Monday, May 20, 2024

ప్రతీహారవంశం, పాలవంశం (బ్రాహ్మణ రాజులు-24, 25) : వనం జ్వాలా నరసింహారావు

ప్రతీహారవంశం, పాలవంశం (బ్రాహ్మణ రాజులు-24, 25)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (20-05-2024)

ప్రతీహారవంశం

భారత దేశంలోని రాజపుత్ర స్థానాన్ని పాలించిన రాజవంశాలలో ప్రతీహార వంశం ప్రముఖమైనది. హరిశ్చంద్రుడు అనే బ్రాహ్మణుడు ఈ రాజ్యస్థాపకుడు. ఈ వంశంలో చివరివాడు శీలుకుడు. ఇది తరువాత కాలంలో గొప్ప శక్తి సమన్వితమైన రాజ్యంగా రూపుదిద్దుకున్నది. ప్రతీహార వంశానికి చెందిన రాజులు వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా ప్రాగ్దక్షిణ ప్రదేశాలలో చిన్న చిన్న రాజ్యాలను స్థాపించుకుని పాలించారు. కొందరేమో లాట దేశంలోని నందిపురి రాజధానిగా దక్షిణ భాగాన్ని ఏలారు. ఘూర్జర రాజ్యాన్ని ప్రతీహార వంశానికి చెందిన ప్రధానమైన శాఖ వారు పాలించినట్లు కూడా ఆధారాలున్నాయి. ప్రధాన శాఖకు చెందిన ప్రతీహార ప్రభువులు జోధ్పూర్ రాజధానిగా పాలన చేశారు. ప్రతీహార వంశీయుడైన నాల్గవ వత్సరాజు జాలార్, అవంతీ రాజ్యాలను పాలించినట్లు ఆధారాలున్నాయి. నాల్గవ వత్సరాజు, అతడి పూర్వీకులు ఉజ్జయినీ నగరాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు.

         ప్రతీహార వంశం క్రీస్తుశకం 8 వ శతాబ్ది ప్రథమార్థంలో ప్రాముఖ్యంలోకి వచ్చింది. నాగభట్టు అనే ప్రతీహార ప్రభువు మ్లేచ్చరాజును ఎదిరించి ఓడించాడు. ఇతడే మొదటి నాగభట్టు. ఇతడు భారతావని మీద దండెత్తి వచ్చిన అరబ్బు రాజులను కూడా ఓడించాడు. మొదటి నాగభట్టు ప్రాక్ ప్రతీహార శాఖకు చెందినవాడు. మొదటి నాగభట్టు క్రీస్తుశకం 730 నుండి క్రీస్తుశకం 756 వరకు సుమారు 27 సంవత్సరాలు పాలించినట్లు ఆధారాలున్నాయి. మొదటి నాగభట్టు సైన్యాన్ని సమీకరించుకొని, మాళవము, రాజపుత్ర స్థానం, ఘూర్జరము లోని కొన్ని ప్రాంతాలను జయించి శక్తి సమన్వితమైన ప్రతీహార రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నాగభట్టు భారత జాతి గర్వించదగ్గ మహారాజు. విదేశీయుల దాడులను అరికట్టి గొప్ప జాతీయ నాయకుడిగా ప్రసిద్ధికెక్కాడు.

         మొదటి నాగభట్టు అనంతరం అతడి సోదరుడి కుమారులు కక్కుకియా, దేవరాజు అనేవారు ఒకరి తరువాత ఒకరు రాజ్యపాలన చేశారు. దేవరాజు కుమారుడు వత్సరాజు చారిత్రిక పురుషుడు. గొప్ప బలవంతుడు. శక్తిమంతుడైన రాజు. ఇతడు రణహస్తి వత్సరాజుగా ప్రఖ్యాతుడు. వత్సరాజు తన రాజ్యానికి ఉత్తర దిశలో వున్న భూభాగాన్ని, మధ్య రాజపుత్ర స్థానాన్ని పాలించాడు. భండి తెగవారి నుండి వారి రాజ్యాన్ని వత్సరాజు బలవంతంగా గ్రహించాడు. వత్సరాజు గౌడ ప్రభువును కూడా జయించాడు. వత్సరాజు ఉత్తరాపథంలోని అనేక రాజ్యాలను జయించి మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు.

         వత్సరాజు మరణానంతరం అతడి కుమారుడు రెండవ నాగభట్టు ప్రతీహార రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడు అనేక రాజ్యాలను జయించి తన రాజ్యాన్ని వృద్ధి చేసుకున్నాడు. అనేక గిరి దుర్గాలను కూడా స్వాధీన పర్చుకున్నాడు. రెండవ నాగభట్టు అనేక విజయాలను సాధించినప్పటికీ, చివరకు రాష్ట్రకూటాన్వయుల చేతిలో పరాజితుడయ్యాడు. విశాల సామ్రాజ్య నిర్మాణానికి ప్రయత్నించిన ప్రతీహార రెండవ నాగభట్టు కోరిక కలగా మిగిలిపోయింది. రాష్ట్రకూటులతో రెండవ నాగభట్టు యుద్ధంలో ఓడిపోయినప్పటికీ, అతడు అజ్ఞాతవాసిగా జీవిస్తూ, తిరిగి రాజ్యాన్ని సంపాదించి, ప్రతీహార సామ్రాజ్యంలోని కొన్ని భాగాలను పాలించాడు. ఇతడు క్రీస్తుశకం 833 వరకు పాలించాడు.

         రెండవ నాగభట్టు అనంతరం, అతడి కుమారుడు రామభద్రుడు సింహాసాన్ని అధిష్టించి కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే పాలించాడు. ఇతడు పిరికివాడు. యుద్ధంలో వెనుకంజ వేసేవాడు. పరిపాలనా పటిమ లేనివాడు. విశాల ప్రతీహార రాజ్యంలోని అధిక భూభాగాన్ని ఇతడు యుద్ధాలలో కోల్పోవాల్సి వచ్చింది. ఇతడు ఆదరణ కోల్పోయి కేవలం నామ మాత్రపు ప్రభువుగా కొనసాగాడు. రామభద్రుడి పాలనాకాలం క్రీస్తుశకం 833-835.  

         రామభద్రుడి కుమారుడు భోజుడు బాల్యం నుండే సమస్త విద్యలలో ఆరితేరి తండ్రి మరణానంతరం ప్రతీహార సింహాసనం అధిష్టించాడు. శత్రువుల హస్తగతమై వున్న కన్యాకుబ్జాన్ని భోజరాజు జయించి తన రాజధానిగా చేసుకొన్నాడు. శత్రురాజుల వశమై పోయిన రామభద్రుడి కాలంలో దానం ఇచ్చిన అగ్రహారాలను భోజరాజు పునరుద్ధరించాడు. భోజుడు రాజ్యాధికారం వహించిన తరువాత అనేక రాజ్యాలను జయించి పూర్వ ప్రతీహార రాజ్యాన్ని పునరుద్ధరించాడు. అయితే పాల వంశీయుడైన దేవపాలుడు ప్రతీహార రాజ్యం మీద దండెత్తి భోజుడిని ఓడించాడు. భోజుడు పట్టుదల కలవాడు. ప్రతిభావంతుడు. అపజయాలను లెక్కచేయకుండా సైన్యాన్ని సమకూర్చుకుని, క్రీస్తుశకం 9 వ శతాబ్దాంతంలో దండయాత్రలు నిర్వహించి విజయాలు సాధించాడు. ప్రతీహార భోజుడు కడు సమర్థుడు. యుద్ధ విద్యా విశారదుడు. విశాల సామ్రాజ్యాన్ని తన వారసులకు అప్పచెప్పాడు. క్రీస్తుశకం 855 లో ఇతడు మరణించాడు.  

