Sunday, September 29, 2019

కబంధుడి చేతులు నరికిన రామలక్ష్మణులు ..... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-80 : వనం జ్వాలా నరసింహారావు


కబంధుడి చేతులు నరికిన రామలక్ష్మణులు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-80
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (29-09-2019)
         లక్ష్మణుడితో ఆతడి మనసు గట్టిపడే విధంగా మాట్లాడుతున్న రాముడిని చూసి కబంధుడు తనను చూసి వారెందుకు భయపడుతున్నారని అడిగాడు. వాళ్ళను తన నోట్లో పడేట్లు బ్రహ్మ చేశాడని కూడా అన్నాడు. ఈ రాక్షసుడు మహా బలవంతుడనీ, భయంకర దేహంకల దుష్టుడనీ, ప్రపంచమంతా గెలవగల పరాక్రమం కలవాడిగా కనిపిస్తున్నాడనీ, కాబట్టి తమను మింగుతాడు కాని వదలడని లక్ష్మణుడు అంటాడు. కబంధుడిని ఉద్దేశించి మాట్లాడుతూ, “మహాత్మా! రాజులైనవారు తమను తాము కాపాడుకోలేక, ఎదిరించి యుద్ధం చేయలేక వున్నవారిని, యజ్ఞమధ్యంలోకి తెచ్చిన పశువుల్లా హింసించడం నీచకార్యం, అది న్యాయం కాదు” అంటాడు.

         లక్ష్మణుడు చెప్పిన మాటలు విని ఆ రాక్షసుడు, రామలక్ష్మణులను నోట్లో వేసుకుందామని ఆలోచించే లోపలే వాడి తత్త్వాన్ని అర్థం చేసుకున్న వారిద్దరిలో రామచంద్రమూర్తి వాడి కుడిచేయి నరికాడు. రాముడికి కుడిపక్కన వున్న లక్ష్మణుడు తన కత్తి దెబ్బతో ఎడమ చేయి నరికాడు. ఇలా నరకగా ఆ రాక్షసుడు భూమ్యాకాశాలు, దిక్కులు దద్దరిల్లేట్లు నేలకొరిగాడు.

         దుఃఖంతో కూడిన ఆ రాక్షసుడు రెండు చేతులూ కోల్పోయి వీరిద్దరూ ఎవర్నీ, ఈ అడవిలో వాళ్లకేమిపని వుందనీ అని ప్రశ్నించాడు. జవాబుగా లక్ష్మణుడు, వాళ్ల చరిత్ర చెప్పాడు ఇలా.

         “ఈ పుణ్యాత్ముడు ఇక్ష్వాకు వంశంలో పుట్టాడు. పేరు శ్రీరాముడు. ఈయన మా అన్న. నా పేరు లక్ష్మణుడు. దేవతల మహిమకల మా అన్న తన భార్యతో దండకారణ్యంలో వున్నప్పుడు దుండగులైన రాక్షసులు మాయచేసి చంద్రవదన అయిన ఆయన భార్య సీతమ్మను దొంగిలించగా ఆమెను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. నువ్వెవరివి? ఇలా మొండెం మాత్రమె ఆకారంగా ఎందుకున్నావు? రొమ్ములో నోరుందికాని పిక్కలు ఎందుకు లేవు? ఎందుకిలా పొర్లుతున్నావు?”. ఇది విన్న ఆ రాక్షసుడు దేవేంద్రుడి మాటలు స్మరించి, తనకు శాపమోక్షణ కాలం దగ్గరికి వచ్చింది కదా అని సంతోషించి ఇలా జవాబిచ్చాడు లక్ష్మణుడికి.

         “ఓ రాఘవులారా! మీకు స్వాగతం. నా భాగ్యం పండడం వల్ల ఈ సమయంలో మిమ్మల్ని ఇక్కడ చూడగలిగాను. చేతులు పోగొట్టుకున్నాను. చేతులు పోవడం నా అదృష్టం వల్లే. శ్రీరామచంద్రా! గర్వం, వినయం తప్పిన పనులు చేయడం వల్లే నాకిలాంటి వికార స్వరూపం కలిగింది. యథార్థం చెప్తా వినండి”.


         “రామచంద్రా! నేను మొట్టమొదట సూర్యచంద్రేంద్రులతో సమానమైన సుందరాకారం కలిగి, ప్రపంచంలోనే అందగాడినని పెరుతెచ్చుకున్నాను. అలాంటి ఆకారం కల నేను గర్వంతో మునులను అరణ్యవాసులను భయపడేట్లు అనేకరకాల దుఃఖపెట్తూ, తమోగుణం ప్రకోపించడం వల్ల దుర్బుద్ధితో స్థూలశిరుడు అనే మునిని నింద్య రూపంలో భయపెట్టాను. ఆ ఋషీశ్వరుడు ‘ఓరీ! పాపాత్ముడా! నింద్యమైన ఈ రూపంలో నన్ను బెదిరిస్తావా? నీకు ఈ రూపమే శాశ్వతం కలుగుగాక!’ అని శపించాడు. శాపవిమోచనం చెప్పమని ప్రార్థించగా ఈ అడవిలో ఎప్పుడు రామచంద్రుడు నీ చేతులు తెగనరికి దహిస్తాడో అప్పుడే నీకు శాపం తొలగిపోయి, నీ పూర్వ రూపం పొందుతావు అని శలవిచ్చాడు ఆ మునీశ్వరుడు”.

“కబంధ రూపం రావడానికి మరో కారణం వుంది. నేను శ్రీయుతుడైన తనువు వల్ల కలిగినవాడిని. ఈ వికారాకారం రావడానికి ఇంద్రుడి కోపమే కారణం. ఆయనకు నామీద కోపం ఎందుకొచ్చిందంటారా? నేను గొప్ప తపస్సు చేసి దీర్ఘాయువు కలిగేట్లు బ్రహ్మ వరం పొందాను. ఆ కారణాన నాకేం భయం లేదని భావించి పొగరుతో బుద్ధిహీనుడనై ఇంద్రుడిని యుద్ధానికి రమ్మని పిలిచాను. ఇంద్రుడు వజ్రాయుధం వేటుతో నా తల, రొమ్ము, కడుపు, తొడలు కుదించుకు పోయేట్లు అణచి వేశాడు. నేనప్పుడు, నాకీ దురవస్థకన్నా మరణమే మేలని చంపమని ప్రార్థించాను. ఎంతవేడుకున్నా బ్రహ్మదేవుడి వాక్కు వృధాకాకూడదని నన్ను చంపలేదు. చావకుండా, బతకలేకుందా అయింది నా పరిస్థితి. రెంటికీ చెడ్డ వాడినయ్యాను. నేనెలా బతకాలయ్యా? అని అడిగితే, ఆమడ పొడుగున్న చేతులు, కడుపులో నోరు అనుగ్రహించాడు. వాతి సహాయంతో ఏనుగులను, పులులను, సింహాలను, ఇతర మృగసమూహాలను చంపి తింటున్నాను. లక్ష్మణుడితో సహా ఎప్పుడు రాముడు నా చేతులను నరుకుతాడో అప్పుడు మళ్లీ నేను స్వర్గానికి వస్తానని చెప్పి ఇంద్రుడు పోయాడు”.

“ఇక అప్పటి నుండి ఈ వికార స్వరూపం పోవడానికి ప్రయత్నం చేస్తూ, ఎవరు కనపడ్డా పట్టుకుని, రాముడు చిక్కకపోతాడా అని ఆసతో ఎదురు చూస్తున్నాను. మహాత్మా! నన్ను యుద్ధంలో ఎంత గొప్ప పరాక్రమవంతులైనా చంపలేరు. కాబట్టి ఆ మునీశ్వరుడు చెప్పిన రాముడివి నువ్వే. మీకు నేను సహాయం చేస్తాను. మీ కార్యం సాధించగల స్నేహితుడిని చూపిస్తాను. నన్ను అగ్నితో దహించు” అని అంటాడు కబంధుడు. తాను జనస్థానంలో వుండగా రావణుడు అనే రాక్షసుడు తన భార్యను దొంగిలించాడనీ, వాడి పేరు తప్ప ఇతర వివరాలేవీ తమకు తెలియవనీ వాడితో చెప్పాడు రాముడు. “వాడెక్కడ వుంటాడో తెలిస్తే చెప్పు. మనస్సు వికలం చెంది అడవుల్లో తిరుగుతున్నాను. మేము ఎవరికైనా ఉపకారం చేస్తాం కానీ, అపకారం చేయం. నువ్వు కోరినట్లు నీకు ఉపకారం చేస్తాం. మామీద దయతలచి అలక్ష్యం చేయకుండా, వాడి స్థితిగతులు చెప్పు. నిన్ను నీ మాట ప్రకారమే దహనం చేస్తాను. నీ ద్వారా మాకు తెలియాల్సింది జానకిని అపహరించినవాడేవాడు?

తన దేహాన్ని వేగంగా దహించి వేస్తే సీతను దాచి వుంచిన రహస్యమంతా దాచకుండా చెప్తానంటాడు కబంధుడు రాముడితో. ఆ పని సూర్యాస్తమయం లోపే చేయమంటాడు. వాడి విషయం తెలిసినవాడు ఒకడున్నాడనీ, అతడితో ధర్మబద్ధంగా స్నేహం చేయమనీ, అతడు ప్రపంచంలో తిరగని చోటు లేదనీ, అతడు రాముడికి ఉపకారం చేస్తాడనీ చెప్పాడు కబంధుడు.

ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన బీహెచ్ఇఎల్ పాఠశాల .... జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-9 : వనం జ్వాలా నరసింహారావు


ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చిన బీహెచ్ఇఎల్ పాఠశాల
జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-9
వనం జ్వాలా నరసింహారావు
          నాతో పాటే బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో అధ్యాపక ఉద్యోగంలో చేరిన వాళ్ల పేర్లు చాలావరకు గుర్తున్నాయి. వీరిలో కొందరు నాతోపాటు, నాకంటే ముందు చేరిన వాళ్లయితే, నేను చేరిన ఏడాది-రెండేళ్లకు చేరిన వాళ్లు కొందరున్నారు. నా సహాధ్యాయులు  చాలా మందితో నాకు ఇప్పటికీ కాంటాక్ట్ వుంది. పౌర సంబంధాల వృత్తిలో వున్న నాకు “get connected and stay connected” అన్న PR సిద్దాంతం మీద పూర్తి నమ్మకం వుండడం వల్ల దాదాపు చాలామంది పాత స్నేహితులతో అనుబంధం కొనసాగిస్తున్నాను. మేడం పద్మావతి గారు జీవించినంత కాలం దాదాపు ప్రతి ఏడాది బీహెచ్ఇఎల్ పాఠశాలకు చెందిన ఎవరో ఒకరి ఇంట్లో ప్రతి ఏటా ఒకనాడు కలిసి భోజనం చేసే అలవాటు కూడా వుండేది. ఈ మధ్యకాలంలో దాదాపు ప్రతి సంవత్సరం పాఠశాల ఆవరణలో పాత అధ్యాపక-విద్యార్ధి బృందాలు కలిసే ఆనవాయితీ కూడా కొనసాగుతున్నది. వీలున్నప్పుడల్లా నేను వాటికి హాజరవ్వడం జరుగుతుంటుంది. పాఠశాల విద్యార్థులు కూడా చాలామంది నాతో టచ్ లో వున్నారు.

