Thursday, September 2, 2010

రెండు దశాబ్దాలుగా నేనెరిగిన-నాకు తెలిసిన కొణిజేటి రోశయ్య : వనం జ్వాలా నరసింహారావు




ఎన్ టీ రామారావు సారధ్యంలోని తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించడానికి పటిష్టమైన నాయకత్వం కొరకు పీసీసీ అధ్యక్షుడిగా చెన్నారెడ్డిని నియమించడంతో, ఆయనకు ఆ లక్ష్యంలో తోడ్పడిన ముఖ్యుల్లో ప్రథముడైన రోశయ్యతో నాకు మొదటిసారి పరిచయం కలిగింది. 1989 సంవత్సరాంతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెన్నారెడ్డి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి కావడం, ఆయన మంత్రివర్గంలో రోశయ్య చేరడం జరిగింది. ఎన్నికల ముందు పరిచయమైన చెన్నారెడ్డి నన్ను "ముఖ్యమంత్రి పౌర సంబంధాల అధికారి" గా నియమించారు. నా నియామకం గురించి మొట్టమొదట రోశయ్య గారికి తెలియచేసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ముఖ్యమంత్రి పీఅర్ఓ గా ప్రతి దినం రోశయ్యను కలిసే అవకాశం, విధి నిర్వహణలో ఆయన సూచనలు-సలహాలు తీసుకోవడం నిరంతరం జరిగేది.

కొణిజేటి రోశయ్య, నాలుగు దశాబ్దాల క్రితం 1968లో విధాన మండలి సభ్యుడిగా ఎన్నికై చట్టసభలో అడుగు పెట్టారు. శాసన మండలిలో ప్రతిపక్షనేతగా వ్యవహరించిన ఆయన వాగ్దాటికి అడ్డుకట్ట వేయడానికి, 1983 లో అధికారంలోకి వచ్చిన ఎన్ టీ రామారావు మండలిని రద్దు చేసేంత వరకు, ఆయన విధాన సభ సభ్యుడుగా కొనసాగారు. తెనాలి, చీరాల నియోజక వర్గాలనుంచి శాసనసభకు, నరసరావుపేట నియోజకవర్గం నుంచి లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో తొలిసారిగా 1979 లో, తదుపరి ఎందరో ముఖ్యమంత్రుల దగ్గర, మంత్రివర్గ సభ్యుడిగా, కీలకమైన శాఖలు నిర్వహించిన అనుభవజ్ఞుడు రోశయ్య. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 1995-97 మధ్య కాలంలో సమర్థవంతంగా పనిచేశారు. పాతికేళ్ల విరామం తర్వాత మరో మారు శాసనమండలి సభ్యుడుగా 2009 లో ఎన్నికయ్యారు. ఏ శాసన మండలి సభ్యుడిగా చట్ట సభల్లో ప్రవేశించారో, అదే మండలి సభ్యుడిగా, రోశయ్య సెప్టెంబర్ 3,2009 న ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. బహుముఖ ప్రజ్ఞా శాలైన రోశయ్యకు 2007 అక్టోబర్‌లో ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ పట్టా ఇచ్చింది. ఎన్జీ రంగా శిష్యుడిగా చెప్పుకునే రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను, 16 సార్లు శాసనసభలో ప్రవేశపెట్టిన అప్రకటిత "ఆర్థిక రంగ నిపుణుడు" కొణిజేటి రోశయ్య. వరుసగా రెండు పర్యాయాలు లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌ ప్రవేశపెట్టి రికార్డు సాధించారు.

