మహా
భారత యుద్దారంభం, కురుక్షేత్రానికి
తరలిన కౌరవ-పాండవ సేనలు
ఆస్వాదన-60
వనం
జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక
(20-02-2022)
వేదవ్యాసుడిని
మనసులో ధ్యానం చేసుకుని,
సంజయుడు, తాను చూసిన, తనకు తెలియవచ్చిన భారత యుద్ధ
విశేషాలను, యుద్ధం మొదలైనప్పటి నుండి ధృతరాష్ట్రుడికి వివరించసాగాడు. యుద్ధం ఆరంభం
కావడానికి పూర్వం, దుర్యోధనుడు దుశ్శాసనుడితో మాట్లాడుతూ, కౌరవ సేనకు ముఖ్యుడైన భీష్ముడిని సైన్యం అంతా
కలిసి రక్షిస్తే, అతడు సైన్యాన్ని మొత్తాన్ని రక్షించగలడని,
శత్రువులను ధ్వంసం చేయగలడని అన్నాడు. భీష్ముడిని అంతా కలిసి రక్షించడం అంటే ఏమిటో
కూడా చెప్పాడు దుర్యోధనుడు. తన ముందు యుద్ధంలో ఎవరూ నిలువలేరని, నిలిచి యుద్ధం చేస్తే జీవించలేరని, అయితే
శిఖండితో మాత్రం తాను పోరాడలేనని, భీష్ముడు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఒకవేళ కౌరవ సైన్యం కన్నులు మూయకుండా భీష్ముడిని
కాపాడలేకపోతే, శిఖండి చేతుల్లో ఆ మహావీరుడు మరణించవచ్చని, కాబట్టి గొప్ప-గొప్పవీరులంతా
శిఖండిని ఎదిరించాలని దుర్యోధనుడు అన్నాడు.
మర్నాడు
సూర్యోదయం కాగానే యుద్ధం ఆరంభం అయింది. సేనాపతైన భీష్ముడు ప్రత్యేక ఆకర్షణగా
వెలుగొందాడు. ఆయన రథం, దానికి కట్టిన గుర్రాలు, ఆయన ధరించిన వస్త్రాలు, పట్టుకున్న ధనుస్సు, బంగారు తాడిచెట్టుతో రెపరెపలాడుతున్న జెండా,
కాంతులీనే కవచం అన్నీ ప్రత్యేకంగా కనిపించాయి. ఇక మిగిలిన మహావీరుల రథాలు, జెండాలు ఎలా వున్నాయో తిక్కన ఈ కింది పద్యంలో
వర్ణించాడు.
సీ:
కాంచనమయ వేదికా కనత్కేతనో జ్జ్వల
విభ్రమం బొప్ప గలశజుండు
గనక గోవృషసాంద్ర కాంతి కాంతధ్వజ విభవ విలాసంబు
వెలయ గృపుడు
మణిసింహ లాంగూల మహితకేతుప్రభా స్ఫురణంబు మెఱయంగ
గురుసుతుండు
రత్నశిలారశ్మి రాజిత కదళికా మహిమ
శోభిల్లంగ మద్రవిభుడు
తే: వెడలి తమ తమ చతురంగ వితతు లెల్ల,
నుచిత గతి నూల్కొనంగ జేయుచు గడంగి
సంగరోత్సవ సంభృతోత్సాహు లగుచు
నగుచు దగు మాట లాడుచు నడచి రెలమి
పూర్వం
మహావీరులు తమ రథాలకు జెండాలను అమర్చేవారు. ఆ జెండా మీద వారిని స్ఫురింపజేసే ఒక
చిహ్నం ఉండేది. దూరం నుంచి చూడగానే, ఫలానా వీరుడని గుర్తు పట్టడానికి వీలుండేది. (కురుక్షేత్ర
మహాసంగ్రామంలో కౌరవపక్షాన ఉన్న అతిరథ మహారథుల వైభవాన్ని, వారి రథాలకున్న కేతనముల ద్వారా తెలియజేసేదే ఈ
పద్యం). ముందుగా, ద్రోణాచార్యులవారి జెండా గుర్తు
బంగారంతో నిర్మింపబడిన యజ్ఞవేదిక. కలశజుడు అంటే కుండలో పుట్టినవాడు. ద్రోణములో (కుండలో) పుట్టినవాడు
ద్రోణాచార్యుడు. ఇక కృపాచార్యులవారి జెండా
బంగారం కాంతితో మెరసిపోయే ఆబోతు విలాస వైభవం కలిగింది. గోవృషమంటే ఆబోతు. ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ జెండా
గుర్తు, వెలుగులు విరజిమ్మే మణి నిర్మితమైన
సింహం తోక. మద్రదేశాధీశుడు శల్యుడి జెండా
గుర్తు, రత్నాల రాళ్లతో ధగ ధగా మెరిసిపోయే
అరటిచెట్టు. ఈ విధంగా ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, శల్యుడు, రథాలపై వారి జెండాలు రెపరెపలాడుతుండగా, ముచ్చట్లు చెప్పుకొంటూ, అమితోత్సాహంతో, చతురంగబలాలతో కదనరంగానికి కదలి వెళ్లారు పరిహాస
వచనాలు వెదజల్లుకుంటూ.
