Saturday, December 31, 2011

రాజకీయ మ్యాచ్‌ ఫిక్సింగ్‌!: వనం జ్వాలా నరసింహారావు


2011 సంవత్సరంలో ఏం జరిగింది?

తడబడినా..... ఆత్మవిశ్వాసం దిశగా! -3
వనం జ్వాలా నరసింహారావు

ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో వున్న వారితో సహా, వివిధ రకాల ఆరోగ్య రుగ్మతల వల్ల, క్రమేపీ ఆరోగ్యం క్షీణించి, పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకున్న వారికి కూడా, అత్యవసర వైద్య సహాయం-అత్యవసరంగా-సకాలంలో లభించేందుకు, "చికిత్సా నిరాకరణ" ను అడ్డుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న వైద్య విధానాన్ని అమల్లోకి తేవాలనుకుందీ సంవత్సరం. ఈ ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చేందుకు, రాష్ట్రవ్యాప్తంగా, సుమారు రెండువందల ప్రభుత్వ-ప్రయివేటు ఆసుపత్రులను తొలిదశలో ఎంపిక చేయదలిచింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల, ప్రాణాపాయ స్థితిలో వుండి, అకాల మరణం పాల్పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు మెరుగయ్యాయి. తొలుత రెండువందల ఆసుపత్రులకే పరిమితం చేయదల్చుకున్న ప్రభుత్వ నిర్ణయం దరిమిలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు విస్తరించవచ్చని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. అత్యవసర పరిస్థితుల్లో చికిత్సా నిరాకరణ నేరంగా పరిగణించే ఆలోచన ఈ ఏడాది చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర వైద్య విధానం సంపూర్ణంగా కార్యరూపం దాలిస్తే, ప్రాణాపాయ స్థితిలో వచ్చిన బాధితులు డబ్బులు చెల్లించ లేకపోయినా, వైద్య సేవలు అందించలేమని చెప్పి వెనక్కు పంపడానికి వీలు లేదు.  

2011 ఏప్రిల్ నెలలో తరచుగా వినిపించిన పదం "మాచ్ ఫిక్సింగ్". ఒక అ నైతిక ఒప్పందంగా "మాచ్ ఫిక్సింగ్" అనే మాట ముద్ర పడింది. ఆ తరహా "అప నమ్మకం" అనే ఆయుధాన్ని రాష్ట్ర రాజకీయ నాయకులు విపరీతంగా వాడకంలోకి తెచ్చారు. దానికి మీడియా తన వంతు సహకారాన్ని అందించ సాగింది. మీడియా-రాజకీయ నాయకుల మధ్య "మాచ్ ఫిక్సింగ్" స్థాయికి ఎదిగిందా అపనమ్మకం ఆయుధం. ఉదాహరణలుగా ఎన్నో చెప్పుకోవచ్చు. శాసన సభలో వై ఎస్ జగన్మోహన రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్-తెలుగు దేశం పార్టీల మధ్య "మాచ్ ఫిక్సింగ్". అంటే ఆ రెండు పార్టీల మీద ప్రజల్లో అపనమ్మకం కలిగించడానికి జగన్ వర్గీయులు వాడిన ఆయుధం. అలానే కాంగ్రెస్-జగన్ వర్గాల మధ్య "మాచ్ ఫిక్సింగ్" ఆరోపణను తెలుగు దేశం పార్టీ కొంత కాలం ప్రచారం చేసి, తరువాత జగన్-బిజెపి ల మధ్య "మాచ్ ఫిక్సింగ్" అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీతో గళం కలిపింది. స్థానిక సంస్థలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ఆ మూడు ప్రధాన రాజకీయ పార్టీలలో, ప్రతి పార్టీ నాయకులు, ఇతర రెండింటి మధ్య "మాచ్ ఫిక్సింగ్అన్న ప్రచారం చేసిన సందర్భాలున్నాయి. సోనియా-జగన్ ల మధ్య "మాచ్ ఫిక్సింగ్గురించి బిజెపి ప్రచారం చేసిన సందర్భం కూడా వుంది. తామేంటో, తమ వ్యూహం ఏంటో, గెలుస్తే తమ పంథా ఎలా వుండబోతుందో తెలియచేయాల్సిన రాజకీయ పార్టీలు, దాన్ని గాలికి వదిలేసి, ప్రత్యర్థుల పై ఓటర్లలో అప నమ్మకం కలిగేలా వ్యవహరించడం విడ్డూరం. చంద్రబాబు నాయుడు బాబ్లీ విషయంలో చేసిన ఉద్యమాన్ని కూడా అప నమ్మకం కోణంలోనే ఆయన వ్యతిరేకులు వాడుకున్నారు తప్ప, ఆయన సరళిలోని తప్పులను ఎంచి చూప లేకపోయారు. అదే కాలంలో రెండు ప్రధాన దిన పత్రికల ఎడిట్ పేజీలలో, ఆ పత్రిక యాజమాన్య అధినేతల విషయంలో, వస్తున్న వ్యాస పరంపరలు, వ్యతిరేకుల మీద "అప నమ్మకం" కలిగించేలా వున్నవే తప్ప, వాస్తవాలు వెలుగులోకి తేవాలన్న తపన కనిపించడం లేదు. ఈ జాడ్యం రాజకీయాలకే పరిమితమై పోలేదు. అన్ని రంగాలకూ వ్యాపించ సాగింది ఒక అంటు జబ్బులా.

ప్రభుత్వ ప్రయివేటు భాగ స్వామ్యంలో, 108 అంబులెన్సు అత్యవసర సహాయ సేవలు, సంబంధిత ప్రభుత్వ శాఖలోని కొందరు అధికారుల అలసత్వం వల్ల, మే నెల కల్లా, గతంలో వలె సేవలందించలేని స్థితికి చేరుకున్నాయి. సగటున గతంలో హాజరయ్యే రోజువారీ అత్యవసర సహాయ సేవలు గణనీయంగా పడిపోయాయి. సేవలను కోల్పోతున్న వారిలో, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు, చిన్న పిల్లలు కూడా వున్నారుఅత్యవసర చికిత్స ఆలశ్యమవుతే సంభవించేది మరణాలే కదా! అదే విధంగా, నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలను అందించే 104 సంచార వాహనాలలో పని చేస్తున్న సిబ్బంది సమ్మె సాకుగా చూపి, సిబ్బంది లేవనెత్తిన అంశాలను పరిష్కరించే బదులు, గత ఏడాది డిసెంబర్ మొదటి వారం నుంచి, ప్రభుత్వమే సంబంధిత జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో నిర్వహిస్తోంది. ఆ నిర్ణయం తీసుకునేందుకు పూర్వం, 475 సంచార వాహనాల ద్వారా, ఆ సేవలందించిన యాజమాన్యం, రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల ప్రాంతాలలో- తాము నివసిస్తున్న గ్రామానికి మూడు కిలోమీటర్ల లోపు కనీస వైద్య సౌకర్యాలు ఏ మాత్రం లేని, సుమారు ఇరవై వేల గ్రామాల ప్రజలకు, నెలకొక్క సారి, అది కూడా నిర్ధారిత తేదీన, అన్ని రకాల ప్రాధమిక వైద్య సౌకర్యాలను సమకూర్చింది. లబ్ది పొందిన లక్షలాది మంది గ్రామీణ నిరుపేదలలో, అనేక మంది గర్భిణీ స్త్రీలు, ప్రసూతి స్త్రీలు, పసి పిల్లలు, చంటి పిల్లలు కూడా వున్నారు. మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు ఆ సేవలెంతగానో తోడ్పడ్డాయి. డిసెంబర్ నెలనుంచి, కలెక్టర్ల ఆధ్వర్యంలో నడుస్తున్న అవే వాహనాలు, కనీసం ఒక్క రోజన్నా, ఒక్క గ్రామానికన్నా, నిర్ధారిత తేదీన వెళ్ళిన దాఖలాలు లేవని చెప్పాలి. ప్రజోపయోగంగా వున్న పథకాలను నిష్ప్రయోజనం చేయకూడదు. అలాంటి ప్రజోపయోగమైన పథకాలలో అత్యంత ప్రయోజనమైన వి, బహుళ జనా మోదం పొందినవి, రాజకీయాలకు అతీతంగా-కుల మతాలకు అతీతంగా ఉపయోగ పడేవి, 108 అంబులెన్సులు- నిర్ధారిత తేదీ ఆరోగ్య సేవలను అందించే 104 సంచార వాహనాలు-ఆరోగ్య సమాచార సహాయ కేంద్రం సేవలు. వీటిని నిధుల లేమితో నీరు కార్చే ప్రయత్నం చేసింది ప్రభుత్వం అన్న భావం ప్రజలలో కలిగిందీ ఏడాది.

కడప లోక్ సభ, పులివెందుల శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన నేపధ్యంలో, ఓటమి దరిమిలా ప్రభుత్వ భవిష్యత్ పై ఆసక్తికర పరిణామాలు సంభవించవచ్చని భావించిన నేపధ్యంలో, తన పార్టీ ఓటమిని ఎలా తీసుకుంటారని మీడియా వారడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఒక సారి ఓడిపోయినంత మాత్రాన, అది శాశ్వతంగా ఓటమి పాలైనట్లు కాదని సమాధానం ఇచ్చారు. ఓటమిని క్రికెట్ మాచ్ తో పోల్చి, ఉదాహరణగా, ఒకానొక అంతర్జాతీయ క్రికెట్ మాచ్ లో బలమైన టీమిండియా, బలహీనమైన బంగ్లాదేశ్ టీంతో ఓటమి పాలైన విషయాన్ని, తర్వాత, ప్రపంచ కప్పును గెలవడాన్ని చెప్పారు సీఎం. ఓటమి-గెలుపుల వరకు పోలిక బాగానే వుంది కాని, మిగతా విషయాలలో టీమిండియా సాధించిన విజయ రహస్యానికి-వ్యూహానికి వెనుక నున్న కృషి-పట్టుదల, ఓటమి పాలు కాకుండా వుండేందుకు, "కిరణ్ కుమార్ రెడ్డి కడప ఎన్నికల టీం" కు లేదనేది పలువురి మనసులో మాటగా చెప్పుకోవాలి. వాస్తవానికి, ఆద్యంతం, జగన్మోహన్ రెడ్డిని అత్యంత బలీయమైన శక్తిగానే ఊహించింది కాంగ్రెస్. కాకపోతే, ఎన్నికల వ్యూహరచన ఓటమి దిశగానే  చేసింది. చివరకు ఓటమి పాలైంది. తన తండ్రి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టను అని అన్న జగన్ నోటితోనే, పడగొట్టి తీరుతాను అన్న దాకా ప్రేరేపించింది. ఏదేమైనా, గెలిచింది వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐనప్పటికీ, ఓడింది కాంగ్రెస్ పార్టీ కాదు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఓడించింది ప్రభుత్వాన్ని. ఓడిపోయింది  అధికారుల అలసత్వానికి ప్రతీకైన ప్రభుత్వంప్రభుత్వంలోని సమిష్టి బాధ్యతా రాహిత్యం, ఆ బాధ్యతా రాహిత్యానికి వూతమిచ్చిన కొందరు అధికారుల సంక్షేమ పథకాల అమలు తీరు. ఈ తప్పులను కనీసం రాబోయే ఏడాదన్నా సరి దిద్దుకుంటే మంచిదేమో!

డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చి మే 22వ తేదీ నాటికి రెండేళ్లు పూర్తయ్యాయి. విదేశాంగ విధానమైనా, ఆర్థిక పరమైన నిర్ణయాలైనా, ఇరుగు-పొరుగు దేశాలతో సత్సంబంధాలైనా, ఒక్కొక్క దానికి మన్మోహన్ ప్రభుత్వం ఒక్కో రీతిలో ప్రగతి సాధించింది. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన "జాతీయ సమైక్యతా మండలి" లోని సభ్యుల జాబితా చూస్తే, రాజకీయాలకతీతంగా, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్న దేశంలో, అలాంటి కమిటీలను ఏర్పాటు చేయగలమన్న భరోసా ఇవ్వగలిగింది మన్మోహన్ ప్రభుత్వం. గ్రామీణ ఉపాధి హామీ పథకం, పట్టణ పునరుద్ధరణ మిషన్, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, భారత్ నిర్మాణ్ యోజన, ఆం ఆద్మీ ఆలోచన లాంటి పలు పథకాలకు యూపీఏ ప్రభుత్వం రూప కల్పన చేసింది-అమలు పరిచింది. ఆర్థిక సంస్కరణలను, మారుతున్న సామాజిక-రాజకీయ-ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొనసాగించడం యూపీఏ విజయాలలో ఒకటి. అలాగే విజయాలను-అపజయాలను గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, ఒక విషయం గుర్తుంచుకోక తప్పదు. ఇదొక సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ధర్మానికి అనుగుణంగానే, మంత్రివర్గ ఏర్పాటుతో సహా, అభివృద్ధి-సంక్షేమ కార్య క్రమాల రూపకల్పన అమలు కూడా వుండి తీరుతుంది. ఇక అంతర్జాతీయ రంగానికి వస్తే, క్షణ క్షణానికి, మన దేశంలో జరుగుతున్న మార్పులతో సంబంధం లేకుండా, అంతో-ఇంతో గత ఎన్డీయే హయాంలో కుదుర్చుకున్న అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధం కాకుండా, నిర్ణయాలు తీసుకోక తప్పదు. మన్మోహన్ సింగ్ కూడా అలానే చేస్తున్నారనాలి.

