Sunday, June 30, 2024

స్వారోచిషుడే స్వారోచిష మనువు {మనుచరిత్ర కథ (5 & 6)} : వనం జ్వాలా నరసింహారావు

 స్వారోచిషుడే స్వారోచిష మనువు

మనుచరిత్ర కథ (5 & 6)

వనం జ్వాలా నరసింహారావు

సూర్యదినపత్రిక (01-07-2024)

వరూధిని కొడుకు స్వరోచికి ఇందీవరాక్షుడి కూతురు మనోరమతో వివాహం

స్వరోచి బాణ ప్రయోగం వల్ల రాక్షసాకారాన్ని వీడి నిజరూపాన్ని ధరించిన గంధర్వరాజు ఆకాశంలో వున్న తన విమానం నుండి భూమ్మీదకు దిగాడు. తనతో పోరాడిన రాక్షసుడు గంధర్వాకారం దాల్చడం స్వరోచికి విస్మయం కలిగించింది. కిందికి దిగిన గంధర్వుడు స్వరోచిని ఆలింగనం చేసుకున్నాడు. తాను స్వరోచి తల్లికి సోదరుడినని, అందువల్ల అతడు తన మేనల్లుడని, తన పేరు ఇందీవరాక్షుడని, మనోరమ తన కుమార్తె అని, ముని శాపాన తనకు రాక్షసత్వం కలిగిందని, చివరకు తన ప్రియపుత్రికనే భక్షించడానికి పూనుకున్నానని అన్నాడు గంధర్వరాజు. ఇలా ఇందీవరాక్షుడు తన విషయం చెప్తుంటే ఆయన కూతురు మనోరమ తండ్రి పాదాలకు నమస్కారం చేసింది.

ఆ తరువాత ఇందీవరాక్షుడు తన శాప వృత్తాంతాన్ని వివరించాడు స్వరోచికి. మోసం చేసి తాను ఒక ముని దగ్గర వైద్యశాస్త్రాన్ని అభ్యసించిన కారణాన ఆయన తనను రాక్షసుడివి కమ్మని శపించినట్లు చెప్పాడు. తన అపరాధాన్ని మన్నించమని మునిని కోరానని, శాపం పోవడానికి ఎన్ని దినాలు పట్టుతుందని అడిగానని, అప్పుడాయన కనికరించి స్వల్పకాలంలోనే అని చెప్పాడని అన్నాడు. రాక్షసాకారంలో తాను తన కుమార్తెను మింగబోయే సమయంలో ఒకానొక మహానుభావుడు వేసిన బాణం వల్ల తన శరీరం దహించి దివ్యరూపం వస్తుందని శాప విమోచన కూడా చెప్పాడని అన్నాడు. తన రాక్షసత్వం పోగొట్టి తనకు మహోపకారం చేసిన స్వరోచికి ప్రత్యుపకారంగా తన కూతురునిచ్చి వివాహం చేస్తానని చెప్పాడు ఇందీవరాక్షుడు. తాను నేర్చుకున్న వైద్యశాస్త్రాన్ని కూడా తన కూతురుతో సహా స్వరోచికిస్తానని అన్నాడు. స్వరోచి దానికి అంగీకరించాడు.

