(ఆంధ్ర ప్రభ దినపత్రిక 29-09-2010)
(సూర్య దినపత్రిక 29-09-2010)
వనం జ్వాలా నరసింహా రావు
పాతికేళ్లుగా పరిచయమున్న తిలక్ మరణ వార్త (23-09-2010) తెలిసినప్పటినుంచి, ఆయన జ్ఞాపకాలు పదే-పదే గుర్తుకొస్తున్నాయి. "తిలక్ జ్ఞాపకాలు" శీర్షికతో "ప్రజాతంత్ర" వారపత్రికలో పది సంవత్సరాల క్రితం అయనను గురించి రాసే రోజుల నాటి సంగతులు మరీ గుర్తుకొచ్చాయి. పత్రిక తాజా సంచిక మార్కెట్లోకి వచ్చిన ప్రతిసారీ, ఆ శీర్షికపై కొంత చర్చ జరిగే ది. సినిమాలకు సంబంధించిన "తిలక్ జ్ఞాపకాల"పై కొందరు స్నేహితులు ఏకీభవించడం, మరికొందరు విభేదించడం జరిగే ది. చర్చలో పాల్గొన్న వారిలో దేవులపల్లి అమర్, డి. వెంకట్రామయ్య, చలసాని ప్రసాదరావు, భండారు శ్రీనివాసరావు, ఆర్.వి.వి. కృష్ణారావు...తదితరులుండే వారు. చలసాని తాను చెప్పదల్చుకున్నవి కాగితంపై రాస్తే అందరం చదివేవాళ్లం. ఒకానొక సందర్భంలో ఆయన ఆ జ్ఞాపకాలను "తిలకాష్ట జీవన బంధనం" పేరుతో పుస్తకంలాగా ప్రచురించమని సలహా కూడా ఇచ్చారు. చివరకు, "అనుపమ గీతాల తిలక్" పేరుతో హాసం వారు దాన్ని ప్రచురించారు. కాకపోతే సీరియల్‌గా రాసినవన్నీ అందులో లేవు. కేవలం సినిమాలకు సంబంధించినంతవరకే ఆ పుస్తకం పరిమితమయింది. వాస్తవానికి తిలక్ ని సినిమాలకు మాత్రమే పరిమితం చేయడం సమంజసం కాదు. ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి.
తిలక్‌ను చూడగానే పదహారణాల కాంగ్రెస్ నాయకుడన్న భావన కలుగుతుంది. ఆయన పార్లమెంటు భవనంలోకి పాస్ లేకుండా వెళ్లగలిగేవారన్న విషయం చాలామందికి తెలియదు. ఆయనలా లోనికి వెళుతుంటే పార్లమెంటు సభ్యుడనుకునేవారు. హైదరాబాద్‌కు వచ్చేంతవరకు ఆయనో సినిమా మనిషి. ఇక అక్కడినుంచి ఒక మానవతావాదిగా, సామాజిక కార్యకర్తగా, ఉద్యమకారునిగా, స్వాతంత్ర సమరయోధుల్లో ఒకడిగా, చిన్నల్లో చిన్నగా, పెద్దల్లో పెద్దగా....ఒక్కొక్కరికి ఒక్కొక్క అవతారంలో కనిపించేవాడు-అనిపించేవాడు. అవతారం ఏదైనా, అనుకున్నది సాధించేంతవరకు అలుపనేది లేకుండా సాగిపోవడం ఆయన నైజం. సినిమా కార్మికుల బాధా మయ గాథలు విని-చలించి, వారికోసం రంగంలోకి దిగిన సందర్భంలోను, "గాంధి" సినిమా విషయంలో భారతీయులకు న్యాయం చేకూర్చడానికి చేసిన న్యాయపోరాటంలోను. రాజభవన్ ప్రాంగణంలో కుముద్ బెన్ జోషి గవర్నర్‌గా వున్నప్పుడు తక్కువ ధర చేసే "డోమ్ హౌజ్" నిర్మాణం చేపట్టడంలోను, ఇండో-పాకిస్తాన్ మైత్రి సంబంధమైన కార్యక్రమాల నిర్వహణలోను, "ట్విన్సీ క్లబ్" స్థాపనలోను, కార్య దక్షతకు తిలక్ పర్యాయపదంగా వుండేవాడు. టీవీ ఛానళ్లు రాక పూర్వమే, ఏ రోజు వార్తలను ఆరోజే వీడియో కేసెట్లో రికార్డ్ చేసి కేబుల్ టీవీ ద్వారా ప్రసారం చేయించాలని ఆయన చేసిన ప్రయత్నం అద్భుతం. పాతరోజుల్లో తన మేధస్సు మధించిన అపురూపమైన చిత్రాలతో ప్రత్యేకించి తెలుగు చిత్ర రంగాన్ని, కొంత మేరకు హిందీ చలన చిత్ర రంగాన్ని ఒక మలుపు తిప్పిన మహనీయుడాయన. ఆయన్ను మొదట్లో తక్కువ అంచనా వేయడం మా లాంటి వారి అజ్ఞానం.
