Monday, October 31, 2016

బ్రాహ్మణ సంక్షేమం….ఈశ్వరుడికి సంతోషం : వనం జ్వాలా నరసింహారావు

బ్రాహ్మణ సంక్షేమం….ఈశ్వరుడికి సంతోషం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి దినపత్రిక (01-11-2016)

"ఋషుల నుంచి అందిపుచ్చుకున్న సంస్కృతీ సంప్రదాయాలను, ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న వారి వంశస్తులే-’బ్రాహ్మణులు’. పరాయి పాలనలో అవి దెబ్బతినకుండా సంరక్షికుంటూ వస్తున్నారీ బ్రాహ్మణులు. ’పురోహితులు’గా సమాజానికి మార్గదర్శకులుగా వుంటూ వస్తున్నారు. యజ్ఞం అంటేనే త్యాగం. యజ్ఞానికి త్యాగమే మూలం. బ్రాహ్మణుడి జీవన విధానమే త్యాగంతో కూడుకున్న మహాయజ్ఞం" - సంపాదకుడు

సమాజానికి సంబంధించిన సేవే బ్రాహ్మణులు చేస్తున్నారని, అయినా ఆ కులస్తుల్లో కొందరి పరిస్తితి దీనంగా వుందని, మంగళహారతి పళ్లెంలో భక్తులు వేసే డబ్బులకోసం అర్చకులు ఎదురు చూసే దుర్భర పరిస్థితులను అధిగమించాలని ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాటలను విశ్లేషించాల్సిన తరుణమిది. ప్రభుత్వం, మేధావులు కలిసి బ్రాహ్మణుల సంక్షేమానికి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని కూడా సీఎం కేసీఆర్ సూచించారు. ఇందులో భాగంగానే మొదలు అన్ని హంగులతో కూడిన ఒక రాష్ట్ర స్థాయి సదనాన్ని హైదరాబాద్ లో నిర్మించుకుందాం అని అంటూ, దాని నిర్వహణ బాధ్యత కోసం ఒక ధర్మకర్తల మండలి ఏర్పాటు చేద్దామనిఆ కేంద్రంలో బ్రాహ్మణ సాంప్రదాయ పరమైన కార్యక్రమాలు జరుపుకునేందుకు ఏర్పాటు చేసుకుందామని సీఎం అన్నారు. బ్రాహ్మణ సంక్షేమం దిశగా సీఎం సూచన మేరకు పలువురు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఇంతకూ బ్రాహ్మణులు చేసుకుంటూ వస్తున్నారన్న సమాజ సేవ ఏమై వుంటుందని విశ్లేషించి చూస్తే....అది వ్యక్తిగత, మతపరమైన, దోష నివారణ సంబంధమైన సేవేననీ, రకరకాల కర్మకాండలందులో వున్నాయనీ, శుభాశుభ కార్యాలందులో భాగమేననీ అర్థం చేసుకోవాలి. అలానే సామాజిక, సాంస్కృతిక ప్రవచనాలిస్తూ, తద్వారా వాజ్ఞయ విస్తరణ, ధర్మ ప్రబోధన చేస్తున్నారు. అలానే ముక్తి ప్రదాయినైన పరావిద్యను, జ్ఞాన సముపార్జనకు అవసరమైన అపరావిద్యను వ్యాప్తిచేసేందుకు కృషి చేస్తున్నారు. ఇదంతా స్వయంగా స్వాధ్యాయనం చేస్తూ, ఆ విధంగా సమాజ సేవకు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.

సృష్టి ఆదినుండీ బ్రాహ్మణ సాంప్రదాయ పద్ధతి ఎలా రూపాంతరం చెందిందీ అనే విషయంలో కొందరు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పడం కూదా జరిగింది.

సృష్టికీ, బ్రాహ్మణులకూ అనిర్వచనీయమైన అనుబంధం వుంది. "ప్రళయావస్థలో శూన్యం తప్ప ఏమీ లేదు. కేవలం పంచ భూతాలు మాత్రమే వుండేవి. ఏ లోకమూ లేదు. భూమ్యాకాశాలూ లేవు. అలాంటప్పుడు ఎవరు ఎవరిని కదిలించారు? ఎలా కదిలించారు? అంతా అనిశ్చిత స్థితే!" అనేది ఋగ్వేదంలోని సంస్కృత శ్లోక సారాంశం. అయోధ్య తీర్పులో న్యాయమూర్తి జస్టిస్ అగర్వాల్ చెప్పినట్లు "సృష్టికి పూర్వం అంతా శూన్యమే. అంతా చీకటిమయం. అంతటా జలమయం. సృష్టి ఎలా, ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు. అన్నీ తెలిసిన పండితులకు, మేధావులకు కూడా తెలిసే అవకాశం లేదు-ఎందుకంటే వారంతా సృష్టి తర్వాతే పుట్టారు కనుక. సృష్టికి కారకుడైన ఆ శక్తే సృష్టిని కొనసాగిస్తున్నదా, లేక, మరెవరన్నా చేస్తున్నారా? అనేదీ అంతుచిక్కని విషయమే. అసలా శక్తికి కూడా తెలుసో, లేదో?"

            సుందరకాండలో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన వుంది. సృష్టించే వాడు బ్రహ్మ అని, సంహరించే వాడు రుద్రుడు అనీ అనుకుంటారు. అయితే అనంతకోటి బ్రహ్మాండానికి "పరబ్రహ్మం" ఒక్కరే! అతడికి (లేదా అమెకు) సమానులైన వారు-అధికులైన వారు ఎవరూ లేరు. గడ్డిపోచ కదలాలన్నా ఆయనే కారణం. ఆ పరబ్రహ్మమే సృష్టికొక అధికారినీ, సంహరించడానికి మరొకరినీ, నియమించారు. "బ్రహ్మ, రుద్రులు" నిమిత్త మాత్రులు. భగవంతుడైన "విష్ణుమూర్తి" రజో గుణం విశేషంగా వుండే జీవులందు ప్రవేశించి వారితో సృష్టి కార్యాన్ని, తమో గుణం వున్నవారిలో ప్రవేశించి సంహార కార్యాన్ని, సత్వ గుణం వున్న వారిలో ప్రవేశించి రక్షించే పనినీ చేయిస్తారు. అందుకే సమస్త ప్రయోజనకర్త ఆ "భగవంతుడే".

            ఆదివారం, అక్టోబర్ 26 , హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన బ్రాహ్మణ సంక్షేమ సమావేశంలో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ కమీషనర్ కేఆర్ నందన్ గారి మాటల్లోని సారాంశంతో పైన పేర్కొన్న అంశాలను జోడించి, అన్వయించి, విశ్లేషిస్తే బ్రాహ్మణుల ఆవిర్భావం, అవసరం, రూపాంతరం, తదనంతర స్థితిగతులు కొంతవరకు అర్థం చేసుకోవచ్చునేమో.

ప్రపంచ వ్యాప్తంగా వందల-వేల సంవత్సరాల చరిత్ర, ఒక దేశంపై మరొక దేశం దాడులు, దాడి తరువాత ఆ దేశాన్ని ఆక్రమించుకుని అంతకు పూర్వం నెలకొన్న నాగరికత, సంస్కృతి, సాంప్రదాయాల విధ్వంసం లాంటి విషయాలను విశ్లేషించి చూస్తే కొన్ని విషయాలు అవగతమౌతాయి. ఉదాహరణకు ఒకానొకప్పుడు ముస్లిమేతర దేశాలైన ఇరాన్-పర్షియా, టర్కీ, ఈజిప్ట్ లను ఆక్రమించుకున్న ఇస్లాం దేశాలు అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలు, ధర్మం కు విరుద్ధంగా వాటిని మార్చడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఉదాహరణకు, అగ్నిహోత్రం చేసుకుంటూ బ్రతికే భారతీయులున్న ఇరాన్ ను మార్చేశారు. ఐదారు వేల ఏల్ల చరిత్ర వున్న పర్షియాను, టర్కీని, ఈజిప్ట్ ను మార్చడానికి కేవలం రెండు దశాబ్దాల కాలం సరిపోయింది. అయితే 800 సంవత్సరాల ముస్లిం రాజుల పాలనలో కాని, 200 ఏళ్ల ఆంగ్లేయుల క్రైస్తవ పాలనలోకాని భారత దేశాన్ని, భారతీయ సంస్కృతిని, భారతీయ ధర్మాన్ని లొంగదీయడం వారికి చేతకాలేదు. దీనికి కారణం మనల్ని పాలించిన ఆ పరాయి వారి సంస్కృతి పరిమితమైన-ఎక్స్క్లూజివ్ సంస్కృతి....కొందరికే నిలయమైందది. ఇక మనదేమో ఇన్‍క్లూజివ్-సంఘటిత సంస్కృతి...అనేక ఏళ్ల నాటి ఆర్య సంస్కృతి....అందులో అందరికీ స్థానం వుంది.