         పాఠశాల అధ్యాపకులలో, కార్యాలయ సిబ్బందిలో గుర్తున్న కొన్ని పేర్లు:
         జగన్మోహన్ రావు, డేవిడ్, సాంబాబ్ (పీటీ), ఇన్నయ్య (పీటీ), నాగేశ్వర్ రావు (పీటీ), ఎస్ఏఏమ్వీ ప్రసాద్ రావు, ఆణంగరాచారి, జోపట్, యువీ రమణ, జీ సుబ్రహ్మణ్యం, పీ సుబ్రహ్మణ్య శర్మ, సూర్యప్రకాష్, విశ్వనాథం,  ఆహోబిలరావు, జయచంద్రన్, కమలాకర్, సీహెచ్ విశ్వేశ్వర్ రావు, రామ శర్మ, హరి సర్వోత్తం రావు, రెడ్డి ప్రసాద్, ఆంజనేయులు, ఎమ్మెస్ఎస్ నాగేశ్వర్ రావు, రఘుపతి, ఆఫీస్ కు చెందిన సుందరేశ్, విజయరాజు, సుబ్రహ్మణ్యంలు, సీవసంత (వైస్ ప్రిన్సిపాల్), డబ్ల్యు పార్వతి, ప్రభావతి, యానీ పద్మారావు, శ్యామల, జ్యోత్స్నా పాధ్యే, లాల్, అలీ, అక్కలక్ష్మి, సుబ్బలక్ష్మి, ఉషాథాకూర్, జమీలా సయీద్బిల్కీస్ అహ్మద్, జైనాబ్, అన్సా అల్లాద్దీన్, మణిప్రభ, మణిపుష్ప, గృహలక్ష్మి, పార్వతి, లలిత, అరుణా ఊర్మిళ, అరుణా వర్మ, చంద్ర ముఖి, మేరీ గ్రేస్, సుశీల, హితవచన, సత్య వాణి, ఝాన్సీ, ఎలెన్ పాండా, శోభ, ఇంద్రాణి, జయా చంద్ర శేఖర్, సుహాస్ చౌధురి, రాజకుమారి, వత్సలాదేవి, శైలజా బాలకృష్ణన్, తెలుగు టీచర్ రాజకుమారి, దేవకరుణ, మెశాక్, అంబిక శామ్యూల్, లిల్లీ రాయ్, నాగమణి, ఫాతిమా, ఉత్తర, దేవి, శేషు బాయి, స్వరాజ్య లక్ష్మి, రమణి, దీనా ప్రకాష్, రాజేశ్వరి, టీ పద్మ, రజనిరెడ్డి, భాస్కర్ రెడ్డి, వైద్యనాథన్  ... తదితరులు.

         జగన్మోహన్ రావు గారు సైన్స్ సబ్జెక్ట్ లోనే కాకుండా తెలుగు సాహిత్య ప్రియులు. తెలుగులో కవిత్వం అలవోకగా రాయగల సమర్థులు. చాలా వ్యాసాలూ, కథానికలు, కవితలు రాశారు. వాటిలో కొన్ని ప్రచురితమైనవి కూడా వున్నాయి. డేవిడ్ ఒక విలక్షణమైన అధ్యాపకుడు. ఎవరికీ తలొగ్గని మనస్తత్వం ఆయనది. పాఠశాలకు ఒక అసోసియేషన్ స్థాపించుకుంటే బాగుంటుందని ఆలోచన చేసిన వారిలో జగన్మోహన్ రావు, డేవిడ్, ఇన్నయ్య, నాగేశ్వర్ రావు, రామశర్మ, నేను ముందు వరసలో వున్నాం. జయా చంద్ర శేఖర్, పార్వతి, అక్కలక్ష్మి లాంటివారు బాగా తోడ్పడ్డారు. అసోసియేషన్ రిజిస్టర్ చేద్దామనుకున్నాం కాని వీలు పడలేదు. చివరకు ప్రతి సంవత్సరం ఒకరం కన్వీనర్ గా దాన్ని నడిపించాం. మొదటి ఏడాది జగన్మోహన్ రావు, తరువాత డేవిడ్, తరువాత నేను అలా కొనసాగం. మా ప్రధానమైన పోరాటం ఆరోజుల్లో, బీహెచ్ఇఎల్ తో సమానంగా హయ్యర్ సెకండరీ స్కూల్ సిబ్బందికి కూడా వేతనాలు తదితర బెనిఫిట్స్ ఇవ్వాలని. స్కూల్ సిబ్బందికి కూడా బోనస్ ఇవ్వాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని సుదీర్ఘ పోరాటం చేసాం. చివరికి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించాం. కన్నభీరన్ మా అడ్వొకేట్. చివరకు కొన్ని అంశాలలో విజయం సాధించాం. ఉదాహరణకు గ్రాట్యుటీ సాధించగలిగాం. కాకపోతే కొంచెం ఆలశ్యంగా.  

         (నేను బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు నాకు టర్మినల్ బెనిఫిట్స్ ఏవీ ఇవ్వలేదు. కేవలం నా ప్రావిడెంట్ ఫండ్ మాత్రం ఇచ్చారు. ఆ తరువాత నేను గవర్నర్ కుముద్ బెన్ జోషి దగ్గర ఆమె అధ్యక్షతన వున్న చేతన స్వచ్చంద సంస్థకు ప్రాజెక్ట్-అడ్మినిస్త్రేటివ్ అధికారిగా పని చేశాను. నాలుగేళ్లు ఆ ఉద్యోగం చేసిన తరువాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 1989-90 సంవత్సరంలో ఆయనకు పీఆర్వో గా వెళ్లాను. నన్ను రాజ్ భవన్ చెన్నారెడ్డి దగ్గరకు డెప్యుటేషన్ మీద పంపించింది. కాని పీఆర్వో ఉద్యోగం అయిపోయిన తరువాత వెనక్కు వచ్చేలోపు చేతన ప్రాజెక్ట్ అధికారి ఉద్యోగాన్ని, తదిర ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్లు చేతన యాజమాన్యం నాటి గవర్నర్ కృష్ణకాంత్ అధ్యక్షతన సమావేశమై నిర్ణయించింది. ఈ వివరాలన్నీ మరోమారు ప్రస్తావిస్తాను. అప్పుడు ఉద్యోగం పోగొట్టుకుని జీతం లేకుండా ఎలా గడపాల్నా అని ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు పోస్టులో బీహెచ్ఇఎల్ నుండి రు. 10,000 లకు చెక్కు వచ్చింది. విప్పి చూస్తే అది నా గ్రాట్యుటీ కింద పంపుతున్నట్లు కవరింగ్ లెటర్లో వుంది. అసలు విషయం ఏంటని విచారిస్తే, కోర్టు విచారణలో స్కూల్ సిబ్బందికి కూడా గ్రాట్యుటీ ఇస్తున్నట్లు బీహెచ్ఇఎల్ యాజమాన్యం పేర్కొన్నందున, అప్పటికి స్కూల్ ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిన వాడిని నేను ఒక్కడినే అయినందున, నాకు గ్రాట్యుటీ చెల్లించినట్లు చెప్పడానికి చెక్కు పంపారు. అనుకోకుండా అలా నాకు లాభం జరిగింది).

         అసోసియేషన్ పక్షాన స్కూల్ సిబ్బందిమి ఒకటి రెండు పర్యాయాలు బీహెచ్ఇఎల్ మెయిన్ గెట్ దగ్గరకు పోయి ధర్నా కూడా చేశాం. కాకపోతే మా అధ్యాపక బృందంలో కొద్ది మంది తప్ప చాలా మంది పద్మావతి గారి మీద భయంతోనో, భక్తితోనో ఉద్యమంలో కలిసి రాకపోయేవారు. మనసు మా పక్షాన, ఫిజికల్ గా ఆమె పక్షాన వుండేవారు. బీహెచ్ఇఎల్ మీద పోరాటం చేసిన ఒకానొక సందర్భంలో నన్ను చైర్మన్ పిలిపించారు. పోరాటం చేయడం శ్రేయస్కరం కాదన్నారు. నాకు కంపెనీలో ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. అందరికీ బెనిఫిట్స్ ఇవ్వాలి కాని నా ఒక్కడికి కాదని తేల్చి చెప్పాను నేను అప్పట్లో.

         బీహెచ్ఇఎల్  హయ్యర్ సెకండరీ స్కూల్ సిబ్బందికి కూడా బీహెచ్ఇఎల్ సిబ్బందికి ఇచ్చినట్లే ఇళ్ళ జాగాలు ఇవ్వాలని డిమాండ్ చేసినా ఫలితం లేకపోతే, మేమే ఒక కోఆపరేటివ్ సొసైటీ స్థాపించాం. దానిపేరు “పద్మశ్రీ బీహెచ్ఇఎల్ స్కూల్ హౌజింగ్ సొసైటీ”. దాని వల్ల పెద్దగా ఫలితం లేకపోయినా చాలా కాలం దాన్ని విజయవంతంగా నడిపాం.