అన్నీ విజయాలేనా అంటే, అక్కడక్కడ, అపజయాలు లేకుండా పోలేదు. దానికి ప్రకృతిది కొంత బాధ్యత అనుకుంటే, మానవ తప్పిదాలు మరికొంత దోహద పడ్డాయి. కరువు-కాటకాలు ద్రవ్యోల్బణానికి దారితీస్తే, నిబద్ధత లేని భాగస్వామ్య పక్షాలకు చెందిన కొందరు, అవినీతికి అంకితమై పోయి, యూపీఏ ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారు. ఫలితం అనుభవిస్తున్నారు. అలానే చమురు ధరల పెంపుదల. అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం మన దేశంపై పడింది. నిత్యావసర వస్తువైన గాస్ మినహా మిగిలిన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంచనాలకు మించి పెరగడం ఒక అపజయంగా అనుకోవచ్చేమో! చమరు ధరల పెరుగుదల నిత్యావసర వస్తువులపై కూడా పడింది. పౌర పంపిణీ వ్యవస్థను ఎంత పటిష్ట పరిచినా ఇంకా చేయాల్సింది చాలా వుంది. టెలికాం స్కాం యూపీఏ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడవేసింది కొంతవరకు. అలానే, అత్యంత వైభవంగా-అంగరంగ వైభోగంగా జరిగిన కామన్వెల్త్ క్రీడలలో కూడా కొంత అపశృతి చోటు చేసుకుంది. భారత దేశానికి మున్నెన్నడూ లభించని విధంగా బంగారు-రజత-కాంస్య పతకాలు లభించాయి. అవినీతిని అరికట్టాలన్న ధృఢ సంకల్పంతో పనిచేస్తున్న యూపీఏ ప్రభుత్వం, టెలికాం, కామన్వెల్త్ క్రీడల స్కాంలను సీబీఐకి అప్ప చెప్పి తన చిత్త శుద్ధిని తెలియ చేసుకుంది.

(మరిన్ని మిగిలాయింకా)

Friday, December 30, 2011

విపక్షాల వైఖరి మారాలి: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు

పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో, ఏ రకమైన చట్టాన్ని, ఎప్పుడు-ఎలా-ఎందుకు రూప కల్పన చేయాలో, చేసిన దానిని రాజ్యాంగ ప్రకరణాలకు-పార్లమెంటరీ విధానాలకు అనుగుణంగా ఆమోదింప చేసుకోవాలో, చేయడం వల్ల తలెత్తే పర్యవసానం ఎలా అధిగమించాలో అన్న విషయాలను నిర్ణయించే అధికారం కేవలం చట్ట సభలకు మాత్రమే వుంటుంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలైన కార్య నిర్వాహక వ్యవస్థ, శాసన ప్రక్రియ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలు, వాటి-వాటి పరిధుల్లో తిరుగులేని అధికారాలను కలిగి వుండడం వల్ల, ఒక వ్యవస్థను మరోటి పూర్తిగా కబళించలేని విధంగా, అధిగమించలేని పద్ధతిలో, "అదుపులు-అన్వయాలు" ఆయా వ్యవస్థల అధికారాలను పరిమితం చేస్తుంటాయి. ఏ వ్యవస్థకు అపరిమితమైన అధికారాలను రాజ్యాంగం కట్టబెట్టలేదు. పార్లమెంటు తన హక్కుగా, బాధ్యతగా, పారదర్శకతతో చేయాల్సిన విధిని, అదేదో తమ పనిగా, ఎవరో కొందరు-పౌర సమాజం నెపంతో నో, లేదా మరే కారణంతో నో, తమపైన వేసుకోవడం అప్రజస్వామికం-అనైతికం.

చారిత్రాత్మక లోక్ పాల్ నమూనా బిల్లు రూపొందించే ప్రక్రియలో, క్రియాశీలక పాత్ర వహించిన గాంధేయ వాది అన్నా హజారేను ప్రతి భారతీయ పౌరుడు మనఃపూర్వకంగా అభినందించాల్సిందే! అంత మాత్రాన, భారత పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని, తద్వారా కొనసాగాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియను కించపరిచే దిశగా అడుగులు వేయబూనుకోవడం సరైందికాదు. రాజ్యాంగ పరంగా సంక్రమించిన శాసన నిర్మాణ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన పార్లమెంటు అధికారం తిరుగులేనిదే! హజారే సూచించిన అంశాలు చాలావరకు పొందుపరిచి లోక్ పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ప్రధాని మన్మోహన్ సింగ్ ను, ఆయన మంత్రి మండలిని అభినందించాల్సిన హజారే-ఆయన పౌర సమాజ బృందం, దానికి బదులుగా, పార్లమెంటు ఆమోదించనున్న ఆ చట్టాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించనున్నదని ముందే జోస్యం చెప్పడం దురదృష్టకరం. ఒకవైపు లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్తుంటే, మరో వైపు ముంబై నగరంలో నిరాహార దీక్షకు పూనుకోవడం ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మనిషిని, అందరిలో ఒకడిగా మిగిల్చింది. చివరకేమైంది? పట్టుమని పదివేల మంది మద్దతును కూడా కూడగట్టుకోలేని దుస్థితికి దిగజార్చింది. హజారే అనుకున్న జన లోక్ పాల్ చట్టం రాకపోగా, ప్రభుత్వం ప్రయత్నించిన లోక్ పాల్-లోక్ ఆయుక్త కూడా ప్రస్తుతానికి చట్టం కాలేకపోవడం దురదృష్టం. 

పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతాల ప్రకారం, అదుపులు అన్వయాలకు లోబడి, కార్య నిర్వహణ అధికారి (ప్రధాన మంత్రి) మంత్రి మండలి సమష్ఠి బాధ్యతకు అనుగుణంగా, చట్టాలను (రూప కల్పననుముందస్తుగా మంత్రి మండలిలో క్షుణ్ణంగా చర్చించి, బిల్లు రూపంలో పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశ పెట్టి-చర్చించిన తర్వాత, (సవరణలతో) ఆమోదించడమో, తిరస్కరించడమో జరగడం ఆనవాయితీ. ఇప్పుడదే జరిగింది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన ఒకటి-రెండు సవరణలను ప్రభుత్వం లోక్ సభలో పరిగణలోకి తీసుకుంది . రాజ్యసభలో ప్రతిపాదనకు వచ్చిన సుమారు రెండువందల సవరణలను పరిగణలోకి తీసుకోవాలా-వద్దా అని నిర్ణయం జరగక ముందే, సభలో నెలకొన్న గందరగోళ పరిస్థితులలో సభాధ్యక్షుడు సభను నిరవధికంగా వాయిదావేశారు. అధికార-ప్రతిపక్షాలకు చెందిన సభ్యులందరూ, పార్లమెంటు సార్వభౌమాధికారం విషయంలో మాత్రం ఒక్కటయ్యారు. "లాబీ వర్గాల" కు (పౌర సమాజం వారితో సహా), పార్లమెంటు సభ్యులుకాని వారికి, లాంఛనంగా-చట్ట పరంగా, ఆ ప్రక్రియలో ముందుగా పాల్గొనే వీలు రాజ్యాంగం కలిగించలేదు. కాకపోతే, వారి పలుకుబడి-ప్రభావం చూపించి, ప్రభుత్వం మీద-పార్లమెంటు సభ్యుల మీద కొంత ఒత్తిడి తెచ్చే అవకాశం లేక పోలేదు. అది హక్కు ఎంత మాత్రం కానేకాదు. ప్రధాన ప్రతిపక్షాలన్నీ ధర్నా చౌక్‌లో అన్నా హజారే బృందానికి మద్దతిస్తూనే, పార్లమెంటు ఉభయ సభలలో మాత్రం తాము అనుకున్నదే చేశారు.

అన్నా హజారే-ఆయన పౌర సమాజం చెప్పిందల్లా చేస్తే, పార్లమెంటుకు, ప్రధానికి ఏదన్నా పాత్ర వుందనుకోవాలా? లేదా? పౌర సమాజానికి చెందిన కొందరు స్వయం ప్రకటిత నేతల ఒత్తిళ్లకు లొంగి, చట్టాల రూపకల్పనకు సంబంధించి పూర్తి అధికారాలను కలిగున్న పార్లమెంటు పరిధి నుంచి ఆ అధికారాలను పార్లమెంటే తర శక్తులకు బదిలీ చేస్తే ప్రజాస్వామ్యం ఏం కావాలి? ప్రధాని మన్మోహన్ సింగ్, సుమారు నాలుగున్నర దశాబ్దాల తర్వాత, చొరవ తీసుకుని (పోనీ హజారే చొరవ వల్ల అనుకుందాం), లోక్ పాల్ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చారు. స్వయంగా ప్రధానిని కూడా లోక్ పాల్ పరిధిలో చేర్చమని ఆయనే కోరారు. చివరకు కమిటీ సభ్యుల సూచనను అంగీకరించారు. బహుశా అత్యున్నత స్థాయి కార్య నిర్వహణ అధికారిని (ప్రధాని), అత్యున్నత న్యాయ వ్యవస్థను, పార్లమెంటులో సభ్యుల పనితీరును, లోక్ పాల్ పరిధిలో తీసుకురాక పోవడం సమంజసమే మో! అదుపులు-అన్వయాలకు బాధ్యత వహించాల్సిన ఈ మూడు వ్యవస్థలను ఆ స్థాయిలో గౌరవించాల్సిన అవసరం వుందనాలి. లోక్ పాల్ సభ్యులుగా నియామకం కాబోయే తొమ్మిది మంది సభ్యులలో భవిష్యత్ లో ఏ నాడూ-ఎవరూ-ఎలాంటి పరిస్థితుల్లోను, ఇతర ఉన్నత స్థాయి-మధ్య స్థాయి-కింది స్థాయి వ్యక్తుల లాగా, ఏ బలహీనతలకు లోను కారన్న నమ్మకం వుందా? అలాంటి వారే ప్రధాని కూడా అని, న్యాయ మూర్తులని భావించడం మంచిదే మో!

పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని, దాని శాసన నిర్మాణ కర్తవ్యాన్ని, ఆ కర్తవ్యంలో పాలు పంచుకుంటున్న గౌరవ సభ్యులను, కార్య నిర్వహణ అధికారి ప్రధానిని కాదని, ఆ మరణ నిరాహార దీక్షకు దిగడం ఎంతవరకు సబబు?

అత్యున్నత విలువల నుంచి హజారే స్ఫూర్తి పొంది ఉండవచ్చు గాక! ఆయన వెంట అశేష జన వాహిని నేడు నడుస్తుండవచ్చు కాక! ఆయన వేసిన ప్రతి అడుగులో అడుగు వేసుకుంటూ, పౌర సమాజానికి చెందిన అతిరథ-మహారథులు హజారే చెప్పే ప్రతి వాక్యాన్ని వేద వాక్కుగా పరిగణిస్తుండ వచ్చు గాక! అంత మాత్రాన ఆయన ఎంచుకున్నది మాత్రం అసలు సిసలైన నిఖార్సైన మార్గం అనే వీలు లేదు. ఇందిరా గాంధీ హయాంలో అత్యవసర పరిస్థితి విధించిన దరిమిలా, అసలే అంతంత మాత్రం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న పార్లమెంటరీ వ్యవస్థ- అందులోని ఉభయ సభల రాజ్యాంగ బద్ధమైన అధికారాలను హరించే ప్రయత్నం చేస్తే వారెంత గొప్ప వారైనా వారి చర్యలను ఎదుర్కోవాల్సిందే. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ప్రమాదకరమైన ప్రభావం పడే ఎటువంటి చర్యైనా అటు ప్రభుత్వం కాని, ఇటు ప్రతి పక్షాలు కాని, వీటన్నింటి కీ అతీతం అని అంటున్న పౌర సమాజం కాని చేపట్టి తే, దాన్ని అడ్డుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం.