            ఆర్య సంస్కృతి కాబట్టే పరాయి దాష్టీకాన్ని తట్టుకుని నిలదొక్కుకుంది. అలా తట్టుకోవడానికి బ్రాహ్మణుల పాత్ర కీలకం. అనాదిగా ఆ సంస్కృతికి సంరక్షకులు బ్రాహ్మణులు కావడమే దీనికి కారణం. ఇండిక్ నాగరకతను నిరంతరం పోషించుకుంటూ, సంరక్షించుకుంటూ, తరతరాలకు అందించిన ఘనత కూడా బ్రాహ్మణులదే. మన ఈ నాగరకత, దానిలోని విలువలు, అందులోని సద్గుణాలు, సత్ప్రవర్తన, నీతి, ధర్మాలు...ఇవన్నీ వ్యక్తికీ, వ్యక్తితోపాటు సమిష్టికీ స్థానమిచ్చింది. మరోవైపు ఇస్లాం, క్రిస్టియానిటీ, తదనంతరం రూపుదిద్దుకున్న కమ్యూనిజం లాంటి ఇజాలు, సమిష్టికో లేదా వ్యక్తికో స్థానమిచ్చాయి కాని రెండింటికీ కలిపి ఇవ్వలేదు. ఈ మన సాంప్రదాయాలు, నాగరకత, ఆర్య సంస్కృతి, లోక కళ్యాణకారిగా విలసిల్లుతూ వస్తున్నది అనాదిగా. ఇటువంటి ఉత్కృష్టమైన నాగరకత బ్రాహ్మణుల సంరక్షణలోకి రావడానికి కారణం ఋషులు. వీరే "కార్య బ్రహ్మలు" అని కూడా పిలువబడ్డారు. సృష్టి కంటే ముందు మనందరం సృష్టి మూలం అనుకుంటున్న చతుర్ముఖ బ్రహ్మను "కారణ బ్రహ్మ" అని కూడా అంటారు. ఆయనే తొలుత ఋషులను సృష్టించి వారిని "కార్య బ్రహ్మలు" గా నియోగించాడు. మొత్తం రూపకల్పన చతుర్ముఖ బ్రహ్మ చేసినప్పటికీ, అమలు మాత్రం కార్య బ్రహ్మలకు అప్ప చెప్పాడాయన. అనంతకోటి బ్రహ్మాండాన్ని శాసించే పరబ్రహ్మ-విష్ణువును "కారణ కారణ బ్రహ్మ" అంటారు.


            బ్రహ్మాండంలో త్రిమూర్తి మండలాలున్నాయి. అవే వారి లోకాలు కూడా. వాటికి దిగువగా ఋషుల మండలం లేదా తపోలోకం వుంటుంది. ఇవన్నీ అంతరిక్షంలో వున్నాయి. మొత్తం బ్రహ్మాండంలో పద్నాలుగు లోకాలున్నాయి. మనుషులకు  మాదిరిగానే యక్ష, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, దేవతలకు కూడా లోకాలున్నాయి. ఋషుల్లో కూడా వివిధ రకాల వాళ్లుంటారు. పద్నాలుగు లోకాలను ఏడు ఊర్ధ్వ లోకాలని, ఏడు అధో లోకాలని నామకరణం చేశారు. త్రిమూర్తులది అందరికంటే పైనుండే లోకం-సత్య లోకం. ఇక మిగిలినవాటిని తపోలోకం, జనలోకం, మహర్లోకం, సువర్లోకం, భువర్లోకం, భూలోకం అని అంటారు. ఊర్ధ్వ లోకాలలలో చివరిది-దిగువది భూలోకం. అలాగే పాతాళం, రౌరవాది నరకాలను అధోలోకాలుగా పిలుస్తారు. అవి: అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలు. మహర్లోకం పైన జనలోకం ఉంది. ఆ లోక ప్రవేశం మొదలుకొని శాశ్వత సుఖం ఆరంభమవుతుందంటారు. అది అమృతరూపం. జనలోకంపైన ఉన్న తపోలోకంలోని సుఖం శాశ్వతమైందే కాక క్షేమరూపంలో ఉంటుంది. తపోలోకం పైన ఉండే సత్యలోకంలో సుఖం శాశ్వతం, మోక్షప్రథం కూడా.

దేవతల కంటే పూర్వమే ఋషులను సృష్టించాడు చతుర్ముఖ కారణ బ్రహ్మ. ఆ తరువాతనే మిగిలినవారందరూ వచ్చారు. కార్య బ్రహ్మల్లో ఒకరైన మరీచుడి కొడుకు కశ్యప ఋషి. ఆయన సంతానమే దేవదానవులు. దేవతలు అదితి ద్వారా, దానవులు దితి ద్వారా కలిగారాయనకు. కశ్యప ఋషిని ప్రజాపతి పదవిలో నియమించాడు బ్రహ్మ. ఆయన కూడా ఒక కార్యబ్రహ్మే. ఆయనే భూమిని సృష్టించాడు. అలా, భూమండలాన్ని కోట్లాది సంవత్సరాల క్రితం సృష్టించడం జరిగింది. కశ్యప సృష్టి వల్ల ఉద్భవించిన భూమిని ఆయన కూతురుగా భావించి "కాశ్యపి" అని కూడా పిలుస్తారు. దరిమిలా భూమండలలో జనాభాను సృష్టించడం జరిగింది. మానవుల ఆవిర్భావం జరిగింది. నాగరిక జీవనానికి ముందు ఆది మానవులుండేవారు. అప్పుడు ఈశ్వరుడి ఆజ్ఞానుసారం తపోలోకంలో నివసిస్తున్న ఋషులు భూలోకంలో జన్మించారు. తోటి మానవులకు జీవాత్మ, పరమాత్మ, మానవ జన్మ శ్రేష్టత, సృష్టి, నిర్మాణం, మానవుల స్థానం లాంటి వాటిని గురించి తెలియచేయమని వారిని ఈశ్వరుడు కోరాడు. ఆ విధంగానే మానవులకు గమ్యం, గమనం, ధర్మాధర్మాలు చెప్పి వారిని సంస్కరించి, మార్గదర్శకత్వం ఇచ్చి తపోలోకానికి మరలి పోయారు.

            ఆ విధంగా ఋషులు భూలోకంలో మనకు సంతానంగా జన్మించి, తపస్సు చేసి, సంస్కృతిని నెలకొల్పారు. అందుకే ఆర్య సంస్కృతిని "ఋషి ప్రోక్తమ్" అంటాం. శాస్త్రాలతో సహా అత్యంత విలువైన వాజ్ఞయ సంపద మనకిచ్చారు. ఇలా నడచుకోమని బోధించారు. సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకునే సంస్కృతిని మనకు దారాదత్తం చేశారు. మానవుల సంతానాన్ని వివాహం చేసుకున్నారు. పిల్లలను కన్నారు. అలా కలిగిన వారి సంతానాన్ని, వారు మనకందించిన జ్ఞానం, వాజ్ఞయ సంపద పరిరక్షిస్తూ సమాజానికి ఉపయోగపడమని, దాన్నే తరతరాలకు అందించమని, సమాజానికి సేవచేయమని చెప్పి, అప్పుడు తపోలోకానికి మరలి పోయారు. ఆ ఋషులు తమ తపోధనాన్ని ధారపోసి అధ్యయనం చేసిన వేదవేదాంగాలను బ్రాహ్మణులకు అప్పచెప్పారు. జీవన విధానం, ఆర్య సంస్కృతి నేర్పారు. అలా ఋషుల నుంచి అందిపుచ్చుకున్న సంస్కృతీ సంప్రదాయాలను, ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్న వారి వంశస్తులే "బ్రాహ్మణులు". పరాయి పాలనలో అవి దెబ్బతినకుండా సంరక్షించుకుంటూ వస్తున్నారీ బ్రాహ్మణులు. "పురోహితులు" గా సమాజానికి మార్గదర్శకులుగా వుంటూ వస్తున్నారు.