తమరాజుకు శాప విమోచనం కలిగిన సంగతి తెలుసుకొని, మర్నాడు, ఇందీవరాక్షుడి పూర్వ సేవకులైన గంధర్వులు అక్కడికి వచ్చి ఆయన దర్శనం చేసుకొన్నారు. స్వరోచి, మనోరమ సహితంగా ఇందీవరాక్షుడు స్వర్ణమయ రథం ఎక్కి ఆకాశమార్గాన మందరగిరికి (గంధర్వ పురానికి) పోయారు. ఆ తరువాత ఇందీవరాక్షుడు మందరాద్రి విశేషాలను స్వరోచికి వివరించాడు. ఒక రాజమందిరంలో స్వరోచిని విడిది చేయించాడు ఇందీవరాక్షుడు. స్వరోచిని, మనోరమను పెళ్లికొడుకుగా, పెళ్లికూతురుగా అలంకారం చేశారు పేరంటాలు. ఆ తరువాత ఇరువురూ వివాహ వేదికకు చేరుకున్నారు. పెండ్లికుమారుడైన స్వరోచికి మామైన గంధర్వరాజు శాస్త్రోక్తంగా మధుపర్కాన్ని ఇచ్చాడు. గంధర్వరాజు విష్ణుమూర్తిని పూజించిన విధంగా అల్లుడిని గౌరవించి లక్ష్మీ సమానురాలైన కూతురును స్వరోచికి ధారాపూర్వకంగా సమర్పించాడు. అంటే కన్యాదానం చేశాడు. తదనంతరం మంగళసూత్ర ధారణ, తలంబ్రాల కార్యక్రమం నడిచింది. అగ్నికి ప్రదక్షిణ నమస్కారాలు కూడా జరిగాయి. అరుంధతీదేవికి నమస్కారం చేయించారు వధూవరులను.

వంద భద్రజాతి ఏనుగులను ఇందీవరాక్షుడు అల్లుడైన స్వరోచికి అరణంగా ఇచ్చాడు. తండోపతండాలుగా హయాలను కానుకగా ఇచ్చాడు. రత్నాలతో ప్రకాశించే విమానాన్ని కానుకగా ఇచ్చాడు. కూతురు మనోరమకు అనేక రకాల ఆభరణాలను, పనిముట్టులను, వస్త్రాలను, వస్తుసమూహాలను దాచుకోవడానికి చక్కటి పెట్టెలను, సుగంధ ద్రవ్యాలను, పనికత్తెలను, దాసీజనాన్ని అరణంగా ఇచ్చాడు ఇందీవరాక్షుడు. కొన్ని గ్రామాలను కూడా వివాహ సమయంలో అరణంగా ఇచ్చాడు కూతురుకు.

పెండ్లికి వచ్చిన వారందరికీ కట్నకానుకలు ఇచ్చి ఇందీవరాక్షుడు సత్కరించాడు.

స్వరోచికి, వనదేవతకు పుట్టినవాడే స్వారోచిష మనువు

స్వరోచి, మనోరమలు వివాహానంతరం కలిసిమెలిసి సుఖాలను అనుభవించారు. అలా వుండగా ఒకనాడు విచారంగా వున్న భార్యను చూసి కారణం అడిగాడు స్వరోచి. తన మీద అమితమైన ప్రేమకల ఇద్దరు చెలికత్తెలు ఒక ముని శాపం వల్ల రోగపీడితులై వున్నారని, వారి రోగం పోగొట్టే విధానం తెలియక విచారపడుతున్నానని, కాబట్టి స్వరోచి ఆ రోగం పోగొట్టుతే తనకు సౌఖ్యం వుంటుందని చెప్పింది మనోరమ. భార్యను విచారపడవద్దని అంటూ, తాను నేర్చుకొన్న వైద్యశాస్త్రాన్ని ఉపయోగించి ఆమె చెలికత్తెల రోగబాదను మాన్పిస్తానని అన్నాడు స్వరోచి. ఆమె చెలికత్తెలు ఎక్కడున్నారో చెప్తే వైద్యం చేస్తానని, అక్కడికి మనోరమను కూడా తనతో రమ్మని చెప్పి, ఇద్దరూ కలిసి వారిదగ్గరికి వెళ్లారు. తనకు తెలిసిన వైద్యం ద్వారా వారికి దివ్య ఔషధం ఇచ్చి, ఆ రోగానికి తగ్గ అనుపానం, పథ్యం కూడా ఇచ్చి, రోగ నిర్మూలన చేసి వారిని ఆరోగ్యవంతులుగా మార్చాడు స్వరోచి.

