Sunday, August 5, 2012

సిద్ధాంతాలతో సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ ముఠా రాజకీయం: వనం జ్వాలా నరసింహారావు


సిద్ధాంతాలతో సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ ముఠా రాజకీయం
వనం జ్వాలా నరసింహారావు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ సోనియా గాంధీతో సమావేశమైనట్లు, రాజీ మార్గం గురించి చర్చించినట్లు మీడియాలో కధనాలొచ్చాయి. ఆ వార్తల్లో వాస్తవం లేదని వైఎస్సార్సీపి నేతలు ఖండించడం కూడా జరిగింది. కలవడం, కలవకపోవడం అటుంచి, రాజీ మార్గం ఎంచుకోవడంలో మాత్రం తప్పేంటి? జగన్మోహన్ రెడ్డికి ముందర ఎంతమంది కాంగ్రెస్ పార్టీని వీడి పోలేదు? ఎంతమంది వారిలో స్వగృహ ప్రవేశం చేయలేదు? ఇతర పార్టీలలో వుంటూ ఎంతమంది కాంగ్రెస్‌ను అనరాని మాటలని, ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరి ప్రధాన భూమిక పోషించడం లేదు? అదే విధంగా భవిష్యత్‍లో జగన్మోహన్ రెడ్డి చేసే అవకాశాలు లేవని ఎందుకు భావించాలి? ఎందుకు ఆ పార్టీ వారు భుజం తడుముకోవాలి? ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి, అందులోకి రావాలని అనుకునేవారికి మామూలే!

స్వాతంత్రోద్యమం నాటి భారత జాతీయ కాంగ్రెస్ కు ఇప్పటి కాంగ్రెస్ () కు పోలికే లేదనాలి. అలనాటి కాంగ్రెస్‌లో అభిప్రాయ భేదాలకు, మైనారిటీ వ్యక్తుల సూచనలకు గౌరవం లభించేది. ఇక ఇప్పుడో, అధిక సంఖ్యాకుల మద్దతున్న వారిని, ప్రజా బలం వున్న వారిని, అధిక సంఖ్యాకుల ప్రజా ప్రతినిధుల ఆదరణ వున్న వారిని, ఏదో ఒక నెపంతో, పార్టీ దూరం చేసుకుంటున్నది. ఒక నాడు పార్టీ అనుసరించిన మద్యే మార్గం, అతివాద-మితవాద శక్తులను కలుపుకుని పార్టీని పటిష్టం చేయడమైతే, ఈ నాటి మద్యే మార్గం, భిన్నాభిప్రాయాలను వెల్లడించమని పరోక్షంగా అధిష్టానం ప్రోత్సహించడమే. అధిష్టానంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు, అధినేత్రి దగ్గర పలుకుబడిని సంపాదించుకునేందుకు, ప్రత్యక్షంగానో-పరోక్షంగానో ప్రతి రాష్ట్రంలోని, సమ్మతి-అసమ్మతి వాదులను పురికొల్పడం ఈ నాటి మద్యే మార్గం. కింది స్థాయినుంచి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనని వారిని, స్థానికంగా ప్రజల మద్దతు లేని వారిని, పోటీ చేసి గెలవలేని వారిని, అధిష్టానం దగ్గర చెవులు కొరుకుతూ తిరిగే వారిని చేర దీయడం పార్టీకి అలవాటుగా మారింది. కాంగ్రేసేతర పార్టీలలో ప్రముఖ పాత్ర పోషించి, అన్నీ అనుభవించి, అక్కడ తమ అవసరాలన్నీ తీర్చుకుని, అక్కడ వున్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఇష్టమొచ్చినట్లు తూలనాడిన వారంతా పార్టీలో ప్రముఖులవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ అంటూ గొంతు చించుకుంటున్న వారంతా, ఎప్పుడో ఒకప్పుడు పార్టీని దుయ్యబట్టిన వారో, ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారో కావడం విశేషం.