Friday, September 27, 2019

సెప్టెంబర్ 17, 1948 పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం .... (స్వర్గీయ మందుముల నరసింగరావు మాటల్లో) : వనం జ్వాలా నరసింహారావు


సెప్టెంబర్ 17, 1948 పూర్వపు హైదరాబాద్ రాష్ట్రం
(స్వర్గీయ మందుముల నరసింగరావు మాటల్లో)
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (27,28 సెప్టెంబర్, 2019)
మందుముల నరసింగరావు ఆరు దశాబ్దాల రాష్ట్ర జాతీయోద్యమ ప్రజా జీవితంలో (1918-1976) విద్యార్థిగా, యువజన నాయకుడుగా, పాత్రికేయుడుగా, సాంఘిక రాజకీయ క్రియాశీలక కార్యకర్తగా, స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వామిగా, శాసన సభ మంత్రి మండలి సభ్యుడుగా, ఒక బహుళార్థ సాధకుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన రాసిన "ఏబై సంవత్సరాల హైదరాబాద్" అలనాటి విషయాలకు సంబంధించిన ఒక విజ్ఞాన సర్వస్వం. పుస్తకానికి ముందుమాటలను తెలుగులో ఉమ్మెత్తుల కేశవరావు, ఆంగ్లంలో మీర్ అక్బర్ అలీఖాన్ రాశారు. నరసింగరావు పుస్తకంలో సెప్టెంబర్ 17, 1948 పూర్వపు హైదరాబాద్ (రాష్ట్రం) గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి.

ఆసఫ్ జాహీ రాజులలో చివరి వాడు, ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 1911లో సింహాసనాన్ని అధిష్టించారు. ఉస్మాన్ అలీఖాన్ రాజ్యాధికారం దాదాపు 1947 లోనే అంతమైందనవచ్చు. మిగిలిన కొసరే తెలంగాణ విలీనం, లేదా, విమోచనం. 1914-1918 మధ్య కాలంలో జరిగిన ప్రధమ ప్రపంచ సంగ్రామ ప్రభావం హైదరాబాద్ పాలనపై కూడా పడింది. రాష్ట్ర పరిపాలనలో బ్రిటీష్ ప్రభుత్వం జోక్యం కలిగించుకుంది. ఆ రోజుల్లో ఆర్య సమాజం, బ్రహ్మ సమాజం, థియోసాఫికల్ సొసైటీ అనే మూడు సంస్థలు మాత్రం వుండేవి. విద్యారంగంలో, హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ ను మౌల్వీ మహమ్మద్ ముర్తజా స్థాపించారు. వామన నాయక్ అధ్యక్షతన హైదరాబాద్ యంగ్ మెన్స్ అసోసియేషన్ నెలకొంది 1916 లో. వివేక వర్ధని హైస్కూల్ స్థాపన జరిగింది కూడా అదే రోజుల్లో. సుల్తాన్ బజార్ లోని శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభాషా నిలయం, సికిందరాబాద్ లోని ఆంధ్ర సంవర్ధనీ గ్రంధాలయం, తెలంగాణ ప్రాంతంలో చైతన్యం కలగడానికి దోహద పడ్డాయనాలి. రాష్ట్రంలో ఏర్పడిన మొట్ట మొదటి రాజకీయ సంస్థ, హైదరాబాద్ రాష్ట్ర సంస్కరణల సంఘం. అది కేవలం కాగితం సంస్థగానే మిగిలి పోయింది.

గాంధీ ప్రభావం హైదరాబాద్ మీద కూడా పడింది. భారత జాతీయ కాంగ్రెస్ జిల్లా కార్యాలయం హైదరాబాద్ లో ఆరంభం కావడం, దానికి వామన నాయక్, అంతు రామచందర్ రావు అధ్యక్ష-కార్యదర్శులుగా ఎన్నిక కావడం విశేషం. మహాత్మా గాంధి విజయవాడ- హైదరాబాద్ పర్యటన, 1921 లో ఖాదీ కేంద్రం, ఆంధ్ర జనసంఘం స్థాపనకు దారితీసింది. ఆంధ్రోద్యమంలో ఇది తొలి దశ ఐతే, మలి దశగా, ఆంధ్ర జన కేంద్ర సంఘం స్థాపన జరిగింది. ఆ దశలలో హైదరాబాద్ ప్రజల కోరిక, కేవలం, తమను సభ్యతగల దేశ నాగరికులుగా గుర్తించమని మాత్రమే!

డిసెంబర్ 1923 లో కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహా సభలో, హైదరాబాద్ రాష్ట్ర ప్రజా ఉద్యమాల గురించి, వాక్ స్వాతంత్ర్యంపై నిబంధనల గురించి, బహిరంగ సభలపై నిషేధం గురించి చర్చ జరిగింది. హైదరాబాద్ సంస్థానంపై బ్రిటీష్ ప్రభుత్వం జోక్యం, రాజకీయ ఉద్యమాలపై ప్రభుత్వ ప్రతిఘటన, పౌర హక్కులకు భంగం, మరింత పటిష్టంగా అమలు కావడం మొదలైంది. రాజకీయ చైతన్యం కలగరాదన్న భావనతో, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే పత్రికలను ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపధ్యంలో, డిసెంబర్ 1927 లో డాక్టర్ అన్సారీ అధ్యక్షతన మద్రాస్ నగరంలో కాంగ్రెస్ మహా సభలు జరిగాయి.

మొదటిసారి, దేశీయ సంస్థానాలలో రాజకీయ సంస్కరణలకు సంబంధించి, బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు దిశగా, ఒక తీర్మానం చేశారు. బ్రిటీష్ ఇండియాలో ఎన్ని మార్పులు వస్తున్నా హైదరాబాద్ లో అంతగా కదలిక రాలేదు. యూరప్ దేశాలలో ఉన్నత విద్యనభ్యసించి హైదరాబాద్ తిరిగొచ్చిన అతివాద భావాలు గల సమాజ వాదులు కొందరు, అంజుమన్ తరఖ్కీ అనే సంస్థను నెలకొల్పారు. అలీయావర్ జంగ్, బాఖర్ అలీ మీర్జా, పద్మజా నాయుడు, ఫజ్లుర్ రహమాన్, లతీఫ్ సయ్యద్, బూర్గుల రామకృష్ణ రావు, శ్రీ కిషన్, మీర్ అక్బర్ అలీ ఖాన్, మందుముల నరసింగరావు లాంటి ప్రముఖులు ఆ సంస్థలో సభ్యులయ్యారు. స్వామీ రామానంద తీర్థ, బీడ్ జిల్లాలోని మోమినాబాద్ లో నెలకొల్పిన పాఠశాల, స్వాతంత్ర్య సమర యోధులను సృష్టించే కేంద్రంగా, పోరాటానికి సంబంధించిన కార్యకలాపాల వేదికగా తయారైంది. ఆయన 1929 లో ప్రజా జీవితంలో ప్రవేశించడంతో నూతనాధ్యాయం మొదలైంది.


మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘనం, దరిమిలా తొలి రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించడం, మలి రౌండ్ టేబుల్ సమావేశం, గాంధీ-ఇర్విన్ ఒప్పందం, సంస్థానాల పాలకులకు గాంధీ పిలుపు, హైదరాబాద్ లో కూడా స్వదేశీ ఉద్యమానికి నాంది పలికాయి. పద్మజా నాయుడు అధ్యక్షతన స్వదేశీ లీగ్ స్థాపన జరిగింది. మెదక్ జిల్లా జోగిపేటతో ప్రారంభమై వరుస ఆంధ్ర మహాసభలు జరుగ సాగాయి. మొదటి మహా సభకు సురవరం ప్రతాప రెడ్డి, రెండవ దానికి బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. సభలు జరుపుకోవడానికి అనుమతి పొందడం అవస్థలతో కూడిన పని. హైదరాబాద్ ప్రభుత్వం, యుద్ధ కాలంలో మాదిరిగా, పౌరుల స్వాతంత్ర్యంపై ఆంక్షలు విధించేవారు. ప్రజా ఉద్యమాల పట్ల ప్రభుత్వ వైఖరి ఇలా వుంటే, మరో వైపు యువకుల్లో పెల్లుబుకిన అసంతృప్తి ముల్కీ ఉద్యమానికి దారి తీసింది. ముల్కీ హక్కులను కాపాడేందుకు ఉద్భవించిన “నైజాం ప్రజల సమితి” ఎక్కువ కాలం మనుగడ సాగించ లేకపోయింది. డిసెంబర్ 1935 లో జరిగిన కరీంనగర్ ఆంధ్ర మహా సభలో, మాడపాటి రామచంద్ర రావు లాంటి యువకులు, నాయకుల వైఖరిని ప్రతిఘటించారు. మొత్తం మీద రాజకీయ చైతన్యానికి పునాదులు బలంగా నాటుకోవడానికి ఆ సభ దోహద పడింది. `విశాలాంధ్ర' స్థాపించే ఉద్దేశంతో, ఆంధ్ర మహా సభలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణ కూడా ప్రభుత్వ వర్గాలు చేశాయి. హైదరాబాద్ రాష్ట్రంలో, ఆ రోజుల్లో, ముస్లిమే తరులు జరుపుకునే ఏ ఉద్యమమైనా, ప్రభుత్వం అనుమానంతోనే చూసేది.

1935 భారత రాజ్యాంగ చట్టం, భారత దేశంలో ఒక వైపు పార్లమెంటరీ ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు, మరో వైపు నిరంకుశ ప్రభువుల పాలన సాగే దేశీయ రాజ్యాల "సమాఖ్య" స్థాపనకు నాంది పలికింది. అదో విచిత్ర పరిణామం. దేశీయ రాజ్యాలలో హైదరాబాద్ పెద్దది. రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకున్న రాష్ట్రం. ఎల్లప్పుడూ మిగులు బడ్జెట్ కలిగిన రాష్ట్రం. "సమాఖ్య" అన్న పదమే నిజాంకు గిట్టేది కాదు. ప్రజాస్వామ్యానికి "సమాఖ్య" పునాదులు వేస్తుందనే భయమే దానికి కారణం. "సమాఖ్య" కు సంబంధించిన రాజ్యాంగ చట్టం అమల్లోకి రాగానే, అప్పటివరకూ రాజకీయేతర సంస్థగా వున్న "ఇత్తె హాదుల్ ముస్లిమీన్" రాజకీయ సంస్థగా మారిపోయింది. భారత సమాఖ్య సంవిధానంలో హైదరాబాద్ ను చేర్చాల్సి వస్తే, దాని రాజకీయాధికారంలో ఎలాంటి లోపం లేకుండా, ఆసఫ్ జాహీ వంశీకులే రాజుగా, సర్వ స్వాతంత్ర్యం గల రాజరికంగా వుండాలని ప్రకటించింది. ఈ నేపధ్యంలో డిసెంబర్ 1936 లో, షాద్ నగర్ లో ఐదవ ఆంధ్ర మహా సభ, ఇబ్బందులకు అతీతంగా జరిగింది. తెలంగాణ వాదుల అభ్యుదయానికి అనుగుణంగా తీర్మానాలనేకం చేయడం జరిగింది అక్కడ. అదే సంవత్సరం "హైదరాబాద్ ప్రజల విద్యా మహాసభ" లో స్వామీ రామానంద తీర్థ పాల్గొనడం జరిగింది. తర్వాత కొంతకాలానికి నిజామాబాద్ లో జరిగిన ఆంధ్ర మహాసభ ఆరవ సమావేశంతో అది రాజకీయ సంస్థగా పరిగణలోకి వచ్చింది.

