Saturday, June 14, 2025

సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకోవడమెలా? : వనం జ్వాలా నరసింహారావు

 సమకాలీన రాజకీయాలను అర్థం చేసుకోవడమెలా?

వనం జ్వాలా నరసింహారావు 

మనతెలంగాణ దినపత్రిక (14-06-2025)

ప్రజాస్వామ్యంలో విమర్శ ఎప్పటికీ కీలకమే. బాధ్యతారాహిత్యంగా, రాజకీయపరమైన అసంబద్ధ విమర్శలు చేస్తే అది హానికరమవుతుంది. ఇటీవల ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ముసురు మేఘంలా విస్తరించిన రాజకీయపరమైన విమర్శ సంస్కృతి, సంబంధిత చర్చలను సహితం నిర్వీర్యం చేస్తోంది. ప్రతిపక్షమనేది అంటే అహర్నిశలూ, మంచికీ-చెడుకీ విమర్శించే శబ్దకాలుష్య వేదికకాదు. శాస్త్రీయంగా, సమగ్రంగా, రాజనీతిజ్ఞంగా, ప్రజాఅభివృద్ధికోణంలో, అంశాల అధ్యయనం ఆధారంగా,  నిర్మాణాత్మకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేదిగా, జవాబు రాబట్టేదిగా వుండాలి. విపక్షం 'ఒత్తిడి పెంచే' వ్యవస్థ కారాదు.

ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు, ప్రభుత్వాధినేతలకు, పాలానాపరంగా, తీసుకునే నిర్ణయాలకు ఆర్ధిక, సామాజిక కోణం వుంటాయి. అది తప్పనిసరి. వారు ఏపార్టీవారైనా, తీసుకున్న నిర్ణయం ఒక్కోసారి వ్యయభారం కావచ్చు. రాజకీయ ఒత్తిడీ కావచ్చు. తక్షణమే ప్రజలకు అర్ధం కాని ప్రయోజనాల కోసం కావచ్చు. సమతూక విశ్లేషణ జాకరూకతతో చేయాలి. నిర్ధారించుకున్న తరువాతే అంశాలవారీగా విమర్శించాలి.

తెలంగాణలో ఇటీవల ముగిసిన మిస్ వరల్డ్ పోటీల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిమీద వచ్చిన విమర్శలేకావచ్చు,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అమరావతి ప్రాజెక్టు వ్యవహారంలో వ్యయపరమైన బాధ్యాతారాహిత్య విమర్శలేకావచ్చు, తెలంగాణ మాజీముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ అద్భుతంగా ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆయనమీద వచ్చిన విమర్శలే కావచ్చు, ఆహ్వానించదగ్గవికాదు.

భారత జాతీయ రాజకీయ పార్టీలుకానీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీనుండి చీలిపోయి వెలసిన పలు ప్రాంతీయ పార్టీలుకానీ, ఇతర రకాలుగా ఆవిర్భవించిన జాతీయపార్టీని పేరులో చేర్చుకున్న ప్రాంతీయ పార్టీలుకానీ, ఆసాంతం భారత రాజకీయ వ్యవస్థ కానీ, ప్రజల సంకల్పానికి, ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా, ప్రతిరూపంగా, ప్రజాస్వామ్య విలువల ఆధారంగా నిర్మితమవ్వాల్సిన మౌలిక ప్రణాళికకు సుదూరంగా, అధికారమే ధ్యేయంగా పయనిస్తున్నాయి. మానవతా దృక్కోణం, సామాజిక సంస్కరణపట్ల నిబద్ధత మృగ్యమైంది.

వారసత్వ రాజకీయాన్ని, ప్రచార ఆడంబరాన్ని, మితిమీరిన వ్యయాన్ని, ప్రజాకర్షణను, ఎంచుకునే వ్యవస్థలయ్యాయి రాజకీయపార్టీలు. నైతిక బీజాల నుంచి పురుడుపోసుకున్న జాతీయ రాజకీయ పార్టీలు సహితం, చిత్తశుద్ధిని సంపూర్ణంగా కోల్పోయి, మానవ-నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చాయి. ఏకొద్దిమందో మినహాయించి, రాజకీయనాయకులు అధికారంలో ఉన్నా, బాధ్యాతాయుతంగా మెలగాల్సిన ప్రతిపక్షంలో ఉన్నా, తమ వైఖరిలో స్పష్టతను కోల్పోయి, ప్రత్యర్థులను అసంబద్ధంగా వ్యతిరేకించే బాండ్ మేళంగా మారారు.

రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించే ఆలోచనలు ఆ పార్టీవారి నుంచే ఒకవైపు, అలాగే కొనసాగించాలన్న స్వీయవర్గీయ పూనికలు మరోవైపు, అసమ్మతి-సమ్మతిలాగా తలపడడంవల్ల, ప్రజాస్వామ్య బలహీనత స్పష్టమవుతున్నదేమో అన్న భావన కలుగుతున్నది. రాజకీయ సంక్లిష్టతను ఆవిష్కరించడమైనా, రాజకీయపార్టీల, నాయకుల ధోరణుల విశ్లేషణ అయినా, సమకాలీన రాజకీయ గమనాన్ని అర్థం చేసుకోవడమైనా, ఇబ్బంది కలిగించే అంశాలే. రాజకీయ పార్టీలు ఓటు కోసం పోటీ చేసే యంత్రాలు కారాదు, కాకూడదు. ప్రజల సంకల్పానికి, అభీష్టానికి ప్రతిరూపమైన వేదికలు మాత్రమే కావాలి.

స్వాతంత్ర్యోద్యమ సమయంలో చర్చలు మాత్రమే జరిపే వేదికగా ఆరంభమైన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, దరిమిలా బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారింది. స్వాతంత్ర్యం వచ్చినతరువాత, అధికారం సుదీర్ఘకాలం అనుభవించినాక, ఉద్యమస్ఫూర్తికి దూరమై, అలసత్వానికి, అంతర్గత విభజనలకు, కుమ్ములాటలకు, అధికారం లభించాల్సిందే అన్న భావానికి లోనై, చివరకు మృదుమధురమైన ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ పార్టీదిప్పుడు మరుగునపడ్డ ఒక అధ్యాయం,   

భారత ప్రజాస్వామ్యం కుటుంబ వారసత్వ రాజకీయంగా మారిపోయింది. నాయకుల కొడుకులు, కూతుళ్లు, వారి పిల్లలు, దగ్గరి బంధువులు, తరాలుమారినా, వారసత్వంగా, రాజకీయపార్టీల కుటుంబ లిమిటెడ్ కంపెనీలమాదిరిగా కుర్చీలను ఆక్రమిస్తున్నారు. ఎదురు తిరిగితే నొక్కిపడేస్తున్నారు. మిగతావారిని హెచ్చరించడం జరుగుతున్నది. వంశపారంపర్యాన్ని ప్రోత్సహించటమే రాజకీయధర్మంగా, నైతికతగా మారింది. ప్రజాస్వామ్య వికాసాన్ని తిరోగామిగా మార్చివేసింది. జవహర్‌లాల్ నెహ్రూ తన తండ్రి మోతీలాల్ స్థానంలో ఎఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైననాడే ఇది మొదలైంది. అదే ధోరణి ఇతరులకు స్ఫూర్తిగా మారింది.

వంశపారంపర్య రాజకీయ ధోరణి కారణంగా, కొత్తవారికి పార్టీల్లో స్థానం దొరకడం అసాధ్యమవుతోంది. ప్రజలు నాయకులకే ఓటు వేస్తున్నట్టు కనిపిస్తున్నా, ఆ నాయకులను ఎన్నుకునే అవకాశమే లేదు. ఇది ప్రజాస్వామ్య మూల సూత్రాలకు విరుద్ధం. దేశాన్ని  ప్రభావితం చేసిన కొన్ని పార్టీలు ప్రాంతీయ స్థాయిలో కీలకపాత్ర వహించాయి. రాష్ట్రాల ఆశయాలు, సామాజిక సమీకరణాలు, ప్రజల ఆకాంక్షలతో ముడిపడి అవి ఎదిగాయి. ఇవి ప్రజల అభిమతానికి ప్రతిరూపంగా మొదలై, అధికారం సాధించగలిగాయి. తర్వాత అవి కూడా ఏకవ్యక్తి ఆధిపత్యంలోకి మళ్లాయి.