         భోజుడి తరువాత రాజ్యానికి వచ్చిన ప్రతీహార పాలకులు బలహీనులు, భోగాలాలసులు. వారి పాలనా కాలంలో మాళవము రాష్ట్రకూటుల స్వాధీనమైపోయింది. కానిభోజుడి అనంతరం రాజ్యానికి వచ్చిన మొదటి మహేంద్రపాలుడు మాత్రం పూర్వం ప్రతీహార సామ్రాజ్యంలో వున్న మాళవమును తిరిగి జయించగలిగాడు. యుద్ధాలలో కోల్పోయిన రాజ్య భాగాలు పోగా మిగిలిన విశాల ప్రతీహార సామ్రాజ్యాన్ని మొదటి మహేంద్రపాలుడు అవిచ్చిన్నంగా పాలించాడు. తండ్రి ఆర్జించి ఇచ్చిన రాజ్యానికి అదనంగా మహేంద్రపాలుడు అనేక ప్రాంతాలను జయించి సామ్రాజ్యాన్ని విస్తృతపరచాడు. యితడు క్రీస్తుశకం 885 నుండి క్రీస్తుశకం 908 వరకు పాలించాడు.

         మహేంద్రపాలుడు మరణించిన తరువాత అతడి కుమారుడు రెండవ భోజుడు ప్రతీహార సామ్రాజ్యాధినేత అయ్యాడు. ఇతడు రాజ్యానికి వచ్చిన తరువాత సవతి సోదరుడు మహీపాలుడితో యుద్ధాలు చేయాల్సి వచ్చింది. చివరకు మహీపాలుడు సింహాసనాన్ని ఆక్రమించాడు. అంతఃకలహాల్లో కూరుకుని బలహీనపడివున్న ప్రతీహార రాజ్యభాగాలను రాష్ట్రకూటులు ఆక్రమించుకున్నారు. మహీపాలుడు చాళుక్య నరసింహుడి ధాటికి తట్టుకోలేక పారిపోయి, అలహాబాద్ ప్రాంతంలో తలదాచుకున్నాడు. ఆ తరువాత కాలంలో చెల్లాచెదరైన తన సైన్యాన్ని సమీకరించుకొని, సామంతులను కూడగట్టుకొని, మహీపాలుడు, ప్రతీహార సామ్రాజ్యాన్ని పునరుద్ధరించుకున్నాడు. క్రీస్తుశకం 942 వరకు మహీపాలుడు పాలించాడు.

         మహీపాలుడి కుమారుడు ఆ తరువాత ఒక ఏడాది మాత్రమే పాలించాడు. ఆ తరువాత నలుగురు రాజులు సుమారు 15 సంవత్సరాలు పాలించారు. ప్రతీహార సామ్రాజ్యం రాష్ట్రకూట, పాల వంశీయుల దండయాత్రల వల్ల క్షీణించ సాగింది. సుమారు ఒక శతాబ్దికాలం మహావైభవంగా అనుభవించిన ప్రతీహార వంశం, ఉత్తర భారత దేశంలో మహా సామ్రాజ్య స్థాపన చేసిన వంశంగా ప్రసిద్ధికెక్కింది.     

పాలవంశం

శశాంకుడి మరణానంతరం వంగ దేశం శతాబ్దికాలం అరాజక స్థితికి లోనైంది. దేశంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రజల ఆర్ధిక స్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ప్రజలప్పుడు ప్రతిభా సంపన్నుడు, యుద్ధవీరుడు, ధైర్యవంతుడు అయిన గోపాలుని తమ ప్రభువుగా ఎన్నుకున్నారు. అతడికి సమస్త అధికారాలను అప్పచెప్పారు. గోపాలుడి పేరుమీద పాల వంశం ఏర్పడినది. పాలవంశ స్థాపకుడైన గోపాల ప్రభువు తాత దైతవిష్ణువు గొప్ప పండితుడు. రాజానుగ్రహం వున్నవాడు. దైతవిష్ణువు కుమారుడు వస్సత విద్యావంతుడు. క్షాత్ర విద్యలలో నేర్పరి. భుజబల సంపన్నుడు. ఇతడి కుమారుడు పాలవంశ స్థాపకుడైన గోపాలుడు.

         గోపాలుడు క్షాత్ర ధర్మం అవలంభించి మహావీరుడుగా ప్రశంసింపబడినాడు. గోపాలుడి తాత దైతవిష్ణువు బ్రాహ్మణుడు. వైదికమత నిరతుడు. గోపాలుడి తరువాత రాజ్యానికి వచ్చిన వారు వైదిక ధర్మంతో పాటు క్షాత్ర ధర్మం కూడా అవలంభించారు. తరువాత కాలంలో ఈ వంశీయులు క్షత్రియులుగా పరిగణింపబడ్డారు. మరికొంత కాలానికి ఈ వంశీయులు సూర్య వంశీయులుగాను, సాగర వంశీయులుగాను పరిగణింపబడ్డారు.

         గోపాలరాజు తరువాత పాల రాజ్య సింహాసనాన్ని అతడి కుమారుడు ధర్మపాలుడు క్రీస్తుశకం 770లో అధిష్టించి సుమారు 40 సంవత్సరాలు పాలించాడు. పాల రాజ్యాన్ని విస్తరించడానికి ధర్మపాలుడు యువకులను చేర్చుకొని గొప్ప సైన్యాన్ని సనకూర్చుకున్నాడు. ధర్మపాలుడు ఉత్తరాపథాన్ని జయించిన తరువాత తన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నాడు. ఇతడు ఉత్తర భారతంలో అనేక రాజ్యాలను జయించినప్పటికీ వాటిని పాల సామ్రాజ్యంలో చేర్చుకోలేదు. అనేక రాజ్యాలను జయించిన ధర్మపాలుడు ఆ రాజ్యాదిపతులను తన సామంతులుగా స్వీకరించి, వారిని ఆ రాజ్యాలను పాలించడానికి నియమించాడు. అతడు అంగ, వంగ దేశాలను మాత్రమే ప్రత్యక్షంగా పాలించాడు. అతడు శతాధిక యుద్ధాలను చేసిన మహాశూరుడు. అజేయ పరాక్రముడు. సామాన్యంగా వున్న పాల రాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా రూపొందించి వంగ దేశానికి సమున్నత స్థానాన్ని కలిగించాడు. ఇతడు క్రీస్తుశకం 810 లో మరణించాడు.

         ధర్మపాలుడి అనంతరం అతడి కుమారుడు దేవపాలుడు రాజ్యాధిపతి అయ్యాడు. ఇతడు కూడా శూరుడు. సమర్థుడైన పాలకుడు. తండ్రి సంపాదించి ఇచ్చిన మహా సామ్రాజ్యానికి అదనంగా కొన్ని ప్రాంతాలను జయించి విశాల భూ భాగాన్ని అతి వైభవంగా పాలించాడు. దేవపాలుడు అనేక దండయాత్రలు చేసి విజయాలు సాధించాడు. ప్రతీహార వంశీయుల ఆధిపత్యాన్ని నశింపచేసి, పాలరాజ వంశ ప్రతిష్టను పెంపొందించి, ఉత్తర భారతంలో ప్రముఖ వ్యక్తిగా దేవపాలుడు కీర్తించబడ్డాడు. దేవపాలుడి పాలనా కాలం క్రీస్తుశకం 810-850.

         దేవపాలుడి అనంతరం విగ్రహపాలుడు పాల రాజ్యాధినేత అయ్యాడు. ఇతడు కేవలం నాలుగు సంవత్సరాలే పాలించాడు. విగ్రహపాలుడు సన్యాసై రాజ్యాన్ని త్యజించిన తరువాత అతడి కుమారుడు నారాయణ పాలుడు పాల రాజ్య సింహాసనాన్ని క్రీస్తుశకం 854 లో అధిష్టించి సుదీర్ఘ కాలం పాలించాడు. కాని ఇతడు రాజ్యంలోని అధిక భాగాలను కోల్పోయాడు. నారాయణ పాలుడు శాంతి కాముకుడు. తత్త్వ జిజ్ఞాసాపరుడు. ఇతడి కాలంలో సామంతులు స్వతంత్రులయ్యారు. ప్రతీహార వంశీయులు పాల రాజ్యంలో అధిక భాగాన్ని ఆక్రమించుకున్నారు. అయితే రాష్ట్రకూటులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డ తరువాత నారాయణ పాలుడు వంగ, అంగ దేశాలలో పాల సామ్రాజ్యాన్ని పునరుద్ధరించాడు. 54 సంవత్సరాలు పాలించిన ఇతడు క్రీస్తుశకం 908 లో మరణించాడు.