జులై 1938 లో "హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్" పేరుతో ఒక తాత్కాలిక సంస్థ ఏర్పాటైంది. అందులో చేరిన సభ్యులందరూ ఆసఫ్ జాహీ పాలనలో బాధ్యతాయుత ప్రభుత్వ సాధనకై ఉద్యమించడానికి సిద్ధమయ్యారు. పౌరసత్వపు హక్కుల కొరకు, శాసనోల్లంఘనం కొనసాగించేందుకు, స్వామీ రామానంద తీర్థ సారధ్యంలో ఒక కమిటీ ఏర్పాటైంది. స్వామీజీ నాటినుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి, తన కార్యకలాపాల వేదికను మోమినాబాద్ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చారు. ఈ నేపధ్యంలో, అప్పటి ప్రధాన మంత్రి హైదరీ, "నిజాం ప్రభుత్వం రాజకీయ సంస్కరణలకు వ్యతిరేకం కాదు" అని శాసనసభలో ప్రకటించారు. ఆ ప్రకటన ఆచరణలో నామ మాత్రంగానే మిగిలిపోయింది. ప్రభుత్వంతో మంచిగా వుంటూనే ఉద్యమాన్ని నడిపించాలన్న భావనతో, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కు జాతీయ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవని బూర్గుల ప్రకటించారు. సెప్టెంబర్ 9, 1938 న జరగాల్సిన స్టేట్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సమావేశం నిర్వహించే వీలు లేకుండా, రెండు రోజుల ముందర, సెప్టెంబర్ 7, సంస్థను "ప్రజా సంరక్షణ చట్టం కింద" చట్టవిరుద్ధమై నదిగా ప్రకటిస్తూ నిషేధించారు.

"హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్" ను నిషేధించడంతో ప్రత్యామ్నాయాలను అన్వేషించసాగారు. నిషేధాన్ని ధిక్కరించి, స్వామీజీ నాయకత్వంలో, ఆయనే దళ నాయకుడుగా, శాసనోల్లంఘనం చేయడం, జైలు శిక్షకు గురికావడం జరిగింది. మహాత్మా గాంధీ, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాన్ని ఆపు చేయాలని ఆదేశమివ్వడం, డిసెంబర్ 1938 లో ఆయన ఆదేశాలను అమలుచేయడం జరిగింది. తన నిర్ణయంతో ప్రభుత్వంలో హృదయ పరివర్తన కలిగి, నిషేధం ఎత్తి వేస్తారని గాంధీ భావించారు. దానికి విరుద్ధంగా, 1946 వరకు నిషేధం కొనసాగింది. అదే సమయంలో, ఉస్మానియా విద్యార్థుల "వందేమాతరం" ఉద్యమం మొదలవడం, పలువురు కళాశాలల నుంచి బహిష్కృతులు కావడం, వారిలో చాలా మంది నాగపూర్ విశ్వవిద్యాలయంలో చదువు కొనసాగించడానికి సిద్ధపడడం జరిగింది. కొన్ని రోజుల తర్వాత, ప్రభుత్వం వందేమాతరం గీతం పాడడానికి అంగీకరించారు. ఆ ఉద్యమం హైదరాబాద్ రాష్ట్రంలో రాజకీయ చైతన్యం కలిగించింది. స్టేట్ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంతో జరిపిన సంభాషణల ఫలితంగా, ప్రభుత్వం సూచన మేరకు, "హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్" పేరు "హైదరాబాద్ నేషనల్ కాన్ఫరెన్స్" గా మార్చారు. ఐనప్పటికీ ప్రభుత్వ ధోరణి మారకపోగా, నేషనల్ కాన్ఫరెన్స్ కార్యకలాపాలు కూడా చట్ట విరుద్ధమైనవని ప్రకటించడంతో, దానిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి, సత్యాగ్రహాన్ని కొనసాగించారు. ఈ నేపధ్యంలో, మతవాద-సామ్యవాద సిద్ధాంతాలకు దూరంగా, అతివాద భావాల మక్దూం మొహియుద్దీన్, రాజబహద్దూర్ గౌడ్, సయ్యద్ ఇబ్రహీం, ఆలం ఖుందుమీర్ లాంటి యువకులు కొందరు హైదరాబాద్ లో "కామ్రేడ్స్ అసోసియేషన్" పేరుతో ఒక చర్చా వేదికను నడిపేవారు.


రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమై, భారత బ్రిటీష్ ప్రభుత్వం అందులో చేరడం జరిగింది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా యుద్ధ ప్రకటన చేశారని నిరసన తెలియచేస్తూ, 1935 చట్టాన్ని అనుసరించి రాష్ట్రాలలో ప్రభుత్వాలు నడుపుతున్న కాంగ్రెస్ మంత్రులు పదవులకు రాజీనామా చేశారు. యుద్ధానంతరం, "డొమినియన్ స్టేటస్" ను భారత దేశానికి ఇస్తానని బ్రిటీష్ ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని మహాత్ముడు "పోస్ట్ డేటెడ్ చెక్" గా వ్యాఖ్యానించారు. యుద్ధానికి మద్దతిస్తున్న సంస్థానాధీశులను-దేశీయ రాజులను గాంధీ విమర్శించారు. హైదరాబాద్ ప్రధాని అక్బర్ హైదరీ, తమ ప్రభుత్వ సంబంధాలు నేరుగా బ్రిటీష్ సార్వభౌమునితో నే వున్నాయని ప్రకటించాడు. "బ్రిటీష్ ప్రభుత్వంతో నేరుగా సంబంధాలు" అన్న నిజాం వాదనను స్టేట్ కాంగ్రెస్ నాయకులు తిరస్కరించారు. స్టేట్ కాంగ్రెస్ వారు ఉద్యమం పేరుతో-ప్రజాస్వామ్యం పేరుతో, అధిక సంఖ్యాకులైన హిందువులకు అధికారం అప్ప చెప్పే ఆలోచనలో వున్నారని ఇత్తె హాదుల్ ముస్లిమీన్ సంస్థ అధ్యక్షుడు విమర్శించారు. మరి కొంచెం ముందుకు పోయి, సమాజంలో ఉత్తమ స్థానం కలవారందరు, "రజాకారు" వ్యవస్థలో చేరాలని కూడా ఉద్భోధించారాయన. అంటే, రజాకారు ఉద్యమం 1940 లోనే ఆరంభమైందనవచ్చు-పోనీ పునాదులు పడ్డాయనవచ్చు.

రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు దశకు చేరుకునే సమయానికి, హైదరాబాద్ పరిస్థితిలో ఏ మార్పూ కనిపించలేదు. స్టేట్ కాంగ్రెస్ పైన నిషేధాజ్ఞలు కొనసాగుతూనే వున్నాయి. ఎన్ని నిషేధాజ్ఞలున్నా, ఉద్యమ ప్రభావాన్ని తగ్గించ లేకపోయింది ప్రభుత్వం. ప్రజలలో అలజడి తీవ్రమై, బాధ్యతాయుత ప్రభుత్వం కొరకు ఒత్తిడి పెరిగింది. 1941 లో కమ్యూనిస్ట్ యోధుడు రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో ఎనిమిదవ ఆంధ్ర మహాసభ జరిగింది. జాతీయ వాదులు, కమ్యూనిస్టులు అని రెండు గ్రూపులుగా ఆంధ్ర మహాసభలో పాల్గొన్న వారు విభజింపబడ్డారు. "క్విట్ ఇండియా" ఉద్యమం దేశవ్యాప్తంగా సాగుతున్నా, హైదరాబాద్ ప్రభుత్వంలో అంతగా పరివర్తన రాలేదింకా. ఇంతలో అక్బర్ హైదరీ ప్రధానిగా పదవీ విరమణ చేశారు. చత్తారి నవాబు ఆయన స్థానంలో నియమితులయ్యారు.

స్టేట్ కాంగ్రెస్ సమస్యపై సత్యాగ్రహం చేసిన స్వామీ రామానంద తీర్థ జైలులో వుండగానే, తెలంగాణ ప్రాంతంలోని హైదరాబాద్ రాష్ట్ర ప్రజలలో, కమ్యూనిస్ట్ భావాలు అధికం కావడంతో, నిజాం, ప్రజలకొక అభ్యర్థన చేసారు. రాజీ మార్గంలో పోదామని సూచించారు. స్వామీజీని నవంబర్ 1941 లో జైలు నుంచి విడుదల చేసింది ప్రభుత్వం. స్టేట్ కాంగ్రెస్ పైన నిషేధాజ్ఞలు ఎత్తివేయలేదు. క్విట్ ఇండియా ఉద్యమానికి స్వామీ జీ నాయకత్వం వహించేందుకు సిద్ధమయ్యారు. ఆగస్ట్ 1942 లో, బొంబాయి నగరంలో జరిగిన సమావేశంలో పాల్గొని, గాంధీ ఆదేశానుసారం, ఉద్యమం నిర్వహించేందుకు హైదరాబాద్ చేరుకున్నారాయన. ఉద్యమం ఆరంభించడానికి ముందర, జి. ఎస్. మెల్కోటే సంతకంతో నిజాం నవాబుకు ఒక లేఖ పంపారు. స్వతంత్ర భారత దేశంలో ఒక భాగంగా హైదరాబాద్ రాష్ట్రం కలిసిపోవాలని, రాష్ట్రంలో బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన జరగాలని, వీటికి సంబంధించిన ప్రకటన నిజాం చేయాలని లేఖలో పేర్కొనడం జరిగింది. లేఖ అందగానే, మెల్కోటేను అరెస్ట్ చేసింది ప్రభుత్వం. ఎం. ఎస్. రాజ లింగం, కాళోజీ నారాయణ రావు, భండారు చంద్రమౌళేశ్వర రావు ప్రభృతులు కూడా అరెస్టయ్యారు దరిమిలా.

