Saturday, October 30, 2010

ఇందిరా గాంధి-ఆత్మ స్థయిర్యం, నిరంకుశ ధోరణి, రాజీ పడని మనస్తత్వం : వనం జ్వాలా నరసింహారావు

ఇందిరా గాంధి మరణించి అక్టోబర్ 31, 2010 కి
26 సంవత్సరాలైన సందర్భంగా

అస్థిర పాలన కంటే నియంతృత్వ ప్రజాస్వామ్యమే
మెరుగైందని తీర్పు చెప్పిన భారత ఓటరు
వనం జ్వాలా నరసింహారావు

ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో గోల్డెన్‌ టెంపుల్-హర్మందిర్ సాహిబ్ పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగరక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ లు జరిపిన కాల్పుల్లో ఇందిరా గాంధి హత్యకు గురై 26 సంవత్సరాలు నిండాయి. బియాంత్ సింగ్ ను ఇతర బాడీ గార్డులు తక్షణమే కాల్చి చంపగా, సత్వంత్ సింగ్ ను, హత్యకు కుట్రపన్నాడన్న అభియోగంపై కేహార్ సింగ్ ను, ఐదేళ్ల తర్వాత తీహారీ జైలులో ఉరితీశారు. ఇందిరా గాంధి మరణించి పాతికేళ్లు దాటినా జాతీయ-అంతర్జాతీయ రంగాలలో ఆమె మిగిల్చిన గుర్తులు అజరామరంగా అశేష ప్రజానీకం గుండెల్లో గూడుకట్టుకున్నాయి. కోట్లాది ప్రజలు అమెనెంతగా అభిమానించేవారో, అంత మోతాదులోనే, ఆమెలోని మంచి చెడులను నిశితంగా విమర్శించేవారు ఇప్పటికీ చాలామంది వున్నారు. ఆమె దో అరుదైన వ్యక్తిత్వం.

సుమారు పదహారేళ్ల పాటు భారత ప్రధాన మంత్రిగా వున్న ఇందిరా గాంధీ, దృఢమైన ఆత్మ స్థయిర్యం, నిరంకుశ ధోరణి, రాజీ పడని మనస్తత్వం కలబోసిన అరుదైన వ్యక్తిత్వంతో, సంక్లిష్టమైన పరిస్థితుల్లో వున్న దేశానికి, సమర్థవంతమైన పరిపాలనను అందించి చరిత్రలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. సర్వేపల్లి రాధా కృష్ణన్, జకీర్ హుస్సేన్, వరాహగిరి వెంకట గిరి, ఫకృద్దీన్ అలీ అహమ్మద్, నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్ సింగ్ లు రాష్ట్రపతులుగా వున్నప్పుడు ఆమె ప్రధాన మంత్రిగా పనిచేశారు. ఆర్థిక, విదేశాంగ, సమాచార శాఖలను నిర్వహించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న "సిండికేట్" నాయకత్వాన్ని ధిక్కరించి, పార్టీని చీల్చి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంది. ఎమర్జెన్సీ అనంతరం ఓడిన కాంగ్రెస్ పార్టీని, మరో మారు చీల్చి, ఇందిరా కాంగ్రెస్ గా నామకరణం చేసి, రెండేళ్లకే మళ్ళీ అధికారంలోకి వచ్చి, పాలనా పగ్గాలను-పార్టీ పగ్గాలను తన చేతుల్లో వుంచుకుంది. తనకు ఎదురు లేకుండా, ఎదిరించిన వారికి పుట్ట గతులు లేకుండా, ఏకచ్ఛత్రాధిపత్యంగా, మకుటంలేని మహారాణిగా దేశాన్ని ఏలింది. నియంతృత్వ ప్రజాస్వామ్యమంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది.

రాజకీయాలకు నిలయమైన కుటుంబంలో జన్మించి, రాజకీయాల్లో మునిగితేలుతుండె వాతావరణంలో పెరిగి, జవహర్లాల్ అడుగుజాడల్లో బహుముఖ రంగాల్లో తీర్చి దిద్దబడి, అవకాశం వచ్చిన వెంటనే అత్యున్నత పదవిని పొంది, తండ్రికంటే మిన్నగా ఆ పదవికి వన్నె తెచ్చి, అధికారంలో వున్నా-లేకపోయినా అత్యంత బలీయమైన శక్తిగా గుర్తింపు పొంది, వైరి వర్గాలను నామరూపాలు లేకుండా చేయగలిగే స్థాయికెదిగి, తనకు తానే సాటి అనిపించుకున్న ఇందిరా గాంధీతో పోల్చతగ్గవారు చాలా అరుదుగా వుంటారనడం అతిశయోక్తి కాదే మో! తండ్రి చాటు బిడ్డగా వుంటూ, అనధికారిక ఆంతరంగికురాలిగా ఎదుగుతూ, కూతురుగా వారసత్వ అధికారాన్ని వంశపారంపర్యంగా-తరతరాలుగా, తమ కుటుంబీకులకే దక్కే విధంగా వ్యూహం పన్నిన ఇందిరా గాంధీ, నవ భారత వర్తమాన చరిత్రలో వేరెవరూ సాధించలేని దాన్ని అవలీలగా సాధించగలిగిన వ్యక్తిగా చిర స్థాయిగా మిగిలిపోతుంది. విధి వక్రీకరించి, సంజయ్ గాంధీని ప్రధాన మంత్రిగా తేలేకపోయిన ఇందిర, తన తదనంతరం రాజీవ్ గాంధీ ప్రధాని కావడానికి రంగం సిద్ధం చేసింది. భవిష్యత్‌లో ఆ పరంపర కొనసాగడానికి చేయాల్సిన దంతా చేసింది.

ఇందిర ప్రియదర్శిని బాల్యమంతా ఒంటరితనంతోనే గడపాల్సి వచ్చింది. అలహాబాద్ లోని ఆమె కుటుంబం వుంటుండే ఇల్లు స్వాతంత్ర్య సంగ్రామానికి ప్రధాన కార్యాలయంగా వుండేది. తాత, తండ్రి తరచుగా జైలుకెళ్ళి వస్తుండడం ఇందిరా గాంధీకి గుర్తున్న విషయాల్లో ముఖ్యమైంది. చిన్న పిల్లల ఆట వస్తువులు కాని, ఆటలు కాని ఆమెకు తెలియవు. ఆడిన ఆటల్లా, ఒక నాయకురాలిగా, మూడేళ్ల వయసులోనే బల్లపైకెక్కి, ఇంట్లో పనిచేసే వారందరికీ రాజకీయ ఉపన్యాసాలివ్వడం-తనను తానే జోన్ ఆఫ్ ఆర్క్ లాగా ఊహించుకోవడం. పెద్ద వారెవరూ అందుబాటులో లేనందున, యువరాణిలా ఎదుగుతున్న ఇందిరలో ఒకరకమైన అహంభావం పెరిగినట్లు ఆమే ఒక సందర్భంలో చెప్పింది. ఇంటిమీద పోలీసు దాడులు జరగడం, సాధారణ జీవనం కొరవడడం, ఇంట్లో వారిని అరెస్టు చేసి జైలుకు పట్టుకెళ్లడం లాంటివి నిత్యం ఆమెకు అనుభవంలోకి వచ్చేవి.

అణుయుగంలో, అంతరిక్ష యుగంలో భారతదేశాన్ని అడుగు పెట్టించిన ఘనత ఇందిరా గాంధీదే. సోవియట్ వ్యోమ నౌకలో భారతీయులను పంపడానికి చొరవ తీసుకుంది ఆమే. ఇండియా-పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ను ఘోరంగా ఓడించి, దానిలో అంతర్భాగంగా వున్న ప్రాంతాన్ని విడిపోయేందుకు దోహదపడి, బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారకురాలై, ప్రపంచంలో భారతదేశాన్ని ఒక బలీయమైన శక్తిగా రూపుదిద్దిన ఘనత కూడా ఇందిరా గాంధీదే. అంతర్జాతీయ రంగంలో ఎవరి పక్షం వహించదని, తమ విదేశాంగ విధానం "భారత అనుకూల విధానం" అనీ ఎలుగెత్తి చాటి చెపుతూ, అలీన విధానాన్ని పాటించే దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్ళింది ఇందిరా గాంధీ. సోవియట్ యూనియన్ తో మైత్రి చేసినప్పటికీ, అమెరికా వ్యతిరేకిగా ముద్ర పడకుండా జాగ్రత్త పడింది. అవసరమైనప్పుడు, తప్పదనుకున్నప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఎదురు తిరిగి తన సత్తా ఏమిటో నిరూపించింది.

ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా మలిచే ప్రయత్నంలో అప్రయత్నంగానే నిరంకుశత్వం అలవరచుకుంది ఇందిరా గాంధీ. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బలమైన కేంద్రం దిశగా ఆమె విధానాలు రూపుదిద్దుకోసాగాయి. పార్టీ పరంగా కూడా నియంతృత్వ ధోరణులే అవలంబించసాగింది. తన పార్టీకి చెందిన ముఖ్యమంత్రులను ఇష్టమొచ్చిన రీతిలో మార్చడం, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను ఇబ్బందులకు గురి చేయడం, అధికారాలను కేంద్రీకరించడం ఆనవాయితీగా మారిపోయింది. కమ్యూనిస్టు వ్యతిరేకతతో రాజకీయ ఆరంగేట్రం చేసిన ఇందిర, కాంగ్రెస్ లోని సిండికేట్ పై విజయం సాధించడానికి వామ పక్షాలను కలుపుకుంది. "కమ్యూనిజం" కంటే "కమ్యూనలిజం" వల్లే ప్రమాదం అంటూ అలనాటి జనసంఘ్ లాంటి పార్టీలను ఎదగకుండా చేసింది. ఎప్పుడైతే, ఎమర్జెన్సీ విధింపుకు వ్యతిరేకంగా కాంగ్రేసేతర పార్టీలన్నీ ఏకమయ్యాయో, వారూ-వీరూ అనే తేడా లేకుండా, తన విధానాలను వ్యతిరేకించిన అందరినీ జైళ్లకు పంపడానికి వెనుకాడలేదు. ఇరవై సూత్రాల ఆర్థిక ప్రణాళికైనా, గరీబీ హటావో పథకమైనా, బాంకుల జాతీయ కరణైనా, గ్రామీణ బాంకుల స్థాపనైనా, రాజ్యాంగ సవరణలైనా, సవరణలలో భాగంగా అవతారికలో "సామ్యవాదం, లౌకిక వాదం" అన్న పదాలను చేర్చడమైనా, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రాధమిక హక్కులకంటే ముఖ్యమైనవని చెప్పడమైనా, మరేదైనా, ఏమి చెప్పినా-చేసినా, ఇందిరా గాంధీ మనసులో మాట ఒకటే. భారత దేశానికి నాయకత్వం వహించగలిగేది తానే అని-తాను దానికోసమే జన్మించానని ఆమె నమ్మకం. ఆ నమ్మకంతోనే ఆమె అనుకున్న కార్యం సాధించడానికి దేనికైనా వెనుకాడక పోయేది. ఆ నమ్మకమే ఆమె గెలుపుకు సోపానాలయ్యాయి-ఓటమికి కారణాలయ్యాయి.

ఇందిరా గాంధీలో సహనం, అసహనం సమపాళ్లలో వుండేవని, ఎప్పుడు దూకుడుగా వ్యవహరించే దో, ఎప్పుడు నిశ్శబ్దంగా పనులు చక్కబెట్టే దో, ఎందుకు ఒంటరిగా వుండదలుచుకునేదో, ఎప్పుడు-ఎందుకు ఏ పని చేసే దో కనుక్కోవడం అంత తేలిక కాదని మీడియాలో కథనాలొచ్చేవి. ఒకరిని చేరదీయడంలోను, ఇంకొకరిని పక్కన పెట్టడంలోను, ఆమెకు ఆమే సాటి. అమెరికా అధ్యక్షుడుగా పనిచేసిన రిచర్డ్ నిక్సన్ ఆ దేశ ప్రయివేట్ పౌరుడిగా, ప్రధాని ఇందిరను కలిసిన సమయంలో, ఇరవై నిమిషాలు గడిచిన తర్వాత, ఇంకెంత సేపు ఆ సమావేశం కొనసాగుతుందని, నిక్సన్ వెంట వచ్చిన విదేశాంగ ప్రతినిధిని హిందీలో అసహనంగా ప్రశ్నించిందట ఆమె. ప్రశ్న హిందీలో వేసినా, దాని గూడార్థాన్ని గ్రహించిన నిక్సన్ సంభాషణను త్వరగా ముగించి వెళ్ళాడని అనధికార వార్తగా పత్రికలు ప్రచురించాయి అప్పట్లో. అందులోని నిజానిజాలు ఎంతవరకో గాని, ఆమెలోని అసహనం పాలు ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువై, ఇంటర్వ్యూలలో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోవడమో, నిశ్శబ్దం పాటించడమో, అదో రకంగా నవ్వు ముఖం పెట్టడమో, ఎదురు ప్రశ్నలు వేయడమో చేసేదని విశ్లేషకులు అంటుండేవారు.

ఆక్స్ ఫర్డ్ లో చదువుకుంటున్న రోజుల్లో బ్రిటీష్ లేబర్ పార్టీ విద్యార్థి విభాగం కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే ది. రెండవ ప్రపంచ యుద్ధం రోజుల్లో, రెడ్ క్రాస్ వాలంటీర్ గా చేరి, కొంతకాలం అంబులెన్స్ డ్రైవర్ కూడా పనిచేసింది. స్వదేశానికి తిరిగొచ్చే సమయంలో ఆమె వెంట, చిన్ననాటి స్నేహితుడు, కాంగ్రెస్ పార్టీలో అప్పటికే చురుగ్గా పాల్గొంటున్న అలహాబాద్ పాత్రికేయుడు ఫిరోజ్ గాంధీ కూడా వున్నారు. తామిద్దరం వివాహం చేసుకుంటామని ఇందిర ప్రకటించడంతో కుటుంబ సభ్యులు ఇబ్బందికి లోనయ్యారు. ఇరువురి దీ ఒక మతం కాదు-ఒక కులం కాదు. అయినా, ఇద్దరి వివాహం జరగడం, కొద్ది కాలంలోనే ఇరువురు జైలు జీవితం గడపాల్సి రావడం, ఆ తర్వాత విడుదలై వైవాహిక జీవితం గడపడం, రాజీవ్-సంజయ్ లు పుట్టడం ఒకటి వెంట ఒకటి జరిగింది నాలుగేళ్లలోపు.

జైలులో వున్న తండ్రి జవహర్లాల్ నెహ్రూ తనకు రాసిన ఉత్తరాలలో వర్తమాన ప్రపంచ చరిత్రతో పాటు ప్రాచీన, భవిష్యత్ దర్శనం కలిగే విధంగా ఎన్నో విషయాలను ఇందిరా గాంధీ తెలుసుకోగలిగింది. సంజయ్ గాంధీ పుట్టిన సంవత్సరంలోనే నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. తండ్రి దగ్గరకు వచ్చే వారికి ఆతిథ్యం సమకూర్చే బాధ్యతలను, అనధికారికంగా ఇందిర చేపట్టాల్సి వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదే కొనసాగింది. ఇష్టంగానో-అయిష్టంగానే ఆమె తన బాధ్యతలను కర్తవ్య పరాయణ తో నిర్వర్తించింది. తండ్రితో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం ఏర్పడడంతో, ఆమె అవసరం నెహ్రూకు కూడా పెరిగి పోవడంతో, ఫిరోజ్ తో గడిపే వీలు తగ్గి, చివరకు వేర్వేరుగా జీవించే పరిస్థితి కలిగింది. ఆయన చనిపోయేంతవరకూ అంతే కొనసాగింది.

జవహర్లాల్ ను కలవడానికొచ్చిన దేశ-విదేశీయ ప్రముఖులు, రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, పాత్రికేయులు, విద్యావేత్తలు, సామాజిక శాస్త్రజ్ఞులు, ఆయన పక్షాన ఆతిథ్య బాధ్యతలు బిడియంగా చేపట్టిన ఇందిరను, తండ్రి చాటు బిడ్డగా నెహ్రూ కూతురుగానే చూసేవారు. ఆమె రాజకీయ పాత్ర పోషించకుండా వుండలేని పరిస్థితికి చేరుకుంది. జవహర్లాల్ వెంట దేశ-విదేశాల్లో కలిసి తిరగడంతో, లక్షలాది మంది భారతీయులకు, చాలా మంది విదేశ ప్రముఖులకు, ఇందిరా గాంధీ సుపరిచితురాలైంది. 1955 లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీకి ఎన్నుకోవడంతో, జాతీయ స్థాయిలో స్వతంత్రంగా గుర్తింపు లభించినట్లయింది. నాలుగేళ్ల అనంతరం, నాలుగు పదుల వయస్సులో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఇందిర, ఏడాది కాలంలో తన రాజకీయ సమర్థతను, కాఠిన్యాన్ని ప్రదర్శించిందనాలి. ప్రపంచ చరిత్రలోనే ప్రప్రధమంగా బాలట్ ద్వారా అధికారంలోకి వచ్చిన కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేయించడంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత జరిగిన ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు విజయం సాధించి పెట్టింది. ఇందిరా గాంధీ మరో సారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సుముఖత చూపలేదు. తండ్రి మరణానంతరం, లాల్ బహదూర్ మంత్రివర్గంలో సమాచార-ప్రసార శాఖను చేపట్టింది. శాస్త్రి హఠాన్మరణం దరిమిలా, కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం వున్నా లేకపోయినా, ఇందిరను ప్రధాన మంత్రిని చేశారు. ఇక అక్కడి నుంచి ఇందిర అధ్యాయం మొదలైంది. ఎవరూ ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాలణ మొదలైంది ఆమె నేతృత్వంలో.

