Thursday, August 4, 2011

రాజ్యాంగ వ్యవస్థలు X హజారే !: వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దిన పత్రిక (05-08-2011)

ప్రశ్నించ తగని పార్లమెంట్‌ సార్వభౌమత్వం; తొందరపడుతున్న అన్నా హజారే బృందం; పార్లమెంట్‌ను ఆదేశిస్తారా?; కార్యనిర్వాహణ, న్యాయ వ్యవస్థల ఆధిక్యత?; అన్నా ఆమరణ నిరాహార దీక్షకు దిగడం సబబేనా?

ప్రజాస్వామ్య విధానంలో-అందునా పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో, రాజ్యాంగాన్ని తుచ తప్పకుండా పాటించాలంటే, భూతకాలంలో జరిగిన దానికీ-వర్తమానంలో జరుగుతున్న దానికీ-భవిష్యత్ లో జరగబోయే దానికీ, కర్త-కర్మ-క్రియ కేవలం చట్ట సభలు మాత్రమే. ఏ రకమైన చట్టాన్ని, ఎప్పుడు-ఎలా-ఎందుకు రూప కల్పన చేయాలో-చేసిన దానిని రాజ్యాంగ ప్రకరణాలకు-పార్లమెంటరీ విధానాలకు అనుగుణంగా ఆమోదింపచేసుకోవాలో, చేయడం వల్ల తలెత్తే పర్యవసానం ఎలా అధిగమించాలన్న విషయాలను నిర్ణయించే అధికారం చట్ట సభలకే వుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభాలైన కార్య నిర్వాహక వ్యవస్థ-శాసన ప్రక్రియ వ్యవస్థ-న్యాయ వ్యవస్థలు, వాటి-వాటి పరిధుల్లో తిరుగులేని అధికారాలను కలిగి వుండడం వల్ల, ఒక దాని అధికారం మరో దాన్ని కబళించలేని విధంగా-అధిగమించలేని పద్ధతిలో, "అదుపులు-అన్వయాలు" ఆ అధికారాలను పరిమితం చేస్తుంటాయి. అనంత కోటి బ్రహ్మాండానికి "పర బ్రహ్మం" ఒక్కరే అని మన నమ్మకం. అలానే, పార్లమెంటుకున్న తిరుగు లేని అధికారంతో, దాని ద్వారా-రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడిన ఒక "కార్య నిర్వహణ అధికారి" (ప్రధాన మంత్రి), పరోక్షంగా పార్లమెంటులో అంతర్భాగమైన రాష్ట్ర పతి నియమ-నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడిన అత్యున్నత న్యాయ వ్యవస్థ, పార్లమెంటు (రాజ్యాంగ సభ) సూత్రాలకు అనువుగా వుండే శాసన ప్రక్రియ, తమ విధులను చట్ట సభల అధికారానికి లోబడే పని చేస్తాయి. అలాంటప్పుడు పార్లమెంటు తన హక్కుగా-బాధ్యతగా పారదర్శకతతో చేయాల్సిన విధిని, అదేదో తమ పనిగా, ఎవరో కొందరు-ఏ కారణంతోనైనా, తమపైన వేసుకోవడం, పార్లమెంటును-కార్య నిర్వహణ వ్యవస్థను ఒత్తిడికి గురిచేయడం పార్లమెంటరీ సిద్ధాంతాలకు విరుద్ధం మాత్రమే కాకుండా ప్రజాస్వామికం కాదు కూడా.

చారిత్రాత్మక లోక్ బాల్ నమూనా బిల్లు రూపొందించే ప్రక్రియలో, ప్రభుత్వాన్ని-మంత్రి మండలిని ఆమోదించే క్రమంలో, క్రియాశీలక పాత్ర వహించిన గాంధేయ వాది అన్న హజారేను-ఆయన పౌర సమాజ బృందాన్ని ప్రతి భారతీయ పౌరుడు మనఃపూర్వకంగా అభినందించాల్సిందే! అంత మాత్రాన, వారెంత మహనీయులైనా, భారత పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని-తద్వారా కొనసాగాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియను కించపరిచే దిశగా అడుగులు వేయబూనుకోవడం సరైందికాదు. రాజ్యాంగ పరంగా సంక్రమించిన శాసన నిర్మాణ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన పార్లమెంటు అధికారం తిరుగులేనిదే! వాస్తవానికి ముసాయిదా లోక్ బాల్ బిల్లులో, జన లోక్ పాల్ సూచించిన అంశాలు చాలావరకు పొందుపరిచింది ప్రభుత్వం. ఒక విధంగా చెప్పుకోవాలంటే, ఎట్టకేలకు బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్తున్నందుకు- ప్రధాని మన్మోహన్ సింగ్ ను, ఆయన మంత్రి మండలిని అభినందించాల్సిన హజారే-ఆయన పౌర సమాజ బృందం, దానికి బదులుగా, పార్లమెంటు ఆమోదించనున్న ఆ చట్టాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించనున్నదని ముందే జోస్యం చెప్పడం దురదృష్టకరం. చట్టం రూపొందించే హక్కును ఎలాగైతే ఏ రాజ్యాంగం పార్లమెంటుకు ప్రసాదించిందో, అదే రాజ్యాంగం ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు తిరస్కరించే అధికారం కూడా ఇచ్చింది కదా! అంతవరకు వేచి మాట్లాడాల్సిన హజారే "తొందరపడి ముందే కూసిన కోయిల" వలె మాట్లాడడం అన్యాయం.