అనుపమ చలన చిత్ర దర్శక నిర్మాతగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, సామాజిక సేవకునిగా తిలక్ చాలామందికి సుపరిచితుడే. కాకపోతే ఆయన్ను గురించి తెలియని విషయాలూ ఎన్నో వున్నాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న తిలక్ జైలు జీవితం గడిపినప్పుడు ఎదురైన అనుభవాలు చెప్పినప్పుడు చలించిపోయాడు. దానికి కారణం ఆయన పడ్డ బాధలు కాదు. తోటి ఖైదీల బాధలు తీర్చలేని పరిస్థితిలో తానున్నందున. తిలక్ వున్నది "సింపుల్ ఇంప్రిజన్మెం ట్ సెల్" కాగా, పక్కనే, అచిర కాలంలో ఉరి శిక్షకు గురి కాబోయే వారి నుంచే "కన్డెమ్డ్ ఇంప్రిజన్మెంజట్ సెల్" వుండేదట. అందులో శిక్షను అనుభవించేవారు, తాము ఎదుర్కొన బోయే పరిస్థితిని తలచుకుని, రాత్రిళ్లు భోరున విలపిస్తుంటే, తిలక్ వాపోయేవాడు. ఖైదీలు, విసర్జించిన తమ మూత్రాన్ని కుండల్లో పట్టుకుని, జైలర్ అనుమతిచ్చినప్పుడు బయట పార పోయడం ఘోరంగా వుండేదనేవారు. తాము తినడానికి జైలు భోజనం ఏ మాత్రం అనువైంది కాదని కూడా అనేవారు. విడుదలైన తిలక్ "ఉషా మెహతా" స్వతంత్ర రేడియో ఉద్యమంలో పాల్గొని, స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని వాడ వాడలా ప్రచారం చేసారు.
ముదిగొండ జగ్గన్న శాస్త్రి పరిచయంతో ప్రజానాట్యమండలి వైపు ఆకర్షితుడైన తిలక్, అతివాద భావాల కళాకారులతో చేతులు కలిపాడు. నాటకాలు వేయడం, వేయించడం, డప్పులు వాయించడం, ప్రజానాట్యమండలి విప్లవ గీతాలను ఆలపించడం, వూరూరా తిరగడం చేసేవాడు. "పెద్దింటి వాళ్లం-తప్ప తాగి వచ్చి డప్పు కొట్తున్నాం-తప్పుకోండి" అంటూ కొంటెగా జానపద గీతం ఆలపిస్తుంటే, ప్రజల స్పందన విపరీతంగా లభించేదట. మేనమామ ఎల్వీ ప్రసాద్ బొంబాయి లో వుంటున్నందున తిలక్ అక్కడకు చేరుకున్నప్పటికీ, ఆయనలో అంతర్లీనంగా వున్న స్వతంత్ర సమరాభిలాష కొనసాగింది. అక్కడి "పీపుల్స్ థియేటర్" లో చేరి, బాలరాజ్ సహాని, రొమేష్ థాపర్ లాంటి వారితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. వామపక్ష భావాల వారి కలయికకు వేదికైన "ఒపేరా హౌజ్" సినిమా టాకీస్ లో జరిగే "ప్రజానాట్యమండలి" సమావేశాలకు హాజరయ్యేవారు. తెలుగు విభాగం ఇన్-చార్జ్ గా కూడా వుండేవారు తిలక్. మిలిటరీ క్లబ్బులకు తంబోలా కూపన్లు అమ్మడం, ఎల్వీ ప్రసాద్ బాతు గుడ్ల వ్యాపారంలో పనిచేయడం ద్వారా నాలుగు డబ్బులు సంపాదించుకునేవారు. బాతు గుడ్ల వ్యాపారం వల్ల బొంబాయి లోని తెలుగు కార్మికులకు, కూలీలకు దగ్గరయ్యారు. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక "పీపుల్స్ వార్" కు పేపర్ బోయ్ గా పనిచేశారు. అలా కమ్యూనిస్టు పార్టీ వారితో సంబంధాలు పెట్టుకున్నారు. బొంబాయిలో వున్న రోజుల్లోనే, దిన ఖర్చుల కొరకు అదనంగా, నర్సాపూర్ లేసులను మార్కెటింగ్ చేశారు. స్వల్ప మొత్తంలో తనకవసరమైన ఆర్థిక వనరులను కష్టపడి సమకూర్చుకునే తిలక్‌కు ఒకరిపై ఆధారపడి జీవించడం ఎంతమాత్రం ఇష్టముండేది కాదు.