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న లోక్ పాల్ బిల్లుకు ఒక  సుదీర్ఘ చరిత్ర వుంది. హజారే ఆందోళన - పౌర సమాజం జోక్యం - ప్రభుత్వ ఏమరుపాటు - రాందేవ్ బాబా రంగ ప్రవేశం - ప్రభుత్వం తొందర పాటు చర్యలు - రాజీ మార్గాల అన్వేషణ - పౌర సమాజం సభ్యులతో కలిసిన సంయుక్త కమిటీ ఏర్పాటు - జన లోక్ పాల్, ప్రభుత్వ లోక్ పాల్ ముసాయిదా బిల్లుల తయారీ - ఏకాభిప్రాయ సాధన - నాలుగై దు మినహా జన లోక్ పాల్ లో ప్రతిపాదించిన అంశాలన్నింటినీ చేర్చుతూ ప్రభుత్వం లోక్ పాల్ బిల్లు ముసాయిదా రూపొందించడం - మంత్రి మండలి ఆమోదం - లోక్ సభలో ప్రవేశ పెట్టడం - మధ్యలో అసంతృప్తి చెందిన అన్నా హజారే నెల రోజుల క్రితమే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటన చేయడం - అన్న మాట ప్రకారం ఆగస్టు పదహారున దీక్షకు దిగేందుకు సన్నద్ధం కావడం - హజారే ముందస్తు అరెస్టు, అదే రోజు రాత్రి పొద్దు పోయాక ఆయనను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం - ఈ లోపల చిదంబరం తో సహా ముగ్గురు కేబినెట్ మంత్రులు ఢిల్లీ పోలీసుల చర్యను సమర్థించడం - హజారేతో సహా పలువురి నిర్బంధం, విడుదల - పార్లమెంటు లోపల, బయట ప్రభుత్వం, ప్రతి పక్షాల మధ్య మాటల యుద్ధం - చివరకు జైలులోనే వుంటానని భీష్మించుకుని కూర్చున్న హజారే మూడోరోజుకల్లా దిగి రావడం...ఒకటి వెంట ఒకటి జరిగిన పరిణామాలుఇక ఆ తర్వాత "సెన్స్ ఆఫ్ ద హౌజ్" పేరుతో అన్నా హజారే ప్రతిపాదనలకు ప్రభుత్వ పరంగా పరోక్ష ఆమోదం, అన్న మాట ప్రకారం ప్రభుత్వం లోక్ పాల్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడం, సభ ఆమోదం పొందడం, రాజ్యసభలో ఆమోదం పొందకుండానే సభ నిరవధికంగా వాయిదాపడడం తదనంతర పరిణామాలు. వీటిలో, అంతా సత్య సంధులే అనడం నిజం కాదు...ప్రభుత్వం ది ఒక రకమైన మొండి వైఖరై తే, ప్రతి పక్షాల ది మరో రకమైన మొండి తనం...ఇక పౌర సమాజానిది గజ మొండి తనం! వెరసి, మీడియాకు బిజీ-బిజీ-బిజీ! ఏదేమైనా ప్రస్తుతానికి లోక్ పాల్ చట్టం లేనట్లే!

నాలుగున్నర దశాబ్దాల తర్వాత లోక్ పాల్ బిల్లు ఆవశ్యకతను గుర్తుచేస్తూ, అన్నా హజారే నాయకత్వంలోని పౌర సమాజ బృందం మొదట్లో ఆందోళనకు దిగడం సమంజసమే. అప్పట్లో వారి డిమాండు ప్రభుత్వం లోక్ పాల్ బిల్లును తెచ్చి చట్టం చేయాలని మాత్రమే! ఆయన వెంట వున్న పౌర సమాజం సభ్యులు నిజాయితీ పరులే-అందులో సందేహం లేదు. గండం గట్టెక్కడానికి ప్రాధాన్యతనిచ్చే సర్కారు, పౌర సమాజాన్ని-ప్రతిపక్షాలను చీల్చాయి అప్పట్లో. ప్రతి పక్షాలను దూరం పెట్టి పౌర సమాజాన్ని దగ్గరకు తెచ్చుకునే వ్యూహంతో ముందుకు సాగింది. ఆందోళనను తాత్కాలికంగా పలచన చేయగలిగింది.

అత్యంత ప్రాధాన్యతను సంచరించుకున్న లోక్ పాల్ బిల్లు ముసాయిదాను ఖరారు పర్చే ముందర, సంప్రదాయ బద్ధంగా-ఆనవాయితీగా వస్తున్న ప్రతిపక్షాలను సంప్రదించే ఆచారాన్ని పక్కన పెట్టింది. కమిటీలో  పౌర సమాజం సభ్యులకు మాత్రమే ప్రభుత్వ సభ్యుల సరసన పెద్ద పీట వేసింది. ఆ చర్యతో, పౌర సమాజం సభ్యులు, తమ వాదనను వినిపించడంలో బలపడ సాగారు. పౌర సమాజం ఎదురు తిరిగింది. జన లోక్ పాల్ బిల్లు తప్ప ప్రభుత్వ బిల్లు తమకు ఆమోద యోగ్యం కాదు పొమ్మంది! ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. తానేమీ తక్కువ తిన్నానా అన్న చందాన, ప్రభుత్వం తన చర్యలను సమర్థించుకునే బదులు, ఎదురుదాడికి దిగింది. అప్రజాస్వామిక చర్యలకు పూనుకుంది. అవసరం లేకపోయినా హజారే ను-ఆయన బృందాన్ని నిర్బంధంలోకి తీసుకుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంది. పార్లమెంటు సార్వభౌమాధికారం అన్న మాటను ఆలశ్యంగా తెరపైకి తెచ్చింది. అది కాదనే పరిస్థితి ప్రతిపక్షాలకు కలిగించింది. ప్రతిపక్షాలను హజారే వైపు మళ్లకుండా జాగ్రత్త పడాల్సింది.

అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలి అన్న సాకుతో, పార్లమెంటుకు, కార్య నిర్వహణ వ్యవస్థకు, న్యాయ స్థానాలకు, రాజ్యాంగానికి, రూల్ ఆఫ్ లాకు అతీతమైన ఒక సూపర్-డూపర్ నామినేటెడ్ బాడీని ఏర్పాటు చేయాలని పౌర సమాజం ప్రభుత్వాన్ని ఆజ్ఞాపించడం ఎంతవరకు సబబు? దానికి ఈ మహానుభావులంతా వంత పాడడం ఎంతవరకు న్యాయం? అరవై నాలుగు సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో-అరవై రెండు సంవత్సరాల భారత రాజ్యాంగ చరిత్రలో, అంచలంచలుగా బలపడాల్సిన రాజ్యాంగ వ్యవస్థలను, పటిష్టం చేయాల్సిన బాధ్యతను విస్మరించిన రాజకీయ నాయకులనేకమంది, అదే బాధ్యతను ఇన్నాళ్లు విస్మరించిన పౌర సమాజం నాయకులకు వత్తాసు పలకడంలోని ఔచిత్యం ఏమిటి? నలభై రెండేళ్ల క్రితం నాటిన లోక్ పాల్ మొక్కకు నీరు పోసిన వారు-పోయనివారు ఏకమై పోయారిప్పుడు. వాస్తవానికి మనకు రాజ్యాంగం ప్రసాదించిన అవినీతి వ్యతిరేక అస్త్ర-శస్త్రాలను, అదే రాజ్యాంగంలోని అనేకానేక ప్రకరణాలను, ఒకదానికి మరొక టి అనుసంధానం చేసి అవినీతి పరులపై ప్రయోగించడానికి, ఇదే రాజకీయ నాయకులు-పౌర సమాజం ప్రతినిధులు ఆదినుంచి పూనుకున్నట్లయితే, సమస్య ఇంత జటిలమయ్యేదా? అంతా జరిగినాక, ఇప్పుడు రాత్రికి రాత్రే, "సర్వోపతి" లాంటి ఒక దివ్యౌషధం కావాలని ప్రభుత్వంపై పౌర సమాజం ఒత్తిడి తేవడం సమంజసం కాదు.

రే అయిందేదో అయిందను కుందాం. తన మాట నెగ్గ లేదనుకుని, మరింత పటిష్టమైన లోక్ పాల్ బిల్లు తేవాలని ప్రభుత్వాన్ని కోరటంలో తప్పు లేదనుకుందాం. దాని కొరకు దీక్షకు దిగడంలోను న్యాయం వుందను కుందాం. ఆయన వెంట నడుస్తున్న ఇతర పౌర సమాజం సభ్యులు, హజారే కంటే అధిక స్థాయిలో పట్టుదల ప్రదర్శించడాన్నీ ఒప్పుకుందాం. కాని, తమకు-తమ పౌర సమాజానికి-తమకు మద్దతిస్తున్న వారికి తప్ప ఇతరులెవరికీ లోక్ పాల్ బిల్లు విషయంలో, ఏమీ తెలవదని వాదించడం మాత్రం అన్యాయం. హజారే ఆరోగ్యం పట్ల ఆందోళన చెందిన ప్రభుత్వం-ప్రతి పక్షాలు, పరస్పరం సంప్రదింపులు చేసుకుని, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తున్న సమయంలో తమవంతు సహకారం అందించడంలో హజారే బృందం సరైన పద్ధతిలో వ్యవహరించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా-ప్రతిపక్షాలు ఎంత సహకారం అందించినా, పరిష్కారం కను చూపు మేరలో కనిపించడం లేదు. ప్రభుత్వం ఎన్నో మెట్లు దిగి వచ్చింది. జన లోక్ పాల్ బిల్లులోని  చాలా అంశాలను, పార్లమెంటు ప్రక్రియ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లులో చేర్చే ప్రయత్నం చేసింది. పార్లమెంటు స్థాయీ సంఘం ఆమోదం పొందడానికి రాజ్యాంగపరంగా వున్న వెసులుబాటులను పరిశీలించింది. పౌర సమాజం సభ్యులతో, అఖిల పక్షం సభ్యులతో ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించింది. సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి, బిజెపి నాయకురాలు సుష్మా స్వరాజ్, ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ ఒక్క విషయంలో ప్రభుత్వానికి అండగా నిలిచారని చెప్పొచ్చు. పార్లమెంటు సార్వభౌమాధికారం, శాసన ప్రక్రియ, న్యాయ స్థానాల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా లోక్ పాల్ బిల్లును తేవాలన్నది వారి మాటల్లో స్ఫురించింది.

రాజ్య సభలో ఇంకా ఏమీ తేలకపోయినా, మన్మోహన్ సింగ్ సర్కారు లోక్ సభలో ప్రవేశపెట్టి, సభ ఆమోదం పొందిన లోక్ పాల్ బిల్లు, అన్నా హజారే బృందం సూచించినంత బలీయమైంది కాకపోవచ్చు. రాజ్యసభలో సూచించిన మోతాదులో 187 సవరణలు తేవాల్సినంత బలహీనమైన బిల్లు కూడా కాదు. అటు పౌర సమాజం, ఇటు ప్రతిపక్షాల సలహాల-సూచనలకు అనుగుణంగా రూపొందించిన "సంతులిత బిల్లు" అనవచ్చేమో! పౌర సమాజాన్ని రెచ్చగొట్టిన ప్రతిపక్షాలు, ఇలాంటి "సంతులిత బిల్లు" కు ఆక్షేపణలు తెలియచేయకుండా వుంటే సమంజసంగా వుండేదేమో! ఇప్పటికైనా ప్రతిపక్షాలతో సహా కొన్ని యుపిఎ భాగస్వామ్య పక్షాలు ఆ దిశగా ఆలోచన చేయాలి. ఇది బలహీనమైందన్న సాకుతో, లోక్ పాల్ చట్టం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలి. 

Thursday, December 29, 2011

భయపెట్టిన కేంద్ర పాలన: వనం జ్వాలా నరసింహారావు


2011 సంవత్సరంలో ఏం జరిగింది?
తడబడినా..... ఆత్మవిశ్వాసం దిశగా! - 2
వనం జ్వాలా నరసింహారావు

రాష్ట్రంలోని స్థితిగతులపై దృష్టి సారిస్తే ఆసక్తికరమైన సంఘటనలు 2011లో చోటుచేసుకున్న విషయం అవగతం చేసుకోవచ్చు. రాజకీయ రంగంలో, ఒకానొక తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ లో నెల కొన్న పరిస్థితి మరే రాష్ట్రంలోను, నెలకొని లేదనే అనాలి. రాజశేఖర రెడ్డి అకాల మరణంతో, కాంగ్రెస్ రాజకీయాలలో, "శూన్యం" ఏర్పడి, రోశయ్య హయాంలో బలపడి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఆయన ప్రమేయం లేకుండానే మర్రి ఊడల్లాగా పెకిలించనలవికాని లోతుకు కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీకి "అధిష్టానం" అనేది వున్నదనే సంగతిని రాజశేఖర రెడ్డి తీసేయగా, రోశయ్య తన పాలనలో చేసిన పని మరిచిపోయిన అధిష్టానాన్ని గుర్తుచేయడమే! ఇక, ఆ తర్వాత, అధిష్టానమే ఇక్కడ పాలన చేసే స్థితికి రాష్ట్రం చేరుకుంది. ప్రత్యేక తెలంగాణ వాదన, జగన్మోహనరెడ్డి సవాలు, ప్రభుత్వోద్యోగుల నిరసనలు, తెలుగు దేశం అవినీతి ఆరోపణలు, ప్రాంతాలవారీగా కాంగ్రెస్ నాయకులు విడిపోయి ఇటు ముఖ్యమంత్రికి-అటు అధిష్టానానికి తల బొప్పి కట్టించడం, అధికారుల్లో అలసత్వం, పధకాల అమలులో నిర్లిప్తత....ఇలా...రకరకాల సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోయిన రాష్ట్రంలో, రాష్ట్రపతి పాలన మినహా గత్యంతరం లేని పరిస్థితులు రాబోతున్నాయా అన్న అనుమానం కూడా కలిగింది ఒక దశలో. రాష్ట్రంలో అప్పట్లో ఎవరి ఆలోచనలు వారివే...ఎవరి ఆరోపణలు వారివే. కాంగ్రెస్-తెలుగుదేశం మధ్య మాచ్ ఫిక్సింగ్ అని తెరాస అంటే, టిడిపి-తెరాస మధ్యనే మాచ్ ఫిక్సింగ్ అని కాంగ్రెస్ వాదించింది. జగన్మోహన రెడ్డికి కేసీఆర్ కు మధ్య మాచ్ ఫిక్సింగ్ కుదిరిందని తెలుగుదేశం ఆరోపించింది. వీటితో సంబంధం లేకుండా, బహిరంగంగానే ఫిక్సయిపోయాడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీతో. చివరకు నెత్తిమీద కుంపటి దించుకుని తన పార్టీని, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ హస్తాలలో పెట్టాడు.

