Thursday, April 25, 2024

సీతాకల్యాణం : వనం జ్వాలా నరసింహారావు....{భక్తి (ఆధ్యాత్మిక మాస) పత్రిక}

 సీతాకల్యాణం

వనం జ్వాలా నరసింహారావు

భక్తి (ఆధ్యాత్మిక మాస) పత్రిక (ఏప్రియల్ నెల 2024)

         శ్రీరామలక్ష్మణులను విశ్వామిత్రుడు మిథిలా నగరానికి తీసుకుని వెళ్లాడు. వారిని జనక మహారాజుకు పరిచయం చేసి, శివ ధనుస్సును చూపించమన్నాడు. అయితే జనకుడు ధనస్సును చూపించే ముందు సీత జన్మ వృత్తాంతం చెప్పాడు. సీత వీర్యశుల్కనీ, తన దగ్గరున్న, శివ ధనుస్సును ఎక్కుపెట్టగలవాడికే అయోనిజైన సీతను ఇచ్చి వివాహం చేస్తానని అన్నాడు. ఇంతవరకు తన దగ్గరకు వచ్చిన వారిలో ఎవరు కూడా ఆ విల్లు ఎత్తలేక పోయారని చెప్పాడు. చివరిగా ధనుస్సును శ్రీరామ లక్ష్మణులకు చూపించాడు జనకుడు.

శ్రీరాముడు, ధనుస్సుండే పెట్టె దగ్గరికిపోయి, దాని మూత తెరిచి చూశాడు. విశ్వామిత్రుడు ఆజ్ఞాపిస్తే బయటకు తీస్తానని, వింటిని ఎక్కుపెడతానని అన్నాడు. ఆయన అనుజ్ఞ ఇవ్వడంతో, రాముడు అవలీలగా వింటిని అరచేత్తో పట్టుకొని, బయటకు తీసి, అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోయింది.

రామచంద్రమూర్తి భుజబలం చూసానని, సీతనిచ్చి తాను ధన్యుడవుతానని జనకుడు అన్నాడు. దానివల్ల తమ జనక కులానికి కీర్తి సంపాదించిపెట్టినట్లయిందని కూడా విశ్వామిత్రుడితో చెప్పాడు. ఆ తరువాత దశరథ మహారాజుకు కబురు చేయడం, ఆయన మందీమార్బలంతో మిథిలా నగరానికి రావడం జరిగింది. సీతా రాముల కళ్యాణానికి ముందు ఇరు వంశాల వారు వంశ క్రమాలను గురించి అడిగి తెలుసుకుంటారు.

పాణిగ్రహణం  

కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోకుండా కన్యను ఇవ్వకూడదు, తీసుకొననూ కూడదు అనేది సనాతన ఆచారం. వివాహంలో వధూవరుల వంశవృక్షం, నేపధ్యం, ప్రవర అవశ్యంగా తెలియాలి. ధన ధాన్యాలు ఎంత సమృద్ధిగా వున్నప్పటికీ, వివాహ విషయంలో ఇది ప్రధానమని శాస్త్రం చెపుతున్నది. ఇక ఆ తరువాత సీతా కళ్యాణ ఘట్టం మొదలవుతుంది.

"సీతను సర్వాభరణో,  పేతను  దా నిలిపి నగ్ని  కెదురుగ గౌస

ల్యా తనయున  కభిముఖముగ,  క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్"

          అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా, శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువబెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:

సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా

కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్"

         ‘కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత, మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు’ అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్ర జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు. తరువాత, జనక మహారాజు లక్ష్మణుడివైపు చూసి, ‘లక్ష్మణా ఇటురా. కన్యాదానంగా ఊర్మిళను స్వీకరించు. ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను’ అని కోరాడు. ఆ తర్వాత, భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి శ్రుతకీర్తిని కన్యాదానం చేశాడు జనకుడు. ఇలా నలుగురు కన్యలను దశరథుడి నలుగురు కొడుకులకు కన్యధారపోసాడు జనకుడు.


రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు, తండ్రి అనుమతితో అగ్నికి, వేదికి, మౌనీశ్వరులందరికి, రాజులకు భార్యలతో కలిసి, వారి చేతులను తమ చేతుల్లో వుంచుకొని,  ప్రదక్షిణ చేసారు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. పూల వాన కురిసింది. ఆకాశంలో దేవ దుందుభులు ధ్వనించాయి. దేవతా స్త్రీలు నాట్యం చేసారు. గంధర్వ కాంతలు పాడారు. రావణాసురుడి భయం వీడి, సందుల్లో, గొందుల్లో దాక్కున్న వారందరు నిర్భయంగా, గుంపులుగుంపులుగా ఆకాశంలో నిలిచారు. మంగళ వాద్యాలు మోగుతుంటే పెళ్లి తంతు ముగిసింది.

జనకుని మనసు

         సీతా కల్యాణ ఘట్టం చదివినవారికి చర్చకు వచ్చే కొన్ని విషయాలున్నాయి. కన్యాదానం చేస్తూ జనకుడు రాముడిని ‘కౌసల్యా సుత’ అని సంబోధించాడు. రామా అని కాని, దశరథ కుమారా అని కాని అనలేదు.  రామా అని పిలిస్తే ఆ పేరుకలవారు మరొకరు కావచ్చు. దశరథ కుమారా అంటే నలుగురు కొడుకుల్లో వేరొకరు కావచ్చు. కౌసల్యా కుమార అంటే ఏవిధమైన సందేహానికి తావుండదు. ‘ఈ సీత’ అంటాడు జనకుడు రాముడితో. సిగ్గుతో సీత తన చేయి పట్టుకొమ్మని, తనంతట తానే రాముడిని అడగదు. అందుకే జనకుడు తానే సీతచేతిని రామచంద్రమూర్తికి చూపి ‘ఈ సీత’ అని చెప్పాడు.

         సాక్షాత్తు లక్ష్మీదేవైన సీతను రాముడికి ఇస్తున్నాననే అర్థమొచ్చే విధంగా ' సీత' అన్నాడు. సీత నాగటి చాలులో దొరికినప్పటికీ జనకుడు సగర్వంగా, 'నాదుకూతురు' అని చెప్పాడు. నీ ‘సహధర్మచరి అనడమంటే, రాముడేది ధర్మమని భావిస్తాడో, ఆ ధర్మమందే ఆమె ఆయనకు తోడుగా వుండి ఆ కార్యాన్ని నిర్వహిస్తుంది. రాముడు తండ్రి వాక్యాన్ని ఎలా పాలించాడో, అలానే ఆయన వాక్యాన్ని సీత పాలిస్తుందని అర్థం. సీతే లక్ష్మీదేవి అయినందువల్ల, విష్ణువు అవతారమైన రాముడి కైంకర్యమే ఆమె స్వరూపం.

