Wednesday, December 26, 2012

తెలుగు భాష - సాహిత్యాల కలయిక నేపధ్యమే మానవతావాదం: వనం జ్వాలా నరసింహారావు


తెలుగు భాష - సాహిత్యాల 
కలయిక నేపధ్యమే మానవతావాదం

వనం జ్వాలా నరసింహారావు

 మానవతావాదం అనాదిగా సాగుతున్న ఒక మహోద్యమం. సంస్కృతీ-సాహిత్యాల సాంప్రదాయిక నేపధ్యం మీద ఆధారపడి వుండే రీతిలో మానవతావాద ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. మేధావులు, సాహిత్యాభిలాషులు, శాస్త్రీయ దృక్ఫధంతో ఆలోచన చేసిన పలువురు, శతాబ్దాల పూర్వమే, మానవ విలువల పరిరక్షణకు ఆరంభించిన ఆ మహోద్యమం ఈ నాటికీ ప్రత్యక్షంగా-పరోక్షంగా వాటిని కాపాడేందుకు దోహదపడుతూనే వుంది. క్రైస్తవమత మానవతావాదమనీ, సాంస్కృతిక మానవతావాదమనీ, సాహితీ మానవతావాదమనీ, రాజకీయపరమైన మానవతావాదమనీ, మతపరమైన మానవతావాదమనీ రకరకాల పేర్లతో-ఎవరికి నచ్చిన విధంగా వారు పిలువసాగారు. రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనా, శ్రామికరాజ్యమైనా.. .. ... ... మానవతా దృక్పథం కలిగిందైతేనే, మానవ విలువలకు అర్థముంటుంది. అలా కానప్పుడు, ఏదో ఒక రూపంలో, మానవ విలువలు కాపాడబడేందుకు నిరంతర పోరాటం జరుగుతూనే వుంటుంది. ఆ పోరాటానికి మొదలు-చివర అంటూ ఏమీలేదు. మానవ విలువల పరిరక్షణకు అసలు-సిసలైన సాధనం మాత్రం సాహిత్యమే. పండితులైనా-పామరులైనా సంభాషించుకునేది వ్యావహారిక భాషలోనే గాని గ్రాంథికంలో కాదు. రచయితకు, పాఠకుడికి మధ్య వుండాల్సిన సంబంధం సంభాషణ లాంటిదే. ఇరువురు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థంకాకపోతే సంభాషణకు అర్థంలేదు. రచయిత రాసింది పాఠకుడికి అర్థంకాకపోతే అసలు భాషే కాదంటాడు జీన్ పాల్ సాత్రే "సాహిత్యం అంటే ఏంటి" అన్న తన పుస్తకంలో. "వాక్యం రసాత్మకం కావ్యం" అన్న విషయం అందరికీ తెలిసిందే. రచయిత తన మేథస్సునుండి పెల్లుబుకిన ఆలోచనను, పాఠకులు అర్థంచేసుకుని-ఆకళింపు చేసుకునే రీతిలో వాక్యంగా మలిచినప్పుడే, ఆ రచనకు గుర్తింపు వస్తుందంటాడు జీన్ పాల్ సాత్రే. నలుగురితో చదివించలేని రచన చిత్తుకాగితంతో సమాన మంటాడు. రచనంటే కేవలం సాహితీ ప్రక్రియ మాత్రమే కాదు-ఉత్పత్తిదారుడుకీ (రచయిత), వినియోగదారుడుకీ (పాఠకుడు) మధ్య తలెత్తనున్న ఘర్షణ.

అతి ప్రాచీనకాలంనాటి నుంచి ఇప్పటికీ వాడుకలో వుండి, వ్యావహారిక భాషగా, సాహిత్యంగా ఉపయోగంలో వున్న వాటిలో తమిళం, తెలుగు భాషలను పేర్కొనాలి. సంస్కృతం, లాటిన్ భాషల్లో సంభాషించు కోవడం దాదాపు లేనట్లే. కొద్ది మార్పులతో గ్రీకు భాష ఇంకా వాడుకలో వుందనాలి. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో తెలుగు ఒకటి. తెలుగు వారుంటున్న ప్రాంతంలోనే ఆది మానవుడు తొలుత సంచరించాడని, దక్షిణా పథానున్న తూర్పు కోస్తా ప్రాంతంలో తిరిగి, తర్వాత పంజాబుకు తరలిపోయాడని చరిత్రకారులంటారు. రాతియుగం నాటి మానవుడు సంచరించిన ప్రీతిపాత్రమైన ప్రదేశంగా కూడా ఆంధ్ర ప్రాంతాన్ని పేర్కొన్నారంటారు. తెలుగువారిప్పుడు నివసించని ప్రదేశమంటూ లేదు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు, అమెరికాతో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న తెలుగువారు ఎందరో వున్నారు. ముక్కోటి ఆంధ్రులల్లా ఆరుకోట్లకెదిగి, ఎనిమిదికోట్లు దాటి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది కోట్లకు చేరుకున్నారని. అమెరికా కాలిఫోర్నియా లోని సిలికాన్ వాలీనిప్పుడు ఆంధ్రా వాలీగా-తెలుగువాడి వాలీగా పిలవాలి. ఇదిలా వుంటే, తెలుగువారుండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ పేర్లతో పిలిచే మూడు ప్రాంతాలున్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో భిన్నమైన యాసలో తెలుగు మాట్లాడే వారుకూడా వున్నారు.


నవంబర్ 1, 1956న తెలుగువారుండే ప్రాంతాలన్నీ కలపాలని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం నివేదిక ఆధారంగా విశాలాంధ్ర ఏర్పాటయింది. తెలుగు వారందరూ కలిసుందామని అనుకున్నారో-లేదో తెలియదుగాని, కలిసుందామనుకున్న అలనాటి మద్రాస్ తెలుగువారు-తమిళులు మాత్రం విడిపోయారు. భాషాపరంగా ఒకరిమీద పడ్డ ఇంకొకరి ప్రభావం అలానే చెక్కు చెదరకుండా వుంది. ఆంధ్ర ప్రదేశ్ లో నివసించే ఏ ప్ర్రాంతం వారైనా మాట్లాడే భాషను "ఆంధ్రము" అని, "తెనుగు" అని, "తెలుగు" అని అంటాం. ప్రాచీనకాలంనాటి సంస్కృత రచనల్లో ఆంధ్రులను గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు "ఆంధ్ర" అనో, "అంధక" అనో పేర్కొనేవారు. ఆ ప్రాంతంలో నివసించేవారిని ఒక తెగగానో, సమాజంగానో, దేశీయులుగానో గుర్తించేందుకు బహుశా అలాంటి పదప్రయోగం చేసుండాలి. భాషాపరమైన పదప్రయోగాలు చాలాకాలం తర్వాతే వాడబడ్డాయి. ఆంధ్ర ప్రాంతం గురించిన ప్రస్తావన రామాయణంలోను, బౌద్ధాయనంలోను, మనుస్మృతిలోను, మత్స్యపురాణంలోను కనిపిస్తుంది. దక్షిణ దిక్కును తెలిపే "తెన్" అనే ద్రావిడ పదం ఆధారంగా "తెనుగు" ఉత్పన్నమైందని కొందరు భాషా కోవిదుల అభిప్రాయం. ద్రావిడులు తెలుగుదేశానికి ఉత్తర దిక్కుగా నివసించారని తెలియచేసే ప్రయత్నంలోనే, దక్షిణాది వారు మాట్లాడే భాషను "తెనుగు" అని సూచించారు. కాకపోతే శాస్త్రీయమైన సాక్ష్యాధారాలు ఆ సూచనకంతగా లభ్యంకాలేదు. "త్రి లింగ" నుండి తెలుగు ఆవిర్భవించిందని అందరూ అనుకుండేదే. త్రి లింగ కూడా "త్రి-కళింగ" నుండి వచ్చిందే. ఆంధ్రులను "మస్సాలియ" అని, "మైసోలియ" అను గ్రీకులు సంబోధించేవారు. కృష్ణానదిని కూడా వారు అలానే పిలిచేవారు "మసూలీపట్నం", "మచిలీపట్నం", "బందర్" అన్న పేరుతో ఇప్పటికీ కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రాన్ని పిలుస్తాం.

విశ్వామిత్ర మహర్షి కోపానికి గురై, దేశ బహిష్కృతులైన ఆయన ఏభైమంది కొడుకుల వారసులే ఆంధ్రులయ్యారని అయితరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. వారందరు ఆర్యావర్తం సరిహద్దుల్లోకి, తూర్పు-దక్షిణ ప్రాంతాల్లోకి వ్యాపించారు. ఆర్యులనీ, ద్రావిడులనీ వాడుకలో వున్న పదాలు ఎందుకు ఉపయోగించారో ఇదమిద్ధంగా తెలియదు. ఒక తెగవారినో, భాష మాట్లాడేవారినో, సంస్కృతిని పాటించేవారినో పరోక్షంగా ప్రస్తావించడానికి అలా వాడి వుండవచ్చు. లేదా గుర్తించడంలోనే పొరబడి వుండవచ్చు. ఇదిలా వుండగా, ఆంధ్ర వాల్మీకి రామాయణంలో, తురకలపూర్వీకులైన ఇరానీయులు ఆర్య శబ్దంనుండి పుట్టినవారేనని రాయబడింది. ఆర్యన్ కు వికృతి "అయిరాన్: అనీ, అదే ఇరాన్ గా మారిందనీ చెప్పబడింది. మధ్య ప్రాంత ద్రావిడ జాతికి చెందిన గోండ్-భిల్లీ భాషలకు, తెలుగుకు అవినాభావ సంబంధముందని కొందరంటారు. ప్రాచీనకాలంలో ఆంధ్ర రాజ్యానికి శ్రీకాకుళం రాజధానిగా వుండేదట. మతపరంగా అధ్యయనం చేసి, విశ్లేషణ చేసిన మరికొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మౌర్యులకు పూర్వమే ఆంధ్ర ప్రాంతంలో జైనమతం ప్రచారంలో వుంది. అశోక చక్రవర్తి కాలంలో వైభవంగా వర్ధిల్లిందని అనుకునే బౌద్ధమతం కంటే ముందే జైనమతాన్ని అనుసరించినవారెందరో వున్నారు. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం-క్రీస్తు శకం ఆరవ శతాబ్దం మధ్య కాలంలో ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధమత ప్రభావం ఎక్కువగా వుండేది. బౌద్ధమతం బోధించిన సర్వ మానవ సిద్ధాంతం, మానవ విలువలు, ప్రజలమధ్యనున్న అంతరాలను తొలగించి, అన్నిజాతులవారిని-తెగలవారిని కులమతాలకు అతీతంగా ఐకమత్యం చేసింది. అత్యంత బలీయమైన, శక్తివంతమైన శాతవాహన రాజుల పాలన స్థాపనకు దారితీసింది.

దక్కన్ పీఠభూమినే దక్షిణాపథం అనేవారు. దానికి ఆగ్నేయ దిక్కుగా ఆంధ్ర ప్రాంతముంది. వింధ్య పర్వతాలను దాటి దక్షిణ ప్రాంతానికి తొలుత వలస వచ్చిన ఆర్యుడు అగస్త్య మహాముని అంటారు. శివలింగాన్ని మొదట కనుగొన్నది ఆయనేననీ, అందువల్లనే ఆంధ్రలోని ఎన్నో శివాలయాలలో వున్న శివలింగాలను అగస్త్యేశ్వరం అనికూడా పిలుస్తారని అంటారు. ఆపస్తంబ ధర్మ సూత్రాల ప్రకారం, క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో, ఆంధ్ర ప్రాంతంలో వైదిక మతం వేళ్లూనుకోసాగింది. భగవత్-భాగవత మతం కూడా ప్రచారంలోకి వచ్చింది. శ్రీకృష్ణుడి బోధనలను తెలియచేస్తూ, క్రమేపీ వైష్ణవ మతంగా రూపాంతరము చెందిందే భాగవత సిద్ధాంతం. సాంఖ్య-యోగ ఆధారంగా భాగవతమతం వుందని భావించినప్పటికీ, దాంట్లో తాత్త్విక చింతనకు సంబంధించిన పలు అంశాలు నిగూఢంగా వున్నాయి వాస్తవానికి. కులాలకు అతీతంగా, అన్ని కులాలవారు పాటించే మతంగా భాగవతం మొదట్లో ప్రచారంలో వున్నప్పటికీ, బ్రాహ్మణుల జోక్యంతో, బ్రాహ్మణ్యం ఆవిర్భవించడంతో, భాగవత మతం, బ్రాహ్మణ్యం కలిసిపోయాయి. కులాల గుర్తింపు మొదలయింది. ఆంధ్ర ప్రాంతంలో అతిపురాతనమైంది, ఎక్కువమంది అనుసరించేది శైవమతం. దాని ప్రభావం కూడా ఎక్కువే. అలానే శాక్తేయ మతాన్ని కొందరు అనుసరించేవారు. వీరశైవం వున్నా దాని ప్రభావం అంతగా లేదనవచ్చునేమో. బ్రాహ్మణుల మూలాన భాగవతమతం వారి చేతుల్లోకి పోయినప్పటికీ, బ్రాహ్మణుడి కర్తవ్యం సాధారణంగా వైదిక పూజలు జరిపించడానికే గాని, కులాధిక్యతకు ప్రతిరూపం కావడం మాత్రం కాదనాలి.