         నారాయణ పాలుడి తరువాత అతడి కుమారుడు రాజ్యపాలుడు సింహాసనం అధిష్టించాడు. ఇతడి కాలం నుండి పాల సామ్రాజ్యం పతనావస్థను చెందింది. ఇతడి తరువాత కొంతకాలం రెండవ గోపాలుడు, రెండవ విగ్రహ పాలుడు పాల రాజ్యాన్ని పాలించారు. రెండవ విగ్రహ పాలుడు క్రీస్తుశకం 987 లో మరణించిన తరువాత అతడి కుమారుడు మొదటి మహీపాలుడు పాల రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడు పాలనలోకి వచ్చేనాటికి పాల మహాసామ్రాజ్యం అతి సాధారణ రాజ్యంగా వుండేది. క్రీస్తుశకం 1000 కల్లా పాల వంశీయులు పునః తమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. మహీపాలుడు పాల సామ్రాజ్య పునరుద్ధరణ చేసి మరో 50 సంవత్సరాలు పాల వంశీయులు వంగ, అంగ దేశాలను పాలించేట్లు చేశాడు. మొదటి మహీపాలుడు అసాధారణ ప్రజ్ఞావంతుడు. రాజ్యకాంక్ష కలవాడు. అనేక విజయాలను సాధించాడు. ఇతడు క్రీస్తుశకం 1038 వరకు సుమారు 51 సంవత్సరాలు పాలించాడు.

         మొదటి మహీపాలుడు మరణించిన తరువాత నాయపాలుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు క్రీస్తుశకం 1055 వరకు 17 సంవత్సరాలు పాలించాడు. ఆ తరువాత నయపాలుడి కుమారుడు మూడవ విగ్రహ పాలుడు రాజ్యాదిపత్యం వహించి 15 సంవత్సరాలు పాలించాడు. ఇతడి అనంతరం అతడి జ్యేష్ట కుమారుడు రెండవ మహీపాలుడు రాజయ్యాడు. శత్రురాజుల దండయాత్రల వల్ల బలహీనపడి సామ్రాజ్య భాగాలను కోల్పోయిన సమయంలో ఇతడు అధికారంలోకి వచ్చాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 1070-1075. ఇతడి తరువాత శూరపాలుడు రాజై రెండు సంవత్సరాలు పాలించాడు. ఆ తరువాత రామపాలుడు, రాజ్యపాలుడు, కుమారపాలుడు, మూడవ గోపాలుడు రాజులయ్యారు. మూడవ గోపాలుడు క్రీస్తుశకం 1144 వరకు 14 సంవత్సరాలు పాలించాడు. ఆ తరువాత మదనపాలుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడే పాల వంశీయులలో చివరివాడు. ఇతడు క్రీస్తుశకం 1161 వరకు 15 సంవత్సరాలు పాలించాడు. అనేక విజయాలను సాధించిన పాల వంశీయుల పాలన సుమారు 400 సంవత్సరాలు సాగింది.

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)


Monday, May 13, 2024

మహా పల్లవ వంశం (బ్రాహ్మణ రాజులు-22) : వనం జ్వాలా నరసింహారావు

 మహా పల్లవ వంశం (బ్రాహ్మణ రాజులు-22)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (13-05-2024)

         కలభ్రులు పూర్వ పల్లవ రాజ్యాన్ని అంతం చేసి, క్రీస్తుశకం ఆరవ శతాబ్ది చివరి పాదంలో తమిళ రాజ్యాన్ని ఆక్రమించారు. పల్లవ వంశ సంజాతుడైన సింహ విష్ణువు క్రీస్తుశకం 575 నాటికి కలభ్రులను ఓడించి, తమిళ భూభాగాల నుండి తరిమివేసి, పల్లవ రాజ్యాన్ని ఉద్ధరించాడు. సింహ విష్ణువు, అతడి సంతతి వారు కాంచీ నగరం రాజధానిగా సుమారు 325 సంవత్సరాలు దక్షిణాపథ, దక్షిణ భారత దేశాలలోశక్తి సమన్వితులై వైభవోపేతంగా పరిపాలన చేశారు. సింహ విష్ణువు వంశీయులను చారిత్రకులు మహా పల్లవ ప్రభువులుగా గుర్తించారు.

         మహాపల్లవ వంశానికి ఆద్యుడు సింహ విష్ణువు. ఇతడు అపరిమిత బలపరాక్రమ సంపన్నుడు. గొప్ప విజేత. పతనమైవున్న పల్లవ రాజ్యాన్ని సముద్ధరించిన మహావీరుడు. కదనజీవి. రాజ్యాధికారం వహించిన తరువాత సింహ విష్ణువు అపార సైన్యాన్ని సమకూర్చుకుని, కలభ్ర, చోళ, మాళవ, సింహళ, కేరళ రాజ్యాధీశుల మీద దండెత్తి విజయం సాధించాడు. ఇతడికి ‘కావన సింహుడు’ అని బిరుదం వున్నది. సింహ విష్ణువుకు దండయాత్రలో రేనాటి చోళ వంశానికి చెందిన ధనంజయ వర్మ తోడ్పడ్డాడు. అతడు సింహ విష్ణువు సామంతుడు. సింహ విష్ణువు సంస్కృత భాషా పోషకుడు. సింహ విష్ణువు పల్లవ రాజ్యాన్ని అతి వైభవంగా క్రీస్తుశకం 575 నుండి క్రీస్తుశకం 600 వరకు సుమారు 25 సంవత్సరాలు పాలించాడు.

         సింహ విష్ణువు మరణానంతరం అతడి కుమారుడు మొదటి మహేంద్ర వర్మ పల్లవ రాజ్యాదిపత్యం వహించాడు. పల్లవ రాజవంశంలో ప్రసిద్ధికెక్కిన రాజులలో ఇతడు మొదట పేర్కొనదగినవాడు. మహేంద్ర వర్మ సమరశూరుడు. లలితకళలను పోషించినవాడు. సంగీత శాస్త్ర ప్రవీణుడు. గ్రంథకర్త. తాను అభ్యసించిన సంగీత శాస్త్రాన్ని భావి తరాల వారికి ఉపయోగపడే విధంగా ఒక గ్రంథాన్ని రచించాడు. శిల్ప విద్యలో అసమాన పాండిత్యం వున్నవాడు. మహేంద్ర వర్మ పల్లవ రాజ్యాన్ని విస్తృతపరచి ప్రజానురంజకంగా పాలించాడు. మహేంద్ర వర్మ చోళ రాజులను జయించి వారి రాజ్య భాగాలను ఆక్రమించాడు. కాంచీనగర సమీపంలోని పుల్లలూరును ఇతడు జయించాడు. ఇతడు ప్రజానురంజకంగా పల్లవ రాజ్యాన్ని క్రీస్తుశకం 600 నుండి క్రీస్తుశకం 630 వరకు సుమారు 30 సంవత్సరాలు పాలించాడు.

         మొదటి మహేంద్ర వర్మ పెద్ద కుమారుడు మొదటి నరసింహ వర్మ తండ్రి అనంతరం పల్లవ రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. రాజైన వెంటనే నరసింహ వర్మ శత్రువుల దండయాత్రలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తొలి యుద్ధాలలో అతడు ఓడిపోవడంతో పల్లవ రాజ్యంలోని కొన్ని భూభాగాలు అన్యాక్రాంతం అయ్యాయి. కాని ఆతరువాత తన రాజ్యం మీద దండెత్తి వచ్చిన రెండవ పులకేశిని ఎదుర్కొని యుద్ధభూమి నుండి వెనుతిరిగేట్లుగా చేశారు. రెండవ పులకేశి యుద్ధరంగంలో మరణించాడు. పల్లవ నరసింహ వర్మ జీవితమంతా యుద్దాలలోనే గడిచిపోయింది. అయినప్పటికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడం విస్మరించలేదు. ఇతడు క్రీస్తుశకం 630 నుండి క్రీస్తుశకం 668 వరకు సుమారు 38 సంవత్సరాలు పాలించాడు.