మాజీ మంత్రి స్వర్గీయ పరకాల శేషావతారంతో కలిసి యూత్ లీగ్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ, బాలానందం సంఘం స్థాపించారు. యూత్ లీగ్ బృందం సభ్యులతో కలిసి, రైల్వే ప్లాట్ఫాిమ్ల పై దొరికే అశ్లీల సాహిత్యంపై సమర భేరి మోగించారు. అలాంటి పుస్తకాల అమ్మకాలను వ్యతిరేకిస్తూ "అరసం" తరహా ఉద్యమానికి ఆ రోజుల్లోనే నాంది పలికారు. అంతటితో ఆగకుండా, అశ్లీల సాహిత్యం చదవకుండా, తమవంతు కర్తవ్యంగా యూత్ లీగ్ చక్కటి సాహిత్యం సేకరించి చదివించేవారు. పోరాట పటిమను, ఉద్యమ స్ఫూర్తిని నీరు కార్చే ప్రయత్నాలు ఆ రోజుల్లో కూడా జరిగేవనడానికి ఉదాహరణగా, అప్పటి పశ్చిమ గోదావరి కలెక్టర్ శేషాద్రి తనను తోటి సమరయోధుల నుంచి విడదీసే ప్రయత్నం ఎలా చేసింది వివరించారు. ఎక్కడున్నా, ఏం చేసినా, స్వాతంత్ర్య ఉద్యమంతో ప్రత్యక్ష-పరోక్ష సంబంధాలను కొనసాగించే తిలక్, జైలు నుంచి విడుదలై వస్తుండే ఉద్యమకారులను కలుసుకొని, మూడో కంటికి తెలియకుండా, అజ్ఞాతవాసానికి తరలించేందుకు దోహద పడేవాడు. కమ్యూనిస్టు పార్టీ అజ్ఞాత కార్యకలాపాల కోఆర్డినేటర్ ఎస్వీ నరసయ్య కాంటాక్ట్ పాయింట్‌గా వుండేవారు. ఒక పర్యాయం కామ్రేడ్ మద్దుకూరు చంద్రశేఖర రావును, మరో కమ్యూనిస్టు అభిమాని శాస్త్రి కారులో మద్రాస్ నుండి బెంగుళూరు తీసుకెళ్లి, అక్కడినుంచి మారు పేర్లతో విమానంలో హైదరాబాద్ కు చేర్చారు తిలక్. హైదరాబాద్ రాష్ట్రంలో అప్పట్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం వుంది. మద్దుకూరును కామ్రేడ్ గోళ్ల రాధాకృష్ణమూర్తికి అప్పగించారు. అదీ ఆయన ఉద్యమ స్ఫూర్తి.
