Wednesday, September 12, 2012

బాంకాక్‍లోని గ్రాండ్ పాలెస్, ఎమరాల్డ్ బుద్ధ: వనం జ్వాలా నరసింహారావు


బాంకాక్‍లోని గ్రాండ్ పాలెస్, ఎమరాల్డ్ బుద్ధ
వనం జ్వాలా నరసింహారావు

అరుణ్ వాట్, వాట్ ఫో బౌద్ధ దేవాలయాల తరువాత బాంకాక్‍లో తప్పకుండా చూడాల్సినవి గ్రాండ్ పాలెస్, ఎమరాల్డ్ బుద్ధ దేవాలయం. మేం బాంకాక్ వెళ్లిన మర్నాడు ఆ రెంటినీ చూశాం. థాయ్ భాషలో "ఫ్రా బోరాం మహా రచ్చ వాంగ్" అని పిలువబడే ఈ అద్భుత రాజప్రాసాదం బాంకాక్ నగరం నడి బొడ్డులో వుంటుంది. 1782 నుండి 143 సంవత్సరాల పాటు థాయ్‍లాండ్ (ఒకప్పటి సయాం) చక్రవర్తుల అధికారిక నివాసంగా వుండేదీ గ్రాండ్ పాలెస్. ఈ రాజప్రాసాదం నుంచే రాజు, ఆయన కోర్ట్, ఆయన ప్రభుత్వం 1925 వరకు పనిచేస్తుండేవి. ప్రస్తుత సార్వభౌమాధికారి-చక్రవర్తి, తొమ్మిదవ రాముడు, భూమి బల్ అదుల్యతేజ్, గ్రాండ్ పాలెస్‍లో కాకుండా, మరో చోట-చిత్రాలడ భవనంలో నివాసముంటున్నాడు. ఐనప్పటికీ గ్రాండ్ పాలస్‍ను పలు అధికారిక కార్యక్రమాలకు వినియోగించుకుంటున్నారు. ఏటా, ఎన్నో రాచరిక కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఈ భవనం నాలుగు గోడల మధ్యే జరుగుతాయి. విచిత్రంగా, ఈ గ్రాండ్ పాలెస్ సముదాయపు విశాలమైన ఆవరణలో, సుమారు వేయికి పైగా, భారతదేశంలో విరివిగా పెరిగే చింత చెట్లు కనిపిస్తాయి. తోటమాలీల ద్వారా చక్కగా-నీట్‍గా కత్తిరించి చూడ ముచ్చటగా పెంచుతున్నారు.


గ్రాండ్ పాలెస్ ఆవరణలోని ఎమరాల్డ్ బుద్ధ దేవాలయం

అప్పటి తన రాజధాని నగరం థోన్‍బూరి నుంచి బాంకాక్ మారిన దరిమిలా, నాటి చక్రవర్తి-మొదటి రాముడు, చక్రి రాజవంశం స్థాపకుడు, రాజా బుద్ధ యోడ్ఫా చులలోక్ ఉత్తర్వుల మేరకు మే నెల 6, 1782 న ఈ రాజప్రాసాదం నిర్మాణము ఆరంభమైంది. ఆయన తదనంతరం ఒకరి వెంట మరొకరు, ముఖ్యంగా ఐదవ రాముడు రాజా చూలాలోంకార్న్ పాలనలో, మరెన్నో నిర్మాణాలను ఈ రాజప్రాసాదానికి అనుబంధంగా నిర్మించుకుంటూ పోయారు. వారసత్వ చక్రవర్తుల సార్వభౌమాధికారానికి 1932 లో స్వస్తి చెప్పిన తరువాత, అన్ని రకాల ప్రభుత్వ సంస్థలు ఇక్కడి నుంచి బయటకు కదిలించారు. నాలుగు వైపులా నాలుగు భారీ ప్రహారీ గోడల మధ్య, సుమారు 218,400 చదరపు మీటర్ల (2,351,000 చదరపు అడుగుల) విస్తీర్ణంలో వ్యాపించి వున్న ఈ భవన సముదాయం దీర్ఘ చతురస్రాకారంలో కనిపిస్తుంది. నగరం నడిబొడ్డు నుండి ప్రవహిస్తున్న ఛావో ఫ్రాయా నది ఒడ్డున వుందీ భవనం. గ్రాండ్ పాలెస్ నిండా అనేక భవనాలు, కోర్ట్ హాల్స్, కోర్ట్ యార్డులు, పచ్చిక బయళ్లు, ఖాళీ మైదానాలు, రోడ్లు, తోటలు కనిపిస్తాయి. సుమారు రెండు వందల సంవత్సరాల పాటు అనేకమంది రాజుల కాలంలో అనేకానేక నిర్మాణాలు, ఎవరికి ఇష్టమొచ్చిన రీతిలో వారు చేయడం వల్ల, ఒక క్రమపద్ధతిలో లేవేమో అనిపిస్తుంది చూసేవారికి. పలు విభాగాలుగా వున్న గ్రాండ్ పాలెస్‍లో ప్రధానంగా కనిపించేవి ఎమరాల్డ్ బుద్ధ దేవాలయం, ఔటర్ కోర్ట్ హాల్, పలు ప్రభుత్వ భవనాలు, మిడిల్ కోర్ట్, ఇన్నర్ కోర్ట్. చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం ఇవన్నీ వాటి కార్యక్రమాలు అవి చేసుకుంటూ పోతాయి. భవనం లోనికి అనుమతి లేకపోయినా పర్యాటకులు భవన సముదాయం లోని విశాలమైన బహిరంగ ప్రదేశంలో తిరగడానికి వీలుంది. విదేశీ-స్వదేశీ పర్యాటకులను అమితంగా ఆకర్షించే గ్రాండ్ పాలెస్ థాయ్‍లాండ్ ప్రధాన పర్యాటక స్థలం. 