రోగబాధ నుండి విముక్తి పొందిన ఆ ఇరువురు చెలికత్తెలు పూర్వపు కాంతిని పొంది, స్వరోచిని స్తోత్రం చేశారు. ఆయన చేసిన మహోపకారానికి ప్రత్యుపకారంగా తాము ఏమీ ఇవ్వలేకపోయినప్పటికీ, ఆయన సంపాదించదానికి అవసరమైనవి కొన్ని తమ దగ్గరున్నాయని వాటిని ఇస్తామని చెప్పారు. వారిలో ఒకామె, తాను మందారుడు అనే విద్యాధరుడి కూతురినని, తన పేరు విభావసి అని, భూమ్మీద కల మృగాల, పక్షుల మాటల అర్థం తనకు తెలుసని, ఆ గొప్ప విద్యను తన దగ్గరనుండి గ్రహించి తనను పెండ్లి చేసుకొమ్మని స్వరోచిని కోరింది. ఆ వెంటనే మరొకామె తన పేరు కళావతి అని, తాను ఒక ముని కుమార్తెనని, తనతల్లి తనను పుట్టగానే వదిలి వెళ్లిపోయిందని, ఒక గంధర్వుడు తనను కోరగా తన తండ్రి నిరాకరించడం వల్ల ఆయన్ను ఆ గంధర్వుడు చంపాడని, తనకు దిక్కుతోచక ప్రాణత్యాగం చేద్దామనుకుంటే ఆకాశవీధిలో పోతున్న పార్వతీదేవి వారించిందని, తనకు మహారాజైన స్వరోచి భర్త కాగలదని అన్నదని, అతడిని వివాహం చేసుకొని సకల సౌఖ్యాలు అనుభవించమని అన్నదని చెప్పింది.

తనకు పార్వతీదేవి ‘పద్మిని అనే విద్యను కూడా ఉపదేశించినట్లు పేర్కొన్నది కళావతి. దానిని స్వరోచికి ఉపదేశిస్తానని చెప్పింది. విభావసి, కళావతిల నుండి రెండు విద్యలను నేర్చుకున్నాడు స్వరోచి. ఒక సుముహూర్తంలో ఆ ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు. వారి వివాహ సమయంలో దేవదుందుభులు మోగాయి. మలయమారుతం వీచింది. ఆ విధంగా మనోరమను, విభావసి, కళావతిలను పెండ్లి చేసుకొని తన ముగ్గురు భార్యలతో సుఖంగా జీవించసాగాడు స్వరోచి.

ఈ నేపధ్యంలో స్వరోచి ఒకనాడు వేటాడదలచి అడవికి పోయాడు. ఆయన వేటాడుతుంటే జంతుజాలాలు భయపడి పారిపోసాగాయి. ఆపుడు ఆయన దృష్టి ఒక అడవి పందిమీద పడింది. స్వరోచి ఆ సూకరాన్ని చంపడానికి ధనుస్సు సంధించగా ఒక ఆడ లేడి రాజును చూసి మనుష్య భాషలో దాన్ని చంపవద్దని, అది అతడికి ఏ అపకారం చేయలేదని, దాన్ని వదిలి తనను చంపమని అన్నది. ఎందుకు ఇలా చావడానికి సిద్ధపడ్డావని లేడిని అడిగాడు స్వరోచి. తన హృదయం స్వరోచి మీద లగ్నమై వున్నదని, మదన తాపంతో బాధపడుతున్నానని, తనను కూడమని కోరింది లేడి. ఆమె మృగమని, తాను నరుడినని ఇద్దరికీ సంబంధం ఎలా కుదురుతుందని ప్రశ్నించాడు స్వరోచి. తనను స్వరోచి ప్రేమతో కౌగలించుకుంటే చాలునని అనగానే స్వరోచి అలాగే చేశాడు.