ఆంధ్రుల మతపరమైన నమ్మకాలు-సంప్రదాయాలు తెలుగు భాషమీద, అదేవిధంగా తెలుగు భాష మతపరమైన చారిత్రాకాంశాలమీద ప్రభావం చూపించి వుండాలి. రాజుల-చక్రవర్తుల ప్రోత్సాహంతో, స్వయంగా వాళ్లే ఒక మతాన్ని నమ్మి అనుసరించడంతో, దాని ప్రభావం జన బాహుళ్యం పైనా, వారి జీవన శైలి పైనా, మానవ విలువల పైనా స్పష్టంగా పడసాగింది. పర్యవసానంగా వైదిక మతం మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానంగా, ఎవరికైనా ఆ సిద్ధాంతాలు పాటించడం తేలికైనటువంటిదిగా, అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. అదే హిందు మతంగా వాడుకలోకొచ్చింది. బహుశా ఎన్నో మతాలకు మాతృకయింది. ప్రపంచ భాషలకు సంస్కృతం ఎలానో, ప్రపంచంలోని మతాలన్నిటికీ హిందు మతం అలానే మాతృకనాలి. అందుకేనేమో మార్క్స్ తన గతి తార్కిక భౌతికవాదంలో ఎన్నో సందర్భాల్లో పరోక్షంగా వైదిక సిద్ధాంతాలను అన్వయించుకుంటాడు.

కృతయుగంలో కూడా "ఆంధ్రము" అనే విషయానికి సంబంధించిన ప్రస్తావన వుంది. అగ్నిమిత్ర అనే ఒక రాజుండేవాడు. ఒక వేసవికాలంలో ఎండల తీవ్రతకు ఆయనకు దృష్టి లోపం వచ్చి, కళ్లు కనిపించలేదు. సూర్య భగవానుడిని ప్రార్థించాడట. అగ్నిమిత్రకు ఆయన ప్రత్యక్షమై, తనను కొలిచేందుకు ఒక కొత్త భాషను నేర్పాడంటారు. సూర్యుడిని అగ్నిమిత్ర అదే భాషలో ప్రార్థించడంతో, ఆ భాషకున్న పదజాల ప్రభావంతో, అగ్నిమిత్రకు పోయిన దృష్టి తిరిగొచ్చింది. సంస్కృతంలో "అంధ" అంటే "గుడ్డి" అని-చీకటి అని అర్థమొస్తుంది. చీకటిని తొలగించి, గుడ్డి తనాన్ని పోగొట్టగలిగింది కాబట్టి ఆయన నేర్చుకున్న భాషకు "ఆంధ్ర భాష" అని పేరొచ్చింది. ఒక్కో యుగంలో ఒక్కోరకంగా తెలుగు భాష వాడుకలో వుందని కొందరి నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా కలియుగంలో తెలుగును "కళింగ ఆంధ్ర భాష" అనీ, "రౌద్ర ఆంధ్ర భాష" అనీ ఏర్పాటుచేసింది శాతకర్ణులకు చెందిన నంది వర్ధనుడు-ఆయన శిష్యుడు దేవల రాయ అని అంటారు. ఆంధ్ర భాషకు రావణాసురుడు వ్యాకరణం రాశాడంటారు. ఆ రాసిన రావణుడు, రామాయణంలో పేర్కొన్న రావణుడే కావాలని లేదు-కాకూడదనీ లేదు. ఆంధ్ర దేశానికి, సింహళ దేశానికి మధ్య మతపరమైన అవినాభావ సంబంధాలున్నందున, తెలుగు భాషకు ఆ దేశానికి చెందిన ఒకవ్యక్తి వ్యాకరణం రాశాడంటే నమ్మ దగ్గ విషయంగానే భావించాలి. ఈ నమ్మకాల్లో, గాథల్లో, మౌఖికంగా ప్రచారంలో వున్న వాటిల్లో, కొంతలో కొంత వాస్తవం వుందనేది మాత్రం వాస్తవమే. భాషకున్న వ్యాకరణ నిర్మాణం-నిబంధనలు-మౌలికమైన పదజాల ఒరవడిని పరిగణలోకి తీసుకొని, తెలుగు భాషను అతి ప్రాచీనమైన ద్రావిడ జాతి భాషలకు చెందినదిగా శాస్త్రవేత్తలు-పరిశోధకులు-భాషా కోవిదులు-పండితులు నిర్ణయించారు. మధ్య ప్రాంత ద్రావిడ జాతి భాషల్లో బహుశా తెలుగు ఒక్కటే అతిపెద్ద వాడుక భాషగానూ, భౌగోళికంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన భాషగానూ, ఉత్తర-దక్షిణాల మధ్య వారధిగా వుండే భాషగానూ, ఆర్యుల-ద్రావిడుల మధ్య వారధిగా వుండే భాషగానూ పేర్కొనడం అతిశయోక్తికాదేమో.

పింగళి లక్ష్మీకాంతం గారు చెప్పినదాని ప్రకారం, భాషాపరంగా, తెలుగు భాషారంభం-అభివృద్ధి నన్నయకు పూర్వం-క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో మొదలై, ఆధునిక కాలం నాటి క్రీస్తుపూర్వం 1875 వరకు, ఆ తర్వాత కొనసాగింది-కొనసాగుతూనే వుంది. ప్రాచీనకాలంలో నాటి తెలుగు నాలుగు దశల్లో అభివృద్ధి చెందిందనవచ్చు. అవి: తెలుగుకు పూర్వం నెలకొన్న దశ, గ్రాంథిక తెలుగుకు పూర్వం నెలకొన్న దశ, గ్రాంథిక తెలుగు దశ, సాహిత్య దశలుగా విభజించవచ్చు. తెలుగుకు పూర్వపు దశ అంటే క్రీస్తుశకం 200 వరకే సాగిందనాలి. క్రీస్తుశకం 200-600 మధ్యకాలం వరకు గ్రాంథిక తెలుగుకు పూర్వ దశ కొనసాగింది. గ్రాంథిక దశ-వివిధ రకాల వాడుక శైలి దశ క్రీస్తుశకం 600-900 మధ్య కాలానికి చెందింది. దీని ఆధారంగా, తెలుగు భాష దక్షిణాది ద్రావిడ భాషల్లోంచి ఉద్భవించిందేననీ, ఒక ప్రత్యేకమైన భాషగా క్రీస్తుపూర్వం ఎన్నో శతాబ్దాల క్రితంనుండే వాడుకలో వుందనీ, బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. "సాలంకాయనులుల" శాసనాల ఆధారంగా, అతి పురాతనమైన తెలుగు లిపి "వెంగి"-"తెలుగు కన్నడ" లభ్యమయిందని తెలుస్తోంది. ద్రావిడ భాషకు చెందినదే అయినప్పటికీ, తెలుగుపై సంస్కృత భాష ప్రభావం అధికంగా వుంది. వాడుకభాషపైనా, గ్రాంథిక భాషపైనా కూడ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అచ్చ తెలుగులో రచనలు చేసినవారు అరుదనాలి. అందుకే మనందరికీ కవిత్రయం నన్నయ-తిక్కన-ఎర్రా ప్రగడ అయితే, శ్రీ శ్రీ గారి కవిత్రయం మాత్రం తిక్కన-వేమన-గురజాడలు. తెలుగు భాషపై సంస్కృతం ప్రభావం పడకుండా అభిమానం చూపిన మొదటి వాడు తిక్కన అని శ్రీ శ్రీ అభిప్రాయం. ఇక ఆధునిక కాలంలో తెలుగు భాష వాడకంలో-ఉపయోగంలో హద్దులనేవి గాని, ఎల్లలనేవి గాని అసలు లేనేలేవు. ఒక వైపు సంస్కృతం ప్రభావం ఇంకా తెలుగు మీద పడుతున్నప్పటికీ, ఎక్కువ ప్రభావం ఆంగ్ల భాషదే అనాలి. నాగరికులందరూ ప్రస్తుతం మాట్లాడుతుండే తెలుగును "తెంగ్లీష్" అనాలి-ఎందుకంటే, అది ప్రధానంగా తెలుగు-ఇంగ్లీషులు కలిపిన భాష కాబట్టి. తమిళం అంతే. ఇంగ్లీష్ పదజాలం లేకుండా ఈ రోజుల్లో బహుశా ఏ భాషా లేదేమో. "వేర్ సెంచరీస్ కో ఎగ్జిస్ట్" అనే భారత ఆంగ్ల సినిమాను రూపొందించిన కృష్ణస్వామి "ఇంగ్లీష్ భారతీయ భాషనీ-దక్షిణ భారతీయ భాషనీ" అంటాడు.

ఇలా మతం, భాష, సాహిత్యం దేని కవే మానవ విలువల పరిరక్షణకు దోహదపడుతున్నాయి. మనిషి తాను భగవంతుడితో మమేకం కావడానికి, తన మూర్తిని భగవంతుడిలో-ఆయన మూర్తిని తనలో చూసుకుంటూ, తద్వారా క్రమశిక్షణతో మెలుగుతూ, తోటి మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం పాటుపడుతూనే వుంటాడని ఆశించుదాం.

Monday, December 24, 2012

పరామర్శకీ పద్దతులున్నాయి!: వనం జ్వాలా నరసింహారావు


పరామర్శకీ పద్దతులున్నాయి!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచిక (31-03-1991)

          మనం ఏ పని చేసినా అవతలి వారిని ఇబ్బంది పెట్ట కూడదు. ఎవరి దగ్గరి కన్నా వెళ్తే, వీడెప్పుడు వెళ్తాడురా! అని వారు అనుకోకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యంగా సుస్తీగా వున్న స్నేహితుని దగ్గరికో, అధికారి దగ్గరికో, లేక ఇంకెవరి దగ్గరికో వెళ్లినపుడు ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందనేది తెలుసుకోవడం మంచిది.

       మన సహోద్యోగి ఆసుపత్రిలో చికిత్స పొందు తున్నప్పుడు అక్కడికెళ్లి, ఆ రోజు మనం కుదుర్చుకున్న లక్షల రూపాయల కాంట్రాక్టు గురించి. ఆ లాభ నష్టాల గురించి మాట్లాడితే ఏం బావుంటుంది? ఆతని శారీరక బాధలను చెప్పుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుంది. కోడలికి జ్వరం వస్తే నోరూరించే పిండి పదార్ధాలను గయ్యాళి అత్త తిన్నట్టుగా మనం ప్రవర్తించకూడదు.

          సుస్తీ చేసిన వారి దగ్గరకు వెళ్లినపుడు చేయ కూడనిది "గిఫ్ట్" లు తీసుకుపోవడం. ముఖ్యంగా తినే పదార్ధాలు అసలే తీసుకెళ్లకూడదు. రోగికి అవి తినాలనిపించవచ్చు. తప్పనిసరిగా తీసుకు వెళ్లదలిచి నపుడు రోగి బంధువులను, వైద్యులను సంప్రదించి ఆపని చేయడం మంచిది. ఇదీ వీలు కాకపోతే, ఇవ్వదగ్గవి పండ్లు మాత్రమే!

          పూలు, బుకేలు కూడా తీసుకెళ్లడం అన్ని వేళలా శ్రేయస్కరం కాదు. కొంత మందికి ఇవి ఎలర్జీ కావచ్చు. మరి కొంత మందికి వారి వారి మతాచారాల ప్రకారం ఒక రకం పూవు శుభం చేయవచ్చు, లేక, అశుభం అనిపించవచ్చు.

          ఇవన్నీ ఒక ఎత్తయితే, ఆసుపత్రికి వచ్చే కొందరు, ఇదేదో పిక్నిక్‍కు వస్తున్నట్లు, టీ-కాఫీలు తెచ్చుకుని అదేపనిగా పేషంటు ముందు సేవిస్తూ వుంటారు. ఇది మంచిది కాదు. మర్యాద అంతకంటే కాదు.


          సుస్తీ చేసిన వారి దగ్గరకు వెళ్లేది, ప్రధానంగా వారి ఆరోగ్యం గురించి వాకబు చేయడానికే. చిరునవ్వు ముఖంతో, సంతోషమైన కబుర్లు చెప్పి బయట పడాలి. అయితే మనం చెప్పే కబుర్లు శృతి మించ కూడదు. రోగి మనకు శ్రోత కాదు. అతని అప్పటి ఆలోచనా ధోరణికి సంబంధించిన విషయాలనే ప్రస్తావించడం మంచిది. అతని జబ్బు గురించి చెపితే ఓపికతో వింటే అతనికి సంతృప్తిని కలిగిస్తుంది. కాకపోతే అతను మాట్లాడడానికి వైద్యులు అంగీకరించాలి. మనం మాట్లాడేది ఉపన్యాస ధోరణిలో కాకుండా, మెల్లగా, నిశ్శబ్దంగా వుండాలి. అప్రియమైన మాటలు ప్రస్తావించడం మానాలి.