            బ్రాహ్మణుడి జీవితం త్యాగంతో కూడుకున్న యజ్ఞం అని అనాలి. దీనికి ఉదాహరణగా అగస్త్య మహర్షి వృత్తాంతం చెప్పుకోవచ్చు. ఎప్పుడూ తపో నిష్టలో వుండే ఆ మహర్షి, తను దేవతలను శాసిస్తే, ఓ రాజు రాజ్యంలో క్షామం పోతుందని తెలిసి, వెనకా-ముందూ ఆలోచించకుండా, అక్కడికి పోయి, తన కమండలంలోని నీళ్లు చేతుల్లోకి తీసుకుని, రాజ్యం సుభిక్షం చేయడానికి తన యావత్ తపోశక్తిని ధారబోశాడు. ఫలితంగా రాజ్యం సుభిక్షమైంది...ఆయన మరలి తపో నిష్టలోకి పోయాడు. అదే మహర్షి తన సొంత కూతురి వివాహం విషయం వచ్చే సరికి, అది తన స్వవిషయం కాబట్టి, తపస్సు ఉపయోగించలేదు. బిక్షాటనకు బయలుదేరాడు. దీన్నే "స్వఛ్చంద బీదరికం" అంటారు. అది బ్రాహ్మణులే చేయగలరు-చేశారు-చేస్తున్నారు కూడా. తపస్సు అంటే వారికి జ్ఞాన సముపార్జన లాంటిది. వారలానే జీవించారు. విలువలను పాటించారు. అలానే జీవించమని తోటి బ్రాహ్మణులకు కూడా ఉద్భోదించారు. అందుకే బ్రాహ్మణుడు విద్యను అభ్యసించేవాడు. యోగ్యుడైన వాడికి తన విద్యను దానం చేసేవాడు. ఇంత చేసి గురుదక్షిణగా కేవలం "ధర్బ పుల్ల" నే తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. వారి జీవన భృతి గురు దక్షిణ కాని, లేదా, బిక్షాటన కాని మాత్రమే. వేరే మార్గంలో పోలేదెప్పుడూ. ఈ క్రమంలోనే నిత్యాగ్నిహోత్రం చేస్తాడు. అందులో లోక కళ్యాణం అనే సంకల్పం తప్ప మరేదీ వుండదు.

            స్వఛ్చంద బీదరికంలో వుంటూనే బ్రాహ్మణుడు, స్వాధ్యాయం, జ్ఞాన సముపార్జన తప్ప మరేదీ ఆలోచించడు. విద్యను అమ్ముకోడు. జీవించడానికి బిక్షాటన చేస్తాడు. అలా బ్రాహ్మణుడి జీవితమంతా త్యాగమే...త్యాగంతో కూడుకున్న యజ్ఞమే! అసలు యజ్ఞం అంటేనే త్యాగం. యజ్ఞానికి త్యాగమే మూలం. బ్రాహ్మణుడి జీవన విధానమే త్యాగంతో కూడుకున్న మహా యజ్ఞం. అగస్త్యుడి లాంటి మహర్షులు తమ వంశంలో పుట్టిన బ్రాహ్మణులను ధర్మంగా జీవించండి, సమాజానికి సేవ చేయండి, సమాజం కోసం బతకండి అని ఆదేశించారు. తమ గురించి ఏమీ ఆలోచించని, కోరని బ్రాహ్మణులను అందుకే "భూ సురులు" అని అంటారు.

సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశం భవిష్యత్ లో బ్రాహ్మణుల సంక్షేమం కోసం ఒక బహుముఖ వ్యూహం రూపొందించుకునేందుకు దోహద పడుతుంది. వైదిక విద్యకు ప్రోత్సాహం, ఆధ్యాత్మిక భావనలు పెంపొందించే వారికి ఆర్థిక చేయూత, సంప్రదాయలు కాపాడే వారికి, ఆధ్యాత్మిక రచనలు చేసే వారిని ఆర్థికంగా ప్రోత్సాహం, బ్రాహ్మణుల విద్య, వైద్య వివాహాది అంశాలకు ప్రాధాన్యత, ప్రతిభావంతులైన పేద బ్రాహ్మణ విద్యార్థులకు తగు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి, యువ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటుకు దారి తీస్తుంది. హైదరాబాద్ లో నిర్మించే బ్రాహ్మణ సదనం బ్రాహ్మణ సమాజోధ్ధరణ వేదికగా ఉపయోగపడుతుంది. వేరే ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, పండితులు వచ్చినా అక్కడ బస చేసే వీలు కలగడంతో పాటు, ఆచార, సంప్రదాయాల పరిరక్షణకు వీలు కలుగుతుంది. ధర్మ సంరక్షణకు, బ్రాహ్మణ సంక్షేమానికి ఇంతకంటె ఇంకేం కావాలి? దీనర్థం...అనాదిగా ధర్మాన్ని, అర్య సంస్కృతిని, నాగరకతను, సంప్రదాయాలను సంరక్షించుకుంటూ వస్తున్న బ్రాహ్మణులకు వాటిని భవిష్యత్ లో కూడా కొనసాగించడానికి ప్రభుత్వ పరంగా చేయూత లభించనుందనే కదా!

బ్రాహ్మణుల సంక్షేమంతో ఈశ్వరుడికి సహితం సంతోషం కలుగుతుందనడంలో అతిశయోక్తి లేదేమో!

8008137012 (M)

Sunday, October 30, 2016

హిందూ వివాహ వేడుక ఒక మరపురాని ఘట్టం-3 : వనం జ్వాలా నరసింహారావు

హిందూ వివాహ వేడుక ఒక మరపురాని ఘట్టం-3
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్ర ప్రభ దినపత్రిక (30-10-2016)

వివాహం ముహూర్తం నాడు పెళ్లికి ముందు-పెళ్ళిలో-పెళ్లైన తర్వాత చేయాల్సిన కార్యక్రమాలెన్నో వున్నాయి. తెలుగు వారి పెళ్ళిళ్లలో ఉండే సందడి, సంతోషం ఎంత మోతాదులో వుంటుందో ఎవరూ చెప్పలేరు. సకుటుంబ పరివార సమేతంగా, బాజా భజంత్రీల నడుమ, సంతోషంగా జరిగే కళ్యాణ మహోత్సవం అందరి జీవితాలలో ఒక మరవలేని సంఘటన. కొందరు కల్యాణ మండపాలను వాడితే మరికొందరు వాడరు. సాధారణంగా పల్లెటూర్లలో కొబ్బరి ఆకుల పందిరి వేయడం వలన మండపం ఆవశ్యకత తగ్గింది. పట్టణాలలో టిప్ టాప్ పందిరి మండపాలు తప్పని సరిగా వాడటం జరుగుతుంది.

ఒక వైపు వధువు గౌరీ పూజ, మరో వైపు వరుడున్న విడిదిలో వర పూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని "లక్ష్మి,పార్వతి,సరస్వతి" ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడిని త్రిమూర్తుల దివ్యస్వరూపంగా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు.

వధువుకు నలుగు స్నానం చేయించి, పెళ్ళికూతురుగా అలంకరించి, కళ్యాణం బొట్టు దిద్ది, పాదాలకు పారాణిని పూసి, పూల జడ వేసి, నూతన వస్త్రాలను కట్టించి (పట్టు చీరె) "గౌరీ పూజ" కు తీసుకెళ్తారు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే, వర పూజ కొరకు విడిదికి వెళ్తారు ఆడ పెళ్ళి వారు. కన్యా దాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో వచ్చి మగ పెళ్ళి వారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. వరపూజలో భాగంగా, ఆడ పెళ్ళి వారు-వారి వైపు బంధువులు వచ్చి, వివాహం చేసుకోవడానికి రమ్మని మగ పెళ్ళివారిని ఆహ్వాని్స్తారు. వరపూజలోనే ఇరువైపువారు, ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించు కోవడానికి "శుభలేఖలు" మార్చుకుంటారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే, కన్యా దాత ఇంట్లో, వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది.

మగ పెళ్లివారందరు కన్యా దాత ఇంటికి చేరుకునే సమయానికి, వధువు గౌరీ పూజ ఇంకా కొనసాగుతూనే వుంది. ఇది ఆచారం-సాంప్రదాయం. బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమాన్ని పొందేందుకు కన్యా వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి "నాయనా నా కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్లమని కన్యా దాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద జరగబోయే వేడుక మొదలవుతుంది. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, "నారాయణ స్వరూపుడైన వరుడికి" పాద ప్రక్షాళన లాంటివి జరిపించి, కన్యా దాత ఆతిధ్యం ఇస్తారు. దీనినే "మధు పర్కం" అని పిలుస్తారు. మధుపర్కం: మధువు అంటే తేనె. కుమార్తెకు భర్తగా వరుడి ఎంపిక తరువాత అతను వధువు తల్లి-తండ్రికి సంప్రదాయాన్ననుసరించి పుత్ర సమానుడౌతాడు. వివాహానంతరం "మధుపర్కం" అంటే తీయటి పానీయం అని అర్ధం. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన వేడుకకై వేచి వుంటాడు. వరుడు పనిలో వున్నప్పుడు, తర్వాత కార్యక్రమం జరిపించడానికి, కన్యా దాత వరుడు నాన్న గారిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న చోటుకెళ్తారు.