తెలంగాణ విమోచన ఉద్యమం ఊపందుకుంటున్న రోజుల్లో, కమ్యూనిస్టు పార్టీతో సహా, ఉద్యమ నిర్మాణ-నిర్వహణలో కీలకపాత్ర వహిస్తున్న ప్రజానాట్యమండలిపైనా నిషేధం వుండేది. నిషేధం నీలినీడల్లో తిలక్‌తో సహా పలువురు ప్రజానాట్యమండలికి చెందిన వారు ఒక్కొక్కరు మద్రాసు చేరుకున్నారు. సాంస్కృతిక విభాగానికి చెందిన సుంకర, వాసిరెడ్డి, తుమ్మల, రాంభట్లలు; భవిష్యత్ సినీ దిగ్గజాలైన తాతినేని, వీరమాచనేని, మిక్కిలినేని, చదలవాడ, రాంకోటి, కోగంటి వారిలో ప్రముఖులు. వీరందరికీ తిలక్ ద్వారా ఎల్వీ ప్రసాద్ మద్రాస్‌లో కొంత ఆధారం ఏర్పాటుచేయడంతో పాటు, కొంతకాలం ఆంధ్ర ప్రజానాట్యమండలి అధ్యక్షునిగా పనిచేశారు. పీసీ జోషి కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా వున్న రోజుల్లో, సర్కారు జిల్లాల్లోని ఎగువ మధ్య తరగతి కుటుంబాల వారు చాలామంది పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. ఒకే ఇంట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు అభిమానులుండడంతో ప్రతి ఇంటిపైనా ఇరు పార్టీల జండాలెగిరేవట. వారిలో చాలామంది ప్రజానాట్యమండలితో సంబంధాలు పెట్టుకుని, మద్రాసుకు వచ్చి స్థిరపడ్డారని చెప్పిన తిలక్, వారిలో పలువురు "క్యాపిటలిస్టులు" గా మారిపోయారని విచారం వ్యక్తంచేశారు. ప్రజానాట్యమండలి కళాకారులందరినీ ఒక వేదికపై తేవడానికి శాంతినికేతన్ లో విద్యనభ్యసించిన సి.వి.వి.ఆర్. ప్రసాద్, ఆయనతో పాటు ఎస్వీ నరసయ్య కృషిచేశారని అనేవారు తిలక్. అలా అభ్యుదయ కళాకారులందరూ ఒకే వేదికపై జమ కూడడం వల్లే, భవిష్యత్‌లో సినీరంగ అభివృద్ధికి పరోక్షంగా ఒక కీలక ఘట్టానికి నాంది పలికిందంటారు తిలక్.
వైభవంగా హైదరాబాద్‌లో జరిగిన "రోజులు మారాయి" సినిమా శత దినోత్సవ వేడుకలు, నగరానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరలి రావడానికి, మొట్టమొదటి సినీ స్టూడియో నిర్మాణానికి దారితీసిన చారిత్రాత్మక సంఘటన అనేవారు తిలక్. ఆ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి రాష్ట్ర మంత్రి స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి, నగరం సాహితీ-సంస్కృత రంగాలలో అభివృద్ధి చెందాలంటే, చలన చిత్ర రంగ ప్రముఖులు కలిసి కట్టుగా కృషిచేయాలని తన ఉపన్యాసంలో చెప్పారట. ఆయన సూచన మేరకు, రోజులు మారాయి యూనిట్ ప్రముఖులందరూ కలిసి కట్టుగా ఆలోచించి సారధీ స్టూడియో నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించడం, అచిర కాలంలోనే అమీర్‌పేటలో అది రూపుదిద్దుకోవడం జరిగింది. స్టూడియో నిర్మాణానికి స్థలం కావాలని (ఇప్పటి లాగా) ప్రభుత్వాన్ని కోరలేదప్పుడు. ప్రయివేట్ వ్యక్తుల దగ్గర కొన్న భూమిలో స్టూడియో నిర్మాణం, దానికి కొంత దూరంలో-ఖైరతాబాద్ సమీపంలో సారధి యూనిట్ కళాకారులందరూ నివసించడానికి ఇళ్ల స్థలాలు కొనుక్కునే ఏర్పాటు జరిగింది. విశ్వ విఖ్యాత నటసార్వభౌములను, నటసామ్రాట్టులను, పద్మశ్రీలను, పద్మభూషణ్‌లను ఆ స్టూడియో అందించినప్పటికీ, సినీ కాల గమనంలో ఎవరికివారే వేరై, ఎవరి "సినీ కుంపటి" వారే పెట్టుకోవడం తననెంతో కలచివేసిందనేవారు తిలక్.
