది నాకు" అని ముగించారు.

రాజు గారు ప్రస్తుతం చందమామ ప్రింట్ మరియు ఆన్‌లైన్ విభాగాల్లో అసోసియేట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మా ఇద్దరితో ఈ "అపరూప పరిచయం" చిరకాలం కొనసాగుతుందని మనసారా కోరుకుంటున్నాను అన్నారు. "మీరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, ఇలాగే రచనలు చేయాలని ఆశిస్తున్నాను" అని రాసారు.

భండారు శ్రీనివాస రావు ఒక అజ్ఞాత రచయితనీ, మేమిద్దరం బాల్యం నుంచీ స్నేహితులమనీ, కలిసి పదో తరగతి వరకు (కలిసింది మధ్యలోనే అయినా) చదువుకున్నామనీ, దారులు వేరైన (ఆయన మాటల్లో చెప్పాలంటే "బారులు ఒకటైనా" )కొన్నాళ్లకు ఆయన మేనకోడలును నేను పెళ్లి చేసుకోవడంతో మళ్లీ కలిసామనీ జవాబిచ్చాను. "ఆయన గొప్ప ఆయనకే తెలియని అతి కొద్దిమందిలో భండారు శ్రీనివాస రావు ఒకరు" అని అంటూ రాజు గారి స్పందనను శ్రీనివాసరావుకు పంపినట్లు తెలియచేసాను.

బ్లాగ్ మొదలు పెట్టి నా రచనలన్నీ అందులో పెట్టమని ఆదిత్య ఇచ్చిన సలహా చివరకిలా గొప్ప వ్యక్తులతో పరిచయానికి దారి తీసింది. హ్యూస్టన్ రావడమేంటి, తెలుగు సాహితీ లోకం నన్ను పిలవడమేంటి, నేను ఇక్కడ మాట్లాడింది సిలికానాంధ్ర వాళ్లు వేయడమేంటి, దాని మీద ఇలాంటి స్పందనలొచ్చి నా బ్లాగ్ లో చేరి, నాకు గౌరవాన్ని- గర్వాన్ని కలుగచేయడమేంటి ! ఇదంతా అందరితో పంచికోవాలనే ఈ ఆర్టికల్.

Tuesday, January 26, 2010

జ్వాలా మ్యూజింగ్స్-18 (నెలనెలా తెలుగు వెన్నెల)

హ్యూస్టన్ తెలుగువారి "నెలనెలా తెలుగు వెన్నెల"

వనం జ్వాలా నరసింహా రావు

శాన్ ఫ్రాన్ సిస్కో నుండి అమ్మాయి కిన్నెర వుంటున్న హ్యూస్టన్ కు వచ్చిన రెండువారాలకు నవంబర్ 21న, అక్కడి తెలుగువారు ప్రతినెలా నిర్వహించుకునే "నెలనెలా తెలుగు వెన్నెల" కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి, "హిందూత్వం-మార్క్సిజం-రామాయణం-మానవ విలువలు" గురించి మాట్లాడమన్నారు. మా అమ్మాయి కిన్నెరకు అన్నిట్లోను అంతో-ఇంతో అభిరుచి వుంది. హ్యూస్టన్లోని "రేడియో మిర్చి" కార్యక్రమానికి తీరిక వున్న ప్రతి శనివారం వెళ్లి, సమన్వయ కర్తగా పాల్గొంటుంది. అలానే, హ్యూస్టన్ తెలుగు సాహితీ లోకం వారు నిర్వహించే కార్యక్రమాల్లోనూ యాక్టివ్ రోల్ తీసుకుంటుంది. ఆ సంస్థ ముఖ్య నిర్వాహకుల్లో ఒకరైన శ్రీ పిల్లుట్ల సుదేష్, నేను శాన్ ఫ్రాన్ సిస్కోలో వుండగానే, హ్యూస్టన్ వచ్చినప్పుడు తమ సంస్థ కార్యక్రమానికి నన్ను రమ్మని ఆహ్వానించారు. ఆయనతో పాటు, సంస్థ కార్యకలాపాలను విజయవంతంగా నిర్వహించడంలో, శ్రీయుతులు చెరువు రమ, వంగూరి చిట్టెన్ రాజు, పాకాల రమ, అర్రా షర్వన్ కృషి చేస్తున్నారు. నా కంటె ముందు-నా తర్వాత ఆ సంస్థ ఆహ్వానించిన గౌరవ-ముఖ్య అతిథుల్లో అక్కిరాజు సుందర రామకృష్ణ గారు, "కళాప్రపూర్ణ శ్రీమతి ఎ. అనసూయాదేవి గారు, హనుమాన్ స్వామి ఆచార్యులు గారు, కళానాధభట్ట వీరభద్ర శాస్త్రి గారు, రామ్మోహన్ గారు, వెన్నెలకంటి మాణిక్యం గారు, వేదాంతం రాఘవ గారు, ఆచార్య పాడూర్ జగదీశ్వరన్ గారు, సరోజ శ్రీ శ్రీ గారు, ఆర్టిస్ట్ చంద్ర గారు, పప్పు నరసింహమూర్తి గారి లాంటి ప్రముఖులున్నారు. వారికి లభించిన గౌరవం నాకూ కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఇక్కడొక విషయం చెప్పాలి.

సీ. నారాయణరెడ్డి, మహాకవి శ్రీ శ్రీ లాంటి ప్రముఖులను ముఖ్య అతిథులుగా పిల్చిన సంస్థ నన్నొకసారి, వారినెందుకు పిలిచారో-నన్నూ అందుకే పిలిచే సరికి, ఏమని జవాబివ్వాలో తోచలేదు. "ఇళ్లక్కియ చింతనై" అనే ప్రముఖ తమిళ సాహీతీసంస్థ ఏటేటా చెన్నైలో జరుపుకునే వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా తమిళభాషేతర సాహిత్యరంగ ప్రముఖులను పిలవడం ఆనవాయితి. అప్పట్లో చిదంబరం సోదరుడు లక్ష్మణన్ ఆ సంస్థకు అధ్యక్షుడు. మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిగారికి ఆయన సన్నిహితుడు. చంద్రమౌళిగారి ద్వారా-నా ద్వారా లక్ష్మణన్ ఆహ్వానించిన సాహితీ ప్రముఖులు ఆఖరు క్షణంలో హఠాత్తుగా రాలేమని చెప్పడంతో, నన్ను రమ్మనీ-"సాహిత్యం-మానవ విలువలు" అన్న అంశంపై మాట్లాడమనీ ఆ సంస్థ అధ్యక్షుడు లక్ష్మణన్ కోరాడు. పది సంవత్సరాల క్రితం మాట ఇది. ఒప్పుకోక తప్పలేదు. ఒప్పుకున్నాను కనుక మాట్లాడక తప్పలేదు. ఆనాటి ఆ సభలో చేసిన ఆంగ్ల ఉపన్యాస సారాంశం ఒకవిధంగా నాలో నిరంతరం రేపే ఆలోచనలే. సాహిత్యం-మానవ విలువలు ఒకరకంగా - ఏదో ఒక రూపంలో, నా చిన్నతనంనుండి, నేను ఆలోచించి-ఆచరణలో పెడుతుండే భావాలకనుగుణమైనవే. అవి బాల్యంలో ఒక విధంగా, పెరుగుతున్నా కొద్దీ మరో రకంగా మలుపులు తిరుగుతూ వచ్చాయి. ఊహ తెలిసినప్పటినుండి, ఏదో ఘర్షణ-అర్థంకాని ఏదో ఆలోచన, ఏదో తపన, ఏమిటో చెయ్యాలన్న పట్టుదలకు లోనవుతుండే వాడిని.

మళ్లా ఇన్నేళ్లకు, నాకిష్టమైన విషయాన్నే హ్యూస్టన్ తెలుగు సాహితీ సమితి వారు ఎంపిక చేసి, నన్ను ప్రసంగించమనడంతో, నా ఆలోచనలను ఇతరులతో పంచుకునే అవకాశం మళ్లీ కలిగింది. నా ప్రసంగ సారాంశాన్ని సిలికానాంధ్ర వారి ఇంటర్నెట్ మాగజైన్ "సుజనరంజని" జనవరి సంచికలో ప్రచురించింది. నా (జ్వాలా మ్యూజింగ్స్) బ్లాగ్ లో డిసెంబర్ నెలలో వుంచాను.

శ్రీ సుదేష్ గారు నాకు మా అమ్మాయి కిన్నెర ద్వారా హ్యూస్టన్ లో పరిచయమైన "మంచి సాహితీ మిత్రుడు". ఎక్కడో వేల మైళ్ల దూరం వచ్చి తెలు తల్లికి సేవచేస్తున్న మంచి మనసున్న కుటుంబం వారిది. శంకరాభరణం శంకరశాస్త్రి గారింట్లో పాదం మోపితే "సరిగమలు" వినిపిస్తాయని సినిమాలో చూసినట్లే, వీళ్ళింట్లోకి వెళ్తే, మరచిపోతున్న మన సంస్కృతీ-సాంప్రదాయాలు కళ్ల ముంద సాక్షాత్కరిస్తాయి. హిందువుల సాంప్రదాయ పండుగలకైనా, ఇండిపెండెంట్ డే, రిపబ్లిక్ డే లాంటి సందర్భంలోనైనా, న్యూ ఇయర్స్ డే కైనా, ఆయన-కుటుంబ సభ్యులు శ్రద్ధతీసుకుని చేసే ఏర్పాట్లు చూస్తుంటే చాలా ఆనందం కలిగింది. హ్యూస్టన్ కు వచ్చిన తర్వాత మధ్యలో పదిరోజుల పాటు మా మనుమరాలు కనక్ బారసాలకు శాన్ ఫ్రాన్ సిస్కో వెళ్లి, డిసెంబర్ 30 న తిరిగి వచ్చాం. నిజానికి, అలా రావడంవల్ల న్యూ ఇయర్స్ డే సందర్భంగా, డిసెంబర్ 31 రాత్రి, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, సుదేష్ కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన విందు-వినోద కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది. ఆ నాటి కార్యక్రమం, మా అమెరికా పర్యటనలో ఒక మరపురాని సంఘటనగా మిగిలిపోతుందనాలి. చిన్న పిల్లలు, చిన్న పిల్లల్లా పెద్దలు, ఆడా-మగ తేడా లేకుండా, కలసి-మెలసి ఆనందంగా, తూరుపు-పడమరల సంగమంగా ఎంతో వేడుకగా జరుపుకొని, అర్థరాత్రి పన్నెండవుతూనే "హేపీ న్యూ ఇయర్ టు యూ" అంటూ కేరింతలు వేశారందరూ. అలానే సంక్రాంతి సంబరాలు జరిపించారు. ఎక్కడ ఏ సందర్భంగా కార్యక్రమం జరిగినా, మా కిన్నెర స్నేహ బృందం అంతా వుండాల్సిందే. మా మనుమడు యష్విన్, మనుమరాలు మేథ, కిన్నెర-కిషన్ కనీసం ఒక్క సాంస్కృతిక కార్యక్రమంలోనన్నా పాల్గొనాల్సిందే. యష్విన్ కు డాన్స్ అన్నా, గిటార్ లాంటి సంగీత వాయిద్యాలు పలికించడమన్నా ఎంతో ఇష్టం.

సంక్రాంతి సందర్భంగా ఇక్కడి తెలుగు వారు చేసిన హడావిడి ఇంతా-అంతా కాదు. సంక్రాంతి ముగిసిన వారాంతపు శనివారం రోజున, స్థానిక మీనాక్షి దేవాలయం ఆడిటోరియంలో అంగరంగ వైభోగంగా జరుపుకున్నారు సంక్రాంతి సంబరాలను. అందులో పాల్గొనదల్చుకున్న వాళ్లు తమ పేర్లను రెండు-మూడు నెలలకిందనే నమోదు చేయించుకోవాలంటే, ఎంతమంది ఔత్సాహిక కళాకారులున్నారో అర్థం చేసుకోవచ్చు. సమయాభావం వల్ల పేర్లిచ్చిన అందరికీ అవకాశం దొరకక పోవచ్చు కూడా. ఇక రక రకాల కార్యక్రమాలకు రిహార్సల్లు-డ్రెస్స్ రిహార్సల్లు పెద్ద స్థాయిలో జరుగుతాయి. సరే, మా మనుమడు-మనుమరాలు-కిన్నెర స్నేహ బృందం పిల్లలు పాల్గొంటున్నందున మేము ఇద్దరం కూడా ఆ రోజు సాయంత్రం అక్కడకు వెళ్లాం. వెళ్లినందుకు ఆనందించాం.

కార్యక్రమ ఖర్చుల కింద వచ్చిన ప్రతివారు పది డాలర్లు చెల్లిస్తారు. అయితే ఆడిటోరియంలో వెళ్లేటప్పుడు టికెట్ కొన్నామా-లేదానని ఎవరూ అడగరు. కొనకుండా ఎవరూ పోరు. పది డాలర్లకు సరిపోను, టీ-కాఫీలు, స్నాక్స్, డిన్నర్ ఉచితంగా తిన్నంత ఇస్తారు. ఇంటికి పార్సిల్ కూడా తీసుకుపోవచ్చు.

