Sunday, June 30, 2013

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు- కాలేజీ కబుర్లు-Part THREE: వనం జ్వాలా నరసింహారావు

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు
కాలేజీ కబుర్లు-Part THREE
వనం జ్వాలా నరసింహారావు

న్యూ సైన్స్ కాలేజీ, బీ ఎస్సీ (ఎం.పీ.సీ) క్లాస్‍లో 150 మందికి పైగా విద్యార్థులుండే వారు. ఎప్పుడూ, సందడిగా, సరదాగా, గలగలా పారే సెలయేరులా వుండేది మా క్లాస్. బయటేమో ఎప్పుడూ..ఏదో ఒక నిర్మాణం జరుగుతుండేది మా కాలేజీలో. కాలేజీకి వున్న మంచి పేరు వల్ల, విద్యార్థుల తాకిడి బాగా వుండేది. అంత మందిని చేర్చుకోవాలంటే, అధిక సంఖ్యలో క్లాస్ రూమ్‌లు కావాలి. అందుకే, ఎప్పుడూ, ఏదో ఒక భవన నిర్మాణం జరుగుతుండేది. ఒక విద్యార్థి...పేరు గుర్తుకు రావడం లేదిప్పుడు...తన దగ్గర ఎప్పుడూ, ఒక "టిక్-టిక్" ధ్వని చేసే టాయ్ వుంచుకునే వాడు. బహుశా...ఆ రోజుల్లోనే అనుకుంటా "దేవాంతకుడు" అనే సినిమా వచ్చి వుండాలి. అందులో హీరో దాన్ని ఉపయోగించేవాడు. ఎవరూ చూడకుండా దాంతో ధ్వని చేయడం అతడికో హాబీ. "సీటింగ్ అరేంజ్ మెంట్" అని రాసి వుంటే, అందులోంచి "ఎస్" అక్షరం తొలగించి, దాన్ని "ఈటింగ్" అని చేసేవాడు. అతడి అల్లరి అంతా-ఇంతా కాదు.

మరి కొందరి క్లాస్ మేట్స్ పేర్లు కూడా గుర్తుకొస్తున్నాయి. ఖమ్మంలో నాతో పాటు పియుసి చదువుకున్న బాల మౌళి (ఇప్పుడో పెద్ద ఛార్టెడ్ అకౌంటెంట్) ఇక్కడ కూడా క్లాస్ మేట్ అయ్యాడు. రాం ప్రసాద్ (ఆయన భార్య గీత..ఆ తరువాతి కాలంలో నాకు స్నేహితురాలైంది) మరొక క్లాస్ మేట్. అతడిప్పుడు ఒక ప్రయివేట్ కంపెనీలో పని చేసి రిటైరై బెంగుళూరులో వుంటున్నాడు. అలానే...రంగ రామానుజం, కుల్ కర్ణి (అతివాద-తీవ్ర వాద భావాల విద్యార్థి), జ్యోతి ప్రసాద్, ఎర్రం రాజు, మల్లికార్జున్, బాబ్జి, సుబ్బా రావు (సీనియర్ సైంటిఫిక్ అధికారిగా పదవీ విరమణ చేశాడు), వి.ఎస్.పి. శాస్త్రి, మల్లాడి వెంకట సుబ్బయ్య, కపాడియా, త్యాగరాజన్, టి. ఆర్. శ్రీనివాసన్ (ప్రస్తుతం షికాగోలో స్థిరపడ్డాడు)...తదితరులు కూడా నాకు క్లాస్ మేట్సే. నిజాం కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం పూర్తి చేసిన వల్లూరి శ్రీ రాం అనే అతడిని, ప్రిన్సిపాల్ సుదర్శన్ నచ్చ చెప్పి ఫైనల్ ఇయర్ లో మా కాలేజీలో, మా క్లాస్ లో చేర్పించాడు. అతడికి లాంగ్వేజెస్ లో యూనివర్సిటీ ఫస్ట్ రావడంతో, ఫైనల్ డిగ్రీలో కూడ అతడికే రాంక్ వచ్చే అవకాశాలున్నాయని భావించిన సుదర్శన్ గారు అలా చేశారు. ఆయన గెస్ నిజమైంది. డిగ్రీలో అతడికే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. క్రెడిట్ న్యూ సైన్స్ కాలేజీకి దక్కింది. ఆయన పక్క నంబరైన నేను కనీసం పాసు కూడా కాలేదు! అసలు పరీక్షలే రాయలేదు! ఇంటర్ నెట్‌లో చూస్తే, శ్రీ రాం అమెరికాలో పని చేస్తున్నట్లు అర్థమైంది.

లెక్చరర్ల విషయానికొస్తే, బహుశా, అంత నైపుణ్యం కల అధ్యాపకులు, మరే కాలేజీలోను వుండరంటే అతిశయోక్తి కాదేమో! తెలుగు బోధించడానికి ఇద్దరుండేవారు. ఒకరి పేరు "మంజు శ్రీ"...మరొకరి పేరు "అరిపిరాల విశ్వం". మాకు తెలుగు పాఠ్య పుస్తకంగా "ఆంధ్ర మహాభారతోపన్యాసాలు", నాన్-డిటేల్‍గా "పురుషోత్తముడు", నాటకంగా "హాలికుడు" వుండేవి. ఆంధ్ర మహాభారతోపన్యాసాలు లో, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్న సందర్భంలో ఆయనను ఆక్షేపిస్తూ శిశుపాలుడు పద్య రూపంలో అన్న మాటలు "అవనీ నాధు లనేకు లుండఁగ విశిష్టారాధ్యు లార్యుల్ మహీ దివిజుల్ పూజ్యులు పల్వు రుండఁగ ధరిత్రీనాథ! గాంగేయుదుర్వ్యవసాయంబునఁ గృష్ణు గష్టచరితున్ వార్ష్ణేయు బూజించి నీ యవివేకం బెఱిఁగించి తిందఱకు దాశార్హుండు పూజార్హుఁడే" ఇంకా గుర్తున్నాయి. పద్య భాగం పుస్తకం పేరు గుర్తుకు రావడం లేదు కాని ఒక పాఠం..."గంగావతరణం" ఇంకా గుర్తుంది. అందులోని ఒక పద్యం...."ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సుశ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి యస్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గంగా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్".....కొంచెం..కొంచెం గుర్తుకొస్తోంది. అరిపిరాల విశ్వం గారి తమ్ముడు రామ్మోహన రావు కూడా నా క్లాస్ మేట్.


New Science College

ఇంగ్లీష్ లెక్చరర్లుగా "షమీం" మేడం, "వి. వి. చారి" గారుండేవారు. పాఠ్య పుస్తకం-వాచకంగా ఇ.ఎఫ్.డాడ్ సంపాదకీయంలోని వ్యాసాల సంకలనం వుండేది. ఎ. జి. గార్డినర్ రాసిన వ్యాసం ఒకటుంది. ఇ. ఎం. ఫార్ స్టర్ రాసిన "పాసేజ్ టు ఇండియా" నాన్-డిటేల్ గా వుండేది. ఫార్ స్టర్ ఆ పుస్తకాన్ని 1924 లో భారత దేశంలో ఆంగ్లేయుల పాలన-1920 నాటి స్వాతంత్ర్య పోరాటం నేపధ్యంలో రాశారు. ప్రపంచంలోని వంద అత్యుత్తమైన ఇంగ్లీష్ లిటరేచర్ పుస్తకాలలో ఒకటిగా పాసేజ్ టు ఇండియాను "మాడరన్ లైబ్రరీ" ఎంపిక చేసింది. 1923-2005 మధ్య కాలంలో వచ్చిన అత్యుత్తమైన వంద ఇంగ్లీష్ నవలలో ఒకటిగా ఈ పుస్తకాన్ని "టైం మాగజైన్" ఎంపిక చేసింది. నవల మొత్తం కేవలం నాలుగు పాత్రల చుట్టూ తిరుగుతుంది. డాక్టర్ అజీజ్, ఆయన బ్రిటీష్ స్నేహితుడు సిరిల్ ఫీల్డింగ్, శ్రీమతి మూర్, కుమారి అడెలా క్వెస్టెడ్. ఇంగ్లీష్ పోయెట్రీలో కొన్ని పాఠాలు గుర్తున్నాయి. జార్జ్ హెర్బర్ట్ రాసిన "Virtue" (సద్గుణం, సత్ ప్రవర్తన) లో చక్కటి నీతి వుంది. ప్రపంచం మొత్తం కాల గర్భంలో కలిసి పోయినా మనిషి సత్ ప్రవర్తన, సద్గుణం అజరామరంగా వుంటుందని దాని భావన ("Only a sweet and virtuous soul, Like seasoned timber, never gives; But though the whole world turn to coal. Then chiefly lives"). మరో పోయెం 1608-1674 మధ్య కాలంలో జీవించిన "జాన్ మిల్టన్" రాసిన "పారడైజ్ లాస్ట్". ఆయనే రాసిన మరో పోయెం "ఆన్ హిజ్ బ్లయిండ్ నెస్". ఇంకో పోయెం కూడా గుర్తుంది. అది "విలియం వర్డ్ స్‌ వర్త్" రాసిన "సాలిటరీ రీపర్" (...."Alone she cuts and binds the grain, And sings a melancholy strain..."). జనరల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ను నాందేడ్కర్, సుబ్రహ్మణ్యం సార్లు చెప్పేవారు. చాలా ఇంటరెస్టింగ్ గా వుండేదా క్లాస్.

ఆప్షనల్ సబ్జెక్టులైన లెక్కలు, భౌతిక, రసాయన శాస్త్రాలు చెప్పే లెక్చరర్లు ఆయా విషయాలను అత్యంత ఆసక్తికరంగా బోధించే వారు. లెక్కల సబ్జెక్టులో మేం ఫైనల్ ఇయర్ పరీక్షల్లో మూడు పేపర్లు రాయాలి. ఒకటి "బీజ గణితం", రెండోది "రేఖా గణితం", మూడోది "త్రికోణమితి". రేఖా గణితం పుస్తకం "మాణిక్య వాచికం పిళ్లే" రాసిన దాన్ని ఉపయోగించే వాళ్లం. బీజ గణితాన్ని "షఫీ ఉల్ హక్", రేఖా గణితాన్ని "భాస్కర రావు", త్రికోణమితిని డాక్టర్ కుప్పుస్వామి బోధించేవారు. నాకు మొదటి నుంచి లెక్కల సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టంగా వుండేది. పరీక్ష రాసిన ప్రతి సారీ ఆ ఒక్క సబ్జెక్ట్ పాసయ్యేవాడిని మంచి మార్కులతో. మిగతావి (భౌతిక, రసాయన శాస్త్రాలు) రాయడానికే భయం వేసేది. భౌతిక శాస్త్రాన్ని "హరి లక్ష్మీపతి", "ప్రభాకర్" బోధించేవారు. భౌతిక శాస్త్రంలో "మాడరన్ ఫిజిక్స్" అనే నాలుగో పేపర్ కూడా వుండేది. డిమాన్ స్ట్రేటర్‌గా పి. వి. వి. ఎస్. మూర్తి మాతో ప్రయోగశాలలో ప్రాక్టికల్స్ చేయించేవారు. వాటిల్లో "వెలాసిటీ ఆఫ్ సౌండ్", "వర్నియర్ కాలి పర్స్", "స్క్రూ గేజ్"", ఫిజికల్ బాలెన్స్" లతో చేసిన ప్రయోగాలింకా గుర్తున్నాయి. అదే విధంగా రసాయన శాస్త్రం ప్రయోగాలను "రఘురాం" గారు చేయించేవారు. "వాల్యూ మెట్రిక్ అనాలసిస్", "పిప్పెట్, బ్యూరెట్ట్" ఉపయోగించడం తో పాటు "కాపర్ సల్ఫేట్ స్ఫటికాలు" తయారు చేయించడం చేసే వాళ్లం. రసాయన శాస్త్రం థియరీలో మూడు భాగాలుండేవి. "ఆర్గానిక్", "ఇన్-ఆర్గానిక్", "ఫిజికల్" అనే ఆ మూడింటిని ముగ్గురు లెక్చరర్లు బోధించేవారు. "వై. సూర్యనారాయణ మూర్తి" ఆర్గానిక్ సబ్జెక్టు చెప్పేవారు. ఇప్పటికీ ఆయన బోర్డు మీద వేసిన "బెంజిన్ రింగ్" కళ్లలో మెదులుతుంది. ఇన్-ఆర్గానిక్ అంశాన్ని ప్రిన్సిపాల్ సుదర్శన్ గారు చెప్పేవారు. ఫిజికల్ కెమిస్ట్రీని కూడా వై.ఎస్.ఎన్ గారు చెప్పినట్లు గుర్తు. సర్కార్ అండ్ రక్షిత్ రాసిన ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాన్ని, బాల్ అండ్ తులి రాసిన ఇన్-ఆర్గానిక్ కెమిస్ట్రీ పుస్తకాన్ని చదివే వాళ్లం. లైబ్రరీకి అడపదడప పోయే వాళ్లం. లైబ్రేరియన్‍గా పుల్లయ్య పని చేసేవాడు. తరువాత రోజుల్లో (1973-1974) ఉస్మానియా యూనివర్సిటీలో నేను లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ చేసేటప్పుడు, అతడు కూడా నాతోపాటు చదివాడు.