ఇంకా యుద్ధానికి
బయల్దేరి వెళ్ళిన వారిలో యాదవ మహావీరుడు కృతవర్మ; సింధు దేశాధిపతి, మహావీరుడైన
జయద్రథుడు; విందుడు, అనువిందుడు అనే రాజ సోదరులు; కళింగరాజు భగదత్తుడు; శకుని; (మూడు
తరాలకు చెందిన) బాహ్లికుడు, ఆయన కుమారుడు సోమదత్తుడు, మనుమడు భూరిశ్రవుడు; కాంభోజ దేశాధినేత
సుదక్షిణుడు; కోసల దేశరాజు బృహద్బలుడు; మాహిష్మతీ నగరాన్ని ఏలే నీలుడు; త్రిగర్త దేశాధిపతి సుశర్మ; రాక్షస నాయకుడు అలంబసుడు; హలాయుధుడు; సాల్వ, సౌవీర, శూరసేన, ఆభీర, యవన మొదలైన రాజులు యుద్ధభూమికి తరలి వెళ్లారు
కౌరవుల పక్షాన. వీరివెంట పది అక్షౌహిణుల సైన్యం తరలి వెళ్ళగా, పదకొండో అక్షౌహిణి బలం వెంటరాగా సార్వభౌముడు దుర్యోధనుడు
కదన రంగానికి కదిలి వెళ్లాడు. అతడి వెంట ఆయన తమ్ములు దుశ్శాసనుడు, దుర్మర్షణుడు, వివింశతి, వికర్ణుడు వెళ్లారు. (అక్షౌహిణి:
218170 రథాలు, 218170 గజాలు, 65610 గుర్రాలు, 109350
కాల్బలం)
(ఈ సందర్భాన్ని
విశ్లేషిస్తూ, డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు
ఇలా రాశారు: ‘మహాభారత యుద్ధంలో నేటి భారత దేశం ఎల్లలు దాటిన కాంభోజ దేశం నుండి
సేనలు, యవనులు, రాక్షసులు పాల్గొనడం ఒక విశేషం. ఒక విధంగా అది
తొలి ప్రపంచ యుద్ధం’).
ఆ సమయంలో
భీష్ముడు రాజులందరినీ ఒక చోట సమావేశపరచి, రాజులకు యుద్ధం స్వర్గంలో ప్రవేశించడానికి తెరువబడిన ద్వారం అని, రణరంగమే రాజులకు పంట చేనని, యుద్ధభూమిని
దర్శించడం అంటే రాజులు పెన్నిధిని చూసినట్లే అని అన్నాడు. భీష్ముడి మాటలు విన్న
రాజులలో ఉత్సాహం పొంగిపోయింది. కర్ణుడు, అతడి స్నేహితులు, కొడుకులు, మంత్రులు, బంధువులు యుద్ధంలో పాల్గొనకూడదని
దుర్యోధనుడితో అన్నాడు భీష్ముడు. ఆ విధంగా భీష్ముడు కర్ణుడిని యుద్ధ రంగానికి
రాకుండా నిషేధించాడు. ఇది దుర్యోధనుడికి బాధ కలిగించే అంశమైనా, భీష్ముడిని ప్రశంసించాడు.
భీష్ముడిని
చక్కటి యుద్ధ వ్యూహం పన్నమని అర్థించాడు దుర్యోధనుడు. భీష్ముడు మనుష్యాకారమైన ఒక
గొప్ప ‘నరవ్యూహాన్ని’ అమర్చాడు. ఆ వ్యూహంలో భాగంగా యుద్ధం చేయడానికి తనతోపాటు
ద్రోణుడిని, కృపాచార్యుడిని,
అశ్వత్థామను, కృపవర్మను, శల్యుడిని, బాహ్లికుడిని, సోమదత్తుడిని, భూరిశ్రవుడిని నిలిపాడు. మధ్యలో దుర్యోధనుడు
తన తమ్ములతో వుండేలా ఏర్పాటు చేశాడు ఆ వ్యూహాన్ని. ఆ వ్యూహంలో మరో విశేషం, ఆయా సైన్యాలను కాపాడడానికి రక్షగా ఏనుగులు
అమర్చబడ్డాయి. వాటి ముందు రథాలు,
రథాలకు రక్షగా అశ్విక బలాలు,
అశ్విక బలాలకు రక్షగా విలుకాండ్రు, వారికి రక్షగా ఆయుధాలు ధరించిన సైనికులు నిలిచే
ఏర్పాటు జరిగింది. ఇలాంటి దృఢమైన వ్యూహాన్ని కనీవినీ ఎరుగమని చూసిన వారంతా
ఆశ్చర్యం చెందారు.