 గ్రాండ్ పాలెస్
గ్రాండ్ పాలెస్ ఆవరణలోనే వుంది ఎమరాల్డ్ బుద్ధ దేవాలయం. థాయ్ భాషలో "ఫ్రా పుత్థ మహా మణి రత్తన పతిమకాన్" అని పిలువబడే ఎమరాల్డ్ బుద్ధ దేవాలయం, థాయ్‍లాండ్ రాజ్యానికి ఒక రకమైన రక్షగా భావిస్తారు. అన్ని వేళలా థాయ్‍లాండ్‍ను కాపాడేది ఎమరాల్డ్ బుద్ధ విగ్రహం. ఆకుపచ్చని జేడ్ రాయితో తయారు చేయబడిన ఈ బుద్ధ విగ్రహం సుమారు 45 సెంటీమీటర్ల పొడవుండి, కూర్చునే ఆకారంలో కనిపిస్తుంది. విగ్రహం చుట్టూ బంగారు వస్త్రం కప్పబడి వుంటుంది. ఆ విగ్రహాన్ని ఎమరాల్డ్ బుద్ధ దేవాలయంలో అమర్చారు. 

 గరుడ-నాగ సంవాదంతో వున్న విగ్రహాలు
ఎమరాల్డ్ బుద్ధ విగ్రహం తయారీ నుంచి, అది బాంకాక్ నగరం చేరుకునేంతవరకూ జరిగిన విషయాలను కథలు-కథలుగా చెప్పుకుంటారక్కడ. క్రీస్తు పూర్వం 43 లో, భారత దేశంలోని ఇప్పటి పాట్నా-ఒక నాటి పాటలీపుత్రంలో నాగసేన అనే మహానుభావుడు సృష్టించాడట ఎమరాల్డ్ బుద్ధ విగ్రహాన్ని. అప్పట్లో జరగవచ్చని భావించిన ఒక అంతర్యుద్ధం బారి నుండి ఎమరాల్డ్ బుద్ధను కాపాడడానికి, మూడు వందల సంవత్సరాల పాటు పాటలీపుత్రంలో నే వున్న దానిని, ఎవరో ఒకరు శ్రీలంకకు తరలించారట. తన దేశంలో బౌద్ధ మతాన్ని విరివిగా ప్రచారంలో తెచ్చే ఉద్దేశంతో, అప్పటి బర్మా చక్రవర్తిరాజా అనురుథ్, ఆ విగ్రహాన్ని ఇవ్వమని అడిగేందుకు, ఒక ప్రతినిధి బృందాన్ని శ్రీలంకకు 457 సంవత్సరంలో పంపాడు. ఆయన అభ్యర్థనను శ్రీలంక ప్రభుత్వం మన్నించినప్పటికీ, విగ్రహాన్ని తీసుకు వస్తున్న నౌక దారి తప్పి కాంబోడియాకు చేరింది. ఆ తరువాత లభ్యమైన చారిత్రక ఆధారాల ప్రకారం, 1434 లో, ఉత్తర థాయ్‍లాండ్‍లో ఆ విగ్రహం బయటపడింది. థాయ్‍లాండ్ దేశంలోని లాంపాంగ్‍లో అది 1468 వరకుంది. అక్కడ నుంచి థాయ్‍లాండ్ లోని మరో రెండు మూడు ప్రదేశాలకు మార్చబడిన తరువాత మార్చ్ 22, 1784 న ఇప్పుడుంటున్న ఎమరాల్డ్ బుద్ధ దేవాలయానికి మార్చాడు అప్పటి ఒకటవ రాముడు రాజా ఛావో ఫ్రాయా చక్రి. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ విగ్రహం ఇక్కడే పూజలందుకుంటుంది. 
 ఎమరాల్డ్ బుద్ధ విగ్రహం

No comments:

Post a Comment