Sunday, June 30, 2019

లక్ష్మణుడిని చూసి సీతను తలచుకుని దుఃఖపడిన రాముడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-67 : వనం జ్వాలా నరసింహారావు


లక్ష్మణుడిని చూసి సీతను తలచుకుని దుఃఖపడిన రాముడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-67
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (30-06-2019)
         ఇక్కడ సీతాదేవి వ్యవహారం, సంగతులు ఇలావుంటే, అక్కడ దండకలో రాముడి సంగతి వేరే విధంగా వుంది. కామరూపి, మాంస భక్షకుడు, జింక రూపం ధరించిన వంచకుడు మారీచుడుని చంపిన రాముడు ఆశ్రమానికి రావాలని త్వర-త్వరగా వస్తుంటే, వెనుక పక్క నక్క కూత వినిపించింది. ఇది అశుభం తెలుపుతున్నది, దీనివల్ల కీడు కలుగుతుంది, అని భావించిన రాముడు, రాక్షసులు సీతను ఎత్తుకు పోయారేమో అని అనుమానిస్తాడు. దుష్టుడైన మారీచుడు తన గొంతు లాంటి గొంతుతో గట్టిగా అరిచాడనీ, ఆ ధ్వనిని సీత, లక్ష్మణుడు వింటే సీత తప్పక తన కోసం లక్ష్మణుడిని పంపుతుందనీ, లక్ష్మణుడు తనను వెతుక్కుంటూ అడవిలో సీతను ఒంటరిగా వదులుతాడనీ, ఆ తరువాత ఏమి కీడు జరుగుతుందోననీ శంకిస్తాడు రాముడు. తనలో తాను ఇలా అనుకుంటాడు రాముడు:

         “ఔరా! ఏమి విచిత్రం? లోకంలో బంగారు జింక వుంటుందా? మారీచుడు నన్ను ఈ విధంగా మోసం చేసి దూరంగా తెచ్చి, నా బాణాలతో చస్తూ, వూరికే చావకుండా, సీతా...లక్ష్మణా...అని అరుస్తూ చావాలా? ఇదంతా ఆలోచిస్తుంటే, నాకు ప్రత్యక్షంగా కీడు చేయలేరు కాబట్టి రాక్షసులే మాయతో సీతకు కీడు చేయనున్నారా? కాబట్టి ఒంటరిగా వున్నా కలికి సీతకు, నా చిన్న తమ్ముడికి క్షేమం కలగుగాక! జనస్థానవాసం కారణాన రాక్షసులతో అంతంలేని విరోధం కలిగింది. అపసకునాలు విస్తారంగా కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా నక్కల అరుపులు వినపడుతున్నాయి. ఏమి కీడు రానున్నదో? ఏ ఘోర విషయం చూడడం తటస్థిందో? ఏమి చేయగలం? సీతా లక్ష్మణులు ఏ గతి పట్టారో” అని వ్యసనపడ్డాడు రాముడు. నడుచుకుంటూ వస్తున్న రాముడికి మృగాలు, పక్షులు, కుడి నుండి ఎడమవైపుగా భయంకర ధ్వని చేసుకుంటూ పోవడం జరిగింది. ఇది చూసి, లక్ష్మణుడిని, సీతను గురించి ఆలోచించుకుంటూ ఆలశ్యం చేయకుండా పోసాగాడు రాముడు.

         ఇలా పోతున్న రాముడు ఆశ్రమాన్ని సమీపించాడు. అక్కడే ముఖం వేలాడవేసుకుని, ఒంటరిగా వస్తున్నా తమ్ముడి చూశాడు. వెంటనే ఏదో కీడు జరిగిందని శంకించాడు. తమ్ముడిని సమీపించి, ఆయన ఎడమచేయి పట్టుకుని, విచారంగా మొదలు పరుశంగాను, తరువాత మృదువుగాను, ఇలా అన్నాడు. “అయ్యో లక్ష్మణా! ఏం పనిచేసావు? ఎందుకు ఒంటరిగా సీతను అడవిలో విడిచి ఇక్కడికి వచ్చావు? రాక్షసులు ఆ ఆడదాన్ని తిన్నారో? తీసుకుని పోయారో? ఈ రెండింటిలో ఒకటి జరిగి వుండాలి. సందేహం లేదు. అశుభ చిహ్నాలు కనపడుతున్నాయి. అన్నా! లక్ష్మణా! సీతాదేవి ప్రాణంతో వుండగా మనం చూడగలమా? లేదనుకుంటా. ఎందుకంటావా? అదిగో చూడు, విను. నక్కలు, పక్షులు, పెద్ద మృగాలు, సూర్యుడికి ఎదురుగా పరుషపు ధ్వనులు చేస్తున్నాయి. ఆ అపశకునాలు మనకెలా మేలు కలిగిస్తాయి? జింక లాగా కనిపించిన ఈ దుష్ట రాక్షసుడు మోసంతో నన్ను చాలా దూరం తీసుకుని పోయాడు. వాడి మోసపు ఆటలు అర్థంకాగానే చంపేశాను”.


         “లక్ష్మణా! ఎడమకన్ను అదురుతున్నది.  సంతోషం మనస్సులో ఏమాత్రం లేదు. నాయనా, ఆశ్రమంలో సీత లేదు. పగ తీర్చుకోవడానికి రాక్షసులు ఆమెను పట్టుకుని పోయారో లేక వారి బాధ పడలేక ఆమే చనిపోయిందో లేక మనల్ని వెతుక్కుంటూ వచ్చి దారి తెలియక వేరే తోవలో ఎక్కడికైనా పోయిందో? ఇంట్లో సుఖం లేదని సాధారణంగా స్త్రీలు బాధపడుతుంటారు. స్త్రీల బుద్ధి ఇలా ఉన్నప్పటికీ, ఎవరూ చెప్పకపోయినా, బలవంతపెట్టకపోయినా, సుఖపడడానికి కాకుండా వినోదం చూడడానికి, దండకారణ్యంలో కాలినడకన తిరగడానికి నామీద భక్తితో సీత వచ్చింది. నేనెలాంటి వాడిని? రాజ్యహీనుడిని. దుఃఖంతో తపించేవాడిని. నిలువనీడ ఇవ్వడానికి పిలిచేవారు లేని ద్రిమ్మరిని. ఇలాంటి నేను నా కష్ట దశలో సహాయంగా వున్న, చేతనైన సుఖం కలిగించిన, జనకరాజ పుత్రికను వదిలి వచ్చానే, తమ్ముడా! నా భార్య ఏమైపోయిందో చెప్పవయ్యా? ఊపిరితో వుందా? లేదా?”.