గౌరీ పూజ జరిగే చోట ఒక్క సారి, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం-ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి అత్యంత ఆసక్తికరంగా-విన సొంపుగా వుంటుంది. "గోత్రం" అంటే వంశం, "ప్రవర" అంటే వంశం మూల పురుషుల సమాచారం. మీ అమ్మాయిని, మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించమని వరుడి తండ్రి, కన్యా దాతను కోరడమే వేడుక ముఖ్య ఉద్దేశం. "చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు-వశిష్ట, శక్తి, పరాశర త్రయార్షేయ ప్రవరాన్విత యజుర్వేదినే, తైత్తిరీయ శాఖాధ్యాయినే, ఆపస్తంబ సూత్రిణే, ….. …. శర్మణో నప్త్రే, …. … శర్మణ పౌత్రాయ, … …. శర్మణ పుత్రాయ, .. … శర్మణే వరాయ, భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో వ్రణీమహే" ("మూడు ఋషులున్న పరాశరుడితో సమానమైన గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్యసించినవాడూ, వేదం ప్రకారం తన ఇంటి కార్యక్రమాలను నడిపించేవాడూ, తైత్తరీయ శాఖను-ఆపస్తంబ సూత్రాన్ని అభ్యసించి అనుసరించేవాడూ, … మునిమనుమడూ, …. మనుమడూ, …. పుత్రుడూ అయినఅనే వరుడికి మీ కూతురునిచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాం") అని అడుగుతాడు. ఇలా వంశం వివరాలు చెప్పడం వల్ల కన్యా దాత చివరివరకూ ఆలోచించుకునే అవకాశం వుందింకా. ఇవేవీ తెలియకపోతే (అందరి సమక్షంలో), ఫలానావారి పిల్లవాడిని చేసుకున్నాం-ఇప్పుడు అనుభవిస్తున్నాం అని భవిష్యత్‌లో అనవచ్చు.

కన్యా దాత, వరుడి వివరాలు ముత్తాత తరం దగ్గర నుండి విన్న తర్వాత, సంబంధం తనకి ఇష్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా చెప్పి అబ్బాయి తన కూతురుని చేసుకోమని అడుగుతాడు.


గౌరీ పూజ దగ్గర గోత్రం-ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చాలా సరదాగా వుంటుంది. ఇందులోనూ ఒకరకమైన సామాజిక స్పృహ కనిపిస్తుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం కూడా పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని-సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ వేడుకలో వుందంటారు పెద్దలు.

Monday, October 24, 2016

ధర్మం కన్న దైవం మిన్న వనం : జ్వాలా నరసింహారావు

ధర్మం కన్న దైవం మిన్న
వనం జ్వాలా నరసింహారావు
శ్రీపీఠం (అక్టోబర్ 2016)

రామాయణం రసరమ్యం. అందులో అవసరం లేందేదీ లేదు. ప్రతిదీ తెలుసుకోవాల్సిన విషయమే. అయోధ్య కాండలో అలాంటిదే ఒక సంఘటన శ్రీరాముడిని వనవాసానికి వెళ్లమని కైక కోరడం. శ్రీరాముడుని అడవులకు పంపాలని, ఆయన స్థానంలో తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయాలని కైక దశరథుడిని కోరడం, ఆ విషయాన్ని ఆయన మాటగా కైకే స్వయంగా రాముడుకి తెలియచేయడం, రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడానికి అడవులకు పోవడానికి సిద్ధపడి తల్లి కౌసల్య అనుమతి-ఆశీర్వాదం కొరకు ఆమె దగ్గరకు పోవడం, ఆ సమయంలో కౌసల్య, తమ్ముడు లక్ష్మణుడు కైకను దూషించి రాముడు అడవులకు పోవద్దని అభ్యంతర పెట్టడం నేపధ్యంలో ధర్మం, అధర్మం, నీతి, న్యాయం లాంటి విషయాలెన్నో లక్ష్మణుడికి వివరిస్తాడు రాముడు. ధర్మాన్ని మించిన దైవం వుందని, కైక మోసం చేసిందని ఆమె మీద కోప్పడ కూడదని, అందులో ఆమె తప్పేమీ లేదని అంటాడు రాముడు. తనకు పట్టాభిషేకం చేయాలని ప్రయత్నం చేసిన వాడు దశరథుడు కాదని, విఘ్నం కలిగించింది కైక కాదని, తాను అడవుల పాలవడానికి తన దోషం ఏదీ లేదని, ఇవన్నీ కేవలం దైవ కృత్యాలేనని అంటాడు.

విధి చేష్ట ఎలా వుంటుందో సోదాహరణంగా తెలియచేశాడు రాముడు. ఇంకా ఇలా అంటాడు: "ఇంత దూరాలోచన దైవ ప్రేరణ వల్లనే కలిగింది. అలా కాకపోతే తనకు ఏ అపరాధం చేయని నన్ను నిష్కారణంగా కష్టపెట్టాలని కైక మనసుకు కలగడం సాధ్యమా? మన ముగ్గురు తల్లులలో, నా మీద ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ ప్రేమ అని చెప్పడానికి, వారిలో కొంచెమైనా తారతమ్యం కనిపించడం నేను చూడలేదు. ఇదే కైకకు నిన్నటి దాకా తన కొడుకుపై ఎక్కువ ప్రేమ కాని, నామీద తక్కువ ప్రేమ కానీ, విరోధ భావం కానీ లేదు. ఇదంతా ఇవ్వాళే కలగడానికి కారణం చెప్పగలమా? ఉన్నట్లుండి ఇంతటి ప్రేమ, విరోధంగా మారడానికి కారణం దైవం కాకుండా మరెవరు? తన కన్న కొడుకు కంటే నాపై ఎక్కువ ప్రేమగల కైక, ఏ అపరాధం చేయని నన్ను, నిష్కారణంగా కఠినోక్తులు మాట్లాడి, ఊళ్లో కూడా వుండనీయకుండా, అడవులకు పొమ్మని అనడం అంటే, ఇదంతా విధి చేష్టకాకుండా ఇతరుల చేష్ట ఎలా అవుతుంది? ఇతరులకు ఇది సాధ్యం కూడా కాదు".