          గుంపులు-గుంపులుగా రోగి దగ్గరకు పోవడం, మంచం చుట్టూ గుమికూడడం ప్రోత్సహించకూడదు. ఎక్కువ మంది విజిటర్స్ వుంటే, మనం కొద్ది సేపు వేచి వుండి, ఒక నిమిషం మాట్లాడి బయటకొస్తే, ఇతరులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.

          సాధ్యమయినంత వరకు పేషంటు వద్దకు చిన్న పిల్లలను తీసుకోపోక పోవడం శ్రేయస్కరం. వారికి ఓపిక వుండదు. మన పేషంటును, ఆసుపత్రిలో వున్న ఇతర రోగులను ఇబ్బంది పెడతారు. పిల్లల ఆరోగ్యానికి కూడా ఇది మంచిది కాదు. వారున్న కాసేపు ఆసుపత్రిని, మనం వారిస్తున్నా కలియతిరుగుతారు.

          ఒక్కోసారి వైద్యుల సలహాపై, విజిటర్స్ ను అనుమతించరు. అలాంటప్పుడు మనం నిబంధనలను సడలించమని పట్టు పట్ట కూడదు. రోగి క్షేమం దృష్ట్యా వారి సలహా పాటించడం శ్రేయస్కరం. మనం వచ్చిన సంగతి రోగి బంధువులకు తెలిస్తే సరి పోతుంది.

          రోగికి ఉచిత సలహాలను ఇవ్వడం మంచిది కాదు. రోగి సుస్తీకి, మనం వాడిన మందుల గురించి ఉపోద్ఘాతం ఇచ్చి, అతని మనసును చీకాకు పర్చ కూడదు. పేషంటు అడిగినా, జవాబు దాట వేయాలి. మనం డాక్టర్ అయినా, సలహా ఇవ్వడం అంత మంచిది కాదు. అతను మరో డాక్టర్ వద్ద ట్రీట్ మెంటులో వున్నాడని గుర్తించాలి. చికిత్స చేస్తున్న వైద్యుడి గురించి మనం తక్కువగా మాట్లాడితే, అది రోగిలో అపోహలకు దారి తీసే ప్రమాదం వుంది. మానసికంగా రోగి కుదుట పడడానికి ఇది అవరోధమవుతుంది.

          కొంతమంది విజిటర్స్ డాక్టర్లను పట్టుకుని, తమకు తెలిసీ-తెలియని జ్ఞానంతో ఏవేవో అడుగుతారు. వైద్యుని చికిత్స గురించి ప్రశ్నించాల్సిన బాధ్యత రోగి దగ్గర బంధువులకే వదిలేయాలి. మనకు కావాల్సిన సమాచారం వారి దగ్గర నుంచి తెలుసుకోవాలి. అదే విధంగా రోగి స్పృహలో వున్న సమయంలో మనం హఠాత్తుగా ఏదో పనున్న వారిలాగా, పక్కన వున్న వారి బంధువులను బయటకు తీసుకెళ్లి మాట్లాడితే, రోగికి అనుమానం కలగవచ్చు.

          సుస్తీలో వున్నవారు చికిత్స పొందేది ఆసుపత్రిలో అయితే, విజిటింగ్ వేళల్లోనే వెళ్లడం మంచిది. మరో చోట వుంటే, అతని విశ్రాంతి వేళల్లో వెళ్లకుండా జాగ్రత్త పడాలి. మనం పరామర్శించ దగిన వ్యక్తికీ, మనకూ వున్న సంబంధాన్ని బట్టి, మనం వారితో గడిపే వ్యవధి ఆధారపడి వుంటుంది.

          పేషంటును చూడడానికి వెళ్తున్న మనకు అనవసర ఆదుర్దా, మనమే ముందు వారిని చూడాలన్న తహతహ వుండకూడదు.

          అప్పుడే పుట్టిన శిశువులను చూడడానికి మనం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న పిల్లలకు తొందరగా వ్యాధులు సోకే ప్రమాదం వుంది. మనం వారిని చూడడానికి గదిలోకి వెళ్లినపుడు మన పాదరక్షలను మార్చుకోవాలి. మాస్కు ధరించాలి. వారిని తాకడం కానీ, మాట్లాడడం కానీ చేయకూడదు. మన ఇన్ ఫెక్షన్స్ పిల్లలకు అంటించరాదు. తల్లికి, తన బిడ్డను ఎలా పెంచాలో, మనం ఆ సమయంలో సలహాలు ఇవ్వడం మంచిది కాదు. ఒకవేళ ఆమె అడిగినా జవాబు దాటవేయడమో, డాక్టర్‌ను సంప్రదించమని చెప్పడమో చేయాలి. మరి కొంచెం ఎదిగిన పిల్లలను చూడడానికి పోయినపుడు కూడా వారికి దూరంగా వుండి, పలకరించి పోవడం మంచిది.

(21 సంవత్సరాల క్రితం ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచికలో రాసిన వ్యాసం ఇది)

Wednesday, December 19, 2012

సోమవారం! తస్మాత్ జాగ్రత్త!?: వనం జ్వాలా నరసింహారావు


సోమవారం! తస్మాత్ జాగ్రత్త!?

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచిక (24-03-1991)

          నాగరిక ప్రపంచంలో గుండె జబ్బుతో హఠాత్తుగా మరణించడం సర్వ సాధారణ విషయమై పోయింది. 40-50 సంవత్సరాల మధ్య వయస్కుల్లో ఇది బాగా కనిపిస్తున్నది. ఎండా కాలంలో ఆకాశంలో మెరుపులాగా చెప్పా పెట్టకుండా గుండె జబ్బు చావులు విపరీతంగా సంభవిస్తున్నాయి.

          వాస్తవానికి, మనిషి శరీరంలో ఈ వ్యాధి లక్షణాలు మనకు తెలియకుండానే, మన అశ్రద్ధ మూలంగా వృద్ధి చెందుతుంటాయి. పనిభారం, వాతావరణ తీవ్రతలు, మద్యం సేవించడం, ఈ వ్యాధిని బయట పడేసి మరణానికి దారితీస్తుంది.

          పరిశోధకులు ఆరు ప్రధానమైన కారణాలను, గుండె జబ్బు ద్వారా మరణానికి హఠాత్తుగా దారి తీసేవిగా పేర్కొన్నారు.

          అనవసరమైన అకారణ భావోద్రేకం వల్ల మానసిక ఒత్తిడులు పెరిగి, గుండె ఆగిపోయి మనిషి మరణించవచ్చు. ఉదాహరణకు, ఒకతని వ్యవహారంలో, అతను ఆడే బేస్ బాల్ గేమే, అతడి పాలిట మరణమైందని తేలింది. ఈ అకారణ ఉద్రేకాలు, మనిషి గుండెల్లో ఒక విద్యుత్ ఘాతంలా తగిలి, హృదయ కోశం నుంచి రక్తం సరఫరా అయ్యే ప్రక్రియ ఆగి పోయే ప్రమాదముంది. దీన్నే "ఎరిధ్ మియాస్" అంటారు. దీనికి గురై బ్రతికిన బోస్టన్‌కు చెందిన  117 మందిని ప్రశ్నించినప్పుడు దీనికి గురికావడానికి 24 గంటల ముందు, వీరిలో చాలామంది మానసిక అల జడులకు లోనయ్యారని తేలింది. వీరిలో ఒకరు, బేస్ బాల్ ఆటను టెలివిజన్‌లో చూస్తూ, తన దేశం ఓటమిని సహించలేక, గుండె జబ్బుకు గురి కావాల్సి వచ్చిందట. అందుకే 10 నిమిషాలకు మించి ఏ విషయంలోనూ అతి ఉత్సాహం చూపించి, అనవసర ఉద్రేకాలకు గురి కావద్దంటున్నారు పరిశోధకులు.  

          మరో కారణం: మంచు తుఫానులు. శరీరానికి ఎక్కువ చలి వేస్తున్నప్పుడు, రక్తనాళాలు ఇరుకై, రక్తప్రసరణ ఆగిపోవచ్చు.


          "ఏంజినో సెక్టోరిస్" అనే హృద్రోగ సంబంధమైన ఛాతీ నెప్పులున్న వారు ఈ రకమైన ప్రమాదానికి లోనయ్యే వీలు ఎక్కువగా వుంటుందని డాక్టర్లు చెపుతున్నారు.

          రాత్రి వేళల్లో మితిమీరిన ఆహారం తినడం కూడా గుండె జబ్బులకు దారితీయవచ్చు. బ్రిటన్‌లో హఠాత్తుగా గుండె ఆగి మరణించిన వంద కేసులను పరిశీలించినప్పుడు 25 శాతం వరకు, భోజనం చేసిన గంటలోపులో మరణించారని తేలింది. భోజనంలోని కొవ్వు పదార్థాలు, కార్డియో వాస్క్యులర్ సిస్టంపైన దుష్పరిణామాలు తేవచ్చు. మొత్తం మీద రిస్క్ ఎంత వుందో అంచనా వేయలేక పోయినా, రాత్రివేళ భోజనంలో తీసుకునే కొవ్వు పదార్థాలు, నిద్రావస్థలో వున్నప్పుడు, జీర్ణప్రక్రియ జరుగుతుండే సందర్భంలో, ఇరుకుగా వున్న రక్తనాళాలు మరింత ఇరు కయ్యే ప్రమాదముంది. అదే బ్రిటీష్ శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం, ఈ వంద మందిలో, మరో నాలుగు వంతుల మంది, చనిపోవడానికి కొంత సేపు క్రితం వరకూ మద్యం సేవిస్తున్నట్లు వెల్లడైంది.

          మరో ఆసక్తికరమైన కారణం, నమ్మ శక్యం కానిది, కెనడా దేశపు శాస్త్రజ్ఞుల పరిశోధనలో బయటపడింది. వారు తెలుసుకున్న దానిని బట్టి, హృద్రోగ మరణాలలో 75 శాతం సోమవారం ఉదయం సంభవించినవే! వారారంభంలో మొదటి పని దినం సోమవారం కావడమే దీనికి కారణం అంటున్నారు వీరు. రెండవ ప్రపంచ యుద్ధంలో, పైలట్ శిక్షణ కొరకు అర్హులైన 3983 మందిని వీరు అధ్యయనం చేసినప్పుడు, వీరిలో గుండే జబ్బు వచ్చినవారిలో అత్యధికులు సోమవారం ఉదయం మృత్యువాతన పడ్డారు.

          ఇదిలా వుండగా, సోమవారం ఉదయమే కానక్కరలేదు-ఏ ఉదయమైనా ఇది జరగవచ్చని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన కార్డియాలజిస్ట్ జేమ్స్ ఇ ముల్లర్ అన్నారు. ఆయన అధ్యయనం చేసిన 847 హృద్రోగ మరణాలలో, ఎక్కువ భాగం ఉదయం ఆరు గంటలకు సంభవించినవేనట. ఒక్కొక్కప్పుడు రెండు-మూడు గంటలు, అటు-ఇటుగా సంభవించాయి.

          యూరోప్, సోవియట్ యూనియన్ శాస్త్రజ్ఞుల పరిశోధనలలో కూడా హృద్రోగ మరణాలు ఉదయం పూటే ఎక్కువ అని తేలింది.

          కారణాలు ఏవైనా, ఎన్నైనా, మన జాగ్రత్తల్లో మనం వుండడం మంచిది.

          (21 సంవత్సరాల క్రితం ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో రాసిన వ్యాసం ఇది)

Tuesday, December 18, 2012

జాతికో ధర్మం! దేశానికో ఆచారం!: వనం జ్వాలా నరసింహారావు



జాతికో ధర్మం! దేశానికో ఆచారం!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక (10-3-1991)

ఆఫ్రికా ఖండంలో అడుగిడిన పాశ్చాత్యులను, అమిత ఆశ్చర్యానికి గురిచేసేవి వారి ఆటవిక సాంప్రదాయాలు! తోటి వారు చనిపోతే, ఆడా-మగ తేడా లేకుండా గుడారాలలో నుంచి, కేరింతలు కొడుతూ బయటికొచ్చి ఉల్లాసంగా గడపడం, వింతగా వుంటుంది. పశ్చిమాఫ్రికా ఆటవికుల్లోని నమ్మకం ప్రకారం, బ్రతికున్నవారు, పుట్టబోయే వారు, చనిపోయిన వారు అనే మూడు తెగలుంటాయనీ, బ్రతికున్న వారు చనిపోయిన వారిలో కలిసేటప్పుడు వారి గౌరవార్థం ఉల్లాసంగా గడపాలనీ వారి సాంప్రదాయం.