పార్టీల నమోదు విషయానికొస్తే, భారత ఎన్నికల సంఘం విధించిన కాగితం నిబంధనల ఆధారంగా ఎవరైనా ఒక పార్టీని, ఆమాటకొస్తే ఎన్నిపార్టీలనైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. అవసరం లేకపోయినా ముందస్తుగా రిజిస్టర్ చేసి, పేరును అమ్ముకునే సందర్భాలు సర్వసాధారణం. పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా? అధ్యక్షుడిని ఎన్నుకునే స్వేచ్ఛ సభ్యులకు ఉందా? సభ్యుల జాబితా నవీకరణ జరుగుతున్నదా? పార్టీ నైతిక విధానాలు కట్టుబాట్లుగా అమలవుతున్నాయా? అనే ప్రశ్నలకు జవాబులే లేవు. భారత ఎన్నికల సంఘం  గుర్తింపు ఇచ్చే విషయంలో తప్ప, పార్టీ నైతికతను పర్యవేక్షించాలనే బాధ్యత పెద్దగా తీసుకోదు. జాతీయపార్టీల రాష్ట్రాధ్యక్షుల ఎంపికలో ఎన్నికలు నామమాత్రంగా కూడా జరగవు. సభ్యుల అభిప్రాయం అవసరం లేదు.

రాజకీయ పార్టీలు నిజంగా ప్రజాసేవ, సిద్ధాంత నిశ్చయత, ప్రజాస్వామ్య సాధికారత అనే బీజాలతో ఏర్పడాలి. కానీ ఆ ఆత్మవిశ్వాసాన్ని తేవాలంటే చట్టాలు సరిపోవు. ప్రజల ఒత్తిడి, సంస్థాగత పర్యవేక్షణ, అవగాహన గల ఓటర్ల సమర్ధించగల శక్తి అవసరం. రాజకీయాల్లో ఒక్కో సంచలనం కనిపించడమే కాదు, దాని వెనుక దాగిన వ్యూహాలు, చైతన్యాలు, వాస్తవాలు, ఇవన్నీ తలచుకోవడానికి ఉద్దీపన కలిగిస్తాయి. ఆర్ద్రతతో కూడిన గాఢమైన భిన్నత్వాల నడుమ, కల్వకుంట్ల కవిత తన తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్‌కు రాసిన, వ్యక్తిగతంగా భావించిన లేఖ, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం, విచిత్రమైన రాజకీయ శైలికి నిదర్శనం.

ఈ లేఖను కొందరు రాజకీయ విశ్లేషకులు భావోద్వేగపు సంకేతంగా, మరికొందరు, వ్యూహాత్మక పదవి కోసం లభించని ప్రయత్నంగా అభివర్ణించారు. అది వాస్తవంగా తిరుగుబాటా? లేక అలక్ష్యంగా, అర్థవంతమైన ఒప్పుకోలు సంకేతమా? అనే ప్రశ్న ప్రశ్నగానే మిగిలింది. ఆ లేఖలో కనిపించే స్పష్టతలు, పలుచోట్ల అస్పష్టతలు, ఇవన్నీ కలిపి అది ఒక లోతైన వ్యూహాన్ని సూచిస్తున్నదా అనే అనుమానం కూడా కలుగుతున్నది. భవిష్యత్తులో ‘అధికారంలోకి వచ్చినప్పుడు గద్దెపై ఎవరు కూర్చోవాలి?’ అని కవిత సంధించిన పరోక్ష ప్రశ్న వర్తమాన రాజకీయ సంక్లిష్టతల్లో ఓ భవిష్య దిశ కోసం వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగేమో?