ఆంధ్ర రాష్ట్రం కొరకు మద్రాసులోని మైలావూర్‌లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షను గుర్తుచేసుకున్న తిలక్ "ఆయన్ను బలిచేశారు" అనేవారు. అప్పట్లో మద్రాస్ టీనగర్లోని సినీ నటుడు చంద్రమోహన్ మామగారు, ప్రముఖ వైద్యులు డాక్టర్ గాలి బాలసుందర రావు ఇంట్లో జరిగే రాజకీయ సమావేశాలకు తిలక్ క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. అక్కడే పద్మశ్రీ డాక్టర్ పి. తిరుమల రావుతో, బులుసు సాంబమూర్తితో పరిచయమైంది. తిలక్ తన కుర్ర కారు గాంగును వెంట పెట్టుకుని, కనిపించిన ప్రతినాయకుడి ఇంటికి వెళ్లి, శ్రీరాములు నిరాహార దీక్షను విరమింపచేయమని ఒత్తిడి తెచ్చేవారు. ఆయనొక్కరే ఎందుకు బలి కావాలని వాదించేవారు. అప్పట్లో తిలక్ నివాసం టంగుటూరు ప్రకాశం పంతులు పెద్ద కొడుకు ఇంటి ఆవరణ వెనుక నున్న ఒక కారు షెడ్డు. ప్రకాశం భోలా మనస్తత్వాన్ని, ఆయనతో తన భేటీని గుర్తుచేసుకుంటూ, ఒకనాడు ఆయన ఇండియన్ రిపబ్లిక్ పత్రిక కార్యాలయంలో కారు దిగుతుండగా ఘెరావ్ చేసిన విషయం చెప్పారు. అప్పటికి పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగానికి మరి కొన్ని గంటల వ్యవధి మాత్రమే వుందట. తిలక్ తనను పట్టుకుని లాగుతుంటే ప్రశ్నించిన ప్రకాశంకు, పొట్టి శ్రీరాములును అందరూ కలిసి బలిదానం చేస్తుంటే తాను పిచ్చివాడినైపోయానని జవాబిచ్చాడు. ప్రకాశం లాంటి గుండే ధైర్యం వున్న మనిషి కూడా ఆ సమయంలో తనను ఏం చేయకపోవడం ఆయన గొప్పతన మంటారు తిలక్.
ఇలా గుర్తు తెచ్చుకుంటూ పోతుంటే తిలక్ జ్ఞాపకాలు, తిలక్ తో పరిచయం అయిన తర్వాత జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తుంటాయి. ఆయన చనిపోయిన నాలుగో రోజున జన చైతన్య వేదిక సంతాప సభ ఏర్పాటుచేసింది. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ గీతారెడ్డి, సిపిఎం నాయకుడు బివి రాఘవులు, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక మండలి అధ్యక్షుడు రమణమూర్తి ప్రభృతులు వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. సమాజంపై తనదంటూ విభిన్నమైన ముద్ర వేసిన తిలక్ భావి తరాల వారికి స్ఫూర్తి దాతగా నిలుస్తారని అంటూ, గీతారెడ్డి, తనకు "రాజకీయ ఆరంగేట్రం" చేయించిన గురువు గారు తిలక్ అని చెప్పారు. ఆయన ఆనాడు రూపొందించిన "భారత రత్న ఇందిరమ్మ" రూప వాణి కార్యక్రమంలో తనకు ఇందిరా గాంధి పాత్రను ఇవ్వడం వల్లే తనకు అమితమైన ప్రాచుర్యం వచ్చిందని, అది తాను రాజకీయంగా ఎదగడానికి దోహద పడిందని అన్నారు. సినీరంగంలో వున్న ప్రతి వ్యక్తి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. "కామ్రేడ్ తిలక్" అని ఆయనను సంభోదిస్తూ ప్రసంగం చేసిన రాఘవులు, జీవితాంతం ప్రజా ధర్మం కొరకు పోరాడిన తిలక్ తనకు "కమ్యూనిస్టు కోణం" లోనే తెలుసన్నారు. వామ పక్ష ఐక్యత కొరకు అహర్నిశలు కృషిచేసిన తిలక్, ఎప్పుడూ గట్టి ప్రతిపక్షం, అదీ వామపక్ష ప్రతిపక్షం వుండాలని కోరుకునేవారని గుర్తుచేసుకున్నారు.
అన్ని రాజకీయ పార్టీల వారు, తిలక్ తమ వాడే అనడం ఆయన గొప్పదనానికి నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో "పెద్దింటివారు" అని పిలువబడే కుటుంబంలో జన్మించిన కొర్లిపర బాలగంగాధర తిలక్ను "కమ్యూనిస్టు గాంధి" అనడం సమంజసమేమో!