1940 లో జరిగిన ఆంధ్ర మహాసభకు జాతీయ పక్షానికి చెందిన మందుముల రామచంద్ర రావు, 1941 లో జరిగిన సభకు కమ్యూనిస్ట్ పక్షానికి చెందిన రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన వహించారు. వీరిరువురి ఆదర్శాలలో కొంత భేదం వుండేది. మే నెల 1942 లో వరంగల్ సమీపంలో జరిగిన తొమ్మిదవ సభ నాటికి అవి ప్రస్ఫుటంగా కనిపించ సాగాయి. 1941-1942 మధ్య కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ బహిరంగంగానే పని చేయడం మొదలైంది. 1943 మధ్య కాలంలో నిషేధం కూడా తొలగించింది ప్రభుత్వం. కొంత గందరగోళం మధ్య ముగిసిన ఆ సభలకు మాదిరాజు రామకోటేశ్వరరావు రావు అధ్యక్షత వహించారు. క్విట్ ఇండియా తీర్మానాన్ని సభ బలపర్చింది. ఆ తర్వాత ఆరు నెలలకు హైదరాబాద్ లో నిషేధాజ్ఞలను ఉల్లంఘించి, సత్యాగ్రహం చేసిన పద్మజా నాయుడు, మెల్కోటే సతీమణి, బూర్గుల రామకృష్ణారావు ప్రభృతులను అరెస్ట్ చేసి, రెండు-మూడు రోజుల తర్వాత విడుదల చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ లో జరిగిన పదో ఆంధ్ర మహా సభ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగడం, కమ్యూనిస్ట్ అభ్యర్థి బద్దం యెల్లారెడ్డిపై పోటీ చేసిన కొండా వెంకట రంగారెడ్డి ఎన్నిక కావడం జరిగింది. పదకొండవ మహా సభ కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణ రెడ్డి నాయకత్వంలో భువనగిరిలో జరిగింది. మితవాదులు, జాతీయ వాదులు ఆ సభను బహిష్కరించారు. మార్చ్ నెల 1945 లో, జాతీయ-మితవాదులందరు కలిసి, పన్నెండవ మహా సభను వరంగల్ సమీపంలోని మడికొండ గ్రామంలో, మాదిరాజు రామకోటేశ్వరరావు రావు అధ్యక్షతన నిర్వహించారు. అది జరిగిన నెల పదిహేను రోజులకు, "నిజాం రాష్ట్ర ఆంధ్ర మహా సభ" పేరుతో, రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన, ఖమ్మం లో మరొక ఆంధ్ర మహా సభ జరిగింది.

జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జనవరి 1946 లో ఉదయపూర్ లో, దేశీయ రాజ్యాల ప్రజల-ప్రతినిధుల మహా సభ జరిగింది. ఆ సభకు, హైదరాబాద్ రాష్ట్రం నుండి, కమ్యూనిస్ట్ నాయకుడు బద్దం యెల్లారెడ్డితో సహా రామానంద తీర్థ, మాడపాటి హనుమంత రావు, బూర్గుల, కాశీనాధ రావు వైద్య, దిగంబర రావు బిందు, మందుముల నరసింగ రావు ప్రభృతులు, హాజరయ్యారు. సభ జరిగిన కొద్ది రోజులకే, "అధికారం బదలాయింపు" ప్రస్తావనను బ్రిటీష్ ప్రధాని అట్లీ పార్లమెంటులో లేవనెత్తారు. భారత సంవిధాన సభ ఏర్పాటు ఆవశ్యకత కూడా ప్రస్తావనకొచ్చింది. మార్చ్ 24, 1946 న బ్రిటీష్ అధికారిక ప్రతినిధులు, ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశీయ రాజ్యాలతో సహా అన్ని ప్రాంతాలు, భారత భవిష్యత్ సంవిధానంలో భాగమేనని స్పష్టం చేశారు. మరో వారం రోజుల తర్వాత, బ్రిటీష్ మంత్రి మండలి సభ్యులను కలిసిన చత్తారి నవాబు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను వెల్లడి చేశారు. దేశ విభజన జరిగితే, హైదరాబాద్ భౌగోళిక కారణాల వల్ల పాకిస్తాన్ లో చేరదని, సిద్ధాంత రీత్యా భారత్ లో వుండలేదని, అందువల్ల, స్వతంత్ర రాజ్యంగా వుంటుందని స్పష్టం చేశాడు. బ్రిటీష్ ఇండియాకు స్వతంత్రం ప్రకటించిన వెంటనే బ్రిటీష్ పరమాధికారం ముగుస్తుందనీ, ఆంతరంగిక శాంతి బధ్రతల పరిరక్షణ తమ చేతుల్లో వుండదని చత్తారి నవాబుకు తెలియ చేశారు.

రాష్ట్ర ఆంతరంగిక పరిస్థితులు ఇబ్బందికరంగా తయారయ్యాయి. కమ్యూనిస్ట్ ఉద్యమం తీవ్రమైంది. చత్తారి నవాబు పదవికి రాజీనామా చేశారు. తాత్కాలిక ప్రధానిగా అఖీల్ జంగ్ నియామకం జరిగింది. స్టేట్ కాంగ్రెస్ పై నిషేధాన్ని ఎత్తి వేశారు. సంస్థ అధ్యక్షుడుగా రామానంద తీర్థ ఎన్నికయ్యారు. సర్ మీర్జా ఇస్మాయిల్ ను ప్రధాన మంత్రిగా నియమించారు. మీర్జా కేవలం పది నెలలు మాత్రమే (ఆగస్ట్ 1946-మే 1947) ప్రధానిగా పని చేశారు. ఆయన ప్రతిపాదించిన సంస్కరణలను కాంగ్రెస్ వారు బహిష్కరించే ఉద్యమం మొదలైంది. శాసన సభకు జరిగిన ఎన్నికలలో వ్యక్తిగతంగా మాత్రమే కొందరు పాల్గొన్నారు. ఇంతలో ఖాసిం రజ్వీ ఇత్తె హాదుల్ పార్టీ నాయకుడుగా, శాసన సభలో ఆ పార్టీ లీడర్ గా ఎన్నికయ్యారు. పింగిళి వెంకట రామారెడ్డి, అబ్దుల్ రహీంలు మిర్జా ఇస్మాయిల్ మంత్రి మండలిలో చేరి, లాయఖ్ అలీ మంత్రి మండలిలో కూడా కొనసాగి, హైదరాబాద్ రాజ్యాధికారం పతనం ఐన తర్వాత పదవులను వదిలారు.

ఈ నేపధ్యంలో, తెలంగాణ ఆంధ్రోద్యమానికి సంబంధమున్న తుది (పదమూడవ) అంధ్ర మహా సభ, జమలాపురం కేశవ రావు అధ్యక్షతన, మే నెల 1946 లో మెదక్ జిల్లా కంది గ్రామంలో జరిగింది. ఆ తర్వాత ఆంధ్ర మహా సభ స్టేట్ కాంగ్రెస్ లో విలీనమైంది. కమ్యూనిస్టులు కూడా తమ పదమూడవ-చివరి మహా సభను బద్దం యెల్లారెడ్డి అధ్యక్షతన కరీంనగర్ లో జరుపుకున్నారు. అప్పటినుంచి ఉద్యమం పార్టీ పేరు మీదే సాగింది. కమ్యూనిస్ట్ ఉద్యమం తీవ్రతరం కావడం, ప్రజలలో అభిమానం పెరగడం, పెద్ద సంఖ్యలో ప్రజలు ఎర్ర జెండాలు పట్టుకుని తిరగడంతో, నవంబర్ 1946 లో పార్టీని నిషేధించింది ప్రభుత్వం.

బ్రిటీష్ ఇండియాకు లార్డ్ మౌంట్ బేటన్ ను వైస్రాయ్ గా నియమించింది. అవసరమొస్తే భారత దేశాన్ని విభజించైనా అధికారం అప్ప చెప్పడం జరుగుతుందని అట్లీ స్పష్టం చేశారు. జూన్ 2, 1947 న ఇదే విషయాన్ని మౌంట్ బేటన్ ఇండియన్ రేడియో ద్వారా ప్రకటించడం, నెహ్రూ దానికి అంగీకారం తెలపడంతో, నిజాం నవాబు హైదరాబాద్ రాష్ట్రం ఇండియా-పాకిస్తాన్ లలో దేని లోనూ చేరదని, స్వతంత్ర రాజ్యంగా వుంటుందని, జూన్ 11 న ఒక ఫర్మానా ద్వారా తెలియ చేశాడు. దానిని ఖండిస్తూ, హైదరాబాద్ లో స్టేట్ కాంగ్రెస్ నాయకులు, స్వామీ రామానంద తీర్థ అధ్యక్షతన బ్రహ్మాండమైన మహా సభను జూన్ 16, 17, 18 తేదీలలో నిర్వహించి, బూర్గుల దానికి అనుగుణంగా చేసిన ప్రతిపాదనను ఆమోదించారు. ఆగస్ట్ 7 న రాష్ట్రంలో జాతీయ జండా ఎగుర వేసి, నిజాం స్వాతంత్ర్యాన్ని తిరస్కరించారు. ఆగస్ట్ 15, 1947 న దేశానికి స్వతంత్రం ఇచ్చి బ్రిటీష్ వారు వెళ్లి పోయిన తర్వాత, మరొక మారు నిజాం తనను తాను స్వతంత్ర రాజుగా ఆగస్ట్ 27 న ప్రకటించుకున్నారు. రజాకార్ల దౌర్జన్యం మొదలై, ఉధృత రూపం దాల్చింది.