ఉదాహరణకు, ఈ నాడు కేంద్ర మంత్రివర్గంలో కీలకమైన పదవిలో వున్న జైపాల్ రెడ్డి, రాజీవ్ గాంధిని, ఎన్ని రకాల దూషించడానికి వీలుందో అన్ని రకాలుగా, బోఫోర్స్-ఫెయిర్‌ ఫాక్స్ విషయాల్లో, దూషించారు. జనతా పార్టీనుంచి గెలిచి కేంద్రంలో మంత్రి పదవిని అనుభవించారు. మరిప్పుడాయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తి. సాక్షాత్తు ఇందిరా గాంధి మీద ఉప ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన వీరేంద్ర పాటిల్, కాంగ్రెస్ () లో చేరి తన స్థానాన్ని బల పర్చుకోలేదా ? స్వర్గీయ పర్వత నేని ఉపేంద్ర మాటేంటి? ఈ నాడు సోనియాకు అతి సన్నిహితురాలిగా చెప్పుకుంటున్న రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంగతేంటి? తెలంగాణ ప్రజా సమితి పేరుతో కాంగ్రెస్ ను ధిక్కరించి, ఎన్నికల్లో పోటీ చేసి, పది మందికి పైగా అభ్యర్థులను పార్లమెంటుకు గెలిపించుకున్న స్వర్గీయ మర్రి చెన్నా రెడ్డిని అధిష్టానం ఏం చేయ గలిగింది. ఒక్క సారి కాదు ... కనీసం మూడు సార్లు ఆయన అధిష్టానాన్ని ధిక్కరించారు. ఇంతెందుకు.. ఎన్నికలు జరిగిన ప్రతి సారి, టికెట్ దొరకని పలువురు నేతలు, ఇండిపెండెంటుగా పోటీ చేయడం, ఆరేళ్లు బహిష్కరించ బడడం, స్వగృహ ప్రవేశం చేయడం, లోగడ కంటే, మంచి పదవులు పొందడం తెలిసిన విషయమే. జగ్జీవన్ రాం, ఎన్డీ తివారి, అర్జున్ సింగ్‌లను కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయగలిగింది ? ఇవ్వాళ శరద్ పవార్ లేకపోతే భారత జాతీయ కాంగ్రెస్ మనుగడే లేదు. మమత బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్‌ను కాదనే ధైర్యం సోనియా గాంధీకి వుందా? తమిళ నాడులో పీవీ నరసింహా రావు పొత్తుల నిర్ణయానికి వ్యతిరేకంగా "తమిళ మానిల కాంగ్రెస్" ను స్థాపించి, పార్లమెంటుకు ఎన్నికై, కాంగ్రేసేతర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిత్వ శాఖను నిర్వహించిన చిదంబరం కాంగ్రెస్ క్రమ శిక్షణకు లోబడినట్లా ? కాదా?




కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు, ముఠా పోకడలు, అధిష్ఠానాన్ని ధిక్కరించడం, పార్టీని వీడిపోవడం, స్వగృహ ప్రవేశం చేయడం, గతంలో కంటే ప్రాధాన్యత సంపాదించుకోవడం లాంటివి ఆది నుంచీ జరుగుతున్నదే. బాల గంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలే, విభేదించినప్పటికీ దూషించుకోలేదు. గాంధీజీ నాయకత్వంలో యువకులైన నెహ్రూ, బోసులకు కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చినప్పటికీ, బోసు ధిక్కార ధోరణి గాంధీకి నచ్చలేదు. తనకిష్టమైన జవహర్లాల్ నెహ్రూను, స్వతంత్రం రాకమునుపు ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వానికి సారధిని చేసేందుకు, అబుల్ కలాం ఆజాద్‌తో రాజీనామా చేయించి, ఆయన స్థానంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా నెహ్రూ వ్యవహరించేందుకు తోడ్పడ్డారు గాంధీజీ. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించినంతవరకు, రాగ ద్వేషాలకు, మహాత్ముడంతటి వాడే అతీతం కాదని అనుకోవడానికి నిదర్శనంగా భవిష్యత్‍లో వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యే అవకాశాలను కూడా పరోక్షంగా దెబ్బ తీశారు గాంధీజీ. మధ్యంతర ప్రభుత్వంలో తనకిష్టమైన విదేశాంగ శాఖను నెహ్రూ వుంచుకుని, హోం శాఖను పటేల్‌కు కేటాయించడంతో తనకు తెలియకుండానే, భవిష్యత్‍లో తన ప్రాబల్యం పెరిగేందుకు అవకాశం కలిపించుకున్నారు నెహ్రూ.

