రెండువేల పది సంవత్సరానికి వీడ్కోలు... పదకొండుకి స్వాగతం...
వనం జ్వాలా నరసింహారావు
కొత్త ఆశలు - పాత వైఫల్యాలు - (ఆంధ్ర జ్యోతి, 1-01-2011)
2010 సంక్రాంతి రోజున అమెరికాలో వున్న నేను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు పండుగ శుభాకాంక్షలు తెలియచేసేందుకు ఫోన్ చేశాను. ఉభయ కుశలోపరి తర్వాత, మరికొన్నాళ్ళు నన్ను అక్కడే వుండమని సలహా ఇచ్చారాయన. ఆయనలా ఎందుకన్నారో కారణం అందరికీ తెలిసిన విషయమే! అంతకు ముందు నెల రోజుల పూర్వం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష దరిమిలా కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటన నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిన హింసా కాండ వల్ల శాంతిభద్రతల సమస్యలతో సతమవుతున్న హైదరాబాద్ కు రావడం కంటే, మరి కొద్ది రోజులు అమెరికాలో పిల్లల దగ్గర గడపడమే మేలని, ఆయన సూచనగా నాకర్థమయింది. మరో నూతన సంవత్సరాదికి స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్న నేడు కూడా రాష్ట్రంలో మళ్లీ అలాంటి పరిస్థితులే తలెత్తే అవకాశం వుండడమంటే అంతకంటే దురదృష్టం బహుశా మరోటి లేదనాలి.
2010 న్యూ ఇయర్స్ డే సందర్భంగా, డిసెంబర్ 31 రాత్రి, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, అమెరికా - హ్యూస్టన్ నగరంలో వుంటున్న సాహితీ మిత్రుడు పిల్లుట్ల సుదేష్ కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన విందు-వినోద కార్యక్రమం మా అమెరికా పర్యటనలో ఒక మరపురాని సంఘటనగా మిగిలిపోయింది. చిన్న పిల్లలు, చిన్న పిల్లల్లా పెద్దలు, ఆడా-మగ తేడా లేకుండా, కలిసి-మెలిసి ఆనందంగా, తూరుపు-పడమరల సంగమంగా ఎంతో వేడుకగా జరుపుకొని, అర్థరాత్రి పన్నెండవుతూనే "హేపీ న్యూ ఇయర్ టు యూ" అంటూ కేరింతలు వేశారందరూ. శంకరాభరణం శంకరశాస్త్రి గారింట్లో పాదం మోపితే "సరిగమలు" వినిపిస్తాయని సినిమాలో చూచినట్లే, వీళ్ళింట్లోకి వెళ్లిన మాకు, మరచిపోతున్న మన సంస్కృతీ-సాంప్రదాయాలు కళ్ల ముందర సాక్షాత్కరించాయి. అలానే సంక్రాంతి సంబరాలు కూడా అక్కడే జరుపుకున్నాం. మరి ఈ ఏడాదో?... ఎలా వుండబోతోందో? ఈ వ్యాసం రాసేటప్పుడు అగమ్యగోచరంగానే వుందనాలి?
ఏం జరగనున్న దో అని అనుకుంటూ ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే, తెలంగాణ - సమైక్యాంధ్ర ఉద్యమాల నేపధ్యంలో అల నాడు రాష్ట్రంలో నెల కొన్న పరిస్థితులను అధిగమించడానికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పరిశీలించడానికి, కేంద్రప్రభుత్వం నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను పాత్రికేయుల సమక్షంలో, హోం మంత్రి చిదంబరానికి అందచేసింది. తదుపరి ప్రక్రియ, జనవరి 6, 2011 న రాష్ట్రానికి చెందిన ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సంప్రదించిన తర్వాతే ప్రారంభిస్తామని చిదంబరం ప్రకటన చేయడం వల్ల ఇక 2010 సంవత్సరానికి ఆందోళనలకు తావులేకుండా వీడ్కోలు పలికే అవకాశం కలిగిందనాలి. కాకపోతే, "కృష్ణా జలాలపై" బ్రజేష్ ట్రిబ్యునల్ తీర్పు మరో వివాదానికి తెర లేపి, శాశ్వతంగా పొరుగు రాష్ట్రాలకు, మనకు మధ్య విరోధానికి నాంది పలికిందని అనక తప్పదు. రాష్ట్రానికి, ఒక వైపు నికర జలాల వాటా పెంచుతూనే, గతంలో బచావత్ తీర్పు నిష్పత్తిలో కాకుండా తగ్గింపు కోటా ఇవ్వడం, మరో వైపు అదనపు జలాల కోటా పూర్తిగా తగ్గించడం వల్ల, రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చేసేందుకు అవకాశాలను కలిగించింది ట్రిబ్యునల్. ఇలా ఆరంభమవుతున్న ది నూతన సంవత్సరం. ఉగాది పచ్చడిని పోలిన ఆంగ్ల ఉగాదికి ఇలా స్వాగతం పలుకుతాం!
