వాగ్దానాల
అమలు దిశగా …1
(సీఎం కేసీఆర్ వడివడిగా అడుగులు)
(సీఎం కేసీఆర్ వడివడిగా అడుగులు)
వనం
జ్వాలా నరసింహారావు
నమస్తే
తెలంగాణ (10-06-2014)
ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంలో అంతిమ
ఘట్టంగా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో గత పదమూడు సంవత్సరాల ఉద్యమ ఫలితంగా
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ
అధ్యక్షురాలు సోనియాగాంధీ చొరవతో, మహోద్యమానికి సారధ్యం వహించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
నాయకత్వ నేపధ్యంలో, 29 వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. రాష్ట్ర ప్రప్రధమ
ముఖ్యమంత్రిగా నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఉద్యమ నాయకుడు చంద్రశేఖర్‌రావు
జూన్ 2, 2014 న పదవీ ప్రమాణ స్వీకారం
చేశారు. తదనంతరం జరిగిన అల్పాహార విందు కార్యక్రమంలో, తనకు,
తన సహచర మంత్రులకు ఉద్దేశించిన ప్రత్యేక షామియానాలోకి కాకుండా,
పలువురుండే ఇతర ఆహ్వానితుల మధ్యలోకి వెళ్ళి అందరినీ పేరు-పేరున
పరామర్శించారు కేసీఆర్. ఆ మరుక్షణం నుంచే, టీఆరెస్ ఎన్నికల
ప్రణాళికలో పేర్కొన్న వాగ్దానాల అమలు దిశగా, రాష్ట్రంలో
స్వపరిపాలన సుపరిపాలనగా వుండాలన్న తలంపుతో, ఒక్క క్షణం కూడా
ఆలస్యం చేయకుండా, తన ప్రభుత్వ భవిష్యత్
కార్యక్రమాన్ని-ప్రణాళికను వివరించే పనిలో నిమగ్నమయ్యారు ముఖ్యమంత్రి. ఆ రోజు పరేడ్
మైదానంలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆయన చేసిన తొలి ప్రసంగంలోనే
కేసీఆర్ ఆలోచనలు, నిబద్ధత, వడివడిగా
వాగ్దానాల అమలు చేయాలన్న తలంపు, బహిర్గతమైనాయి.
"ఎన్నికల హామీలన్నీ
అమలు చేస్తాం" అని కేసీఆర్ తన తొలి ప్రసంగంలో స్పష్టంగా
ప్రకటించారు. రాజకీయ అవినీతిని కూకటి వేళ్లతో పెకలించి
వేస్తాం అని; సంక్షేమ పథకాలన్నీ అవినీతి రహితంగా, పారదర్శకంగా అమలు చేస్తామని; తెలంగాణ రాష్ట్రాన్ని
అభివృద్ధి చేయడం కోసం కేంద్రంతోపాటు పొరుగు రాష్ట్రాలతో నూ సత్సంబంధాలు ఏర్పాటు
చేసుకుంటామని అన్నారు. తెలంగాణ అభ్యుదయం, అభివృద్ధి, బాగుపై ప్రజలు కోటి ఆశలతో ఉన్నారని గుర్తు చేస్తూ, తదనుగుణంగానే
ప్రజా సమస్యల పరిష్కారమే కేంద్ర బిందువుగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని,
ప్రభుత్వ పాలన కూడా ఉద్యమ పథంలోనే ఉంటుందని, ఇతర
రాష్ట్రాలు చూసి నేర్చుకునేలా, తెలంగాణ రాష్ట్రాన్ని
దేశానికి తలమానికమయ్యేలా పాలన అందిస్తామని, ప్రజా కమిటీలను
ఏర్పాటు చేస్తామని, మేధావులు, పత్రికా
సంపాదకులతో రాష్ట్ర సలహా మండలిని నియమించి వారి సలహాలు, సూచనలు
స్వీకరిస్తాం అని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్‌తోపాటు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో వేతనాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. దళితులు, గిరిజనులు, బీసీలు,
మైనారిటీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని, ఈ వర్గాల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామని,
కేవలం దళితుల కోసమే రూ. 50 వేల కోట్లు ఖర్చు
చేస్తామని ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు
ప్రతి పేద కుటుంబానికి 120 గజాల స్థలంలో రెండు పడకగదులు,
వంటగది, హాలు, మరుగుదొడ్డి
సౌకర్యం ఉన్న ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. రూ.లక్ష లోపు పంట రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. తెలంగాణను
"సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా" గా
తీర్చిదిద్దుతామన్నారు. వ్యవసాయ విద్యాలయాలను విస్తృతం
చేస్తామన్నారు. వ్యవసాయ పరిశోధనలను మరింత ప్రోత్సహిస్తామని
చెప్పారు. ప్రతి జిల్లాలో వెయ్యి ఎకరాల్లో 'గ్రీన్ హౌస్ టెక్నాలజీ'ని అందుబాటులోకి తెస్తామని
చెప్పారు.