         “నా ప్రాణాలు, దేహం నిలబడడానికి ఎవరైతే సహాయ పడ్డారో ఆమెను ఎడబాసి ఈ దేహాన్ని రక్షించలేను. అలాంటి ఆమె నా దగ్గర లేకపోతే సార్వభౌమత్వం కాని, ఇంద్రత్వం కాని కోరను. అట్లాంటి సుమకోమల సీత ఏదిరా లక్ష్మణా? అన్నా, లక్ష్మణా! నా ప్రాణాలకంటే నాకు ప్రియమైనది కావడం వల్లే నా ప్రాణం ఇచ్చైనా, నేనెవరిని రక్షించాలో అలాంటి సీత దండకలో ప్రాణాలతో వుందా? లేదా? అది ముందు చెప్పు. నేను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యంలో కోరతలేకుండా వుంటానని చెప్పాను. ఇప్పుడు సీత లేకపోతె నేను చెప్పిన మాట అసత్యం కాదుకదా? దానివల్ల రాముడు సత్యప్రతిజ్ఞుడనే గొప్పతనానికి హానికలగాడు కదా? నాయనా చెప్పరా! సీత మరణిస్తే, నేనూ మరణించినట్లే. మేమిద్దరం లేకపోతే నీకు ఈ అడవిలో పనేముంది? అయోధ్యకు వెళ్లు. నువ్వు అయోధ్యకు రావడం చూసి, నేను అడవుల్లో చావాలనుకుంటున్న కైక తన కోరిక నెరవేరిందని సంతోషిస్తుంది కదా?”.

         “లక్ష్మణా! సీతాదేవి ప్రాణాలతో వుంటే ఆశ్రమానికి వస్తాను. లేకపోతె, అంతదూరం రావడం ఎందుకు? ఇక్కడే చస్తాను. కాబట్టి, సీత జీవించి వుందా, లేదా చెప్పు. నేను వెళ్లేటప్పుడు జీవించి వ ఉన్న ఆమె, ముద్దులు ఒలుకుతూ, నవ్వుతూ, నాకెదురుగా వచ్చి మంచి మాటలు చెప్పకపోతే నేను ఆశ్రమానికి రాను. దానిముందే మరణిస్తాను. లక్ష్మణా! చెప్పు, సీత ప్రాణంతో వుందా? రాక్షసులు ఏమన్నా మింగారా? రాక్షసులు ఎత్తుకు పోయారా? అయ్యో ఆమె చిన్న వయసుది. మంచి స్వభావం కలది. విలాసంతో వున్నది. ఎక్కడుందో? ఏమో? మారీచుడి అరుపుకు సీత మోసపోయినా, నువ్వెలా మోసపోయావు? సీత పొమ్మన్నా రక్షించాల్సిన వాడివి అబలను ఒంటరిగా వదలి ఎలా వెళ్లావు? అలా వెళ్లి మనకు కీడు చేసే రాక్షసులకు అవకాసం ఇచ్చావు. రాక్షసులు ఆమెను చంపారో? ఏమో? ఇలా జరగవచ్చని కొంచెమైనా ఆలోచించావా? అయినా నిన్ను అని ప్రయోజనం లేదు. సముద్రంలో మునిగాను. చెడ్డాను, చచ్చాను. ఇంతకంటే ఎక్కువ ఏమికావాలి? ఈ గతి నాకు కలగాలని మీకీ బుద్ధి పుట్టించాడు.” అని సీతకొరకై రాముడు వెక్కి-వెక్కి ఏడ్చాడు.

Thursday, June 27, 2019

అలనాటి చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ : వనం జ్వాలా నరసింహారావు


అలనాటి చీకటి అధ్యాయం ఎమర్జెన్సీ
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (28-06-2019)
                44 సంవత్సరాల క్రితం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక చీకటి అద్యాయానికి తెర లేచింది. అందరూ భయపడుతున్నట్లుగానే 1975 జూన్‌ 26న (25వ తేదీ అర్ధరాత్రి) అలనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన స్వప్రయోజనాల కోసం చేసిన సిఫార్సులతో, అప్పటి రాష్త్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటింఛారు. 1977లో తిరిగి ఎన్నికలు జరిగే వరకూ, 21 నెలలపాటు ఈ చీకటి రాజ్యం సాగింది. దీనికి కారణం, రాయబరేలిలో గెలుపుకోసం ఇందిర అనేక అక్రమాలకు పాల్పడ్డారని, కాబట్టి ఈ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆమె చేతిలో ఓడిపోయిన అభ్యర్థి రాజ్‌ నారాయణ్‌ అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌. ప్రధాని ఇందిరా గాంధీపై వేసిన ఎన్నికల పిటీషన్‍లో, ఆమెకు వ్యతిరేకంగా, లోక్ సభకు ఆమె ఎన్నిక చెల్లదని, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్ మోహన్ లాల్ సిన్హా జూన్ 12, 1975 న చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇందిర అనర్హురాలిగా న్యాయస్థానం ప్రకటించింది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, నియంతృత్వ దిశగా అడుగులు వేసింది ఇందిరాగాంధి. యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించే ప్రక్రియకు నాంది పలికింది. అలనాటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి, ఆమె అనుంగు సహచరుడు సిద్ధార్థ శంకర రే సలహా మేరకు దేశ సమగ్రత-సమైక్యతలు ముప్పు వాటిల్లనున్నదన్న కారణం చూపుతూ, జూన్ 25, 1975 అర్థరాత్రి అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ఇందిరా గాంధీ.

వాస్తవానికి 1971లో పాకిస్తాన్‍తో యుద్ధాన్ని బూచిగా చూపి, విధించిన ఎమర్జెన్సీని రద్దుచేయకుండానే, దేశానికి ఆంతరంగికంగా ముప్పు ఏర్పడిందంటూ 352 ఆర్టికల్‌ కింద తిరిగి ఎమర్జన్సీని ప్రకటించింది. దీనిపై కోర్టుకు వెళ్లటానికి వీలులేకుండా రాజ్యాంగానికి 39వ సవరణ తెచ్చింది. అసాధారణ అధికారాలను చేజిక్కించుకుని, పౌర హక్కులను కాల రాసింది. అంతర్గత భధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది ఇందిరా గాంధీ. అలహాబాద్‌ హైకోర్టు తీర్పుతో నియంతగా మారిన ఇందిరా గాంధీ ప్రజాస్వామ్య వ్యవస్థనే ఖూనీ చేస్తూ పలువురు ప్రజాస్వామ్య వాదులు ముందే హెచ్చరించినట్లుగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.

అలహాబాద్‌ హైకోర్టు తీర్పు, జూన్‌ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పును దృష్టిలో పెట్టుకుని ఇందిరాగాంధీ కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలోను, ముఖ్యమంత్రి వెంగళరావు పాలనలోని అలనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍లోను ఎమర్జెన్సీ దురాగతాలు పెద్దఎత్తున చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇష్టానుసారంగా దుర్వినియోగం చేశారు. పోలీసు నిఘా విభాగాన్ని తమ గుత్త సంస్థగా మార్చేశారు. దేశ వ్యాపితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరితో సహా, జయప్రకాష్‌ నారాయణ, మొరార్జీ దేశాయ్ వంటి ప్రతిపక్ష పార్టీల నాయకుల నుండి సాధారణ కార్యకర్తల వరకు వేలాది మంది పేర్లతో జాబితాలు తయారు చేసి విచ్చలవిడిగా అరెస్టులు చేయసాగారు.

పలువురు ముఖ్య నాయకులు అజ్ఞాతంలో ఉండి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్‌ 25న అర్థరాత్రి విధించిన ఎమర్జెన్సీ వార్త ప్రముఖ పత్రికలలో రాకుండా ఉండేందుకు కూడా ప్రభుత్వం విద్యుత్ సరఫరా ఆపుచేసే చర్యలకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. సంబంధిత అధికారులకు అలాంటి ఆదేశాలు అందాయని 'షా' కమీషన్‌ ముందు తరువాత సాక్ష్యాలిచ్చిన వారున్నారు.  క్రమంగా అన్ని పత్రికా వార్తలపైనా సెన్సారు వచ్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ రాయటానికి వీలులేదు. మీసా వంటి చట్టాలను కాంగ్రెస్‌ అధిష్టానం యథేచ్ఛగా తమ కనుకూలంగా వాడుకుంది.