ఇదిలా వుండగా ఏడు
అక్షౌహిణుల పాండవుల సేన సహితం యుద్ధ రంగానికి కదిలింది. ధర్మరాజు యుద్ధభూమికి తరలి
వెళ్లాడు. ఆయన యుద్ధానికి వెళ్లడం శోభాయమానంగా పరిణమించింది. ఆయన వెంట యుద్ధ వినోద
విహారానికి సన్నద్ధుడై భీముడు వచ్చాడు. అర్జునుడు యుద్ధ భూమికి బయల్దేరి వెళ్లాడు.
దేదీప్యమానంగా ప్రకాశించే ఆంజనేయుడి జెండా వున్న ఆయన దివ్యమైన రథ సారథిగా
శ్రీకృష్ణుడు వున్నాడు. దేవదత్తం అనే తన శంఖం పూరిస్తూ అర్జునుడు శోభతో
వెలుగొందాడు. కవలలైన నకుల సహదేవులు యుద్ధాన్ని గురించి సల్లాపాలు ఆడుకుంటూ
బయల్దేరి యుద్ధరంగానికి వచ్చారు. అభిమన్యుడు, ద్రౌపదీదేవి కొడుకులు ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకీర్తి, శతానీకుడు, శ్రుతసేనుడు రణరంగానికి కదలి
వచ్చారు.
పాండవ పక్షాన
యుద్ధం చేస్తున్న పాంచాల ప్రభువు ద్రుపదుడు, ఆయన కొడుకులు, తమ్ముళ్లు; మత్స్యరాజు విరాటుడు; యాదవ
సైన్యాలతో సాత్యకి; చేకితానుడు;
శిఖండి; మగధ దేశాధిపతి సహదేవుడు, ఆయన తమ్ముడు; ధృష్టకేతుడు; రాక్షసులతో సహా రాక్షస వీరుడు
ఘటోత్కచుడు; పాండ్యరాజు; శిబి వంశీయుడైన రాజు; కాశ కరూశాది రాజులు; పంచ కేకయులు మొదలైన వారు యుద్ధానికి తరలి
వచ్చారు. పాండవ పక్షంలో సర్వసేనాధిపతైన ధృష్టద్యుమ్నుడు దేదీప్యమానంగా
వెలుగొందాడు. ఆయన ముందుండి పాండవ సైన్యాన్ని నడిపించాడు. పాండవ సేన
కురుక్షేత్రానికి తరలి వెళ్లడాన్ని అభివర్ణిస్తూ, తిక్కన ఇలా రాశారు:
సీ: ఇల ధూళి యెగసిన బలుచగాకుండంగ రాసిన తొడవుల
రాజము దొరగు
సమరవికాసంబు
చెమట నొప్పరకుండ హేతి దీధితులు రేయెండ నొడుచు
భేరీధ్వనుల
నింగి బీటలు వోకుండ గరికర శీకరోత్కరము దడుపు
దర్పంబు
గనుజాటు దాకకుండగ గొడు గులపెల్లు ఖచర దృక్కోటి నాగు
తే: ననిన నిజమైనయట్లుండె మనుజనాథ ధరణి వడవడ
వడకె దిక్తటము లద్రువ
భూరి
చతురంగ చండ విస్ఫూర్తి బాండు నందనులసేన గలనికి నడుచునపుడు
పాండవ
సైన్యం శమంతక పంచకం చేరే సమయంలో ధర్మరాజుకు అన్నీ మంచి శకునాలు ఏర్పడ్డాయి. ఆ శుభ
శకునాలకు ధర్మరాజు సంతోషించాడు. పాండవ సైన్యం ఉత్సాహంతో యుద్ధం చేయడానికి
కురుక్షేత్రం చేరింది. కౌరవ సేనాపతి భీష్ముడు నర వ్యూహం పన్నాడని, దానికన్నా
అనురూపమైన గొప్ప వ్యూహాన్ని పన్నమని అర్జునిడితో అన్నాడు ధర్మరాజు. అర్జునుడు
పాండవ సేనాధిపతి ధృష్టద్యుమ్నుడితో ‘అచల’ వ్యూహాన్ని పన్నమని ఆదేశించాడు. ఆయన అలాగే అని చెప్పి అచల వ్యూహం
అమర్చాడు. ఆ అచల వ్యూహంలో యుద్ధం చేయడానికి అభిమన్యుడు, ఇతర పాండవ కుమారులు, నకుల సహదేవులు, భీమసేనుడు, విరాటుడు, ద్రుపదుడు నిలిచారు. వ్యూహం మధ్య భాగంలో
ధర్మరాజు రథం మీద కూచున్నాడు. ముందు భాగంలో అర్జునుడి రక్షణలో శిఖండి భీష్ముడికి
ఎదురుబొదురుగా నిలిచాడు. వెనుక భాగంలో మహదా దేశానికి చెందిన సహదేవుడు, ధృష్టకేతుడు నిలిచారు.