పార్లమెంటరీ ప్రజాస్వామ్య సిద్ధాంతాల ప్రకారం, అదుపులు అన్వయాలకు లోబడి, కార్య నిర్వహణ అధికారి (ప్రధాన మంత్రి) మంత్రి మండలి సమష్ఠి బాధ్యతకు అనుగుణంగా, చట్టాల (రూప కల్పనను) ప్రతిపాదించు తారు. అలా తయారు చేసిన ప్రతిపాదన బిల్లు రూపంలో పార్లమెంటు ఉభయ సభలలో ప్రవేశ పెట్టి-చర్చించిన తర్వాత, (సవరణలతో)ఆమోదించడమో-తిరస్కరించడమో జరగడం ఆనవాయితీ. "లాబీ వర్గాల" కు (పౌర సమాజం వారితో సహా) పార్లమెంటే తరులకు, లాంఛనంగా-చట్ట పరంగా, ఆ ప్రక్రియలో ముందుగా పాల్గొనే వీలు రాజ్యాంగం కలిగించలేదు. కాకపోతే, వారి పలుకుబడి-ప్రభావం చూపించి, ప్రభుత్వం మీద-పార్లమెంటు సభ్యుల మీద కొంత ఒత్తిడి తెచ్చే అవకాశం లేక పోలేదు. అది హక్కు ఎంత మాత్రం కానేకాదు. ప్రతిపక్షాలను కూడా అవసరమనుకుంటేనే ప్రభుత్వం సంప్రదిస్తుంది కాని, ఉపేక్షించితే తప్పు పట్టాల్సిన పని లేదు. ఏ పార్టీ అధికారంలో వున్నా ఇలానే జరుగుతుంది.

అన్నా హజారే-ఆయన పౌర సమాజం చెప్పిందల్లా చేస్తే, ఇక పార్లమెంటుకు-ప్రధానికి ఏదన్నా పాత్ర వుందనుకోవాలా? లేదా? పౌర సమాజానికి చెందిన కొందరు స్వయం ప్రకటిత నేతల ఒత్తిళ్లకు లొంగి, చట్టాల రూపకల్పనకు సంబంధించి పూర్తి అధికారాలను కలిగున్న పార్లమెంటు పరిధి నుంచి ఆ అధికారాలను పార్లమెంటే తర శక్తులకు బదిలీ చేస్తే ప్రజాస్వామ్యం ఏం కావాలి? చట్టాలను చేసే నిర్ణయాధికారం-సార్వభౌమాధికారం, నూటికి నూరుపాళ్లు పార్లమెంటు దే అయినా, భారత పార్లమెంటుకు రాజ్యాంగ పరంగా సంక్రమించిన తన అధికారాలను కార్య నిర్వహణ సంస్థ చేతుల్లో పెట్టిందన్న అపవాదు ఇటీవల కాలంలో తలెత్తడంతో, పరోక్షంగా అది తన ఉనికిని కోల్పోతోంది. ఎన్నికల ద్వారా రాకుండా బాధ్యతాయుతమైన విధులు నిర్వహించే కొన్ని రాజ్యాంగ వ్యవస్థలకు (భవిష్యత్ లో లోక్ పాల్ లాగా) బదలాయించిన అధికారాలపై కూడా పార్లమెంటు పర్యవేక్షణ బలహీనంగా వుంది. కార్య నిర్వహణ వ్యవస్థ పార్లమెంటును శాసిస్తున్నదా అన్న అనుమానం కలుగుతోంది. న్యాయ వ్యవస్థ కూడా పార్లమెంటును ఆదేశించే సందర్భాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. శాసన సంబంధమైన ప్రక్రియలో జాప్యం, చట్టం స్థానంలో తరచుగా "ఆర్డినెన్సుల" ను తేవడం ద్వారా (గుడ్డిలో మెల్లగా లోక్ పాల్ ఆర్డినెన్సు తేవాలని హజారే పట్టు బట్టలేదు!) కార్య నిర్వహణ వ్యవస్థకు (ప్రధాన మంత్రికి) తన అధికారాలను కట్టబెడుతూ పోవడం, భారత పార్లమెంటుకున్న అతి పెద్ద బలహీనత. ఎగ్జిక్యూటివ్ అధికారాలను సమీక్షించే విషయంలో పార్లమెంటు నిష్ఫలత స్పష్టంగా కనిపిస్తోంది. పెరుగుతున్న సామాజిక అవసరాలకు-ఆధునిక పార్లమెంటరీ పద్ధతులకు అనుగుణంగా వ్యవహరించగల సామర్థ్యం-అభిరుచి చాలామంది పార్లమెంటు సభ్యులలో అంతగా లేదు. రాజకీయ పార్టీలు సంస్థాగతంగా పటిష్ఠంగా వ్యవహరించలేక పోతున్నాయి.