         మొదటి నరసింహ వర్మ కుమారుడు రెండవ మహేంద్ర వర్మ తండ్రి అనంతరం రాజ్యానికి వచ్చాడు. ఇతడు సమర్థుడైన వాడు కాదు. శత్రువులు ఆక్రమించిన రాజ్య భాగాలు పోగా మిగతా చోళ రాజ్యాన్ని రెండవ మహేంద్ర వర్మ క్రీస్తుశకం 668 నుండి క్రీస్తుశక 669 వరకు ఏడాది పాటు మాత్రమే పాలించాడు. ఇతడి కుమారుడు మొదటి పరమేశ్వర వర్మ అతడి అనంతరం రాజ్యానికి వచ్చాడు. రాజ్యానికి వచ్చిన వెంటనే అతడు అనేక చిక్కులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇతడు కూడా కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే క్రీస్తుశకం 700 వరకు పాలించాడు.

         మొదటి పరమేశ్వర వర్మ కుమారుడు రెండవ నరసింహ వర్మ క్రీస్తుశకం 700 లో పల్లవ సింహాసనం అధిష్టించి, సుమారు 30 సంవత్సరాలు పాలించాడు. ఇతడు గొప్ప పరాక్రమశాలి. రాజసింహ బిరుదాంకితుడు. నరసింహ వర్మ చాళుక్య రాజులతో పోరాడవలసి వచ్చింది. చాళుక్యుల దండయాత్రలను ఎదుర్కొని పల్లవ రాజ్య భాగాలను రక్షించుకున్నాడు. నరసింహ వర్మ పాలన పల్లవ రాజ్యమంతటా నిరాఘాటంగా సాగింది. రెండవ నరసింహ వర్మ కళాప్రియుడు. ఇతడు ప్రత్యేకత సంతరించుకున్న అనేక దేవాలయాలను నిర్మించాడు. ఇతడి కాలంలో సంస్కృత భాషకు ఆదరం లభించినది.

         రెండవ నరసింహ వర్మ కుమారుడైన రెండవ పరమేశ్వర వర్మ తండ్రి అనంతరం క్రీస్తుశకం 730 లో పల్లవ రాజ్యాధిపత్యాన్ని వహించి, 3 సంవత్సరాలు మాత్రమే పాలించాడు. ఇతడు సమర్ధుడైన పాలకుడు కాదు. చాళుక్యులతో జరిగిన పోరాటంలో అపజయం పొందాడు. చాళుక్యులతో పాటు పశ్చిమ గాంగ పురుష ముత్తమ రాజు పల్లవ రాజ్య భాగాల మీద దండెత్తటం సహించని పరమేశ్వర వర్మ అతడి రాజ్యం మీద దండెత్తాడు. ఇరు సైన్యాలు భీకరంగా పోరాడాయి. ఈ యుద్ధంలో పరమేశ్వర వర్మ మరణించాడు.

         రెండవ పరమేశ్వర వర్మ మరణానంతరం పల్లవ రాజ్యంలో అలజడులు రేగాయి. దాయాదులు సింహాసనాన్ని అధిష్టించడానికి సుముఖులుగా లేకుండిరి.  సింహ విష్ణువు సోదరుడు, భీమవర్మ సంతతి వాడైన పరమేశ్వర వర్మను క్రీస్తుశకం 733 లో మంత్రులు, (రెండవ) నందివర్మ పేరుతో పల్లవ రాజ్యాధీశుడిని చేశారు. అప్పటికి అతడు వయసు 12 సంవత్సరాలే. ఇతడు ప్రసిద్ధుడైన రాజు. పల్లవమల్ల బిరుదాంకితుడు. ఇతడు సుమారు 65 సంవత్సరాలు పల్లవ రాజ్యాన్ని పాలించాడు. రెండవ నందివర్మ రాజ్యానికి వచ్చిన తరువాత తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి అనేక యుద్ధాలు చేయాల్సి వచ్చింది. విజయం సాధించిన నందివర్మ వేంగీ రాజ్య దక్షిణ భాగాలను, పల్లవ రాజ్యానికి ఉత్తరంలో వున్న ప్రాంతాలను పల్లవ రాజ్యంలో చేర్చుకున్నాడు. దీంతో పల్లవ రాజ్య ప్రతిష్ట ఇనిమడించినది. కాని బాదామీ చాళుక్యులతో వైరం ముదిరినది. ఇతడు వృద్ధాప్యంలో దివంగతుడయ్యాడు.

         రెండవ నందివర్మ మరణానంతరం అతడి కుమారుడు దంతి వర్మ పల్లవ రాజ్య సింహాసనాన్ని క్రీస్తుశకం 798 లో అధిష్టించాడు. దంతి వర్మ రాష్ట్ర కూట ప్రభువులతో పోరాడవలసి వచ్చింది. దంతి వర్మ 50 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పల్లవ రాజ్యాన్ని పాలించాడు. దంతి వర్మ తరువాత అతడి కుమారుడు, మనుమడు నృపతుంగ వర్మ పల్లవ రాజ్యాన్ని క్రీస్తుశకం 890 వరకు పాలించారు. నృపతుంగుడి సవతి సోదరుడు అపరాజితుడు క్రీస్తుశకం 890 ప్రాంతంలో పల్లవ రాజయ్యాడు. క్రీస్తుశకం 899 లో చోళ వంశజుడైన ఆదిత్యతో జరిగిన ఒక యుద్ధంలో మరణించాడు. ఆ తరువాత తంజావూరు పట్టణంలో చోళ రాజ్యం స్థాపించ బడింది. పల్లవ వంశానికి చెందిన మూడవ నందివర్మ కుమారుడు కంప వర్మ పల్లవ రాజ్యంలోని కొన్ని భాగాలను పాలించాడు. క్రీస్తుశకం 10 వ శతాబ్దం ఆరంభంలో పల్లవుల అధికారం పూర్తిగా అంతరించింది.        

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)

 

                          

Saturday, May 11, 2024

PROBE INTO EXORBITANT POLL SPENDING : Vanam Jwala Narasimha Rao

 PROBE INTO EXORBITANT POLL SPENDING

(CM Revanth Rightly Favored

Factfinding Committee’ or ‘Enquiry Commission’)

Vanam Jwala Narasimha Rao

The Hans India (12-05-2024)

{Telangana Chief Minister Revanth Reddy, expressing serious, genuine, and conscious concern, on the source of funds flow to BRS and BJP Leaders KCR and Modi, in organizing ‘Frequent Public Meetings’ with huge paraphernalia, spending large amounts of money, preferred either a ‘Factfinding Committee’ or an ‘Enquiry Commission’ with ‘Supreme Court Sitting Judge’ to probe, Excessive Expenditure by Candidates. CM Revanth Reddy made it clear, that he and his party too is ready to welcome such a move, if Modi agrees to his suggestion. Let ECI take lead on Revanth Reddy’s Sincere suggestion} – Editor’s Synoptic Observations

With the announcement of ‘Schedule for General Elections’ to the 18th Lok Sabha, by the Election Commission of India (ECI), two months ago, comprising ‘Seven Phase Lengthy Election Schedule’ spread over two months and half, the ongoing ‘Festival of Democracy’ that cut across ethnic, linguistic, regional, and religious barriers commenced, and is half way through. First three phases of elections (19 April, 26 April, and 7 May) were over. The next phase, including in Telangana, is on Monday (Tomorrow), the May 13, 2024. Final three phases are on May 20 and 25, and June 1, 2024. Total electorate in the country is amazing 97 crores (543 Constituencies).

‘Voter Turnout’ in first three phases was 66.14% (102 Constituencies), 66.71% (88 Constituencies), and 64.4% (93 constituencies), showing significant dip of 4%, 3% and 3% respectively compared to 2019 elections. ECI faced severe criticism over its inordinate delay in publishing voter turnout percentages of first two phases, after revision for four days in its mobile application, and for not releasing final data until April 30. It is normal for ECI to revise voter turnout numbers, though, such an instance seldom happened before. ‘Lack of Transparency’ on the real number of votes cast in each constituency and ‘Apprehensions of Manipulation of Results’ were the concerns expressed.  

The Article 324 of Constitution of India, bestowed relevant powers, duties, and functions upon ECI, to hold ‘General Elections’ whenever due. Accordingly, ECI made ‘Comprehensive Preparations, for ‘Free, Fair, Participative, Accessible, Inclusive, Transparent, and Peaceful’ conduct of elections, with meticulous planning of every aspect, in advance, to ensure ‘Fearless Participation of Electors’ especially in vulnerable places, but with a ‘Rider.’ ECI mobilized ‘Election Machinery’ of more than 12 million officials, the ‘Biggest Human Management Exercise’ in the world, and imparted them ‘Systematic Training’ for flawless conduct of elections. In view of the arduous and difficult journey that polling teams have to undertake to ensure that no voter is left behind, ECI doubled the remuneration of polling officials heading for election duty in remote and difficult areas. Fair Enough.