భారత రాజ్యాంగం హమీ ఇచ్చిన వ్యక్తి స్వాతంత్య్రాన్ని ఇందిరా కాంగ్రెస్‌ నిలువునా కాలరాచింది. ప్రముఖ నాయకుల ఫోన్‌లను ట్యాప్‌ చేయించింది. ప్రభుత్వంలో ఏ హోదాలేని ఇందిరాగాంధీ ముద్దుల కొడుకు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా అవతరించాడు. ఢిల్లీ నగరంలోని తుర్కమన్‌గేటు, ఇతర ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ఉన్న మురికివాడలను బుల్డోజర్లు పెట్టి కూల్చివేశారు. అలాగే పేదవాళ్లు ఎక్కువగా పిల్లలను కనడం వల్లనే దేశానికి సమస్యలొస్తున్నాయని చెప్పి మురికివాడలలో నిర్బంధంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాడు.

దేశవ్యాప్తంగా అరెస్టయిన వారిలో, కాంగ్రెస్ పార్టీలో ఆమెను బలంగా వ్యతిరేకించిన ఒకరిద్దరితో సహా, సీపీఎం, జనసంఘ్, సంస్థాగత కాంగ్రెస్, ఇతర కాంగ్రేసేతర రాజకీయ నాయకులను చాలామందిని అరెస్ట్ చేయించింది. విమర్శలను లెక్క చేయని ఇందిర రాజ్యాంగాన్ని తిరగ రాసి, తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పునుంచి ఊరట పొందింది. విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. దేశ సమైక్యతకు-సమగ్రతకు ముప్పు వాటిల్లిందని, రోగికి చేదు మందిచ్చి బ్రతికించిన విధంగానే, అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు, జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. విదేశీ బూచిని చూపించడం పదే పదే చేయసాగింది. మీడియాపై మరిన్ని ఆంక్షలు విధించింది.


ఈ నేపధ్యంలో, దేశవ్యాప్తంగా అరెస్టయిన వారి సరసన ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, స్వర్గీయ డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిని చేర్చారు. అలనాటి కేంద్ర హోం మంత్రి స్వర్గీయ కాసు బ్రహ్మానంద రెడ్డి దృష్టిలో, లిస్టులో లేకపోయినా, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రోద్బలంతో డాక్టర్‍గారిని నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. ఎమర్జెన్సీ విధించిన నాటి అర్థరాత్రి సమయంలో, డాక్టర్‍గారి ఆసుపత్రి కాలింగ్ బెల్ మోగింది. ఎమర్జెన్సీ విధించిన సంగతి ఇంకా తెలియని డాక్టర్‍గారు, తలుపు తీసి, ఎదురుగా కనిపించిన మఫ్టీలోని పోలీసు అధికారిని, ఏమీ జరగనప్పుడు-ఏమవసరమున్నదని అంత అర్థరాత్రి వచ్చారని ప్రశ్నించారు. తనకు తెలియదని, ఎస్పీ గారు పిలుచుకుని రమ్మంటే వచ్చానని జవాబిచ్చాడా అధికారి. విషయం కొంతవరకు అవగాహన చేసుకున్న రాధాకృష్ణమూర్తి, అదేదో అరెస్ట్ వ్యవహారమేనని నిర్ధారించుకుని వచ్చిన పోలీసు అధికారిని గౌరవంగా సంబోధిస్తూ, కూచోమని కోరి, ఆయనకు కాఫీ ఏర్పాటు చేసి, దుస్తులు సర్దుకునేందుకు లోనికెళ్ళారు. తన జీవితంలో, అరెస్ట్ చేసేందుకొచ్చిన పోలీసు అధికారికి అంత మర్యాద ఇచ్చిన వారిని ఎవరినీ చూడ లేదన్నాడతడు.

నేనాయన జీవిత చరిత్రను గ్రంధస్తం చేస్తున్నప్పుడు, అలనాటి రాత్రి సంగతులను గుర్తు చేసుకున్న డాక్టర్‍గారు, పోలీసు అధికారి తన విధి నిర్వహణలో వచ్చినప్పుడు, గౌరవించడం కనీస బాధ్యతని, తానదే చేసానని చెప్పారు. ఆ సందర్భంగా ఒకటి రెండు జైలు సంఘటనలను గుర్తుచేసుకున్నారు. జైలులో వాళ్ల కొచ్చిన ఉత్తరాలను ముందుగానే పరిశీలించి-సెన్సార్ చేసినప్పటికీ, పూర్తి పాఠాన్ని చదువుకునే వీలు కలిగించి తిరిగి తీసుకునేవారు జైలు అధికారులు. ఇంటర్వ్యూలో పరిమితంగా కుటుంబ సభ్యులకు మాత్రమే, అదీ ఒకరిద్దరిని, ఒక గంట సేపు మాట్లాడనిచ్చేవారట. భార్యా పిల్లలు వచ్చినా, మాట్లాడేటప్పుడు ఇంటెలిజెన్స్ అధికారి పక్కనే కూర్చుని తనకు వినబడేట్లు మాత్రమే మాట్లాడాలని నియమం పెట్టేవారట.

డాక్టర్ రాధాకృష్ణమూర్తిని అరెస్ట్ చేసి, వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకెళ్లారు. ఆయనతో పాటు చిర్రావూరి లక్ష్మీనరసయ్య, బోడేపూడి వెంకటేశ్వరరావు, మంచికంటి రాంకిషన్‍రావు లను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. జైల్లో వీరే కాకుండా నక్సలైట్లు, ఆరెస్సెస్‍కు చెందినవారు, జనసంఘీయులు, ఇతర రాజకీయ పక్షాలకు చెందిన మరికొందరు కూడా వున్నారు. వారం రోజుల పాటు అందరూ ఉమ్మడి కాపురం చేసి, కలిసిమెలిసి భోజనాలు చేసేవారు. ఒకనాడు కరీంనగర్ నుండి జనసంఘం పార్టీకి చెందిన చెన్నుపాటి విద్యాసాగరరావుగారు (వీరు 1998 ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్) వంటినిండా దెబ్బలతో జైలుకు వచ్చారు. , ఆ తర్వాత ఎవరి బారక్స్ వాళ్లకే కేటాయించారు.