తమ ధోరణికి అనుకూలించడనుకున్న మొరార్జీ ప్రధాన మంత్రి కాకూడదనే ఆలోచనతో, తమ అదుపు ఆజ్ఞల్లో-కనుసన్నల్లో నడుచుకుంటుదన్న ధీమాతో కామరాజ్ నాడార్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి లాంటి వారు ఇందిరా గాంధీ వైపు మొగ్గు చూపారే కాని, భవిష్యత్ లో ఆమె నుంచి పొంచి వున్న ప్రమాదాన్ని పసికట్ట లేకపోయారు. అనిశ్చిత పరిస్థితుల నడుమ, ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదికి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధించడంతో భవిష్యత్ పై దృష్టి సారించింది ఇందిరా గాంధీ. జాతీయ స్థాయిలో యావత్ భారత దేశ ప్రజలంగీకరించే ఏకైక నాయకురాలు తానేనని గ్రహించింది ఆమె. పార్టీ ప్రక్షాలణకు సమయం ఆసన్నమైందని, ప్రజలకు తాను మరింత చేరువ కావాలంటే, సామ్యవాద పంథాలో పయనించడం మినహా మార్గం లేదని విశ్వసించింది. తదనుగుణంగా ప్రభుత్వ పథకాల రూపకల్పనకు అంకురార్పణ చేయసాగింది.

అకస్మాత్తుగా మరణించిన రాష్టపతి జకీర్ హుస్సేన్ స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో పార్టీలోని విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. ఇందిరా గాంధీని విమర్శించే నీలం సంజీవరెడ్డిని ఇందిర వ్యతిరేక కాంగ్రెస్ అధిష్టాన వర్గం అభ్యర్థిగా నిర్ణయించింది. ఆయననే ప్రతిపాదించిన ఇందిరా గాంధీ, ఓటింగులో, స్వతంత్ర అభ్యర్థి వీవీ గిరికి మద్దతును బహిరంగంగానే ప్రకటించి, తన వారందరినీ ఆయనకే ఓటెయ్యమని సూచించింది. ఆమే నెగ్గింది. నీలం ఓటమి పాలయ్యారు. అగ్నికి ఆజ్యం పోసినట్లు, తన వ్యతిరేక వర్గానికి చెందిన మొరార్జీ దేశాయ్ ని మంత్రివర్గంలోంచి వెళ్లిపోయే పరిస్థితులు కలిపించింది. క్రమశిక్షణను ఉల్లంఘించిందన్న ఆరోపణపై, వృద్ధ నాయకత్వం ఆమెను పార్టీ నుంచి తొలగించడంతో, వారందరినీ అభివృద్ధి నిరోధక శక్తులు గాను-సామ్యవాద పథకాలను అడ్డుకునేవారి గాను చిత్రించింది ఇందిరా గాంధీ. పార్లమెంటరీ పార్టీ ఆమె పట్ల విశ్వాసం ప్రకటించడంతో, ఆమె ప్రధాన పదవికి ఢోకా లేకపోగా, పార్టీ చీలిపోయింది. ఇందిర పార్టీని చీల్చింది. ఏడాది ముందే 1971 లో ఎన్నికలకు పోయి, అఖండ విజయం సాధించి పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించింది.

భారత-పాకిస్తాన్ యుద్ధంలో, ఇందిర నేతృత్వంలోని భారతదేశం అఖండ విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఉపఖండంలో తిరుగులేని శక్తిగా భారత దేశానికి పేరు తెచ్చింది. ఇందిరా గాంధీని ద్వేషించే అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ తన సంపూర్ణ మద్దతును పాకిస్తాన్ కు ఇచ్చిన నేపధ్యంలో, యుద్ధానంతరం ఆయనకొక ఘాటైన ఉత్తరం రాసిందామె. లక్షలాది మంది తూర్పు పాకిస్తాన్ శరణార్థులు సరిహద్దులు దాటి భారత దేశానికి వచ్చి పడుతుంటే, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమకుందని, ఆ కర్తవ్య నిర్వహణలో యుద్ధం చేయాల్సి వస్తే, తాను చేసిన తప్పేమిటో స్పష్టం చేయాలని నిక్సన్ ను ప్రశ్నించింది. ఆ తర్వాత కొద్ది నెలలకు జరిగిన రాష్ట్ర శాసన సభల ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధించింది. ఆమె ప్రభ వెలగ సాగింది. ఆమె ఆరోహణ పర్వం కొనసాగుతుండగానే, అవినీతి ఆరోపణలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులొచ్చాయి. నైతిక విలువలకు కట్టుబడడం లేదని శత్రువులు ఆమెను విమర్శించ సాగారు. ఆమెకు మద్దతు పలుకుతున్న కొందరు స్వపక్షీయులు కూడా వారితో గొంతు కలిపారు. గోరు చుట్టుపై రోకటి పోటులా, అలహాబాద్ హైకోర్టు, లోక్ సభకు ఆమె ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించింది. తక్షణమే ఆమె రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండు చేశాయి. రాజీనామా ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా, యోధాన యోధులైన రాజకీయ నాయకులను నిర్బంధించి, అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అంతర్గత బధ్రత చట్టం కింద వందల, వేల సంఖ్యలో అరెస్టులు చేయించింది. స్వతంత్ర భారత దేశంలో చీకటి రోజులకు తెరలేపింది ఇందిరా గాంధీ.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులు హరించిందని, పత్రికా స్వాతంత్ర్యం కాల రాసిందని దేశ విదేశాల ప్రముఖుల విమర్శలను లెక్క చేయని ఇందిర రాజ్యాంగాన్ని తిరగ రాసింది. తనకు వ్యతిరేకంగా వచ్చిన అలహాబాద్ హైకోర్టు తీర్పునుంచి ఊరట పొందింది. విమర్శకుల నోళ్లు మూయించే ప్రయత్నం చేసింది. దేశ సమైక్యతకు-సమగ్రతకు ముప్పు వాటిల్లిందని, రోగికి చేదు మందిచ్చి బ్రతికించిన విధంగానే, అత్యవసర పరిస్థితి విధింపు తాత్కాలికమే అని నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. ఆర్థిక, రాజకీయ సుస్థిరత కొరకు, జరగాల్సిన సార్వత్రిక ఎన్నికలను ఒక ఏడాది వాయిదా వేసింది. మీడియాపై మరిన్ని ఆంక్షలు విధించింది. అరెస్టు చేసిన రాజకీయ ఖైదీలను విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించడానికి తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఇందిరకు మరింత బలం చేకూరింది. మరిన్ని రాజ్యాంగ సవరణల ద్వారా, అవధులు లేని అధికారాలను ఇందిరా గాంధీ తన సొంతం చేసుకుంది. ఆమె ప్రతిపాదించిన అసాధారణ రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఆమోదం లభించింది. జనవరి 1977 లో ఎన్నికల నిర్ణయం ప్రకటించి, ప్రజలపై-ప్రజా శక్తిపై తనకు అపారమైన విశ్వాసం వుందని, మార్చ్ నెలలో ప్రజల నిర్ణయం కొరకు ఎన్నికలు జరుగుతాయని అన్నది. జైళ్లలో నిర్బంధించిన వారందరినీ విడుదల చేయించింది. భారత దేశం బలీయమైన శక్తిగా ఎదగడానికి బలమైన కేంద్ర ప్రభుత్వం, సుస్థిరమైన కేంద్ర ప్రభుత్వం అవసరమని స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ కాలం నుండి ప్రోత్సహిస్తూ వస్తున్న చిన్న కొడుకు సంజయ్ గాంధీని రాజ్యాంగేతర శక్తిగా ఎదగడానికి తోడ్పడింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయనను ప్రవేశ పెట్టింది. వారసత్వానికి బాటలు వేసింది.

ప్రతి పక్షాలన్నీ ఏకమయ్యాయి. ఆమె అనుంగు సహచరుడు జగ్జీవన్ రాం కూడా బాంబు పేల్చాడు. ప్రతి పక్షాల సరసన చేరాడు. జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలో జనతా పార్టీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జత కట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటంలేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా, జనతా పార్టీ ఓటర్ల ముందుకు పోయింది. మార్చ్ 20, 1977 న జరిగిన లోక సభ ఎన్నికలలో ఇందిరా గాంధీని ఆమె నియోజక వర్గంలోను, ఆమె సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని దేశంలోను దారుణంగా ఓడించారు. కలగాపులగం లాంటి కాంగ్రేసేతర పార్టీల కలయికతో ఏర్పడిన జనతా ప్రభుత్వానికి, ఇందిరా గాంధీ మంత్రి వర్గంలో ఉప ప్రధాన మంత్రిగా చేసిన మొరార్జీ దేశాయ్ ప్రధాన మంత్రిగా సారధ్యం వహించారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తానని, ప్రజల సేవలోనే గడుపుతానని అంటూ పదవికి రాజీనామా చేసింది ఇందిరా గాంధీ.

ఎమర్జెన్సీ అక్రమాలపై విచారణ చేయడానికి జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్ ముందు హాజరవడానికి ఇందిర నిరాకరించింది. అది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, రాజ్యాంగ బద్ధంగా, మంత్రివర్గం సిఫార్సుపై, పార్లమెంటు ఆమోదం లభించిన చర్య అని ఆమె స్పష్టం చేసింది. కమీషన్ ఏర్పాటుకు చట్ట బద్ధత లేదన్నది. అవినీతి ఆరోపణలపై జనతా ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది. బెయిలు తీసుకోమని ప్రభుత్వం ఇచ్చిన సలహాను ఆమె నిరాకరించింది. ఆమె అరెస్టుకు తగిన కారణాలు ప్రభుత్వం చూపలేక పోయిందని, ఆమెను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రయత్నాలు తిరిగి ప్రారంభించింది. తన పార్టీలో తనకు వ్యతిరేకంగా వున్న వారితో బంధాలు తెంచుకుని, మరో మారు పార్టీని చీల్చి, కాంగ్రెస్ (ఐ) ని స్థాపించింది. అదే అసలు సిసలైన భారత జాతీయ కాంగ్రెస్ గా ప్రకటించింది.

కర్నాటకలోని చిక్ మగలూర్ నుంచి ఇందిరా గాంధీ లోక సభకు ఎన్నికవడంతో, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అఖండ విజయం సాధించడంతో ప్రజలు ఆమెకు తిరిగి బ్రహ్మ రధం పట్ట సాగారు. మాజీ ప్రధానిగా తనను వేధించడం తగదని పార్లమెంట్ లోపలా-వెలుపలా పదే పదే జనతా ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఒకానొక సందర్భంలో, లోక్ సభలో సుదీర్ఘ చర్చ అనంతరం, ఇందిరా గాంధీ సభ్యత్వం రద్దుచేయాలని, సమావేశాలు ముగిసేవరకు అరెస్ట్ చేయాలని, ప్రధాని మొరార్జీ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. పార్లమెంట్ హాలును వదిలి వెళ్లనని, తననక్కడే అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తూ భీష్మించుకుని కూచుంది ఇందిరా గాంధీ. అరెస్ట్ చేయడానికి వచ్చిన అధికారులకు నమస్తే చెపుతూ వారి వెంట వెళ్లింది. ఆమె అరెస్టుకు నిరసనగా లక్షలాది మంది అభిమానులు ఆందోళన చేశారు. అరెస్టయ్యారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ఆమెను విడుదల చేసింది ప్రభుత్వం. ఆమెను వదిలి వెళ్లిన కాంగ్రెస్ నేతలు, ప్రజల నుండి లభిస్తున్న అభిమానాన్ని గమనించి తిరిగి ఆమె పంచన చేరారు. ఇంతలో అంతర్గత వైరుధ్యాల మధ్య జనతా ప్రభుత్వం కూలిపోయే దశకు చేరుకుంది.

జులై 1979 లో మొరార్జీ దేశాయ్ రాజీనామా చేశారు. దానికి కారణ భూతుడైన చరణ్ సింగ్ కు మద్దతు పలికి, వ్యూహాత్మకంగా ఆయన ప్రధాన మంత్రి కావడానికి తోడ్పడింది ఇందిరా గాంధీ. తనపై మొరార్జీ ప్రభుత్వం చేసిన అవినీతి ఆరోపణలను ఉపసంహరించుకోవడానికి నిరాకరించిన చరణ్ సింగ్ ప్రభుత్వాన్ని విశ్వాస తీర్మానంలో ఓటమి పాలు చేసింది. ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా వున్న చరణ్ సింగ్ ఆచరణలో ఇందిర ప్రతినిధిగానే పాలన చేశాడనాలి. జనవరి 1980 లో జరిగిన మధ్యంతర ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ (ఐ), మూడింట రెండు వంతుల మెజారిటీతో అఖండ విజయం సాధించింది. సుస్థిరతా-అస్థిరతా అన్న నినాదంతో ఇందిరా గాంధీ ఎన్నికల బరిలో దిగి గెలిచింది. సుస్థిరతే ముఖ్యమని భారత దేశ ఓటర్లు స్పష్టం చేశారు. అస్థిర పాలన కంటే, నియంతృత్వ ప్రజాస్వామ్యమే మెరుగైందని ఓటర్లు తీర్పిచ్చారు. దాని రూపకర్త ఇందిరా గాంధీని మరో మారు ప్రధానిని చేశారు.

Tuesday, October 26, 2010

సమష్ఠి బాధ్యతా రాహిత్యంతో నానాటికి కొరవడుతున్న విశ్వాసం : వనం జ్వాలా నరసింహారావు

సమష్ఠి బాధ్యతా రాహిత్యంతో నానాటికి కొరవడుతున్న విశ్వాసం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర ప్రభ దిన పత్రిక (28-10-2010)

కొందరు మంత్రులు తమ శాఖలను పట్టించుకోవడం లేదని, విధాన నిర్ణయాల విషయంలో పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి ఆదేశాలనే బే ఖాతరు చేస్తున్నారని, స్వీయ నిర్ణయాలు తీసుకోవడానికి జంకి ముఖ్యమంత్రిపై భారం మోపుతున్నారని వార్తలొస్తున్నాయి. సంస్కరణల పేరుతో మంత్రులకు తెలియకుండా-ముఖ్యమంత్రి దృష్టికి పోనీ కుండా కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలను గురించి సీఎం ను అడిగితే ఆయన అమాయకంగా స్పందిస్తున్నట్లు, సంబంధిత శాఖ మంత్రిని వివరణ అడుగుతే తనకూ తెలియదని జవాబిస్తున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. దీనికి తోడు మంత్రి వర్గ నిర్ణయాలు సమిష్టి బాధ్యతగా భావించడం ఏ మంత్రీ పాటించడం లేదని, మంత్రులకు అధికారులకు మధ్య విధాన నిర్ణయాల విషయంలోను-పథకాల అమలు విషయంలోను-రాజశేఖర రెడ్డి హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలను తిరగ తోడే విషయంలోను, అవగాహనా రాహిత్యం పూర్తి స్థాయిలో చోటుచేసుకుంటున్నదని కూడా వార్తలొస్తున్నాయి.

చాలా మంది మంత్రులు తనకు గుదిబండలుగా పరిణమించినట్లు, సగానికి పైగా మంత్రులు క్రియాశీల రాహిత్యంగా-నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నట్లు, సచివులు మొక్కుబడి కోసం పనిచేస్తున్నారే తప్ప ప్రభుత్వ ప్రతిష్ఠను కాపాడే ఉద్దేశంతో కానట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆయనలోని అసహనం హద్దులు దాటి, మీడియా వీటికి సంబంధించిన అంశాలపై పరోక్షంగా ప్రశ్నలు గుప్పిస్తుంటే, "పొరపాటునో గ్రహపాటునో సీఎం అయినంత మాత్రాన అన్ని విషయాలూ ఫింగర్‌ టిప్స్ పైన ఉంటాయా?'' అని అన్నట్లు పత్రికలు రాశాయి. అలానే, ఒకానొక అతి ముఖ్యమైన విషయంలో ముఖ్యమంత్రి సంబంధిత ఫైలు మీద సంతకం పెట్టి విధి విధానాలను రూపొందించమని మంత్రికి సూచించినప్పటికీ, ఆ విషయంలో ఆయన మీడియాకు బాధ్యతా రాహిత్యంగా సమాధానాలు ఇచ్చినట్లు కూడా వార్తలొచ్చాయి. ఒకే విషయాన్ని తనను, ముఖ్యమంత్రిని అడగడమంటే, ఇద్దరి మధ్య పుల్లలు పెట్టే ప్రయత్నంగా ఆ మంత్రి అనడం, సమిష్టి బాధ్యతా రాహిత్యానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. ఇదిలా వుండగా, వరదల్లో వైఫల్యం, విత్తనాల పంపిణీ, గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యం, నిత్యావసర ధరలు, నకిలీ విత్తనాలు, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు డిమాండ్లు, తెలంగాణ న్యాయవాదుల పోరాటం, సోంపేటలో రైతులపై కాల్పులు, బయ్యారం గనులు, ఆరోగ్య సేవలు, మైక్రో ఫైనాన్స్ ఆగడాల లాంటి పలు సమస్యలకు సంబంధించి అధికారుల నుంచి సరైన సమాచారం ముఖ్య మంత్రి స్థాయిలో ప్రభుత్వానికి చేరుతున్నట్లు కూడా కనిపించడం లేదు.