Provisions of ‘Moral Code of Conduct’ (MCC) a ‘Necessary Evil’ in the conduct of elections, are made applicable to contesting candidates, political parties, and government, by ECI. Election expenses ceiling with a ‘Maximum Limit of Rs 95 Lakhs per Lok Sabha Candidate’ was fixed besides making it mandatory to pay by ‘Crossed Account Payee Cheque or Draft or by RTGS/NEFT’ etc. linked with bank account of the candidate opened for election purpose, if the expenditure exceeds Rs 10,000. ECI’s endeavor to promote equity and ensure quality of the electoral system with the objective of upholding democratic values and principles is nonetheless laudable.

Despite periodical corrective measures, why the ‘Largest Democracy went Wrong’ is a million-dolor question. For instance, visible effect of MCC, like random, infrequent searches, and confiscation of transportation of cash, gold, liquor etc. in excess permitted by law, has been felt by real offenders and also by genuine public. Flying squads and video teams have been querying and quizzing people who are caught. But the question frequently asked by Citizen is, why not the details of individuals caught along with value, and the end result, are ‘Explicitly Displayed’ in public domain.

‘Unfolding Indian Elections-Journey of the Living Democracy,’ a book published by ECI in January 2017, documented exciting anecdotes on Indian Elections. Spending money or buying votes was an anathema in the first general elections held during 1951-52, which Global Community voluntarily witnessed with great interest.

Lengthy electioneering process causes exorbitant expenditure by candidates and political parties, often multiple times over and above mandated by ECI. Dr N Bhaskara Rao, Chairman, Centre for Media Studies (CMS), engaged in tracking election spending for over 35 years, revealed an astounding harsh reality, that, the 2024 Lok Sabha Elections are on track to break all past records and become the ‘Most Expensive Electoral Event in the world’!!!

According to this ‘Internationally Renowned Poll Expert,’ the estimated expenditure would be a staggering Rs 1.35 Lakh Crore, more than double the Rs 60,000 crore spent in 2019!!! This, surpasses the expenditure of 2020 US elections, which stood at $ 14.4 Billion or Rs 1.2 lakh Crore. This comprehensive expenditure, encompasses all spending, direct or indirect, related to polls, including that by political parties and organizations, candidates, government, and ECI.

Expenditure includes the ‘Electoral Bond Disclosures,’ spending on ‘Pre-Election Activities’ which are integral to campaign, that normally takes place prior to announcing voting dates, and spending by parties and candidates towards political rallies, transportation, hiring of human resources, and even on ‘Horse-Trading of Political Leaders.’ Huge spending’s roots are to be traced in the presence of Crorepathi candidates. For instance, about 600 Crorepathi candidates are contesting in just third and fourth phases, including one worth declared assets of over Rs 5700 Crores!!     

According to CMS Dr Rao, Parties and Candidates often find ways to circumvent spending restrictions imposed by MCC, a clear indication of growing ‘Reliance on Money Power over Ideology’ in Indian politics. Rao lamented transformation from ‘Ideology-Driven Election Campaigns’ to ‘Chauvinistic Apparatuses.’ Six key undesirable trends in elections, identified by Dr Rao are, prolonged pre-poll activities, affluent candidates’ dominance, political crossovers, manipulation through various channels, lack of fair play, and power dynamics favoring incumbents.

Remarkably, and laudably, Telangana Chief Minister Revanth Reddy, in an interview to a Telugu Channel, expressing serious, genuine, and conscious concern, on the source of funds flow to BRS and BJP Leaders KCR and Modi, in organizing ‘Frequent Public Meetings’ with huge paraphernalia, spending large amounts of money, preferred either a ‘Factfinding Committee’ or an ‘Enquiry Commission’ with ‘Supreme Court Sitting Judge’ to probe, including Electoral Bonds and Social Media Expenditure. CM Revanth Reddy made it clear, that he and his party too is ready to welcome such a move, if Modi agrees to his suggestion. Let ECI take lead on Revanth Reddy’s Sincere suggestion.

India has Constitutionally Guaranteed independent Election Commission (ECI), who can be removed only through parliamentary impeachment, since ‘day one’ when the Constitution was adopted on November 26, 1949. It is, however, unfortunate that ECI, shoulders its responsibility, only during elections and seldom exhibits its authority and responsiveness, like checking indiscriminate defections when elections do not take place. Is the gap period a ‘Rest Time’?

Two Significant, creditable, and perhaps reasonably successful initiatives of ECI are, establishing the ‘India International Institute of Democracy and Election Management (IIIDEM)’ and ‘Systematic Voters’ Education and Electoral Participation Program’ (SVEEP), to endeavor to promote voters’ participation, voter education, voter literacy in India and contribute to developing stronger democratic institutions.

As part of fostering international cooperation ECI has organized, a five-day ‘Election Visitors’ Program’ to familiarize with the nuances of India’s Electoral System as well as the best practices used by India, the largest democracy in the world. 75 delegates representing Electoral Management Bodies and Organizations from 23 countries, participated in this. Members from International Foundation for Electoral Systems and Media Teams also participated. After the program, delegates in small groups, embarked on visits to constituencies in six states, to observe polls, and their preparedness. Kudos to ECI.

Well, it is high time, for serious consideration to bring ‘Conscious Electoral Reforms,’ for ‘Making an Effective and Efficient Difference’ by introducing ‘Anytime, Anywhere Voting’ system, through ‘Permanent Social Security Number Voter ID Card’ by the ECI. Instead of ‘Earmarked Fixed Booth,’ voter shall be given an ‘Exit option’ to vote ‘Anytime, Anywhere’ including outside the constituency, district, and state.

‘ECI should Regain Its Credibility’ and send strong message to world community, on distinctiveness of Elections in the ‘Largest Democracy’!!! For our part, Let us all exercise our ‘Right to Vote’ and take part in building a stronger Democratic Nation.

Tuesday, May 7, 2024

ఆచార అనుబంధాల సేతువు హిందూ వివాహ క్రతువు : వనం జ్వాలా నరసింహారావు

 ఆచార అనుబంధాల సేతువు హిందూ వివాహ క్రతువు

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రప్రభ దినపత్రిక (08-05-2024)

‘హిందూ వివాహం ఓ సంస్కారం. పవిత్రమైన మతకర్మ. భారతీయ సమాజంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహమంటే ఆటపాటలు, విందువినోదాలు, కట్నకానుకలు ఇచ్చిపుచ్చుకునే సందర్భమో, లేదా, వాణిజ్యపరమైన లావాదేవీనో కానే కాదు. ఇది కుటుంబ వ్యవస్థకు ఓ గంభీరమైన పునాది కార్యక్రమం’ అంటూ జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం, ఇటీవల (మే నెల 1 తేదీన) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహం చెల్లుబాటు కావాలంటే ‘సముచిత ఆచార వ్యవహారాల మధ్య వివాహ క్రతువు’ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. పవిత్ర అగ్నిగుండం చుట్టూ 7 అడుగులు వేసే ‘సప్తపది’ ప్రాధాన్యాన్ని ప్రస్తావించింది. ‘రిజిస్ట్రేషన్ కేవలం ఋజువు’ మాత్రమేనని ధర్మాసనం అన్నది.

ఇంతకూ, ఏమిటీ ఆ ‘సముచిత ఆచార వ్యవహారాల వివాహ క్రతువు'? వేదాలలో ‘హిందూ వివాహం’ ప్రస్తావన చాలా స్పష్టంగా వుంది. తోడూ, నీడా లేని ఒంటరి బ్రతుకు ఒక బ్రతుకే కాదని, మగకు ఆడ, ఆడకు మగ తోడు అవసరమని, మంచి కుటుంబమే మంచి సమాజమవుతుందని, ఆడ, మగను కలపడానికి పవిత్రమైన వివాహ బంధాన్ని ఏర్పరిచినారని వేదంలో వున్నది. వేద సూక్తంలో వధువుకు ప్రాధాన్యత ఇస్తూ, వివాహం గురించి విపులంగా చెప్పబడినది. దాంపత్యాన్ని గురించిన ఆశయాన్ని చక్కగా వివరించడం జరిగింది. పిల్లలు, పిల్లల పిల్లలతో ఆడుకుంటూ గడిపే వార్థక్యం గురించిన వివరణ వుంది.