ఫార్మా, పౌల్ట్రీ రంగాలు మరింత పురోగమించేలా ప్రోత్సహిస్తామని కేసీఆర్ తెలిపారు.
చక్కటి పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని అన్నారు. తెలంగాణను
మూడేళ్లలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుస్తా మన్నారు. స్పెషల్
పోలీస్, ఏఆర్, సివిల్ పేరిట ఉన్న
పోలీసు విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకొస్తామని తెలిపారు. పోలీసు శాఖలో వ్యత్యాసాలు, అన్యాయాలను
సరిదిద్దుతామన్నారు. హైదరాబాద్ నగరంలోని నిరాశ్రయులు,
మురికివాడలలో నివసించే వారందరికీ ఆశ్రయం కల్పిస్తామని, దీనికోసం ఎంత ఖర్చయినా భరిస్తామని తెలిపారు. నగరాన్ని
మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఉద్యోగులందరికీ
త్వరలో ఆరోగ్య కార్డులు ఇస్తామని, వృద్ధులు, వితంతువులకు పెన్షన్ రూ. 1000 ఇస్తామని, వికలాంగులకు పెన్షన్ రూ. 1500 ఇస్తామని కూడా
చెప్పారు కేసీఆర్.
పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్న అనంతరం
కేసీఆర్ సచివాలయానికి వచ్చారు. కేసీఆర్ రాకతో సచివాలయంలో పండగ వాతావరణం
నెలకొంది. ఉద్యోగులు ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించి,
వాగ్దానాల అమలు దిశగా మరికొన్ని అడుగులు వేశారు. సర్వీస్ రూల్స్ ను
సమూలంగా మార్చేసుకుందామని, సరళీకృతం చేసుకుందామని, పదో పీఆర్సీని జెట్ స్పీడ్‌తో అందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా పే స్కేళ్ళు ఉంటాయని ప్రకటించారు.
పరిపాలనా సౌలభ్యం కొరకై, ప్రజాసమస్యల సత్వర
పరిష్కారం కొరకై, మంత్రివర్గ సభ్యులకు అవసరమైన సలహాలు సూచనలు
ఎప్పటికప్పుడు ఇచ్చేందుకు, ముఖ్యమంత్రి, కొత్త రాష్ట్రానికి ఆరుగురు సలహాదారులను నియమించారు. వివిధ రంగాల్లో విశేష అనుభవం ఉన్న వీరి సేవలను ఉపయోగించుకునేందుకు కేసీఆర్
వీరిని సలహాదారులుగా నియమించుకున్నారనాలి. ఎన్నికల వాగ్దానాల సత్వర అమలుకు వీరి
అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందనవచ్చు.
తెలంగాణ
తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కె. చంద్రశేఖర్‌రావు, తన ప్రధాన హామీల్లో ఒకటైన లక్ష రూపాయల రైతుల రుణ
మాఫీపై పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే దృష్టి సారించారు. ఈ పథకం అమల్లో భాగంగా
బ్యాంకర్లతో సమావేశం కావడానికి ముందు రైతుల రుణ మాఫీకి సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు
చేసుకున్నారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే లక్ష రూపాయల వరకూ ఉన్న రైతుల
రుణాలు మాఫీ చేస్తామని చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారం సమయంలో ప్రకటించారు. దీన్ని అమలు చేసి తీరుతామని
ఆయన బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన రాష్ట్రావతరణ
వేడుకల్లో కూడా పునరుద్ఘాటించారు. ఆ వెంటనే కార్యాచరణలోకి దిగారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన
మూడో రోజే రుణ మాఫీపై కేసీఆర్ బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజున జరిగిన జీహెచ్‌ఎంసీ సమీక్షా
సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్, "హైదరాబాద్ బ్రాండ్ బజాయించాలి" అని చెప్పారు. హైదరాబాద్‌ను
విశ్వ నగరంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలను యుద్ధ ప్రాతిపదికన రూపొందించాలని
ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నగరానికి ఐటీఐఆర్ ప్రాజెక్టు వస్తున్నందున దానికి
తగిన స్థాయిలో మౌలిక వసతుల కల్పన, రవాణా వ్యవస్థ ఏర్పాటు జరగాలన్నారు. నగరంలో పచ్చదనానికి, పారిశుధ్యానికి పెద్దపీట
వేయాలన్నారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థను
సమూలంగా మార్చివేయడం,
శివారు
జలాశయాల పునరుద్ధరణ ,
మూసీకి పూర్వ
వైభవం,
వర్షాలకు
ట్రాఫిక్ అంతరాయాల నివారణ,
మురికివాడల్లో
డబుల్ బెడ్ రూం గృహాల నిర్మాణం తదితర అంశాలన్నింటిపైనా ఆయన తన ప్రాధాన్యతలను
అధికారులకు వివరించారు.
