సూర్య దినపత్రిక (07-04-2012)
వనం జ్వాలా నరసింహారావు
మొత్తం మీద అంతా అనుకున్నట్లు గానే-అనుకున్న విధంగానే జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య తలెత్తిన వివాదాన్ని గులాం నబీ ఆజాద్ తనదైన “అధిష్టానం దూత” శైలిలో ప్రస్తుతానికి సమసిపోయేట్లు చేశారు. ఇకపై వారిద్దరిలో ఎవరు కూడా ఒకరికంటే మరొకరి అధికులు కారని, ఇద్దరూ ఆజాద్ కనుసన్నలలో పనిచేయాలని నిర్ణయం జరిగినట్లు మీడియా కధనాలొచ్చాయి. తగాదా లేకుండా కలిసిమెలిసి పనిచేయాల్సిన వారిద్దరూ, అనవసరంగా ఒకరితో మరొకరు తగవులా డి, తానెక్కువంటే తానే ఎక్కువని కయ్యానికి కాలుదువ్వి, చివరకు, ఇద్దరూ తక్కువనే రీతిలో ఆజాద్ కింద పనిచేయాల్సిన స్థితికి చేరుకున్నారు. రాజీ కుదిరించే మార్గంలో, ఆజాద్ పదే-పదే మేడం ప్రస్తావన తీసుకొచ్చారు. ఆమె గారు కిరణ్-బొత్సలపై కోపంగా వున్నారని కూడా చెప్పాడు. త్వరలో జరగబోయే ఉపఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి ధీటుగా పోటీ ఇవ్వకపోతే. వారిద్దరితో పాటు తానూ ఇంటిదారి పట్టాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. పనిలో పనిగా కిరణ్ కుమార్‌కు మరికొన్ని పాఠాలు కూడా చెప్పారట. అదే విధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పేర్ల జాబితా తయారుచేసి తన ఆమోదం కొరకు పంపాలని బొత్సకు సూచించారు. నామినేటెడ్ పదవుల పందేరాలు మొదలెట్టాలని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం విషయంలో ఉపముఖ్యమంత్రితో, బొత్సతో చర్చించాలని సీఎంను ఆదేశించారు. ఉపఎన్నికలలో విజయం సాధించడానికి, నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. అంటే, ఇక అంతా ఆజాద్ పాలనే కొనసాగనున్నదన్న మాట! ఏదేమైనా, తామంతా ఒకటే జట్టు అని, అంతా కలిసి కట్టుగా వుంటామని బొత్స-కిరణ్ ప్రకటించడం గమనించాల్సిన విషయం!
ఈ తతంగం నమ్మాలంటే, బొత్స-కిరణ్ "కలిసి పోయారని" భావించాలంటే, కనీసం ఒక్క సారన్నా, వారిద్దరూ ఢిల్లీకి "కలిసి పోవాలి". అదెలాగూ జరుగదు కనుక వీరిద్దరి మధ్య రాజీ తాత్కాలికమే! దానికి ఉదాహరణగా, ఏసిబి లో చోటుచేసుకుంటున్న పరిణామాలనే తీసుకోవాలి. బాధ్యతాయుతమైన పదవిలో వున్న ఒక ఏసిబి అధికారిని పదోన్నతిపై బదిలీ చేయడం, ఆయనను రిలీవ్ చేసేది లేనేలేదని ఆయన పై అధికారి అనడం, అవసరమైతే తానే శెలవుపై వెళ్తాననడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యంతో సర్దుమణిగినట్లే కనిపించి మరింత వివాదానికి దారి తీయడం, ఇదంతా జరుగుతుండగానే బొత్స మనుషులు అనుకున్న తెల్ల రేషన్ కార్డుల వారిపై మరి కొన్ని దాడులు జరగడం, కిరణ్‌కు-బొత్సకు మధ్య రాజీ పెట్టిందే కాని అతుక్కున్నది కాదని అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు సంక్షోభం వచ్చినా, అది కేవలం వచ్చినంత వేగంగా సర్దుమణగడానికేనేమో అనిపిస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వుంది. అదే మళ్లీ మరో మారు