1948-1950 మధ్య కాలంలో హోమ్ మినిస్టర్ గా వున్న వల్లభాయ్ పటేల్ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. దాదాపు అన్ని ప్రొవిన్షియల్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పటేల్ మనుషులు ఎన్నికయ్యారు. ఈ లోపున రాజ్యాంగ శాసనసభకు సంబంధించి, సంస్థానాల విలీనం గురించి చర్చలు-చర్యలు మొదలయ్యాయి. జాతీయ గీతంగా జనగణమణ..” వుండాలా, “వందేమాతరం...” వుండాలా? అన్న విషయంలోనూ కాంగ్రెస్ నాయకత్వంలో విభేదాలు చోటుచేసుకున్నాయి. 1948 లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా గెలిచిన పట్టాభి సీతారామయ్య, ఆ తర్వాత పురుషోత్తం దాస్ టాండన్ చేతిలో ఓటమి పాలయ్యారు. వారిలో మొదటి వారు నెహ్రూ బలపర్చిన వ్యక్తికాగా, టాండన్ పటేల్ పక్షం మనిషి. గాంధీజీ మరణానంతరం, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ రాష్ట్రపతి అభ్యర్థిగా గవర్నర్ జనరల్ గా పనిచేసిన రాజగోపాలా చారికి నెహ్రూ మద్దతు లభించగా, పటేల్ మద్దతు వున్న రాజేంద్ర ప్రసాద్‌కు ఆ పీఠం దక్కింది. అవన్నీ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత పోరాటాలే. అప్పట్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులలో నెహ్రూ అనుచరులని, పటేల్ అనుచరులని వేర్వేరుగా సంబోధించేవారు. నీలం సంజీవరెడ్డి నెహ్రూ అనుకూలుడుగా, టంగుటూరు ప్రకాశం పంతులు ఆయనకు వ్యతిరేకిగా చెప్పుకునేవారు.

మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న ప్రకాశం పంతులును దింపడానికి నీలం సంజీవరెడ్డి, కళా వెంకట్రావులు ఒకటయ్యారు. నీలం-కళా వెంకట్రావుల వ్యూహంలో ముఖ్యమంత్రి పదవి కోల్పోయి, కాంగ్రెస్ వదిలి వెళ్లిపోయిన ప్రకాశం, స్వగృహ ప్రవేశం చేసి, అదే సంజీవరెడ్డి ప్రోద్బలంతో తిరిగి ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి అయ్యారు. ఉప ముఖ్య మంత్రి పదవి దక్కించుకున్న నీలం సంజీవ రెడ్డి చక్రం తిప్పారు. కాంగ్రెస్‌ను వీడిన ఆయన ప్రత్యర్థి ఎన్జీ రంగా ఆ తరువాత స్వగృహ ప్రవేశం చేసి గుంటూరు లోక్ సభ సభ్యుడుగా ఎన్నికయ్యారు. శాసన సభ సమావేశాలలో, మద్య నిషేధం సాకుగా ఓడిన ప్రకాశం రాజీనామా చేయడంతో గవర్నర్ పాలన విధించడం, శాసన సభను రద్దుచేయడం జరిగింది. అవన్నీ ముఠా రాజకీయాలే. దరిమిలా, నీలం సంజీవరెడ్డి స్థానంలో బెజవాడ గోపాల రెడ్డి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1955 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నాయకుడిగా నీలం-బెజవాడల మధ్య పోటీ వుండడంతో, అధిష్ఠానం బెజవాడ గోపాల రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరచడంతో ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒప్పుకుని, పి డబ్ల్యు శాఖతో తృప్తి పడాల్సి వచ్చింది. మళ్ళీ ముఠా రాజకీయాలు మొదలయ్యాయి. గోపాలరెడ్డికి వ్యతిరేకంగా, కళా వెంకట్రావును, కల్లూరు చంద్రమౌళిని కలుపుకుని నీలం సంజీవరెడ్డి పనిచేయ సాగారు. అధిష్ఠానం దూతగా వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి వారి మధ్య తాత్కాలికంగా రాజీ కుదిరించారు.

బెజవాడ గోపాలరెడ్డికి పోటీగా, కాసు బ్రహ్మానందరెడ్డిని ప్రోత్సహించిన నీలం సంజీవరెడ్డి, తమతో అల్లూరి సత్యనారాయణ రాజును కలుపుకున్నారు. 1956 లో విశాలాంధ్రగా ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రం అవతరించింది. ముఖ్య మంత్రి పదవికోసం మరో మారు పోటీ మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి-మర్రి చెన్నారెడ్డి మద్దతు బెజవాడకు, బూర్గుల-విబి రాజుల మద్దతు నీలంకు లభించింది. ఆంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు నీలంకే మద్దతు పలికారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తన మంత్రివర్గంలోనే ఉప ముఖ్య మంత్రిగా పనిచేసిన నీలం సంజీవరెడ్డి కింద బెజవాడ గోపాలరెడ్డి ఆర్థిక శాఖను నిర్వహించాల్సి వచ్చింది. 1957 లో తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. నీలం వర్గానికి అధిక స్థానాలు వచ్చాయి. తన స్థానాన్ని పదిలపర్చుకోసాగాడు. కొండా వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, పాగా పుల్లారెడ్డి, బొమ్మ కంటి సత్యనారాయణ రావు ప్రభృతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పార్టీని వదిలి, “డెమోక్రాటిక్ పార్టీని స్థాపించారు. విజయవాడలో నిర్వహించిన ఆ పార్టీ మహాసభలో ప్రసంగించిన మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరడం కంటె, కృష్ణా నదిలో పడడం మంచిదనిఅన్నారు. పార్టీ వదిలిన మర్రి చెన్నారెడ్డి అప్పుడే కాకుండా అలా మరి రెండు పర్యాయాలు వదలడం-స్వగృహ ప్రవేశం చేయడం, పదవులను అనుభవించడం అందరికీ తెలిసిందే.