అనసూయకు చెప్పిన కథ

తన కళ్యాణ వివరాలను సాక్షాత్తూ సీతాదేవే అత్రి మహాముని భార్యైన, అనసూయాదేవికి వివరించింది. అరణ్యవాసంలో భాగంగా చిత్రకూటం నుండి సీతాలక్ష్మణ సమేతంగా బయల్దేరిన శ్రీరాముడు అత్రి మహాముని ఆశ్రమానికి చేరుకుని, ఆయనకు, ఆయన భార్య సతీ అనసూయాదేవికి సీతాదేవిని పరిచయం చేశాడు. సీత పుణ్యచరిత్రదని, పాతివ్రత్యమే గొప్పదిగా భావించి, చుట్టాలను, సంపదను, సౌఖ్యాన్ని వదిలి, మహారాజు కోడలినని కాని, మహారాజు కూతురునని కాని లక్ష్యపెట్టకుండా, తండ్రిని యదార్థవాదిని చేయాలన్న ఉద్దేశంతో అడవికి భర్తతో  వచ్చిందని, ఆమెలాంటి స్త్రీలు అరుదని, కొనియాడింది అనసూయ.

శ్రీ రామచంద్రమూర్తి తన పరాక్రమంతో స్వయంవరంలో సీతను పెళ్లి చేసుకున్నాడని వినడమే కాని, అదెలా జరిగిందో వివరంగా వినలేదని, అ కథ వినాలని వుందని, జరిగినదంతా వివరంగా చెప్పమని అనసూయ సీతను అడిగింది. జవాబుగా సీతాదేవి, తన తండ్రి జనకుడు విదేహ దేశానికి రాజని, ఒకనాడు యజ్ఞం చేయడానికి నేల దున్నిస్తుంటే నాగేటి కర్రు తగిలి నేల పెళ్లలు లేచివచ్చి తాను భూమిలోనుండి బయటకు వచ్చానని, అప్పుడు జనకుడు తనను చూసి ఆశ్చర్యపడి, తన పెద్ద భార్యకు ఇచ్చాడని చెప్పింది. ఆమె తన్ను తన కన్నబిడ్డలాగా చూసుకుని పెంచిందని, తనకు వివాహయోగ్య దశ రావడం గమనించిన తల్లిదండ్రులు తనకు భర్తగా తగిన వాడిని, సద్గుణ సంపత్తికలవాడిని, గొప్పవాడిని, మన్మథాకారుడిని సంపాదించాలని జనకుడు వెతికాడు కాని ఎవరూ దొరకలేదని, అప్పుడు స్వయంవరం చాటిస్తే బాగుంటుందని ఆలోచనచేశాడని సీతాదేవి అనసూయకు చెప్పింది.

 ‘ఈ ప్రకారం ఆలోచించి, తాను చేసిన ఒక గొప్ప యజ్ఞంలో వరుణుడు తనకు ఇచ్చిన మనుష్యులు కదిలించ సాధ్యపడని వింటిని, రాజులు కలలో కూడా ఎక్కుపెట్టలేని వింటిని, అక్షయబాణాలను, రాజులందరికీ చూపించాడు జనకుడు. ఆ విల్లెక్కుపెట్టిన వాడు తన కూతురుకు భర్త కాగలడని ప్రకటించాడు. అక్కడికి వచ్చిన రాజులు దానిని ఎత్తలేక, చూడగానే భయపడి, దానికి ఒక నమస్కారం చేసి పోయారు. చాలాకాలం ఇలాగే గడిచి పోయింది. రాజకుమారులెవరూ దానిని ఎక్కుపెట్టలేక పోయారు. చివరకు విశ్వామిత్రుడితో వచ్చిన శ్రీరామచంద్రుడు ఆ పని చేసి తనను వివాహం చేసుకున్నాడు అని చెప్పింది సీత.

సీతాకల్యాణ తిథి  

శ్రీరామవతారం వైవస్వత మన్వంతరంలో ఐదవ మహాయుగమైన త్రేతాయుగంలో సంభవించింది. కొడుకులకై దశరథుడు పుత్రకామేష్టి చేయగా శ్రీరామ జననం అయింది. జన్మించింది విలంబినామ సంవత్సరం కాబట్టి హేవిలంబిలో అశ్వమేధయాగం, పుత్రకామేష్టి చేశాడు. దుర్ముఖి చైత్రమాసంలో అశ్వం విడిచారు. శ్రీరాముడి జనన కాలంలో గురువు, చంద్రుడు, కర్కాటక లగ్నంలో వున్నారు. అంటే జన్మ లగ్నం కర్కాటకం కాగా, మేషంలో రవి, బుధులు, తులలో శని, మకరంలో కుజుడు, మీనంలో శుక్రుడు వున్నారు. పునర్వసువు నక్షత్రంలో బుధవారం నాడు శ్రీరామజననం. చైత్ర బహుళ పంచమి నాడు నామకరణం జరిగింది. పరాభవ సంవత్సరంలో తొమ్మిదో ఏట ఉపనయనం జరిగింది. శ్రీరాముడికి 12 ఏళ్ల వయసున్నప్పుడు, సౌమ్యనామ సంవత్సరంలో యాగరక్షణ కొరకు విశ్వామిత్రుడి వెంట అరణ్యాలకు పోయాడు. అరణ్యవాసానికి పోయేటప్పుడు శ్రీరాముడికి 25 సంవత్సరాలు కాగా, సీతాదేవికి 18 సంవత్సరాలు.