స్త్రీ పురుషులకు అనుకూల దాంపత్యం ఒక వరం. కలిసి ఉన్న దంపతులు కష్టాలను లెక్కచేయరు. ఆనందం సంపదలో లేదు! అనన్యత్వంలో ఉంది!! సుఖ దుఃఖాలు సాపేక్షాలు. కలసి నవ్వడంలో వున్న ఆనందం కలసి ఏడవడంలోనూ ఉంది. ఆలుమగలు కలసి సాగడం వల్ల హృదయానికి విశ్రాంతి, మనశ్శాంతి. వార్ధక్యం వచ్చినా అదే అనురాగమైన వలపు వుంటుంది. కాలం నడుస్తుంటే ప్రేమ పండుతుంది. స్నేహం స్థిరంగా ఉంటుంది. హిందూ వివాహం పవిత్ర బంధం. ఏడేడు జన్మల అనుబంధం. నూరేళ్ల పంట! మృత్యువు సహితం విడదీయలేదు. ఎంతటి సమాజంలోనైనా కుటుంబానిదే అగ్ర స్థానం. కుటుంబమే సమాజానికి మూల కారణం.

ధర్మం ప్రాతిపదికగా, అర్థం, కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం ‘హిందూ వివాహం.’ వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. హిందూ వివాహంలో మొదటి ఘట్టం ‘వాగ్ధానం,’ లేదా,నిశ్చితార్థం’ లేదా ‘నిశ్చయ తాంబూలం.’ అప్పుడే వధూవరుల తారా బలం, చంద్ర బలం చూసి సుముహూర్తం నిశ్చయిస్తారు.

పెళ్లిరోజుకు ముందర పురోహితులు వరుడిని ‘బ్రహ్మచర్యం’ నుండి ‘గృహస్థాశ్రమం’ స్వీకరించడానికి సిద్ధంచేసే ‘స్నాతకంఅనే వేడుకైన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వరుడు గొడుగు పట్టుకొని, చేత కర్ర పుచ్చుకొని, పాదాలకు పావు కోళ్లు ధరించి, పసుపు బట్టలు వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు, కాశీకి పోతున్నానని చెప్పి బయలు దేరుతాడు. వధువు సోదరుడు వచ్చి కాశీ ప్రయాణం విరమించుకోమని, తన సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించమని నచ్చచెప్పి వెనుకకు తీసుకొని వస్తాడు.

పెళ్ళికి ముందర పెళ్ళికొడుకును, పెళ్ళికూతురును చేయడం ఆచారం. తెల్లవారక ముందే, మంగళ వాయిద్యాల మధ్య మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. పెళ్ళికూతురు’ ను చేసిన అనంతరం, సమయానుకూలంగా, నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చి ‘అంకురార్పణ’ జరిపిస్తారు. స్నాతకం చేసుకున్న తరువాత మగపెళ్లివారు ఆడపెళ్ళివారి ప్రదేశానికి తరలి పోతారు. విడిదికి చేరుకున్న వారికి, ఆడపెళ్లి వారు, ఎదురు కోలు’ సరదాగా, సందడిగా పలుకుతారు.  

వధువు గౌరీ పూజకు, విడిదిలో వరపూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సంప్రదాయం ప్రకారం వధువుని ‘లక్ష్మి, పార్వతి, సరస్వతి’ ల ఉమ్మడి రూపంగా, వరుడిని ‘త్రిమూర్తుల దివ్యస్వరూపం’ గా, విధాత చూపిన విజయోన్ముఖ పథంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధ పురుషుడుగా భావిస్తారు. వరపూజ అనంతరం మగ పెళ్లివారు కన్యాదాత ఇంటికి చేరుకునే సమయానికి, కన్యా వరణానికి వచ్చే వరుడికి ఎదురేగి తన కుమార్తెను భార్యగా స్వీకరించి కలకాలం వర్ధిల్లమని కన్యాదాత దీవించే కార్యక్రమంతో వివాహ మండపం వద్ద వేడుక మొదలవుతుంది. హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం, నారాయణ స్వరూపుడైన’ వరుడికి పాద ప్రక్షాళన జరిపించి, కన్యాదాత ‘మధు పర్కం’ రూపంలో ఆతిధ్యం ఇస్తారు. మధు పర్కాలుగా ఇచ్చిన నూతన వస్త్రాలను ధరించి వరుడు వివాహ వేదిక మీద జరగాల్సిన తంతుకై వేచి వుంటాడు.

కన్యాదాత వరుడు తండ్రిని తీసుకొని వధువు గౌరీ పూజ చేస్తున్న చోటుకెళ్తారు. అక్కడ, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం, ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి ఆసక్తికరంగా, విన సొంపుగా వుంటుంది. ‘గోత్రం’ అంటే వంశం, ‘ప్రవర’ అంటే ఆ వంశం మూల పురుషుల సమాచారం.

మీ అమ్మాయిని, మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించమని వరుడి తండ్రి, కన్యా దాతను కోరడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశం. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు’ అని మొదలవుతుంది తంతు. వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం సరదాగా, సామాజిక స్పృహతో కూడి వుంటుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని, సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ.

కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం ప్రాధాన్యతను సంతరించుకున్న ఘట్టం. వయసులో పెద్దయిన కన్యాదాత, చిన్నవాడైన వరుడి కాళ్లు కడిగే సాంప్రదాయ బద్ధమైన ప్రక్రియలో తేజస్సు తరిగి పోకుండా పురోహితుడు మంత్రాన్ని చెప్పుతాడు. అది కన్యాదాత ఉచ్చరిస్తూ, ఇచ్చిన ‘అర్ఘ్యాన్ని’ (మంచి నీరు) స్వీకరిస్తాడు వరుడు. కన్యా దాత వరుడి కాళ్ళు కడిగి నందువల్ల, చిన్నవాడైన వరుడు, తనలోని కాంతి తరిగిపోకుండా వుండేందుకు, ఆచమనం చేయించి, దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు. వధువుని గంపలోనే వుంచి ‘మహా సంకల్పం’తో ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్తారు పురోహితులు.

వధూవరులను సాక్షాత్తు ‘లక్ష్మీనారాయణ స్వరూపులు’ గా భావించుతారు కాబట్టి, ఆ విధంగానే కల్యాణం జరిపించుతారు. మహాసంకల్పం’ చెప్పడం, సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి శక్తి, సామర్థ్యాలు అనంతమని, అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని కొనసాగుతుంది. మానవుడి మేథస్సు ఊహించనలవికాని పరిమాణంలో వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్న, చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత ఖండంలో, మారు మూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసేదే మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది.

మహా సంకల్పం విశ్వ స్వరూపాన్ని, ఖగోళ స్థితిని చక్కగా వివరిస్తుంది. భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్త ద్వీపాలు, నవ వర్షాలు, నవ ఖండాలు, దశారణ్యాలు, యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో భరత వర్షం, భరత ఖండం, దానిలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నది కన్యాదాత పేర్కొంటాడు. అలాగే బ్రహ్మ కాలమాన ప్రకారం, శ్వేత వరాహకల్పంలో, పద్నాలుగు మన్వంతరాలలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో, శాలివాహన శకంలో, ఇరవై ఎనిమిదవ మహా యుగంలో, కలియుగంలో, ఫలానా సంవత్సరంలో, ఫలానా మాసంలో, ఫలానా తిది రోజున, సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్ర్రీతి కోసం ‘సర్వాలంకార భూషితైన ఈ కన్యను దానం చేస్తున్నాను’ అని కన్యాదాత చెప్పే సంకల్పం ఇది. ఈ కన్యాదానం వల్ల తనకు బ్రహ్మ లోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలని, అగ్ని, స్తోమ, అతిరాత్ర, వాజపేయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలని, తనకు వెనుక పది, ముందు పది తరాల వాళ్ళు , తనతో కలిపి 21 తరాల వారు, బ్రహ్మ లోకంలో నివసించాలని కన్యాదాత సంకల్పం చేస్తాడు.