కార్యక్రమంలో మొదలు చిన్న పిల్లలకు సంక్రాంతి భోగి పళ్లు పోసారు. ఇక పాటలు, పద్యాలు, సోలో నాట్యాలు, బృంద గానాలు, ఒంటరి పాటలు, సినిమా నృత్యాలు, గ్రూప్ డాన్సులు, నాటికలు-నాటకాలు, శంకరాభరణం నుంచి-పరమానంద శిష్యులనుంచి కొన్ని భాగాలు, కూచిపూడి-భరత నాట్యాలు.. ... ఇలా అనేకం .. అద్భుతంగా ప్రదర్శించారు పిల్లలు-పెద్దలు. శంకరా భరణంలోని, దాసు "బ్రోచేవారెవరెవరురా" కీర్తనను వక్రీకరిస్తుంటే, శంకర శాస్త్రి కోపగించుకున్న సన్నివేశం, కుర్రకారు కేకలేస్తుంటే శంకర శాస్త్రి వాళ్లకు బుద్ధి చెప్పడం సన్నివేశం అద్భుతంగా వున్నాయి. శంకర శాస్త్రిగా సాక్షాత్తు సోమయాజులు గారి సోదరుడి కుమారుడు జొన్నల గడ్డ అరుణ్ నటించారు. ఆయన ఇద్దరు పిల్లలు, మా మనుమడు యష్విన్ కూడా అందులో నటించారు. మావాడు శాస్త్రిగారిని ఆట పట్టించిన "రవ రవ" సంగీత కారుడు. రిహార్సల్స్ అన్నీ మా కిన్నెర ఇంట్లోనే జరిగాయి. మా మనుమరాలు మేథ "లాలీ-లాలీ" అనే క్లాసికల్ డాన్స్ లో పాల్గొంది.

"రామశబ్దం" నృత్యం, డోలే-డోలే" నృత్యం, అభినవ్ పాడిన పాట, సంక్రాంతి సంబంధమైన నాట్యం, "దశావతారం" నృత్యం, "అష్ఠ లక్ష్మి" నృత్యం, "చెప్పవే చిరుగాలి" పాట, "అల్లెగ్రా" డాన్స్, వళ్లు గగుర్పొడిచే సినిమా డాన్సులు ప్రేక్షకులను ఆరు గంటల పాటు అలరించాయి. జానకి-శర్మల పిల్లలు స్నేహ, అమూల్య, మానస-శ్రీనివాస్ కూతురు భవ్య, శివ-పల్లవి పిల్లలు అనూహ్య-ప్రణవ్, సోనాలీ కూతురు అందరూ అందరే-బాగా చేశారు. మధ్యలో హ్యూస్టన్ తెలుగు వారందరికీ సన్నిహితుడైన వంగూరి చిట్టెన్ రాజు గారికి సన్మానం చేశారు. హ్యూస్టన్ లో ఇదో అద్భుతమైన అనుభూతి. సప్త సముద్రాల ఆవల, తెలుగుపై నున్న అభిమానాన్ని ఇలా చాటుకుంటున్న అందరూ అభినందనీయులే.

Sunday, January 24, 2010

జ్వాలా మ్యూజింగ్స్-17 (హ్యూస్టన్ "నాసా" కేంద్రం)

మానవాళి మనుగడకై వేసిన అడుగు-
స్ఫూర్తినిచ్చిన "నాసా-లిండన్ బి జాన్సన్ స్పేస్ సెంటర్"

వనం జ్వాలా నరసింహారావు

దైవ దర్శనం తర్వాత, కిన్నెర వాళ్ల గృహ ప్రవేశానికి ఇంకా కొంత వ్యవధి వుండడం వల్ల, దగ్గర్లో వున్న ప్రదేశాలకు మమ్మల్ని తీసుకెళ్లి తీరాలన్న ఆలోచన వచ్చింది కిషన్-కిన్నెరలకు. వెంటనే వచ్చిన వారాంతపు శెలవు దినాన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, హ్యూస్టన్ "నాసా" కేంద్రానికి వెళ్లొచ్చాం అందరం కలిసి. కిన్నెర ఇంటి నుంచి గంట సేపు ప్రయాణం చేస్తే వస్తుంది అది వున్న ప్రదేశం. అక్కడ ఎంజాయ్ చేయడంతో పాటు, తెలుసుకోవాల్సినవి కూడా ఎన్నో వున్నాయి.

1957 లో, అలనాటి సోవియట్ యూనియన్, కృత్రిమ అంతరిక్ష నౌకను మొదటిసారిగా ప్రయోగించడంతో, స్పందించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్హోవర్, ఏడాది తిరక్కుండానే, 1958 లో "నేషనల్ ఎయిరో నాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్"-"నాసా" ను, స్థాపించాడు. వాస్తవానికి మార్చ్ 3, 1915 న ఆ దేశంలో నెలకొల్పిన "నేషనల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఎయిరోనాటిక్స్"-"నాకా" సంస్థ నుంచి "నాసా" ఆవిర్భావం జరిగిందనాలి. అంతరిక్ష యానానికి సంబంధించిన సాంకేతిక నైపుణ్యం, తమ దేశంలో అభివృద్ధి చేయడానికి, "నాసా" స్థాపనకు నలభై సంవత్సరాల ముందు నుంచే "నాకా" పరిశోధనలను విజయవంతంగా నిర్వహిస్తున్నది. తోటి అగ్రరాజ్యం సోవియట్ యూనియన్ సాధించిన ఫలితాలను అధిగమించేందుకు, అంతరిక్ష రంగంలో మరింత పట్టు సాధించేందుకు, ఐసెన్హోవర్ "నాసా" ను స్థాపించాడు. జాన్ కెన్నెడి అధ్యక్షుడిగా వున్నప్పుడు, "నాసా" పైనా, అంతరిక్షంలోకి పంపాల్సిన వ్యోమగాముల శిక్షణ-అభివృద్ధి పైనా, ముఖ్యంగా "చంద్ర మండలం" మీద పాదం మోపడం కొరకూ, భారీగా నిధులను కేటాయించింది నాటి అమెరికన్ ప్రభుత్వం. అవి సత్ఫలితాలనిచ్చి, జులై 20, 1969 న, అమెరికా అంతరిక్ష నౌక "అపోలో" లో ప్రయాణించిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఆల్విన్ అడ్రిన్ లు కెన్నెడి విసిరిన సవాలుకు ప్రతిగా, చంద్రుడి మీద పాదం మోపిన తొలి మానవులయ్యారు. ఆయన వాంఛను నెరవేర్చారు.

"నాసా" ఒక వైపు అంతరిక్ష యానం దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తూనే, ఇంకో వైపు, గతంలో "నాకా" చేపట్టిన "అంతరిక్ష పరిశోధన" కు సంబంధించిన ఫలితాలలోను గణనీయమైన పురోగతిని సాధిస్తూ వచ్చింది. "స్పేస్ టెక్నాలజీ" కి సంబంధించిన వాతావరణ-సమాచార రంగాల్లో అభివృద్ధికి అంతరిక్ష నౌకలను అనుసంధానం చేయడంలో కూడా విజయం సాధించింది. వాషింగ్టన్ లోని "నాసా" ప్రధాన కేంద్ర కార్యాలయం, అంతరిక్ష యానానికి సంబంధించిన పరిశోధన-అభివృద్ధి-శిక్షణలకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించడం-అమలుకు చర్యలు తీసుకోవడం తీసుకుంటుంది. "నాసా" కార్య కలాపాల ప్రధాన అధిపతిని "అడ్మినిస్ట్రేటర్" అంటారు. అమెరికా అధ్యక్షుడు ఎంపిక చేసి, నామినేట్ చేసిన వ్యక్తిని, సెనేట్ ఆమోదించాల్సి వుంటుంది. ప్రస్తుతం జులై 17, 2009 నుంచి ఆ పదవిలో వున్న పన్నెండవ అడ్మినిస్ట్రేటర్, మేజర్ జనరల్ ఛార్లెస్ ఫ్రాంక్ బోల్డెన్ జూనియర్ ను, ప్రెసిడెంట్ ఒబామా నామినేట్ చేశాడు. 34 సంవత్సరాల తన సుదీర్ఘ అనుభవంలో 14 సంవత్సరాలు "నాసా" అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సభ్యుడుగా వుంటూ, 1986-1994 మధ్య కాలంలో నాలుగు పర్యాయాలు అంతరిక్ష నౌకలో స్పేస్ వాక్ చేశాడు. "నాసా" లో వివిధ కీలక పదవులను గతంలో నిర్వహించిన బోల్డెన్ 1946 సంవత్సరంలో ఆగస్ట్ నెల 19 వ తేదీన జన్మించాడు. బోల్డెన్ హ్యూస్టన్ నగర వాసి.

హ్యూస్టన్ నగరంలో, 1961 లో "ప్రయాణీకుల అంతరిక్ష నౌకా కేంద్రం" గా అప్పటి అమెరికా అధ్యక్షుడు లిండన్ జాన్సన్ రూపకల్పన చేసి నెలకొల్పిన ఇక్కడి "నాసా" కార్యాలయం పేరును, జాన్సన్ మరణానంతరం, ఆయన స్మృతి చిహ్నంగా, "లిండన్ బి జాన్సన్ స్పేస్ సెంటర్" గా మార్చారు. గత నాలుగైదు దశాబ్దాలుగా మానవ అంతరిక్ష యానానికి సంబంధించిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి-విజయవంతంగా అమలుకు రంగం సిద్ధం చేసిన సంస్థల్లో, ప్రపంచంలో అగ్రగామిగా పేరు తెచ్చుకుంది హ్యూస్టన్లోని ఈ కేంద్రం. అమెరికా అంతరిక్ష పరిశోధన మొదటి కార్యక్రమమైన జెమిని కార్యకలాపాలు పూర్తయి పోయి, అపోలో కార్యక్రమం ఆరంభమవడంతో, యావత్ ప్రపంచం దృష్టి దానిమీద పడింది. కెన్నెడి విసిరిన సవాలుకు ప్రతిస్పందనగా చేపట్టిన చంద్రుడిపై కాలుమోపే కార్యక్రమం విజయవంతంగా ముగిసి, వ్యోమగాములు సురక్షితంగా భూమి పైకి తిరిగొస్తుంటే, ప్రపంచం కళ్లన్నీ హ్యూస్టన్ మీదనే కేంద్రీకృతమయ్యాయి. జులై 20, 1969 రోజున చంద్రమండలం మీద కాలిడిన నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, అక్కడ నుంచే, "హ్యూస్టన్, ఈగిల్ లాండయింది" అనడం, కొన్ని గంటల్లోనే, అపోలో నౌక "లూనార్ మాడ్యూల్‌" నుంచి ఆయన సహచర వ్యోమగాములు, నిచ్చెన ద్వారా దిగి అంతరిక్షంలో పాదం పెట్టి, "మానవుడికి ఇదొక చిన్న అడుగే కాని, మానవాళి మనుగడ దిశగా వేసిన పెద్ద అడుగు" అని ప్రకటించడం, ఇక్కడి వారికి మరపు రాని సంఘటన.

భూత-భవిష్యత్-వర్తమానాలకు చెందిన అమెరికా అంతరిక్ష పరిశోధనలు, సాధించిన విషయాలు, మానవాళి మనుగడకు సాధించనున్న సత్ఫలితాలు కళ్లకు కట్టినట్లు చూడొచ్చిక్కడ. సాక్షాత్తు అంతరిక్ష యానం చేస్తున్న అనుభూతినీ పొందవచ్చు. ఈ భూమండలంలో-యావత్ ప్రపంచంలో, మరెక్కడా లేని విధంగా, మరో ప్రపంచంలోకి సాహసోపేతమైన ప్రయాణం చేయించగల సౌకర్యమున్న ప్రదేశం కూడా బహుశా హ్యూస్టన్లోని అంతరిక్ష కేంద్రం ఒక్కటేనోమో. ఇక్కడ ప్రదర్శనలో వుంచిన వివిధ అంశాలు, ఆకర్షణలు, ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు, ఇంతవరకు జరిపిన అంతరిక్ష ప్రయాణాలకు సంబంధించిన అలనాటి "ప్రత్యక్ష ప్రసారాలు", వ్యోమగాముల శిక్షణా వివరాలు, మిషన్ కంట్రోల్ కేంద్రం, చంద్ర మండలం నుంచి తెచ్చిన శిలలు, "నాసా" వాహనంలో పర్యటన, అంతరిక్షంలో నౌకను పంపే సమయంలో అడుగడుగునా చోటు చేసుకునే సంఘటనలు, చిన్న పిల్లల వినోద కార్య క్రమాలు.. ... ఇలా ఎన్నో ఆసక్తికరమైన వినోద-విజ్ఞాన ప్రదేశం హ్యూస్టన్లోని "నాసా" కేంద్రం.