తక్షణమే ఆ లేడి ఒక మనుష్య స్త్రీ ఆకారంలో కనిపించింది. అలా ఆమె  లేడి రూపం ధరించడానికి, ఆ తరువాత మనుష్య స్త్రీ కావడానికి కారణం ఏమిటని అడిగాడు స్వరోచి. తాను ఆ వనానికి దేవతనని, స్వరోచి వల్ల ఒక ‘మనువును కనాలని దేవతలు కోరగా ఆయన దగ్గరకు వచ్చానని, తనను కలిసి కొడుకును కనమని, దానివల్ల పుణ్యలోకాలు కలుగుతాయని చెప్పింది. దానికి అంగీకరించిన స్వరోచి ఆమెతో సుఖాలను అనుభవిస్తుండగా ఆమె గర్భాన్ని దాల్చింది. ఒక శుభ దినాన సింహపరాక్రమ సమానుడైన, మన్మథుడిని మించిన సౌందర్యం కల, సార్వభౌమ లక్షణాలు కల, సద్గుణాలు కల, అభిమానధనుడైన ఒక కుమారుడిని కన్నది ఆ వనదేవత.

స్వారోచిషుడు అన్న పేరు కల ఆ బాలుడు ఇంద్రియ నిగ్రహం కలవాడై, విష్ణుదేవుడిని గూర్చి బహుకాలం తపస్సు చేశాడు. ఆ ఆదినారాయణుడు కొంతకాలానికి అతడికి ప్రత్యక్షమయ్యాడు. స్వారోచిషుడు విష్ణును పరిపరి విధాల స్తోత్రం చేశాడు. ఆయన దశావతారాలలో ఏమేమి చేశాడో వర్ణించాడు. విష్ణుమూర్తి ఏం వరం కావాల్నో కోరుకొమ్మని స్వారోచిషుడికి చెప్పాడు. విష్ణుమూర్తి సమీపంలో సంచరించే వృత్తిని తనకిమ్మని స్వారోచిషుడు ప్రార్థించాడు. రెండవ మనువుగా నీతిని, ధర్మాన్ని వృద్ధిపరచి, చక్కగా భూమిని పాలించి, ఆ తరువాత సాలోక్య పదవిని పొందమని స్వారోచిషుడికి చెప్పాడు నారాయణుడు. అలా చెప్పి స్వారోచిషుడిని మనుపదానికి పట్టాభిషిక్తుడిని చేసి అంతర్థానం అయ్యాడు విష్ణుమూర్తి.

స్వారోచిషుడు మనుత్వాన్ని పొంది శాస్త్ర పద్ధతిన దుష్టులను శిక్షిస్తూ, శిష్టులను రక్షిస్తూ, భూమిని పాలించాడు. స్వారోచిష మనువుగా ప్రసిద్ధికెక్కాడు. చివరకు దేవత్వాన్ని పొందాడు. 

(వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ ప్రచురించిన మనుచరిత్రము,

పంచమాశ్వాసం షష్టాశ్వాసంఆధారంగా)

శ్రీరాముని ధర్మబోధ : వనం జ్వాలా నరసింహారావు

 శ్రీరాముని ధర్మబోధ

వనం జ్వాలా నరసింహారావు

భక్తి పత్రిక (జూలై నెల, 2024)  

శ్రీరాముడు వనవాసానికి వెళ్లాడు. ఆ తరువాత భరతుడు వచ్చి ఆయనను తిరిగి రమ్మని బతిమాలాడాడు. శ్రీరాముడు అంగీకరించకపోవడం వల్ల ఆయన ప్రతినిధిగానే భరతుడు పాలన సాగించాడు. చిత్రకూట పర్వతంమీద తనను కలిసిన భరతుడికి శ్రీరాముడు అనేక రాజధర్మాలను బోధించాడు. శ్రీరాముడు వనవాసానికి వెళ్లిన ఆరవరోజు అర్థరాత్రి దశరథుడు ప్రాణాలు విడిచాడు. నలుగురు కుమారులలో ఎవరూ అందుబాటులో లేనందున, రాజు దేహాన్ని నూనె కాగులో వుంచి భద్రపరిచారు. రాజును నిర్ణయించే అధికారంకల గౌతముడు, ఏమి చేయాలన్న విషయంలో, మౌద్గల్యుడు, కాత్యాయనుడు, మార్కండేయుడు, జాబాలి, కాశ్యపుడు, వామదేవుడు, మంత్రులతో, వసిష్ట మహర్షితో ఆలోచనచేశారు. దూతలను పిలిచి మేనమామ వూరిలో వున్న భరతుడి దగ్గరకు పోయి ఆలశ్యం చేయకుండా వెంటబెట్టుకుని రమ్మని వశిష్టుడి మాటగా ఆజ్ఞాపించారు. అయోధ్యలో జరిగిన సంగతులను భరతుడికి తెలియచేయోద్దని దూతలకు చెప్పారు.