మన రాష్ట్రంలో మంత్రులకు-మంత్రులకు మధ్య, మంత్రులకు-ముఖ్య మంత్రికి మధ్య, మంత్రులకు, ముఖ్యమంత్రికి-సంబంధిత శాఖ అధికారులకు మధ్య అగాధం నానాటికి పెరిగిపోతోంది.. పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో మంత్రికి రాజ్యాంగ పరంగా ఎంత బాధ్యత ఉందో, సివిల్ సర్వెంట్లకూ అంతే బాధ్యతే ఉంటుంది.. అధికారికీ, మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే ప్రభుత్వ పనితీరు, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం మెరుగుపడతాయి... అనుభవజ్ఞులైన మంత్రులు అధికారులతో ఎలా పనిచేయించుకోగలుగుతారో, అలానే అనుభవం లేని మంత్రులను కొందరు అధికారులు బురిడీ కొట్టించగలుగుతారు. సంస్కరణల పేరిట పాత పథకాలకు పేర్లు మార్చడమో, నీరు కార్చడమో చేసి సంబంధిత శాఖ మంత్రికి, ముఖ్య మంత్రికి విషయం తెలిసే లోపున ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తారు. ఇటీవల కాలంలో ఇవన్నీ మామూలై పోయాయి.

కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు దాటినా, ఆయన మంత్రివర్గంలోని చాలామందికి తమ శాఖకు చెందిన ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి, శాఖాధిపతులతో నేటికీ సత్సంబంధాలు ఏర్పడలేదు. అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు సీనియర్ అధికారులు సంబంధిత మంత్రి నుంచి కాకుండా ఇతర మంత్రులనుంచి ఆదేశాలు తీసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. నేరుగా ముఖ్యమంత్రికి మాత్రమే తాము జవాబుదారీ అనే ధోరణి కూడా కొంతమంది అధికారుల్లో కనిపిస్తోంది.

ఇలాంటి పరిణామాల నేపధ్యంలో, సివిల్ సర్వెంట్లకు-మంత్రులకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలన్న చర్చ మొదలైంది. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. బ్రిటిష్ సంప్రదాయాలనే చాలావరకు మనం అనుకరిస్తున్నాం, అన్వయించుకుంటున్నాం. ఆచరణలోకి వచ్చేటప్పటికి, కొన్ని సందర్భాల్లో మనదైన శైలిలో నడుస్తున్నాం. మంత్రులకూ-సివిల్ సర్వెంట్లకూ మధ్య ఉండాల్సిన సంబంధాల విషయంలో ఇరువురూ ఎవరికి తోచిన సంప్రదాయాలను వారు పాటిస్తున్నారు. మంత్రులకూ-సివిల్ సర్వెంట్లకు మధ్య ఉండాల్సిన సంబంధాలను, సివిల్ సర్వెంట్ల కర్తవ్యాలు-బాధ్యతలను, బ్రిటన్ లో రూపొందించిన" ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండం" లో వివరించారు. పదేళ్ల క్రితం ఆ మెమొరాండానికి కొన్ని సవరణలు చేశారు. వాటిని పరిగణనలోకి తీసుకొని, ప్రస్తుతం మన రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను సమీక్షించడం సబబు. మెమొరాండంలో పేర్కొన్నట్లు రాజ్యాంగ పరంగా ఆలోచిస్తే మంత్రులు చట్టసభలకు జవాబుదారీ అయినట్లే, సివిల్ సర్వెంట్లు (అధికారులు) మంత్రులకు జవాబుదారీగా ఉండాలి. మంత్రులకు అంటే, ప్రజాతీర్పు ద్వారా ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని అర్ధం చేసుకోవాలి. ఏ రాజకీయ పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ ముఖ్య మంత్రి పదవిలో వున్నా, రాజకీయాలతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా ప్రభుత్వానికి సేవలందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. తమ శాఖను నిర్వహిస్తున్న మంత్రి విశ్వాసాన్ని చూరగొనడం వారి ప్రధమ కర్తవ్యం. ప్రభుత్వాలు మారినా వారి ఈ కర్తవ్యం మారదు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి-అంటే సంబంధిత మంత్రికి-వారు అవసరమైన సూచనలు ఇస్తూ, పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో సహకరిస్తూండాలి. తమ ఇష్టాయిష్టాలకు అతీతంగా నిర్ణయాల అమల్లో తోడ్పడుతూ, ఎన్నికల్లో చేసిన వాగ్దానాల అమల్లో ప్రభుత్వానికి అండదండగా ఉండాలి. విదేశాల్లో నేర్చుకున్న పాఠాలను, భారత దేశ పరిస్థితులకు అన్వయించకుండా, యధా తధంగా అప్ప చెప్పడం మానుకోవాలి. అక్కడ విన్నవీ-కన్నవీ, ఆ విషయాలంతగా తెలియని మంత్రులకు చెప్పి, వారు అర్థం చేసుకోకుండా ఒప్పించి, అప్పటివరకూ ప్రజోపయోగంగా వున్న పథకాలను నిష్ప్రయోజనం చేయకూడదు.

ప్రభుత్వమంటే, సమష్టి బాధ్యతతో వివిధ శాఖలను నిర్వహిస్తున్న పూర్తి మంత్రి మండలి. దాని అధినేత ముఖ్యమంత్రి. సంబంధిత శాఖకు చెందిన పాలన విధానాన్ని నిర్ణయించేది ఆ శాఖ మంత్రే అయినా, అది యావత్ మంత్రి మండలి సమష్టి నిర్ణయమే. ఏ ఒక్క మంత్రి తప్పు చేసినా, దానికి అందరూ బాధ్యత వహించాలి అని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. అసలీ విషయం గురించిన ఆలోచనే ఇటీవలి కాలంలో మంత్రులకు రావడం లేదు. పైగా తోటి మంత్రి చేసిన దాన్ని తప్పు పట్టడం, బాహాటంగా మరో మంత్రిని విమర్శించడం, వీలుంటే ముఖ్య మంత్రినే విమర్శించడం, తన పార్టీకి చెందిన వాడే ముఖ్య మంత్రిగా వున్నప్పటికీ మరో వ్యక్తి ఆ పీఠంలోకి వస్తే బాగుంటదని వ్యాఖ్యలు చేయడం, సంబంధిత శాఖ మంత్రికి తాను తీసుకున్న నిర్ణయంపై అవగాహన లేకపోవడం సర్వసాధారణ విషయాలవుతున్నాయి. పాలనాపరమైన విధాన నిర్ణయాల్లో మంత్రికి రాజ్యాంగపరంగా ఏ విధమైన బాధ్యత ఉందో, సివిల్ సర్వెంట్లకూ అలాంటి బాధ్యతే ఉంటుంది. పాలనాపరమైన విధాన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో సంబంధిత శాఖ మంత్రికి ఆ శాఖ ముఖ్య అధికారి పూర్తిగా తోడ్పడాలి. తనకు తెలిసిన సమస్త సమాచారంతోపాటు తన అనుభవాన్నంతా రంగరించి, నిజాయితీగా, నిష్పక్షపాతంగా, రాగద్వేషాలకు అతీతంగా సలహాలు ఇవ్వాలి. మంత్రి ఆలోచన సరళికి భిన్నమైన దైనా, ఇవ్వవలసిన శ్రేష్టమైన సలహా ఇచ్చి తీరాలి.

సివిల్ సర్వెంట్లు మంత్రికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వకపోయినా, తాను అత్యంత శ్రేష్టమని నమ్మిన సలహాకు బదులు వేరే సలహా ఇచ్చినా, మంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని జాప్యం చేసే ప్రయత్నం చేసినా, అది పూర్తి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమవుతుంది. ఇదంతా జరిగిన తరువాత మంత్రి తీసుకునే నిర్ణయం ఏదైనా, దానిపై తనకెన్ని సందేహాలున్నా, అభిప్రాయభేదాలున్నా, అమలు విషయం వచ్చేసరికి ఎటువంటి అరమరికలు లేకుండా చిత్తశుద్ధితో, ద్విగుణీకృతమైన పట్టుదలతో పనిచేయాలని ఆర్మ్ స్ట్రాంగ్ మెమొరాండంలో స్పష్టం చేశారు. అధికారికీ-మంత్రికీ మధ్య ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత నెల కొన్నప్పుడే ప్రభుత్వ పనితీరు, దక్షత, నైపుణ్యం, సామర్ధ్యం పెరుగుతాయి. అధికారులు సరైన సలహాను సరైన సమయంలో ఇవ్వకపోయినా, తప్పు జరగడానికి ఆస్కారమున్న సలహా ఇచ్చినా, మంత్రులను మభ్యపెట్టినా, మంత్రులకు తెలియకుండా రహస్య సమాచారాన్ని అధికారికంగా బహిర్గతం చేసినా, ఆ దుష్ప్రభావం సంబంధిత మంత్రులపైనా, యావత్ మంత్రి మండలిపైనా, ప్రభుత్వంపైనా పడుతుంది. పర్యవసానం ఏదైనా, తప్పొప్పులకు బాధ్యుడు మాత్రం మంత్రే. సివిల్ సర్వెంటులమీద రాజకీయ ఒత్తిడుల ప్రభావం పని చేస్తుందన్న విషయం కూడా ఆలోచించాలి. రాజకీయ లబ్దికోసమో, వ్యక్తిగత ప్రయోజనాలకోసమో, తమ ఆలోచనా సరళికి అనువుగా ఉండే సలహాని మాత్రమే పొందే విధంగా సివిల్ సర్వెంటులపైనా ఒత్తిళ్లు రావచ్చు. మన దేశంలో ఇలాంటి ఒత్తిడులు వచ్చే అవకాశాలే ఎక్కువ. వృత్తి ధర్మానికి విరుద్ధంగా సివిల్ సర్వెంట్లతో తప్పు చేయించే ధైర్యం ఎంతమంది మంత్రులకు ఉంటుందనేది కూడా ప్రశ్నార్ధకమే. ఒకవేళ మంత్రి ప్రోద్భలం లేకపోయినా అలాంటి తప్పులు స్వతహాగా అధికారులు చేయొచ్చా? జీతభత్యాల విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ మంత్రుల ప్రత్యక్ష ప్రమేయం ఉండదని తెలిసినా, అఖిల భారత సర్వీసులకు చెందిన సివిల్ సర్వెంట్లకన్నా ఎందుకు మరింత మెరుగ్గా పనిచేయకూడదు? తమను వేలెత్తిచూపు చూపే రీతిలో కొందరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు?

ఏదైనా పాలనాపరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ,జనా కర్షక పధకంపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు కానీ, అధికారులు మంత్రుల ఆలోచనా విధానానికి అనుగుణంగా స్పందించాల్సిన అవసరమొస్తే అలాంటి స్పందనను ఒత్తిడి అనలేం. మంత్రుల అభిప్రాయాన్ని, అభిమతాన్ని తప్పక పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటప్పుడు ఆంతరంగికత, పరస్పర విశ్వసనీయత అతి ముఖ్యం. సలహా అడిగిన మంత్రికీ, ఇచ్చిన అధికారికీ మధ్యన గట్టి విశ్వాసం ఉండాలి. అనుభవజ్ఞులైన మంత్రులు అధికారులతో ఎలా పని చేయించుకోగలుగుతారో, అలానే అనుభవం లేని మంత్రులను కొందరు అధికారులు బురిడీ కొట్టించగలుగుతారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికే మాతృకైన బ్రిటన్లో అమలవుతున్న సత్ సంప్రదాయాలను ఇక్కడా ఆచరణలో పెట్టి పనిచేయడం మంత్రులకూ, అధికారులకూ మంచిది.

Thursday, October 21, 2010

ప్రభుత్వ నిర్ణయాల అమలు బాధ్యత అధికారులదా? మంత్రులదా?: వనం జ్వాలా నరసింహారావు


సూర్య దిన పత్రిక (23-10-2010)
వనం జ్వాలా నరసింహారావు

ప్రభుత్వాలు మారినప్పుడల్లా వివిధ స్థాయిలలో సమీక్షా సమావేశాలు నిర్వహించడం, ముఖ్యమంత్రి స్వయంగా సమీక్షించడం, కొత్త పథకాలకు రూపకల్పన చేయాలని నిర్ణయించడం, వున్న పథకాలకు పేర్లు మార్చడం, సంస్కరణలంటూ "ఇల్లు పీకి పంది రేసే" ప్రయత్నాలు చేయడం, ఒక వైపు నిధులకు కొరత లేదంటూ ప్రకటనలు గుప్పించడం-మరో వైపు నిధుల కొరతంటూ ప్రజోపయోగమైన కార్యక్రమాలకు కోత విధించడం, ఆ తరువాత అంతా మరచిపోవడం, ప్రతిపక్షాల విమర్శలకు ఎదురు దాడి చేయడం, ఒక తంతుగా-ప్రజాస్వామ్యాన్ని పరిహాసంచేసే ప్రహసనంగా మారిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చాకనే ఇలా జరుగుతుందా అని ప్రశ్నించుకుంటే, జవాబు అవునని చెప్పాల్సి వచ్చినా, ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతున్నదిదే అనక తప్పదు. సమావేశాలలో-సమీక్షా సమావేశాలలో తీసుకున్న నిర్ణయాల అమలు బాధ్యత అధికారులదా? అమలు చేయించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులదా? సమన్వయంతో ఇద్దరూ కలిసి చేస్తేనే మంచిదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు అమలు కాకపోతే ఫలితం శూన్యం! అసలు ప్రభుత్వం అమలు చేద్దామనుకున్న, చేయవలసిన వివిధ పధకాల అమలు తీరుతెన్నులపై ముఖ్యమంత్రి స్థాయి వరకు ఖచ్చితమైన సమాచారం పాలనా యంత్రాంగం ఆయనకు అందింస్తున్నదా అన్న అనుమానం కూడా కలుగుతోంది పలువురికి.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్న రోజుల్లో అప్పటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం అమలు జరుపుతున్న కార్యక్రమాల లొసుగులకు సంబంధించిన సమాచారం, ఆయన ఎలా సేకరించేవారోకాని, పలువురు జిల్లా కలెక్టర్లతో సహా అనేకమంది అధికారులు, ఆయన ఎప్పుడేమడుగుతారోనని అప్రమత్తంగా వ్యవహరించేవారు. అసలా రోజుల్లో కొందరు జిల్లా కలెక్టర్లు రాజశేఖర రెడ్డికే జవాబుదారీగా పనిచేస్తున్నారేమోనన్న అనుమానంకూడా అప్పుడప్పుడు కలిగేది. సమాచార సేకరణకు ఇప్పుడున్నంత యంత్రాంగం ప్రతిపక్షనేతగా అప్పుడు లేకపోయినా, ఆయన దగ్గర ఖచ్చితమైన గణాంక వివరాలు ఉన్నాయని అధికారులు భయపడి పనిచేసేవారు. అయన వున్నప్పుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందితో సహా యావత్ రాష్ట్ర పాలనా యంత్రాంగం, గ్రామస్థాయి వరకూ ప్రభుత్వం కనుసన్నల్లోనే పనిచేస్తుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రికి అందుతున్న సమాచారంలో తప్పులు దొర్లుతున్నాయనే సంగతి ఇటీవల కాలంలో కొన్ని కొన్ని విషయాల్లో స్పష్టంగా బయటపడింది.

రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు సంబంధించిన ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో కాని, బయ్యారం గనుల విషయంలో కాని, సోంపేట కాల్పులకు సంబంధించి కాని, వైద్య-ఆరోగ్య సంబంధిత వివరాల గురించి కాని సరైన సమాచారం చేరవలసిన స్థాయికి (ముఖ్యమంత్రి స్థాయికి) చేరడంలేదే మో అనిపిస్తోంది. బాధ్యతాయుతమైన అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు, వివాదాస్పదమైన సమాచారాన్ని మాత్రమే అందించడం ఎంతవరకు సబబన్నది నిబద్ధతతో పనిచేస్తున్న ఇతర అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడడం, అఖిల భారత సర్వీసులకు చెందిన ప్రత్యేకత సంతరించుకున్న ’ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్’ అధికారుల పనితీరుకే ఒక సవాలనుకోవాలి. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో వివాదాల్లో చిక్కుకోవడం, రాజకీయ ప్రభావాలకు లోను కావడం, మంత్రులకు వంతపాడటం, పక్షపాత వైఖరితో ఉద్యోగ ధర్మాన్ని విస్మరించడం, నైతిక విలువలను పాటించకపోవడం కొందరికి అలవాటుగా మారిందన్న సంకేతాలొస్తున్నాయి. స్వర్గీయ ఎస్. ఆర్. శంకరన్ లాగా పనిచేస్తున్నారని అనిపించుకోవాలనో, ఒక వి. చంద్రమౌళిలాగా వ్యవహరించాలనో, ఒక పి.వి.అర్.కె. ప్రసాద్ లా పనిచేయాలనో, ఒక జయప్రకాష్ నారాయణ లా పేరు తెచ్చుకోవాలనో అనుకునేవారు అరుదుగా కనిపిస్తున్నారు. అత్యంత బాధ్యతతో కూడుకున్న పదవులు చిన్న వయసులోనే చేపట్టినందువల్లనో, మారుతున్న రాజకీయ పరిస్థితుల ప్రభావంవల్లనో, సంప్రదాయాలను పాటించనందువల్లనో, సివిల్ సర్వీసులలో సంస్కరణలు అమలు చేయకపోవడంవల్లనో ఇలాంటివి జరుగుతుండవచ్చు. ఇందుకు ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలి.

ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐ.ఎ.ఎస్)ను సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశానికి ’ఉక్కు వ్యవస్థ’గా అభివర్ణించారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రభుత్వ నిర్ణయాలను కట్టుదిట్టంగా అమలుపర్చేందుకు, చేయూతనందించేందుకు, పటిష్టమైన పాలన యంత్రాంగం అవసరమైన నేపధ్యంలో అది ఆవిర్భవించింది. అంతకుముందు ఆంగ్లేయుల పాలనలో పరిపాలన బాధ్యతలు నిర్వహించిన ’ఇండియన్ సివిల్ సర్వీస్’కు విప్లవాత్మకమైన మార్పులు చేర్పులు చేసి, ఆ నమూనాలోనే ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ సర్వీస్కుీ ఎంపికైన వ్యక్తులు పౌర పరిపాలనలోనూ, విధాన నిర్ణయాలలోనూ, ఆంతరంగిక విదేశీ సంస్కరణలను చాకచక్యంగా నివారించడంలోనూ కీలకమైన పాత్ర పోషిస్తుంటారు. సాహిత్యం నుంచి వైద్యశాస్త్రం వరకు విభిన్న విద్యల్లో తమదంటూ ఒక ప్రత్యేకత ఉందని నిరూపించుకున్న తెలివైన, బాధ్యతాయుతమైన, సమర్ధులైన వ్యక్తులను ఓ పద్దతి ప్రకారం విస్తృతమైన, కఠినమైన పరీక్షా విధానం ద్వారా ఈ సర్వీసుకు ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన ఐ.ఎ.ఎస్ అధికారుల ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన భద్రత ఉంటుంది. కార్య నిర్వహణ అధికారాల విషయంలో భయపడాల్సిన అవసరం కాని ఒత్తిడులకు లోను కావాల్సిన అవసరం కానీ వారికి ఎంత మాత్రంలేదు. దేశ సమగ్రతకు ఈ వ్యవస్థ అత్యంత అవసరమైందని సర్దార్ పటేల్ అనేవారు.

ఐ.ఎ.ఎస్‍కు చెందిన అధికారులకు సబ్ కలెక్టర్ స్థాయినుంచి, రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు, కేంద్రంలో కేబినెట్ సెక్రటరీ స్థాయి వరకు వివిధ శ్రేణి ఉద్యోగాల్లో పనిచేసే అవకాశం కలుగుతుంది. వారి వారి సామర్ధ్యాన్నిబట్టి, కార్య నిర్వహణ పద్ధతులను బట్టి వారిని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులుగా నియమించడం, పదోన్నతులు కల్పించడం జరుగుతుంది. అయితే గత కొంత కాలంగా, పలు సందర్భాల్లో ఇవేవీ అర్హతలు కాకుండా, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులతో వీరికున్న చనువు ఆధారంగా పదవులు దొరుకుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. కొంతమందైతే ఏ పార్టీకి చెందిన ప్రభుత్వం అధికారంలో ఉన్నా సమర్ధత ప్రాతిపదికగా కాకుండా "చొరవ", "పలుకుబడి” ప్రాతిపదికగా ప్రాధాన్యతగల పోస్టులు దక్కించుకుంటున్నారు. తరచూ ఇలాంటి వారే ఏ ఎండకాగొడుగు పడుతూ మంత్రుల అవసరాలకు, ఆదేశాలకు అనుగుణంగా నడచు కొంటూ తాత్కాలిక లబ్ది పొందుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య తక్కువే అయినా వారిని ప్రభుత్వంలోని కొందరు పలుకుబడి కలిగిన మంత్రులు ప్రోత్సహిస్తున్నారు. ఇది సంప్రదాయం కాకూడదు. ఇలాంటి వారి కారణంగానే ఎన్నో మంచి కార్యక్రమాలను నీరుగార్చడము, పేరు మార్చడము జరుగుతున్నది.

ఐ.ఏ.ఎస్ కు ఎంపికైన వారు ఏడాదిపాటు ముస్సోరీలో, ఏడాదిపాటు వారికి కేటాయించిన రాష్ట్రంలో అసిస్టెంట్ కలెక్టర్ శిక్షణ పొందిన తరువాత లభించే మొదటి ఉద్యోగం సబ్ కలెక్టర్. ఈ హోదాలో పనిచేసిన తరువాత సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారిగా, జాయింట్ కలక్టర్ గా పదోన్నతులు పొంది డిప్యూటీ సెక్రటరీ - జాయింట్ సెక్రటరీ స్థాయి హోదాలో (కొన్ని సందర్భాల్లో సెక్రటరీ స్థాయి) ఒక జిల్లా కలక్టర్ గా నియమితులవుతారు. దురదృష్ట వంతులైన కొందరికి ఈ అవకాశం రాకుండాపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ పదవుల కుండే హోదా, మెజిస్టీరియల్ అధికారాల దృష్ట్యా, ప్రతి ఐ.ఎ.ఎస్ అధికారీ ఈ బాధ్యతలు నిర్వహించాలనే కోరుకుంటారు.

అఖిల భారత సర్వీసుల్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ప్రత్యేకత ఉంటే అందులో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న పదవి జిల్లా కలెక్టర్. పలు అభివృద్ధి సంక్షేమ పధకాల అమలులో, పర్యవేక్షణలో కలెక్టర్ బాధ్యత అంచనాలను మించిపోతున్నది. జిల్లా స్థాయిలో లెక్కకు మించిన శాఖలకు కలెక్టరే అధిపతి. సుమారు వందకు పైగా కమిటీలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఎప్పుడేపని చేస్తుండేదీ గుర్తుంచుకోలేని స్థాయికి కలెక్టర్ చేరుకున్నారు. ఇలా కలెక్టర్లకు అధికారాలు, బాధ్యతలు పెంచడమే కాకుండా అడపా దడపా పరిపాలనా నియమావళులనూ మార్చేస్తున్నారు. కాని, అవి తు.చ. తప్పకుండా అమలు జరగాలంటే ఆ పదవి నిర్వహిస్తున్న వారికి వయస్సు రీత్యాగాని, అనుభవం రీత్యాగాని ఉన్న అవగాహన స్థాయి, పరిపక్వత, అలోచనా సరళి ఏమిటనే సంగతిని ఎవరన్నా పట్టించుకుంటున్నారా అనేది అనుమానమే. ఒకప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి ప్రజల కోరికలు, డిమాండ్లు పాతకాలంలో లాగా లేవు. అందుకే అప్పటి-ఇప్పటి పరిస్థితులను అర్ధం చేసుకున్న కొందరినన్నా కొన్ని జిల్లాలకు కలెక్టర్లుగా పంపితే, కనీసం ప్రయోగాత్మకంగానన్నా ఈ పరిస్థితిని అమలు చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఒక ఐ.ఎ.ఎస్ అధికారి జిల్లా కలెక్టర్ గా పనిచేసి, పదోన్నతి పొంది రాజధానికి చేరి, సచివాలయంలో అధికారిగానో, శాఖాధిపతిగానో పనిచేయడం ప్రారంభించిన తరువాత మళ్ళీ జిల్లాలకు పోవడం అరుదుగా జరుగుతుంది. ఐ.ఎ.ఎస్ అయిన మొదటి పది-పదిహేను సంవత్సరాలు జిల్లాలో ఉన్న తరువాత మిగిలిన సర్వీసంతా ’అట్టడుగు స్థాయి’ సేవలకు దాదాపు దూరమయినట్లే. ఇంకో విధంగా చెప్పాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానో లేక కేబినెట్ కార్యదర్శిగానో అయ్యే అవకాశం వచ్చేంతవరకు అసలు-సిసలైన అధికారానికి కూడా నోచుకోనట్లే. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పెరుగుతున్న బాధ్యతల దృష్ట్యా, ఈ వ్యవస్థలో కొంత మార్పు తేవడం అవసరం.

రాష్ట్రంలోని కనీసం మూడోవంతు జిల్లా కలెక్టర్లుగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులనే నియమించాలి. వారి పాలనానుభువం ప్రజలకు, ప్రభుత్వానికి ఉపయోగించబడటంతోపాటు అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలను ఆకళింపు చేసుకొనే అవకాశం వీరికి మరో మారు లభిస్తుంది. గ్రామీణ భారతాన్ని తెలుసుకునే వీలు కలుగుతుంది. అలాంటివి ఇప్పుడు లేకపోతే కొత్తగా ఏర్పాటు చేయాలి. రాష్ట్రానికి, ప్రజా సమస్యలకు, గ్రామస్థాయి పధకాల అమలుకు దూరంగా పనిచేస్తున్న అధికారులను సీనియారిటీ పేరుమీద నో, ’మరే కారణంగానో’ అత్యున్నతమైన పదవులకు ఎంపిక చేయడం సమంజసం కాదు. అలా జరిగితే అనుభవం లేని మంత్రులకు అవగాహన లేని అధికారులు తోడవు తారు. ఆ పాలన ఎలా ఉంటుందో మనం అనుభవంలో చూస్తున్నాం కదా!

Wednesday, October 20, 2010

అ నైతిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఆద్యులెవరు? బాధ్యులెవరు?: వనం జ్వాలా నరసింహారావు

అ నైతిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు
ఆద్యులెవరు? బాధ్యులెవరు?
వనం జ్వాలా నరసింహారావు

కర్నాటక సంక్షోభం నేపధ్యంలో, రాష్ట్రపతి పాలన విధించాల్సిందిగా గవర్నర్ సిఫార్సు చేసినట్లు వార్తలొచ్చాయి. నిర్ణయం తీసుకోవాల్సిన యూపీఏ కేంద్ర ప్రభుత్వం, దానికి సారధ్యం వహిస్తున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, కారణాలేవైనప్పటికీ, తాత్సారం చేయడంతో, ఈ లోగా మరో సారి బల పరీక్షకు యడియూరప్పకు గవర్నర్ అవకాశం ఇవ్వడంతో, ఆయనందులో గెలవడంతో, ప్రభుత్వం మరికొంతకాలం మనుగడ సాగించే వీలు కలిగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంతో-ఇంతో అపహాస్యం పాలైనప్పటికీ, రాష్ట్రపతి పాలన వాయిదా పడింది. గవర్నర్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి పాలన విధించినట్లయితే, దేశవ్యాప్తంగా కాంగ్రేసేతర ప్రతిపక్షాల నిరసన ధ్వనులు వినిపించేవి. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను ఐదేళ్ల కాలం పదవిలో కొనసాగనీయకుండా, అప్రజాస్వామికంగా కూల దోయడం ఆరంభించింది కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే అయినప్పటికీ, ఆ సాంప్రదాయాన్ని తొలి కాంగ్రేసేతర జనతా సంకీర్ణ ప్రభుత్వం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రేసేతర ప్రభుత్వాలు కూడా కొనసాగించాయి. అధికారంలో వున్నప్పుడొక నీతి, ప్రతిపక్షంలో వున్నప్పుడు మరొక నీతి పాటించడంలో రాజకీయ పార్టీలన్నీ ఒకే బాటలో నడవడంతో, మెరుగైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు కావాల్సిన సత్ సంప్రదాయాలకు పునాదులు పడలేదు.

దక్షిణ భారతదేశంలో ఏర్పాటైన మొదటి బీజేపీ ప్రభుత్వం కర్నాటకలోనే. పూర్తి మెజారిటీకి కావాల్సినంతమంది మద్దతు లేకపోయినా, అచిర కాలంలోనే అతి చాకచక్యంగా మెజారిటీ పొందగలిగారు. స్వతంత్ర సభ్యులను ఏదో విధంగా తమ పక్షం తిప్పుకోగలిగారు యడియూరప్ప. గాలి సోదరుల మద్దతు-తిరుగు బాటుల మధ్య ఆయన ప్రభుత్వం మనుగడ సాగించినప్పటికీ, సంక్షోభంలో పడక తప్పలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యమంటే అంకెల గారడీ అని సోదాహరణంగా నిరూపించారు యడియూరప్ప. ఆయన పార్టీకి చెందిన సభాపతి, బీజేపీ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన పదకొండు మంది పార్టీ ఎమ్మెల్యేలతో సహా ఐదుగురు ఇండిపెండెంటు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దుచేసి, గవర్నర్ ఆదేశం మీద జరిగిన బల పరీక్షలో యడియూరప్పకు విజయం చేకూర్చారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడానికి, రాజ్యాంగం ప్రకారం అధికారాలున్న సభాపతి, గవర్నర్ తమ వంతు పాత్రను పోషించారు. ఒక పార్టీ టికెట్‌పై ఎన్నికైన వారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడం తప్పే. అంతకు ముందు ఇండిపెండెంట్లుగా ఎన్నికై, బీజేపీ తీర్థం పుచ్చుకుని, తర్వాత క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడడం కూడా తప్పే. మెజారిటీ కొరకు వారిని బీజేపీ లో చేర్చుకోవడమూ తప్పే. సాధారణంగా, ఫిరాయింపుల చట్టం కింద, పార్టీ విప్ ధిక్కరించి ఓటేసిన తర్వాత సభ్యత్వం రద్దు చేయడం ఆనవాయితీ. కర్నాటకలో స్పీకర్ ఒకడుగు ముందుకు వేసి, అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకుండానే బీజేపీ-ఇండిపెండెంట్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దుచేశారు. బంతిని కోర్టులో విసిరారు అంతా కలిసి.

శాసన నిర్మాణ, న్యాయ నిర్ణయ, కార్య నిర్వహణ వ్యవస్థల మధ్య "అదుపులూ, అన్వయాలూ" అనే రాజ్యాంగ స్ఫూర్తి, సమన్వయం-సమ న్యాయం వుండేలా వ్యవహరించడం వల్లే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనుగడ సాగించే వీలు కలుగుతోంది. కర్నాటక వ్యవహారంలో, శాసన సభ స్పీకర్కు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుచేసే తిరుగులేని రాజ్యాంగాధికారం వున్నప్పటికీ, దాన్నెవరూ ప్రశ్నించ లేనప్పటికీ, న్యాయ నిర్ణయ వ్యవస్థ విచారణ చేసే వీలు కలిగింది. ఇక న్యాయ నిర్ణయ వ్యవస్థ విషయానికొస్తే, అంచెలంచల ఏర్పాటుతో పనిచేసే ఆ వ్యవస్థలో ఒక స్థాయిలో న్యాయం జరగలేదని భావించినప్పుడు, పై స్థాయిలో న్యాయం కొరకు ప్రయత్నం చేసే వీలుంది. కాకపోతే, ఈ వ్యవస్థలన్నీ కేవలం రాజ్యాంగ ప్రకరణాలకు లోనై మాత్రమే పనిచేసేకంటే, సత్ సంప్రదాయాలను నెలకొల్పుకుంటూ పనిచేయడం మంచిది. అలా జరుగుతుండడం వల్లే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్ దేశంలో, కాగితంపై రాసుకున్న రాజ్యాంగం లేకపోయినా, సాంప్రదాయాల ప్రాతిపదికపై, ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తోంది. బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన మనం, వారి వారసత్వంగా చెడును స్వీకరించ గలిగినప్పుడు, మంచినెందుకు అలవర్చుకోలేకపోతున్నామో?

గవర్నర్ గా నియమించబడిన, కేంద్ర ప్రభుత్వంలోని అధికార పార్టీకి అనుకూలురైన వ్యక్తికి, ఆ వ్యక్తి ద్వారా రాష్ట్రపతికి (అదే రాజకీయ పార్టీ అభ్యర్థిగా పదవిలోకి వచ్చిన వ్యక్తి), కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో వున్న పార్టీకి, 356 రాజ్యాంగ ప్రకరణ "రక్షక కవచం" లాంటిది. ఆఖరు ప్రయత్నంగా ఉపయోగించాల్సిన అధికారాన్ని, మొదటి అస్త్రంలాగా-అదీ బ్రహ్మాస్త్రంలాగా వాడుకునే ప్రకరణైంది. దాన్ని ప్రయోగించే ముందు జరగబోయే పరిణామం సత్ సంప్రదాయానికి దారి తీస్తోందా, దుష్ట సంప్రదాయమౌతుందా అని ఒక్క క్షణం ఆలోచించి చేస్తే బాగుంటుంది. దురదృష్ట వశాత్తు అలా జరగక పోవడం వల్ల, కర్నాటక గవర్నర్ తొందర పడ్డాడని భావించాలి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడని అనాలి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధ బాంధవ్యాలు చెడిపోవటానికి ప్రధాన కారణం 356 రాజ్యాంగ ప్రకరణమంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రాలలో అధికారంలో వున్న పార్టీ స్థానంలో, కేంద్రంలో అధికారంలో వున్న పార్టీని తెచ్చే ప్రక్రియగా ఆ ప్రకరణంను ఉపయోగించుకునే సంప్రదాయం మొదలైంది.