కాలేజీ చదువుతో పాటు క్రికెట్ ఆటకు క్రమం తప్పకుండా పోవడం కూడా అలవాటు చేసుకున్నాను. బర్కత్ పూరా సమీపంలోని ఆంధ్ర యువతీ మండలి మైదానంలో క్రికెట్ ప్రాక్టీసుకు వెళ్లేవాడిని. "జాలీ రోవర్స్ క్రికెట్ క్లబ్" ఆ రోజుల్లో హైదరాబాద్ "బి-లీగ్" మాచ్‍లు ఆడుతుండేది. నేను ఆ క్లబ్ పక్షాన ఆడేవాడిని. అంతగా ఆటలో రాణించక పోయినా ప్రాక్టీసు మానక పోయేవాడిని. నేను ప్రాక్టీసు చేస్తున్న రోజుల్లో ఆడిన పెద్ద క్రికెట్ క్రీడాకారుల్లో "అబ్దుల్ హాయ్", "సాయినాథ్", "ప్లహ్లాద్" వున్నారు. దరిమిలా వాళ్లంతా రంజీ ట్రోఫీ స్థాయి వరకు ఎదిగారు. నేను హైదరాబాద్‌లో ఆడడంతో, శెలవులకు ఖమ్మం వెళ్లినప్పుడు నాకు అదో రకమైన గౌరవం లభించేది. ఖమ్మం మామిళ్లగూడెం క్రికెట్ క్లబ్ పక్షాన టోర్నమెంటులకు వెల్లే జట్టులో నేనుండే వాడిని. ఖమ్మంలో వనం రంగారావు, నర్సింగరావు, శేషగిరి, మూర్తి, దిలీప్, శంకర్, దివాకర్, ప్లహ్లాద్, కళాధర్, రాధాకృష్ణ...లాంటి వారితో కలిసి ఆడాను.

Saturday, June 29, 2013

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు - కాలేజీ కబుర్లు-Part TWO: వనం జ్వాలా నరసింహారావు

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు
కాలేజీ కబుర్లు-Part TWO
వనం జ్వాలా నరసింహారావు

ప్రతిరోజు సాయంత్రం నేను, స్నేహితుడు నరసింహ మూర్తి, క్రమం తప్పకుండా కలిసే వాళ్లం. నరసింహమూర్తి వివేక వర్ధని కాలేజీలో బి. . (ఎకనామిక్స్, పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) చదువుతుండేవాడు. వాళ్లన్నయ్య కృష్ణమూర్తి గారు మామయ్యతో పాటు సచివాలయంలో పని చేస్తుండేవాడు. వాళ్ల మధ్య స్నేహం మమ్మల్ని కూడా దగ్గరికి చేర్చింది. కాలేజీ నుంచి వచ్చిన తరువాత సాయంత్రం నాలుగు-ఐదు గంటల ప్రాంతంలో నారాయణ గుడా తాజ్ మహల్ ముందు కలిసే వాళ్లం. కబుర్లు చెప్పుకుంటూ, ఒక ప్లేట్ "ముర్కు" తిని, "వన్ బై టు" కప్పు కాఫీ తాగి (బహుశా అంతా కలిపి అర్థ రూపాయ కన్నా తక్కువ బిల్లు అయ్యేదేమో!) బయట పడే వాళ్లంతాజ్ మహల్ హోటెల్ లో పనిచేసే కామత్ అనే అతను మాకు మంచి స్నేహితుడయ్యాడు. కూపన్ మరిచి పోయి వచ్చినా, డబ్బులు టైంకు ఇవ్వలేక పోయినా, భోజనం విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. కాఫీ-టీలు ఫ్రీగా తాగిన రోజులు కూడా ఎన్నో వున్నాయి. మాతో పాటు ఒక్కోసారి రూమ్మేట్ కల్మల చెర్వు రమణ, ఉస్మానియా "బి-హాస్టల్" లో వుంటూ ఎం. ఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న వనం రంగారావు (నర్సింగరావు తమ్ముడు...చనిపోయాడు) కూడా వుండేవారు. తాజ్ మహల్ నుంచి బయటికొచ్చి, కాసేపు నారాయణ గుడా బ్రిడ్జ్ పక్కనున్న పార్క్ లో కూచుని కబుర్లు చెప్పుకునే వాళ్లం. ఒక్కో సారి హిమాయత్ నగర్ మీదుగా, పీపుల్స్ హై స్కూల్ పక్కనుంచి నడుచుకుంటూ, చిక్కడపల్లి దాకా పోయి, నరసింహమూర్తిని వదిలేసి, నేను తాజ్ మహల్ హోటెల్ కు పోయి భోజనం చేసి రూమ్ కు వెళ్లే వాడిని. మధ్య-మధ్య నారాయణ గుడా నుంచి నడుచుకుంటూ వై.ఎం.సి.ఏ మీదుగా, బడీ చావడీ, సుల్తాన్ బజార్, కోఠి తిరిగి వచ్చే వాళ్లం. తిరుగు ప్రయాణం, ఒక వేళ అలిసిపోతే, బస్సులో చేసే వాళ్లం.

హిమాయత్ నగర్, అశోక్ నగర్ మధ్య ఇప్పుడున్న "బ్రిడ్జ్" అప్పుడు లేదు. వర్షాకాలంలో మోకాలు లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లే వాళ్లం. అశోక్ నగర్ లో ఇప్పుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న "హనుమాన్" గుడి అప్పుడు లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రం రోడ్డు మధ్యలో-కొంచెం పక్కగా వుండేది. నేను, మూర్తి, ఒకరు చూడకుండా మరొకరు ఆ విగ్రహానికి దండం పెట్టుకుని కదిలే వాళ్లం. పీపుల్స్ హైస్కూల్ దాటిన తరువాత మలుపు తిరిగి చిక్కడపల్లి వైపు పోతుంటే, ఇప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీ భవనం వున్న చోట ఒక కల్లు కాంపౌండ్ వుండేది. దాని ముందర నుంచి చీకటి పడిన తరువాత వెళ్లాలంటే కొంచెం భయమేసేది కూడా. ఇక మా కబుర్లలో వర్తమాన రాజకీయాలు ఎక్కువగా వుంటుండేవి. కేరళ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని ఇందిరా గాంధి ఎలా పడగొట్టింది, కెన్నెడీని ఎలా చంపారు, మావో సేటుంగ్ వ్యవహారం...ఇలా...జాతీయ-అంతర్జాతీయ రంగానికి చెందిన కబుర్లుండేవి. మూర్తికి, నాకు మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే వుంది. పోలీసు స్పెషల్ బ్రాంచ్ లో సీనియర్ అధికారిగా పని చేసి పదవీ విరమణ చేసాడు మూర్తి. అప్పట్లో హైదరాబాద్ లో ఒక సారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన ఒక బహిరంగ సభ ఫతే మైదాన్ స్టేడియంలో జరిగినట్లు గుర్తు. ఆ సభలో నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి "టోపీ" ని సవరించుకుంటుంటే, రాబోయే రోజుల్లో, ఏదో ఒక రాజకీయ మార్పు వుంటుందని పరిశీలకులు వ్యాఖ్యానించినట్లు గుర్తు కూడా వుంది. 


హైదరాబాద్‌లో ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని సినిమా టాకీసులు లేవు. వున్నవాటిలో ఎయిర్ కండిషన్ థియేటర్లు కాని, ఎయిర్ కూల్డ్ థియేటర్లు కాని దాదాపు లేనట్లే. ఆబిడ్స్ లో వున్న "జమ్రూద్" టాకీసు ఒక్కటే జనరేటర్ బాక్-అప్ వున్న ఎయిర్ కండిషన్ థియేటర్. అలానే వి. వి. కాలేజీ పక్కనున్న "నవరంగ్" థియేటర్ ఒకే ఒక్క ఎయిర్ కూల్డ్ థియేటర్. ఇవి కాకుండా నారాయణ గుడాలో "దీపక్ మహల్", హిమాయత్ నగర్ లో "లిబర్టీ", సికిందరాబాద్ లో "పారడైజ్", "తివోలీ" థియేటర్లుండేవి. సికిందరాబాద్ లో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు చూపించేవారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఇప్పుడున్న థియేటర్లు ఏవీ అప్పుడు లేవు. ముషీరాబాద్‌లో "రహమత్ మహల్" టాకీసుండేది. అలానే నారాయణ గుడా దీపక మహల్ పక్కన "రాజ్ కమల్" బార్ అండ్ రెస్టారెంట్ (ఇప్పటికీ వుంది) వుండేది. బహుశా అందులో మద్యపానం అలవాటు చేసుకోని వారు అరుదుగా వుంటారేమో! నాకు బాగా గుర్తుంది….. డిగ్రీ పరీక్షల్లో, చివరిగా, మాడరన్ ఫిజిక్స్ పేపర్ (వాస్తవానికి హాజరవడమే కాని మొదటి సారి నేను రాయలేదు) అయిపోయిన తరువాత, మధ్యాహ్నం పూట, మొట్ట మొదటి సారిగా, రాజ్ కమల్ బార్‌కు వెళ్లి, "గోల్డెన్‌ ఈగిల్" బీర్ తాగాను. నేను తాగలేనని వనం రంగారావు ఛాలెంజ్ చేయడంతో ఆ పని చేయాల్సి వచ్చింది. అప్పట్లో బీర్ బాటిల్ ధర కేవలం మూడు రూపాయలే! 1966 లో అలా మొదలైన ఆ అలవాటు ఇప్పటికీ నన్ను వదలలేదు. మరో మూడేళ్లలో నా తాగుడికి "గోల్డెన్‌ జూబ్లీ" సెలబ్రేషన్స్ చేసుకోవచ్చేమో! అప్పుడు మూడు రూపాయల ధర మాత్రమే వున్న బీర్ బాటిల్ ఇప్పుడు వంద దాటి పోయింది...అప్పట్లో కేవలం గోల్డెన్‌ ఈగిల్ లాంటి ఒకటి-రెండు బ్రాండులే వుండగా, ఇప్పుడు లెక్క లేనన్ని వున్నాయి!  


అశోక్ నగర్ లో, నా కంటే వయసులో పెద్ద, స్నేహితుడు, వూటుకూర్ వరప్రసాద్ వుండేవాడు. ప్రసాద్, మరికొందరు ఇతర స్నేహితులతో కలిసి దగ్గర లోని సుధా హోటల్ లో కాని, కొంచెం దూరంలో వున్న నారాయణగూడా తాజ్ మహల్ హోటెల్ లో కాని కూర్చుని, కప్పు కాఫీ తాగుతూ, సాయంత్రాలు గడిపే వాళ్లం. నేను హైదరాబాద్ లో వున్న తొలినాళ్లలో, ఆ తరువాత, వర ప్రసాద్ ద్వారా పరిచయమైన వ్యక్తులలో ఏ నాటికీ మరవలేని ఒక మహనీయుడు మహారాజశ్రీ అనే ఒక సాదా-సీదా మనిషి. సుధా హోటెల్, నారాయణ గూడా తాజ్ మహల్ హోటెల్ చర్చలలో మహారాజశ్రీ మాకు పెద్ద దిక్కు. గలగలా మాట్లాడే స్వభావం ఆయనది. చిన్నవాళ్ల మైనా మమ్ములను మర్యాదగా సంభోదించేవాడు. మహారాజశ్రీ పరిచయం కూడా గమ్మత్తుగా అయిందనాలి. ఆయన వయస్సు అప్పుడెంతో నాకు గుర్తుకు రావడం లేదు కాని వయసులో మాకంటే చాలా పెద్ద వాడే అని మాత్రం చెప్పగలను. నేను బాగా అభిమానించే బ్రిటీష్ రచయిత, ఉద్యమకారుడు, తత్వవేత్త, బెర్ట్రాండ్ రస్సెల్ అక్టోబర్ 22, 1960 లో లండన్ నగరంలో స్థాపించిన "కమిటీ ఆఫ్ వన్ హండ్రెడ్" ఆదర్శాలను-భావాలను తనదైన శైలిలో పదిమందితో పంచుకోవాలన్న తపన మొదటగా వ్యక్తం చేసింది మహారాజశ్రీ. నాకెందుకో ఆయన భావాలు ఆ విధంగా నచ్చాయి అప్పట్లో... ఆ మాటకొస్తే ఇన్నేళ్ల తరువాత ఇప్పటికీ కూడా. ఒక లాల్చీ-పైజమా, అది కూడా మాసినట్లు కనిపించే విధంగా ధరించి, ఎప్పుడూ-ఏదో విషయంలో మాట్లాడుతూనే వుండేవాడు మహారాజశ్రీ. ఆయన మాటల్లో ఎక్కువగా ప్రపంచ శాంతి-అంతర్జాతీయ సౌభ్రాతృత్వం-మానవాభ్యుదయం పదాలు దొర్లుతుండేవి. "కమిటీ ఆఫ్ వన్ హండ్రెడ్" పేరుతో స్వయంగా మహారాజశ్రీ ఒక హౌజ్ మాగజైన్ నడిపినట్లు కూడా గుర్తు. కరపత్రాలు చాలా సార్లు ముద్రించాడు. "కమిటీ ఆఫ్ వన్ హండ్రెడ్" స్థాపనకు మూలకారణమైన అణ్వాయుధ వ్యాప్తి వ్యతిరేక శాసనోల్లంఘన ఉద్యమాన్ని గురించి పదే-పదే మాట్లాడేవాడు మహారాజశ్రీ. ఆయన మాటల్లో బెర్ట్రాండ్ రస్సెల్ పేరుతో పాటు ఆయన సహ ఉద్యమ కారులైన రాల్ఫ్ షోన్ మన్, రెవరెండ్ మైఖేల్ స్కాట్, ఇతర మద్దతు దార్ల పేర్లు తరచుగా వినబడేవి. అణ్వాయుధ నిరాయుధీకరణ విషయం కూడా చెప్పేవాడు. "కమిటీ ఆఫ్ వన్ హండ్రెడ్" అధ్యక్షుడిగా బెర్ట్రాండ్ రస్సెల్ ఎన్నికయ్యారు. మహారాజశ్రీ ఏనాడూ తన స్వవిషయం చెప్పేవాడు కాదు. ఆయనకు ఎంతమంది పిల్లలో కూడా నాకు తెలియదు. తాను తీసుకొచ్చే మాగజైన్ కు కాని, కరపత్రాలకు కాని నిధులెక్కడ నుంచి సమకూర్చుకునేవాడో కూడా తెలియదు. నన్ను మాత్రం ఒక్క రోజు కూడా ఒక్క రూపాయ కూడా అడగలేదు. ఇప్పటికీ-ఎప్పటికీ మరవరాని మహనీయులైన వ్యక్తులలో మహారాజశ్రీ ముందు వరుసలో వుంటారనడంలో అతిశయోక్తి లేదు.

