Wednesday, June 27, 2012

రాహుల్ కోసం అధిష్ఠానం కౌటిల్యం!: వనం జ్వాలా నరసింహారావు


రాహుల్ కోసం అధిష్ఠానం కౌటిల్యం!
సూర్య దినపత్రిక (28-06-2012)
వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్న పరిశీలకులు అసలా రాష్ట్రంలో ఏం జరుగుతోందా అన్న మీమాంసతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రత్యేకించి, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను వివిధ కోణాలనుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్న రాష్ట్ర-రాష్ట్రేతర విశ్లేషకులకు, ఆ ఫలితాల మర్మం ఏంటో? అన్న చిక్కుముడిని విప్పే పనిలో పడిపోయారానక తప్పదు. ఈ మొత్తం వ్యవహారంలో తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చాలా తేలికగా కనిపించవచ్చు కాని వాస్తవానికి అంత చిన్న విషయమేమీ కాదనాలి. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతావనికి, ప్రభుత్వ పదవి లేకపోయినా-ప్రధాని కాకపోయినా, మకుటం లేని మహారాణిగా చెలామణి అవుతున్న సోనియా గాంధీ-ఆమె కుమారుడు, ఢిల్లీ పీఠం బావి వారసుడు రాహుల్ గాంధీల ఆధిపత్యం ఏం కాబోతున్నదా అన్న అనుమానం ఈ ఉప ఎన్నిక ఫలితాల ద్వారా కలగక మానదంటునారు ఆ పరిశీలకులు. పాద రసంలాగా ఎగబాకుతున్న యువ నాయకుడు, వైఎస్సార్ తనయుడు, "రెబెల్" వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తగు రీతిలో రాజకీయ గుణపాఠం చెప్పి తీరాల్సిందే అన్న పట్టుదలతో యావత్ కాంగ్రెస్ అధిష్ఠానం ముందడుగు వేస్తోంది. తాను నమ్ముకున్న-తననే నమ్ముకున్నారని భావిస్తున్న రాష్ట్ర ప్రజలను "ఓదార్పు యాత్ర" పేరుతో కలవాలనుకున్న జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరిని-తిరుగుబాటు ధోరణిని అల నాడు అధిష్ఠానం సహించే స్థితిలో లేదు. ఆయన కోరుకున్న విధంగా చేయడానికి ఆయనను అనుమతి ఇచ్చినట్లయితే, ప్రజల సానుభూతి-సహానుభూతి పొంది, ఒక ప్రజానాయకుడుగా జగన్ ఎదిగేందుకు దోహదపడుతుందని అప్పట్లో అధిష్ఠానం భావించి, ఆయనకు ముక్కుతాడు వేసే ప్రయత్నం చేసింది. మొన్న జరిగిన ఉప ఎన్నికలను కూడా, తమకు అనుకూలంగా, ఒక ఆయుధంలాగా మలచుకుందామని, జగన్ పార్టీలోకి వలసలను ఆపు చేద్దామని అపోహపడింది అధిష్ఠానం. వీటన్నింటి నేపధ్యం ఒకటే! సామ-దాన-భేద-దండోపాయాలను ఉపయోగించి సోనియా-నెహ్రూ-గాంధీ కుటుంబాల వారసత్వానికి, ఆధిపత్యానికి తిరుగులేని అవకాశం కలిగించి, రాహుల్ గాంధీని ఢిల్లీ గద్దె ఎక్కించడమే! భావి భారత ప్రధానిగా చూడడమే! అది ఇలా సాధ్యపడుతోందా? లేదా? అంటే అది వేరే సంగతి!