శ్రీరాముడికి 12 సంవత్సరాల వయసున్నప్పుడు, సీతకు ఆరేళ్ళ వయసులో వారి వివాహం జరిగింది. దీనికి దృష్టాంతరంగా విశ్వామిత్రుడి యాగం కాపాడడానికి రామలక్ష్మణులు వెళ్లిన రోజు నుంచి మిథిలా నగరం వెళ్లడం వరకు తీసుకోవచ్చు. సౌమ్యనామ సంవత్సరం మాఘబహుళ విదియ నాడు శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రుడి వెంట పోయారు. హస్త పోయి చిత్రా నక్షత్రం ప్రవేశించడంతో, ఆ రోజు ప్రయాణానికి మంచి రోజే కాకుండా అది శ్రీరాముడికి ధృవతార కూడా. 15 వ నాటి ఉదయం మిథిలా ప్రవేశం చేసి, శివ ధనుర్భంగం చేశాడు. 27 వ రోజున ఫాల్గున శుద్ధ శుక్ల త్రయోదశి శుభ దినం కాబట్టిఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో, శుభదినమైన శుక్ల త్రయోదశి నాడు సీతారాముల కల్యాణం జరిగింది అని ఆంధ్రవాల్మీకి వాసుదాస స్వామి ‘ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం చెబుతోంది.

Tuesday, April 23, 2024

గ్రామ రాజకీయాల స్థాయికి దిగజారిన రాష్ట్ర రాజకీయాలు! ..... వనం జ్వాలా నరసింహారావు

 గ్రామ రాజకీయాల స్థాయికి దిగజారిన రాష్ట్ర రాజకీయాలు!

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (24-04-2024)

{అలనాటి గ్రామ రాజకీయాలు నేడు రాష్ట్ర స్థాయికి చేరుకున్నాయి. గుళ్లో ప్రమాణాలు, పార్టీ మార్పిడులు, కులం కార్డులు, బెదిరింపులు, క్యాంపు రాజకీయాలు, ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు, అమ్ముడుపోవడం, ప్రత్యర్థుల మీద దాడులు, మద్యం ధనం విచ్చలవిడిగా వాడకం, ‘దమ్ముందా, వెంట్రుక పీకలేవు’ లాంటి పదజాలం విరివిగా ఉపయోగం... ఇలా ఎన్నో అతి జుగుప్సాకరమైన రాజకీయాలు రాష్ట్ర, దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి} - సంపాదకుడు

వర్తమాన రాజకీయాలను చూస్తే ఐదారు దశాబ్దాల క్రితం గ్రామాల్లో నెలకొన్న పెత్తందారీ వ్యవస్థ రాజకీయాలను జ్ఞప్తికి తెస్తున్నాయి. ఎందరెందరో ప్రముఖ నాయకులు నిస్వార్థంగా రాజకీయాలలో చురుకైన పాత్ర పోషించిన తెలుగు రాష్ట్రాలలో వర్తమాన రాజకీయాలు చూస్తుంటే జుగుప్సాకరమైన అసహనం, ఏమీ చేయలేని చేతకానితనం, భవిష్యత్తులో మరింకేమి కాబోతున్నదోనన్న ఆందోళన కలుగుతున్నదనడంలో బహుశా అతిశయోక్తి లేదేమో.

ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉన్న ఒక రాజకీయ నాయకుడి మీద జరిగిన రాళ్ల దాడి ఘటననే తీసుకుంటే – నమ్మశక్యం కాని సందేహంగా ఒకవైపు, ఒకవేళ అది నిజంగా ప్రతిపక్షంవారి పనే అయితే, ఇలాంటి చర్యలకు ప్రతిపక్షాలు పాల్పడవచ్చా అన్న మీమాంస మరోవైపు! రాష్ట్ర, దేశ రాజకీయాలలో దినదిన ప్రవర్ధమానమవుతున్న అసంబద్ధ ఆరోపణలు, ప్రత్యారోపణలు చూస్తుంటే అపనమ్మకమనే జీవాయుధం తీవ్రంగా పని చేస్తున్న రోజులు వచ్చాయనవచ్చు. ఈ తరహా దాడులు, ‘కుళ్లు రాజకీయాలు’ ఒకప్పుడు గ్రామ రాజకీయాలకే పరిమితమయ్యేవి. ఇప్పుడవి దేశ, రాష్ట్ర రాజకీయాలలో సర్వసాధారణమైపోయాయి.

ఈ సందర్భంగా ఐదారు దశాబ్దాల క్రితం అలనాటి ఖమ్మం జిల్లా, ఖమ్మం సమితి, గ్రామ రాజకీయాలు జ్ఞప్తికి వస్తున్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐఎం) మద్దతుతో శీలం సిద్దారెడ్డి; కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) మద్దతుతో జలగం వెంగళరావు వర్గాలుగా చీలిపోయారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో పెత్తందారుల కక్షలు కార్పణ్యాల వాతావరణం ఉండేది. మా గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐఎం) అభిమానులు ఉన్నప్పటికీ భూస్వాములకు భయపడి నిశ్శబ్దంగా ఉండిపోయేవారు. పంచాయితీ ఎన్నికలలో పోటీకి దిగే సాహసం చేయకపోయేవారు. నివురుగప్పిన నిప్పులా వ్యాపిస్తున్న తమమీద ఉన్న వ్యతిరేకత ఏ క్షణాన బహిర్గతమవుతుందో అన్న భయంతో, కమ్యూనిస్ట్ భావజాల కుటుంబ నేపథ్యం కలిగిన ఒక పెద్దమనిషిని, పెత్తందారీ గ్రామరాజకీయాలను నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆశీస్సులతో గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకునేవారు. గ్రామ నాయకత్వం జలగం వర్గానికి చెందిన వ్యక్తిగా చాలా మంచివాడైన గ్రామ పోలీసు పటేల్ చేతుల్లో ఉండేది.

పంచాయితీ ఎన్నికల తేదీ ప్రకటించగానే, రచ్చబండ దగ్గర అతడు నిర్ణయించిన అభ్యర్థి పేరే ప్రకటించి, గ్రామస్థుల ఆమోదం ‘మూజువాణీ’ పద్ధతిన పొంది, ఆయననే ఏకగ్రీవంగా సర్పంచ్‌‍గా ఎన్నుకునేవారు. గ్రామ రాజకీయాలను ఆసరాగా చేసుకుని, పెత్తందారులను అడ్డం పెట్టుకుని, గూండాగిరి చేస్తూ ఒక వ్యక్తి పటేల్‌కు సన్నిహితంగా వుంటూ, అతడి అండ చూసుకుని అందరి మీద పెత్తనం చేసేవాడు. తాగుడుకు బానిసై, గ్రామంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తించేవాడు. సినిమాల్లో వలె పటేల్ అతడి ద్వారా పెత్తనం చెలాయించేవాడు. చివరకు ఇద్దరికీ బెడిసి ఒకరిని మరొకరు బెదిరించుకోవడం, పటేల్ మరో అనుచరుడు సైకిల్ చైన్‌తో అతడిని చితకబాదడం, మొత్తం వ్యవహారాన్ని పటేల్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయడం ఫక్తు గ్రామ రాజకీయాల స్థాయిలో జరిగాయి. వర్తమాన రాష్ట్ర స్థాయి రాజకీయాలు ఈ స్థితిలోకి వచ్చాయిప్పుడు. తమపక్షంలో లేని వారిని, రానివారిని హింసకు గురిచేయడమే ఇప్పటి రాజకీయంగా మారింది!