జ్వాలా మ్యూజింగ్స్-16 (అమెరికాలో దేవాలయాల సంస్కృతి)

అమెరికాలో దేవాలయాల సంస్కృతి

అష్ట లక్ష్మి దేవాలయం- గోదా కల్యాణం
లివర్ మోర్ శివ-విష్ణు దేవాలయం-వైకుంఠ ఏకాదశి

వనం జ్వాలా నరసింహా రావు

మేం గతంలో అమెరికా వచ్చిన రెండు పర్యాయాలు కూడా, కిన్నెర మమ్మల్నెక్కడికీ తీసుకుపోలేక పోయానని అనుకుంటుండేది. అప్పుడు డెలివరీ రోజులు కాబట్టి తిరగడం ఇబ్బందిగా వుండేది. అయినా అప్పట్లో కూడా పిట్స్ బర్గ్ కు, స్మోకీ హిల్స్ కు వెళ్లొచ్చాం. ఈ సారి వచ్చినప్పటినుంచీ ఎక్కడి కన్నా వెళ్దామనేది. చలి రోజులు కాబట్టి, దూర ప్రయాణం చేయమని స్పష్టంగా చెప్పాం. అదే విషయం శ్రీమతి అక్క కొడుకు వంశికి, కూతురు శ్రీదేవికి కూడా చెప్పాం. కలవాలనుకుంటే మేముండే చోటుకు వాళ్లనే రమ్మని సలహా ఇచ్చాం. అందుకే ఎక్కువగా, హ్యూస్టన్ చుట్టుపక్కల ప్రదేశాలను, వూళ్లోని దర్శనీయ స్థలాలను చూపించాలనుకున్నారు కిన్నెర-కిషన్. పిల్లలకు స్కూళ్లుండడం వల్ల శెలవు దినాల్లోనే బయటకు వెళ్లేందుకు వీలయ్యేది. కిన్నెర వాళ్ల కొత్త ఇల్లు పూర్తయ్యే దశలో వున్నందున గృహ ప్రవేశానికి-ఇల్లు మారడానికి కూడా ఏర్పాట్లు చేసుకునే హడావిడిలో వుండడంతో, సమయం చిక్కినప్పుడు మాత్రమే బయటకు వెళ్తుండే వాళ్లం. మొదటగా వెళ్లిన స్థలం, షుగర్ లాండ్ సినోట్ రోడ్ లో, గుజరాతీల స్వామినారయణ టెంపుల్ పక్కనున్న “అష్టలక్ష్మి దేవాలయం". కిన్నెర వుంటున్న ప్రదేశం నుంచి అక్కడకు పోవడానికి కారులో పావు గంట ప్రయాణం చేయాలి.

హ్యూస్టన్లో, ఆ మాటకొస్తే అమెరికాలోని అన్ని ప్రధాన నగరాల్లో (చిన్న చిన్న ప్రదేశాల్లో కూడా) హిందు సంస్కృతి-సాంప్రదాయాలకు నిలయమైన అనేక దేవాలయాలు నెలకొల్పారు మన తెలుగు వారు. పిట్స్ బర్గ్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సాక్షాత్తు తిరుమల దేవాలయంతో పోల్చడం అందరికి తెలిసిన విషయమే. దరిమిలా అమెరికాలోని పలు ప్రాంతాల్లో పిట్స్ బర్గ్ కు ధీటుగా దేవాలయాలు వెలిశాయి. సిన్స్ నాటిలో, డేటన్ లో వున్న దేవాలయాలను చూశాం. పిట్స్ బర్గ్ కు వెళ్లినప్పుడు, అక్కడున్న సాయిబాబా గుడిని కూడా చూశాం. అవి ఏవీ కూడా మన దేశంలోని పురాతన దేవాలయాలకు తీసిపోవు. పూజా-పునస్కారాలు కూడా శాస్త్రోక్తంగా, పాండిత్యం తెలిసిన అర్చకులే నిర్వహిస్తుంటారు. అన్నింటికన్నా విశేషం, మన మతాన్ని గౌరవిస్తూ, మన దేవాలయాల నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అమెరికన్ ప్రభుత్వం రక్షణ కలిగించడం. సెక్యులరిజం అనేది మనదేశంలో ఎంతవరకు పాటిస్తున్నామో చెప్పలేం కాని, ఇక్కడ మాత్రం మన భావాలను గౌరవిస్తున్నారు. ఇక్కడ దేవాలయాల్లో అర్చకులుగా వచ్చేవారికి, రెలిజియస్ కోటా కింద వీసాలు జారీ అవుతాయి. కొందరు పూజారులు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు తీసిపోకుండా సంపాదించుకుంటున్నారు. తమ లాంటి వారిని ఇండియా నుంచి పిలిపించి, వారికి జీవనోపాధి కలిగిస్తున్నారు.

హ్యూస్టన్లో, అష్ట లక్ష్మి దేవాలయంతో పాటు, మరికొన్ని దేవాలయాలు కూడా వున్నాయి. అష్ట లక్ష్మి దేవాలయాన్ని"జెట్ వైదిక విజ్ఞాన కేంద్రం" అని కూడా పిలుస్తుంటారు. దేవాలయ నిర్మాణం ఆధునిక పద్ధతుల్లో జరిగినప్పటికీ, భారతీయ ఆగమ సాంప్రదాయానికి భంగం కలగకుండా, తగు జాగ్రత్తలు తీసుకున్నారు నిర్వాహకులు. సనాతన హిందు దేవాలయాల్లో అనుసరిస్తున్న ఆచార వ్యవహారాల విషయంలో కూడా శ్రద్ధ తీసుకున్నారు. నిత్యం ఉదయం-సాయంత్రం యథావిధిగా దేవాలయాల్లో నిర్వహించాల్సిన పూజా కార్యక్రమాలకు ఏ లోటు రాకుండా పూజారులు నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు కూడా జరుగుతాయి. శ్రీ శ్రీ శ్రీ త్రి దండి రామానుజ చిన జీయర్ స్వామి బోధనలకనుగుణంగా, వైదిక సాంప్రదాయాన్ని-వేదాల్లోని విజ్ఞానాన్ని, నేటి తరం-భావి తరాల వాళ్ళకు అందించడమనే ప్రధాన ధ్యేయంగా ఈ దేవాలయం వివిధ కార్యక్రమాలను చేపడ్తుంది. పాంచరాత్ర ఆగమ సూత్రాలను తు. చ తప్పకుండా పాటిస్తూ స్థాపించబడిన అష్ట లక్ష్మి దేవాలయం, నిర్వహణలోనూ అవే అనుసరిస్తుంటుంది. చిన జీయర్ స్వామి, పెద జీయర్ స్వామి నిలువెత్తు ఫొటోలు, ఆళ్వార్ల ఫొటోలు, గోదా దేవి ఫొటోలు అక్కడ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. లక్ష్మి నారాయణ స్వామిని, ఆయన సరసన ఆది లక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్య లక్ష్మి, గజ లక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యా లక్ష్మి, ధన లక్ష్మి విగ్రహాలు దర్శనమిస్తాయిక్కడ. నిత్యం అంగరంగ వైభోగంగా దైవిక కార్యక్రమాలతో పాటు, "హ్యూస్టన్ తెలుగు సాహితీ లోకం" లాంటి సాహితీ సంస్థలు నిర్వహించే "నెల నెలా తెలుగు వెన్నెల" తరహా కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. హ్యూస్టన్లో వుంటున్న తెలుగు వారు (ప్రధానంగా), ఇతర భారతీయులు తరచుగా కలుసుకునే పుణ్యం-పురుషార్థం కలుగజేసే "సాంప్రదాయ-సాహితీ సంగమం" అష్ట లక్ష్మి దేవాలయం.

శాన్ ఫ్రాన్ సిస్కోలో వున్నప్పుడు వాసు దాసుగారి "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం-బాల కాండ మందరం" సంక్షిప్తీకరించి "బాలకాండ మందర మకరందం" గా లఘు కృతిలో పూర్తి చేసి, శ్రీమతి పుట్టిన రోజు కానుకగా ఇవ్వడం జరిగింది గాని, నేను అనుకున్నట్లు గుడికి పోవడానికి కుదర లేదు. ఆదిత్య బిజీగా వుండడం వల్ల బయటకు వెళ్ల లేక పోయాం. ఇంతలో నవంబర్ తొమ్మిదిన హ్యూస్టన్ వచ్చాం. అందుకే వీలైనంత త్వరగా గుడికి వెళ్లాలని కిన్నెరకు చెప్పాం. వచ్చిన మొదటి వారంలోనే "అష్ట లక్ష్మి" దేవాలయానికి వెళ్లి లక్ష్మి నారాయణుడి పాదాల వద్ద మొదటి ప్రతిని వుంచి ఆయన ఆశీస్సులు తీసుకున్నాం. లోగడ రాసిన "సుందర కాండ మందర మకరందం" పుస్తకాన్ని దేవాలయ ప్రధాన అర్చకుడు హనుమాన్ స్వామి గారికి ఇచ్చి ఆయన అనుగ్రహ భాషణం తీసుకున్నాను. శ్రీమతి, కిన్నెర, కిషన్, యష్విన్, మేథలు కూడా గుడికొచ్చారు. ఆపాటికే అక్కడ నిర్వహిస్తున్న ఒక యాగాన్ని కూడా చూశాం.

ఒక సాహితీ కార్యక్రమానికి, కిన్నెర వాళ్ల గృహ ప్రవేశం జరిగిన తర్వాత ఒక నాడు, భోగి పండుగ నాడు "గోదా దేవి కల్యాణం" చేయించడానికి కూడా అష్ట లక్ష్మి దేవాలయానికి వెళ్లాం.

ప్రతి సంక్రాంతి ముందర వచ్చే భోగి పండుగ నాడు చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే "గోదా దేవి కల్యాణం" ఉత్సవానికి హాజరవడం శ్రీమతికి అలవాటు. ముత్తారం దేవాలయంలో చేయించడం కూడా అలవాటుగా మారింది. గత సంవత్సరం, జీయర్ స్వామి ఆశ్రమం వెళ్లి, అక్కడ వేలాది మంది భక్తుల సరసన కూర్చొని, గోదా దేవి కల్యాణంలో పాల్గొన్నాం. ఈ సారి ఎలా అనుకుంటుంటే, భగవంతుడే ఆ ముచ్చట తీర్చాడు. మధ్యలో ఒక సారి గుడికెళ్లినప్పుడు, భోగి పండుగ నాడు, గోదా దేవి కల్యాణం జరిపే విషయం, 51 డాలర్లు చందా ఇస్తే మనం పాల్గొన వచ్చన్న విషయం తెలిసింది. జనవరి 13, 2010 న, కిషన్ (కిన్నెర సంక్రాంతి బొమ్మల కొలువు పెట్టి, పేరంటాళ్లతో గడుపుతుండడంవల్ల రాలేక పోయినందున) మా ఇద్దరిని సాయంత్రం ఏడింటి కల్లా గుళ్లో దింపాడు. 51 డాలర్లు చెల్లించి, అందులో పాల్గొన్నాం. చిన జీయర్ స్వామి చేయించిన రీతిలోనే, దాదాపు వేయి మందికి పైగా హాజరయిన భక్తుల సమక్షంలో, వైభవంగా జరిగింది గోదా దేవి కల్యాణ మహోత్సవం.

గోదా దేవి: అపర జానకీ మాతను గుర్తుకు తెచ్చేదే ఆండాళ్ తల్లి-లేదా-గోదా దేవి. జనక మహారాజు యజ్ఞ శాల నిర్మించేందుకు భూమిని దున్నుతుంటే ఏ విధంగా సీత దొరికిందో, ఆండాళ్‌ కూడా తులసి వనం కొరకు, విష్ణుచిత్తుడు భూమిని దున్నుతుంటే దొరికింది. ఇద్దరూ అయోనిజలే. సీతలేని రామాలయం, గోదాదేవి లేని వైష్ణవాలయం (రామాలయంతో సహా) వుండదు. సీతమ్మ శ్రీరాముడిని, ఆండాళ్‌ శ్రీరంగ నాథుడిని- ఇద్దరు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశతో అవతరించిన వారే-వివాహమాడారు. "పేరి ఆళ్వారు" గా పిలువబడే శ్రీ విష్ణుచిత్తుడు, తమిళనాడులోని శ్రీవిల్లి వుత్తూరులో నిరంతరం వట పత్ర శాయికి మాలా కైంకర్యం చేసుకుంటూ, నిరంతరం ఆ విష్ణు మూర్తి ధ్యానంలోనే గడుపుతుండే వాడు.

తులసి వనం కొరకు భూమిని దున్నుతుంటే ఆండాళ్‌ శిశువు భూమిలో కనిపించింది. ఆ పసికూనను, పరమ సంతోషంతో తన ఇంటికి తీసుకెళ్లి, పెంచమని భార్య కిచ్చాడు విష్ణుచిత్తుడు. పసిబిడ్డకు గోదాదేవి అని నామకరణం చేశారు. గోదా అంటే భూమి అని, భూమిలో ఉద్భవించింది కాబట్టి గోదాదేవి అని పేరు పెట్టారు ఆ దంపతులు. ఆ పసిపిల్లకు చిన్నతనం నుంచే, శ్రీమన్నారాయణుడి మీద అమితమైన భక్తి. పెరిగి పెద్దై, జ్ఞానం వచ్చేసరికి శ్రీమన్నారాయణుడుని తప్ప మానవ మాత్రులనెవరినీ వరించబోనని-వివాహం చేసుకోనని, తన నిశ్చయం తెలిపింది.

తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు వటపత్రశాయికి మాలా కైంకర్యం చేయడం చూసి గోదాదేవి పరవశించి పోయేది. తండ్రి కట్టిన మాలలు ఆయనకు తెలియకుండా ధరించి, భావిలో తన అందాన్ని చూసుకొని మురిసిపోయి, తిరిగి ఆ మాలలను యథాస్థానంలో వుంచేది. ఒక నాడు తండ్రి ఇది చూసి, గోదా చేసింది తప్పని భావించాడు. మాలలు మాలిన్యమై నాయని ఆనాడు వటపత్రశాయికి అవి సమర్పించలేదు. గోదా దేవిని సున్నితంగా మందలించాడు. స్వామికి నిర్ణయించ బడిన పూల దండ ముందర ఆమె ధరించడం అపచారమంటాడు. గోదాదేవి తన కొప్పులో ముడిచిన పూల దండలు తనకెందుకు సమర్పించలేదని విష్ణు చిత్తుడికి కలలో కనబడి ప్రశ్నించాడు వటపత్రశాయి. విష్ణు చిత్తుడు తన కూతురు చేసిన అపరాధాన్ని వివరించి, మాలలను సమర్పించ లేకపోయిన కారణం తెలియ చేశాడు. వాటికి బదులుగా వేరేవి తయారు చేసేందుకు సమయం లేకపోయింది అని విన్నవించుకున్నాడు.

వటపత్రశాయి చిరునవ్వుతో, గోదాదేవి ముందుగా ధరించిన మాలంటేనే తనకు ఇష్టమని, అదే తాను కోరుకుంటున్నానని అంటాడు. ఆమె తలలో పెట్టుకోని మాలలు తనకొద్దంటాడు. ఆమె విషయం విష్ణు చిత్తుడికి తెలియదని, సాక్షాత్తు లక్ష్మీదేవే భూలోకంలో గోదాదేవిగా అవతరించిందని చెప్పాడు. గోదా దేవికి యుక్త వయస్సు వస్తూనే, గోపికలు కృష్ణుడి మీద చూపిన అనురక్తి లాంటిది ఆమెలో కనిపించ సాగింది. కృష్ణుడు యమునలో జలక్రీడలాడే దృశ్యాన్ని మనస్సులో ఊహించుకుంటుంది. ధనుర్మాసంలో తోటి బాలికలతో కలిసి స్నానం చేసి వటపత్రశాయి దేవాలయం శ్రీకృష్ణుడి గృహం గాను, తోటి బాలికలు గోపికలు గాను, వటపత్రశాయి శ్రీకృష్ణుడి గాను, తాను ఒక గోపాంగన గాను భావించుకుంటుంది. వటపత్రశాయికి ధూప, దీప , నైవేద్యంతో రోజుకొక "పాశురం" ద్రావిడ భాషలో (తమిళం)వ్రాసి వటపత్రుడి సన్నిధిలో పాడుకుంటూ, తోటి బాలికలతో కాత్యాయనీ వ్రతం చేసింది. తన తండ్రిని 108 దివ్య తిరుపతుల లోని మూర్తుల కళ్యాణ గుణాలను వివరించి చెప్పమని అడిగింది. ఆమె కోరినట్లే, పేరియాళ్వారు చక్కగా వివరించి చెప్పాడు.

ఆ వర్ణనలను వింటూ, శ్రీరంగంలో వేంచేసి వున్న, శ్రీరంగ నాయకుడి మహాదైశ్వర్యవిభూతి సౌందర్యానికి ముగ్ధురాలైంది. ఆయనను వివాహమాడాలని ధృఢంగా నిశ్చయించుకుంది. గోదా దేవికి శ్రీరంగనాథుడుకి వివాహం జరిగేదెలా అని విష్ణుచిత్తుడు వ్యాకులపడ్డాడు. వటపత్రశాయికి మొర పెట్టుకుంటాడు. తన కుమార్తెను శ్రీరంగ నాథుడి సన్నిధికి తీసుకొని పొమ్మని వటపత్రశాయి ఆదేశించాడు. శ్రీరంగనాథుడు అ రోజు రాత్రి విష్ణు చిత్తుడి కలలో కనిపించి ఆయన కూతురుని వివాహం చేసుకుంటానని, దానికి సిద్ధంగా వుండమని చెప్పాడు. మరుసటి దినం శ్రీరంగ నాథుడి అజ్ఞమేరకు ఆయన భక్తులు, అర్చకులు మేళ తాళాలతో విష్ణు చిత్తుడి దగ్గర కొచ్చి, గోదా దేవిని విష్ణు చిత్తుడిని శ్రీ రంగనాథుడి కోరికగా, పల్లకిలో శ్రీరంగం తీసుకొని పోయారు.

అదే రోజున స్వామి ఆజ్ఞ ప్రకారం, శ్రీ రంగనాథుడి విగ్రహానికి, గోదా దేవినిచ్చి వివాహం చేశారు. గోదా దేవి స్వామిని సేవించడం అందరూ చూస్తుండగా, శ్రీ రంగనాథుడి గర్భాలయంలోకి పోయి ఆయనలో లీనమై పోయింది. శ్రీరంగనాథుడు విష్ణు చిత్తుడిని చూసి, దిగులు పడొద్దని అంటూ, ఆయనకు గౌరవ పురస్కారంగా తిరుప్పరి పట్టము, తోమాల, శ్రీ శఠ కోపము యిచ్చి, సత్కరించి పంపాడు. గోదా దేవికి ఆండాళ్‌, చూడి కొడుత్తామ్మాల్‌ అని పేర్లు కూడా వున్నాయి. గోదాదేవిని 12 మంది ఆళ్వారులలో చేర్చారు. ధనుర్మాసంలో ఆమె రచించి పాడిన తిరుప్పావై పాశురాలు జగత్‌ విఖ్యాతి చెందాయి. అన్ని వైష్ణవ దేవాలయాలలో, ధనుర్మాసంలో, అత్యంత భక్తితో ప్రజలందరు ముప్పై రోజులు పాశురాలను పాడుకుంటు, ఆమెను కొలుస్తుంటారు. ఆమె తిరుప్పవై (30 పాశురాలు), నాచ్చియారు తిరుమొళి (143 పాశురాలు) జగత్‌ విఖ్యాతమై అందరి చేత నుతించ బడుతున్నాయి. తిరుప్పావై ఒక దివ్య ప్రభందం.
అలాంటి గోదా దేవి కల్యాణం అమెరికాలో జరిగినప్పుడు పాల్గొనడం మాకు ఎంతో తృప్తినిచ్చింది. కల్యాణం సంకల్పం కూడా మాతోనే చేయించారు. అది మరింత తృప్తినిచ్చింది. హ్యూస్టన్లో అష్ట లక్ష్మి దేవాలయం కాకుండా, చిన్మయ మిషన్, సాయి బాబా గుడి, శ్రీ మీనాక్షి దేవాలయం కూడా వున్నాయి. మేం మీనాక్షి గుడికి, సాయి బాబా గుడికి కూడా వెళ్లాం. మీనాక్షి గుడి చాలా పెద్దది. శెలవు రోజుల్లో వచ్చే భక్తులు అక్కడే ఏర్పాటుచేసిన భోజన శాలలో కావాల్సినవేవో తిని పోవడం ఆనవాయితి. ఒక డాలర్ చెల్లిస్తే కడుపునిండా తినవచ్చు.

చిన్న పిల్లలు గోదా చరిత్ర-గోదా కల్యాణం నాట్యంగా అభినయిస్తుంటే, మన సంస్కృతీ-సంప్రదాయాలను తల్లి-తండ్రులు మరిచిపోకుండా ఎలా పిల్లలకు తెలియ చేస్తున్నారో అర్థమయింది.

శాన్ ఫ్రాన్ సిస్కోలో వున్నప్పుడు కూడా మూడు దేవాలయాలను చూశాం. వెళ్లిన కొద్దిరోజులకే, ఫ్రీమాంట్ డేలావేర్ డ్రైవ్ లోని వేదిక్ ధర్మ సమాజ్ నిర్వహణలో వున్న హిందు దేవాలయానికి తీసుకెళ్లారు ఆదిత్య-పారుల్. కాలిఫోర్నియా సాగర తీరంలో నివస్తున్న హిందువులందరికొరకు 1985 లో నిర్మించారీ దేవాలయాన్ని. విశాలమైన ఆవరణలో నిర్మించిన ఈ దేవాలయంలో ప్రార్థన, ధ్యానం చేసుకునేందుకు ఏర్పాట్లున్నాయి. అవసరమైన వారికి వారి-వారి హిందు ఆచారాలకు అనుగుణంగా పూజలు, వివాహాది శుభ కార్యాలు, మత పరమైన సంస్కారాలు నిర్వహించుకునే వసతి కూడా వుంది. అన్ని రకాల హిందువుల పండుగలను ఘనంగా జరుపుతారిక్కడ. వైదిక సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలయం కూడా వుంది. భారత దేశంనుండి వచ్చిన అన్ని ప్రాంతాలవారు ఈ గుడికి వచ్చిపోతుంటారు.

శాన్ ఫ్రాన్ సిస్కోలోని మరో ప్రాముఖ్యత సంతరించుకున్న గుడి స్ప్రింగ్ టౌన్ లో వున్న "లివర్ మోర్ శివ-విష్ణు దేవాలయం". దీన్నే "హిందువుల సంస్కృతీ కేంద్రం" అని కూడా పిలిస్తారు. 1977 లో దీనిని నిర్మించాలన్న తలంపు కలగడం, తొమ్మిది సంవత్సరాలకు శివ-విష్ణు దేవాలయంగా రూపుదిద్దుకోవడం, దరిమిలా అంచెలంచలుగా అభివృద్ధి చెందడం, కుంభాభిషేకం-మహాకుంభాభిషేకం జరుపుకొని యావత్ ఉత్తర కాలిఫోర్నియా ప్రాంతానికే తలమానికమైన హిందు మత ప్రచార కేంద్రంగా రూపాంతరం చెందడం జరిగింది. మొదట్లో తాత్కాలిమైన నిర్మాణం మాత్రమే వున్న గుడికి శాశ్వతమైన భారీ దేవాలయంగా నిర్మించ తలపెట్టినప్పుడు పునాది రాయిని వేసింది నాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు. దేవాలయ నిర్మాణ శిల్పులు, ఆగమ పండితులు భారత దేశం నుండి వచ్చారు. సాంస్కృతిక కేంద్రానికి సంబంధించిన ఉత్సవాలను పండిట్ రవిశంకర్, ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్ జరిపించారు. విశాలమైన ఆవరనలో వున్న ఈ గుడికి వేల సంఖ్యలో భక్తులొస్తుంటారు. పండుగ దినాల్లో పదివేలకు పైగా భక్తులు దైవ దర్శనానికి వస్తారు. శాన్ ఫ్రాన్ సిస్కోలో చాలా సంవత్సరాలుగా వుంటున్న మా శ్రీమతి వాళ్ల బాబాయి వల్లభి (స్వర్గీయ)అయితరాజు శేషగిరిరావు గారి కొడుకు సురేశ్ వెంకట్-భార్య సంధ్య-పిల్లలు, మేమిద్దరం కలిసి వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఆ దేవాలయం వెళ్లి ఉత్తర (వైకుంఠ) ద్వారం గుండా విష్ణుమూర్తి దర్శనం చేసుకున్నాం. గుడికి తీసుకెళ్లి దర్శనం చేయించిన సురేశ్ దంపతులకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మా కనక్ పుట్టిన సరిగ్గా నెలరోజులకు శాంతా క్లారాలోనే వున్న ఆదిత్య ఇంటి సమీపంలోని గుడికి వెళ్లొచ్చాం. అదే గుళ్లో, ఆదిత్య కొన్న కొత్త మర్సిడీస్ బెంజ్ కారుకు పూజా కూడా చేయించాడు వాడు.