కన్యాదానం’ తంతు మొదలవుతుంది. ‘కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషియా’ అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వస్తాయి. దీని అర్ధం: ‘ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను’ అని కన్యాదాత అంటారు. ‘సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు, పంచభూతాల, సర్వ దేవతల సాక్షిగా, పితృదేవతలను తరింపచేసేందుకు, ఈ కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం కలిగి, బుద్ధిమంతుడి వైన నీకు, ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు, సాలంకృత సాధ్వియైన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను’ అంటాడు.

ఇలా అంటూ, కన్యా దాత వరుడి చేతిలో నీళ్లు పోసి మరో మాటంటారు. ‘నీకు దానం చేసినప్పటికీ, ఈ కన్య నా కుమార్తే సుమా!’ అని. ఇలా అంటూనే, ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి చరితవ్యా’ అని ప్రతిజ్ఞ చేయిస్తారు కన్యాదాత వరుడితో. దీనికి సమాధానంగా, నాతి చ రామి’ అని మూడుసార్లు వరుడితో చెప్పిస్తారు. వధూవరులను కళ్యాణ వేదికపై కూచోబెట్టి, తెరను అడ్డం పెట్టి, ఇరువురి చేతికి ‘జీలకర్ర-బెల్లం’ కలిపిన ముద్దను ఇస్తాడు పురోహితుడు. నిర్ణయించిన సుముహూర్తానికి మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, వధువు, వరుడు ఏక కాలంలో ఒకరి శిరస్సు మీద (బ్రహ్మ రంధ్రం మీద) మరొకరు ‘జీలకర్ర-బెల్లం’ కలిపిన ముద్దను వుంచుకుంటారు. పెద్దలందరూ దంపతులు మీద అక్షితలు చల్లుతారు.

తదుపరి మాంగల్య ధారణ తంతు మొదలవుతుంది. వివాహం అయిన మహిళలు ‘మంగళ సూత్రం’ ధరించడం భారతీయ సంప్రదాయం. హిందువుల ఆచారం. సన్నని పోగులు, తొమ్మిది లేదా పదకొండు దారాలతో కలిపి, పసుపు రాసి తాళిని తయారు చేస్తారు. సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. దీన్నే ‘శత మానములు’ అని కూడా అంటారు. రెండు సూత్రాలలో ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. మంగళ సూత్ర ధారణకు ముందు, మేనమామ పెట్టిన ‘మధుపర్కం చీరె’ ను, వధువు కట్టుకుంటుంది.

మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం’ అని చదువుతుంటే, వరుడితో మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించుతాడు పురోహితుడు. మూడు ముళ్లు వేయమంటాడు. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ, రజ, తమో గుణాలకు సంకేతం. మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ’శతమానం భవతి, శతాయుః పురుష’ అని ఆశీర్వదిస్తారు.

మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా, తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. వధూవరుల గృహస్థాశ్రమ జీవితం శుభప్రదంగా, మంగళప్రదంగా వుండాలని ‘మంగళ ద్రవ్యాలతో’ చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. ఈ తంతు ముగిసిన తర్వాత, వధువు చీరె కొంగు అంచును, వరుడి ఉత్తరీయం అంచుకు కలిపి ‘బ్రహ్మముడి’ వేస్తారు. తరువాత, వధూవరులను వివాహ వేదికనుంచి కిందికి దింపి,స్థాళీపాకం’ జరిపిస్తాడు పురోహితుడు. అతి ముఖ్యమైన ‘సప్తపది’ ఘట్టం వుంటుంది. అగ్నిహోత్రుడి చుట్టూ, ఆయన సాక్షిగా, వధూవరులిద్దరు, వధువు కుడి కాలి అడుగుతో ఆరంభించి, ఏడు అడుగులు’ వేస్తారు. గృహస్థాశ్రమ స్వీకారానికిది పరమావధి. ఆ తరువాత నాగవల్లి, సదశ్యం జరుగుతాయి.

కన్యాదాత ఇంట్లో జరిగే వేడుకల్లో చివరది ‘అప్పగింతలు’ కార్యక్రమం. అంటే కూతురును అత్తవారి ఇంటికి పంపే వేడుక. హృదయాన్ని కలచివేసేది. కంట తడి పెట్టించేది. పెళ్లికూతురును అత్తవారింటి వైపు బంధువులకు పరిచయం చేయడం కొరకు కూడా ఈ వేడుకను జరిపిస్తుండవచ్చు. తంతులో భాగంగా వధూవరులకు ‘అరుంధతి’ నక్షత్రాన్ని చూపిస్తాడు పురోహితుడు. చివరకు విడిది గృహ ప్రవేశానికి పంపుతారు.

హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాకుండా ఎంతో పవిత్రమైన వ్యవస్థ కూడా. పెళ్ళయినాక భార్యాభర్తల మధ్య దాంపత్య ధర్మం అనే బాధ్యత మొదలవుతుంది. పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. లక్ష్మీదేవి స్వరూపమైన తమ కూతుర్ని, వరుడిని శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించి, ‘కన్యాదానం’ చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందని హిందువుల నమ్మకం. ఈ యావత్తు ప్రక్రియ ‘కన్యాదానం లో భాగమే.

(‘సజీవ వాహిని సనాతన ధర్మం పుస్తక తచయిత రాసిన వ్యాసం)

(మే నెల 1 న, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యల నేపధ్యంలో)

 

Sunday, May 5, 2024

వాకాటక వంశం (బ్రాహ్మణ రాజులు-21) : వనం జ్వాలా నరసింహారావు

 వాకాటక వంశం (బ్రాహ్మణ రాజులు-21)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (06-05-2024)

           దక్షిణ భారత దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన శకం ప్రారంభానికి మూడవ శతాబ్దిలోని మధ్యకాలం గుర్తుగా నిలిచి వున్నది. నాలుగున్నర శతాబ్దాల కాలం దక్షిణ భారతదేశంలోని విశాల ప్రాంతం మీద రాజ్యాధికారం వహించిన శాతవాహనులు ఈ కాలంలోనే చారిత్రిక రంగం నుండి అదృశ్యులయ్యారు. శాతవాహన రాజులలో నాల్గవ పులమావి పతనానంతరం అతడి ఆధిపత్యంలో వున్న వివిధ రాష్ట్రాలలో పలు చిన్న రాజ్యాలు ఆవిర్భవించాయి. శాతవాహనుల అనంతరం హైదరాబాద్ రాజ్య దక్షిణ ప్రాంతంలో శకులు రాజ్యాధికారానికి వచ్చినట్లు తెలుస్తున్నది. అయితే శాతవాహనుల పతనానంతరం రాజ్యాదిపత్యానికి వచ్చిన వంశీయులలో వాకాటకులను పురాణాలు ఉటంకించక పోవడం వింతగా గోచరిస్తున్నది. శాతవాహనుల అనంతరం వచ్చిన కిలకిల, కోలికిల రాజుల అనంతరం వాకాటకులకు చెందిన వింధ్యశక్తి రాజ్యాదిపత్యానికి వచ్చినట్లు పురాణాలలో కనిపిస్తున్నది.

         చరిత్రకు తెలిసినంతవరకు వాకాటక వంశీయులలో ఒకటవ వింధ్యశక్తి మొట్టమొదటి రాజు. వాకాటక వంశానికి ఇతడు పతాకమని, ద్విజుడని వర్ణించబడినాడు. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. విష్ణువృద్ధ అనేది వాకాటకుల గోత్రం. వింధ్యశక్తి అంతకు పూర్వం శాతవాహనుల కింద ఒక అధికార హోదాలో వుండేవాడు. అలా, అలా, ఇతడు రాజ్యాధికారానికి ఎదిగాడు. బహుశః వింధ్యశక్తి స్వస్థలం వల్లూరుకు దగ్గరిలో మధ్య దక్కన్ లో వుండి వుండవచ్చును. అజంతా శాసనం వింధ్యశక్తిని కొనియాడింది. ఇతడి రాజ్యం వింధ్య పర్వతాల దాకా విస్తరించి వుండేది. శాసనాల ఆధారంగా అర్థమయ్యే విషయం ఒకటుంది. బహుశః వింధ్యశక్తికి లాంఛనప్రాయంగా పట్టాభిషేకం జరగలేదనేది. కాకపోతే ఇది నమ్మదగినదిగా లేదు. ఇతడు క్రీస్తుశకం 250-270 మధ్య కాలంలో పాలించి వుండవచ్చు.