ఈ నేపధ్యంలో గత ఏడాది సంఘటనలను ఒక్క సారి మననం చేసుకుంటే ఎలా వుంటుంది?
2009 సంవత్సరంలో విమాన ప్రమాదంలో మరణించిన రాజశేఖర రెడ్డి స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొణిజేటి రోశయ్య సారధ్యంలో, ఆయనకు ప్రమేయం వున్నా - లేకపోయినా, రాష్ట్ర ప్రజలకు 2010 సంవత్సరం ఎన్నో చేదు అనుభవాలను రుచి చూపించింది. ఆయనకు అలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. డిసెంబర్ (2009) తొమ్మిది నాటి చిదంబరం "తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు" ప్రకటన వేర్పాటు వాదుల్లో ఆశలు రేకెత్తించగా, సమైక్య వాదులను ఉద్యమ దిశగా మళ్లించింది. దరిమిలా, తెలంగాణలోని ప్రజాప్రతినిధులు-ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీలకతీతంగా తమ పదవులకు రాజీనామా చేయడం, చివరకు కేవలం పన్నెండు మంది ఎమ్మెల్యేల రాజీనామాలు మినహా మిగతా అందరివీ తిరస్కరించడం జరిగింది. రాజీనామాల విషయంలో స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రదర్శించిన "వ్యూహం", అధిష్టానం దృష్టిని ఆకర్షించి, రోశయ్య స్థానంలో అతి పిన్న వయస్సులో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కావడానికి దోహద పడిందనవచ్చు! ఆ పన్నెండు మందిలో ఒకరు టిడిపికి, మరొకరు బిజెపికి చెందిన వారు కాగా, మిగతా పదిమంది తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎన్నికైన వారే. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలలో రాజీనామా చేసిన వారందరినీ భారీ మెజారిటీతో గెలిపించారు తెలంగాణ ఓటర్లు. ఆ తీర్పు ఒక విధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర వాదనకు బలం చే కూరిస్తే, మరో విధంగా రోశయ్య నాయకత్వంలోని బలహీనతలను బహిర్గతం చేశాయనాలి. ఆ మాటకొస్తే, రాజశేఖర రెడ్డి మరణంతో పార్టీ పరంగా కాంగ్రెస్, పాలనాపరంగా రాష్ట్రం "పటిష్టమైన నాయకత్వాన్ని" దాదాపు కోల్పోయిందనవచ్చు. ఒక వైపు తెలంగాణా ప్రజల్లో జాగృతి పెరగడానికి, మరోవైపు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి "ప్రత్యామ్నాయ నాయకుడు" గా ఎదగడానికి పరిస్థితులు అనుకూలించసాగాయి. అధిష్టానం అండదండలు పుష్కలంగా వున్న రోశయ్య, తన అపారమైన రాజకీయ అనుభవాన్ని ఫణంగా పెట్టినప్పటికీ, సంక్షోభాన్ని అధిగమించడంలో పూర్తిగా విఫలమయ్యాడనే చెప్పాలి.