Friday, June 28, 2013

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు, కాలేజీ కబుర్లు-Part ONE: వనం జ్వాలా నరసింహారావు

హైదరాబాద్ నగరంలో తొలి అనుభవాలు
కాలేజీ కబుర్లు-Part ONE
వనం జ్వాలా నరసింహారావు

మొత్తం మీద, ద్వారక సార్ పుణ్యమా అంటూ, 1964 జూన్ నెలలో న్యూ సైన్స్ కాలేజీలో బిఎస్సీ డిగ్రీ రెండో సంవత్సరంలో చేరాను. అప్పటికే ఫస్ట్ ఇయర్ లో చేరిన వారి సంఖ్య 150 దాటింది. నా రోల్ నంబర్ "150 X" గా కేటాయించారు. కాలేజీలో చేరడం పూర్తయిన తరువాత చేసిన మొట్టమొదట పని నేను వుండడానికి ఒక గది వెతుక్కోవడం. మా సమీప బంధువులు, శ్రీమతి ఝాన్సీ దంపతులకు, విద్యా నగర్ అడ్డీకమేట్ లో ఇల్లుండేది. వారింట్లో ఒక గది అద్దెకు తీసుకున్నాను. నెలసరి అద్దె పది రూపాయల లోపే! అప్పట్లో నాన్న గారు నాకు నెలకు వంద రూపాయలు ఖర్చులకొరకు పంపేవారు. రెండు నెలలు శెలవులు పోగా, మిగిలిన పది నెలల మొత్తం మీద వెయ్యి రూపాయలు వచ్చేవి. ఫీజులకు పోను, నెలంతా ఖర్చులకు పోను, ఇంకా నెలకు పది-పదిహేను రూపాయలు మిగిలేవి. అవి మా అత్తయ్య దగ్గర దాచుకునేవాడిని. శెలవుల్లో ఇంటికి వెళ్లేటప్పుడు తమ్ముళ్లకు-చెల్లెళ్లకు ఏమన్నా కొనుక్కోపోయేవాడిని. ఎన్ని కొన్నా ఇంకా డబ్బులు మిగిలేవి. శెలవులకు వెళ్లినప్పుడల్లా మామయ్య-అత్తయ్య, మేనల్లుడినైన నాకు, పాంటు-షర్ట్ గుడ్దలు కొనిచ్చేవాడు. అవి ఖమ్మంలో కాని, లేకపోతే శెలవుల తరువాత హైదరాబాద్ వచ్చినప్పుడు నారాయణ గుడాలోని "యాక్స్" టైలర్ దగ్గర కాని, "పారగాన్" టైలర్ దగ్గర కాని కుట్టించుకునేవాడిని. అప్పట్లో కుట్టు కూలీ ఐదారు రూపాయల కంటే మించకపోయేది. ఇప్పటి లాగా అప్పట్లో "రెడీ మేడ్" దుస్తులు ఎక్కువగా లభించకపోయేవి. ఎక్కువగా "టెరిలీన్", "వులెన్" దుస్తులు లభించేవి. కాటన్ తక్కువే. మొదట్లో "బాటం వెడల్పు" గా వుండే పాంట్లు కుట్టించుకునే వాళ్లం. ఆ తరువాత "గొట్టం" పాంట్ల ఫాషన్ వచ్చింది. అవి పోయి "బెల్ బాటం" వచ్చాయి. పాంటు కింద భాగంలో మడతతో కొన్నాళ్లు, మడత లేకుండా కొన్నాళ్లు ఫాషన్‌గా వుండేది. బట్టలు ఎక్కువగా "ఎఫ్. డి. ఖాన్ బట్టల దుకాణం" లో కొనే వాళ్లం.

విద్యా నగర్ లో వున్నంత కాలం భోజనం సమీపంలోని చెలమయ్య హోటెల్ లో తినేవాడిని. చెలమయ్య హోటెల్ ఇడ్లీలు కూడా తినేవాడిని ఉదయం పూట. విద్యా నగర్ నుంచి కాలేజీకి వెళ్లడానికి "3-డి" బస్సు ఎక్కి, నారాయణ గుడాలో దిగి, నడుచుకుంటూ, విఠల్ వాడీ మీదుగా వెళ్లేవాడిని. ఒక్కో సారి "చారనా" బాడుగ ఇచ్చి "చార్మీనార్ చౌ రాస్తా" (ఇప్పటి ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్) వరకు రిక్షాలో వచ్చి, అక్కడ నుంచి "7-సి" బస్సెక్కి, వై.ఎం.సి.ఏ దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్లేవాడిని కాలేజీకి. చార్మీనార్ చౌ రాస్తా చుట్టుపక్కలంతా పారిశ్రామిక వాడగా వుండేదప్పట్లో. చార్మీనార్ సిగరెట్ కర్మాగారం (వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ), (నీలం రంగు పాకెట్ లో వచ్చే) గోలకొండ సిగరెట్ కర్మాగారం అక్కడే వుండేవి. చార్మీనార్ చౌ రాస్తా నుంచి విద్యానగర్‍కు వెళ్లడానికి పక్కా రోడ్డు లేదప్పట్లో. ఆ మార్గంలో సిటీ బస్సులు నడవకపోయేవి. విద్యా నగర్ పక్కనే జమిస్తాన్ పూరాకు వెళ్లడానికి "రామ్ నగర్ గుండు" మీద నుంచి వెళ్లే వాళ్లం. చార్మీనార్ చౌ రాస్తా-ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్ నుంచి (ఇప్పుడున్న) టాంక్ బండ్‍ను కలిపే రోడ్డు కూడా అప్పట్లో లేదు. ఇప్పుడు టాంక్ బండ్‍ను కలిపే స్థలంలో కొంచెం అటు-ఇటుగా ఒక "కల్లు కాంపౌండ్" వుండేది. దానిని తొలగించడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మొదట్లో సాధ్యపడలేదు. ఇందిరా పార్క్ అసలే లేదు. ధర్నా చౌక్ కూడా లేదు. ఇందిరా పార్క్ దగ్గర నుంచి టాంక్ బండ్ పక్కగా ప్రస్తుతం వున్న "ఫ్లయిఓవర్" కూడా లేదప్పుడు. ఆ రోజుల్లో హైదరాబాద్‌లో కనీసం పాతిక-ముప్పై వేల రిక్షాలన్నా వుండేవి. మీటర్ టాక్సీలుండేవి కాని, బేరం కుదుర్చుకోని ఎక్కించు కోవడం తప్ప మీటర్ ఎప్పుడూ వేయక పోయేవారు. డ్రైవర్ కాకుండా ముగ్గురికంటే ఎక్కువగా టాక్సీలో కూర్చోనీయక పోయే వాళ్లు. ఆటోలు కూడా వుండేవి కాని అంత పాపులర్ కాదు. ఆటోలలో ఇద్దరు పాసింజర్లకే పర్మిషన్. టాక్సీలకు కిలోమీటర్‌కు పావలా చార్జ్ వున్నట్లు గుర్తు.

సిటీ బస్సుల్లో ప్రయాణం ఇప్పటి లాగా కష్టంగా వుండేది కాదు. హాయిగా ప్రయాణం చేసే వాళ్లం. "ఆగే బడో" అనుకుంటూ కండక్టర్ సున్నితంగా చెపుతుంటే ప్రయాణీకులు క్రమ శిక్షణతో దొరికిన సీట్లలో కూచోవడమో, లేదా, ఒక క్రమ పద్ధతిన నిలబడడమో చేసేవారు. సింగిల్ బస్సులు, ట్రైలర్ బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు వుండేవి. కండక్టర్ చేతిలో టికెట్ ఇచ్చే మిషన్ వుండేది. బర్రున తిప్పి ఒక చిన్న టికెట్ ఇచ్చేవాడు. టికెట్ ఖరీదు పైసల్లోనో, అణా-బేడలలోనో వుండేది. కనీస చార్జ్ ఒక "అణా"-ఆరు "నయాపైసలు" వున్నట్లు గుర్తు. ఉదాహరణకు విద్యా నగర్ నుంచి నారాయణ గుడాకు కాని, చార్మీనార్ చౌ రాస్తా నుంచి వై.ఎం.సి.ఏ కు కాని "అణా" లేదా ఆరు పైసలు రేటుండేది. ఇంతకీ "అణా" ఏంటనే ప్రశ్న రావచ్చు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల్లో కొన్నాళ్ల వరకు-బహుశా ఒక ఆర్నెల్ల వరకనుకుంటా, ఇంకా అణా-బేడలు చలామణిలోనే వుండేవి. అందుకే ఇక్కడ కొంత మన నాణాల గురించి ప్రస్తావిస్తే బాగుంటుందేమో! ఆగస్ట్ 15, 1947 భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో అమల్లో వున్న కరెన్సీ నాణాలు "దశాంశ" తరహా నాణాలు కావు. రూపాయను పదహారు "అణా” లుగా, ఎనిమిది "బేడ” లుగా, నాలుగు "పావలా” లుగా, రెండు "అర్థ రూపాయ” లుగా విభజించి చలామణిలో వుంచారు. ఒక "అణా” కు నాలుగు పైసలు...రూపాయకు 64 పైసలు. 1957 లో "డెసిమల్" పద్ధతిలోకి చలామణిని మార్చింది ప్రభుత్వం. అయితే 1964 (నేను హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల) వరకు, నాన్-డెసిమల్ (అణా, బేడ, పావలా...), డెసిమల్ పద్ధతులు రెండింటినీ వాడకంలో వుంచారు. అణా గుండ్రంగా, బేడ నాలుగు పలకలుగా-పచ్చ రంగులో వుండేవి. ఆ తరువాత నాన్-డెసిమల్ నాణాల వాడకం ఉపసంహరించింది ప్రభుత్వం. ఇప్పుడు మనం పైసలుగా వ్యవహరిస్తున్న నాణాలను 1957-1964 మధ్య కాలంలో "నయా పైస” లుగా పిలిచేవారు. 1, 2, 5, 10, 20, 25, 50 (నయా) పైసల నాణాలు చలామణిలో వుండేవి.