         ఒకటవ వింధ్యశక్తి అనంతరం సింహాసనాన్ని అధిష్టించిన ఒకటవ ప్రవరసేనుడు ఈ వంశంలో చాలా ప్రఖ్యాతుడు. ఇతడు తన రాజ్యాన్ని నాల్గు దిక్కులకు విస్తరింప చేశాడు. యుద్ధాలలో విజయం సాధించిన ఇతడు తన రాజధానిని పురికాకు మార్చాడు. ఇది సాత్పూరా పర్వత శ్రేణుల దిగువన వున్నది. ఒకటవ ప్రవరసేనుడు దైవ భక్తి కలవాడు. వేదపరాయణుడు. ఇతడు అనేక యజ్ఞాలను చేశాడు. ఇతడికి సామ్రాట్ అనే బిరుదు వచ్చింది. ధర్మమహారాజు అనే బిరుదు కూడా వున్నది. అనేక విజయాలను నమోదు చేసుకోవడం వల్ల ఒకటవ ప్రవరసేనుడు దక్కన్ లో తన రాజ్యాదిపత్యాన్ని ప్రకటించుకున్నాడు. తన స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు ఉత్తర భారత దేశీయులతో వైవాహిక సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. ఇతడు క్రీస్తుశకం 270 నుండి క్రీస్తుశకం 330 వరకు 60 సంవత్సరాలు సుదీర్ఘంగా పాలన చేశాడు. ఇతడి మరణానంతరం అతడి విశాల సామ్రాజ్యం అతడి నలుగురు కొడుకులకు విభాగించబడిందని అంటారు.  

         ఒకటవ ప్రవరసేనుడి కంటే ముందుగానే అతడి పెద్ద కొడుకు గౌతమపుత్ర మరణించాడు. అందువల్ల క్రీస్తుశకం 330 లో అతడి మనుమడు ఒకటవ రుద్రసేనుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఇతడు మహాభైరవుడి ఉగ్రభక్తుడు. ఒకటవ రుద్రసేనుడు సముద్రగుప్తుడి సమకాలికుడు. వాకాటక ప్రదానశాఖకు చెందిన ఒకటవ రుద్రసేనుడి అధికారానికి, గౌరవానికి గుప్త విజయాలు పెద్ద దెబ్బగా పరిణమించాయి. అనేకమంది రాజులు వాకాటక రాజ్యాదిపత్యాన్ని వదిలి గుప్త చక్రవర్తికి లొంగిపోయారు. ఒకటవ రుద్రసేనుడి సామ్రాజ్యం చాలా తగ్గిపోయనప్పటికీ, అతడు తన స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకుని, గుప్తచక్రవర్తికి లొంగిపోలేదు.

         క్రీస్తుశకం 350 లో ఒకటవ రుద్రసేనుడి కుమారుడు మొదటి పృథ్వీసేనుడు రాజయ్యాడు. ఇతడు మహేశ్వరుడికి గొప్ప భక్తుడు. నీతిమంతుడు. దానశీలుడు. ఆత్మనిగ్రహం కలవాడు. వీరుడు. రాజకీయవేత్త. ఇతడు పూర్తిగా శాంతి విధానాన్ని అవలంభించాడు. అహర్నిశలూ తన రాజ్య సుస్థిరతకు పాటుబడేవాడు. ఇతడు క్రీస్తుశకం 400 వరకు సుదీర్ఘ కాలం సుమారు 50 సంవత్సరాలు పాలించాడు. మొదటి పృథ్వీసేనుడు కాలంలో వాకాటకుల రాజధాని నాగపూర్ కు 20 మైళ్ల దూరంలో వున్న రామ్టెక్ దగ్గరలోని నందివర్ధన్ కు మార్చబడింది.

         మొదటి పృథ్వీసేనుడి అనంతరం అతడి కుమారుడు, రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడి అల్లుడైన, రెండవ రుద్రసేనుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. ఇతడు చక్రపాణికి భక్తుడు. ఇతడు రాజ్యానికి వచ్చిన కొద్దికాలానికే క్రీస్తుశకం 405 లో మరణించాడు. కేవలం 5 సంవత్సరాలే పాలించాడు.

         ఆ తరువాత  రెండవ రుద్రసేనుడి కుమారులు దివాకరసేనుడు, దామోదరసేనుడు ఒకరి తరువాత మరొకరు రాజ్యం చేశారు. దివాకరసేనుడు బాల్యంలోనే రాజయ్యాడు. అతడు అల్పాయుష్కుడు. అతడి మరణానంతరం క్రీస్తుశకం 420 లో దామోదరసేనుడు పట్టాభిషిక్తుడయ్యాడు. తన పూర్వీకుడైన ప్రవరసేనుడి పేరు పెట్టుకున్నాడితడు. ఇతడు క్రీస్తుశకం 450 వరకు 30 సంవత్సరాలు పాలించాడు. ఇతడు తన పేరుమీద ప్రవరపురం అనే ఒక నగరాన్ని నిర్మించి రాజధానిని అక్కడికి మార్చాడు. విదర్భలోని వార్ధా జిల్లాలో వున్న పవనార్ పేనార్ ప్రవరపురం ఒక్కటే. ఇతడు శంభుదేవుడి భక్తుడు. అయినప్పటికీ శ్రీరాముడిని కీర్తిస్తూ సేతుబంధ కావ్యాన్ని రచించాడు.

         రెండవ ప్రవరసేనుడి తరువాత అతడి కుమారుడు నరేంద్రసేనుడు క్రీస్తుశకం 450 లో రాజ్యానికి వచ్చాడు. అజిత భట్టారిక అనే కుంతల దేశ రాకుమారిని నరేంద్రసేనుడు వివాహం చేసుకున్నాడు. రాజ్యాభిషిక్తుడైనప్పుడు యుక్త వయస్కుడైన నరేంద్రసేనుడు సుమారు 20 సంవత్సరాలు క్రీస్తుశకం 470 వరకు రాజ్యపాలన చేశాడు. ఇతడి పాలనాంతర కాలంలో వాకాటక రాజ్యం మీద నలరాజు భవదట్ట దండయాత్ర చేశాడు. నరేంద్రసేనుడు అతడిని ఓడించాడు. ఆ తరువాత కాలంలో నల వంశీయులు ప్రతీకారంగా వాకాటక రాజ్యంలోని పలు ప్రాంతాలను ఆక్రమించుకున్నారు.

         నరేంద్రసేనుడి తరువాత రెండవ పృథ్వీసేనుడు రాజ్యానికి వచ్చాడు. ఇతడు విష్ణు భక్తుడు. ఇతడి ఏకైక పుత్రిక మహాదేవి విష్ణుకుండిన రెండవ మాధవ వర్మను వివాహం చేసుకోవడం వల్ల వాకాటక రాజ్యం, విష్ణుకుండిన రాజ్యంలో విలీనం అయింది. సమర్థవంతులైన పాలకులు, జ్ఞానవంతులైన రాజ్య నిర్వాహకులు, కళా సాహిత్య పోషకులైన అనేకమంది ప్రఖ్యాత రాజులను ఈ వాకాటక శాఖ సృష్టించింది.

         సమాంతరంగా వాకాటక వంశీయులకు చెందిన వత్సగుల్మ శాఖ రాజులు అధికారంలోకి వచ్చారు. వారిలో సర్వసేనుడు, వింధ్యసేనుడు లేదా రెండవ వింధ్యశక్తి, రెండవ ప్రవరసేనుడు, దేవసేనుడు, హరిసేనుడు వున్నారు. హరిసేనుడే ఈ శాకకు చెందినంతవరకు చివరి రాజు.

         గొప్ప వాకాటక సామ్రాజ్యం అకస్మాత్తుగా విచ్చిన్నం కావడానికి కారణాలను చరిత్రలో భద్రపర్చలేదు.

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)