నాలుగు లక్షల మంది తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆట విడుపు స్థలాలయ్యాయి. ఉద్యోగులు రావడం, సంతకాలు చేయడం, పెన్ డౌన్ సమ్మె చేయడంతో ప్రభుత్వం దాదాపు స్తంభించి పోయిందనాలి. ఆ తర్వాత రెండు రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె, మరో రోజున "పల్లె పల్లె పట్టాల" పైకి ఆందోళన కార్యక్రమంతో ప్రభుత్వానికి ఏం చేయాల్నో పాలుపోలేదు. జగన్మోహన రెడ్డి వారం రోజుల నిరాహార దీక్ష సహితం వార్తలలో ప్రముఖంగా చోటు చేసుకుంది. రాజశేఖర రెడ్డి హయాంలో వాగ్దానం చేసిన ఫీజు రీఇంబర్స్ మెంటు విషయంలో, చేసిన దీక్ష అది. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోను, నిజాం కళాశాల ప్రాంగణంలోను చెలరేగిన హింసా కాండ కూడా దారుణమైన సంఘటనలే అనాలి. అదే రోజుల్లో లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేయడంతో, వారికి కాంగ్రెస్ సభ్యుల, ఎన్డీయే సభ్యుల మద్దతు లభించడంతో, సభ పలు మార్లు వాయిదా పడింది. ఎమెల్యేలు శాసన సభలో లేకుండా, మంత్రులు రాజీనామా బాట పడుతుంటే, (కాంగ్రెస్ పార్టీకి చెందిన)ఎంపీలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటుంటే, ఏమీ చేయలేని స్థితిలో వున్న (రాష్ట్ర) ప్రభుత్వాన్ని రద్దు చేసి, అసెంబ్లీని సుషుప్తావస్థలో వుంచి రాష్ట్రపతి పాలన పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం వుందేమో అన్న అని అనుమానాలు కలిగాయప్పట్లో. చివరకు అంతా సర్దుమణిగింది.
పార్లమెంటును తెరాస సభ్యులు స్థంబింప చేసే ప్రక్రియలో, తెలుగు దేశం తెలంగాణ లోక్ సభ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు, "జై తెలంగాణ" నినాదాలతో అండగా నిలిచారు. భారతీయ జనతా పార్టీ తన సంపూర్ణ మద్దతును తెలంగాణకు అనుకూలంగా ప్రకటించింది. పరిస్థితి చే జారి పోతున్న తరుణంలో, ప్రణబ్ ముఖర్జీ, తన మంత్ర దండాన్ని ఉపయోగించారు. ఆ చర్యతో కాంగ్రెస్ తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఒకింత అవాక్కయ్యారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకున్నారు. ఇక అంతే సంగతులు...తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ, ఆ మాటకొస్తే దానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చే ప్రక్రియ, ఐదు రాష్ట్రాల ఎన్నికలయ్యేవరకు వాయిదా వేశారు. 2011 మే నెల చివరి వరకూ, కాంగ్రెస్ సభ్యులను కట్టడి చేస్తూనే, పరోక్షంగా తెరాసకు సంకేతం పంపారు. అంతవరకూ వేచి చూడాల్సిందేనని, ఆగాల్సిందే-ఆగి తీరాల్సిందే అని స్పష్టం చేసారు ప్రణబ్ ముఖర్జీ. అలనాటి ఢిల్లీ సంకేతాలు, సహాయ నిరాకరణ చేస్తున్న నాలుగు లక్షల తెలంగాణ ఉద్యోగుల పైన ప్రభావం చూపాయి. ఇంటర్ పరీక్షల సమస్య కూడా వారికి తల నొప్పైంది. మూడు నెలలు సహాయ నిరాకరణ కొనసాగించడం కష్టమైన పని అని భావించి, వ్యూహాత్మకంగా విరమించారు. అదలా వుండగా మిలియన్ మార్చ్ వ్యవహారాన్ని తెర పైకి తెచ్చింది రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ. 
అదే రోజుల్లో మార్చ్ 11, 2011 న జపాన్ తీరప్రాంతంలో సంభవించిన సునామీ-భూకంపం దరిమిలా చెలరేగిన అణు సంక్షోభం క్షణ-క్షణ భీకరమైపోయింది. పరిస్థితి విషమించింది. ఫుకుషిమా దైచీ అణు విద్యుత్ కేంద్రంలో రేడియేషన్ స్థాయి తీవ్రమై, హెలికాప్టర్ సహాయంతో రి యాక్టర్ పై నీళ్లు చల్లేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. ఇంధన కడ్డీలను చల్లార్చేందుకు హెలికాప్టర్ల ద్వారా బోరిక్ యాసిడ్ చల్లే అవకాశాలను కూడా అధికారులు పరిశీలించారు. ఫుకుషిమా విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే కలుషిత గాలి, రష్యా మీదుగా వెళుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అమెరికా కాలిఫోర్నియాకు చేరవచ్చనీ అన్నారప్పట్లో. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో, అంతవరకూ ఎన్నడూ, కనీ-వినీ ఎరుగని రీతిలో, దేశంలో వున్న మిలిటరీ సిబ్బందిలో సగానికి పైగా, సుమారు లక్ష మందిని సహాయ-పునరావాస కార్యక్రమాలకు పురమాయించింది జపాన్ ప్రభుత్వం. అమెరికా దేశానికి చెందిన న్యూ క్లియర్ ఆధారిత విమానాలు మోసుకెళ్లే నౌక "రొనాల్డ్ రీగన్" తన వంతు సహాయం చేయడానికి అక్కడకు చేరుకుంది కూడా. రోజులు గడుస్తున్నా కొద్దీ పరిస్థితులు తీవ్రమయ్యాయేకాని తగ్గే సూచనలు అంతగా కానరాలేదు.
గెలుపు-ఓటములు దైవాధీనం కాదని, మానవాధీనం అని ఘంటా పధంగా చెప్పడానికి 2011 మార్చ్ నెలలో జరిగిన మూడు రకాల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఉపాధ్యాయ-పట్టభద్రుల నియోజక వర్గాల నుంచి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కాని, ఎమ్మెల్యేల కోటా ఎన్నికలు కాని, స్థానిక సంస్థల కోటావి కాని...ఆ మాట కొస్తే భవిష్యత్ లో జరగబోయే మరి కొన్ని ఈ మోస్తారు ఎన్నికలు తీరుతెన్నులు కాని, కేంద్ర-రాష్ట్ర ఎన్నికల సంఘాలు కించిత్తైనా గమనించిన దాఖలాలు లేవు. ఆ పార్టీ-ఈ పార్టీ అన్న తేడా లేకుండా, ఉపాధ్యాయ-పట్టభద్రుల-ఎమ్మెల్యే-స్థానిక సంస్థల కోటాలో అభ్యర్థుల గెలుపు-ఓటములు. ఎన్నికల నిబంధనలతో సంబంధం లేకుండా, సాంప్రదాయాలను ఏ మాత్రం గౌరవించకుండా, తమ గెలుపు-ప్రత్యర్థుల ఓటమే లక్ష్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగడం దురదృష్టకరం.
 ఉపాధ్యాయ-పట్ట భద్రుల కోటాలో బరిలోకి దిగినవారిలో, ఎవరో ఒకరిద్దరి విషయం మినహాయించి, పోటీకి దిగిన ప్రతివారూ, ఏదో ఒక రాజకీయ పార్టీ మద్దతు లేకుండా, రంగంలోకి దిగడం జరగలేదు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా రాజకీయ నేపధ్యంలోనే జరిగింది. వీరి విషయంలో కూడా ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా నైనా క్యాంపు రాజకీయాలకు తెర లేచింది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే స్థితికి చేరుకుంది వ్యవహారం. కాంగ్రెస్ సమ్మతి-అసమ్మతి వర్గ అభ్యర్థులు, జగన్ వర్గం అభ్యర్థులు, టిడిపి అభ్యర్థులు, వీరి మద్దతు అంతో-ఇంతో కూడగట్టుకున్న మిత్ర పక్షాల అభ్యర్థులు రంగంలోకి దిగి, ప్రత్యర్థుల ఓటమికి కృషి చేశారు. తమ గెలుపు లక్ష్యం కన్నా, ఇతరుల ఓటమే లక్ష్యంగా జరిగిన ఎన్నికలివి. సరే అంచనాలు కొందరి విషయంలో అనుకూలంగాను, మరి కొందరి విషయంలో తారు-మారుగాను జరగడంతో, ఓడిన వారి పక్షాన నిలిచిన రాజకీయ పార్టీ నాయకుల కన్ను ఎమ్మెల్యే కోటా ఎన్నికలపై పడింది.
ఎమ్మెల్యేల కోటాలో పది మంది ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు మాత్రమే వీలుండగా, అన్ని పార్టీలకు చెందిన రాజకీయ చాణక్యులు, వారి-వారి అనుకూల కూటముల అవగాహన (రాహిత్యం) ప్రకారం, కలిమిడిగా-విడి విడిగా, పన్నెండు మంది అభ్యర్థులను రంగంలో దింపారు. సాధారణంగా బలాబలాలు స్పష్టంగా వున్నప్పుడు ఏకగ్రీవంగా జరిగే నిర్ణయం, ఈ సారి, ఎన్నికల ద్వారా తీసుకోవాల్సిన అవసరం పడింది. "సీక్రెట్ బాలెట్" కాస్తా "ఓపెన్ సీక్రెట్ బాలెట్" గా మారి పోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక నియమావళికి విరుద్ధంగా జరిగింది. ఆసాంతం పర్యవేక్షించాల్సిన ఎన్నికల సంఘం నోట మాట లేదు. ఎవరినీ తప్పు పట్టలేని స్థితికి చేరుకుంది. గెలిచిన వారు, ఓడిన వారు ఒకే తప్పు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతి పక్ష పార్టీల వారు, తమ చేతిలో వున్న "క్రాస్ ఓటింగు" ఆయుధాన్ని యధేఛ్చగా వాడుకున్నారు. తాము ఓడి పార్టీని ఓటమి పాలు చేసిన వారు కొందరైతే, పార్టీని ఓడించి తామూ ఓటమి పాలైన వారు మరి కొందరయ్యారు.
ఏప్రిల్ 2011 చివరలో దేశ-విదేశాలలోని లక్షలాది మంది తమ ఆరాధ్యదైవంగా భావించే భగవాన్ సత్య సాయిబాబా ఆరోగ్యం విషమించి పరమపదించారు. ఆస్తికులు-నాస్తికులు, అన్ని మతాల వారు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు, అధికారులు-అనధికారులు, ఆంధ్రులు-ఆంధ్రేతరులు, దేశ-విదేశాల్లోని సామాన్యులు-అసామాన్యులు, బాబా అపర భక్తులు-ఏ మాత్రం గిట్టని వారు, వారు-వీరు అనే తేడా లేకుండా ఆబాల గోపాలం సత్య సాయిబాబా ఆరోగ్యం గురించి ఆందోళన చెందారు. దీన్ని అర్థం చేసుకోవడంలోనే, ఆయనో మహానుభావుడని, దైవాంశ సంభూతుడని, మానవ రూపంలో మనందరి మధ్యనే-మన కోసం కద లాడుతున్న "పురుషోత్తముడు" అనే విషయం బోధ పడుతుంది. పొలిమేరలే తప్ప ఎల్లలు లేని ఒక కుగ్రామంలో జన్మించి, ఎల్లలెరుగని అపురూప ప్రదేశంగా దాన్ని మలిచి, ప్రపంచ వ్యాప్తంగా దేశ-దేశాల పౌరులకు ఆధ్యాత్మిక తృప్తిని, మానసిక స్థయిర్యాన్ని కలుగజేసే "ప్రశాంత నిలయం" గా ఆ పల్లె రూపు-రేఖలనే మార్చి, తన చిన్న కుటుంబాన్ని వసుధైక కుటుంబంగా చేసుకున్న భగవాన్ సత్య సాయిబాబా తన భక్తులను వీడి శివైక్యం పొందారుసత్య సాయిబాబా మానవ రూపంలో మన మధ్య నున్న దైవం అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ దైవాన్ని మన మధ్యనే ఆ భగవంతుడు వుంచి నంత కాలం అందరికీ అంతా మంచే జరిగింది. ఆ తర్వాత ఆ భగవంతుడు ఎలా జరగాలనుకున్నాడో అలానే జరిగింది. ఇదే భగవత్ అవతార రహస్యం!
(మరిన్ని మిగిలాయింకా)