ఈ చిన్న విషయానికే ఇంతగా ఆశ్చర్యపోతే, దేశ దేశాల్లో, వివిధ మతాచారాల ప్రకారం, చనిపోయిన వారికి జరిపే అంత్యక్రియలను చూస్తే మరింతగా బిత్తరపోవాల్సి వస్తుంది. చనిపోయిన మనిషి మృతదేహాన్ని ఏ విధంగా సాగనంపాలనే విషయంలో తుది మాట మతానిదే. జరపాల్సిన అపర కర్మలు కానీ, ఏటేటా నిర్వహించాల్సిన వార్షికాలు కానీ, అన్నీ, వారివారి మతాచారాలపైనే ఆధారపడి వుంటాయి.

జంతువుల విషయానికొస్తే, అవి చనిపోయింతర్వాత, వాటి మృత దేహాలు క్రమేపీ కుళ్లిపోయి కాలగర్భంలో కలిసి పోవాల్సిందే. వాటికి దిక్కూ మొక్కూ వుండదు. ప్రకృతీ తనకనువైన రీతిలో, వాటి ద్వారా వచ్చే దుర్వాసనను భరించి, తనలో కలుపుకుంటుంది. ఒక్కోసారి ఈ దుర్గంధం, సుదూరంలో వున్న వేరే జంతువులను ఆకర్షించి, వాటి ఆహార కొరత తీరుస్తుంటుంది. మొత్తం మీద జంతు ప్రపంచంలో కర్మ కాండలు లేవనేది స్పష్టంగా తెలుస్తున్నది.


పరిణామక్రమంలో ఉన్నత జాతికి చెందిన కోతులలాంటి కొన్ని జంతువులు, కొన్ని రకాల పక్షులు, అకాల మరణం చెందిన తమతోటి జీవాలను, తమ మధ్య వుంచుకుని వాటికి తోచిన తరహాలో ఆవేదనను వ్యక్తం చేస్తాయి. కాకి చనిపోతే మిగతా కాకులు చేసే గోల, కోతుల్లో ఒకటి చనిపోతే మిగతా కోతులు చేసే ఆగడం, ఏనుగు పిల్ల మరణిస్తే మిగతావి చేసే విలయ తాండవం, మనం ఉదాహరణలుగా తీసుకోవచ్చు. చనిపోయిన ఈ జంతువుల శరీరాన్ని అవి, ఆకులలాలతో కప్పి దాచే ప్రయత్నాలు చేస్తాయి. ఆ తరువాత అవి బాక్టీరియాకు గురై భూమిలో కలిసి పోవాల్సిందే. బహుశా ఈ విధంగా ఆకుల మధ్యన జంతువుల మృత దేహాలను కప్పి దాచే పద్ధతి, చనిపోయిన పక్షి పిల్లలను గూటిలోంచి తల్లి పక్షి తొలగించి బయట పారేయడం లాంటివి, ఈనాడు మానవుల విషయంలో మనం ఆచరిస్తున్న మృతదేహాల ఖననానికి కాని, కాల్చడానికి కాని ఆరంభం కావచ్చు.

హిందువుల్లో ఎవరైనా చనిపోతే, మృతదేహాన్ని పవిత్రమైన మంటలకు ఆహుతి చేస్తారు. క్రైస్తవులు, ముస్లింలు, తమవారెవరైనా మరణిస్తే, ఆ మృతదేహాన్ని పది అడుగుల లోతుగా తీసిన గుంటలో శాస్త్రోక్తంగా పూడ్చి పెడతారు. జొరాస్ట్రియన్ మతాచారం ప్రకారం మృతదేహాన్ని ప్రకృతిలోని పశుపక్ష్యాదులకు ఆహారంగా అప్ప చెపుతారు. పద్ధతులలో ఇలా తేడాలు కనిపిస్తుంటాయి.

క్రైస్తవ ఆచారం ప్రకారం, మృత దేహాన్ని వెల్లికిలా పరుండబెట్టి, శవ పేటికలోకి చేరుస్తారు. ఆ శవ పేటికను యధాతధంగా, మతాచారుల ప్రార్థనల మధ్య గోతిలోకి దింపుతారు. ముస్లింల విషయానికొస్తే, అప్పటికప్పుడు తవ్వబడిన గోతిలో, సరాసరి, శవాన్నే తెల్ల గుడ్డతో కప్పి పూడ్చి పెడతారు. అయితే, మృతదేహం తలను మాత్రం, మక్కా దిక్కుగా చూసే విధంగా అమరుస్తారు. ఆ తరువాత తాజ్ మహల్ లాంటి సమాధులు వాటిపై కట్తుంటారు వారివారి స్థాయిని బట్టి.

శవాల్ని పాతేసే పద్ధతి, చితికి ఆహుతి చేసే పద్ధతికన్నా పురాతనమైందనే విషయాన్ని చరిత్ర చెపుతోంది. శవాలను అగ్నికి ఆహుతి చేసే ఆచారం రోమ్, గ్రీక్ నాగరికతల నాటిది కాగా, ఈజిప్ట్ లో ఏనాడో అరవై వేల ఏళ్ల క్రితమే మృత దేహాలను సమాధి చేసిన చారిత్రక సాక్ష్యాధారాలు లభించాయి. ఈజిప్ట్ లో నైలు నది నాగరికత ప్రభావం వున్న కాలంలో, కర్మకాండతో మృత దేహాలను సమాధి చేసేవారు. ఈజిప్ట్ రాజులు, తాము బతికున్నప్పుడే, మరణానంతరం వుపయోగపడేలా తమకు, తమ పిల్లలకు సమాధుల కొరకై పెద్ద పెద్ద పిరమిడ్లను నిర్మించుకునే వారు. అవే ఈనాడు విహార స్థలాలుగా చెలామణి అవుతున్నాయి. ఈ సమాధులలో భధ్రపరచబడిన "మమ్మీల" పై ఆంతులేని ఆభరణాలు, విలువగల దుస్తులు వుంచేవారనీ, అందుకే ఈ ప్రదేశాలను కాపాడేవారనీ అంటారు.

హిందువులలో కర్మకాండలు అనేక రకాలు. చిన్న పిల్లలు చనిపోతే పూడ్చి పెడతారు. కేరళకు చెందిన "పిషారాదీసులు" అనే హిందువులు, మృతదేహాన్ని ఉప్పుతో నింపి, కూర్చున్న ఆకృతిలో పూడ్చి పెడతారు. చనిపోయిన వారి జ్ఞాపకార్థం సంతాప దినాలు పాటించడం, అన్న దానం చేయడం, బూడిదను గంగానది లాంటి పవిత్ర జలాలలో కలపడం, దేశంలోని పలు ప్రాంతాలలో హెలికాప్టర్ల ద్వారా వెదజల్లడం, ఇలా ఎన్నో విధాలుగా మరణించిన వారిని గౌరవిస్తారు.

ఇలా నదులలో బూడిదను కలుపుతూ పోతుంటే కాలుష్యం మాటేంటి? అని అడగవచ్చు. మరణించిన వారి ఆత్మలు తృప్తి చెందాలి కాని, పర్యావరణం ముఖ్యం కాదని ఇలాంటి వారిని ఎవరిని అడిగినా సమాధానం ఇస్తారు. జంతువుల మృత దేహాలను ఆకులతో కప్పే ప్రక్రియ నుంచి, మానవ శరీరాలను మరణానంతరం ప్రకృతి ఒడిలో కలపడం వరకు మనం గమనించాల్సింది ఒకటే. పనికిరాని పదార్ధాన్ని మన మధ్య నుంచి ఏ విధంగానైనా తొలగించడమే!

( 21 సంవత్సరాల క్రితం ఆంధ్ర జ్యోతిలో రాసిన వ్యాసం ఇది)

Saturday, December 15, 2012

బ్రాహ్మణులంటే ఎవరు?: వనం జ్వాలా నరసింహారావు


బ్రాహ్మణులంటే ఎవరు?

వనం జ్వాలా నరసింహారావు

నువ్వెవరివి? అని అడుగుతే తాను ఎవరో-ఏంటో, చెప్పుకోలేని స్థితిలో వున్నారు నేటి బ్రాహ్మణులు. బ్రాహ్మణ ఔన్నత్యాన్నీ, బ్రాహ్మణ మూల విశేషాలను, ఏ మాత్రం తెలియని అనేకమంది తమ నోటికొచ్చినట్లు బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తూ మాట్లాడే రోజులొచ్చాయి. తమ గురించి తాము చెప్పుకోలేని పరిస్థితి బ్రాహ్మణులకు కలిగింది. ఈ నేపధ్యంలో పాత్రికేయులు డాక్టర్ పాలకోడేటి సత్యనారాయణ రావు రాసిన "సంక్షిప్త బ్రాహ్మణ చరిత్ర" బ్రాహ్మణేతర విమర్శకులకు అసలు-సిసలైన సమాధానం అనాలి. ఇది చదివిన వారు-ముఖ్యంగా బ్రాహ్మణ విమర్శకులు, "ఓహో...బ్రాహ్మణులంటే ఇంత గొప్ప వారా? వీళ్లకు ఇంత తెలుసా? బ్రాహ్మణులకి ఇంత విస్తారమైన చరిత్ర వుందా? వీరిని బాపనోడు, బామ్మడు, పంగనామాలోడు అని హేళన చేయవచ్చా?" అన్న ఆలోచన చేయక మానరు.
          
సామూహిక జన జీవన వ్యవస్థే సమాజం అంటూ ప్రారంభించి, అనేకానేక విషయాలను, సంక్షిప్తంగా అంటూనే, వివరంగా తెలియచేసే ప్రయత్నంలో పాలకోడేటి సఫలమయ్యారనడంలో సందేహం లేదు. వివరాలలోకి పోతే.... ప్రపంచంలో ఎన్ని మతాలున్నా హైందవ మతానికి, లేదా, వైదిక మతానికి ఒక ప్రత్యేకత వుంది. వాల్మీకి రామాయణం రాసే కాలంలోనే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు వాడుకలో వున్నాయి. మరో వాదన ప్రకారం, ఆర్యులు ఆంధ్ర దేశం రాక ముందు, చాతుర్వర్ణ పద్ధతి లేదు. ఐతే, పుట్టుకతో అందరూ శూద్రులే ఐనప్పటికీ, తమ తమ విధి నిర్వహణ సంస్కారాలను బట్టి, బ్రహ్మ జ్ఞానం సంతరించుకున్న తదుపరి, బ్రాహ్మణులుగా అవుతారని శంకరాచార్యులవారు వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ద్విజులని, విప్రులని, బ్రాహ్మణులని మూడు విడి-విడి పదాలున్నాయి. వీటి అర్థం ఒకటే ఐనా, కొంత వ్యత్యాసం వుంది. లోతుగా పోతే, బ్రాహ్మణులని పిలిపించుకోవాలంటే, బ్రహ్మ జ్ఞానాన్ని పొందడం తప్పని సరి. సమాజం అభివృద్ధి చెందిన నేడు కూడా, సామాజిక అవసరాల దృష్ట్యా, చాతుర్వర్ణాలుండవచ్చు కదా! ఇలాంటి వ్యవస్థ ప్రాచీన కాలం నాటి ఈజిప్ట్, బాబిలోనియాలతో సహా, చైనా దేశంలోనూ వుండేదట. అక్కడి వాడుక ప్రకారం వారిని పూజారులుగా, పాలకులుగా, వృత్తి దారులుగా, బానిసలుగా విభజించారు. అలానే ప్రాచీన ఇరాన్‌లో "పిస్త్రీ" అనే నాలుగు వర్ణాలుండేవి.
          
ఇక "కులం" అంటే ఏమిటో చూద్దాం. ఒక అర్థం ప్రకారం కులమంటే "నివాసం". వర్ణాలు వేరు, జాతులు వేరు. వర్ణం అనే మాట "వర్గం" ను సూచిస్తే, జాతి అనేది "కులం" ను సూచిస్తుంది. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే "క్లాస్", "కాస్ట్" అన్న మాట. జాతులు పెరుగుతూ తరుగుతూ వస్తున్నప్పటికీ, వర్ణాలు మాత్రం నాలుగు గానే వుండిపోయాయి. ఏదేమైనప్పటికీ, చాతుర్వర్ణ వ్యవస్థను ఎవరు-ఎప్పుడు సృష్టించినప్పటికీ, అది ఎలా రూపాంతరం చెందినప్పటికీ, ఒక విషయం మాత్రం వాస్తవం. అది ఒక సామాజిక అవసరాన్ని, బాధ్యతను నిర్వహించింది. అందువల్ల ఎవరు కూడా తాము ఫలానా కులంలో పుట్టామని బాధ పడాల్సిన అవసరం లేదు. గర్వ పడాల్సిన అవసరమూ లేదు. ఒక కులంలో పుట్టినందుకు వేరే కులం వారిని తక్కువగా కాని, ఎక్కువగా కాని చూడాల్సిన అవసరమూ లేదు. బ్రాహ్మణుల విషయానికొస్తే, వారు సమాజంలో దైవ చింతనను పెంచాలని, సమాజ హితం కోరే "పురోహితులు” గా వుండాలనీ, ఒకనాటి వ్యవస్థ నిర్దేశించింది. సమాజం వారికి అప్పగించిన బాధ్యతను చాలా కాలంపాటు, బ్రాహ్మణులు సక్రమంగా నిర్వహించారు కూడా. కాలానుగుణంగా, సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా, బ్రాహ్మణులు కూడా మార్పులకు లోనుకాక తప్పలేదు. ఒకటి మాత్రం వాస్తవం. బ్రాహ్మణులు కులవ్యవస్థకు కారకులు కాదు. వారు కుల వ్యవస్థను పెంచి పోషించిందీ లేదు. సమాజం అవసరాల నేపధ్యంలో అదే సమాజం సృష్టించుకున్నవే ఇవన్నీ.
          
