విదుర, ఉద్ధవుల సంభాషణ
శ్రీ మహాభాగవత కథ-8
వనం జ్వాలా నరసింహారావు
సూర్యదినపత్రిక (28-10-2024)
కంII చదివెడిది భాగవతమిది,
చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్
చదివినను
ముక్తి కలుగును,
చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా’ మతినై
ధృతరాష్ట్రుడు
తన కుమారులైన దుర్యోధనాదులను గారాబంగా పెంచాడు. పాండురాజు మరణానంతరం ఆయన కుమారులైన
పాండవులను కూడా ఆయన చేరదీసి పెంచాడు. పాండవులను చూసి అసూయ పడ్డ సుయోధనాదులు వారిని
అనేక ఇబ్బందుల పాలు చేశారు. విషాన్నం పెట్టారు, తాళ్లతో కట్టారు, గంగలో తోశారు, రాజ్యం నుండి వెళ్ళగొట్టారు, వారున్న లక్క ఇంటికి నిప్పు పెట్టారు, వారి భార్య ద్రౌపదీదేవిని నిండు సభలోకి ఈడ్చి తెచ్చారు.
ఇలా వారిని అవమానించని రోజు లేదు. చివరకు మాయాజూదంలో పాండవుల రాజ్యాన్ని లాక్కుని
వారిని అడవులకు పంపారు. వారు పన్నెండేళ్ల అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తిచేసి, తిరిగొచ్చి తమ రాజ్యభాగాన్ని అడిగితే ఇవ్వలేదు. ధర్మరాజు
కోరికమీద రాయభారానికి ధృతరాష్ట్రుడి దగ్గరకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు. ఆయన మాటలు
కౌరవులు పెడచెవిన పెట్టారు.
శ్రీకృష్ణుడి పిలుపు మేరకు విదురుడు ఆ
సభకు వచ్చాడు. శ్రీకృష్ణుడి మాటలు మన్నించి పాండవుల రాజ్యాన్ని వారికివ్వమని
విదురుడు ధృతరాష్ట్రుడికి బోధించాడు. అలా కాకుండా కొడుకు సుయోధనుడి మాట వింటే, కులనాశనం, బందునాశనం తప్పకుండా జరుగుతుంది అని అన్నాడు. ఆ
మాటలు విన్న దుర్యోధనుడు కోపంతో ‘ఈ దాసీపుత్రుడిని సభనుండి గెంటి వెయ్యండి’ అని అన్నాడు. ఆ మాటలకు విదురుడు బాధపడి అడవికి వెళ్లాడు. అడవిలో
అనేక సరోవరాలను, పుణ్యభూములను, పుణ్యతీర్థాలను చూసి, ప్రభాస తీర్థానికి చేరుకున్నాడు. అక్కడ ఆయనకు కౌరవ-పాండవ
యుద్ధంలో కౌరవులంతా చనిపోయారని తెలిసి దుఃఖంలో మునిగి పోయాడు. ఇక ఆ ప్రదేశంలో
ఉండలేక బయల్దేరి పోయి, తిరుగుతూ-తిరుగుతూ యమునా నదిని సమీపించి అక్కడ భాగవతుడు, శ్రీకృష్ణ భక్తుడూ అయిన ఉద్ధవుడిని చూశాడు. కుశల ప్రశ్నల
అనంతరం పాండవుల, కృష్ణబలరాముల, వసుదేవుడి, ప్రద్యుమ్నుడి, ఉగ్రసేనుడి, సాత్యకి, దేవకీదేవి, కుంతీదేవి, ధృతరాష్ట్రుడి, తదితర ప్రముఖుల
క్షేమ సమాచారం అడిగాడు.
ఈ ప్రశ్నలన్నీ విన్న ఉద్ధవుడికి, యాదవ కులానికి పెన్నిధి అయిన కృష్ణుడి పాదకమలాలకు
శాశ్వతమైన ఎడబాటు వచ్చిన కారణంగా, దుఃఖం పొంగి పొర్లింది. నోట మాట రాలేదు. శోకంతో కాంతిహీనుడయ్యాడు. కృష్ణుడి
మరణవార్తను విదురుడికి చెప్పలేక ఉపేక్ష వహించాడు చాలాసేపు. ఒక్క క్షణం పాటు అతడి
కళ్ళు అశ్రువులతో నిండిపోయి గొంతు పూడుకు పోయింది. ఇలా అన్నాడు:
‘శ్రీకృష్ణుడి యోగ క్షేమం గురించి
ఏమని చెప్పాలి? శ్రీకృష్ణ పాదముద్రలతో స్వచ్చంగా, మంగళకరంగా ప్రకాశించే భూదేవి తన భాగ్యాన్ని కోల్పోయింది.