Wednesday, December 28, 2011

తడబడినా..... ఆత్మవిశ్వాసం దిశగా!: వనం జ్వాలా నరసింహారావు


2011 సంవత్సరంలో ఏం జరిగింది?
వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (29-12-2011)

     కిరణ్‌ వైపే మొగ్గిన అసంతృప్తి వాదులు; ఆధిపత్యాన్ని స్థిరపరచుకున్న కిరణ్‌; ఎటూ తేల్చని శ్రీకృష్ణ కమిటీ; మరో వివాదాన్ని తెచ్చిన బ్రజేష్‌ తీర్పు; న్యూస్‌ బ్రాడ్‌ కాస్టర్స్‌ అసోసియేషన్‌ ఆవిర్భావం; కేంద్రమంత్రివర్గ విస్తరణలో ఆంధ్రులకు అన్యాయం; అరబ్‌ ప్రపంచాన్ని కుదిపివేసిన తిరుగుబాట్లు - ఎడిటర్

          ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంతవరకు, అన్ని రంగాలలో కాకపోయినా, కనీసం రాజకీయ రంగంలోనైనా, గత ఏడాది కోడి కొంచెం ముందే కూసింది. తన రాజకీయ సుదీర్ఘ ప్రస్థానంలో, నిత్య "అసంతృప్తి వాది" గా ముద్రపడినప్పటికీ, ఏనాడూ, భారత జాతీయ కాంగ్రెస్‌ను వీడే సాహసం చేయని వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యం పూరించలేక పోయిన నేటి తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య స్థానంలో, గత ఏడాది (2010) చివరలో-నవంబర్ నెలాఖరులో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించింది అధిష్టానం. నెల తిరిగే కల్లా 2011 సంవత్సరానికి స్వాగతం పలికాం. అప్పటివరకూ కనీసం మంత్రిగా ఒక్కసారైనా పనిచేయని కిరణ్ కుమార్ రెడ్డి ఎంపికను జీర్ణించుకోలేక పోయారు పలువురు కాంగ్రెస్ నాయకులు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి స్థానంలో నూట ఏబైమందికి పైగా ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోదలిచిన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరిక తీరలేదు. ఆయన కోరిక తీరనందుకు ఆయనకంటే ఎక్కువగా ఆయన వీర విధేయులు కలతచెందారు. అలా కలతచెందిన వారిలో, అలనాటి మంత్రివర్గంలోని అనేక మంది మంత్రులున్నారు కూడా. వారిలో కొందరు, రాజ్యాంగపరంగా చేయాల్సిన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరవడానికి ఒకింత విముఖత చూపించారు కూడా. ఐతే, కాలం-కర్మం కలిసి రాకపోవడంతో, అలా విముఖత చూపిన వారే, తమ మంత్రి పదవికి ఎక్కడ ఎసరొస్తుందనే భయంతో, ఒక్కరొక్కరే, కిరణ్ కుమార్ రెడ్డి పంచన చేరడం మొదలెట్టారు. ఏ వీర విధేయతను వారంతా జగన్ పట్ల చూపించారో, అదే వీర విధేయతను, అంచలంచలుగా ముఖ్యమంత్రి పట్ల చూపించసాగారు. "తప్పటడుగులు" వేసి తమ గుప్పిట్లో చిక్కకపోతాడా ముఖ్యమంత్రి అని భావించిన పలువురికి ఆశాభంగం కలిగింది. కొంత "తడబడుతూ అడుగులు" వేసినప్పటికీ, రోజులు-నెలలు గడుస్తున్నా కొద్దీ, అత్యంత "ఆత్మవిశ్వాసం" తో అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తన ఆధిపత్యాన్ని అన్ని విధాలా నిలుపుకోవడం 2011 రాజకీయ సంవత్సరం ప్రత్యేకతగా చెప్పుకోవాలి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పరిశీలించడానికి, కేంద్రప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను పాత్రికేయుల సమక్షంలో, హోం మంత్రి చిదంబరానికి అందచేసి, తదుపరి ప్రక్రియ జనవరి 6, 2011 న రాష్ట్రానికి చెందిన ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదించిన తర్వాతే ప్రారంభిస్తామని చిదంబరం ప్రకటన చేయడం వల్ల 2010 సంవత్సరానికి సంబంధించినంతవరకు, ఆందోళనలకు తావులేకుండా వీడ్కోలు పలికే అవకాశం కలిగిందనాలి. నివేదిక ఇస్తూ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు తమకు అప్పజెప్పిన పని సులభమైంది కాదనిఅన్నారు. పదకొండు నెలలుగా చేసిన విస్తృత సంప్రదింపులు, బృహత్తర పరిశోధనలు చివరకు ఏమైనా తేల్చిందా? అనేది ప్రశ్నార్థకం. ఒక విధంగా చెప్పాలంటే, శాశ్వత ప్రతిష్ఠంభన దిశగా సూచనలివ్వడం జరిగింది. కమిటీ చేసిన "బెస్ట్" లేదా "సెకండ్ బెస్ట్" సూచనలలో ఏ ఒక్క దాన్ని ప్రభుత్వం అంగీకరించినా, ఆ నిర్ణయం, నిజంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్లు "ఎవరికీ పరాజయం లేకుండా అందరికీ సమానంగా విజయం చేకూరినట్లు" అవుతుందా? జవహర్లాల్ నెహ్రూ  చెప్పిన బుద్ధుడి ప్రవచనాలను శ్రీకృష్ణ కమిటీ నిజంగా గౌరవించిందా? న్యాయమూర్తి అనేవారెవరైనా "ధర్మ సమ్మతమైన న్యాయం" చెప్పి సమస్యను పరిష్కరించే సూచనలివ్వాలి కాని, సమస్యను మరింత జటిలం చేయొచ్చా? పైగా అందరికీ విజయం చే కూరుస్తున్నామని చెప్పడం తగునా? నివేదికలో ఏం చెప్పినా ఇష్టంగానో-అయిష్టంగా నో, మనసులో మాట మాత్రం దాచుకోలేక పోయారు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు. ఆధునిక మహాభారత యుద్ధానికి తెరలేపింది శ్రీకృష్ణ కమిటీ "కృష్ణ రాయభారం తరహా నివేదిక". నాటి శ్రీకృష్ణుడు పాండవ పక్షం-ధర్మం పక్షం వహిస్తే, నేటి శ్రీకృష్ణుడి నివేదిక సమైక్యానికి మొగ్గు చూపినట్లు భావన కలిగించినా, ఆసాంతం, మనసులో వున్న మాటగా, విభజన పలుకులే పలకడం విశేషం.
          "కృష్ణా జలాలపై" బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పు మరో వివాదానికి తెర లేపి, శాశ్వతంగా పొరుగు రాష్ట్రాలకు, మనకు మధ్య విరోధానికి నాంది పలికిందని అనక తప్పదు. రాష్ట్రానికి, ఒక వైపు నికర జలాల వాటా పెంచుతూనే, గతంలో బచావత్ తీర్పు నిష్పత్తిలో కాకుండా తగ్గింపు కోటా ఇవ్వడం, మరో వైపు అదనపు జలాల కోటా పూర్తిగా తగ్గించడం వల్ల, రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేసేందుకు అవకాశాలను కలిగించింది ట్రిబ్యునల్. ఇలా ఆరంభమయింది 2011 సంవత్సరం.
ఈ నేపధ్యంలో గత ఏడాది సంఘటనలను ఒక్క సారి మననం చేసుకుంటే ఎలా వుంటుంది
కంచే చేనును మేసిందని, పౌరుల ప్రాధమిక హక్కులను పరిరక్షించాల్సిన అత్యున్నత న్యాయస్థానమే వాటి ఉల్లంఘనకు మార్గం సుగమం చేసిందని, దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత, అదే అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. అస్సాంకు చెందిన చౌహాన్ అనే వ్యక్తికి సుప్రీం కోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ, పౌరుల ప్రాధమిక హక్కుల ఉల్లంఘన అరుదుగా జరిగే వీలున్నప్పటికీ, భవిష్యత్ లో అసలే జరుగదనే నమ్మకం లేదన్న అభిప్రాయం వెలిబుచ్చింది అత్యున్నత న్యాయస్థానం 2011 జనవరి మొదటి వారంలో ఒక రివ్యూ పిటీషన్లో ఇచ్చిన తీర్పులో. ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో 1976 లో అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన ఒక "హెబియస్ కార్పస్ కేసు" లో తీర్పిచ్చిన నలుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, "ఎమర్జెన్సీ అమల్లో వున్నప్పుడు పౌరుడి జీవించే హక్కు కూడా రద్దుచేయవచ్చు" అని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన విషయం జస్టిస్ ఆలం, జస్టిస్ గంగూలీలు ఈ సందర్భంగా పేర్కొనడం గమనించాల్సిన విషయం.
మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలన్న డిమాండుతో, “తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ఆవిర్భవించడం, ఆ సంస్థకు రాష్ట్రంలోని ప్రధాన వార్తా ఛానళ్ల ప్రముఖుల మద్దతుండడం గమనించ దగ్గ విషయం. ఈ సంస్థ మార్గదర్శకాలకు, ఇంతవరకూ జాతీయ స్థాయిలో పనిచేస్తున్న ఎన్‌బీయేసంస్థ ఆదేశాలకు వ్యత్యాసం ఏమేరకుంటుందో చూడాలి. భారత రాజ్యాంగం భావ స్వేచ్ఛ ప్రసాదించినప్పటికీ, ఆ స్వేచ్ఛ "నిష్పాక్షికంగా, బాధ్యతాయుతంగా" వినియోగించుకోవడానికి, ప్రభుత్వ పరమైన నియంత్రణలకంటే స్వయం సంయమనం పాటించడమే మేలు. మన రాష్ట్రంలో ఆవిర్భవించిన తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్స్వయం సంయమనం పాటించే దిశగా చర్యలు తీసుకుంటే అభినందించాల్సిందే. వ్యక్తి భావ ప్రకటనా స్వేఛ్చకుండాల్సిన పరిమితులు-హద్దులు రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఆ బాధ్యతను, రాష్ట్రంలోని ప్రధాన వార్తా ఛానళ్ల ప్రముఖుల చొరవతో ఆవిర్భవించిన తెలుగు న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్చేపడ్తుందని ఆశించుదాం.
జనవరి 19, 2011 న చేసిన కేంద్ర మంత్రి మండలి విస్తరణలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ అన్యాయం జరిగింది. ఢిల్లీ స్థాయిలో కీలక పదవుల పంపకంలో ఆది నుంచీ తెలుగు వారికి అన్యాయం జరుగుతూనే వుంది. ఢిల్లీ స్థాయిలో పెత్తనం సాగించే కీలకమైన రాజకీయ నాయకులకు "చేదోడు-వాదోడుగా" వుండడంలో అగ్రభాగాన వుండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కేంద్రంలో పలుకుబడి ఉపయోగించడానికి దోహదపడే కీలక స్థాయికి ఎదగడంలో మాత్రం వెనుకబడే వుంటూ వస్తుంది. కేంద్ర స్థాయిలో పాలనలో సరైన భాగస్వామ్యం లభించకపోవడంతో, అక్కడినుంచి నిధులను పొందడంలో కూడా విఫలమవుతూనే వుంది. అదే మరో మారు జరిగింది 2011లో కూడా. ఒకసారి కాదు, రెండు సార్లు.
నియంతృత్వానికి వ్యతిరేకంగా, ఈజిప్ట్ ప్రజల, అందునా యువకుల, పద్దెనిమిది రోజుల సుదీర్ఘ ప్రజాస్వామ్య పోరాటం, ఆ దేశాధ్యక్షుడిని పదవీచ్యుతుడిని చేసింది. ముప్పై సంవత్సరాల హోస్నీ ముబారక్ పాలనకు చరమ గీతం పాడిన దేశ పౌరులకు, వారి చిరకాల వాంఛైన ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు సాధ్యపడే విషయమా, లేక, మరికొంత కాలం సైనిక పాలనే కొనసాగనున్నదా అనేది ఇప్పటికీ చెప్పడం కష్టమే. తిరుగుబాటు అనంతరం పాలనను చేపట్టిన ఈజిప్ట్ మిలిటరీ నాయకులు, త్వరలోనే రాజ్యాంగాన్ని సవరించి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపించుతామని, ప్రజల న్యాయమైన హక్కులకు భంగం వాటిల్లకుండా చూస్తామని, ముబారక్ కాలం నుండి అమల్లో వున్న "అత్యవసర చట్టాన్ని" తొలగించుతామని బహిరంగంగా ప్రకటించి కూడా ఏడాది కావస్తోంది. పౌర పాలన స్థాపనకు శ్రీకారం చుట్టి, ప్రజలెన్నుకున్న నాయకుల కింద పనిచేసేందుకు సైన్యం అంగీకరించుతుందా, లేక, మరో మిలిటరీ నియంత పాలనకు కనీసం ప్రయోగాత్మకంగానన్నా దోహదపడుతుందా అనే విషయం ఇంకా తేలాల్సి వుంది.
లిబియాలో అధికారంలో ఉన్న గడాఫికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 17, 2011 న మొదలైన ఉద్యమం రోజురోజుకు ఊపందుకుంది. ఇరవై మూడేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన తునీషియా అధ్యక్షుడు జినే బెన్ అలీ ప్రజల ఆగ్రహాన్ని చవిచూసి పదవీచ్యుతుడు కాక తప్పలేదు. బహరైన్ లోనూ పరిస్థితి తీవ్రతరమయింది. యెమెన్ లో కూడా ప్రభుత్వ మార్పిడి కోరుతూ ప్రజలు పెద్ద యెత్తున ఆందోళనలు చేపట్టారు. ఆ మార్గాన్నే 41 సంవత్సరాల కల్నల్ గడాఫి నియంతృత్వ పాలనకు చరమగీతం పాడారు. పెట్రోలియం నిల్వలతో-ఉత్పత్తులతో సంపన్న దేశాల జాబితాలో చేరిన లిబియా దేశాన్ని తన ఉక్కు పిడికిలిలో బంధించిన గడాఫి, చివరకు అమెరికా కుట్రలో భాగంగా అసువులు కోల్పోయాడు. ఇటీవలి కాలంలో అరబ్ ప్రపంచంలో చోటు చేసుకుంటున్న తిరుగుబాటులకు, గతంలో సైనిక తిరుగుబాటులకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, తిరుగుబాటుల వల్ల నియంతృత్వం పోయి ప్రజాస్వామ్యం వచ్చే అవకాశాలు అప్పూడూ-ఇప్పుడూ లేవు. ఆ దేశాల్లో సైనికులు ప్రభుత్వాలను పడగొట్టడానికి నూతన మార్గాలను ఎంచుకున్నట్లు కనబడుతున్నది. ఉన్న నియంతకు వ్యతిరేకంగా ప్రజలను పురికొల్పి, వారిని గద్దె దింపి, ఆ స్థానంలో అధికారం పొందడమనే వ్యూహం వుందా అన్న ధోరణిలో అక్కడి తిరుగుబాటులు గోచరిస్తున్నాయి. ప్రజాస్వామ్యం నెలకొననంత వరకు తిరుగుబాటు చేసిన ప్రజలకు వారు కోరుకున్నది లభించనట్లే. ఇదిలా వుండగా, అరబ్ ప్రపంచాన్ని అస్థిర పరచడానికి, అమెరికా పన్నిన కుట్రలో భాగంగానే, ఆయా దేశాల్లో తిరుగుబాటులు చోటుచేసుకుంటున్నాయని, ప్రజాస్వామ్యమైనా-నియంతృత్వమైనా, రాబోయే ప్రభుత్వాలు తన కనుసన్నలలో మెలగాలని అమెరికా పన్నాగమని విశ్లేషకులనుకుంటున్నారు.
(మరిన్ని మిగిలాయింకా)