నీలం సంజీవరెడ్డిని జాతీయ రాజకీయాల్లోకి లాగడమే మంచిదని భావించిన జవహర్లాల్ నెహ్రూ, పథకం ప్రకారం 1960 లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. సంజీవరెడ్డి స్థానంలో రాజీ అభ్యర్థిగా దామోదరం సంజీవయ్యను ముఖ్యమంత్రి పీఠం ఎక్కించారు. తనను వ్యతిరేకించిన ఏసీ సుబ్బారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు సంజీవయ్య. ఏ కొద్దిమందో తప్ప, దాదాపు కాంగ్రెస్ పార్టీలోని హేమా-హేమీలందరు సంజీవయ్యను ధిక్కరించిన వారే ! ఐనా పార్టీలో కొనసాగారు. 1962 లో ఎన్నిక లొచ్చే సమయానికల్లా సంజీవరెడ్డిని తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకుని రావడం జరిగింది. ఆయన స్థానంలో సంజీవయ్యను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేశారు. ఎన్నికలనంతరం 1964 లో కర్నూల్ బస్సుల జాతీయం కేసులో రాజీనామా చేసేంతవరకు బలీయమైన నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి కొనసాగారు.

1964 లో కాసు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి అయింతర్వాత, మళ్లీ ముఠా రాజకీయాలకు తెర లేచింది. కాసుకు వ్యతిరేకంగా ఏసీ సుబ్బారెడ్డి అసంతృప్తి కాంగ్రెస్ వర్గానికి బాహాటంగానే నాయకత్వం వహించారు. కాసు వర్గాన్ని మినిస్టీరియలిస్టులుఅని, ఏసీ వర్గాన్ని డిసిడెంట్లుఅని పిలిచేవారు. మర్రి చెన్నారెడ్డి మద్దతు కాసు వర్గానికుండేది. 1967 లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి గెలిచిన మర్రి చెన్నారెడ్డి ఎన్నికల కేసులో సభ్యత్వాన్ని కోల్పోవడమే కాకుండా, ఆరేళ్లు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హుడవడంతో, 1969 తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం చేపట్టారు. కేంద్ర మంత్రివర్గంలో చేరిన నీలం సంజీవరెడ్డి, రాష్ట్ర రాజకీయాలలో తల దూర్చలేదు. చెన్నారెడ్డి ధిక్కార ధోరణి పుణ్యమా అని, కాసు ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేయడం, ఆయన స్థానంలో పీవీ నరసింహా రావు రావడం జరిగింది. 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరించి, తెలంగాణ ప్రజా సమితి పేరుమీద ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయం సాధించారు చెన్నారెడ్డి బలపర్చిన అభ్యర్థులు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో సస్పెన్షన్లకు లెక్కేలేదు. ముల్కీ కేసులో తీర్పుపై పీవీ వ్యాఖ్యలకు నిరసనగా తలెత్తిన ఉద్యమం ఫలితంగా ఆయన పదవి కోల్పోవడం, ఆయన స్థానంలో కొన్నాళ్లకు జలగం ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర విధేయుడుగా, అత్యంత సమర్థుడైన ముఖ్య మంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం, ఆ తర్వాత కాలంలో, ఇందిర మంత్రివర్గంలో ఎమర్జెన్సీ హోం మినిస్టర్గా పనిచేసిన బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్ లో చేరాడు. 1978 శాసనసభ ఎన్నికల్లో, ఇందిరా కాంగ్రెస్ (నేటి అఖిల భారత జాతీయ కాంగ్రెస్-) ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి విజయ పథంలో నడిపించగా, వెంగళ్ రావు నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలైంది. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు మొదటిసారి. వెంగళరావు మళ్ళీ ఇందిర పంచన చేరి కేంద్రంలో మంత్రి పదవి అనుభవించారు. పీసీసీ అధ్యక్షుడుగా కూడా పని చేశారు. ఆయన బాటలోనే బ్రహ్మానందరెడ్డి నడిచారనాలి.