అధిష్ఠానంకు ఈ తరహా ఆలోచన రావడం, అమలుచేయడం, కొత్తేమీకాదు. గతంలో కూడా, అధిష్ఠానానికి ఎదురుతిరిగిన మహామహులను-ఉద్దండ పిండాలను నిరంకుశంగా కాల రాసింది. రాజగోపాలాచారిని రాష్ట్రపతి కాకుండా చేయగలిగింది. ఎదురుతిరిగిన వైబి చవాన్ ను, మొరార్జీ దేశాయ్ ని, ఆ మాటకొస్తే ఎంతో మంది అతిరధ-మహారధులను అర్థ రధులుగా చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, "సమిష్ఠి నాయకత్వం" అన్న మాటే గిట్టదు అధిష్ఠానానికి. అధిష్ఠానం అంటే ఎవరో కాదు. ఒకనాడు నెహ్రూ అయితే, ఆ తర్వాత ఇందిర, రాజీవ్ (మధ్యలో సంజయ్) లు కాగా ఇప్పుడు సోనియా. ఆ ఏక వ్యక్తుల అభిప్రాయమే ఏకాభిప్రాయం-సమిష్ఠి అభిప్రాయం. ఆ సుప్రీం లీడర్‌కు అంతా సలాం కొట్టాల్సిందే! అడుగుజాడలలో నడవాల్సిందే!వారెంత ప్రజాదరణ కల నాయకులైనా, పరిణితి చెందిన నాయకులైనా, ఎన్ని రకాల శక్తి సామర్ధ్యాలున్న వారైనా, తలవంచక-దాసోహం అనక తప్పదు. అలాంటప్పుడు జగన్ స్థాయి నాయకుడిని, ఆయన ఇష్టం వచ్చినట్లు చేయనివ్వడానికి అధిష్ఠానం ఎలా అంగీకరించుతుంది? అది గతం. ఇక ఇప్పుడో? రెండేళ్ల తరువాత రానున్న సార్వత్రిక ఎన్నికలలో, కాంగ్రెస్ పార్టీకి అంతగా అనుకూలంగా లేని ప్రస్తుత పరిస్థితులలో, మరో ప్రాంతీయ పార్టీని బ్రతికి బట్ట కట్టనిస్తుందా? ఇప్పటికే ఉప ఎన్నిక ఫలితాల ద్వారా, పరువు-ప్రతిష్ఠలను పూర్తిగా కోల్పోయిన కాంగ్రెస్ అధిష్ఠానం, జగన్ పార్టీని మనుగడ చేయనిస్తుందా? పోనీ ఏం చేయగలుగుతుంది? అన్నింటికన్నా ముఖ్యమైంది, పవర్ పాలిటిక్స్ ను అర్థం చేసుకోగలగడం. పవర్ పాలిటిక్స్ ను అనుసరించాలంటే, ఊహ కందని వ్యూహాలను పన్నాలి. వాటికి నైతికత అక్కర లేదు. సోక్రటీస్ దగ్గర నుంచి అరిస్టాటిల్ వరకు వాటి రుచి ఎరిగినవారే.
పవర్ పాలిటిక్స్ అనే ఆట ఆడడంలో ఢిల్లీ అధినాయకత్వానికి తెలియని కిటుకు లేదు. ఆ ఆట ఆడడానికి అనుసరించని నిరంకుశ ధోరణి లేదు. ఆ మాటకొస్తే, భారతీయ సంస్కృతీ-సాంప్రదాయాలలో పవర్ పాలిటిక్స్ అనాదిగా వస్తున్న ఆచారమేనేమో! రామాయణ , మహాభారత కావ్యాలలో, భగవద్గీతలో, చాణక్యుడి అర్థశాస్త్రంలో, కుటిల రాజకీయాల గురించి అనేకానేక విషయాలు చెప్పడం జరిగింది. "నారద మహా మునులు", "మామ శకునిలు", "కౌటిల్యులు" మనకు కనిపించుతారు సందర్భోచితంగా. "నెహ్రూ-ఇందిర-గాంధీ" వారసత్వ సంపదను పదికాలాలపాటు పదిలంగా ఉంచడానికి, కాంగ్రెస్ అధిష్టానం, పురాతన-ఆధునిక కాలపు పవర్ పాలిటిక్స్ ను , అవసరమైతే, జాతీయ అవసరాలను పక్కన పెట్టినా సరే, తమకు అనుకూలంగా మలచుకుంటూ వస్తున్నది. కాకపోతే, అన్నివేళలా అధిష్ఠానం ఆలోచనలు విజయవంతమవుతున్నాయా అంటే, బెడసి కొట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఉప ఎన్నికల ఫలితాలు దానికొక ఉదాహరణ మాత్రమే! ఈ ఆటలో ఏకైక వ్యూహం ఒక్కటే. ఏదో విధంగా రాహుల్‌ను ప్రధాని పీఠం ఎక్కించడమే! దానిని అడ్డగించినవారికి చుక్కలు చూపించే ప్రయత్నం చేయడమే! ఈ పరంపరలో జారి ప్రయోజనాలు దెబ్బతిన్నా పర్వాలేదు.