Tuesday, December 27, 2011

ఖమ్మం జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పిన శీలం సిద్దారెడ్డి: వనం జ్వాలా నరసింహారావు


ఆంధ్రజ్యోతి దినపత్రిక (28-12-2011)
(శీలం సిద్దారెడ్డి 26-12-2011 న మరణించిన సందర్భంగా)
వనం జ్వాలా నరసింహారావు

ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, బాణాపురం గ్రామంతో సహా చుట్టుపక్కల అనేక గ్రామాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తల మధ్య హింసా కాండ కొనసాగింది. ఇరు పక్షాలలో ఎంతోమంది చనిపోయారు. పక్క గ్రామమైన వల్లభిలోనూ, మండల కార్యాలయమున్న ముదిగొండ, చుట్టుపక్కల గ్రామాల్లోనూ రాజకీయ హత్యలెన్నో జరిగాయి. వీటన్నిటి వెనుక కేవలం కమ్యూనిస్టు-కాంగ్రెస్ పార్టీల మధ్య తగాదాలే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ప్రముఖ జిల్లా నాయకుల మధ్య జరిగిన ప్రచ్చన్న ఆధిపత్య పోరాటం కూడా కారణమే అన్న విషయం అలనాటి జిల్లా రాజకీయాలను అర్థం చేసుకున్న ప్రతి వారికీ తెలుసు.
రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమంలో ఖమ్మం జిల్లాకొక ప్రత్యేక స్థానం ఉంది. వరంగల్‌ జిల్లాలో భాగంగా ఉన్నప్పుడే ఖమ్మం పట్టణ శాఖ ఏర్పడడం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జిల్లా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన చిర్రావూరి లక్ష్మీనరసయ్య, సర్వదేవభట్ల రామనాధం, మంచికంటి రాంకిషన్‍రావు, రావెళ్ళ సత్యనారాయణ వంటి యోధులు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఉమ్మడి పార్టీ చీలిపోవడంతో సీపీఎం (కమ్యూనిస్ట్ పార్టీ-మార్క్సిస్ట్) బలమైన శక్తిగా ఎదుగుతూ వచ్చింది. రాష్ట్రం మొత్తంలో సీపీఎంకు పట్టున్న జిల్లాగా పేరు తెచ్చుకుంది.
తొలి రోజుల్లో, ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాలలోనూ, ప్రత్యేకించి జిల్లా రాజకీయాలలోనూ కీలక పాత్ర పోషించిన బొమ్మకంటి సత్యనారాయణరావు, కొంతకాలం రాష్ట్ర రాజకీయాలను శాసించి ముఖ్యమంత్రి, కేంద్రమంత్రిగా ఉన్న జలగం వెంగళరావుల చుట్టూ ఖమ్మం జిల్లా రాజకీయాలు తిరుగుతుండేవి. శీలం సిద్దారెడ్డి రాజకీయంగా ఎదిగి, మంత్రివర్గంలో స్థానం సంపాదించి, నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలగడంతో, జిల్లా కాంగ్రెస్‌లోని ఒక వర్గానికి ఆయన నాయకత్వం వహించారు. ఆ తర్వాత కాలంలో, జలగం-శీలం వర్గాలుగా ఖమ్మం కాంగ్రెసు రాజకీయాలు సాగాయి. కమ్యూనిస్టులు జిల్లాలోనూ, ప్రత్యేకించి ముదిగొండ ప్రాంతంలోనూ, పరిస్థితులను బట్టి శీలం వర్గానికి మద్దతివ్వడమో, తీసుకోవడమో జరిగేది.
జలగం-శీలం వర్గాల మధ్య ఆధిపత్య పోరాటం కొనసాగుతున్న రోజుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఖమ్మం తాలూకా పాలేరు-తిరుమలాయపాలెం పరిధిలోని గ్రామాల్లో సిద్దారెడ్డి వర్గానికి కమ్యూనిస్టుల మద్దతు లభిస్తే, ఖమ్మం సమితి పరిధిలోని గ్రామాలలో కమ్యూనిస్ట్ అభ్యర్థులకు సిద్దారెడ్డి వర్గం మద్దతు లభించేది. ఆ విధంగా చెరొక సమితి దక్కించుకుని జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించేవారు. అయితే కమ్యూనిస్టులు విడిపోయిన తర్వాత సీపీఐ జలగం పక్షాన, సీపీఎం సిద్దారెడ్డి వర్గంతోనూ కలిసి పనిచేశాయి. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కొంత మారింది. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి, ఇంకో సారి తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చేవారు. వారి మద్దతుతో వీలై నన్ని ఎక్కువ స్థానాలు ఆయా ఎన్నికల్లో సంపాదించుకునే ప్రయత్నం చేసేవారు. కమ్యూనిస్ట్ పార్టీలు స్వయంకృషితో ఎదగడం ఒకవిధంగా, రోజులుగడుస్తున్నకొద్దీ, ఆగిపోయిందనే అనాలి
ఇలాంటి రాజకీయ నేపథ్యంలో మొట్టమొదటి సారిగా, గత శతాబ్దం అరవయ్యో దశకంలో, మిగతా జిల్లాల్లో మాదిరిగానే ఖమ్మంలో కూడా గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగడం, ఎన్నికైన సర్పంచులు సమితి అధ్యక్షుడినీ, వీరంతా కలిసి జిల్లా పరిషత్‌ అధ్యక్షుడిని ఎన్నుకోబోవడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిందని రాజకీయ విశ్లేషకులందరూ భావించే "సీల్డ్ కవర్‌" రాజకీయాలకు అపర చాణక్యుడుగా పేరుపడ్డ బొమ్మకంటి సత్యనారాయణరావు ఆ రోజుల్లోనే శ్రీ కారం చుట్టి, తన సమీప బంధువైన రావులపాటి సత్యనారాయణ రావుని, ‘పాలేరుసమితి అధ్యక్షుడిని చేశారు. అప్పట్లో రావులపాటిని తప్ప వేరెవరిని ప్రతిపాదించినా సమితి అధ్యక్ష పదవికి తాము కూడా పోటీలో ఉంటామని కమ్యూనిస్టు నాయకులు ప్రకటించడంతో, సర్పంచ్‌ కూడా కాని ఆయనను కో-ఆప్షన్‌ సభ్యునిగా ఎంపిక చేయించి అధ్యక్షుడిగా చేశారన్న విషయం ఆ ప్రాంతవాసులందరికీ తెలిసిన విషయమే. వాస్తవానికి బొమ్మకంటి నిర్ణయంవల్ల రాజకీయంగా ఎక్కువ నష్టపడింది ఆయన మరో బంధువు అయితరాజు రాం రావు. అప్పటికే రాజకీయంగా బొమ్మకంటితో సమాన స్థాయికి ఎదిగిన ఆయన ఎదుగుదలను ఆపుచేసేందుకే బొమ్మకంటి తన చాణక్య నీతిని ప్రదర్శించాడంటారు. వల్లభి గ్రామ వాస్తవ్యుడైన రాం రావు శీలం గారికి అత్యంత సన్నిహితుడు.
ఈ నిర్ణయంతో బొమ్మకంటి నుండి కొందరు అయినవారు దూరం కావడం, జలగం వర్గం వారికి కోపం కలగడం దరిమిలా చోటు చేసుకున్న పరిణామాలు. ఆ నేపథ్యంలో, ముదిగొండ, పరిసర గ్రామాల రాజకీయాలు క్రమేపీ వేడెక్కాయి. కక్షలకు దారి తీసాయి. అప్పటి వరకూ కలసిమెలసి ఉంటున్న వారిమధ్య చిచ్చు రేగింది. బొమ్మకంటికి అత్యంత సన్నిహితుడిగా అప్పటివరకూ ఉంటూ వస్తున్న సమీప గ్రామానికి చెందిన ఓ భూస్వామికీ, సమితి అధ్యక్షుడికి భూమితగాదాతో ప్రారంభమైన పేచీ చిలికి చిలికి తుఫానుగా మారింది. సమితి అధ్యక్షుడికి అండగా దళితులు, పేదలతో సహా, సాక్షాత్తు ఆయన్ను వ్యతిరేకించిన భూస్వామి కొడుకు పక్షాన పరోక్షంగా స్థానిక కమ్యూనిస్టులు నిల్చారు. దీర్ఘకాలం సాగిన ఆ పోరాటంలో సమితి అధ్యక్షుడి పక్షానున్న భూస్వామి కొడుకును ఆయన తండ్రి నాయకత్వంలోని వైరి వర్గాల వారు హత్య చేయించారని చెప్పుకునేవారు ఆ రోజుల్లో. దీని ప్రభావం అదే మండలంలోని అనేక గ్రామాల్లో- ముందుగా వల్లభిగ్రామంలో పడింది. అలనాటి తగాదాలలో శీలం సిద్దారెడ్డి తన మద్దతును దళితుల పక్షాన నిలిచిన సమితి అధ్యక్షుడికి ఇచ్చారు.
 ముదిగొండలో ఇరుపక్షాల కాంగ్రెస్‌ వారి మధ్య పోరు సాగినంత కాలం శీలం వర్గం రావుల పాటికి అండగానూ, జలగం వర్గం ఆయనకు వ్యతిరేకంగానూ నిల్చింది. అయితే దళితులు, పేదలు రావులపాటికి మద్దతు ఇస్తుండడంతో, వారికి మద్దతుగా కమ్యూనిస్టులు నిల్చారు. ఆ ప్రాంత-జిల్లా, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులైన రాయల వెంకటేశ్వర్లు, రావిళ్ల సత్యం పార్టీ పరంగా ముందున్నారు. రాయల వెంకటేశ్వర్లు ముదిగొండ పంచాయితీలో ఒకప్పుడు భాగమైన వెంకటాపురం గ్రామానికి, రావిళ్ల సమీప గ్రామమైన గోకినేపల్లికి చెందినవారు. తర్వాత జరిగిన పంచాయితీ ఎన్నికల్లో సమితి అధ్యక్షుడిగా జలగం వర్గీయుడు, ముదిగొండ సమీపంలోని మేడేపల్లి గ్రామానికి చెందిన నాటి కాంగ్రెస్‌ యువనేత ఉపేంద్రయ్య గెలుపొందారు. సమితి స్థాయిలో తిరుగులేని నాయకుడిగా, జలగం వర్గంలో ముఖ్యుడిగా, అనతి కాలంలో ఎదిగాడు. అప్పటికే జలగం, శీలం వర్గాలుగా చీలిన కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో ఆధిపత్యం పోరులో కూరుకుపోయింది. ఆ ప్రభావం ముదిగొండ పరిసర గ్రామాల్లో పడింది. జలగం గ్రూప్‌ పక్షాన పలుకుబడిగలిగిన ఒక అగ్రవర్ణం వారు చేరగా, శీలం వైపున మరో అగ్రవర్ణం వారే చేరారు. దళితుల్లో మెజార్టీ శీలం వర్గానికి చెందిన అగ్రవర్ణాల పక్షాన నిల్చారు.
సమితి అధ్యక్షుడిని తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన రావడం, అదీ, కాంగ్రెస్‌నుంచే రావడంతో ఆ ప్రాంత రాజకీయాలు మరో మారు వేడెక్కాయి. సీపీఎం సర్పంచ్‌లు ఉపేంద్రయ్యను పూర్తిగా వ్యతిరేకించగా, సీపీఐకి చెందిన కొందరితో సహా పార్టీ మద్దతుతో గెల్చిన మరి కొందరి మద్దతు ఆయనకు లభించింది. కాకపోతే అలా మద్దతు ఇచ్చిన కమ్యూనిస్టు సర్పంచులు చివరకు పార్టీని వీడి, ఉపేంద్రయ్య అండతో, ఆ తర్వాత కాలంలో కమ్యూనిస్టులపై పోరాటం చేసారు. ఇరుపక్షాలకు చెందిన కొందరు నాయకులు హత్యకు కూడా గురయ్యారు. రాజకీయంగా పలుకుబడి కోల్పోతున్న సమయాన ఉపేంద్రయ్య కూడా హత్యా రాజకీయాలకు బలైపోయారు
అవిశ్వాస తీర్మానంలో ఉపేంద్రయ్యకు అండగా నిలవని సర్పంచులపై కక్ష బూనిన జలగం వర్గానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ అగ్ర వర్ణాల వారికి, అదే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దళితులకు ముదిగొండ మండలంలోని వల్లభిగ్రామం మరో భూ పోరాటానికివేదికైంది. దళితుల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన ఆ గ్రామ అగ్ర వర్ణాల వారికి, దళితులకు తలెత్తిన వివాదం హత్యకు దారితీసింది. చనిపోయిన వ్యక్తి అగ్రవర్ణానికి చెందిన వాడైనందున దళితులను గ్రామం నుంచి బహిష్కరించారు. దళితులకు అండగా నిలిచిన ఆ గ్రామ పెద్ద, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, స్వర్గీయ అయితరాజు రాం రావు గ్రామం విడిచి కొంత కాలం ఖమ్మంలో ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ మొత్తం రాజకీయ పోరాటంలో శీలం సిద్దారెడ్డి స్వాతంత్ర్య సమరయోధుడైన రాం రావు పక్షాన నిలిచారు.
ఈ సమస్యకు పరిష్కారం గాంధేయ మార్గంతప్ప మరోటి కాదని గ్రహించిన అయితరాజు రాం రావు, స్నేహితుల సహాయంతో గాంధి-వినోబా బావేల శిష్యుడైన ఆచార్య భన్సాలిని ఆశ్రయించాడు. పోరాటం కన్నా శాంతే మేలని భావించాడు. వల్లభికి భన్సాలీ వచ్చిన మరుక్షణమే, దళితులను గ్రామానికి రప్పించాలని, వారిని వెళ్లగొట్టిన అగ్రవర్ణాల వారిని కోరాడు. అంతే కాకుండా శాంతియుత వాతావరణంలో సహజీవనం సాగించాలన్న నిబంధననూ విధించాడు. అంతవరకూ నిరాహార దీక్షలో ఉంటానని శపథం చేసాడు. ఒకటి రెండు రోజుల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక వచ్చింది. నాటి గవర్నర్‌ ఖండూభాయ్ దేశాయి, ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి, ఆఘమేఘాల మీద సంధి ప్రయత్నాలు మొదలెట్టారు. సంధికి అంగీకరించాల్సిందెవరో కాదు. కాంగ్రెస్‌లోని ఇరు వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు చెందిన ఇద్దరు ప్రముఖ నాయకులు: జలగం వెంగళరావు, శీలం సిద్దారెడ్డి. జిల్లా మంత్రుల సమక్షంలో గవర్నర్‌, ముఖ్యమంత్రి భన్సాలి దీక్షను విరమింప చేసారు. నాటి నుంచి ఆ గ్రామంలో కొట్లాటలు జరిగిన దాఖలాలు లేవు. రాష్ట్రంలో, బహుశా దేశంలోనే దళితుడు పూజారిగా ఉన్న మొదటి రామాలయం వల్లభి గ్రామంలో ఉంది. అప్పటి జాతీయ, అంతర్జాతీయ వార్తా పత్రికల్లో ఈ విశేషాలన్నీ ప్రముఖంగా చోటు చేసుకున్నాయి. వల్లభి గ్రామ భూపోరాటంలో అక్కడి కమ్యూనిస్టులు దళితుల పక్షాన పోరు సల్పిన కాంగ్రెస్‌ వర్గానికి మద్దతిచ్చారు
ఆ ప్రాంత రాజకీయాలు హత్యా రాజకీయాలుగా, భౌతికంగా ఒక పార్టీ వారిని మరో పార్టీ వారు అనునిత్యం వెంటాడే స్థితికి చేరుకోసాగాయి. మళ్ళీ సమితి ఎన్నిక లొచ్చే సరికి, ఆ ప్రాంతంలోని ప్రతి గ్రామ సర్పంచ్‌ ఓటు అత్యంత ప్రాముఖ్యంగా మారడం విశేషం. చివరకు శీలం వర్గం కాంగ్రెస్‌ సర్పంచుల సహకారంతో సిపిఎం సమితి పీఠాన్ని దక్కించుకుంది. అయితే అంతకుముందు, ఆ తర్వాత, చోటు చేసుకున్న పరిణామాల్లో, ఎంతోమంది కమ్యూనిస్టు-కాంగ్రెస్‌ నేతలు హత్యకు గురయ్యారు. బాణాపురం గ్రామానికి చెందిన మార్క్సిస్ట్ నాయకుడు ముక్క చిన నరసింహతో ఆరంభమైన హత్యాకాండ ఎంతో మందిని బలి తీసుకుంది. కాంగ్రెస్‌-కమ్యూనిస్టుల మధ్య జరిగిన పోరులో సిపిఎం నాయకులు గంధసిరి గ్రామ వాసి గండ్ర వీరభద్రా రెడ్డి, బాణాపురం గ్రామవాసి గండ్లూరు కిషన్‌రావు, కాంగ్రెస్‌కు చెందిన మాజీ కమ్యూనిస్టు కోయ వెంకటరావుతో సహా చాలా మంది చనిపోయారు. పోలీసు క్యాంపులు ఆ ప్రాంతాల్లో అలవాటుగా మారిపోయాయి కొంత కాలం.
శీలం సిద్దారెడ్డికి ఆ విధంగా ఖమ్మం జిల్లా రాజకీయాలతో ఎన్నో విధాల అనుబంధం వుండేది. ఆయన తుది శ్వాస విడిచేంతవరకు కూడా, ఆయన ప్రభావం అంతో-ఇంతో ఖమ్మం జిల్లా రాజకీయాలపై పడుతూనే వుండేదంటే అతిశయోక్తి కాదేమో! చిన్న తనంలో ప్రాధమిక విద్యాభ్యాసం స్వగ్రామం బనిగళ్లపాడులో చేసిన సిద్దారెడ్డి, ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో హైస్కూల్ చదువు పూర్తి చేసుకున్నారు. ఇంటర్ రెండేళ్లు, బిఏ రెండేళ్లు, లా రెండేళ్లు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, రాష్ట్ర సహకార బాంక్ అధ్యక్షుడుగా, కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం కార్యదర్శిగా పనిచేశారు. ఎమ్మెల్సీగా స్థానిక సంస్థల కోటానుండి 1958 లో ఎన్నికైన సిద్దారెడ్డికి 1967 లో మొదటిసారి బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో చోటు దొరికింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అనంతరం జరిగిన మంత్రివర్గ విస్తరణలో మూడో పర్యాయం ఆయన మంత్రి అయ్యారు. నాలుగో సారి పివి నరసింహారావు మంత్రివర్గంలో స్థానం దక్కింది సిద్దారెడ్డికి. ఆయనకు ఎప్పుడూ నీటిపారుదల శాఖనే కేటాయించేవారు.
(రచయిత స్వగ్రామం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో వుంది)