రాముడు ఇంకా ఇలా అంటాడు:"ఆమె స్వభావ రీత్యా దుష్టురాలు. ఆ దుష్ట స్వభావమే ఇప్పుడామెను ప్రేరేపించింది. ఇక దైవం ఏమి చేసిందంటావా? సహజంగా ఆమె దుష్టురాలు కాదు. ఆమె పుట్టడం తోనే ఆమెతో గుణాలకు తోడు గౌరవం కూడా పుట్టింది. కులం కొలది గుణం అంటారు. ఆమె గొప్ప వంశంలో రాజకుమారిగా పుట్టింది. గొప్ప జాతిలో, గొప్ప వంశంలో పుట్టి, గొప్పవారి సాంగత్యంలో పెరిగిన దానికి నీచగుణం సహజమని ఎలా చెప్పగలం? సాలగ్రామాల గనుల్లో గులకరాళ్లు కూడా వుంటాయికదా? సముద్రంలో విషం పుట్టలేదా? అలా ఐతే బాల్యం నుంచే ఆమె నీచురాలై వుండాలి. అలా కాకుండా, దానానికి, దయకు స్థానంగా కీర్తి సంపాదించింది. సహజంగా నీచురాలైతే ఆమెకు ఈ కీర్తి కలిగేదా? తనతో సమానమైన సవతుల మీద ద్వేషం పెంచుకుంది. అది నీచమే కదా? ఆమె ద్వేషించింది సపత్నీత్వాన్ని కాని సవతులను కాదు. వారు సవతులు కాకపోతే వారిని ద్వేషించేది కాదు. అందరు ఆడవారిని ద్వేషించలేదే? తమ యోగ క్షేమాలకు హాని కలిగిస్తారేమోనని అనుమానం కలిగిన తోటి రాజులను అణచివేసే ప్రయత్నాన్ని పట్టాభిషిక్తులైన రాజులు కూడా చేయడం లేదా? ఒకరికె ఎంతైనా దానం చేయగల కైక పరుల సొత్తును ఎందుకు ఆశించింది? ఎంతో దయా గుణం కల ఆమె ఇలాంటి క్రూరమైన పనికి ఎందుకు సాహసించింది? ఎందుకు భర్తను ఎదిరించింది? ప్రీతిపాత్రుడనైన నన్ను ఎందుకు పనికిమాలిన, బాధాకరమైన మాటలను అనగలిగింది? దైవం ఆవేశించకున్న ఇలా చేయగలిగేదా? సహజమైతే ఇన్నాళ్లు ఎందుకు చేయలేదు? కాబట్టి ఇంత మహిమగలది, ఊహించలేనిది, అసాధ్యమైన ప్రభావం కలదైన దైవం ఎలాంటివారికైనా అందలేనిదే. దానికి ఎదురులేదు. ఆమెకు ఆ దుర్భుద్ధి పుట్టడానికి, నాకు దారిద్ర్యం రావడానికి దైవమే కారణం. ఆ దైవమే ఇంత పని చేసింది"."దైవం వుందనడానికి ప్రమాణం ఏంటి? దైవాన్ని ఎదిరించి ఇలాంటివి జరగకుండా మనం పురుషకారం చేయలేమా? ఒక పని మనం చేస్తున్నప్పుడు దైవం అనేదొకటున్నదని, అదేంటో చేస్తున్నదని, మనకు తెలియదు. ఫలితం కలిగేటప్పుడు మాత్రం ఆ దైవం కనపడి అదెలా చేయదల్చుకున్నదో, అలానే చేస్తుంది. ఫలితంలో మాత్రం కనిపించి, వేరే విధంగా కనిపించక, ఆ కారణం వల్ల దానిని జయించలేక సతమతమయ్యే మనం దైవంతో పోరాడగలమా? అది ఏ రూపంలో, ఎలా, ఏం చేస్తున్నదో మనకు తెలియనప్పుడు దానితో పోరాటం చేయగలమా? ఎలా చేస్తాం? ఫలానా సమయంలో, ఫలానా కార్యం సాధించేందుకు, ఫలానా సాధనాలను (దైవం) సిద్ధం చేసుకుని వుందని మనకు ముందే తెలుస్తే కదా, మనం ప్రతీకారం చేయగలం? కార్యస్వరూపంలో కనిపించకుండా, ఫలితం స్వరూపంలో కనిపించేదే దైవం. కాబట్టి దైవం వుందనడానికి అనుమానమే ప్రమాణం...బుద్ధి బలంతో మాత్రమే దానిని ఊహించగలం. కారణం లేకుండా కార్యం జరగదు. నిష్కారణం అంటే...కారణం మనకు తెలియదని అర్థమే కాని, కారణం లేదని అర్థం కాదు. కాబట్టి, మన సంతోషానికి, సౌఖ్యానికి, వ్యసనానికి, శాంతికి, రోషానికి, లాభనష్టాలకు, జననమరణాలకు, మరెన్నో ఇతర ఫలితాలకు....వేటినైతే కారణం లేకుండా కలుగుతున్నాయని అనుకుంటామో, వాటన్నిటికీ మూలకారణం దైవమే సుమా! ఇది తప్పదయ్యా తప్పదు!".

"పామరులమైన మన సంగతలా వుంచితే, ఘోరమైన తపస్సు చేసి, ఎంతో జ్ఞానాన్ని-మహిమను సంపాదించి, నిత్యనియమవ్రతులై, శాంతులై, నిష్కాములై, అడవిలో ఒక మూల నివసించే మునులు కూడా దైవాన్ని ఎదిరించి ఏమీ చేయలేరు. ఇలాంటి వారిలో కొందరు హటాత్తుగా కామానికి, కోపానికి లోబడి, దీర్ఘకాలంగా అభ్యసిస్తున్న నియమనిష్ఠలను నీటిపాలుచేసి, మర్యాద తప్పి, భ్రష్టులై పోవడం దైవ చేష్ట కాదా? పురుష ప్రయత్నంలో ఏ లోపం వుంది? విశ్వామిత్రుడంతటి వాడే నిమిషంలో కామానికి, క్రోధానికి వశుడై చెడి పోయాడో విన్నాం కదా? శివుడు కూడా అలానే అయ్యాడు కదా? ఎప్పుడు కూడా ఇదిలా జరుగవచ్చని ఊహించని పనులు తటాలున వున్నట్లుండి అయిపోవడం, అందరూ తప్పక అవుతుందనుకున్న కార్యం విఘ్నం కావడం లాంటివన్నీ దైవ చేష్టలే! ఇది సత్యం. ఈ విధంగా సప్రమాణంగా, నిస్సందేహంగా నిశ్చయించుకుని, ఇతరుల ఉపదేశాల వలనే కాకుండా, నాలో నేనే కార్యాచరణ ఆలోచించాను. ఇది దైవ కృత్యమని, దీనిలో మన దోషం లేదని, కైక నిమిత్త మాత్రమేనని, ఆమె దైవానికి సాధనం అయిందని, సాధించేది దైవం మాత్రమేనని, నాకు అర్థమైంది. దానివల్ల నాకు వ్యసనం, బాధ కలగలేదు. లక్ష్మి పోయింది...దారిద్ర్యం వచ్చింది అని దుఃఖించవద్దు. నా అభిప్రాయంలో, లెక్కింపనలవి కాని ఈ రాజ భోగాలు, అరణ్యవాసం, రెండూ ధర్మ కార్యాలే. రెండూ ఒకటిగానే అనిపిస్తున్నది. ఒక విధంగా ఆలోచిస్తే, వనవాసమే సుఖమనిపిస్తున్నది. ఎందుకంటే...రాజభోగం సుఖరూపక దుఃఖం; వనవాసం దుఃఖరూపక సుఖం. రాజభోగం ఇప్పటికి సుఖంగా కనిపించినప్పటికీ, నిర్వహణలో దుఃఖంతో కూడుకున్నదవుతుంది. వనవాసం నిశ్చింతం. నిరుపద్రవం. పుణ్యఫలదం. కాబట్టి, తాత్కాలికంగా దుఃఖంగా తోచినప్పటికీ, పోనుపోను సుఖమిస్తుంది. సుఖాన్ని, దుఃఖాన్ని ఇచ్చేవారెవరూ లేరు. ఎవరో ఇతరులు అవి కలిగిస్తారని మనం అనుకుంటాం. నేనే ఈ పని చేశాననడం వృధాభిమానం. ప్రతి మనిషి తాని చేసిన కర్మకు కట్టుబడి వున్నాడు. కైకలో స్వతస్సిద్ధమైన దోషం లేదు. పిశాచం పట్టిన వారు, సన్నిపాత జ్వరంతో బాధ పడేవారు, దూషించినప్పుడు, అది రోగబలమంటామే కాని వ్యక్తిని తప్పు పట్టం కదా? అలానే, దైవం కైక నోటి నుండి ఇలాంటి కీడు మాటలు పలికించింది. కైక మీద కోప్పడి ప్రయోజనం లేదు".

శ్రీరాముడు చెప్పినదంతా విన్న లక్ష్మణుడు ఆయనతో విభేదించి ఇలా అంటాడు: "కైకేయీ దశరథుల ఆలోచనను నువ్వు దైవ తంత్రంగా పోల్చావు. అలాంటి దైవం నాకిష్టం లేదు. కుట్రలు ప్రేరేపించు దైవం ఎలా దైవం అవుతుంది? ఎలా పూజ్యనీయమవుతుంది? బలం లేనివారు, అల్ప తేజస్సు కలవారు దైవ బలం అంటారు. ఎందుకు? వాళ్లకు కార్యసాధనకు కావాల్సిన బలం, తెలివితేటలు లేకపోవడం వల్ల, నింద తమ మీద వేసుకోకుండా దైవం మీద పెట్తారు. ఇక బలవంతులు, కీర్తిని కోరేవారు, దైవం అనేదొకటున్నదని కలలో కూడా అనుకోరు. పురుషకారంతో స్వకార్యాన్ని సాధించి కీర్తిని పొందుతారు. అలాంటివారిని దైవం ఏం చేస్తుంది? బలం గల గొప్పవాడు పౌరుష బలంతో దైవాన్ని దగ్గరకు రాకుండా తరిమికొట్టి, చివరకు, దైవం వల్ల ఏ బాధ పడకుండా, సమర్థతతో తన పని తాను చేసుకుంటాడు. నువ్వు దైవ బలం ఎక్కువ అంటున్నావు. నేను పురుష బలం ఎక్కువ అంటున్నాను".