ఎల్లప్పుడూ తెల్లటి ఖద్దరు దుస్తులనే ధరించే రోశయ్య ఆజానుబాహుడు. గంభీరమైన కంఠస్వరం ఆయన సొత్తు. సంయమనం ఆయన ఆస్తి. ఆయన పంచె కట్టు తెలుగు దనానికే ప్రతీక . గిట్టని వారు సహితం ఆయన్ను ఫలానా వారి గ్రూపుకు చెందిన వ్యక్తిగా వేలెత్తి చూపలేదింతవరకు. మహాత్మా గాంధి సిద్ధాంతాలైన అహింస-సత్య శీలతకు ఆయన పర్యాయ పదం అనవచ్చు. డబ్బై సంవత్సరాల రోశయ్య తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో విలక్షణమైన రాజనీతిజ్ఞుడిగా, అందరి వాడుగా, క్రమ శిక్షణ గల కాంగ్రెస్ వాదిగా మన్ననలను పొందారు. ఆశించని ముఖ్య మంత్రి పదవి, రోశయ్యకు దక్కడంతో, "అజాత శత్రువు" గా ఆయనకున్న పేరును, కొందరు అసూయాపరులు మలినం చేసే ప్రయత్నాలు ఉద్దేశపూర్వకంగా చేయడాన్ని, లౌక్యంతో-ఓర్పుతో-నమ్రతతో, అనుభవం నేర్పిన ధైర్యంతో ఎదుర్కున్నారాయన. స్వర్గీయ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగి, సంక్షేమ-అభివృద్ధి పథకాల రూపకల్పన-అమలులో చేదోడుగా నిలిచి, ఎదురైన చిక్కు సమస్యలను పరిష్కరించే బాధ్యత తన భుజస్కంధాల మీద మోపుకునేవారు రోశయ్య. అసెంబ్లీలో-పాలనా వ్యవహారాలలో రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మీయుడుగా వ్యవహరించి నమ్మకానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచారు. మూడు దశాబ్దాల పాటు మంత్రిగా పనిచేసిన అనుభవంతో, ముఖ్యమంత్రిగా, తనదైన శైలితో విధాన పరమైన నిర్ణయాలను తీసుకుంటూ, చెరిపినా చెరగని ముద్ర ప్రభుత్వ పాలనపై వేశారాయన. క్లిష్ట సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి, ఒకటి వెంట మరొక సంక్షోభం రోశయ్యను వెంటాడాయి. ప్రకృతి భీభత్సం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నినాదం హింసాయుతంగా మారడం, రాజకీయ అనిశ్చిత పరిస్థితుల లాంటి సంక్షోభాలను ఎదుర్కోని, ధైర్యంతో నిలదొక్కుకొని, పాలనను గాడిలో పెట్టారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంలో ఆయన చూపిన చొరవ అభినందనీయం.

ముఖ్యమంత్రిగా రోశయ్య పాలనకు ఏడాది పూర్తి అయింది. అవాంతరాలు ఎన్ని ఎదురైనా, అధిష్ఠానం అండదండలు ఒక వైపు, కాదన్న మంత్రులే కలిసిరావడం మరోవైపు, అపారమైన అనుభవం అన్ని వైపులా ఆయన పక్షాన వుండడంతో, రోశయ్య పాలన సజావు గా ముందుకు సాగుతోంది. పరిపాలన చక్కదిద్దడానికి రోశయ్యను మించిన కాంగ్రెస్ నాయకులు మరొకరు లేరనేది తేలిపోయింది. ఊపిరి పీల్చుకోకుండా చేసిన తెలంగాణ ఉద్యమం , సవాళ్లు విసిరిన అసమ్మతి కాంగ్రెస్ వాదుల వ్యవహారం , ఆశించని ఫలితాలు అందించని హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు-శాసనసభ ఉప ఎన్నికలు, చంద్రబాబు నాయుడు లేవనెత్తిన బాబ్లీ వివాదం , బయ్యారం మైనింగ్‌ లీజుల వ్యవహారం, విద్యార్థుల ఫీజు చెల్లించే వివాదం లాంటి పలు అంశాలు, రోశయ్యను ఇరుకున పెట్టాయే తప్ప పెరుగుతున్న ఆయన ప్రతిష్టకు భంగం కలిగించ లేకపోయాయి. రాజకీయంగా ఆటుపోట్లను స్వపక్షం నుంచీ-విపక్షాలనుంచీ ప్రభుత్వం నిత్యం ఎదుర్కుంటూనే, తనపై విసిరిన ప్రతి సవాలునూ తనదైన శైలిలో రోశయ్య అధిగమించడం కాంగ్రెస్ అధిష్టానాన్ని సైతం ఆకట్టుకుంది. ధిక్కార స్వరం వినిపిస్తున్న వారి విషయంలో రోశయ్య వ్యూహాత్మకంగా వ్యవహరించి పైచేయి తనదే అని నిరూపించుకున్నారు. తనను అదే పనిగా విమర్శించేవారి నోళ్లు మూయించడంలో నూటికి నూరు పాళ్లు సఫలం అయ్యాడనాలి. బాధ్యతలు స్వీకరించిన రోజుల్లో ప్రతికూలించిన ప్రకృతి ప్రస్తుతం సహకరించడం, ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగు పడటం రోశయ్యకు అనుకూలంగా మారాయి. ఆదిలో సహకరించని పలువురు మంత్రులను విశ్వాసంలోకి తీసుకొనడంలో రోశయ్య అవలంబించిన వైఖరి వల్ల అదే మంత్రులలో చాలామంది అనేక సందర్బాల్లో కలసికట్టుగా ప్రకటన చేయడం రోశయ్యకు మరో విజయం.