డాక్టర్ రాధాకృష్ణమూర్తికి తమ పార్టీ వారికి రాజకీయ పాఠాలు చెప్పినట్లే, అక్కడ ఇతరులకు తమ పార్టీ విధానాలు చెప్పడం, ఇతర పార్టీ వారి నుంచి వినడం ఒక నిత్యకృత్యమై పోయింది. డిటెన్యూలలో వరంగల్ అడ్వకేట్ ఆర్.ఎస్.ఎస్ నాయకులు భండారు సదాశివరావు గారు బాగా చదువుకున్న వ్యక్తి. భగవద్గీత, షడ్ దర్శనాలకు సంబంధించిన పలు విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ప్రతివాది భయంకర షఠగోపాచారి మరో డిటెన్యూ. ఆయన ఆయుర్వేద వైద్య ప్రముఖులు. వరవర రావును కూడా వీరితో పాటు అదే జైల్లో డిటెన్యూగా వుంచింది ప్రభుత్వం. అలానే పలు ముస్లిం నాయకులనూ నిర్బంధించి అక్కడే పెట్టింది. పద్దెనిమిది నెలల ఆ జైలు జీవితంలో సహచర డిటెన్యూల దగ్గర భగవద్గీత, షడ్ దర్శనాలు, ఆయుర్వేద వైద్యం, ఇస్లాం మతానికి చెందిన విషయాలను నేర్చుకున్నారు డాక్టర్ రాధాకృష్ణమూర్తి. ఈ జైల్లో కూడా జైలు డాక్టర్ డ్యూటీని ఆయన డిటెన్యూగా వచ్చిన తర్వాత ఆయనకే అప్ప చెప్పారు. తృప్తిగా వృత్తి ధర్మాన్ని అక్కడ కూడా నిర్వహించారు. అత్యవసర పరిస్థితి ఎత్తివేయడానికి నెల రోజుల ముందర అందరు డిటెన్యూలతో పాటు డాక్టర్ రాధాకృష్ణమూర్తిని కూడా విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఆలా బయటకు పోయి, ఇలా లోనికి వస్తానని అనుకోలేదాయన అప్పటికి.

జైలు నుంచి విడుదలై, ఖమ్మం సమీపంలోని నేలకొండపల్లిలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక రాష్ట్ర మహాసభలకు హాజరయ్యేందుకు వెళ్లారు. వారం రోజులపాటు, ఎమర్జెన్సీ ఇంకా అమలులో వుండగానే జరుగుతున్న సభలు, విజయవంతంగా జరగడాన్ని దగ్గరగా గమనించిన పోలీసులు, వాటిని భగ్నం చేసి, నాయకులని భావించిన రాధాకృష్ణమూర్తిని మళ్ళీ జైలుకు తరలించారు. జైలుకు వెళ్లిన కొన్ని రోజులకే, 1977 మార్చ్ నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది. ఖమ్మం నుంచి లోక్ సభ స్థానానికి సిపిఎం అభ్యర్థిగా డాక్టర్ రాధాకృష్ణమూర్తిని పోటీ చేయించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. జైల్లో వున్న ఆయనకు కబురు చేసి విషయం చెప్పారు. ఆయన నామినేషన్ పత్రాలపై జైలులోనే సంతకాలు పెట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు పోటీలో వున్న అభ్యర్థిగా విడుదల చేశారు.

హఠాత్తుగా, జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించింది ఇందిరా గాంధీ. ప్రజలపై, ప్రజా శక్తిపై తనకు అపారమైన విశ్వాసం వుందని, మార్చ్ నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని అన్నది. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. ఎమర్జెన్సీ దురాగతాలను ఎదుర్కోవాలని జైలు నుంచే జయప్రకాష్‌నారాయణ 'సంపూర్ణ విప్లవం' అంటూ ఇచ్చిన పిలుపు... దేశ రాజకీయాల దిశను మార్చివేసింది. అప్పటి వరకు చిన్న చిన్న పార్టీలుగా ఉన్న అనేక పార్టీలన్నీ ఒకే గొడుగుక్రిందకు వచ్చి జనతాపార్టీగా ఏర్పడ్డాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగు సహచరుడు జగ్జీవన్ రామ్ కూడా బాంబు పేల్చాడు. ప్రతి పక్షాల సరసన చేరాడు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. వామపక్షాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్‍లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా, జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చ్ 20, 1977 న జరిగిన లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు ఓటర్లు. కలగాపులగం లాంటి కాంగ్రేసేతర పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసి, ఆ తర్వాత రెండేళ్లు ఆమెచే జైల్లో నిర్బంధించబడిన మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.
అలా ఒక అధ్యాయం ముగిసింది భారత దేశ చరిత్రలో!

Saturday, June 22, 2019

సీతదగ్గర రాక్షస స్త్రీలను కాపలా పెట్టిన రావణుడు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-66 : వనం జ్వాలా నరసింహారావు


సీతదగ్గర రాక్షస స్త్రీలను కాపలా పెట్టిన రావణుడు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-66
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (23-06-2019)

ఇంకా ఇలా కొనసాగించింది సీత.
“నీచబుద్ధికల రాక్షసా! రామచంద్రమూర్తి కోపంతో మండుతున్న కళ్ళను చూసినంత మాత్రానే, ఆ నిమిషంలో కాలి నేలపడవా? కుక్కను కొట్టడానికి బచ్చెనకోల కావాల్నా? అలాగే, నిన్ను చంపడానికి బాణ ప్రయోగం అవసరమా? నీ పరాక్రమం గురించి నువ్వు చెప్పిన మాటలు దంభవాక్యాలు. వాస్తవం చెప్తా విను. రామచంద్రమూర్తికి కోపం వస్తే, చంద్రుడినైనా నేలపడవేస్తాడు. రూపం కనబడకుండా భుజబలంతో చేయగలడు. అలాంటి అసమాన బలసంపన్నుడు ఈ తుచ్ఛ సముద్రాన్ని దాటి వచ్చి, తనమీద అనురాగం వున్న తన ఇల్లాలిని చెరనుండి విడిపించలేడని అనుకుంటున్నావా? రాక్షసా! అవశ్యం విడిపిస్తాడు. నీ ఐశ్వర్యం, నీ గృహాలు, లంక నీకింకా వుందని నన్ను ఆశ పెట్తున్నావు. ఎప్పుడైతే నువ్వు పరస్త్రీని కామ దృష్టితో స్ఫృశించావో అప్పుడే నీ సంపద నాశనమై పోయింది. ఆయుస్సు, ఇంద్రియబలం, దేహబలం, సర్వం నాశనమైనదని భావించు. నీ కారణాన లంకాపురం పతిలేనిదై పోయింది. అక్కడి స్త్రీలు విధవలై పోయారు. ఇంతమాత్రానికా ఈ పొగరు? వినాశకాలం సమీపించినా పోగరువల్ల తెలుసుకోలేక పోతున్నావు. ఎంత మూర్ఖుడివిరా?”

         “అల్పబలం కల నన్ను నా భర్త దగ్గరనుండి విడతీసినందున పాపాత్ముడా, నీ పాపం నీకు కొంచెం సుఖం కూడా ఇవ్వదు. చూస్తుండు. నా మగడికి దేహబలమే కాదు....దైవ బలం కూడా వుంది. కాబట్టి ఆయన అమితమైన తేజస్సు కలవాడు. నీకు దైవబలం లేదు. కాబట్టి నీకు తేజస్సులేదు. నువ్వు చెప్పిన దేబె, జోగి నువ్వే కాని రామచంద్రుడు కాదు. ఆయన ధర్మయుక్తమైన నడవడి కలవాడు. మంచి మనస్సు కలవాడు. భయం అంటే ఏమిటో తెలియనివాడు. అసమానమైన శౌర్యంలొ ఆయన్ను మించినవారు లేరు. భయంకర మృగాలున్న అడవిలో ఉన్నాడాయన. నీ బలాన్ని, నీ గర్వాన్ని బాణాల వర్షంతో కక్కిస్తాడు. మృత్యువు సమీపించిన వాళ్లు కాల మహిమ వల్ల వాళ్లు చేయాల్సిన పనులు కాకుండా చేయకూడని చెడు పనులను అవే మంచివనుకుని చేస్తారు. ఆ విధంగా నాశనమైపోయే కాలం నీకూ, నీ రాక్షసమూకకు, నిన్ను కట్టుకున్న స్త్రీలకు, నువ్వు నన్ను బలవంతంగా తేవడం వల్ల ఏకకాలంలో కలిగింది”.