ఒకవైపు
కౌరవ పక్షంలోని వారు, ఇంకొక వైపు పాండవ పక్షంలోని వారు
పరస్పరం ఎదుర్కుంటూ భయంకరంగా ప్రకాశించారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు పాంచజన్యం అనే
శంఖాన్నీ, అర్జునుడు దేవదత్తం అనే శంఖాన్నీ
పూరించారు. ఇదిలా వుండగా కురుక్షేత్రానికి వచ్చిన ధర్మరాజు ఉన్నట్లుండి తన
కవచాన్ని తీసేసి, ఆయుధాలతో పాటు రథం మీద పెట్టి, రథం దిగి, మౌనవ్రతం పూని, భీష్ముడున్న చోటుకు వెళ్లడం చూశారు అతడి
తమ్ములు, శ్రీకృష్ణుడు, సాత్యకి మొదలైనవారు. ఆయనలా ఎందుకు
చేస్తున్నాడో తెలియక కంగారు పడి వారంతా ఆయన్ను అనుసరించారు. వారి ప్రశ్నలకు జవాబు
చెప్పకుండా నిరాయుధుడై, భీష్ముడిని సమీపించిన ధర్మరాజు పితామహుడైన భీష్ముడి
దగ్గరికి పోయి అతడి పాదాలకు నమస్కారం చేశాడు.
యుద్ధం
చేయడానికి భీష్ముడి అనుమతి,
ఆశీర్వాదం కావాలని కోరాడు ధర్మరాజు. ఆయనకు తన ఆశీస్సులని, ఆయన శత్రువులను జయిస్తాడని, ఆయనేదైనా వరం కోరుకుంటే ఇస్తానని అన్నాడు
భీష్ముడు ధర్మరాజుతో. భీష్ముడిని యుద్ధంలో గెలిచే ఉపాయం చెప్పమని అడిగాడు ధర్మరాజు.
తాను పట్టిన ఆయుధం పక్కకు పెట్టితే తప్ప తనను జయించడం దేవతలకు కూడా సాధ్యం
కాదన్నాడు. తనను జయించడానికి ఉపాయం చెప్పడానికి ఇంకా సమయం రాలేదన్నాడు. ఆ తరువాత
ధర్మరాజు ముందుకు పోయి ద్రోణుడు,
కృపుడు, శల్యుడు వున్న చోటుకు వెళ్లి వారి
పాదాలకు నమస్కారం చేసి, తాను వారితో యుద్ధం చేయడానికి అనుమతి, ఆశీర్వాదం కావాలని
కోరాడు. ధర్మం ఎక్కడ వుంటుందో అక్కడ శ్రీకృష్ణుడు వుంటాడని, శ్రీకృష్ణుడు ఎక్కడ వుంటే అక్కడ విజయం
సిద్ధిస్తుందని అన్నాడు ద్రోణాచార్యుడు. చేతిలో ఆయుధం ఉన్నంతవరకు తనను ఎవరూ
చంపలేరన్నాడు. తనకు కీడుమాట వినిపిస్తేనే శస్త్ర సన్యాసం చేస్తానన్నాడు. యుద్ధంలో
ధర్మరాజు గెలవాలని కృపాచార్యుడు, శల్యుడు దీవించారు. వారందరి దగ్గర సెలవు తీసుకుని
ధర్మరాజు మరలి తన స్థానానికి వెళ్లాడు.
కవిత్రయ
విరచిత
శ్రీమదాంధ్ర
మహాభారతం, భీష్మపర్వం, ప్రథమాశ్వాసం
(తిరుమల, తిరుపతి
దేవస్థానాల ప్రచురణ)