జరుగుతోందిప్పుడు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, దామోదర రాజనర్సింహ మధ్య చిచ్చు పుట్టినట్లే పుట్టి, వెంటనే ఆరినట్లే ఆరిపోయింది. కనీసం పైకన్నా అలా జరిగింది. ఇక ముసళ్ల పండుగ ముందుందా? ప్రస్తుతానికి కథ కంచికేనా? అంటే దానికి సమాధానం అంత తేలిగ్గా దొరికేది కాదు. మొత్తం మీద అధిష్టానం ముగ్గురినీ ఢిల్లీకి పిలిచి, పెట్టాల్సిన చివాట్లు పెట్టి, పనిలో పనిగా గుంజాల్సినంత గుంజి, తలంటు పోసి, రాజకీయ రాజీ కుదిర్చి, ఇక ఇప్పటికిది చాలులే అని హైదరాబాద్‌కు సాగనంపారు. అధిష్టానానికి కావాల్సింది రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్య, దాని కనుసన్నలలో కొనసాగే వైరం కాని, సయోధ్య కానే కాదన్న సంగతి, కిరణ్‍కూ, బొత్సకూ, దామోదరకూ తెలుసు. అందుకే వారు ఈ తతంగాన్ని పెద్ద శిక్షగా కానీ, అభిశంసనగా కానీ భావించడం లేదు. వెళ్లిన పని ఇప్పటికి ఐందికదా అని ఊపిరి పీల్చుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.
ఇంతకూ రాష్ట్ర కాంగ్రెస్-సంబంధిత రాజకీయాలలో ఏం జరుగుతోంది? ఏం జరుగబోతోంది? కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేతగా ఏడాదిన్నర కింద కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసి, ముఖ్యమంత్రిగా ఇన్నింగ్స్ ప్రారంభించమని అనడం వెనుక కొంత నేపధ్యం వుండి తీరాలి. ఆ నేపధ్యం ఆయనంటే గిట్టనివారికి ప్రతికూలంగా వుండి వుండాలి. ఆ ప్రతికూలతే, ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పుడో-ఎప్పుడో ఒకప్పుడు ఆశించిన వారికి, మధ్య మధ్య గుర్తుకొస్తుండవచ్చు. దాని పర్యవసానమే, కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తికి కారణమై వుండి వుండవచ్చు. ఇంతకీ ఆ నేపధ్యం ఏమై వుండవచ్చు?
రాజశేఖర రెడ్డి అకాల మరణంతో సుమారు మూడేళ్ల కింద రాష్ట్ర రాజకీయాలలో, అందునా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో, అర్థంకాని శూన్యత హఠాత్తుగా చోటుచేసుకుంది. ఆయన స్థానంలో, అంతటి పటిష్టమైన నాయకుడు అప్పట్లో (ఆ మాటకొస్తే ఇప్పటికీ!) ఎవరూ అధిష్టానానికి కనపడలేదు. ఆయన వారసుడుగా వద్దామనుకున్న పటిష్టమైన (వై ఎస్ జగన్మోహన్ రెడ్డి?) నాయకుడు అధిష్టానానికి పనికి రాలేదు. మధ్యేమార్గంగా, సీనియారిటీని తెర పైకి తెచ్చి, అనధికారికంగా రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో "నంబర్ టు" గా వున్న రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది అధిష్టానం. అది గిట్టని వారు గింజుకున్నారు-గొణిగారు కాని అసంతృప్తి స్థాయికి ఎదగలేదు. మధ్యలో జగన్ గొడవ కొంత సాగింది. ఆయనకు మద్దతు ప్రకటించిన అనేక మంది మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారానికి రామని కూడా మారాం చేశారు. రోశయ్యగారు, ఆయనకు మద్దతుగా అధిష్టానం దూతలు, నయానో-భయానో నచ్చ చెప్పి, అప్పట్లో-ఆ తరువాత ఒక ఏడాది కాలం పాటు అసంతృప్తిని ఎవరి గుండెలలో వారే