రాజకీయ రంగంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న మరో పరిణామం వై ఎస్ జగన్ చేపట్టిన "ఓదార్పు యాత్ర". వర్తమాన రాజకీయాల్లో, యావదాంధ్ర దేశంలో ఆబాలగోపాలం నోట జగన్ ఓదార్పు యాత్ర చర్చనీయాంశమైపోయినంతగా, బహుశా మరే అంశం కాలేదే మో! కారణాలే వైనా, ఆయన వెళ్లిన ప్రతి చోటా, విశేషంగా ప్రజాదరణ లభించింది. ముఖ్యమంత్రి హోదాలో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను జగన్ ఓదార్పు యాత్రకు వెళ్లకుండా ఆంక్షలు విధించే ప్రయత్నాలు రోశయ్య చేసినా, ఫలితం కనిపించలేదు. ఆయన నాయకత్వ లోపానికి అది మరో నిదర్శనంగా మిగిలిపోయింది. చివరకు సాక్షాత్తు "కాంగ్రెస్ అధినేత్రి" బెదిరింపులకు కూడా లొంగని జగన్ వెంట చెప్పుకోదగ్గ సంఖ్యలో ప్రజాప్రతినిధుల మద్దతు లభించింది. చివరకు, పార్టీని-అధిష్టానాన్ని తప్పు పడుతూ, జగన్ తన పార్లమెంట్ సభ్యత్వానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, కనీవినీ ఎరుగని సవాలు విసిరారు. ఆధ్యతన భవిష్యత్ లో ఆ సవాలు కాంగ్రెస్ అస్తిత్వానికే ముప్పు తెచ్చే దిగా పరిణమించవచ్చు. 2010 లో రాజకీయంగా, ఆంధ్ర రాష్ట్రంలో ఇదొక ప్రాముఖ్యత సంతరించుకున్న అంశంగా భావించాలి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరుగుతుందో-లేదో కాని, ఆ పేరుమీద జరుగుతున్న వుద్యమంలో భాగంగా సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల మధ్య సాంస్కృతిక విభేదాలు కొట్టొచ్చినట్లు పొడచూపాయి. తెలంగాణ ధూమ్-ధాం, బ్రతుకమ్మ పండుగలు పెద్ద ఎత్తున జరుపుకోవడం విశేషం. సినిమాలలో కూడా ఆంధ్ర తెలంగాణ విభేదాలు కనిపించాయి. ఒక ప్రాంతం వారికి చెందిన అంశాలకు సంబంధించిన సినిమాలను చేరే ప్రాంతం వారు బహిష్కరించే దాకా పోయింది కొన్ని సందర్భాల్లో.
వామ పక్ష వుద్యమం ఆంధ్ర ప్రదేశ్ లో క్రమేపీ బలహీన పడుతున్న సూచనలు ఈ సంవత్సరం ప్రస్ఫుటంగా కనిపించ సాగాయి. భారత కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీలో చోటుచేసుకుంటున్న విపరీత ధోరణులు పార్టీని ఎటు వైపుగా తీసుకెళ్తాయో నాయకత్వానికే అర్థం కావాలి. ప్రాణాలను-ఆస్తులను-కుటుంబ బాధ్యతలను లెక్క చేయకుండా, సుందరయ్య గారి లాంటి నాయకులు, పార్టీని పటిష్టం చేశారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో అల నాడు అంతమంది పాల్గొనడానికి కారణం ప్రజల్లో పార్టీ పట్ల-పార్టీ నాయకుల పట్ల వున్న విశ్వాసమే. క్రమేపీ, ప్రజలకు దూరం కా సాగింది కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజలే న్యాయమూర్తులని, వారికే తాము జవాబుదారులమని మరిచిపోతోంది పార్టీ నాయకత్వం. వాస్తవాలన్నీ ప్రజలు గమనించుతున్నారని కూడా గ్రహించలేని స్థితికి పోతుందా పార్టీ అనిపిస్తుంది. పార్టీలో ఏం జరుగుతుందో సామాన్యుడికి తెలిసే అవకాశమే లేదిప్పుడు. దానికి కావాల్సిన యంత్రాంగం లేనప్పుడు, ప్రజలతో సంబంధాలు తెగిపోవడం సహజం.
అయోధ్యలోని ఒకానొక చారిత్రక వివాదంపై అలహాబాద్ హైకోర్టు సెప్టెంబర్ 30, 2010 న ఇచ్చిన చరిత్రాత్మక "సెక్యులర్" తీర్పు ప్రభావం మిశ్రమంగా కనిపించింది. విశ్వాసాల ప్రాతిపదికగా, నమ్మకాల ప్రాతిపదికగా, చారిత్రాత్మక కట్టడాల నేపధ్యం ప్రాతిపదికగా, చారిత్రిక సాక్ష్యాధారాల ప్రాతిపదికగా, స్వాధీన అధీనం ప్రాతిపదికగా అనేకానేక పరిశోధనల సాక్ష్యాధారాలను ప్రామాణికంగా చేసుకుని వెలువరించిన ధర్మాసనం తీర్పును పలువురు ఆహ్వానించారనే అనాలి.