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రెండు సంవత్సరాలకే, పంజాబ్‌లో, "రాజ్యాంగ యంత్రాంగం" భగ్నం కావడం, జూన్ 1951 లో రాష్ట్రపతి పాలన విధించడం, ఆ సంప్రదాయం ఎన్నో పర్యాయాలు అదే రాష్ట్రంలో నెలకొనడం జరిగింది. అసలు సిసలైన ప్రజాస్వామ్య ఖూనీ కేరళ రాష్ట్రంలో ఆ తర్వాత జరిగింది. కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలనలో గడపని రాష్ట్రాలు దాదాపు లేనట్లే. కనీసం వంద సార్లకు పైనే రాష్ట్రపతి పాలన వివిధ రాష్ట్రాల్లో విధించడం జరిగింది. 1957 లో ప్రపంచ చరిత్రలోనే మొదటి సారి బాలట్ ద్వారా అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రెండేళ్లకే 1959 లో రద్దుచేసి, కేరళలో రాష్ట్రపతి పాలన విధించింది అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం. అలా అప్రజాస్వామిక సంప్రదాయం నెలకొల్పింది ఎవరో కాదు-ప్రపంచంలో ప్రజాస్వామ్య వాదిగా ప్రసిద్ధికెక్కిన జవహర్లాల్ నెహ్రూ. ఆ చర్యకు ప్రేరణ ఇచ్చిన అలనాటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎవరో కాదు-ప్రజాస్వామ్య నియంతగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధి. అప్పట్లో ఆ చర్యకు బలైంది కమ్యూనిస్టులు కాబట్టి, కాంగ్రెస్ లోని ప్రజాస్వామ్య వాదులు కాని, కమ్యూనిస్టేతర ప్రతిపక్ష నాయకులు కాని నిరసన తెలియచేయలేదు. అచిర కాలంలోనే, తమ వంతు కూడా వస్తుందని కమ్యూనిస్టేతర రాజకీయ పార్టీలు అప్పుడే అనుకుంటే బాగుండేది. అప్పట్లో కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఇంకా రాష్ట్రాలలో అధికారంలోకి రావడం మొదలు కాలేదు. వచ్చిన ఒకే ఒక్కటి కమ్యూనిస్టు పార్టీకి చెందింది కావడం, దాన్నీ అధికారంలో కొనసాగనీయక పోవడం భవిష్యత్ లో జరగబోయే పరిణామాలకు సంకేతమని కాంగ్రేసేతర పార్టీలు పసిగట్టలేక పోయాయి. కాంగ్రెస్ పార్టీ కూడా, అదే అస్త్రం తమపై ప్రయోగించే అవకాశం వుందని భావించలేదు.

1967 కు పూర్వం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రాలలోను, కేంద్రంలోను తిరుగులేని మెజారిటీ వుండేది. ఆడింది ఆట-పాడింది పాట. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి (పదవి కొరకు)ఫిరాయింపులుండేవి కాని, కాంగ్రెస్ నుంచి బయటకు పోవడం వుండకపోయేది. నాలుగో సాధారణ ఎన్నికల తర్వాత పరిస్థితిలో మార్పొచ్చింది. కాంగ్రెస్ గుత్తాధిపత్యానికి ఎదురుదెబ్బ తగిలింది. కిచిడీ సంకీర్ణ ప్రభుత్వాలనేకం రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చాయి. ఆయారామ్-గయారామ్లె ఫిరాయింపు పర్వాలు మొదలయ్యాయి. సుమారు పది సంవత్సరాల కాలంలో, పదమూడు రాష్ట్రాలలో పాతిక పర్యాయాలకు పైగా "రక్షక కవచం" ఉపయోగించి, గవర్నర్ల సహకారంతో రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. "రాజకీయ ప్రతిష్టంభన" సాకు చూపి, శాసన సభలను రద్ధుచేసి, పరోక్షంగా కాంగ్రెస్ పాలన సాగిందా రోజుల్లో. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ పనిచేయడానికి రాజకీయ జోక్యం కావాలి కాని, ఆ జోక్యం రాజ్యాంగాన్ని-సంప్రదాయాలను అపహాస్యం చేసే స్థితికి పోకూడదు. ఉదాహరణకు, "శాంతి భద్రతల ప్రతిష్టంభన" ఏర్పడిందన్న సాకుతో, 1967 సాధారణ ఎన్నికల్లో గెలిచి అధికారంలొకొచ్చిన యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని 1968 లో రద్దుచేసి, పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం. మొరార్జీ దేశాయ్ ప్రప్రధమ కాంగ్రేసేతర ప్రధాన మంత్రి కాగానే, ఆయన ధర్మ సంస్థాపన, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల దోయడంతో ఆరంభమైంది. కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో వున్న అర డజన్ రాష్ట్రాలలో అధిక సంఖ్యలో జనతా పార్టీ లోక్ సభ సభ్యులు గెలిచి నందువల్ల, ఆ ప్రభుత్వాలకు ప్రజల మద్దతు లేదన్న సాకుతో మొరార్జీ వాటిని రద్దుచేయడం మరో దుష్ట సంప్రదాయం. శాసన సభ్యులుగా ఓటర్లు ఐదేళ్ల కాలపరిమితికి ఎన్నుకున్నారన్న ప్రజాస్వామ్య ప్రాధమిక సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారాయన.

ప్రజాస్వామిక వ్యతిరేక చర్యలకు పాల్పడిన ప్రభుత్వాలు ఏ పార్టీకి చెందినవైనప్పటికీ, ఆ చర్యలు ఏ పార్టీకి వ్యతిరేకంగా జరిగినవైనప్పటికీ, పార్టీలకతీతంగా ఖండించక పోవడం వల్ల, దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు, ఎంతో కొంత అన్యాయం జరుగుతూనే వుంది. అదే విధంగా నియంతృత్వ ధోరణులు అనుకరిస్తున్న ప్రభుత్వం లోని పార్టీ ఏదైనా, ఆ ధోరణి వల్ల నష్టపోయింది ఎవరైనా, తీవ్రంగా ఖండించకపోతే, వాటికి ఎవరైనా బలికావొచ్చు. ఉదాహరణకు, 1962 లో, చైనాతో యుద్ధం జరిగిన నేపధ్యంలో, పీడీ చట్టం కింద సీపీఎం కు చెందిన వేయి మందికి పైగా పార్టీ కార్యకర్తలను దేశవ్యాప్తంగా నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. నిర్బంధంలో తీసుకుంది కమ్యూనిస్టులనే కదా అన్న ధోరణిలో, ప్రభుత్వ చర్యను ఖండించిన కాంగ్రెస్-కమ్యూనిస్టేతర రాజకీయ పార్టీలు లేనే లేవు. ఆ తర్వాత ఏమైంది? చరిత్ర పునరావృతమైంది. ఇందిరా గాంధీ, ఎమర్జెన్సీ రోజుల్లో, దేశవ్యాప్తంగా వారూ-వీరూ అనే భేదం లేకుండా, తనను వ్యతిరేకించిన స్వపక్షీయులతో సహా, అన్ని రాజకీయ పార్టీల నాయకులను నిర్బంధించింది. 1959 లో, 1962 లో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా తీసుకున్న అప్రజాస్వామిక చర్యలను అన్ని రాజకీయ పార్టీలు ఖండించినట్లయితే, నూరు పర్యాయాలు రాష్ట్రపతి పాలనలు విధించడం కాని, వేలాది మంది ప్రజాస్వామ్య వాదులను నిర్బంధించడం కాని జరిగుండేది కానేకాదు. అ నైతిక పార్లమెంటరీ ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఆద్యులెవరు? బాధ్యులెవరు? అన్ని రాజకీయ పార్టీల వారు ఆత్మ విమర్శ చేసుకోవడం మంచిదే మో! అంకెల గారడీ తో గండం గట్టెక్కిన యడియూరప్ప, తనకు మద్దతు లభించింది 106 మంది శాసన సభ్యులదే కాని, 113 మందిది కాదని, తనకు ప్రభుత్వం నడిపే నైతిక హక్కు లేదని భావించాలి. చట్ట ప్రకారం బలాన్ని నిరూపించుకున్నందున, శాసన సభను రద్దు చేయమని, తిరిగి ఎన్నికలు నిర్వహించమని గవర్నర్‌ను కోరి, సత్ సంప్రదాయాన్ని నెలకొల్పితే మంచిది. ఆ విధంగానన్నా, గవర్నర్‌కు రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఇవ్వకుండా చూడాలి.

Saturday, October 16, 2010

పయ్యావుల చెప్పిన వీర తెలంగాణా విప్లవ గాధ : వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణా సాయుధ పోరాటం ఉపసంహరణ జరిగి
(అక్టోబర్ 21, 2010 న)
59 సంవత్సరాలు నిండిన సందర్భంగా

సూర్య దిన పత్రిక (17-10-2010)
వనం జ్వాలా నరసింహారావు

ఐదేళ్ల పాటు సాగిన వీర తెలంగాణా విప్లవ రైతాంగ సాయుధ పోరాటం భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక మైలు రాయి-కీలకమైన ఒక మలుపు రాయి. పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవ పున్నయ్య లాంటి విప్లవ యోధుల సరసన పోరాటంలో పాల్గొన్న వారిలో చరిత్ర పుటల్లోకి ఎక్కనివారి పాత్రను తక్కువగా అంచనా వేయలేము. సరిగ్గా ఏభై తొమ్మిది సంవత్సరాల క్రితం, అక్టోబర్ 21, 1951న ఉపసంహరించబడిన సాయుధ పోరాటంలో కీలక పాత్ర వహించిన ఖమ్మం జిల్లా, గోకినేపల్లి గ్రామానికి చెందిన 85 సంవత్సరాల పయ్యావుల లక్ష్మయ్యకు ఇప్పటికీ, ఈ వయసులోను ఎన్నో విషయాలు గుర్తున్నాయి. సాయుధ పోరాట ఉద్యమంలో దూకిన పయ్యావుల లక్ష్మయ్య, తనను నిర్బంధించిన నిజామాబాద్ జైలు కిటికీ వూచలు కోసి, తప్పించుకుని, సొంత గ్రామం గోకినేపల్లికి చేరుకున్నారు. క్రమేపీ ఉద్యమం తీవ్రమైంది.

మైదానంలో రక్షణ లేదని లక్ష్మయ్య ప్రభృతులు, ఇల్లెందు అడవుల్లోకి పోయారు. అప్పటికే రంగ ప్రవేశం చేసిన యూనియన్ సైన్యాలు అడవుల్లోకి, గుట్టల్లోకి వీరిని గాలించుకుంటూ వచ్చాయి. మిలిటరీ ధాటికి తట్టుకోలేక మొదట్లో ఐదు గురితో ఏర్పాటైన దళాలు, క్రమేణ ముగ్గురి తో, ఇద్దరితో కుదించడం జరిగింది. మొండిగా ఉద్యమం సాగించారు. ఉద్యమం కొనసాగించడం సరైందా, కాదా అన్న మీమాంసలో లక్ష్మయ్య లాంటి వారున్నప్పటికీ, పుచ్చలపల్లి సుందరయ్య గారు మాత్రం, అడవుల్లో దళాలను అంటిపెట్టుకుని ముందుకు సాగేవారు. అప్పట్లో లక్ష్మయ్య పాలేరు ప్రాంతం ఇన్-చార్జ్ గా పనిచేశారు. నేలకొండపల్లి సమీపంలోని మూటా పురానికి చెందిన బాగం వీరయ్య రైఫిల్ పోగొట్టుకుని చిత్రహింసలకు గురై కూడా రహస్యాలు బయటపెట్టని విషయం గుర్తుచేసుకున్నారు లక్ష్మయ్య.

చకిలం శ్రీనివాస రావు కార్యదర్శిగా వున్న (ఏరియా కమిటీ) దళంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి (పార్లమెంట్ మాజీ సభ్యుడు), మచ్చా వీరయ్య, చిర్రావూరి లక్ష్మీనరసయ్య (ఖమ్మం మాజీ మునిసిపల్ చైర్మన్) లతో పాటు లక్ష్మయ్య కూడా వుండేవారు. ఒక సారి జరిగిన దాడిలో లక్ష్మయ్య వారినుంచి చీలి హుజూర్ నగర్ దళంలో కలిశాడు. అక్కడ మేదరమెట్ల సీతారామయ్య, నిజామాబాద్ జైలునుంచి తనతో పాటు పారిపోయి వచ్చిన వంకాయలపాటి కృష్ణయ్య కలిశారు. సీతారామయ్య ధైర్య సాహసాలను గుర్తుచేసుకుంటూ, ఒకసారి అడవి దేవులపల్లి-దేవరకొండ ప్రాంతంలో పోతున్నప్పుడు, తమను నిర్భంధించడానికి వస్తున్న గూర్ఖాలను పసిగట్టి ఎలా వెనుక దెబ్బతీసింది వివరించారు లక్ష్మయ్య. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీసు స్టేషన్ మీద దాడి చేసేందుకు ప్రణాళిక తయారుచేయమని లక్ష్మయ్యను పార్టీ ఆదేశించించింది. సహచర ఉద్యమకారుడు వంకాయలపాటిని, మేదరమెట్లను, మరొకరిని కలుపుకుని, నలుగురు స్టేషన్ పై దాడికి ప్రణాళిక వేసుకున్నారు. పొగాకు అమ్మే బేర గాళ్ల వేషంలో వూళ్ళోకి సాయంత్రం ఎనిమిది గంటలకు చేరుకున్నారు. వూరి బయట పొగాకు పరిచి, తరాజులు పెట్టి అమ్మకాలు మొదలెట్టారు. జనసంచారం తగ్గింతర్వాత ముసుగులు ధరించి, వెంట తెచ్చుకున్న తుపాకీలు పట్టుకుని పోలీసు స్టేషన్ పై దాడి చేశారు. దాడికి వచ్చింది నలుగురే అని భావించని పోలీసులు భయంతో, లోనికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వెంటిలేటర్ల నుంచి బయటున్న వీరు కాల్పులు చేయడంతో లోపలున్న పోలీసులు గాయపడి చేతులెత్తి లొంగిపోయారు. బయట కొచ్చిన ఒక్కొక్కరి ని బంధించారు వీళ్ళు. వాళ్ళ దగ్గరున్న 14 తుపాకీలను కట్టకట్టి, మోయలేక, అతి కష్టం మీద ఊరి బయటకు చేర్చారు. అప్పటికి అక్కడున్న రాతి బావిలో పడవేసి, తర్వాత తీసుకున్నారు.

అడుగడుగునా పోలీసు కాపలా అవరోధాల మధ్య, సానుభూతి పరుల సహాయం లభించేది. ఒక సారి ఈయన దళాన్ని వంద మంది పోలీసులు చుట్టుముట్టారు. సమీపంలోని జొన్న చేలలో, చుట్టూతా తుపాకీల పహరా మధ్య తప్పించుకునే ప్రయత్నంలో వుండగా, తోటి ఉద్యమకారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని సమీపిస్తున్న లక్ష్మయ్యకు దండం పెట్టి, తాను పోలీసులకు చిక్కక ముందే చంపమని ప్రాధేయ పడ్డాడట. అతడిని భుజంపై వేసుకుని ఎలాగోలా లక్ష్మయ్య తప్పించుకోగలిగాడు. జొన్న చేలు దాటి, మరో దళానికి చెందిన సభ్యుడొకరిని, దొడ్డా నరసయ్య గ్రామం దగ్గరున్న చిలుకూరు సమీపంలో కలిశాడు లక్ష్మయ్య. ఒకరినొకరు క్షణకాలం అనుమానించినా కలిసిపోయారు. గాయపడిన సహచరుడిని, సుదూరంలో కనిపిస్తున్న గుర్రానికి కట్టి తీసుకెళ్దామని భావించారు. అయితే, ఆ గుర్రం సహాయంతోనే మరో సహచరుడు వంకాయలపాటి కృష్ణయ్య రావడం గమనించారు. మొత్తం మీద అందరూ కలిసి, చిలుకూరు నుంచి గొర్రగూడెం అడవులకు చేరుకున్నారు. అక్కడే హుజూర్ నగర్ దళం పని చేస్తున్నది. అప్పటికే, ఖమ్మం దళం కంటే పటిష్టంగా, నిర్మాణాత్మకంగా పనిచేస్తున్న హుజూర్ నగర్ దళం, కాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నది.