"బ్రాహ్మణులు" అనే మాట "బ్రహ్మన్" అనే పదం నుంచి వచ్చింది. బ్రహ్మన్ అంటే "యజ్ఞం’ అనే అర్థం కూడా వుంది. అంటే యజ్ఞాలు చేసే వారు బ్రాహ్మణులని చెప్పుకోవచ్చు. అలానే "బ్రహ్మ" అంటే వేదం అని, జ్ఞానం అని, వీటి నుంచే బ్రాహ్మణ శబ్దం వచ్చిందని కూడా అంటారు. అంటే వేదాధ్యయనం చేసిన వాడు, ఆత్మ జ్ఞానం తెలిసిన వాడే బ్రాహ్మణుడని అర్థం. బ్రాహ్మణ స్త్రీ యందు, బ్రాహ్మణ పురుషుడి వలన జన్మించి, తదుపరి, జాతి, కులం, వృత్తి, స్వాధ్యాయం, జ్ఞానాల వల్ల బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. తాను నిరంతరం చదువుకుంటూ వుండడం, శిష్యులకు బోధించడం, యజ్ఞాలు చేయడం, యజమానులతో చేయించడం, దానాలు ఇవ్వడం-తీసుకోవడం బ్రాహ్మణులు చేయాల్సిన పని. ఒకానొక రోజుల్లో బ్రాహ్మణులకు బ్రహ్మ-క్షత్రియ గుణాలుండేవి. కాని, ఆ తరువాత, వారు తమ క్షత్రియ గుణాలను పూర్తిగా వదిలి, పాలన, మంత్రాంగం, పురహితాల వైపు దృష్టి మరల్చారు. బ్రాహ్మణులకు అనాది నుంచీ, సమాజంలోని ఇతరుల నుంచి ఎంతో గౌరవ ప్రపత్తులు లభించేవి. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామ పరిపాలన, సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ కొరకు పనిచేసే "పంచ ప్రధానుల" లో కనీసం ఒకరిద్దరు బ్రాహ్మణులుండేవారు. అదే నేటి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఐంది. సుమతి శతకం ప్రకారం, ఒక ప్రదేశం గ్రామం అనిపించుకోవాలంటే, దానికి వుండాల్సిన ప్రాధమిక లక్ష్యాలలో వూళ్లో బ్రాహ్మణుడు వుండడం కూడా ఒకటి. సమాజాన్ని మార్క్సిస్టు కోణంలో నిశితంగా పరిశీలన చేసిన చరిత్రకారుడు కోశాంబి తన గ్రంధంలో, బ్రాహ్మణులు సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా గొప్ప యోగ్యతా పత్రం ఇచ్చారు. ఆర్య, ఆదిమ వాసుల పునఃకలయికవల్ల ఏర్పడిన కులంగా బ్రాహ్మణులను అభివర్ణించి, ప్రాచీన పవిత్ర గ్రంథాలలో లభ్యమైన వాటిని భద్ర పరిచింది వారేనని, దాని విలువ అపారమని పేర్కొన్నారు. 
          
బ్రాహ్మణ వంశంలో పుట్టిన వారందరూ బ్రాహ్మణులు కాలేరు. వారిలో ఉపనయనాది సంస్కారాలు, వైదిక కర్మలు లేని వారిని "మాత్రులు" అని; వైదికాచారాలు పాటిస్తూ శాంత స్వభావులైన వారిని "బ్రాహ్మణులు" అని; బ్రాహ్మణోచితమైన షట్ కర్మలను ఆచరించే వారిని "శ్రోత్రియులు" అని; నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారిని, విద్వాంసులను "అనూచానులు" అని; ఇంద్రియాలను తమ వశంలో వుంచుకున్న వారిని "భ్రూణులు" అని; ఎప్పుడూ ఆశ్రమంలోనో, అరణ్యంలోనో వుండే వారిని "ఋషికల్పులు" అని; రేతస్కలనం లేక సత్య ప్రజ్ఞులైన వారిని "ఋషులు" అని; సంపూర్ణ తత్వ జ్ఞానం కలవారిని "మునులు" అని అంటారు.
          
అఖండ భారత దేశంలోని అన్ని ప్రాంతాలలో బ్రాహ్మణులు విస్తరించి వున్నారు. ఉత్తర భారతంలో పంచ గౌడులుగా, దక్షిణ భారతంలో పంచ ద్రావిడులుగా పిలువబడే బ్రాహ్మణులు, భారతావనికి ఆవల వున్న దేశాలలోనూ వున్నారు. నేపాల్‌లో "బహున్" లుగా, మయన్మార్‍లో "పొన్న" లుగా, వివిధ పేర్లతో బ్రాహ్మణులున్నారు. దక్షిణాది బ్రాహ్మణులలో స్మార్తులని, వైష్ణవులని, మధ్వులని మూడు ప్రధానమైన విభాగాలున్నాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన వున్న బ్రాహ్మణులలో తెలుగు వారికి ఒక ప్రత్యేక స్థానం వుంది. వీరిని తెలుగు బ్రాహ్మణులంటారు. వీరిలో స్మార్తులు అత్యధికులు. మధ్వుల సంఖ్య పరిమితం. తెలుగు స్మార్త  బ్రాహ్మణులలో ప్రధానమైన తెగలు పది వరకూ వున్నాయి. వారిని, తెలగాణ్యులు, మురికినాడు, వెలనాడు, కాసలనాడు, కరణ కమ్మలు, వేగినాడు, తొడ్రనాడు, ఔదమనాడు, కోన సముద్ర ద్రావిడులు, ఆరామ ద్రావిడులు అని పిలుస్తారు. ఈ పది తెగల వారు కూడా వైదికులే. స్మార్తులలో ఒక విభాగం వైదికులైతే, మరో విభాగం వారిని నియోగులంటారు.
          
వేద వేదాంగ విహితమైన పౌరోహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ, సమాజంలో అందరూ తమ తమ జన్మానుసారం చేయదగిన కులపరమైన సంస్కార నిర్వహణకు మంత్ర సహితమైన కర్మ-కాండలలో తోడ్పడుతూ, ప్రజాసేవకు అంకితమవుతున్న వారిని "వైదికులు" అంటారు. వీరు వేద విద్యాభ్యాసం, వేద విద్య ప్రచారం, వేద విద్యానుగతమైన యజ్ఞకార్యాదుల నిర్వహణలో నిమగ్నమవుతూ వుంటారు. సమాజంలో వస్తున్న మార్పులకనుగుణంగా వీరిలో పలువురు వర్తమాన కాలంలో వివిధ ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకూ ఏ వేదం చదివిన వారిని వైదికులని పిలవాలి? ఏక వేద పాఠకులను వైదికులని, ఒకటికి మించి ఎక్కువ చదివితే ద్వివేదులని, త్రివేదులని, చతుర్వేదులని పిలుస్తున్నారు. ఒకప్పుడు ప్రజ్ఞా పాటవాలకు లభించిన ఈ బిరుదులు ఇప్పుడు ఇంటి పేర్లుగా మారిపోయాయి.
          
వైదికులనుండి విడిపోయి, ప్రత్యేక శాఖగా ఏర్పడిన వారు "నియోగులు". వారిలో, ఆరు వేల, నందవరీక, కరణకమ్మ, వెలనాటి, తెలగాణ్య, ద్రావిడ, కరణాలు, శిష్టకరణాలు, కాసలనాటి, పాకలనాటి నియోగులని రకరకాల ఉప శాఖల వారున్నారు. నియోగులనే పదానికి అర్థం, కరిణీకం, మంత్రి పదవి లాంటి లౌకిక కార్యాలలో రాజులచే వినియోగించబడిన వారని. నియోగులు సంప్రదాయ బ్రాహ్మణులు కారనే వాదన కూడా వుంది. కొందరి దృష్టిలో సంప్రదాయ బ్రాహ్మణులంటే వైదిక కార్యాలు చేసే వైదికులు మాత్రమేనని. పౌరోహిత్యం వృత్తిగా కాకుండా, లౌకిక ఉద్యోగాల మీద ఆధారపడిన వారే నియోగులు. వీరిలో ఆరు వేల నియోగులది పెద్ద ఉప శాఖ. ఐతే, వీరు ఆరువేల గ్రామాలకు చెందిన వారో, ఆరువేల గ్రామాలకు నియోగించబడిన వారో అనే విషయం ఇదమిద్ధంగా తేలలేదు. శతాబ్దాల క్రితం ఆంధ్ర దేశాన్ని పాలించిన రాజులు పరిపాలనా సౌలభ్యం కొరకు రాష్ట్రాన్ని పలు చిన్న ప్రాంతాలుగా విభజించారు. నియోగులలో చాలా శాఖలు లేదా విభాగాలు ప్రాధమికంగా ప్రాంతాల ఆధారంగా రూపొందినవే. కాకతీయుల పరిపాలనా కాలంలో, ఆరువేల మంది బ్రాహ్మణులను, స్థానిక గ్రామాలకు చెందిన రికార్డుల నిర్వహణ కొరకు గ్రామాధికారులుగా, గ్రామ కరణాలుగా నియోగించి నందువల్ల, వారికి ఆరువేల నియోగులన్న పేరొచ్చిందంటారు. అంతవరకూ యుద్ధాలలో కూడా పాల్గొన్న బ్రాహ్మణులు పాలనా రంగంలోకి వచ్చారు. మరో కథనం ప్రకారం, మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ కాలానికి తరువాత, తిక్కన కాలానికి ముందు నియోగి బ్రాహ్మణుల తెగ ఏర్పడి వుండవచ్చు.     వేంగీ చాళుక్యుల కాలంలో బ్రాహ్మణుల చరిత్ర గొప్ప మలుపు తిరిగింది. అంత వరకు, వేద పఠనానికి, పురోహితానికి మాత్రమే పరిమితమైన బ్రాహ్మణులు, మంత్రాంగ, మంత్రిత్వ నిర్వహణలకు పూనుకున్నారు. బహుశా అప్పటి నుంచి వైదిక, నియోగి శాఖలు ఏర్పడి వుండవచ్చు. మొత్తం మీద బ్రాహ్మణులలో నియోగి శాఖ ఎలా ఏర్పడిందనే అంశంపై చాలా కథలు ప్రచారంలో వున్నాయి. వేటిలో ఏది నిజమో, ఏవి కావో మరింత పరిశోధనలు చేయాల్సి వుంటుంది.

వైదికులైనా, నియోగులైనా, తమ పని తాము చేసుకుని పోతున్న బ్రాహ్మణులను, తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూ, వారేదో తప్పు చేశారని చరిత్ర వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు సబబు?

Thursday, December 13, 2012

కాలయాపనకే అఖిల పక్షాలు: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు
          
తెలంగాణ సమస్యపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చి దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తోంది. తదనంతరం అఖిల పక్ష సమావేశాలూ జరిగాయి. ఇంతవరకూ ఏమీ తేలలేదు. మళ్లీ అఖిల పక్ష సమావేశ మంటున్నారు. అసలా మాటకొస్తే ఆ కమిటీ చేసిందంతా అఖిల పక్ష సమావేశాలే కదా? విస్తృత స్థాయిలో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశమైన తరువాతే నివేదిక ఇచ్చినప్పుడు మళ్లీ అఖిల పక్ష సమావేశం కావాల్నా?