అరకొర
సౌకర్యాలతో మురికివాడల్లో నివసిస్తున్న పేదలకు టాయ్‌లెట్, కిచెన్‌తో కూడిన రెండు పడక
గదుల ఇళ్ల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే నగరంలో ఏదో ఒక
ప్రాంతంలో పైలట్ ప్రాజక్టుకింద పనులు చేపట్టాలని ఆదేశించారు.
రాష్ట్ర
విభజనకు సంబంధించి తెలంగాణ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ
పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక గ్రీవెన్స్ సెల్
ఏర్పాటుచేసింది.
ముఖ్యమంత్రి
కేసీఆర్ ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. సెక్రెటేరియట్ కేంద్రంగా
గ్రీవెన్స్ సెల్ పనిచేస్తుంది. విభజనలో భాగంగా సీమాంధ్రకు బట్వాడా అయిన తెలంగాణ ఉద్యోగుల
సమస్యల పరిష్కారానికి ఈ సెల్ దృష్టి సారిస్తుంది. ఈ విభాగం పనిచేయాల్సిన విధానంపై
కూడా సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. మౌఖికంగా మార్గదర్శకాలను
కూడా సూచించారు.
పదవీ ప్రమాణ
స్వీకారం చేసిన మూడో నాడే బ్యాంకర్లతో ముఖ్యమంత్రి
కేసీఆర్ భేటీ అయ్యారు. రూ.లక్ష లోపు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని
ఎన్నికల సమయంలో ప్రకటించిన కేసీఆర్... ముఖ్యమంత్రిగా
బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టారు. "మా ఎన్నికల హామీల్లో ప్రధానమైనది రుణ మాఫీ. ఈ
పథకాన్ని గడిచిన సంవత్సరం పంట రుణాలు తీసుకున్న రైతులకు అమలు చేయాలని లక్ష్యంగా
పెట్టుకోవాలనుకుంటున్నాము'' అని బ్యాంకర్లకు స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిగా
బాధ్యతలు స్వీకరించిన మూడో రోజునే కేసీఆర్ తన శాసనసభ నియోజకవర్గమైన గజ్వేల్ లో పర్యటించారు. అక్కడ కూడా ఆయన చేసిన ప్రసంగాలలో, సమీక్షలలో,
ఎన్నికల వాగ్దానాల అమలుకే పెద్ద పీట వేయడం జరిగింది. అక్కడ జరిగిన
ఒక బహిరంగ సభలో, "భూములు, కమతాల
ఏకీకరణ చేపడతాం. రైతుల భూములన్నీ అక్కడ కొంత ఇక్కడ కొంత
ఉన్నాయి. దీంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల భూములన్నీ ఒకరి భూమి ఒకరు కొని, తెలంగాణ
భాషలో రద్దు బదులు చేసుకునే విధంగా రిజిస్ట్రేషన్ ఫీజు మాఫీ చేసి, ఆర్నెల్ల పాటు కమతాల ఏకీకరణకు శ్రీకారం చుడతాం" అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.
సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని కేసీఆర్ ప్రకటించారు. తమ ప్రభుత్వం, తొలి ప్రాధాన్యంగా దళితులు..బలహీనవర్గాలు..గిరిజనులు.. ముస్లిం,
క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని తెలిపారు.
వీరి సంక్షేమానికి రానున్న ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలను అవినీతికి
తావులేకుండా ఖర్చు చేస్తామన్నారు. ఇందులో రూ.50వేలు దళితుల అభివృద్ధికే ఖర్చు చేస్తామని వివరించారు. రెండో ప్రాధాన్యం వ్యవసాయ రంగానికని తెలిపారు. గ్రామీణ
ప్రాంతాల్లో 80-90 శాతం మంది వ్యవసాయాన్నే నమ్ముకుని
బతుకుతున్నారు. అందువల్ల వ్యవసాయ రంగానికి మేలు చేస్తామని
వెల్లడించారు. మూడో ప్రాధాన్యంగా విద్యారంగంపై దృష్టి
సారిస్తామని తెలిపారు. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యను
అందిస్తామన్నారు. రెండు, మూడేళ్లలో పేద పిల్లలందరికీ ఆంగ్ల
మాధ్యమంలో సీబీఎస్ఈ సిలబస్ తో ఉచిత నిర్బంధ విద్యను అందిస్తాం అని ప్రకటించారు.