పదిలంగా వుంచుకునేట్లు చేయగలిగారు. అడుగడుగునా అధిష్టానం పేరు చెప్పుకుంటూ రోశయ్య, అత్యంత భారంగా, ఒక ఏడాది పాటు పదవిలో వుండగలిగారు. తన సీనియారిటీకి రాష్ట్ర రాజకీయాలు తగవని నిర్ధారించుకున్న మరుక్షణం, రోశయ్య అత్యంత గౌరవ ప్రదంగా, స్వచ్చందంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని, అనతి కాలంలోనే గవర్నర్‍గా స్థిరపడిపోయారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలని ఆలోచన చేసిన అధిష్టానం దృష్టికి వచ్చిన పేర్లలో, ఆసక్తికరంగా, కిరణ్ కుమార్ రెడ్డి ముందు వరుసలో నిలబడ్డాడు. ఆయన ముఖ్యమంత్రి కావడం, పరిశీలనలోకి వచ్చిన ఇతర పేర్లలో ఒకరు ఉప ముఖ్యమంత్రి కావడం, మరొకరు దరిమిలా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావడం అందరికీ తెలిసిందే. ఐతే, అందరిలోకి కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఎక్కువ మార్కులొచ్చాయి?
ఈ ప్రశ్నకు సమాధానం అంత సులువు కాదు. ఐనా దొరకబుచ్చుకున్నారు విశ్లేషకులు. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో సభ్యులు కానివారికి మొదటి ప్రాధాన్యత ఇద్దామనుకుంది అధిష్టానం. దానికి సరైన కారణం లేకపోలేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన చేసిన భూపందేరాలలాంటి అనేకానేక అవినీతి వ్యవహారాలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పవన్న భావనలో వుంది అధిష్టానం. ఆ వ్యవహారం బయటపడిన తరువాత, కేవలం అది రాజశేఖర రెడ్డితోనే ఆగదని, అది ఆయన మంత్రివర్గంలో పనిచేసిన అందరి మెడలకీ చుట్టుకుంటుందని అధిష్టానం నమ్మింది. ఆ క్రమంలోనే రోశయ్యను తప్పించినప్పుడు, వైఎస్‌కు సన్నిహితుడిగా వున్నప్పటికీ, ఆయన మంత్రివర్గంలో సభ్యుడు కాని కిరణ్ కుమార్ రెడ్డిమీద కు దృష్టి మరల్చింది. వాస్తవానికి అదే బొత్సకు మైనస్ పాయింట్ అయింది. ఇక దామోదర రాజ నరసింహకు రాకపోవడానికి కారణం ఆయన తెలంగాణ నేపధ్యమే! ఆ నేపధ్యమే ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. ఇంతవరకూ బాగానే వుంది కాని, ఆ తరువాత జరుగుతున్న కథే అర్థం కావడం లేదు అధిష్టానానికి. తమవాడనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి తామనుకుంటున్న తరహాలో-మోతాదులో, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవడం లేదన్న అనుమానం రాసాగింది. బొత్సను రంగంలోకి దింపింది. ఆయన కూడా వైఎస్ జగన్‌ను డీ కొట్టడానికి బదులు కిరణ్‌తో తల పడ్డాడు. ఇక దామోదర రాజనర్సింహ ఎందుకు పెంచుకున్నాడో-ఏమో కాని ఆయన కూడా కిరణ్ కుమార్ రెడ్డి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఈ ముగ్గురి మధ్య ఇతరులు తలదూర్చడం మొదలైంది. ఇక శంకర రావు లాంటి వారు, డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి వారు ఎలాగూ ఎప్పుడూ వుంటూనే వుంటారు. ఈ నేపధ్యంలో మొదలైంది అవినీతి నిరోధక శాఖ వారి మద్యం ముడుపుల దాడులు. దాంతో వాతావరణం మరింత వేడెక్కింది.