నివేదిక ఇస్తూ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు తమకు “అప్పజెప్పిన పని సులభమైంది కాదని” అనడం కన్నా, బాధ్యత తీసుకునే ముందే, తమకంతగా చేతకాని బాధ్యత నెత్తిన వేసుకుంటున్నామని అనుకుంటే బాగుండేదేమో. పదకొండు నెలలుగా చేసిన విస్తృత సంప్రదింపులు, బృహత్తర పరిశోధనలు చివరకు ఏమైనా తేల్చిందా? తేల్చనప్పుడు-తేల్చలేమని గుర్తించినప్పుడు, ఆ సంగతే చెప్పాలి కాని, శాశ్వత ప్రతిష్ఠంభన దిశగా సూచనలివ్వడం ఎంతవరకు సబబు? పైగా తాము చెప్పలేని దానికి, పోనీ పదే-పదే చెప్తూ వస్తున్న దానికి (అందరికీ ఆమోద యోగ్యమైన నివేదిక ఇస్తాం!) పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగంలోని సూక్తులను పేర్కొనడం ఒక తెలివైన ఎత్తుగడ తప్ప మరోటి కాదు. కమిటీ చేసిన "బెస్ట్" లేదా "సెకండ్ బెస్ట్" సూచనలలో ఏ ఒక్క దాన్ని ప్రభుత్వం అంగీకరించినా, ఆ నిర్ణయం, నిజంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్లు "ఎవరికీ పరాజయం లేకుండా అందరికీ సమానంగా విజయం చేకూరినట్లు" అవుతుందా? సూచన-ఐదుకు ప్రభుత్వం అంగీకరించితే అది సమైక్య వాదులకు అపజయమే కదా! సూచన-ఆరుకు ఒప్పుకుంటే, ఇటు తెలంగాణ కోరుకునే వారికి, అటు సమైక్య వాదులకు అపజయమే కదా! జవహర్లాల్ నెహ్రూ చెప్పిన బుద్ధుడి ప్రవచనాలను శ్రీకృష్ణ కమిటీ నిజంగా గౌరవించిందా? న్యాయమూర్తి అనేవారెవరైనా "ధర్మ సమ్మతమైన న్యాయం" చెప్పి సమస్యను పరిష్కరించే సూచనలివ్వాలి కాని, సమస్యను మరింత జటిలం చేయొచ్చా? పైగా అందరికీ విజయం చేకూరుస్తున్నామని చెప్పడం తగునా?


          నివేదికలో ఏం చెప్పినా ఇష్టంగానో-అయిష్టంగా నో, మనసులో మాట మాత్రం దాచుకోలేక పోయారు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు. మహాభారత యుద్ధం పూర్వ రంగంలో, కౌరవ-పాండవ యుద్ధం నివారించడానికి శ్రీకృష్ణుడు హస్తినకు రాయభారానికి వెళ్లినట్లు వర్ణించడం జరిగినా, వాస్తవానికి, యుద్ధాన్ని ఖాయం చేసేందు కొరకే వెళ్లాడనే ది జగమెరిగిన సత్యం. అదే జరిగింది శ్రీకృష్ణ కమిటీ నివేదిక విషయంలో కూడా. ఏభై నాలుగేళ్ల ఆంధ్రా నిలువెత్తు దోపిడీకి నిదర్శనంగా నేటికీ మిగిలిపోయిన తెలంగాణ ప్రాంతం వారు చేయబోయే ఆధునిక మహాభారత యుద్ధానికి తెరలేపింది శ్రీకృష్ణ కమిటీ "కృష్ణ రాయభారం తరహా నివేదిక". నాటి శ్రీకృష్ణుడు పాండవ పక్షం-ధర్మం పక్షం వహిస్తే, నేటి శ్రీకృష్ణుడి నివేదిక సమైక్యానికి మొగ్గు చూపినట్లు భావన కలిగించినా, ఆసాంతం, మనసులో వున్న మాటగా, విభజన పలుకులే పలకడం విశేషం. మరో విధంగా చెప్పాలంటే, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల న్యాయమైన కోర్కె సమంజసమని-సమర్థించాలని మనసులో వున్నా, చేసిన ఆరు సూచనలలో వద్దనుకుంటూనే నాలుగు సూచనలు విభజనకు సంబంధించినవి కావడం విశేషం. అంటే, విభజన సమస్య పరిష్కారానికి సరైన మార్గమని ఆయనకు తెలిసినా అసంబద్ధమైన విభజనలను మొదలు సూచించి, చివరకు అసలు సిసలైన రాయభారం తరహాలో... ఐదూళ్లిచ్చిన చాలును... అన్న చందాన పనికిమాలిన సూచనతో సహా, అసలు సిసలైన ఒకే ఒక్క సూచన చేశారు. ఆయన చెప్పిన విధంగా, ఐదో సూచనకు అనుగుణంగా తప్ప, వేరే రకంగా విభజనకు ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరు తెలంగాణ ప్రజలు. "అనివార్యమైతే - అంతా ఒప్పుకుంటేనే పరిశీలించాలి" అని కమిటీ వ్యాఖ్య చేసిన "రాష్ట్రాన్ని సీమాంధ్ర-తెలంగాణగా విభజించి... హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా ఉంచడం, సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేయడం" అన్న దానికి ప్రభుత్వం ఒప్పుకుని, దానికి అనుగుణమైన చర్యలు చేపట్టి తేనే, బహుశా మహాభారత యుద్ధం లాంటిది నివారించవచ్చేమో! శ్రీకృష్ణ కమిటీ సభ్యులంతా "మనసా-వాచా" తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు న్యాయమైందని భావించినా, "కర్మనా" అనుకూలంగా లేకుండా-ప్రతికూలంగా కాకుండా తీర్పు లాంటి సూచన ఇవ్వడం అన్యాయం లాంటిదే!
          
ఒక వైపు సూచనలు చేస్తూనే అవే సూచనలు "ఆచరణ యోగ్యమైన వి కావు" అని అనడం కూడా ఎంతవరకు సబబు? "కలిసి ఉండటమే ఉత్తమం" అంటూనే, అదే "అత్యుత్తమమైన మార్గం" అని చెప్తూనే, సమైక్యాంధ్రకు అనుకూలమైన ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే తెలంగాణలో నిరసనలు తప్పక పోవచ్చని, పలు ప్రాంతాల్లో వ్యతిరేకత ఎదురవుతుందని వ్యాఖ్యానించడంలోని ఆంతర్యం ఏంటి? సమైక్యంగా వుండడానికి తెలంగాణ ప్రాంతం వారు అంగీకరించ రనే కదా? అంటే శ్రీకృష్ణ కమిటీ మనసులోని మాట ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాదా? ఇంకొంచెం లోతుగా నివేదికను విశ్లేషిస్తే,"అనివార్యంగా రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే తెలంగాణను, సీమాంధ్రను రెండు రాష్ట్రాలుగా విడదీయాలని, సీమాంధ్ర సొంత రాజధానిని అభివృద్ధి చేసుకునే దాకా హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని" మరో సూచన కనిపిస్తుంది. ఇది కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసిందనాలి కదా? ఏదేమైనా, ‘‘ఇదేమంత అభిలషణీయమైన పరిష్కారం కాదు. అయినా సరే అనివార్యంగా విభజించాల్సి వస్తే అది మూడు ప్రాంతాల ప్రజల ఆమోదంతో జరగాలి’’ అని చెప్పకనే చెప్పింది ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి ఇంతకంటే ఇంకేం కావాలి ప్రభుత్వానికి". ఇతర సూచనలకు కూడా "తెలంగాణ ప్రాంతం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది" అని కమిటీ అభిప్రాయ పడడమంటే, నర్మ గర్భంగా తెలంగాణ ఏర్పాటు చేయమని చెప్పడమే కదా? కాకపోతే, ఎందుకో, ఏ కారణానో, "సందిగ్ధత లేని" తరహాలో మనసులో మాట చెప్పడానికి జంకింది శ్రీకృష్ణ కమిటీ.
          
మొదటి నాలుగు సూచనలలో “ఆచరణసాధ్యం కాని” ఒక సూచన, తెలంగాణలో ఒప్పుకోనందున “అసాధ్యమని భావించిన” మరో సూచన, ఏ ప్రాంతం వారికి “ఆమోదయోగ్యం కాని” ఇంకొక సూచన, నక్సలిజం పెరగడానికి అవకాశమున్నందున-ఏకాభిప్రాయం సాధ్యం కానందున “పనికి రాని” ఒక సూచన చేసిన కమిటీ, మిగిలిన రెండు సూచనలు సార్వజనీన సమ్మతమైన వని చెప్పడానికి సాహసించలేదు. ఒకటి పరిశీలనకు తగిందిగా, మరొక టి సమస్యలకు దారి తీసే దిగా కమిటీ మాటల్లోనే స్పష్టమవుతోంది. "రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి, రాజకీయ సాధికారతకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం-చట్టబద్ధమైన అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం" ఏబై సంవత్సరాల క్రితం చెప్పి వుంటే కొంతైనా అమలయ్యేదేమో కాని ఇప్పుడు అత్యంత అసాధ్యమైన విషయం. 1956 లో చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం స్ఫూర్తితో "తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు" చేయమని సూచించడం కన్నా తిరోగమన మార్గం లేదనాలి. ఇన్నేళ్లు జరగంది, ఇప్పుడు జరుగుతుందన్న నమ్మకం, విశ్వాసం భవిష్యత్ "సీమాంధ్ర నాయకులు" ఎన్ని రాజ్యాంగ భద్రతలు కలిగించినా, తెలంగాణ ప్రజల్లో కలిగించడం జరగని పని. చట్టబద్ధమైన సంప్రదింపులను ప్రాంతీయ మండలి నిర్వహించడం కాని, ప్రాంతీయ మండలికి-రాష్ట్ర ప్రభుత్వానికి-శాసనసభకు మధ్య ఎప్పుడైనా, ఏవైనా అభిప్రాయభేదాలు తలెత్తినపుడు... “గవర్నర్ ఆధ్వర్యంలో అత్యున్నత కమిటీ” ని ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం కాని ఎండమావుల లాంటి ఆలోచనలు. తెలంగాణ ఏర్పాటై, తెలంగాణకు చెందిన వారు ముఖ్యమంత్రి కావాలనుకునే తెలంగాణ ప్రజలకు, తమ ప్రాంతం వాడే మో "కేవలం కేబినెట్ మంత్రిగా" మిగిలి పోవడం ఆమోదయోగ్యమైన ప్రతిపాదన కానే కాదు. ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి లేదా కీలక మంత్రిత్వ శాఖలను తెలంగాణ ప్రాంత నేతలకు కేటాయించడం జరుగు తే, ప్రాంతీయ మండలి అధ్యక్షుడి హోదా ఏం కావాలి? బహుశా ఆచరణ యోగ్యం కాని సూచనలలో అగ్ర భాగాన నిలిచే సూచన ఇదేనేమో!
          
అన్నింటి కన్నా ఘోరమైంది, రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా నామినేటెడ్ పోస్టులో నియమించబడిన గవర్నర్ కు, ఈ ప్రతిపాదన ద్వారా విస్తృత అధికారాలను కట్టబెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం.
          
శ్రీకృష్ణ కమిటీ మాటల్లోనే, తెలంగాణ-సీమాంధ్ర లుగా రాష్ట్రాన్ని విభజించడం, అత్యధిక తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించినట్లన్న భావన వుంది. తెలంగాణ లోని మెజారిటీ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారన్న వాస్తవం కూడా కమిటీ చెప్పింది. "తప్పని పరిస్థితుల్లో-అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైతేనే" రాష్ట్ర విభజన జరగాలని కమిటీ అభిప్రాయపడడం, పరోక్షంగా, అలాంటి పరిస్థితులు కలుగుతాయని హెచ్చరించడమేనా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్న చిరకాల డిమాండ్ నేపధ్యంలో, రాష్ట్ర విభజన జరగకపోతే, ఉద్యమం కొనసాగే ప్రమాదముందని కమిటీ హెచ్చరిస్తుంది. "నేర్పుగా, చాకచక్యంగా, దృఢంగా" ప్రభుత్వం ఉద్యమాన్ని” అదుపు చేయగలిగితే" తప్ప ఉద్యమం ఎదుర్కోవడం కష్టమవుతుంది కనుక, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే ఉత్తమం అని సూచన చేసింది. (…”Likelihood of the agitation continuing in case the demand is not met-unless handled deftly, tactfully and firmly as discussed under option six-consideration has to be given to this option.)
          
రాష్ట్ర విభజన చేసేందుకు నిర్ణయం తీసుకుంటే, రాజ్యాంగంలోని మూడవ ప్రకరణం కింద చెప్పిన విధంగా, ముందుకు సాగితే మంచిదని కూడా కమిటీ సూచించింది. అంటే, రాష్ట్ర రాజకీయ నాయకులతో సంప్రదింపులు అనవసరం అన్న భావన వుంది కదా! ఎలాగూ చిదంబరం డిసెంబర్ తొమ్మిది ప్రకటనలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలయిందని స్పష్టంగా చెప్పారు. కమిటీ అదే సూచించింది. ఇంకెందుకు ఆలశ్యం? పార్లమెంటులో బిల్లు పెడితే ప్రధాన ప్రతిపక్షం బిజెపి-దాని ఎన్డీఏ మిత్ర పక్షాలు సమర్థించడం ఖాయం కనుక, ఆ దిశగా అడుగులు వేస్తే అందరికీ మేలు.ఇంకా అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం అనవసరం!