కేసీఆర్ వ్యూహాత్మకంగా పార్టీలోని అంతర్గత వ్యతిరేకతను అణిచే మార్గంలో వెళ్లారా, వెళ్తున్నారా? అన్నది అన్వేషణార్హమైన విషయం. ‘నా నాయకుడు కేసీఆరే, ఇంకెవ్వరూ అంగీకరించను’ అనే కవిత వ్యాఖ్య, దీనికి నిదర్శనం. అధికారాన్ని కోల్పోయినప్పటికీ, బీఆర్‌ఎస్ పార్టీపై కేసీఆర్ ది సడలని పట్టు. మాటల కన్నా మౌనాన్ని, వేదికల కన్నా వ్యూహాలను, భక్తుల కన్నా నిబద్ధతను ప్రాధాన్యంలో ఉంచే విధంగా ఆయన వైఖరి, ఉండటం వల్ల, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది,  ఆయన్ను దగ్గరిగా గమనిస్తున్న పార్టీ నేతలకు కూడా అస్పష్టమే!

భారతదేశ మహిళలు రాజకీయ ప్రస్తానం స్వాతంత్ర్యోద్యమ కాలంలో  విలువల సిద్ధాంతాల ప్రాతిపదికగా ఆరంభమైంది. స్వాతంత్ర్యానంతరం ఎక్కువమందే కుటుంబ వారసత్వం, సామాజిక స్వప్రయోజనాలు, వ్యక్తిగత ఆకాంక్షలు, అధికారలక్ష్యం వంటి నేపధ్యంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొందరివి అద్భుత విజయాలైతే, మరికొందరివి దారుణమైన పరాజయాలు. మహిళా నాయకత్వం బలమైన, ఘనమైన చరిత్రను నిర్మించుకుంటూ, పునర్నిర్మించుకుంటూ పురుషులతో సమానంగా, ఆ మాటకొస్తే అధికంగా సాగుతున్నది. ఇందిరాగాంధీ నుండి శర్మిళ, కవితల ప్రయత్నాలు కూడా ఆదారిలోనే. ఫలితాలు వేర్వేరు కావచ్చు.

కవితకు తన తండ్రి కేసీఆర్ ద్వారా లభించిన వారసత్వం, నాయకత్వం, రాజకీయంగా ఒక గుర్తింపును ఇచ్చింది. తెలంగాణ జాగృతి వంటి సాంస్కృతికసంస్థల ద్వారా ఆమె నేతగా ఎదగగలిగారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా  అనుభవం, తననీస్థానానికీ తెచ్చిన పార్టీ నాయకత్వంమీదనే తిరుగుబాటు చేసేదాకా తీసుకుని వెళ్లింది. ‘నేను మౌనంగా ఉండను, నా భవిష్యత్ దిశలో స్పష్టత కావాలి’ అనే సంకేతాన్ని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీతో విలీన ప్రతిపాదన ఉన్నట్లు కవిత చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ కు అనుకూలంగా ధర్నాలు చేయడం వ్యూహమా?

తమ ఎదుగదలకు కారణమైన నాయకత్వాన్ని అర్థం చేసుకోవడంతోపాటు, తార్కికంగా ప్రశ్నించటం, భావోద్వేగంతో సరిపుచ్చుకోకుండా, దృఢంగా భవిష్యత్తుకు బాటలు వేసుకోవడం అలవర్చుకోవాలి. ప్రజాస్వామ్యం రాజకీయాల్లో ఇంటిపేరుకంటే పరిపక్వత, వారసత్వంకంటే లక్ష్య స్పష్టత, వివిధరకాల ప్రభావం కన్నా ప్రజల నమ్మకం, ప్రజలలో స్థానం సంపాదించటం ప్రధానమైనవి. ఆ దారిలోనే, ఉజ్వల భవిష్యత్ వుండే అవకాశాలున్న కవితకు కావలసింది ఆమె స్వంత ధైర్యం, ప్రజలతో తనదైన మానవీయ సంబంధం మాత్రమే. వంశపారంపర్యంగా వచ్చిన హోదా, పదవి, అవకాశం, తలుపులు తెరచినా, పోటీలో నిలబెట్టేది వాస్తవికతే. విమర్శ అవసరం, వ్యూహం అవసరం, నాయకత్వం మీద తిరుగుబాటూ అవసరమే. దేనికైనా ప్రదర్శనాత్మక చిత్తశుద్ధి, ప్రజల పట్ల పరిపూర్ణ బాధ్యత కూడా తప్పనిసరనే నిజం మరువకూడదు.  

 

No comments:

Post a Comment