మొత్తం మీద గ్రామంలోని ఒకరిద్దరు మోతుబరి రైతులు, పటేల్ పెత్తనం చెలాయించడం విషయంలో ఆగ్రహంగా ఉన్న అతడి మాజీ అనుయాయి, సైకిల్ చైన్ దెబ్బలు తిన్న వ్యక్తి, గ్రామానికి చెందిన పలువురు ఉత్సాహవంతులైన యువకులు, చేతులు కలిపారు. ‘పసుపు బియ్యాల’తో ప్రమాణం చేశారు. (ఇలాంటి ప్రమాణాలు ఇటీవల కాలంలో రాష్ట్ర స్థాయి రాజకీయాలలో ఆనవాయితీ అయిపోయింది. తడిగుడ్డలతో దేవాలయాలలో, స్వంత పిల్లల మీద, ఇలా రకరకాల విధాలుగా చోటుచేసుకుంటున్నాయి).

పంచాయితీ ఎన్నికలు రావడంతో పల్లెటూరి రాజకీయానికి తెరలేచింది. అప్పట్లో మూడంచెల పంచాయితీ వ్యవస్థ ఉండేది. గ్రామంలో మొదలు ఎన్నికలు జరిగేవి. వార్డు సభ్యులను ఎన్నుకునేవారు. ఓటింగ్ వార్డు వారీగా జరిగేది. అదే రోజు సాయంత్రం గెలిచిన వార్డు సభ్యులంతా సాధారణ మెజారిటీ పద్ధతిలో సర్పంచ్‌ను ఎన్నుకునేవారు. కొద్ది రోజుల తరువాత సర్పంచ్‌లంతా కలిసి సమితి అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. ముందుగా సమితికి ఆరుగురు కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకుని, అంతా కలిసి సమితి అధ్యక్షుడిని రహస్య బాలెట్ ద్వారా ఎన్నుకునేవారు. కో–ఆప్ట్ చేసుకున్న సభ్యులకు కూడా సమితికి పోటీ చేసే అర్హత ఉంటుంది.

ఆ తరువాత సమితి అధ్యక్షులంతా కలిసి ఇదే ప్రక్రియలో జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. అక్కడా కో – ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకునే పద్ధతి ఉంటుంది. జిల్లా పరిషత్ చైర్మన్‌ది చాలా పవర్‍ఫుల్ హోదా. కొందరు కాబినెట్ మంత్రులుగా రాజీనామా చేసి, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భాలున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్లకు ఎంత పలుకుబడి ప్రాబల్యం వుండేదంటే, వాళ్ల అంగీకారం లేకుండా ముఖ్యమంత్రి కావడం కూడా కష్టంగా ఉండేదారోజుల్లో. ఒకే ఒక్క గ్రామ సర్పంచ్ జిల్లా పరిషత్ ఎన్నికల భవితవ్యాన్ని మార్చగలిగే స్థితిలో ఉండేవారు అప్పుడప్పుడూ. సమితిలో ఒక్క ఓటుతో అదృష్టం తారుమారయ్యేది. అదే ఒక్క ఓటు జిల్లా పరిషత్‌లో కీలకమయ్యేది. ఇప్పుడు జెడ్పీ, మండల చైర్మన్లు ఉత్సవ విగ్రహాలే!

‘పసుపు బియ్యాల మీద చేసిన ప్రమాణం’ చేసినవారిలో కొందరు ‘కులం కార్డు’ ప్రాతిపదికగా, తిరిగి పటేల్ వర్గం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు. పటేల్ చేతిలో పరాభవం పొంది, దెబ్బలు తిని, పాతకాలపు గూండాగిరి మానిన వ్యక్తి కమ్యూనిస్ట్ పక్షాన ఒక వార్డులో పోటీ చేసి గెలిచాడు. తొమ్మిది వార్డులలో ఒక్క వార్డు మినహా, మిగతావన్నీ సీపీఐఎం – శీలం వర్గం కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. ఇప్పటి శాసనసభా పక్షం నాయకుడి ఎన్నిక నేపథ్యంలో చోటుచేసుకునే రాజకీయాల తరయాలో, చివరి క్షణం వరకూ గెలిచిన వార్డు మెంబర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ, పటేల్‌కు అయిష్టమైన ఒకప్పటి ఆయన సహచరుడు, సర్పంచిగా ఎన్నికయ్యాడు.

ఈ నేపథ్యంలో ముగింపు మాత్రం వేరే విధంగా, ఇప్పటి ‘రాష్ట్ర రాజకీయం’, ఒకప్పటి ‘గ్రామ రాజకీయం’ శైలిలో జరిగింది. అచిర కాలంలోనే, మద్యానికి మరోసారి బానిసైన (అలా పటేల్ బానిసగా మలచిన) గ్రామ సర్పంచ్ (కులం కార్డు ప్రాతిపదికగా) పాతపగ మర్చిపోయి, మళ్లీ పటేల్ పక్షంలో చేరిపోయాడు. సమితిలో సగం గ్రామాలు కమ్యూనిస్ట్ (సీపీఐఎం), శీలం సిద్ధారెడ్డి కాంగ్రెస్ వర్గం మిగిలిన సగం గ్రామాలు కమ్యూనిస్ట్ (సీపీఐ), జలగం వెంగళరావు కాంగ్రెస్ వర్గం గెలుచుకున్నది. ఖమ్మం సమితి గెలిచిన వారి పక్షమే జిల్లాపరిషత్ గెలుచుకునే పరిస్థితి నెలకొంది.