మరి కొన్ని విశేషాలు చెప్పుకోవాలంటే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రప్రధమంగా ఏర్పాటుచేసిన "బి. ఎన్. రెడ్డి జాతీయ అవార్డ్" గ్రహీత, ప్రముఖ సినీ దర్శక నిర్మాత-మానవతావాది-సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గళం విప్పిన కె. బి. తిలక్ సెప్టెంబర్ నెలలో చనిపోయారు. తెలుగు కవిత్వాన్ని స్వయంగా నడిపించిన ఒక శతాబ్దపు యుగ కవిగాను, మహాకవి గాను, తెలుగు సాహితీ-సాంస్కృతిక రంగాలపై అనూహ్యమైన ప్రభావం చూపిన అరుదైన వ్యక్తి గాను, అరసం-విరసం అధ్యక్షుడి గాను, అహర్నిశలు కమ్యూనిస్టుల పక్షాన నిలబడ్ట సామ్యవాదిగాను, "తెలుగు కవిత్వాన్ని ఖండించి-దీవించి-ఊగించి-శాసించి-రక్షించి” న మహా ప్రస్థానం సృష్టికర్త గాను, అందరికీ సుపరిచితుడైన మహాకవి శ్రీశ్రీ నూరేళ్ల విరసం మహాసభలు జరిగాయి. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా-విలీనమా అన్న వాదనలు ఈ సంవత్సరం చోటుచేసుకున్నంతగా గతంలో ఎప్పుడూ లేదు. బాబ్లీ ప్రాజెక్టును సందర్శించి, స్వయంగా అధ్యయనం చేసి, ప్రధానికి అన్ని విషయాలు తెలియచేయాలన్న ఆలోచనతో ఆంధ్ర-మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, తెలుగు దేశం పార్టీకి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులను, మహారాష్ట్రలోకి రానీకుండా అడ్డుకున్న మరాఠా పోలీసులు, ప్రాజెక్టుకు తీసుకుపోతామని మభ్యపెట్టి, పోలీసు వాహనం ఎక్కించి, అతి జుగుప్సాకరమైన పద్ధతిలో వారందరినీ "అరెస్టు" చేసినట్లు ప్రకటించి, మూడు రోజులు శారీరకంగా హింసకు గురిచేయడం పలువురిని విస్మయ పరిచింది.
మన రాష్ట్రంలో పుట్టక పోయినా ఇక్కడి అశేష ప్రజానీకం ఆదరాభిమానాలను చూరగొన్న మహామనిషి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ మృతి, పౌర హక్కుల నాయకుడు కన్నభీరన్ మృతి 2010 లో చోటుచేసుకున్న అత్యంత విషాదకరమైన సంఘటనలుగా పేర్కొనాలి.
మకుటం లేని మహారాణిగా చెలామణి అవుతున్న కాంగ్రెస్ పార్టీ "అధినాయకి " సోనియా గాంధీని, పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి రాజీనామా చేసిన వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వైపు, కాంగ్రెస్ పార్టీతో సరి సమానమైన ప్రజా బలం వున్న తెలుగు దేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు మరో వైపు, ఏ క్షణం ఎలాంటి వ్యూహంతో-ఎత్తుగడలతో ఎదురు తిరుగు తాడో అర్థంకాని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె సి ఆర్ ఇంకో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, 2010 సంవత్సరంలో (ఆయన పాలన చేసిన సుమారు నెల రోజులు) ఇబ్బందులకు గురి చేస్తూనే వున్నారనాలి. జగన్ ఓదార్పు యాత్రలు, రైతు సంక్షేమ యాత్రలు, చివరకు రెండు రోజుల సామూహిక "లక్ష్య దీక్ష" కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సవాలు విసిరింది గత ఏడాది. అలానే, అంతకంటే ఎక్కువ మోతాదులోనే చంద్రబాబు నాయుడి ఆమరణ నిరాహార దీక్ష, దరిమిలా చెలరేగిన సంఘటనలు, గుంటూరులో నిర్వహించిన "రైతు కోసం" మహా సభ కూడా ముఖ్య మంత్రికి పెను సవాలే. విద్యార్థులపై వుద్యమాల సందర్భంగా పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా శీతాకాలం శాసన సభ సమావేశాలలో డిమాండు చేసినా ఒప్పుకోని కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరాహార దీక్షకు దిగగానే ఒప్పుకోవడం 2010 సంవత్సరాంతంలో ప్రాముఖ్యత సంతరించుకున్న ప్రధాన అంశం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కాని, తదనంతర పరిణామాలు కాని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టక పోతే, 2010 లో సంభవించిన పరిణామాల కంటే తీవ్రమైన పరిణామాలు 2011 జరగడానికి ఆస్కారం వుండబోతుందన వచ్చు. అలా జరగ రాదని, అందరూ సంయమనం పాటించాలని కోరుకుంటూ, రెండువేల పది సంవత్సరానికి వీడ్కోలు... పదకొండుకి స్వాగతం పలుకుదాం.