Wednesday, December 12, 2012

"ఇంటర్వ్యూ" కి చిట్కాలున్నాయి!: వనం జ్వాలా నరసింహారావు


"ఇంటర్వ్యూ" కి చిట్కాలున్నాయి!:
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి ఆదివారం సంచిక (03-03-1991)

అడిగేవాడికి చెప్పేవాడు లోకువని అంటారు. అందుకే, ఇంటర్వ్యూకి వెళ్లడం ఓ భయంకరమైన అనుభవం అనాలి. మొట్టమొదటి సారిగా వెళ్లేవారికి, తయారు కాకుండా ఇంటర్వ్యూకి పొయ్యే వారికీ మరీ ఇబ్బందీ నూ. అలాంటి వారికి కొన్ని చిట్కాలు:

ఉద్యోగం కావాలంటే వ్రాత పరీక్షలు, మౌఖిక పరీక్షలు తప్పనిసరి. ఉద్యోగం కోరుకునే వారి వ్యక్తిత్వం, అభిరుచులు, అర్హతలు, తెలుసుకునేటందుకే ఇంటర్వ్యూలు జరుపుతారు. అందుకే వ్రాత పరీక్ష ఎంత ముఖ్యమైందో, మౌఖిక పరీక్ష కూడా అంతే ముఖ్యమైంది.
·       ఇంటర్వ్యూకి వెళ్లే ముందు, కావాలనుకుంటున్న ఉద్యోగం లాంటిదే చేస్తున్న వారిని కలిసి మాట్లాడి విషయాలు తెలుసుకోవాలి. కల్సిన వ్యక్తి నుంచి పూర్తి సమాచారం దొరకక పోవచ్చునేమోకాని, ఆ ఉద్యోగంలో ఏం చేయాలి, చేయడానికి అర్హతలున్నాయా? లేవా? అనే విషయాలు తెలుసుకోవచ్చు. ఇవెంతో ఉపయోగపడతాయి.

·       వార్తా పత్రికలతో పాటు, విజ్ఞానాన్నందించే మాగజైన్లు, పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలి.

·       పుట్టు పూర్వోత్తరాలు, అభిరుచులు, అనుభవం గురించి తయారు చేసిన బయోడేటాలోని విషయాల గురించి ఏమడిగినా సమాధానం చెప్పగలగాలి.

·       చేరదల్చుకున్న సంస్థ గురించి క్షుణ్ణంగా తెల్సుకుని వెళ్లాలి.

·       ఎందుకీ ఉద్యోగంలో చేరదల్చు కుంటున్నదీ చెప్పగలగాలి.



·       ఇంటర్వ్యూ గదిలోకి ఎలా వెళ్లాలి, ఏం చేయాలి అనే విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.

·       తలుపుపై మెల్లగా శబ్దం చేయాలి. తలుపు తెరిచి, లోనికి ప్రవేశించడానికి అనుమతి కోరాలి. అనుమతి రాగానే, మెల్లగా, అటు కదులుతూ, ఇంటర్వ్యూ పానెల్ లో వున్న వారికి వినబడేట్లు వారిని విష చేయాలి. అలా చేస్తూ సభ్యులందరి వైపూ, ఒక్క సారి త్వరగా చూపు మరల్చాలి. కూర్చోమన్న దాకా వేచి వుండి, ఆ తరువాతే ఉద్దేశించిన కుర్చీలో కూర్చోవాలి. ఇవన్నీ చాలా ముఖ్యం.

·       భయం, సిగ్గు ప్రదర్శించరాదు. ఈ ఉద్యోగం దొరక్కపోతే, ఇలాంటివి ఇంకెన్నో వున్నాయి అనుకొని ధైర్యంగా వుండాలి.

·       సమాధానాలు ఇస్తున్నప్పుడు, ప్రశ్న వేసిన సభ్యుడి వైపే చూడకుండా, అందరి వైపూ చూస్తుండాలి. చెప్పేది వారికి వినపడాలి. అర్థ మవ్వాలి. మధ్య, మధ్య చిరునవ్వు మొహంతో, అసభ్యమైన పదజాలం వాడకుండా జాగ్రత్త పడాలి.

·       కాలిమీద కాలు వేసుకుని కూర్చోవడం, తలను గోక్కొనడం చేయరాదు. ప్రశ్నలడగని వ్యక్తే ఇంటర్వ్యూలో ముఖ్యమైన వ్యక్తి కావచ్చునేమో నని గమనించాలి. సమాధానం తెలియకపోతే అబద్ధాలు చెప్పి బుకాయించ వద్దు. బాగా తెలిస్తే, వచ్చిందంతా క్లుప్తంగా చెప్పాలి. కొద్దిగా తెలిస్తే, అంతవరకే చెప్పాలి. అనవసరంగా వాగ్వివాదానికి దిగ వద్దు.

(ఆంధ్ర జ్యోతి ఆదివారం సంచికలో 21 సంవత్సరాల క్రితం నేను రాసిన వ్యాసం)

దిక్కుతోచని స్థితిలో బ్రాహ్మణులు: వనం జ్వాలా నరసింహారావు


దిక్కుతోచని స్థితిలో బ్రాహ్మణులు


ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణుల పరిస్థితి గతులు రోజు-రోజుకూ క్షీణించి పోతున్నాయి. క్రిస్టియన్ మిషనరీల రాకతో, అంతకు ముందు ముస్లింల పాలనలో, ప్రారంభమైన బ్రాహ్మణ వ్యతిరేకత, బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో బలపడి, స్వతంత్ర భారత దేశంలో పతాక దశకు చేరుకుంది. దశాబ్దం క్రితం మండల కమీషన్ నివేదికతో ఆ వ్యతిరేకత వేళ్లూనుకుని పోయింది. బ్రిటీష్ పాలనలో బ్రాహ్మణులను ఇబ్బందులకు గురిచేయడం యాధృఛ్చికంగా జరిగిందేమీకాదు. భారత దేశ సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణుల పాత్ర ఎంత ప్రాముఖ్యమైందో బ్రిటీష్ వారికి మొదట్లోనే అవగతమైంది. పవిత్రమైన సాంస్కృతిక-సాంప్రదాయక బవబంధాల నేపధ్యంలో దేశ ప్రజలను ఐక్యంగా-సమైక్యంగా మలచడంలో కీలక పాత్ర పోషిస్తున్న బ్రాహ్మణులను కట్టడి చేయాలన్న ఆలోచన ఆంగ్లేయులకు కలగడం సహజం. విభజించి పాలించు అనే సంస్కృతిని అనుసరించే బ్రిటీష్ ప్రభుత్వం, భారత సమాజాన్ని విడదీయాలంటే, మొదలు బ్రాహ్మణులను దెబ్బ తీయాలని భావించింది. అలనాడు ఆ ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే స్వతంత్ర భారత దేశంలో మండల్ కమీషన్ అనుసరించింది. చదువుకున్న బ్రాహ్మణుల మూలాన, భారతదేశంలో తమ గుత్తాధిపత్యానికి ప్రమాదం వుందని భావించింది బ్రిటీష్ ప్రభుత్వం. జాతీయోద్యమంలో పెద్ద ఎత్తున బ్రాహ్మణులు పాల్గొనడమే కాకుండా నాయకత్వం వహించడం వారి అనుమానాన్ని మరింత ధృఢ పరిచింది.

అనాదిగా వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా, పౌరాణిక-ఐతిహాసిక కథనాల ప్రకారం, చాతుర్వర్ణ వ్యవస్థలో అత్యున్నతమైంది బ్రాహ్మణ్యం. బ్రాహ్మణులంటే బ్రహ్మ జ్ఞానం కలవారని. అదొక సామాజిక వర్గం. హైందవ మతంలో, ఆచారంలో, ఒక భాగం. అగ్ర కులంగా, అగ్ర వర్ణంగా బ్రాహ్మణులకు వైదిక కాలం నుంచి కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ వస్తోంది. భారతీయ మనుస్మృతి ప్రకారం క్షత్రియులు (యోధులు, చట్టం అమలు, పరిపాలకులు), బ్రాహ్మణులు (పండితులు, ఉపాధ్యాయులు, అగ్ని పూజారులు), వైశ్యులు (వ్యవసాయదారులు, వ్యాపారులు, బ్యాంకర్లు), శూద్రులు (సేవకులు) అనే నాలుగు "వర్ణాలు" లేదా తరగతులు ఉన్నాయి. నాలుగు వర్ణాలుగా అనాది నుంచీ విభజన జరిగిన వాటిలో మొదటిది బ్రాహ్మణులు కాగా, మిగిలిన మూడింటిని, క్షత్రియులని, వైశ్యులని, శూద్రులనీ పిలవడం మొదలెట్టారు. అగ్ర కులంగా, అగ్ర వర్ణంగా బ్రాహ్మణులకు దక్కిన ప్రత్యేక హోదా నాటి నుంచీ నేటి దాకా ఒక విధంగా కొనసాగుతూనే వుంది. వాళ్ల గొప్పతనానికి, ఆధిపత్యానికి, ఇప్పటికీ గౌరవం లభిస్తున్నప్పటికీ, అనాదిగా వారికి దక్కిన హక్కుల విషయంలో మాత్రం అడుగడుగునా కోతలు ఎప్పటి నుంచో మొదలైంది. ఇతర కులాల వారు, వర్ణాల వారూ చేయలేని అనేక పనులను, వైదిక కర్మ కాండలను చేయగల సామర్థ్యం కేవలం ఒక్క బ్రాహ్మణులకే నేటికీ వుందనడంలో అతిశయోక్తి లేదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే జ్ఞాన సముపార్జన వాళ్లకే చాలా కాలం వరకూ పరిమితమై పోయింది. కాలానుగుణంగా వస్తున్న మార్పులలో ఇతర వర్ణాల వారు, కులాల వారు, జ్ఞాన సముపార్జన విషయంలో వీరితో పోటీ పడి నెగ్గుకొస్తున్నప్పటికీ, సాంప్రదాయిక వైదిక విద్యా సముపార్జన మాత్రం ఇంకా వీరి అధీనంలోనే చాలా వరకు వుందనాలి. వాళ్లకు సంఘంలో వున్న గౌరవం వల్లనైతేనేమి, సాంప్రదాయకంగా వారికి లభిస్తున్న విద్య వల్ల నైతేనేమి, బ్రాహ్మణులు మత పరమైన వ్యవహారాలనే కాకుండా లౌకిక వ్యవహారాలను కూడా చక్కదిద్దే స్థాయికి ఎదిగారు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటు పడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదాలలో ప్రావీణ్యం కల వారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభిస్తోంది. వారు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వేద-పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై చక్కటి అవగాహన కలిగి ఉంటారు.

బ్రాహ్మణులను "విప్ర" ("ప్రేరణ"), లేదా ""ద్విజ"" ("రెండుసార్లు జన్మించిన") అని కూడా పిలుస్తారు. ఆధునిక వాడుక భాషలో అందరూ "బ్రాహ్మణులు" అయినప్పటికీ, ప్రాంతీయ మత ఆచార సాంప్రదాయ వ్యవహారాలు-వేద పాఠశాలల (శాఖలు) వలన వారు వివిధ ఉప కులాల వారీగా విభజించబడ్డారు. బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా ఆలయం పూజారులు అయినప్పటికీ, అందరు బ్రాహ్మణులు అగ్ని (హోత్ర) పూజారులు కారు. ఇటీవలి కాలంలో కొద్ది మంది బ్రాహ్మణులు మాత్రమే వేద విద్య నేర్చుకోవడం చేస్తున్నారు. మరి కొందరు పౌరోహిత్య విధులు నిర్వర్తిస్తున్నారు. పురాతన భారత సామాజిక నిర్మాణం పతనం కారణంగా, వివిధ వృత్తుల్లో, ఉద్యోగాలలో బ్రాహ్మణులు కూడా తమ అవకాశాలు వెతుక్కుంటున్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు బ్రాహ్మణుల వలసలు కూడా సాగుతున్నాయి.