సమితి ఎన్నిక ఐదారు రోజులే ఉందనగా జలగం, శీలం వర్గాలు తమ తమ సర్పంచ్‌లతో ‘క్యాంపులు’ పెట్టే చర్యలు చేపట్టారు. (విపరీతమైన వ్యయంతో ఇలాంటి క్యాంపు రాజకీయాలు నిర్వహించడం ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో సర్వసాధారణం). శీలం క్యాంపునకు మా గ్రామ సర్పంచ్ కూడా వెళ్లాలి. వెళ్లనని పేచీ పెట్టాడు. అప్పటికే (మనం – మనం ఒకే కులం అన్న ప్రాతిపదికన) పటేల్‌తో అతడికి రహస్య ఒప్పందం కుదిరిన విషయం బయటపడకుండా వుంచారు! చివరికి సర్పంచ్ క్యాంపునకు వెళ్లక తప్పలేదు.

పద్ధతి ప్రకారం నిర్ధారించిన తేదీ నాడు ఖమ్మం సమితి అధ్యక్ష ఎన్నికకు సర్వం సిద్ధమైంది. తొలుత ఆరుగురు కో – ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక జరగాలి. మా గ్రామ సర్పంచ్‌ను, ఇరు (శీలం, జలగం) వర్గాలవారు తమ ఓటు కింద వేసుకున్నారు. (ఇలా ఇరుపక్షాలు ఒకే వ్యక్తిని తమ పార్టీవాడిగా భావించడం రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు చాలా చిన్న విషయం.) మొదటి కో – ఆప్టెడ్ సభ్యుడిగా శీలం – సీపీఐఎం అభ్యర్థి మా సర్పంచ్ వేసిన ఓటుతో గెలిచాడు.

రెండవ అభ్యర్థిగా శీలం – సీపీఐఎం పక్షాన ఒక ప్రముఖ సీపీఐఎం నాయకుడు, సమితి అధ్యక్ష అభ్యర్థి, పోటీలో ఉన్నాడు. ప్రలోభాలకు అప్పటికే గురైన మా గ్రామ సర్పంచ్ అతడికి ఓటు వేయనందున ఓడిపోయాడు. ఆ సమయంలో సర్పంచ్‌కు తీవ్రమైన హెచ్చరిక పోయింది. ఫలితంగా, ఆ తరువాత మిగిలిన నలుగురు కో – ఆప్టెడ్ సభ్యులుగా శీలం – సీపీఐఎం గ్రూపు వారే ఎన్నికయ్యారు. కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీకి సమితి దక్కకుండా చేద్దామని, జలగం గ్రూపు అభ్యర్థి సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించినా ఫలితం లేకపోయింది.

గెలిచిన వారిలో సీపీఐఎం పార్టీకి చెందిన ఒకరు సమితి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. జిల్లాపరిషత్ చైర్మన్ పదవికి శీలం వర్గానికి చెందిన కాంగ్రెస్ అభ్యర్థి, వైస్ చైర్మన్‌గా కమ్యూనిస్ట్ (మార్క్సిస్ట్) పార్టీకి చెందిన వ్యక్తి ఎన్నికయ్యారు. ఇది అప్పట్లో ఒక్క మా గ్రామ, లేదా ఖమ్మం సమితి పరిస్థితి మాత్రమే కాదు. గ్రామ గ్రామాన ఇదే అనుభం కొంచెం మార్పులు, చేర్పులతో!

అలనాటి గ్రామ రాజకీయాలు క్రమంగా మరింత దిగజారి నేడు రాష్ట్ర స్థాయికి చేరుకున్నాయి. గుళ్లో ప్రమాణాలు, పార్టీ మార్పిడులు, కులం కార్డులు, బెదిరింపులు, క్యాంపు రాజకీయాలు, ప్రజాప్రతినిధుల కొనుగోళ్లు, అమ్ముడుపోవడం, ప్రత్యర్థుల మీద దాడులు, మద్యం ధనం విచ్చలవిడిగా వాడకం, ‘దమ్ముందా, వెంట్రుక పీకలేవు’ లాంటి పదజాలం విరివిగా ఉపయోగం... ఇలా ఎన్నో అతి జుగుప్సాకరమైన రాజకీయాలు రాష్ట్ర, దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్నాయి. ఈ దిగజారుడు రాజకీయాలకు ఆద్యులెవారు, బాధ్యులెవరు? ఏ రాజకీయనాయకుడిని అడిగినా అవతలి పక్షం వారివైపు వేలు చూపిస్తున్నారు!

Monday, April 22, 2024

మౌఖరి వంశం, వంగ రాజ్య వంశం, కదంబ వంశం (బ్రాహ్మణ రాజులు-16, 17, 18) : వనం జ్వాలా నరసింహారావు

 మౌఖరి వంశం, వంగ రాజ్య వంశం, కదంబ వంశం

(బ్రాహ్మణ రాజులు-16, 17, 18)

వనం జ్వాలా నరసింహారావు 

సూర్యదినపత్రిక (22-04-2024)

           భారత దేశంలోని ప్రాచీన రాజ వంశాలలో మౌఖరి వంశం కూడా ఒకటి. మహాభారతంలో మద్ర దేశాధీశుడు, అశ్వపతి వంశీయుడు, మౌఖరులు ఈ ఆశ్వపతి వంశానికి చెందిన వారు. వీరు గొప్ప రాజ్యాన్ని నెలకొల్పి పాలించారు. మద్రదేశం నేటి పంజాబ్ లోనిది. ఆశ్వపతులు ఈ ప్రాంత పాలకులు. మౌఖరి వంశీయులు ఉత్తర హిందూ దేశమంతా వ్యాపించారు. క్రీస్తుశకం ఆరవ శతాబ్దంలో గయ ప్రాంతాన వీరి పాలన కొనసాగింది. గయ జిల్లాలోని నాగార్జునికొండ, బరబరా కొండలలో ఈ వంశానికి చెందిన శాసనాలలు లభించాయి. ఈ వంశానికి చెందిన ముగ్గురు రాజులు యజ్ఞవర్మ, శార్దూలవర్మ, అనంత వర్మలు గుప్త చక్రవర్తుల సామంతులుగా వ్యవహరించారు.

         మౌఖరి వంశానికి ఆద్యుడు యజ్ఞవర్మ గుప్త చక్రవర్తులకు సామంతుడిగా వ్యవహరించాడు. విదేయ సామంతుడిగా గుప్త రాజుల శత్రువులతో పోరాడి విజయాలు సాధించాడు. ఇతడి పాలనా కాలం క్రీస్తుశకం 501-520. సుమారు 19 సంవత్సరాలు. యజ్ఞవర్మ అనంతరం శార్దూల వర్మ మౌఖరి సామంత రాజ్యాధిపత్యం స్వీకరించాడు. శార్దూల వర్మ గుప్త రాజులతో చక్కటి సంబంధాలు కలిగి వున్నాడు. శార్దూల వర్మ క్రీస్తుశకం 520 నుండి క్ర్ఫీస్తుశకం 535 వరకు 15 సంవత్సరాలు పాలించాడు. మౌఖరి వంశ రాజులలో అనంత వర్మ మూడవవాడు. ఇతడు తన సామంత రాజ్యాన్ని క్రీస్తుశకం 535 నుండి క్రీస్తుశకం 550 వరకు సుమారు 15 సంవత్సరాలు పాలించాడు.