భరతుని భ్రాతృప్రేమ

ఏ రాత్రయితే దూతలు భరతుడున్న నగరం ప్రవేశిoచారో, అదే రోజు తెల్లవారు ఝామున భరతుడికి వచ్చిన ఒక భయంకరమైన కల వచ్చింది. ఆ కల ఫలితం దశరథుడో, రాముడో, లక్ష్మణుడో, తానో మరణించడమని అనుమానపడ్డాడు భరతుడు. రామాయణంలో దశరథ, భరత, త్రిజటల స్వప్నాలు అత్యద్భుతమైన ఘట్టాలు. మూడు కలలూ నిజమైనట్లు వాల్మీకి చెప్పడం విశేషం.

వసిష్ఠుడు తొందరగా రమ్మని పిలిచినప్పుడు దానికేదో కారణం వుండాలని భరతుడు అనుమానించాడు. మర్నాడే అయోధ్యకు ప్రయాణమై పోయాడు. అయోధ్యలో ప్రవేశిస్తూనే దాని రూపురేఖలు గమనించి కీడును శంకించాడు. తల్లి కైకేయి ఇంటికి పోయి, తండ్రి మరణం, దాని నేపధ్యం తెలుసుకుని, తండ్రిని, తండ్రితో సమానమైన శ్రీరామచంద్రమూర్తిని విడనాడిన ఐశ్వర్యం నాకెందుకు? రాజ్యం ఎందుకు? అని కైకను తూలనాడాడు. ‘నేను నీ ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తాను. ఆ శ్రీరాముడిని పట్టణానికి మరల వచ్చేట్లు చేస్తాను. ఆయన్నే రాజుగా చేసి స్థిరమైన అంతఃకరణతో ఆయనకు దాసుడనై, చత్రచామరాదుల సేవ చేస్తూ, ఆయనకు సంతోషం కలిగిస్తాను. ఇది నా స్వరూపస్వభావం. నా స్వరూపం వల్లే నేను ఆయనకు దాసుడిని’ అంటాడు. అదే విషయాన్ని పెత్తల్లి కౌసల్య దగ్గరికి, పినతల్లి సుమిత్ర దగ్గరికి పోయి చెప్పాడు.

         ఆతరువాత, ఆచార్యులు, ఋత్విక్కులు, పురోహితులు దశరథ మహారాజుకు అంత్యక్రియలు జరిపించారు. మౌని వశిష్ఠుడు సింహాసనానికి రాజును చేయడానికి అధికారం వున్న రాజకర్తలు, దశరథుడి (పరోక్ష) కోరిక మేరకు భరతుడిని రాజ్యపాలన చేయమని కోరారు. దానికి అంగీకరించని భరతుడు, శ్రీరాముడినే రాజును చేసి, ఆయన పక్షాన తానే అడవుల్లో పద్నాలుగేళ్లు వుంటానని చెప్పాడు. అరణ్యంలోనే శ్రీరాముడికి పట్టాభిషేకం చేసి అయోధ్యకు తీసుకువద్దామనీ, అంటూ అడవికి పోవడానికి ప్రయాణమయ్యాడు భరతుడు.