రామాయణ కాలం నాటి బ్రాహ్మణులు బాహ్యేంద్రియాలను, అంతరేంద్రియాలను, జయించారు. పరులను వంచించాలనే దురాచారానికి దూరంగా వుండేవారు. ఎటువంటి అనాచారానికి లోనుకాకుండా, సత్యాన్నే పలుకుతూ, భగవత్ కథలనే వల్లించి కాలయాపన చేస్తూ, యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ, నిర్మల బుద్ధితో వుండేవారు. వేదాల్లో చెప్పిన కర్మ కార్యాలను నెరవేరుస్తూ, అడిగిన వారికి లేదనకుండా శక్తికొలది దాన ధర్మాలు చేస్తుండేవారు. ఆరంగాల (శిక్ష-వ్యాకరణం-ఛందస్సు-నిరుక్తం-జ్యోతిష్యం-కల్పం) వేదాధ్యయనం చేయడం వారికి నిత్య కృత్యం. పెద్ద మనసుతో పుణ్య కార్యాలను చేస్తూ, దేవర్షులతో-మహర్షులతో సమానంగా, సూర్య చంద్రుల తేజస్సుతో-వర్ఛస్సుతో భగవధ్యానం చేస్తూ, సదాచార సంపన్నులై మెలగుతుండేవారు. అలాంటి వారు ఇప్పటికీ పలువురు వున్నారు. కాకపోతే ఆధునిక రాజకీయ, సామాజిక మార్పులకు, ఆర్థిక ఇబ్బందులకు అనుగుణంగా ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. బ్రాహ్మణులను ద్విజాతులని, వేదషడంగ పారగోత్తములని, అహితాగ్నులని, సహస్రదులని, మహామతులని, సత్యవచస్కులని, హిమకర మిత్ర తేజులనిఋషులని ఆంధ్ర వాల్మీకి రామాయణ గ్రంధ కర్త శ్రీమాన్ వావిలికొలను సుబ్బారావు పోల్చారు. వారినే, హృష్ఠ మానసులని, శాస్త్ర చింతన పరాయణులని, స్వస్వతుష్టులని, త్యాగశీలురని, భూరి సంచయులని వర్ణించారు తన రామాయణంలో. తమ వర్ణానికి, ఆశ్రమానికి శాస్త్రోక్తమైన విహిత కర్మ ఏదో, దానినే బ్రాహ్మణులు శ్రద్ధతో ఆచరిస్తూ, విద్యా దానంలో, అధ్యయనంలో ఉత్తములై , వశ్యేంద్రులై, జితమనస్కులై, దానానికి పాత్రులై వుండేవారు.

రాజకీయంగా అధికారం మరో అగ్ర వర్ణం వారైన క్షత్రియుల చేతుల్లో వున్నప్పటికీ, అమాత్యులుగా రాజులకు సలహాలనిచ్చే బాధ్యతను-హక్కును వారే కలిగి వుండడం కూడా అనాదిగా వస్తోంది. ఆంగ్లేయుల పాలనలో, బ్రాహ్మణులు, మేధ పరమైన తమ ఆధిపత్య నాయకత్వాన్ని పదిలంగా కాపాడుకున్నారు. వారి ఆ ఆధిపత్యం, తొలినాళ్లలో, ఆంగ్లేయుల ప్రభుత్వంలో ప్రాముఖ్యత సంతరించుకున్న ఉద్యోగాలలో పనిచేయడంతో ప్రారంభమై, జాతీయోద్యమంలో కీలక నాయకత్వం చేపట్టడం దాకా పోయింది. భారత దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత కూడా వారి ఆధిపత్యం కొనసాగింది చాలా రోజుల వరకు. అధికారంలో వున్న భారత జాతీయ కాంగ్రెస్  పార్టీలో కీలక పదవులు పొందడంలోను, కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భూమిక పోషించడంలోను బ్రాహ్మణులే ముందుండే వారు. వీరి ఈ ఎదుగుదలను సహించలేని కొన్ని రాష్ట్రాలలో-ముఖ్యంగా దక్షిణాదిలో, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి. కాకపోతే, ఆ ఉద్యమాల ప్రభావం వారి హక్కులను హరించడం వరకే పరిమితమైనాయి తప్ప, పూజారులుగా, అర్చకులుగా, వేద పండితులుగా, కర్మకాండలు నిర్వహించే వారిగా, సంబంధిత కార్యక్రమాల నిర్వాహకులుగా కొనసాగే విషయంలో పెద్ద నష్టం జరగలేదు. వివాహాలలో, అంత్యక్రియలలో, ఇతర పూజా పునస్కారాలలో వారు లేకుండా వ్యవహారం నడవడం కష్టమే ఇప్పటికీ. క్రమేపీ, వీటికే పరిమితమై పోవడంతో, గతంలో మాదిరి రాజకీయంగా కాని, సామాజికంగా కాని, ఆర్థికంగా కాని ఎదుగుదలకు నోచుకోలేక, బీదరికంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది చాలామందికి. దీనికి తోడు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అనుదినం చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వారిని కడు ఇబ్బందులకు గురి చేయసాగింది.

బ్రిటీష్ ప్రభుత్వ పాలనలో, జాతీయోద్యమంలో కీలక పాత్ర వహించిన బ్రాహ్మణుల నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించడానికి, ఒక వైపున సైద్ధాంతికంగా వారిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ, మరో వైపున బ్రాహ్మణేతర అగ్ర కులాల వారిని, బ్రాహ్మణులతో సమానంగా పరిగణించబడాలన్న డిమాండుతో తెర పైకి తేవడం జరిగింది. ఆ తరువాత కాలంలో అదే పద్ధతిని ముస్లింల విషయంలో కూడా అవలంబించింది బ్రిటీష్ ప్రభుత్వం. భారత దేశ చరిత్రను తిరగ రాసే ప్రయత్నంలో, బ్రాహ్మణులను, ఇతర వర్ణాల వారికి వ్యతిరేకులుగా, పీడించే వారిగా, దుర్మార్గులుగా చిత్రించే ప్రయత్నం కూడా చేసింది. భారత సమాజాన్ని అభివృద్ది పరచడంలో బ్రాహ్మణులు వహించిన పాత్రను తక్కువ చేసి చూపడం జరిగింది. ఇదంతా కావాలనే చేసింది నాటి ప్రభుత్వం. ఆ ప్రయత్నాలే ఆ తరువాత స్వతంత్ర భారత దేశంలో కూడా మరో రూపంలో కొనసాగాయనవచ్చు.

సమాజాన్ని ఐక్యంగా, సమైక్యంగా వుంచడానికి బ్రాహ్మణులు అనాదిగా చేసుకుంటూ వస్తున్న అవిరళ కృషిని, మరుగుపర్చి, బ్రాహ్మణ వ్యతిరేకతను ప్రోత్సహించింది నాటి బ్రిటీష్ ప్రభుత్వం. ఆ వ్యతిరేకతే దరిమిలా కొనసాగి, అరవై ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో మరింత బలపడి, చరిత్రలో కనీ-వినీ ఎరుగని రీతిలో, బ్రాహ్మణులను అణగ దొక్కే స్థాయికి తీసుకుపోయింది. వాస్తవానికి శతాబ్దాల కాలంగా బ్రాహ్మణ, బ్రాహ్మణే తరులు కలిమిడిగా, అభివృద్ధి చేసిన సామాజిక, రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. ఒకరిని మరొకరు దూషించుకునే స్థితికి చేరుకుందిప్పుడు. ఈ మార్పుల వల్ల వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా కులాల ప్రాధాన్యత వచ్చింది. రాజకీయ, సామాజిక, మతపర, సాంస్కృతిక వ్యవహారాలలో కులాల ప్రస్తావన లేకుండా ఏదీ జరగలేని స్థితికి చేరుకున్నాం. బ్రాహ్మణ వ్యతిరేకత చివరకు కులాల వ్యతిరేకతకు దారితీసింది. ఒక కులం వారు, మరో కులాన్ని దూషించే పరిస్థితులొచ్చాయి. అగ్ర కులాలని, వెనుకబడిన కులాలని, దళితులని బేధాలొచ్చాయి. బ్రాహ్మణ ద్వేషం బాగా ప్రబలిపోయింది.

చివరకు జరిగిందేంటి? ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి పోయారు. వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని కోల్పోయారు. వున్న భూమి వ్యవసాయ భూపరిమితి చట్టం కింద ప్రభుత్వానికి పోయింది. రోజు గడవడం కష్టమైంది. ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయింది. వీటికి ఒకనాడు లభించిన గౌరవ మర్యాదలు కూడా కరవై పోయాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బ్రాహ్మణుల స్థితిగతులపై అధ్యయనం చేసిన ఒక సంస్థ, పలు ఆసక్తికరమైన నిజాలను వెలుగులోకి తెచ్చింది. రాష్ట్రంలోని దాదాపు పురోహితులందరూ దారిద్ర్యరేఖకు దిగువన వున్నవారేనట. సుమారు 55 శాతం మది బ్రాహ్మణులు జాతీయ సగటు వ్యక్తిగత ఆదాయం కంటే తక్కువగా, దారిద్ర్యరేఖకు దిగువగా జీవనం సాగిస్తున్నారు. అనాదిగా ఆచారంగా వస్తున్న వారి దుస్తుల విషయం కాని, పిలక జుట్టు కాని, ఆచార వ్యవహారాలు కాని, బ్రాహ్మణులను హేళనకు గురి చేస్తున్నాయని అధ్యయనంలో తేలింది. రిజర్వేషన్లు, దిగజారుతున్న ఆర్థిక స్తోమత, వారిని లౌకిక ఉద్యోగాలకు దూరం చేసింది. పాఠశాలలో, కళాశాలలో చదువుకునే బ్రాహ్మణుల సంఖ్య దిన-దినం తగ్గిపోసాగింది. 5-18 సంవత్సరాల వయసున్న బ్రాహ్మణ బాల-బాలికలలో సుమారు 44 శాతం మంది ప్రాధమిక స్థాయిలో, మరో 36 శాతం మంది హయ్యర్ సెకండరీ స్థాయిలో పాఠశాల విద్యకు స్వస్తి చెపుతున్నారు. బ్రాహ్మణే తరుల ఆదాయంతో పోల్చి చూస్తే, నూటికి తొంబై శాతం మంది ఆదాయం చాలా తక్కువ. అనాథ బ్రాహ్మణుల శాతం అఖిల భారత సాధారణ కేటగిరీ సగటు కంటే చాలా ఎక్కువ. ఇంటర్మీడియట్ స్థాయి దాటి చదువు కొనసాగించేవారు దాదాపు లేనట్లే!

కడు బీదరికంతో అల్లల్లాడి పోతున్న పలువురు బ్రాహ్మణులు, పల్లెల నుంచి పట్టణాలకు ఉపాధి కొరకు వలసపోయే పరిస్థితులొచ్చాయి. చేతికందిన పని వెతుక్కుంటున్నారు. మొదట్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడిపోవచ్చని భావించారు. న్యాయవాద వృత్తిలోనో, వైద్య వృత్తిలోనో చేరుదామని కలలు కన్నారు. అదీ అందని ద్రాక్ష పండే ఐంది. రిజర్వేషన్ల మూలాన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు దొరక కుండా పోయాయి. ప్రయివేట్ గా ఏదన్నా చేసుకుందామంటే ఆర్థిక స్థోమత అడ్డొచ్చింది. చివరకు గృహ సంబంధమైన చాకిరీ చేసే వివిధ వృత్తులలో స్థిరపడి పోవాల్సి వచ్చింది. బ్రాహ్మణులలో నిరుద్యోగ శాతం దాదాపు 75 మేరకు చేరుకుంది. ఆ మధ్యన అమెరికా దేశానికి చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్, బ్రాహ్మణులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. ఒకనాడు ప్రత్యేక హక్కులు కల వర్గంగా భావించబడిన బ్రాహ్మణులు, రారాజుల కనుసన్నలలో జీవనం సాగించిన బ్రాహ్మణులు, గత కొన్ని దశాబ్దాలుగా, భారత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాల మూలంగా, కనీ వినీ ఎరుగని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ జర్నల్ పేర్కొంది. జాతీయ ఆర్థిక జీవన స్రవంతిలో బ్రాహ్మణుల భాగస్వామ్యం లేకుండా పోతోందని కూడా రాసింది. ఒక నాడు ఇండియన్ సివిల్ సర్వీసులలోను, ఆ తరువాత ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులలోన, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అధికార స్వామ్యంలోను కీలకమైన స్థానాలలో వున్న బ్రాహ్మణులను, రిజర్వేషన్లు, వాటికి దూరం చేశాయని కూడా జర్నల్ రాసింది. చివరకు రైల్వే కూలీలుగా, రిక్షా కార్మికులుగా, సులభ శౌచాలయ నిర్వాహకులుగా కూడా పని చేస్తున్నారు పలువురు బ్రాహ్మణులు.

ఎప్పుడో, వేల ఏళ్ల క్రితం, అప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారన్న నెపంతో, ఈ తరం బ్రాహ్మణులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యమా? దోపిడీ చేసిన వారు, దోపిడీకి గురైన వారు అంతరించి పోయారు. ఇప్పుడున్నది సమ సమాజం. అందరూ భారత రాజ్యాంగ కింద సమాన హక్కులు కలవారే అంటున్నాం. అలాంటప్పుడు, సమాజంలోని ఒక వర్గం వారిని బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసమా? ప్రత్యేక హక్కులు కావాలని వారనడం లేదు. అడగడమూ లేదు. తమను అందరితో సమానంగా చూడమనే అడుగుతున్నారు. ఆర్థికంగా చితికి పోయిన తాము కూడా వెనుకబడిన వర్గాల వారిమే అంటున్నారు. అందరితో పాటు వారినీ సమానంగా చూడడం సమాజం కర్తవ్యం!