కైకేయిని దూషించవద్దని లక్ష్మణుడితో రాముడంటాడు. రాజ్యాభిషేక విఘ్నం ఆమె చేసింది కాదని, దైవకృతం అని, ఆమె నిమిత్త మాత్రమే అని, ఆమె మీద కోప పడవద్దని, దైవమే మేలు-కీలుకు కారణం అని, ఆమెకు ఆ బుద్ధి కలిగించింది దైవమే అని, అలా కాకుంటే తన మీద ఎంతో ప్రేమ కలిగిన ఆమెకు నిమిషాల్లో విషమ బుద్ధి ఎందుకు కలిగిందని, దైవం అప్రతిహతమని, అలాంటి దైవంతో ఎవరు పోరగలరని, రాముడు సమాధానం చెప్పాడు. బదులుగా లక్ష్మణుడు...రాముడు చెప్పింది సరైంది కాదని, దైవం పరాధీనమైందని, అది స్వతంత్రించి ఏ పనీ చేయలేదని, అలాంటి దాన్ని నమ్ముకుని, దైవం ఇస్తుందని పురుష ప్రయత్నం చేయకుండా వుండడం సరికాదని అంటాడు. దైవం కంటే పౌరుషమే శ్రేష్టమని లక్ష్మణుడు వాదించాడు.

మహాభారతంలో చెప్పినట్లు, లోకం దైవాన్ని ఆలంబనంగా తీసుకుని పురుషకారంలో ఉదాసీనులు కాకూడదు. మనుష్యుడు చేయాల్సిన కర్మం చేయకుండా దైవమే ఇస్తాడని భావించకూడదు. ఇలాంటి మాటలు చూస్తుంటే, దైవం కంటే పౌరుషం బలమని అనిపిస్తుంది. రాముడు దైవమే బలిష్టమని అన్నాడు. దైవ-పౌరుషాలకు పరస్పర విరోధం కనిపిస్తున్నది. ఇదెలా అంటే....పురుషకారం లేకుండా దైవం ఏ కార్యం చేయలేదు...అలానే, దైవ సహాయం లేకుండా ఏ కార్యం ఫలించదు. కాబట్టి ఏదైనా ఫలితం కావాలంటే రెండూ అవసరమే! ఇదిలా వుంటే...రామచంద్రమూర్తి ఎందుకు పురుషకారానికి అనమతి ఇవ్వలేదు? ఆయన అభిప్రాయం ప్రకారం...పురుష ప్రయత్నం వ్యర్థం...దైవమే కార్యసాదకం. నిజంగా అలాంటి అభిప్రాయమే ఆయనకుంటే, సీతకొరకై పురుషకారం చేసి వుండేవాడు కాదు. దైవమే సీతను తెచ్చి ఇస్తుందని వూరకే వుండేవాడు. ధర్మ విరుద్ధ పురుషకారం శ్రీరాముడికి సమ్మతం కాదు. లక్ష్మణుడి పురుషకారానికి ప్రధమ కబళం దశరథుడు. రాజ్యం కోసం తండ్రిని పీడించిన వాడవుతాడు. అందుకే రాముడొప్పుకోలేదు. రాముడు పురుషకార విరోధి కాదు. అలానే, అన్న అరణ్యాలకు పోయి కష్టపడడం ఇష్టం లేక, ఎలాగైనా అయోధ్యలోనే ఆయన వుండేట్లు చేయడానికి సద్భావంతో లక్ష్మణుడు రాముడితో వాదించాడే కాని ఆయన దైవ విరోధి కాదు. అలాంటప్పుడు లక్ష్మణ వాదన సాధువాదమా? దుర్వాదమా? అని విచారించాలి.


          రామాయణంలో సీతారామలక్ష్మణుల చరిత్ర వల్ల, వారి మాటల వల్ల, బోధ పడేదేంటంటే...పౌరుషం కంటే దైవమే ప్రబలం కాబట్టి, దైవాన్నే సేవించాలనే విషయం. భారతంలో కూడా ఇదే చెప్పబడింది. కాబట్టి మనుష్యులు దైవాన్ని ధిక్కరించి పౌరుషాన్నే ఆశ్రయించక దైవాన్ని ఆశ్రయించి, యథాశక్తి, యథాశాస్త్రం ప్రకారం, నిష్కాములై స్వకర్మలు చేయాలి. రామాయణంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే. భగవద్గీతోపదేశం కూడా ఇదే. రాముడు చెప్పిన ప్రతి మాట అందరికీ అన్ని వేళలా వర్తిస్తుందనడంలో సందేహం లేదేమో! END

అయోధ్య తీర్పు ఒక విజ్ఞాన సర్వస్వం : వనం జ్వాలా నరసింహారావు

అయోధ్య తీర్పు ఒక విజ్ఞాన సర్వస్వం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (25-10-2016)

          సరిగ్గా అరేళ్ల క్రితం ఇదే అక్టోబర్ మాసంలో ఏ పత్రిక చదివినా, ఏ ఎలెక్ట్రానిక్ మీడియా వీక్షించినా అత్యంత ప్రముఖంగా కనిపించిన-వినిపించిన ఏకైక అంశం, అయోధ్య వివాదంపై సెప్టెంబర్ 30, 2010 న వెలువడిన అలహాబాద్ హైకోర్ట్ సెక్యులర్ తీర్పు గురించే. సుదీర్ఘమైన ఆ తీర్పులో న్యాయమూర్తులు ఋగ్వేదం, కార్ల మార్క్స్, ఖురాన్, ఇక్బాల్, ప్రొఫెట్ మహమ్మద్, డార్విన్ లాంటి అనేక సనాతన, అధునాతన పుస్తకాల్లోని మహనీయుల మాటలను ఉటంకించారు. తీర్పిచ్చిన ముగ్గురు న్యాయమూర్తులలో ఇద్దరు వారు చదివిన తీర్పు ముందు-చివర పేర్కొన్న వాటిల్లో ఆసక్తికరమైన, పరిశోధనలకు కావాల్సిన అనేకానేక విషయాలున్నాయి. వారి తీర్పులో న్యాయమూర్తులు అనేక ఆధారాలను చూపిస్తూ, పేర్కొన్న ఉదాహరణలు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, సంస్కృత భాషల్లో ఉన్నాయి. వేదాలు, పురాణాల ఉదాహరణలు సహితం తీర్పులో చోటుచేసుకున్నాయి. ఎనిమిదివేల పేజీల పైనున్న ఆ తీర్పు పాఠం ఒక మోస్తరు "విజ్ఞాన సర్వస్వం" అనవచ్చేమో !

          ఈ కేసులో ముగ్గురు న్యాయమూర్తులు వేర్వేరుగా తమ తీర్పులు రాశారు. త్రి సభ్య ధర్మాసనంలోని జస్టిస్ ఎస్.యూ.ఖాన్, జస్టిస్ సుధీర్ అగర్వాల్ అనేక అంశాలపై ఏకీభవించారు. సీనియర్ న్యాయమూర్తి డి.వి. శర్మ, వివాదాస్పద స్థలం మొత్తం రామ జన్మభూమిగా ప్రకటించారు. అయితే... స్థలాన్ని మూడుగా విభజించి, ముగ్గురి కి కేటాయించాలన్న ఇద్దరు న్యాయమూర్తుల తీర్పు 'మెజారిటీ'గా నిలిచింది. అదే... హైకోర్టు అంతిమ తీర్పు అయ్యింది. వివాదాస్పద కట్టడం మసీదే అని జస్టిస్ ఖాన్ భావిస్తే, దానికి మసీదు లక్షణాలు లేవని జస్టిస్ శర్మ అభిప్రాయపడ్డారు. మసీదు కోసం మందిరాన్ని కూల్చలేదని జస్టిస్ ఖాన్ పేర్కొనగా... మందిరాన్ని కూల్చి ఆ శిథిలాలపైనే వివాదాస్పద కట్టడం నిర్మించారని జస్టిస్ శర్మ తెలిపారు. వివాదాస్పద ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేసి వాటి యాజమాన్య హక్కులను సున్నీ వక్ఫ్ బోర్డుకు, నిర్మోహీ అఖాడాకు, రామ్‌లాలాకు అప్పగిస్తూ తీర్పిచ్చింది. బాబ్రీ మసీదుకున్న మూడు గుమ్మటాలను 1992లో కరసేవ చేసి కూల్చేసిన తర్వాత, ప్రధాన గుమ్మటం కింద రామ్‌లాలా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏర్పాటుచేసిన తాత్కాలిక ఆలయం వున్న స్థలాన్నే రామ జన్మభూమిగా కోర్టు నిర్ణయించింది. దీన్నే రామ జన్మభూమి న్యాస్ ట్రస్టుకు కేటాయించింది. ఆ స్థలానికి రెండువైపుల వున్న సీతా రసోయి, రామ్ చబూత్రా స్థలాలను నిర్మోహి అఖారాకు ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది. రామ జన్మభూమికి, నిర్మోహి అఖారాకు ఇచ్చిన తర్వాత మిగిలిన స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకి ఇవ్వాలని, ఒకవేళ ఇతరులతో సమానంగా స్థలం లభించకపోతే పక్కనే కేంద్ర ప్రభుత్వం సేకరించిన భూమిలోంచి ఆ భాగాన్ని ఇవ్వాలని కూడా తీర్పిచ్చింది న్యాయస్థానం.