అడవిలో చిత్రకూటాన్ని, మందాకినీ నదిని గురించి సీతకు చెప్తున్న సమయంలో, దూరంనుండి వినవస్తున్న ధ్వనిని గమనించిన లక్ష్మణుడు పరుగుపరుగున వచ్చాడు. భరతుడు సైన్యంతో వస్తున్నాడని, అనుమానంగా చెప్పాడు. వెంటనే లక్ష్మణుడిని సరిదిద్దాడు శ్రీరాముడు. ఇంతలో రానేవచ్చిన భరతుడికి పర్ణశాలలో దర్భాసనం మీద కూర్చున్న శ్రీరాముడు కనిపించాడు. పరుగెత్తుకుంటూ ఆయన సమీపంలోకి పోయాడు భరతుడు. తనను చూడగానే దుఃఖిస్తున్న భరతశత్రుఘ్నులను ఓదార్చి, శ్రీరాముడు కుశల ప్రశ్నలు వేశాడు. తండ్రి చనిపోయిన వార్త భరతుడి ద్వారా విని ఎంతగానో దుఃఖించాడు. తండ్రికి పిండప్రదానం చేశాడు.   

ఆలోచన పంచుకోవాలి

ఆ తరువాత శ్రీరాముడిని అయోధ్యకు రమ్మని భరతుడు కోరాడు. రాముడు నిరాకరించాడు. ఇద్దరి మధ్యా వాదోపవాదాలు జరిగాయి. మధ్యలో రాజ ధర్మాన్ని వివరిస్తూ రాముడు భరతుడిని ప్రశ్నలు వేయడం జరిగింది. యజ్ఞయాగాలతో దేవతలను, శ్రాద్ధాదులతో పితృదేవతలను తృప్తి పరుస్తున్నావా అని, ప్రజల మాటలు అర్థం చేసుకుని వారిని సంతోషపరుస్తున్నావా అని, గురువులకు శుశ్రూష, పెద్దలకు నమస్కారాలు, విద్వాంసులకు, ఆయుర్వేదం తెలిసినవారికి, బ్రాహ్మణులతో సహా అవసరమైనవారికి  ధన సహాయం చేసి సంతోష పరుస్తున్నావా అని ప్రశ్నించాడు. మంత్రులందరూ శౌర్యవంతులు, నీతిశాస్త్రం చక్కగా చదివినవారే కదా?! బుద్ధిలో రాజుతో సమానమైనవారు, ఇంద్రియ నిగ్రహం వున్నవారే కదా అని అడిగాడు. శాస్త్రాన్ని తెలిసిన మంత్రులు రాజు ఆలోచనలు ముందుగానే బహిర్గతం చేయరు కదా అని అడిగాడు.

రహస్యాలను ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించాలి. వాటిని కేవలం ఒకడితోనే పంచుకుంటే వాడికి ఎవరనుకూలంగా వుంటే వారికే చెప్పే ప్రమాదం వుంది. పదిమందితో పంచుకుంటే, ఒకరు కాకున్నా మరొకరు ఇతరులకు చెప్పే అవకాశం వుంది. భిన్నాభిప్రాయాలు కలవారైతే వారిలోవారు కలహించుకుంటారని, రాజు ఆలోచనలు ఏవిధంగా వున్నా, పనికి ముందే ఎవరికీ చెప్పడం తగదు. నీతిశాస్త్రం ప్రకారం నడుచుకోవాలి. కార్యం చెడిపోయే విధంగా ఆలస్యం చేయకూడదు. నిర్ణయానికి పూర్వమే సామంతరాజులకు తెలియకుండా జాగ్రత్త పడాలి. వేయిమంది మూర్ఖులకంటే కార్యం ఆలోచించి చేయగల కనీసం ఒక్కడైనా రాజు దగ్గర వుండాలి.

కష్టజీవులకు తోడ్పాటు

రాజు తనమీద ప్రేమగలవారిని, అనేక పరీక్షల్లో నెగ్గినవారిని, వంశపరంపరగా సేవ చేస్తున్న వారిని, త్రికరణ శుద్ధిగా సత్యంగానే వుండేవారిని, మాలిన్యం లేనివారినే మంత్రులుగా నియమించాలి. నిర్మలమైన మనసు లేనివారు, చెడునీతిని బోధించేవారు, ఇతరులమీద పిర్యాదులు చేసేవారు, రాజు అంటే భయం లేనివారు, ధనాశ వున్నవారు రాజు దగ్గర వుండతగరు. సేనానాయకుడు సుగుణాల కలిగినవాడు, శూరుడు, ధైర్యం వున్నవాడు, సమర్దుడు అయి వుండాలి.