విద్యా నగర్ లో ఎక్కువ రోజులుండలేదు. అక్కడ నుంచి కాలేజీకి వెళ్లి రావడం ఇబ్బందిగా వుండడంతో మకాం మార్చాలనుకున్నాను. మారుదామనుకుంటున్న రోజుల్లో, మా పిన్ని కొడుకు కల్మల చెర్వు రమణా రావు (రమణ), హైదరాబాద్ న్యూ సైన్స్ కాలేజీలో డిగ్రీలో చేరడానికి వచ్చాడు. రమణ కూడా సత్యనారాయణ రావు మామయ్యకు వరసకు మేనల్లుడే. నేనేమో స్వయానా అక్క కొడుకునైతే, రమణ, మామయ్యకు కజిన్ సిస్టర్ కొడుకు. మామయ్య-అత్తయ్య ఆ తేడా ఎప్పుడూ చూపలేదు. ఇద్దరం కలిసి వెతకగా హిమాయత్ నగర్ పదకొండో వీధిలో ఒక ఇంట్లో (3-6-700) ముందు భాగంలో గది దొరికింది. అద్దె పది రూపాయలు. చెరి ఐదు రూపాయలన్న మాట. ఆ గదిలో 1965 మార్చ్-ఏప్రిల్ వరకున్నాం. ఆ గదిలో వుంటున్నప్పుడు ఒక సారి వనం నర్సింగరావు (కమలాపురం), గండ్లూరి కిషన్ రావు (బాణాపురం), తాళ్లూరి వైకుంఠం (మండవ) హైదరాబాద్ వచ్చి మా రూంలో మకాం చేసారు. వాళ్లు ముగ్గురు, వూటుకూరు వరప్రసాద్ కలిసి ఒక లారీ కొని వ్యాపారం చేయడానికి నిర్ణయం మా రూంలోనే జరిగింది. కొన్నారు కూడా ఆ తరువాత. వాళ్లొచ్చిన రోజు రాత్రి "చీట్ల పేక" ఆడి, తగాదా కూడా పడ్డాం. డిగ్రీ రెండో సంవత్సరం లాంగ్వేజెస్ పరీక్షలు పూర్తైన తరువాత శెలవులకు వెళ్తూ గది ఖాళీ చేశాం. పరీక్షల్లో నేను థర్డ్ క్లాస్‍లో పాసయ్యాను. శెలవుల తరువాత మళ్లీ హైదరాబాద్ వచ్చి గది వెతుక్కుంటున్నప్పుడు నేలకొండపల్లి వాస్తవ్యుడైన కంకిపాటి జగన్మోహన్ రావుగారి కుమారుడు సీతారాం రావు మాతో కలిసి వుంటానన్నాడు. ఆయన ఆ సంవత్సరం మా కాలేజీలోనే పి.యు.సి లో చేరాడు. ముగ్గురం కలిసి, లింగం పల్లి (వై.ఎం.సి.ఏ సమీపంలో) రెడ్డి మహిళా కాలేజీ పక్క సందులో, రిటైర్డ్ డి.ఎస్.పి విశ్వనాధ రావుగారింట్లో ఒక "గారేజ్" వుంటే అది అద్దెకు తీసుకున్నాం. అద్దె పదిహేను రూపాయలు. ముగ్గురం తలా ఐదు రూపాయలు భరించేవాళ్లం. పర్సా కిషన్ రావు గారి ఇల్లు, కె. బి. భూపాల రావు గారి ఇల్లు మేం అద్దెకు తీసుకున్న వీధిలోనే వుండేవి. సమీపంలోనే, వి. వి. హాస్టల్ పక్క వీధిలో వనం గీతా రంగారావు తండ్రి గారి ఇల్లుండేది.  గదికి దగ్గర లోనే వుండడం వల్ల సాధారణంగా కాలేజీకి నడుచుకుంటూ పోయే వాళ్లం.


కాలేజీకి వెళ్లే దారిలో వై.ఎం.సి.ఏ కి ఎదురుగా "ఇంద్ర భవన్" అనే ఇరానీ రెస్టారెంటులో ఆగుతుండేవాళ్లం ఒక్కొక్కప్పుడు. అక్కడ కాకపోతే, కాలేజీ ఎదురు గుండా (ఇప్పటికీ వుంది) "సెంటర్ కెఫే" కి పోయే వాళ్లం. ఇరానీ "చాయ్" (బహుశా) 15 పైసలిచ్చి తాగే వాళ్లం. ఒక్కోసారి "పౌనా" తాగే వాళ్లం. 5 పైసలకు ఒక సమోసా, లేదా, ఒక బిస్కట్ కొనుక్కుని తినే వాళ్లం. అప్పట్లో "పానీ పురి" ఖరీదు కూడా 5 పైసలే. మిర్చి బజ్జీ కూడా 5 పైసలకే దొరికేది. అలానే సాయంత్రాలు చిక్కడపల్లి వెళ్లి "సాయిబాబా మిఠాయి భండార్" లో "గులాబ్ జామూన్", "కలకంద" తిని, "హైదరాబాద్ మౌజ్" కలుపుకుని పాలు-పౌనా తాగే వాళ్లం. పావలాకు అర డజన్ మౌజ్-అరటి పళ్లు దొరికేవప్పుడు. చిక్కడపల్లి రోడ్డు మీద వున్న మరో హోటెల్ "గుల్షన్ కెఫే" కి కూడా వెళ్తుండేవాళ్లం. గుల్షన్ కెఫే సమీపంలో "రూబీ ఆర్ట్ స్టూడియో" వుండేది. మామయ్య ఇంటి సందులోకి వెళ్లే ముందర, "ప్రజా ఫార్మసీ మెడికల్" షాప్, దానికి ఎదురుగా "మహావీర్ మెడికల్ షాప్" వుండేవి. మామయ్య ఇంటికి పోయే సందులోనే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకట స్వామి ఇల్లుండేది. ఆయనను తరచుగా చూస్తుండేవాళ్లం. శెలవుల్లో హిమాయత్ నగర్‌లో వున్న "గాయత్రీ భవన్" కు కాని, నారాయణ గుడాలో వున్న తాజ్ మహల్ కు కాని టిఫిన్ తింటానికి వెళ్లే వాళ్లం. ఇక భోజనం ఎప్పుడూ నారాయణ గుడా తాజ్ మహల్ హోటల్లోనే. అప్పట్లో తాజ్ మహల్ లో 36 రూపాయలిస్తే 60 భోజనం కూపన్లు ఇచ్చేవారు. తడవకు 18 రూపాయలిచ్చి 30 కూపన్లు కొనుక్కునే వాళ్లం. కూపన్ పుస్తకంలో "అతిధులకు" అదనంగా రెండు టికెట్లుండేవి. నెలకు అలా నలుగురు గెస్టులను ఉచితంగా భోజనానికి తీసుకెళ్లగలిగే వాళ్లం. ఇక భోజనంలో "అన్ లిమిటెడ్" పూరీలు ఇచ్చేవారు. సైజు చిన్నగా వుండేవి. వూరగాయ పచ్చళ్లతో సహా తీరు-తీరు రుచులతో భోజనం, పరిశుభ్రంగా పెట్టేవారు హోటెల్ వారు. నేను స్టూడెంటుగా వున్నంతకాలం ఒక్క తాజ్ మహల్ హోటెల్ లోనే భోజనం చేశాను. క్రమేపీ రేట్ పెరుక్కుంటూ పోయింది. ఇప్పుడు 36 రూపాయలకు "ప్లేట్" ఇడ్లీ కూడా రాని పరిస్థితి!

Monday, June 24, 2013

హైదరాబాద్ రాక-న్యూ సైన్స్ కాలేజీలో చేరిక: వనం జ్వాలా నరసింహారావు

హైదరాబాద్ రాక-న్యూ సైన్స్ కాలేజీలో చేరిక
వనం జ్వాలా నరసింహారావు

          ఖమ్మంలో బిఎస్సీ డిగ్రీ మొదటి ఏడాది చదువు పూర్తి చేసుకున్న నేను, మిగతా రెండేళ్లు హైదరాబాద్ లో కొనసాగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. నేను-మా నాన్న గారు, హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో ఉద్యోగం చేస్తూ, చిక్కడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్క సందులో నివాసముంటున్న మేనమామ కంకిపాటి సత్యనారాయణ రావు గారిని సంప్రదించాం. మామయ్య అని నేను సంబోధించే సత్యనారాయణ రావు గారు హైదరాబాద్‌లోనే తన డిగ్రీ చదువు పూర్తి చేశారు. విశ్వవిద్యాలయంలో టాప్ రాంకర్‍గా (యూనివర్సిటీ ఫస్ట్) డిగ్రీ పరీక్ష పాసయ్యారాయన. మంచి స్టయిలిష్‍గా, ఎల్లప్పుడూ టిప్-టాప్‌గా వుండేవారు. సచివాలయంలో ఎల్డీసి గా చేరిన మామయ్య సహాయ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. నీతికి-నిజాయితీకి మారు పేరు. లక్షలాది రూపాయలు లంచంగా పొందగలిగే అవకాశమున్న గనుల శాఖలో ఉద్యోగం చేసినప్పటికీ పైసా అక్రమ సంపాదన చేయని ఉన్నతమైన వ్యక్తి ఆయన. మా అత్తయ్య విమలమ్మ ఆయనకు అన్ని విధాల తగిన సహధర్మచారిణి. తింటే ఆమె చేసిన వంటే తినాలి...అంత రుచిగా వుంటుంది.

          అప్పట్లో మామయ్య కుటుంబం మాకు వరసకు బంధువైన గూడూరు వారింట్లో ఒక పోర్షన్‌లో అద్దెకుండేది. పక్క పోర్షన్‌లో మా అత్తయ్య సొంత అన్న గారు (ఆయన ఎజి కార్యాలయంలో ఉద్యోగం చేసేవారు) వెంకట్ రామారావు గారు అద్దెకుండేవారు. దరిమిలా ఆ ఇంటిని ఆయన కొనుక్కున్నారు. ఇంటి ఎదురుగా వున్న 150 చదరపు గజాల ఖాళీ స్థలాన్ని మామయ్య కొనుక్కుని, అందులో చిన్న రెండస్తుల భవనాన్ని నిర్మించుకున్నారు. ఇప్పటికీ సుమారు 75 సంవత్సరాల వయస్సులో మామయ్య, 70 సంవత్సరాల వయస్సులో మా అత్తయ్య, ఆయన ఉమ్మడి కుటుంబం ఆ ఇంటిలోనే నివసిస్తున్నారు. నేను హైదరాబాద్ వచ్చిన తొలిరోజుల్లో మామయ్యకు నలుగురు (విజయ్ రాధా కిషన్, నాగన్న, జయ, పద్మ) పిల్లలుండేవారు. తరువాత మరో నలుగురు (శీను, గోపి, జానకి, చిట్టి) పుట్టారు. మామయ్య కుటుంబం, మా అత్తయ్య సోదరుడి కుటుంబం (ఆయనకు ముగ్గురు పిల్లలు) ఎంత కలిమిడిగా వుండేవారంటే, ఇరు కుటుంబాలకూ కలిపి ఒకే వంట ఇల్లుండేది. ఒక నెలంతా ఒకరి పోర్షన్‌లోని కిచెన్‌లో వండితే మరుసటి నెల మరొకరి పోర్షన్‌లో ఆ పని జరిగేది. అందరూ ఒకే చోట భోజనం చేసేవారు. ఖర్చు చెరిసగం పంచుకునేవారు. ఎవరింటికి బంధువులొచ్చినా, వారిని, ఇరువురూ తమ బంధువులాగానే చూసుకునేవారు. నాకు గుర్తున్నంతవరకు కనీసం పాతిక-ముప్పై సంవత్సరాలన్నా అలా కలిసి మెలిసి భోజనాలు చేశారు. పిల్లలు పెరిగిన తరువాత క్రమేపీ ఎవరి వంట వారే చేసుకోవడం మొదలైంది. ఇద్దరి పిల్లలూ చక్కగా పైకొచ్చారు...ఉద్యోగాలు చేసుకుంటున్నారు.

మామయ్యను నా సీటు విషయం సంప్రదించాం. వెంటనే హైదరాబాద్ బయల్దేరి రమ్మన్నాడు. నేనంతకు ముందు ఒక్కసారి హైదరాబాద్ వచ్చి పోయాను. ఎం. జె. కె. స్మిత్ సారధ్యంలో ఎం.సీ.సీ (ఇంగ్లాండు క్రికెట్ టీం ను ఆ రోజుల్లో అలా పిలిచేవారు) జట్టు భారత దేశంలో పర్యటనలో భాగంగా, జనవరి 7-9, 1964 లో హైదరాబాద్ ఫతేమైదాన్ (ఇప్పటి ఎల్. బి. స్టేడియం) లో సౌత్ జోన్ కు, ఎం.సీ.సీ కి మధ్య ఒక కౌంటీ మాచ్ జరిగింది. సౌత్ జోన్ పైన ఎం.సీ.సీ జట్టు ఇన్నింగ్స్ 27 పరుగుల తేడాతో గెలిచింది. విల్సన్ అనే ఇంగ్లాండ్ క్రీడాకారుడు బాటింగ్‍లోను, బౌలింగ్ లోను అద్భుతమైన ప్రతిభ కనబరిచాడా మాచ్‍లో. సెంచరీ కూడా చేశాడు. అలనాటి హైదరాబాద్ క్రికెట్ స్టార్ ఎం. ఎల్. జయసింహ ఆ మాచ్ లో మంచి స్కోర్ చేయలేకపోయాడు. క్రికెట్ మీద వున్న అభిమానంతో ఖమ్మం కాలేజీలో చదువుకుంటున్న కొంతమందిమి ఆ మాచ్ చూడడానికి మొదటి సారిగా హైదరాబాద్ వచ్చాం అప్పుడు. అప్పట్లో ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లడానికి ఒకే ఒక ఆర్. టీ. సీ బస్సు, ఒక రైలు వుండేవి. ఆర్. టీ. సీ బస్సులో కాని, రైల్లో కాని హైదరాబాద్ టికెట్ ఖరీదు ఆరేడు రూపాయలంటే ఎక్కువ లేదు. మేం రైల్లో ప్రయాణం చేశాం. రిజర్వేషన్ లేదు. రాత్రి పొద్దు పోయాక ఖమ్మంలో రైలెక్కాంరైలు ఎక్కడానికి చాలా అవస్థ పడాల్సి వచ్చింది. చివరకు ఎవరూ కంపార్ట్ మెంట్ తలుపులు తీయకపోతే, తలుపులకు వేళ్లాడుకుంటూ డోర్నకల్ జంక్షన్ వరకు ప్రాణాపాయ స్థితిలో ప్రయాణం చేశాం. మొత్తం మీద ఏ ప్రమాదం జరగకుండా జంక్షన్‌లో కంపార్ట్ మెంట్ లోకి వెళ్లగలిగాం. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో దిగి, సమీపంలోనే వున్న వూటుకూర్ వరప్రసాద్ గదికి చేరుకున్నాం. మా టీంలో నేను కాకుండా, వనం నర్సింగరావు, వనం రంగారావు కూడా వున్నారు. మాచ్ చూడడానికి మాకు టికెట్లు వరప్రసాద్ ఏర్పాటు చేశాడు. వరప్రసాద్ గదిలో ఆయనతో పాటు, ఖమ్మం జిల్లా, కారేపల్లికి చెందిన పర్సా సీతారాం కూడా వుండేవాడు. సీతారాం డన్ లప్ కంపెనీలో పని చేస్తుండగా, ప్రసాద్ ప్రయివేట్ గా డిగ్రీ చదువుతుండేవాడు. ఆ ట్రిప్ లోనే హైదరాబాద్ నగరం కూడా కొంత మేరకు చూసినట్లు గుర్తు.