పయ్యావుల లక్ష్మయ్యను కల్వకుర్తి జోనల్ కమిటీ కార్యదర్శిని చేసింది పార్టీ. సరిగ్గా అదే రోజుల్లో, ఉద్యమంతో బాగా అనుబంధమున్న ఒక సీనియర్ కార్యకర్తను అరెస్టు చేసింది ప్రభుత్వం. అతడు పోలీసు ఇన్ ఫార్మర్ గా మారిపోయాడు. గుట్టల్లో దళం సభ్యులను కలిసి, పాత పరిచయాలతో వారినుంచి సమాచారం సేకరించి, పోలీసులకు చేరవేయ సాగాడు. చివరకు వాడిని తమ దగ్గర నుంచి, ఎల్. బి. గంగాధర రావు సారధ్యంలోని కేంద్రానికి పంపారు. ఆ దళంలో, కొండన్న అనే మాజీ సైనికాధికారి సభ్యుడుగా వుండేవారు. అతను వీడి విషయం పసిగట్టాడు. అది గ్రహించిన ఇన్ ఫార్మర్ జరగబోయేది ఊహించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడు. పార్టీకి, ఉద్యమానికి ద్రోహం చేశానని ఉత్తరం రాసి, ఉరేసుకుని చనిపోయేందుకు సిద్ధమయ్యాడు. అయితే వాడికి ఆ అవకాశం ఇవ్వకుండా గొడ్డలితో నరికి చంపారని, ఆ సంఘటన మీద పార్టీలో చాలాకాలం చర్చ జరిగిందని, తప్పొప్పుల బేరీజు వేసుకోవడం కూడా జరిగిందని గుర్తుచేసుకున్నారు లక్ష్మయ్య. ఏదేమైనా చరిత్ర మటుకు ముందుకు సాగింది.

కమ్యూనిస్టు పార్టీలో రెండు వర్గాలున్న విషయం ప్రస్తావించారు లక్ష్మయ్య. ఒకటి సుందరయ్య వర్గం కాగా, మరొకటి రావి నారాయణరెడ్డి వర్గం. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనమైన తర్వాత, తెలంగాణా సాయుధ పోరాటం కొనసాగించడమంటే, అది నెహ్రూ ప్రభుత్వాన్ని కూల దోయడానికి జరిగే కుట్రగా ప్రచారం మొదలైంది. యూనియన్ సైన్యాలు నిజాం సంస్థానంలో ప్రవేశించిన మరుక్షణం నుంచే, తెలంగాణా సాయుధ పోరాటాన్ని ఖండించే వర్గం మొదలైంది. తెలంగాణా సాయుధ పోరాటం నిర్వహించుతున్న నాయకత్వం లోని చండ్ర రాజేశ్వర రావు, మాకినేని బసవ పున్నయ్య, మద్దుకూరి చంద్రశేఖర రావు, పుచ్చలపల్లి సుందరయ్య అక్టోబర్ 20, 1951 న సమావేశమై, పోరాటాన్ని ఉపసంహరించుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు. నిర్ణయాన్ని అక్టోబర్ 21, 1951 న ప్రజలకు, పత్రికలకు విడుదల చేయడం రేడియోలో ప్రసారం చేయడం జరిగింది. ఈ నేపధ్యంలో పయ్యావుల లక్ష్మయ్య ప్రభృతులు, వారిలాంటి చాలామంది కార్యకర్తలు అజ్ఞాత వాసంలో వుంటూ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.

పోరాట విరమణ నిర్ణయాన్ని, దాని వెనుక వున్న భావాన్ని కింది స్థాయి కార్యకర్తలు అర్థం చేసుకోలేక పోయారంటారు లక్ష్మయ్య. పోరాట విరమణ కార్యక్రమం ఉద్యమ కారులకు వివరించడానికి లక్ష్మయ్య జోనల్ కమిటీ కార్యదర్శిగా వున్న కల్వకుర్తి జోన్ ను ఎంపిక చేసింది పార్టీ నాయకత్వం. పుచ్చలపల్లి సుందరయ్య గారు అక్కడ కొచ్చి సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన వెంట వచ్చిన ఒక ప్రముఖ ఉద్యమ నాయకుడు (దరిమిలా ఆయన సీపీఐ లోను, ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ లోను పని చేశారు) సుందరయ్య గారి సమక్షంలో, "ఎప్పుడో పోరాటం విరమించాల్సింది" అని వ్యాఖ్యానించడంతో, అక్కడున్న వారంతా ఆయన్ను తప్పుబట్టి ఎదురు తిరిగారట. పోరాట విరమణ నిర్ణయాన్ని వివరించిన సుందరయ్య గారు, "ఆత్మ రక్షణ కొరకు పోరాటం కొనసాగిస్తే తప్పులేదు" అన్న మాటలను లక్ష్మయ్య బృందం సరిగ్గా అవగాహన చేసుకోలేక పోయింది. "చంపవద్దు" అన్న మాట అర్థమయినా, ప్రభుత్వంతో తుపాకీల అప్పగింత విషయంలో చర్చ లింకా జరుగుతున్నాయని సుందరయ్య అనడాన్ని, ఆత్మ రక్షణ కొరకు వాటిని వాడుకోవచ్చని భావించారు.

సాయుధ పోరాటం కొనసాగుతున్న రోజుల్లో, ఇంకా తుపాకీలు అప్పచెప్పకముందు, పయ్యావుల లక్ష్మయ్య దళంలో పనిచేసిన వారిలో బూర్గుల రామకృష్ణా రావు గారి బంధువు హనుమయ్య ఒకరు. విద్యాధికుడైన హనుమయ్య, డాక్టర్ పరాంజిపే దగ్గర వైద్యం నేర్చుకున్నాడు. ఆత్మ రక్షణ కొరకు ఆయుధాలింకా ఉపయోగిస్తున్న తరుణంలో, ఒకానొక సందర్భంలో హనుమయ్యను నిర్భంధించినప్పుడు, ఆ గ్రామ పటేల్ ఆయనను కాపాడి నందువల్ల పోలీసులు అతడిని చిత్రహింసలు పెట్టిన సంగతిని గుర్తుచేసుకున్నారు లక్ష్మయ్య.

ఎప్పుడో ఒకప్పుడు సాయుధ పోరాటం వస్తుందని సుందరయ్య గారు నమ్మేవారని, అందుకే, ఆయన మార్గాన్ని అనుసరించే తన లాంటి వారెందరో, తుపాకీల అవసరం తప్పక రావచ్చని భావించామని ఆనంద భాష్పాల మధ్య, వ్యక్తపరచలేని సుందరయ్య గారి మీదున్న అభిమానం మధ్య పేర్కొన్నారు. నందికొండ ప్రాజెక్టు కింద మునిగి పోయిన స్థలంలో, ఇప్పుడు సాగర్ జలాలు ప్రవహిస్తున్న అలనాటి ప్రాంతంలో, ఒక గుర్తు ప్రకారం తామంతా ఆయుధాలు దాచిపెట్టామని, అవి ఎప్పుడో ఒకప్పుడు భావి తరాల ఉద్యమకారులకు దర్శనమిస్తాయని, అపారమైన నమ్మకంతో, 85 ఏళ్ళ పయ్యావుల లక్ష్మయ్య అంటుంటే, ఆయన నమ్మకానికి జోహార్లు అనాలనిపించింది.

ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి, చీలిక తర్వాత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి ఎనలేని సేవలందించిన అలనాటి వీర తెలంగాణ విప్లవ పోరాట యోధుడు పయ్యావుల లక్ష్మయ్యను, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణ మీద సీపీఎం నుంచి బహిష్కరించడం కడు బాధాకరమైన విషయం. విప్లవ యోధులను గౌరవించడమంటే ఇదేనని సోదాహరణంగా చూపించింది సీపీఎం. లక్ష్మయ్య లాంటి "తెలుగు సోమనాథ్ ఛటర్జీ" లు ఖమ్మం జిల్లాలో చాలామంది కనిపిస్తారు మనకు. వారిలో చాలామంది నుంచి ఇలాంటి గాధలెన్నో వినవచ్చు. ఇంత జరిగినా పార్టీ మీదున్న అభిమానాన్ని, గౌరవాన్ని అణు మాత్రం కూడా వదులుకోలేని లక్ష్మయ్య, ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, తనను చూసేందుకు వచ్చిన వారితో, పార్టీతో-విప్లవంతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకుంటారు.

Wednesday, October 13, 2010

విమర్శలను ఎదుర్కొంటున్న నోబెల్ శాంతి బహుమానం : వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (15-10-2010)

గాంధీని గుర్తించకపోయినా ఆ మార్గాన్ని గౌరవించినట్టే
అణ్వస్త్ర కాముకులకు కూడా శాంతి బహుమానాలు
బహుమతి రానందుకు హిట్లర్‌ అసంతృప్తి
పలు ఎంపికలతో నోబెల్‌ ఆత్మకు క్షోభ కలిగించిన కమిటీ
కమ్యూనిస్టు వ్యతిరేకతా శాంతి స్థాపన కృషేనా?
గాంధీ, నెహ్రూ, లెనిన్‌లు అనర్హులేనా?

చైనా దేశంలో ప్రాధమిక మానవ హక్కుల కొరకు దీర్ఘకాలంగా అహింసాయుత పోరాటం జరుపుతున్న ఇరవై ఒకటవ శతాబ్దపు గాంధీ "లీ జియావో బో" కు, ఈ సంవత్సరపు నోబెల్ శాంతి బహుమానం రావడం, విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం. అహింసాయుత పోరాటం అంటే ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి బహుమానం ప్రదానం చేయకపోయినా, ఆయన మార్గంలో నడిచిన మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, లీ జియావో బో లాంటి కొందరి నైనా నోబెల్ కమిటీ గుర్తించడమంటే, గాంధీకి ఇచ్చినట్లే భావించాలి. చైనా ప్రభుత్వం నిరసనలను పట్టించుకోకుండా, పదకొండేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న లియు ను, 2010 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమానానికి ఎంపిక చేసేందుకు, నార్వీజియన్ నోబెల్ కమిటీ నిర్ణయం తీసుకోవడం సాహసోపేతంగా చెప్పుకోవచ్చు. అయితే, ఏటేటా ఇస్తుండే ఈ బహుమానాలకు ఎంపిక చేయబడిన వ్యక్తులు-సంస్థలు, ఎంపిక చేయబడిన విధానం, విమర్శలకతీతంగా మాత్రం లేవు. అమెరికా ప్రత్యక్ష-పరోక్ష ఒత్తిడికి లోను కావడం ఈ విమర్శల్లో ముఖ్యంగా చెప్పుకోవాలి.

నోబెల్ శాంతి బహుమానం పొందిన మదర్ థెరిసా, ఆర్కే పచౌరీలతో సహా ఇతర రంగాలలో బహుమానం పొందిన భారతీయులు, భారత దేశ సంతతికి చెందిన వారు ఎక్కువ మంది లేకపోయినా కొందరైనా వున్నారు. సాహిత్యంలో రబీంద్రనాథ్ ఠాగూర్, వీఎస్ నైపాల్, రడ్యార్డ్ కిప్ల్ంగ్; భౌతిక శాస్త్రంలో సీవీ రామన్, సుబ్రమణియం చంద్రశేఖర్; రసాయన శాస్త్రంలో వెంకటరామన్ కృష్ణన్; వైద్య రంగంలో హరగోవింద్ ఖొరానా, రొనాల్డ్ రాస్; అర్థ శాస్త్రం లో అమర్త్య సేన్ లకు ఈ గౌరవం దక్కింది.

నోబెల్ శాంతి బహుమానాన్ని పొందిన అంతర్జాతీయ ప్రముఖుల్లో (కొందరిందులో తీవ్ర విమర్శలకు గురైనా)-సంస్థల్లో, హెన్రీ డ్యూరెంట్, థియోడోర్ రూజ్వెల్ట్, పాల్ హెన్రీ బెంజమిన్, అంతర్జాతీయ రెడ్ క్రాస్, ఉడ్రో విల్సన్, జేన్ ఆడమ్స్, ఆల్బర్ట్ స్క్వెట్జర్, డగ్ హామర్క్స్ జోల్డ్, లినస్ పాలింగ్, మార్టిన్ లూథర్ కింగ్, యునిసెఫ్, ఐఎల్ఓన, విల్లీ బ్రాండ్ట్హ, హెన్రీ కిస్సింజర్, అమ్నేస్టీ ఇంటర్నేషనల్, అన్వర్ సాదత్, మదర్ థెరిస్సా, అల్వా మిర్డాల్, లెచ్ వలేసా, మెనాఖెమ్ బెగిన్, డెస్మండ్ టుటు, దలైలామా, మైఖేల్ గోర్బచేవ్, ఔంగ్ సాన్ సూక్యి, నెల్సన్ మండేలా, ఫ్రెడెరిక్ విలియం డి క్లర్క్, యాసర్ అరాఫత్, బారక్ హుస్సేన్ ఒబామా, మొహమ్మద్ యూనస్, జిమ్మీ కార్టర్, కోఫీ అన్నన్ లను ప్రముఖంగా పేర్కొనాలి.

నోబెల్ శాంతి బహుమానం ఇంతవరకు 91 సార్లు 121 మంది అభిషిక్తలకు 2010 సంవత్సరం వరకు ఇవ్వడం జరిగింది. ఇందులో 98 మంది వ్యక్తులకు, 20 వ్యవస్థలకు-సంస్థలకు ప్రదానం చేసింది నోబెల్ కమిటీ. అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థకు 1917, 1944, 1963 సంవత్సరాలలో-మూడు సార్లు, శరణార్థుల కొరకు ఏర్పాటైన ఐక్య రాజ్య సమితి హైకమీషనర్‌కు 1954, 1981-రెండు సార్లు ఇవ్వడం జరిగింది.

నోబెల్ బహుమానాలను, అందునా, శాంతి బహుమానాన్ని పొందిన వారు ప్రపంచ ప్రముఖ వ్యక్తులుగా-సంస్థలుగా పరిగణలోకి వస్తారు. బహుమానంగా దక్కిన ధనం కంటె, వేయిరెట్ల గౌరవం లభిస్తుంది వారికి. శాంతి స్థాపనకు కృషి చేసిన వారిగా గుర్తింపు రావడం వల్ల, అనర్హులైన వారిని ఎంపిక చేసిన సందర్భాల్లో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తాయి. మొదటిసారి నోబెల్ శాంతి బహుమానానికి సంబంధించిన ప్రస్తావన, ఆల్ఫ్రెడ్ నోబెల్, తన దగ్గర పనిచేసిన మాజీ ఆంతరంగిక కార్యదర్శి "బెర్తా వాన్ సట్నర్" కు 1893 లో రాసిన లేఖలో వుంది. నోబెల్ తాను సంపాదించిన అపారమైన సంపదలో కొంత భాగాన్ని, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక పర్యాయం, ఐరోపాలో శాంతి స్థాపనకు కృషి చేసిన వారికి ఇవ్వాలని వుందని పేర్కొన్నాడు. జీవితాంతం బ్రహ్మచారిగానే వుండిపోయిన నోబెల్ జీవితంలో ప్రవేశించి ప్రేమ రగిలించిన ఒకే ఒక స్త్రీ బెర్తా వాన్ సట్నర్. తన దగ్గర, తన ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన సట్నర్ ఆంతరంగాన్ని అర్థం చేసుకోలేక పోయిన నోబెల్, ఆమె మనసు దోచుకోవడంలో కృత కృత్యుడు కాలేకపోయాడు. పంతొమ్మిదవ శతాబ్దపు అత్యంత ప్రముఖ శాంతి స్థాపన ప్రచార ఉద్యమ కారిణిగా పశ్చిమ ఐరోపాలో ఆమెకు పేరుండేది. ఆమె స్ఫూర్తే "నోబెల్ శాంతి బహుమానం".

ప్రపంచ దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించేందుకు నిర్మాణాత్మకమైన కృషి సలిపిన వ్యక్తులకు-సంస్థలకు, లేదా, సైనిక సంపత్తిని సమకూర్చుకునే దేశాలను ఆ మార్గంనుంచి మళ్ళించి నివారించేందుకు-కనీసం తగ్గించేందుకు దోహదపడే వ్యక్తులకు-సంస్థలకు, శాంతి స్థాపన సమావేశాలను ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగేలా నిర్వహించే వారికి, ఒక అంతర్జాతీయ స్థాయి బహుమానాన్ని తన సంపాదనతో ఇవ్వ తలచినట్లు ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 రాసిన తన వీలునామాలో పేర్కొన్నారు. ఈ సిద్ధాంత ప్రాతిపదికపైనే ఏటేటా నోబెల్ బహుమానాలను ఇస్తున్నారు. నోబెల్ శాంతి బహుమానానికి అర్హులైన వ్యక్తులను, సంస్థలను ఎంపిక చేసేందుకు, వచ్చిన ప్రపంచవ్యాప్త ప్రతిపాదనలను పరిశీలించేందుకు, నార్వీజియన్ పార్లమెంటు ఒక నోబెల్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. నాలుగు గోడల నడుమ, అత్యంత గోప్యంగా పార్లమెంటు నియమించిన కమిటీ జరిపే సమావేశాల వివరాలు ఎవరికీ బహిర్గతం అయ్యే అవకాశాలుండవు. కేవలం, వారి నిర్ణయం మేరకు అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతికి ఎంపికయిన వారి పేర్లను మాత్రమే వెల్లడి చేస్తారు.