Sunday, December 25, 2011

1977 లో పౌరహక్కుల సభలు: వనం జ్వాలా నరసింహారావు


తీపి గుర్తులు - చేదు అనుభవాలు: అధ్యాయం – 17
1977 లో పౌరహక్కుల సభలు
వనం జ్వాలా నరసింహారావు

(మాజీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సిపిఐ (ఎం) నాయకుడు, ప్రజా వైద్యుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారి జీవితచరిత్రను "తీపి గుర్తులు-చేదు అనుభవాలు" గా గ్రంధస్థం చేసే అవకాశం కలిగింది నాకు. 39 అధ్యాయాల ఆ పుస్తకంలోని వివరాలలో పదిహేడవ అధ్యాయం ఇది).

1977లో ఎమర్జెన్సీ ఎత్తి వేశాక, కేంద్రంలో అధికారంలోకొచ్చిన జనతా ప్రభుత్వం, ఎమర్జెన్సీలో జరిగిన అకృత్యాల అధ్యయనం కోసం, "షా కమీషన్" ఏర్పాటు చేసింది. ఆ స్ఫూర్తితో తిరిగి పౌర హక్కుల ఉద్యమాన్ని జిల్లాలో ప్రారంభించే ప్రయత్నం చేశారు డాక్టర్ గారు. అప్పటికి సిపిఐ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు తదితరులతో కాంగ్రెస్ నాయకులు గెల్లా కేశవరావుగారు, పూర్వ కమ్యూనిస్ట్ నాయకులు గండ్ర సుబ్బారెడ్డిగారు, జనతా పార్టీ నాయకులు చేకూరి కాశయ్యగారు సహకరించారు. కొన్ని కార్యక్రమాలు జరిగాయి. రిటైర్డ్ జస్టిస్ తార్కుండే గారి నాయకత్వాన ఒక కమిటీ, పౌర హక్కుల ఉల్లంఘనలపై ఒక పెద్ద నివేదిక విడుదల చేసింది. నివేదికను హైదరాబాద్‌లో ఆవిష్కరించిన తరువాత ఖమ్మంలో ఆవిష్కరించే ఏర్పాట్లు చేశారు. వర్తక సంఘం భవనంలో పెద్ద సదస్సు జరిగింది. హైదరాబాద్ నుండి కన్న భీరన్ గారు, ప్రముఖ హేతువాది అడ్వకేట్ ఎం. వి. రామ్మూర్తి గారు, కాళోజీ నారాయణరావుగారు హాజరయ్యారు.

ఎమర్జెన్సీ కాలంలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావుగారి ఆధ్వర్యంలో, ఆనాటి నక్సల్స్ పై జరిగిన మారణకాండపై, విషయ సేకరణ కోసం ప్రభుత్వం జస్టిస్ భార్గవ కమీషన్‌ను నియమించింది. ఈ కమీషన్ హైదరాబాద్‌లో విచారణ ప్రారంభించింది. సుందరయ్య, ఓంకార్‍గార్లు విచారణలో పాల్గొన్నారు. కన్నభీరన్‍గారు న్యాయ సంబంధమైన వివరణలు ఇచ్చారు. ఆ కమీషన్ కార్య కలాపాలకు పత్రికలు పెద్ద ఎత్తున ప్రాముఖ్యం ఇవ్వడంతో, ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. కమీషన్ విచారణ బహిరంగంగా చేయరాదని, గుంభనంగా మాత్రమే జరగాలని ఆదేశించింది. అందుకు జస్టిస్ భార్గవ కాని, కన్నభీరన్, సుందరయ్యగార్లు కాని సుముఖంగా లేకపోవడంతో దాన్ని మూసి వేశారు. ఆ రోజుల్లో ఖమ్మం జిల్లాలో కూడా చాలా ఘోరాలు జరిగాయి. సత్తుపల్లికి చెందిన అడ్వకేట్ బత్తుల వెంకటేశ్వరరావును నక్సలైట్ పేరుతో అమానుషంగా పోలీసులు చంపివేశారు. అది పెద్ద సంచలనం సృష్టించింది.

ఆ కేసు తదితర కేసులకు సంబంధించిన వివరాలు డాక్టర్ వై.ఆర్.కె, ఆయన మిత్రులు కర్నాటి రామ్మోహనరావు, బోడేపూడి వెంకటేశ్వరరావు(అడ్వకేట్), ఆయా ప్రదేశాలకు వెళ్లి, సమాచారం సేకరించి, భార్గవ కమీషన్ ముందుకు పంపించారు.

అదే సమయంలో వెంగళరావు అవినీతి అంశంపై విచారణకు "జస్టిస్ విమద్ లాల్ కమీషన్" ఏర్పాటైంది. అది చేకూరి కాశయ్య గారి చొరవతో వేయబడ్డ కమీషన్. దానితో డాక్టర్ వై.ఆర్.కె కు సంబంధం లేదు. కాని, ఆ కమీషన్ కూడా, జస్టిస్ గారి మెతక వైఖరి వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేక పోయింది. ఆ నాడు అవినీతి వ్యతిరేక పోరాటం చేపట్టిన వారందరికీ నిరాశ కలిగించింది.