         “యజ్ఞశాల మధ్యలో వున్నా ఉపకరణాల పాత్రను, వేదమంత్రాలతో పవిత్రంగా వుంచాల్సిన దాన్ని, ఎవరైనా తాక వశమా? అలాగే పతివ్రతనైన నేను కూడా పవిత్రమైన వేదినే. ధర్మం విడనాదని దశరథరాజు కుమారుడి భార్యనైన, పతివ్రతనైన నన్ను రాక్షసాధముడా, పాపాత్ముడా, దుష్ట చరితుడా, మూర్ఖుడా, నీకు తాక సాధ్యమా? ఓరీ! నీ వల్ల నేను చెడిపోను. నాకా భయం లేదు. నా భర్త ఇక్కడికి ఎలాగూ వస్తాడు. నిన్ను ఎలాగూ చంపుతాడు. లంకా నాశనం కాక తప్పదు. ఇది నిశ్చయం. నీకు నేను భయపడను, వశపడను. నన్నిప్పుడే చంపుతానంటావా? ఈ దేహం జడ పదార్ధం. దీన్ని కట్టేస్తావా? కానివ్వు. తింటావా? తిను. దాని వల్ల నాకేం నష్టం లేదు. ఈ శరీరం నేను రక్షించవలసిన అవసరం నాకు లేదు. వున్నా, పోయినా ఒకటే. నా శరీరం చెడ్డా, నేను చెడిపోను. నా మనస్సు చెడితే నేను చెడిపోయినట్లు. నా మనస్సు నా స్వాధీనంలో వుంది. దాన్ని నువ్వేం చేయలేవు”. ఇలా అని ఊరుకుంది సీతాదేవి. కఠినంగా మాట్లాడి, కోపంతో ఏమీ మాట్లాడకుండా సీతాదేవి వుండిపోవడంతో, రావణుడు ఆమెకు భయం కలిగే విధంగా మండిపడుతూ, ఇలా అన్నాడు.


         “ఓసీ నవ్వు ముఖందానా! సీతా, విను. ఇక్కడ నుండి పన్నెండు నెలల్లో నువ్వు నామీద విశ్వాసం కలిగి, ప్రేమగా నన్ను కామించకపోతే, ఆ గడువు ముగుస్తుండగానే, నా ఉదయం భోజనానికి, నా వంటవాళ్లు నిన్ను ముక్కలుగా కోసి వండుతారు” అని చెప్పి, ఆమెకు కాపలాగా వున్న రాక్షస స్త్రీలను చూసి తన కోపం తగ్గిపోయే విధంగా సీతాదేవి కొవ్వు తీసేయండని చెప్తాడు.

         (సీతాపహరణం జ్యేష్టమాసంలో జరిగింది. రామ-రావణ యుద్ధం ఫాల్గుణ మాసంలో, కృష్ణ పక్షంలో జరిగింది. హనుమంతుడు సీతాదేవిని సందర్శించింది ఫాల్గుణ మాసారంభంలో. అప్పటికి పది నెలల గడువు అయింది).

         రావణుడి మాటలకు రాక్షస స్త్రీలు అంగీకార సూచనగా నమస్కరించారు. అప్పుడు రావణుడు నేలను గట్టిగా తన్నుకుంటూ, సీతను అశోకవనానికి తీసుకు పొమ్మంటాడు. అక్కడ ఆమెను వుంచి ఎల్లప్పుడూ విడువకుండా ఆమె చేష్టలను మిక్కిలి రహస్యంగా గమనించమని చెప్తాడు. “భయంకర చూపులు కలవారా...వికార రూపాలు కలవారా....మాంసం, నెత్తురు ఆహారంగా కలవారా....ఈ సీతను మంచిమాటలతో కాని, బెదిరించి కాని, మచ్చిక చేసుకుని నాకు స్వాధీనం చేయండి” అని అంటూ రావణుడు అక్కడినుండి పోతాడు. ఆ తరువాత రాక్షస స్త్రీలు సీతాదేవిని అశోకవనానికి తీసుకుని పోయారు. ఇక అప్పటినుండి సీత రాకాసుల గుంపుల వశంలో వుండిపోయింది. కట్టివేయబడిన ఆడ జింకలాగా అయిందామె పని. భయం కలిగించే పెద్ద కళ్ళ రాక్షస స్త్రీలు భయపెట్టుతుంటే, తన ప్రియుడు, శ్రీకరుడు, దైవం అయిన మగాడిని సర్వదా ధ్యానించ సాగింది.

Friday, June 21, 2019

Besides the burnished name : Vanam Jwala Narasimha Rao


Besides the burnished name
Millennium Post, New Delhi (24-06-2019)
All empty talk at NITI Aayog
Vanam Jwala Narasimha Rao
Telangana Today (21-06-2019)

What did the recently concluded NITI Aayog meet chaired by the Prime Minister of India achieve in real terms? How many of its recommendations of the past four meetings were considered by the Union Government and the real help was extended to the states which were described by the Prime Minister as members of Team India? Like in the earlier four meetings the fifth meeting was also expected to discuss important subjects. The council, the apex body of NITI Aayog, includes all Chief Ministers, Lieutenant Governors of Union Territories, several Union Ministers and senior government officials.

Headed by the Prime Minister, the Governing Council meets regularly, and its first meeting took place on February 8, 2015. In the First Meeting the Prime Minister laid down the key mandates of NITI Aayog such as fostering cooperative federalism and addressing national issues through active participation of the States. The second meeting of council on July 15, 2015, reviewed the progress made by the three sub-groups of Chief Ministers and the two task forces.

In the third meeting of the council on April 23, 2017, Modi had pitched for conducting simultaneous elections of the Lok Sabha and the state assemblies and shifting to a January-December fiscal year. The fourth meeting of the council on June 17, 2018, deliberated upon measures taken to double farmers' income and the progress of government's flagship schemes. None of the outcomes of those meetings took a real shape in effect.

The fifth meeting among others discussed the subjects including major issues concerning water management, agriculture, and aspirational district programme. Besides, the council also deliberated on security issues in districts impacted by left-wing extremism in states like Jharkhand and Chhattisgarh.


            The best example of flouting NITI Aayog recommendations is that of Telangana State wherein despite it recommending a grant of Rs 24,000 crores for Mission Bhagiratha and Mission Kakatiya, centre did not give even a single rupee. Even for the world’s largest multi-stage lift irrigation Kaleshwaram Project which will provide assured irrigation to 45 lakhs of acres in Telangana besides meeting drinking water and industrial water requirements, centre has not given a single rupee despite NITI Aayog recommendation.   


Chief Minister K Chandrashekhar Rao, during the third NITI Aayog meeting pitched for various measures to pull the farming sector in the country out of distress. CM brought to the notice of NITI Aayog and PM about several steps to address the agrarian distress and to revive the farm sector in Telangana and to revamp the rural economy by reviving the traditional activities such as, sheep rearing, fisheries dairy, etc. KCR requested for Government of India support to such initiatives by the State Governments to address the agrarian distress. Nothing happened subsequently.