పార్లమెంటు నిర్వర్తించాల్సిన విధులను, దానంతటదే పరిత్యజించడం ఆశ్చర్యకరమైన అంశం. పార్లమెంటు సభ్యులు, సరైన కారణాలు లేకపోయినా, చట్ట సభలో అవరోధాలు కలిగించి శాసన ప్రక్రియను ఆలశ్యం చేస్తున్నారు. తమ ఓటు హక్కు ద్వారా గెలిపించిన ప్రజా ప్రతినిధులుండే చట్ట సభల (పార్లమెంట్-శాసన సభలు) పని తీరు అసంతృప్తికి గురి చేస్తున్నాయన్న భావన కలుగుతోంది పౌరులకు. భారత దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో చోటుచేసుకుంటున్న వైఫల్యాలకు-సాఫల్యాలకు, పార్లమెంటు బాధ్యత వహించక తప్పదు. తప్పైనా-ఒప్పైనా, అర్హతల-యోగ్యతల దృష్ట్యా కాని, నిబద్ధత దృష్ట్యా కాని, పార్లమెంటేరియన్ పనిలో నాణ్యత క్షీణిస్తున్నదనే అభిప్రాయం కూడా కలుగుతోంది. పార్లమెంటు సభ్యులలో చాలా మంది విద్యార్హతలు ఉన్నత స్థాయిలో వున్నప్పటికీ, ఎన్నికైన వారిలో గణనీయమైన సంఖ్యలో, నేరచరిత్ర కలిగినవారు కూడా వుండడంతో, దాని ప్రభావం పార్లమెంటు పనితీరుపై పడుతోంది.

పార్లమెంటులో శాసన నిర్మాణానికి అంచలంచల ప్రక్రియ వుంది. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత, ముసాయిదాను చర్చకొరకు పరిశీలించేందుకు తక్షణమే ఓటింగు పెట్టవచ్చు. లేదా, ప్రవేశపెట్టిన సభా సభ్యుల సెలెక్ట్ కమిటీకి కాని, ఉభయ సభల సంయుక్త సెలెక్ట్ కమిటీకి కాని పంపవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణకొరకు కూడా పంపవచ్చు. కాకపోతే ఈ ప్రక్రియ అరుదుగా జరుగుతుంటుంది. లోక్ పాల్ బిల్లు విషయంలో, ఈ ప్రక్రియకు అవకాశం వుండొచ్చేమో! సింహభాగం బిల్లులను సెలెక్టు కమిటీలకే పంపి తాత్కాలికంగా చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం. క్లాజు వారీగా బిల్లుపై చర్చ, సవరణల పరిశీలన, సవరణలకు మంత్రివర్గం ఆమోదం-తిరస్కారం, తర్వాత ఓటింగు జరుగుతుంది. సంబంధిత సభలో నెగ్గిన తర్వాత, మరో సభకు పంపి ఇదే ప్రక్రియను అనుసరిస్తారు. ఉభయ సభలలో ఓటింగు తర్వాత, రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపడం జరుగుతుంది. ఆమోదం పొందినంత మాత్రాన యాంత్రికంగా-స్వయం చలనంగా చట్టం కాదు. చాలా సందర్భాలలో (కావాలనే?) మరిచి పోవడంతో, రాజ్యాంగపరంగా జారీ చేయాల్సిన గెజెట్ నోటిఫికేషన్ ఆలశ్యం కావడం, చట్టం కాగితాలకే పరిమితమై పోవడం జరుగుతుంటుంది.