Thursday, January 21, 2010

జ్వాలా మ్యూజింగ్స్-15 (హ్యూస్టన్ కు వచ్చిన తొలి రోజులు)

(జ్వాలా మ్యూజింగ్స్ 13, 14 భాగాలు "అమెరికా ఎన్నికల్లోను అదే తంతు", "అమెరికా ఆరోగ్య సంస్కరణల చట్టం-భారతీయుడి అభిప్రాయం" అన్న శీర్షికలతో డిసెంబర్ 27, 2009 న ఈ బ్లాగ్ లో పెట్టాను)

హ్యూస్టన్ కు వచ్చిన తొలి రోజులు

వనం జ్వాలా నరసింహా రావు

నవంబర్ 9, 2009 న హ్యూస్టన్ లో వుంటున్న మా అమ్మాయి కిన్నెర దగ్గరకు రావడానికి-తిరిగి శాన్ ఫ్రాన్ సిస్కోకు వెళ్లడానికి, మా ఇంటర్ నేషనల్ ఎయిర్ టికెట్ లోనే ఏర్పాటుచేశాడు ఆదిత్య. శాన్ ఫ్రాన్ సిస్కోకు, హ్యూస్టన్ కు సరాసరి వెళ్లే విమానమైతే సుమారు నాలుగున్నర గంటల ప్రయాణం. మధ్యలో విమానం మారాల్సొస్తే మరో గంటన్నర గడపాలి. మొదటి సారి మా ప్రయాణం సరాసరి వెళ్లే విమానంలోనే. అక్కడకు-ఇక్కడకు టైమ్ కూడా తేడానే. హ్యూస్టన్లో రెండు గంటలు ముందుంటుంది. మేం ఈ తేడాలు పాటించకుండా మా ఏర్పాటు మేం చేసుకున్నాం. మా గడియారాల్లో ఇండియా టైమ్ ను మార్చకుండా, ఏ ప్రదేశంలో వున్నా, అక్కడి పగలును రాత్రిగా, రాత్రిని పగలుగా, అదే టైమ్ ను చూసుకుండే వాళ్ళం. ఉదాహరణకు, శాన్ ఫ్రాన్ సిస్కోలో వున్నప్పుడు (అక్టోబర్ వరకు) ఉదయం ఏడు గంటలవుతే, హైదరాబాద్ లో సాయంత్రం ఏడున్నర గంటలయ్యేది. మా దృష్టిలో శాన్ ఫ్రాన్ సిస్కోలో అప్పుడు ఉదయం ఏడున్నర గంటలయినట్లుగా భావించేవాళ్లం. అలానే హ్యూస్టన్లో అప్పుడు (మేం వచ్చేసరికల్లా) ఉదయం ఏడు గంటలవుతే, ఇండియాలో సాయంత్రం ఆరున్నర గంటలయ్యేది. మా వరకు మాకు, హ్యూస్టన్లో ఉదయం ఆరున్నర గంటల కింద లెక్కే. ఇండియాలో ఉదయాన్ని సాయంత్రం లాగా, సాయంత్రాన్ని ఉదయం టైమ్ లాగా చూసుకున్నాం కనుకనే జెట్ లాగుల లాంటివి మమ్మల్ని భాదించలేదు. గడియారంలో టైమ్ కూడా మార్చలేదు. తిన్నా-తాగినా-నిద్ర పోయినా-పొద్దున లేచినా, అవే టైమ్స్ పాటించాం.

హ్యూస్టన్ విమానాశ్రయంలో దిగి, సామానులు తీసుకొని, బయటకొస్తుంటే, కిన్నెర-కిషన్-యష్విన్-మేథలు కనిపించారు. సాయంత్రం ఐదవుతుందప్పుడు. కిన్నెర వాళ్లు అప్పట్లో షుగర్ లాండ్ లోని "బ్రాడ్ స్టోన్ అపార్ట్ మెంట్స్" లో వుంటున్నారు. సిన్సినాటి నుంచి వెళ్లి, న్యూయార్క్ రాజధాని ఆల్బనీలో కొన్నాళ్లుండి, సుమారు ఏడాది క్రితం హ్యూస్టన్ కు మారి, షుగర్ లాండ్ లో వుంటున్నారు. మా అల్లుడు కిషన్ బ్రిటీష్ పెట్రోలియం సంస్థలో పర్యావరణానికి సంబంధించిన నిపుణుడిగా పనిచేస్తున్నాడు. కిన్నెర సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుండేది ఆల్బనీలో. పిల్లలిద్దరు ఇంకా చిన్నవాళ్లే కాబట్టి మధ్యలో కొన్నాళ్లు ఉద్యోగం మానేసింది. ప్రస్తుతం హ్యూస్టన్లో ఇంకా ఏ ఉద్యోగంలోను చేరలేదు. కిన్నెర వాళ్లుంటున్న షుగర్ లాండ్ ప్రాంతంలో, పక్క-పక్కనే వున్న, "న్యూ టెరిటరీ", "టెల్ ఫెయిర్‌" ప్రాంతాలలో నివసిస్తున్న వారిలో చాలా మంది భారతీయులే. అందులోను ఎక్కువమంది తెలుగు వారే. కిన్నెర ఆడపడుచు మానస కుటుంబం పదేళ్లకు పైగా ఇక్కడే వుంటున్నారు. మానస-భర్త శ్రీనివాస రావు, ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ల సొంత ఇల్లు "న్యూ టెరిటరీ" లో వుంది. విమానాశ్రయం నుంచి కిన్నెర వాళ్లుండే అపార్ట్ మెంట్స్ కు వచ్చే దారిలో, బాబా గుడుకి పోయి, పక్కనే వున్న ఇండియా స్టోర్స్ లో ఏదో కొన్నాం. టెల్ ఫెయిర్‌ లో వాళ్లు కొనుక్కున్న కొత్త ఇల్లు కూడా చూపించారు దారిలో.

షుగర్ లాండ్ సిటీ ఒక విధంగా హ్యూస్టన్లో భాగమే. ఎనభై వేలకు పైగా జనాభా వున్న ఈ నగరం టెక్సాస్ రాష్ట్రంలో-ఫోర్ట్ బెండ్ కౌంటీలో వుంది. హ్యూస్టన్-షుగర్ లాండ్-బే టౌన్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఇదొక ముఖ్యమైన ప్రాంతం. టెక్సాస్ రాష్ట్రంలో అతి తొందరగా అభివృద్ధి చెందిన నగరాల్లో ఇదొకటని అంటుంటారు. 1800 సంవత్సరం వరకూ ఈ ప్రాంతమంతా చెరకు సాగుచేసేవారట. 1959 లో కార్పొరేషన్ హోదా లభించిన షుగర్ లాండ్ ను, ఫోర్ట్ బెండ్ కౌంటీలో అతిపెద్ద సిటీగా-కీలకమైన ఆర్థిక, వాణిజ్య కేంద్రంగా పేర్కొంటారు. టెక్సాస్ రాష్ట్రంలోని ప్రధాన చక్కెర ఉత్పత్తి-మార్కెటింగ్ సంస్థగా గుర్తింపు పొందిన "ఇంపీరియల్ షుగర్" కేంద్ర కార్యాలయం షుగర్ లాండ్ లోనే వుంది. ఫోర్ట్ బెండ్ కౌంటీ లో, మాస్టర్ ప్రణాళిక ఆధారంగా నిర్మాణాలు జరిగిన ప్రదేశాల్లో షుగర్ లాండ్ ను మించింది లేదు. ఫస్ట్ కౌంటీ, షుగర్ క్రీక్, రివర్ స్టోన్, న్యూ టెరిటరీ, టెల్ ఫెయిర్‌, గ్రేట్ వుడ్ లాంటి ఎన్నో మాస్టర్ ప్రణాళికల కమ్యూనిటీ కాలనీలతో అలరారే అందమైన అమెరికన్ "ఛండీగఢ్" నగరం షుగర్ లాండ్. నగర మునిసిపల్ కార్యాలయం "సిటీ కౌన్సిల్" హాలుండే ప్రదేశం చక్కటి విహార స్థలంలాగా వుంటుంది. చుట్టుపక్కల ఎన్నో భారతీయ-ఆంధ్రుల రెస్టారెంట్లుంటాయి. అసలా మాటకొస్తే, హ్యూస్టన్ పరిసరాల్లో ఎక్కడ తిరుగుతున్నా, భారతదేశంలోని ఏ హైదరాబాద్ లోనో తిరుగుతున్నట్లు వుంటుంది. వాతావరణం కూడా దాదాపు అలానే వుంటుంది. అలానే గుళ్లు-గోపురాలు, పెళ్లిళ్లు-పేరంటాలు, సాయంకాల సమావేశాలు, వీకెండ్ పార్టీలు, విందులు-వినోదాలు, అన్నీ అచ్చు హైదరాబాద్ లో మాదిరి అనుభూతే కలిగింది. మా అమ్మాయి కిన్నెర ఆల్బనీలోని ఇల్లు అమ్మి, ఇక్కడ నూతనంగా అభివృద్ధి చెందుతున్న "టెల్ ఫెయిర్‌" కమ్యూనిటీ కాలనీలో ఇల్లు కొనుక్కున్నారు. మేం వచ్చేసరికి అదింకా పూర్తిగా తయారవలేదు. మేం ఇక్కడ వుండగానే అందులోకి మారారు.

కిన్నెర వాళ్లుండే అపార్ట్ మెంట్స్ ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటిది. లోనికి రావాలంటే, గేట్ తెరుచుకోవాలి. దానికో పాస్ వర్డ్ వుంటుంది. అయితే అదొక బహిరంగ చిదంబర రహస్యం. ఏ మాత్రం తెలివితేటలున్నా లోపలికి రాజాలా రావచ్చు. పోవడానికి ఇబ్బంది అసలే వుండదు. శాంతా క్లారాలో ఆదిత్య వుంటున్న అపార్ట్ మెంట్స్ లో కూడా అంతే. కిన్నెర చిన్నతనంలో హైదరాబాద్ లో ఎలా స్నేహితుల బృందాన్ని పెంచుకుందో, సరిగ్గా అదే తరహాలో ఇక్కడకూడా చేస్తున్నది. పక్క-పక్క ఫ్లాట్లలో వుంటున్న పేరి శర్మ-భార్య జానకి-పిల్లలు స్నేహ, అమూల్య; ఉత్తర భారతీయులు అంబుజ్-భార్య రూ పాళి-పిల్లలు అనికా, అర్ష్; దగ్గర లో వుంటున్న శివ-పల్లవి-పిల్లలు ప్రణవ్, అనూహ్య; కొంచెం దూరంలో వుంటున్న రామకృష్ణ-భార్య సునంద-పిల్లలు భావన, సంజనా; దగ్గర లోని న్యూ టెరిటరీ లో వుంటున్న కిషన్ చెల్లెలు మానస-భర్త శ్రీనివాస్-పిల్లలు హర్ష్, భవ్య లతో సహా దాని ఇతర స్నేహితులు సుమన, అపర్ణ, గీత, సోనాలీ.. ... ... ఇలా ఎందరితోనో పరిచయాలు చేసుకొని, అంతటితో ఆగకుండా స్నేహంగా మెలుగుతుంటుంది. ఒకరి కష్ట సుఖాలు మరొకరు తెలుసుకుంటూ, అహర్నిశలు అండ-దండగా వుంటుంటారు. నిజంగా ఇక్కడ వీళ్లని చూసి, కలివిడిగా వుండే విధానం నేర్చుకోవాలనిపిస్తుంది. మేం వచ్చిన మర్నాడే పల్లవి వాళ్లు తమ కొత్త ఇంటిలో గృహప్రవేశమయ్యారు. తెల్లవారు ఝామున జరిగిందా ప్రోగ్రాం. గృహ ప్రవేశానికి తప్పకుండా కావాల్సిన "పాలు" మర్చిపోయింది ఆమె. కిన్నెరకు తెల్లవారుతుండగా, అది అప్పుడే బయలుదేరి అక్కడకు పొయ్యే సమయంలో పల్లవి దానికి ఫోన్ చేసింది. (హైదరాబాద్ లో శ్రీనివాస రావు భార్య దుర్గ-నిర్మలా దేవికి ఆపత్ సమయంలో వచ్చినట్లే దీనికి ఇక్కడ ఇలాంటి ఫోన్లు వస్తుంటాయి). ఏ మాత్రం విసుక్కోకుండా ఇది పాలు పట్టుకొని పోయింది. పల్లవి వాళ్లూ అలానే వుంటారు. ఆ మాటకొస్తే వీళ్ల బృందంలోని అందరూ అలానే.

కిన్నెర-కిషన్ నన్ను, మా శ్రీమతిని వాళ్లందరికీ పరిచయం చేశారు. మా తోనూ వీళ్లందరు అలానే స్నేహంగా మెలిగారు. మేం వచ్చిన నాడే పరిచయమైన శర్మ గారు, అంబుజ్ కలిసి, ఆ మర్నాడే వాళ్లింట్లో (ఇద్దరు పైనా-కిందా ఫ్లాట్లలో వుండేవారు. తర్వాత అంబుజ్ కిన్నెర కొత్త ఇంటికి సమీపంలోనే కొనుక్కున్న సొంత ఇంటికి మారాడు) మంచి పార్టీ ఏర్పాటు చేశారు. వాళ్లకంత త్వరగా నా అలవాటు ఎలా తెలిసిందో మరి. నాకంటే వయసులో చిన్నవారైనప్పటికీ, కలిసి-మెలిసి సమానంగా ఎంజాయ్ చేశారందరు. జానకి గారు-రూ పాళి విందు భోజనం పెట్టారు. ఇక ఇలాంటివి హ్యూస్టన్లో వున్నన్నాళ్లు "నిత్య దిన చర్య" కాకపోయినా "వారాంతపు ఆట విడుపులు" అయ్యాయి.