At the fourth meeting of NITI Aayog Chief Minister KCR asked the Centre to encourage fast-growing States such as Telangana by giving tax incentives, if additional devolution of funds linked to performance is not possible as the prosperity of the country lies in the growth of States. Chief Minister also wanted to link the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme (MGNREGS) to agriculture as part of the need to focus on agriculture and allied activities as an integrated sector. Stressing on the need of cooperative federalism, often talked about by Prime Minister Narendra Modi, the Chief Minister wanted more freedom to States in the implementation of schemes in the areas such as health, education, urban development, agriculture and rural development. CM also mentioned about Telangana’s Rythu Bandhu scheme. No concrete steps were initiated to take cognizance of CM KCR suggestions nor to that matter any other CM’s suggestions.

In fact, CM while participating in a discussion on “Emerging Markets at Cross Roads” at the World Economic Forum Meeting in China in September 2015 strongly supported the initiatives of PM and his concept of NITI Aayog. He said, “In place of the earlier Planning Commission an organization called NITI Ayog consisting of all the Chief Ministers of all the states with Prime Minister as its Chairman has come into existence. We call this as Team India. With Prime Minister as Chairman and CMs as members, we all together plan the development of country as a whole and also the states’ development as well”. Is it happening the way he anticipated then?

Against this background the fifth meeting of the Governing Council of NITI Aayog was held under the Chairmanship of the Prime Minister Narendra Modi at Rashtrapathi Bhawan on 15th June. It was attended by 26 Chief Ministers and others. Telangana CM did not attend the meeting may be due to preoccupation with prior commitments. As usual and setting the tone of the meeting PM mentioned about Team India concept and highlighted with all lofty narratives of the importance of NITI Aayog meet as a platform to inspire cooperative federalism, to collectively combat poverty, unemployment, drought, pollution, pockets of under-development and all such factors that constrain India’s progress.

As in the earlier four meetings PM welcomed constructive discussion and suggestions made by various Chief Ministers and assured the Council that these suggestions would be seriously considered in the course of decision-making. There was broad consensus on reducing water wastage, promoting efficient water conservation practices across States, with rain-water harvesting to be undertaken at the household and community level with proactive policy and investment support. Various Chief Ministers presented best practices from their respective states which can serve as templates for replication across the country. The Council also deliberated upon a closely related and deeply important issue of drought management and associate relief measures. It also reviewed the implementation of the Aspirational Districts Programme. The PM also reaffirmed the commitment of the Government to combat Left Wing Extremism.

As usual the courtesies were exchanged and the Prime Minister thanked the Chief Ministers for their suggestions and reiterated that that the Union Government is keen to partner with the States, and work together for India's development. 

The NITI Aayog which was mandated with fostering cooperative federalism through structured support initiatives and mechanisms with the states on a continuous basis, recognizing that strong States make a strong nation has not been successful in its objective. Though it seeks to design and assist the implementation of strategic, long-term policy frameworks and programme initiatives of state governments, it never gives any proper directive to union government to realise this. The Governing Council, which is supposed to embody objective of cooperative federalism seldom adheres to it.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఆర్నెల్ల పూర్వరంగం : వనం జ్వాలా నరసింహారావు


కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఆర్నెల్ల పూర్వరంగం
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (21-06-2019)
తెలంగాణను సస్యశ్యామలంచేసే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును ఈ రోజున (జూన్ 21, 2019) అత్యంత వైభవంగా ప్రారంభించుకుంటున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కాళేశ్వరం ప్రాజెక్టు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలతో తెలంగాణ స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నదానడానికి ఈ ప్రాజెక్టు ఒక మంచి ఉదాహరణ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మహారాష్ట్ర సహకారం మరువలేనిది. యావత్ భారతదేశంలో 45 లక్షల ఎకరాలకు సాగునీటిని, 80శాతం తెలంగాణకు తాగునీటితోపాటు, పారిశ్రామిక అవసరాలు తీర్చే బృహత్తర ప్రాజెక్టు ఏ రాష్ట్రంలోనూ లేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణం అతి తక్కువ సమయంలో చేసింది ప్రభుత్వం.

ప్రారంభోత్సవ నేపధ్యంలో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొని వుంది. ప్రపంచమే అబ్బురపరిచే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించుకొనే సమయం ఇది. ప్రాకెక్టు పూర్తి సత్ఫలితాలు ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుంది. ఇంత చక్కగా పనులు జరగడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహమే కారణం. చివరి దశలో మొన్న కూడా 15 ఎకరాల ప్రైవేటు భూమి, 25ఎకరాల అటవీభూమిని ఇప్పించింది ఆ ప్రభుత్వం. కరకట్టలు కట్టడానికి అవసరమైతే వారు ఉదారంగా వ్యవహరించారు. పర్యావరణ అనుమతులూ ఇప్పించారు. స్నేహపూర్వకంగా ఉండటం మూలాన ఇది సాధ్యమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా సాగుకాబోయే 45 లక్షల ఎకరాలలో రెండు పంటలు పండుతాయి. మొదటి దశలో 25 లక్షల ఎకరాలకు, శ్రీరాంసాగర్ ఆయకట్టు, ప్లస్ సిరిసిల్ల్ల దాని తాలుకా పరిసరాలు, హుస్నాబాద్ తాలుకా దాని పరిసరాల్లో ఉండే ప్రాంతాలు.. కొత్త, పాత కలిపి సుమారు 25 లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయి. ఆపైన సిద్దిపేట జిల్లా, ప్రస్తుతం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌కు వచ్చేనాటికి, మరో 20 లక్షల ఎకరాలకు, అంటే దాదాపు 45 లక్షల ఎకరాలకు సాగునీరు, తెలంగాణ పారిశ్రామిక అవసరాలతోపాటు తెలంగాణకు సమృద్ధిగా నీరు అందించే మహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరం ఇంత త్వరగా పూర్తి కావడంపట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు.

నీటి పారుదల రంగానికి అపరిమితమైన ప్రాధాన్యం ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనేకసార్లు స్వయంగా ప్రాజెక్టుల సందర్శన చేశారు. అనేకసార్లు సమీక్షలు నిర్వహించారు. అందులో ప్రధానమైంది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. ఆర్నెల్ల క్రితం ఈ ఏడాది జనవరి మొదటి తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మాణంలో వున్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజి, కన్నెపల్లి పంపుహౌజులను సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించారు.

         మర్నాడు కన్నేపల్లి పంప్ హౌజ్ నుండి అన్నారం బ్యారేజి వరకు నీటిని తరలించే కాలువ పనులను చూశారు. సుమారు 15 కిలోమీటర్లు అన్నారం బ్యారేజీ వరకు రోడ్డు కాలువ వెంబడి  ప్రయాణిస్తూ అనేక  చోట్ల ఆగి క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని చోట్ల కాలువ సైడ్ స్లోప్స్ కూలిపోతున్నాయని , అటువంటి రీచెస్ లో కాంక్రీట్ గైడ్ వాల్స్ కడితే క్షేమంగా ఉంటుందని, వెంటనే వాటిని నిర్మించడానికి ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. అన్నారం బ్యారేజి వద్ద పనులను, సుందిళ్ళ బ్యారేజి, అన్నారం పంప హౌజ్, సుందిళ్ళ పంప హౌజ్ పనులని కూడా సి ఎం పరిశీలించారు. పంప హౌజ్ ల వద్ద ట్రాన్స్కో వారు నిర్మించిన విద్యుత్ సబ్ స్టేషన్లను వాన నీటి నుంచి రక్షించడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. అనంతరం శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం లో భాగంగా రాజేశ్వర్ రావు పేట వద్ద  నిర్మాణం అవుతున్న రెండవ పంప హౌజ్ నిర్మాణ పనులను పరిశీలించారు.