జనవరి 1964 లో భారత దేశంలో పర్యటించిన ఇంగ్లాండ్-ఎం.సీ.సీ జట్టు మొత్తం ఐదు టెస్ట్ మాచ్‍లు, రెండు కౌంటీ మాచ్‍లు ఆడింది. సౌత్ జోన్‌తో ఆడిన కౌంటీ మాచ్ కంటె ముందు బెంగ్‍ళూర్‍లో జనవరి 3-5 మధ్య  ఇండియన్ బోర్డ్ ప్రెసిడెంట్ ఎలెవన్‌తో మొదటి కౌంటీ మాచ్ ఆడింది. అది డ్రాగా ముగిసింది. టెస్ట్ మాచ్‍ల్లో ఇంగ్లాండ్ పక్షాన కెప్టెన్ స్మిత్ కాకుండా, బ్రియాన్ బోలస్, ఫ్రెడ్ టిట్మస్, జాన్ మార్టిమోర్, జాన్ ప్రైస్, కాలిన్ కౌడ్రే, డేవిడ్ లార్టర్, బారీ నైట్, జిమ్ పార్క్స్, కెన్ బారింగ్ టన్...తదితరులు ఆడారు. భారత దేశం పక్షాన ఆడినవారిలో కెప్టెన్ నవాబ్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, బుధి కుందేరన్, చందూ బోర్డే, బాపు నడ్కర్ని, సలీమ్ అబ్దుల్ దురానీ, భగవత్ చంద్రశేఖర్, దిలీప్ సర్దేశాయ్, ఎం. ఎల్. జయసింహ, రమా కాంత్ దేశాయ్, హనుమంత్ సింగ్...తదితరులు వున్నారు. ఐదు టెస్ట్ మాచ్‍లు కూడా డ్రాగా ముగిశాయి. ఐదు మాచ్‍లకు టాస్ ఇండియా కెప్టెన్ పటౌడీ గెలిచాడు. మద్రాస్ లో జరిగిన మొదటి మాచ్‍లో ఓపెనర్-వికెట్ కీపర్ గా ఆడవలసిన ఫారూక్ ఇంజనీర్ గాయం వల్ల చివరి క్షణంలో జట్టులోకి తీసుకోనందువల్ల, ఆయన స్థానంలో బుధి కుందేరన్ ఆడాడు. ఆ మాచ్‍లో భారత జట్టు చేసిన మొదటి ఇన్నింగ్స్ స్కోర్ 457/7 (డిక్లేర్) లో బుధి కుందేరన్ 192 పరుగులు సాధించడంతో మిగిలిన నాలుగు మాచ్‍లకు అతడినే ఓపెనర్-వికెట్ కీపర్‌గా కొనసాగించారు. 

కాన్పూర్‌లో జరిగిన చివరి మాచ్‍లో టాస్ గెలిచిన పటౌడీ, పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఇంగ్లాండుకు తొలుత బాటింగ్ ఇచ్చాడు. 8 వికెట్లు కోల్పోయి 559 పరుగుల భారీ స్కోర్ చేసిన ఇంగ్లాండ్ భారత్ ముందు పెద్ద సవాలు విసిరింది. భయపడినట్లే, భారత్ తన మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 266 పరుగులకే ఆల్ ఔట్ అయింది. ఫాలో ఆన్ తప్పలేదు. మొదటి ఇన్నింగ్ లో చివరలో వచ్చిన బౌలర్ నడ్కర్ని చక్కటి ఆట ఆడి అజేయంగా నిలవడంతో, రెండవ ఇన్నింగ్స్ లో అతడిని ఓపెనర్ గా పంపించాడు కెప్టెన్ పటౌడీ. ఆ ఇన్నింగ్స్ లో నడ్కర్ని సెంచరీ చేసి మళ్లీ అజేయంగా నిలిచి భారత జట్టును ఓడిపోకుండా కాపాడాడు. మొత్తం మీద భారత్  పక్షాన అన్ని మాచ్‍‍లు కలిపి అత్యధిక పరుగులు చేసిన వారిగా బుధి కుందేరన్ (525), దిలీప్ సర్దేశాయ్ (449), ఎం.ఎల్.జయసింహ (444) వుండగా, ఇంగ్లాండ్ పక్షాన బ్రియాన్ బోలస్ (391), కాలిన్ కౌడ్రే (309),ఎం.జె.కె.స్మిత్ (306) అధిక పరుగులు చేశారు. సలీమ్ దురాని 11 వికెట్లు, చంద్రశేఖర్ 10 వికెట్లు, బాపు నడ్కర్ని 9 వికెట్లు, టిట్మస్ 27, జాన్ ప్రైస్ 14, విల్సన్ 9 వికెట్లు తీసుకున్నారు ఇరు పక్షాల నుంచి. హనుమంత్ సింగ్ తాను ఆడిన మొదటి మాచ్ లోనే సెంచరీ సాధించినట్లు గుర్తు. అలానే పటౌడీ ఒక డబుల్ సెంచరీ కూడా చేశాడు.

వాతావరణం అనుకూలించనందున ఇంగ్లాండు జట్టులో చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. ఒకానొక సందర్భంలో, ఒక టెస్ట్ మాచ్‍లో, వాళ్లు ఫీల్డింగ్ చేయడానికి పదకొండు మంది ఆటగాళ్లు లేకపోయే పరిస్థితి ఎదురైంది. భారత్ ఆటగాళ్లు ఒకరిద్దరు ఇంగ్లాండు టీం పక్షాన ఫీల్డింగ్ చేసినట్లు జ్ఞాపకం. అంతా "స్పోర్ట్స్ మెన్ స్పిరిట్"...ఇప్పటి లాగా "మాచ్ ఫిక్సింగ్" లు లేవా రోజుల్లో. అలానే, ఆ రోజుల్లో ఇప్పటి లాగా టెలివిజన్ సెట్లు లేవు. రేడియోలో కామెంటరీ వినుకుంటూ ఆనందించేవాళ్లం. విజ్జీ, చక్రపాణి లాంటి వారు వ్యాఖ్యాతలుగా వుండేవారు. మా కాలేజీలో పని చేస్తున్న లెక్చరర్లు వరదరాజన్, జడ్డి, చక్రపాణి, వైద్య క్రికెట్ అభిమానులు కావడంతో, మేం కూడా, మధ్య-మధ్య క్లాసులు ఎగ్గొట్టి వాళ్ల గదుల్లోకి వెళ్లి కామెంటరీ వినే వాళ్లం.

          1964 జూన్ నెలలో నేను, నాన్న గారు కలిసి హైదరాబాద్ చేరుకున్నాం. ఖమ్మంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూడా బస్ స్టాండ్ చేరుకునే సరికి సాయంత్రం ఏడు దాటింది. అప్పట్లో ఎక్స్ ప్రెస్ బస్సు కాదది. ఒకరకమైన ఫాస్ట్ పాసింజర్ లాంటిది. కండక్టర్ ఇష్టమొచ్చిన చోట బస్సును ఆపేవాడు. చిక్కడపల్లి వెళ్లడానికి గౌలిగూడా నుంచి రిక్షా కుదుర్చుకున్నాం. రిక్షా వాడిని మొదలు "చల్తే క్యా" అని అడగాలి. అంతా హింది-ఉర్దు కలిసిన భాష. "కహా జానా సాబ్" అని వాడు అడగడం...మేం చిక్కడపల్లి "దేవల్ కి బాజు గల్లీ" అని చెప్పడం, అంగీకరించిన రిక్షా వాడు "బారానా" (75 పైసలకు సమానం) కిరాయి అడుగుతే, మేం "ఛె ఆనా" (వాడడిగిన దాంట్లో సగం) ఇస్తామనడం, చివరకు "ఆఠానా" కు కుదరడం జరిగిపోయింది. గౌలిగూడా, ఇసామియాబజార్, సుల్తాన్ బజార్, బడీ చావిడి, కాచి గుడా చౌ రాస్తా, వై.ఎం.సి.ఏ మీదుగా చిక్కడపల్లి "దేవల్ కి బాజు గల్లీ" లో వున్న మామయ్య ఇంటికి సుమారు ఎనిమిది గంటల రాత్రి సమయంలో చేరుకున్నాం. ఆ రాత్రికి భోజనాలు కానిచ్చి మర్నాడు ఏం చేయాలో మామయ్యతో కలిసి నిర్ణయించుకున్నాం.


మామయ్యకు డిగ్రీలో లెక్కల సబ్జెక్ట్ బోధించిన డి. వి. ద్వారక గారు ఉస్మానియా యూనివర్సిటీలో మాథమాటిక్స్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారప్పుడు. చిక్కడపల్లిలో మామయ్య ఇంటి పక్క వీధిలో వుండేవారాయన. బహుశా ఇప్పుడాయనకు సుమారు 90 సంవత్సరాల పైన వుండవచ్చు. ఇటీవలే రెండేళ్ల క్రితం ఒక పెళ్లిలో ఆయనను కలిశాను. ఆరోగ్యంగానే కనిపించారు. న్యూ సైన్స్ కాలేజీలో సీటు ఇప్పించమని ద్వారకా గారిని అడుగుదామనుకున్నాం. ఆయన ఇంటికి వెళ్లాం. మా అభ్యర్థన మేరకు మర్నాడు నన్ను కాలేజీకి తీసుకెళతామన్నారు. అలానే వెళ్లాం. కాలేజీలో నన్ను ప్రిన్సిపాల్ సి. సుదర్శన్ గారికి పరిచయం చేశారాయన. సీటు కావాలని కోరారు. ఆయన వెంటనే సీటివ్వడానికి అంగీకరించారు. అలా బీఎస్పీ (ఎం.పీ.సీ) రెండో సంవత్సరంలో 1964 జూన్ లో న్యూ సైన్స్ కళాశాలలో చేరాను. ఆ కళాశాలను జులై 17, 1956 , నూతన విద్యా సమితి యాజమాన్యం కింద, సి. సుదర్శన్ గారు, జి.ఎస్. మెల్కోటే గారు స్థాపించారు. నారాయణగూడలో వున్న ఆ కాలేజీలో అత్యంత నైపుణ్యం కల మేధావులైన విద్యావేత్తలెందరో పని చేసేవారు. 1982 సంవత్సరంలో కళాశాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకున్న సందర్భంలో, యాజమాన్య బాధ్యతలను, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ విద్యా భవన్ చేపట్టింది. నారాయణగూడలోని కళాశాల భవనానికి అదనంగా అమీర్ పేటలో మరో బ్రాంచ్ కూడా స్థాపించింది యాజమాన్యం దరిమిలా. ప్రిన్సిపాల్ సుదర్శన్ గారితో ఆనాడు మొదలైన నా పరిచయం ఆ చివరి రోజుల వరకూ కొనసాగింది. నేను రాజ భవన్ లో పని చేస్తున్నప్పుడు, ఆ పరిచయం కాస్త బలపడింది కూడా

Sunday, June 23, 2013

ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాల విద్యార్థిగా: వనం జ్వాలా నరసింహారావు

ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాల విద్యార్థిగా
వనం జ్వాలా నరసింహారావు

హెచ్.ఎస్.సీ పరీక్షల్లో హయ్యర్ సెకండ్ క్లాస్ లో పాసవడమే కాకుండా లెక్కల్లో, సైన్స్ సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించాను. ఎం.పీ.సీ (లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం) గ్రూపు తీసుకుని ఖమ్మం ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలలో ప్రీ-యూనివర్సిటీ (పి.యు.సి) కోర్సులో చేరాను. ఆ మూడు సబ్జెక్టులే కాకుండా, ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ సబ్జెక్టులు కూడా వుండేవి అప్పట్లో. లెక్కలు, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం సబ్జెక్టులను ఐచ్చికం (ఆప్షనల్) అని, మిగతా వాటిని కంపల్‌సరీ అని పిలిచే వాళ్లం. హెచ్.ఎస్.సీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్న మాకు, మొట్ట మొదటిసారిగా పి.యు.సి లో చేరగానే, ఆంగ్ల మాధ్యమంలో అభ్యసించాలంటే మొదట్లో కొంత ఇబ్బందికరంగా వుండేది. పోను-పోను అలవాటై పోయింది. భౌతిక, రసాయన శాస్త్రాలకు థియరీ క్లాసులే కాకుండా ప్రాక్టికల్స్ కూడా వుండేవి. అంతా కొత్తగా వుండేది. ఆ విషయాలలోకి పోయే ముందర ఒక్క సారి ఖమ్మం కళాశాల ఆవిర్భావం గురించి కొంత రాస్తే బాగుంటుందేమో!