         మౌఖరి వంశంలో రెండవ శాఖ వారు శక్తిమంతులు. బలపరాక్రమ సంపన్నులు. వీరు గొప్ప రాజ్యాలను స్థాపించారు. మౌఖరి వంశీయుల రాజ్యం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వ్యాపించింది. మౌఖరి వంశంలో నాల్గవ రాజైన ఈశానవర్మ సామంత రాజ్యాదిపత్యం వహించిన తరువాత ఈ వంశీయుల అభ్యుదయం ఉన్నత శిఖరాలను అధిరోహించింది. ఈశానవర్మ కుమారుడు శర్వవర్మ. విష్ణుకుండిన ఇంద్రభట్టారకుడు శర్వవర్మకు తన కుమార్తె ఇంద్రభట్టారికను ఇచ్చి వివాహం చేసి, రెండు రాజ్యాలు సఖ్యంగా వుండడానికి తోడ్పడ్డాడు. మౌఖరి రాజ్యాన్ని విస్తృత పరచాలాన్న ఆశయంతో ఈశానవర్మ అంగరాజ్యాన్ని జయించి, ముందుకు సాగాడు. ఈశానవర్మ అపరిమిత సైన్యసంపద కలవాడు. మౌఖరి రాజులలో ఈశానవర్మ కడు సమర్థుడు. స్వతంత్ర రాజ్య స్థాపకుడు. గుప్తరాజులు వారి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలని భావించి, సైన్యాన్ని పెంపొందించుకొని మౌఖరి ఈశానవర్మను ఎదిరించారు. ఈశానవర్మ పోరాడినా లాభం లేకపోయింది. అపజయం పొందాడు. అపరిమిత సైన్యంతో అనేక దేశాలను జయించి, మౌఖరి వంశ ప్రతిష్టను ఇనిమడింప చేసిన ఈశానవర్మ భారతదేశ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి, క్రీస్తుశకం 550 నుండి క్రీస్తుశకం 576 వరకు 26 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు.

         మౌఖరి ఈశానవర్మ కుమారుడు శర్వవర్మ తండ్రి అనంతరం రాజ్యాదిపత్యాన్ని వహించాడు. ఇతడు రాజకీయ దురంధరుడు. అపరిమిత బలసంపన్నుడు. అజేయుడు. ఇతడు తన కుమారుడితో కలిసి యుద్ధం చేసి మగథ రాజ్యాన్ని ఆక్రమించాడు. శర్వవర్మ తండ్రితో కలిసి హూణులతో యుద్ధాలు చేసి విజయాలు సాధించారు. శర్వవర్మ కొద్దికాలం (క్రీస్తుశకం 576-580) మాత్రమే పాలించాడు. మౌఖరి శర్వవర్మ కుమారుడు అనంతవర్మ (అవంతీవర్మ) ఆ తరువాత రాజ్యానికి వచ్చాడు. ఇతడు కూడా అసాధారణ ప్రజ్ఞావంతుడు. మౌఖరి వంశీయులలో గర్వించదగ్గ వ్యక్తి. అవంతీవర్మ తరువాత అతడి కుమారుడు గృహవర్మ మౌఖరి రాజ్యాధిపతి అయ్యాడు. ఇతడి పాలనాకాలం క్రీస్తుశకం 600 నుండి క్రీస్తుశకం 606. గృహవర్మ మరణానంతరం అతడి సోదరుడు మౌఖరి రాజ్య పాలనా బాధ్యత వహించాడు. ఈశానవర్మ వంశ చరిత్ర ఇంతటితో ముగిసింది.

         క్రీస్తుశకం 7 వ శతాబ్ది ప్రథమ పాదం వరకు మౌఖరి వంశేయులు గొప్ప రాజులుగా కీర్తించబడి వైభవోపేతంగా పాలించారు.    

వంగ రాజ్య వంశం

           గుప్త సామ్రాజ్య పతనానంతరం వంగ దేశంలో ఒక స్వతంత్ర రాజ్యం ఆవిర్భవించింది. ఈ రాజ్యం మొదట్లో దక్షిణ, పశ్చిమ ప్రాగ్భాగాలలో విస్తరించింది. క్రీస్తుశకం ఆరవ శతాబ్ది ప్రథమార్థంలో స్వతంత్ర వంగ రాజ్యం నెలకొల్పబడింది. వంగ రాజ్యానికి సంబంధించిన తొలి ముగ్గురు రాజులు గోపచంద్రుడు, ధర్మాదిత్యుడు, సమాచారదేవుడు. వీరి సమగ్ర సమాచారం లభ్యం కావడం లేదు. ఈ ముగ్గురు రాజులలో సమాచారదేవుడు ప్రకటించిన బంగారు నాణేలు కనుగొనబడ్డాయి. శాసనాలలో ఈ రాజులు మహారాజాదిరాజులుగా వర్ణించబడ్డారు. వైశ్యగుప్తుడు, గోపచంద్రుడు వేయించిన శాసనాలలో విజయసేనుడి ప్రశంస వున్నది. విజయసేనుడు వైశ్యగుప్తుడి సామంతుడు. వైశ్యగుప్తుడి తరువాత వంగ దేశంలో గుప్త చక్రవర్తుల పరిపాలన అంతరించిపోయింది. క్రీస్తుశకం 507 లో గోపచంద్రుడు స్వతంత్ర రాజ్యం నెలకొల్పాడు.

         క్రీస్తుశకం 543 వరకు గుప్త చక్రవర్తుల అధికారం ఉత్తర వంగ దేశంలో చెల్లుతుండేది. గోపచంద్రుడు వంగ దేశాన్ని క్రీస్తుశకం 507 నుండి క్రీస్తుశకం 525 వరకు స్వతంత్రంగా పాలించాడు. గోపచంద్రుడి తరువాత ధర్మాదిత్య, సమాచారదేవులు వంగ దేశాన్ని పాలించారు. సమాచారదేవుడు 14 సంవత్సరాలు పాలించాడు. మొత్తంమీద గోపచంద్రుడు, ధర్మాదిత్యుడు, సమాచారదేవుడు కలిపి క్రీస్తుశకం 507 నుండి క్రీస్తుశకం 575 వరకు వంగ రాజ్యాన్ని ఏలారు.