అధికార యంత్రాంగంలో మునుపటికంటే నిబద్ధత కనిపించడం, పరిపాలనలో చురుకుదనం చోటుచేసుకోవడం, అలిగిన మంత్రులే వాస్తవాలను అర్థంచేసుకుని పాలనలో క్రియాశీలక పాత్ర పోషించడం, విమర్శించిన స్వపక్షీయులే తప్పు సరి దిద్దుకుని రోశయ్యను సమర్థించడం, గతంలో రాజశేఖర రెడ్డికి అనుకూలంగా లేని కొందరు కాంగ్రెస్ ప్రముఖులు కూడా రోశయ్యకు మద్దతు పలకడం, రోశయ్య ఏడాది పాలనకు విజయపు గుర్తులు. ఒక వైపు తనకంటూ ప్రత్యేక అజెండా అంటూ ఏదీ లేదని-దివంగత ముఖ్యమంత్రి అభివృద్ధి-సంక్షేమ పథకాలనే పటిష్టంగా అమలు పరచడమే తన ప్రధాన లక్ష్యమని ప్రకటించినప్పటికీ, వాటి అమలుకు-వాటి అమలులో చోటుచేసుకున్నట్లు భావిస్తున్న అక్రమాలను సవరించేందుకు, తనదైన శైలిలో, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడం ప్రతిపక్షాల వారిని కూడా ఆశ్చర్య పరుస్తున్నది. పదే-పదే గొప్పలు చెప్పుకోకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు మాత్రమే కావాలన్న ఉద్దేశంతో కాకుండా, పథకాల అమలే ప్రధాన ధ్యేయంగా, ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనలో వ్యవహరిస్తున్న తీరు, పారదర్శకతతో-బాధ్యతాయుతంగా-జవాబుదారీతనంతో, అనునిత్యం రోశయ్య వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్ ముఖ్యమంత్రులకు "బెంచ్ మార్క్" లా విశ్లేషకులు భావిస్తున్నారు. సంక్షేమ పథకాలకు కోత పడుతుందని కొందరు చేస్తున్న ప్రచారాన్ని తప్పుడు ప్రచారమని ఆయన తన చేతల ద్వారా నిరూపించుకుంటున్నారు. విమర్శించిన మంత్రులతో పని చేయించుకుంటూనే, ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసి, మరింత మెరుగైన పాలనకు ఇనుమడించిన సమర్థతకు పట్టంగట్టే దిశగా రోశయ్య అడుగువేస్తున్నారు. అధిష్టానం ఆమోదం, ఆశీస్సులు పుష్కలంగా వున్న రోశయ్య తన ప్రభుత్వాన్ని విమర్శలకు అతీతంగా నడిపించడానికి సర్వ శక్తులనూ ఒడ్డుతున్నారని త్రి కరణ శుద్ధిగా ఆయన తీసుకుంటున్న చర్యలు చెబుతున్నాయి.

అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎప్పటికప్పుడు రాష్ట్ర పరిస్ధితులను క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ, అధిష్టానం, అరమరికలు లేని మద్దతును రోశయ్యకు ఇచ్చేందుకు సంపూర్ణ సహకారం ఇస్తున్నారు. పార్టీపరంగా అర-కొరగా మిగులున్న "శైశవ దశలోని అసంతృప్తి" విషయంలో ఆమె ఆలోచనలను రాష్ట్ర పార్టీ నేతలకు, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నిర్మొహమాటంగా వివరించారు. మరో పక్క భావి భారత ప్రధాని రాహుల్ గాంధి రాష్ట్రానికి చెందిన యువ ఎమ్మెల్యేలను ఢిల్లీకి ఆహ్వానించి తన సందేశం వినిపించారు. ఇరువురు, రాష్ట్రంలో రోశయ్య సారధ్యంలోని ప్రభుత్వాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. రోశయ్య ప్రభుత్వానికి కాని, రాష్ట్ర కాంగ్రెస్ కు కాని, జాతీయ స్థాయిలో పార్టీకి కాని నష్ట పరిచే "యాత్రలకు" అధిష్టానం అనుమతి లేదన్న ప్రత్యక్ష-పరోక్ష సంకేతాలు స్పష్టంగా వ్యక్త పరిచింది సోనియా గాంధి.

వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, రోశయ్య నాయకత్వంలో ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో చొరవ తీసుకుంటున్నది. నిధుల కొరత కారణంగా వివిధ పథకాలకు ప్రాధాన్య పరంగా నిధులు కేటాయించడంలో రోశయ్య ఆర్థిక శాఖలో తనకున్న అనుభవం దోహదపడుతున్నది. మద్యంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను రోశయ్య ప్రభుత్వం ఘాటుగా తిప్పికొట్టింది. మద్యంపై ప్రభుత్వానికి ఆదాయం రావడం నేరం కాదని స్పష్టం చేశారాయన. 'ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు’ కు తాను వ్యతిరేకం కాదు-అనుకూలమూ కాదని, అధిష్ఠానం ఏం చెబితే దానికి కట్టుబడి ఉంటానని, సమస్యకు పరిష్కారం చూపేందుకే కేంద్రం శ్రీకృష్ణ కమిటీని వేసిందని ఆయన పలు మార్లు స్పష్టం చేయడం వెనుక ఆయన పార్టీ విధేయత అవగాహన చేసుకోవచ్చు. తనను అస్థిర పరిచేందుకు కొన్ని బలీయమైన శక్తులు ప్రయత్నిస్తున్నాయన్న విషయం తెలిసి కూడా ఆయన స్పందనలో రాజకీయానికి తావులేకుండా వ్యాఖ్యలుండేవి. తన వ్యాఖ్యలకు సంబంధించి ఎవరి పేరును ఏనాడు ఆయన ఉదహరించలేదు.

రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో స్వపక్షం నుంచే ధిక్కార స్వరాలు వినిపించాయి. రోశయ్య తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమే అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రముఖులు కూడా కొందరున్నారు. సహచర మంత్రుల్లో కొందరు, రాజ్యాంగ పరంగా తప్పనిసరిగా చేయాల్సిన పదవీ ప్రమాణ స్వీకారానికి హాజరు కామని హటయోగం చేసేంతవరకూ వెళ్లింది వ్యవహారం. చివరకు అన్నీ సద్దుమణిగాయి. "అధిష్టానం ఆశీస్సులు వున్నంత వరకు" ఎవరెన్ని అన్నా ముఖ్యమంత్రి స్థానంలోంచి రోశయ్యను కదల్చడం జరిగే పని కాదని తేలిపోయింది. పాలనా పరంగా పట్టు సాధించడమే కాకుండా, పార్టీ పరంగా తన మాటకు తిరుగులేదని అనేక సందర్భాల్లో నిరూపించుకున్నారు రోశయ్య. తొమ్మిది గంటల విద్యుత్‌ విషయంలో స్వపక్ష విమర్శకుల వాదనను తిప్పికొట్టే సందర్భంలోను, ఓబులాపురం గనుల అక్రమాలపై సిబిఐ విచారణకు సిఫారసు చేయడంలోను, రాష్ట్రం వరదల్లో అతలా కుతలం అయినప్పుడు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌-యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని రప్పించడంలోను, బాబ్లీ వివాదాన్ని పరిష్కరించేందుకు అఖిల పక్ష కమిటీ వాదనను ప్రధానికి వినిపించడానికి చొరవ తీసుకోవడంలోను, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్య మంత్రి రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ పధకాలను యధా విధిగా కొనసాగించడంలోను, నిరంతరం ప్రభుత్వ శాఖల పనితీరుపై నేర్పుగా సమీక్షలు జరపడంలోను, అధికార యంత్రాంగంపై పట్టు సాధించడంలోను, పరిపాలనకు సంబంధించిన విషయాలలో ఎవరిని-ఎక్కడ-ఎందుకు-ఏ సందర్భంలో నియమించాలనే విషయంలోను, ప్రతి విషయంలోను ఆచి-తూచి మాట్లాడడంలోను, తనకు తానే సాటి అని, "సరి లేరు తనకెవ్వరని" నిర్ద్వందంగా నిరూపించుకుంటున్న ప్రతిభాశాలి ముఖ్యమంత్రి రోశయ్య.

2 comments:

  1. Rao Gaaru, Meeru Rosaiah gaari lo maaku teliyani kotta konam ni parichayam chestaru ani aasa paddamu, meeru ippati daaka andariki telisina vishayalane parichayam chesaru.

    ReplyDelete
  2. you have stooped to a very low level in praising the current CM. he is so ignorant that he has written a letter to RBI to print a coin in the memory of YSR.RBI is responsible for printing of notes & the mint (mint compound in hyderabad)is responsible for the minting of coins.you have boasted that Rosiah has worked as FM in so many ministries & he is ignorant of this fact. Rosiah has undertaken a frontal attack on Chennareddy`s ministry on Bagareddy`s cement scandal & the next day he joined the ministry of chennareddy. Eenadu chief editor Gajjela mallareddy has described Rosiah as Magalanja on that day.you should not distort history in praising any politician & state the facts so that the present generation should know the facts.

    ReplyDelete