ఢిల్లీ దర్బారులో జగన్మోహన్ రెడ్డికి "గాడ్ ఫాదర్" గా కొందరు భావిస్తున్న బెంగాల్ దాదా ప్రణబ్ కుమార్ ముఖర్జీ, మరో నెల రోజుల లోపు భారత రాష్ట్రపతి కాబోతున్నారు. వాస్తవానికి, ప్రణబ్ కున్న అనుభవం రీత్యా, పరిణితి రీత్యా, సీనియారిటీ రీత్యా, రాజకీయ స్థితప్రజ్ఞత రీత్యా, ఏ కోణం నుంచి చూసినా, మన్మోహన్ సింగ్‌కు ఆయనే వారసుడు కావాలి. ప్రధాన మంత్రి పదవికి ఆయనకంటే అర్హుడు మరెవ్వరూ లేరనాలి. ఆయన ఆ పీఠాన్ని అధిరోహించితే అడ్డు చెప్పేవారు కాని, చెప్పగలిగేవారు కాని పార్టీలో ఎవరూ లేరు. అందుకే, రాహుల్‍కు దారి సుగమం చేయడానికి ప్రణబ్‌కు మరో విధంగా పదోన్నతి కలిగించి రాష్ట్రపతి పదవి కట్టబెట్తున్నది నెహ్రూ-ఇందిర-గాంధీ వారసత్వం. ఇప్పుడిప్పుడే రాజకీయ పాఠాలు నేర్చుకునేవారు సైతం ఈ కుట్రను అర్థం చేసుకోవడం తేలికే! యుపిఎ భాగస్వామ్య పార్టీల నాయకులు శరద్ పవార్, అజిత్ సింగ్, మమతా బెనర్జీ, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, కరుణానిధి లాంటి కాకలు తీరిన యోధుల పాదాలు చల్లబడేట్లు చేసింది సోనియా నిర్ణయం. ఒకవేళ వీరిలో ఎవరన్నా నోరు మెదిపితే, ఎల్లప్పుడూ వాడే సిబిఐ దర్యాప్తు లాంటి బ్లాక్ మెయిల్ ఆయుధం వారిపై కూడా ప్రయోగించే వీలుందని అందరికీ తెలిసిన విషయమే! ఇక రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం కుదరడానికి అన్నీ అడ్డంకులే. బిజెపి, దాని మిత్ర పక్షాలలో కూడా అలజడి రేగింది. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల్లోనే ఏకాభిప్రాయం లేదు. కుదరదు కూడా. ఇక రాష్ట్రం విషయానికొస్తే, జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు బావుటాను ఎదుర్కునేందుకు అధిష్ఠానం తనముందున్న తురుఫ్ ముక్కలన్నింటినీ బయటకు తెచ్చింది. ఎప్పుడైతే పద్దెనిమిది మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులు పార్టీ ఫిరాయించనున్నారని పసికట్టిందో, అప్పుడే, చిరంజీవిని గుంజుకుంది. కీలకమైన ఉప ఎన్నికల సమయంలో జగన్ జైలు పాలయ్యాడు. ఆయన జైలుకు పోతే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ లబ్ది పొందేందుకు బదులుగా, సానుభూతి పవనాలతో భారీగా నష్టపోయింది. ఓటర్ల మనోగతాన్ని పసికట్టడంలో దారుణంగా విఫలమైంది. విజయమ్మ కన్నీళ్లు వైఎస్సార్ సీ కాంగ్రెస్ పార్టీకి ఓట్లను సంపాదించిపెట్టాయి. షర్మిల హావభావాలు రాజశేఖర రెడ్డిని తలపించాయి. జగన్ కుటుంబ సభ్యులు ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టనుందని కాంగ్రెస్ అధిష్ఠానం ఊహించలేకపోయింది. నష్టం జరిగిపోయింది. ఘోరంగా ఓటమి పాలైంది. పది స్థానాలలో డిపాజిట్ కోల్పోయింది. ఓటు బాంకుకు గండి పడింది. ప్రధాన ప్రతిపక్షం కూడా మట్టి కరిచింది.
జగన్ తల్లీ-కూతురు, గాయపడ్డ కొదమ సింహాలలా ఓటర్ల ముందు రెచ్చి పోయారు. భర్తను పోగొట్టుకుని, కొడుకును జైలు పాలు చేస్తుంటే ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో వున్నాననని విజయమ్మ అంటే, తండ్రిని పోగొట్టుకుని అన్నను జైలులో చూడాల్సి వస్తున్నదని షర్మిల వాపోయింది. ఓటర్లు సానుభూతి విపరీతంగా పోగైంది. మరో పక్కన జగన్‌పై సిబిఐ దర్యాప్తు కూడా ముమ్మరమైంది. దారుణ పరాభవం తప్పదనుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం జాతీయ-రాష్ట్ర స్థాయి కీలకమైన నాయకులను ప్రచార రంగంలోకి దింపింది. గులాం నబీ ఆజాద్, చిరంజీవి, పురంధరేశ్వరి, రేనుకా చౌదరి, వైలార్ రవి లాంటి వారెందరో తమ వంతు పాత్ర పోషించినా ఫలితం శూన్యం. జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు సంవత్సరాలు జైలులోనే వుంటాడన్న ప్రచారమూ జరిగింది. డబ్బు విషయంలో అటు కాంగ్రెస్ పార్టీకి కాని , ఇటు జగన్మోహన్ రెడ్డికి కాని ఎదురే లేదు. "ఓటుకు నోటు" అన్న నినాదం ఓటర్లను కించపరిచే స్థాయి వరకూ పోయింది. నిజంగా డబ్బు ఓట్లను తెచ్చిందా? లేదా? అన్నది ఎవరికి వారే ఊహించుకోవాలి. ఒక్క నెల్లూరు లోక సభ పరిధిలోనే వందల కోట్లు ఖర్చైందని వార్తలొచ్చాయి. పట్టుబడ్డ పైకమే అరవై కోట్లకు పగా వుందంటే ఖర్చైంది ఎంతో అంచనా వేసుకోవచ్చు. కేజీల కొద్దీ బంగారం, లీటర్ల కొద్దీ మద్యం కూడా పట్టుబడింది. ఇంత జరుగుతున్నా, న్యాయస్థానానికి వచ్చేటప్పుడు-పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి కులాసాగా నవ్వుకుంటూ-చేతులు ఊపుకుంటూ వుండడం గమనించాల్సిన విషయం.
ఇదంతా పరిశీలుస్తున్న విశ్లేషకులకు అంతా గమ్మత్తుగా వుంది.

1 comment:

  1. Sir,

    Your write-up on Rahul is very nice.All these things are true and people are proved cleverer.Any way what to say about Mrs.Sonia Gandhi..she is from the land of Machiavelly and Mario Puzo.

    ...Murthy,Bhdrachalam

    ReplyDelete