భార్గవ కమీషన్
దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజుల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, బూటకపు ఎన్‌కౌంటర్లలో అనేక మంది పోలీసుల చేతుల్లో చనిపోయారు. ఆ ఘటనలను విచారించి, నిజానిజాలను కనిపెట్టి బహిరంగంగా బయట పెట్టి బాధ్యులకు శిక్ష విధించాలన్న ఉద్యమం మొదలైంది. ఎమర్జెన్సీ ముగిసిపోయి, జనతా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కూడా జరిగింది. ఆ పాటికే ప్రముఖ పౌర హక్కుల ఉద్యమ నాయకుడు విఎం. తార్కుండే అధ్యక్షుడుగా, ఎనిమిది మంది సభ్యులతో ఏప్రిల్ 1977లో ఏర్పాటైన "తార్కుండే కమిటీ" సాక్ష్యాల సేకరణలో నిమగ్నమైంది. అనేక ప్రాంతాలలో కమిటీ సభ్యులు పర్యటించి, సమాచారాన్ని సేకరించి, నివేదికలను రూపొందించి, ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్‌కు, హోం మంత్రి చరణ్ సింగ్‍కు పంపింది కమిటీ. ఆ కమిటీ సభ్యులలో కన్నబిరాన్, కాళోజీ నారాయణరావు, బి.జి. వర్గీస్, అరుణ్ శౌరి లాంటి ప్రముఖులున్నారు. ప్రధానిని, హోం మంత్రిని కన్నభీరన్ పలుసార్లు స్వయంగా కూడా కలుసుకున్నారు. నివేదికలు చదివిన మొరార్జీ దేశాయ్ విచారణ కమీషన్ వేయాల్సిన అవసరం వుందనే అభిప్రాయానికి వచ్చారు. కాకపోతే అలాంటి కమీషన్‌ను వేసే అధికారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే వుందనేది గమనించాల్సిన అంశం. కేంద్రం జోక్యం తప్పని సరి అని కన్నభీరన్ ప్రభృతులు ప్రధానిని కోరడంతో, రాజీ ఫార్ములాగా, కేంద్రం సూచించిన న్యాయమూర్తిని రాష్ట్ర ప్రభుత్వం నియమించి విచారణ జరిపించాలన్న నిర్ణయం జరిగింది.

పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ వశిష్ట భార్గవ నాయకత్వంలో, వెంగళరావు ప్రభుత్వం, భార్గవ కమీషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ భార్గవకు నిజాయితీపరుడని, ముక్కు సూటిగా మాట్లాడే వాడని, జిల్లా జడ్జీగా-హైకోర్టు జడ్జీగా-సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా మంచి పేరు తెచ్చుకున్నాడని గుర్తింపు వుంది. కమీషన్ కార్యదర్శిగా బీనాదేవిగా ప్రసిద్ధిగాంచిన రచయిత బి. నరసింగ రావును నియమించింది ప్రభుత్వం. ఆయన కార్యదర్శిగా జులై 1977 చివరి వారంలో, కమీషన్‌కు సంబంధించిన తొలి విచారణ బహిరంగ ప్రకటన వెలువడింది. హైదరాబాద్ దిల్ కుషా ప్రభుత్వ అతిధి గృహంలో విచారణ జరిగింది. మొట్ట మొదటి వాంగ్మూలం తార్కుండే ఇచ్చారు. తార్కుండే కమిటీ పక్షాన ఎం. వి. రామమూర్తి, కన్నబిరాన్ వాదనలు వినిపించేవారు. పి. శివశంకర్‌ను ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఆయా రంగాలలో నిపుణులైన మరి కొందరిని కూడా కమీషన్ నియమించింది.  

ప్రభుత్వం సాగించిన అమానుష హత్యాకాండపై న్యాయ విచారణ
ఖమ్మం జిల్లా పౌరహక్కుల పరిరక్షణ సదస్సు డిమాండ్
(విశాలాంధ్ర: జూన్ 19, 1977)
        ఎన్నో ఘోరాలు చేసి, ఎన్నో నిండు ప్రాణాలను బలిగొన్న ఆంధ్రపదేశ్ ప్రభుత్వ అమానుష హత్యాకాండపై న్యాయవిచారణ జరగాలని, బాధ్యులైన  వారెంతటి ఉన్నత పదవుల్లో వున్నా, వారిని వెంటనే సస్పెండ్ చేసి, న్యాయవిచారణలో దోషులుగా రుజువైన వారందరినీ కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఖమ్మంజిల్లా పౌరహక్కుల పరిరక్షణ సదస్సు తీర్మానించింది.

           న్యాయవిచారణ సక్రమంగా జరగడానికై ఈలోగా రికార్డులు మాయమయ్యేందుకు గాని సాక్షులను బాధ పెట్టేందుకు గాని పోలీసులకు, ప్రభుత్వానికి అవకాశం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సదస్సు కోరింది

ఖమ్మం జిల్లా పౌరహక్కుల పరిరక్షణ అఖిల పక్ష సదస్సు ఈ నెల 12వ తేదినుండి (1977) స్థానిక వర్తక సంఘం భవనంలో జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా సమితి, జిల్లా మార్క్సిస్టు పార్టీ, జనతాపార్టీ, జమాతే--ఇస్లామి పార్టీలతోను, ఇతర మేధావులతోను ఏర్పడి, సన్నాహక సంఘం పిలిపుపైన జరిగిన ఈ సదస్సుకు జిల్లా అన్ని ప్రాంతాలనుంచి వివిధ పార్టీలకు చెందిన వారు, పట్టణ మేధావంతులు, విదార్ధులు, యువకులు, కార్మికులు, డాక్టర్లు, న్యాయవాదులు, 15 వందల మందికి పైగా పాల్గొన్నారు

సన్నాహక సంఘ కన్వీనర్ డాక్టర్ ఎలమంచిలి రాధాకృష్ణమూర్తి స్వాగతం పలికారు. సదస్సుకు న్యాయవాది శ్రీ కొమరిగిరి సుందర రామారావు అధ్యక్షత వహించారు

శ్రీ కాళోజీ నారాయణరావు సదస్సును ప్రారంభిస్తూ గత 30 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో పౌరహక్కులు లేకుండా పోయాయని, ముఖ్యంగా నక్సలైట్స్ పేరుతో అనేకమందిని పట్టుకుని కాల్చివేసిందని, వారు గావించిన పాపాలన్నిటిని విచారణ జరిపి, దోషులందరినీ జైళ్ళాలో పెట్టే పరిస్థితి ఈనాడు ఏర్పడిందని అన్నారు.

తరువాత శ్రీ కన్నాభిరాం సందేశమిస్తూ సంఘబలం ద్వారానే ప్రభుత్వాలను అదుపులో పెట్టగలమనిచెపుతూ, తార్కుండే కమిటీ ఏర్పడిన విధానం, అవి ఇప్పటివరకు పరిశోధించిన కేసులు, వాటి స్వరూప స్వభావాలు వివరిస్తూ యీ కమిటీ చేసిన పని యావత్తూ సాక్ష్యాధాలతో సహా ప్రజల ముందుంచుకుంటానని చెప్పారు.

శ్రీ నార్ల వెంకటేశ్వరరావు పంపిన సందేశాన్ని సదస్సులో చదివారు.

సాయంత్రం 4 గంటలకు తార్కుండే కమిటీ ప్రకటించిన రెండవ నివేదికను కమిటీ సభ్యుడైన యం.వి. రామమూర్తి సదస్సులో సందేశాన్నిచ్చారు.

సదస్సులో 9 అంశాలతో కూడుకొన్న తీర్మానాన్ని శ్రీ పాటిబండ్ల రవికుమార్ (అడ్వకేట్) ప్రతిపాదించగా వివిధ పార్టీల నాయకులు దానిపై తమ తమ అభిప్రాయాలను చెపుతూ వాటికి తమ సంపూర్ణ సహకారాన్ని ప్రకటించిన తర్వాత తీర్మానాన్ని సదస్సు కరతాళ ధ్వనుల మధ్య ఆమోదించింది.

తీర్మానంపైన జరిగిన చర్చల్లో కమ్యూనిస్టుపార్టీ తరపున శ్రీ పారుపల్లి పుల్లయ్య, శాసన సభ్యులు శ్రీ మహమ్మద్ రజబ్ ఆలీ, మార్క్సిస్టూపార్టీ తరపున శ్రీ టి.వి.ఆర్. చంద్రం, శ్రీ కె.యల్. నర్సింహారావు, జనతాపార్టీ తరపున శాసనసభ్యులు శ్రీ చేకూరు కాశయ్య, శ్రీ గండ్ర సుబ్బారెడ్డి, జమాత్--ఇస్లామి తరపున శ్రీ మహమ్మద్ ఇలియాస్, నక్సలైట్స్ తరపున శ్రీ జానారెడ్డి కోటేశ్వరరావులు పాల్గొన్నారు.

చివరిలో సదస్సు కన్వీనర్ డా. రాధాకృష్ణమూర్తి చర్చలను ముగిస్తూ విభిన్న ధృక్పదాలు కలిగియున్న పార్టీలన్నీ ఏకమై పౌరహక్కుల పరిరక్షణ సదస్సును జరుపుకోవడంవల్ల యీ జిల్లాలో నూతనాధ్యాయానికి నాంది పలికిందని అన్నారు.

శ్రీ అడపా గోపాలకృష్ణమూర్తి వందన సమర్పణతో సదస్సు జయప్రదంగా ముగిసింది.

నూతన కమిటీ
          సదస్సులో ఈ క్రింది వారితో జిల్లా పౌరహక్కుల పరిరక్షణ కమిటీని ఏకగ్రీవంగా యెన్నుకున్నారు
          డా. వై. రాధాకృష్ణమూర్తి (కన్వీనర్), శ్రీయుతులు చేకూరి కాశయ్య (ఎం.ఎల్.), మహమ్మద్. రజబ్ ఆలీ (ఎం.ఎల్.), కొమరిగిరి సుందర రామారావు (ఆద్వకేట్),, అజహర్ ఆలీ (అడ్వకేట్), విరాధాకృష్ణ (అడ్వకేట్), డా. వి. రామనాధంవాసిరెడ్డి కోటేశ్వరరావు, అడపా గోపాలకృష్ణమూర్తి, పువ్వాడ నాగేశ్వరరావు (కమ్యూనిస్టు పార్టీ), పాదుపల్లి పుల్లయ్య (కమ్యూనిస్టుపార్టీ), టి.వి.ఆర్.చంద్రం (మార్క్సిస్టు పార్టీ), కె.ఎల్. నర్సింహారావు (మార్క్సిస్టు పార్టీ), గండ్ర సుబ్బారెడ్డి (జనతాపార్టీ), మహమ్మద్ ఇలియాజ్‌ (జమాత్--ఇస్లామి), యం. రామచంద్రారావు (ఎస్.పహె.), సిద్ధి వెంకటేశ్వర్లు (యువజన సమాఖ్య).

          రాజకీయ ఖైదీల పై నేరవిచారణ పేరుతో కుట్ర కేసులు బనాయించి సంవత్సరాల తరబడి నేర విచారణ తతంగాన్ని పొడిగించి వారిని దీర్ఘకాల కారాగార బాధితుల్ని చేయటం, అందులో నిర్దోషులుగా పేర్కొనబడిన వారుకూడా ఈ మొత్తం కాలం అనవసరంగా శిక్షలను అనుభవించవలసి రావటం, నేరం రుజువు కాకుండానే కఠిన శిక్షను అమలుపర్చే ప్రభుత్వ కుట్రగా భావించి సదస్సు తీవ్రంగా ఖండించింది.

          రాజకీయ నాయకులను చంపిగాని, ప్రాణాలతోగాని వచ్చిన వారికి పారితోషికాలు ప్రకటించి, మన ప్రభుత్వంవలన ప్రభుత్వాల అమానుషత్వాన్ని తలదన్నిందిఅట్టి విధానాన్ని రద్దుచేసి నాగరిక ప్రభుత్వ పద్ధతులను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.

          జైళ్ళలో ఇప్పటికీ మగ్గిపోతూవున్న రాజకీయ ఖైదీలందరినీ బేషరతుగా విడుదలచేయాలని, రాజకీయ ప్రత్యర్ధులపై మోపిన అన్ని కేసులను, వారంట్లను ఉపసంహరించాలని డిమాండ్ చేసింది.

          మీసా, డి..ఆర్. వంటి రాక్షస చట్టాలను రద్దు చేయాలని, కల్లోలిత ప్రాంతాల ప్రకటనను రద్దుచేయాలని, రాజకీయ వివక్షతతో ఉద్యోగాలనుండి తొలగించిన వారిని తిరిగి చేర్చుకోవాలని సదస్సు కోరింది.

          ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు తెలిసినవారు మానవతా దృక్పథంతో వాస్తవాలను బహిరంగ పరచ వలసిందిగా సదస్సు కోరింది.