ప్రప్రధమ నోబెల్ శాంతి బహుమానాన్ని అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థను స్థాపించిన మహనీయుడు, స్విట్జర్లాండు దేశస్థుడు హెన్రీ డ్యురాంటుకు, శాంతి నీతిని ప్రబోధించిన ఫ్రెంచ్ దేశస్థుడు ఫ్రెఢరిక్ పాసీలకు, సంయుక్తంగా 1901 వ సంవత్సరంలో ప్రదానం చేసింది నోబెల్ కమిటీ. వాస్తవానికి నోబెల్ మనసులో మాట గ్రహించడానికి కమిటీకి మరో ఐదు సంవత్సరాలు పట్టింది. ప్రధమ బహుమతి గ్రహీత కావాల్సిన బెర్తా వాన్ సట్నర్‍‍ను, 1905 లో ఎంపిక చేసింది కమిటీ. బహుమానాన్ని పొందిన ప్రధమ మహిళ కూడా ఆమే. నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వడం ప్రారంభించిన పదమూడు సంవత్సరాల తర్వాత మొదటి సారిగా 1914 లో ఎవరినీ బహుమతికి ఎంపిక చేయలేదు. ఆ తర్వాత కూడా సుమారు 15 పర్యాయాలు ఎవరినీ ఎంపిక చేయలేకపోయారంటే, శాంతి స్థాపనకు కృషి సలిపేవారు తక్కువైపోతున్నారేమో అనుకోవాలి! అగ్ర రాజ్యాలుగా-అణ్వస్త్ర కాముకులుగా పిలువబడే అమెరికా, ఇంగ్లాండు, ఫ్రాన్స్ దేశాలకు సుమారు నలబై సార్లు నోబెల్ శాంతి బహుమతి లభించింది. అలా లభించిన వారిలో హెన్రీ కిస్సింజర్, జిమ్మీ కార్టర్, ఒబామా లాంటి "శాంతి కాముకులు!" కూడా వుండడం విశేషం.

ఉత్తర వియత్నాంకు చెందిన లీడక్ థో, 1974 లో హెన్రీ కిస్సింజర్ తో పాటు సంయుక్తంగా బహుమానానికి ఎంపిక చేసినందుకు నిరసనగా బహుమతిని తిరస్కరించారు. జైలులో ఉన్న లీ జియావో బో కి 2010 సంవత్సరానికి శాంతి బహుమతి ఇవ్వాలని నోబెల్‌ కమిటీ పొరపాటు నిర్ణయం తీసుకున్నదని చైనా దేశ ప్రభుత్వం ఆరోపించినట్లే, గతంలో కూడా, నోబెల్ కమిటీ నిర్ణయాలను విమర్శించిన వారు లేకపోలేదు. చైనాలో దోషిగా జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి శాంతి బహుమతి ఇవ్వడమంటే చైనా న్యాయ వ్యవస్థలపట్ల నోబెల్ కమిటీకి గౌరవం లేదన్న విషయం స్పష్టమవుతోందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అన్నారు. ఏళ్లు గడుస్తున్నా కొద్దీ, నోబెల్ శాంతి బహుమానాలు, వాటికి ఎంపికైన వ్యక్తులను నిర్ణయించిన విధానం, వివాదాస్పదంగా తయారవుతున్నాయి. ప్రస్తుతం చైనా ప్రభుత్వం లాగానే, పలువురికి, వివిధ కారణాలవల్ల కోప కారణం కూడా అయ్యాయి. బహుమతి తనను ఎంపిక చేయలేదని తీవ్ర అసంతృప్తికి గురైన హిట్లర్, ఆగ్రహంతో, జర్మనీ దేశానికి చెందిన వారెవరినీ 1937 లో బహుమానాలను తీసుకోకుండా ఆంక్షలు విధించాడు.

జర్మనీ దేశానికి చెందిన శాంతి సమరయోధుడు, పాత్రికేయుడు, కార్లవాన్ ఒస్సీ స్టిస్కీని 1935 లో నోబెల్ శాంతి బహుమానానికి ఎంపిక చేశారు. ప్రస్తుతం లీ జియావో బో జైలులో వున్న విధంగానే, కార్లవాన్ హిట్లర్ నిర్బంధ శిబిరంలో బందీగా వున్నాడు. ఆయనను బహుమతికి ఎంపిక చేయడం గొప్ప సాహసమైన కార్యంగా భావించారప్పట్లో. బహుమానాన్ని తిరస్కరించాల్సిందిగా నాజీ దుర్మార్గులు ఆయనపై ఎన్ని ఒత్తిడులు తెచ్చినా కార్లవాన్ లొంగలేదు. అయినప్పటికీ బహుమానాన్ని స్వీకరించ లేకపోయాడు. మాట వినని కార్లవాన్నువ నాజీ సైనికులు హింసించడంతో 1938 లో బెర్లిన్ జైలులో మరణించాడు. ఇక బహుమానానికి ఎంపికైన అమెరికన్లలో ఉడ్రోవిల్సన్, లీనస్ పాలింగ్ లాంటి వారి విషయంలో ఎవరికీ అభ్యంతరాలుండవు. 1974 లో ఎంపికైన కిస్సింజర్, కుట్రలు-కుతంత్రాలు-పన్నాగాలకు మారు పేరుగా ప్రసిద్ధికెక్కినవాడు. అలానే వివాదగ్రస్తులైన వారిలో అనేక యుద్ధాలను ప్రేరేపించిన థియోడోర్ రూజ్వెల్ట్, యుద్ధ సామాగ్రి తయారుచేసుకోవడానికి ఫాసిస్టు జర్మనీకి కోట్లాది డాలర్లు సహాయం చేసిన ఛార్లెస్ డాస్, యుద్ధోన్మాది జార్జ్ మార్షల్, ఆ క్రమంలోనే జిమ్మీ కార్టర్, ఒబామా లాంటి వారున్నారు. 1978 లో నోబెల్ బహుమానం విలువను పూర్తిగా మంట కలిపారు. లెబనాన్‌లో పాలస్తనీయులను ఊచకోత కోసిన కసాయి, అంతర్జాతీయ టెర్రరిస్ట్, ఇరవయ్యో శతాబ్దపు ప్రముఖ యుద్ధోన్మాది మనాఖెమ్ బెగిన్ కు బహుమానాన్ని ఇచ్చి, నోబెల్ ఆత్మకు క్షోభ మిగిలించింది కమిటీ.

1983 లో నోబెల్ శాంతి బహుమానానికి ఎంపికైన లెచ్ వాలేసాకున్న ఒకే ఒక అర్హత కమ్యూనిస్ట్ వ్యతిరేకత. కమ్యూనిస్ట్ దేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమం ప్రారంభించడమే, ఆయన ప్రపంచ శాంతికి తోడ్పడడం అనుకోవాలా? ఈ ఏడాది బహుమతి గ్రహీత కూడా కమ్యూనిస్ట్ వ్యతిరేకి ఐనందునే బహుమానం ఇచ్చారా? ఒక్కో సారి నోబెల్ శాంతి బహుమానాన్ని పొందాల్సిన అర్హత వున్నవారు ఎంపిక కాకపోవడం శోచనీయం. 1976 శాంతి బహుమానానికి ఎవరినీ ఎంపిక చేయకపోవడంతో, ప్రజలు నోబెల్ కమిటీకి సరైన రీతిలో గుణపాఠం చెప్పారు. ఇరవై రెండు నార్వే వార్తా పత్రికలు మూడు లక్షల ఇరవై నాలుగు వేల డాలర్లు సేకరించి, "ప్రజల శాంతి బహుమానం" గా, ఉత్తర ఐర్లాండు దేశస్థులు, శాంతి ఉద్యమ నిర్మాతలైన మేరడ్ కారిగన్, బెట్టీ విలియమ్స్ అనే ఇద్దరు బెల్ ఫాస్ట్ మహిళలకు ఇచ్చారు. పశ్చాత్తాప పడ్డ నోబెల్ కమిటీ మరుసటి సంవత్సరం వారిద్దరికీ నోబెల్ శాంతి బహుమానాన్ని ప్రకటించింది.

నోబెల్ శాంతి బహుమానం రాజకీయాలకు అతీతం కాదేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏనాడో మానవ హక్కుల కొరకు పోరాడి, సామ్రాజ్యవాద-వలస వాద దేశాన్నుంచి శాంతి సమరం ద్వారా భారత దేశానికి స్వాతంత్ర్యం సముపార్జించిన మహాత్మా గాంధీని, పంచశీల పేరుతో అలీన ఉద్యమం నిర్మించి ప్రపంచ వ్యాప్తంగా శాంతిని ప్రబోధించిన జవహర్లాల్ నెహ్రూ, ప్రపంచంలోనే మొదటి సోషలిస్టు దేశాన్ని స్థాపించిన లెనిన్ లను నోబెల్ శాంతి బహుమానానికి ఎంపిక చేయకపోవడం దురదృష్టకరం.

Monday, October 11, 2010

Historical Secular Judgment on Ayodhya-Interesting quotes By Vanam Jwala Narasimha Rao

Historical Secular Judgment on Ayodhya
Interesting quotes
By
Vanam Jwala Narasimha Rao

“Cases were filed before the Court of Civil Judge Faizabad which was transferred on the request of Uttar Pradesh Government to Allahabad High Court resulting in constitution of a three member Special Bench by the Chief Justice. Claim was made that, Babur built a mosque at Ayodhya, known as Babri Mosque which was damaged in 1934 during communal riots and thereafter in December 1949 large crowd of Hindus desecrated the mosque by placing idols inside the mosque. On behalf of some of the defendants, it was alleged that not only in the outer courtyard but also in the inner courtyard people used to worship the birth place of deity and it is being worshipped from times immemorial”.

“The case of the plaintiffs is that at Ayodhya, Pargana Haveli Oudh there exists an ancient historic mosque commonly known as 'Babari Masjid' built by Emperor Babar about 433 years ago, after his conquest of India, and occupation of the territories including Ayodhya town. The said mosque was for the use of Muslims in general as a place of worship and performance of religious ceremonies”.

One defendant in his written statement: “Babar was not a fanatic but a devout Muslim who did not believe in destroying Hindu temples. It was Mir Baqi who was a Shia and commanded Babar's orders, who demolished ancient Hindu temple of the time of Maharaja Vikramaditya at Shri Ramjanambhumi and tried to raise a mosque like structure in its place with its material. Babar was not an emperor. He was a marauder. What was constructed was not a mosque nor it was constructed for use of Muslims in general. It was not known as Babri Masjid but described as Masjid Janamsthan in British times. The objective evidence of demolition of ancient temple and attempted construction of mosque at Ramjanambhumi existed in the form of 14 Kasauti pillars, sandal wood beams and other structural features of the building. The aforesaid act, however, is opposed to the tenets of Islam as disclosed by holy Quran and Fatwa issued by Muslim theologians”.

Faizabad Gazetteer 1960 has recorded an important fact at page 50 as under: “William Finch, the English merchant, who travelled through the Mughal Empire (1608-1611), says that Avadh is a city of ancient note, and seat of Potan King, now much ruined; the castle built four hundred years ago. Here are also the ruins of castle and houses of Ram Chandra, the Hero of Ramayan, which the Indians acknowledge for the great God, saying that he took a flesh upon him to see the tamasha of the world. In these ruins Ramayana certain Brahmans who record the names of all such Indians as wash themselves in the river running thereby; which custom they say, has continued four lakhs of years (which is three hundred ninety four thousand and five hundred years before the world's creation).”

The three Judges Justice Sudhir Agarwal, Justice S U Khan and Justice D V Sharma, in their judgment decided that “the area covered by the central dome of the three domed structure-the disputed structure being the deity of Bhagwan Ram Janamsthan and place of birth of Lord Rama as per faith and belief of the Hindus. The area within the inner courtyard belongs to members of both the communities-Hindus and Muslims since it was being used by both for decades and centuries. The area covered by the structures, namely, Ram Chabutra, Sita Rasoi and Bhandar in the outer courtyard is declared in the share of Nirmohi Akhara. The open area within the outer courtyard shall be shared by Nirmohi Akhara and Muslims. It is however made clear that the share of Muslim parties shall not be less than one third of the total area of the premises and if necessary it may be given some area of outer courtyard. It is also made clear that while making partition by metes and bounds (is a system or method of describing land, real property), if some minor adjustments are to be made with respect to the share of different parties, the affected party may be compensated by allotting the requisite land from the area which is under acquisition of the Government of India.

Justice Sudhir Agarwal, started his judgment with a Rig-Veda Shloka and said that, “During the Dissolution, there was neither existence nor non¬existence, and at that time neither Lok (world) was there nor was anything beyond the space. What encompassed all at that time? Where was the abode and of whom? What was the unfathomable and deep water? At that time there was neither death nor immortality, and there was also no knowledge of day and night in absence of the Sun and the Moon. In that stage of vacuum, Brahm (the Supreme Being) alone was imbibing life from His own power. There was nothing beyond or distinct from Him.”

“Prior to Creation, in the stage of Dissolution, there was darkness, everything was covered with darkness in an unknown state and this was all water and whatever existed, was covered all around with remarkable attributes of existence and non¬existence and this was possible due to the effect of great austere practice. None knows and none can tell as to from where and how the Creation took place, because even the scholars or those having foresight, were born after the Creation. Hence, none knows the source of this Creation. O scholar whether the Creation is sustained by the Creator or not, is known only to Him, who superintends this Creation from the supreme space or it may not be known even to Him.”

Justice Agarwal mentioned that, Sixty years and more passed since the first Suit was filed in the Court of Civil Judge, Faizabad and more than twenty one years was over when it came before a Full Bench of Allahabad High Court (on transfer of the suits from the Court of Civil Judge Faizabad). They examined 533 exhibits, 87 witnesses deposing in about 13990 pages, gone through more than a thousand reference books on various subjects like History, Culture, Archaeology, Religion etc. and in different languages like Sanskrit, Hindi, Urdu, Persian, Turkish, French etc.; innumerable archaeological artifacts kept in the record room; dozens of C.Ds. and other records; and, the period of events ranging from crores to more than 550 years; religious faith, sentiments and pathos of millions of people of not only this Country but abroad also. All these gave them some indication towards length, width and depth of the dispute before them observed Justice Agarwal.

According to the Judges, the entire dispute relates to the land situated in village Kot Rama Chandra (Ramkot at Ayodhya), Pargana Haveli Avadh, Tehsil Sadar, District Faizabad. At the disputed site there was an old structure--centre of controversy among two major communities of this country, i.e., Hindus and Muslims. Amongst Hindus also a religious sect known as “Ramanandi Vairagis” has an independent and separate claim. It is claimed by Hindus in general that the disputed site is the place where Lord Rama was born and it is his birthplace. There existed a Rama temple at the site which was demolished in 1528 by Mir Baqi, a Commander of Babar, and, he constructed the said disputed structure which the Muslims claimed to be “Babari Mosque”. The claim of Hindus is that there cannot be another birthplace of Lord Rama. Therefore, by its very nature they cannot give away such a unique and singular pious place. Ramanandi Vairagis, however, claim that the structure was not a mosque but continued to be a “Rama temple” throughout and worshipped as such, it belongs to them, and they have been in continuous possession and management till December' 1949. They, however, are in agreement with the orthodox Hindus' general belief that the site in dispute is the birthplace of Lord Rama.

Justice Agarwal said that, “It is averred that from the public record of unimpeachable authority, it is established manifestly that the premises in dispute is the place where Maryada Purushottam Shri Ramchandra Ji Maharaj was born as the son of Maharaja Dashrath of Solar Dynasty. According to the traditions and faith of devotees of Bhagwan Shri Ram, it is the place where he manifested himself in human form as an incarnation of Bhagwan Vishnu. The place has since ever been called Shri Ramjanambhumi by all and sundry through the ages. The place itself has been the object of worship as a Deity by the devotees of Bhagwan Shri Rama as it personifies the spirit of Divine, worshipped in the form of Shri Ramlala or Lord Ram, the child. The Sthan was thus deified and has a juridical personality of its own even before the construction of a Temple building or the intallation of idol of Bhagwan Shri Rama thereat. Hindus do not worship the stone or the metal shaped into the form of their Ishta Deva or the stone of Saligram which has no particular shape at all. They worship the Divine.”

Justice S.U. Khan, in his prelude mentioned that, “here is a small piece of land (1500 square yards) where angels fear to tread. It is full of innumerable land mines. We are required to clear it. Some very sane elements advised us not to attempt that. We do not propose to rush in like fools lest we are blown. However we have to take risk. It is said that the greatest risk in life is not daring to take risk when occasion for the same arises. Once, angels were made to bow before Man. Sometimes he has to justify the said honor. This is one of those occasions. We have succeeded or failed? No one can be a judge in his own cause”. Then the judgment of him followed saying that the entire country is waiting with bated breath for the same.