ఖమ్మం పట్టణంలో మొట్ట మొదటి ప్రయివేట్ కళాశాలగా ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ కళాశాలను స్థాపించారు. నిజాం సంస్థానం నుంచి విముక్తి పొంది, భారత దేశంలో విలీనమైన హైదరాబాద్ రాష్ట్రంలో, ఒకప్పుడు, ఒక్క హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా కళాశాలలు లేవు. దరిమిలా, వరంగల్ జిల్లాలో వున్న ఖమ్మం ప్రాంతాన్ని వేరు చేసి, 1956 లో ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేసింది  ప్రభుత్వం. అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు, ప్రతి జిల్లాలో కనీసం ఒక్క కళాశాలన్నా వుండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అప్పటి ఖమ్మం జిల్లా కలెక్టర్ జీ వీ భట్, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా, ఖమ్మానికి చెందిన కొందరు ప్రముఖులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. స్వర్గీయులు బొమ్మకంటి సత్యనారాయణరావు, సర్వదేవభట్ల నరసింహమూర్తి, పర్సా శ్రీనివాసరావు, కవుటూరి కృష్ణమూర్తి, రావులపాటి జానకి రామారావులతో ఏర్పాటైన ఆ కమిటీ, నిధుల సేకరణ మొదలెట్టారు. ఒకానొక సందర్భంలో, భద్రాచల రామాలయానికి చెందిన ఒక ఆభరణాన్ని వేలం వేసి, అలా సేకరించిన పైకంతో కళాశాల నెలకొల్పాలని భావించారట. అది తెలుసుకున్న, స్వర్గీయ శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు (జగ్గయ్య పేట వాసి) గారనే లోకోపకార గుణం గల మహానుభావుడు, లక్ష రూపాయలు విరాళంగా ఇస్తానని కలెక్టర్‌ను కలిసి చెప్పడం, ఆయన ఇచ్చిన మూలధనంతో కళాశాల రూపుదిద్దుకోవడం జరిగింది. తొలుత గుట్టలబాజార్ దాటిన తరువాత గ్రెయిన్ మార్కెట్ ప్రాంతంలో నెలకొల్పారు కళాశాలను. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కూడా, కళాశాల పేరు ముందర శ్రీ రామ భక్త గెంటాల నారాయణరావు పేరు కొనసాగిస్తూ వచ్చారు. దరిమిలా కళాశాలకు ఇల్లెందు రోడ్డులో నూతన భవనాలను నిర్మించి అక్కడకు మార్చారు. ఇటీవలే ఐదారు సంవత్సరాల క్రితం గెంటాల నారాయణరావు గారి విగ్రహాన్ని కళాశాల పూర్వ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కాలేజీ ఆవరణలో ఆవిష్కరించారు. గెంటాల నారాయణరావు గారి సమీప బంధువు భాను మూర్తి విగ్రహావిష్కరణకు చొరవ తీసుకోవడమే కాకుండా ద్రవ్య సహాయం కూడా చేశారు.

కాలేజీ విద్యార్థిగా పి.యు.సి లో చేరడంతో ఒక పెద్దరికం వచ్చిన అనుభూతి కలిగింది. బహుశా నా క్లాస్ లో వున్న వాళ్లందరిలో నేనే వయసులో చిన్నవాడిననుకుంటా. కాలేజీ మైదానం పక్కనున్న షెడ్డుల్లో మా క్లాస్ జరిగేది. ఇంగ్లీష్, తెలుగు, జనరల్ స్టడీస్ అన్ని గ్రూపులకు అంటే-ఎం.పీ.సీ, బై పీసీ (జీవ శాస్త్రం, భౌతిక-రసాయన శాస్త్రాలు), కామర్స్ (ఎకనామిక్స్, కామర్స్, అకౌంటింగ్), సివిక్స్ (చరిత్ర, భూగోళం, సాంఘికం)-కలిపి చెప్పేవారు. భౌతిక, రసాయన శాస్త్రాల క్లాసులు ఎం.పీ.సీ, బై పీసీ గ్రూపులకు కలిపి తీసుకునేవారు. లెక్కల క్లాస్ ప్రత్యేకంగా ఎం.పీ.సీ గ్రూపుకు మాత్రమే వుండేది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్రోజ్, పోయెట్రీ, గ్రామర్ విభాగాలుగా వుండేవి. సత్యనాధం లెక్చరర్, సుబ్బారావు ట్యూటర్ (లెక్చరర్ కంటే ఒక గ్రేడ్ తక్కువ) మాకు ఇంగ్లీష్ చాలా చక్కగా బోధించేవారు. నాకు గుర్తున్న కొన్ని ఇంగ్లీష్ పాఠాలలో (రచయిత గుర్తుకు రావడం లేదు) "ఆన్ ఫర్ గెట్టింగ్", "ఆన్ సీయింగ్ పీపుల్ ఆఫ్", "ఆన్ అదర్ పీపుల్ జాబ్స్" లాంటివి చాలా ఆసక్తికరంగా వుండేవి. అలానే విలియం వర్డ్స్ వర్త్, షేక్స్ పియర్ పోయెట్రీ కూడా ఆకట్టుకునేది. తెలుగును ఎం. హనుమంతరావు సార్ చెప్పేవారు. ఆయన బోధించిన మనుచరిత్రలోని ఒక పద్యం ఇంకా గుర్తుంది. "అటజనికాంచె భూమిసురు డంబరచుంబి, శిర స్సర జ్ఝరీ పటల, ముహుర్ముహు ర్లుఠ, దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల, పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌, కటకచరత్ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్‌". ఇక జనరల్ స్టడీస్ క్లాసులను జగన్మోహన రావు గారు, వై. వి. రెడ్డి గారు ఎంతో ఆహ్లాదకరంగా తీసుకునేవారు. వర్తమాన సంఘటనలను పాఠ్యాంశాలకు అనుసంధానం చేసి ఆసక్తికరంగా చెప్పేవారు. ఎన్. వి. సాంబశివరావు సార్ లెక్కల సబ్జెక్ట్ అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు బోధించేవారు. భౌతిక శాస్త్రం సబ్జెక్ట్ ఎ. విస్సన్న పంతులు గారు, రసాయన శాస్త్రం ఆదిశేషా రెడ్డి గారు బోధించేవారు. ప్రాక్టికల్స్ క్లాసులను తీసుకునేవారిని ఆ రోజుల్లో "డిమాన్ స్ట్రేటర్" (లెక్చరర్ కంటే ఒక గ్రేడ్ తక్కువ) అనే వాళ్లం. భౌతిక శాస్త్రానికి చక్రపాణి గారు, రసాయన శాస్త్రానికి సి. ఆంజనేయులు గారు డిమాన్ స్ట్రేటర్లుగా పని చేశారు. ప్రాక్టికల్స్ లో ఉపయోగించే కామన్ బాలెన్స్, పిప్పెట్, బ్యూరెట్ట్ లాంటివి ఇంకా గుర్తుకొస్తున్నాయి.


పి.యు.సి లో నా క్లాస్ మేట్స్ పేర్లు ఎక్కువగా గుర్తుకు రావడం లేదు. నా హెచ్.ఎస్.సీ క్లాస్ మేట్ ఎల్. వి.ఎస్.ఆర్. శర్మ నాతో పాటు పి.యు.సి లో కూడా చేరాడు. మరొక క్లాస్ మేట్ సి. బాల మౌళి. అతడు మా బజారులోనే (మామిళ్లగూడెం) నివసించే కొలిపాక ఆనంద రావు (అప్పట్లో సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసేవాడు) అనే మా శ్రీమతి వైపు బంధువుకు బావ మరిది. పి.యు.సి లో థర్డ్ క్లాస్ విద్యార్థిగా వున్నప్పటికీ, దరిమిలా హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసుకుని, సి.ఎ చదివి పెద్ద ఛార్టెడ్ అకౌంటెంటుగా పేరు తెచ్చుకున్నాడు. మరో పి.యు.సి విద్యార్థి సత్యనారాయణ ఇంజనీరయ్యాడు. క్లాస్ మేట్స్ గా వున్న నలుగురు అమ్మాయిల పేర్లు గుర్తున్నాయి. ఒకరు హేమ నళిని (మా బాబాయి వనం నర్సింగరావు ప్రేమించి మరీ వివాహం చేసుకున్నాడు) కాగా, మరొకరి పేరు నయన తార (ఈ అమ్మాయి అక్క- నా డిగ్రీ క్లాస్ మేట్ చంద్ర లేఖను రసాయన శాస్త్రం లెక్చరర్ ఆదిశేషా రెడ్డి వివాహం చేసుకున్నాడు). ఇంకో అమ్మాయి పేరు దేవి (ఈమె అన్నయ్య బారు సీతారాం రావు నాకు సీనియర్). మరో అమ్మాయి ఫకీర్ బీ (ఈ అమ్మాయిని విద్యార్థి సంఘం నాయకుడు, ఆ తరువాత రాజకీయ నాయకుడు ఖాదర్ అలీ పెళ్లి చేసుకున్నాడు). నాకు గుర్తున్నంతవరకు ఒక్క దేవి తప్ప మిగతా అమ్మాయిలు పి.యు.సి లో ఫెయిలయ్యారు. నేను కూడా పి.యు.సి లో అత్తెసరు మార్కులతో థర్డ్ క్లాస్ లో పాసయ్యాను. కాలేజీలో నేను పి.యు.సి చదువుతున్నప్పుడే బాబాయి వనం నర్సింగరావు బి. ఎస్సీ  డిగ్రీ మూడో సంవత్సరంలో చదువుతుండగా, ఆయన తమ్ముడు స్వర్గీయ వనం రంగారావు డిగ్రీ బి. ఏ రెండో సంవత్సరంలో చదివేవాడు.

పి.యు.సి లో చేరిన తరువాత చదువు మీద కంటే ఇతర విషయాల మీద ఆసక్తి పెరగ సాగింది. కళాశాల రాజకీయాలపై-కమ్యూనిస్ట్ రాజకీయాలపై ఆసక్తి కలగడంతో పాటు, క్రికెట్ ఆటపై మోజు పెరగ సాగింది. ఆ రెండింటి ప్రభావం చదువుపై తీవ్రంగా పడింది. వాటి మీద ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం బాబాయి నర్సింగరావు. ఖమ్మం కళాశాల రాజకీయాలలో నర్సింగరావు ది క్రియాశీలక పాత్రే కాకుండా "కింగ్ మేకర్" పాత్ర కూడా. ఆయనకు తోడు, బి. ఎస్సీ  డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న మరో సమీప బంధువు-స్నేహితుడు కొండపల్లి శ్రీ భార్గవ కూడా కాలేజీ రాజకీయాలలో చురుకైన పాత్ర వహించేవాడు. ఆ రోజుల్లో ఖమ్మం కాలేజీ ఎన్నికల రాజకీయాలు, శాసన సభ-లోక్ సభ ఎన్నికల రాజకీయాలను మరిపించే విధంగా వుండేవి. కాలేజీలోని రెండు ప్రధాన గ్రూపులకు, జిల్లాకు చెందిన రెండు ప్రధాన రాజకీయ పార్టీల అండ దండలుండేవి. ఒకటి కాంగ్రెస్ పార్టీ కాగా, మరొకటి కమ్యూనిస్ట్ పార్టీ. ఇంకా అప్పటికి కమ్యూనిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో చీలిపోలేదు. నర్సింగరావు కమ్యూనిస్ట్ పార్టీ బలపర్చిన గ్రూప్ పక్షాన నాయకత్వం వహించేవాడు. కళాశాల రాజకీయాలు స్థానిక కమ్మ హాస్టల్ కేంద్రంగా సాగుతుండేవి. కమ్మ హాస్టల్ లో నివసించే విద్యార్థులలో మెజారిటీ ఎవరి పక్షాన వుంటే వారికే కాలేజీ ఎన్నికలలో ఘన విజయం లభించేది. అందువల్ల కళాశాలలు వేసవి శెలవుల తరువాత ప్రారంభం కాగానే, రెండు గ్రూపుల వాళ్లు, హాస్టల్ పైన పట్టు సాధించేందుకు ముందస్తుగా ప్రయత్నాలు చేసేవారు. కళాశాల రాజకీయాలకు మరో కేంద్రం మామిళ్ల గూడెం లోని మా ఇల్లు.

