Thursday, March 3, 2011

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన తప్పదా?: వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన తప్పదా?
వనం జ్వాలా నరసింహారావు

విస్తరించిన రాజకీయ శూన్యత; అధిష్ఠానమే సాగిస్తున్న రాష్ట్ర పాలన;
నిరంతరంగా తెలంగాణ చర్చ; అగ్నికి ఆజ్యం పోస్తున్న సంఘటనలు;
తక్షణ రాజకీయ దృష్టివల్లనే చిక్కులు

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో నెల కొన్న పరిస్థితి లాంటిది, బహుశా స్వతంత్ర భారత దేశ చరిత్రలో, మరే రాష్ట్రంలోను-ఏనాడు నెలకొని లేదనొచ్చు. ఆ మాటకొస్తే, ఈ పరిస్థితి ఈనాటిది కాదు. రాజశేఖర రెడ్డి అకాల మరణంతో, కాంగ్రెస్ రాజకీయాలలో, మున్నెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో "శూన్యం" ఏర్పడి, రోశయ్య హయాంలో ఆ శూన్యం బలపడి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఆయన ప్రమేయం లేకుండానే మర్రి ఊడల్లాగా పెకిలించనలవికాని లోతుకు కూరుకుపోయింది. కాంగ్రెస్ పార్టీకి "అధిష్టానం" అనేది వున్నదనే సంగతిని వైఎస్ రాజశేఖర రెడ్డి కార్యకర్తల మన ఫలకం నుంచి తీసేయగా, రోశయ్య తన పద్నాలుగు నెలల పాలనలో చేసిన ఏకైక పని మరిచిపోయిన అధిష్టానాన్ని అదే కార్యకర్తలకు గుర్తుచేయడమే! ఇక, ఆ తర్వాత, అధిష్టానమే ఇక్కడ పాలన చేసే స్థితికి రాష్ట్రం చేరుకుంది. ప్రత్యేక తెలంగాణ వాదన, జగన్మోహనరెడ్డి సవాలు, ప్రభుత్వోద్యోగుల నిరసనలు, తెలుగు దేశం గుప్పిస్తున్న ఆరోపణలు, ప్రాంతాలవారీగా కాంగ్రెస్ నాయకులు విడిపోయి ఇటు ముఖ్యమంత్రికి-అటు అధిష్టానానికి తల బొప్పి కట్టించడం, అవినీతి ఆరోపణలు, అధికారుల్లో అలసత్వం, పధకాల అమలులో నిర్లిప్తత....ఇలా...రకరకాల సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోయిన రాష్ట్రంలో, రాష్ట్రపతి పాలన మినహా గత్యంతరం లేని పరిస్థితులు రాబోతున్నాయా అన్న అనుమానం బలపడుతోంది ప్రతివారిలో.

ఇంతకూ...తప్పెవరిది? ఒప్పెవరిది? అనేవి సమాధానం దొరకని ప్రశ్నలు. దొరికించుకునే ప్రయత్నం చేస్తే.....కర్ణుడి చావుకు కారకులెవరో-ఎందరెందరో అన్నది ఎలా భారతంలో పరోక్షంగా వివరించడం జరిగిందో, అలానే విశదమవుతుంది. వారూ-వీరూ అన్న తేడా లేకుండా, అన్ని రాజకీయ పార్టీలను, మొదటగా తప్పు పట్టాలి. అధికారంలో వున్నప్పుడొక మాట, ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడొక మాట మాట్లాడే రాజకీయ పార్టీల నాయకులున్నప్పుడు, ఎప్పటికైనా, ఇప్పుడేం జరుగుతుందో అదే జరిగి తీరుతుంది. మాట మార్చే రాజకీయ నాయకుల వల్లనే ఇలాంటివి జరుగుతుంటాయి. ఈ నేపధ్యంలో... అలాంటి ఒకటి రెండు ఉదాహరణలు మననం చేసుకోవచ్చేమో!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న వాదన సమంజసమా?కాదా? అన్న చర్చ చాలా కాలంగా జరుగుతున్నదే. తెలంగాణ ఏర్పడినా, ఏర్పడకపోయినా, ఆ చర్చ ఏదో ఒక రీతిలో కొనసాగుతూనే వుంటుంది. ఒక వైపు చర్చ జరుగుతుండగానే, సమస్య పరిష్కారం కొరకు కాకుండా, అగ్నికి ఆజ్యం పోస్తున్న తరహాలో జరుగుతున్న సంఘటనలతోనే వచ్చిన చిక్కల్లా. రాజశేఖర రెడ్డి వున్నంతకాలం, అన్నీ తానే అయిపోయి, ఎంత బలంగా ప్రజల్లో నాటుకు పోయినప్పటికీ, తెలంగాణ సమస్యను తన అదుపులో వుంచుకోగలిగాడు. పరిస్థితులు కూడా అనుకూలించాయనొచ్చు. ఆ తర్వాత ఉవ్వెత్తున లేచిన ఉద్యమం అణచడం చేతకాని (కేంద్ర-రాష్ట్ర) ప్రభుత్వం, దొడ్డి దోవలు వెతకడం మొదలెట్టింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడి ఆమరణ నిరాహార దీక్ష విరమింప చేసి, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి, అందరినీ ఏకాభిప్రాయానికి ఒప్పించినట్లు నటించి, డిసెంబర్ 9,2009 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలెట్టినట్లు ప్రకటన చేసింది. చేసే ముందర అలా చేయడంలోని ఔచిత్యం కించిత్తైనా ఆలోచన చేయలేదు. కేవలం తక్షణ రాజకీయ ప్రయోజనాలే దృష్టిలో పెట్టుకుని అటు తెలంగాణ ప్రజలను, ఇటు, సీమాంధ్ర ప్రజలను, ఒక్కోరకంగా మోసం చేసింది. ఈ నాటి ఈ దుస్థితికి అంకురార్పణ అలా జరిగింది. మాట నిలబెట్టుకోలేక పోయింది. సీమాంధ్రులను, తెలంగాణ వారిని ఇష్టం వచ్చినట్లు రెచ్చగొట్టింది. పనిలో పనిగా, (కేంద్ర) ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి తనయుడిని ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం చేసింది. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో సరైన నిర్ణయం తీసుకోకుండా, తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టింది. ఎన్ని రకాల వీలుంటే, అన్ని రకాల పద్ధతుల ద్వారా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు, వాటిని పాలిస్తున్న కాంగ్రెస్ పాలకులు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను, విభజించి-పాలించు తరహాలో, ఇబ్బందులకు లోను చేయడం దురదృష్టం.

ఈ నేపధ్యంలో, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఒకే ఒక్క కోణం నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం కష్టం. ఎవరి ఆలోచనలు వారివే...ఎవరి ఆరోపణలు వారివే. కాంగ్రెస్-తెలుగుదేశం మధ్య మాచ్ ఫిక్సింగ్ అని తెరాస అంటుంటే, టిడిపి-తెరాస మధ్యనే మాచ్ ఫిక్సింగ్ అని కాంగ్రెస్ వాదిస్తున్నది. కాదు జగన్మోహన రెడ్డికి కేసీఆర్ కు మధ్య మాచ్ ఫిక్సింగ్ కుదిరిందని తెలుగుదేశం ఆరోపిస్తున్నది. వీటితో సంబంధం లేకుండా, బహిరంగంగానే ఫిక్సయిపోయాడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీతో. శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టమని టిడిపిని డిమాండు చేసింది తెరాస పార్టీ. జగన్ వర్గం కూడా ఆ అర్థం స్ఫురించే రీతిలోనే మాట్లాడింది. ఒక వైపు తన తండ్రి గెలిపించి-అధికారంలోకి తెచ్చిన ప్రభుత్వాన్ని పడగొట్టే వుద్దేశం తనకు లేదంటూనే, అదే ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు జగన్. ఒకానొక సందర్భంలో, తమకున్న సంఖ్యా బలంతోనే, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్తామని అన్న తెరాస పార్టీ, ఆ పని చేయలేదెందుకో మరి.