అమెరికాలో వున్న వారందరికీ-కనీసం మా లాగా అప్పుడప్పుడూ వెళ్తున్నవారందరికి, ఎదురయ్యే వాటిల్లో పెరుగు-తోడు గురించిన అనుభవం ఒకటి. కాక పోతే, మా భండారు శ్రీనివాసరావు తన మాస్కో అనుభవాల్లో రాసినట్లు, సోవియట్ యూనియన్-మాస్కో అంత ఘోరం కాదే మో అమెరికాలో. ఇక్కడ "యోగర్ట్" లని పాకేజ్ పెరుగు వివిధ పరిణామాలలో, వివిధ రుచుల్లో దొరికినా, దాని రుచి మన తోడేసిన పెరుగుకు (కనీసం మనలాంటి వారికైనా) సమానం కాదు. పైగా ఆ యోగర్టులలో ఎక్కువ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. మేం ఇక్కడ శాన్ ఫ్రాన్ సిస్కోలో అడుగు పెట్టగానే మా కోడలిని ఎంక్వైరీ చేసిన మొదటి విషయం పెరుగు-తోడు గురించే. అయితే మేం ఇండియా నుంచి తేకపోవడానికి కారణం ఇక్కడ (మాస్కో లా కాకుండా) తప్పక దొరుకుతుందన్న నమ్మకం. అయితే మా కోడలుకు అమెరికా జీవితం కొత్త-ఇంకా అలవాటు కాలేదు కాబట్టి వాళ్లింకా "యోగర్ట్" లే కొంటున్నారు. వాస్తవానికి ఆ పెరుగు రుచిగా, తియ్యగా, హైజినిక్ గా కూడా వుంటుంది. అయినా మన రుచి ప్రిఫరబుల్ కదా. రెండు-మూడు రోజుల తర్వాత మూడొందల మైళ్ల దూరంలో వున్న లాస్ ఏంజల్స్ కు వెళ్లాం దగ్గర లోని డిస్నీ లాండ్ చూడడానికి. ఆ వూళ్లో వుంటున్న మా శ్రీమతి అక్క కోడలు శిల్ప వాడే పెరుగు "తోడు పెరుగు". అంతే - ఎగిరి గంతేసి ఆ తోడు తెచ్చుకున్నాం. ఇప్పటికీ మా కోడలు అదే తోడు తో పెరుగు తయారు చేసుకుంటుంది. హ్యూస్టన్ కు వచ్చిన తర్వాత ఆ ఇబ్బందే లేదు. ఇదంతా పాడి-పశువులతో వర్ధిల్లే మన చిన్నతనం నాటి ఒక తెలుగు గ్రామం లాగా వుంటుంది. వీళ్లున్న ప్రాంతం పేరే: "షుగర్ లాండ్"- ఒకప్పుడు చెరకు తోటలు విస్తారంగా వుండేవట. ఇప్పటికీ అమెరికాలోని అతి పెద్ద చెరకు ఉత్పత్తి-వాణిజ్య కేంద్రం ఇక్కడే వుంది. ఇక్కడ దొరకని భారతీయ వస్తువు-తెలుగు సామాను ఏదీ లేదు. అందుకే అంటారేమో" "ఏ దేశమేగినా ఎందు కాలిడినా..... పొగడరా నీ పెరుగు తియ్యదనాన్ని" అని.

జ్వాలా మ్యూజింగ్స్-12 (శ్రీమతి పుట్టిన రోజు బహుమతి)

“శ్రీమతి పుట్టిన రోజు బహుమతి”
"బాల కాండ మందర మకరందం"

వనం జ్వాలా నరసింహారావు

అమెరికా వచ్చినప్పటి నుంచి, ఆదిత్యకు చెప్పి "న్యూ యార్క్ టైమ్స్" దినపత్రికకు చందా కట్టి ఇంటికి తెప్పించుకునే ఏర్పాటు చేసుకున్నాను. అమెరికాలో సర్వ సాధారణంగా ఎవరు పత్రికలకు చందా కట్టి తెప్పించుకునే అలవాటుండదు. ఆన్ లైన్‌లోనే చదువుతారు. కొన్ని పత్రికల వాళ్లు చందా కట్టకపోయినా, వారంలో కొన్ని రోజులు ఉచితంగానే వేసి పోతూంటారు. కొందరు వారానికి ఒకటో-రెండో రోజులకు చందా కట్టి, పత్రిక వేయమని అడుగుతే, ఆ డబ్బులకే వారమంతా వేస్తుంటారు. ఏ పద్ధతిలో దిన పత్రిక ఎవరింటికి వచ్చినా, అది ఇంటి ముందర వేసే తీరు అమెరికన్ల క్రమశిక్షణకు నిదర్శనంగా వుంటుందనే చెప్పుకోవాలి. తెల్లవారక ముందే, ఎప్పుడు వేస్తాడో-ఎవరు వేస్తాడో తెలియదు గాని, లేచేసరికి ఇంటి ముందర, చక్కటి ప్లాస్టిక్ కవర్లో, వర్షం కురిసినా తడవకుండా వుండే విధంగా పెట్టి, ఇంటి ముందర వేసి పోతారు. నాలాంటి వాళ్లు వచ్చినప్పుడు తప్ప వాటి జోలికి సాధారణంగా పోరు ఇక్కడుండే మనవాళ్లు గాని, అమెరికన్లు గాని. యధా ప్రకారం "ట్రాష్" లోకన్నా పోతుంది-లేదా-ఇంట్లోకి తేబడి తెరవకుండా "ట్రాష్” లోకన్నా పోతుంది. ఒకవేళ తెరవడమంటూ జరుగుతే, అందులో వుండే "కూపన్లు" చించు కోవడానికి మాత్రమే పరిమితం చేసి, మిగతాది ట్రాష్ లోకి చేరుస్తారు.

సరే, నా అలవాటు మార్చుకోలేక, పేపర్ తెప్పించుకోవడం, చదవడం, ఆసక్తికరంగా వున్న వార్తలను మరింత విశ్లేషణ చేసి, ఇంకొంచెం విషయ సేకరణ చేసి, ఏదో ఒక పత్రికకు పంపడం చేసేవాడిని. కొన్ని ప్రచురించబడ్డాయి వాటిలో. కొన్ని యధా ప్రకారం ఏమైనాయో కూడా తెలియదు. ఎక్కడో ఒకచోట వచ్చేంతవరకు వెంట బడే వాడిని. కొన్ని "ఆంధ్ర జ్యోతి" లో, కొన్ని సిలికానాంధ్ర వారి "సుజన రంజని" లో, కొన్ని మితృడు శంకర్ నడిపే "ఎమ్మెల్యే డాట్ కాం" ఇంటర్నెట్ లో, కొన్ని అన్నింటిలోనూ దర్శనమిచ్చాయి. నేను అమెరికా వచ్చిన మొదటి రోజుల్లో న్యూయార్క్ మేయర్ ఎన్నిక జరుగుతున్న విధానం, అభ్యర్థుల ఎన్నిక వ్యూహాలు, పెడుతున్న ఖర్చుకు సంబంధించిన వార్తలు నన్ను ఆకర్షించాయి. ఇంటికి వస్తున్న న్యూయార్క్ టైమ్స్ తో పాటు, ఆన్‌లైన్లో కూడా వార్తలు చదివేవాడిని. ఇంకో వార్త నన్ను బాగా ఆకర్షించింది, ఆరోగ్యరంగంలో, అమెరికాలో ఒబామా ప్రభుత్వం ప్రవేశ పెట్టదల్చుకున్న సంస్కరణలు. ఈ రెండింటి మీద శ్రద్ధగా చాలా చదివేవాడిని.

"రామాయణం-బాల కాండ మందర మకరందం" రాయడం నవంబర్ మొదటి తేదీతో అయిపోయింది. అయిపోవడమంటే, మొదటి డ్రాఫ్ట్ రాయడం, కంప్యూటర్ లో తెలుగులో స్వయంగా 250 పేజీలకు పైగా కంపోజ్ చేయడం అయిపోయింది. శ్రద్ధగా చదివి అభిప్రాయం చెపుతారని నేను భావించిన వారందరికీ, సాఫ్ట్ కాపీని, మెయిల్ చేశాను. కొందరికి, నేను పంపలేదని అనుకుంటారని-అంటారనీ భయపడి పంపాను. చిలకపాటి విజయ రాఘవా చార్యులు గారి లాంటి వారు, మా శ్రీమతి కజిన్ కొమరగిరి ఫణి లాంటి ఇద్దరు-ముగ్గురు చదివి అభిప్రాయాలు చెప్పారు. సూచనలు కూడా చేశారు. ఆ సూచనలను తగు విధంగా పొందుపరుస్తున్నాను. రాయడం-కంప్యూటర్‌లోకి ఎక్కించడం అయిపోయింది కనుక ఆదిత్య, పారుల్, శ్రీమతి-ముగ్గురు, నా ఆలోచన కను గుణంగా, మొదటి కాపీని ఆవిష్కరిద్దామన్నారు. సిన్సినాటిలో అయిదేళ్ల క్రితం "సుందర కాండ మందర మకరందం" పూర్తి చేసినప్పుడు మొదటి డ్రాఫ్ట్ ను, మా అమ్మాయి కిన్నెర అత్తగారు శ్రీమతి లక్ష్మి సుందరి గారితో ఆవిష్కరించి, మొదటి కాపీని ఆమెగారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మర్నాడే, అనుకోకుండా, అదే వూళ్లో వుంటున్న, బంధువు-మిత్రుడు గన్నంరాజు వెంకటేశ్వర రావు తీసుకెళ్లడంతో పుస్తక ప్రతిని "పిట్స్ బర్గ్" లోని "వెంకటేశ్వర స్వామి" గుడిలో ఆయన పాదాల చెంత పెట్టి తెచ్చుకున్నాను. అలానే ఈ సారి కూడా "బాల కాండ మందర మకరందం" విషయంలో చేద్దామనుకున్నాం.

ఆలోచన వచ్చిందే తడవుగా, కోడలు పారుల్ కార్యరూపంలో పెట్టడం మొదలెట్టింది. ముందుగా పుస్తకం పేజీలన్నీ ప్రింట్లు తెచ్చింది. కలర్ పేజీలను ఆదిత్య ప్రింట్ చేయించాడు. మర్నాడు నవంబర్ 2, 2009 సాయంత్రం అయిదింటికల్లా చక్కటి ఫైల్ గా పుస్తకం కంటే అందంగా తయారుచేశారు ఆదిత్య-పారుల్. అదే రోజు మా శ్రీమతి విజయ లక్ష్మి 55వ పుట్టిన రోజు. హ్యూస్టన్ లో వుంటున్న మా రెండో కూతురు కిన్నెర పుట్టిన రోజు కూడా అదే రోజున. ఆ సాయంత్రం ఆదిత్య స్నేహితులు, శాన్ ఫ్రాన్ సిస్కోలో వున్న ఒకరిద్దరు పరిచయస్తులు ఇంటికొచ్చారు. ఒక రకంగా పండుగ వాతావరణం నెలకొంది. అందరి కోరికపై, "బాల కాండ మందర మకరందం" మొదటి కాపీని శ్రీమతికి అందచేసాను. సరదాగా గడిచిందా సాయంత్రం. నిజానికి శాన్ ఫ్రాన్ సిస్కోకు వచ్చిన తర్వాత మేం జరుపుకున్న పారుల్ పుట్టిన రోజు, శ్రీమతి పుట్టిన రోజు, దసరా-దీపావళి పండుగలు హైదరాబాద్ లోకంటే ఘనంగా జరుపుకున్నా మనాలి. దీపావళి నాడు పారుల్-మా శ్రీమతి కలిసి, ఆదిత్య తోడ్పాటుతో ఏర్పాటుచేసిన లైట్లు చాలా బాగున్నాయి. ప్రమిదలు కూడా ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి వరకు-ఆనాడు కూడా అలానే ప్రమిదలు లైట్లు పెట్టారు. కోడలు పారుల్ కు మా శ్రీమతి లాగానే పూజా-పునస్కారాలంటే ఇష్టం. అదేం టోగాని, మా ఇంట్లో మా నాన్న వారసత్వమైన పూజా-పునస్కారాలు కొడుకులకన్నా, కోడళ్లకే బాగా అబ్బుతున్నాయి. అయితే మా రెండో కూతురు కిన్నెర మాత్రం వాళ్లమ్మ లాగానే, ఉద్యోగం చేస్తున్నా- చేయకపోయినా, పూజల విషయంలో మాత్రం అశ్రద్ధ చేయదు.