          విశ్వాసాల, నమ్మకాల, చారిత్రాత్మక కట్టడాల నేపధ్యం, చారిత్రిక సాక్ష్యాధారాలు, స్వాధీన అధీనం ప్రాతిపదికలుగా, అనేకానేక పరిశోధనాత్మక సాక్ష్యాధారాలను ప్రామాణికంగా చేసుకుని వెలువరించిన ధర్మాసనం తీర్పిది. సుమారు నూటాపాతికేళ్ల సుదీర్ఘ అనిశ్చిత స్థితికి ఎవరినీ ఎక్కువగా నొప్పించకుండా... దాదాపు అందరికీ అంతో-ఇంతో ఆమోదయోగ్యమైన విధంగా, ఒకరు గెలిచామని పొంగిపోకుండా... వేరొకరు ఓడిపోయామని ఆవేదన చెందకుండా..ఎవరినీ అసంతృప్తికి గురిచేయకుండా ఇచ్చిన తీర్పిది. సంతృప్తికి హద్దులుండవు...అసంతృప్తికి పరిమితులుంటాయి...అందుకే అందరికీ అమోదయోగ్యమైంది. ఎక్కువమంది తగు మోతాదులో సంతృప్తి పడేందుకు అనుకూలమైంది.

          జస్టిస్ సుధీర్ అగర్వాల్ తన తీర్పు పాఠాన్ని ఋగ్వేదంలోని సంస్కృత శ్లోకాలతో ఆరంభించారు. "ప్రళయావస్థలో శూన్యం తప్ప ఏమీ లేదు. కేవలం పంచ భూతాలు మాత్రమే వుండేవి. ఏ లోకమూ లేదు. భూమ్యాకాశాలూ లేవు. అలాంటప్పుడు ఎవరు ఎవరిని కదిలించారు? ఎలా కదిలించారు? అంతా అనిశ్చిత స్థితే!" అని మొదలవుతుందా శ్లోకం. అలా కొనసాగిస్తూ, చావు పుట్టుకలు అప్పుడు తెలియదని, సూర్యచంద్రులు వున్నారో-లేరో తెలియనందున రాత్రి-పగలు తేడా లేదని అంటూ, ఆ సమయంలో ఎవరికీ అంతుచిక్కని ఒక పర బ్రహ్మ స్వరూపం, తన శక్తితో సృష్టి ప్రక్రియను ప్రారంభించాడని, ఆ శక్తికి అతీతమైంది మరేదీ లేదని పేర్కొన్నారు. "సృష్టికి పూర్వం అంతా శూన్యమే. అంతా చీకటిమయం. అంతటా జలమయం. సృష్టి ఎలా, ఎప్పుడు ప్రారంభమైందో ఎవరికీ తెలియదు. అన్నీ తెలిసిన పండితులకు, మేధావులకు కూడా తెలిసే అవకాశం లేదు-ఎందుకంటే వారంతా సృష్టి తర్వాతే పుట్టారు కనుక. సృష్టికి కారకుడైన ఆ శక్తే సృష్టిని కొనసాగిస్తున్నదా, లేక, మరెవరన్నా చేస్తున్నారా? అనేదీ అంతుచిక్కని విషయమే. అసలా శక్తికి కూడా తెలుసో, లేదో?" అని ఆరంభించి, వివాదం విషయం ప్రస్తావిస్తారు న్యాయమూర్తి అగర్వాల్. ఇక అక్కడినుంచి స్థాన వర్ణన, వివాదాస్పద నిర్మాణం, కోర్టు దావాల వివరాలలోకి పోతారు.


          జస్టిస్ సుధీర్ అగర్వాల్ తన తీర్పు చివర్లో, ఇదో "జైగాంటిక్, హెర్క్యూలియన్ టాస్క్" అని వర్ణించారు. తీర్పు అనుబంధంలో, న్యాయమూర్తులు పరిశీలించిన అనేక పుస్తకాల వివరాలను ఇచ్చారు. వాటిలో, ఇంపీరియల్ గెజెటీర్స్ తో సహా రకరకాల ఇతర గెజెటీర్స్, మహమ్మదీయుల చట్టాలకు సంబంధించిన పుస్తకాలు, మొగలాయిల డాక్యుమెంట్లు, హోలీ ఖురాన్, బాబర్ నామా, శ్రీ గురు గ్రంధ సాహిబ్, హెగెల్ చరిత్ర తత్వ శాస్త్రం (ఫిలాసఫీ ఆఫ్ హిస్టరీ), రోమిలా థాపర్ రాసిన భారత దేశ చరిత్ర, కుష్వంత్ సింగ్ సిక్కుల చరిత్ర, ఆర్ సి మజుందార్ భారత దేశ చరిత్ర, వివిధ భాషలలోని నిఘంటువులు, హిందూ మత నిఘంటువు, హ్యూయన్ సాంగ్ జీవిత చరిత్ర, ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా తో సహా అనేక విజ్ఞాన సర్వస్వాలు, ఆర్కియాలాజికల్ సర్వే నివేదికలు, స్వామి వివేకానంద రచనలు, ఆనంద రామాయణం, వాల్మీకి రామాయణం, రామ చరిత్ర మానస, భగవద్గీత, కాళిదాసు రఘువంశం, అధర్వ వేద సంహిత, రుగ్వేదం, రుగ్వేద సంహిత, సామవేదం, శుక్ల యజుర్వేదం, బృహదారణ్యక ఉపనిషత్తు, బృహస్పతి స్మృతి, మను స్మృతి, ధర్మశాస్త్రాలు, మత్స్య పురాణం, మేఘ దూత, నారదీయ ధర్మ శాస్త్రం, నారద స్మృతి, పురుష సూక్తం, శాకుంతలం, శుక్రనీతి, స్కంద పురాణం, యాజ్ఞవల్క్య స్మృతి లాంటివి వున్నాయి.

          జస్టిస్ ఎస్ యు ఖాన్ తీర్పు ఆరంభం చేసిన విధానం మరింత ఆసక్తికరంగా వుంది. అవతారిక, ముందుమాటలతో ఆరంభించారాయన. అవతారికలో, పదిహేను వందల గజాల స్థలం ఒకచోట వుందని, అందులో దేవతలు వెళ్లడానికి కూడా జంకుతారని, ఎందుకంటే ఆ జాగా నిండా మందుపాతరలు అమర్చబడి వున్నాయని పేర్కొని ముందుకు సాగుతారు. "ఆ మందుపాతరలను తొలగించే బాధ్యత మాపై పడింది. వాటి జోలికి పోవద్దని ఉత్తములు కొందరు సలహా ఇచ్చారు. మాకు కూడా ఆదరాబాదరాగా వెళ్లి మూర్ఖుల ఆగడానికి బలి కావాలని లేదు. కాకపోతే, సాహసం చేయక తప్పదు-ప్రమాదాన్ని ఎదుర్కోక తప్పదు. అవసరం కలిగినప్పుడు, తప్పనప్పుడు, ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి రిస్క్ తీసుకోకపోవడమే, జీవితంలో మనకెదురయ్యే పెద్ద రిస్క్" అంటారు జస్టిస్ ఖాన్. "ఒకానొక సందర్భంలో మానవుడి ముందు దేవతలు మోకరిల్లాల్సి వచ్చిందట. తనకు లభించిన అరుదైన గౌరవానికి మానవుడు న్యాయం చేకూర్చాల్సిన బాధ్యతుంది. మాకు అలాంటి అవకాశం వచ్చింది. మేము సఫలమయ్యామా? విఫలమయ్యామా? తమ వ్యాజ్యంలో తామే న్యాయమూర్తులు కాలేరు" అని అంటూ, తాను చెప్పబోయే తీర్పుకు ముందుమాట చదువుతారు. మసీదు కూల్చి వేసిన రోజుల్లో దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఒక పత్రికలో వచ్చిన సంపాదకీయాన్ని ఉటంకిస్తూ పేర్కొన్నారు తన తీర్పులో. అంత క్లిష్ట పరిస్థితుల్లోను ప్రజలంతా ఐకమత్యంతో వుండడాన్ని వివరిస్తూ, "సారీ జహాః సే అచ్చా హిందుస్థాన్ హమారా" అన్న గీతాన్ని ఇనుమడించిన ఉత్సాహంతో ఆలపించా మంటారు. ముఖ్యంగా అందులోని "మజ్హాబ్ నహీ సిఖాతా ఆపస్ మె బైర్ రఖ్నాచ..." అనే చరణాలను గుర్తుచేసుకుంటారు.