Justice Khan referring to demolition of mosque in 1992 said that, “a very large crowd of Hindus (Kara Sewaks) gathered at the spot and demolished constructed portion, boundary wall and Ram Chabutra etc. situated in the premises in dispute in spite of the interim orders passed by Supreme Court and this Court and makeshift structure/ temple was constructed at the place which was under the central dome and the idol was replaced there. The demolition caused almost unprecedented communal disturbance and divide. In independent India only the frenzy and madness which was unleashed immediately after independence and partition of the country could surpass the magnitude of the situation triggered by the demolition. The demolition was by design, as asserted by some, or it was sudden, spontaneous and unplanned and was a result of outburst of pant up feelings of the mob which had gathered there for Kara Seva (religious service), as asserted by others?”

“One may not fully agree with Marx in his interpretation of history relating that only and only with economics. However, it will be perilous to deny even partial truth in the said approach. At the time of the demolition our economy was in shatters. However, it goes to our credit that we the people of India showed remarkable resilience and disproved the doomsday predictors. Neither the misplaced ecstasy nor the abject despondency survived long. The demolition did not prove Indian equivalent of storming of the Bastille and it remained a turning point in Indian history when history refused to turn. We could again sing with fresh charm Sare jahan Se Achcha Hindustan hamara..”.

In his Epilogue, Justice Khan said that, “my judgment is short, very short. Either I may be admired as an artist who knows where to stop, particularly in such sensitive, delicate matter or I may be castigated for being so casual in such a momentous task. Sometimes patience is intense action, silence is speech and pauses are punches”.
“I have not delved too deep in the history and the archaeology. This I have done for four reasons. Firstly this exercise was not absolutely essential to decide these suits. Secondly I was not sure as to whether at the end of the tortuous voyage I would have found a treasure or faced a monster (treasure of truth or monster of confusion worst confounded). Thirdly having no pretence of knowledge of history I did not want to be caught in the crossfire of historians. Fourthly, the Supreme Court… has held as:”¬

“As far as a title suit of civil nature is concerned, there is no room for historical facts and claims. Reliance on borderline historical facts will lead to erroneous conclusions.”

Observing that this judgment is not finally deciding the matter and as the most crucial stage is to come after it, he wanted to remind both the warring factions and said:

“The one quality which epitomized the character of Ram is tyag (sacrifice)”.

“When Prophet Mohammad entered into a treaty with the rival group at Hudayliyah, it appeared to be abject surrender even to his staunch supporters. However the Quran described that as clear victory and it did prove so. Within a short span there from Muslims entered the Mecca as victors, and not a drop of blood was shed. Under the sub-heading of demolition I have admired our resilience. However we must realize that such things do not happen in quick succession. Another fall and we may not be able to rise again, at least quickly. Today the pace of the world is faster than it was in 1992. We may be crushed”.

Justice Khan quoted two verses of Iqbal and then observation of Darwin that, “Only those species survived which collaborated and improvised.”

Justice Khan finally says that, “Muslims must also ponder that at present the entire world wants to know the exact teaching of Islam in respect of relationship of Muslims with others. Hostility, peace, friendship, tolerance, opportunity to impress others with the Message--opportunity to strike wherever and whenever possible – or what? In this regard Muslims in India enjoy a unique position. They have been rulers here, they have been ruled and now they are sharers in power (of course junior partners). They are not in majority but they are also not negligible minority (Maximum member of Muslims in any country after Indonesia is in India.) In other countries either the Muslims are in huge majority which makes them indifferent to the problem in question or in negligible minority which makes them redundant. Indian Muslims have also inherited huge legacy of religious learning and knowledge. They are therefore in the best position to tell the world the correct position. Let them start with their role in the resolution of the conflict at hand”.

Sunday, October 10, 2010

పారదర్శకత చూపని ప్రభుత్వం : వనం జ్వాలా నరసింహారావు

(సూర్య దినపత్రిక:10-10-2010)
వనం జ్వాలా నరసింహారావు

చంద్రబాబుది ‘స్మార్ట్ పాలన'
వైఎస్సార్‌ది ‘కేరింగ్‌ ప్రభుత్వం’
ప్రస్తుత పాలనలో ఉదాసీనత
అమలు కాని పరిపాలనా సంస్కరణలు
పౌర సేవా పట్టికల తయారీకి టీడీపీ కృషి

పారదర్శకత, జవాబుదారీతనం, విశ్వసనీయత, ప్రజా సంక్షేమం, పౌర సౌకర్యాలు, అభివృద్ధి అనే మాటలను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి, ఇప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య తరచుగా చెప్పడం గమనిస్తున్న పలువురు పరిశీలకులకు "మేడి పండు" సామెత గుర్తుకొస్తోంది. వీరిరువురు, తమ (కాంగ్రెస్) ప్రభుత్వం పనితీరు గురించి చెప్పుకొంటున్నప్పుడల్లా ఈ పదాలను అదే పనిగా ఉచ్చరించడం ఒక రకమైన ఆనవాయితీగా-అలవాటుగా మారింది. ఆ మాటకొస్తే మాజీ ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ మాటలు చెప్పకుండా ఏ పనీ చేసేవారు కాదు. కాకపోతే చెప్పిన మాటలను చేయడానికి, చేసినట్లు ప్రజలను నమ్మించడానికి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అనుసరించేవారు. చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో తన ప్రభుత్వాన్ని ’స్మార్ట్ గవర్నమెంట్’ అనేవారు. సరళీకృత, నైతిక, జవాబుదారీ, బాధ్యతాయుత, పారదర్శక (సిం పుల్‌, మోరల్‌, అకౌంటబుల్‌, రెస్పాన్సివ్‌, ట్రాన్స్ పరెంట్‌) విధానాలను త్రి కరణ శుద్ధిగా పాటించే ప్రభుత్వం తమ ప్రభుత్వమని అనే వారు. ఇక దివంగత ముఖ్యమంత్రి అవే పదాలను ఇంచుమించు అటు ఇటుగా మార్చి, తనది ’కేరింగ్ ప్రభుత్వం’ అని నామకరణం చేశారు. రెండింటికి బాధ్యతాయుత ప్రభుత్వమన్న అర్ధమే వస్తుంది. కాకపోతే, ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియజేయడంలోను, పారదర్శకతకు, జవాబుదారీతనానికి నిదర్శనంగా చెప్పుకోదగిన ప్రభుత్వ పరమైన సాధనాలను ప్రవేశపెట్టడంలోను, వాటిలో అతి ముఖ్యమైన పౌర సేవా పట్టిక (సిటిజన్ చార్ట్)ల రూపకల్పన-అమలు లోను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటి ప్రభుత్వం కంటె మెరుగైన శ్రద్ధ కనబరిచారనే విషయంలో సందేహం లేదు. మరో రకంగా చెప్పుకోవాలంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందనాలి.

పాలనలో పారదర్శకత ఉట్టిపడేందుకు, పాలకుల్లో, ప్రభుత్వోద్యోగుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు దశాబ్దాల కిందటే కసరత్తులు మొదలైనా ఆచరణలో జరిగింది సున్నా అని చెప్పక తప్పదు. పాలనాపరమైన సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటిస్తూ ఐదు, ఆరు దశకాల్లో గోపాలస్వామి అయ్యంగార్, పాల్ ఏపెల్ బీ, టీటీ కృష్ణమాచారి వంటి ప్రముఖులు నివేదికలు తయారుచేశారు. తమ నివేదికల్లో చేసిన అనేక సూచనలు అమలుకు నోచుకోలేదు. కానీ, ఈ నివేదికల పుణ్యమా అని 1964లో కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా పరిపాలనా సంస్కరణల శాఖను ఏర్పాటు చేసింది. మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటైన పాలన సంస్కరణల కమిషన్ 500కు పైగా సూచనలు చేసింది. ప్రభుత్వాలు అభివృద్ధికే ప్రాధాన్యమివ్వాలి తప్ప నియంత్రించడానికి కాదని ఎల్.కె. ఝా కమిషన్ సూచించింది. తొమ్మిదో దశకం తొలినాళ్లలోనే ప్రవేశపెట్టిన సరళీకృత ఆర్థిక విధానాల పర్యవసానంగా పాలన సంస్కరణలను తప్పనిసరిగా చేపట్టవలసిన అవసరమేర్పడింది. ఈ నేపథ్యంలో - 1997 మేలో జరిగిన ముఖ్యమంత్రుల సదస్సులో పాలన సంస్కరణల దిశగా చేసిన తీర్మానం చెప్పుకోదగినది. ఐ. కే. గుజ్రాల్ ప్రధాన మంత్రిగా వుండి, అధ్యక్షత వహించిన ఆ సమావేశంలో, రాజకీయాలకు అతీతంగా-పార్టీలకతీతంగా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలోనే, తన "స్మార్ట్ గవర్నమెంట్" విధి విధానాలను వివరించి పలువురు ముఖ్యమంత్రుల ప్రశంసలను అందుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే, అలనాటి ఆయన ఉపన్యాసం అత్యంత కీలకమైన పాలనా సంస్కరణలను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టి అమలు పరచడానికి దోహదపడిందనవచ్చు.

1997లో అప్పటి ప్రధాని అధ్యక్షతన జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి యాభై ఏళ్లు గడచిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం. ఆ సమావేశంలో చేసిన ఏకగ్రీవ తీర్మానం, తదనంతరం రూపొందించిన తొమ్మిది అంశాల కార్యాచరణ పథకం భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా వర్ణించాలి. స్వాతంత్రం లభించి యాభయ్యేళ్లు గడచినా ప్రభుత్వాల పనితీరుపైనా, జవాబుదారీతనంపైనా ప్రజలకు పూర్తి విశ్వాసం ఏర్పడలేదని, ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు అత్యవసరంగా కొన్ని చర్యలు చేపట్టాలని ఆ తీర్మానంలో సూత్రీకరించారు. అలనాటి తొమ్మిది అంశాల కార్యాచరణ ప్రణాళిక కట్టుదిట్టంగా అమలు చేయడం ద్వారా బాధ్యతాయుతమైన సుపరిపాలనను అందించడాన్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఆ ప్రణాళికే ఇప్పటికీ అమలులో వున్నట్టయితే, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం, బయ్యారం గనుల అక్రమాలు, పబ్లిక్ సర్వీసు కమీషన్ అవకతవకలు, అలాంటి అనేకానేక పౌర వ్యతిరేక కార్యక్రమాలు చోటు చేసుకోకపోయేవేమో!

అప్పట్లో ఆ నవ సూత్ర ప్రణాళిక అమలుకు, ఆ రోజునుంచి ఆరు నెలల గడువును కూడా నిర్దేశించుకున్నారు. అందులో అతి ప్రాముఖ్యమైన వాటిలో, పౌర సేవా పట్టికల తయారీ-అమలు, పాలనలో పారదర్శకత - జవాబుదారీతనం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడం, చట్టాలు - నియమనిబంధనలు - నియంత్రణలను సమీక్షించి తగిన విధంగా సవరణలు చేయడం, సమాచార హక్కు కల్పించడం, పౌర సమాచార సదుపాయాల కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులోకి తేవడం, ప్రజాసేవకులకు నైతిక విలువల నియమావళిని రూపొందించి వర్తింపజేయడం, పాలనలో అవినీతిని అరికట్టేందుకు చర్యలు చేపట్టడం, ప్రభుత్వోద్యోగులకు పదవీకాలంలో స్థిరత్వం కల్పించడం, సివిల్ సర్వీసెస్ బోర్డును ఏర్పాటు చేయడం వంటి అంశాలున్నాయి. అప్పటి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రుల్లో చాలామంది ఇప్పటికీ అధికారంలో కొనసాగుతున్నారు. మరికొందరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇంకొందరు వారసులో, బంధుగణమో, ఇలా ... వారంతా ఇప్పటికీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నా, అప్పటి ప్రణాళికలోని అంశాల అమలుకు మాత్రం ఈ పదమూడేళ్ల కాలంలో చేసిన కృషి నామమాత్రమే.

మన రాష్ర్టానికి సంబంధించినంతవరకు అప్పటి ప్రణాళికలోని తొమ్మిది అంశాలలో ఒకటైన పౌర సేవా పట్టికల రూపకల్పనకు తెలుగుదేశం ప్రభుత్వం గణనీయమైన కృషి చేసింది. పౌర సేవా పట్టికలను తయారు చేయవలసిందిగా ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీచేసింది. ఈ కార్యక్రమం ఆమలు కోసం సిబ్బందికి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ ఇచ్చారు. వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులను, ఉన్నతాధికారులను, మధ్య స్థాయి అధికారులను ఒకే వేదిక పైకి తెచ్చి ప్రజల అవసరాలకు, అభీష్టాలకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్న విషయాలపై ఉమ్మడి ఆలోచన చేసేందుకు చంద్రబాబు నాయుడు ఆదేశాలిచ్చారు. ఆ మేరకు అనేక ప్రభుత్వ శాఖలు పౌర సేవా పట్టికల్ని తయారుచేశాయి. అయితే, మొదట్లో, అమలు విషయానికి వచ్చేసరికి ఏడెనిమిది శాఖలు మినహా మిగతావన్నీ వాటిని కాగితాలకే పరిమితం చేశాయి. ఇంతలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోవడానికి కొన్ని నెలల ముందు పౌర సేవా పట్టికల అమలు తీరుపై సమీక్ష జరిపినా, ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పౌర సేవా పట్టికల అమలు విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టింది. బహుశా ఇప్పడు చాలా శాఖల్లో పౌర సేవా పట్టికలనేవి లేకపోవడమో, వున్నా, వాటి విషయం అక్కడి ఉద్యోగులతో సహా సంబంధిత పౌరులకు తెలియకపోవడమో జరుగుతోంది.

ముఖ్యమంత్రుల సదస్సులో అంగీకారం పొందిన ప్రణాళిక అమలు తీరును పరిశీలించేందుకు కేంద్రప్రభుత్వం 2001లో రాష్ట్రాల నుంచి నివేదికలు తెప్పించుకొని అధ్యయనం చేసింది. వీటిని విశ్లేషించేందుకు కేంద్రం నియమించిన కమిటీ 2002లో తన నివేదికను సమర్పించింది. ప్రణాళికలోని తొమ్మిది అంశాలలో ఒక్కటి కూడా ఏ రాష్ట్రంలోనూ సక్రమంగా అమలు జరగడం లేదన్నది ఆ నివేదిక సారాంశం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న ఆంధ్ర ప్రదేశ్ లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అమలు తీరు చాలా బాగుందని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అభిప్రాయపడిందప్పట్లో. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలపై కొరడా ఝుళిపించవలసిన కేంద్రం కూడా ఏమీ పట్టించుకోకుండా మిన్నకుండిపోయింది. ఆ తరువాత మేల్కొని మరో మారు పౌర సేవా పట్టికల రూపకల్పనను తక్షణం చేపట్టాలంటూ ఆదేశాలిచ్చింది. వాటిని రూపొందించడం, అమలు చేయడం వంటి విషయాల్లో కొన్ని మార్గదర్శకాలను సూచించింది. పౌర సేవా పట్టికల తయారీకి ప్రతి ప్రభుత్వ శాఖలో ఒక నోడల్ అధికారిని నియమించి, అతని సారధ్యంలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఉద్యోగ వర్గాల ప్రతినిధులు, ప్రభుత్వేతర సంస్థల సభ్యులు టాస్క్ ఫోర్స్ లో సభ్యులుగా ఉండాలని, వారు పలు దఫాలు చర్చలు జరిపిన అనంతరం పౌర సేవా పట్టికలను రూపొందించాలని కోరింది. ఇన్ని సూచనలు చేసినా, సలహాలు ఇచ్చినా, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిలో మార్పు రాలేదనడానికి మన రాష్ట్రమే ఓ ఉదాహరణ.

ప్రభుత్వానికీ, ప్రజలకూ మద్య పౌర సేవా పట్టిక ఒక అవగాహన పత్రం లాంటిది. ఏయే సేవలను ఎలా, ఎప్పుడు, ఏ విధంగా, ఎంత సమయంలో అందించేదీ ప్రభుత్వం సవివరంగా తెలియజేస్తూ ప్రజలకు ఇచ్చే ఒప్పందపత్రం అది. ఇది కార్యరూపం దాల్చాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి కావాలి. ఏదో ఒకటి రెండు ఉదాహరణలిచ్చి తమ ప్రభుత్వం పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేస్తోందని బాకా ఊదుకోవడం ప్రజల్ని మభ్యపెట్టడమే. కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రధానిగా అయిన తర్వాత తీసుకువచ్చిన సమాచార హక్కు చట్టం పకడ్బందీగా అమలు కావాలన్నా పౌర సేవా పట్టికల రూపకల్పన, వాటితోపాటు పౌర సమాచార సదుపాయాల కేంద్రాల ఏర్పాటూ తప్పనిసరి. వాటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన తరువాతే ఏ ప్రభుత్వమైనా తమది పారదర్శకత, జవాబుదారీతనం ఉట్టిపడే ప్రభుత్వమని చెప్పుకుంటే బాగుంటుంది. అప్పటివరకూ, ఎమ్మార్ కుంభకోణాలు, బయ్యారం గనుల అక్రమాలు, సోంపేట బాధలు ప్రజలకు తప్పవు.