         బాదామీచాళుక్య చక్రవర్తి కీర్తివర్మ, టిబెట్ రాజు స్రోన్బట్సన్ దండయాత్రల వల్ల వంగ రాజ్యం పతనమై పోయింది. వంగ రాజ్యం వంగ, గౌడ రాజ్యాలుగా విభజించబడింది. గౌడ దేశం ఉత్తర, పశ్చిమ వంగ దేశ భాగాలుగా వ్యాపించి వుండేది. దక్షిణ, తూర్పు భాగాలు వంగ దేశంగా పరిగణించబడేవి. వంగ దేశ ప్రాచీన నామం సమతత. మహాసేన గుప్తుడి చివరి రాజ్య సంవత్సరాలలో గౌడ దేశంలో శశాంకుడు పాలనా బాధ్యత వహించి స్వతంత్ర రాజ్యాన్ని స్తాపించాడు. శశాంకుడు మహాసేన గుప్తుడి సోదరుడి కొడుకు. శశాంకుడి రాజధాని కనక సువర్ణపురం. మార్షిదాబాద్ జిల్లాలోని బెర్హంపూర్ కు 10 కిలోమీటర్ల దూరంలో వున్న రాంగామాట శిధిలాలు పూర్వం కనక సువర్ణపురివై వుండవచ్చు.

         మాణ వంశీయులు శశాంకుడికి పూర్వం వంగ దేశంలోని పర్వత ప్రాంతాలను పాలించారు. వీరి రాజ్యం మిడ్నాపూర్, గయల దాకా విస్తరించి వుండేది. వీరు కళింగం దాకా తమ రాజ్యాన్ని వ్యాపింప చేసుకున్నారు. శంభుయశనుడు ఈ వంశీయుడు. క్రీస్తుశకం 580 నుండి క్రీస్తుశకం 603 వరకు 23 సంవత్సరాలు కళింగ దేశాన్ని పాలించాడు. శశాంకుడు ఇతడిని ఓడించి అతడికి చెందిన కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు.

         శైలోద్భవ వంశీయులు కొంగోద రాజ్యాన్ని పాలిస్తూ క్రీస్తుశకం 619 వరకు శశాంకుడి సామంతులుగా వున్నారు. తరువాత స్వతంత్రులయ్యారు. శశాంకుడు గౌడ దేశాన్ని మహేంద్రగిరి దాకా విస్తరించాడు. ఉత్తర మగథ భూభాగాలను స్వాధీనపర్చుకున్నాడు. కనోజి పాలకుడు గృహవర్మ మౌఖరి వంశీయుడు. మౌఖరి ఈశానవర్మ కాలం నుండి గౌడులు మౌఖరులతో శత్రుత్వం కలిగి వుండేవారు. మాళవ గుప్త రాజులకు మౌఖరులకు బద్ధ వైరం. కాబట్టి శశాంకుడు దేవగుప్తుడితో స్నేహం చేసుకున్నాడు.

         శశాంకుడు క్రీస్తుశకం 637-638 వరకు మగథను పాలించినట్లు ఆధారాలున్నాయి. శశాంకుడు వంగ దేశ ప్రథమ స్వతంత్ర ప్రభువు. అతడు గౌడ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా రూపొందించడమే కాకుండా దక్షిణ అంగ, కళింగ దేశాలను జయించి ప్రబల శక్తి సమన్వితమైన రాజుగా కీర్తి వహించాడు.  

కదంబ వంశం

           దక్షిణాపథ, దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధికెక్కిన రాజవంశాలలో కదంబ వంశం ఒకటి. ఈ వంశీయుల తొలి నివాసం తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాలో వున్న కందూరు గ్రామం. కందూరు చాళుక్యుల కాలంలో ప్రసిద్దికెక్కిన గిరి దుర్గం. కందూరునాడును కందూరు పట్టణంగా కూడా పిలవడం జరిగింది. తెలుగు చోడులలో ఒక శాఖవారు తెలంగాణాలోని నల్లగొండ, మహబూబ్ నగర్ మండలాలను, ఖమ్మం మండలంలోని నేలకొండపల్లి ప్రాంతాన్ని, కొలనుపాక, కోడూరు, కందూరు, వర్ధమానపురం, పానుగల్లు పట్టణాలను రాజధానులుగా చేసుకుని పాలించారు.

         కందూరులో పెద్ద సంఖ్యలో కదంబ వృక్షాలుండేవి. కదంబ వృక్షాల వల్ల మయూర శర్మ వంశానికి కదంబ వంశమని పేరు వచ్చింది. కదంబులు హారీత పుత్రులు. మానవ్యస గోత్రులు. వేదవేదాంగేతిహాస, కావ్య నాటక, అలంకార శాస్త్రాలను క్షుణ్ణంగా అభ్యసించారు. సకల సద్గుణ సంపన్నులు. వీరు బ్రాహ్మణులు. కందూరు గ్రామ వాస్తవ్యులు.

         కదంబ వంశంలో మయూర శర్మ జన్మించాడు. బ్రాహ్మణుడైన మయూర శర్మ పౌరుష ప్రతాపాలున్నవాడు. అతడు బ్రాహ్మణ్యాన్ని వీడకుండా క్షత్రియ ధర్మాన్ని అవలంభించి, బ్రహ్మక్షత్రతేజో భృతుడయ్యాడు. అతడు కాంచీ నగరాన్నుండి బయల్దేరి శ్రీ పర్వతారణ్యంలోని ఆటవిక జాతుల వారిని పురికొల్పి, తన సైన్యాన్ని చేర్చుకుని, వారికి సైనిక శిక్షణ ఇచ్చి, వీరులుగా తీర్చిదిద్దాడు. తన గ్రామంలోని, పరిసర గ్రామాలలోని స్నేహితులను సైన్యంలో చేర్చుకున్నాడు. అలా చేర్చుకున్న సైన్యంతో కలిసి మయూర శర్మ అనేక ప్రాంతాల మీద దండయాత్రలు నిర్వహించి విజయుడై, తన వంశం పేరుతో కదంబ రాజ్యాన్ని స్థాపించాడు. అతడి రాజ్యం క్రమేపీ అభివృద్ధి చెంద సాగింది. మయూర శర్మ పల్లవ రాజుల సామంతులుగా వున్న బృహద్బాణ రాజులను ఓడించాడు.