          మా ఇంట్లో మూడు పోర్షన్లుండేవి. ఒక దాంట్లో (మధ్య పోర్షన్) ఆ రోజుల్లో కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పని చేస్తున్న కె. వై. ఎల్. నరసింహారావు గారు, మరో దాంట్లో (దక్షిణ వైపు) ఆర్థిక శాస్త్రంలో లెక్చరర్ గా పని చేస్తున్న జగన్మోహన్ రావు అద్దెకుండేవారు. ఉత్తరం వైపున్న పోర్షన్ మా కింద వుండేది. అమ్మా-నాన్నలు మా వూళ్లో ఎక్కువగా వుండేవారు. నేను హోటెల్ లో (ఆనంద రావు హోటెల్ అనుకుంటా) భోజనం చేస్తూ చదువుకునేవాడిని. బి. ఎస్సీ  ఫైనల్ ఇయర్ చదువుతున్న బాబాయి నర్సింగరావు, తమ్ముడు రంగారావుతో కలిసి వేరే గదిలో వుంటున్నప్పటికీ, ఎక్కువగా మా ఇంట్లోనే గడిపేవాడు. రాజకీయాలన్నీ అక్కడి నుంచే నడిచేవి. నేను పి.యు.సి లో చేరిన సంవత్సరం (1962-1963) జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ మద్దతుతో విద్యార్థి సంఘానికి పోటీ చేసిన వాళ్లలో సామినేని రాధాకృష్ణమూర్తి (అధ్యక్షుడు), ఖాదర్ అలీ (కార్యదర్శి), భార్గవ (కల్చరల్ కార్యదర్శి) పేర్లు గుర్తున్నాయి. ఆ ఏడాది అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన టి. రామయ్య గెలిచినప్పటికీ, కార్యదర్శితో సహా అధిక భాగం సీట్లను కమ్యూనిస్ట్ పార్టీ బలపర్చిన గ్రూప్ గెలుచుకుంది. ఎన్నికలు ముగిసిన వారం-పది రోజుల పాటు చాలా టెన్షన్ గా వుండేది. కొట్లాటలు జరిగేవి. దరిమిలా అంతా సర్దుకు పోయేది.

ఇంతకు ముందే చెప్పినట్లు నా పి.యు.సి చదువు పాడు కావడానికి మరో కారణం క్రికెట్ ఆట. కాలేజీలో చేరడంతోనే క్రికెట్ ఆడడం మొదలెట్టాను. "మామిళ్లగూడెం క్రికెట్ క్లబ్" ఆధ్వర్యంలో మా బజారులోని ఒక ఖాళీ స్థలంలో ఆడడంతో పాటు, కాలేజీ మైదానంలో కళాశాల జట్టుకు ఆడడం కూడా చేసేవాడిని. లెక్చరర్లు వైద్య, జడ్డి, వరదరాజన్ లాంటి వాళ్ల మద్దతు కూడా బాగా లభించేది. విద్యార్థులతో సమానంగా వాళ్లు కూడా ఆటలో పాల్గొనేవారు. మా ఇంట్లో కూచుని క్యారం బోర్డు ఆడడమో, ఉదయం-సాయంత్రం క్రికెట్ ఆడడమో నిత్య కృత్యమై పోయింది. తీరిక దొరికినప్పుడు ఇంట్లో గదిలో కూడా, ఆ కాస్త స్థలంలో క్రికెట్ ఆడుతుంటే పక్క పోర్షన్ లో వుండే ఇంగ్లీష్ లెక్చరర్ కె. వై. ఎల్. నరసింహారావు గారు తరచుగ మందలించేవారు. పి.యు.సి చదువుతున్నప్పుడు, హెచ్.ఎస్.సీ చివరి రోజుల్లో కొనుక్కున్న సైకిల్ మీద ప్రతిరోజూ కాలేజీకి వెళ్లే వాళ్లం. ఆ రోజుల్లో లెక్చరర్లు కూడా సైకిల్ మీదనే కాలేజీకి వెళ్తుండేవారు. కొందరైతే నడిచే వెళ్లేవారు. స్కూటర్లు, కార్లు లేనే లేవు. సైకిల్ పైన నేను, శర్మ డబుల్స్ పోయే వాళ్లం. గుట్టల బజార్ దగ్గర సైకిల్ తొక్కలేక ఇద్దరం దిగే వాళ్లం. వాడిని సైకిల్ తోయమని పురమాయించేవాడిని. గుట్ట ఎక్కిన తరువాత మళ్లీ డబుల్స్ రైడ్!

పి.యు.సి పరీక్షలొచ్చాయి. అప్పట్లో "పరీక్షలు రాయను" అనడం ఒక ఫాషన్. నేను అదే మాట అన్నాను మా నాన్నతో. బహుశా ఒకటో-రెండో సబ్జెక్టులు రాసిన తరువాత, మంచి మార్కులు రావని, థర్డ్ క్లాస్ లో పాసైతే, ఇంజనీరింగులో సీటు రాదని, అందుకే మిగతా పరీక్షలు రాయనని వూళ్లో వున్న నాన్నగారికి కబురు చేశాను. ఆయన హుటాహుటిన ఖమ్మం చేరుకుని, నాకు నచ్చ చెప్పి మిగతా పరీక్ష రాయడానికి ఒప్పించారు. హైదరాబాద్, వరంగల్ లలో (ఆ రోజుల్లో నాకు గుర్తున్నంతవరకు రెండే ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి) ఇంజనీరింగులో సీటు రాకపోతే, బెంగుళూరు పంపించి చదివిస్తానని అన్నారు. సరేనని చెప్పి పరీక్ష రాయడం కొనసాగించాను. ఫలితాలు నేను ఊహించినట్లే వచ్చాయి.... థర్డ్ క్లాస్ లో పాసయ్యాను. ఎం.పీ.సీ గ్రూపులో మంచి మార్కులు వచ్చినప్పటికీ, ఇంజనీరింగులో సీటు లభించే స్థాయిలో రాలేదు. బొమ్మకంటి సత్యనారాయణ గారి సిఫార్సుతో, అప్పటి కాంగ్రెస్ పార్టీ మంత్రి టి. హయగ్రీవా చారి గారి ద్వారా ఎంత ప్రయత్నించినా ఇంజనీరింగులో సీటు దొరక లేదు. బెంగుళూరు ఎమ్మెస్ రామయ్య కాలేజీలో ప్రయత్నం చేశాం కాని ఫలితం లేకపోయింది. బి. ఎస్సీ  డిగ్రీ మొదటి సంవత్సరంలో ఎం.పీ.సీ గ్రూప్ తీసుకుని ఖమ్మం కళాశాలలో చేరాను. శర్మ ఫెయిలయ్యాడు. చాలామంది ఫెయిలయ్యారు. ఒకరిద్దరు తప్ప ఇంజనీరింగులో-మెడిసిన్ లో సీట్లు తెచ్చుకున్నవారు లేరనే అనాలి. బాల మౌళి థర్డ్ క్లాస్ లో పాసయ్యాడు. హైదరాబాద్ వెళ్లి పోయాడు.

ఆ రోజుల్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే వాళ్లను ఏం చేస్తున్నావని అడుగుతే ఫలానా డిగ్రీ, ఫలానా ఇయర్ అని సమాధానం ఇవ్వక పోయే వాళ్లు. "ఫస్ట్ ఇయర్...రెస్ట్ ఇయర్" అని క్లుప్తంగా చెప్పే వాళ్లు. దానికి కారణం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో పబ్లిక్ పరీక్షలు లేకపోవడమే. చదివినా-చదవక పోయినా రెండో సంవత్సరానికి ప్రమోట్ అయ్యే వాళ్లు. సెకండ్ ఇయర్లో లాంగ్వేజెస్ (ఇంగ్లీష్, తెలుగు), జనరల్ స్టడీస్ లో పరీక్షలుండేవి. మొత్తం ఆరు పేపర్లుండేవి. థర్డ్ ఇయర్లో ఆప్షనల్ సబ్జెక్టులలో (ఎం.పీ.సీ గ్రూప్) పరీక్షలుండేవి. భౌతిక శాస్త్రంలో మాడరన్ ఫిజిక్స్ లో నాలుగు పేపర్లతో సహా మొత్తం పది పేపర్లుండేవి. పరీక్ష-పరీక్షకు మధ్య ఇప్పటి లాగా దినం విడిచి దినమో, మధ్య మధ్య శెలవులో వుండక పోయేది. సోమవారం పరీక్ష మొదలవుతే మధ్యలో వచ్చే ఒక్క ఆదివారం మినహా వరుస వెంట పది రోజులు పరీక్షలు జరిగేవి. మూడు సంవత్సరాలు చదివింది గుర్తుంచుకుని రాయాల్సి వచ్చేది. అదే విధంగా లాంగ్వేజెస్ పేపర్లు రెండేళ్లు చెప్పింది గుర్తుంచుకుని రాయాలి.

డిగ్రీలో ఎప్పటిలాగే చదువు, క్రికెట్, రాజకీయాలు కొనసాగాయి. చదువు తక్కువ, మిగతావి ఎక్కువ. నర్సింగరావు డిగ్రీ చదవడం పూర్తైనప్పటికీ, పరీక్ష పాసవనందున, కాలేజీతో అనుబంధం వుంచుకోవడంతో పాటు రాజకీయాలలో ఇంకా పాల్గొంటూనే వుండేవాడు. ఆయన వెంబడి మేమూ అదే పని. డిగ్రీ మొదటి సంవత్సరం మాత్రమే నేను ఖమ్మంలో చదివాను. మరుసటి ఏడాది హైదరాబాద్ వెళ్లిపోయాను. ఆ వివరాలు తరువాత రాస్తాను. డిగ్రీలో ఇంగ్లీష్ పాఠ్యాంశాలను కె. వై. ఎల్. నరసింహారావు గారు, వరదరాజన్ గారు, జడ్డి గారు, సత్యనాధం గారు బోధించేవారు. తెలుగు ఎం. హనుమంతరావు గారు. యడవల్లి ఆదినారాయణ గారు చెప్పేవారు. నాకు గుర్తున్నంతవరకు "ఆంధ్ర మహాభారతోపన్యాసాలు" సబ్జెక్ట్ గా వుండేది తెలుగులో. బమ్మెర పోతన నాటకం కూడా వుండేది.

జనరల్ స్టడీస్ సబ్జెక్టును జగన్మోహన్ రావు, వై. వి. రెడ్డి, సుబ్రహ్మణ్యం గార్లు చెప్పేవారు. భౌతిక శాస్త్రం ఎమ్మెస్ ఆచారి గారు, . విస్సన్న పంతులుగారు బోధించేవారు. లెక్కలు కె. కోదండరాం రావు గారు, రసాయన శాస్త్రాన్ని జి. వి. నరసింహారావు (ఆర్గానిక్) గారు, ఆదిశేషా రెడ్డి (ఇన్ ఆర్గానిక్) గారు చెప్పేవారు. డిమాన్ స్తేటర్లుగా చక్రపాణి గారు, ఆంజనేయులు గారు డిగ్రీలో కూడా వుండేవారు. నా క్లాస్ మేట్స్ పేర్లు కొన్ని మాత్రమే గుర్తున్నాయి. అప్పట్లో "రౌడీ శంకర్" గా పేరు పొందిన ఎన్. శంకర్ రావు, మా ఇంటి ఎదురుగా వుండే మోటమర్రి వెంకట రామారావు, ఎస్. రాజేశ్వర రావు, సి.హెచ్. విజయ రామ శర్మ, ఎస్.ఎం.ఎన్. రాయ్, కళాధర్, నాగేశ్వర రావు, రోజా-పుష్ప అనే అక్క చెల్లెళ్లు, దేవి, చంద్రలేఖ నా క్లాస్ మేట్స్. శంకర్ రావు దరిమిలా మునిసిపల్ వార్డ్ మెంబర్ గా పని చేశాడు. వెంకట రామారావు హెడ్ మాస్టర్ గా పదవీ విరమణ చేశాడు. రాజేశ్వర రావు, రాయ్, శర్మ బాంక్ అధికారులుగా రిటైర్ అయ్యారు. కళాధర్ ఏ. జి. ఆఫీస్ లో పని చేసి రిటైర్ అయ్యాడు. చంద్రలేఖ ఆదిశేషా రెడ్డి గారిని వివాహమాడింది. శర్మ, రాయ్, రాజేశ్వర రావు, నాగేశ్వర రావు క్రికెట్ ఆటగాళ్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు కూడా. మాతో పాటు మామిళ్లగూడెంలోనే వుంటుండే మా సమీప బంధువు వనం రంగారావు కూడా కాలేజీలో బి. ఎ లో చేరి క్రికెట్ ఆటగాడుగా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నాడు. దరిమిలా రాష్ట్ర స్థాయి క్రీడాకారుడుగా ఎదిగాడు.