ఇందిర తిరిగి అధికారంలోకి రావడంతో, సమ్మతి-అసమ్మతి రాగాల మధ్య, ముఖ్యమంత్రుల మార్పిడికి శ్రీకారం చుట్టడం జరిగింది. బహిరంగంగానే, అసమ్మతికి అధిష్ఠానం ప్రోత్సాహం లభించేది. ఒకరి వెంట మరొకరు అంజయ్య, భవనం, విజయ భాస్కర రెడ్డి ముఖ్య మంత్రులయ్యారు అసమ్మతి పుణ్యమా అని. 1983 లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ ను, 1989 లో మరో పర్యాయం, పీసీసీ అధ్యక్షుడుగా గెలిపించిన చెన్నారెడ్డి, ముఖ్య మంత్రి కావడానికి అధిష్ఠానం ఆశీస్సులు తప్పనిసరైందని అనక తప్పదు. మళ్ళీ అసమ్మతి... మళ్ళీ ధిక్కార స్వరాలు.. ఏడాదికే ఆయన స్థానంలో.. నేదురుమల్లి జనార్థన్ రెడ్డి ముఖ్య మంత్రయ్యారు. ఆయన్నూ వుండనివ్వలేదు అధిష్ఠానం. మరో మారు విజయ భాస్కర రెడ్డిని ముఖ్య మంత్రిని చేసి, తెలుగు దేశం ఇంకో మారు అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసింది. అప్పట్లో అసమ్మతిని, ధిక్కార స్వరాన్ని వినిపించిన డాక్టర్ రాజశేఖర రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని బలోపేతం చేసినా, కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి మరో పది సంవత్సరాలు పట్టింది. ఆయన రెండో పర్యాయం ముఖ్య మంత్రి అయింతర్వాత, ఆకస్మికంగా మరణించడంతో, ఆరేళ్లు వినిపించని ధిక్కార స్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ఆయన వున్నప్పుడు ధిక్కారానికి అవసరం లేనందునో-వీలు కలగనందునో తాత్కాలికంగా ఆగినా, కాంగ్రెస్ లో అంతర్భాగమైన ధిక్కార పర్వాలు, అసంతృప్తి కాండలు మళ్ళీ మొదలయ్యాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫొటో విషయంలో ఈ రోజు ఆయనను బాహాటంగా విమర్శించే వారు, ఆయనున్నప్పుడు నోరు విప్పడానికే జంకేవారు.
          
నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రలో ఏదో విధంగా అధిష్ఠానాన్ని ధిక్కరించని నాయకులు అరుదు. పార్టీలో ఎవరికి ఎప్పుడు ప్రాధాన్యత వుంటుందో-ఎప్పుడు ఎవరికి వుండకుండా పోతుందో చెప్ప గల వారు లేరిప్పుడు. సుమారు పాతిక పర్యాయాలు పార్టీ పగ్గాలను చేజిక్కించుకుని, నలభై సంవత్సరాల పాటు అధ్యక్ష పీఠం అధిష్ఠించింది నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన వారే. అదే వారసత్వానికి చెందిన సోనియా గాంధీ నాయకత్వంలోని అధిష్ఠానం ప్రస్తుతం అవలంభిస్తున్నది మాత్రం విభజించి పెత్తనం సాగించడంఅనే బ్రిటీష్ పోకడలు. భవిష్యత్ లో పార్టీకి ఆ పోకడలు లాభం చేకూరుస్తాయనుకోవడం పొరపాటే. దీని ప్రభావం అన్ని రాష్ట్రాల మాదిరిగానే, ఆంధ్ర ప్రదేశ్‌పైనా పడక మానదు. యుపిఎ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పరంగా అత్యధిక స్థానాలను సంపాదించి పెట్టిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వారితో సంధి ప్రయత్నాలను చేయక తప్పని పరిస్థితి



కాకపోతే, ఆ పని ఇప్పుడు చేస్తే మంచిదా? 2014 ఎన్నికల తరువాత చేస్తే మంచిదా? అని ఆలోచించుకోవాలి. ఏదేమైనా, చేరేది లేదు-చేతులు కలిపేది లేదని తెగేసి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి! ఎవరి వ్యూహం ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే.

1 comment:

  1. ఇదంతా వారికి అలవాటు వారు మన పాలకులు కావడం మన గ్రహపాటు. పాలసీ విభేదాలు లేవు, అవకాశవాదమే.

    ReplyDelete