రామాయణం రాయడం కార్యక్రమంలో కొంత విశ్రాంతి లభించడంతో మనసు ఆర్టికల్స్ రాయడం వైపు మరలింది. మొదటి ఆర్టికల్ "ఆంధ్ర వాల్మీకి వాసుదాసు"ను సుజనరంజనికి పంపాను. వాళ్లు అక్టోబర్ సంచికలో వాడారు. రెండోది న్యూయార్క్ మేయర్ ఎన్నికల మీద రాసి ఆంధ్ర జ్యోతికి పంపాను. నవంబర్ 8, 2009 న "అమెరికా ఎన్నికల్లోను అదే తంతు" శీర్షికన ఆంధ్ర జ్యోతి దాన్ని ప్రచురించింది. (డిసెంబర్ 27, 2009 న దాన్ని నా బ్లాగ్ లో వుంచాను). మర్నాడు నవంబర్ 9, 2009 న హ్యూస్టన్ లో వుంటున్న మా అమ్మాయి కిన్నెర దగ్గరకు వచ్చాం. అక్కడ కూడా (శాన్ ఫ్రాన్ సిస్కో లో కట్టిన చందా కిందనే, మా కోరిక ప్రకారం, అడ్రెస్ మార్చి పేపర్ వేసే వాళ్లు) న్యూయార్క్ టైమ్స్ పేపర్ వచ్చేది. అక్కడకు పోయిన తర్వాత రాసిన మొదటి ఆర్టికల్ అమెరికా ఆరోగ్య సంస్కరణల మీద. దాన్ని కూడా ఆంధ్ర జ్యోతికి పంపాను. అది నవంబర్ 20, 2009 న ఆంధ్ర జ్యోతిలోను, డిసెంబర్ నెల సుజన రంజనిలోను వచ్చింది. (డిసెంబర్ 27, 2009 న దాన్ని నా బ్లాగ్ లో వుంచాను).

Tuesday, January 19, 2010

జార్జ్ వాషింగ్టన్ నుంచి ఒబామా వరకు (సమస్యల సుడిగుండంలో) అమెరికా-అమెరికన్లు

అమెరికా అధ్యక్షుడిగా బారక్ హుస్సేన్ ఒబామా (జనవరి 20, 2010న)
ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. ...

వనం జ్వాలా నరసింహారావు
హ్యూస్టన్, యూ.ఎస్.ఏ

మున్నెన్నడూ జరగని రీతిలో లక్షలాది మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయి అధిక సంఖ్యలో పరిశ్రమలు మూత బడడంతో, ఎన్నేళ్ల గానో అమెరికన్ ప్రభుత్వం ఇస్తూ వస్తున్న నిరుద్యోగ భీమా, ఫుడ్ స్టాంప్స్ కార్డ్స్, ధన రూపేణా సమకూరుస్తున్న సంక్షేమ సహాయం అంచనాలను మించి పోయి ప్రభుత్వానికి గుదిబండలాగా తయారయ్యాయని ఆర్థికరంగ నిపుణులు భావిస్తున్నారు. ఒక వైపు లబ్దిదారుల సంఖ్య పెరగడం, మరో వైపు కను చూపు మేరలో పరిస్థితులు మెరుగయ్యే సూచనలు కనిపించక పోవడంతో, దారుణమైన ఈ ఆర్థిక మాంద్య ప్రభావాన్ని ఎలా ఎదుర్కోవాలని ఒబామా ప్రభుత్వం ఆలోచనలో పడింది. కాకపోతే సంక్షోభ తీవ్రతను అదుపులో వుంచేందుకు చేతనైన ప్రయత్నం కొనసాగిస్తూనే వుంది ప్రభుత్వం. అరవై లక్షల "అమెరికన్ పేదల పాలిటి పెన్నిధి"గా పిలవదగిన (భారత దేశంలో అమలవుతున్న) "జాతీయ పనికి ఆహార పథకం" లాంటి అమెరికా "ఫుడ్ స్టాంప్ ప్రోగ్రాం" పటిష్టంగా అమలు జరిపేందుకు చర్యలు చేపట్టింది.

ఆహార భద్రత-ఉపాధి పథకాలను భారత దేశం లాంటి అభివృద్ధి చెందుతున్న-బీద దేశాలలో అమలు పరచడం మామూలే. "సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన పథకం", "జాతీయ పనికి ఆహార పథకం" అలాంటివే. ఆర్థికంగా-సామాజికంగా వెనుకబడిన తరగతుల వారికి, దారిద్ర్య రేఖకు దిగువనున్న గ్రామీణ పేద కుటుంబాల వారికి ఆహారంతో పాటు, ఉపాధి కలిగించే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలివి. "జాతీయ పనికి ఆహార పథకం" కింద దేశంలోని గ్రామాల్లో నివసిస్తున్న అత్యంత వెనుకబడిన కుటుంబాల వారిని గుర్తించి, ప్రతి కుటుంబానికి నెల రోజుల పాటు ఉపాధి కలిగించి, పనిచేసిన వారికి ఆర్నెల్ల పాటు బియ్యం, డబ్బులు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. సరిగ్గా అలాంటిదే అమెరికాలో ఇటీవల కాలంలో పలువురిని ఆదుకుంటున్న "ఫుడ్ స్టాంపుల పథకం". ఎప్పుడో 1961లో పైలట్ ప్రోగ్రాంగా అప్పట్లో నెల కొన్న ఆర్థిక పరిస్థితులను అధిగమించడానికి చట్టంగా చేసి అమలుపర్చిన ఫుడ్ స్టాంప్స్ ప్రోగ్రాం ఇప్పడు ఒబామా ప్రభుత్వాన్ని ఆదుకుంటున్నదనవచ్చు.

ఆరంకెల డాలర్ల నెలసరి ఆదాయం-ఆరు గదుల అందమైన ఇల్లు కోల్పోయి, తినడానికి తిండి -ఉండడానికి ఇల్లు లేక, గంపెడు కుటుంబంతో, కేవలం ప్రభుత్వ సహాయంతో జీవించే అమెరికన్ల సంఖ్య రోజు-రోజుకు పెరిగిపోతుంది. కనీ-వినీ ఎరుగని ఆర్థిక మాంద్యం నేపధ్యంలో ఉపాధి కోల్పోయిన పలువురు, ఉద్యోగాలకు దరఖాస్తులు పంపడం-అవన్నీ బుట్ట దాఖలా కావడం సర్వసాధారణ విషయమై పోయిందిప్పుడు అమెరికాలో. అలా ఇబ్బందులకు గురవుతున్న వారితో పాటు, మరెన్నో కారణాలవల్ల ఉపాధికి-ఆదాయ వనరులకు నోచుకోని వారికి ఆసరాగా అమెరికన్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకమే "ఫుడ్ స్టాంపుల పథకం". కాకపోతే ప్రభుత్వం నుండి అందే సహాయం, లబ్ది పొందేవారి అవసరాలకు అనుగుణంగా, ప్రభుత్వ అంచనా మేరకు ధన రూపేణా కాకుండా, కొన్ని వందల డాలర్ల విలువ చేసే "ఫుడ్ స్టాంపుల" రూపంలో మాత్రమే వుంటుంది. ఈ విధంగా ప్రభుత్వ సహాయంతో బ్రతుకుతున్న అరవై లక్షల మంది అమెరికన్లు "ఫుడ్ స్టాంపులు" పొందాలంటే, తమ కెలాంటి ఆదాయం లేదనీ-నిరుద్యోగులమనీ-ఏ రకమైన ఇతర ధనరూప సహాయం తమకు ఎక్కడనుంచి లభించడం లేదనీ-సంక్షేమ, నిరుద్యోగ, భీమా, పెన్షన్ సౌకర్యం కింద ఎలాంటి భృతి దొరకడం లేదనీ-తమ పిల్లలకు గాని, కుటుంబంలోని వికలాంగులకు గాని మరే విధమైన సహాయం అందడం లేదనీ నిర్ధారించే ధృవీకరణ పత్రం ఇవ్వాలి. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సహాయం లభిస్తుంది.

ఆర్థిక మాంద్యం దేశాన్ని కుదిపి వేయడాని కంటే ముందే, అమెరికన్ సంక్షేమ చట్టాల అమలు కఠినతరం చేసిన కారణంగా, గతంలో ధన రూపేణా లభిస్తుండె నిరుద్యోగ భృతిని పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న పలువురు అమెరికన్లు, ఫుడ్ స్టాంప్స్ పథకం వైపు దృష్టి సారించడంతో, లబ్దిదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ, గత రెండేళ్లలో అనూహ్యంగా 50%నికి పైగా దాటిపోయింది. ప్రస్తుతం అమెరికాలోని ప్రతి 50 మందిలో ఒకరు ఏరకమైన ఆదాయం లేని కుటుంబ సభ్యుడుగా మిగిలిపోయి, కేవలం ప్రభుత్వం ఇచ్చే “ఫుడ్ స్టాంప్ కార్డ్” మీదే బతుకుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ సహాయంతో జీవిస్తున్న ఇలాంటి కుటుంబాలు అదనపు ఆదాయ వనరుల కొరకు-కనీస ఆశ్రయం కొరకు అన్వేషించని మార్గాలు లేవు. కొంద రైతే తమ చదువుకు సంబంధం లేని చిన్నా-చితకా "బల్ల కింద ఉద్యోగాలు" చేసుకుంటూ నో, బంధువుల దగ్గర గడుపుతూ నో కాలం వెళ్లబుచ్చుతున్నారు. అమెరికాలో నెల కొన్న నిరుద్యోగ సమస్య వృద్ధి చెందుతూ, సుమారు 14%నికి చేరుకోవడంతో, పని దొరకని పలువురికి ఈ పథకం ఒక వరమన వచ్చు.

నిరుద్యోగ సమస్య వృద్ధి రేట్ నానాటికి పెరుగుతూ 10% దాటిందిప్పుడు. ఆ ప్రభావం "ఫుడ్ స్టాంప్స్ కార్డ్స్" కొరకు ఎదురు చూసేవారి సంఖ్య పెరగడానికి దారితీసింది. అమెరికాలోని 3140 కౌంటీలకుగాను, 239కి పైగా కౌంటీలలో నివసిస్తున్న కనీసం నాలుగోవంతు జనాభా ఫుడ్ స్టాంప్స్ మీద ఆధారపడుతున్నారు. 750 కౌంటీలలో నివసిస్తున్న నల్ల జాతీయులలో ప్రతి ముగ్గురి లో ఒకరి జీవనాధారం, 800కౌంటీలలో నివసిస్తున్న చిన్న పిల్లలలో ప్రతి ముగ్గురి లో ఒకరి బతుకు ఫుడ్ స్టాంప్స్ ద్వారా దొరికే సహాయమే. ఫుడ్ స్టాంప్స్ సహాయం కోరుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతున్న వైనం పరిశీలిస్తే కుంచించుకొని పోతున్న అమెరికా వ్యవస్థ దర్శనమిస్తుంది. నెలసరి ఆదాయం 150డాలర్ల కంటే తక్కువుండి, బాంక్ లోగాని, చేతిలోగాని 100డాలర్లకు మించకుండా డబ్బుగలవారందరు ఫుడ్ స్టాంప్స్ కార్డ్స్ పొందేందుకు అర్హులే.

పది సంవత్సరాల క్రితం జులై 1999లో మొదటిసారి నేనొచ్చిన అమెరికాకు ఇప్పటి అమెరికాకు పోలికే లేదు. అప్పుడదో "భూతల స్వర్గం-భోగ భూమి". భారతదేశమంటే అక్కడ నుండి ఇక్కడ కొచ్చి స్థిరపడినవారికి కూడా కేవలం "కర్మ భూమి" మాత్రమే ! రెండో పర్యాయం మార్చ్ 2003లో వచ్చినప్పుడు అమెరికా ఇరాక్ తో భీకర సంగ్రామంలో కూరుకుపోయింది. "భవిష్యత్ ప్రకంపనలు" అమెరికా విమానాశ్రయంలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే కొట్టొచ్చినట్లు కనబడ్డాయప్పటికే. అనుకున్నంతా అయిందనిపిస్తోదిప్పుడు. రాజకీయాలనుంచి, సామాజిక జీవన శైలి వరకు-దైనందిన జీవనశైలి తో సహా, ప్రతి విషయంలోను వైరుధ్యం స్పష్టంగా గోచరిస్తున్నది. ప్రతివారిలో ఏదో అ భద్రతా భావం, ఏదో కోల్పోతున్నా మన్న తపన, ఎలా అంతో-ఇంతో వెనకేసుకోవాలన్న ఆలోచన కనిపిస్తుందిప్పుడు. ఈ విషయంలో అమెరికన్లకు, వలస వచ్చి స్థిరపడిన ఇతర దేశీయులకు తేడా ఏ మాత్రం లేదనాలి.