నాస్తికవాదులైన చార్వాకులను ఆదరించరాదు. అలా చేస్తే, ఈ లోకానికి, పరలోకానికి వాళ్లు కీడు చేస్తారు. వాళ్లు వాస్తవానికి పండితులు కాకపోయినా తమను తాము పండితులమని అనుకుని సర్వజ్ఞత్వం తమ మీద వేసుకుంటారు. విపరీత బుద్ధులు నేర్పుతూ, తమను నమ్మినవారిని ఉభయ లోకాల్లో చెడగొడతారు. సత్సంప్రదాయ పరంగా చదవాల్సినవి చదవకుండా చేస్తారు. ధర్మశాస్త్రాలను విపరీత బుద్ధితో వక్రభాష్యం చెబుతారు. నిస్సారమైన, నిరర్థకమైన తర్క, యుక్తి వాదాలు చేసుకుంటూ వుండే చార్వాకులతో స్నేహం కీడు కలిగిస్తుందని స్పష్టం చేశాడు.

భూమి దున్ని జీవించే, పశువులను మేపి జీవించే కష్ట జీవులకు సహాయం చేయాలన్నాడు శ్రీరాముడు. కృషి, గోరక్షణ, వాణిజ్యం చేసేవారికి సహాయం చేస్తూ, వారి బాధలు తీర్చాలన్నాడు. సమస్త వర్ణాశ్రమ ధర్మాలవారిని శాస్త్రప్రకారం రక్షించాలని, స్త్రీలను గౌరవించాలని చెప్పాడు. ప్రతిరోజూ సభలో ఉదయాన ప్రజలకు దర్శనం ఇవ్వాలి. అలా చేయకపోతే రాజుకు అనారోగ్యమని ప్రజలు సందేహిస్తారు. సేవకులను ఇష్ఠానుసారంగా రాజు దగ్గరికి రానిస్తే వారు చులకనగా చూస్తారు. రానివ్వకాపోతే విపరీతార్థాలు తీస్తారు. అవసరానికి తగ్గట్టే వారిని మితంగా కలవాలి. జలదుర్గాలు, గిరిదుర్గాలు, వనదుర్గాలు అన్నీ ధనధాన్యాలతో, జలాలతో, ఆయుధాలతో కూడి ఎప్పుడూ రక్షణలో వుండాలి.

ఇవి రాజధర్మాలు

వ్యయం కంటే మించి ఆదాయం వుండాలి. అపాత్రదానం తప్పు. దేవతా కార్యాలు, పితృ కార్యాలు, చేసేవారికి ధన సహాయం చేయాలి. పుణ్యకార్యాలు చేసేవారికి సహాయం చేస్తే రాజుకూ పుణ్యం వస్తుంది. నేరం చేసినవాడిని వదిలిపెట్టడం వల్ల కలిగే పాపం కంటే నేరం చేయనివాడిని దండించడం వల్ల కలిగే పాపమే అధికమని రాజైనవాడు గ్రహించాలని శ్రీరాముడు చెప్పాడు. గురువులకు, వృద్ధులకు, తాపసులకు, అతిథులకు, మోక్షలాభం సిద్ధించినవారికి, భక్తితో, నిర్మల మనసుతో నమస్కారం చేయాలి. ధనం కోసం ధర్మాన్ని వ్యర్థం చేయకూడదు. ధనం సంపాదించాల్సిన సమయంలో ధర్మ విచారం చేస్తూ కాలయాపన చేయకూడదు. ధర్మ, అర్థ, కామాలను ఏవేళకు ఏది చేయాలో అదే చేయాలి.