గత ఆరు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్‌ల పైన, ఎక్సైజ్ అధికారుల పైన, శాంతిభద్రతల విభాగం పోలీసులపైన, అవినీతి నిరోధక శాఖ చేస్తున్న దాడుల విషయంలో, మిగతా వారి సంగతి ఎలా వున్నా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పరిస్థితి మాత్రం, అంటకాగుతున్న పెనంలో పెట్టిన వస్తువులాగా తయారైంది. ఆ దాడులకు ప్రధాన బాధ్యుడైన పోలీసు అధికారిని ఆ పోస్టులోంచి తొలగించే దాకా బొత్సకు నిద్దురపట్టలేదనాలి. తనవారనుకున్న వారిపై దాడులకు ప్రేరణ ముఖ్యమంత్రి నుంచేనని ఆయన అనుమానం. ఆ సందర్భంగానే, ఒకానొక సందర్భంలో ఢిల్లీనుంచి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, నిష్టూరాలు ఆడాడని మీడియాలో కధనాలొచ్చాయి. సరే, ఆ తరువాత, బొత్స వాటిని ఆనవాయితీ ప్రకారం ఖండించడం కూడా జరిగింది. ఆ నేపధ్యంలోనే, తనపై వచ్చిన అపవాదునుంచి తప్పించుకోవడానికి, కిరణ్ కుమార్ రెడ్డి, ఏసిబి అదనపు డైరెక్టర్‌ను ఆ స్థానం నుంచి తప్పించారంటున్నారు. ఏదేమైనా మద్యం సిండికేట్‌ల పైనా ఈ పాటికే చాలా లోతుగా దర్యాప్తు జరిగింది. మద్యం సిండికేట్‌ల వెనుక భారీ ఆర్థిక కుంభకోణం వుందని కూడా అనుమానాలు వచ్చాయి. ఎప్పుడైతే సిండికేట్‌ల భాగోతం విజయనగరం జిల్లాకు చేరుకుందో అప్పుడే రాజకీయ దుమారం మొదలైంది. ఆ దుమారంలో కీలక అంశం బొత్స మనుషులుగా చెప్పుకుంటున్న ముప్పై మందికి పైగా తెల్ల రేషన్ కార్డుల వారి పేరుతో షాపులుండడం. సహజంగానే బొత్సకు ఈ వ్యవహారం నచ్చలేదు. అలా మొదలైన బొత్స-కిరణ్ ప్రచ్చన్న-పరోక్ష యుద్ధం ప్రస్తుతానికి వాయిదా పడ్డా, ఇద్దరిలో ఏ ఒక్కరన్నా-లేదా ఇద్దరన్నా పదవి కోల్పోయిందాకా ఆగదనేది అక్షర సత్యం. అందుకే అటు బొత్స ఇటు కిరణ్ ఇద్దరూ కూడా ఆ తరువాత తమ పరిస్థితి ఏంటి అన్న దానిపైనే దృష్టి సారించారని, రాష్ట్రంలో కోల్పోనున్న పదవుల స్థానంలో రాబోయే ఎన్నికలలో వారిద్దరూ లోక్ సభ నుంచి రంగంలోకి దిగాలని ఆలోచిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే, అవసరమైతే ప్రస్తుతం ప్రత్యర్థులని భావిస్తున్నవారి మద్దతును కూడా కూడగట్టే ప్రయత్నంలో వున్నారని ఒక వార్త ప్రచారంలో వుంది. వారిద్దరూ ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం లేదని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల వారితో విచారణ జరిపిస్తున్నది అధిష్టానం అని కూడా వార్త ప్రచారంలో వుంది. పాపం-పుణ్యం భగవంతుడికే తెలియాలి!
No comments:
Post a Comment