అమెరికా చరిత్ర ఆధునికమైందే అయినా, గట్టి పునాదుల మీద లిఖించబడింది. సుమారు రెండు శతాబ్దాల క్రితం జార్జ్ వాషింగ్టన్ బ్రిటీష్ సైన్యాన్ని పారదోలి, ఏకగ్రీవంగా అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఆటుపోట్లను అడపాదడపా ఎదుర్కున్నా, తిరుగులేని ప్రపంచాధిక్య దేశంగా తన స్థానాన్ని పదిలపరచుకుంటూనే వుందనాలి. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, అంతర్జాతీయంగా, అగ్ర రాజ్యంగా అమెరికా ఎదుగుదలను వర్తమాన చరిత్రకారులు గుర్తించారు-గుర్తిస్తూనే వున్నారింకా. అమెరికా 1929లో హూవర్ అధ్యక్షుడుగా వుండగా మొట్ట మొదటిసారి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఆ రోజుల్లోనే కోటి మందికి పైగా అమెరికన్లు ఉపాధి కోల్పోయారు. ఎన్నో బాంకులు దివాలా తీశాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. అలా కొనసాగిన సంక్షోభం రూజ్వెల్ట్ "న్యూ డీల్" తో కుదుటపడి ఒక కొలిక్కి వచ్చింది. ప్రభుత్వ నిధులతో నిరుద్యోగులకు ఉపాధి కలిగించేందుకు ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. బాంకులను, పరిశ్రమలను ఆదుకుంది ప్రభుత్వం. సంక్షోభం నుండి గట్టెక్కింది అమెరికా అప్పట్లో. రెండో ప్రపంచ యుద్ధంలో రూజ్వెల్ట్ సారధ్యంలో అమెరికా విజయం సాధించిన తర్వాత ట్రూమన్ డాక్ట్రిన్ పుణ్యమా అని, కమ్యూనిజం వ్యాప్తి చెందకుండా వుండేందుకు పెద్ద మొత్తంలో నిధులను ఖర్చుచేసింది అమెరికా. ఆ డాక్ట్రిన్ ప్రభావం, ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి అభ్యర్థన మేరకు, 1950 కొరియన్ యుద్ధంలో అమెరికా తన సైన్యాన్ని పంపడంతో దరిమిలా చోటూ చేసుకున్న పరిణామాలు, బహుశా "అంతర్జాతీయ తీవ్రవాదం"- "సీమాంతర ఉగ్రవాదం" ఆవిర్భావానికి పరోక్షంగా దోహదపడ్డాయి.

జాన్ కెన్నెడి హత్యానంతరం అధ్యక్షుడయిన లిండన్ జాన్సన్ హయాంలోనే మొట్ట మొదటిసారిగా "ఫుడ్ స్టాంప్స్ ప్రోగ్రాం “కు అంకురార్పణ జరిగింది. అయినా వియత్నాంలో యుద్దానికి ఐదు లక్షల మంది అమెరికన్ సైనికులను పంపిన జాన్సన్ అప్రదిష్టపాలైనాడు. ఆయన వారసుడు నిక్సన్ ఆ తప్పును సరిదిద్ది సేనలను ఉపసంహరించాడు. గత శతాబ్దం డబ్భై దశకంలో జిమ్మీ కార్టర్ హయాంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయి, నిరుద్యోగ సమస్య మరో మారు అమెరికాను కుదిపేసింది. ఉగ్రవాదం ఉదృత రూపం దాల్చడం మొదలై, ఇరాన్ లోని అమెరికన్ దౌత్య కార్యాలయంలో, అమెరికన్లను బందీలుగా చేసే స్థాయికి చేరుకుంది. కార్టర్ వారి విడుదలకొరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఎన్నికల్లో ఓటమిని చవిచూశాడాయన. రీగన్ హయాం ఆరంభమై "కోల్డ్ వార్" రోజులకు నాంది పలికింది. సోవియట్ యూనియన్ లో కమ్యూనిజంకు చివరిరోజులప్పుడే మొదలయ్యాయి కూడా. "రీగనా మిక్స్" మంచే చేసిందా-చెడే చేసిందా గాని, ఆయన తర్వాత వచ్చిన సీనియర్ బుష్ హయాంలో ఆర్థిక మాంద్యం ఆరంభమై సామాజిక సమస్యలనేకం తలెత్తాయి. ఆయన కాలంలోనే జరిగిన గల్ఫ్ యుద్ధం సీమాంతర ఉగ్రవాదానికి మరింత బలం చేకూర్చింది. బిల్ క్లింటన్ రోజుల్లో అమెరికా ఆర్థిక పరిస్థితి మెరుగైంది. ఉపాధి అవకాశాలు మెండుగా పెరిగాయి.

ఒబామా కంటె ముందు అధ్యక్ష పదవిలో ఎనిమిదేళ్లున్న జూనియర్ బుష్ కు మొదటి విడత అధికారపు మొదటి సంవత్సరమే చేదు అనుభవం ఎదురయింది. అగ్ర రాజ్యంగా-తమనెవరూ ఏమీ చేయలేరని విర్రవీగిన అమెరికాను క్షణాలలో మట్టికరిపించి, ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన న్యూయార్క్ నగరంలోని "వరల్డ్ ట్రేడ్ సెంటర్" టవర్స్ ను "అల్ ఖైదా" ఉగ్రవాదులు నేలమట్టం చేశారు సెప్టెంబర్ 11, 2001న. పర్యవసానంగా "ఉగ్రవాదం" మీద, "ఉగ్రవాదుల" మీద యుద్ధం ప్రకటించాడు బుష్. అఫ్గానిస్థాన్‌ మీద యుద్ధం చేసి అల్ ఖైదా నాయకత్వాన్ని అక్కడ నుండి పారదోలగలిగినా ఇంకా అజ్ఞాతంలో నాయకత్వం తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే వుంది. తర్వాత కువైట్ స్థావరంగా ఇరాక్ మీద 2003లో యుద్ధం చేసి, సద్దాం హుస్సేన్ ను బంధించి, ఆ తర్వాత వురితీసింది అమెరికన్ ప్రభుత్వం. అయినా అమెరికా పెంచి పోషించిన ఉగ్రవాదం అంతం కాలేదు-కాదే మో కూడా.

అమెరికా 44వ అధ్యక్షుడుగా, ఆఫ్రికన్-అమెరికన్ నల్ల జాతీయుడైన బారక్ హుస్సేన్ ఒబామా జనవరి 20, 2009న అధికారం చేపట్టాడు. ఒక వైపు అంతర్జాతీయ ఉగ్రవాదం, మరో వైపు తీవ్ర ఆర్థిక మాంద్యం దేశాన్ని కుదిపేస్తున్న క్లిష్ట తరుణంలో అధ్యక్షుడయ్యాడు ఒబామా. ఆయన పదవీకాలమంతా లోటు బడ్జెట్ తోనే గడపాల్సి వస్తుందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇరాక్, అఫ్గానిస్థాన్‌ సమస్యలతో సహా ఆర్థిక పరమైన విషయాలన్నిటికి సంబంధించి మొదటి సంవత్సరం తాను చేయాలనుకుంటున్న కార్యాచరణ ప్రణాళికను అధికారం చేపట్టడానికంటే ముందే సిద్ధం చేసుకున్నాడు ఒబామా. అధికారం చేపట్టిన ఆరంభపు వారాల్లోనే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చట్టసభలతో విస్తృతంగా చర్చించి, 787 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయక ప్యాకేజ్ ను ప్రకటించాడు. అదో మైలురాయిగా అభివర్ణించారు ఆర్థిక నిపుణులు. వాయిదా పద్దతుల మీద ఇళ్లు కొనుక్కొని, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో, ఉద్యోగాలు కోల్పోయి, బాంక్ ఋణాలు చెల్లించలేక, నానా అవస్థలు పడుతున్న వారికి వెసులుబాటు కలిగించే మరో ప్యాకేజ్ ను ప్రకటించాడు. ఆ తర్వాత సమగ్ర జాతీయ ఆరోగ్య భీమా పథకాన్ని ప్రకటించి, దిగువసభ ఆమోదం పొంది, సెనేట్ ఆమోదంకొరకు ఎదురుచూస్తున్నాడు. ఇవన్నీ చక్కదిద్దే చర్యలే.

నిరుద్యోగ వృద్ధి రేట్ 10% దాటిపోవడంతో ఒబామా ప్రకటించిన 787 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయక ప్యాకేజ్ ఏ మూలకూ సరిపోదనుకుంటున్నారు. ఆరున్నర లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించడానికి లక్ష్యంగా పెట్టుకున్న ప్యాకేజ్ నిజంగా ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగిందానని ప్రశ్నిస్తున్నారు పలువురు.

తాను మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్న ఇరాక్ యుద్ధాన్ని కొనసాగించే విషయంలో వ్యూహం మార్చుకున్నాడు. ఆగస్ట్ 2010నాటికి అక్కడున్న బలగాలన్నీ ఉపసంహరించుకుంటానని ప్రకటించాడు. అణ్వాయుధాల తయారీ-పెద్దఎత్తున నిల్వ చేయకపోవడం విషయంలో రష్యా, అమెరికా దేశాలు ఒక అంగీకారానికి వచ్చేలా ఒబామా చొరవ తీసుకున్నాడు. ఎనిమిదేళ్లగా నడుస్తున్న అఫ్గానిస్తాన్ వ్యవహారానికి "చరమగీతం" పాడతానని ప్రకటించి 30వేలమంది అదనపు బలగాలను పంపేందుకు నిర్ణయం తీసుకున్నాడు. అంటే బలగాల సంఖ్య లక్షకు చేరనున్నదన్నమాట. అల్ ఖైదా ఉగ్రవాదులందరినీ తుదముట్టిస్తానంటున్నాడు. ఆ విషయంలో తమకు తోడ్పడాల్సిందేనని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. ఒబామా అఫ్గానిస్తాన్ నిర్ణయం స్వపక్షం నుంచి, విపక్షం నుంచి విమర్శలకు గురైంది. దేశం ఎదుర్కుంటున్న పలు సమస్యలకు పరిష్కార మార్గాలు కనుక్కుంటూ, తమకు నేరుగా సంబంధించిన అంతర్జాతీయ సమస్యలకే ప్రాధాన్యమిస్తూ, ఇతర సమస్యల జోలికి ఒబామా పోకుండా వుంటే మంచిదని పలువురు అమెరికన్లు భావిస్తున్నారు.

అధ్యక్షుడు నల్లజాతివాడైనా, జాతి వివక్షత పూర్తిగా సమసి పోయినట్లు లేదింకా. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పొందినప్పటికీ, ఆఫ్రికన్-అమెరికన్ నల్ల జాతి వారికి ఉద్యోగాలు దొరకడం కష్టమై పోతున్నది. నల్ల-తెల్లవారి మధ్య అసమానతలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే, షికాగో విశ్వవిద్యాలయం నుంచి ఎం.బి.ఏ పొంది, నల్ల జాతి వాడైనందున ఉద్యోగం లభించక, చివరకు బయోడేటా నుంచి తన జాతికి సంబంధించిన వివరాలను ఒక వ్యక్తి తొలగించుకోవాల్సి వచ్చింది. నిరుద్యోగుల శాతం తెల్ల వారికంటే నల్ల వారిలో రెండింతలు పైగా వుందిప్పుడు. నల్ల వారినుండి ఎంత వ్యతిరేకత వచ్చినా రాజకీయంగా తనకు ఎటువంటి నష్టం కలగదని ఒబామా భావిస్తున్నట్లు విశ్లేషకుల అభిప్రాయం. వాస్తవానికి, అమెరికాలోని నల్ల జాతి ఓటర్లందరూ ఓటింగ్ లో పాల్గొన కుండా ఇళ్లలో కూరుచున్నా, ఒబామా గెలిచేవాడు. తెల్ల వారిలో అధిక సంఖ్యాకులకు ఆమోదయోగ్యమైన వ్యక్తిగా, నల్లజాతివారి పక్షాన పక్షపాత దృష్టితో వ్యవహరించనివాడిలా పేరు తెచ్చుకుంటున్నాడు ఒబామా.

ఒబామా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరోగ్య సంస్కరణల చట్టం దిగువ సభ ఆమోదం పొంది, సెనేట్ ఆమోదం కొరకు ఎదురుచూస్తున్నది. చట్టంగా రూపు దిద్దుకునే సమయానికి దాని రూపురేఖలెలా వుంటాయనేది ఇంకా ప్రశ్నార్థకమే. అయితే గుడ్డిలో మెల్ల లాగా, 2009 డిసెంబర్ నెల నుంచి ఆర్థిక పరిస్థితి మెరుగవుతున్నదని, ఆర్థిక మాంద్యంలో వెసులుబాటు కలుగుతున్నదని ఆర్థిక నిపుణులు భావిస్తున్నట్లు మీడియా కథనాలొస్తున్నాయి. అదెంతవరకు వాస్తవమో కాలమే తేల్చాలి.

ఇవన్నీ ఇలా వుండగా, అక్టోబర్ 9, 2009న, ఒబామాకు నోబెల్ శాంతి బహుమానం ప్రకటించడం-దాన్ని ఆయన ఆస్లో నగరంలో నిరసన ధ్వనుల మధ్య అందుకోవడం జరిగింది.

అంతర్జాతీయ సమస్యలు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగ సమస్య తీవ్రత, జాతి వివక్షత, అమెరికాపై పెరిగిపోతున్న ఉగ్రవాద ప్రభావం, స్వపక్ష-విపక్షాలనుండి ఎదురవుతున్న విమర్శలతో ఏడాది పాలన పూర్తి చేసుకున్న ఒబామా భవిష్యత్ లో మిగిలున్న మూడేళ్ల కాలాన్ని ఎలా పూర్తిచేసుకుంటాడోననేది ఆసక్తికరమైన విషయమే.