జస్టిస్ ఎస్ యు ఖాన్ తన తీర్పు పాఠాన్ని ఉపసంహారం తొ ముగించారు. ఆసాంతం ఆయన తీర్పులో పలు ఆసక్తికరమైన అంశాలను చేర్చారు. చరిత్ర, పురావస్తు, ప్రాచీన శిల్ప శాస్త్రాలకు సంబంధించిన విషయాల్లో తానంత లోతుగా వెళ్ళ లేకపోయానని, దానికి నాలుగు కారణాలున్నాయని అంటారు జస్టిస్ ఖాన్. మొదటిది వ్యాజ్యాలను నిర్ణయించడానికి వాటి అవసరం అంతగా లేదని తాను భావించడం. ఒకవేళ తానలా వాటి మూలాల్లోకి పోయినట్లయితే, ఆ మార్గంలో, తనకు "నిజం అనే నిధి" లభ్యమవుతుందా, లేక, "అస్పష్టమైన కఠోర భ్రమ" మిగులుతుందా తెలియదంటారాయన. చారిత్రక విషయాల గురించి అంతగా పరిజ్ఞానం లేని తాను, చరిత్రకారుల సంకట జ్వాలల్లో ఇరుక్కోవాలని లేదంటారు. సివిల్ వ్యాజ్యాల్లో చరిత్ర సాక్ష్యాధారాలకు అంతగా స్థానం లేదని సుప్రీం కోర్టు గతంలో ఒక తీర్పులో చెప్పడం మరో కారణమంటారు. ఏదేమైనా తాము చెప్తున్న తీర్పు తుది నిర్ణయం కాదని, అసలైన నిర్ణయాత్మక దశ మున్ముందు రానున్నదని, ఆ దిశగా ఇరు పక్షాల వారికి తానొక సూచన చేయదల్చుకున్నానని ఉపసంహారంలో పేర్కొన్నారు జస్టిస్ ఖాన్.

          రాము డంటే త్యాగానికి మారు పేరని, ఆయన గుణగణాల్లో త్యాగానికే ప్రాధాన్యత అధికమని అంటారు జస్టిస్ ఖాన్. అలాగే ప్రాఫెట్ మొహమ్మద్ ప్రస్తావనా తెచ్చారు. హుదయ్ లియా వద్ద, ప్రాఫెట్ మొహమ్మద్ విపక్ష బృందంతో ఒప్పందం కుదుర్చుకోవడాన్ని, ఆయన బలీయమైన మద్దతు దార్లతో సహా పలువురు, మొహమ్మద్ లొంగుబాటుగా భావించారని, ఖురాన్ మాత్రం ఆ సంఘటనను మొహమ్మద్ విజయంగా వర్ణించిందని పేర్కొన్నారు. అదే నిజమైందని, అనతికాలంలోనే ముస్లింలు ఒక్క నెత్తురు బొట్టు కూడా చిందకుండా మక్కాలోకి ప్రవేశించే వీలు కలిగిందని అంటారు న్యాయమూర్తి ఖాన్. డిసెంబర్ 6, 1992 నాటి మసీదు కూల్చివేత సంఘటనను ప్రస్తావించి, అలనాటి భారతీయుల సర్దుబాటు ధోరణిని అభినందనీయమంటారు. అయితే, అలాంటి సంఘటనలు మరల తలెత్తవని, అలా మళ్లీ జరుగు తే, కోలుకోవడం కష్టతరమవుతుందని అభిప్రాయ పడ్డారు. వర్తమాన కాలంలో ప్రపంచ గమనం వేగవంతమైందని, 1992 లో లాగా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో చితికిపోవచ్చని అంటారు. "వతన్ కీ ఫికర్ కర్ నాదా ముసీబత్ ఆనే వాలీ హై..." అన్న ఇక్బాల్ కవి వాక్యాలను, డార్విన్ చెప్పిన మాటలను ఉదహరించారాయన. "సహ యోగం చేసిన, మెరుగు పడిన జాతులు మాత్రమే మనుగడ సాధించగలిగాయి" అని చెప్పిన డార్విన్ మాటలను గుర్తుచేశారు.

          ఇతర మతాలవారితో ముస్లింల సంబంధ బాంధవ్యాలకు సంబంధించి ఇస్లాం బోధనలేంటో తెలుసుకునేందుకు యావత్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తున్న విషయం ముస్లింలు లోతుగా ఆలోచించాలంటారు జస్టిస్ ఖాన్. విరోధం, శాంతి, స్నేహం, ఓర్పు లాంటి సందేశంతో ఇతరులను మెప్పించే సమయం కొరకా, లేక, ఎక్కడ-ఎప్పుడు వీలుంటే అప్పుడు దెబ్బతీసే సమయం కొరకా ఎదురు చూస్తోంది? అని ప్రశ్నించారాయన. ముస్లింలు భారత దేశంలో అద్వితీయమైన స్థానంలో వున్నారని, వాళ్లు ఒకప్పుడు పాలకులు గాను, మరొకప్పుడు పాలించబడిన వారి గాను వున్నప్పటికీ, ప్రస్తుతం, జూనియర్లగానైనా అధికారంలో భాగస్వాములయ్యారని అంటారు. వారిక్కడ మెజారిటీలో లేకపోయినా, ఉపేక్షించదగిన మైనారిటీలో లేరని, ఇండొనేషియా తర్వాత అధిక సంఖ్యాక ముస్లింలుండేది భారతదేశంలోనేనని పేర్కొన్నారు. చాలా దేశాల్లో వారు మెజారిటీలో వున్నప్పటికీ అక్కడి సమస్యల పట్ల నిర్లిప్తతతో-ఉదాసీనతతో వుంటారని, మైనారిటీలో వున్న దేశాల్లో వారి ఉనికిని గుర్తించకపోవడం జరుగుతున్నదని అంటారు. భారత దేశంలోని ముస్లింలు మత పరమైన విద్యాభ్యాసాన్ని, పరిజ్ఞానాన్ని తర తరాల అపారమైన వారసత్వ సంపదగా పొందారని, అందువల్ల, యావత్ ప్రపంచానికి అసలు విషయాన్ని తెలియ పరిచే దిశగా పయనించడానికి సరైన స్థానంలో వున్నారని, ఆ దిశగా ఈ వివాద పరిష్కారాన్ని ఎరుక పరిచే విధంగా తమ పాత్ర పోషించాలని సూచించారు జస్టిస్ ఖాన్.

          జస్టిస్ ధరమ్ వీర్ శర్మ మాత్రం ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే తీర్పు రాశారు.


          తీర్పు వెలువడిన తరువాత దానిలోని కొన్ని అంశాలను సవాలు చేస్తూ అఖిల భారతీయ హిందు మహాసభ, సున్నీ వక్ఫ్ బోర్డ్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా కోర్టు స్టే మంజూరు చెసింది. అలహాబాద్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుపై వ్యాఖ్యానిస్తూ ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం, ఎవరూ కోరక పోయినా, స్థలాన్ని విభజించడం ఎందుకని ప్రశ్నించింది. వివాదానికి సంబంధించిన అనేక విషయాలు అరబిక్, పర్షియన్, సంస్కృతం, హింది, ఉర్దు, పంజాబీ భాషల్లో వున్నందున, వీటన్నింటినీ ఆంగ్లంలోకి తర్జుమా చేసి చదివి పరిశీలించాల్సిన అవసరం వున్నందున బహుశా వాదనలు వినిపించడానికి చాలా కాలం పట్టవచ్చు నేమో! End