తెలంగాణలో 24 జిల్లాలను ఏర్పాటు చేసి జిల్లాకో
నిమ్స్ ఆసుపత్రి నిర్మిస్తామని వెల్లడించారు. హార్టీకల్చర్
హబ్ ఏర్పాటు చేస్తామని, తెలంగాణ రైతులు విత్తనాలు మాత్రమే
పండించి, ధనికులయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తామని
ప్రకటించారు. ఎన్నికల హామీల మేరకు ఆటో రిక్షా సోదరులకు పన్ను
మాఫీ చేస్తామని కూడా అన్నారు.
ఏరియా అథారిటీ కమిటీ ద్వారా గజ్వేల్‌ను రాజకీయాలకు అతీతంగా
అభివృద్ది చేయడానికి చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. మండలానికి కొంత మందిని
సలహాదారులను ఎంపిక
చేసి
నియోజకవర్గానికి కమిటీ ద్వారా అవసరమైన సమస్యలను తాను ప్రత్యేకంగా నియమించిన ఐఏఎస్
ఆఫీసర్ ద్వారా ప్రభుత్వ దృష్టికి చేరతాయని పేర్కొన్నారు. ప్రజలకు అవసరంగా భావించిన
ఆమోదయోగ్యమైన పనులకు వెంటనే నిధులు మంజూరవుతాయని కూడా సూచించారు. స్థానిక ప్రజలకు వ్యక్తిగత
ఇబ్బందులు కలిగినా ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకువెళితే సహకరిస్తారన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల
కోసం తాను నియమించిన ప్రత్యేక పీఏ ద్వారా అభివృద్దితో పాటు సమస్యల పరిష్కారానికి
సహకారం పొందవచ్చన్నారు.
ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానం మేరకు కొత్తగా 14 జిల్లాలను ఏర్పాటు చేసి, మొత్తం తెలంగాణాలోని జిల్లాల సంఖ్యను 24 కు పెంచడానికి ప్రభుత్వం కసరత్తు
ప్రారంభించింది. జయశంకర్ పేరుతో ఒక కొత్త జిల్లా రాబోతుంది కూడా. రాష్ట్రంలో పాలన
పట్టాలకెక్కించే క్రమంలో ప్రభుత్వ శాఖల సమీక్షలను ఆయన వేగవంతం చేశారు. విద్యుత్, వ్యవసాయ రంగాలతో పాటు
అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు.బాధ్యతలు
చేపట్టిన నాలుగో రోజున తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలపై కేసీఆర్
అధికారులతో సమీక్ష నిర్వహించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమీక్షలో విద్యుత్‌కు
సంబంధించిన అంశాలపై ప్రభుత్వ లక్ష్యాలను ఆయన అధికారులకు వివరించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో ప్రభుత్వ
రంగంలోనే విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు రంగంలో విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చేదిలేదని ఆయన
స్పష్టంచేశారు. ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసినట్లుగా,
రాబోయే మూడేళ్లలో 6వేల మెగావాట్ల సామర్థ్యం
కలిగిన విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తి చేయాలని చెప్పారు.
ఈ విషయంలో ఎవరు ఎటువంటి సాకులు చెప్పినా వినేదిలేదని స్పష్టంచేశారు.
బొగ్గు ఆధారిత రంగంలో చేపట్టనున్న థర్మల్ ప్రాజెక్టులు
పూర్తికావడానికి పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకుని తగు చర్యలు
తీసుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ
ప్రాంతాల్లో ఇళ్ల మీద సౌర విద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలను
ప్రోత్సహించాలని సీఎం సూచించారు.
పదవీ బాధ్యతలు చేపట్టిన వారంలోపల, చకచకా, తాను చేయబోయే కార్యక్రమాలు ఎలా వుండబోతోందీ, తమ ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు చేసిన వాగ్దానాలను ఎలా అమలు
చేయబోతోందీ, వాటి అమలుకు తన ప్రభుత్వం రూపొందించుకుంటున్న
కార్యాచరణ ప్రణాళిక ఏంటీ, అన్న విషయంలో ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఒక స్పష్టమైన అవగాహనతో, ఆలోచనతో
ముందుకు సాగుతూ, వాగ్దానాల అమలు దిశగా వడివడిగా అడుగులు
వేయడం ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మార్గదర్శకంగా వుంటుందనవచ్చు. End