నిజాం ప్రయత్నాలకు రజాకార్ల మద్దతు లభించింది. దౌర్జన్యాలు మితి మీరి పోయాయి. జూన్ 1948 మౌంట్ బేటన్ స్థానంలో రాజగోపాలా చారి గవర్నర్ జనరల్ గా నియమితులయ్యారు. నిజాం తన కేసును ఐక్య రాజ్య సమితి దృష్టికి కూడా తీసుకెళ్లాడు. పరిస్థితులు చే జారి పోతుండడంతో, పోలీసు చర్య ఆరంభమై, సెప్టెంబర్ 13, 1948 న భారత సైన్యాలు హైదరాబాద్ రాష్టంలోకి ప్రవేశించాయి. యూనియన్ సైన్యానికి నిజాం సేనల-రజాకార్ల నుంచి నామ మాత్రపు ప్రతిఘటన ఎదురైంది. సెప్టెంబర్ 17 న మేజర్ జనరల్ జే ఎన్ చౌదరీ నాయకత్వంలోని సేనలు హైదరాబాద్ కు చేరుకోగానే, నిజాం లొంగిపోయి శరణు కోరాడు. ఖాసిం రజ్వీ, లాయక్ అలీ లను నిర్బంధంలోకి తీసుకున్నారు. చౌదరీ మిలిటరీ గవర్నర్ గా, సెప్టెంబర్ 18, 1948 న సైనిక ప్రభుత్వం ఏర్పడింది. రెండేళ్ల తర్వాత వెల్లోడి ముఖ్య మంత్రిగా సివిల్ పాలన మొదలైంది. 1952 లో ఎన్నికల అనంతరం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైంది. బూర్గుల రామకృష్ణా రావు ముఖ్య మంత్రిగా 1956 అక్టోబర్ వరకు కొన సాగారు.

ఈ నేపధ్యంలో, భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం కొరకు ఆందోళన మొదలైంది. ఫజలలీ కమీషన్ ఏర్పాటై, ప్రజాభిప్రాయ సేకరణకు సభ్యులు హైదరాబాద్ వచ్చి, ప్రముఖులతో చర్చలు జరిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు, వారు కోరుకున్న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాలేదు. హైదరాబాద్ రాష్ట్రం కూడా మూడు ముక్కలైంది. కర్నాటక, మహారాష్ట్రలకు పోగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మిగిలిన ఎనిమిది (ఇప్పటి ఉమ్మడి పది) జిల్లాలను, ఆంధ్ర రాష్ట్రంలోని పదకొండు(ఇప్పటి పదమూడు) జిల్లాలతో కలిపి "ఆంధ్ర ప్రదేశ్" రాష్ట్రం ఏర్పాటైంది. సెప్టెంబర్ 17, 1948 న భారత దేశంలో నిజాం రాష్ట్రం "విలీనం" అయింది. ఎనిమిదేళ్లు గడవగానే, తెలంగాణ ప్రాంతాన్ని విశాలాంధ్ర లో విలీనం చేసారు. కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాల శాంతియుత ఉద్యమం తర్వాత జూన్ 2, 2014 లో తెలంగాణ అరాష్ట్రం ఏర్పాటైంది. 

ఇన్నాళ్లూ అన్నదమ్ములవలె కలిసిమెలిసి వుంటున్న ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం వారు, భౌగోళికంగా విడిపోయి, అన్నదమ్ముల్లానే, చిరకాలం కలిసిమెలిసి వుంటే మంచిదేమో!

Wednesday, September 25, 2019

పద్మావతి ప్రిన్సిపాల్ గా బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాల .... జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-8 : వనం జ్వాలా నరసింహారావు


పద్మావతి ప్రిన్సిపాల్ గా బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాల
జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-8
వనం జ్వాలా నరసింహారావు
          నాతో పాటే దాదాపు నా సమవయస్కులు పాతిక మందికి పైగా బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఉపాధ్యాయులుగా చేరారు. వారి వివరాలన్నీ మరోమారు ప్రస్తావిస్తాను. హైదరాబాద్ రామచంద్రాపురంలో వున్న బీహెచ్ఇఎల్ ఉద్యోగుల పిల్లల సౌకర్యం కొరకు ప్రత్యేకంగా స్థాపించారు ఆ స్కూలును. సెంటర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఇ)-కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) కు హయ్యర్ సెకండరీ స్కూల్ ను అనుబంధంగా ఏర్పాటు చేశారు. సిలబస్, పరీక్షా విధానం, తదితర నిబంధనలన్నీ సీబీఎస్ఇ, కేవీఎస్ కు అనుగుణంగానె వుండేవి. పదవ తరగతి చివర్లో, పన్నెండవ తరగతి చివర్లో బోర్డ్ పరీక్షలుండేవి. సర్వసాధారణంగా ఆ పరీక్షల్లో స్కూల్ ఉత్తీర్ణత శాతం ప్రతి సంవత్సరం కూడా నూటికి నూరు శాతమే. అందులో 95% పైగా విద్యార్థులు డిస్టింక్షన్ లోనూ, మిగతావారు కొంచెం తక్కువ మార్కులతోనూ పాసయ్యేవారు.

నేనక్కడ పనిచేసినంత కాలం ఫెయిల్ అన్న మాట వినలేదు. ప్రతి సంవత్సరం కనీసం ఇద్దరు-ముగ్గురన్నా, పన్నెండో తరగతి చదువుతున్నప్పుడే ఎన్డీయే (నేషనల్ డిఫెన్స్ అకాడెమీ) కోర్సుకు ఎంపికయ్యేవారు. ఇక ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో పదుల సంఖ్యలో ఎంపికయ్యేవారు విద్యార్థులు. అక్కడ చదివిన విద్యార్థులు రాణించని రంగం లేదు. శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, రాజకీయ వేత్తలుగా, అధ్యాపకులుగా, మానేజ్మెంట్ నిపుణులుగా, త్రివిధ దళాల ఉద్యోగులుగా, దేశ విదేశాలలో పేరు ప్రఖ్యాతులు గడించారు. నగరంలోని (పెంటాంగులర్) అంతర్ పాఠశాలల, అంతర రాష్ట్ర పాఠశాలల పోటీలలో అన్ని రంగాలలోనూ బీహెచ్ఇఎల్ పాఠశాల విద్యార్థులదే పైచేయిగా వుండేది. అవి ఆటలపోటీలే కావచ్చు, వ్యాసరచన, డిబేట్, క్విజ్ లేదా తదిర అకాడెమిక్ పోటీలే కావచ్చు.....అన్నింటా హయ్యర్ సెకండరీ స్కూల్ ఫస్ట్ వచ్చేది. ఇక పాఠశాల వార్షిక క్రీడోత్సవం కానీ, సైన్స్-ఆర్ట్స్ ప్రదర్శన కానీ అంగరంగ వైభోగంగాజరిగేది.  ఉదయం పూట స్కూల్ ప్రారంభం కావడానికి ముందు ప్రేయర్ మీట్ ఒక అద్భుతంగా వుండేది. ప్రతిరోజూ “థాట్ ఫర్ ద డే” అని ఒక విద్యార్థితోనో, అధ్యాపకుడితోనో మాట్లాడించే వారు. అది నిజంగా థాట్ ప్రవోకింగ్ గా వుండేది.

వీటన్నిటికీ మూల కారణం ఆ పాఠశాల ప్రిన్సిపాల్ స్వర్గీయ శ్రీమతి వై పద్మావతి. మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి ఎంఎ ఇంగ్లీష్, ఎకనామిక్స్ విభాగాలలో పట్టాపొందిన పద్మావతి గారు నిరంతర అధ్యయనవేత్త. పద్మావతి గారు ప్రిన్సిపాల్ గా వుండగా నేను హయ్యర్ సెకండరీ పాఠశాలలో దాదాపు పది సంవత్సరాలకు పైగా లైబ్రేరియన్ గా పనిచేశాను. ఆవిడ పదవీ విరమణ చేసిన తరువాత మాలతీ గోపాలకృష్ణన్ ప్రిన్సిపాల్ గా వుండగా పనిచేసినప్పటికీ గతంలో లాగా ఆసక్తిగా పనిచేయలేకపోయాను. పద్మావతి గారి సారధ్యంలో ఆ పాఠశాల ఒక అత్యున్నత శిఖరాలకు పోగలిగింది. ఆమె పాలనా దక్షత, అధికార దర్పం, పాఠశాల వ్యవహారాలను తన చెప్పుచేతల్లో వుంచుకున్న విధానం ఒక అరుదైన ప్రక్రియగా చెప్పుకోవాలి. విద్యార్థులకు, అధ్యాపకులకు, ఇతర సిబ్బందికి ఆమె ఒక స్నేహితురాలిగా, తత్వవేత్తగా, దార్శనికురాలిగా, ఆత్మీయురాలిగా వుండేది. పాఠశాల వ్యవహారాలను కంట్రోల్ చేసే బీహేచీఇఎల్ అధిష్టాన యాజమాన్యం దృష్టిలో పద్మావతి ఒక ఉన్నత విద్యావేత్త, పాలనా దక్షురాలు. రోజువారీ పాలనా వ్యవహారాలలో వారేమాత్రం జోక్యం చేసుకునేవారు కాదు. ఒక విధంగా వారికి ఆమె అంటే భయ-భక్తులు వుండేవి.  
   

లైబ్రేరియన్ గా నా బాధ్యత పాఠశాల లైబ్రరీ నిర్వహణ. పుస్తకాలను పిల్లలకు ఇవ్వడం, వారు వాటిని చదివేలా చూడడం, చదివిన తరువాత తిరిగి తీసుకోవడం, పుస్తకాల క్లాసిఫికేషన్, కేటలాగ్ చేయడం తదితర వ్యవహారాలను నిర్వర్తించేవాడిని. వాస్తవానికి లైబ్రరీ సైన్స్ డిగ్రీలో చదివిన దానికంటే ప్రాక్టికల్ గా చాలా విషయాలను పద్మావతి గారిదగ్గర నేర్చుకున్నాను. ఆమె స్వయంగా పుస్తక ప్రియురాలు. మాగజైన్లు, జర్నల్స్ నిరంతరం చదువుతుండేది. ప్రతిరోజూ మధ్యాహ్న భోజన సమయంలో తప్పక ఒక మాగజైన్ తెమ్మని అడిగేది. పద్మావతి గారి అనుమతితో లైబ్రరీకి అన్ని రకాల మాగజైన్లు, జర్నల్స్, మార్కెట్లోకి వచ్చే కొత్త పుస్తకాలు తెప్పిమ్చేవాడిని. వాటిలో చాలా భాగం చదవడం వల్ల భవిష్యత్ లొ నేనొక పాత్రికేయుడిగా, ప్రజాసంబంధాల వృత్తినిపుణుడిగా ఎదగడానికి దోహదపడింది. నేను ఆంగ్లభాషలో అంతో-ఇంతో ప్రావీణ్యం పొందడానికి పద్మావతిగారే ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు మనం మాట్లాడే భాషను మనల్ని నొప్పించకుండా సరిదిద్దేవారామె. ఒక సందర్భం నాకింకా గుర్తుంది. నేను “Madam…can I come”….అని అడిగినప్పుడు ఆమె జవాబుగా “Yes…you can…but you may not!”.  ఇంగ్లీష్ లో can ఎప్పుడు వాడాలి, may ఎప్పుడు వాడాలి ఆమె దగ్గర నేర్చుకున్నాను.