         తన పర్యటన ముగిసిన మూడు రోజులకు సాగునీటి ప్రాజెక్టులపై రిటైర్డు ఇంజనీర్లు, వివిధ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు, ప్రభుత్వ ముఖ్య అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కోసం విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా గోదావరి, కృష్ణా బేసిన్లలో రాష్ట్రానికున్న నీటి వాటాను వినియోగించుకునే వ్యూహం అమలు చేయాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా నిధులు సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత కూడా వాటి నిర్వహణ కోసం అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిస్తామని వెల్లడించారు.  

గోదావరి నదిలో తెలంగాణకు 950 టిఎంసిల నీటి వాటా ఉందనీ, అందులో భాగంగానే గోదావరిపై కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మిస్తున్నామనీ, ఆ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందించాలనీ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజిలు, కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల పంపుహౌజుల నిర్మాణం పూర్తి కావాలనీ,  ఎల్లంపల్లి, మిడ్ మానేరు దాకా నీళ్లు రావాలనీ, వచ్చిన నీటిని వచ్చినట్లు పంపు చేసి చెరువులకు మళ్లించాలనీ అన్నారు సీఎం.

అలాగే, ఎల్లంపల్లి దాకా వచ్చిన నీటిలో ఒక టిఎంసిని మిడ్ మానేరు ద్వారా శ్రీరాం సాగర్ కాల్వలకు మళ్లించాలనీ, మరో టిఎంసి నీళ్లను మల్లన్న సాగర్ వైపు మళ్లించాలనీ, మల్లన్న సాగర్ ద్వారా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్మించే బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్ కు తరలించాలనీ, మల్లన్న సాగర్ ద్వారానే హైదరాబాద్ మంచినీళ్ల కోసం నిర్మిస్తున్న 10 టిఎంసిల రిజర్వాయర్ కు నీళ్లు పంపాలనీ, హల్ది వాగు ద్వారా నిజాంసాగర్, ఘనపురం ఆయకట్టుకు సాగునీరు అందించాలనీ, గండిపేట, హిమాయత్ సాగర్ చెరువులు నింపాలనీ, వాటి ద్వారా క్రమం తప్పకుండా నీటిని విడుదల మూసీనదికి,  చివరికి మూసీ నది నీళ్ల ద్వారా పాత నల్గొండ జిల్లా పొలాలకు నీరు చేరాలనీ ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలను వివరించారు.

ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటితో ముందుగా చెరువులు నింపాలని సిఎం ఆదేశించారు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను ఉపయోగించుకుని చెరువులను నింపేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరో సమీక్షా సమావేశంలో, ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అటు మిడ్ మానేరు నుంచి ఎస్.ఆర్.ఎస్.పి వరకు, ఇటు మల్లన్న సాగర్ వరకు నీరు అందుతుందన్నారు. అలా వచ్చిన నీటిని మొదట చెరువులను మళ్లించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టు కాల్వలపై తూములు నిర్మించి, చెరువులకు నీరు మళ్లించాలన్నారు. ఏదైనా చెరువుకు ఫీడర్ ఛానల్ లేకుంటే, కొత్తగా కాల్వ తవ్వాలని ఆదేశించారు. ఎస్.ఆర్.ఎస్.పి. రెండో దశ వరకు చెరువులు నింపాలని చెప్పారు.


ప్రాజెక్టు పనుల పురోగతిపై కేసీఆర్ మార్చ్ నెల 30 వ తేదీన ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాలపై సమీక్షించారు. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు వరకు నీటిని తరలించడానికి నిర్మిస్తున్న కాలువ పనులపై  చర్చించారు. అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ల పనులు, కాల్వల పనులు, టన్నెల్ పనులపై కూలంకశంగా సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణం పూర్తవుతున్నందున, గోదావరి నీటిని ఎత్తిపోసి చెరువులు నింపాలని సిఎం చెప్పారు. వర్షాకాలంలో చెరువులన్నీ నింపాలని, దీనికోసం కాలువలకు ఎక్కడెక్కడ తూములు తీయాలో నిర్ణయించి, పనులు చేపట్టాలని కోరారు.

ప్రాజెక్టు కాలువల ద్వారా వచ్చే నీరు, వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు అన్నీ చెరువులకు మళ్లాలనీ, దీనికోసం కావల్సిన కాల్వలను సిద్ధం చేయాలనీ, తెలంగాణలోని చెరువులు, కుంటలతో పాటు కాల్వలు, వాగులు, వంకలపై పెద్ద ఎత్తున నిర్మించిన చెక్ డ్యాముల్లో కూడా నీరు నిల్వ ఉండాలనీ, తెలంగాణ భూభాగమంతా నీటితో కళకళ లాడాలనీ ఆ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.  ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంతోనే నీటి పారుదల శాఖ బాధ్యత పూర్తికాదని, ఆ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులకు అవసరమైన బ్యారేజీలు, రిజర్వాయర్లు, కాలువలు తదితర వ్యవస్థ సిద్ధంగా ఉందని, కానీ కాళేశ్వరంతో పాటు ఇతర కొత్త ప్రాజెక్టులకు అవసరమైన వ్యవస్థలను అంతా కొత్తగా రూపొందించుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్త వ్యవస్థలకు రూపకల్పన చేసే క్రమంలోనే జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, ఎక్కువ ఆయకట్టు కవర్ అయ్యే ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.

ఏప్రిల్ నెలలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. 124.4 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులతో 105 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే పంపింగ్ అనుకున్నది అనుకున్నట్లు విజయవంతంగా జరగడం అత్యంత ఆనందకరమైనదిగా సిఎం అభివర్ణించారు. ఇంతటి భారీ సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా వినియోగించడం ద్వారా ఆసియా ఖండంలోనే ఈ ఘనత సాధించిన ఏకైక దేశంగా భారత్,  ఏకైక రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చెప్పారు.