ఇవి లేకుండా రాజ్యం చేయాలని బోధించాడు. దశవర్గం, పంచవర్గం, చతుర్వర్గం, అష్టవర్గం, త్రివర్గం, విద్యాత్రయం అనే లక్షణాలలో ఏవి అవసరమో, అనవసరమో ఆలోచించి, ఆచరించాలన్నాడు. దైవ, మానుష్య వ్యసనాల గురించి, కృత్యం గురించి, ప్రకృతి, మండలం, వింశతి వర్గాలు, షడ్గుణాలలో ముఖ్యమైన సంధి, విగ్రహం, యాత్ర, దండం గురించి ఆలోచించి గ్రహించాల్సిన వాటిని మాత్రమే గ్రహించాలని చెప్పాడు.

మంత్రి, పురోహితుడు, యువరాజు, సేనాపతి, ద్వారపాలకుడు, అంతఃపురంలాంటి వాటిదగ్గర మేటి ద్వారపాలకుడు, అంతఃపుర కార్యనిర్వాహకుడు, కారాగారాధిపతి, అర్థసంచయికుడు, కార్యనియోజకుడు, రాజాజ్ఞాలను వెల్లడించేవాడు, ప్రాడ్వివాకుడు (న్యాయ విచారకర్త), సేనానాయకుడు, నగరాధ్యక్షుడు, కర్మాంతికులను (సైన్యేతర సిబ్బందికి జీతాలిచ్చేవాడు) నియమించాలన్నాడు శ్రీరాముడు. సభను అలంకరించే వాడిని, ధర్మాధ్యక్షుడిని, దండపాణి లేదా దండపాలుడిని, దుర్గపాలుడిని, రాష్ట్రంతపాలుడిని, నియమించాలని చెప్పాడు శ్రీరాముడు.

దోషం అంటనివాడు

ధర్మ పద్ధతిన రాజ్యపాలన ఎలా చేయాలో శ్రీరాముడు వివరించాడు. అసత్యం పలకడం, దేవుడు లేదనడం, పని చేయకుండా కాలం గడపడం, అనవసరంగా కోపగించుకోవడం కూడదు. వాటివల్ల బుద్ధిపొరపాటు, బుద్దిమాంద్యం కలుగుతాయి. శ్రేయస్కరమైన జ్ఞానుల దర్శనం చేసుకోకుండా వుండకూడదు. పంచేంద్రియాలకు లోబడి వుండడం, రాచకార్యాలను ఒక్కడే ఆలోచన చేయడం మంచిదికాదు. నీచులను గౌరవించడం, నిర్ణయించబడిన పని చేయక పోవడం అనర్థం. అర్థజ్ఞానం లేనివారితో కలిసి ఆలోచన చేయడం, ఆలోచనలను దాచుకోకుండా బయట పెట్టడం లాంటి దోషాలు రాజుకు వుండకూడదు.

ఇతరులతో ఆలోచించి చేయాల్సిన ప్రతిపనినీ ముగ్గురికి తక్కువ కాకుండా, నలుగురికి ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అది కూడా మొదట ఒక్కొక్కరితో వేర్వేరుగా, తర్వాత అందరిని కలిపి ఒక్కటిగా ఆలోచించాలి. వారి అభిప్రాయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఆ తరువాత మంచి, చెడులను భేరీజు వేసుకుని, రాజు స్వతంత్రంగా ఆలోచన చేయాలి.

‘నేను నీకు చెప్పినవన్నీ ధర్మార్థ కామాలతో కూడినవి. ఇహపరలోక సుఖం కలిగించేవి. మోక్షార్థికి కావాల్సిన దీర్ఘాయువు ఇచ్చేవి. ధర్మార్థ కామాలలో ధర్మానికే ప్రాధాన్యం ఇచ్చేవి. రాజైనవాడు ధర్మ మార్గాన నడుచుకుంటూ ప్రజలను పాలిస్తే మరణించిన తరువాత స్వర్గానికి పోయి అక్కడ దివ్యభోగాలను అనుభవించడానికి ఉపయోగపడేవి. ఎలాంటి సందర్భంలోనైనా, ప్రాణాపాయ స్థితిలో కూడా ధర్మాన్ని విడువకూడదు. ధర్మం శాశ్వతం’ అని భరతుడికి రాజధర్మాలను చెప్పడం పూర్తి చేశాడు శ్రీరాముడు.

(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)