పద్మావతిగారితో చాలా సందర్భాలలో విభేదించాను. కాని ఆమెది విశాల హృదయం. ఆమె నన్ను తన కొడుకులాగా చూసుకునేది. తప్పులు పట్టించుకోకుండా ఒప్పులు నేర్పేది. ఆమె అభీష్టానికి విరుద్ధంగా బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాల సిబ్బంది అసోసియేషన్ ప్రారంభానికి జగన్మోహన్ రావు, డేవిడ్, నాగేశ్వర్ రావులతో కలిసి నేను కూడా ఒక ముఖ్య కారకుడిని. అసోసియేషన్ ఏర్పాటుకు సంబంధించి యావత్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆమె ఆ విషయాన్ని కనిపెట్టకుండా, కనిపెట్టి దానికి అడ్డుతగలకుండా నేను జాగ్రత్త పడ్డాను. ఆరోజు ఆమెతో కలిసి ఆమె కారులో వెళ్లి ఆమె ఇంటివద్ద దిగిందాకా ఆమెకు విషయం తెలియకుండా చూశాను. మర్నాడు విషయం తెలుసుకున్న పద్మావతి గారు అగ్గిమీద గుగ్గిలంలాగా అయిపోయి, తమాయించుకుని, నన్ను మందలించారు. మేం చేసిందంతా పిల్ల వ్యవహారంలాగా కొట్టి పారేసింది.        

బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉద్యోగం మానేసిన తరువాత కూడా ఆమె చనిపోయేంతవరకు పద్మావతిగారితో టచ్ లొ వుండేవాడిని. ఆమె సహస్ర చంద్ర దర్శనానికి కూడా సతీసమేతంగా వెళ్లాను. ఆమె చనిపోయినప్పుడు నయాగారా (అమెరికా) లో వున్నందున కడసారి చూడలేకపోయాను.

బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాల గురించి, అక్కడ నాతో పనిచేసిన సహాయాధ్యుల గురించి మరిన్ని వివరాలు ముందు...ముందు.         

Tuesday, September 24, 2019

బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్ ఉద్యోగం....జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-7:వనం జ్వాలా నరసింహారావు:


జ్ఞాపకాల అనుభవాలు-అనుభవాల జ్ఞాపకాలు-7
బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్ ఉద్యోగం
వనం జ్వాలా నరసింహారావు
          ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లైబ్రరీ సైన్స్ కోర్సు (1973-1974) చదవడం పూర్తయినా అప్పుడు కాంపస్ లో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో సాధారణంగా మార్చ్-ఏప్రిల్ నెలలో జరగాల్సిన  పరీక్షలు ఇంకా జరగలేదు. నేను తిరిగి ఖమ్మం వెళ్లి శాంతినగర్ జూనియర్ కళాశాలలో ఉద్యోగంలో చేరాను. చేరిన కొన్నాళ్లకు పేపర్లో ఒక ప్రకటన కనిపించింది. హైదరాబాద్ సమీపంలోని రామచంద్రాపురంలో వున్న బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోమని దాని సారాంశం. క్వాలిఫికేషన్ లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ వుండాలని, అనుభవం వున్న వారికి ప్రాధాన్యం వుంటుందని ప్రకటనలో వుంది. నాకు అనుభవం అయితే వుందికానీ, ఇంకా అప్పటికి అర్హత అయిన డిగ్రీ చేతికి రాలేదు. అసాధారణ వ్యక్తుల విషయంలో అర్హత సడలిస్తామని కూడా ప్రకటనలో వుండడంతో నేను కూడా అప్లయి చేద్దామనుకున్నాను.

         ఉద్యోగ బాధ్యతలతో ఖమ్మంలో వున్న నేను వెంటనే బీహెచ్ఇఎల్ లైబ్రేరియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకోలేక పోయాను. దాదాపు సమయం మించిపోయే ముందు హైదరాబాద్ స్వయంగా వచ్చి ఈ విషయాన్ని స్నేహితుడు, బీఎస్సీ లో నా క్లాస్మేట్ విజయరామ్ శర్మ కు చెప్పాను. అప్పట్లో వాడి బావ బీహెచ్ఇఎల్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడి సహాయం తీసుకుని చివరి నిమిషంలో అప్ప్లై చేశాను. చేసి దాదాపు మర్చిపోయాను. కొన్నాళ్లకు స్కూల్ యాజమాన్యం నుండి ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. తెలిసిన స్నేహితుల ద్వారా విచారించగా మొత్తం పన్నెండు మందిని ఇంటర్వ్యూకి పిలిచినట్లు, నేను తప్ప అందరూ లైబ్రరీ సైన్స్ డిగ్రీ వున్నవారే అని తెలిసింది. కాకపోతే పనిచేసిన అనుభవం మాత్రం నాకుంది అన్న ధైర్యంతో ఇంటర్వ్యూకి పోవడానికి నిశ్చయించుకున్నాను.

         ఇంటర్వ్యూ డేట్ సమీపించే ముందర ఈ విషయాన్ని భద్రాచలంలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మా బ్రదర్ ఇన్ లా డాక్టర్ ఏపీ రంగారావుకు చెప్పాను. అప్పట్లో భద్రాచలం సబ్-కలెక్టర్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన జంధ్యాల హరినారాయణ పనిచేస్తున్నాడు. డాక్టర్ రంగారావు యాధృచ్చికంగా నా ఇంటర్వ్యూ విషయం స్నేహితుడైన హరినారాయణకు చెప్పాడు. వెంటనే ఆయన వివరాలు నోట్ చేసుకుని, బీహెచ్ఇఎల్ లో అకౌంట్స్ ఉన్నతాధికారిగా, బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్ చైర్మన్ గా పనిచేస్తున్న స్వర్గీయ ఆకెళ్ళ అచ్యుత రామం గారికి చెప్పాడు. ఆయనలా చెప్పిన విషయం నాకు తెలియదు. నేను మామూలుగా ఇంటర్వ్యూకి వెళ్లాను. నేను ఇంటర్వ్యూకి పోవడం కూడా ఒక ప్రహసనం లాగా జరిగింది.

         నాకు గుర్తున్నంతవరకు ఇంటర్వ్యూ 1974 సంవత్సరం జూన్ నెలలో జరిగింది. ఆ రోజుల్లో హైదరాబాద్ గన్ఫవుండరీ స్టేట్ బాంక్ ఆఫ్ హైదరాబాద్ లో సమీప బంధువు, స్నేహితుడు వనం రంగారావు పనిచేస్తుండే వాడు. రంగారావు దంపతులు చిక్కడపల్లి-అశోకనగర్లో వున్న పర్సా మోహన్ రావుగారింట్లో ఒక గదిలో అద్దెకుండే వాడు. మోహన్ రావుగారు ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నతోద్యోగి. ఆయనకొక స్కూటర్ వుండేది. ఆ స్కూటర్ ను అడపదడప రంగారావు కూడా ఉపయోగించుకునే వాడు. నా బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఇంటర్వ్యూకి ఆ స్కూటర్ తీసుకుని రంగారావు, నేను వెళ్లాం. వచ్చేటప్పుడో, లేదా, వెళ్లేటప్పుడో గుర్తులేదుకాని స్కూటర్ క్లచ్ వైరో, గేర్ వైరో తెగి కొంత ఇబ్బంది కలిగింది.


         ఇంటర్వ్యూలో ఆకెళ్ళ అచ్యుత రామం గారితో పాటు స్కూల్ ప్రిన్సిపాల్ వై పద్మావతి, మరో సీనియర్ బీహెచ్ఇఎల్ అధికారి వున్నారు. ఒక సబ్జెక్ట్ నిపుణుడు కూడా వున్నాడు. లైబ్రరీసైన్స్ డిగ్రీ పాసైన పదకొండు మందినీ కాదని ఇంకా పరీక్షలు రాయని నన్ను అనుభవం వుందన్న కారణాన ఎంపిక చేశారు. కాకపోతే ఒక రైడర్ పెట్టారు. నేను పరీక్షలు రాసి పాసయ్యేంతవరకు నాకు లైబ్రేరియన్ జీతం కాకుండా అంతకంటే తక్కువ స్థాయిలో ఉంచుతామన్నారు. ఒప్పుకున్నాను. జులై 1, 1974 న ఉద్యోగంలో చేరాను. అదేనెల రెండో వారంలో లైబ్రరీ సైన్స్ పరీక్షలు రాసి, ఆ మరుసటి నెల ప్రకటించిన ఫలితాలలో యూనివర్సిటీ సెకండ రామక్ సాధించి ఉత్తీర్ణుడినయ్యాను. బీహెచ్ఇఎల్ స్కూల్ యాజమాన్యం అన్న మాట ప్రకారం నేను పరీక్ష రాసిన నాటినుండి లైబ్రేరియన్ స్కేల్ ఇచ్చింది. జీతం మొత్తం కలిపి రు. 330. ఖమ్మం కంటే 70-80 రూపాయలు ఎక్కువ.

         ఉద్యోగంలో చేరగానే మళ్లీ కాపురం హైదరాబాద్ కు మార్చాను. అశోకనగర్లో పీపుల్స్ హైస్కూల్ దాటిన తరువాత వచ్చే సందులో (స్వర్గీయ) భండారు మల్లిఖార్జున రావు గారింట్లో రెండు గదులు అద్దెకు తీసుకున్నాను. మాతో పాటే హైదరాబాద్ లొ చదువుకుంటున్న మా ఆవిడ తమ్ముడు (స్వర్గీయ) ఏవీజీ కుమార్ ఎలియాస్ వెంకన్న కూడా వుండేవాడు. మల్లిఖార్జున రావు గారి దంపతులు చాలా మంచివారు. మమ్మల్ని ఎప్పుడూ ఒక కంట కనిపెట్టేవారు. వారి పిల్లలు కూడా మాతో చాలా కలుపుగోలుగా వుండేవారు. బీహెచ్ఇఎల్ పోవడం అంటే పొద్దున్నే లేవాలి. ఉదయం ఆరున్నర గంటలకల్లా బ్రేక్ ఫాస్ట్ కానిచ్చి, మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకుని బయల్దేరే వాడిని. ఓ పది నిమిషాలు నడుచుకుంటూ హిమాయత్నగర్ చేరుకొని, అక్కడ బీహెచ్ఇఎల్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో (ఉదయం 6-50 కల్లా) ఎక్కి ఉదయం ఎనిమిది కల్లా బీహెచ్ఇఎల్ స్కూల్ చేరుకునేవాడిని. నాలాగే మిగతా స్కూల్ ఉద్యోగులు కూడా వెళ్లేవారు. స్కూల్ ఉదయం 9-30 కు మొదలయ్యేది. అప్పటి దాకా సిటీ నుండి వచ్చే టీచర్లు అంతా కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్ళం. సాయంత్రం 4 గంటలకల్లా స్కూల్ అయిపోయేది. కాని, బస్ మాత్రం 5-45 దాకా వుండకపోయేది. మళ్లీ సాయంత్రం బస్సు వచ్చేదాకా కబుర్లే. అలా దాదాపు పన్నెండు సంవత్సరాలు 1974 నుండి 1986 వరకు అక్కడే ఉద్యోగం చేశాను.

         బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఉద్యోగం ఒక గొప్ప అనుభూతి. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ వై పద్మావతి దగ్గర నేర్చుకొని అంశం లేదంటే అతిశయోక్తి కాదు. వివరాలు ముందు...ముందు.           


Saturday, September 21, 2019

కబంధుడి చేత చిక్కిన రామలక్ష్మణులు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-79 : వనం జ్వాలా నరసింహారావు


కబంధుడి చేత చిక్కిన రామలక్ష్మణులు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-79
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (22-09-2019)

జటాయువును సొదమీద పెట్టి, అగ్ని రగిలించి, తన తండ్రిలాగే ఆయనకూ నిప్పు పెట్టి జింక మాంసంతో పిండాలు చేశాడు. ఆ పిండాలను లేతపచ్చిక మీద వుంచి, బ్రాహ్మణులు స్వర్గప్రాప్తి కోసం మనుష్య ప్రేతాలను ఉద్దేశించి ఏ మంత్రాలను చదువుతారో అవే చదివాడు. ఆ తరువాత గోదావరీ నదిలో తమ్ముడితో సహా స్నానం చేసి, జటాయువుకు నీళ్లు వదిలారు. మరణించిన గద్ద రాజు మహర్షి సమానుడైన రామచంద్రుడి చేత సంస్కారం పొంది పుణ్యలోకాలకు పోయాడు. ఇలా రామలక్ష్మణులు కర్మలు చేసి, జటాయువు మీదనే మనసుంచి, సీతాదేవి తనకు లభిస్తుందని ఆయన చెప్పిన మాటలను విశ్వసించి, సీతాదేవిని కలవాలన్న కోరికతో అడవుల జాడ పట్టుకుని పోయారు.

         రాజకుమారులు రామలక్ష్మణులు ఇద్దరూ, నైరుతిమూలగా కొంతదూరం పోయి, ఆ అడవికి మూడు కోసుల దూరంలో వున్న క్రౌంచారణ్యంలోకి ప్రవేశించి, అక్కడ బడలిక తీర్చుకోవడానికి మధ్య-మధ్య చెట్ల నీడల్లో కూర్చుంటూ, అనేక అడవి మృగాలున్న ఆ అడవిలో సీతను వెతకసాగారు. ఆ క్రౌంచారణ్యం దాటి తూర్పుగా పోయి, మతంగవనంలో మూడుకోసుల దూరాన వున్న ఒక కొనను సమీపించారు. అది పాతాళం లాగా మిక్కిలి భయంకరంగా శాశ్వతమైన గాడాంధకారం లాగా వుంది. అక్కడ కొంచెం దూరం నుండే భయంకర రాక్షసి ఒకటి వాడి కోరలతో, తల వెంట్రుకలు విరియబోసుకుని, మృగాలను తినేదైన వేలాడే పొట్టతో రామలక్ష్మణులను అడ్డగించింది. 

         అడ్డగించిన తరువాత ముందు నడుస్తున్న లక్ష్మణుడిని నిలిపి, చేతులతో ఆయన్ను గట్టిగా కౌగలించుకుని, మొహంతో ఆ రాక్షసి ఇలా అన్నది. “ప్రియనాథా! నీకు నేను పెళ్లాన్నవుతాను. మనం బతికినంత కాలం అడవుల్లో ఏటి ఒడ్డుల్లో ఆడుకుందాం. త్వరగా రా...పోదాం. నా పేరు అయోముఖి అంటారు”. ఇలా ఆమె చెప్పగా లక్ష్మణుడు కోపంతో, కత్తి దూసి, దాని ముక్కు, చెవులు, చన్నులు నరికాడు. అది మొర్రో అంటూ మొత్తుకుం తూ వచ్చిన దోవలో వెళ్లింది. అది పోగానే, తమ దారిలో అడవిలో పోతున్న సమయంలో రామచంద్రమూర్తితో లక్ష్మణుడు ఇలా అన్నాడు. “అన్నా! గుండె చెదిరింది. ఎడమ భుజం అదురుతున్నది. ఏదో కీడు కలగబోతున్నట్లు అనిపిస్తున్నది. అన్నా! నా మాట విను. మనకేదో నష్టం రాబోతున్నది. యుద్ధ ప్రయత్నంలో వుందాం. కష్టం వచ్చినా మనకు జయం కలుగుతుందని కూడా శకునాల ద్వారా అర్థమవుతున్నది”. అని లక్ష్మణుడు చెప్పగా వాళ్లిద్దరూ అడవుల్లో వెతుక్కుంటూ పోతుండగా వారికి అడవిని చీల్చుకుంటూ పెద్ద ధ్వని వినిపించింది. అదేంటోనని అడవిలో వెతుకుతుంటే ఒకచోట ఒక భయంకరాకారం కనిపించింది.


         పర్వతంలాంటి పెద్ద దేహం, పెద్ద రొమ్ము, తల-మెడ లేకుండా, బిరుసు వెంట్రుకలు, నల్లటి మబ్బు లాంటి, ఉరుము లాంటి ధ్వని, నిప్పుల్లాంటి ఒంటి పెద్ద కన్ను, పెద్ద కోరలు, జింక-ఏనుగు మొదలైన అడవి మృగాలతో ఆడుకునే ఆసక్తి, యోజనం పొడుగు చేతులు కలవాదిని, నోరు తెరిచి వున్న వాడిని, తమ దారికి అడ్డంగా వున్నా వాడిని, కబంధుడిని సమీపించారు రామలక్ష్మణులు. ఆ రాక్షసుడు వీళ్ళిద్దరినీ తన రెండు చేతులతో పట్టుకున్నాడు. సూర్య తేజస్సు లాంటి తేజస్సు ఉన్నప్పటికీ, పెద్ద-పెద్ద విల్లు బాణాలు ఉన్నప్పటికీ, చేత కత్తులున్నా, మహా బలవంతులైనా, ఆ సమయంలో వారిద్దరూ శత్రువు చేత చిక్కి ఆపదపాలయ్యారు. ధైర్యం, పరాక్రమం కల రామచంద్రమూర్తి వాటిని వదలలేదు. చిన్నవాడైనా లక్ష్మణుడు ధైర్యం చెడలేదు. అయినా, వ్యసనపడుతూ అన్నతో ఇలా అన్నాడు.

         “అన్నా! నాగతి చూశావా? రాక్షసుడి చేతుల్లో చిక్కుకున్నాను. వీడి నోట్లో పడేట్లు నన్ను వదిలి నువ్వైనా దూరంగా పరుగెత్తు. ఇద్దరిలో ఒకరు బతికినా మంచిదే కదా? ఏవిధంగానైనా నువ్వు నీ భార్యను కలుసుకుంటావని తోస్తున్నది. కాబట్టి నిన్ను ఒకటి ప్రార్థిస్తున్నాను. నువ్వు రాజువై రాజ్యసంపద పూర్తిగా అనుభవిస్తున్నప్పుడు నన్ను మర్చిపోవద్దు”. అని లక్ష్మణుడు చెప్పగా, విని రామచంద్రుడు “లక్ష్మణా! నువ్వు కూడా పిరికివాదిలాగా, పామరుడిలాగా బాధపడ్తున్నావా? ఇప్పుడెం మించిపోయింది?”. ఇలా వాళ్లిద్దరూ మాట్లాడుకుంటుంటే ఆ భయంకర రాక్షసుడు ఇలా అన్నాడు.

         “మీరెవరు? విల్లు, బాణాలు, కత్తులు ధరించి వాదికోమ్ముల కోడెల్లాగా తిరుగుతున్నారు. ఆకలిగా వున్న నానోట్లో పడడానికి ఇంతదూరం ఎందుకు వచ్చారు? నాబారిన పడ్డ మీరు ఏ ఉపాయం చేసినా బతకలేరు. మీకు వందేళ్ళు నేటితో ముగిశాయి”. అని ఇలా గర్వంతో అంటున్న రాక్షసుడి మాట విని తమ్ముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు రాముడు. “కష్టం మీద కష్టం కలుగుతున్న మనకు చివరకు ప్రాణానికే ముప్పు వచ్చింది. ప్రియురాలు లభించకపోతే పోయే. భార్యను పోగొట్టుకుని మళ్లీ రాబట్టుకోలేక పోయాదన్న అపకీర్తికి తోడూ రాముడు అడవిలో చచ్చాడన్న అపకీర్తి కూడా వస్తున్నది. ప్రియురాలిని కష్టం నుండి తప్పించలేకపోయాను. ఆ పని అయినట్లియితే మరణ భయం లేదు. ఔరౌరా! ఏం ఆశ్చర్యం? భూమ్మీద పుట్టిన ప్రాణులపైన కాలానికి ఎంత శౌర్యం వుందో చూశావా? నిన్ను, నన్ను కూడా దుఃఖంతో కృశించేట్లు చేసింది. మనగతే ఇలా వుంటే, కాలాని వశపడకుండా తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం? ఎంత గొప్ప ధైర్యంకలవారు, సత్య పరాక్రములు, లక్ష్యసిద్ధి కలవారు, యుద్ధంలో శత్రువులకు సహించలేని పరాక్రమం వున్నా కాలం అనుకూలించకపోతే, ప్రతికూలిస్తే, నిర్వీర్యులై పడిపోతారు. దైవం ప్రాణులను చంపాలనుకుంటే అసాధ్యం ఏదీ లేదు. విధికి అసాధ్యం వుందా?