ఖమ్మం మామిళ్లగూడెంలో వున్న మా ఇంట్లో అద్దెకుంటుండే కె. వై. ఎల్. నరసింహారావు గారికి కాలేజీ ప్రిన్సిపాల్ గా పదోన్నతి వచ్చింది. ఆయన మా ఇంట్లో చాలా కాలం అద్దెకున్నారు. ఐతే, నేను డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరిన ఏడాదే, మా కుటుంబం ఖమ్మంలో కాపురం పెట్టింది. అద్దెలకివ్వగా మిగిలిన ఒక్క పోర్షన్ మా కుటుంబానికి సరిపడకపోవడంతో కె. వై. ఎల్. నరసింహారావు గారిని ఖాళీ చేయమని మా నాన్నగారు కోరారు. ఆయన గారికి సరైన అద్దె ఇల్లు లభించనందున ఎంతకాలం గడిచినా ఖాళీ చేసే సూచనలు కనిపించ లేదు. మా కుటుంబానికి ఇంట్లో మిగిలిన ఒక్క పోర్షన్ సరిపోనందున ఎదురింటిలో ఒక భాగం అద్దెకు తీసుకుని వుండాల్సిన పరిస్థితి వచ్చింది. కె. వై. ఎల్. గారిని ఖాళీ చేయించేందుకు మా నాన్న గారు కొంత బలప్రయోగం వుపయోగించాల్సి వచ్చింది. ఆయన ఖాళీ చేయక తప్పలేదు కొంతకాలానికి. ఐతే, ఆయన కళాశాల ప్ర్రిన్సిపాల్ గా పని చేస్తున్నందున, నేను అక్కడే చదువుతున్నందున, నా చదువుకు ఆయనేమన్నా ఇబ్బందులు కలగ చేయవచ్చనే అనుమానంతో, మా నాన్నగారు నా చదువు హైదరాబాద్ కు మార్పించాలన్న ఆలోచన చేశారు. ఫలితంగా 1964 లో హైదరాబాద్ చేరుకున్న నేను, నాటి నుంచి నేటి వరకు, గత ఏబై సంవత్సరాలుగా, ఈ నగరంతో అనుబంధం పెట్టుకున్నాను. ఆ నాడు వచ్చిన నేను, ఇక్కడే స్థిరపడి పోతానని అప్పట్లో భావించలేదు. ఆ విషయాలన్నీ ముందు---ముందు.

Thursday, June 20, 2013

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part FIVE: వనం జ్వాలా నరసింహారావు

నా బాల్యం...చిన్ననాటి కబుర్లు-Part FIVE:

వనం జ్వాలా నరసింహారావు

ఏబై-అరవై ఏళ్ల కింద గ్రామాలలో నెలకొన్న కొన్ని పరిస్థితులను మననం చేసుకుంటుంటే, ఇప్పటికీ-అప్పటికీ వున్న తేడా కొట్టొచ్చినట్లు అర్థమవుతుంది. ఉదాహరణకు, నా చిన్నతనంలో, మా గ్రామంలో ఎవరికైనా "సుస్తీ" (వంట్లో బాగా లేక పోతే-జ్వరం లాంటిది వస్తే) చేస్తే, వైద్యం చేయడానికి, వూళ్లో వున్న నాటు వైద్యుడే దిక్కు. నాటు వైద్యులలో అల్లోపతి వారు, హోమియోపతి వారు. ఆయుర్వేదం వారు, పాము-తేలు మంత్రాలు వచ్చిన వాళ్లు, మూలిక వైద్యులు....ఇలా అన్ని రకాల వాళ్లు వుండేవారు. మా వూళ్లో ఇంతమంది లేరు కాని, అల్లోపతి వైద్యం నేర్చుకున్న ఒక డాక్టర్ జంగం రాజయ్య, ఆయుర్వేదం వైద్యం తెలిసిన మరో డాక్టర్ రత్నమాచార్యులు వుండేవారు. రత్నమాచార్యులు పూజారి పని కూడా చేసేవారు. ఎవరికి ఏ సుస్తీ చేసినా వాళ్లే గతి. ఇద్దరికీ ఇంజక్షన్లు ఇచ్చి వైద్యం చేసే అలవాటుండేది. జ్వరాలకు (ఎక్కువగా ఇన్ ఫ్లు ఎంజా, మలేరియా-చలి జ్వరం) ఏ.పీ.సీ టాబ్లెట్లు ఇచ్చేవాడు రాజయ్య. ఒక సీసాలో ఆయన ఇంట్లో తయారు చేసిన "రంగు నీళ్లు" కూడా ఇచ్చేవాడు. తగ్గితే తగ్గినట్లు, లేకపోతే, రోగి కర్మ అనుకునేవారు ఆ రోజుల్లో. జంగం రాజయ్యకు ఒక సైకలుండేది. మా ఇంట్లో ఎవరికీ సుస్తీ లేకపోయినా, ప్రతి రోజు ఏదో ఒక టైంలో మా ఇంటికి రాజయ్య తప్పక వచ్చి పోయేవాడు. మా నాన్నను "దొరవారు" అని సంబోధిస్తూ ఓ గంట గడిపి పోయేవాడు.

          వూళ్లో ఏవైనా సీరియస్ కేసులు వుంటే, ఎడ్ల బండిలోనో, మేనాలోనో తీసుకుని ఖమ్మం పోయే వాళ్లు. వారి వెంట రాజయ్య కూడా వెళ్లేవాడు. ఐతే, ఖమ్మంలో కూడా ఆ రోజుల్లో ఎం.బి.బి.ఎస్ డాక్టర్లు ఎక్కువగా లేరు. డాక్టర్ అబ్దుల్ మజీద్, డాక్ట్రర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, డాక్ట్రర్ అశ్వత్థామలు ఎం.బి.బి.ఎస్ డాక్టర్లు. వారు కాకుండా, చిల్లంచర్ల రంగాచార్యులు, ఉపేందర్ రావు, సీతారామచంద్ర రావు లాంటి కొందరు ఆర్.ఎం.పి డాక్టర్లు కూడా చిన్న-చిన్న నర్సింగ్ హోంలు పెట్టి వైద్యం చేసేవారు. ఆపరేషన్లు కూడా వాళ్ళే చేసేవారు. ఇప్పుడైతే ఖమ్మంలో వందలాది మంది ఎం.బి.బి.ఎస్ డాక్టర్లు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు....అంతే సంఖ్యలో నర్సింగ్ హోంలు వున్నాయి. నేను, మా కుటుంబం, ఖమ్మంలో వున్నప్పుడు కూడా చాలా మటుకు స్థానిక డాక్ట్రర్ జె. రామారావు (ఆర్.ఎం.పి) దగ్గరకో, లేకపోతే డాక్టర్ అబ్దుల్ మజీద్ దగ్గర కాంపౌండర్‍గా పని చేస్తూ, ఇంట్లో డాక్టర్ గా పేరు తెచ్చుకున్న రామాచారి దగ్గరికో వెళ్లే వాళ్లం.

          జంగం రాజయ్య కంటే, ఇతర ఖమ్మం డాక్టర్ల కంటే ఎక్కువగా, మా ఫామిలీ డాక్టర్ గా నేలకొండపల్లి గ్రామంలో వైద్యం చేస్తున్న మరో ఆర్.ఎం.పి డాక్ట్రర్ బొప్పెన వెంకటేశ్వర రావును చూసుకునేవాళ్లం. మా వూళ్లో జంగం రాజయ్య వల్ల తగ్గని సందర్భంలో, బండి కట్టుకుని, నేలకొండపల్లి వెళ్లి, అక్కడ మా మేనమామ కంకిపాటి రాజేశ్వర రావు గారింట్లో వుంటూ, డాక్టర్ వెంకటేశ్వర రావు దగ్గర వైద్యం చేయించుకునే వాళ్లం. రెండు పర్యాయాలు నేను నేలకొండపల్లిలో వుంటూ వైద్యం చేయించుకున్న సందర్భాలు ఇంకా గుర్తున్నాయి. ఒక సారి ఎడ్ల బండి మీద పోతుంటే, కమలాపురం-అయ్యగారి పల్లి సరిహద్దుల్లో "వరకటం" (అస్తవ్యస్తమైన ఎడ్ల బండి దారి) దగ్గర ప్రమాదం జరిగి నా కాలు మడమ దగ్గర పెద్ద గాయం అయింది. సుమారు పదిహేను రోజులు నేలకొండపల్లిలో వుండి వైద్యం చేయించుకున్నాను. అలానే ఒక సారి టైఫాయిడ్ (అది టైఫాయిడ్ అవునో కాదో!) వచ్చిందని సుమారు నెల రోజులు నేలకొండపల్లిలో వుండి వైద్యం చేయించుకున్నాను. అప్పట్లో ఇంకా యాంటీబయాటిక్స్ ఉపయోగం అంతగా పాపులర్ కాలేదు. ఆర్.ఎం.పి డాక్టర్ వెంకటేశ్వర రావు గారిచ్చిన మందులతోనే నయమయింది. నాకు అప్పుడు చాలా చిన్న వయస్సు. జ్వరంతో బాధపడుతున్న నన్ను ఎప్పుడూ "ఖుషీ" గా వుంచడానికి నేలకొండపల్లిలో చదువుకుంటున్న వనం నర్సింగరావు, భార్గవలను నాతో "చీట్ల పేక" ( ప్లేయింగ్ కార్డ్ లు) ఆడమని మా మామయ్య పురమాయించేవాడు.

          నా చిన్నతనంలో గ్రామాలలో "గత్తర" (కలరా), "స్పోటకం-పాటకం" (స్మాల్ పాక్స్) వ్యాధులు తరచుగా వస్తుండేవి. వీటికి తోడు "దద్దులు", "వంచెలు" కూడా చిన్న పిల్లలకు పోసేవి. ఇవి రాకుండా ముందస్తు నివారణ చర్యగా కలరా ఇంజక్షన్లు చేయడానికి, "టీకాలు" వేయడానికి ప్రభుత్వ వైద్యుల బృందం గ్రామంలోకి వచ్చేది. వారు మా ఇంటి ఎదురుగా వున్న పోలీస్ పటేల్ తుల్లూరి రామయ్య ఇంట్లో మకాం వేసి, గ్రామంలోని అందరినీ అక్కడకు రప్పించి ఇంజక్షన్లు, టీకాలు ఇచ్చేవారు. టీకాలు వేసిన చోట పెద్ద పుండులాగా అయి, ఒక నెల రోజుల తరువాత పెద్ద మచ్చలాగా పడేది. నాకు, నా చేతి భుజం మీద ఆ మచ్చ ఇంకా వుంది. ఇప్పుడైతే స్మాల్ పాక్స్ పూర్తిగా మాయమైంది. చిన్నతనంలోనే టీకాలు వేయడంతో క్రమేపీ అది నిర్మూలించబడింది. కలరా కూడా ఎప్పుడో అప్పుడు కలుషిత నీరు తాగడం వల్ల కొందరికి వస్తున్నా, దాదాపు నిర్మూలించబడినట్లే.

          ఒక్కసారి చిన్నతనం రోజులు, ఇప్పటి రోజులు తలచుకుని పోల్చి చూసుకుంటే, ఎంత అభివృద్ధి చెందామో అర్థమవుతుంది. మా వూరికి ఇప్పుడు విద్యుత్ సరఫరా వుంది. ఖమ్మం నుంచి రావడానికి-పోవడానికి చక్కటి డబుల్ రోడ్ డాంబర్ రహదారి వుంది. దానిపై అన్ని వేళలా తిరగడానికి ప్రభుత్వ బస్సులున్నాయి. 24 గంటలు అందుబాటులో 108 అంబులెన్స్ వుంది. సాగర్ నీళ్లు వచ్చి గ్రామంలోని మూడొంతుల భూమి సస్యశ్యామలం అయింది. ఒకనాడు ఒకరిద్దరు క్వాలిఫైడ్ డాక్టర్లు మాత్రమే వున్న ఖమ్మంలో వందలాది మంది అయ్యారిప్పుడు. మా వూళ్లో ఒక పెట్రోల్ బంక్ కూడా వచ్చిందిప్పుడు. కనీసం పది మందికన్నా కార్లు, ఏబై వరకు ఇతర వాహనాలు వున్నాయి. ఫోన్ లేని ఇల్లు, మొబైల్ వాడని వ్యక్తి మా వూళ్లో కనిపించవు. చింతకాని వెళ్లే మార్గ మద్యంలో వున్న ఏరు మీద వంతెన కట్టుతున్నారు. మా వూరి నుంచి సరాసరి ఖమ్మం పోయే దారిలో ఖమ్మం సమీపంలో ఏటిపైన మరో వంతెన కట్తున్నారు. నడకతో కొన్నాళ్లు, సైకిల్ పైన కొన్నాళ్లు, ఎడ్ల బండిపైన కొన్నాళ్లు, ప్రయివేట్ బస్సుపైన కొన్నాళ్లు, స్కూటర్ మీద ప్రయాణం చేసి కొన్నాళ్లు ఖమ్మం-మా వూరి మధ్యన తిరిగిన మేం, ఇప్పుడు సరాసరి హైదరాబాద్ నుంచి ఉదయం బయల్దేరి కారులో మా వూరికి వెళ్లి, కొన్ని గంటలక్కడ గడిపి, రాత్రి కల్లా హైదరాబాద్ చేరుకో గలుగుతున్నాం. ఎడ్ల బండిలో ప్రయాణం చేసిన నేను విమానాలలో తిరుగుతున్నాను. ఆర్.ఎం.పి డాక్టర్ చికిత్సకే పరిమితమైన మేం ఇప్పుడు సూపర్ స్పెషలిస్ట్ వైద్యం చేయించుకుంటున్నాం. పలకా-బలపం పట్టిన నేను కంప్యూటర్ ను ఉపయోగిస్తున్నాను. ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలి?-End