ప్రధాని మన్మోహన్ సింగ్, సుమారు నాలుగున్నర దశాబ్దాల తర్వాత, చొరవ తీసుకుని (పోనీ హజారే చొరవ వల్ల అనుకుందాం), లోక్ బాల్ బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకొచ్చారు. స్వయంగా ప్రధానిని కూడా లోక్ పాల్ పరిధిలో చేర్చమని ఆయనే కోరారు. చివరకు కమిటీ సభ్యుల సూచనను అంగీకరించారు. బహుశా అత్యున్నత స్థాయి కార్య నిర్వహణ అధికారిని (ప్రధాని), అత్యున్నత న్యాయ వ్యవస్థను, పార్లమెంటులో సభ్యుల పనితీరును, లోక్ పాల్ పరిధిలో తీసుకురాక పోవడం సమంజసమే మో! అదుపులు-అన్వయాలకు బాధ్యత వహించాల్సిన ఈ మూడు వ్యవస్థలను ఆ స్థాయిలో గౌరవించాల్సిన అవసరం వుందనాలి. లోక్ బాల్ సభ్యులుగా నియామకం కాబోయే తొమ్మిది మంది సభ్యులలో భవిష్యత్ లో ఏ నాడూ-ఎవరూ-ఎలాంటి పరిస్థితుల్లోను, ఇతర ఉన్నత స్థాయి-మధ్య స్థాయి-కింది స్థాయి వ్యక్తుల లాగా, ఏ బలహీనతలకు లోను కారన్న నమ్మకం వుందా? అలాంటి వారే ప్రధాని కూడా అని, న్యాయ మూర్తులని భావించడం మంచిదే మో!

పార్లమెంటు సార్వభౌమాధికారాన్ని-దాని శాసన నిర్మాణ కర్తవ్యాన్ని-ఆ కర్తవ్యంలో పాలు పంచుకుంటున్న గౌరవ సభ్యులను-కార్య నిర్వహణ అధికారి ప్రధానిని కాదని, ఆ మరణ నిరాహార దీక్షకు దిగడం ఎంతవరకు సబబు?

4 comments:

  1. Very well written. Super analysis sir. This line of thought is very important and much needed at this point of time.

    హజారే ఉద్యమంగానీ కార్యక్రమాలు గానీ అవినీతికి వ్యతిరేకంగా ప్రజల అవగాహనని పెంచడానికీ ప్రజలని చైతన్య పరచడానికి దారితీయడం సంతోషకరమే. కానీ.. అవినీతి మీద ఉన్న వ్యతిరేకత వల్ల హజారేనో మరెవరో చెప్పేవి మాత్రమే ఆచరణీయమన్న బలహీనతకి లోనయ్యి జనాలు మొత్తం వ్యవస్థకే ప్రమాదకరమైన పరిస్థితులు తీసుకొస్తారనేదే ఆందోళన చెంద వలసిన విషయం.

    ఆమరణ దీక్ష చెయ్యడం మాత్రం సబబు కాదు అని చెప్పొచ్చు.

    I think the government should make an honest attempt to get the bill passed and to accommodate any worthy amendment proposed by the parliament. Its time for the executive and the legislature to stand up for themselves rather than bowing down to unreasonable mob pressure.

    ReplyDelete
  2. I made similar comments on Baba Ramdev's fast on to death, where in I also quoted how Anna Hazare's (fast on to death)Deeksha was also not in the spirit of democracy.

    It is one thing raising awareness on corruption and entirely different thing holding elected parliament at gun point. I totally support on first count but not on the later. People hate politicians so much, they are not realizing they are actually undermining the principles of democracy by blindly supporting such Deekshas.


    When I said all this not many liked it. (you can see comments herehttp://apmediakaburlu.blogspot.com/2011/06/blog-post.html--). They mistakenly thought I am siding with dirty politicians and ignoring the greatness of people of Anna's stature. Both are wrong.

    Your article is very apt.

    ReplyDelete
  3. Thank You for observations by Weekend Politician and Pavani. Jwala