శ్రీకృష్ణ భగవానుడు తప్పుకున్న వెంటనే యాదవ రాజ్యలక్ష్మి కనుమరుగయింది. ధర్మాచరణ
నశించింది. అధర్మం పెచ్చుపెరిగింది. శ్రీకృష్ణుడి గురించి ఆయన లీలలను గురించి
ఆలోచించినప్పుడల్లా నా మనస్సు చింతాగ్రస్తమవుతున్నది’. ఇలా విదురుడికి చెప్తూ, కురుక్షేత్రంలో జరిగిన కౌరవ పాండవ యుద్ధాన్ని, యాదవ కుల నాశనాన్ని గుర్తుచేసుకున్నాడు
ఉద్ధవుడు. గుర్తుచేసుకుని ఇలా చెప్పాడు:
‘కుంతీపుత్రులకు ద్రోహం చేసిన కారణంగా
కౌరవులకు యుద్ధంలో బుద్ధి చెప్పాడు. యుద్ధంలో అంతులేని భుజబలంతో, ఉత్సాహంతో ఉన్న భీష్మ, ద్రోణ, భీమార్జునుల చేత పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యాన్ని చంపించాడు. భూభారాన్ని
తగ్గించాడు. తనతో సమాన బలురైన యదువీరులను జయించడం ఎవరికీ సాధ్యం కాదని భావించి, యాదవులకు అన్యోన్య శత్రుత్వాన్ని, వాళ్లలో వారికి
పోరాటాన్ని కలిగించి, పరస్పరం చేతిదెబ్బల వల్ల మరణించేట్లు చేశాడు. అభిమన్యుడి భార్య ఉత్తర
గర్భాన్ని నిలిపాడు’
‘సమస్త యాదవులు నాశనమైన తరువాత, ఎంతో
నేర్పుతో కూడిన తన నిజమాయా విలాసాన్ని చూసి, సరస్వతీ నదీ జలాలతో మరణించిన వారందరికీ ఉత్తర క్రియలు
జరిపించాడు. తదనంతరం, శ్రీకృష్ణుడు ఒక చెట్టునీడలో కూర్చును, నన్ను పిలిచి, బదరీవనానికి వెళ్లిపొమ్మన్నాడు. అలా చెప్పి, ఆయనెక్కడికో వెళ్లిపోయాడు. నాకు మాత్రం ఆయన్ను విడిచి
వెళ్లాలని అనిపించలేదు. హరిని వెతుకుతూ వెళ్లాను. ఆయన్ను ఒక చెట్టు మొదట్లో
చూశాను. ఆ సమయంలో భగవద్భక్తుడు మైత్రేయుడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చాడు.
శ్రీకృష్ణుడిని చూశాడు. అప్పుడు మైత్రేయుడు వింటుండగా, “ఉద్ధవా! నేను నీ హృదయంలో ఉంటూ అంతా చూస్తూ ఉంటాను.
ఇతరులకు నేను అగోచరుడనై ఉంటాను. నీకు ఇదే ఆఖరు జన్మ. ఇక జన్మ లేదు. బ్రహ్మకు నేను
చెప్పిన దివ్య జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆ జ్ఞానం వల్ల నీకు నా మహాత్మ్యం
తెలుస్తుంది” అన్నాడు. నేనాయనకు అంజలి ఘటించి ప్రార్థించాను’.
ఆ తరువాత తాను నరనారాయణులు తపస్సు
చేసిన ప్రదేశానికి బయల్దేరానని చెప్పాడు ఉద్ధవుడు. ఇదంతా విన్న విదురుడు కృష్ణుడు
ఉద్ధవుడికి చెప్పిన ఆధ్యాత్మత్త్వ రహస్యజ్ఞానాన్ని తనకు చెప్పమని కోరాడు. దానికి
తగినవాడు మైత్రేయుడే అని అన్నాడు ఉద్ధవుడు. ఇద్దరూ కలసి యమునా నదీతీరానికి
వెళ్లారు. యమునా నదిని కన్నుల పండువగా చూశారు. కృష్ణుడిని తలచుకుంటూ గడిపారు ఆ
రోజంతా. మర్నాడు యమునానదిని దాటి బదరికాశ్రమానికి పోయాడు ఉద్ధవుడు. ఆయన పోయిన
వెంటనే, మైత్రేయుడిని దర్శించడానికి తన
ప్రయాణం కొనసాగించాడు విదురుడు.
వెల్లి, వెళ్లి, గంగానదిని చూశాడు. అందులో స్నానం చేశాడు.
స్నానానంతరం అక్కడ ఒకానొక ఇసుక తిన్నెమీద భువన పావనుడైన మైత్రేయుడిని చూశాడు. చూసి
ఆయన పాదాలకు నమస్కారం చేశాడు విదురుడు. చేసి, చేతులు జోడించి, తన మనస్సులోని కోరిక తీర్చమని
ప్రార్థిస్తూ, ఇలా అన్నాడు:
‘మునీంద్రా! సత్త్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలకు నియంత అయిన భగవంతుడు అవతారాలు ఎత్తి, ఏఏ అవతారాలలో ఏఏ కర్మలను ఆచరించాడు? అసలాయన ఈ ప్రపంచాన్ని ఎలా కలిపించాడు? ఏ ప్రకారం
పాలిస్తున్నాడు? ఈ విశ్వాన్ని తనలో విలీనం చేసుకుని
యోగామాయలో ఎలా ఉంటున్నాడు? ఈ బ్రహ్మాండంలో ఎలా ఉంటున్నాడు? త్రిమూర్తుల రూపాలను పొంది అనేక విధాలుగా ఎలా క్రీడిస్తున్నాడు? అవతారాలను ఎత్తి ఏ ప్రయోజనం సాధించాడు? ఈ బ్రహ్మాండం లోపల అనేక లోకాలను ఎలా సృష్టించాడు?’ అని అడిగాడు విదురుడు.
జవాబుగా మైత్రేయుడు, విశ్వం పుట్టుకను, అభివృద్ధిని, నాశనాన్ని, విష్ణు మహత్త్వాన్నీ వివరంగా
చెప్పాడు.
(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం,
రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)