ఇక బహిష్కరణల పర్వం, సహాయ నిరాకరణ పర్వాలు మొదలయ్యాయి. శాసనసభ సమావేశాలు మొదలైన తొలి రోజునే, తెరాస-టిడిపి తెలంగాణ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అసలు సభకు రాకుండా, ఢిల్లీలో గడిపిన కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యేలు, తమదైన శైలిలో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారు. రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో, ఆదరాబాదరగ తన ప్రసంగాన్ని చదివాననిపించుకున్నారు గవర్నర్. చట్ట సభలో గవర్నర్ ప్రసంగం చేయలేని పరిస్థితి కలిగితే దాన్నే మని పిలవాలి? ఇక ఆ తర్వాత లోక్ సత్తా ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ-తెరాస ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఘర్షణ, జేపీ పై దాడి ఎలా అర్థం చేసుకోవాలి. ఎవరిది తప్పు-ఎవరిది ఒప్పు అనేది పక్కన పెడితే, ప్రభుత్వం సజావుగా సాగుతున్నదనుకోవాలా? లేదా? అనేది ప్రధానంగా అలోచించాల్సిన విషయం. మర్నాటి నుంచి, ఇప్పటి దాకా, శాసన సభ కార్యకలాపాలు జరుగుతున్నది లేనే లేదు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ సర్వ సాధారణ విషయమైంది. బడ్జెట్ ప్రసంగం నామ మాత్రంగా ఆర్థిక మంత్రి చదవాల్సిన పరిస్థితులు మరీ దురదృష్టం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సభా సాంప్రదాయాలకు, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేదనాలి. కొందరు "గౌరవ శాసనసభ సభ్యులు" స్పీకర్ పోడియంలో వున్నప్పుడు, ధన్యవాదాలు చెప్పే ప్రసంగం ముఖ్యమంత్రి చేయడం జరిగింది. సభా నాయకుడు నిలుచున్నప్పుడు, మరే సభ్యుడూ నిలుచుని వుండ కూడదనేది పార్లమెంటరీ సాంప్రదాయం-చట్ట సభల నిబంధన. అలాంటిది, వారు పోడియంలో వుండగా, సీఎం ప్రసంగం చేయొచ్చా? తప్పలేదనుకుని సమాధానం చెప్పుకోవాల్సి వస్తే, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కదా? అంటే... రాజ్యాంగ నియమ నిబంధనలకు అనుగుణంగా సభ నడవలేదనుకోవాల్నా? నిపుణులకే వదిలేద్దాం ఈ సంగతి!

నాలుగు లక్షల మంది తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణ మరో కీలకాంశం. అదే రోజుల్లో కొంచెం ఇంచుమించుగా, జగన్మోహన రెడ్డి వారం రోజుల నిరాహార దీక్ష చోటు చేసుకుంది. విద్యార్థులకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ప్రారంభించిన ఫీజు రీఇంబర్స్ మెంటు జరగనందున, ప్రభుత్వాన్ని ఒప్పించడానికి చేసిన దీక్ష అది. ఇక్కడ కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. దీక్షకు సంబంధించిన మెరిట్-డీ మెరిట్ విషయాలు పక్కన పెట్టి, రాజకీయంగా ప్రాముఖ్యతున్న ఒక వ్యక్తి దీక్షకు దిగినప్పుడు, ప్రభుత్వం అంతో-ఇంతో స్పందించక పోవడం మంచి పద్ధతి కాదనిపిస్తోంది. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలోను, నిజాం కళాశాల ప్రాంగణంలోను చెలరేగిన హింసా కాండ భవిష్యత్ లో ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుందో అర్థం కావడం లేదు. ఇక ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆట విడుపు స్థలాలయ్యాయి. ఉద్యోగులు రావడం, సంతకాలు చేయడం, పెన్ డౌన్ సమ్మెలా సహాయ నిరాకరణ చేయడమంటే, ప్రభుత్వం స్తంభించి పోయినట్లే కదా! చివరకు పని చేసిన వారికీ-చేయని వారికీ జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో వుంది రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్ జీతమే ఆలశ్యమైంది. ముఖ్య మంత్రికి-మంత్రి వర్గ సభ్యులకు జీతాలు లేవు. వారికి రాకపోయినా గడుస్తుంది. జీతాలే జీవితంలాగా భావించే మధ్య తరగతి ఉద్యోగస్థుల గతేంటి? రెండు రోజుల రాష్ట్ర వ్యాప్త సమ్మె, మరో రోజున "పల్లె పల్లె పట్టాల" పైకి ఆందోళన కార్యక్రమంతో ప్రభుత్వానికి ఎం చేయాల్నో పాలుబోతున్నట్లు లేదు.