         మయూర శర్మ కదంబ రాజ్యాన్ని నిర్భీతిగా, ప్రశాంతంగా, ప్రజానురంజకంగా పాలించాడు. అతడు అష్టాదశ అశ్వమేధ యాగాలు చేశాడని అంటారు. పరశురాముడి లాంటి పరాక్రమవంతుడని అతడికి పేరు. మయూర శర్మ కాలంలో భారత దేశాన్ని పాలించిన అనేక రాజ వంశాల వారు బ్రాహ్మణులు. వారు క్షత్రియ ధర్మాన్ని అవలంభించి, బ్రాహ్మణత్వాన్ని వీడకుండా పరిపాలన చేశారు. ఆ రోజుల్లో క్షత్రియులు, బ్రాహ్మణుల మధ్య వైవాహిక సంబంధ బాంధవ్యాలు వుండేవి. మయూర శర్మ క్రీస్తుశకం 345 నుండి క్రీస్తుశకం 360 వరకు సుమారు 15 సంవత్సరాలు పాలించాడు.

         మయూర శర్మ మరణించిన తరువాత అతడి కుమారుడు కంగవర్మ కదంబ రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు సమర్థుడైన రాజు. ఇతడు సుమారు 25 సంవత్సరాలు వైభవంగా పాలించాడు. కంగవర్మ కుమారుడు భగీరధుడు క్రీస్తుశకం 385 లో రాజ్యానికి వచ్చి సుమారు 25 సంవత్సరాలు పాలించాడు. తండ్రి, తాతల లాగానే ఇతడు కూడా చక్కటి పాలన అందించాడు. భగీరధుడి పెద్ద కుమారుడు రఘువు క్రీస్తుశకం 410 లో రాజ్యానికి వచ్చి 15 సంవత్సరాలు పాలించాడు. ఇతడి పాలనా కాలం స్వర్ణయుగం అని పిల్వబడ్డది. రఘువు కదంబ రాజ్యాన్ని బలిష్టపర్చాడు. రఘువు తరువాత భగీరధుడి రెండవ కుమారుడు కకుత్స వర్మ రాజ్య పాలనా బాధ్యత వహించి ఇరుగు పొరుగు రాజులతో, రాజ వంశాల వారితో చక్కటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పాడు. కకుత్స వర్మ గొప్ప వీరుడు. ఇతడు క్రీస్తుశకం 425 నుండి సుమారు 25 సంవత్సరాలు పాలించాడు.

         కకుత్స వర్మ పెద్ద కుమారుడు శాంతి వర్మ క్రీస్తుశకం 450 లో అధికారంలోకి వచ్చాడు. ఇతడు శత్రు భయంకరుడు. అనేక రాజ్యాలను జయించి విశాల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇతడి పాలనా కాలం సుమారు 25 సంవత్సరాలు. కకుత్స వర్మ రెండవ కుమారుడు కృష్ణ వర్మ, శాంతి వర్మ తరువాత రాజయ్యాడు. కృష్ణ వర్మ కుమారుడు విష్ణు వర్మ తండ్రి మరణానంతరం కదంబ రాజ్య పాలనా బాధ్యతలు స్వీకరించాడు. ఇతడు పల్లవుల ధాటికి తట్టుకోలేక వారికి సామంతుడిగా వుండిపోయాడు. శాంతి వర్మ కుమారుడు మృగేశ వర్మ కదంబ రాజ్య పాలనా బాధ్యతను క్రీస్తుశకం 470 లో స్వీకరించి సుమారు 18 సంవత్సరాలు పాలించాడు. ఇతడు సకల విద్యలలో నిష్ణాతుడు. పల్లవ రాజ్యం మీద దండయాత్రలు చేసి విజయం సాధించి, కదంబ వంశ ప్రతిష్టను ఇనుమడింప చేశాడు.

         మృగేశ వర్మ కుమారుడు రవి వర్మ క్రీస్తుశకం 488 లో కదంబ రాజ్య పాలనా బాధ్యతలు వహించాడు. రవి వర్మ బలసంపన్నుడు. తన జ్ఞాతి అయిన విష్ణు వర్మ పల్లవుల సామంతుడు కావడం సహించలేక, అతడి రాజ్యం మీద దండయాత్రలు చేశాడు. పల్లవులు విష్ణు వర్మకు సైన్య సహాయం చేశారు. అయినప్పటికీ యుద్ధంలో విష్ణు వర్మ, రవి వర్మ చేతిలో చనిపోయాడు. రవి వర్మ పట్టుదల కలవాడు. విష్ణు వర్మకు సహకరించిన పల్లవుల మీద దండయాత్ర చేసి వారిని ఓడించాడు. చివరకు అఖండ కదంబ రాజ్య పాలకుడు అయ్యాడు. రవివర్మ 60 సంవత్సరాలు పాలించాడు.

         రవి వర్మ తరువాత అతడి కుమారుడు హరి వర్మ క్రీస్తుశకం 538 లో కదంబ రాజ్య సింహాసనాన్ని అధిష్టించాడు. ఇతడు శాంతి కాముకుడు. ఇతడి పాలనా కాలంలో మొదటి పులకేశి విజృంభించి, కదంబ రాజ్యంలోని అనేక భాగాలను జయించాడు. హరివర్మ అతడిని ఎదిరించలేక మిగిలిన భూభాగాలను 12 సంవత్సరాలు పాలించాడు. ఇతడితో కదంబ వంశం ప్రధాన శాఖ అంతరించింది.

         ఇదిలా వుండగా కృష్ణ వర్మ సంతతి వారిలో విష్ణు వర్మ కుమారుడు సింహ వర్మ పల్లవుల సహాయంతో రాజ్యాన్ని తిరిగి సంపాదించాడు. అతడి వంశీయులలో రెండవ కృష్ణ వర్మ, మాంద్రాత్రి వర్మ, అజ వర్మ, భోగి వర్మ కదంబ రాజ్యాన్ని పాలించారు. అజ వర్మ, భోగి వర్మల కాలంలో కదంబ రాజ్య వంశం పూర్తిగా అంతరించి పోయింది.  

(స్వర్గీయ బిఎన్ శాస్త్రి గారి బ్రాహ్మణ రాజ్య సర్వస్వం ఆధారంగా)