Saturday, April 9, 2011

అత్యవసర వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వ సరికొత్త నిర్ణయం? : వనం జ్వాలా నరసింహారావు

అత్యవసర వైద్య సేవలకు చట్టం

(ఆంధ్ర జ్యోతి దిన పత్రిక: 15-04-2011)

అత్యవసర వైద్య సదుపాయంలో "బంగారు ఘడియ"

(సూర్య దిన పత్రిక: 15-04-2011)

వనం జ్వాలా నరసింహారావు

ఆ మధ్య అమెరికాలో వున్నప్పుడు, తెలిసిన స్నేహితుడింట్లో పని చేస్తుండే "నానీ" (ఆయా లాంటిది), ఒక రోజు ఉదయాన అతడింటికి వస్తున్నప్పుడు, రోడ్డు ప్రమాదానికి గురైంది. పోలీసుల సహాయంతో, 911 అంబులెన్సులో (108 అంబులెన్సు లాంటిది) ఆసుపత్రిలో చేరింది. భారతదేశం నుంచి బంధువుల తోడ్పాటుతో కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా చేరిన ఆమె వీసా కాలపరిమితి తీరింది. అమెరికన్ పౌరురాలు కాకపోయినా, వీసా లేకపోయినా, ప్రమాద బారిన పడిన ఆమెకు అత్యవసర వైద్య సహాయం అందించడంలో, స్థానిక ఆసుపత్రి వైద్యులు ఏ మాత్రం ఆలశ్యం చేయలేదు. ఆ తర్వాత, ఆమె మరికొంతకాలం ఆసుపత్రిలోనే చికిత్స పొందాల్సిన అవసరం వుండడంతో, ఆమె ఎవరి తాలూకు మనిషని ఆసుపత్రి అధికారులు విచారణ చేశారు. ఎవరూ లేరని తేలడంతో, తదుపరి చికిత్స కూడా ఉచితంగానే చేశారు. డిశ్చార్జ్ చేయాల్సిన సమయంలో కూడా ఆమెకు దగ్గరి వారు ఎవరూ లేరని తేలడంతో, ఆమె బాధ్యతను, అలాంటివారికి సహాయపడే స్వచ్చంద సేవకులకు అప్ప చెప్పారు. ఇలాంటిది మన దేశంలో జరుగుతే ఏమైతుందనేది ఊహించడం కష్టమే. 108 అంబులెన్సు అత్యవసర సహాయ సేవలు ఆరంభమైన తర్వాత, కొంతలో కొంత మెరుగ్గా, అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి మాత్రం, ఆ అంబులెన్సుల ద్వారా ఆసుపత్రికి చేర్చిన ఇరవై నాలుగు గంటల వరకు, ప్రభుత్వ-ప్రయివేట్ ఆసుపత్రులు ఉచితంగా చికిత్స చేయడం జరుగుతున్నప్పటికీ, అన్ని సందర్భాల్లో ఇది జరగడంలేదనేది వాస్తవం. "చికిత్సా నిరాకరణ"-అందునా అత్యవసర పరిస్థితుల్లో నిరాకరించడం శిక్షార్హం కానంతవరకు రోగులకు వైద్య సదుపాయం లభించక పోవడం లాంటివి జరుగుతూనే వుంటాయి.

గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సౌకర్యాలున్న ఆసుపత్రులు అతి తక్కువ. డాక్టర్ల కొరతా ఉంది. వైద్యులున్న ఆసుపత్రులలో, చికిత్స నిరాకరించడం అలా వుంచితే, చికిత్సను అందించలేని పరిస్తితులుండే అవకాశాలే ఎక్కువ. ఇక నగరాల-పట్టణాల విషయానికొస్తే, ఆసుపత్రులున్నా, వైద్యులున్నా, ధనికుల విషయంలో ఇబ్బందులు లేకపోయినా, మధ్య తరగతి వారికి కోరుకున్న రీతిలో వైద్యం లభించడం కష్టమే. కొన్ని లొసుగులున్నప్పటికీ, ఆరోగ్య శ్రీ పధకం పేద వారికి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తేగలిగిందనడంలో సందేహం లేదు. సాధారణ పరిస్థితుల సంగతి ఇదైతే, అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలను కాపాడడానికి సమగ్రమైన చట్టం లేకపోవడం మూలాన, ధనికుల విషయం ఎలా వున్నా పేద-మధ్య తరగతి వారికి మాత్రం అటు గ్రామీణ ప్రాంతాలలోను, ఇటు పట్టణ ప్రాంతాలలోను సరైన సమయంలో సరైన వైద్యం అందక పోవడం, అకాల మరణాలు సంభవించడం అందరికీ తెలిసిందే. "లాభాపేక్ష రహిత ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం" కింద, 108 అత్యవసర సహాయ సేవల ద్వారా, మారుమూల ప్రాంతాలలో ఆపదకు గురైన వారిని, అతి తక్కువ వ్యవధిలో, సమీప ఆసుపత్రికి, చేయదగినంత మేరకు అత్యవసర చికిత్స చేసుకుంటూ, చేర్చే వీలున్నప్పటికీ, చేరిన తర్వాత అదే మోతాదులో చికిత్స అందే అవకాశాలు అంతగా లేవు. నూటికి తొంభై ఆసుపత్రులలో, కనీస అత్యవసర వైద్య సౌకర్యాలు అంతగా లేవు. దానికి తోడు, కారణాలు ఏవైనా, చికిత్సను నిరాకరించే పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే వున్నాయి.

ఈ నేపధ్యంలో, ప్రమాదాల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో వున్న వారితో సహా, వివిధ రకాల ఆరోగ్య రుగ్మతల వల్ల, క్రమేపీ ఆరోగ్యం క్షీణించి, పరిస్థితి ప్రమాద స్థాయికి చేరుకున్న వారికి కూడా, అత్యవసర వైద్య సహాయం-అత్యవసరంగా-సకాలంలో లభించేందుకు, "చికిత్సా నిరాకరణ" ను అడ్డుకునేందుకు,రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న వైద్య విధానాన్ని అమల్లోకి తేవాలను కోవడం అభినందించాల్సిన విషయమే. ఈ ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చేందుకు, రాష్ట్రవ్యాప్తంగా, సుమారు రెండువందల ప్రభుత్వ-ప్రయివేటు ఆసుపత్రులను తొలిదశలో ఎంపిక చేయనున్నది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల, ప్రాణాపాయ స్థితిలో వుండి, అకాల మరణం పాల్పడే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు మెరుగవుతాయి. ప్రస్తుతానికి రెండువందల ఆసుపత్రులకే పరిమితం కానున్న ప్రభుత్వ నిర్ణయం దరిమిలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు విస్తరించడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో చికిత్సా నిరాకరణ నేరంగా పరిగణించే ఆలోచన చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి.

అయిదారు సంవత్సరాల కింద రాష్ట్ర రాజధాని-వందల సంఖ్యలో చిన్నా-పెద్దా ప్రభుత్వ-ప్రయివేటు ఆసుపత్రులున్న హైదరాబాద్‍ నగరంలో కుక్క కాటుకు బలైన పసికందు ప్రాణాలను కాపాడేందుకు తల్లిదండ్రులు చేసిన విశ్వ ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా డబ్బులివ్వందే చికిత్స చేయలేమన్నారు. చివరకు చనిపోయిన బాలుడి శవానికి కప్పేందుకు గుడ్డనివ్వడానికికూడా డబ్బులడిగారు ఒక ప్రభుత్వాసుపత్రిలో. మర్నాడు మీడియా ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించింది. అదేదో రాజధానిలో జరిగింది కనుక పది మందికి తెలిసింది. తెలియనివెన్నో! ప్రభుత్వాసుపత్రి అయినా, ప్రైవేట్‍దైనా, ప్రభుత్వ డాక్టరైనా, క్లినిక్ నడిపే డాక్టరైనా ప్రాణాపాయంలో ఉన్న పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వలేదన్న సాకుతో వైద్యం అందించకుండా ఉండవచ్చా?

ప్రభుత్వం ప్రకటించనున్న అత్యవసర వైద్య విధానం కార్యరూపం దాలిస్తే, ప్రాణాపాయ స్థితిలో వచ్చిన బాధితులు డబ్బులు చెల్లించ లేకపోయినా, వైద్య సేవలు అందించలేమని చెప్పి వెనక్కు పంపడానికి వీలు లేదు. వాస్తవానికి, సుమారు రెండు దశాబ్దాల కిందటే భారత దేశ అత్యున్నత న్యాయస్థానం, జాతీయ వినియోగదారుల ఫోరం, వివిధ సందర్భాల్లో తీర్పునిస్తూ, ప్రమాదాల బారిన పడినప్పుడే కాక, మరే ఇతర అత్యవసర వైద్య సహాయం అవసరమైనా, రోగిని తీసుకెళ్లిన చోట, చికిత్స చేయకుండా నిరాకరించడం తప్పని పేర్కొన్నాయి. ఇలాంటి సందర్భాల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం మన దేశానికే పరిమితమై లేదు. ఇటువంటివి మళ్లీ జరగ కుండా నిరోధించాలనే ఆలోచనతో కేంద్రప్రభుత్వానికి చెందిన లా కమిషన్ తనంతట తాను చొరవ తీసుకొని, ఐదారేళ్ల కింద, ఒక నమూనా చట్టాన్ని రూపొందించి, దానిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి అభిప్రాయాలడిగింది. అయినప్పటికీ, ఆ నమూనా చట్టం కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు. లా కమిషన్ నివేదిక-నమూనా చట్టంలో, మెడికో లీగల్ కేసు అనే నెపంతోనో, డబ్బిలివ్వలేదనే కారణానో, భీమా లేదన్న సాకుతోనో, మరేదైనా మిషతోనో వైద్య సహాయాన్ని నిరాకరించడానికి వీల్లేని విధంగా చట్టం రూపొంచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సందర్భాల్లో చికిత్సకైన ఖర్చును ఆ తర్వాత, వైద్య సహాయం అందించిన ఆసుపత్రికి గాని, ప్రైవేట్‍ డాక్టర్‍కుగాని చెల్లించే ఏర్పాటు చేయాలి. ఈ ఖర్చును భరించడానికి ఒక పధకాన్ని రూపొందించాలని, ఆసుపత్రికి చేర్చిన అంబులెన్స్ ఖర్చుకూడా ప్రభుత్వమే భరించే ఏర్పాటు చేయాలని లా కమిషన్ నివేదికలో ఉంది. వైద్య రంగం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కనుక, చట్టం తేవడానికి తోడ్పడేందుకు లా కమిషన్ ఈ విధంగా నమూనా బిల్లును తయారుచేసి ఉండవచ్చు.

లా కమిషన్ తయారు చేసి రాష్ట్రప్రభుత్వాల అభిప్రాయం కోసం పంపిన నివేదికలో పలు ఆసక్తి కరమైన విషయాలను పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా, అత్యవసర వైద్య సహాయం అవసరమైన సందర్భాల్లో విధిగా గుర్తుంచు కోవలసిన "బంగారు ఘడియ" ను (గోల్డెన్‌ అవర్ కాన్సెప్ట్) గురించి విడమర్చి చెప్పింది. ఎమర్జెన్సీ కేసుల్లో రోగిని, ప్రమాదాన్ని గుర్తించిన గంట లోపు సమీప ఆసుపత్రికి చేర్చగలిగితే, చేర్చి నిలకడ స్థితిని సాధించ గలిగితే బతికే అవకాశాలు ఎనభై శాతం ఎక్కువగా ఉంటాయని చెప్పే సిద్ధాంతమే " గోల్డెన్‌ అవర్ కాన్సెఫ్ట్". అలాగే ప్రభుత్వ డాక్టరైనా, ప్రైవేట్ డాక్టరైనా, వృత్తి రీత్యా సంక్రమించిన బాధ్యత నుంచి తప్పుకునేందుకు వీలు లేదు. ఈ "ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్" ను చట్టం కాదన లేదని సుప్రీంకోర్టు కూడా పేర్కొంది. అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చిన రోగికి చికిత్స చేసే విషయంలో మెడికో లీగల్ నిబంధనను పక్కన పెట్టినప్పటికీ, వైద్య సహాయమందించిన డాక్టర్‌ను న్యాయవాదులు కోర్టుల చుట్టూ తిప్పటం సరైనది కాదని కూడా నివేదికలో ఉంది. దీనిని అనవసర వేధింపుల కింద పరిగణించాలని సూచించారు. పోలీస్ లాంఛనాలు పాటించకుండా, డాక్టర్లు బాధ్యతతో రోగి ప్రాణం కాపాడేందుకు అధిక ప్రాధాన్యమిస్తే, దానిని తప్పుగా పరిగణించకుండా ఉండేలా నమూనా చట్టాన్ని రూపొందించారు. ఇటువంటి సందర్భాల్లో అవసరమైనప్పుడు, వ్యక్తిగతంగా కోర్టుకు వచ్చి, సాక్ష్యం ఇచ్చే అవసరం లేకుండా డైరీ ఆధారంగా విచారణ జరిగితే చాలన్న నిబంధనను నమూనా చట్టంలో చేర్చారు.

అమెరికా వంటి దేశాల్లో ఒకప్పుడు ఇదే పరిస్థితి ఉండడంతో, 1986లో అక్కడ చట్టాన్ని తెచ్చి, డాక్టర్లు, ఆసుపత్రులు, వైద్య సహాయం నివారించే వీలు లేకుండా కట్టడి చేయడం జరిగింది. మన దేశంలో కూడా అత్యున్నత న్యాయస్థానం దాదాపు అదే సమయంలో ఈ విషయంలో ఇచ్చిన తీర్పులో, సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడమే ధ్యేయంగా భారత రాజ్యాంగం రూపొందించినప్పుడు, ప్రజల సంక్షేమ దిశగా సేవలందించడమే ప్రభుత్వాల కనీస కర్తవ్యమని పేర్కొంది. అవసరమైన ఆరోగ్య-వైద్య సౌకర్యాలను అందించవలసిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అందుకే ప్రభుత్వం ఆసుపత్రులను, ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ప్రతి పౌరుడి ప్రాణం-స్వేచ్ఛ కాపాడ వలసిన బాధ్యత ప్రభుత్వానిదైనప్పటికీ, సుప్రీం కోర్టు ఆమేరకు తీర్పు ఇచ్చినప్పటికీ, సరైన సమయంలో తగిన వైద్య సహాయం అందక ఎన్నో ప్రాణాలు పోతున్నాయి. కుక్క కాటుకు బాలుడు మరణించడం లాంటివి ఈ వాస్తవాలను మళ్లీ-మళ్లీ బయట పెట్టినట్లయింది. ఆసుపత్రులకు వెళ్లే రోగుల్లో, ఫీజులిచ్చుకొనేవారూ, ఇవ్వలేని వారూ ఉంటారు. ఇచ్చే స్తోమతలేని వారిని "వినియోగదారులు" గా వర్ణించింది సుప్రీం కోర్టు. అంతేకాక, ఫీజులు చెల్లించే వారి డబ్బులోనే చెల్లించ లేనివారి డబ్బుకూడా ఉంటుందని చక్కటి భాష్యం చెప్పింది.

ప్రమాద పరిస్థితిలో వచ్చిన రోగికి చికిత్స అందే విధంగా చట్ట పరమైన రక్షణ కల్పించాలని, వచ్చిన రోగికి ప్రాధమిక చికిత్స చేసి, అవసరమైన పరీక్షలు నిర్వహించి, ఆసుపత్రిలో-క్లినిక్‌లో చేయదగినంత చికిత్స చేయాలని, స్థోమతలేని వారి చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరించాలని, తమకు వీలు కాని పరిస్థితిలో చావు బతుకుల్లో ఉన్న రోగులను డాక్టర్ లేదా ఆసుపత్రి యాజమాన్యమే మరో ఆసుపత్రికి తరలించాలని, స్క్రీనింగ్ పరీక్షల వంటివి చేయడం చేత కాకపోతే అవి లభ్యమయ్యే వేరే చోటికి పంపే ఏర్పాటు కూడా చేయాలని లా కమిషన్ సూచనలు చేసింది. రోగికి నిలకడ పరిస్థితి కల్పించాలని, అది తమకు చేత కాకపోతే మరొక చోటికి పంపడానికి నిరాకరించిన ఆసుపత్రి లేదా క్లినిక్ లేదా డాక్టర్ ఆ వృత్తిలో కొనసాగే వీలు లేకుండా నిబంధనలుండాలని సూచించింది. రోగిని తరలించడానికి రమ్మని కోరితే, అంబులెన్సుల నిర్వాహకులు నిరాకరించ రాదన్న సూచన కూడా ఉంది. అంబులెన్స్ లేక పోతే పోలీస్ సహాయం తీసుకొని వాహనం ఏర్పాటుచేయాలి. రోగిని తరలించే సందర్భంలో ప్రమాదం జరగకుండా అన్ని జాగ్రత్తలూ తరలిస్తున్న డాక్టర్ కాని, ఆసుపత్రి వారు కాని తీసుకోవాలి. రోగికి సంబంధించిన రికార్డులన్నీ వెంట పంపాలి. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులను ప్రభుత్వాలు సమకూర్చడానికి సరైన పధకం రూపొందించాలని కూడా లా కమిషన్ సిఫార్సు చేసింది.

లా కమీషన్ అల నాడు సూచించిన నమూనా చట్టం బహుశా ఏ రాష్ట్రంలో కూడా అమల్లోకి వచ్చినట్లు లేదు. నిజంగా ఇవన్నీ జరిగితే ఇంతకన్నా కావలసిందేముంది? ప్రమాదకర పరిస్థితుల్లో అన్నింటికంటే ముఖ్యం సమీప ఆసుపత్రికి తరలించడం. తరలించే ముందు ప్రాధమిక చికిత్స అందించడం, తరలిస్తున్న రోగిని కనీస సౌకర్యాలున్న సమీప ఆసుపత్రికి చేర్పించడం, ఆ తర్వాతే చికిత్స గురించి ఆలోచించడం. ఇవన్నీ కొంచెమైనా జరగాలంటే మొదటగా కావలసింది కనీస సౌకర్యాలున్న అంబులెన్స్, అందులో ప్రాధమిక చికిత్స చేయగలిగిన సుశిక్షుతులైన పారామెడిక్ సిబ్బంది, అవి నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్త (దేశవ్యాప్త) నెట్‌వర్క్, సాంకేతిక సదుపాయం, నిబద్ధతతో పనిచేసే వ్యక్తులు. ఆ తర్వాత కావలసింది ప్రతి 15-20 కిలోమీటర్లకు కనీస వసతులున్న ఆరోగ్య కేంద్రాలు, వాటిలో డాక్టర్లు, ఇతర సిబ్బంది. ఆ తర్వాతే చికిత్స విషయం. వాటిల్లో ఎక్కడ ఏ మాత్రం లోపం జరిగినా, ఒకరి నొకరు నిందించు కోవడం తప్ప, ఆశించిన ఫలితం ఉండదు. ఆసుపత్రులున్నా డాక్టర్లు ఉండరు. డాక్టర్లున్నా పరికరాలుండవు. పరికరాలున్నా ఉపయోగించగలిగే నైపుణ్యమున్న సహాయ సిబ్బంది ఉండరు. చట్టంలో ఇవన్నీ స్పష్టంగా పేర్కొంటే మళ్లీ మళ్లీ దీని గురించి, ఆలోచన చేయవలసిన అవసరం ఉండదు. వీటిలో అంబులెన్సుల విషయానికొస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో "ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థ" గత ఆరు సంవత్సరాలుగా ఏడెనిమిది వందలకు పైగా 108 అత్యవసర సహాయ సేవలు అందిస్తున్నది. రాష్ట్రప్రభుత్వం, జాతీయ ఆరోగ్య మిషన్ పధకం కింద, ఈ అత్యవసర వైద్యసహాయసేవలు అందించడానికి, అవసరమైన నిధులను సమకూరుస్తున్నది. అంతవరకు బాగానే వుంది కాని, ప్రాణాపాయ స్థితిలో వున్న రోగులకు, ప్రాధమిక అత్యవసర సహాయ సేవలు అందిస్తూ, "108 అంబులెన్సులు" ఆసుపత్రికి చేర్చిన తర్వాత, అదే మోతాదులో, నాణ్యమైన "ఇన్ పేషంటు" అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అన్నీ అవరోధాలే. చాలా ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలు కరవైతే, ప్రయివేట్ ఆసుపత్రులలో ఇరవై నాలుగు గంటల తర్వాత రోగులు చికిత్స కయ్యే వ్యయాన్ని భరించాలి.

ప్రభుత్వం ప్రకటించనున్న నూతన అత్యవసర వైద్య విధానం కేవలం రెండు వందల ఆసుపత్రులకే పరిమితం చేయకుండా, గతంలో లా కమీషన్ సూచించిన నమూనా చట్టాన్ని ఆధారంగా చేసుకుని, మరింత మెరుగుగా అత్యవసర పరిస్థితుల్లో రోగి ప్రాణాలను కాపాడడానికి వీలయ్యే సమగ్రమైన చట్టం తీసుకు రావాలి. అప్పుడే రోగికి సరైన రక్షణ కలిగించినట్లవుతుంది. అన్ని సౌకర్యాలను కల్పిస్తే చికిత్స నిరాకరించినవారిని ప్రశ్నించే హక్కు పౌరుడికి ఉంటుంది. ప్రతి ఆసుపత్రిలోను, కనీస అత్యవసర వైద్య సౌకర్యం లభించే విధంగా, ప్రత్యేకంగా "ఎమర్జెన్సీ గదులను" రూపొందించాలి. 108 అత్యవసర సహాయ సేవలు అందిస్తున్న ఇ.ఎం.ఆర్.ఐ వైద్య బృందం, ప్రతి చిన్నా-పెద్దా ఆసుపత్రులలో, ఎమర్జెన్సీ గదులను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన బ్లూ ప్రింటును ఏనాడో తయారు చేసింది. దాని ఆధారంగా, అతి తక్కువ వ్యయంతో, వీలై నన్ని ఆసుపత్రులలో ఎమర్జెన్సీ చికిత్సను తక్షణం అందుబాటులోకి తెచ్చే చర్యలు చేపట్టి తే బాగుంటుంది. భారత దేశంలో, ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఒక మెడికల్ డాక్టర్ వున్నందున, అతి త్వరలో ఈ దిశగా ప్రభుత్వం ఒక కార్యాచరణ పథకం తయారు చేస్తుందని ఆశించవచ్చు. End

No comments:

Post a Comment