    ReplyDelete
  4. ఫ్రెండ్స్ , మీరు చెప్పినది కరెక్ట్ కావచు కాని అది కేవలం ప్రబుత్వం మన (ప్రజల) మాటలకి విలువిచ్చి ప్రజల కొరకు పాటు పడే సమయం లో మాత్రమె.
    1) ప్రబుత్వం యొక్క బిల్ లో చుసినట్టైతే ఒక వేల ఎవరైనా ఇచ్చిన కంప్లైంట్ ఒక వేల తప్పైతే వారు అతనికి 6 నెలల నుండి 2 years వరకు శిక్ష వేయొచ్చు. అంటే దీని ప్రకారం మనం ఏదైనా కంప్లైంట్ చేయాలంటే ముందుగ మనం investigate చేసి ఆ పిన కంప్లైంట్ చేయాలన్న మాట. ఇటువంటి బిల్ ని ప్రబుత్వం అమలు చేయాలనీ అనుకుంటే దానికి అతను అలాగే ఈ ప్రజలు అందరు ఒప్పుకోమనడం ఎంత వరకు సమంజసం.
    2 ) మన జాతిపిత మహాత్మాగాంధి స్వాతంత్రం కోసం పోరాడడానికి ఇదే తరమైన ఉద్యమం చేస్తే తప్పు కకపొఇనప్పుదు, రాష్ట్ర స్థాపనకు పోరాడిన పొట్టి శ్రీరాములు గారి సిద్ధాంతం తప్పు మార్గం కానప్పుడు ఇలాంటి బ్రష్టుపట్టుక పాయిన సమాజాన్ని మార్చడానికి పాటుపడే అన్నా హజారే గారి ఉద్యమం కూడా ఎంతమాత్రం తాపు కాదన్నది నా అబిప్రాయం. ఒకవేళ రాజ్యాగం ప్రకారం ఇది తప్పు ఐతే ప్రబుత్వం తప్పు చేసిన్నప్పుడు వారి తప్పును తెలియచేయడానికి ఇల్లాంటి ఉద్యమాలు చేయడం తప్పు కాదని ఒక చట్టాన్ని తీసుకరావాలని నా అబిప్రాయం.
    3 ప్రజల కొరకు, ప్రజల కోసం, ప్రజల వలన అనే ఈ మాటలు మన రాజ్యంగం లోని మాటలే కదా, అలాంటప్పుడు ఆ ప్రబుత్వం తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు చేసేది తప్పు అని చూపించాల్సిన మార్గం భారత ప్రజలైన మన ఫై ఎంతైనా ఉంది. ఐతే అది చూపించడానికి ఇంట కంటే మంచి మార్గం ఇంకొకటి ఉందని నేను అనుకోవడం లేదు.
    4 ఎన్నాళ్ళ నుండో వేచి ఉన్న లోక్పాల్ బిల్ ని కనీసం పార్లమెంట్ లో ప్రవేశపెట్టినందుకు మనం ఆనందిన్చాలిసిన విషయం అని అన్నారు కదా.. ఆలాంటి Govt లోక్పాల్ బిల్ ని ప్రబుత్వం అమలుపరచాలని అనుకుంటే అటువంటి బిల్ ని అమలు పరచానీయకుండా ఒక ఉద్యమం చేయాల్సి వస్తుందేమో, అల ఉంది ప్రబుత్వం అమలు చేయాలనుకుంటున్న బిల్లు.

    మన రాజ్యాంగం రచించిన సమయం లో ఉన్న నాయకులు, ఇప్పుడు ఉన్న నాయకులకు చాల తేడా ఉంది. ఇలాంటి నాయకులు వస్తారని అంబేత్కర్ గారు ఊహించి ఉండరు అందుకే ఆ నాయకులకు చాలా అధికారాలని ఇచ్చారు.. ఇలాంటివి ఊహించి ఉంటె ఇప్పుడు అన్నా హజారే & టీం చెప్పిన విదంగా వారిని నియంత్రిచడానికి ఒక మంచి ఇండిపెండెంట్ సంస్థ ను వారే రుపొందిచేవారేమో. అది ఇప్పుడు అన్నా హజారే అండ్ టీం చేయాలనుకోవడం ఎంత మాత్రం తప్పు కాదేమో అన్నది నా అబిప్రాయం.

    5 ) ఒక ఉద్యోగి తన వయసు 60 సంవత్సరాలు వచ్చేవరకు తను ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ చేస్తే తనకి పెన్షన్ తీసేసింది ఈ ప్రబుత్వం. కాని అదే ఆ ప్రబుత్వ నాయకులకు (MLA 's ) కి మాత్రం పెన్షన్ కావాలి. ఒక ఉద్యోగ సంఘం వారు వాళ్ళ పని మానేసి ధర్నా చేసి ఎన్ని సార్లు అడిగిన వాళ్ళ salaries పెంచని ఈ ప్రబుత్వం వాళ్ళ salaries మాత్రం వాళ్ళకి నచినట్టుగా పెంచుకోవాచు.
    ఇటువంటి చట్టలెన్నో ఉన్న రాజ్యాంగంలో ఎన్నో వాటిని చంగె చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    From
    సంతోష్ కుమార్

    ReplyDelete