కేంద్రంలో అధికారంలో వున్న కాంగ్రెస్ సారధ్యంలోని యూపీయే ప్రభుత్వం పుణ్యమా అని, సీమాంధ్ర-తెలంగాణ సోదర-సోదరీమణుల మధ్య, సీమాంధ్ర-తెలంగాణ మధ్య భౌగోళిక విభజన స్థానంలో, శాశ్వత స్పర్ధలు చోటు చేసుకుంటున్నాయి. మాటల యుద్ధం-తూటాల యుద్ధంగా మారుతున్నది. మధ్యలో ఒక పెద్ద మనిషి "ఉత్తరాంధ్ర కలిసిన తెలంగాణ" అన్న నినాదం తెరపైకి తెచ్చాడు. ఐక్య కార్యాచరణ కమిటీ "మిలియన్ మార్చ్" పిలుపు నేపధ్యంలో, పరిస్థితులు ఎటువైపు దారితీస్తాయో అర్థం కావడం లేదు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు ఏర్పాటు చేసుకోదల్చిన సమావేశానికి వ్యతిరేకంగా, ఎంపీ కావూరి సాంబశివ రావు ఇంటి దగ్గర తెలంగాణ న్యాయవాదుల ధర్నా విమర్శలకు దారితీసింది. మీసాలు మెలేసుకునే స్థితికి పోతోంది. ఆయన మాటలకు ప్రతిస్పందనగా, రాష్ట్ర మంత్రి జూపెల్లి కృష్ణారావు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా లేఖను స్పీకర్ కు, సోనియా గాంధీకి పంపినట్లు పాత్రికేయులకు చెప్పారు. ఆయన బాటలోనే మరి కొందరు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతకంటే ముందు, తెరాస, తెలుగుదేశం తెలంగాణ సభ్యులు, కాంగ్రెస్ తెలంగాణ సభ్యులు బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. లోక్ సభలో తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు కె. చంద్రశేఖర రావు, విజయశాంతి స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేయడంతో-వారికి కాంగ్రెస్ సభ్యుల, ఎన్డీయే సభ్యుల మద్దతు లభించడంతో, సభ పలు మార్లు వాయిదా పడి చివరకు మర్నాటికి వాయిదా పడింది. ఎంపీలు మధు యాష్కీ, సుఖేందర్ రెడ్డి, తమ పార్టీకి చెందిన కావూరిని రాజీనామా చేయమని సవాలు విసిరారు. యాష్కీ ఆయనపై కొన్ని ఆరోపణలు కూడా మోపారు.

ఎమెల్యేలు శాసన సభలో లేకుండా, మంత్రులు రాజీనామా బాట పడుతుంటే, (కాంగ్రెస్ పార్టీకి చెందిన)ఎంపీలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటుంటే, ఏమీ చేయలేని స్థితిలో వున్న (రాష్ట్ర) ప్రభుత్వాన్ని రద్దు చేసి, అసెంబ్లీని సుషుప్తావస్థలో వుంచి రాష్ట్రపతి పాలన పెట్టే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం వుందేమో అని అనుమానం వేస్తోంది. కాకపోతే, కిరణ్ స్థానంలో నరసింహన్ రావడమంటే, రాష్ట్రం పరిస్థితి పెనంలోంచి పొయ్యిలోకి పడ్డట్లే!

2 comments:

  1. ఓ 2ఏళ్ళు నరసింహన్ చేతిలోకి లాఠీ రావాలని రాష్ట్రప్రజలంతా కోరుకుంటున్నారు.

    ReplyDelete
  2. When Congress Party is in power at Center and State, how can you expect President rule?

    0.01% chances.

    ReplyDelete