‘‘తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించదానికి కాళేశ్వరం దగ్గర మాత్రమే నీటి లభ్యత ఉందని నిర్ధారించుకున్నాం. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి తెలంగాణలోని 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బృహత్ ప్రణాళిక తయారు చేయడానికి నెలల తరబడి కసరత్తు చేశాం. లైడార్ సర్వే నిర్వహించి, పక్కా అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. గోదావరి నుంచి నీటిని తోడడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా 139 మెగావాట్ల భారీ సామర్థ్యం కలిగిన పంపుసెట్లను వినియోగించడానికి డిజైన్ చేశాము. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్కోపంపు గరిష్టంగా 120 మీటర్ల ఎత్తు వరకు నీటిని పంపింగ్ చేసే ప్రణాళిక ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల తలరాత మార్చే అదృష్టం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రియల్ 30 న మరో సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజుల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, వాటి నిర్వహణకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించారు. బ్యారేజీల వద్ద నది ప్రవాహం ఎంత ఉధృతంగా ఉన్నప్పటికీ, ఎంత భారీ వర్షం కురిసినప్పటికీ ప్రాజెక్టు నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగని రీతిలో హై ఫ్లడ్ లెవల్ కు చాలా ఎత్తులో వాచ్ టవర్, సిబ్బంది క్వార్టర్లు ఉండాలని సిఎం చెప్పారు. ప్రస్తుతమున్న హెచ్ఎఫ్ఎల్ కాకుండా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత వచ్చే హెచ్.ఎఫ్.ఎల్. ను పరిగణలోకి తీసుకోవాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని లిఫ్టు చేయడానికి అవసరమయ్యే విద్యుత్ సరఫరా చేసే అంశంపై ముఖ్యమంత్రి మే నెల 16 న విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది జూలై  చివరి నుంచే కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది నుంచి 2 టిఎంసిలు, వచ్చే ఏడాది నుంచి 3 టిఎంసిల నీళ్లను గోదావరి నుంచి ఎత్తిపోయాలని నిర్ణయించినట్లు ఆ సమీక్షలో సిఎం చెప్పారు. ఈ ఏడాది రోజుకు రెండు టిఎంసిల చొప్పున నీటిని ఎత్తిపోయడానికి 3,800 మెగావాట్లు, వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి రోజుకు మూడు టిఎంసిల నీటిని లిఫ్టు చేయడానికి మొత్తం 6,100 మెగావాట్ల విద్యుత్ అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు. కావాల్సినంత విద్యుత్ ను సమకూర్చుకుని, గోదావరిలో నీటి ప్రవాహం ఉండే ఆరు నెలల పాటు నిర్విరామంగా 24 గంటల పాటు సరఫరా చేయాలని చెప్పారు. ప్రతీ ఏడాది దాదాపు 540 నుంచి 600 టిఎంసిల నీళ్లను ఎత్తిపోసి 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిఎం వివరించారు. ఎత్తిపోతల పథకాలకు వినియోగించే కరెంటు కోసం అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సిఎం వెల్లడించారు.

మే నెల 18, 19 తేదేలలో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలన లో బాగంగా కుటుంబ సమేతంగా, ఉన్నతాధికారులతో కలిసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని, పార్వతి మాతని దర్శించుకున్నారు దర్శించుకున్నారు. స్వామి దర్శనం తర్వాత కన్నేపల్లి పంప్ హౌజ్ నిర్మాణ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కెసిఆర్, మేడిగడ్డ కు చేరుకుని అక్కడ పూర్తి కావచ్చిన  బ్యారేజ్ పనుల పరిశీలించారు. వ్యూ పాయింట్ వద్ద పనుల పురోగతిని  సంబంధిత అధికారుల ద్వారా ఆరాతీసి, మరింత త్వరిత గతిన పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించారు. అక్కడనుంచి బ్యారేజ్ మీద నుంచి ప్రయాణిస్తూ, నడుమ ఆగిన ముఖ్యమంత్రి బ్యారేజ్ నిర్మాణాన్ని గేట్ల బిగింపు, తదితర పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. గోదావరి నీటి కోతను తట్టుకునేందుకు అంచులకు నిర్మిస్తున్న కరకట్టల  నిర్మాణ పనులను పరిశీలించారు.

అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కీలకమైన కన్నేపల్లి పంప్ హౌస్ పనులకు క్షుణ్నంగా పరిశీలించారు. పంపుహౌస్ లోనికి లిఫ్ట్ ద్వారా దిగి మోటార్ల పంపింగ్ పనితీరు గురించి ఇంజనీర్లను, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోయడం ప్రారంభిస్తున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మే నెల 25 న మరో సమీక్ష నిర్వహించారు.   ఇప్పటిదాకా కరువు ప్రాంతంగా ఉన్నతెలంగాణలో ఇకపై నిరంతర నీటి ప్రవాహం ఉంటుందని, దీనికి తగినట్లుగానే కాల్వల నిర్వహణ కోసం సమగ్ర వ్యూహం రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. బ్యారేజిలు, రిజర్వాయర్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లు, తూములను నిర్వహించడానికి సర్వసన్నద్ధం కావాలని చెప్పారు.

         ఈ నెల నాలుగో తేదీన మరో మారు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా ఈ ఏడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నింపుతామని ఆ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు.  ఇందుకోసం జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద నిర్మిస్తున్న పంపుహౌజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం పనులను ముఖ్యమంత్రి పరశీలించారు.  రాంపూర్ వద్ద నిర్మిస్తున్న ఎనిమిది పంపు హౌజ్ పనులను సందర్శించారు. పనుల పురోగతిపై సమీక్ష జరిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని పట్టుదలతో వున్న ముఖ్యమంత్రి కె.చంద్రశెఖర్ రావు కేవలం 15రోజుల వ్యవధిలోనే  రెండొసారి నిర్మాణ ప్రాంతాలను సందర్శించారు.   మే నెల 19న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంపుహౌజ్ లను సందర్శించారు.  సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలంటే దశాబ్దాలు పట్టే దేశంలో  రెండు మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పలు బ్యారేజీలను అత్యంత క్లిష్టమైన ఎత్తిపోతల నిర్మాణాలను విద్యుత్ సబ్ స్టేషన్లను పూర్తిచేస్తుండడంతో ప్రపంచం తెలంగాణ వైపు చూస్తున్నదని, వలసపాలనలో నత్తనడకన నడిచిన తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల పనులు స్వయంపాలనలో యుద్దప్రాతిపదికన పూర్తికావస్తుండడం గొప్ప విషయమని  సిఎం అన్నారు.

తొలుత రాంపూర్ ఫంప్ హౌజ్ నిర్మాణం  పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి అక్కడనుంచి మేడిగడ్డ బ్యారేజీ పనులను పర్యవేక్షించినారు.  హెలీకాప్టర్ లో ఏరియల్ వ్యూ నిర్వహించిన  అనంతరం ప్రాజెక్టుపక్కన వ్యూపాయింట్ నుంచి మేడిగడ్డ  పనుల పురోగతిని పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేసినారు. అక్కడనుంచి బ్యారేజీ మీదుగా ప్రయాణించి, ప్రాజెక్టుకు బిగింపును పూర్తి చేసుకున్న 85 గేట్లను అక్కడక్కడ ఆగి పరిశీలించినారు. ఆ తర్వాత బ్రిడ్జిదిగి కాఫర్ డ్యాం మీదుగా గేట్లు నిర్మాణమవుతున్న ఐదు ప్రదేశాల్లో అక్కడక్కడా ఆగి  పరిశీలించినారు.

ఇలా ఎప్పటికప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను ఉన్నత స్థాయిలో సమీక్షిస్తూ, స్వయంగా అక్కడ పర్యటించి పనుల పురోగతిని పరిశీలిస్తూ, ఆ చారిత్రాత్మక నేపధ్యంలో ఈ నెల 21 న అంగరంగ వైభోగంగా, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రుల సమక్షంలో, “నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ” దిశగా ప్రారంభోత్సవం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆయన ఆశయం నేరవేరుతున్న ఈ శుభ సందర్భంలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు.